అల్లం వీరయ్య గారి ఇంటర్వ్యూ
గోదావరి పత్రిక ప్రారంభ సంచిక కోసం అల్లం వీరయ్య గారితో లోకే రాజ్ పవన్ చేసిన ఇంటర్వ్యూ
1. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి.
మాది మధ్య తరగతి రైతు కుటుంబం. అమ్మ గృహిణి. ఇంటి పనులతోపాటు రోజు కూలీకి వెళ్ళేది. నాన్న గ్రామంలో పెద్దమనిషి. చుట్టుపక్కల గ్రామాలలో ఖమ్మంపల్లి, మచ్చుపేట, ముత్తారం వరకు పంచాయతీ చెప్పడం, సమస్యలు తెంపడం వంటి పనులతో పెద్ద తరహా వ్యక్తిత్వం అతనిది. మా కుటుంబం ముంజంపల్లి నుంచి కట్టుబట్టలతో గాజులపల్లికి వలస వచ్చింది. నాన్న గాజులపల్లిలో కష్టపడి దినసరి కూలీగా పోతూ ఆయన జీవితకాలం కష్టపడి 18 - 20 ఎకరాల భూమి కొన్నాడు. మోటబావి నీళ్లతో కష్టంగా వ్యవసాయం సాగేది. 1975-76 ప్రాంతంలో కరెంటు ప్రవేశంతో మోటార్లు వచ్చాయి. మా ఉద్యోగాల వరకూ పండిన పంట అంతా కుటుంబ పోషణకే సరిపోయేది. ఒక్కోసారి కరువు సమయాల్లో తిండికి సరిపోవడమే కష్టమయ్యేది. మందులు లేని వ్యవసాయం కావడంతో ఆరోగ్యాలు ఎప్పుడూ మమ్ముల్ని ఇబ్బంది పెట్టలేదు. తిన్నది బలవర్ధకమైన ఆహారం కనుక. గ్రామంలో కాపు, పెరక, గొల్ల, మాల, మాదిగ వంటి కులాలు కలిసిమెలిసి ఉండేవి.
2. మీ చదువు - ఉద్యోగం గురించి చెప్పండి.
నాన్న కృషితోనే నేను పుట్టిన 5 - 6 సంవత్సరాలకు మా ఊరికి పాఠశాల వచ్చింది. మా అన్నయ్య, తమ్ముడు పాఠశాలకు వెళ్ళడం మొదలైనపుడు వ్యవసాయపనుల్లో నాన్నకు సహాయం కోసం నేను పాఠశాలకు వెళ్ళలేకపోయాను. ఎడ్లు కాయడానికి పోయేది. కానీ బడి మీద ఆసక్తి ఉండేది. ఓ రోజు మా బంధువొకాయన చదువుకునే మా తమ్మున్ని దగ్గరకు తీసుకున్న సంఘటన నన్ను కలిచివేసింది. నన్ను అట్లా తీసుకోకపోవడానికి కారణం నా చదువులేనితనమని అర్థమూ మర్నాటి నుండి పలక కొనియ్యమని నాన్నను పోరుపెట్టాను. నేను కూడా చదువుకుపోతే నాన్నకు కష్టమవుతుందని ఆయన సంశయించాడు. ఎట్లాగైతేనేం బలవంతంగా ఒప్పించాను. తమ్ముడు 2వ తరగతిలో ఉండగా నేను ఓనమాలు దిద్దుకున్నాను. కానీ నా వయసు, ఆసక్తి రెండూ కలిసి నన్ను తొందరగా మూడో తరగతి వరకూ సిలబస్‌ను ఇక్క సంవత్సరంలోనే నేర్చుకునేటట్టు చేశాయి. దాంతో మరుసటి ఏడాది తమ్మునితో కలిసి మూడో తరగతిలోకి ప్రవేశించాను. మా మొదటి గురువు శాస్త్రులపల్లి చంద్రయ్య సార్. ఆయన ప్రేరణ, సహాయాలే ఈనాటి నా స్థితికి పునాది. 4వ తరగతికి అమ్మమ్మగారి ఊరు వెన్నంపల్లికి వెళ్ళాను. అప్పటికే అన్న అక్కడ చదువుకునేవాడు. వెన్నంపల్లి ఊరు మా ఊరికంటే కొంత ముందంజలో ఉండేది. అక్కడ అప్పటికే ప్రజల మధ్య సాంస్కృతిక వాతావరణంలో కలగలిసిన సామాజిక సంబంధాలుండేవి. రాత్రి బుడగ జంగాల కథలు, కోలాటాల వంటివి నడిచేవి. వాటిలో అట్కరి దొంగల కథ, రఘుపతిరాయుని కథ, మైనావతి కథ, అనుముల బ్రహ్మానంద రెడ్డి కథ, జగపతిరాయుని కథ లాంటి కథలతో రాత్రంతా ప్రజలందరూ కలిసిమెలిసి ఒకేచోట ఉండి, ఐకమత్యం పెంపొందేలా ఆ కార్యక్రమాలు వారికి సహాయపడేవి. అందుకే రాజయ్య కథలలో వెన్నంపల్లి నేపథ్య కథలు ఉంటాయి. ఆ కథల్లోని పాత్రలు సజీవ సంఘటనల్లోంచి వచ్చినవే. గోదావరిఖని, మంచిర్యాల, గాజులపల్లి నేపథ్య కథలు కూడా మనం చదివే ఉంటాం. వెన్నంపల్లి పాత్రలే 'మనిషిలోని విధ్వంసం' లాంటి అద్భుతమయిన కథకు జీవం పోశాయి. తర్వాత ఆరో తరగతి నుంచి ఇంటర్ దాకా చదువు మంథనిలో సాగింది. గాజులపల్లి నుండి మంథనికి నడిచిపోయి చదివేది. కొన్నిసార్లు మంథనిలో అన్న రూమ్‌లో ఉన్నా తక్కువ కాలమే. ఇంటిని, పల్లెను, పొలాన్ని ఒక్కరోజు చూడకపోయినా వెలితిగా ఉండేది. 7వ తరగతిలో ఉండగానే 1969 తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉద్యమం వెనక చరిత్ర తెలవకపోయినా ఆ ఉద్యమంలో న్యాయం ఉన్నదనిపించేది. అందరితో కలిసి అందులో పాల్గొన్నా. అప్పటికి అన్న స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా ఉండేవాడు. అప్పటి పాఠశాల చదువు కూడా నాకు జీవితంలో చాలా ఉపయోగపడింది. మార్కులు ఎక్కువ వస్తే తోటి పిల్లలు సహించకపోయే పరిస్థితే పోటీని పెంచింది, ఆసక్తిని పెంచింది. నాకు, నారాయణనే ఎప్పుడూ పోటీ. తర్వాత రాజయ్య పియుసి కోసం వరంగల్ వెళ్ళాడు. అక్కడి చదువుకు డబ్బులకు కష్టమయ్యేది. అయినా నాన్న ధైర్యంగానే చదివించాడు. ఆర్థిక పరిస్థితి క్షీణించింది. నేను ఇంటర్‌కు వచ్చాను. ఆ కాలంలో వచ్చిన వామపక్ష ఉద్యమాలు కొంత ప్రభావం చూపించినా చదువుకోవడాన్ని వదిలివేయలేదు తర్వాత జమ్మికుంట ఆదర్శ కాలేజీలో బి.యస్సీ. సైన్స్ విభాగంలో చేరాను. కానీ హాజరు లేక మధ్యలోనే ఆపేయాల్సివచ్చింది. అట్లా 1976 నుంచి పూర్తిస్థాయి వ్యవసాయంలో నిమగ్నమైపోయాను. తర్వాత మా ఊరి మిత్రుడు నగునూరి శేఖర్ ప్రోత్సాహంతో టిటిసిలో చేరాను. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ. చేశాను. తర్వాత మొదటిసారి గిన్నెదార్‌లో ఐటిడిఎ లో టీచర్‌గా చేరాను. 1983లో వివాహం జరిగింది. మాది స్టేజి వివాహం. అదే సంవత్సరం డి.యస్సీ.లో సెలెక్టయి మంథని బాలుర పాఠశాలలో టీచర్‌గా చేరాను. తర్వాత పెంచికల్‌పేటలో, తర్వాత మళ్ళీ బాలుర పాఠశాల, మంథనిలో టీచర్‌గా చేసి 2014లో రిటైరయ్యాను.
3. ఇంట్లో సాంప్రదాయికత ప్రభావం ఎట్లా ఉండేది?
అన్న సమాజాలలాగే మన సమాజంలోనూ సాంప్రదాయిక ధోరణులు ఎక్కువగానే ఉండేవి. సమాజం ప్రతిబింబమే కుటుంబం. అయితే మొదటినుంచి నా భావాలను ఇతరుల మీద రుద్దడం నాకిష్టం లేదు. ఏది మంచిదో ఎవరికి వాళ్ళే తమ అనుభవాల ద్వారా, పరిసరాల ద్వారా గ్రహించాలి. నా సహచరి, పిల్లలు వాళ్ళ భావాలు, ఆలోచననలకు అనుగుణంగానే ఉండేవాళ్ళు. కొన్ని సార్లు సాంప్రదాయికమైన పరిస్థితులు ఎదురైనా నేను రాజీ పడేవాన్ని. వాళ్ళుకూడా నా ఆలోచనలకు ఎప్పుడూ అడ్డుతగలలేదు. పూర్తి ప్రజాస్వామిక వాతావరణం మా ఇంట్లో ఉండేది. ఒకరినొకరు నియంత్రించుకోవడం మా ఇంట్లో ఎప్పుడూ లేదు.
4. పిల్లల గురించి చెప్పండి.
ఇద్దరు పిల్లలు. పెద్దోడు చైతన్య. అమెరికాలో ఉన్నాడు. చాలాసార్లు అమెరికాలో సౌకర్యవంతంగా ఉంటారనే సాధారణ అభిప్రాయం మనకుంటుంది. కానీ చైతన్య విపరీతంగా కష్టపడ్డాడు. అక్కడ చదువు, ఉద్యోగం, స్థిరపడటం లాంటి ప్రతిదశలోనూ ఎంతో కష్టాన్ని అనుభవించాడు. మేం ఇక్కడ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. దేశంకాని దేశంలో కన్నకొడుకు కష్టాలనుభవిస్తే ఎవరు మాత్రం నిశ్చింతగా ఉండగలరు? అవి గుర్తొస్తే ఇప్పటికీ చాలా బాధగా ఉంటుంది. చిన్నోడు వంశి. పంజాబ్‌లో ఉద్యోగంలో ఉన్నాడు. ఇద్దరూ చాలా నియమబద్దంగా పెరిగారు. మా కుటుంబ నేపథ్యం, సామాజిక పరిస్థితులను ఏ వయసుకావయసులో ఆకళింపు చేసుకుని పెంపకంలో మాకీనాడు అపసవ్యమైన పరిస్థితులు సృష్టించకుండా ఇద్దరూ మెలిగారు. అక్కడికి చాలా సంతృప్తి నాకు.
5 మీ సోదరులను గురించి చెప్పండి.
వాళ్ళ గురించి అందరికీ తెలిసిందే. కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అయితే మా ముగ్గురి మీదా మా ఊరి ప్రభావం, సమాజ ప్రభావం చాలా ఉంది. వాటినుంచే రాజయ్య గొప్ప కథకునిగా ఎదిగాడు. ఆయన చూసిన పరిస్థితులు, దానికి తోడు ఆయన విద్యార్థి దశలో ఎదురు వచ్చిన వామపక్ష ఉద్యమాలు ఆయన కథల్లోని వస్తువును ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ వచ్చాయి. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో కథల్లో నిజజీవిత దృశ్యాలను చొప్పిస్తూ అభ్యుదయకరమైన ముగింపుని ఇవ్వడం రాజయ్య కథల్లో ప్రత్యేకత. కొమురం భీం మీద ఎవరూ చేయని పరిశోధన చేసి అతని జీవితాన్ని రికార్డు చేశాడు రాజయ్య. నారయణ అంతే. నమ్ముకున్న జర్నలిజంలో విలువలకోసం తాపత్రయపడ్డాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలలో నమస్తే తెలంగాణలాంటి ప్రజల పక్షపు పత్రికను నడపడం అషామాషీ విషయం కాదు. సంపాదకత్వం ఎప్పుడూ ముళ్ళమీద నడకే. తెలంగాణ ఉద్యమం లాంటి సమయంలో అది మరింత కష్టమైన పని. అయినా చాలా సమర్థవంతంగా పనిచేశాడు. అంతకుముంది కూడా చాలా ప్రగతిశీలంగా రాసేవాడు. రంగం ఏదైనా ఇద్దరూ ప్రజల పక్షాన నిలబడ్డవాళ్ళు. ఏ రోజూ తాము నమ్మిన భావాలను వదిలిన వాళ్ళు కాదు. అందుకే వాళ్ళంటే చాలా అభిమానం.
6 ఎర్రజెండా పాట గురించి చెప్పండి
1978లో రాసిన పాట అది. గాజులపల్లిలోని ఒక జానపద పాట బాణిలో రాసిందది. ఉద్యమాల్లో అమరులైన వాళ్ళ స్మృతిలో రాసిన పాట. అప్పుడప్పుడే సాహిత్య పరిణితి వస్తున్న కాలంలో మేమున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఆ పాట రాసాను. చాలా రోజులు దాన్ని చిన్న చిన్న సమావేశాల్లో కొందరు పాడేవాళ్ళు. గద్దర్ బృందం దాన్ని జననాట్యమండలి పాటల్లో భాగంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో పాడటం, సహజంగానే ఆ పాట బాణిలో, అర్థంలో పటుత్వం ఉండటం వల్ల తొందర్లోనే ప్రజల నోళ్ళలోకి వచ్చింది. అదే సమయంలో ఆర్.నారాయణమూర్తి చీమలదండు సినిమా కోసం పాట తీసుకోవడంతో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమం కదా. అందులో తీసుకున్న పాటగా అన్ని వర్గాల ప్రజలూ పాడుకునేలా సినిమా ఆ పాటను విశాల సముదాయంలోకి తీసుకువెళ్ళింది.
7. సినిమా వాళ్ళు ఏమైనా రెమ్యునరేషన్ ఇచ్చారా?
ఇక్కడొక విషయం చెప్పాలి. పాట రాయడం వరకూ రాయాలనే నా బాధ్యతను నిర్వహించాను. తర్వాత దాన్ని ప్రచారం చేసే పనిని నేను నిర్వహించలేదు. ఆ పని చేసింది జె యన్ యం వాళ్ళు. నారాయణమూర్తి నా పాటను సినిమాలో పెట్టుకుంటానని అడిగినపుడు అదే మాట చెప్పాను. ఆ సంస్థ వాళ్ళే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కనుక వాళ్ళనడిగితేనే బాగుంటుదన్నాను. ఎలాగైతేనేం, సినిమాలోకి తీసుకున్నారు పాటను. తర్వాత నాకొక పదివేల రూపాయల చెక్కు పంపించారు నారాయణమూర్తి. ఎర్రజెండా పాటను రాసే చైతన్నాన్ని, పరిస్థితులను నాకు అందించింది గాజులపల్లి ఊరు. అందుకే ఆ డబ్బును ఊరు కోసమే ఖర్చు పెట్టాలని అనుకున్నా. నిజానికి ఆ సమయంలో మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. అయినా ఆ డబ్బుతో బెంచీలు చేయించి గాజులపల్లి పాఠశాలకు ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఐదువేల రూపాయలు పంపించాడు నారాయణమూర్తి. ఆ డబ్బులతో కూడా వెన్నంపల్లి పాఠశాలకు బెంచీలు చేయించి ఇచ్చాను. అట్లా నా పాట డబ్బులను రెండు పాఠశాలల్లోని విద్యార్థులకు వెచ్చించాననే సంతృప్తి అయితే మిగిలింది నాకు. పాట పొందిన ప్రాచుర్యం కంటే ఈ సంతృప్తే నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది.
8. ఈ సాహిత్య వారసత్వం పిల్లలకు చేరిందా?
కొంతవరకు పిల్లలు కథలు, కవితలు రాస్తారు. అయితే అది నా వారసత్వంగా కాదు. వాళ్ళకు చిన్నతనం నుంచి ఉన్న ఆసక్తి, సామాజిక స్పృహల వల్లే రాస్తారు. వంశీ చాలా కథలు రాసాడు. ''మొలకలు'' అనే కథా సంపుటి తెచ్చాడు. త్వరలో మరో పుస్తకం కూడా తెస్తున్నానని చెప్పాడు. బహుశా నవల అనుకుంటా. చైతన్య వేరే దేశంలో ఉన్నా కూడా తరచు రాస్తుంటాడు. పుస్తకాలేమీ తేలేదుగానీ రాయడం మాత్రం అతనికి మంచి అలవాటుగా ఉంది. నేనెప్పుడూ నా వారసత్వంగా వాళ్ళు ఏదో రాయాలని అనుకోలేదు, కానీ వాళ్ళకు స్వతసిద్ధంగా అలవాటైంది
9. మీరేమైనా సలహాలివ్వడం, ప్రూఫ్ రీడింగ్ లాంటివి చేస్తారా?
లేదు. వాళ్ళు రాసే దాని మీద నేను ప్రభావం చూపాలని ఎప్పుడూ అనుకోను. కథా వస్తువు, పాత్రల వరకు నేను చెప్పగలనేమో. తర్వాత శైలి, కథా విధాన కొనసాగింపులాంటివైతే వాళ్ళే చేసుకోవాలి కదా! అందుకే నేను మొత్తానికే ఆ విషయంలో తలదూర్చను. ప్రూఫ్ రీడింగ్ కూడా ఎప్పుడు చేయను. మొత్తం రాశాక, ఎప్పుడైనా తీరిక సమయాల్లో వినిపిస్తే వినడం తప్ప ఇంకే రకంగాను ముట్టుకోను నేను.
10. అస్తిత్వ, సారా వ్యతిరేక, దండోరా తదితర 1990ల నాటి ఉద్యమాల ప్రభావాన్ని మీ విద్యార్థుల మీద వేయగలిగారా?
ఇంతకుముందే చెప్పినట్లు నేనెప్పుడూ నా అభిప్రాయాలను రుద్దడానికి ఇష్టపడలేదు. విద్యార్థుల మీదా అంతే. ఎవరి చైతన్యం మేరకు వాళ్ళు ఆలోచిస్తారు. అయితే ఆ చైతన్నాన్ని నా పాఠాలతో తరగతి గదిలో పెంపొందించేలా, అది కూడా అకడమిక్ పరిధి దాటకుండా ప్రయత్నించేవాన్ని. అసలు మన పాఠ్యపుస్తకాలే మనకు చాలా జ్ఞానాన్నిస్తాయి. వాటిని సరిగ్గా ఆచరణలోకి తేగలిగితే, విద్యార్థులకు ఆ జ్ఞానాన్ని అందించగలిగితే ఒక ఉపాధ్యాయుడు సక్సెస్ అయినట్టే. నేనాపనిని చాలా మట్టుకు చేశాననే అనుకుంటున్నా. మీరు చెప్పిన ఆ ఉద్యమాలలో నా విద్యార్థులు ఉండవచ్చు. అయితే నేరుగా నా ప్రోత్సాహం అందుకు కారణం కాలేదు. నేను అందించిన సాహితీ, సామాజిక జ్ఞానాల ప్రభావం వారి మీద ఉంటే ఉండవచ్చు.
11. మీ రచనల గురించి చెప్పండి
కథలు, కవిత్వం రాశాను. కథలే ఎక్కువ. రాసినవన్నీ నాకు సంతృప్తి నిచ్చినవే. సంఖ్య కోసం ఎప్పుడు రాయలేదు. వస్తువు నాణ్యమైందిగా, ఉపయోగపడేదిగా ఉంటేనే రాయడానికి పూనుకుంటాను. అందుకే నా కథలన్నీ మంచి వస్తువుతో వచ్చినవే. భయం, రెండు మరణాలు, వాసన ఇట్లా అన్ని కథలూ నేను సంతృప్తి పడే రీతిలో వచ్చినవే.
12. కానీ ఎప్పుడూ పుస్తకంగా తేలేదు కదా!
సాధారణంగా కొన్ని కథలు కాగానే రచయితలు పుస్తకాలుగా అచ్చువేసుకుంటారు. అయితే పుస్తకం వేయాలని ఏనాడూ అనిపించలేదు. నేను రాసింది కూడా పుస్తకం వేసుకోవాలని కాదు.
కొందరు మిత్రులు అడిగారు కానీ ఎప్పుడూ ఆ దిశగా ఆసక్తి చూపలేదు. కానీ కొంతకాలం తర్వాత ఒక పుస్తకంగా తెస్తాను. ఇంకో పది - పన్నెండు కథలకుగాను రాసే పని పెండింగ్‌లో ఉంది. అది పూర్తవగానే పుస్తకం తెచ్చే ఆలోచన చేస్తాను
13. ప్రస్తుత ప్రభుత్వంపై మీ అభిప్రాయం?
విస్త త జనాభా కలిగిన సముదాయాలకు ప్రభుత్వాలు జవాబుదారిగా ఉండాల్సి వచ్చినపుడు అందరు ప్రజలనూ ప్రభుత్వాలు తృప్తి పరచలేవు. అట్లాంటప్పుడు మనకు అలవాటైపోయిందేమిటంటే గతం కంటే ఇప్పుడు మెరుగే కాదా? అని ప్రశ్నించుకోవడం. ఆ కోణంలో చూస్తే గత సమైక్యాంధ్ర ప్రభుత్వాల కంటే ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు మెరుగ్గానే ఉంది. అయితే లోపాలూ ఉన్నాయి. మనం ఆశించాల్సిందల్లా లోపాలు పోవాలని, మరింత మెరుగ్గా, ఏ రోజుకారోజు మెరుగుపడేలా పాలన ఉండాలనే. అట్లాంటి పాలన ప్రజలకు అందుతుందని భావిద్దాం.
14. మీ ఎర్రజెండా పాటను పెళ్ళిళ్లలో, డి.జె.లలో, వినాయక ఉత్సవాల్లో రికార్డుగా మోగిస్తుంటే ఏమనిపిస్తుంది
ఆ పాటను ఆ రోజు ఒక ఉద్దేశ్యంతో, ఒక సామాజిక ప్రయోజనం కోసం రాసిన మాట వాస్తవమే. అయితే ఆ తర్వాత అది నా చేతినుంచి ప్రజల నాలుకల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు అందరూ ఒకేలాగా ఉండరు కదా. విభిన్న మనస్తత్వాల, విభిన్న జీవన విధానాల, విభిన్న జీవన శైలుల ప్రజలుగా ఉంటారు. ఈ ఒక్క పాటనే వాళ్ళంతా పాడుకోవాల్సివచ్చినపుడు ఎవరి వాళ్ళ స్వభావానుసారంగా పాడుకుంటారు. ఒకరు పెళ్ళికి పాడుకుంటే మరోకరు దేవుని ఉత్సవాలకు, ఇంకొకరు డి.జె. డ్యాన్సులకు దాన్ని వాడుకుంటారు. అందులో బాధపడాల్సిందేముంటుంది? విభిన్న రకాల ప్రజలు విభిన్న పద్ధతులలో పాటను అన్వయించుకుంటున్నారని అర్థం చేసుకోవాలంతే.
15 చివరగా మీ మిద్దెతోట గురించి చెప్పడి.
మొదటినుంచీ నాకు వ్యవసాయం ఇష్టం. 48 సంవత్సరాలుగా ప్రతి ఏడూ వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. అట్లాగే ఇంటి దగ్గరా చిన్న చిన్న మొక్కలు పెంచడం చేసేవాన్ని. ఒకరోజు సదాశివుడు మాస్టర్ (గోదావరిఖని) తన ఇంట్లో మిద్దె తోటను చూపించాడు. అప్పటికే తుమ్మేటి రఘోత్తం రెడ్డి, మా రాజన్న ఈ మిద్దె తోటలను ప్రారంభించారు. నేనూ ప్రారంభించాను. కూరగాయలు, పూల చెట్లు పెట్టాను. బోలెడు కూరగాయలు వచ్చాయి. పూలూ వచ్చినయి. దగ్గరి వాళ్ళందరికీ పంచుతుంటే ఎంతో తృప్తి.
16 జీవితంలో మీకు చాలా తృప్తినిచ్చిన అంశం ఏంటి?
నేను అమితంగా ప్రేమించినవి రెండు అంశాలు. మొదటిది నా వృత్తి అయితే రెండోది వ్యవసాయం. ఉపాధ్యాయునిగా ఎంతో చేయాలనే తపనతో వృత్తిలోకి అడుగుపెట్టాను. ఆ ఆశయాన్ని చివరి వరకూ మనసులో ఉంచుకునే పని చేశాను. వేలాది విద్యార్థులను ప్రభావితం చేసే పనిలో నేను నా వ్యక్తిత్వాన్ని నిరంతరం అభివృద్ధి పరచుకుంటూనే పోయాను. అందుకే నా వృత్తి పట్ల విపరీతమైన ప్రేమ నాకు.
అట్లాగే నా పసితనం నుంచీ నన్ను అంటిపెట్టుకుంటూ నాతో మమేకమైపోయి, ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు అధిగమింపజేసే అవకాశాన్ని, బాధ్యతను నాకిచ్చిన వ్యవసాయం అంటే కూడా నాకెంతో ఇష్టం. రిటైరైపోయాక ఒక అంశం నా నుంచి దూరమైందనే బాధను రెండో అంశంలో పూర్తి కాలం నిమగ్నమై తొలగించుకుంటున్నాను. ఈ రెండు అంశాలే నా జీవితంలో నాకు చాలా తృప్తినిచ్చినవి.
May 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు