ఇంటర్వ్యూలు

(October,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సాహిత్య విమర్శది మొదట్నించీ బలహీన స్వరమే - డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

 

1          మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి?

మాది నల్లగొండ జిల్లా కనగల్‍ మండలంలోని పగిడిమర్రి గ్రామం. అమ్మానాయినలు కోటమ్మ, మారయ్య (నాగరీకరణ లో మాధవరెడ్డి అయ్యిండు). దీపావళి ఎల్లిన తెల్లారి పుట్టిన్నని అమ్మ చెప్పేది. సంవత్సరం ఆమెకు తెల్వదు కనుక చెప్పలేదు. 12-03-1954 అని స్కూల్‍ సర్టిఫికెట్‍ చెప్తుంది. మా నాయిన మధ్య తరగతి రైతు. నలుగురు చెల్లెండ్లు. నా సదువు తెలంగాణ వర్షాధార వ్యవసాయం. అందు వల్లనేమో మేము దారిద్య్రమనుభవించలేదు గాని భోగాల్లో కూడ పెరగలేదు. స్కూలు లేని, కాలేజిలేని కాలమంతా వ్యవసాయపనులు చేసేది. ప్రతి ఎండకాలం గొర్లు కాసేది. మిగతా సెలవుల్లో పసుల గాసేది. వరాలు దీయడం, నాగలి దున్నడం వరి కోయడం మొదలగు అన్ని పనులు చేసేది (ఈ పనులన్ని లెక్చరర్‍ అయినంక గూడ చేసేది). పగిడిమర్రి నుంచి నల్లగొండకు 12 కి.మీ వారంవారం నడిచి వెళ్ళొచ్చేది. డిగ్రీలో రూం కిరాయి, కిరాణం మొదలగు అన్నీ కలిపి నెలకు 20 రూపాయలతో కష్టకష్టంగా ఎల్లదీసేది. పి.జి, యం.ఫిల్‍ కాలంలో మెస్‍ లేనప్పుడు ఎన్నో సార్లు   ఉపాసముండేది. ఇదంతా ఎందుకు చెప్తున్ననంటె జీవితంలో కాయకష్టం తెలుసునని, తర్వాతి కాలంలో ఇది కష్టజీవుల పట్ల సానుభూతి కలగడానికి ఒక కారణమై ఉండొచ్చునని చెప్పటానికే.

            మా నాయిన ఊర్లో మంచిపేరుగల పెద్దమనిషి. మా యింటిముంగట  ఎప్పుడూ పంచాయితీలు జరుగుతుండేవి. మా నాయిన చెప్పేదానిని అందరూ అంగీకరించే వాళ్ళు. ఎందుకంటే ఆయన న్యాయంగా తీర్పుచెప్పేవాడు (అందుకే ఆయన ఏకగ్రీవంగా సర్పంచ్‍ అయ్యిండు). బహుశా ఇది తర్వాతి కాలంలో నేను న్యాయంవైపు నిలబడడానికి ఒక కారణమై ఉండొచ్చు.

            సక్రమ మార్గంలో డిగ్రీ కాలేజీ లెక్చరర్‍గా ఎన్నికైన. లెక్చరర్‍గా ప్రిన్సిపాల్‍గా ఏమేంజేసిన అనేది నేను చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్టుంటది. మొత్తానికి యాంటీ ఎస్టాబ్లిష్‍మెంట్‍గా ఉన్నననే అనుకుంట.

            మా అమ్మ బతుకమ్మలప్పుడు, నాట్లేసేటప్పుడు, పచ్చగలుపు తీసేటప్పుడు, వరిగోసేటప్పుడు, వడ్లు దంచేటప్పుడు పదాలు పాడేది. కథలు చెప్పేది. భాగోతాలకు, శారదగాండ్ల  కథలకు నన్ను తీసుకపోయేది. ఈ బాహిర ఆంతర డియన్‍ఏ నన్ను కవిత్వం వేపు మళ్ళించిందేమో.

 

 1. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు    నడిపించాయి?

 

 తొలిదశలో పుస్తక పఠనం వైపు రావడానికి మీ ప్రశ్నలో పేర్కొన్న ఏ పరిస్థితులూ కారణం కావు. కేవలం వ్యక్తిగతం (వ్యక్తిగతం వెనుక అప్పటికి నాకర్థంకాని కారణాలున్నయేమో తెల్వవు). మూడు నాలుగేండ్లకు గాని నాకు నడక రాలేదట. నకిరెంబట్టి నల్లగా ఉండే వాడినట. ఎవ్వరూ నన్ను దగ్గరికి దీసేవారు కారట. కర్రోడా, బక్కోడా, నట్టలోడా అని ఎక్కిరించేవారట. ఇది నాకు తెలివొచ్చింతర్వాత (స్పృహ ) కూడా జరిగింది. ఈ పరిస్థితి నన్ను ఆత్మన్యూనతా భావానికి లోనుజేసి అంతర్ముఖుణ్ణి చేసి ఉంటుంది. బహుశా ఆ కారణంగానేనేమో ఎక్కువ మాట్లాడకపోయేవాణ్ణట. భగభగ మాట్లాడే వాణ్ణే తెలివగల్లోడని అంటరు గద. అందుకే అందరూ తెలివితక్కువోణ్ణి నాలుముచ్చోణ్ణి అని కూడ అనేవారట. అట ఏంది ఇప్పటికీ ఇది కొంత నిజమే. ఏడులో ఒకసారి, పదిలో ఒకసారి ఫెయిల్‍ కావడంతో ఈ లక్షణాలు ఇంకా ఎక్కువయి ఉంటయి. బహుశా దీన్ని జయించటానికి నేను పుస్తక పఠనంలోకి వచ్చి ఉంటాను. నాకు యాదికున్నంత వరకు ఇది ఎనిమిదో తరగతి నుంచి మొదలయి ఉంటుంది. పసుల గాయపోయినా, గొర్ల గాయపోయినా, శేను కావలి పోయినా ఎప్పుడూ చేతిలో పుస్తకం ఉండే. మిగతా సబ్జెక్టుల్లో ఫెయిలయినా తెలుగులో మాత్రం ఫస్టుండే వాడిని. అందుకే మా తెలుగు సార్లు నన్ను క్లాస్‍ లీడర్‍ను చేసిండ్రని అప్పటి క్లాస్‍మేట్స్ తర్వాత చెప్పగా గుర్తుకొచ్చింది. ఇది ఇంటర్‍లో, బి.ఏ.లో తెలుగును ఆప్షనల్‍ సబ్జెక్టు తీసుకోవటానికి ప్రేరకం అయి ఉంటుంది. ఇది కూడా నన్ను తెలుగు సాహిత్యం వైపు నడిపించి ఉంటుంది. డిగ్రీ అయ్యిందాకా చదివింది చందమామ లాంటి బాలసాహిత్యం, డిటెక్టవ్‍ నవలల లాంటి కాలక్షేప సాహిత్యం, ఠాగూర్‍లాంటి సీరియెస్‍ సాహిత్యం (ఈ విభజన అప్పుడు తెలియదు) ఉండేది. సిలబస్‍లో ఉండేవి సరేసరి.

