ఇంటర్వ్యూలు

(November,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

పరిశీలకుడినే గానీ తీర్పరిని కాను - అల్లం రాజయ్య

(ఆంధ్ర జ్యోతి వివిధ కోసం అల్లం రాజయ్య గారిని కాత్యాయనీ విద్మహే గారు  ఇంటర్వ్యూ చేసారు.   గత సంవత్సరంలో   ఆంధ్ర జ్యోతి వివిధ సాహిత్య పేజీలో  ఈ ఇంటర్వ్యూ లోని కొంత భాగాన్ని ప్రచురించారు.  ఆంధ్ర జ్యోతి సౌజన్యంతో ఆ ఇంటర్వ్యూ పూర్తి భాగాన్ని గోదావరి అంతర్జాల సాహిత్య పత్రిక పాఠకుల కోసం ప్రచురిస్తున్నాం)

ఎదురు తిరిగితే’ (1977) కథ నుండి,నలభై రెండేళ్లుగా  నేను అల్లం రాజయ్యగారి సాహిత్య పాఠకురాలిని. ఉత్తర తెలంగాణ గ్రామీణజనజీవిత సంఘర్షణలను, ఆరాటపోరాటాల చరిత్రగతిని,ఉత్పత్తి సంబంధాల నేపథ్యంలో సమాజాన్ని, మానవ సంబంధాలను అర్ధం చేసుకొనటానికి సమర్ధ వంతమైన సాధనం అల్లం రాజయ్య సాహిత్యం. మంథని తాలూకా అడవి అంచున, ఒకప్పటి  బ్రాహ్మణ అగ్రహారం  గాజులపల్లి లో రైతు కుటుంబంలో పుట్టిన రాజయ్య బడి చదువుల నాటికే కులం, ఆర్ధికం,దొరల  అధికారం మానవ సంబంధాలను శాసిస్తున్నతీరును గమనిస్తూ ,కలవరానికి గురి అవుతూ కారణాలు తెలియని ఆవేదనలో సాహిత్యం చదవటం మొదలుపెట్టారు. గాంధీని, అంబేద్కర్ ను అధ్యయనం చేసారు. సామాజిక ఆచరణ మార్గాల వెతుకులాటలో 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగం అయ్యారు. అది అర్ధాంతరంగా ముగిసిన తరువాత  కాలేజీ చదువులకోసం వరంగల్ వచ్చారు. 1974 లో బీఎస్సీ పూర్తయ్యే నాటికే నక్సల్బరీ వెలుగులో కరీంనగర్ లో పురుడు పోసుకొంటున్న విప్లవోద్యమ నిర్మాణం లో తనతరపు సహచరులందరితో పాటు తానూ ఒకరైనారు. 1975 లో  ఏసిసి కంపెనీ ఉద్యోగంలో చేరి మంచిర్యాలకు  మకాం మార్చినా  ఆలోచన,ఆచరణ,సృజన అన్నీనూతన ప్రజాస్వామిక  ఉత్పత్తి సంబంధాల విప్లవోద్యమ పునర్నిర్మాణ మార్గంలోనే  సాగించుకొంటూ వచ్చిన  వర్తమాన చరిత్ర అల్లం రాజయ్య. 

1973 నుండి అల్లం రాజయ్య రాసిన కథలు, నవలలు  సంపుటాలుగా ప్రచురించ టానికి  హైదరాబాద్ లోని పర్ స్పెక్టివ్స్ సంస్థ పూనుకొన్నది. వరవరరావు వీటికి సంపాదకులు. 2008 లో  కొలిమంటుకున్నది, ఊరు, అగ్నికణం నవలలతో వచ్చిన మొదటి సంపుటంఅల్లం రాజయ్య సాహిత్యం’. 1973 నుండి 1980 వరకు వచ్చిన 34 కథలతో ’  2011 లో రెండవ సంపుటంసృష్టికర్తలు వచ్చింది.  2013 లోకొమురంభీముమూడవ సంపుటంగానూ , ‘వసంతగీతంనాలుగవ  సంపుటంగానూ  వచ్చాయి. 1981నుండి 1985 వరకు రాయబడిన 32 కథలతో అయిదవ సంపుటంతల్లిచేప’ 2017 లో రాగా 1987 నుండి 2000 వరకు ప్రచురించబడిన 25  కథలతో ఆరవ సంపుటంఅతడు’ 2019 లో వచ్చింది. వివి రాసిన విపులమైన ముందుమాటలతో అచ్చులో 2,390 పుటలకు వ్యాపించిన సృజన సాహిత్యం ఇది.  ముగింపులు - ముందుమాటలు ,ఊరేగింపు  అనే నవలలు, మరో ముప్ఫయ్ కథలు పోయినవి పోగా లభించనివి మరికొన్ని, ఇటీవలి టైగర్ జోన్ నవల, మరి మూడు  కథలు ఈ సంపుటాలలోకి ఎక్కనేలేదు. ఆరవది, ఇప్పటికి చివరిది అయినఅతడు’   కథల సంపుటి వెలువడిన సందర్భంగా  అల్లం రాజయ్య గారితో  ముఖాముఖి సంభాషణ  కోసం వంగాల సంపత్ రెడ్డి తో కలిసి ఆగస్టు 27 న మంచిర్యాల వెళ్ళాను. ఆరుగంటల పాటు ఒక మహా ప్రవాహంలా సాగిన ఆ నాటి సంభాషణలో దొర్లిన చరిత్ర,అనుభవాలు, జ్ఞాపకాలు, నమ్మకాలూ ఎన్నెన్నో…  ఆ సంభాషణ నుండి కొంత మీ కోసం.    

రాజయ్యగారూ , వందకు పైగా కథలు, పోగొట్టుకొన్న నవలలు, అచ్చులో ఉన్న సైరన్టైగర్ జోన్ నవలతో  కలుపుకొని తొమ్మిది నవలలు రాశారు కదాఅంత అపరిమిత సాహిత్యాన్ని ఉత్తరతెలంగాణ దేశకాల  పరిస్థితుల పరిమితులనుండి సృష్టించటం ఎలా సాధ్యమైంది?

పాత అభివృద్ధి నిరోధకమైన సమాజాన్ని కూలదోసి దోపిడీ, పీడన,హింస లేని కొత్త సమసమాజాన్ని, శ్రామికవర్గ పార్టీని నిర్మించి పోరాడే చరిత్ర నా కాలంలో, స్థలంలో కొనసాగటం వల్లనే సాధ్యమైంది. ఇలాంటి సంఘర్షణాత్మకమైన సమాజం సాహిత్యానికి ప్రేరణ. అర్ధమైన వాస్తవికత గురించి రాయాలి. అదెప్పడూ స్థలకాల పరిమితమైందే . అనేక పొరలలో, అనేక కోణాలలో నిర్మితమయ్యే సమాజంలోని అసమానతలు , అవి సృష్టించే  వైరుధ్యాలు, పరిష్కారంలో సంఘం అర్ధమయ్యేవరకు యాతన పడాలి. ఆ యాతన నుండి పుట్టే ఘర్షణ భావోద్వేగాలకు కారణమవుతూ ఒక వాస్తవానికి చుట్టూ ఆవరించిన అనేక వాస్తవికతలను అర్ధం చేయిస్తుంది..  అందువల్ల  దేశకాల పరిమితులున్నా జీవన  వైవిధ్యం, సంఘర్షణ గురించిన ఎరుక కలుగుతుంది. ఆ ఒత్తిడి నుండే నేను రాసాను. కరపత్రాలు, నివేదికలు ఇవన్నీ కూడా కథలే కదా! నా చుట్టూ వున్న సమాజం గురించే రాసాను. మనుషుల గురించే రాసాను. అందరూ నేను చూసిన, ఎరిగిన మనుషులే. వేరేపేర్లు పెట్టి రాస్తాం అంతే. నా దుఃఖం ఏదైతే వ్రాసానో అది స్థల కాలాలనుండి తెలుసుకోవలసినదే. ఆ సమాజం ఇప్పుడు స్తబ్దంగా లేదు…. కూకటివేళ్లతో సహా పెకులుతోంది…  ఎంతో అలజడిమరెంతో సంఘర్షణ.  

 కథ, నవల  యాదృచ్ఛిక రచనలు కావు. ఆచరణాత్మకమైన ఉద్దేశపూర్వక రచనలు . కథ రాయటమంత యాతన మరొకటి ఉండదు. ఆ హింసనంతా మనం అనుభవించాలి. మొదట నేను తెలుసుకొనటం ,తెలుసుకునే క్రమంలో  లీనమై పోవటం, - వ్యక్తిగా కంటే ఆ పరిస్థితులలో, సమూహంలో లీనమవటానికే నా ప్రాధాన్యత- మనం అందులో భాగమైన, కూలిపోతున్న పాత సమాజపు ఆవేదన, రూపొందుతున్న కొత్త సమాజపు ఉద్వేగం రెండూ అతలాకుతలం చేస్తాయి. ఉద్విగ్న మైన వైరుధ్యాలను ఎదుర్కొనటం, ఉద్విగ్నతను దాటి పరిష్కారంవైపు పోవటం, ఆచరణకు వీలయ్యేదశలో రాయటం. ఇది నా రచనా పద్ధతి. ఇదే సర్వ సంపూర్ణమైన ఆచరణ అనుకోను. అప్పటికీ ఇప్పటికీ రూపొందుతున్న సమాజం పట్ల చిన్నపిల్లగాడ్నే - పరిశీలకుడినే గానీ తీర్పరిని కాను. 

సృజనలో అనుభవానికి ప్రాధాన్యమా? పరిశీలనకు ప్రాధాన్యమా?

అనుభవమే ప్రధానం.అనుభవం పుట్టి పెరిగిన ప్రాంతాలను ,స్థల కాలాలను, కులాన్ని, మతాన్ని, లింగాన్ని బట్టి వ్యక్తిగతమైనదిగానూ, సామూహిక మైనది గానూ కూడా ఉంటుంది. అనుభవాలు ఒకసారి ఏర్పడి స్థిరపడేవికావు. జ్ఞానేంద్రియాల ద్వారా  ఎప్పటికప్పుడు వచ్చి చేరే కొత్త అనుభవంతో అది నిరంతరం  విస్తృతమవుతుంటుంది.  ఈ క్రమంలో  ‘పరిశీలనది  ప్రధాన పాత్ర. పరిశీలన అనుభవంగా మారుతుంది.అనుభవాన్ని గతి తార్కికంగానూ, చారిత్రికంగానూ విశ్లేషించుకోవటమే పరిశీలన. ఈ రెండూ సృజన అనే ఆచరణ నేపథ్యంలో జరుగుతాయి.  

సన్నకారు రైతులు, రైతుకూలీలు ఫ్యూడల్ భూస్వామ్యంతో ప్రత్యక్ష సంఘర్షణకు దిగిన కాలాన్ని, చరిత్రను, సింగరేణి కార్మికులు పెట్టుబడిదారీ  వ్యవస్థతో సంఘర్షణకు దిగిన చరిత్రను కథలుగా మలచిన మీరుమధ్యవర్తులుకథతో చదువుకున్న మధ్య తరగతి వైపు చూపు మళ్లించారు.ఎందుకని?  

ఉత్పత్తి వనరులు,ఉత్పత్తిశక్తులైన కార్మికులు,కర్షకుల అధీనంలో కాకుండా భూస్వాముల పెట్టుబడిదారుల అధీనంలో ఉండటం - ఉత్పత్తిశక్తుల నుండి అదనపు విలువ పిండుకొని - అతి కీలకమైన ఉత్పత్తిశక్తులనుఅభివృద్ధికాకుండా నిరోధించటం, ఉత్పత్తిసంబంధాలు ప్రజాస్వామీకరణ చెందకుండా భూస్వామిక పెట్టుబడిదారీ వలస సంబంధాలుగా ఉండటం - భారతీయ సమాజంలో అత్యంత అభివృద్ధి నిరోధకమైంది. కనుక ఇలాంటి అసమ విషమ పరిస్థితులు మార్చటానికి ఉత్పత్తి శక్తులు పోరాడక తప్పదు. అది అనివార్యం. 

వ్యవసాయక దేశంలో భూమి అంటే దానిని అంటిపెట్టుకొని అభివృద్ధిచెందే సకల ఉత్పత్తి సంబంధాలు. అవి  సృష్టించే  అసమానతలు ఎన్ని తీర్లు ఉన్నయ్, అసమ సంబంధాలు  ఎంత బాధ కలిగిస్తయ్, వాటి మీద కోపం ఎన్ని రూపాలలో వ్యక్తమవుతుందీ చెప్పే ప్రయత్నం మొదటి కథలలో చేసాను. ఉత్పత్తి వనరు అయిన  భూమికి, భూస్వాములకు, భూమి నుండి ఉత్పత్తి అయిన పంటకు, పంపకానికి రైతుకూలీలకు మధ్య ఉన్నసంబంధాలను జరిగిన పోరాటం ద్వారా పరిశీలించే కొద్దీ  అసమానతల వాస్తవం స్పష్టంగా అనుభవమైంది కనుక భూసంబంధాలు, అందులోని వైరుధ్యాలు, సంఘర్షణ అందుకోసం జరిగిన ప్రజాపోరాటాలు  నా చేత  ఆ రకమైన కథలు రాయించినయ్. సమస్యలకు ఒక పరిష్కారం దిశగా జరిగే యుద్ధానికి మనుషులను సన్నద్ధం చేసే  పార్టీ గురించి చెప్పాలి. మీరు పేర్కొన్న గోడ కథనే తీసుకుందాం. అది అట్లా రాసిందే. పీపుల్స్ వార్ నిర్మాణమే ఆ కథ. ( ఎన్నాళ్ళుగానో కూలి వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్న భూమి తనదని, వదిలి వెళ్లిపోవాలని మోటర్ల రిపేరింగ్ కార్ఖానా పెట్టుకుంటానని దొర చెప్పినప్పుడు చుట్టూ గోడలేపి, గుడిసెల కూల్చివేతకు సిద్ధపడ్డప్పుడు రాత్రికి రాత్రి కూలీకుటుంబాలన్నీ కలసి ఆ గోడను కూలగొట్టిన కథ అది. కూలివాళ్ళ మీద కేసులు, నక్సలైట్లతో సంబంధాలున్నాయని శిక్షలు మామూలే. వాళ్లలో రాములు  మాత్రం జాడపత్తా లేకుండా పోవటం అందులో చెప్పబడింది. అంటే భూస్వామ్య అధికారాన్ని విధ్వంసం చేసే ప్రజాయుద్ధ నిర్మాణంలోకి అతను వెళ్లాడన్నమాట. )

            ఆదివాసీ  ఉత్పత్తి ప్రకృతితో ముడిపడింది. భారతీయ ఉత్పత్తివిధానం అటువంటిది కాదు. ఉత్పత్తి విధానంలో , సంబంధాలలో యూరప్ లో లాగా బానిస సమాజాన్ని రద్దుచేసి ఫ్యూడల్ సమాజం, దాన్ని రద్దుచేసి పెట్టుబడిదారీ సమాజం ఇక్కడ ఏర్పడలేదు. ఉత్పత్తి సంబంధాలలో అతి పురాతన మను కౌటిల్యులే ఇప్పటిదాకా కొనసాగటం ఒక కుట్ర. విషాదం. అది ఇప్పుడు మరీ తీవ్రమైంది. అది ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధం లేని  మధ్యతరగతిని ఏమి చేస్తుంది? తాము పుట్టిపెరిగిన రైతాంగం నుండి , కార్మికుల నుండి విడదీసి యంత్రాoగంగా మారుస్తుంది. చదువుకున్న వాళ్ళు ,మధ్యతరగతివాళ్ళు ఈ ఉత్పత్తి మాయలో ఏమైతరు? ఇప్పుడున్న ఉత్పత్తిసంబంధాలలో వాళ్ళెంత హింసకు, పరాయీకరణకు గురవుతున్నారో తెలుస్తున్నప్పుడు, వాటిని మార్చటం గురించిన చైతన్యం కలిగించాలి. తప్పనిసరిగా  వాళ్ళు పోరాడే శక్తులతో కలిసి పోవాలి. అన్ని భారతీయ భాషల్లో మధ్యవర్తుల శ్రమ పరాయీకరణ గురించి బాధపడటం రాశారు. కాదుఆ స్థితిని దాటటానికి ప్రయత్నం చేయాలనే ఈ కథ. 

 మధ్యతరగతి లో ఉత్పత్తి సంబంధాలలోని అమానవీయతను గురించిన స్పృహ వుంటుంది. గోపీచంద్ ,చలం, బుచ్చిబాబు వంటి రచయితలు ఈ కోవకు చెందినవాళ్ళే. ఉత్పత్తిసంబంధాలను ప్రశ్నించిన ,పాత భూస్వామ్య హేతు విరుద్ధ సమాజాన్ని ప్రశ్నించిన సాహిత్యం - చీకటిగదులు - వంటి నవలలు వచ్చాయి. కానీ ఉత్పత్తిసంబంధాలను మార్చటాన్ని గురించి వాళ్ళు ఆలోచించలేదు.  విప్లవం తెచ్చే మార్పువాళ్ళ  కోసం కూడా కావాలి.   ‘మధ్యవర్తులువంటి కథలు అందుకే రాసాను. సర్వీసురంగం పేర మధ్యతరగతి 50 శాతం కన్నా ఎక్కువగా పెరిగింది. 

భూమి సమస్య కేంద్రంగా మనుషుల ఆరాటపోరాటాలను, విప్లవోద్యమనిర్మాణంలోకి చేరే అనివార్యమైన స్థితిగతులను, రాజ్యహింసను ధిక్కరిస్తూ విప్లవోద్యమాన్ని అంటిపెట్టుకొని సాగే క్రమాన్ని చిత్రించిన -సృష్టికర్తలు’ ,  ‘అడివి మనిషితల్లి చేప, ‘ఒకతండ్రివంటి  కథలు రాసారు కదా! ఆ  కథలు   ఉత్తేజకరమైన ఆశను  , ఆర్ద్రతను  కలిగించాయి.మరి అటువంటి పోరాటంతో ఏ సంబంధంలేని  ‘మనిషిలోపలి విధ్వంసంకథ ఎందుకు రాసారు ?అది ఆద్యంతాలు విషాదమే కదా

భారతీయ ఉత్పత్తి విధానం కోణం నుండి జీవితాన్ని, సామాజిక పరిణామక్రమాన్ని అర్ధం చేసుకొనటం అవసరం. ఈ కథలో రైతు రాజారాం భూస్వామిక వ్యవసాయ విధానం సంక్షోభం మూలకంగా  కొంతకాలానికి కూలీగా మారిపోయి ,అక్కడినుండి ఇంకా దిగజారి, పరాయీకరణకు లోనై, విధ్వంసమై ,భార్య తిరస్కారానికి గురియై ఒంటరివాడు అవుతాడు.  భార్య తీసుకొని వెళ్ళిపెంచి పెద్దచేసిన కొడుకు తన చుట్టూ ఆవరించి ఉన్న కల్లోల సమాజాన్ని, సంక్షోభాన్ని అర్ధం చేసుకోలేక యాతనపడి ,రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొంటాడు. వాడి మరణానికి కూడా మొగుడే కారణమన్నట్లు చూసి,చీదరించుకొని కొడుకు శవాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఆమె. రాజారాం పెళ్ళాంపిల్లలను పోషించలేని అసమర్థుడయ్యాడు , తాగి వచ్చిపెళ్ళాన్ని  కొడుతున్నాడు. ఇల్లూ వాకిలి పట్టక తిరుగుతున్నాడు అని అతని భార్యే కాదు ఎవరైనా  చీదరించుకోవచ్చు , కానీ అతను అలా ఎందుకు తయారయ్యాడన్నప్రశ్న వేసుకొని ఎవరైనా ఆలోచిస్తారాఆలోచిస్తే అది భారతదేశ వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల వైఫల్యం అని అర్ధం అవుతుంది. 

భారతదేశంలోని కోట్లాది రైతుల స్థితి అది. ఇప్పటికీ రైతు పొలందున్ని పంట వేయాలంటే ట్రాక్టర్ల కోసం, ఎరువులు,పురుగు మందుల కోసం, అప్పులకై  షావుకార్ల  చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సివస్తుంది. ఇంత చేసి పండిస్తే గిట్టుబాటు ధరలేక రైతుకు గిట్టేది 40 శాతం మాత్రమే. ఈ ప్రక్రియలో అంతులేని హింసకు, దోపిడీకి గురవుతూ  భూమికి , భార్యా బిడ్డలకుదేనికీ, ఎవరికీ చెందనివాడవుతాడు. ఒంటరివాడవుతాడు. మన ఉత్పత్తి విధానం భూస్వాములకు,పెట్టుబడిదారులకు లాభాలను తెచ్చి పెడుతూ రైతాంగాన్ని నష్టాలకు, కష్టాలకు గురిచేస్తుంది. అది మొత్తంగా మనిషిలోపలి విధ్వంసానికి దారితీస్తున్నది.    విషాద వాస్తవం గురించిన అవగాహన కలిగితే తప్ప ఆస్తి యొక్క అన్నిరకాల  అధికార అభివ్యక్తుల మీద పోరాటాలు నిర్మాణంకావు. కులాలుగా వర్గాలుగా చీలివున్న గ్రామీణ రైతాంగం, రైతుకూలీలు అభివృద్ధి నిరోధకమైన హింసాత్మక ఉత్పత్తివైధానాన్ని అర్ధం చేసుకొని పరిష్కరించే దిశగా ప్రజాపోరాటాల నిర్మాణం జరిగితే కోట్లాదిమంది అలాంటి పోరాటాల్లో సమీకరించబడతారు. ఇప్పటికీ భారతదేశంలో విప్లవపోరాటాలు ఎదుర్కుంటున్నది అతి కీలకమైన నిర్మాణపరంగా సమస్య. 

కమల’, ‘మహాదేవుని కలకథలు కూడా ఉత్పత్తిసంబంధాల వైఫల్యం   చెప్పటానికే రాసాను. భూస్వామి దగ్గర పనిచేసే పాలేరుకిష్టయ్యభూస్వామి కుటుంబానికి చాకిరిచేసే భార్య కమల దాదాపు ఒక స్థితిలో ఉన్నవాళ్లే. ఫలితం లేని శ్రమ, హక్కులు లేని జీవితం ఉత్పత్తి సంబంధాలలోని అసమానతల వల్లనే వాళ్ళ పాలబడ్డాయి. వాటినుండి బయట పడటానికి కిష్టయ్య వంటి పాలేర్లకు వున్న పాటి అవకాశం కూడా కమల వంటి స్త్రీలకు లేదు. భారతదేశంలోని సగభాగం స్త్రీలు విప్లవోద్యమాలల్లోకి రావాలంటే ఈ వైరుధ్యం అర్ధం కావాలి.  

శూద్ర కులాల వాళ్ళు చేయవలసినదిగా చెప్పబడిన వ్యవసాయం మీద అపేక్ష పడిన మహాదేవుడి జీవిత వైఫల్యాన్ని కూడాఉత్పత్తి విధానంలో భాగంగానే   చూడాలంటారా?

కులాల గురించి భారతదేశ పరిణామక్రమం అర్ధం చేసుకోకుండా  చర్చజరుగుతున్న సందర్భంలో రాసిన కథ అది.  మహాదేవుని వెనక మల్లోజుల కోటేశ్వరరావు ఉన్నాడు.ఇంకా చాలామంది మిత్రులున్నారు.  బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన  అతను  వ్యవసాయ సంబంధాలలో , భూ సంబంధాలలో మార్పు కోసం ఎందుకంత తండ్లాడిండు అన్న ప్రశ్ననన్ను చాల వేధించింది.  సమాధానంకోసం సంఘర్షణ పడ్డ. అసలు మనిషికి భూమికి , శ్రమకు వుండే సంబంధం చాలా సహజమైంది. కానీ మనువాద బ్రాహ్మణీయ కుల  వ్యవస్థ కొందరిని శ్రమనుండి దూరం చేసింది. శూద్రులను,దళితులను, మహిళలను  శ్రమ ఫలితాలకు దూరం చేసింది. కులం రీత్యా అగ్రహారాలు పొంది భూములైతే పొందిన్రు కానీ వాళ్ళు భూమితో, శ్రమతో వుండే సహజ సంబంధాన్ని పోగొట్టుకున్నారు.ఆ ప్రక్రియ చాలా హింసాత్మకమైనది. ఆ క్రమంలో మనుషులు విధ్వంసం అవుతారు. మహాదేవ్ లాగా పిచ్చివాళ్లయినా అవుతారు. వాళ్ళ నాయన వలే శ్రమ అగ్రవర్ణానికి అవమానకరమైనదిగా భావించే స్థితికి చేరి పరాన్నభుక్కులుగా నయినా మారతారు.క్రూర హింసాత్మక రాజ్యంగా, ప్రత్యర్థులుగా మారతారు.  భారతదేశ భూస్వామిక సంక్లిష్ట స్వభావాన్ని అధ్యయనం చేయటంలో భాగంగా ఈ కథ రూపొందింది. 

 ‘లక్షలాది మందిని లోలోపల ముట్టుకున్నమనిషి’  గురించినఅతడుకథ లో  ఆ లక్షలాది మందిని మీరు కూడా లోలోపల నుండి ముట్టుకున్నట్లే  అనిపిస్తుంది. మల్లిక ఇంటి నుండి వీధులకు, మార్కెట్ కుమిల్లులకు, తుప్పలకు, హాస్పిటల్ కు, పోలీస్ స్టేషన్ కు, చివరకు శ్మశానానికి, ఆ క్రమంలో  అనేకమంది మంది మనుషుల మనసులలోకి కెమెరాను మార్చి మార్చిఫోకస్ చేస్తూ ఈ కథను గొప్ప దృశ్యకావ్యంగా  చేసారు మీరు. ఈ కథలో  కోట్లాది మానవులను కలిపే ఉత్పత్తి సంబంధం గురించి,అందులోని వైరుధ్యాల గురించి, అవి మనుషులను ఎన్ని భిన్నమార్గాలలోకి నెట్టుకు పోతాయో  భిన్న పాత్రల అంతరంగ ఆలోచనల ద్వారా చూపించిన తీరును గుర్తు చేసుకొంటే  ఉత్పత్తి సంబంధాల మార్మికతను విప్పిచెప్పటమే అంతఃసూత్రంగా కనబడుతుంది. ఏమంటారు?

నిజమే. భూస్వామ్య పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు రెండింటి మధ్యఅతడుపనిచేశాడు. ఆ ఉత్పత్తి విధానాలలోని దోపిడీ, హింస, విధ్వంసం అర్ధం చేసుకొన్నాడు కనుకనే మార్పు కోసం పనిచేశాడు. పాత అమానవీయమైన  భూస్వామిక మానవ సంబంధాలను పునాదులతో కదిలించి ,కొత్త ప్రజాస్వామిక సంబంధాల నిర్మాణాన్ని వేగవంతం చేయటం, భిన్న వైరుధ్యాలలో ఉన్న మనుషులను కదిలించి ఆచరణలోకి తేవటంలో కార్మికవర్గ నాయకుడిగా పనిచేశాడు. అందుకే అతడికి పేరులేదు. అతడు విప్లవాచరణ స్వరూపం. మహాదేవునికలలోని మహాదేవ్ ను,మనిషిలోపలి విధ్వంసం లోని రాజారాం ను, మధ్యవర్తులు లోని నాగేంద్రను, కమలలోని కమలను, ప్రత్యర్థులు లోని రావు ను గతితార్కికంగా, చారిత్రకంగా అర్ధం చేసుకొని వారివారి సంక్షోభాలను, విధ్వంసాలను రూపుమాపి నిర్మాణం చేసే శ్రామికవర్గ పార్టీ అతడు.   

మీరు  ఒక ప్రధాన మంత్రి మానసిక స్థితిని, సంఘర్షణను చిత్రిస్తూప్రత్యర్ధులుకథ రాశారు కదా! ఆ ప్రధాని పివి నరసింహారావు అని తెలుస్తూనే వుంది. ప్రజల సమస్యలు, వాళ్ళు చేస్తున్న యుద్ధాలు అనేకం ఉండగా  అంత పై స్థాయి వ్యక్తి ని కేంద్రం గా చేసి కథ ఎందుకు రాయవలసి వచ్చింది?  

నేనున్న సామాజిక సందర్భం నుండే ఆ కథ వచ్చింది. బ్రాహ్మణీయ అర్ధ వలస , అర్ధభూస్వామ్య  లక్షణం అంతగా ఉన్నవారు పివి తప్ప మరొకరు లేరు. మన శత్రువు గురించి మనకు తెలియకుండా యుద్ధంలో నిలబడలేం. ఈ కథలో ఆదివాసీ నాయకుడి పాత్ర ఒకటి వుంది. అతను ఈ ప్రధానమంత్రి ఒకే వూర్లో పుట్టి పెరిగిన వాళ్ళు. ఒకే కాలంలో  లో ప్రారంభం అయినవాళ్లు ఎక్కడ ,ఎట్లా వేరయిన్రు ? .. వాళ్ళను వేరుచేసింది ఏమిటి? ఉత్పత్తి విధానమే. ఉత్పత్తిచుట్టూ వుండే యంత్రాOగం వాడే భాష వేరు. ఎవడి నాటకం వాడిదే. భూస్వామ్య అర్ధవలస సంబంధం అది. ఆ సంబంధంలో మనుషులు ఎలా ఉన్నారో కూడా మనకు కావాలి. మార్చటానికి సంబంధించిన సన్నివేశంలో మనం ఉన్నాం కనుక వాళ్ళ జీవితాలనుండి అర్ధం చేసుకొన్న వాస్తవికతను రాయాల్సి వుంది. అందుకనే రాసా. 

రాయటం వరకు బాగానే ఉంది. కానీ శత్రువు  మీద కోపం కాస్తయినా కనబరచకుండా  అంతరంగ చిత్రణ చేయటం ఎలా సాధ్యమైంది ?  

కమ్యూనిజాన్ని కనిష్ఠ స్థాయి నుండి గరిష్ఠ స్థాయివరకు అర్ధం చేసుకున్న వాళ్ళు మనిషి మీద కోపం చేయరు. మనిషిని అట్లా మార్చిన ఉత్పత్తి విధాన వ్యవస్థమీద కోపం తెచ్చుకోవాలె. దానిని మనచేతుల్లోకి తీసుకుని మార్చుకొనటం ఎట్లా అనేది నా కథకు లక్ష్యం. అయితే ప్రత్యర్ధులు కథ నిండా  అనేక సామాజిక పరిణామ క్రమపు ఉద్వేగాలు, పతాకస్థాయి ఘర్షణ వున్నాయి. నిజానికి ఈ కథ తాత్వికంగా అత్యంత తీవ్రమైన కథ. కథ మొదలవటమే ఒక ఎన్నికల యుద్ధవాతావరణంలో మొదలౌతుంది. ఎప్పటికైనా అత్యంతదారుణమైన, హింసాత్మకమైన స్థితిలో తమ పతనం జరిగితీరుతుందన్న భయం ఎరుక ఉన్నాయి. 

అయితే అది మీరువసంతగీతంనవలతోనే ప్రారంభించినట్లున్నారు. విప్లవోద్యమాన్ని అత్యంత హింసాత్మకంగా అణచివేస్తున్న  పోలీసులు వ్యక్తులుగా  మానసికంగా ఎంత విధ్వంసానికి గురిఅవుతున్నారో, ప్రేమకుకౌటుంబిక జీవితానికి   ఎలా పరాయీకరణకు గురిఅవుతున్నారో ఈ నవలలో చిత్రించారుకదా !

అవును. నేరం రాజ్యం యొక్క అవ్యక్తరూపం. అది ఆస్తులతో, అధికారంతో పాటు ఉత్పత్తి అవుతుంది.  సున్నితమైన హృదయం ఉన్న మానవుణ్ణి కర్కోటకుడిగా మారుస్తుంది. యుద్ధం నేరవ్యవస్థపైనే. యుద్ధరంగంలో మోహరించిన విప్లవోద్యమాల ఎత్తుగడలు,వ్యూహం ; రాష్ట్రం నుండి కేంద్రం దాకా మోహరించిన రాజ్యపు నిర్మాణాలు చిత్రించనైనది. 

ఈ నవలలో మరొకటి కూడా వుంది.ఉత్పత్తి సంబంధాలలో  అసమానతల వల్ల బాధలుపడేవాళ్లు వాటిని మార్చటానికి పనిచేస్తున్న పార్టీకి ఆకర్షితులు కావటం , నిర్మాణంలోకి పోవటం సహజం. పోయినవాళ్లంతా జీవితకాలం దానినే అంటిపెట్టుకొని ఉండాలనుకొనటం ఆదర్శం. అటువంటి వాళ్ళు ఉన్నారు కూడా. కానీ మనుషులందరూ అట్లాగే ఉండరు. రకరకాల లోపలి వత్తిడులతో, బయటి వత్తిడులతో, వదులుకోలేని 

మోహాలతో నిర్మాణాన్ని వీడి వెళ్లిపోవచ్చు. ఆ విధమైన మనుషులను పిరికివాళ్ళనో, విప్లవ ద్రోహులనో వదిలెయ్యటమో,శిక్షించటమో కాదు చెయ్యాల్సింది. వాళ్ళ రాజకీయచైతన్యం పదునుదేరే వరకు కనిపెట్టుకొని ఉండాలి.ఊగిసలాడేవాళ్ళకొరకు కూడా  ప్రజాసంఘాలు, పార్టీ పనిచేయాల్సి ఉంటుంది. గట్టయ్య జీవిత పరిణామాలు కేంద్రంగా ఇతివృత్తం నడపటం అందుకోసమే.  

భారతదేశ చరిత్రలో ప్రజాపోరాట చరిత్రలో అనేక ప్రాంతాలల్లో తిరుగుబాట్లు , ఉద్యమాలు జరిగి ఇంచుమించు మూడునాలుగు సంవత్సరాలలో అణచివేతకు గురయ్యాయి. తొలిసారిగా చైనాదేశపు విప్లవ విజయం (1931-49) 18 సంవత్సరాలు,  (1967-1985) నుండి నక్సల్బరీ రైతాంగపోరాటంగా నిలదొక్కుకోవటానికి దారులు తీసిన అనుభవం ఈ నవల. 

కొలిమంటుకున్నది నవల నుండి వసంతగీతం వరకు ఈ నలభై ఏళ్ళ లో మీరు రాసిన నవలలన్నీ సమకాలీన రాజకీయార్థిక చరిత్రలే కదాకొమురం భీములో చరిత్రనే ఇతివృత్తం చేసుకున్నారు ఎందుకని

భారత దేశంలో జరిగిన అనేక రైతాంగ పోరాటాలు తగిన స్థావర ప్రాంతాలు లేక నిలదొక్కుకోజాలని నేపథ్యంలో విప్లవోద్యమం ముందు నుండే అడవిలో పనిచేసింది. ఫలితంగా 1976  నాటికి ఆదివాసులలో  భూమి హక్కు చైతన్యం ఉద్యమస్థాయికి చేరుతున్నది.  1981 లో ఇంద్రవెల్లి లో   గిరిజన రైతుకూలీ సభకు సమీకరణ దాని ఫలితమే.  పోలీసు కాల్పులతో ఆ సభ భగ్నమైన ఘటన నన్ను నిద్రపోనియ్యలేదు.అప్పటికే సాహూకు అడవి సుపరిచితం. అడవిని సర్వే చేసి , ఆదివాసీల జీవితాన్ని పరిశీలిస్తూ నోట్సుకూడా  రాసుకున్నాడు . నలభై సంవత్సరాల క్రితపుకొమురం భీము పోరాట చరిత్రతో తెగిపోయిన లింకు ఎక్కడో నరాలను అంటుకొని మండుతూ కలవరపరిచింది. ఆదివాసీల  కథనాలలో దాని జాడలు తెలిసే కొద్దీ ఇంద్రవెల్లి సందర్భం నుండి, ఇంద్రవెల్లిని మరింత అభివృద్ధికరంగా ముందుకు తీసుకు పోవటానికి  కొమురం భీము చరిత్రను నవలగా  రాయటం అవసరం అనిపించింది. రాశాం. ఆ కొమురం భీము పోరాట వారసత్వమే ఇప్పటి  ఆదివాసీ యుద్ధం.ఇప్పటికి ఆరు సార్లు ప్రచురించ బడింది ఈ నవల.  

ఇదివరకు పరిచయం ఉన్నఒక  ఆదివాసీ కుటుంబాన్నిఈ మధ్య కలిసిన.. అప్పుడు చిన్నగా ఉన్న వాళ్ళ  బిడ్డలు ఇప్పుడు కాలేజీ చదువులకు వచ్చారు. వాళ్ళ  అమ్మాయి చేతిలో కొమురం భీము నవల ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. కొమురం భీము నవల చదువుతున్న  ఆ ఆదివాసీ అమ్మాయి ఏమి ఆలోచిస్తున్నది? దానితో ఎట్లా ఐడెంటిఫై అవుతున్నదిఏమైతది? అనే ప్రశ్నలు నన్ను ఇప్పటికీ వేధిస్తున్నయ్. 

ఆదివాసీలు తమ చరిత్రనే కాక సామాజిక పరిణామక్రమాన్నిగతితార్కిగంగా, చారిత్రికంగా అర్ధంచేసుకుని యాభైఏళ్ల సుదీర్ఘపోరాటంలో నాయకత్వంలోకి వస్తున్నారు. జల్ - జంగల్- జమీన్ - అధికార్ నినాదాలతో భారతదేశంలో ఒక శక్తిగా ఎదుగుతున్నారు. భారతదేశంలోని వనరులను, ఖనిజాలను, దళారీ ప్రభుత్వ అండదండలతో దోచుకుపోతున్న బహుళజాతి కంపెనీలకు, సామ్రాజ్యవాదులకు సవాలుగా మనందరి తరఫున నిలబడ్డారు. ఇలాంటి చైతన్యానికి, నిర్మాణానికి,కొమురంభీం ఒక టార్చ్ లైట్ గా పనిచేశాడు. రెండువేల అయిదువందల సంవత్సరాల వలసవాదుల - ఆర్యులనుండి ఆంగ్లేయులదాకా- అల్లిన పుక్కిటి పురాణాల చరిత్రను తిరస్కరించి పోరాడిన ఆదివాసీ, మూలవాసీ పోరాటయోధుడు కొమురం భీం.  

మహిళల పట్ల స్నేహం, గౌరవం, నమ్మకం మీ సాహిత్యంలో అంతఃస్రవంతి. కానీ ఈ విధమైన సంస్కారం  ఈ నాటి సమాజంలో నానాటికీ క్షీణిస్తున్నది. దీనిని మీరెలా వ్యాఖ్యానిస్తారు

బ్రాహ్మణీయ భూస్వామ్య పితృస్వామిక సమాజంలో ఆడవాళ్లను మనుషులుగా చూసే పరిస్థితే లేదు. కమల కథలో కమల లాగా స్త్రీలందరూ ఉత్పత్తి సంబంధాల వైరుధ్యాల మధ్య పితృస్వామిక భావజాలంవలన  అందరికంటే ఎక్కువగా అణచివేతకు, హింస కు గురయ్యారు. సోషలిస్టు దేశాలలో కూడా వాళ్ళను సమానంగా ఎదగనియ్యలేదు. మొదట్లో విప్లవోద్యమం కూడా స్త్రీ సమస్యను అర్ధం చేసుకొనటంలో, పార్టీలోకి తీసుకొనటంలో తడబడిన మాట వాస్తవం. 1985 నుండి స్త్రీల గురించి ఆలోచించటం , స్త్రీల భాగసామ్యం పార్టీలో పెరుగుతూ వచ్చింది. అయితే ఆదివాసీ శ్రామిక దళిత బహుజన మహిళకు ఉన్నంత వెసులుబాటు  మధ్యతరగతి మహిళలకు లేదు. 

            యాభైఏళ్ల భారతీయ విప్లవోద్యమాన్ని బాగా అర్ధం చేసుకున్నవాళ్ళు మహిళలు.వాళ్లు  తాగరు. సమిష్టి జీవితాన్ని కోల్పోలేదు. కుటుంబ నిర్వహణ సామర్ధ్యం , అనుభవం వున్నవాళ్లు. ఆస్తులే లేనివాళ్లు నేరాలు చేసే ప్రసక్తే లేదు అందువల్ల తక్షణ సమస్యల నుండి దీర్ఘకాలిక విప్లవఅవసరాల కోసం కూడా నిలబడగలిగిన శక్తి వాళ్లకే అధికంగా  ఉన్నది. ప్రపంచ విప్లవోద్యమాలల్లో లేనివిధంగా 50 శాతం మహిళలు విప్లవోద్యమాల్లో పోరాడుతున్నారు. 

పసి పిల్లల నుండి వయసుతో నిమిత్తంలేకుండా ,వావి వరసలతో సంబంధం లేకుండా ఆడవాళ్ళ మీద  జరుగుతున్న అత్యాచారాలను ఎట్లా అర్ధం చేసుకోవాలి

భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలు ఎంత మొరటుగా ,వికృతంగా సామాజిక పరిణామక్రమానికి భిన్నంగా ఎంత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయో - ఈ ఘటనలు కొండగుర్తు. తమ సామాజిక వైఫల్యాన్నంతా పురుషులు స్త్రీల మీద చూపిస్తున్నారు. దళితుల మీద జరిగిన స్థాయిలో స్త్రీల మీద దాడులు ఈ రూపంలో సాగుతున్నాయి. పితృస్వామిక బహుముఖాల వికృత రూపమిది. మహిళలు చైతన్యం కావటం, పాత పుక్కిటి పురాణాల బ్రాహ్మణీయ భావజాలం నుండి బయటపడి సంఘటితం కావటం అటు బూర్జువా రాజకీయాలల్లో, విప్లవ రాజకీయాలల్లో ముఖ్యంగా ఉత్పత్తిరంగంలోకి ,ఉద్యోగాలల్లోకి - క్రమంగా ఫ్యూడల్ నిర్మాణమైన కుటుంబంలో పురుషుడు పట్టు కోల్పోవటం - వీటన్నిటి మూలకంగా మనువాద రామాయణం సంకెళ్లు తెగటంతో - రాజ్యం లాగే -పురుషుడు ఫాసిస్టుగా -ముఖ్యంగా బ్రాహ్మణీయ విధ్వంసక ఫాసిస్టుగా మారుతున్నాడు. సృజనాత్మకంగా వుండే మనుషులపట్ల, ఆడవాళ్లు ,పిల్లల పట్ల హింసాత్మక ప్రవృత్తికి దిగుతున్నాడు. మహాద్భుతమైన స్త్రీ పురుషులు విప్లవోద్యమాలల్లో నిర్మాణం కాకుండా నిరోధించటానికి సామ్రాజ్య వాదులు, వాళ్ళ తొత్తులైన ప్రభుత్వాలు,ప్రసార ప్రచార సామాజిక మాధ్యమాలు సెల్ ఫోన్ల లాంటి వాటిలో ఒక అరాచక వికృత హింసాత్మక భావజాలాన్ని అన్నిరకాలుగా ప్రచారంచేస్తున్నారు. 

 వరకట్నపు వేధింపులు, హత్యలు, అత్యాచారాలు మొదలు ప్రభుత్వ విధానాలు,రాజకీయార్థిక సమస్యలు, నిర్వాసితత్వం వరకు  అనేక రూపాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలమీద  పోరాడుతున్న మహిళా సంఘాలు, కుల వివక్షమీద పోరాడుతున్న సంఘాలు  ఈ నాడు అనేకం వున్నాయి.  వీటిని ఎట్లా చూడాలంటారు

బహుముఖాలుగా వ్యక్తమవుతున్న ప్రజాచైతన్యంగా  అర్ధం చేసుకోవాలి. వర్గ కుల లింగ ప్రాంతీయ వైరుధ్యాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయటంలో స్థలకాలాలల్లో అలాంటి వైరుధ్యాలను గుర్తెరిగి ఉద్యమాలు నిర్మించటంలో  విప్లవోద్యమం విఫలం అయింది. ఇన్నాళ్లు గిడసబారి యాభైఏళ్ల విప్లవోద్యమ నేపథ్యంలో అవి  చైతన్యం పొందాయి.  ఆయా వర్గాల ఆగ్రహావేశాల వ్యక్తీకరణ ఈ రకమైన సంఘాలు.

 వాళ్ళ దగ్గరకు  పోవటం ఎలా అంటే భాషను మార్చుకోవాలి. బ్రాహ్మణీయ ఆధిక్యతా స్వభావాన్ని గుర్తించి వదులుకోవాలి. మనకున్న జ్ఞాన తత్వమంతా పుక్కిటి పురాణాల భావవాదమే. భావవాదం తీవ్ర స్థితిలో ఇలాంటి వైరుధ్యాలను పెంచి పోషించి -సుదీర్ఘకాలం మనుగడ సాగించటానికి భారతదేశ భూస్వామ్యం వాడుకున్నది. ఆ తరువాత వచ్చిన ముస్లిములు, మొగలులు, ఇంగ్లీషువారు, ఇప్పటి సామ్రాజ్య వాదులు ఇలాంటి వైరుధ్యాలను వాడుకొని ప్రజలు నిర్మాణం కాకుండా చూసారు. అందుకే దళితులు, ఆదివాసీలు, మహిళల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు.  దళితులు, బహుజనులు, మహిళలు ఈ మాయలో పడకుండా - తమలోపలి వైరుధ్యాలను పరిష్కరించుకొని నిర్మాణం కావాలి. తమవైన ప్రజాపోరాటాలకు నాయకత్వం వహించి, కలిసివచ్చే ప్రజాస్వామిక శక్తులను కూడగట్టుకోవాలి. 

నిజానికి భారతదేశంలో విప్లవోద్యమమంటే -దళిత బహుజన మహిళా ఆదివాసీ మత మైనారిటీల ఐక్యతతో - నాయకత్వంతో  -కార్మికవర్గ దృక్పథం తో నిర్మించుకోవాలి. యాభైఏళ్ల విప్లవోద్యమపోరాటం వాళ్ళ కోసం - వారిదే. భవిష్యత్తు వాళ్లదే. వాళ్ళు విప్లవోద్యమం వేరు కాదు. 

ఇన్ని రకాల సంఘాలు రావటం ఆరోగ్యకరమే.చలన చైతన్యాలతో తొణికిసలాడుతున్న సమూహాలకు శ్రామికవర్గ పార్టీ దగ్గర కావాలి. శ్రమ నుండి ఉత్పన్నమైన జ్ఞానాన్ని, దళితుల ఆదివాసీల,బహుజనుల, మహిళల గతితార్కిక చరిత్రను పునర్నిర్మించాలి. రాజకీయాలనుండి రూపొందిన జ్ఞానాన్నివినిమయం చేసుకోవాలి.

  స్త్రీలది, దళితులది,ఆదివాసీలది భాష సుకుమారం. మనుషులపట్ల గౌరవం దానిలో వ్యక్తమవుతుంది. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయటంలో వాళ్ళే నిజమైన చోదకశక్తులు.    

సమకాలీన తెలుగు సాహిత్యం  గురించి మీ అభిప్రాయం ఏమిటి

తొలి నుండి కన్నడ,మలయాళ,మరాఠీ  సాహిత్యాల వలే జీవితాన్ని పట్టుకున్న సాహిత్యం కాదు తెలుగుసాహిత్యం. బెంగాల్ ,తెలుగు సాహిత్యాలలో కొంత కాల్పనికత, హేతువిరుద్ధత ,రొమాంటిసిజం, అతివాదం ఉన్నాయి.  విప్లవోద్యమ కాలంలో ప్రజల నుండి  రచయితలు వచ్చారు. కానీ ఎక్కువమంది రాలేదు. కవిత్వంలో ప్రజావ్యతిరేక ధోరణులు ఉన్నాయి కానీ ఒక్క కథ కూడా ప్రజావ్యతిరేకమైనది లేదు. ఇప్పటి కథకులు సెన్సిటివ్ గానూ ఉన్నారు, తీవ్ర స్వరంతోను ఉన్నారు. సామ్రాజ్యవాద కంపు కొట్టే సరుకుల సంస్కృతిపై విస్తృతంగా రాస్తున్నారు. విభిన్న వర్గాలను గుర్తెరిగి చీలివున్న ప్రజలను దగ్గరకు తీసుకొని నిర్మాణం చేయగల సాహిత్యం రావాలి. 

మరొక ప్రశ్న ..  సాహిత్యానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం ఉండాలంటారు?  

సాహిత్యం ,రాజకీయం, జీవితం ఈ మూడూ వేరువేరు కాదు.  వీటికి సంబంధించిన పనిలోఆచరణ  అనుభవమే సాహిత్యం. నా కాలంలో, నా స్థలంలో,సకల అనర్ధాలకు మూలమైన స్వంతఆస్తిని రద్దుచేసి నూతన ప్రజాస్వామిక ఉత్పత్తివిధానం నెలకొల్పటం, - తద్వారా సోషలిజం సాధించటానికి మార్గంవేయడంకోసం దీర్ఘకాలికంగా ప్రజలు పోరాడుతున్నారు. అనేక అనుభవాలు గడించారు. కొన్ని అనుభవాలను నా శక్తి మేరకు చిత్రించాను. నా సాహిత్యం కన్నా పురోగమించాల్సిన ప్రజాపోరాటాలను తెలుసుకోవడం, నా వంతుగా నిలబడటం, నా శక్తి మేరకు కృషిచేయడం నా జీవితం. నేను అలంటి ప్రజలను నా సాహిత్యం కన్నా ఎక్కువగా ఇష్టపడతాను. ప్రేమిస్తాను. 

చివరి ప్రశ్న .. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కనీస ప్రజాస్వామిక వాతావరణం కూడా లేకుండాపోయింది. సభలు, సమావేశాలు పెట్టుకునే పరిస్థితే లేదుకదా దీనిమీద మీరేమంటారు ?

            మంచి ప్రశ్న. ప్రత్యేక తెలంగాణ ఏర్పడటమే ఆట,పాట, మాట బందైన నిర్బంధ వాతావరణంలో ప్రజలు ఒక వెసులుబాటు కోసం పెద్దఎత్తున ఉద్యమంలోకి కదలటంతోనే సాధ్యమైంది. అంతకు ముందటి విప్లవోద్యమాల తరహా సభలు,సమావేశాలకన్న భిన్నంగా - ఎక్కడికక్కడ వేలాది లక్షలాదిమంది కదిలారు. ఇతర కారణాలతో పాటు- ప్రజాస్వామిక వాతావరణం కోసం కూడా జరిగిన ఉద్యమది. 

            తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన పరిణామాలు అతివాదానికో, మితవాదానికో లోనై అంచనా వేయటం సరికాదు. స్థలకాలాలల్లో మోహరించిన వైరుధ్యాలను ఎవరు శాస్త్రీయంగా వాస్తవంగా అర్ధం చేసుకుంటారో వారు  ప్రజలతో ఉంటారు. తెలంగాణ ప్రజలు ఉద్యమాలకన్నా ముందున్నారు. మునుపటి ప్రజాసంఘాలు పాత ఆచరణలోనే ఉన్నాయి. 

అయినా ప్రభుత్వాలు విప్లవోద్యమాలను ఆమోదించవు. స్థల కాలాలలో దారులు వెతకటమే ఇంకోపక్క అనేక సభలు,సమావేశాలు దైనందిన విషయాలమీద జరుగుతూనే ఉన్నాయి. ఉద్యమాలు రాజకీయంగా అంటే తక్షణ,దీర్ఘకాలిక లక్ష్యాలను కనిష్ట స్థాయినుండి గరిష్ట స్థాయికి అర్ధం చేసుకుంటీ ఇలాంటిస్థితిని దాటుకుంటాయి.  

 

                                                      --------------------------------------------------

 

              

   

 

 

              

   

 
 

  

 


ఈ సంచికలో...                     

Sep 2021

ఇతర పత్రికలు