ఇంటర్వ్యూలు

(October,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ప్రజా ఉద్యమం “నిప్పు”  అయితే ఆ నిప్పును  మరింత  జ్వలింపజేసే “గాలి” సాహిత్యం – గంటేరు గౌరునాయుడు&nb

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు గంటేరు గౌరునాయుడు  గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

1.    మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి?

ఇప్పటి విజయనగరం జిల్లా కొమరాడ మండలం నాగావళీ నదీ తీరాన గల దళవాయి పేట అనే చిన్న పల్లెటూరు లో మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో 1954 ఆగస్టు 7న పుట్టాను.  మా అమ్మ సోములమ్మ, బాపు తండ్రి సత్యం నాయుడు.  నెలలు నిండకుండానే ఏడో నెలలో పుట్టిన కారణంగా బతుకుతానని అనుకోలేదట.  ప్రాథమిక విద్య మా  ఊళ్ళోనే. ఉన్నత పాఠశాల చదువు కోసం మా నాగావళి నది ని దాటి నాలుగు మైళ్ల దూరం నడిచి కోటి పాం  పెళ్లి వచ్చేవాళ్ళం.  ఇంటర్మీడియట్ మాకు సమీప పట్నం పార్వతీపురం జూనియర్ కళాశాలలో తెలుగు హిస్టరీ సివిక్స్.  ప్రధానంగా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అట్టాడ అప్పల్నాయుడు (ప్రముఖ కథా  నవలా రచయిత) పక్క పక్క గదుల్లో అద్దెకు ఉండే వాళ్ళం.  అప్పలనాయుడు కూడా కోటి పాం హై స్కూల్ లో చదివాడు. నాకంటే ఒక ఏడాది పెద్ద తను. ఇంటర్మీడియట్ పరీక్ష తప్పడంతో  (సినిమాలు, స్నేహితులు అని సరిగా కాలేజీ కి వెళ్లకపోతే తప్పక ఏమవుతుంది) చదవడానికి ఇష్టపడక వ్యవసాయంలో కుదిరిపోయాను. కీర్తిశేషులు శ్రీ సామవేదుల  రామ గోపాల శాస్త్రి గారు చూపిన దారిలో ప్రైవేటుగా తెలుగు పరీక్షలు రాసి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయున్నయినాను.  2011  సంవత్సరం లో ఉద్యోగ విరమణ చేశాక ఇప్పుడు పార్వతీపురంలో విశ్రాంత జీవితం గడుపుతున్నాను.  నా భార్య పేరు జానకి. ఇద్దరు కొడుకులు. కిరణ్  కుమార్, క్రాంతి కుమార్.  నేను ఇద్దరు తమ్ముళ్లకు, ఇద్దరు చెల్లెళ్లకు అన్నయ్యని. నా మనవరాళ్లిద్దరు (పెద్దోడి పిల్లలు) ఆడిస్తుంటే వాళ్లతో ఆడుతూ గడిపేస్తున్నానిప్పుడు.  కోడళ్ళి ద్దరి పేర్లు  పెద్ద కోడలు లావణ్య, చిన్న కోడలు స్వప్న.

2.    మిమ్మల్ని ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి?

 నిజానికి నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు అంటే ఎనిమిదో తరగతి లో  నాటిక రాసి  ఊళ్లో ప్రదర్శించాను.  స్కూల్లో ఎవరో ఒకతను ఫిరదౌసి ఏకపాత్రాభినయం ప్రదర్శించాడు. అప్పుడు అనిపించింది కవి కావాలని. మా బాపు నటుడు, గాయకుడు, హార్మోనిస్ట్, వేణు అద్భుతంగా పలికించే వాడు, పాటలు బొమ్మలు నా బాల్యంలో నన్ను కళా రంగంలోకి  ఆకర్షించాయి. ప్రభావితం చేసిన సాహిత్య సంస్థల గురించి మాట్లాడితే మా పార్వతీపురంలో మిత్ర సాహితీ సాహితీ సంస్థ ప్రతి నెలా ఒక సమావేశం జరిపేది.  దానికి ప్రధాన వ్యక్తి ప్రముఖ కథా రచయిత పి వి బి  శ్రీరామమూర్తిగారు.  1988లో ఒక సమావేశంలో ఒక కథ చదివాను.  ఆ సభకు ముఖ్య అతిథి ప్రముఖ కవి రచయిత  శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు.  ఆ కథ రేపటి  ఉదయం కోసం.  ఆ కథ ఆకాశవాణి (విశాఖపట్నం) లో ప్రసారం అయ్యింది.  అదే కథను పార్వతీపురం లోని మరో సాహిత్య సంస్థ సాహితి లహరి  అధ్యక్షులు శ్రీ మంచిపల్లి శ్రీ రాములు గారి సంపాదకత్వంలో ప్రచురించిన ప్రచురించిన కథాలహరి కథా సంకలనంలో ప్రచురితమైంది.  అలా నన్ను ప్రోత్సహించిన తొలి సాహితీ సంస్థలు మిత్ర సాహితీ, సాహితీ లారీ ప్రభావం మర్చిపోలేనిది.  శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు పార్వతీపురంలో గిరిజన సంక్షేమ అధికారి గా పని చేసేవాడు.  ఆయన అప్పటికే “నిర్వికల్ప సంగీతం”, “అరణ్యం” పుస్తకాలు రాసారని  తెలిసి ఆశ్చర్యపోయాను.  తరువాత వారి స్ఫూర్తితో సాహిత్య ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించాను.  అట్టాడ అప్పల్నాయుడు ప్రచురించిన “పోడు – పోరు”  కథా  సంకలనం 1988లో నా చేతుల్లోకి వచ్చింది.  ఆ కథలు నన్ను కథారచయితగా నిలదొక్కుకునేందుకు పునాది వేసాయి.  “పోడు-పోరు” కథా సంకలనం లేకపోతే నా “ఏటి పాట” వచ్చి ఉండేది కాదు.  “ఏటి పాట” కథా సంకలనాన్ని శ్రీకాకుళ సాహితి ప్రచురించింది.  1997 ఫిబ్రవరి 17న కథానిలయం ప్రారంభోత్సవంలో గౌరవ కాళీపట్నం రామారావు మాస్టారు ఆవిష్కరించారు.  ప్రముఖ రచయిత శ్రీపతి గారు ఈ పుస్తకాన్ని  పరిచయం చేశారు.  ఆ సభకి  అధ్యక్షులు గౌరవ గూటాల కృష్ణమూర్తి గారు.  ఆ సభ  నాకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది.  శ్రీకాకుళ సాహితీ నెలనెలా జరిపే సమావేశాలు సాహిత్యం సామాజిక బాధ్యత అని చెప్పి నాకు చూపును  ఇచ్చాయి.  శ్రీకాకుళ సాహితి స్ఫూర్తితో నేను కురుపాంలో (అప్పటికి నేను కురుపాంలో ఉండేవాడిని) స్నేహ కళా సాహితి అనే సంస్థను కొద్ది మంది మిత్రులం  ఏర్పాటు చేసుకున్నాం.  గౌరవ కారా మాస్టారు  ముఖ్య అతిథిగా వచ్చి ఆశీర్వదించారు.  ఇప్పుడు స్నేహ కళా సాహితీ పార్వతీపురంలో ఒక లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటిదాకా 25 పుస్తకాలను ప్రచురించాం.  స్నేహ కళా సాహితీ పేరుతో శ్రీకాకుళ సాహితీ స్ఫూర్తితోనే స్నేహ కల సాహితి నడుస్తుంది.  కొత్త తరం కవుల్ని, కథకుల్ని  తయారు చేసే లక్ష్యంతో వారం వారం సమావేశాలు నిర్వహిస్తోంది.

3.      ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు సాహిత్యం వైపు నడిపించాయి?

 ఉత్తరాంధ్ర విశాలమైన సముద్ర తీర ప్రాంతం, విస్తారమైన అడవులు, నాగావళి, వంశధార వంటి నదులు, పచ్చని మైదాన ప్రాంతం తో సుభిక్షంగా ఉండాల్సింది.  కానీ రైతుల  కూలీల వలసలతో, అన్య ప్రాంత పెట్టుబడిదారుల రాకతో మా అస్తిత్వానికి ఉనికి లేకుండా పోయే ప్రమాదంలో పడింది.  అందుకే ఇక్కడి నుంచి ( ఏ కకవైనా ఏ రచయితయినా ) ఆ వెనుకబాటుతనాన్ని తమ రచనల్లో చిత్రిస్తున్నారు.  నా దరి కూడా అదే కదా. ఇక్కడే  మా ఊరికి సమీపంలోనే ఒకనాడు శ్రీకాకుళ గిరిజన ఉద్యమం జరిగింది.  అది  అణిచి వేయబడినా  ఆ పోరాట స్ఫూర్తి సాహిత్యం ద్వారా అందుకున్న రచయితలు వర్తమాన కళింగాంధ్ర  వెనుకబాటుతనాన్ని రికార్డు చేస్తూ ప్రజల తరఫున నిలబడి  తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.

 

4.    మీ రచనల గురించి చెప్పండి?

 కారా మాస్టారు, అట్టాడ అప్పల్నాయుడు , చినవీరభద్రుడుల పరిచయం,  స్పూర్తి, ప్రోత్సాహం లేకుంటే బహుషా ఒక దృక్పథం లేని  కాలక్షేపం రచనలు చేసే రచయితగా మిగిలిపోయే వాడిని.  నా మొదటి కథా సంకలనం “ఏటి పాట”. రెండో కథాసంకలనం “ఒక రాత్రి రెండు స్వప్నాలు”.  “పాడుదమా స్వేచ్ఛా గీతం”, “ప్రియ భారత జనని”, “గీతాంజలి” పాటల పుస్తకాలు,  “నదిని దానం చేశాక”, “గిరిపోతున్న పిట్టల కోసం”. రెండు కవితా సంకలనాలు “నాగేటి చాలు కు నమస్కారం”,  “నాగలి” రెండు దీర్ఘ కవితలు. “నాగావళి అలల సవ్వడి”, “ఉన్నమాట”, “సేద్య గాడు”(ముద్రణ కావాల్సి ఉంది ).  పద్య రచనలు కలింగోర (ప్రాసంగిక వ్యాసాలు). ఆంధ్రప్రభలో “వ్యాసపీఠం” పేరుతో కాలం నిర్వహించాను  ఒక ఏడాది పాటు.  అవే కలింగోర పేరుతో  పేరుతో పుస్తకంగా వేశాం.  ఇక కొన్ని పుస్తకాలకు ముందుమాటలు, అప్పుడప్పుడు  పత్రికలకు వ్యాసాలు, గజల్సు మీద మక్కువతో “మనసు పలికే” పేరుతో పుస్తకం వేశాను.  నేను ఒక పరిమిత ప్రాంతానికి పరిమిత జ్ఞానంతో నా చుట్టూ ఉన్న ప్రజాజీవితాన్ని చిత్రించడంతో పాటు కొత్తతరం కవులు, రచయితలు తయారు కావాలన్న లక్ష్యంతో స్నేహ కళా సాహితీ సంస్థను  నిర్వహిస్తున్న మిత్రుల సహాయంతో పార్వతీపురంలో.

5.      మీ మొదటి రచన ఏది అది ఏ సందర్భంలో వచ్చింది?

అచ్చులో వచ్చిన మొదటి కవిత “ఇదేనా”.  శ్రీకాకుళం నుండి వెలువడే నాగావళి వారపత్రికలో 1979 డిసెంబర్ లో అచ్చయింది.  నాగావళి  పత్రికకు సంపాదకుడిగా అట్టాడ అప్పల్నాయుడు రచన ఇవ్వమంటే పంపించాను.  అచ్చులో వచ్చిన మొదటి కథ “శారద పెళ్లి”  కథాంజలి   1983.  1979 సంవత్సరానికి ముందు ఎన్ని వేల పేజీలు చిత్తుకాగితాలు ఎగిరిపోయాయో.  వాటిలో నాటకాలు ఉన్నాయి. నవల ఒకటుంది

6.      ఉత్తరాంధ్ర సాహిత్యం మిగతా ప్రాంతాల నుండి భిన్నంగా ఉంటుంది ఎందుకు?

