ఇంటర్వ్యూలు

(December,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సాహిత్యం షాక్ అబ్జార్బర్ గా పనిచేయాలి - డా.కాళ్ళకూరి శైలజ

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు డా.కాళ్ళకూరి శైలజ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         మీరు సాహిత్యంలోకి ఎలా వచ్చారు ?   

శ్రీమతి వాడ్రేవు వీర లక్ష్మి దేవి గారు, శ్రీమతి మల్లీశ్వరి గారు సంపాదకులు గా వెలువరించిన 'నవ నవలా నాయికలు' అనే పుస్తకం లో ఒక వ్యాసం వ్రాసే సదవకాశం వారు కల్పించారు.  అదే నా తొలి రచన. నవలా నాయికలు వ్యాస సంకలనం లో  'అవతలి గట్టు' అరవింద గారు వ్రాసిన నవలా నాయిక  పై విశ్లేషణ. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,2019).

'చినుకు', 'సారంగ', 'కౌముది', ' కొలిమి','సంచిక', 'విపుల' మేగజైన్స్  లో కధలు ప్రచురింపబడ్డాయి.

 శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారి తో కలిసి  మహాత్మా గాంధీ గురించి వ్యాసాలు వివిధ దినపత్రికల్లో.

'కరోనా' నేపధ్యంలో అస్తవ్యస్త మైన జనజీవనం పై విశ్లేషణాత్మక వ్యాసాలు.                                       

2.         సాహిత్యం వ్రాస్తున్న క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి ?  

చదవడం , వ్రాయడం రెండు విభిన్నమైన విషయాలు.  బాగా వ్రాయడానికి మరింత విస్తృతంగా, లోతుగా,  విశ్లేషణాత్మకంగా చదవాలి.  వ్రాయడంలో సులువు పధ్ధతి అంటూ ఉండదు.  స్పందించే మనసుతో పాటు, ఆలోచన  ప్రయోజనాత్మకంగా, సార్వజనీనంగా ఉండాలి.                        

3.         మీరు సాహిత్యం లోకి రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులు రచయితలు పుస్తకాలు సంస్థల గురించి తెలపండి.   

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, విద్వాన్ విశ్వం గారు,శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు నా జీవన గమనంలో అంతస్సూత్రంగా ఉన్నారు.రష్యన్ సాహిత్యం నాకు చాలా సెన్సిబిలిటీ ప్రసాదించింది.

నేషనల్ బుక్ ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ సంస్థలు ప్రచురించిన పుస్తకాలు దేశం మొత్తం పై అంశాలను సమన్వయపరచేవి గా ఉంటాయి. అవి చాలా ఇష్టం.             

4.           మీరు సాహిత్యం లోకి రాకముందు సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు ? 

అప్పట్లో రచనలు చేయడమంటేఒక జన్మతః వచ్చిన వరం అనుకునే వాళ్ళం.  ఏదైనా కవిత ప్రచురింపబడితే చాలా గొప్పగా ఉండేది.  అవకాశాలు చాలా తక్కువ.

ఇపుడు తెలుగు లో ఎన్నో పత్రికలు,వెబ్ మాగజైన్ లు, అనేక ప్రముఖ పత్రికల్లో సాహిత్యం పేజీ ఇవన్నీ ఒక విశాలమైన వాతావరణం నెలకొల్పాయి.  పైగా అనుభవం గల రచయితలు కొత్తవారిని చాలా ప్రోత్సహిస్తున్నారు.          

5.         మీరు రాసిన కవిత్వం మీకు తెచ్చిన గుర్తింపు గురించి మీరేమి అనుకుంటున్నారు?  

ఎందరో మార్గదర్శకులు, స్నేహితులు పరిచయమై నా జీవితం సుసంపన్నం చేశారు.  కొందరు అభిమాన రచయితలతో ప్రత్యక్ష అనుబంధం ఏర్పడింది.  ఇది తృప్తి ని ఇచ్చింది.

6.         కొత్తగా వెలువడుతున్న కవిత్వం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు?    

మానవ సంబంధాల సంక్లిష్టతను పరిష్కరించడానికి, వ్యక్తిగత అభిప్రాయాల కు పరిమితం కాకుండా సంఘం గురించి ఆలోచన, సహానుభూతి పెంచేందుకు కృషి చేయాలి.  శరవేగంతో వస్తున్న సాంకేతికత మనిషిని మరమనిషిగా చేసి రాబోయే రోజుల్లో మానసిక క్రుంగుబాటుకు దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు.  ఇందుకు సాహిత్యం షాక్ అబ్జార్బర్ గా పనిచేయాలి.            

7.         భిన్న సాహిత్య ఉద్యమాలు  మీ రచనల పై చూపిన ప్రభావం ఏమిటి?   

అన్నిటి కంటే స్త్రీల సమస్యలు,  గ్లోబలైజేషన్ పేరిట సాంస్కృతిక పరాయీకరణ నన్ను బాధ పడతాయి. వీటిని అర్థం చేసుకునేలా సాహిత్య ఉద్యమాలు నాపై ముద్ర వేసాయి.                            

8.         మీ రచనలు పుస్తక రూపంలో కి రావాల్సినవి ఏవి ఉన్నాయి? ఎప్పుడు మీ కొత్త పుస్తకం వస్తుంది?

గాంధీజీ గురించి ఒక వ్యాసావళి త్వరలో వెలువడుతుంది.

ఆ తర్వాత కవిత్వం పుస్తకం వేయాలని ఆశిస్తున్నాను.

 9. స్థానికంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారి గురించి చెప్పండి?

శ్రీమతి వాడ్రేవు వీర లక్ష్మి దేవి గారు కాకినాడ, శ్రీ శిఖామణి గారు యానాం నన్ను ప్రోత్సహిస్తున్నారు.

ఇతర కవులు, రచయితలు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చి నా రచనా వ్యాసంగం ఒక నిర్దిష్టమైన విధానంలో జరిగేందుకు సహకరిస్తున్నారు.

 


ఈ సంచికలో...                     

Sep 2021

ఇతర పత్రికలు