            పూర్తిగా సీరియస్‍ సాహిత్యం చదివింది ఉస్మానియాలో ఎం.ఏకు వచ్చిన తర్వాతనే. ఇక్కడ మీ ప్రశ్నలో పేర్కొన్న పరిస్థితులు ప్రస్తావనకొస్తవి. ఉస్మానియా అంతా అప్పుడు విప్లవ భావజాల సంరంభంలో ఉండేది. పిడియస్‍యూ, ఆర్‍యస్‍యూ, డియస్‍ఓ, యస్‍ఫ్‍ఐ, ఎఐయస్‍ఫ్‍ లాంటి విద్యార్థి సంఘాలు అనేక ఉపన్యాస కార్యర్రకమాలు నిర్వహించేవి ( ఈ వివరాలు అప్పటి భావోద్వేగం వేరే ఇంటర్వూలలో, వ్యాసాలలో రాసిన కాబట్టి మళ్ళీ ఎందుకని వదిలేస్తున్న) పైన వివరించినట్టు గ్రామాల్లో చూసిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడి విప్లవ రాజకీయాల ప్రభావంతో సీరియస్‍ సాహిత్యంవైపు పయనించిన.

 

 1.   మిమ్ములను ప్రభావితం చేసిన సాహత్య సంస్థలు, పత్రికలు పుస్తకాల గురించి తెలపండి?

 నన్ను మొదట ప్రభావితం చేసింది విప్లవ విద్యార్థి సంస్థలు. తద్వారా సాహిత్యం, తద్వారా విరసం. విరసం మాచెర్ల , తిరుపతి సభల్లో ఉత్సాహంగా పాల్గొన్నం. హైదరాబాద్‍లో దశాబ్ది ఉత్సవాల్లో అంతే ఉత్సాహంతో పాల్గొన్నం. ఈ సభల ద్వారా అనేక మంది విప్లవ రచయితలు, కవులు పరిచయమయిన్రు. విరసంలో సభ్యులం కాకపోయినా సభ్యులంత నిబద్ధతతో అనేక విరసం కార్యక్రమాలకు అటెండయ్యేవాళ్ళం. వక్తలుగా, కవులుగా కూడా పాలుపంచుకునేవాళ్ళం. ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ స్థాపన నిర్వహణల్లో విరసం ప్రభావం నేపథ్యంగా పనిచేసింది. విరసం కార్యదర్శి కె.వి.రమణరెడ్డి ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ కన్వీనర్‍నయిన నాకు ఉత్తరాలు రాయడం, విరసం సభ్యుడైన ఆర్‍.కె. మాతో నిత్య సంబంధంలో ఉండడంవిరసం సభ్యుడైన చెరబండరాజుకు రైటర్స్ సర్కిల్‍ నుంచి వెలువడిన ‘‘ఈ తరం యుద్ధ కవిత’’ ను అంకితమివ్వడం, వరవరరావు, కె.వి. రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావులను వక్తలుగా పిలువడం మొదలయినవి విరసంతో మా అనుబంధానికి గుర్తులు.

            అరుణతార, సృజన, ప్రజాసాహితి పత్రికలను క్రమం తప్పకుండా చదివేవాళ్ళం. వాటిలో వచ్చే రచనలు మా ఆలోచనలకు పదును పెట్టేవి. నా తొలిదశ కవితలను అరుణతార, ప్రజాసాహితి అచ్చువేసి ప్రోత్సహించినవి.

            నండూరి ప్రసాద్‍రావు గారి డార్విన్‍ పరిణామవాదంచదివి నేను హేతువాదినయిన. బహుశా ఆయనదే ‘‘గతితార్కిక భౌతికవాదం’’ నన్ను మార్క్సిజం వైపు మళ్ళించింది. డిగ్రీలో ఉండగా చదివిన ‘‘పారిశ్రామిక విప్లవం’’(రచయిత పేరు యాదికి లేదు), సురవరం ‘‘ఆంధ్రుల సాంఘికచరిత్ర’’లతో ఈ పుస్తకాలు అనుసంధానం చేసినవి. ఇంకా ఆ క్రమంలో అనేక పుస్తకాలు చదివిన.

 

 1.   మీ రచనల గురించి చెప్పండి?

 

నా తొలి స్వీయ కవితా సంకలనం ‘‘తోవ ఎక్కడ’’(1994). కాని నేను వెలువరించిన తొలిపుస్తకం ‘‘1971 - 80 ఈ తరం యుద్దకవిత’’ (1982) మలిపుస్తకాలు గుడిహాళం రఘునాథం, గుంటూరు ఏసుపాదం, మర్రి విజయరావులతో కలిసి రాసిన సంయుక్త కవిత్వం ‘‘విపశ్యన’’ బులెటిన్లు (1986 - 91). ‘దాలి’,‘తావు’, ‘ముంగిలి’,‘మత్తడి’ ‘‘తెలంగాణ చరిత్ర’’ ‘‘గనుమ’’ల గురించి తరువాతి జవాబుల్లో ఉంటుంది. (ఇవికాక చాలా పుస్తకాలు ఉన్నవి. ఆసక్తి ఉంటే వాటి గురించి అనుబంధంలో చూడొచ్చు). మిగతా కొన్ని పుస్తకాల గురించి ఇక్కడ కొద్దిగా చెప్త. ‘‘అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి జీవిత చిత్రణ’’, ‘‘తెలుగు కవిత్వం - తాత్విక నేపథ్యం’’ ఇవి ఎం.ఫిల్‍, పిహెచ్‍.డి సిద్ధాంత గ్రంధాలు. ఇవి మార్క్సిస్ట్ దృక్పథంతో రాసినవి. ‘‘బహువచనం’’ నేను సంపాదకత్వం వహించిన సంకలనం. ఇది తెలంగాణ తొలి దళిత బహుజన వాద కవితా సంకలనం. చాలా పాపులర్‍ దీర్ఘకవిత. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో అనేక మందికి ప్రేరణనిచ్చిన కవిత ‘‘నల్లవలస’’. ఇది గుడిహాళం రఘునాథం, కె.శివకుమార్‍, కె.శ్రీనివాస్‍, నేను కలిసి రాసిన సంయుక్త కవిత.

 

 1.   మీ మొదటి రచన ఏది? అది కథనా? కవితనా? అది ఏ సందర్భంలో నుండి వచ్చింది?

           గోడ పత్రిక కూడ అచ్చు కిందికే వస్తే, నేను నర్సింహాచారి కలిసి రాసిన ‘‘అతి రహస్యం’’ అనే చందమామ తరహా కథ. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‍ గోడపత్రికలో వచ్చింది. పరిగణనకు తీసుకోదగిన రచన కాదు. ఇంటర్‍, డిగ్రీల్లో రాసినవి పోయినవి. ఎం.ఏలో ఉండగా నా తొలికవిత ‘‘ధ్వని’’ జయశ్రీ అనే పత్రిక నవంబర్‍, 1977 సంచికలో వచ్చింది. (తర్వాత వెంటవెంటనే ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, అరుణతార, అభ్యుదయ, భారతి మొదలగు పత్రికలలో వచ్చినవి). ఇది విప్లవ దృక్పథంతో రాసిన కవిత. సందర్భంలో నుండి అయితే ఎమర్జెన్సీ తర్వాత జరిగిన మొదటి ఎన్‍కౌంటర్‍ (నల్లగొండ జిల్లా మంచినీళ్ళ బావి గూడెంలో జరిగినప్పుడు,1980)  ‘‘అక్షరకటకం’’ రాసిన.

 

 1.  ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ స్థాపనలో మీ పాత్ర ఏమిటి? ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ మీ మీద ఎలాంటి ప్రభావాన్ని  చూపింది?

          దీని గురించి చాలా సందర్భాల్లో రాసిఉన్న. కాబట్టి సంక్షిప్తంగా చెప్త. నందిని సిధారెడ్డి, నేను, సలంద్ర, నాళేశ్వరం శంకరం, జింబో(మంగారి రాజేందర్‍), కె.ముత్యం ఇంకా కొందరం స్థాపక సభ్యులం. అయితే ఆవిర్భావ సభ జరుగకముందే కొన్ని అపోహలవల్ల సిధారెడ్డి పక్కకు జరిగిండు. నా మీద బాధ్యత పడింది. అప్పటికే విప్లవ నిబద్ధత ఏర్పడింది కాబట్టి కాడెత్తెయకుండా స్థాపనకాణ్నుంచి చివరి దాకా అంటే గుంటూరు ఏసుపాదం, కె.ఎన్‍. చారి కన్వీనర్లుగా ఉన్నప్పుడు గూడ అంటే 1983 దాకా ప్రధాన పాత్ర వహించిన.

            రైటర్స్ సర్కిల్‍తో ఉస్మానియాలో ఒక విప్లవ సాహిత్య సంరంభం ఏర్పడింది. అనేక కార్యక్రమాలు నిర్వహించినం. భావజాల పరంగా, సంస్థల నిర్వహణ పరంగా రైటర్స్ సర్కిల్‍ నిర్వహణ ద్వారా ఎంతో నేర్చుకున్న. ఈ అనుభవం అనంతరకాలంలో శ్రీకాకుళ సాహితి, నీలగిరి సాహితి, తెలంగాణ సాంస్కతిక వేదిక, సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) లాంటి సంస్థల స్థాపనకు ఎంతో ఉపయోగపడింది. ప్రగతిశీల భావజాలాన్ని అనంతర తరాల వారికి అందించడానికి దోహదం చేసింది.

 1.   ‘‘ఈ తరం యుద్ధకవిత’’ గురించి చెప్పండి?

          1971 - 80 దశాబ్ది సంకలనమిది. దశాబ్ది సంకలనాలలో ఇది మొదటిది. ఆ రకంగా ఇది దశాబ్ది సంకలనాలకు దారి వేసింది. విరసం దందహ్యమాన దశాబ్దికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఆ దశాబ్దిలో వచ్చిన ఇతర ప్రగతిశీల కవిత్వానికి కూడ స్థానం కల్పించింది. ఆ రకంగా ఇది 1971 - 80 దశాబ్దికి సంపూర్ణ ప్రతిబింబం. ఆ దారిలోనే పాపినేని ‘‘కవితా ఓ కవితా’’, 1981 - 90 పెన్నా శివరామకృష్ణ, ఎస్వీల ‘‘1991 - 2000 కవితా సంకలనం, అఫ్సర్‍ ‘‘కవిత 2001 - 2009’’ లు వచ్చినవి. అందువల్ల ‘‘ ఈ తరం యుద్ధకవిత’’ ఒక ట్రెండ్‍ సెట్టర్‍.

 1.   జముకు గురించి చెప్పడి?

 కాలేజి సర్వీస్‍ కమీషన్‍ వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు లెక్చరర్‍గా సెలెక్ట్ చేసి నన్ను శ్రీకాకుళం జిల్లాకు కెటాయించారు. శ్రీకాకుళ సాయుధ పోరాటాన్ని సుబ్బారావు పాణిగ్రాహిని, వెంపటాపు సత్యాన్ని మననం చేసుకుంటూ గొప్ప ఉద్వేగంతో అక్కడ అడుగుపెట్టిన. కాని ఆ వేడి వాడి ఏమీ కన్పించలేదు. ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ నడిపిన అనుభవంతో అదే లక్ష్యంతో రామారావు నాయుడు లాంటి ప్రగతిశీల వ్యక్తులతో అప్పల్నాయుడు, జోగారావు, బి ఎన్‍ స్వామి, బి పి శాస్త్రి లాంటి విరసం మిత్రులతో ఛాయారాజ్‍లాంటి జనసాహితీ మిత్రులతో కలిసి విశాల ప్రాతిపదికన ‘‘శ్రీకాకుళ సాహితి’’ని స్థాపించినం. ఆ ‘‘శ్రీకాకుళ సాహితి’’ నుంచి వెలువడిన సాహిత్య పత్రికే ‘‘జముకు’’.అది బులెటిన్ల కాలం కాబట్టి దాన్ని బులెటిన్‍ (సాంకేతిక కారణాల వల్ల కూడ) అన్నాం. దానికి ముందూ వెనకాల మంజీర, దిక్సూచి, చినుకు, ఉజ్వల, కంజర లాంటి అనేక బులెటిన్లు అప్పుడు వచ్చినవి. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు ప్రసాద్‍ లాంటి వాగ్గేయకారులు విప్లవ చైతన్యోద్దీపనకు సాధనంగా వాడిన వాయిద్య విశేషం ‘‘జముకు’’. స్థానిక ప్రగతిశీల భావనకు ప్రతీకగా ఆ పేరును ఎన్నుకున్నం. దీనికి నేను వర్కింగ్‍ ఎడిటర్‍ను. శ్రీకాకుళ సాహితి, జముకు అక్కడ ఒక కొత్త తరాన్ని నిర్మించినవి.

 1.   ‘‘మత్తడి’’ తెలంగాణ ఉద్యమానికి అందించిన స్ఫూర్తి ఏమిటి?

          తెలంగాణలో కవులు లేరన్న వారికి ఇక్కడి సాహిత్యాన్ని చిన్న చూపు చూసినవారికి గోలకొండ కవుల సంచిక మొదటి జవాబు కాగా, రెండవ జవాబు ‘‘మత్తడి’’. రెండంచుల కత్తి ఇది. సుమారు వంద సంవత్సరాల ఆధునిక తెలంగాణ కవిత్వ వైవిధ్యాన్ని విశిష్టతను ప్రతిబింబించి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం ఒక అంచు. వర్తమాన తెలంగాణ ఉద్వేగాన్ని, రాష్ట్ర ఆకాంక్షను గట్టిగా వినిపించడం రెండో అంచు. ఈ రెండు అంచులతో మత్తడి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినందించింది.

 1.  ‘‘ముంగిలి’’ రూపొందడంలో మీ అనుభవాలు చెప్పండి?

          మత్తడి ముందుమాటలో తెలంగాణ ప్రాచీన కవిత్వ సంకలనం తెస్తామని చెప్పినం. ముంగిలిని వెలువరించటానికి అదొక కారణం. ఉద్యమ క్రమంలో అనేక చోట్ల ఇచ్చిన ఉపన్యాసాల్లో ఒక ప్రాంత చరిత్రనే మొత్తం ఆంధ్రుల చరిత్రగా   ఆ ప్రాంత సాహిత్యచరిత్రనే మొత్తం తెలుగు సాహిత్య చరిత్రగా  చలామణి చేస్తున్నరని చెప్పినప్పుడు తెలంగాణ చరిత్ర, సాహిత్య చరిత్ర ఎందుకు లేవనే ప్రశ్నలు వచ్చినవి. అవి రావాలనే ఆకాంక్ష వ్యక్తమయింది. ముంగిలి గాని, తెలంగాణ చరిత్రగాని రావటానికి ఇది రెండవ కారణం. ముంగిలి ప్రస్తావన కాబట్టి దాని గురించి చెప్త. కాసుల ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో తెలంగాణ సాంస్కృతిక వేదికనుండి 2001లో వెలువడిన ‘‘తెలంగాణ తోవలు’’లో ‘‘లెక్కదప్పిన తెలుగు సాహిత్య చరిత్ర’’ అనే వ్యాసం రాసిన. ఆ వ్యాసంలో ముంగిలికి పునాది పడింది.పైన చెప్పినట్టు తొలుత ప్రాచీన కవిత్వ సంకలనం అనుకున్నం కాబట్టి కొందరికి కొందరు కవుల్ని కెటాయిస్తూ ఆ కవుల పద్యాలు ఎన్నిక చేసి పంపండి అని  ఉత్తరాలు రాసిన.శివరామ శర్మ, నేను కొందరు కవుల పద్యాలను ఎన్నిక కూడ చేసినం. కాని ఆ క్రమంలో అర్థం అయింది, కేవలం పద్యాలు వేయడం అసమగ్రమని. సాహిత్య చరిత్రలాగే కూర్చాలని నిర్ణయానికొచ్చిన. అప్పుడు అనేక సాహిత్య చరిత్రల్ని, పక్రియల చరిత్రల్ని, చరిత్ర గ్రంథాల్ని అధ్యయనం చేసిన. వీటికోసం మద్రాసు ఓరియంటల్‍ మ్యానుస్క్రిప్ట్లైబ్రరీ, తెలుగు విశ్వవిద్యాలయం గ్రంథాలయం, సుందరయ్య విజ్ఞానభవన్‍(ఆరుద్ర), స్టేట్‍ సెంట్రల్‍ లైబ్రరీ, సిటీ సెంట్రల్‍లైబ్రరీ, ఉస్మానియా లైబ్రరీ, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం మొదలగు వాటిని సందర్శించిన. అనేక స్క్రిప్టుల తర్వాత రూపొందిన గ్రంథాన్ని ఎట్లా అచ్చువేయాలనే సమస్య వచ్చింది. నాకా ఆర్థిక స్థోమతలేదు. ప్రముఖ దర్శకులు కవి, రచయిత బి.నర్సింగ్‍ రావుగారికి చూయించిన. ఆయన అండదండలతో వేదకుమార్‍ గారి పూనికతో అది అచ్చయింది. తర్వాత తెలుగు అకాడమీ ఎనిమిదివేల ప్రతుల్ని అచ్చేసింది. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ పాఠ్యపుస్తకంగా రిఫరెన్స్ గ్రంథంగా ప్రకటించినవి. కె.శ్రీనివాస్‍, అమ్మంగి వేణుగోపాల్‍, రామా చంద్రమౌళి, బాల శ్రీనివాసమూర్తి, లక్ష్మణచక్రవర్తి లాంటి ప్రముఖులు మంచి సమీక్షలు రాసిన్రు. తెలంగాణ ప్రాచీన సాహిత్య విజ్ఞాన సర్వస్వం అన్నారు. దాదాపు అన్ని పత్రికలు మంచి కవరేజీనిచ్చినవి. వందలమంది ఫోన్లు చేసిండ్రు.ఉత్తరాలు రాసిండ్రు. కొందరు అపర హాలుడు అనిఅపర సురవరం అని పొగిడిండ్రు. తెలుగు విశ్వవిద్యాలయంవారు ఉత్తమ గ్రంథంగా  ఎన్నిక చేయడం మరొక మంచి అనుభూతి. ముంగిలిని చదివి కెసిఆర్‍ ఫోన్‍చేసి ప్రశంసించడం మరిచిపోలేని అనుభూతి. వారందరికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎక్కడ మొదలై ఈదుకుంటూ ఎక్కడ తేలిన్నో చూస్తే అద్భుతాశ్చర్యాలు ముంచెత్తుతాయి. ఒక బాధ ఏమిటంటే, ఒక రిటైర్డు ప్రొఫెసర్‍ ముంగిలిని కాపీ చేయడం, దాన్ని యూనివర్సిటీవారు ముంగిలికంటె ముందు వరసలో పెట్టడం. ఇలాంటి కాపీరాయుళ్లకు శిక్ష లేదా? కోర్టులో వేస్తానంటే ఇంకొక ప్రొఫెసర్‍ ఆపిండు. ఇంకొక బాధ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కోసం ముంగిలిఫైనల్‍కు రాగా కొందరు అడ్డుకోవడం.

 1.   గనుమ ఏ పరిస్థితుల్లో రూపొందింది?

           దళిత, బహుజన, ముస్లిం తెలంగాణ అస్తిత్వవాదాల నేపథ్యంలో వెలువడిన విమర్శనా గ్రంధం ఇది. ఆయా వాదాలు సృష్టించిన పుస్తకం ఇది. అంతేకాదు ఆయావాదాల్ని స్థిరపరచడానికుద్దేశించిన గ్రంధం కూడ ఇది. ఇందులోని మొదటి వ్యాసం 1992లో రాసిన. ఈ వ్యాసం తెలుగు సాహిత్యంలో రాబోతున్న, రావలసిన మార్పుల గురించి చర్చించింది. తెలంగాణ తొలిదళిత బహుజన కవితా సంకలనం ‘‘బహువచనం’’ గురించి రాసిన వ్యాసం, తొలి ముస్లింవాద సంకలనం ‘‘జల్‍జలా’’ గురించి రాసిన వ్యాసం, ఇవి రెండూ పెద్ద సంచలనాలని విమర్శకులు భావించినారు. ఈ పుస్తకంలోని రెండవ భాగం తెలంగాణ వాద వ్యాసాలు సంపుటి. ఇందులోని మొదటి వ్యాసం ‘‘ఎన్నాళ్ళీ వివక్ష’’ తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యంపట్ల గల వివక్ష విస్మరణ గురించి చర్చించిన వ్యాసం. ఇందులో పేర్కొన్న తెలంగాణ విస్మృత  కవులను గురించి రాసినవి మిగతా వ్యాసాలు. కరుణశ్రీ కంటే చాలా ఏండ్ల ముందటనే సుమవిలాపం రాసిన కోదాటి రామకృష్ణరావు ఎందుకు విస్మరణకు గురైండుతొలిసారిగా మాదిగలకు ప్రతీకగా ‘‘తొండం’’ కావ్యాన్ని రాసిన దైద వేములపల్లి దేవేందర్‍ ఎందుకు పేరుకు రాలేదు? దువ్వూరి లాగా రైతు జీవితాన్ని చిత్రించిన ‘‘కాపుబిడ్డ’’ కావ్యకర్త గంగుల శాయిరెడ్డిని కాల గర్భంలో ఎవరు కలిపేసిన్రు? తెలంగాణ రైతాంగ సాయుధపోరాట ఇతివృత్తంతో రాసిన సోమసుందర్‍, గంగినేని, ఆరుద్ర వంటి తెలంగాణేతరుల కొచ్చిన పేరు రాజారాం లాంటి ప్రజా కవులకు ఎందుకు రాలేదు? తొలి వచన కవితా కావ్యమైన ‘‘మహైక’’(1953) మరుగునపడి 1956లో వచ్చిన కుందుర్తి ‘‘తెలంగాణ’’ను తొలి వచనకవితా కావ్యంగా ప్రాచుర్యంలోకి ఎందుకు తెచ్చిండ్రు? ‘‘వైతాళికులు’’ (1935) కంటే ముందుగా వచ్చిన తెలంగాణ ఆధునిక కవితా సంకలనమైన ‘‘గోలకొండ కవుల సంచిక’’(1934)ను ఏ సాహిత్య చరిత్రలోను ఎందుకు స్పృశించలేదు? ఇలాంటి ప్రశ్నలతో తెలంగాణ సాహిత్యానికి జరిగిన అన్యాయంలోంచి, ఆవేదనలోంచి ‘‘గునుమ’’ పురుడు పోసుకుంది.

 1.   దాలి, తావుల గురించిచెప్పండి?

 దాలితెలంగాణ దీర్ఘకవిత. తెలంగాణ సాంస్కృతిక  వేదికనుండి వెలువడిన (2001) మొదటి పుస్తకం. ఆనాటి తెలంగాణ ఆగ్రహాన్నీ ఆవేదననీ సమగ్రంగా పలికిన కావ్యం. తెలంగాణ తొలి రెండు మూడు దీర్ఘకవితలలో ఒకటిగా ప్రసిద్ది  చెందింది. కె. శ్రీనివాస్‍, గుడిపాటి, కాసుప్రతాపరెడ్డి, హెచ్చార్కే, జింబో,ఎస్‍.రామకృష్ణ, జి.వెంకటకృష్ణ,సూరేపల్లి మనోహర్‍,వఝల శివకుమార్‍,బైరెడ్డి కృష్ణారెడ్డి, పగడాల నాగేందర్‍,కాలువ  మల్లయ్య లాంటి ఎందరో  విమర్శకుల, అనేక మంది పాఠకుల మన్ననలను పొందిన కావ్యం. ఇంకా నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం లాంటి అనేక మంది మిత్రులు వ్యాసాల్లో ఉపన్యాసాల్లో మెచ్చుకున్నరు.

      ‘తావుసంకలనంలోని వాగు,రోడ్డు,అవిద్య,పావురం లాంటి చాలా కవితలు చాలా మంది మన్ననలు పొందినవి.కె.శ్రీనివాస్‍,బైరెడ్డి కృష్ణారెడ్డి మంచి ముందుమాటలు రాసిండ్రు.పెన్నా శివరామకృష్ణ పావురం’, ‘హనన ద్రవం’,  కవితల నిర్మాణ శిల్పాన్ని విశ్లేషిస్తూ చక్కగా రాసిండు.ఎం.నారాయణశర్మ,శివరాత్రి సుధాకర్‍, తండా హరీష్‍ లాంటి వాళ్లు మంచి సమీక్షలు చేసిండ్రు.ఈ సంకలనానికి రంగినేని ఎల్లమ్మ పురస్కారం (సిరిసిల్ల) లభించింది.

         దాలి,తావు ల గురించి సీనియర్‍ కవి మాదిరాజు రంగారావుగారు ఒక ఉత్తరంలో విలువైన విశ్లేషణ చేశారు ఇలా ‘‘దాలి,తావు రెండూ అలజడిని ప్రతిఫలిస్తూనే రూపం(కవిత్వం) లక్ష్యం(టార్గెట్‍) రెండూ చక్కని పాళ్లలో సమన్వయం కలిగిన రచనలు.తావులో భావచిత్రాలకెక్కువ ప్రాధాన్యం కనిపించింది. దాలిలో తెలంగాణ భాషాసుందరతకు ఎక్కువ అవకాశం దృష్టికి వస్తుంది.....సహృదయుల్ని కట్టిపడేస్తుంది.......’’

 1.   తెలంగాణ సాహిత్యం ప్రత్యేకత ఏమిటి?

  చాలా లోతైన ప్రశ్న.  తెలంగాణ భాషకు, చరిత్రకు, సంస్కృతి కి ఒక ప్రత్యేకత ఉన్నట్లే సాహిత్యానికిఉన్నది. అందుకు అనేక కారణాలు.  కోస్తాంధ్ర సాహిత్యం ఎక్కువగా బయటి ప్రభావాల (సంస్కృతం,ఇంగ్లీషు)తో వస్తే తెలంగాణ సాహిత్యం ప్రధానంగా ఇక్కడి నేల సెగల్లోంచి వచ్చింది.  2001లో కాసుల ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వచ్చిన ‘‘తెలంగాణ తోవలు’’లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన.  ఇప్పటికీ ఇది సరైనదేనని అనుకుంటున్న.  ఇక్కడి సంస్కృత  రచనల అనువాదాలు భిన్నంగా వచ్చినవి.  పాల్కుర్కి సాహిత్యం భిన్నంగా వచ్చింది.  భావకవితాయుగం ఇక్కడ లేదు.  అభ్యుదయ కవిత్వం భిన్నంగా వచ్చింది.  ఇక్కడ స్త్రీవాదం అక్కడిలాగా ఎలైట్‍ స్త్రీవాదంగా రాలేదు.  ఇలాంటి వెన్నో? ఇక్కడి సాహిత్యాన్ని అక్కడి ప్రమాణాలతో కొలిచిండ్రు.  కొలమానాలే తప్పు.  జీవితం నిజం.  సాహిత్యం నిజం.  తెలంగాణ సాహిత్యానిది భిన్న నేపథ్యంభిన్న ప్రయాణం.  కొలమానాలు మారాలె.

 1.  ఒక తెలుగు లెక్చరరైన మీరు  తెలంగాణ చరిత్రను రాయడానికి కారణాలు ఏమిటివిమర్శకులు మీ తెలంగాణ చరిత్ర మీద ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చారు?

పదవ ప్రశ్నకు చెప్పిన జవాబులో పేర్కొన్నట్టు తెలంగాణ ప్రజల డిమాండు మొదటి కారణం.  బి.ఏ.లో ఇంకొక ఆప్షనల్‍ సబ్జెక్టు హిస్టరీ.మార్క్సిస్టు అధ్యయనశీలిగా చరిత్ర అధ్యయనం మామూలు విషయం. అందువల్ల చరిత్ర నాకు కొత్త అంశం కాదు.  ముంగిలి రూపకల్పనలో భాగంగా అనేక చరిత్ర గ్రంథాలు చదివిన.  ఇ.హెచ్‍.కార్‍ ‘‘చరిత్ర అంటే ఏమిటి?’’ లాంటి చరిత్ర రచనాశాస్త్ర గ్రంథాలు చదివిన. భారత జాతీయోద్యమ కాలంలో, ఆంధ్రోద్యమ కాలంలో, తెలంగాణ ఆంధ్ర జనసంఘం కాలంలో, ఆంధ్రమహాసభ కాలంలో ఆనాటి ఉద్యమకారులు ఏం చేసారో అధ్యయనం చేసిన.  బ్రిటీష్‍ చరిత్రకారులు భారతదేశ చరిత్ర రాసి భారతీయులు వెనుకబడినవాళ్ళు, అసమర్థులు అన్నారు.  అందువల్ల ఈ దేశాన్ని మేమే పాలించాలి అని అన్నారు.  సరిగ్గా ఇవే మాటలు కోస్తాంధ్రులు తెలంగాణనుద్దేశించి  అన్నారు.  ఆనాడు భారతీయ మేధావులు భారతదేశ చరిత్రను వెలికి తీసి చరిత్ర గ్రంథాలు రాసి గత ఘన వైభవాన్ని చాటి ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపినారు.  మనం గూడ అదేపని చేసి చూపాలనిపించింది.  అందుకే తెలంగాణ చరిత్రరాసిన.  మరిన్ని వివారాలకు తెలంగాణ చరిత్రకు నేను రాసిన ముందుమాట చూడండి.  ఇది తొలి తెలంగాణ చరిత్రగ్రంథం కావడం వల్ల కెసిఆర్‍, డా.దేమె రాజారెడ్డి వకులాభరణం రామకృష్ణ,అడపా సత్యనారాయణ,ఘంటా చక్రపాణి, టంకశాల అశోక్‍, సంగిశెట్టి శ్రీనివాస్‍, అమ్మంగి వేణుగోపాల్‍,కాసుల ప్రతాపరెడ్డి, కుర్రా జితేంద్రబాబు,ఏనుగు నరసింహారెడ్డి, జగన్‍ రెడ్డి,కాసుల లింగారెడ్డి- ఇట్లా ఎంతో మంది విమర్శకుల మన్ననలందుకుంది.  ఇది వచ్చిన తరువాత అనేక కాపీ చరిత్రలు వచ్చినవి. ఇది దాని ప్రసిద్దికి నిదర్శనం.  ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర, తెలుగు శాఖల్లో దీనిని రిఫరెన్స్ గ్రంథంగా పెట్టడం, బి.యన్‍. శాస్త్రి అవార్డ్ రావడం, లక్షల మంది విద్యార్దులకు ఉపయోగపడడం, నాలుగు సంత్సరాల్లో నాలుగు ముద్రణలు పొంది వేల ప్రతులు అమ్ముడు పోవడం విమర్శకుల, పాఠకుల మన్ననలు పొందిందనడానికి మరికొన్ని నిదర్శనాలు.

15.     తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాహిత్యం మీద జరుగుతున్న అధ్యయనాలు ఎలా ఉన్నాయి?

మలిదశ తెలంగాణ ఉద్యమ క్రమంలోనే ప్రారంభమైన తెలంగాణ సాహిత్య అధ్యయన పక్రియ తెలంగాణ వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్నది.అన్ని విశ్వవిద్యాలయాలల్లో తెలంగాణ సాహిత్యంలోని వివిధ అంశాల మీద, కోణాల మీద పరిశోధనలు చేయిస్తున్నారు. అయితే సంస్థల నుంచి ఆశించినంత స్థాయిలో జరగడంలేదని అనిపిస్తుంది.  కానీ వ్యక్తులుగా సంగిశెట్టి శ్రీనివాస్‍లాంటి వారు నిరంతరం ఏదో ఒకటి తవ్వుతూనే ఉన్నారు. ఏమనుకోమంటే ఇందులో నేను కూడ ఉన్న.

16.      తెలంగాణలో బలమైన సాహిత్యం వెలువడలేదని, అసలు కవులే లేరని ఎందుకు ప్రచారమయింది?

ఒకటి తెలంగాణేతరుల అజ్ఞానం. రెండు చూడదలచుకోకపోవడం.  మూడు వాళ్ళ ప్రమాణాలనుంచి కొలవడం.  నాలుగు పాలకులెప్పుడూ పాలితులను అత్మన్యూనతలో పడేటట్టు చేస్తారు.  ఈ కారణాల వల్ల పై విధంగా ప్రచారమయింది.

17.      తెలంగాణ వచ్చిన తర్వాత వెలువడుతున్న సాహిత్యం ఎలా ఉంది?

 దళిత, స్త్రీ, ముస్లిం వాదాలు అంతకుముందే వస్తురీత్యా ఎగ్జాస్ట్ అయినవి.  తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వస్తువు కూడా అయిపోవడంతో ఒక శూన్య స్థితి ఏర్పడింది. అందువల్ల చాలామంది కవులు మౌనం దాల్చినారు.  కొందరు అభివృద్ది గురించి  రాసినారు.  కొందరు డే టు డే సాధారణ సమస్యల గురించి రాసిన్రు.  మొత్తంగా ఉద్యమ స్ఫూర్తిగల సాహిత్యం వెలువడలేదు.  కాని రంగం ఖాళీగా ఉండదు కదా.

18.       ఇప్పుడు వెలువడుతున్న సాహిత్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు?

అనేక ఉద్యమ ప్రవాహాల్ని చూసినవాణ్ణి.  వాటితో సమాంతరంగా ఉప్పెనలా వెల్లువెత్తిన సాహిత్యాన్ని చూసినవాణ్ణి.  అలా  చూసినప్పుడు ఇప్పటి సాహిత్యం చడీచప్పుడు లేకుండా సాగుతున్నదనిపిస్తుంది.  అయితే జీవితంలోని పలుపార్శ్వాలను పలు పొరలను పట్టుకుంటున్నది.

19.      ఇటీవలి కాలంలో సాహిత్య విమర్శ ఎందుకు బలహీనపడింది?

సాహిత్య విమర్శది మొదట్నించీ బలహీన స్వరమే.  మీరన్నట్టు ఇప్పుడు ఆ బలహీనత ద్విగుణీకృతమైంది.  దీని బీజాలు 1980ల నుంచి ఉన్నయి.  అప్పట్నించి విమర్శకుల సంఖ్య వేళ్లమీద లెక్కబ్టెగలిగినంత మంది కూడా ఉండటం లేదు.  కవుల సంఖ్యేమో వందలకు ఫేస్‍బుక్‍, వాట్సాప్‍ వచ్చినంక వేలకు పెరిగిపోయింది.  మరీ ఇప్పటి కవులకు ఇన్‍స్టంట్‍ కీర్తి ఎక్కువయింది.  ఇది విమర్శ మీద ప్రభావం చూపిస్తుంది.  కాబట్టి అహా, ఓహోలే తప్ప విమర్శ ఉండటం లేదు.  అంటే ఒకవైపు  కవులు విమర్శను సహించడం లేదు.  రెండో వైపు అధ్యయనం ఉండటం లేదు.  ఎంత అధ్యయనం ఉంటే అంత గొప్ప విమర్శ వస్తది.  ఇంకొకవైపు తద్దినాలలాంటి సమీక్షలకు - నిజానికి అవి సమీక్షలు కూడా కాదు - తప్ప పత్రికలు స్థానమివ్వడంలేదు. ఫేసుబుక్కు, వాట్సాప్‍, వెబ్‍ పత్రికలలో స్పేస్‍ సమస్య లేకపోయినా దీర్ఘమయిన విమర్శలను చదవడం లేదు.  చదవడం లేదని రాయడం లేదు. కాబట్టి ఇప్పటి విమర్శ రూపాలు సూపర్‍, ఎక్సలెంట్‍, సుపర్బ్, వెల్‍, నైస్‍లు.  పుస్తకాల నుండి పేజీలకు, పేజీలనుండి పేరాలకు పేరాలనుండి ఇలాంటి పదాలకు విమర్శ ఎదుగుతూ వస్తుంది.  బలహీనపడిందంటారేమిటి?

20.     నందిని సిదారెడ్డి,గుడిహాళం రఘునాథం, నాళేశ్వరం శంకరంలతో మీకున్న అనుబంధం ఏమిటి?

ముగ్గురూ నాకు ఆత్మీయ మిత్రులు.  గొప్ప ప్రతిభావంతులు.  సిధారెడ్డి, గుడిహాళం ఎం.ఏ.లో నాకు ఒక సంవత్సరం సీనియర్లు. సిధారెడ్డి పరిచయంతోటే నాకు ఆధునిక సాహిత్య గవాక్షాలు పూర్తిగా తెరుచుకున్నయి.  ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ సహ వ్యవస్థాపకులం.  మళ్ళీ సుమారు ఇరవై ఏళ్ల తర్వాత తెలంగాణ సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక భాగస్వాములమయినం. మధ్యలో కొన్ని విభేదాలు.  గుడిహాళం నేను ఇతరులతో కలిసి ‘‘విపశ్యన కవిత్వ’’ ‘‘నల్ల వలస’’ (తెలంగాణ తొలి సమగ్ర దీర్ఘకవిత) సంయుక్త కవులం.  సుదీర్ఘ స్నేహం మాది.  నాళేశ్వరం శంకరం నేను ఎం.ఏ. క్లాస్‍మేట్స్మి. మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి.పేరుకు తగ్గట్టే బోళాశంకరుడు. ఆయన కవితా, కందుకూరి శ్రీరాములు కవితా ‘‘ఈతరం యుద్ద కవిత’’లో లేనందుకు ఇప్పటికీ నా మీద గుర్రుగానే ఉన్నరు. కని స్నేహం స్నేహమే.

21.    పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం  చెప్పదలుచుకున్నారు?

ఒకరు చెప్పడం ఇంకొకరు వినడం భూస్వామ్య భావజాలం అవశేషం. దానికి కాలం చెల్లింది.  ఇప్పుడు మనకనిపించింది ప్రకటించడం వరకే.  నచ్చిన వాళ్ళు షేర్‍ చేస్తారు.

       ఏ భూస్వామ్య భావజాలాన్ని మనం దాటుకుని వచ్చామో ఆ భూస్వామ్యభావజాలం కొత్త రూపాలలో, ఆధునిక అత్యాధునిక వేషంతో వస్తున్నది.  మేం చెప్పేవాళ్ళం మీరు వినే వాళ్ళు అంటున్నది.  ఏ అసమ్మతి స్వరాన్ని వినం అంటున్నది.  అథ:పాతాళానికి  తొక్కేస్తానంటున్నది.  వందల ఏళ్ళనుంచి వందల పోరాటాల ద్వారా సాధించుకున్న కనీస ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తానంటున్నది.  తీవ్ర జాతీయవాదం పేరుతో సకలజనుల ఆర్థిక సాంస్కృతిక సామాజిక పునాదులను పెళ్ళగించజూస్తున్నది.  ఇది సకల కళారూపాల్లో విజృంభించే తీరు ఎంతో దూరం లేదు. ఈ పరిశీలన సరైనదనిపిస్తే స్వీకరించొచ్చు.  అదే అత్యాధునిక రూపాల్లో నిరసించొచ్చు.

 

అనుబంధం:

రచయిత పరిచయం-ఇతర పుస్తకాలు

వ్యక్తిగతం     

            పేరు- డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి

            తల్లిదండ్రులు-కోటమ్మ , మాధవరెడ్డి.

            విద్య-ఎం.ఏ, ఎం.ఫిల్‍, పిహెచ్‍.డి.

            జననం-దీపావళి,1954, గ్రామం-పగిడిమర్రి

            మండలం-కనగల్‍,జిల్లా-నల్లగొండ 

వృత్తి                      

            1. 1984 నుండి 2010 వరకు వివిధ ప్రభుత్వ డిగ్రీకళాశాలల్లో తెలుగు బోధన,

            2. 2010 నుండి 2012 వరకుచండూరు ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‍గా,

            3. స్వల్పకాలం తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్‍ ప్రొఫెసర్‍ గా

కవిత్వం

            1. తోవ ఎక్కడ - 1994.

            2. దాలి-తెలంగాణ దీర్ఘకవిత -2001,2016

            3. నల్లవలస - తెలంగాణ దీర్ఘ కవిత (ఇతరులతో కలిసి)1998.

            4. విపశ్యన కవిత్వం(ఇతరులతో కలిసి)-1886-1991

            5. తావు - 2016

పరిశోధన-చరిత్ర

            1.ముంగిలి-తెలంగాణ ప్రాచీనసాహిత్యం-2009, తెలుగుఅకాడమీ వారి పునర్ముద్రణ రెండు సార్లు-2016

            2. తెలంగాణ చరిత్ర (క్రీ.పూ నుండి 1948 వరకు)-2011,2013,2014,2015.

                (హిందీ అనువాదం-డా.కొమ్మిశెట్టి మోహన్‍,ఆం.ప్ర.హిందీ అకాడమి-2015)                    

                (ఇంగ్లీషు అనువాదం త్వరలో వెలువడనున్నది)

            3. తెలంగాణ సాహిత్య చరిత్ర(ప్రాచీన,ఆధునిక సాహిత్య సంక్షిప్త చరిత్ర)తెలుగుఅకాడమి-2012

            4.తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర(ఇతరులతో కలిసి)-తెలుగు అకాడమి-2016

            5. తెలంగాణ సాహిత్య చరిత్ర (ప్రాచీన,ఆధునిక కవిత్వం,కథ,నవల)(సంగిశెట్టి తో కలిసి)-తెలంగాణ సారస్వత పరిషత్తు-2019

            6.అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి జీవిత చిత్రణ(ఎం.ఫిల్‍)-1982  (త్వరలో అచ్చు కానున్నది).

            7.తాత్త్విక నేపథ్యంలో- తెలుగు కవిత్వ పరిణామం(పిహెచ్‍.డి)-1990 (త్వరలో అచ్చు కానున్నది)                  

విమర్శ

            1.గనుమ-దళిత, బహుజన, ముస్లిం, తెలంగాణ అస్తిత్వ సాహిత్య  వ్యాసాలు-2010

            2.వినిర్మాణం (తెలంగాణ అస్తిత్వ నిర్మాణ వ్యాసాలు)

            3.సురవరం ప్రతాపరెడ్డి(మోనోగ్రాఫ్‍)-తెలుగు అకాడమి-2017

            4.గురజాడ..మరికొన్ని వ్యాసాలు(త్వరలో అచ్చు కానున్నది)

సంపాదకత్వం

            1. 1971-80 ఈ తరం యుద్ధకవిత(ఇతరులతో కలిసి)1982,2017

            2. జముకు సాహితీ బులెటిన్‍-1986-1989.

            3. యానగాలి-శ్రీకాకుళ కవిత్వం(ఇతరులతో కలిసి)1991

            4. బహువచనం-దళిత బహుజన కవిత్వం-1996,2017

            5. మత్తడి-తెలంగాణ ఆధునిక కవిత్వం(సురేంద్రరాజు తోకలిసి) 2002.

            6. నల్లగొండ జిల్లా సాహిత్య సంచిక-మన తెలంగాణ (బైరెడ్డి కృష్ణారెడ్డితో కలిసి) 2007

            7.కమ్యూనిజమా?కోస్తా వాదమా?(సి.పి.ఎం.తెలంగాణవైఖరిపైవిమర్శ)(ఇతరులతో కలిసి)2008

            8.1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం (సంగిశెట్టితో కలిసి)-2009

            9. సురవరం తెలంగాణ వ్యాసాలు (సంగిశెట్టితో కలిసి)-2010.

            10.సురవరందస్తూరి(సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు) O.M.L.R.I,A.P.Govt - 2010

            11. భాగ్యనగర వైభవం-దైద వేములపల్లి దేవేందర్‍ -2017

            12. సుజాత -గడియారం రామకృష్ణ శర్మ – 2017

            13. ఆదిరాజు వీరభధ్రరావు -పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు - 2017

            14. స్వాతంత్య్ర సమరంలో ముస్లింయోధులు-హీరాలాల్‍ మోరియా-2017

            15. కాపుబిడ్డ ,మావూరు -గంగుల శాయిరెడ్డి-2017

            16.‘‘తొలిసంజ’’ తెలంగాణ-తొలినాటి ఆధునిక కవిత్వం-మూటువూరు వెంకటేశ్వరరావు-2017

            17. భూగోళ విజ్ఞానం-సురవరం ప్రతాపరెడ్డి-2017

            18. ‘‘ధనాభిరామం’’-తొలి కల్పిత కావ్యం-నూతనకవి సూరన-2017

            19. జాతీయ గేయములు -మంతిప్రగడ వెంకటేశ్వరరావు-2017

            20. ‘‘గుంటక పురాణం’’-ఆధునిక అధిక్షేప పద్యాలు -గవ్వా మురహరిరెడ్డి-2017

            21. చరిత్రక్కని చరితార్ధులు-బిరుదురాజు రామరాజు-2017

            22.   భారతీయ సాహిత్య పరిణామ పరిశీలన-పాములపర్తి సదాశివరావు-2017

విశ్లేషణ: ఛీకృష్ణ కమిటీ(శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ మీద విశ్లేషణ)(సంగిశెట్టి శ్రీనివాస్‍తో కలిసి) 2011

పాఠ్యగ్రంథ రచన, సంపాదకత్వం

            1. భారతీయ వారసత్వం-సంస్కృతి -డిగ్రీ విద్యార్ధులకు,దూర విద్యాకేంద్రం,మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం-2014

            2.విఙ్ఞాన శాస్త్రం-నాగరికత- డిగ్రీ విద్యార్ధులకు,దూర విద్యాకేంద్రం,మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం-2014

            3.పర్యావరణ అధ్యయనం- డిగ్రీ విద్యార్ధులకు,దూర విద్యాకేంద్రం,మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం-2014

            4.   Indian Heritage and Culture-డిగ్రీ విద్యార్ధులకు,దూర విద్యాకేంద్రం,మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం-2014

            5.1-10 తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాల ఎన్నిక కమిటీ సభ్యుడిగా-2014-15

పాఠ్యగ్రంథాలుగా

                      1.‘ముంగిలి’ - కాకతీయ యూనివర్సిటీ తెలుగు ఎం.ఏ కు పాఠ్యగ్రంథం

                        2.‘ముంగిలి’- ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ఎం.ఏ కు రిఫరెన్స్ గ్రంథం

                        3.‘‘తెలంగాణ చరిత్ర’’ఉస్మానియా యూనివర్సిటీ- చరిత్ర శాఖ ఎం.ఏ.కు రిఫరెన్స్ గ్రంథం

                        4.‘‘తెలంగాణ చరిత్ర’’ఉస్మానియా యూనివర్సిటీ-తెలుగు ఎం.ఏ.కు రిఫరెన్స్ గ్రంథం

పురస్కారాలు :

            1. ‘‘తెలంగాణ చరిత్ర’’ కు బి.ఎన్‍.శాస్త్రిపురస్కారం-2011

            2.‘ముంగిలికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారం-2012                                                  

            3. ‘గనుమకు శాతవాహన విశ్వవిద్యాలయం ద్వారా ముదిగంటి వెంకటనర్సింహారెడ్డి పురస్కారం

              2014

             4. ‘ముంగిలికి ప్రొఫెసర్‍ ఎస్వీ రామారావు గారి పరిశోధనపురస్కారం-2014

            5. ‘ముంగిలికి ద్వానాశాస్త్రి పురస్కారం-2014.

            6. తెలంగాణ ప్రభుత్వం వారి‘‘రాష్ట్ర ఉత్తమ సాహితీవేత్త’’ తొలి పురస్కారం-2015

            7.‘‘తావు’’ కు రంగినేని ఎల్లమ్మ పురస్కారం -2017

ఇతరాలు                 

            1. 70-80 సెమినార్లలో కీలకోపన్యాసాలు,పత్ర సమర్పణలు

            2.ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్‍, శ్రీకాకుళ సాహితి, నీలగిరి సాహితి,

               తెలంగాణ సాంస్కృతిక వేదిక, సింగిడి లాంటి సంస్థల స్థాపన ,నిర్వహణ భాగస్వామ్యం.

            3. నా పర్యవేక్షణలో 5గురికి పిహెచ్‍.డి అవార్డులు.కొనసాగుతున్న మరొక ఆరుగురు .

            4. వివిధ టి.వీ ల్లో, రేడియోలో పాఠ్యాంశాల బోధన,సాహిత్య ప్రసంగాలు,చర్చలు.

            5.తెలుగు విశ్వవిద్యాలయంతెలుగు అకాడమితెలంగాణ సాహిత్య అకాడమీల కొన్ని కమిటీల్లో సభ్యుడిగా.

            6.‘సుంకిరెడ్డి నారాయణరెడ్డి నాలుగు దశాబ్దాల సాహిత్య సమాలోచన’ (11-12-2016) సంచిక రానున్నది.


ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు