గోదావరి అంతర్జాల మాస సాహిత్య పత్రికకు అట్టాడ అప్పలనాయుడు ఇచ్చిన ఇంటర్వ్యూ
మీ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిగా చెప్పండి.
నేను ఓ మధ్యతరగతి రైతు కొడుకుని. మా కుటుంబంలో అక్షరాస్యత మా బావు (తండ్రి)తో ఆరంభమైంది. మా బావు తనది వానాకాలం చదువనేవాడు. ఆంధ్రం, అమరం, భారత, రామాయణాలు చదివేవాడు. మా బావుకి అయిదుగురు అప్పచెల్లెల్లు. వాళ్ల పెళ్లీపేరంటాలూ, వ్యవసాయంలో ఎగుడుదిగుళ్లూ మధ్యతరగతి రైతయిన మా బావుని సన్నకారు రైతుని చేసాయి. నీటి ఆధరమున్న భూములు అప్పుల కింద పోయి, వర్షాధార భూమి కొద్దిగా మిగిలింది. నేను పెద్దకొడుకుని. నా కంటే ముందు పుట్టిన కొడుకు బాల్యంలోనే చనిపోయేడట. ఆ తర్వాత ఓ అక్క(ఎనిమిదేళ్ల కిందట చనిపోయింది),తర్వాత నేను.నా తర్వాత ముగ్గురు చెల్లెల్లు (ఇద్దరు చెల్లెల్లు చనిపోయేరు పదీ, పదిహేనేళ్ల కిందట) ఒక తమ్ముడు. మేమంతా ఎదిగే సరికి మా ఇంట ఇనపగజ్జెలతల్లి నాట్యమాడేది. తిండికి కరువు. దాదాపు యేడాదిలో మూడునెలలు చోడిఅంబలి, జొన్నజావ, గంటిజావ తినేవాళ్లం! ఈ పేదరికం కారణాన ఎస్సెస్సెల్సీ పాసయినా కాలేజీ చదువులకు వెళ్ల లేకపోయేను. 1969 మార్చిలో ఎస్సెస్సెల్సీ పరీక్ష రాసి పాసయ్యేను. ఏడాదిపాటు ఖాళీగా ఊరిలో వున్నాను. నేను బాగాసన్నంగా, బలహీనంగా వుండేవాణ్ని. పొలం పనులు చేయలేకపోయే వాణ్ని మా తమ్ముడిలానో, అప్పచెల్లెల్లలానో! అదీగాక అప్పట్లో మా ఊరి ఎలిమెంటరీ స్కూలుకి ఉపాధ్యాయుడిగా వచ్చిన లంక నరసింహులుమాస్టారు వలన కమ్యూనిస్ట్ రాజకీయాలు వంట పట్టించుకోవడం ప్రారంభమైంది. యువజనసంఘం పెట్టడం, గ్రామ సమస్యల మీద పనిచేయడం, సాంఘికనాటకాలు వేయడం వంటి కార్యక్రమాల్లో తిరగడంతో చెడిపోతానని భయపడిన మా బావు తర్వాతి యేడాది నన్ను ఇంటర్మీడియట్ చదువుకి పార్వతీపురం పంపించేడు. అది 1970 జూలై! మా కాలేజీ యెదురుగా పోలీస్‍స్టేషన్. జూలై 10న ఆ స్టేషన్‍కి శ్రీకాకుళ పోరాట వీరులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం గార్ల (దొంగ ఎదురు కాల్పులు) మృతదేహాలను తీసుకొచ్చేరు. ఆ వీరుల గురించీ, వారి పోరాటబాట గురించీ తెలుసుకోవడం, ఆ తర్వాత అలా ఆ రాజకీయాల్లో ప్రవేశం, కేసులూ, కోర్టులూ, మామిడి అప్పలసూరి (శ్రీకాకుళపోరాట నాయకుల్లో ఒకరు) పరిచయం, వారి అమ్మాయి అరుణ, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం...! వామపక్ష రాజకీయ విశ్వాసాలే శ్వాసగా జీవించటం!
మీరు సాహిత్యంలోకి రాకముందు సాహిత్య వాతావరణం ఎలా ఉండేది.? మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో సాహిత్య వాతావరణం ఎలా ఉండేది?
నేను సాహిత్యంలోకి వస్తాననుకోలేదు. ఇంటర్మీడియట్‍లో జాయిన్ అవకముందరి సంవత్సరమంతా ఖాళీగా వున్నాను గదా అప్పుడు ఎక్కువగా డిటెక్టివ్ సాహిత్యం, ఎమెస్కోవారి ప్రచురణలూ (మా ప్రక్క ఊరి రామకృష్ణంనాయుడు గారు తెప్పించే) చదివేను. లంక నరసింహులు మాస్టారు వచ్చేక తొలిసారిగా మహాప్రస్ధానం చదివేను. ఆ తర్వాత దిగంబర కవుల కవిత్వం, భూషణం గారి కధలూ, రావి శాస్త్రిగారి రచనలూ ...అలా అలా సోవియట్ ప్రచురణలూ నరసింహులు మాస్టారి వలన చదివేను. ఇంటర్‍లో మా ప్రిన్సిపాల్ దిగంబరకవుల్ని విమర్శిస్తే - ఖంఢించేను. దిగంబరాక్షరం అశ్లీలం పలుకుతోందంటున్నావు...కవిత అప్పచెప్పాను. అప్పటికి నా సహవిద్యార్ధి గంటేడ గౌరునాయుడు కవి. అతని కవిత్వాన్ని తూచే వాడిని. ఒక విమర్శకుడ్ని మాత్రమే అప్పటికి.
అప్పటికి బహుశా నగరాల్లోని అధోజగత్‍సహోదరుల జీవితాన్ని రావిశాస్త్రిగారూ, పల్లెల్లోని రైతాంగపేదల జీవితాన్ని కాళీపట్నం రామారావుగారూ, ఆదివాసీప్రాంత జీవితాన్ని భూషణంగారూ మహాధ్బుతంగా రాస్తుండి వుంటారు. తత్కాలంలో నేను వారివన్నీ చదవలేదు...తర్వాత్తర్వాత ఎప్పటికో అన్నీ చదివేను. చాసో గూడా రాస్తున్నారు. ఇంకోవేపుమధ్యతరగతి జీవితాన్ని బలివాడ కాంతారావు, భరాగో, రాజుల జీవితాన్ని పూసపాటి కృష్ణంరాజూ రాస్తున్నారు. వీరేగాకవ్యాపారపత్రికల కోసం రాసే కొందరు రచయితలూ ఉత్తరాంధ్రలో వున్నారు. నేను సాహిత్యంలోకి వచ్చేసరికి వున్న వాతావరణమది!
మీరు సాహిత్యరంగం లోకి రాకముందు, వచ్చిన తరువాత మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పుత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
నేను సాహిత్యంలోకి రాకముందు ప్రభావితం చేసిన పుస్తకాలు - దిగంబరకవుల దిక్‍లు, శీశ్రీ మహాప్రస్ధానం, రావిశాస్త్రి రచనలు, భూషణం కధలూ, సోవియట్‍ప్రచురణలు - అమ్మ నవల! అన్నప్రాస నాడే ఆవకాయ తిన్నావు నువ్వనే వారు కారా మాస్టారు నా గురించి. సాహిత్యంలోకి రావడమే విప్లవ రాజకీయలతో వచ్చేను. శ్రీకాకుళ పోరాటంలోని ఘటనలనేకం కధనం కావలసి వుండగా భూషణం కలం మూసే సారు, కారా కూడా! రాస్తోన్న రావిశాస్త్రికి అందని జీవితం! ఇకా సమయంలో నా యెరుకలో వున్న శ్రీకాకుళపోరాట ఘటనలను నేనే కధనం చేయాలనుకొని సాహితీకారుణ్నయాను. (పోడు-పోరు కధలు). సహజంగానే నన్ను విరసం ఆ సమయంలో ప్రభావితం చేసింది. ఇంకే సాహిత్యసంస్ధ కూడా అపుడు నన్ను ప్రభావితం చేయలేదు. విరసంలో కూడా నేను ప్రణాళికను (మార్క్సిస్ట్,లెనినిస్ట్,మావో ఆలోచనావిధానమనే కండషన్‍ను) విభేదిస్తూనే మెజారిటీకి కట్టుబడి కొన సాగేను! సృజన, అరుణతార, చైనా పోరాట నవలలు (నా కుటుంబం), ‘ఉదయగీతిక’, సోవియట్ నవలలు.... యిలా వామపక్ష రచనలు అనేకం నా మీద ప్రభావాన్ని కలిగించేయి.
మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.?
మాది వెనుకబడిన ప్రాంతం. నీటివసతిలేని వ్యావసాయకప్రాంతం. రైతులు చిదిగిపోయేరు. కూలీలు పనులు లేక వలస బాట పట్టేరు. ఆదివాసీప్రాంతాన శీశ్రీ అన్నట్టు కండబలం, కొండఫలం కొల్లగొట్టబడీ భూమీ, పుట్టా కోల్పోయి కంబార్లు(పాలేర్లు)గా మిగిలిన ఆదివాసీలు కమ్యూనిస్టులవడం...దశాబ్దన్నర కాలం పాటు చట్టబధ్ద ఆందోళనలతో నడ చిన గిరిజనోద్యమమ్మీద రాజ్యహింస ...మాచుట్టూ వున్న సామాజిక,రాజకీయ,ఆర్ధిక పరిస్ధితులు సంఘర్షణాయుతంగా వుండేవి. మా ఇంటిలో పేదరికమే గాక మా ఊరిలో రైతుల సంక్షోభం, ఇంటర్మీడియట్‍తో చదువు ఆపేసాక నేను విప్లవరాజకీయ ప్రభావంలోకి వెళ్లడం...జననాట్యమండలి ప్రదర్శనలూ, రాజకీయసభలూ, సమావేశాల్లో పాల్గోవడం, కొన్నాళ్లు పూర్తికాల విప్లవ రాజకీయకార్య కర్తగా పనిచేయడం... నిత్యసంచలనాత్మక, చలనశీల కాలమది నాజీవితంలో! ఇంకోవేపు యీ సంచలనాత్మక జీవితాన్ని అంతకుముందర కధనం చేసే భూషణంగారు విరమణలోకి మళ్లడంతో ఆ ఖాళీని పూరించడానికన్నట్టుగా నేను కధా రచన ఆరంభించేను.
మీ రచనల గురించి చెప్పండి. ఇటీవల మీరు వ్రాసిన నిరాయుధం కథ నేపథ్యం ఏమిటి?
నా రచనల గురించి నేను చెప్పేకంటే విమర్శకులూ, పాఠకులే చెప్పడం బాగుంటుంది. శ్రీకాకుళపోరాట ఉత్తేజంతో ఆ పోరాటఘటనలు కొన్ని అక్షరబధ్దం చేయాలనుకొని సాహిత్యంలోకి ప్రవేశించిన నేను ఆ క్రమంలో పోరాటఘటనలే గాక సామాజికరంగంలో వున్న అనేకాంశాలను విప్లవరాజకీయ దృష్టికోణంలోనే విశ్లేషించుకొని రచనలు చేయసాగేను. రాజకీయార్ధికేతర రచనేదీ నేను చేయలేదు. ‘‘.....గత ఉద్యమాలు, ఆకాంక్షలు, ఆశయాలు, త్యాగాలు...నిత్యఆందోళనలు..మండిన, మండుతోన్న అగ్నిగుండం నా కళింగం! ఈ అగ్నిజ్వాలలు నా నిండా...నా సాహిత్యం నిండా..! ఒక ప్రశాంతత, ఒక ప్రకాశిత ఉదయం, ఒక కార్తీకపున్నమీ...కళింగం స్వప్నిస్తోంది. కళింగమే కాదు దేశం, దేశమే కాదు ప్రపంచం...యీ స్వప్నాన్ని కంటోంది! ఆ స్వప్నమే నా రచనల ...వెనక...’’ అని నా ‘అప్పల్నాయుడు సాహిత్యం’ సంపుటాల్లో ...‘‘ నా రచనల యెనక..’’ అన్న శీర్షికలో రాసుకున్నదే యీ ప్రశ్నకు వర్తిస్తుంది.
నిరాయుధం - కధానేపధ్యం శ్రీకాకుళ ఆదివాసీ ప్రాంతాన పనిచేసే ఓ స్వచ్చంద సంస్ధ ఆర్గనైజర్‍కూ, ఆ ప్రాంతంలో గల ఓ సాయుధ విప్లవ విభాగ దళనాయుకునికీ జరిగిన అంశాలు, కొన్ని పర్యవసానాలు...ఒక నేపధ్యమైతే; మరో నేపధ్యమేమంటే...విశాఖ ఆదివాసీప్రాంతంలో బ్యాంకులు, వ్యాపారసంస్ధలు, ప్రభుత్వకార్యాలయాలూ, రాజకీయాలూ ఆదివాసీ అభివృధ్దిపేరిట జరుపుతోన్న భాగోతం...సందట్లో సడేమియాగా కార్పొరేట్ కంపెనీలు ఖనిజాల దొలిచివేతకు ప్రవేశం...ఈ మొత్తం భాగోతాన్నీ, కార్పొరేట్ దోపిడీనీ యెదిరించాల్సిన ఆదివాసీ నిరాయుధంగా కన్పించడం! సాంప్రదాయ ఆయుధాన్ని గూడా కోల్పోయిన ఆదివాసీ!
ఈ రెంటి నేపధ్యంలో రూపుదిద్దుకున్న కధ...నిరాయుధం!
మీ సాహిత్యాన్ని, మీ వ్యక్తిగత జీవితం ఎంతవరకు ప్రభావితం చేసింది ?
మీ సాహిత్యాన్ని మీ వ్యక్తిగత జీవితం ఎంతవరకు ప్రభావితం చేసింది - నిజానికి వ్యక్తిగత ఆలోచనలూ, విశ్లేషణలే రచనల్లో ప్రతిఫలిస్తాయి. నా ఆలోచనలు మార్క్సిస్ట్ధృక్పధంకి సంబంధించినవి. ఆ కోణంలోనే నా సాహిత్యమ్మీద ప్రభావం పడుతుంది. వ్యక్తిగత జీవితం...ముఖ్యంగా నేను బ్యాంకింగ్‍రంగంలో పనిచేయడం వలన, గ్రామీణబ్యాంకు కావడం వల్ల గ్రామీణార్ధిక,రాజకీయాలను చూడగలిగేను, అది నా సాహిత్యమ్మీద ప్రభావితం చేసింది.
మీ జీవితాన్ని సాహిత్యం ఎట్లా ప్రభావితం చేసింది?
నా జీవితాన్ని వామపక్షసాహిత్యం బాగా ప్రభావితం చేసింది. నాకు లోకాన్ని అర్ధం చేసుకోడానికి యెరుకనూ, లోకాన్ని చూడడానికి చూపునూ సాహిత్యమే యిచ్చింది!
మీరు విరసంలో పనిచేసారు కదా. 50 సంవత్సరాల విరసంను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు.?
నేను విరసంలో ఇరవయ్యేళ్లు సభ్యుడిగా వున్నాను(కొన్నాళ్లు కార్యవర్గ సభ్యుణ్ని కూడా). భూషణం గారు విరసంకి రాజీనామా యిచ్చేక సభ్యుడే లేని శ్రీకాకుళం నుంచి సభ్యుణ్ని అవడమే గాక ఒక యూనిట్ యేర్పరచేను. రెండు మహాసభలు నా ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జరిగేయి. అనేక చిన్నాచితకా సభలు జరిపేం. నా రచనలు చాలా ‘అరుణతార’లో వచ్చేయి. (నిరాయుధం..కధ ప్రచురించటం లేదని తిప్పి వేసారనుకోండి). నా ‘వాళ్లు’ కధ మీద యేడాది తర్వాత వ్యక్తిగత విమర్శతో లేఖ అరుణతారలో ప్రచురణయ్యింది. నేను సభ్యత్వం తీసుకున్న నాటినుంచీ ప్రణాళికను మెజారిటీకి కట్టుబడి అంగీకరించానే తప్పా అభ్యంతరాలున్నవాడ్ని. అలాగే చేరిన నాటినుంచీ నేనొక విప్లవ విభాగం ( గ్రూపు అనడం యిష్టం లేదు)కి చెందినవాణ్ని. మెజారిటీ విరసం సభ్యులు ఓ విభాగానికి చెందినవాళ్లు. ఆ విభాగపు రాజకీయాలే విరసం సంస్ధను ప్రభావితమూ, అజమాయిషీ చేస్తాయని అనుకుంటున్నాను. 1978లో విరసంలో చేరాను. 1998లో బయటకు వచ్చేను. ఏభయ్యేళ్ల విరసం సభల ఆహ్వానం కూడా నేను చూడలేదు...పత్రికల్లో చూడడమే తప్పా. ఇపుడు శ్రీకాకుళంలో సభ్యులెవరూ లేనట్టుంది కూడా!
రచయితకు రాజకీయనిబధ్దతను (రచనే గాక జీవితాచరణకూ) నిబంధన చేసి ఆచరణలో అలా కట్టుబడి, ఒడిదుడుకులను భరిస్తూ నిలబడిన సంస్ధ విరసం. విరసంని అనేకులు గౌరవించడానికిది ముఖ్యకారణం, దాని ప్రణాళికా, ప్రయాణం కంటే!
ఉత్తరాంధ్ర సాహిత్యం ప్రత్యేకత ఏమిటి ?
ఉత్తరాంధ్ర సాహిత్యం ప్రత్యేకత...ప్రజల వేపు నిలబడడం. తొలినాళ్లలో గురజాడ సామాన్యజనం వాడుక భాషను సాహిత్యంలోకి తీసుకొస్తే, సామాన్యజన జీవితాన్ని ఆ తరువాత చాసో,రావిశాస్త్రి,కారా,భూషణం, శ్రీపతి,పతంజలి వర్త మానంలో గంటేడ, బజరా, మల్లిపురం, చింతా... యెంతోమంది శ్రామికజనజీవనాన్ని చిత్రిస్తున్నారు. ఉత్తరాంధ్ర సాహిత్యం వ్యాపారసాహిత్యం కాలేదు. సంస్కరణవాద కధ (గురజాడ), అభ్యుదయకధ (చాసో), విప్లవకధ (కారా, రావిశాస్త్రి, భూషణం, నేను, బజరా), వర్తమాన ప్రపంచీకరణ సంక్షోభకధ (శ్రీకాకుళసాహితి) రాస్తుండడం...ఒక ప్రవాహం కొన సాగడం ఉత్తరాంధ్రసాహిత్య ప్రత్యేకత!
ఇప్పటికి ఆ ప్రత్యేకత ఉత్తరాంధ్ర సాహిత్యంలో కొనసాగుతున్నదా?
ఇప్పటికీ కొనసాగుతోంది. కాకపోతే గతంలో వున్న ప్రతిభావంతుల స్ధాయిని వర్తమాన రచయితలు అందుకోవలసే వుంది.
మీరు క్రియాశీలకంగా సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు కదా. ఇప్పుడు ఆ ఉద్యమాలను ఎలా అర్థం చేసుకుంటున్నారు?
నేను దాదాపు నా ఉద్యోగసంఘంతో పాటూ విప్లవరాజకీయాల్లో, అనేక సామాజికోద్యమాల్లో పాల్గొన్నాను. కేసులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు జరుగుతోన్న ఉద్యమాలలో ఐక్యత, ధృఢవైఖరీ లోటు. ఉద్యమాల చారిత్రక అవగాహన కూడా కొరవడింది.
స్టేజి కళాకారుడిగా సువర్ణముఖితో మీరు చేసిన ప్రయోగాలూ తెలుపండి.
స్టేజి కళాకారుడిగా నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నుంచి పనిచేసాను. సువర్ణముఖితో కలిసి ఆ ఒక్క విరసం సభలో, ఆ రాత్రి ప్రదర్శనే తప్పా మరెప్పుడూ వేయలేదు. సువర్ణముఖి మాతో కలిసివున్నదే తక్కువ.
మడిసెక్క అనే నాటకం రాసేను, దానిలో పాత్ర వేసాను. వంగపండు భూమిభాగోతం, శిక్కోలు యుధ్దం కంజరికధల్లో చేసాను. స్ట్రీట్‍ప్లే గా ‘విముక్తి’ దాదాపు వంద గ్రామాల్లో వేసుంటాను.
సాహిత్యం మీద శ్రీకాకుళం పోరాట ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
శ్రీకాకుళపోరాటమే...రక్తసిక్త ఆదివాసీని సాహిత్యంలోకి తీసుకొచ్చింది (భూషణం...అడివంటుకుంది కధ). శీశ్రీ నుంచి అనేకుల్ని శ్రీకాకుళపోరాటం ఉత్తేజితుల్ని చేసింది. రావిశాస్త్రి గారికి అందని పోరాటజీవితమైనా సరే వారి ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్మలుపోనాయండి,నవలల్లో గాక చివరి నవల ‘ఇల్లు’నవలలో శ్రీకాకుళం వేపు కధానాయకుడు ప్రయాణిస్తాడు. పార్లమెంటరీ రాజకీయాల లోతుల్ని అర్ధం చేయించింది. ఈ దొంగల రాజ్యాంగం రచనే ఒక కుట్ర అన్న ఎరుకను శ్రీకాకుళపోరాటమందించింది. రాజ్యం అణచివేత సాధనమన్నది రచయితలకు యెరుకపరచింది.
దేశమంటే మట్టికాదు, మనుషులని గురజాడ చెప్తే, ఆ మనుషులు కష్టజీవులన శీశ్రీ గారు చెప్పగా శ్రీకాకుళపోరాటం...ఆ కష్టజీవులు పోరాటప్రజలని తెలియజేసింది. పోరాటప్రజల వేపు సాహిత్యాన్ని నిలిపేట్టు శ్రీకాకుళపోరాటం ఉత్తేజాన్నిచ్చింది. రచయితకూ, ప్రజలకూ మధ్య రేఖను చెరిపేసింది. ప్రజలతో మమేకం కావడం నేర్పింది.
శ్రీకాకుళపోరాటం పాటను ప్రజల నోళ్లల్లో ఆయుధం చేసింది. జాతీయోద్యమంలో యీ నేల నుండి గరిమెళ్ల సత్యనారాయణ ‘మాకొద్దీ తెల్లదొరతనం’ అన్న పాట, మరికొన్ని గీతాలూ యెంతటి ఉత్తేజాన్ని కలిగించాయో, అంతకు మించిన ఉత్తేజాన్ని కలిగించే పాటలకు ప్రేరణయ్యింది శ్రీకాకుళపోరాటం ! స్వయంగా పెన్నూ, గన్నూ పట్టి ఉద్యమంలో పాల్గొన్న సుబ్బారావు పాణిగ్రాహి కవీ,కళాకారుడూ కావడం, వెంపటాపు సత్యం, ఆరిక సోములు వంటి వాళ్లు కూడా ఉద్యమ గీతాలను రాయడంతో పాట ఆయుధమైంది. దాన్ని యిక్కడనుండి శక్తివంతం చేసినవాడు వంగపండు ప్రసాదరావు ( ఆయన రాజకీయంగా అవగాహనను పెంచుకోలేకపోవడమన్న పరిమితి వున్నా సరే!).
గురజాడను ఇప్పుడు ఎలా చూడాలి?
గురజాడను ఇప్పుడే కాదు అప్పుడు కూడా బూర్జువా ప్రజాస్వామిక భావజాల ప్రభావితుడుగా చూడాలి. ఆంగ్లేయుల ఆధునికత గురజాడను ఆకర్షించింది. తాను నివసించిన ఫ్యూడల్ సమాజ విలువలు,సాంప్రదాయాలతో విభేదించేడు. ఆంగ్లేయులు తీసుకొచ్చిన ఆధునికత, ప్రజాస్వామికత - వలస ఆధునికత, వలస పెట్టుబడిదారీ ప్రజాస్వామికత.! అవి మనదేశంలోని ఫ్యూడల్ విధానాన్ని నిర్మూలించి ప్రవేశించినవి కావు. వీలున్నమేరకు వలసపెట్టుబడికి ఆటంకం లేకుండా యిక్కడి ఫ్యూడల్‍వ్యవస్ధను సర్దుబాటు చేసింది. ఆ సర్దుబాటుకు అవసరమయిన సంస్కరణవాదమే యిక్కడ మనకు వచ్చింది. సంస్కరణవాదులందరి కంటే గురజాడ ఆధునికుడు. స్త్రీ పట్ల గురజాడ ఆలోచనలు సంస్కరణవాదులకు లేవు. మతం పట్ల కూడా! గురజాడకు మార్క్సిస్ట్ భావజాలం అందే అవకాశముండివుండదు.
పాణిగ్రాహి మీ తరానికి ఎలా ఆదర్శం?
పాణిగ్రాహి మా తరానికి ఉత్తేజకిరణమే. గానీ నేను భావించేది...కవిగా,కళాకారుడిగా భావజాలరంగంలో మాత్రమే ఆయన పనిచేసి వుంటే బాగుండేదని! విప్లవమంటే కేవలం సాయుధపోరాటమే కాదుగదా, భావజాలరంగంలో గూడా పోరాటం! బ్యానర్లు రాయడం, గోడలమీద నినాదాలు రాయడం, అప్పటికప్పుడు సందర్భానికి తగ్గట్టు జోక్‍లు వేయడం, పాటలు కూర్చి పాడడం, కధలు చెప్పడం, నిత్యం ఓ సందడిగా తనచుట్టూ మనుషుల్ని ఆకర్షించే వ్యక్తి సుబ్బారావు. అనేక శక్తి, సామర్ధ్యాలున్నవాడు. గొప్ప వక్త, కళాకారుడు, రాజకీయనిబధ్దుడు...సాంస్కృతికరంగంలో చేయాల్సింది యెంతో వుండగా సాయుధపోరులో అమరుడైనాడు.
కళా సాహిత్యాల సృజనకు మూలం వ్యవస్తికృత మయిన వాస్తవమా మరి ఇంకా ఏదయినా ఉందా?
సమస్త కళాసాహిత్యాలకు జన్మస్తలం సమాజమే.వాటి గమ్యస్తానం కూడా సమాజమే. గనక సామాజిక వాస్తవికతయే కళాసాహిత్యాల సృజనకు మూలం!
ప్రస్తుతం తెలుగు సాహిత్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు?
వ్యాపారపత్రికల్లో సాహిత్యం గురించి యేం చెపుతాం?కానీ వాటిల్లో కొన్నిసార్లు, అవి గాకుండా మరికొన్ని సాహిత్య పత్రికల్లో, వెబ్‍పత్రికల్లో వస్తోన్న సాహిత్యం యెక్కువగా కొత్తతరం రాసే వాటిల్లో వైవిధ్యం కన్పిస్తోంది...వస్తు,శిల్పాల్లో! కానీ జీవితంలోని వైరుధ్యాలు, సామాజికవైరుధ్యాలు వాటి మూలాలు గురించి ఆలోచించటంలేదు. సాహిత్యచరిత్ర అధ్యయనం లేదు. ఏ రంగంలో పనిచేయాలన్నా ఆ రంగం తాలూకా ప్రయాణాన్ని, చరిత్రను అధ్యయనం చేయాలి. ఇప్పటి తెలుగు సాహిత్యకారుల్లో అది అంతగా కన్పించటంలేదు. ఇక అరుణతార,ప్రజాసాహితి వంటి పత్రికల్లో సాహిత్యం ఆయా రాజకీయవిభాగాల అవగాహన, కార్యక్రమాల చుట్టూ తిరుగుతోంది. బయట చాలా వేగవంతంగా మార్పులు జరుగుతుంటే గమనించటంలేదో, మార్పులుగా గుర్తించటంలేదో మరి తెలీదు.వాట్ని సాహిత్యీకరించటంలేదు.
సాహిత్యం లోకి యువతరం, కొత్తతరం ఎందుకు రాలేకపోతున్నది ?
కొత్తతరం, యువతరం నిజానికి తెలుగుభాషకు దూరమవుతున్నారు. యేమేరకో తెలుగుభాషతో బంధమున్నవాళ్లు కూడా బతుకుతెరువు యాతనలో పడినలుగుతున్నారు. సాహిత్యం కోసం తీరుబడి చేసుకునే వెసులుబాటు లేని కాలంలో వాళ్లు జీవిస్తున్నారు గనక కొత్తతరం,యువతరం రావడంలేదనుకుంటాను.
ఉత్తరాంధ్ర మాస పత్రిక నిర్వహణలో మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి?
ఉత్తరాంధ్ర మాసపత్రిక నిర్వహణలో రచనల కొరత, ఆర్ధికకొరత యిబ్బంది పెట్టేది. ముఖ్యంగా రచనలు...కొరత ఎక్కువ. మనం ఆశించే రీతిలో మనకొచ్చే రచనలు చాలా తక్కువ. రాజీపడి ప్రచురించడమే! నిర్వహణలో సభ్యులంతా కాకపోయినా యెక్కువ మంది పాలుపంచుకుంటే బాగుండేది. మాకు అది తక్కువ. అందరూ యెవరి వ్యాపకాల్లో వారు బిజీ! ఉత్తరాంధ్ర పత్రిక యాజమాన్యం, సంపాదకుడిగా రిజిస్ట్రేషన్ సన్నశెట్టి రాజశేఖర్ పేరున వుంది. ఆయనకు ఒక వేపు ఉపాధ్యాయసంఘం, యింకోవేపు ఒక విప్లవ విభాగంలో పాలుపంచుకోడం, కుటుంబం యిలా అనేకాల్లో ఒకటిగా ఉత్తరాంధ్ర ఆయనకు. మరికొన్ని సంస్ధాగత సమస్యలూ వచ్చేయి. పరిష్కరించుకోవాలి.
సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనా ఇంతవరకు మీ అనుభవం ఏమిటి?
సాహిత్యం ద్వారా మాత్రమే సమాజంలో మార్పు రాదు. అనేకానేక అంశాలు సామాజికమార్పుకి దారితీస్తాయి. ఆ అంశాల్లో సాహిత్యం ఒకటి!
కొత్తగా మీరు ఏం రాశారు ఇంకేం రాయబోతున్నారు?
కొత్తగా యేటా ఒకటో రెండో కధలు రాస్తునే వున్నాను...కొత్త పరిస్ధితుల మీద! ఓ నవల ‘బహుళ’ పూర్తి చేసాను. దాదాపు వందేళ్ల కళింగాంధ్రా సామాజిక ప్రయాణాన్ని చిత్రించే ప్రయత్నం చేసానందులో!
పాఠకులు, కవులు రచయితలు సాహితీవేత్తలకు గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు, లేదు?
ఎన్నడో కొ.కు ఓ మాట చెప్పారు - వస్తువు కోసం సమాజాన్నీ, శిల్పం కోసం సాహిత్యాన్నీ అధ్యయనం చేయమని. అదే చెప్పదలచుకున్నాను. దానికి జతగా గరిమెళ్ల సత్యనారాయణ మాటను జోడించాలి - కవులూ, రచయితలూ...వర్తమాన రాజకీయాల్లోంచి వస్తువులను యేరుకోవాలని! పాఠకులు ఆదరించాలని. గోదావరి నిర్వాహకులకు నమస్కారాలు!
Oct 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు