కవిత్వం రాయడమే విరసం ప్రభావం తో మొదలైంది - అద్దేపల్లి ప్రభు
విరసం యాబై ఏళ్ళ సందర్భంగా అద్దేపల్లి ప్రభు గారు గోదావరి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ సాహిత్య ప్రస్థానం ఎలా మొదలైంది?
జ. దాదాపు నాలుగవ తరగతి నించీ చందమామ, బొమ్మరిల్లు లాంటివి బాగా చదివే అలవాటు ఉండేది.బాలసాహిత్యం ముఖ్యంగా సోవియట్ రష్యా పుస్తకాలు బాగా చదివే వాళ్ళం. హైస్కూలులో ఉండగా మాగజైన్ కోసం కథ రాశాను. చిన్న నాటిక ఒకటి రాసి వేశాం. ఇంట్లో ఎలాగూ సాహిత్య వాతావరణం ఉంది.
మా అన్నయ్య కథలు బాగా రాసేవాడు.అలా నేనూ రాయాలనుకునే వాణ్ణి.కాకినాడలో జరిగే సభల్లో, ఇంట్లో ఇప్పుడు బాగా పేరున్న రచయితలూ, కొత్తగా రాస్తున్నవాళ్ళూ చాలా మందిని చూసేవాళ్ళం.అమలాపురంలో మినీ కవిత మీద ఒక సదస్సు జరిగింది.ఆ సదస్సులో అలిశెట్టి ప్రభాకర్ వంటి చాలా మందిని కలిశాం. అలా కవిత్వం కధలు రాయడం మొదలైంది.
2. మీ సాహిత్య ప్రస్థానం మొదలైన తొలినాళ్లలో సాహిత్య వాతావరణాన్ని ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు ఏవి?
జ. విరసమే.కవిత్వం రాయడమే విరసం ప్రభావం తో మొదలైంది. చెరబండరాజు, శివసాగర్, అల్లం రాజయ్య, లాంటి వాళ్ళ కవిత్వం, కధలు బాగా ప్రభావం చూపేవి.కుటుంబరావు బాగా ఆకట్టుకునే వారు.విరసం లాగానే కాలేజీ లో కవిత్వం రాసే కొంతమందిమి చైతన్యప్రవాహం అనే గ్రూప్ పెట్టుకుని ఒక రాత పత్రిక నడిపేవాళ్ళం. కొన్నాళ్ళు సైక్లోస్టైల్ పత్రిక గా కూడా నడిపాం.
3. మీ సాహిత్య ప్రస్థానంలో మీకు విరసం ఎప్పుడు ఎలా పరిచయం అయింది
జ. మొదట్లో ప్రత్యక్షంగా పరిచయం లేదు కానీ సృజన అరుణతార వంటి పత్రికలు ద్వారా పరిచయమే. మొదటి సారి 1982లో విజయవాడలో జరిగిన విరసం సాహిత్య పాఠశాలలో హాజరు కావడం ప్రత్యక్ష పరిచయం.విరసం రచయితలు చాలా మందిని అక్కడ కలిశాం. త్రిపురనేని,కేవీఆర్,వివి,చలసాని, బాలగోపాల్... చాలా మందిని అక్కడ చూశాం, విన్నాం.
4. విరసం పరిచయమైన తరువాత మీ సాహిత్య వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులు ఏమిటి
జ. మా సాహిత్య ప్రస్థానమే విరసం ప్రభావం తో మొదలైంది కాబట్టి మార్పులు అనేవి రచనా సంవిధానానికీ సంబంధించిన వే అనుకుంటున్నాను. ముఖ్యంగా సాహిత్యం లో వర్గ దృక్పథం లోతుగా పెంచుకోవడం, కళాత్మక అభివ్యక్తి సాధన చేయడం విరసం ప్రభావం తో వచ్చాయి.చెరబండరాజులా కథ,పాట, కవిత్వం రాయాలని అలా జీవించాలనే తపన బాగా ఉండేది.
5. విరసం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన పరిణామాలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు
జ. విరసం ఏర్పడిన తరువాత ప్రజాసాహిత్యం ఒక స్పష్టమైన, నిర్దుష్టమైన రూపం తీసుకుందని నా భావన.అంతకు ముందు లేని ఒక సాహిత్య నిబద్ధత ని విరసం తీసుకువచ్చింది.
6. కవిగా రచయితగా సృజన కారుడిగా మీ పరిణామం వెనుక విరసం ప్రభావం ఏమైనా ఉందా
జ. అవును.పూర్తిగా.
7. విరసం లాంటి సంస్థ 50 సంవత్సరాలు మనగలగడం వెనుక గల పరిస్థితులు కారణాలు తెలుపగలరు
జ. గత యాభై ఏళ్లుగా తెలుగు సమాజంలో వచ్చిన అన్ని ఉద్యమాలనీ విరసం ప్రతిబింబించింది.ప్రతిఫలించింది. ఏ సందర్భంలోనూ ప్రజల్ని విడిచి పెట్టలేదు.అదే విరసం మనుగడకి కారణం.
8. విరసం అవసరం ప్రస్తుత తెలుగు సాహిత్య సామాజిక రంగంలో ఎంత వరకు ఉన్నది.
జ. విరసం లాంటి ఒక సాహిత్య సంస్థ లేకపోతే సాహిత్య రంగమంతా అభివృద్ధి నిరోధకులతో నిండిపోతుంది. ఎంతో కొంత మేరకు సాహిత్యాన్ని ప్రజల మధ్య కి తీసుకెళ్ళింది విరసమే. సాహిత్య రంగంలో కవిత్వం,కథ,నవల,పాట, నాటిక, వ్యాసం లాంటి అన్ని ప్రక్రియలనీ విరసం బాగా అభివృద్ధి చేసింది.సామాజిక, తాత్త్విక, పర్యావరణానికి సంబంధించిన అనేక విశ్లేషణ లనీ చర్చలనీ విరసం నిర్వహించింది.ప్రస్తుత తెలుగు సాహిత్యంలో ఉన్న భిన్న దృక్పథాలని ప్రజాస్వామికంగా అర్థం చేసుకోవాలి అందుకు విరసం లాంటి సంస్థ చేయాల్సింది చాలా ఉంది.
9. విప్లవ సాహిత్యం లో వచ్చిన పరిణామాలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు
జ. విప్లవ సాహిత్యం లో విరసం ఒక భాగమే తప్ప అదే విప్లవ సాహిత్యం కాదు.ప్రజాస్వామిక చైతన్యం నెలకొల్పడానికి ప్రజలకి సంబంధించిన అనేక దృక్పథాలలోంచి సాహిత్యం రావాలి. స్త్రీవాదం, దళితవాదం, బహుజన వాదం లాంటి అన్ని దృక్పథాలూ విప్లవ ప్రజాస్వామిక సాహిత్యం లో భాగమే నని నా అభిప్రాయం.రివిజనిస్టు ఉదారవాద సాహిత్యం పైన తిరుగుబాటు గా వచ్చిన విరసం మొదట్లో కొంత అతికి పోయినా క్రమంగా తన తాత్త్విక చింతన ని మెరుగు పరుచుకుంది. అది నిరంతరం ప్రజల పక్షాన ఉంది అది ప్రధానం.
10. కొత్త రచయితలను కవులను తయారుచేయడంలో విరసం పాత్ర ఎంత వరకు ఉన్నదని మీరు భావిస్తున్నారు
జ. విరసం ఏర్పడిన తరువాత దాని ప్రభావం సోకని తెలుగు రచయితలు ఉండరు. కొత్త రచయితలని తయారు చేయడం లో విరసం కృషి గణనీయమైనదే. అనేక దశాబ్దాలుగా విరసం నిర్వహించిన సాహిత్య పాఠశాలలు వస్తుశిల్పాల గురించి చాలా అవగాహన కల్పించాయి.
11. తెలుగు ముద్రణ మరియు అంతర్జాల పత్రికారంగంలోవిరసం పత్రికలు మరియు అంతర్జాల పత్రిక ప్రభావం ఏ రకంగా ఉందని మీరు అంచనా వేస్తున్నారు
జ. అరుణతార,అంతర్జాల పత్రికల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సమాజం పట్ల తపన చెందే రచయితలు ఆలోచనలు, సృజన పాఠకుల్ని తప్పకుండా ప్రభావితం చేస్తాయి.
12. దళిత స్త్రీవాద మైనారిటీ బహుజన పోరాటాల పరిణామాలను విరసం ఎంత మాత్రం ప్రభావితం చేయగలిగింది
జ. విప్లవ సాహిత్యం స్త్రీవాద,దళిత బహుజన సాహిత్యాన్ని సరిగ్గానే స్వీకరించింది. మొదట్లో ఈ వాదాల పట్లా వాళ్ళ మార్క్సిస్టు వ్యతిరేకత పట్లా అనుమానం ఉండేది.కానీ ప్రజాస్వామిక విప్లవ సంస్క్రుతిలో భాగంగా చూసి నప్పుడు ఈ వాదాలు మన్ని చాలా ఎడ్యుకేట్ చేశాయి.విరసం ఈ ఆలోచనల్ని స్వీకరించింది.పెంపొందించుకుంది.ఇది గొప్పగా అని పిస్తుంది. దళితవాదం ప్రభావం తో నే అంబేద్కర్ నీ, ఫూలే నీ కొత్తగా అధ్యయనం చేయడం, అర్థం చేసుకోవడం మొదలు పెట్టాం.
13. 50 ఏళ్ల విరసం సందర్భాన్ని మీరు ఏ రకంగా స్వాగతిస్తున్నారు
జ. జీవితంలోనూ సాహిత్యం లోనూ తిరోగమన శక్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ప్రగతిశీలత పైన పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది.మతమౌఢ్యం, కులం,మూఢనమ్మకాలు సంప్రదాయం, సంస్కృతి పేరుతో ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతున్నాయి.ఇలాంటి సందర్భంలో విరసం 50 ఏళ్ళ సభలు జరుగుతున్నాయి. చాలా కొత్త కర్తవ్యాలను ఎత్తుకోవల్సిన సందర్భం ఇది. విరసం కాక పోతే ఇంకెవరు తీసుకుంటారు.
14. యువతరం సాహిత్యం పట్ల ఆసక్తి కనబరుస్తున్న అని మీరు భావిస్తున్నారా.
జ. అవును.యువతరం సాహిత్యం పట్ల ఆసక్తి గానే ఉన్నారు. కవిత్వం రాస్తున్నారు.కధలు రాస్తున్నారు. సాహిత్యం చదువుతున్నారు.
15. యువతరాన్ని సాహిత్యానికి దగ్గర చేయడంలో విరసం పాత్ర ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు?
జ. విప్లవ సాహిత్య విస్తృతిని పెంచడానికి కృషి చేయాలని అనుకుంటున్నాను.అటు సైద్ధాంతికంగానూ యిటు సాహిత్య కార్యాచరణ లోనూ కొత్త ఆలోచనలనీ ప్రయోగాలనీ ప్రోత్సహించడం అవసరం.
మార్క్సిజం మనల్ని నిద్రపోనివ్వదు – వి. చెంచయ్య
విరసం యాబై ఏళ్ళ సందర్భంగా వి. చెంచయ్య గారు గోదావరి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ
పాఠశాల విద్య పూర్తయ్యేదాకా సాహిత్యం గూర్చి ఏమీ తెలియదు. కావలి జవహర్ భారతి కళాశాలలో పి.యు.సి. ( ప్రీ యూనివర్సిటీ కోర్స్) లో చేరాక హిందీ అధ్యాపకులు పులికొండ వెంకటరత్నం గారు హిందీ సాహిత్యాన్ని పరిచయం చేశారు. ప్రేంచంద్ కథలు, నవలలు, సుమిత్రానందన్ పంత్, సూర్యకాంత త్రిపాఠీ నిరాలా, మహాదేవ వర్మ వంటి కవుల కవిత్వం చదివాను, ఆ ప్రభావంతో హిందీలో కథలు, గేయాలు రాయడం ప్రారంభించాను. అవి కళాశాల మ్యాగజైన్‌లో అచ్చయ్యేవి. హిందీలో కంటే తెలుగులో రాయడం బాగుంటుందని రత్నంగారు సూచన చేశారు. ఆయన సలహాతో తెలుగులో కథలు, కవితలు, గేయాలు రాయసాగాను. వీటిలో కొన్ని కళాశాల మ్యాగజైన్‌లో అచ్చయ్యాయి.
బి.ఎ. మొదటి సంవత్సరంలో ఉండగా మా తెలుగు అధ్యాపకులు యస్వీ భుజంగరాయ శర్మగారు శ్రీశ్రీ మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి ఇచ్చి చదవమన్నారు. రెండు రోజుల్లో ఏకబిగిన చదివేశాను. మనసులో ఏదో అలజడి మొదలయ్యింది. ప్రశాంతంగా వుండలేకపోయాను. ఆ రెండు కవితా సంపుటాలూ దగ్గర పెట్టుకుని 20పేజీల వ్యాసం రాసేశాను. నేను వ్యాసం రాస్తున్నానన్న స్పృహ కూడా నాకు లేదు. నాలో కలిగిన అలజడిని తగ్గించుకోడం కోసం ఏదో రాశాను. అప్పటికి గాని ఆ అలజడి తగ్గలేదు. అప్పటి నుండి కవిత్వమొక తీరని దాహం అయింది. లైబ్రరీకి వెళ్ళి కనిపించిన కవితల, గేయాల పుస్తకాలు చదవడం మొదలెట్టాను. ఆ క్రమంలో బసవరాజు అప్పారావు కోయిల పాట ఒకటి తటస్థపడింది. ''కోయిలా కోయిలా కూయబోకే/ గుండెలూ బద్దలూ సేయబోకే'' అంటూ సాగుతుంది ఆ పాట. కోయిలను పాడొద్దనడం, అది పాడితే గుండెలు బద్దలవుతాయనడం ఏమిటో నాకర్ధం కాలేదు. కానీ ఆ పాట నా గుండెల్ని పిండేసింది. అదే రోజు కోయిల నుద్దేశించి నేనొక గేయం రాశాను.
''కోయిలా కోయిలా ఎక్కడున్నావే?
నేడు నీ పాటలే మా బాటలవ్వాలి
నీ అమరగానమే మా నాద మవ్వాలి
....... .........
తీయతీయని గాన మీనాడు కొరగాదు
అగ్నీకణములు చిమ్మగొంతెత్తి పాడవే''
అలా సాగుతుంది ఆ గాయం. బసవరాజు గారు కోయిలను పాడొద్దంటే, నేను గొంతెత్తి పాడమన్నాను. ఆయన భావకవి అనీ, భావకవులకు వెన్నెల, కోయిలపాట మొదలైనవి పడవనీ, వాళ్ళు, చీకటిని ప్రేమిస్తారనీ ఆ తర్వాత తెలిసింది.
ఆధ్యాత్మికవాదుల నుండి 'నువ్వెవరో తెలుసుకో' అనే మాట వినబడుతుండేది. 'నేను' ఆత్మ అని, దైవ స్వరూపమని అంటుండేవారు. బి.ఎ. మూడో సంవత్సరంలో ఉన్నప్పుడు వీటికి జవాబుగా 'నేను' అంటే ఎవరో చెప్పాలని 'నేను' పేరుతో ఒక కవిత రాశాను. అందులో నాలుగు చరణాలు -
''సకల ప్రపంచానికి చిక్కవలసిన ధనాన్ని
వ్యాకుల మానవాళికి చక్కని సాధనాన్ని
విప్లవ యంత్రానికి
వినియోగింపబడు ఇంధనాన్ని''
అప్పటికే నాలో అభ్యుదయ భావాలున్నాయి. నా కవితలన్నిటిలో ఆ ప్రభావం కనిపించింది. అలా మొదలైంది నా సాహిత్య ప్రస్థానం.
నా సాహిత్య పఠనం మొలైంది 1968 నుండి. మొదట హిందీ సాహిత్యం, ఆ తర్వాత 1970నుండి తెలుగు సాహిత్యం చదివాను. సాహిత్య వాతావరణం గురించి ఆలోచించేంత శక్తి అప్పట్లో నాకు లేదు. అభ్యుదయ రచయితల సంఘం గురించి విన్నాను గాని, దాని గురించి నాకు పెద్దగా తెలియదు. 1970లో విరసం ఏర్పడిందని తెలుసుగాని, దాని గురించీ తెలియదు. 1968, 69 సంవత్సరాల్లో దిగంబర కవుల గురించి విన్నాను. ఆ కవిత్వం దొరికితే చదవాలని అనిపించేది గాని, అది నాకు దొరకలేదు. ఆకాశవాణి కేంద్రం వాళ్ళు ఆగస్టు 15 సందర్భంగానూ ఉగాది సందర్భంగానూ నిర్వహించే కవిసమ్మేళన కార్యక్రమాల్ని తప్పకుండా రేడియోలో వినేవాణ్ణి. అవి ప్రతికల్లో అచ్చయితే చదివి, వాటిని సేకరించి పెట్టుకునే వాణ్ణి
శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, నారాయణరెడ్డి గార్ల కవితలు నాకు బాగా నచ్చేవి. 1973 ఆగస్టు 15 నాడు హైదరాబాద్ రేడియో కేంద్రం వాళ్ళు నిర్వహించిన కవి సమ్మేళనంలో శ్రీశ్రీ గేయాన్ని ఆరుద్ర చదివాడు. ''ఓ మహాత్మా, ఓ మహర్షీ ! / ఓ క్షమా పీయూష వర్షీ / ఎక్కడయ్యా నీ అహింస? / ఏడ నీ కరుణా రిరంస?'' అని మొదలైంది ఆ గేయం. పత్రికలో వచ్చాక దాన్ని వంద సార్లయినా చదివుంటాను. దాని ప్రభావంతో అదే లయలో 'వెంకటేశా శ్రీనివాసా, చాలులే ఇక నీ తమాషా' అంటూ నేనొక పెద్ద గేయం రాశాను. అది అప్పట్లో విజయవాడ నుండి వెలువడే 'చార్వాక' మాసపత్రికలో అచ్చయింది.
''బ్రహ్మసత్యం జగన్మిథ్యని / గీతలో నువు చెబితివి
డబ్బు కోసం కొండపైన / లార్జి స్కీవిండస్ట్రి పెడతివి''
లాంటి చరణాలు అందులో ఉన్నాయి.
1970లో నేను బి.ఎ. విద్యార్థిగా ఉన్నప్పుడు విరసం గురించి విన్నాను తప్ప, అప్పటికి దాని గురించి వివరాలేమీ తెలియవు. 1972లో కె.వి.ఆర్. గారు ఒక సందర్భంలో విరసం గురించి నాతో ప్రస్తావించారు. అయితే ఆయన కూడా వివరంగా చెప్పలేదు. జవహర్ భారతి కళాశాలలో ఆయన మాకు రాజనీతి శాస్త్రం బోధించారు. ఆయన పాఠం అంత ఆసక్తికరంగా ఉండేదికాదు గాని, శ్రద్ధగా వింటే మాత్రం విషయం చాలా బాగుండేది. పాఠం చెప్పేటప్పుడు ఆయన మాటల్లో కవితామయ వాక్యాలు దొర్లేవి. భారత రాజ్యాంగం గురించి చెబుతూ నిIఅసఱaఅ జశీఅర్‌ఱ్‌బ్‌ఱశీఅ ఱర ్‌ష్ట్రవ పవర్ వఞaఎజూశ్రీవ ్‌శీ ్‌ష్ట్రవ షశీతీవర్ జశీఅర్‌ఱ్‌బ్‌ఱశీఅ'' అని అన్న మాటలు నేనెప్పుడూ మార్చిపోలేదు. విదార్థి దశలో ఆయనకు దగ్గర కావాలని నేనెంతో ప్రయత్నించాను. కాని ఆ అవకాశం నాకు దొరకలేదు. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా చదువుతూనో, రాస్తూనో కనిపించేవారు.
1972 ఆగస్టులో తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో తెలుగు ఎం.ఏ.లో చేరాక అక్కడ ముగ్గురు విరసం సభ్యులతో పరిచయం అయింది. మొదటి వ్యక్తి తన్నీరు కోటయ్య. జ్యోతి అనే కలం పేరుతో కవితలు రాసేవాడు. రెండో వ్యక్తి మా క్లాస్‌మేట్ సాకం నాగరాజు. వారి ద్వారా త్రిపురనేని మధుసూదనరావు పరిచయం అయ్యారు. వారంలో కనీసం మూడుసార్లు కోటయ్య, నేను సాయంత్రం పూట ఆయనింటికి వెళ్ళే వాళ్ళం. ఎం.ఏ.లో ఉన్నప్పుడు సెలవు రోజులలో కావలికి వచ్చినప్పుడు కె.వి.ఆర్.ని కలిసేవాణ్ణి. అప్పుడు మాత్రం కొంత సమయం కేటాయించి మాట్లాడేవారు. ఈ నలుగురూ నన్ను విరసంలో చేరమని ఎన్నోసార్లు అడిగారు. కానీ నేను తొందరపడి చేరలేదు. ఒక సారి చేరింతర్వాత వెనక్కి వెళ్ళకూడదనే అభిప్రాయం ఉండేది. చివరకు 1975 జనవరిలో అనంతపురం మహాసభల్లో విరసం సభ్యత్వం తీసుకున్నాను.
1972 - 74 సంవత్సరాలలో తిరుపతిలో ఉన్నప్పుడు విరసం సభ్యులతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. అప్పటికి 'అరుణతార' పత్రిక ప్రారంభం కాలేదు. అయితే అప్పుడప్పుడూ 'ఎరుపు' పేరుతో విరసం తరపున కొన్ని ప్రత్యేక సంచికలు వచ్చేవి. రెండు మూడు సంచికలు అవి చదివాను. మధుసూదనరావుగారి వ్యాసాలు కొన్ని చదివాను. 1970 ఫిబ్రవరిలో వెలువడిన శ్రీశ్రీ సాహిత్యం 5 సంపుటాలు మా కళాశాల లైబ్రరీలో చూశాను. శ్రీశ్రీ కవిత్వమే గాకుండా వ్యాసాలు, ఉపన్యాసాలు, ప్రాసక్రీడలు, లిమరుక్కులు వగైరాలు చదివాను. అంతకు ముందెప్పుడో విశాలాంధ్ర ప్రచురించిన కొడవగంటి కుటుంబరావు గారి 'సాహిత్య ప్రయోజనం' వ్యాస సంపుటి చదివాను. ఆ ప్రాంతంలోనే వచ్చిన కొ.కు. 'సాహిత్యంలో విప్లవోద్యమం' వ్యాస సంపుటి బాగా ఆకర్షించింది. కొ.కు., మధుసూదనరావుల వ్యాసాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. సాంప్రదాయిక పద్ధతిలో గాక, కొత్తగా ఆలోచించే పద్ధతిని నేర్పాయి. ఏదైనా విషయాన్ని మూలాల్లోకి వెళ్ళి ఎలా చూడాలో అవగాహన కలిగించాయి. సాహిత్య అధ్యయనంలోని ఈ మార్పు నాలో వచ్చిన సాహిత్య వ్యక్తిత్వంలోని మార్పే.
1975 జనవరిలో నేను విరసంలో చేరాక ఆరు నెలల్లోనే జులై 25న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ( అత్యవసర పరిస్థితి ) విధించింది. జులై 29న కావలిలో నా పెళ్ళి. దానికి కె.వి.ఆర్., మధుసూదనరావు, వకుళాభారణం రామకృష్ణ, మధురాంతకం మాదవరావు వక్తలు. అది దండల పెళ్ళి. అయితే కె.వి.ఆర్. ను 26వ తేదీనే అరెస్టు చేశారు. అప్పటికి నేను కావలి జవహర్ భారతి కళాశాలలో తెలుగు లక్చరర్‌గా చేరి సంవత్సరం అయింది. సుమారు ఆరు నెలలపాటు నాకు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి, ఇంట్లో ఉన్నప్పుడు కాలేజీకి వెళ్ళి నా గురించి ఎంక్వయిరీ చెయ్యసాగారు. నా శ్రేయోభిలాషులు కొందరు విరసానికి రాజీనామా చెయ్యి, లేకుంటే ఉద్యోగం పోతుందన్నారు. నాలుగురోజుల పాటు విపరీతమైన టెన్షన్‌కు గురయ్యాను. నాకు పరిచయమైన విరసం సభ్యులెవరూ బయటలేరు, జైల్లో ఉన్నారు. నన్ను గైడ్ చేసే వాళ్ళు లేరు. విరసానికి రాజీనామా లేఖ రాసి పెట్టుకున్నాను. నాకు తెలిసి విరసం ఉపాధ్యక్షుడు కుటుంబరావుగారు మద్రాసులో ఉన్నారు. మద్రాసు వెళ్ళి ఆయనకు అంద జేద్దామనుకున్నాను. అలా నాలుగు రోజులు నా మనసులో నేనే మథన పడసాగాను. ఒక సారి విరసంలో చేరింతర్వాత వెనక్కి వెళ్ళకూడదని అంతకుముందు నేననుకున్న మాటలు గుర్తుకొచ్చాయి. అయిదోరోజు ఉదయం కాలేజీకి వెళుతూ దారి మధ్యలో ఉన్న ఒక మురుగు కాలువలో ఆ రాజీనామా లేఖను పడేశాను. దాంతో నా టెన్షన్ పోయింది. మనసు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. రాజీనామా ఆలోచన వచ్చినందుకు నాలో నేను సిగ్గుపడ్డాను. సాహిత్య వ్యక్తిత్వంలోనే కాదు, నా వ్యక్తిత్వంలో కూడా విరసం తెచ్చిన మార్పే ఇది.
1967కు ముందు ఎవరైనా గట్టిగా ఎదిరించి మాట్లాడితే 'నువ్వు కమ్యూనిస్టువా' అనే వాళ్ళు. 1967లో నక్సల్బరీ ఉద్యమం వచ్చాక అలా మాట్లాడేవాళ్ళను 'నువ్వు నక్సలైట్‌వా' అనడం మొదలెట్టారు. నక్సలైట్ అనేమాట కమ్యూనిస్టు అనేమాటను కాస్త వెనక్కి నెట్టింది. దీనిక్కారణం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పోరాటాల్ని వదిలి, సంస్కరణ వాదంలో కూరుకుపోయి, రివిజనిస్టు పార్టీలుగా మారిపోవడమే. ఈ తేడా సాహిత్యరంగంలో కూడా కనిపించింది. 1955 మధ్యంతర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ దారుణంగా ఓడిపోయింతర్వాత ప్రధానంగా ఎన్నికలకే పరిమితమై పార్లమెంటరీ పంథాలో వుండిపోయింది. ఆ ఎన్నికలలోనే పార్టీ తనను తాను సరిగ్గా అంచనా వేసుకోలేక పోయింది. ఒకవేళ అప్పుడు గెలిచి అధికారంలోకి వచ్చినా దాని పంథా పార్లమెంటరీ విధనానికే కట్టుబడి వుండేది. నిజానికి 1951లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని విరమించినప్పుడే దాని పోరాట చరిత్ర ముగిసింది. రచయితలూ, కళాకారులూ ఎప్పుడు కూడా ఉద్యమాలనుండే ప్రేరణ పొందుతారు. అప్పటి నుండే అభ్యుదయ రచయితల సంఘం గానీ, ప్రజానాట్య మండలి గానీ చేవను కోల్పోవడం మొదలైంది. రచయితలూ, కళాకారులూ సినిమా రంగం వైపు చూశారు.
నక్సల్బరీ పోరాటం రచయితలు, కళాకారుల్లో కొత్త స్ఫూర్తిని, చైతన్యాన్ని నింపింది. చారుముజుందార్ భారతదేశానికి ఒక ఆశా కిరణంలా కనిపించాడు. పాణిగ్రాహి సుబ్బారావు లాంటి కళాకారులు విప్లవోద్యమ స్ఫూర్తితో ప్రాణాలు సైతం అర్పించారు. రెండు మూడేళ్ళలోనే నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల్ని రాజ్యం అణిచివేసినా నక్సల్బరీ నిప్పు రవ్వను పూర్తిగా ఆర్పలేక పోయింది. ఆ స్ఫూర్తితోనే 1970 జులై 4న విరసం ఏర్పడింది. విరసం ఏర్పడ్డ వారం రోజులకే జూలై 10న అధిభట్ల కైలాసం, వెంపటాపు సత్యాలను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. తాత్కాలికంగా ఉద్యమం ఆగిపోయింది. అయినా విరసం నక్సల్బరీ ప్రేరణతో కొనసాగింది, కొనసాగుతోంది.
ఆనాడు తెలంగాణా పోరాటాన్ని పార్టీ నాయకత్వం ఉద్దేశపూర్వకంగా విరమించింది. అందుకే సాహిత్య సాంస్కృతిక రంగంలో నిరాశా నిస్పృహలు వ్యాపించాయి. అందుకు భిన్నంగా నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల్ని నాయకత్వం విరమించలేదు. తాత్కాలిక ఓటమికి గురై నాయకులు, కార్యకర్తలు ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డారు. ఆ పోరాట స్ఫూర్తి విరసాన్ని సజీవంగా నిలబెట్టింది. దానికి జననాట్యమండలి తోడైంది. ఈ రెండు సంస్థలూ ఆనాడు తెలుగు నేలను ఒక ఊపు ఊపాయి. అప్పటి నుండి విప్లవం అనే మాటకు ప్రజామోదం లభించింది. సాహిత్య రంగంలో కూడా విప్లవాన్ని అనుకూలంగానో, ప్రతికూలంగానో స్పృశించక తప్పని అనివార్యపరిస్థితి ఏర్పడింది.
ఉంది. 1974 ఆగస్టు 15న కావలిలో జరిగిన ఒక కవి సమ్మేళనంలో ''స్వతంత్ర భారత్ కీ జై! '' అనే కవిత చదివాను అందులో-
''ఓ విప్లవ కవీ!
వెధవ కూడూ గుడ్డా లేదని విప్లవం కావాలంటావా?
నీయిష్టం వచ్చినట్టు మాట్లాడే స్వాతంత్య్రం నీకు లేదోయ్ !
కాస్త నిరాశ, కాస్త నిస్పృహ, కాస్త వైరాగ్యం
కలిపి తయారు చేసిన టానిక్కు
హిందూమతం మందులషాపులో దొరుకుతుంది కొనుక్కో''
అంటూ విప్లవకవి నుద్దేశించి రాశాను. అప్పటికి నేను విరసం సభ్యుణ్ణి కాక పోయినా, నన్ను నేను విరసం సభ్యుడిగా భావించుకుని రాసిన కవిత అది. అప్పటికే విరసంతో మమేకం చెందివున్నాను. 1975లో విరసంలో చేరడం, ఎమర్జెన్సీ రావడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత జరిగిన విరసం సభలకు అన్నిటికీ హాజరయ్యాను. అధ్యయన తరగతులకు వెళ్ళాను. 1979 అక్టోబర్‌లో తిరుపతిలో జరిగిన విరసం ఏడవ మహాసభల్లో తొలిసారిగా వక్తగా పాల్గొనే అవకాశం వచ్చింది. 1983 జనవరిలో విజయవాడలో జరిగిన సాహిత్య పాఠశాలలో 1965, 70 మధ్య కాలంలో తెలుగులో వచ్చిన తిరుగుబాటు సాహిత్యం గురించి రెండు గంటలసేపు సుదీర్ఘంగా మాట్లాడాను. నేను నేర్చుకున్న ఉపన్యాసపు మెలకువల్ని ఆ ప్రసంగంలో బాగా ప్రదర్శించగలిగానని గుర్తింపు వచ్చింది. 1986 వేసవి పాఠశాలలో మార్క్సిజం గురించి మూడు రోజుల పాటు పాఠం చెప్పే అవకాశం కలిగింది. ఇవన్నీ నేను ఒక బాధ్యతాయుతమైన విరసం సభ్యుడిగా ఎదగడానికి ఉపకరించినవే. 1988లో విరసం కార్యదర్శి నయ్యాను. 'అరుణతార' సంపాదకుణ్ణయ్యాను. ఊపిరి సలపని బాధ్యతల మధ్య నన్నొక వ్యాసకర్తగా, విమర్శకునిగా, వక్తగా తీర్చిదిద్దింది విరసమే.
విరసం 50 సంసత్సారాలు మనగలగడం గొప్పకాదు; సజీవంగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగగలగడం గొప్ప. అది దాని పుట్టుకలోనే ఉంది. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల అగ్నిజ్వాలల్లోంచి విరసం పుట్టింది. విప్లవోద్యమం ఉన్నంతవరకు, ఆ ఉద్యమ అవసరం ఉన్నంత వరకు విరసం ఉంటుంది. ఇది అతిశయోక్తి కాదు. సహజోక్తి.
మొదట్నుంచీ విరరసం విమర్శకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, ఆత్మవిమర్శకూ అంత ప్రాధాన్యం ఇస్తుంది. మెజారిటీ అభిప్రాయాలతో బాటు మైనారిటీ అభిప్రాయాలకూ విలువ ఇస్తుంది. శిక్షలకంటే శిక్షణకే మొగ్గు చూపుతుంది. వృద్ధతరం సలహాలను స్వీకరిస్తూ, సానుభూతిపరుల సంఖ్యను రెండింతలు మూడింతలు పెంచుకునే గుణం ఉంది. సాహిత్య కృషి ఎంత చేసినా, రాజకీయ సిద్ధాంతానికి దూరంం కాదు. ఇప్పటికీ లక్షణాలు చాలు విరసం మరో 50 ఏళ్ళు కొనసాగడానికి.
ప్రస్తుత సమాజం ప్రజాస్వామ్య వ్యవస్థ రూపంలో ఉందని మనం భ్రమపడుతున్నాం. నిజానికిది బూర్జువా ప్రజాస్వామ్యం కూడా కాదు. ఇది బూర్జువా నియంతృత్వం. బూర్జువా ప్రజాస్వామ్యంలో బూర్జువా ప్రజాస్వామిక విలువలైనా ఉండాలి. వ్యక్తి స్వేచ్ఛ, కులమత భేదాలు లేకపోవడం, మత ప్రమేయం లేని రాజ్యం, భూస్వామ్య సంస్కృతి వ్యతిరేకత మొదలైనవి బూర్జువా ప్రజాస్వామిక విలువలు. వాటికి కూడా కాలదోషం పట్టిస్తున్న పాలక వ్యవస్థ మనది. అందువల్ల సాహిత్య, కళా, సాంస్కృతిక రంగాలు కలుషితమైపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ స్థితిలో విప్లవ రచయితల సంఘం అవసరం చాలా వుంది. విరసం తనను తాను జాగ్రదవస్థలో ఉంచుకుంటూ, సాహిత్య సాంస్కృతిక రంగాల్ని తప్పుదారి పట్టకుండా చూసే బాధ్యత వహించాలి. ఇది కేవలం విరసం ఒక్కటే చెయ్యగలిగిన పని కాదు. ప్రగతిశీల సాహిత్య కళా బృందాల సహకారంతో మాత్రమే చెయ్యగలిగిన పని. సాహిత్య సాంస్కృతిక రంగాల్లోని ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తుల్ని కూడగట్టి, ఒకటిగా నడిపించడానికి చొరవ తీసుకోగల అవకాశం విరసానికి ఉందని భావిస్తున్నాను.
సాహిత్య, సైద్ధాంతిక రంగాల్లోని వైరుధ్యాల్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, ఘర్షణ పడుతూ, పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్న సంస్థ విరసం. విరసం ఏర్పడ్డ తొలిదశలో శత్రువులందరూ ఒక్కసారి మూకుమ్మడిగా విరసంపైన విరుచుకు పడిన స్థితి ఉంది. విరసం పుట్టుకతో బెంబేలు పడిపోయి, సాహిత్యంలో కూడా నక్సలైట్లు వ్రవేశించారని, వారి పని పట్టాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్న విశ్వనాథ వంటి సాంప్రదాయికులు ఒక వైపు; సాహిత్యరంగంలో ఇక ఎంత మాత్రం పాత వేషం పనికిరాదని వేషం మార్చుకుని, కొత్త సీసాలో పాతసారా లాగా ముందుకొచ్చిన గుంటూరు శేషేంద్రశర్మ, ఆరెస్ సుదర్శనం లాంటి సరికొత్త ఆధునిక ఛాందసులు మరొక వైపు; మానవతావాదం, అనుభూతివాదం లాంటి పాఠకుల్ని పక్కదారి పట్టించే పుట్టగొడుగు వాదాలు ఇంకోవైపు; సాహిత్యంలో చేతబడులూ, సూడో సైన్సులూ ప్రవేశించి యువతరాన్ని మంత్రముగ్ధుల్ని చెయ్య ప్రయత్నించిన యండమూరిలాంటి విఠలాచార్యలూ తెలుగు సాహిత్యరంగాన్ని పట్టి పీడిస్తున్న దశలో ఆ పెడధోరణులన్నిటినీ విరసం కరకుదనంతో, కఠీనస్వరంతో నిర్దాక్షణ్యంగా ఖండించి తన ఉనికిని కాపాడుకోగలిగింది. తెలుగు సాహిత్య రంగానికి దిక్సూచిలా నిలిచింది.
ఆ తర్వాత దశలో దళితవాదం, స్త్రీవాదం, మైనారిటీ ప్రాంతీయ వాదాలు విరసానికి ప్రత్యర్థుల్లా ఎదురైనా, ఘర్షణ ఐక్యత పద్ధతిలో ఆ వైరుధ్యాన్ని పరిష్కరించుకోగలిగింది. విభిన్న అస్తిత్వావాదాల్ని తనకు మిత్రులే అని నిరూపించుకుంటూ వాటి పరిమితుల్ని విడమరిచి చెప్పగలిగింది. అస్తిత్వవాదుల సమస్యల్నీ, ఆవేదనల్నీ, తిరుగుబాటు స్వభావాన్నీ గుర్తించి, వాటిని ఆహ్వానిస్తూనే సరైన దిశా మార్గాన్ని సూచించింది. ఇక ప్రస్తుతస్థితిలో హిందూత్వ రాజ్య హింసను ఎదుర్కొంటూ, సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య సంస్కృతి భావజాల వ్యతిరేక ఐక్య సంఘటనను నిర్మించే కృషిలో తలమునకలై మునుముందుకు సాగుతోంది. ఇలా విరసం నిరంతరం అప్‌డేట్ అవుతూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది.
సాహిత్యంలో విరసం సాధించిన అంశాలలో సాహిత్య విమర్శ దృక్పథంలో తీసుకొచ్చిన మార్పు ఒకటి. సాహిత్య విమర్శలో మార్క్సిస్ట్ దృక్పథం మద్దుకూరి చంశ్రేఖరరావుతో మొదలై, కొవవటిగంటి కుటుంబరావు, కె.వి.ఆర్. లాంటి వారితో నిశిత దృష్టిని సాధించి, 1970లో విరసం ఏర్పడింతర్వాత త్రిపురనేని మధుసూదనరావు, కొకు., బాలగోపాల్ లాంటి వారితో పదునుదేలింది. ఆ తర్వాత దశలో కళ్యాణరావు, చెంచయ్య, వేణుగోపాల్, పాణి లాంటి ఎందరో మలితరం విమర్శకులు మార్క్సిస్టు సాహిత్య విమర్శను ముందుకు తీసుకువెళుతున్నారు. సాహిత్య విమర్శలో కూడా విరసంలో ఎప్పటికప్పుడు కొత్తరక్తం వస్తోంది. తెలుగు సాహిత్య విమర్శపై విరసం ప్రభావాన్ని ముఖ్యంగా మూడు అంశాలలో చెప్పుకోవచ్చు. తెలుగు సాహిత్య విమర్శ చేత స్థూలంగానైనా ప్రజాపక్షం వహించాల్సిన అవసరాన్ని గుర్తింపజెయ్యడం విరసం వెయ్యగలిగిన మొదటి ప్రభావం. ప్రాచీన సాంప్రదాయిక సాహిత్యాన్ని మార్కి ్సస్టు దృక్పథంతో విశ్లేషించి ఏ కాలపు సాహిత్యాన్నైనా శాస్త్రీయంగా అంచనా వేసే పద్ధతికి ఒక మార్గాన్ని చూపించడం రెండో అంశం. మార్క్సిస్ట్ లలో కూడా కనిపించే సంస్కరణవాద, రివజనిస్టు ధోరణుల్ని గుర్తించి సాహిత్య విమర్శలో మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచనా విధానం ఎలా ఉంటుందో చూపించడం మూడో అంశం.
దీన్ని రెండు రకాలుగా చూడాలి. మొదటిది విరసంలో కొత్త రచయితల్ని, కవుల్ని తయారు చెయ్యడంలో విరసం పాత్ర, రెండోది బయటి రచయితల్ని, కవుల్ని తయారు చెయ్యడంలో విరసం పాత్ర.
విరసానికి బయటవున్న వాళ్ళలో ఏకలవ్య శిష్యులు కొందరుంటారు. వాళ్ళు విరసం సాహిత్యాన్ని చదువుతూ ఫాలో అవుతుంటారు. వాళ్ళంతట వాళ్ళే అనేక విషయాలు నేర్చుకుంటుంటారు. విరసమే అందరికీ అన్నీ నేర్పుతుందని మేం అనుకోవడం లేదు. బయటి రచయితల, కవులనుండి విరసం సభ్యులు కూడా అనేక విషయాలు నేర్చుకుంటారు. నిజం చెప్పాలంటే ప్రతి రచయితా కొన్ని విషయాల్లో కొందరికి గురువే. ప్రతి రచయితా కొన్ని విషయాల్లో కొందరికి శిష్యుడే. ఈ విషయంలో విరసానికున్న అవగాహన ఇది. అయితే సాహిత్య దృక్పథాన్నీ, లక్ష్యాన్నీ నిర్దేశించడంలో విరసం పాత్ర తప్పక ఉంటుంది. శిల్ప పరంగా ఎందరినుంచో నేర్చుకునే అవకాశం ఉంది.
మొదట్నుంచీ ఉన్నా, గత రెండు దశాబ్దాలుగా రచయితలకు వర్క్‌షాపులు నిర్వహిస్తోంది విరసం. ఇందులో విరసం సభ్యులే గాక, సభ్యులుకాని రచయితలూ పాల్గొంటారు. ముఖ్యంగా కవిత్వరచన పైనా, కథా రచనపైనా ఎక్కువ వర్క్‌షాపులు జరిగాయి. రచయితలు తమ రచనల్ని చదివితే, అందరూ ఆ రచనల్ని విశ్లేషిస్తారు. తర్వాత ఆ రచయితలు ఇంటికి వెళ్ళి ఆ చర్చ నేపథ్యంలో మళ్ళీ తిరగరాస్తారు. ఆ విధంగా రచయితల్లో రచనా నైపుణ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది. అలా వర్క్‌షాపుల్లో తీర్చిదిద్దబడిన కథలతో 'కథలపంట' పేరుతో కొన్ని సంకలనాల్ని వెలువరించింది విరసం. ఈ కృషి అవిచ్ఛిన్నంగా సాగుతోంది. ఈ క్రెడిట్ అంతా విరసంలో యువతరానికి చెందిన సభ్యులదే.
2007 జూన్ లో విరసం వ్యాసరచన గురించి కూడా మూడు రోజుల పాటు ఒక వర్క్ షాపును మిర్యాలగూడలో నిర్వహించింది. దానికి మంచి స్పందన వచ్చింది. హాజరైన వారి చేత అప్పటికప్పుడు కొన్ని విషయాలఫై చిన్న చిన్న వ్యాసాలు రాయించి చర్చించడం జరిగింది. ప్రముఖ వ్యాస రచయితల వ్యాసాలలోని గుణ దోషాల్ని గురించి కూడా మంచి చర్చే జరిగింది. పంక్చువేషన్ ( విరామ చిహ్నాలు ) వేణుగోపాల్ ఒక పాఠం చెప్పాడు. నేను “ఒక ప్రక్రియగా వ్యాసరచన” అనే విషయం ఫై పాఠం చెప్పాను. ఆ తర్వాత దాన్ని “వ్యాస రచనా శిల్పం” పేరుతో ఒక బుక్ లెట్ ను ప్రచురించాను. ఈ విషయంఫై ఇంకా కొన్ని వర్క్ షాపులు నిర్వహించాల్సి ఉంది. భాష గురించి కూడా ఒక వర్క్ షాపును నిర్వహించాలని అనుకున్నంగాని, ఇంకా ఆచరణలోకి రాలేదు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వర్క్ షాపుల రిపోర్టులు చాలా వివరంగా 'అరుణతార'లో వచ్చాయి. ఎంత వివరంగా అంటే వాటిని చదివినా, వర్క్‌షాపులకు హాజరైన అనుభూతినీ, ప్రయోజనాన్ని పొందగలరు.
విరసానికి మొదటి పత్రిక 'ఎరుపు'. 1970 - 74 మధ్య కాలంలో నాలుగైదు సంచికలు మాత్రమే వచ్చాయి, సభలు జరిగిన సందర్భాలలో అవి ప్రత్యేక సంచికలుగా వచ్చాయి. ఆ తర్వాత 1977 నవంబర్ నుండి 'అరుణతార' విరసం అధికార పత్రికగా వస్తోంది. 1980 డిసెంబర్ వరకూ త్రై మాసికగా వచ్చింది. 1981 జనవరి నుండి మాసపత్రికగా వస్తోంది. కె.వి.ఆర్. దీని మొదటి సంపాదకుడు. ఇది మొదట వెయ్యి కాపీలతో మొదలయింది. నాలుగు దశాబ్దాలు గడిచాక కూడా ఈ సంఖ్యలో పెద్ద మార్పులేదు. ప్రస్తుతం వేస్తున్నది కూడా 1700 కాపీలే. ప్రత్యేక సంచికలు 2000 కాపీలు. ప్రతుల సంఖ్య ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.
అయితే 2016నుండి వెలువడుతున్న విరసం అంతర్జాల పత్రిక ఈ లోటును కొంత పూరిస్తోంది. దీనికి మూడు వేల దాకా పాఠకులున్నారని విన్నాను. 1992 వరకు వచ్చిన 'సృజన' విరసానికి అనధికార పత్రికలాంటిది.
మొదట్నుండి 'అరుణతార' లో గానీ, అంతర్జాల పత్రికలో గానీ విరసం సభ్యుల రచనలేగాక, ఇతర ప్రజాస్వామిక రచయితల రచనలు కూడా వస్తున్నాయి. విరసం సభ్యులు కానివాళ్ళు చాలా మంది ఈ పత్రికల్ని తమ పత్రికలుగా ఓన్ చేసుకుంటున్నారు. వీటి ప్రభావం సాధారణంగా బాగానే ఉంటోందన్న ఇంప్రెషన్ తప్ప, సరైన ఫీడ్ బ్యాక్ ఇంతవరకు లేదు. ఈ పత్రికల నిర్వహణ గురించీ, ప్రభావం గురించీ 'వీక్షణం' నిర్వహిస్తున్నట్లుగా సంవత్సరానికొక సారి రచయితల్ని, పాఠకుల్ని సమావేశ పర్చి సమీక్షలు నిర్వహించడం అవసరం. రాష్ట్రస్థాయిలోగాక పోయినా, జిల్లా లేదా ప్రాంతాల స్థాయిలోనైనా ఇలాంటివి జరపడం అవసరం.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పోరాటాల్ని వదిలి, ఎన్నికలకే పరిమితమైపోగా, అరసం, ప్రజానాట్యమండటి సంస్థలు సైతం నీరసించిపోగా, తెలుగు సాహిత్య ప్రపంచంలో వ్రాపించిన నిరాశా నిస్పృహల్ని ఛేదిస్తూ 1960వ దశకంలో తిరుగబడు కవులు, దిగంబర కవులు ప్రభంజనంలా వచ్చారు. 1967లో మొదలైన నక్సల్బరీ పోరాటం, ఆవెంటనే వచ్చిన శ్రీకాకుళపోరాటం రివిజనిజాన్ని దెబ్బతీశాయి. భారత విప్లవోద్యమానికి సాయుధపోరాట పంథాను చూపాయి. 'నక్సలైట్లే దేశభక్తులు' అనే నినాదం మారుమోగింది. మార్క్సిజం, లేనినిజం, మావో ఆలోచనావిధానం అనే ప్రాపంచిక దృక్పథంతో 1970 జులై 4న విరసం పుట్టి తెలుగు సాహిత్యలోకానికి దిశానిర్దేశం చేసింది. బెంగాల్ సంతాలులూ, శ్రీకాకుళ గిరిజనులూ చేసిన వీరోచిత పోరాటంతో కేంద్రప్రభుత్వం గిరిజన భూముల రక్షణకై 1/ 70 లాంటి చట్టాల్ని చెయ్యవలసి వచ్చింది. రాజ్యనిర్భంధంతో నక్సల్బరీ నిప్పురవ్వ తాత్కాలికంగా ఆరిపోయినట్టు కనిపించినా, అది ఆరిపోలేదు గదా...ఉత్తర తెలంగాణలో జగిత్యాల జైత్రయాత్ర మొదలైంది. విప్లవ విద్యార్థి సంఘాలు 'గ్రామాలకు తరలండి' క్యాంపెయిన్ ద్వారా పల్లె ప్రజల్లో సైతం రాజకీయ చైతన్యాన్ని కలిగించాయి. యువత, మహిళలు, అణగారిన వర్గాలు అందరూ తమ సమస్యల గురించి ఆలోచించడం ప్రశ్నించడం ప్రారంభించారు. వీటికి తోడు కారంచేడు లాంటి సంఘటనలు దళితుల చైతన్యాన్ని రెట్టింపు చేశాయి. ఈ మొత్తం వాతావరణం సమాజంలో ప్రశ్నించే స్వభావాన్ని పెంచింది. ఈ నేపథ్యం నుండే దళితవాదం, స్త్రీవాదం, మైనారిటీ వాదం, ప్రాంతీయ వాదం మొదలైన అస్తిత్వా ఉద్యమాలు మొలకెత్తాయి.
ఈ అస్తిత్వ ఉద్యమాలు తొలిదశలో తమ బాధల్ని, ఆవేదనల్ని ఆవేశ పూరితంగా వ్యక్తపరిచాయి. విప్లవోద్యమాన్నీ, విప్లవ సాహిత్యోద్యమాన్నీ కూడా ప్రశ్నించాయి. అయితే విప్లవోద్యమంగానీ, విరసంగానీ అస్తిత్వాధోరణుల్ని శత్రువులుగా పరిగణించ లేదు. వారు సంధించిన ప్రశ్నలకు సహనంతో సమాధానం ఇస్తూనే, వారి చైతన్యాన్ని ఆహ్వానిస్తూనే, ఆధోరణుల పరిమితుల్ని వివరించి చెప్పింది. క్రమంగా వారు కూడా విప్లవోద్యమాన్నీ, విప్లవ సాహిత్యోద్యమాన్నీ తమ మిత్రులు గానే భావించారు. విరసం అస్తత్వా వాదాల్ని ప్రభావితం చేసినట్లే, అవి కూడా విరసాన్ని ప్రభావితం చేశాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే బాధ్యతా యుతంగా స్వాగతిస్తున్నాం. ఒక రచయితల సంఘం 50 ఏళ్ళు ఉనికిలో ఉండడం గొప్పకాదు. చైతన్యపూరితంగా పనిచేస్తూ సజీవంగా కొనసాగడం గొప్ప. పక్కదారి పట్టించే ప్రపంచీకరణ ప్రభావాలెన్ని ఉన్నా, విరసం వాటి కెదురొడ్డి నిలిచి యువతను ఆకర్షిస్తూనే ఉంది. 50 ఏళ్ళ సందర్భం మా బాధ్యతను మరింత పెంచుతోంది. రెట్టింపు ఉత్సాహంతో పనిచెయ్యగలిగే శక్తి సామర్థ్యాలను కలిగిస్తోంది.
యువతరం టీవీలకూ, కంప్యూటర్లకూ, సెల్‌ఫోన్లకూ అతుక్కు పోతోందనీ, సాహిత్యాన్ని పట్టించుకోవడం లేదనీ, బాధ్యతారహితంగా ఉంటోందనీ సర్వత్రా వినిపిస్తున్న విషయం. ఇది చాలా వరకు నిజమే. అయితే అంతమాత్రాన యువతరంపై ఆశలు వదులుకొని చేతులు ముడుచుకు కూర్చోవాల్సిన అవసరం లేదు. దేశ భవిష్యత్తు యువతరం పైనే ఆధారపడి ఉంది. ఇది ముమ్మాటికి నిజం. సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే యువతరాన్ని సాహిత్యంవైపు, సామాజిక బాధ్యతలవైపు మళ్ళించడం కష్టం కాదు. దేశ భవిష్యత్తుపై నమ్మకం పోకూడదు. నిరాశా నిస్ప ృహలలో కూరుకు పోకూడదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రపంచాన్ని మార్చాలనుకునే వాళ్ళకు ముందు ఆ ప్రపంచపు భవిష్యత్తుపై నమ్మకం ఉండాలి. ఉత్సాహం ఉండాలి. ఈ లక్షణాలు విరసానికున్నాయి.
అందుకే ఇంత నిరుత్సాహకర వాతావరణంలో కూడా విరసం సమరోత్సాహంతో పనిచేస్తోంది. దానికి సగం బలం అదే. మిగతా సగం బలం దానికున్న మార్క్సిస్ట్ తాత్విక దృక్పథం. విరసం - సమస్యకు పరిష్కారాన్ని ఆధ్యాత్మిక వాదుల్లా పరలోకంలో చూడదు. భావవాదుల్లా మనో ప్రపంచంలో వెతకదు. గతితార్కిక చారిత్రక భౌతికవాదం దాని సిద్ధాంతం. సమస్యకు పరిష్కారాన్ని ఈ భౌతిక ప్రపంచంలోనే చూస్తుంది. ఈ అవగాహన ఉన్నంత కాలం విరసం నిరాశా నిస్పృహలకు లోనుకాదు.
విరసానికెప్పుడూ భవిష్యత్తుపై ఆశ చావదు. అంమాత్రాన ఆ ఆశ ఒక్కటే చాలదు. ఆశలనూ, ఆశయాలనూ, ఆచరణలోకి మార్చడానికి తగిన కార్యాచరణను రూపొందించుకోవాలి. యువతరం విరసం వైపు చూడక పోతే, విరసమే యువతరం వైపు చూస్తుంది. యువతరాన్ని ఎలా రాబట్టుకోవాలో విరసంలోని యువతరానికి తెలుసు. నాలుగేళ్ళ క్రితం ప్రారంభమైన విరసం అంతర్జాల పక్షపత్రిక దానికి తిరుగులేని సాక్ష్యం.
అసమానతలున్నంత వరకు, శ్రమదోపిడీ ఉన్నంతవరకు మార్క్సిజం మనల్ని నిద్రపోనివ్వదుగదా!
విరసం కాలాన్ని జయించింది - నందిని సిధారెడ్డి
విరసం యాబై ఏళ్ళ సందర్భంగా నందిని సిదారెడ్డి గారు గోదావరి పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ
1. మీ సాహిత్య ప్రస్థానం ఎలా మొదలైంది?
నా సాహిత్య ప్రస్థానం సంప్రదాయ కవిత్వంతోనే మొదలైంది. ఒక విధంగా చెప్పాలంటే పద్యరచనతో మొదలైంది. తరువాత వచన కవిత్వం, పాట, జానపద గీతాలు నా సాహిత్య ప్రస్థానంలో చేరాయి.
పాఠశాలలో లైబ్రరీ ఉండేది. దాదాపు 1000 పుస్తకాలు ఉన్నాయి. చిన్న పిల్లల కథలు చదివాను. అందరూ అంటుంటే జంద్యాల ఉదయశ్రీ చదివాను. పదవ తరగతిలో ఉన్నప్పుడు మా గ్రామపంచాయితీకి లైబ్రరీ పేరుతో దాదాపు 300 పుస్తకాలు వచ్చాయి. అర్థం కాలేదుగాని చలం ఆనందం విషాదం చదివాను. తాళ్ళూరి నాగేశ్వరరావు రాసిన 'మా ఊరి కథలు' చదివాను. అందులో ''మిఠాయి పంపకం'' అనే కథ ఉంది. ఆ కథ నన్ను ఆకర్షించింది. ఆ కథను నాటకంగా రాసాను. ఇదే నా మొదటి రచన. 15 ఆగస్టుకు, 26 జనవరికి పాఠశాలలో నాటకాలు వేసే సంప్రదాయం ఉంది. అందువల్లనే ''మిఠాయి పంపకం'' కథను నాటకంగా రాసాను.
అష్టకాల నరసింహరామశర్మ అనే తెలుగు ఉపాధ్యాయుడు బదిలీ మీద వచ్చాడు. ఆయన ప్రభావం వల్ల పద్యాలు రాయడం మొదలు పెట్టాను. ఆయన ''శిథిల విపంచి'' అనే పద్య కవితా సంపుటిని ప్రచురించాడు. దాని వెల చారాన. విద్యార్థులం అందరం కొన్నాం, చదువుకున్నాం. పద్యాల పట్ల నా ఆసక్తిని చూసి ఆయన ''ఋత చేతన'' వచన కవిత్వం ఇచ్చాడు. సిద్దిపేటలోని నలుగురు కవుల వేసిన వచన కవిత్వం అది. కథలు, కవిత్వం, నాటకాలు, పద్యం, జానపదగీతాలు రాయాలనే తలంపు పాఠశాలలో తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే నాలో ప్రవేశించింది.
2. మీ సాహిత్య ప్రస్థానం మొదలైన తొలినాళ్ళలో సాహిత్య వాతావరణాన్ని ప్రభావితం చేసిన సాహిత్యసంస్థలు ఏవి?
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అష్టకాల నరసింహరామశర్మగారి ద్వారా 'యువభారతి' అనే సాహిత్య సంస్థ పరిచయమైంది. యువభారతిలో మెంబర్ షిప్ చేయించారు. 'సాహితీ మిత్ర' పథకంలో చేరాను. అందువల్ల నాకు కొన్ని పుస్తకాలు వారి నుండి వచ్చేవి. ఇంటర్మీడియట్‌లోనే సాహితీ వికాస మండలి అనే సంస్థతో పరిచయమైంది.
డిగ్రీ మొదటి సంవత్సరంలో గ్రంథాలయ సంస్థ నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలలో జరిగిన సాహిత్య కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నాను. ఈ వారోత్సవాలు నాలో సాహిత్య రచన పట్ల ప్రేరణ కలగడానికి ఉపయోగపడ్డాయి. గ్రంథాలయంలో రోజులకు రోజులు గడిపేవాడిని. అప్పుడే శ్రీ శ్రీ మహాప్రస్థానం దొరికింది.
డిగ్రీ రెండవ సంవత్సరంలో ''నవసాహితి'' అనే సంస్థ కళాశాలలో కవి సమ్మేళనం పెట్టింది. ఈ కవి సమ్మేళనంలో పాల్గొని కవిత చదివాను. ఈ పరిణామం నా సాహిత్య ప్రయాణం వేగంగా నడవడానికి కారణమైంది. డిగ్రీ మూడవ సంవత్సరంలోకి వచ్చేసరికి నవసాహితి బాధ్యుడిగా సభలు నిర్వహించాను. దీని ద్వారా సంస్థలు నడపడం తెలిసింది.
నవసాహితి ఆధ్వర్యంలో సభ జరుగుతుండగా ఎ బి వి పి విద్యార్థులు కొందరు సభను అడ్డుకునే ప్రయత్నం చేసారు. కిటికీ బమటనుండి రాళ్ళు వేసారు. కాని మేము చాకచక్యంగా వ్యవహరించి సభను నడిపాము. దీనిద్వారా సభ నిర్వహణ, చాకచక్యంగా వ్యవహరించే నేర్పు అలవడింది. ఆ రోజుల్లో నెహ్రూ యువక కేంద్ర కూడా యువకవి సమ్మేళనాలు పెట్టేది.
3.. మీ సాహిత్య ప్రస్థానంలో మీకు విరసం ఎప్పుడు ఎలా పరిచయం అయింది?
1974 ఫిబ్రవరిలో మొదట విరసం పరిచయం జరిగింది. అప్పటికింకా నవసాహితి పరిచయం కాలేదు. హైదరాబాదులో సి.టి.ఐ. ( సెంట్రల్ ట్రయినింగ్ ఇనిస్ట్యూట్) లో నా స్నేహితుడు సత్తయ్య ఉండేవాడు. సత్యయ్యకు ఒక ఆర్గనైజర్‌తో పరిచయమయింది. ఒకానొక సందర్బంలో నా గురించి సత్తయ్య ఆ ఆర్గనైజర్‌కు చెప్పాడట. ఆ ఆర్గనైజర్ నా ఆడ్రస్ తీసుకొని నాకు ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరంలో విరసం గురించి వ్రాసాడు. ఆ ఉత్తరం ద్వారానే నాకు విరసం పరిచయం జరిగింది.
సిద్దిపేటలో భగవంతరెడ్డి ఉండేవాడు. ఆవేశపరుడు. ''అగ్నిజ్వాల'' పేరుతో కవిత్వం రాసేవాడు. సృజన, జీవనాడి, విరసంల గురించి చెప్పాడు. దిగంబర కవులు, విరసం రచయితలు మారుపేర్లతో కవిత్వం వ్రాస్తారని చెప్పాడు.
నవసాహితి పరిచయం అయిన తరువాత సరిపల్లి కృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సాన్నిహిత్యంగా మారింది. ఆ క్రమంలో మేము విరివిగా కలుసుకుంటుండేవాళ్ళం. ఆయనే నాకు విరసం ప్రాపంచిక అవగాహనను , విరసం కార్యకలాపాలను, నిర్వహణను, నిర్మాణాన్ని గురించి చెప్పాడు.
నిజామాబాదులో బెడిద రాజేశ్వర్ అనే స్నేహితుడు ఉండేవాడు. అతను విరసం గురించి ఉత్తరాల్లో రాసేవాడు. విరసం సాహిత్యంలో చాలా మార్పులు తీసుకొచ్చిందని రాసేవాడు. విరసంలో చేరవద్దని, సంస్థకు పరిమితం కావద్దని కూడా రాసేవాడు. ఒక సంస్థకు పరిమితమైతే ఆ సంస్థ నియమావళికి కట్టుబడి ఉండాలని, అలా కవులు ఉండడం సరికాదని అభిప్రాయపడేవాడు. అయితే విరసం నిబద్దత, నిమగ్నతను గురించి తన ఉత్తరాలలో చర్చించేవాడు.
4 విరసం పరిచయమైర తరువాత మీ సాహిత్య వ్యక్తిత్వలో వచ్చిన మార్పులు ఏమిటి?
విరసం పరిచయం కాకముందు పద్యాలు, వచన కవితలు, జానపద గీతాలు రాసేవాన్ని. అప్పటివరకు సినారె కవిత్వంతో ప్రభావితం అయ్యాను. ''మంటలూ-మానవుడూ'' చదివాను. సినిమాలు చూసే అలవాటు ఎక్కువగా ఉంది. అందువల్ల సినారెలాగా సినిమా పాటలు రాయాలని అనుకునేవాన్ని. ప్రాక్టీసు కోసం 200 నుండి 300 వరకు పాటలు రాసుకున్నాను. శ్రీ శ్రీ మహా ప్రస్థానం చదివిన తరువాత, శ్రీ శ్రీ కి విరసంకి ఉన్న సంబంధం తెలిసిన తరువాత కవిత్వం ప్రజాప్రయోజనాల కోసమేనని నిర్ధారించుకున్నాను.
కృష్ణారెడ్డికి గోపులింగారెడ్డి బావ. గోపు లింగారెడ్డిది సభా వివాహం. సిద్దిపేటలో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అప్పుడు గోపు లింగారెడ్డి విరసం సిటీ కన్వీనర్‌గా ఉన్నట్టు తెలిసింది. కృష్ణారెడ్డి, తదితరుల ద్వారా విరసం గురించి లోతుగా వినడం ద్వారా విరసం ప్రభావానికి లోనయ్యాను.
1974 నవంబర్‌లో కందుకూరి శ్రీరాములు, కర్ణాల బాలరాజు, నేను ( నందిని సిధారెడ్డి) కలిసి ''దివిటి'' అనే మినీ కవితా సంపుటిని త్రిమూర్తుల పేరుతో వెలువరించాము.
విరసం ప్రభావంతో నేను రాసిన మొదటి కవిత ''బందూక్''. సాహిత్యాన్ని అలవోకగా తీసుకునే స్వభావం నుంచి కవిత్వం ప్రయోజనాన్ని తెలుసుకొని ఆ దిశగా కవిత్వం రాయడానికి, కవిత్వాన్ని సీరియస్‌గా తీసుకోవడానికి, కవిగా సీరియస్‌గా, బాధ్యతాయుతంగా ఉండడానికి విరసం దోహదపడింది. నా వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని బలంగా ప్రభావితం చేసింది. నిబద్దంగా ఉండడాన్ని పరిచయం చేసింది.
విరసం, నవసాహితి రాజకీయాలు పరిచయమైన తరువాత ''దున్నేవాడిదే భూమి'' అని మా బాపు పదే పదే చెప్పే విషయానికి లింక్ కుదిరింది. అందువల్ల మరింత ఆసక్తితో, అభిమానంతో, నిబద్దతతో ఆశయం వైపు కదలాలని నిశ్చయించుకున్నాను.
5.. విరసం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన పరిణామాలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు?
తెలుగు సాహిత్యంలో విరసం ఏర్పాటు పెద్ద సంచలనం. యం.ఏ. లో క్యాంపస్‌లోకి ప్రవేశించిన తరువాత విరసం గూర్చి లోతుగా అధ్యయనం చేసాను. విరసం ఏర్పాటు తదనంతర పరిణామాలు అన్నీ అవగాహనకు తెచ్చుకున్నాను.
తెలుగు సాహిత్యంలో నెలకొన్న స్తబ్దతను దిగంబర కవులు చేధిస్తే, అవసరమైన దిశానిర్ధేశాన్ని రాజకీయ దృక్పథాన్ని జోడించి తెలుగు సాహిత్యానికి విరసం దిక్సూచిగా నిలిచింది. ఆ తరువాత ప్రతికవి విప్లవ కవిత్వ ధోరణిలో రాయాలని తపన పడేవాడు.
నీరసదశ నుంచి సాహిత్యం క్రొత్త రక్తంతో సరిక్రొత్త భావాలతో పరవళ్ళు తొక్కింది. అన్ని ప్రక్రియలలో క్రొత్త పరిణామాలు సంభవించాయి. సాహిత్యం ప్రజలకు చేరువగా వచ్చింది. పాట విశేష ప్రక్రియగా ఆదరణ పొందింది.
6.. విరసం లాంటి సంస్థ 50 సంవత్సరాలు మనగలగడం వెనుక గల పరిస్థితులు, కారణాలు తెలుపగలరు?
సమాజంలో నెలకొన్న అసమానతలు. రాజ్యాంగ అమలులో కొనసాగుతున్న అవకతవకలు, తీవ్రమైన నిరుద్యోగం, ప్రజల పేదరికం. వ్యవస్థలో ఒదగలేక వ్యక్తులు పడే సంక్షోభం, వ్యాపార సాహిత్యం, యాంత్రిక సన్మానాల సంస్థలు - అన్నీ పరిణామాలు విరసం మాబై ఏళ్ళ చరిత్రకు భూమికగా నిలిచాయి.
సాహిత్యంలో వ్యక్తివాదం, కళా విలువలు తప్ప మరేమి అక్కరలేదనే సౌందర్యవాదం, కొత్త రచయితల పట్ల నిర్లక్ష్య వైఖరి, పద్యం కన్నా, వినోద గేయాల కన్నా, ప్రజల్ని నడిపించే సాహిత్య ఆవశ్యకతే విరసం యాబై ఏళ్ళుగా నిలదొక్కుకోవడానికి యాబై ఏళ్ళుగా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేయడానికి కారణమైంది
వివిధ అస్తిత్వవాదాల ఆవిర్భావ వికాసాలను అర్థం చేసుకుని ఆహ్వానించే విశాలమైన స్వభావం వల్ల విరసం యాబై ఏళ్ళు ప్రభావవంతంగా ఉండగలిగింది.
7.. విరసం అవసరం ప్రస్తుత తెలుగు సాహిత్య సామాజిక రంగంలో ఎంత వరకు ఉన్నది?
సాహిత్యం మరొకసారి సీరియస్‌నెస్ కోల్పోతున్న దశ. ఎంత విస్త ృతంగా, వరదలా సాహిత్యం వెలువడుతున్నా స్సష్టమైన సామాజిక దృక్పథం లోపిస్తున్నది. అన్ని అస్తిత్వ వాదాలను అనుసంధానం చేయగలిగిన ప్రజాస్వామిక విధానం కొరవడింది. భిన్నత్వంలో ఏకత్వం అనే వాదనను తలమానికంగా భావించిన వ్యవస్థలో ''ఏకత్వంలో ఏకత్వం, ఏకత్వమే సమస్తం''గా రుద్దబడుతున్న చోట, వాటన్నిటిని సరిగ్గా అర్థం చేసుకుని నడిపించగలిగే క్రియాశీల సంస్థగా విరసం పాత్ర పోషించాల్సిన కర్తవ్యం మిగిలి ఉంది, ఆ పని విరసం చేస్తే సమాజానికి , సాహిత్యానికి, ప్రజాస్వామిక విలువలకు మేలు జరుగుతుంది.
మనుషులు చిన్నచిన్న సమూహాలుగా విడిపోతూ ప్రత్యామ్నాయ ఆలోచనావిధానాన్ని నిలబెట్టలేని స్థితిలో విరసం బాధ్యత మరింతగా ఉందేమో!
8. విప్లవ సాహిత్యంలో వచ్చిన పరిణామాలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు?
రాజకీయాలు సూటిగా చెప్పడం, వ్యక్తీకరణలో సిద్ధాంతానికి, కార్యాచరణకు ఎక్కువ చోటివ్వడం అనే లక్షణాలతో తొలిదశ విప్లవ సాహిత్యం వెలువడింది.
తదనంతర దశలో సాంద్ర కవిత్వం, లోతైన అవగాహన. సృజనాత్మక విలువలతో ప్రభావశీలిగా విప్లవ సాహిత్యం వచ్చింది. రాజకీయాల అవగాహనను పెంచింది. అస్తిత్వ రాజకీయాల, అస్తిత్వ సాహిత్య నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేసే నాయకత్వాన్ని విరసం అందించింది.
9 . సాహిత్య పరిశోధన మీద విమర్శ రంగం మీద విరసం ప్రభావాన్ని ఎలా అంచనా వేయాలి?
విమర్శలో చాలా బలమైన ప్రభావం ఉంది. త్రిపురనేని మధుసూదనరావు, చెంచయ్య, వరవరరావు, కె వి రమణారెడి, ఒక మేరలో వేల్చేరు నారాయణరావు లాంటి వారు విప్లవ సాహిత్య విమర్శ రంగంలో పనిచేసారు. విమర్శ రంగంలో కొనసాగాలనుకున్నవాళ్ళు తప్పనిసరిగా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసే స్థితిని సృష్టించింది.
విశ్వవిద్యాలయాలల్లో పరిశోధన కూడా తనను తాను సవరించుకున్నది. పాత సంప్రదాయిక అంశాల మీద పున:పున: పరిశోధనలను దాటి విశ్వవిద్యాలయాలు పరిశోధనలను ఆధునికరించడంలో విప్లవ రచయితల పాత్ర ఉంది. కాత్యాయనీ, కె కె ఆర్, రాచపాళెం వంటివారు విప్లవ సూత్రాలను కూడా దృష్టిలో పెట్టుకొని విమర్శ సాగిస్తున్నారు.
10. కొత్త రచయితలను కవులను తయారుచేయడంలో విరసం పాత్ర ఎంత వరకు ఉన్నదని మీరు భావిస్తున్నారు?
కొంతమేరకు ఉన్నది. వర్క్‌షాపులను, సాహిత్య పాఠశాలలను నిర్వహించి. అరుణతార పత్రిక ద్వారా కొత్త కవులను గుర్తించి వారి రచనలను ప్రచురించడం వల్ల ఒక మేరకు కవులు రచయితలు తయారయ్యారు.
11. యాబై ఏళ్ళ విరసం సందర్భాన్ని మీరు ఏ రకంగా స్వాగతిస్తున్నారు?
ఒక సంస్థ అర్థ శతాబ్ధం క్రియాశీలకంగా జీవించడం చాలా కష్టసాధ్యం. అయినా విరసం లాంటి సంస్థ కాలాన్ని జయించింది, నిలబడింది. యాబై ఏండ్ల సంస్థలు ఉండొచ్చు. కార్యదీక్షతో నడిచింది, జనస్వరమై నిలిచింది విరసం ఒక్కటే.
యాబై సంవత్సరాల సందర్భంగా పునరుత్సాహాన్ని సంతరించుకుని తెలుగు సాహిత్య రంగంలోని లోటుపాట్లను సవరిస్తూ ప్రజాభిముఖంగా ప్రయాణించాలని ఆకాంక్షిస్తున్నాను.
12 . యువతరం సాహిత్యం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని మీరు భావిస్తున్నారా? యువతరాన్ని సాహిత్యానికి దగ్గర చేయడంలో విరసం పాత్ర ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు?
యువతరం సాహిత్యం పట్ల ఆసక్తితో ఉన్నారు. సాంఘీక మాధ్యమాలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగు సాహిత్యంలో కొత్తగా సృష్టించబడుతున్న కవితా ప్రక్రియలు ఒక సూచిక.
అవార్డులు కోసం, రికార్డుల కోసం రూపొందించబడుతున్న కార్యక్రమాలు, సభలు మరొక ఋజువు. కానీ అక్షరం ఆయు:ప్రమాణం తగ్గిపోతున్నది. ఈ ధోరణుల్లో ఎటూ తేల్చుకోలేని రచయితలల్లో ఒక అయోమయస్థితి నెలకొని ఉన్నది. ఇలాంటి ఒక విచిత్ర స్థితి నుంచి స్పష్టమైన రచనా లక్ష్యాల వైపు, జీవనమూల్యాల వైపు నడిపించటం విరసం బాధ్యత, కర్తవ్యం.
May 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు