ఇంటర్వ్యూలు

(December,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

నేను వుండబట్టలేనితనం నుంచే రాస్తున్నాను - పల్లిపట్టు నాగరాజు

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు పల్లిపట్టు నాగరాజు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         మీరు సాహిత్యంలోకి ఎలా వచ్చారు ?

నేను సాహిత్యం లోకి రావడానికి దోహదం చేసినవిగా మూడు కారణాలు అనుకుంటాను.

1. నేను ఏ మాత్రం సాహిత్య  వాతావరణం లేని కుటుంబం నుంచి వచ్చాను.  అయితే నా పసప్పుడు మా అవ్వ(నాయనమ్మ)మంగమ్మ ఎన్నో కథలు చెప్పేది.

ఇప్పుడు మనం చెప్పుకునే జానపద కథలు, వీరుల కథలు, హాస్య కథలు, దేవుళ్ళ కథలు, ఇలా చాలా కథలు చెప్పేది. బహుశా మా అవ్వ లాగా మా ఊళ్ళో కథలు ఎవరూ చెప్పరేమో.! ఆ కథల వల్ల నాలో   ఊహించడం వచ్చింది. దేన్నైనా కళాత్మకంగా చెప్పడం అనేది వచ్చిందని అనుకుంటాను.  మా పెద్ద మేనత్త కూడా కథల్ని అద్భుతంగా గానం చేస్తుంది. ఒక సీరియల్ లాగా రోజుల తరబడి కథలు చెప్పగా వినడం నాకు లభించిన అవకాశం. ఇంకా మా నాయిన, పెదనాయినలు అన్నలు వీధి  నాటకాలు ఆడే నేపథ్యం గలవారు.  వాళ్ళు రాత్రి పూట నెలలు తరబడి ప్రాక్టీసు చేస్తుంటే ఆ ఒద్దికల దగ్గర వాళ్ళ తోపాటు వుండే వాణ్ణి.  మా ఊళ్లో పిల్లలు అందరం కూడా అలా రాత్రి ఉన్న దరువుల్ని, పద్యాల్ని పగటి పూట పాడుకుంటూ ఆడుకునే వాళ్ళం. బహుశా ఇవన్నీ నాలో ఏదైనా చెప్పడం, అనుకరించడం అనే నైపుణ్యాలను పెంచాయేమో.

2. వీటితోపాటు నేను పుట్టిన వాతావరణం. కుటుంబం పరిస్థితులు. ఇంట్లో ఆడపని, మగ పని అన్నీ చేయడం అలవాటు.  మా ఇళ్లలో పిల్లలు, పెద్దలు అన్నిట్లో పాలుపంచుకునే వాళ్ళం.  ముప్పై ఏళ్ళ ముందు అన్నీ రకాల ఆటుపోట్లను ఎదుర్కొన్న వెనుకబాటు కుటుంబాలకు ప్రాతినిధ్యం మా కుటుంబం.  వ్యవసాయం చేసుకుని,  కూలీలు చేసుకుని మట్టి ఇళ్ళలోజీవిస్తూ,  గొడ్లు కాచుకుంటూ బతకడం.  కరువు కాటకాలలో, ఆకలి కష్టాల్లో బతకడం, ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉండటం నన్ను కదిలిస్తూ ఉంటాయి. బళ్ళో ఆధిపత్య కులాల పిల్లలకు నాకూ ఏదో ఒక విభజన రేఖ తెలియకుండానే వెంటాడేది. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా ఆలోచింపజేసేవి.

వాటిని నాకు తెలిసిన జానపదగేయాల బాణీలలో పాడుకునే వాణ్ణి.  ఎప్పుడూ రాసింది లేదు.

3. అయితే నా జీవితంలో చదువుకోవడం గొప్ప అవకాశం. ఎందుకంటే మా పూర్వీకుల నుండి చూస్తే కనీసం చదువుకున్న మొదటి తరం మాదే.  మా కుటుంబం లో మొదటిగా హైస్కూలు విద్య పూర్తిగా చవుకున్నది, మొదటిగా కాలేజీని చూసింది నేనే.  మొదటి గ్రాడ్యుయేట్ ని. మొదటి ఉపాధ్యాయున్ని, మొదటి యూనివర్సిటీ చదువరిని,  పరిశోధక విద్యార్థిని కావడం ఆనందంగా ఉంటుంది.  ఇందుకు మా ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారు.  ముఖ్యంగా మా మొదటి టీచర్ అన్నపూర్ణమ్మ.  మా తెలుగు గురువు మునెయ్య సారు.  తెలుగుపట్ల ఒక విధంగా సాహిత్యం పట్ల ఇష్టం కలగడానికి మా తెలుగు సారే కారణం.  ఎనిమిదో తరగతిలో ఛందస్సు  నేర్చుకోవడంతో పద్యాలు  రాయాలి అనే ఆసక్తి కలిగింది. ప్రయత్నం చేసాను కానీ పూర్తి అవగాహన రాలేదు. ఆ యతులు, ప్రాసలు  వేయడం చాలా కష్టంగా ఉండేది. అందుకే గేయాలు రాయడం. అప్పటి సినీమా పాటల్ని అనుకరించి పేరడీలు రాయడం.  సొంతంగా చిన్న చిన్న గేయాలు రాయడం అలవాటు అయింది.  దేన్నైనా ఊహించడం, ఊహించింది కాగితం పై రాయడం నాకు నేర్పింది మాత్రం నా పాఠశాల విద్యనే.  వాటన్నిటిని ఒక నోట్ బుక్ లో రాసి దాచిపెట్టుకోవడం అలవాటు.  ఇదే అప్పటి నుంచి నాతోపాటు సాగుతూనే ఉంది. ఆ కొనసాగింపే సాహిత్యంలోకి నన్ను చేర్చింది అనుకుంటాను.

తిరుపతి లో ఎస్ జి ఎస్ కాలేజీలో డిగ్రీ చేరాక అప్పటిదాకా మా ఊరు చుట్టుపక్కల మాత్రమే చూసి తెలుసుకున్న నేను భిన్నమైన సమాజాన్ని చూడటం,  చదవటం, ఆలోచించండం వల్ల నా దృష్టి, అర్డం చేసుకోవడం మారుతూ వచ్చాయి.

ముఖ్యంగా లైబ్రరీలో పుస్తకాలు.  పాఠాలే కాకుండా ఇతర విషయాలు చదవడం అలవాటు చేశాయి.

నేను మొదటగా శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం చదివింది డిగ్రీలోనే.  క్లుప్తంగా చెప్పాలంటే శ్రామిక కళాతత్వంతో కూడిన కుటుంబ జీవితం, మా నానమ్మ చెప్పిన జానపద కథలు, పాఠశాలలో చదువుకున్న తెలుగు పాఠాలు నన్ను సాహిత్యం  వైపు నడిపించాయి ఏమో అనిపిస్తుంది.            

2.       సాహిత్యం వ్రాస్తున్న క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి ?

సాహిత్యం రాస్తున్న క్రమంలో  నేను జీవిస్తున్న కాలాన్ని  నాకు అర్థమైన రీతిలో అవగాహన చేసుకోగలిగాను.

మారుతున్న సమకాలీన పరిస్థితులు మనం రాస్తున్న సాహిత్యాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తాయని గ్రహించాను.  జీవితాన్ని ప్రతిబింబించే ఏ కవిత్వానికయినా ఆదరణ ఉంటుందని కూడా అర్థం చేసుకున్నాను.             

3.       మీరు సాహిత్యం లోకి రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులు రచయితలు పుస్తకాలు సంస్థల గురించి తెలపండి.

నేను సాహిత్యంలోకి రావడానికి నన్ను ప్రభావితం చేసిన మొదటి అంశం నా పాఠశాల విద్యలోని తెలుగు పుస్తకాలు.  అందులోని కవుల గురించి వారి రచనల గురించి తెలుసుకున్నప్పుడు నేను కూడా నాకు తెలిసి నా నా చుట్టూ ఉన్న విషయాలను గురించి నా ప్రాంతపు జనం మాట్లాడుకునే మాటల్లో రాయాలనుకున్నాను.  అలాగే డిగ్రీలో చేరిన తర్వాత నేను చదువుకున్నటువంటి పుస్తకాలు నన్ను సామాజిక స్పృహతో ఆలోచింపజేశాయి.

శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం,  తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి,,  నేనెంతో ఆరాధించే శివారెడ్డి సారు కవిత్వమంతా నన్ను ఎంతో ప్రభావితం చేసింది.  సార్ తిరుపతి వచ్చినప్పుడు సార్ కవిత్వాన్ని అన్ని సంపుటాలు కొని ఇవ్వడం మర్చిపోలేను.  అలాగే పలమనేరు బాలాజీ సారు, శిఖామణి సారు, యాకూబ్ సార్ ,  ఎండ్లూరి సుధాకర్ సార్, అఫ్సర్ సర్ కవిత్వం నన్ను ఎంతో ఆసక్తిగా చదివించి ఆలోచింపజేసింది.  ప్రముఖ విమర్శకులు జి లక్ష్మి నరసయ్య సారు చెప్పిన ఎన్నో విలువైన సూచనలు కవిత్వం రాయడం పట్ల ఒక స్పష్టతను బాధ్యతను తెలియజేశాయి.  తొలిసారిగా నల్గొండలో కలిసినప్పుడు సార్  కవిత్వ  నిర్మాణ పద్ధతులు, విమర్శకు సంబంధించిన పుస్తకాలు కానుకగా ఇచ్చారు.  అలాగే విశాలాంధ్ర ప్రజాశక్తి, గోదావరి వంటి సాహితీ పత్రికలే కాక వాకిలి, రాస్తా, కొలిమి,  సారాంగ, గోదావరి వంటి ఆన్లైన్ పత్రికలు నా కవిత్వాన్ని ప్రచురించి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాయి.  ఆయా పత్రికల సంపాదకులకు ధన్యవాదాలు. సాహిత్య ప్రస్థానం వారు మొదటిగా నా కవితను శ్రీ శ్రీ శతజయంతి కవితా సంకలనంలో అచ్చులో  చూసుకునేలా చేశారు.  విజయవాడలో జరిగిన యంగ్ పోయెట్ మీట్ కార్యక్రమంలో ప్రసిద్ధుల ముందర కవిత్వం చదివే అవకాశం కల్పించిన సాహిత్య ప్రస్థానం వర ప్రసాద్ సార్ , అన్న కెoగారమోహన్,  జంధ్యాల రఘుబాబు సార్ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు.  వారికి కృతజ్ఞతలు.

తిరుపతిలోని విశాలాంధ్ర బుక్ హౌస్ దగ్గర ప్రతి సాయంత్రం సీనియర్ రచయితలతో కలిసి మాట్లాడి చర్చించుకునే అవకాశం కలిగింది.  అక్కడే ప్రముఖ రచయిత రాసాని గారు,  లైబ్రేరియన్ షణ్ముగం గారు, ఆకాశవాణి మల్లేశ్వరరావు గారు,  మా ముందు తరం రచయిత సుంకోజి దేవేంద్రాచారి గారు, సీనియర్ పాత్రికేయులు కొత్వాలు  అమరేంద్ర గారు పరిచయమై ఎంతో ప్రోత్సహించారు. 

ముఖ్యంగా కవి శివారెడ్డి సార్ తో పరిచయం గొప్ప అవకాశం.  సార్ వల్లే కవి యాకూబ్ సార్, శిఖామణి సారు,  సుగంబాబు గారు, ఆకాశరాజు సారు వంటి సీనియర్ కవులతో వారి కవిత్వంతో సాన్నిహిత్యం ఏర్పడింది.  ఆ పరిచయం నన్ను తెలుగు సాహిత్యంలో కొత్త తరానికి గొప్ప వేదికగా నిలబడిన కవిసంగమం కి పరిచయం చేసింది.  కవిసంగమంలోకి ప్రవేశించక ముందు కొన్ని కవితలు అచ్చు అయినప్పటికీ నేను తెలిసింది కొద్దిమందికే.  కానీ కవిసంగమంలోకి వచ్చి మొదలుపెట్టాక నా కవిత్వంలో ఎంతో పరిణితి వచ్చింది.  కవిసంగమం కొత్త కవులకు ఎంతో నేర్చుకునే, తెలుసుకునే, సరిదిద్దుకునే గొప్ప వేదిక అని నా భావన.  తెలుగు సాహిత్య చరిత్రలో కవిసంగమం పాత్ర ఉన్నతమైనది.  నా కవితా ప్రయాణంలో కవిసంగమం నన్ను ఎంతో ప్రభావితం చేసింది.  నా కవిత్వాన్ని ఎక్కువమందికి చేరవేసింది కవిసంగమం.  ఈ సందర్భంలో కవిసంగమం సారథులు కవి యాకూబ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

4.       మీరు సాహిత్యంలోకి రాకముందు సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు.?

రాకముందు పరిచయం ఉన్న వాటిని మాత్రమే చదువుకొని అదే అని భావించేవాణ్ణి.  సాహిత్యం లోకి వచ్చాక ఎంతో వైవిధ్యాన్ని భిన్న దృక్పథాలని  ధోరణులని నా పరిధిలో నేను అర్థం చేసుకున్నాను.  ఇంకా చదవాల్సింది,  తెలుసుకోవాల్సింది చాలా ఉందని భావిస్తున్నాను.  అప్పటి వాతావరణం గురించి

 కచ్చితంగా చెప్పలేను కానీ, వచ్చాక ఒక పాజిటివ్ వాతావరణాన్ని అయితే చూస్తున్నాను.  ఇప్పుడు వస్తున్న కవిత్వంలో చాలా మటుకు సామాజిక స్పృహ, సమకాలీనతతో వస్తున్నది.  సామాజిక మాధ్యమాల ద్వారా త్వరగా ఎక్కువమందికి చేరుతావుంది. అది ముందు లేదని కాదు కానీ నా అవగాహన మేరకు చెబుతున్నా.

5.       మీరు రాసిన కవిత్వం మీకు తెచ్చిన గుర్తింపు గురించి మీరేమి అనుకుంటున్నారు?

ఏ కళకైనా గుర్తింపు అనేది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తాను.  అది కవిత్వానికి కూడా వర్తిస్తుంది.  నేను కవిత్వం రాస్తున్న క్రమంలో నాకు కొన్ని సత్కారాలు పురస్కారాలు రావడం ఉత్సాహాన్ని ఇచ్చింది.  కవిసంగమం వేదిక ద్వారా మూడు తరాల కవిసంగమంలో అల్లం నారాయణ గారు  వంటి సీనియర్ కవులు సరసన కూర్చుని కవిత్వం చదివే అవకాశం లభించింది.  ప్రభుత్వం వారి జిల్లాస్థాయి ఉగాది పురస్కారం, కలహంస పురస్కారం,  రాథేయ పురస్కారం వంటి  పురస్కారాలు రావడం సంతోషంగా ఉంది.

ముఖ్యంగా నా కవితలు దాదాపు ఒక కవితా సంపుటికి సరిపోయే అన్ని కన్నడంలోకి అనువాదం కావడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇందుకు కారకులైన పద్మ కే రాజ్ అక్కకు, ఎస్ డి కుమార్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

6.       కొత్తగా వెలువడుతున్న కవిత్వం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు?

కవిత్వం ఎలా ఉండాలో చెప్పేంత  అనుభవం లేదు కానీ, సమకాలీనతను సామాజిక స్పృహ కలిగి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.  కవి యాకూబ్ సార్ చెప్పినట్టు చదివి గుర్తుపెట్టుకునే ఒక వాక్యం చాలు అనిపిస్తుంది. అలా ఉంటేనే కవిత్వం అనను కానీ నేను చదువుకుంటున్నది ఎక్కువ ఇదే ఉండటం వల్ల అలా అంటున్నా నేమో!

నా మటుకు నేను జీవిస్తున్న కాలంలో నేను చూస్తున్నది,  వింటున్నది,  సంఘర్షణ పడుతున్నది,  నా బతుకు తాలూకా అనుభవాల్లోంచి రాసే ప్రయత్నం చేస్తున్నాను.  ఇక్కడ నేనంటే నా చుట్టూ ఉన్న సమస్తం అని అర్థం. నేను వుండబట్టలేనితనం నుంచే రాస్తున్నాను. పనిగట్టుకుని రాయడం అంటే నాకు వల్లకాదు.  ఒక్కోసారి వెంటవెంటనే రాస్తాను.  కొన్నాళ్లు రాయాలనిపించదు.  చడవడమంటే ఇష్టం కదా చదువుతూ ఉంటాను.  కవిత్వం, కథలు, నవలలు, చరిత్ర పుస్తకాలు,  విమర్శ వ్యాసాల పుస్తకాలతో  చిన్నపాటి లైబ్రరీ చాలా కాలంగా ఉంది నాతో పాటు.

పుస్తకాలు నన్ను క్రొత్తకొత్త ఆలోచనల్లోకి తీసుకెళ్తాయి.  చెప్పడంలో కొత్తదనం ఉన్న వాక్యాలు మనల్ని వెంటనే ఆకర్షిస్తాయి అనిపిస్తుంది.

7.       భిన్న సాహిత్య ఉద్యమాలు  మీ రచనల పై చూపిన ప్రభావం ఏమిటి?

ప్రతి రచయిత మీద తనకంటే ముందు తరాల సాహిత్యం ప్రభావం ఏ కొంత అయినా ఖచ్చితంగా ఉంటుంది.  భిన్న సాహిత్య ఉద్యమాల, వాదాల  రచనలు చదువుతున్నప్పుడు నా కవిత్వం ఎక్కడ నిలబడుతుందో ఎటువైపు మాట్లాడుతుందో నన్ను నేను అంచనా వేసుకోవడానికి ఒక అవకాశం లభించింది. నేను చదువుకున్న మేరకు అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం  నా వ్యక్తిగత ప్రాంతీయ అస్తిత్వాన్ని గురించి మాట్లాడడానికి ప్రభావితం చేసినట్లు, అభ్యుదయ విప్లవ రచనలు మానవీయ కోణంలో విశ్వ మానవీయతను  అర్థం చేసుకోవడానికి, ఆ దిశగా మాట్లాడడానికి నన్ను కదిలిస్తూ ఉంటాయి.  నా కవిత్వంలో ఈ స్పృహను మరిచిపోను.  భవిష్యత్లో నా రాయలసీమ నేపథ్యంలో దళితసామాజిక నేపథ్యంలో ఇదివరకంటే ఎక్కువగా రాయాలని అనుకున్నాను.        

 8. మీ రచనలు పుస్తక రూపంలో కి రావాల్సినవి ఏవి ఉన్నాయి? ఎప్పుడు మీ కొత్త పుస్తకం వస్తుంది?

నేను పుస్తక రూపంలో తీసుకు రావాలనుకుంది  కవిత్వం మాత్రమే.  అయిదారు కథలు రాయడం జరిగింది.  కానీ కథల  విషయంలో ప్రాథమిక దశలోనే ఉన్నాను.   కాబట్టి కథల జోలికి పోదలుచుకోలేదు.  నేను కవిత్వాన్ని ఇంకా పుస్తకంగా తీసుకురాలేదు. త్వరలో  తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.  ఆ ప్రయత్నం  జరుగుతోంది.  గతేడాది నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆర్థిక పరమైన సమస్యలు కారణంగా అది ఆలస్యం అయింది.

త్వరలో రాబోయే నా పుస్తకానికి మా గురువుగారు కవి శివారెడ్డి గారు అలాగే ప్రముఖ సాహితీ విమర్శకులు జి లక్ష్మి నరసయ్య సార్ గారు ముందు మాటలు అందించిన ఆశీర్వదించారు.  వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.  నా కవితల్ని ఎప్పటికప్పుడు చదివి నా అభ్యున్నతికి తోడ్పడుతున్న కవి సంగమ కవులకు అలాగే నా ఆత్మీయు మిత్రులు అన్నామెట్టానాగేశ్వరరావుకు, నాగిళ్ళన్నకు, మిత్రుడు గోపాల్కు, అన్న కవి విల్సన్ రావ్ గారికి,  ప్రముఖ సీనియర్ కవులు మల్లెల నరసింహ మూర్తికి గారికి,  కవి ఎజ్రా శాస్త్రి అన్నకు - ఇంకా నా కవిత్వాన్ని ఆభిమానించి ఆదరిస్తున్న అందరికీ నా ముప్పిదాలు.

9.       స్థానికంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారి గురించి చెప్పండి?

స్థానికంగా నేను కలుసుకున్న మొదటి సాహితీకారులు మా గురువు గారు ఆచార్య ఎస్జిడీ చంద్ర శేఖర్ గారు.  పి జి చదివేటప్పుడు సార్ ను సాయంత్రాల్లో కలిసి నేను రాసినవి చూపించే వాడిని.  సారు అవసరమైన సూచనలు ఇచ్చేవారు. సారు వాళ్ళ ఇంట్లో కొంతకాలం వున్నాను.  సారు వ్యక్తిగత లైబ్రరీలో వేలాది పుస్తకాలు ఉండేవి.

అక్కడ నచ్చిన పుస్తకం చదువుకునే  అవకాశం లభించింది. అక్కడే భిన్న వాదాల కవిత్వం పరిచయం అయింది.  2012లో మా తెలుగు డిపార్ట్మెంట్ వద్ద జరిగే కవితోత్సవానికి సారే  నన్ను పంపారు.  అక్కడ మా జిల్లాలో రచయితలు కవులు సీనియర్లను, కొత్తవాళ్ళని కలుసుకున్నాను.  అదే నేను పాల్గొన్న మొదటి కవి సమ్మేళనం. అక్కడే పెద్దలు సాకం నాగరాజు సార్, మా పలమనేరు బాలాజీ సార్ వంటి సీనియర్ రచయితలు,  అప్పటికే కవిత్వ రాస్తున్న  నేమిలేటి కిట్టన్న సార్, నడ్డి నారాయణ సార్, విశ్వనాధ సార్ వంటి వారు పరిచయమయ్యారు.  అప్పటి నుంచి వాళ్లంతా నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు.  వారి ఆత్మీయత నాకెంత విశ్వాసం ఇచ్చింది.

ముఖ్యంగా మా బాలాజీ సార్ నా కవితలని వివిధ సంకలనాల్లో ముద్రించేందుకు నన్ను  ప్రోత్సహించి రాయించారు.  నా కవిత్వం అంతా పుస్తకంగా తీసుకురావాలని పదేపదే చెబుతూ ఉంటారు.  ఇంతెందుకు మీ పత్రికతో పరిచయంకి ఇపుడు ఇలా మీతో పంచుకోవడానికి కూడా సారే కారకులు.  అందుకు సార్ కు కృతజ్ఞతలు  తెలుపుకుంటున్నాను. అలాగే కొత్వాలు అమరేంద్ర సార్ ఆంధ్రజ్యోతి జిల్లా సాహిత్య పేజీ లో నన్ను నా కవితా ప్రస్థానాన్ని మొదటిగా పరిచయం చేశారు.

అదే విధంగా తిరుపతిలోని అరసం, తెలుగు భాషోద్యమ సమితి, ఈ తరం కవిత వేదిక,  జిల్లా రచయితల సంఘం సభ్యులు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.  తిరుపతి ఆకాశవాణి కేంద్రం   నా కవితలు చాలా వాటిని ప్రసారం చేసింది.  ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీలో గడిపిన నా నిరుద్యోగ కాలం నా కవిత్వాన్ని చక్కగా మలిచింది.  నాకు కొంత ఎరుకను ఇచ్చింది. ఆ మధ్య కేంద్ర సాహిత్య అకాడమీ వారు యువకవులకు ఇచ్చే విజిటింగ్ గ్రాంట్ కు ఎంపిక కాబడినా పరిస్థితులు అనుకూలించక పోలేకపోయాను. వెళ్ళివుంటే మరికొంత తెలుసుకునే వాడిని. వివిధ ప్రాంతాల్ని సందర్శించడం.  గొప్ప వాళ్ళను కలుసుకోవడం అంటే మనం విస్తృతి కావడమే కదా.  అవకాశం మిస్ అయ్యానని అప్పుడప్పుడు అనిపిస్తుంది.

కుటుంబ సభ్యులు నా మిత్రుల సహకారం, ప్రోత్సాహం నా ప్రయాణంలో ఎంతో గొప్పది.  వారందరికీ ధన్యవాదాలు...

చివరిగా కొత్తకవుల్ని అడిగి మరీ కవిత్వాన్ని ముద్రిస్తూ ప్రోత్సహిస్తున్న మీ పత్రికకు ఇలా మొదటిసారి నా గురించే చెప్పుకొనే వీలు కల్పించినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు సర్...నమస్సులు.

_


ఈ సంచికలో...                     

Sep 2021

ఇతర పత్రికలు