ఇంటర్వ్యూలు

(October,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

బోధనాభాషగా పాలనాభాషగా మాతృభాషను అమలు చెయ్యాలి –సాకం నాగరాజు

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు సాకం నాగరాజు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.       మీ బాల్యం గురించి.

          మావూరు పాకాలకు దగ్గర్లో వరదప్పనాయుడు పేట. మాది ఉమ్మడి కుటుంబం. గాండ్లకులస్తులమైనా వ్యవసాయమే. పిల్లలు పెద్దలు 21 మందిమి. మా పెద్దలు మమ్మల్ని బాగా చదివించారు. నేను లెక్చరర్‍, మా తమ్ముడు ప్రిన్సిపాల్‍, ఇంకో తమ్ముడు బ్యాంక్‍ ఆఫీసర్‍. మా అన్న వెంకటసుబ్బయ్య పి.యు.సి. వరకే చదివినా హోమియో రంగంలో కృషిచేసి తిరుపతి కొర్లగుంటలో డాక్టర్‍గా స్థిరపడినాడు. డాక్టర్‍ దేవుడుగా పేరు పొందాడు. ఇప్పుడు మా ఐదు కుటుంబాలూ తిరుపతి నగరంలో స్థిరనివాసం వుండే దాకా ఎదిగామంటే ఆశ్చర్యంగానే వుంటుంది.

2.       మీ విద్యాభ్యాసంలో చెప్పుకోదగిన విషయాలు...

          దామల్‍చెరువు హైస్కూల్‍కు రోజూ ఐదుమైళ్ళు నడిచి వెళ్ళిరావడం. రెండు సంగతులు ముఖ్యంగా చెప్పాలి. తొమ్మిదిలో వుండగా మాకు తెలుగు అయ్యవారు మధురాంతకం దొరస్వామి పిళ్ళై. పద్యంలో ప్రతి పదానికి అర్థం చెప్పేవారు. అర్థాలు తెలుసుకొని పద్యం చదువుకుంటే పద్యం నోటికి వచ్చేది. ఇలా తెలుగుభాషపట్ల ఏర్పడిన మమకారం వల్లనో ఏమో మా తమ్ముడు సుధాకర కామర్స్లో పి.జి. చేస్తే నేను తెలుగులో చేశాను. తెలుగు పట్ల ఈ మమకారాన్ని మరింత పెంచి పోషించింది యూనివర్శిటిలో తుమ్మపూడి కోటేశ్వరరావు మేష్టారు పాఠాలు.

3.       మీ ఉద్యోగ జీవితం...

          దీనికంటే ముందు నా విద్యార్థి దశ గురించి కొంత చెప్పాలి. కాలేజీ విద్య అంతా తిరుపతినే. డిగ్రీలో రెండు సంవత్సరాలు నేను మా హాస్టల్‍ సెక్రటరీని. ఈ సమయంలోనే త్రిపురనేని మధుసూదనరావు మా గోవింద రాజస్వామి కాలేజీ లెక్చరర్‍. నా దురదృష్టం కొద్దీ ఆయన మా క్లాసుకు పడలేదు. అయితే అదృష్టం కొద్దీ సంవత్సరం లోపే వారితో పరిచయానికి మించిన సాంగత్యం లభించింది. అప్పటికే దిగంబర కవుల కవితా సంపుటి ఒకదాన్ని లైబ్రరీలో చదివి వున్నాను. ఇక అప్పటి నుంచీ శ్రీశ్రీ, చలం, కొ.కు., రావిశాస్త్రి, శ్రీపాద.... ఇలా రచయితలు నాకు సరికొత్త దృక్పథాన్ని కల్పించారు. ఫలితంగా 1972 గుంటూరు సభల్లో విరసంలో ప్రవేశం. ఆ రోజుల్లో   ఉబలాటం కొద్దీ సృజన, అరుణతారల్లో ఐదారు కవితలేవో రాశాను తప్ప నేనేమీ కవినీ కాను, రచయితనూ కాను. ఈ కాలంలోనే తిరుపతిలో ఏర్పడిన రాడికల్‍ స్టూడెంట్స్ యూనియన్‍ వ్యవస్థాపక సభ్యుల్లో నేను కూడా ఒకణ్ని. ఎమెర్జెన్సీకాలం వరకూ రాడికల్స్ కార్యకలాపాలు బాగానే జరిగాయి తిరుపతిలో.

          ఇక నా ఉద్యోగ జీవితమంటారా, వృత్తి ధర్మాన్ని పాటించాను.  కానీ లెక్చరర్ల సంఘంలో తలదూర్చి ఇరవై ఏళ్ళ కాలాన్ని వృథా చేసుకున్నా. ఎక్కడ పనిచేసినా సాహితీ వేత్తలను కళాశాలకు పిలిపించి విద్యార్థులకు వారి   ఉపన్యాసాలు ఏర్పాటు చేసేవాణ్ణి. త్రిపురనేని, భూమన్‍, జ్యాలాముఖి, సింగమనేని, మృణాళిని, గరికపాటి, ఎండ్లూరి. సుధాకర్‍, అశోక్‍తేజ వంటి వారిని వినే అవకాశం మా విద్యార్థులకు కలిగింది. దీంతోపాటు ఉద్యోగజీవితంలో ఆరు కాలేజీ మేగజైన్లు నా చేతుల మీదుగా వచ్చాయి. ఈ మేగజైన్లు చూసిన జానుమద్ది హనుమచ్చాస్త్రి, వకుళాభరణం రామకృష్ణ, నిఖిలేశ్వర్‍, ఎం.వి. రమణారెడ్డి, యాకూబ్‍ వంటి మేధావులు ఇవి విశిష్ట సంచికలనీ, సాహిత్య సంచికలనీ అభినందించారు. విద్యార్థుల్లో సాహిత్య స్పృహ  కలిగించేందుకు కొంత మేరకు ప్రయత్నం చేశాననే తృప్తి మిగిలింది నాకు.

4        తిరుపతిలో తెలుగు భాషా బ్రహ్మత్సవాలు ఆ స్థాయిలో రాయలసీమలో మరెక్కడా జరగలేదేమో! మీ ఆశయాలేమిటి? ఎంతవరకు సాధించారు?

          ఇవి భూమన కరుణాకరరెడ్డి గారి నేతృత్వంలో జరిగిన తెలుగు పండుగలు. సంస్థకు ఆయన అధ్యక్షులు శైలకుమార్‍ నేనూ కన్వీనర్లము. 2004 నుంచీ నాలుగేళ్ళ పాటు ప్రతి ఏటా ఏడు ఎనిమిది రోజులపాటు నవంబర్‍ మాసంలో జరిగేవి. తెలుగు ప్రజల్లో భాషాస్ఫూర్తిని కలిగించడమే సభల ఆశయం. ఆ ఉత్సవాలను జనరంజకం కావడానికి కేవలం సినీ గ్లామర్‍కే పరిమితం చేయకుండా దాశరథి రంగాచార్య, జ్వాలాముఖి, కత్తి పద్మారావు, ఓల్గా, శివారెడ్డి, సింగమనేని, వంగపండు, గోరటి వెంకన్న, గరికపాటి వంటి సమాంతర రచయితలు, కళాకారులను పిలిపించి సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపాము. జనసందోహంతో మహతి సభామందిరం క్రిక్కిరిసి పోవడం మహదానందం కలిగించేది మాకు.

5        లెక్చరర్‍గా వుంటూనే ప్రచురణ రంగంవైపు మళ్ళినట్టున్నారు?

          అభినవ ప్రచురణలు పేరుతో మొదటి పుస్తకం తెలుగు కథకి జేజే’. మామూలుగా కథాసంకలనాలు చలం అనగానే ఓ పువ్వు పూసింది, శ్రీపాద అనగానే గులాబీ అత్తరు, రావిశాస్త్రి అనగానే కార్నర్‍ సీటు, ముళ్ళపూడి అనగానే కానుక తో కథాసంకలనాలు తేవడం తెలుగునేల మీద రివాజు. దానికి భిన్నంగా ఒక సంకలనం తెద్దామన్న ఆలోచనే తెలుగు కథకు జేజే’. నిజానికి చాసో వఱపు, కొ.కు. ఆదాయవ్యయాలు కథలకు ఒకరకంగా పాఠకుల్లో ప్రాచుర్యం కల్పించింది ఆ సంకలనమే. అంతకు ముందు పాఠక లోకానికి పెద్దగా తెలియని కథలవి. అంత పెద్ద కథాసంకలనంలో లబ్ధప్రతిష్టులకే పెద్దపీట వేయలేదు. తుమ్మపూడి భారతీ, ఒకే ఒక కథ రాసిన బాపూ, మోహనలూ ఇంకా మహాకవి అయిన శిష్ట్లా (గురివి కథ) చోటుచేసుకున్నారు. పెద్దప్రచురణ సంస్థలే వెయ్యికాపీలు వేస్తుండగా ఖరీదైన పేపరు మీద మూడువేల కాపీలు ముద్రించి నా ముచ్చట తీర్చుకున్నాను. కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయ చరిత్ర కూడా అభినవ ప్రచురణే. తెలుగు కథతో మొదలైన ఈ పుస్తక ప్రచురణ ఈ రోజు నా రచన మహాభారతం : సొగసులు - సూక్ష్మాలు దాకా కొనసాగుతూనే వుంది.

6        అన్నిటికంటే తెలుగుభాషోద్యమ సమితి కార్యక్రమాలే విశేషంగా చేసినట్టున్నారు మీరు...

          లెక్చరర్ల సంఘం తర్వాత సమితి పనులే నావి ఎక్కువ. 2006లో పిడికెడు మందితో ఏర్పడిన సంస్థ. తెలుగుభాషకు ప్రాచీన హోదా  కోరుతూ మా కార్యక్రమాలు ప్రారంభించాం. దాంతోపాటు రచయితల జయంతులు వర్ధంతులు, పుస్తక ఆవిష్కరణలు జోరుగా జరిగేవి. అడపాదడపా తెలుగుభాష పరిరక్షణ గురించీ గొంతు విప్పేవాళ్ళం. ప్రభుత్వానికి మహజర్లు, విజ్ఞప్తులు, దీక్షలు, ఊరేగింపులూ వంటివి. ఎక్కువగా కార్యక్రమాలు మొక్కుబడిగా సాగడంతో మాలో కొంత నిరాశ కలిగింది. ఆరుద్ర గారు ఒక సందర్భంలో మంచిమాట చెప్పారు. తెలుగులో అచ్చులు హల్లులు ఈ 56 అక్షరాలు - తెలుగు జాతికున్న గొప్ప సంపదఅని. కనుక ఈ సంపదను వీలైనంత, చేతనైనంత కొద్దికొద్దిగా కూర్చి విద్యార్థులకు చేర్చడానికి చిన్న చిన్న పుస్తకాలను సంకలనం చేసేపని తలపెట్టింది సమితి. ఇప్పటి వరకూ ఓ ఇరవైదాకా వేసివుంటాము : విద్యార్థుల కోసం శ్రీశ్రీ, చిత్తూరు కథ, రాజాచంద్ర ఫౌండేషన్‍ దుర్గాప్రసాద్‍ గారితో కలిసి నవ్యాంధ్ర ప్రత్యేక సంచిక... ఇలా సమితి చేతినిండా పనిబెట్టుకుంది. చాల పుస్తకాలు జిల్లాలోని పాఠశాలలు కళాశాలలకు వెళ్ళి విద్యార్థులతో చదివించాము,.. మాకు ఎంతో కొంత ప్రయోజనకరంగా కనిపించిన పని ఇదే అని ఘంటాపథంగా చెప్తున్నా.

7        ఉద్యోగ విరమణ తర్వాత చాలా పాఠశాలల్లో కోటపురుషోత్తంతో కలసి చేసిన ప్రసంగాల గురించి...

          పత్రికలు మా ఇద్దరికీ పెట్టిన పేరు అక్షరనేస్తాలు.  ఆరేడేళ్ళపాటు ఉమ్మడి రాష్ట్రంలో అనేక మార్లు  పర్యటన చేశాము. పురుషోత్తం పద్యాలకు ప్టెని కోట. వ్యక్తిత్వ వికాసం గురించి ఉపన్యాసం చెప్పడంలో దిట్ట. ఆయన    ఉపన్యాసాలు లక్షలాది మంది విద్యార్థులకు ప్రేరణ నిచ్చాయి. నిజానికి ఈ పర్యటనంతా సారథి  పురుషోత్తమైతే, సారథ్యం మాత్రమే నాది. బాగా వ్యయప్రయాసలతో సాగిన పర్యటన.

8        ఏదో ఒక పుస్తకం మీరు 20 వేల కాపీలు వేశారటగా !

          ఒకసారి బాపుగారు యేసోపు కథలకు వందకుపైగా బొమ్మలు వేసి నామినికి పంపించి ఆ కథలను అనువాదం చేసి పుస్తకం వేసి పిల్లలకు పరిచయం చేయండని చెప్పారు. నామిని అప్పటికే మా అమ్మ చెప్పిన కతలను శివకాశికి వెళ్ళి లక్షప్రతులను ముద్రించి చేతులు కాల్చుకొని వున్నాడు. ఈ పని ఇప్పుడు నావల్ల కాదనిఆయన చేతులెత్తేయడంతో నేను ముందుకు వచ్చి ఆ పుస్తకాన్ని ఏకంగా 20 వేల కాపీలు అచ్చువేసి చిలక ముక్కుల్లాంటి ఆ పుస్తకాలను పప్పులు బెల్లాల్లా పంచిపెట్టాము.

9        కనిపించిన వారందరికీ పుస్తకాలు ఇస్తారట కదా...

          నాకు పరిచయస్థులు అందరి ఇళ్ళల్లో నా పుస్తకాలు వుండే వుంటాయి. చివరకు నేను ఎక్కిన ఆటోలో డ్రైవర్‍ అయినా సరే, వాళ్ళ ఇంట్లో స్కూలూ కాలేజీ పిల్లలున్నారంటే నావద్ద వున్న ఏదో ఒక పుస్తకం ఇచ్చి తీరుతాను. పక్కన నా భార్య గనకవుంటే ఆమెకు తలగొట్టేసినంత పనే, ప్రిస్టేజ్‍ ఫీలవుతుంది. కొరియర్లకే వేల రూపాయలు ఖర్చు అయివుంటాయి నాకు. నన్ను అడిగిన వారిలో నేను పుస్తకాలు కొరియర్‍ చేయకుండా ఏ ఒక్కరూ లేరు ఈరోజుకీ. నా పిచ్చి నాకు ఆనందమే!

10.     స్వర్గీయులైన వారిపేరిట వారి వర్ధంతులకు కొన్ని పుస్తకాలు తెచ్చినట్టున్నారు!

          పేదల డాక్టర్‍గా పేరుపొందిన మా అన్న మరణిస్తే మంచి మంచి వ్యాసాలతో మా అన్న డాక్టర్‍ వెంకటసుబ్బయ్య పేరుతో సాహిత్య సంస్మరణ సంచిక తెచ్చాను. బ్యాంక్‍ ఆఫీసరైన మా తమ్ముడు మోహన్‍ అకాల మరణం చెందాడు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డిగారి తమ్ముడి ఉత్తరంకథను ముద్రించాను. కంటతడి పెట్టే కథ, గుండెలను పిండివేసే కథ అన్నారు చదివిన వాళ్ళు. పుస్తకం వెయ్యడానికి చావుల కోసం ఎదురుచూసే నాగరాజు అని  కొందరు జోక్‍లు వేసినా సరే నేను వెరవలేదు. మిత్రుల కుటుంబాల్లోనూ - చావులకూ పెళ్ళిళ్ళకూ కథల పుస్తకాలు వేశాము. గిఫ్టుగా ఇచ్చే స్టీలు క్యారీర్ల కంటే పుస్తకం వేయివిధాల మేలని మా అనుభవం నేర్పింది.

11.      చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య ఏర్పాటులోనూ మీరే ప్రధానపాత్ర వహించారా?

          ప్రధానపాత్ర పలమనేరు బాలాజీ గారిది. కట్టమంచి బాలకృష్ణారెడ్డి, నాయుని కృష్ణమూర్తి, వేంపల్లి అబ్దుల్‍ ఖాదర్‍, టి.ఎస్‍.ఎ. కృష్ణమూర్తి వంటి పెద్దలు బాగా సహకరించారు. బాలాజీకి నేనూ తోడుగా నిలిచాను. నాలుగైదు నెలల కృషితో జిల్లాలోని దాదాపు ఇరవై సంస్థలు ఒక్కతాటి మీదకు వచ్చాయి. బాలాజీ నేనూ ఇద్దరం కన్వీనర్లుగా వున్నాము. 1968లో చిత్తూరు పట్టణంలో జిల్లా రచయితల తొలిమహా సభలు జరిగాయి. 2016లో సెప్టెంబర్‍ 10, 11 తేదీలలో సమాఖ్య ఆధ్వర్యంలో మళ్ళీ జిల్లా రచయితల సభల్ని వైభవంగా జరుపుకున్నాము. సభల ప్రత్యేక సంచిక కూడా తేవడం జరిగింది. త్వరలో చిత్తూరు కవితకూడా రాబోతోంది.

12.      ప్రభుత్వం భాషపరంగా ఏమి చేయాలని  మీరు అనుకుంటున్నారు?

          బోధనాభాషగా పాలనాభాషగా మాతృభాషను అమలు చెయ్యాలనే అందరూ కోరుతున్నది. గత ప్రభుత్వాలు చేస్తామంటూనే చెయ్యలేదు. ఈనాటి ప్రభుత్వమైతే చెయ్యము అని ఖరాఖండిగా చెప్తూ వున్నది. ఇదీ తెలుగు భాషకు పట్టిన దుర్గతి.

13.      మీరు చేసిన వాటిల్లో మరచిపోలేని పనులు ఇంకేమైనా వున్నాయా?

          ఆం.ప్ర. జన విజ్ఞాన వేదిక ప్రచురణ ఉపాధ్యాయ వృత్తి అనుభవాలూ జ్ఞాపకాలూ!పుస్తకానికి ప్రధాన సంపాదకుణ్ణి. ఇది నాకు గర్వకారణమైన పని. అలాగే ఈ వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఆల్బర్ట్ ఐన్‍స్టీన్‍ కాంస్య విగ్రహాన్ని తిరుపతిలో ఎస్‍.వి. ఆర్టస్ కళాశాల ముంగిట నెలకొల్పడం. స్కూల్స్ కాలేజీల్లో మీటింగులు పెట్టి ఐన్‍స్టీన్‍ గొప్పదనం గురించి ఉపన్యాసాలు చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ.10/-లు చొప్పున 30 వేల మంది విద్యార్థుల వద్ద విగ్రహం కోసం విరాళం వసూలు చేయడం అద్భుతమైన విషయం.  ఈ విగ్రహం కోసం రెండేళ్ళపాటు ఛాయామోహన్‍, మన్నెం వెంకటరామిరెడ్డి, వేణుగోపాలరావు గార్లతో కలసి పనిచేయడం మరచిపోలేని జ్ఞాపకం. అలాగే ప్రత్యేకంగా డిగ్రీ, పి.జి. విద్యార్థుల కోసం మూడులక్షలతో మూడు వేల కాపీలు వేసిన ప్రపంచకథా సాహిత్యం పుస్తకానికి వెల : కట్టలేనిది అని ప్రకటించడం ఇప్పటికీ నాకైతే పొగురుగానే జ్ఞాపకాల్లో మిగిలిపోయింది.

14.      ఇలా పుస్తకాల్ని నెత్తిన బెట్టుకుని చేతి చమురు వదిలించు కుంటూ శ్రమపడుతుంటే మీ కుటుంబ సభ్యుల సహకారం...

          నాకు ఇద్దరమ్మాయిలు. ఇంజనీరింగ్‍ చదివించాను, పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళు నా నుంచి పెద్దగా ఆశించేదేమీ వుండదు. నా తిరుగుళ్ళు నా భార్యకే పెద్ద అభ్యంతరం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను. తెలుగు కథకి జేజే 3 వేలు, పిల్లల పుస్తకం 20 వేలు, మా అన్న పేరిట వేసిన వ్యాసాల సంకలనం 2 వేలు, ప్రపంచకథా సాహిత్యం 3 వేలు... ఇవన్నీ ఇంట్లోనే. ఇంట్లోనించే విద్యార్థి లోకానికి పంచేవాళ్ళము. ప్రచురణ ఖర్చు 10 లక్షలు చలవ అయివుంటే జిల్లా అంతటా, అప్పుడప్పుడు బయట జిల్లాలకూ ఈ పుస్తకాలను వాహనంలో తీసుకువెళ్ళడం అనేది పెద్ద ఖర్చు. మంచినీళ్ళలా పెట్టే ఈ ఖర్చులకు భయపడే నా భార్య శిశికళ ప్రతినిత్యం నాతో వాదులాట పెట్టుకునేది. మనకీ పనులు అక్కర్లేదు, సమాజం మారదు గాక మారదు, కుటుంబంతో హాయిగా గడపాలనేది ఆమె సిద్ధాంతం. ప్రజల సుఖం కోసం  ఆస్తులు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళున్నారు, వాళ్ళ త్యాగాల ముందర మనం సిగ్గుపడాలనేది ఆమెకు నా జవాబు. నేను చేసేవి చెడుపనులు కావని తెలిసీ కూతుర్లు అమ్మపక్షాన్నే నిలుస్తారు. అయినా నాకు తృప్తిగా వుంది. 70 వేల జీతంతో రిటైరై, వేల రూపాయల నెల పింఛను పొందే నాకు... పిల్లలకూ పుస్తకాలకూ చేసిన ఈ ఖర్చు చాలా మంచి ఖర్చు అని భావిస్తాను.

15      మీ భాషా స్ఫూర్తిని ఇతరులు అందుకోలేక పోయారని నిరాశా నిస్పృహలకు గురయ్యారా?

          కన్యాశుల్కం నాటకంలో మధురవాణి - ఈ ఊళ్ళో నారదుడు వచ్చి పాడితే నాలుగు దమ్మిడీ లివ్వరుఅని అంటుంది. వందేళ్ళ క్రితమే సమాజంలో ఆ పరిస్థితి వుందంటే ఇప్పటి కాలం గురించి చెప్పేదేముంది? ఈ కొద్ది పనులైనా నా తృప్తి కోసం నేను చేసినవే.

16      మీ భవిష్యత్తు కార్యక్రమాలేమిటి ?

          ఇప్పటి వరకూ చేసినవి అన్నీ కూడా చిన్న చిన్న పనులే. ఇక 70 ఏళ్ళ వయస్సులో ఇంతకంటే గొప్ప పనులు చేస్తామనే ఆశ ఏ కోశానా లేదు.


ఈ సంచికలో...                     

Oct 2020