ప్రతి ప్రాంతానికి దానిదయిన  ఒక చరిత్ర ఉంటుంది కదా. పేదరికం దేశంలో ఏ ప్రాంతానికైనా ఒక సమస్య అయినా  దాడిని ఎదుర్కోవడంలోనూ స్వీకరించడం లోనూ ప్రాంతీయ ప్రత్యేకతలు ఉంటాయి.  పూర్వ రచయితల, కవుల ప్రభావం ప్రతి రచయిత మీద ఉంటుంది.  గురజాడ నుండి అందుకున్న చైతన్యం అదే అడుగు జాడ గా సాహిత్యం సృష్టిస్తూ వస్తున్నారు కవులు, రచయితలు.  వ్యవహారిక భాషా ఉద్యమం జరిగింది ఇక్కడ.  శ్రీకాకుళం రైతాంగ పోరాటం జరిగింది ఇక్కడ.  స్వాతంత్ర సముపార్జనకు  ముందే ఇక్కడ ఎన్నోన్నో  తిరుగుబాట్లు జరిగాయి. జమీందారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి.  వీటన్నింటికంటే ముందర చరిత్రలో నెత్తుటి మరకగా  మిగిలిపోయిన అశోకుడి దుర్మార్గ దండయాత్రకు బలైపోయిన లక్షల్లో కళింగ యోధుల పోరాట స్ఫూర్తి చైతన్య పరుస్తూ వచ్చింది రచయితలను కవులను.  కళింగ యుద్ధం నుండి  మొన్నటి సోంపేటలో  థర్మల్ విద్యుత్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం దాకా ఈ నేలకు ఒక ప్రత్యేకత ఉంది.  ఆ ప్రత్యేకతే ఈ ప్రాంత  సాహిత్యం  మిగతా ప్రాంతాల నుండి భిన్నంగా ఉండడానికి కారణం కావచ్చు. ముఖ్యంగా గిడుగు, గురజాడల ప్రభావం అని నా విశ్వాసం. ఇక్కడి ప్రజల భాష సంస్కృతి జీవన విధానంలోని విలక్షణత్వం, యాస, వెటకారం, వ్యంగ్యం  ఇవన్నీ గురజాడ నుండి సంక్రమించిన సాహిత్య వారసత్వ సంపద. బహుశా ఇవే మిగతా ప్రాంతాల నుండి కళింగాంధ్ర ను ప్రత్యేకంగా నిలుపుతున్నవని  అనుకుంటాను.

7.      ఇప్పుడు వస్తున్న సాహిత్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు?

ఏ కాలంలో వచ్చిన సాహిత్యం ఆ కాలపు రాజకీయ ఆర్ధిక సామాజిక పరిస్థితులకు దర్పణంగా నిలుస్తుంది. సమస్యలను కళాత్మకంగా చిత్రిస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.  ఉత్తరాంధ్ర కళింగాంధ్ర వర్తమాన సాహిత్యం కూడా అదే చేస్తుంది.  ఏ ప్రాంతానికి తీసిపోని సాహితీ సృజన నిరంతరం కొనసాగుతూనే ఉంది.

8  సాహితీవేత్తలకు కవులకు రచయితలకు పాఠకులకు మీరు ఏం చెప్పదలచుకున్నారు? కొత్తగా రాస్తున్న వాళ్ళ గురించి  మీరేమంటారు?

సాహితీవేత్తలకు, కవులకు, రచయితలకు ఏం చెప్పగలను?  అంత జ్ఞానము లేదు.  అయితే ఒకటి మాత్రం అనుకుంటున్నాను. వర్తమాన కవులు రచయితలతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది వారు తమ పూర్వ కవుల, కథకుల రచనలు అధ్యయనం చేయలేదని.  ఊహశాలిత, రాసే నేర్పు ఉండటం మాత్రమే కాదు రచయితకు ఉండాల్సింది తమ పూర్వ రచయితలు ఏమి రాశారో, తాము ఏమి రాయాల్సి ఉంటుందో అంచనా వేసుకోవడానికి అధ్యయనం  ముఖ్యమని భావించకపోవడం.  అలాగే భాష, వాక్య నిర్మాణం పట్ల సాధికారత  లేకపోవడం.  అయితే అందరూ ఇలాగే ఉన్నారు అని కాదు అని నా భావన.  చాలా ఎక్కువ మందిలో నేను గమనించింది.  కవుల్లో అయితే అస్పష్టత గమనించాను. ఇతరులకు అర్థం కాకుండా రాస్తేనే అది గొప్ప కవిత్వంగా ప్రశంసిస్తారు అనే భావన కొందరిలో గమనించాను. ఇలా చెబితే కొందరికి ఆగ్రహం కలగొచ్చు గానీ రాసిన అక్షరాల తడి ఆరకుండానే అచ్చయి పోవాలననే  తపన చాలామందిలో (ఇప్పుడెవరూ కలం పట్టుకుని రాసే వారు లేరు అనుకోండి).  రాసినదాన్ని పదేపదే సరిచూసుకొని తనకు తానే ఎడిట్ చేసుకుని ఆచ్చుకి పంపించడం చేస్తున్నారా అంటే అది అనుమానమే.  అచ్చులో కంటే ఫేస్బుక్ , వాట్సాప్ లో అచ్చవుతున్నాయి కదా.  సమస్యలేదు. రాసినదంతా  కవిత్వంగా లైక్ లు,  ఆహా ఓహో, అద్భుతం అంటూ  కవిత్వంగా చలామణి అయిపోతుంది.  కొత్త వారిలో కొద్దిమంది మాత్రమే భాషపట్ల,  వాక్య నిర్మాణం పట్ల , అభివ్యక్తి శిల్పం పట్ల జాగురూకులుగా  ఉండటాన్ని గమనించాను.  ఇవన్నీ నేను గమనించిన అంశాలుగానే చెబుతున్నాను తప్ప ఇవి సలహాలు ఇస్తున్నట్టుగా ఎవరూ భావించనక్కరలేదు.  ముందే చెప్పాను కదా అంత జ్ఞానం లేదని.

9       యువతరం సాహిత్యంలోకి రావాలంటే ఏం చేయాలి?

యువతరాన్ని సాహిత్యంలోకి ఆకర్షించాలంటే ముందు బాష పట్ల వారికి ఆసక్తి, అభిరుచి కలిగించాలి.  ఇది పాఠశాలల్లోనే జరగాలి, కళాశాలలో జరగాలి.  అది జరిగే అవకాశం ఎక్కడుంది? ర్యాంకుల గొడవలో పడి సతమతమై పోతుంటే?  భాషల గురించి పట్టించుకునేదెవరు? ఇక ఆంగ్ల భాష మాధ్యమంగా చదువుకొని వర్తమానంలో భాషల పట్ల పిల్లలకు ఆసక్తి ఎలా కలుగుతుంది?  ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక అమ్మాయి బాపు బొమ్మకి చేసిన అనువాదం “గాంధీ టాయ్”  అని.  మాతృభాషలో ఉన్నత పాఠశాల వరకూ బోధన జరగాలి.  పై తరగతుల్లో కళాశాలల్లో తెలుగు భాష తప్పనిసరిగా బోధించ బడాలి.  ప్రైవేట్ కళాశాలల్లో కూడా తెలుగు భాషా బోధన జరగాలి.  కళాశాలలు వేదికలుగా సాహితీ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించుకుంటే విద్యార్థులకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించవచ్చు.  ముఖ్యంగా యువతరం కవులు, రచయితలు తాము అధ్యయనం చేస్తూ కళాశాలలని  సాహిత్య వేదికలుగా మార్చుకొని అనుభవం గల  రచయితల్ని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తే యువతరం సాహిత్యానికి చేరువ  కాగలుగుతారు.

10      కొత్త రచయితలకు మీరిచ్చే సూచనలు?

సూచనలు స్వీకరించే స్థితిలో కొత్త రచయితలున్నారా?   చాలామంది రచయితలు సాహిత్యం కోసం, కొత్తవారి కోసం ఉపయోగపడే పుస్తకాలు  వేస్తున్నారు.  అవి కొత్త రచయితలు చదువుతున్నారా? రాసినదంతా సాహిత్యమే అనుకోకుండా తోటి మిత్రులతోనూ అనుభవంపండిన  వారితోనూ రచన గురించి మాట్లాడుతుంటే అదే వారిని ముందుకు నడిపిస్తుంది

11       ఈ మధ్య మీరు చదివిన మంచి కథలు చెబుతారా?

కథలు ఎంత ఇష్టంగా చదివే వాడిననో.  ఇటీవల అసలు కథలు (ఇటీవల వచ్చిన కథలు) చదవలేకపోయాను.  ఆంధ్రజ్యోతి ఆదివారం, సాక్షి ఆదివారం,  ప్రజాసాహితి, నవ్య వీక్లీ, పాలపిట్ట  ఇంకా ఆయా రచయితల కథా సంకలనాలు  చదివేవాడిని.  కరోనా కాలంలో కథలు చదవ లేదనే చెప్పాలి. పద్దం అనుసూయ కోయ ఆదివాసి కథలు చదివాను. కోయ  జీవితాల్లోని చీకటి కోణాలు బయటి ప్రపంచానికి తెలియజేసిన ప్రత్యేక గిరిజన కథలు. కోయ గిరిజన తెగకు చెందిన రచయిత్రి రాసిన ఈ కథలు పుస్తకం లో ఉన్నవి నాలుగే  అయినా చదవాల్సిన పుస్తకమే.  లైబ్రరీ కి వెళ్లడం కుదరక (కరోనా కాలం) కథల్ని  చదవలేదు.  ఈ కరోనా కాలంలో “వందేళ్ల కథకు వందనాలు” పుస్తకంలోని కథలు చదవడం పూర్తి చేశాను. నవలలయితే”పర్వా” (రెండోసారి) “అమృతసంతానం”(రెండోసారి) చదివాను. కల్లూరి భాస్కరం గారి “మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మనదే” చదవడం పూర్తి చేశాను నిన్ననే.  చాలా రోజుల కిందట  మిత్రులు దాట్ల దేవదానంరాజు గారిచ్చిన  “ గోదావరి కథలు”,  మిత్రులు చిరంజీవి వర్మ కథల పుస్తకం “కాకి బొడ్డు” చదవడానికి తీశాను బయటకి.  ప్రస్తుతం చదువుతున్నది దీవి సుబ్బారావు గారి కవిత్వం” ఇంకొకప్పుడు”. ఈ వారం క్రితం అందుకున్న మోదుగు శ్రీ సుధ గారి విహారి (కవిత్వం) పుస్తకం అడుగుతోంది నన్ను ఎప్పుడు చదువుతారు అని.

12.     తెలుగులోకి వస్తున్నంతగా  అనువాద సాహిత్యం తెలుగు నుండి బయట భాష లోకి వెళ్లడం లేదు.  ఏం చేయాలి?

ఇది ఆలోచించాల్సిందే.  ఇతర భాషలలోకి అనువదించ దగ్గ  రచనలు రాకపోవడమా  లేదా తెలుగు భాషతో పాటు పర భాషలు తెలిసిన అనువాదకులు శ్రద్ధ పెట్టకపోవడమో.  నాకైతే గొప్ప రచనలు రాలేదేమో అనిపిస్తుంది.  అయితే ఇటీవల వచ్చిన “శప్తభూమి”(స్వామి) “ కొండపొలం”(సన్నపురెడ్డి) నవలలు ఇతర భాషలలోకి వెళ్లవలసిన మంచి రచనలు.  మరి ఎందుకు శ్రద్ధ చూపలేదు అనువాదకులు?  కథలు ఇంగ్లీషులోకి అనువదించచే  ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది.  అది సంతృప్తి కలిగించే రీతిలో కాదు.  పేరున్న సాహితీ సంస్థలు శ్రద్ధ తీసుకోవాలి

13    ఇదివరకు పత్రికలు పోషించిన పాత్రను ఇప్పుడు అంతర్జాల పత్రికలు,  ఫేస్బుక్ పోషిస్తున్నాయి కదా.  ఈ మార్పు వల్ల కొత్త తరం పాఠకులు సాహిత్యంలోకి వచ్చారంటరా?

పత్రికలు పోషించిన పాత్రను ఇప్పుడు అంతర్జాల పత్రికలు, ఫేస్బుక్ పోషిస్తున్న మాట వాస్తవమే గానీ అంతర్జాల పత్రికలో వస్తున్న సాహిత్యం చదువుతున్నది పరిమితమే  అని నేను అనుకుంటున్నాను.  అభిరుచి ఉన్నవారు, సాహిత్య పరిచయం ఉన్నవారు చదువుతున్నారేమో? వారు కూడా స్మార్ట్ ఫోన్ లోని ఇతరేతర దృశ్యాల పట్ల చూపిన ఆసక్తితో  అంతర్జాల పత్రికలు తెరుస్తున్నారు అంటే అనుమానమే.  అంతర్జాల పత్రికలో ఈ కథ చదివాను బాగుంది అని నాతో అన్న వాళ్ళు అతి తక్కువ  (నా దరిదాపుల్లోనే రచయితలు మిత్రులు).  కథ రాసిన రచయిత మిత్రుడు ఫేస్బుక్లో కోరడం వల్ల గానీ ఫోన్లో చెప్పడం వల్ల గాని చదివిన  సందర్భాలు   ఉండొచ్చు.  నాలాంటి వాడు ఫోన్ లో చదవడం కష్టం.  అందరికీ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఉంటాయా? కొత్త తరం పాఠకులు, రచయితలు ఫేస్బుక్లో  కనిపిస్తున్నారు అది కవితలకు పరిమితమై అని నా అభిప్రాయం.  కథలు, వ్యాసాలు సాహిత్య జీవులైన పెద్దలు కొందరు చదువుతారు ఏమో? నిన్నటి తరం పత్రికలలో సాహిత్యాన్ని చదివినట్టు అంతర్జాల పత్రికల్లో సాహిత్యం చదువుతున్నా కొత్త తరం తక్కువే అనిపిస్తుంది.  నా అభిప్రాయం, అంచనా తప్పయినా కావచ్చు

14.    మీకు బాగా నచ్చిన ప్రజల నాలుకలపై కదలాడే  పాట?

నాకు నచ్చిన ప్రజల (ఎక్కువగా ప్రజల్లో గాయకుల్లో) నాలుకల పైన కదలాడే  పాట దాశరధి గారి రచన “ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో” పాట.  నేను ఎక్కువగా ఇష్టపడి పాడుకునే పాట ఇది

15.     ప్రజా ఉద్యమాలకు సాహిత్యం ఎంతవరకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు?

 ప్రజా ఉద్యమం “నిప్పు”  అయితే ఆ నిప్పును  మరింత  జ్వలింపజేసే “గాలి” సాహిత్యం.  సాహిత్యం లేకుండా ఉద్యమాలు వేగవంతం కాలేవని నా అభిప్రాయం.

 16.      స్థానిక ప్రాంతీయ అస్తిత్వ లకు సంబంధించిన కథా సాహిత్యం ఈ మధ్యకాలంలో ఏ స్థాయిలో వస్తోంది ? దాని ప్రభావం ఇతర అస్తిత్వ ఉద్యమాల పై ఉన్నదా?

ఈ మధ్య కాలంలోనే కాదు స్థానిక ప్రాంతీయ అస్తిత్వ లకు సంబంధించిన వాదాలు సాహిత్యంలో ఊపందుకున్న నాటి నుంచి అదే సాహిత్యం వస్తోంది.  ఇది సాహిత్య ప్రపంచాన్ని చీలికలుగా చేస్తున్న ప్రమాదం దాపురించింది.  “మా కులం వాళ్లమే మా సాహిత్యం రాసుకోవాలి.  ఇతరులు ఏం రాయగలరు? అన్నంత  వరకూ వచ్చి మా కోసం ఆ మహా రచయిత ఏం రాశాడు? ఈ మహాకవి ఏం చేశాడు?” అని వారిని తక్కువ చేసే స్థితి ఉంది.  ఇది సాహిత్య లోకానికి మేలు చేయదనుకుంటాను. కవులు, రచయితల మధ్య సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది.


ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు