ఇంటర్వ్యూలు

(January,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సమాజం మనల్ని ఎప్పటికప్పుడు పునర్నిర్మిస్తూనే ఉంటుంది – జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి  గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

1.         భీమవరంనుండి చౌడేపల్లె వరకూ కొనసాగిన, సాగుతున్న మీ సాహిత్య ప్రస్థానం గురించిన విశేషాలు చెప్పండి.

మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని కోపల్లె. ఇప్పుడు చూస్తే తాలూకాల్లేవు. కోపల్లె ఏ మండలానికి వెళ్ళిందో లేక అదే ప్రత్యేకమైన మండలంగా మారిందో తెలీదు. మన చరిత్ర్రని మనకి తెలియకుండానే మనకి ఏమాత్రం తెలియనివాళ్ళొచ్చి రాసేస్తారు. అప్పుడు మనది ఏ మండలమో కూడా తెలీకుండా ఇల్లలికిన ఈగలా మారిపోతాం.

ఆరోతరగతో ఏడో తరగతో చదువుతున్నప్పుడు "ఆతడొక్క సువర్ణ మనీషి మనుష్య సంతతిన్" అనే మకుటంతో ఐదు పద్యాలు రాసి ఒకాయనకి అంకితం ఇచ్చాను. ఆయన మనీషి అంటే ఏమిటని అడిగాడు. మనిషి కంటే మనీషి చాలా గొప్పవాడండి అని చెప్పాను. ఆయన నవ్వేసి "ముందు తెలుసుకుని రా" అన్నాడు. అలాంటివన్నీ తెలుసుకోవడం కంటే పద్యాల జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిదని ఊరుకున్నాను. కానీ మా నాన్నగారు ఊరుకోలేదు. నన్ను ఎలాగైనా తనకి వారసుడిగా చెయ్యాలనుకున్నారు. కానీ నేను దేశాలు పట్టిపోయాను. దాంతో ఆయన మార్గదర్శకత్వంలో నడిచే అవకాశం కోల్పోయాను. నేను కోల్పోయినది ఎంత విలువైనదో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

2.         పద్యంతో మొదలుపెట్టిన మీరు మళ్ళీ కవిత్వం జోలికి వెళ్ళినట్టు లేదు.

సాహిత్య ప్రయాణం ప్రారంభైమైంది పద్యంతోనే.  అయినా పద్యాన్ని ఇంతవరకూ నేను అందుకోలేకపోయాను. బహుశా ఎప్పటికీ అందుకోలేనేమో!

ఆ తరువాత ముప్ఫై అయిదేళ్ళవరకూ రాయడం గురించిన ఆలోచనగానీ అవసరంగానీ రాలేదు. నేను పాపిరెడ్డిగారిపల్లె అనే ఊళ్ళో ఉన్నప్పుడు భూమి గుండ్రముగానుండును అని ఓ కథ రాశాను. అది భూమి గుండ్రముగానే ఉండును అని నిరూపిస్తూ అన్ని పత్రికలనుండీ విజయవంతంగా తిరిగి వచ్చాక దాన్నే మరోసారి తిరగరాసి ఉదయానికి పంపిస్తే ఉదయం ఆదివారం అనుబంధంలో అచ్చయింది. అప్పట్లో నామిని చిత్తూరు జిల్లా తిరుపతికి యాసలో రాస్తూండేవారు. నేను కూడా ముష్టూరి మాండలికాన్ని రాయగలనేమో ప్రయత్నం చేసి చూద్దాం అనుకుని వలస దేవర అనే కథ రాశాను. అది అచ్చయింది. దాన్ని చదివిన మధురాంతకం మేస్టారు,"మా వాయల్పాడు యాస బాగానే పట్టినారు. కానీ మీ జొన్నవిత్తులోళ్ళు ఈ పక్కోళ్ళు కాదే" అన్నారు నవ్వుతూ.

3.         అంటే వలస దేవర పేరుతో ఒక కథ కూడా రాశారన్నమాట?

అవును. దాని గురించి మీరు చాలా విపులమైన వ్యాసం కూడా రాశారుగా?

4.         మరి జంగమ దేవర?

వలస దేవర ముష్టూరి జీవితం. జంగమదేవర నా జీవితం.

5.         మరి చౌడేపల్లె?

అది నాకు ఒకప్పటి ఫాంటసీ. ఇప్పటి వాస్తవం. పిల్లల మాసపత్రిక కోసం పనిచెయ్యడం అనేది నేను కల్లో కూడా ఊహించనిది.

6.         మీరన్నీ ఊహించనివే అయ్యారు.

నేను అవ్వలేదు. మీరు చేశారు. తప్పులు చేస్తే సరిదిద్దారు. ఒప్పులు చేస్తే పెన్నుతట్టారు. ఏ సమాజమైనా ఎప్పుడూ ఎవరినీ పాడుచెయ్యదండి. అలాగే ఎంతమంది ఎన్ని రకాలుగా పాడుచేసినా ఏ సమాజమూ ఎన్నడూ చెడిపోదండి. సమాజం మనల్ని ఎప్పటికప్పుడు పునర్నిర్మిస్తూనే ఉంటుంది.

7.         ఇదే విషయాన్ని జంగమదేవర నవల్లో నిరూపించినట్లున్నారుగా?

మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి.

8.         కన్నడంలో కూడా రచనలు చేశారుకదా? ఏయే రచనలు చేశారు? అందుకు దారితీసిన పరిస్థితులేమిటి?

నన్ను కన్నడ రచయితని చేసింది పరిస్థితులే. బుల్లితెర వృత్తి రచయితగా తెలుగులో ఇమడలేని ఒకానొక సందర్భంలో కన్నడంలో అవకాశమిచ్చారు. నేను చేసిందల్లా దాన్ని ఉపయోగించుకోవడం మాత్రమే. ఇంతవరకూ కన్నడంలో నేరుగా రాసినవి రెండు కథలు మాత్రమే. మిగిలినవి అనువాదాలు. నావీ మీవీ మరికొందరు మిత్రులవీను. బుల్లితెరమీద మాత్రం ఎన్నో కార్యక్రమాలకు మాటలు, పాటలు, నిరూపణా సాహిత్యం రాశాను. మనం వాటిని సాహిత్యంగా గుర్తించంగానీ కన్నడిగులు గుర్తిస్తారు. సాహిత్యం విషయంలో వాళ్ళు మనకంటే ఎంతో ముందున్నారని మనం చెప్పుకుంటామేగానీ వాళ్ళు చలం శ్రీశ్రీలతో మొదలు పెట్టి గోరటి వెంకన్నదాకా అన్నిరకాల సాహిత్య ప్రక్రియల్లోనూ మనల్ని ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. మనంత ముందుకు వెళ్ళలేదంటారు. ఇంక సినిమా విషయానికొస్తే తెలుగు సినిమా విడుదలైన సందర్భాల్లో కన్నడ సినిమాకి థియేటర్లు దొరకని సందర్భాలు లెక్కలేనన్ని. ఎదుటివారిని గౌరవించడం ఎలాగో వాళ్ళని చూసే నేర్చుకోవాలి.

9.         కథలూ నవలలూ రెండూ రాస్తారు కదా? ఈ రెండు ప్రక్రియలనూ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?

మీరు కథలూ నవలలూ మాత్రమే కాకుండా కవిత్వమూ సాహిత్యవ్యాసాలూ కూడా రాస్తూంటారు. కాబట్టీ దీనికి సమాధానం నాకంటే బాగా మీరే చెప్పగలరు.

10.       అయినా ఎవరి అనుభవాలు వారివి కదా? మీ అనుభవాలు చెప్పండి.

నవల రాయటం కంటే కథరాయడం కష్టం. అలాగే కథరాయటం కంటే నవల రాయటం కష్టం. కష్టమనుకుంటే ఏది రాయడమైనా కష్టమే. కాదనుకుంటే ఏది రాయడమైనా సులభమే. కథ సూక్ష్మంలో మోక్షం. నవల మోక్షానికి సూక్ష్మం. వలస దేవర అనే పేరుతో ఒక కథ రాశాను. అదొక సంఘటన. అదే పేరుతో నవల రాశాను. అదొక పల్లె జీవితం. ఆ సంఘటనలాంటి సంఘటనలు లెక్కలేనన్ని వస్తాయి నవల్లో. దేనికదే వేరువేరుగా ముత్యాల్లా ఉంటాయి. కూరిస్తే ముత్యాల హారం అవుతుంది.

11.       జంగమదేవర కావడానికి నవలైనా అందులోని యాభై భాగాలూ యాభై కథల్లా ఉంటాయి. ఏ భాగానికాభాగం ఒక కథలాగా రాయడం కష్టం. అలాంటి కథలన్నింటినీ ఒక నవలగా  కూర్చడం ఇంకా కష్టం. అదో సర్కస్ ఫీట్ లాంటిది. దాన్ని మీరు చేసి చూపించారు.

ఒక్కోసారి కథల్లో కూడా లెక్కలేనన్ని ముత్యాలు కూర్చాల్సి వస్తుంది.

12.       మీ కథల్లో చాలావరకూ పెద్దవిగా ఉండటానికి కారణం అదేనా?

అవును. కథ మొదలు పెట్టేవరకూ అది మన చేతిలో ఉంటుంది. మొదలుపెట్టాక మనం దాని చేతుల్లోకి వెళ్ళిపోతాం. అలా తన చేతుల్లోకి తీసుకుందీ అంటే అది సర్వాంగ సుందరంగా బయటకి వస్తుంది. నవల అలా కాదు. అది మొదటినుండి చివరి వరకూ మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టీ మనం ఎంత ఎక్కువ జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కథలో అయినా నవల్లో అయినా అనవసరమైన విషయాల్ని జోక్యం చేసుకోనివ్వకూడదు. మరీ ముఖ్యంగా మనకి తెలిసిన విషయాలన్నింటినీ చొప్పించేద్దామనే తాపత్రయం రెండింటిలోనూ పనికిరాదు. ఎందుకంటే, తనకి ఏవి అవసరం ఏవి అనవసరం అనేవి ఆ రెండింటికీ మనకంటే బాగా తెలుసు.

13.       మీ అనువాద రచనల గురించి తెలపండి

నేను ముందుగా అనువదించింది మీ మాటల్లేని వేళ. ప్రస్తుతం నా కథల్నీ నవలల్నీ కన్నడంలోకి నేనే అనువదించుకోవాలనుకుంటున్నాను. బొళువారు మహమ్మద్ కుణ్హిగారు రాసిన "గాంధి పాపు- బాపు గాంధి ఆద కథె"అనే బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య ఎకాడమీ బహుమతి పొందిన నవలని తెలుగులోకి భలేతాత మన బాపూజీ పేరుతో అనువదించాను. డాక్టర్ చంద్రశేఖర కంబార గారి గుళ్ళకాయజ్జి నాటకాన్ని కూడా తెలుగులోకి అనువాదం చేసాను. డా. డి విజయభాస్కర్ గారి రాజిగాడు రాజయ్యాడు నాటకాన్ని కన్నడంలోకి అనువదిస్తున్నాను.

14.       చదువు గురించి, విద్యావ్యవస్థ గురించి, పిల్లల గురించి చాలా మంచి కథలు రాశారు. ఎందుకా కథలు రాయాలనిపించింది?

చదువుకోవలసిన వయస్సులో చదువునించీ దూరంగా పారిపోయాను. కడుపుకోసం మళ్ళీ ఆ చదువునే ఆశ్రయించక తప్పలేదు. అందరూ చదువుకున్నాక బడిపెడతారు. నేను బడిపెట్టాక చదువుకున్నాను. పిల్లలకి చెప్పడంకోసం నేర్చుకునే చదువు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలకి మూలమౌతుంది. కానీ అలాంటి ఆవిష్కరణలకి తగిన అవకాశాన్ని మన చదువులు ఇవ్వడంలేదు. అందుకు కారణం సమాజానికి కట్టుబడి సున్నం కావలసిన చదువు పెట్టుబడిగా మారిపోవడం. అది రాంకర్స్ ని తయారు చేయడానికే తప్ప సమాజానికి పనికొచ్చే మనుషుల్ని తయారు చేయడానికి ఏమాత్రం పనికిరాదని తేలిపోయింది. కనీసం ఇప్పుడైనా మేలుకుని చదువు కేవలం ఉద్యోగం ఇచ్చే ఉపాధి మాత్రమే కాదు, జీవనోపాధుల్ని ఎప్పటికప్పుడు బహుముఖీనంగా వికసింపజేసే ప్రాణ స్పందన అనే విషయాన్ని గుర్తింపజేయాలి. అది జరగాలంటే మనం ఈ నూరు మార్కుల విషవలయంలోంచీ బయట పడాలి. మనిషిగా పుట్టినవాడు మనిషిగా ఎదగడానికి కావలసింది ఒకటే మార్కు. అదే నూటొకటో మార్కు.

15.       నగర జీవితం మీ సాహిత్య జీవితంపైన చూపిన ప్రభావం ఏమిటి?

నగరం అంటే అన్నిరకాల ఆకర్షణల్నీ కళ్ళముందు ఆడిస్తూనే వీటికి ఆకర్షించబడితే శలభంలా మాడిమసైపోతావని చెబుతూనే ఉంటుంది. చెడిపోయే దారులన్నీ మనకి ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు చెబుతూనే ఉంటాయి. అక్కడ కూడా యంత్రంలా మారిపోకుండా ఉండగలిగితే ఏ సమస్యా లేదు. కానీ చుట్టూ ఉండేవన్నీ యంత్రాలే. మాయలూ మంత్రాలే. వాటినించీ బయట పడటం కష్టం. నగరం అంటే మనుషుల్నీ సంపదల్నీ ఒకే విధంగా సమీకరించే అయస్కాంతం. అయితే అది ఇనుముని తప్ప దేనినీ ఆకర్షించలేదు. అదే పెద్ద విషాదం.

16.       మీరు ఏ ప్రాంతపు రచయిత అని మీరనుకుంటున్నారు? మీరు ఏ ప్రాంతపు రచయితగా గుర్తించబడ్డారు?

మా కోపల్లె ఏ మండలంలో ఉందో నాకు తెలియదు. అలాగే నేను ఎవరి తాలూకావాడినో కూడా నాకు తెలీదు. ఇవన్నీ నేను ఫలానా ప్రాంతానికి చెందుతానా లేదా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు వచ్చే సమస్యలు. అలా కాకుండా నేను తెలుగుతాలూకా మనిషిని అనుకుంటే ఏ సమస్యా ఉండదు. మా పగోజి వాడు అని పిలిచి వేసే పీటగానీ మా చిత్తూరు రాతగాడు అని వేసే పీటగానీ పట్టుచీర అరువిచ్చినవాళ్ళవే తప్ప పట్టుచీరవి కావు.

17.       సాహిత్య పరంగా మీ భవిష్యత్ ప్రణాళికలేమిటి?

తక్షణ ప్రణాళికలు నా సాహిత్యానికి సంబంధించినవి కావు. అవన్నీ మా నాన్నగారు జొన్నవిత్తుల రామకృష్ణ శర్మగారు రాసిన సాహిత్య గ్రంథాలు. వాటిని వెలుగులోకి తీసుకురావడానికి నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. ఇంతవరకూ శ్రీమద్రామాయణ కల్పవృక్ష అంతర్దర్శనం, మనుచరిత్ర ప్రబంధదర్శనం అనే గ్రంథాలొచ్చాయి. వాటికి తగినంత ప్రచారం లభించకపోయినా ఎవరెవరికి చేరాలో వారికి చేరాయి. ఇంకా చేరుతున్నాయి. నాన్నగారి సాహిత్యానికి సంబంధించిన పనులు పూర్తయ్యాక ఒక నవల రాయాలి. దానిపేరు తెలకోవెల. ఈమధ్యలో వచ్చిన కొత్త కథలతో మరో సంకలనం తీసుకురావాలి.

18.       సాహిత్యాన్నివిద్యార్థుల వద్దకు ఎలా తీసుకువెళ్ళాలి?

సాహిత్యానికీ విద్యార్థులకీ మధ్య లంకెని తెంచేసింది మన కార్పొరేట్ చదువులే. అన్ని శాస్త్రాలన్నీ ఆంగ్లంలోనూ భాష దగ్గరకొస్తే తెలుక్కంటే ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు కాబట్టీ సంస్కృతంలోనూ చదువుతారు. ఆ సంస్కృత పండితుల్లో ఎవరికీ యస్యజ్ఞాన దయాసింధో అనగానే మా పాలేరు చెప్పే గోడదాటితే అదే సందో అనడం కూడా రాదు. రామశబ్దం కూడా చెప్పలేరు. కాబట్టీ వాళ్ళదగ్గరకి సాహిత్యాన్ని తీసికెళ్ళలేం. సాహిత్యం అనేది ఒకానొక సామాజిక శాస్త్రం. సామాజిక చరిత్ర. మనకి చదవడం రావాలేగానీ అదో గొప్ప శాస్త్రవిజ్ఞాన సర్వస్వం. కథలు చెప్పాలి. కాకమ్మ కథలో బేతాళ కథలో జానపద కథలో చెప్పాలి. చెబుతూనే ఉండాలి. కథలు చెబుతూంటే వాళ్ళకి అనుమానాలొస్తాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నకొద్దీ మన అవగాహనా పరిధి విస్తృతమౌతుంది.

19.       ఇప్పటి తల్లులు కథలు చెప్పగలరంటారా?

అదే చెప్పబోతున్నది. ఇప్పటి తల్లులంతా దాదాపు కార్పొరేట్ స్కూళ్ళలో చదివినవాళ్ళే. కాబట్టీ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జుండదు. అంతా యూట్యూబులైట్లే. వాళ్ళకి కథల్ని చూపించడమేగానీ చెప్పడం రాదు. కథలు కట్టడం వచ్చిన తరాన్ని మనం వృద్ధాశ్రమాల్లోకి పంపేసి చేతులు కడిగేసుకుంటున్నాం. అందుకే ఈమధ్య నగరాల్లో కథలు చెప్పే కళని  పెంచుకోవడంద్వారా ఉపాధి వెతుక్కునే వాళ్ళు తయారౌతున్నారు. వాళ్ళు చెప్పే కథల్లో ఆకాశంలో ఎగిరే చేపలుండవు. గుర్రాల్తో పోటీపడి పరిగెత్తే నత్తలుండవు. సముద్రాన్ని లంఘించే వానరాలుండవు. అవి లేకుండా కట్టే ఏ కథైనా మన పిల్లల్ని ఆకట్టుకోదు. వాళ్ళలోని ఊహాశక్తిని పెంచదు. సృజనాత్మకతని వెలిగించదు. అవేవీ చెయ్యని కథలు బ్యాంకు లాకర్లలో పెట్టుకోవడానికి తప్ప చేతుల్లో చెలామణీ కావు. కథలే వెళ్ళని బాల్యంలోకి సాహిత్యం ఎలా వెళ్ళగలదు? అయినా సరే. సాహిత్యం పిల్లల్లోకి వెళ్తుంది. మన పిల్లలు చూసే కామిక్సన్నింటిలోనూ సాహిత్యం ఉంది. ఎటొచ్చీ అది సాహిత్యం అనే ఎరుకే లేదు. ఆ ఎరుక కలిగించగలిగితే బొమ్మల్లోంచీ చిత్రాలు మాయమై అక్షరాలు ఆకృతిదాలుస్తాయి.

20.       విద్యార్థులకు సాహిత్యం ఏమేరకు అవసరమంటారు?

చాలా అవసరం. అది లేని లోటు ప్రతి ఇంట్లోనూ చూడచ్చు. అన్నీ న్యూక్లియర్ ఫామిలీసే. అమ్మా నాన్నా కొడుకో కూతురో. అంతే అమ్మానాన్నా ఆఫీసులకెళ్ళిపోతే కొడుకో కూతురో సెల్లులో కూరుకుపోక తప్పదు. వాళ్ళకి ఆటంటే క్రికెట్టే. మాటంటే బుల్లితెర బూతే. అదే మంచివో చెడ్డవో పుస్తకాలు చదవడం మొదలెడితే వాటిద్వారా వారిలోని సృజనాత్మకత జాగృతమౌతుంది. ఆ సృజనాత్మకతే లేకపోతే మన సైంటిస్టులు ఏదీ కనిపెట్టగలిగి ఉండేవారు. లేనిదాన్ని ఉన్నట్టు ఊహించుకోగల సామర్థ్యం ఎక్కడినించొస్తుంది? సాహిత్యాన్నించే కదా? ముందు కలగనటం రావాలి. అప్పుడుగానీ ఆ కలని నిజం చేసుకోవడానికి ఎక్కడ వెతుక్కోవాలో ఎలా వెతుక్కోవాలో తెలియదు కదా! ఈ విషయం అర్థమయ్యేలా చెప్పే అయ్యవారికోసం ప్రతి బడీ ప్రతి ఇల్లూ ప్రతి విద్యార్థీ ఎదురు చూస్తున్నమాట వాస్తవం. ఇదే సరైన సమయం.

21.       వర్తమాన కథలు చదువుతున్నారా?  మీకు ఏమనిపిస్తోంది?

ఎప్పటికథలైనా అప్పటి సమాజాన్నీ భాషనీ సాంస్కృతిక నేపథ్యాన్నీ వివరిస్తాయి. ఇప్పటి కథలూ ఆ పనే చేస్తున్నాయి. చిన్నప్పుడు కథలు విననివాళ్ళు రాసే కథల్లో ఎక్కువగా అభిప్రాయాలూ అనుభవాలే వివరణలూ సమీకరణాలే తప్ప అనుభూతులుండవు. అయినాసరే, ఇప్పటి యువతరం రాసే కథల్లో కొత్తదనం ఉంటోంది. అయితే రాసే యువతీయువకుల సంఖ్యే తగ్గిపోతోంది. ఇంకో పదేళ్ళు పోతే రాయగలవారి సంఖ్య కూడా తగ్గిపోతుంది.

22.       ఎందుకంటారు?

ఎందుకంటే భాష అనేది కేవలం కమ్యూనికేషన్ కి ఉపయోగించే ఉపకరణంగా మారిపోతుంది. అప్పుడు వార్తాపత్రికల భాషకీ సాహిత్యభాషకీ తేడా ఉండదు. అందులోకి అనుభూతుల్ని కుదేస్తే అది రసహీనంగా తయారౌతుంది. నీరసప్రధానంగా మారిపోతుంది.

23.       పాఠకులకి పుస్తకాలు ఎలా చేరువౌతాయి?

మంచి పాఠకులు ఎప్పుడూ తక్కువే ఉంటారు. వారు మంచిపుస్తకాల్ని వెతుక్కుంటూ వెళ్ళి కొనుక్కొస్తారు. ఇంట్లో పెట్టుకుంటారు. బెంగాలీలకీ కన్నడిగులకీ పుస్తకమే హస్తభూషణం. అంచేత వాళ్ళు కొంటారు. చదువుతారు. చిన్నప్పుడు కూడా అద్దె పుస్తకాలే తప్ప కొని చదివే అలవాటు లేదు. ఉన్న సాహిత్యాన్నే చేర్చలేకపోతూంటే లేనిదాన్ని చేరువ చెయ్యడం కష్టం.

24.       ఈమధ్య కోవిడ్ పరిస్థితుల కారణంగా ముద్రణా సాహిత్యంతగ్గి అంతర్జాల సాహిత్యం విస్తృతంగా రూపొందుతోంది కదా, ఈ పరిణామం పట్ల మీ స్పందన, పరిశీలన ఏమిటి?

కోవిడ్ ధర్మమా అని ఆందరికీ కావలసినంత సమయం లభించింది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సాహిత్యం ఉపకరించినంతబాగా మరే కళా ఉపకరించదు. ఈ విషయంతెలిసినవాళ్ళకి పుస్తకమైనా ఒకటే అంతర్జాల సాహిత్యమైనా ఒకటే. పుస్తకమైతే మనం దానిమీద లైటేసి చదువుతాం. అదే అంతర్జాలసాహిత్యమైతే్ మన కంట్లోకి లైటేసి చదివిస్తుంది. సాహిత్యంతోబాటు కంటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉచితం. అందువల్ల పుస్తక సాహిత్యమే ఉచితము.

ఇంకో విషయం ఏమిటంటే లైకుల సాహిత్యంలో లైకింగున్నా ఉండకపోయినా మన పాఠకులెవరో మనకి తెలిసిపోతుంది. కాబట్టీ మిత్రభేదం రాకుండా మిత్రలాభాన్ని పాటించక తప్పని పరిస్థితులు ఎప్పటికప్పుడు మనం రాసే ప్రతి అక్షరాన్నీ నియంత్రిస్తూంటాయి. అదే పుస్తకం అనుకోండి. ఆ పుస్తకానికి పాఠకులెవరనేది మనకి తెలియదు. కాబట్టీ వారికి మన సాహిత్యం మాత్రమే అందుతుంది. ఎవరేమనుకుంటారో ఎవరేమంటారో అనే సమస్య ఉండదు. తెలియని దేవుడికంటే తెలిసిన దెయ్యమే మేలనే సామెత ఇక్కడ పనికిరాదు.

25.       టీవీ రంగంలో మీ అనుభవాలు చెప్పండి.

టీవీ అనేది ఏ ఇంటికైనా ఠీవిని పెంచుతుంది. అయితే మనం చూడాల్సినవాటికంటే చూడాల్సిన అవసరం లేనివే ఎక్కువొస్తూంటాయి. చూడాల్సినవాటిని చూపించడానికి పడే కష్టం కంటే చూడనవసరం లేనివాటిని అలవాటు చెయ్యడానికి పడాల్సిన కష్టమే ఎక్కువ.

26.       టీవీ రచయితగా మీ అనుభవాలేమిటి?

బుద్ధిబలం కంటే భుజబలం ఎక్కువ కావాలి. ఎందుకంటే రోజుకో ఎపిసోడివ్వక తప్పదు. అదివ్వాలంటే రాయాలిగా? మనం ఒకటి రాస్తే ప్రామ్టర్ ఇంకోటి చదివితే ఆర్టిస్టు మరో అర్థం వచ్చేలా ఎక్స్ ప్రెషనిస్తే డబ్బింగాయన తనకి అర్థమైనట్టు పలికితే వచ్చే పంచకూళ్ళ కషాయం చేసింది మనమేనా అనే అనుమానం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. అలాంటి అనుమానాలు లేనివాళ్ళుమాత్రమే రాణించగల రంగమది.

27.       రచయితగా, దర్శకుడిగా వృత్తిపరమైన విభిన్నతల గురించి చెప్పండి.

నాకు టీవీ రైటర్ ఉద్యోగం వచ్చిందని చెప్పగానే వల్లంపాటి సార్ "మీ ఫీల్డులో రాయడం వచ్చినవాడు రైటరవుతాడు, పాడ్డంవచ్చినవాడు సింగరౌతాడు. నాట్యం తెలిసినవాడు డాన్సరౌతాడు. ఏమీ రానివాడు డైరెక్టరౌతాడు. కాబట్టీ మీరు డైరెక్టరయ్యే ఛాన్సే లేదు"అన్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం డైరెక్టరనేవాడు స్టార్ హోటల్లో ఉండే టేస్టర్ లాంటివాడు. సాహిత్యంలో విమర్శకుడిలాంటివాడు. ప్రేక్షకులకంటే ముందే వారి మనసులో కలిగే భావనలను కనిపెట్టి వాటికి అనుగుణంగా అన్నికళలనీ తగుపాళ్ళలో మేళవించవలసినవాడు. కనుక ఆయన అన్ని దేంట్లోనూ ఎక్స్ పర్టై ఉండవలసిన అవసరం లేదు. కానీ అన్నింటిపట్లా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

28.       సాహితీ గోదావరి పాఠకులకు ఏమైనా చెప్పండి.

పాఠకులంటే రచయిత చెప్పకుండా వదిలేసిన ఖాళీలను పూరించుకునే సామర్థ్యం కలిగిన సృజనకారుడు. అంతేకాదు, రచయితల గ్రహణకు రాని ఎన్నో విషయాల లోతులు తెలిసినా ఆ తెలియనితనం గురించి యాగీచెయ్యని సహృదయులు. అలాంటివారికి  నేను చెప్పగలిగింది ఏముంటుంది? అయినా సరే, ఆడిగారుగనుక ఒక్క విషయం గుర్తుచేస్తాను.

అక్షరం అంటే మనల్ని క్షరం కానివ్వకుండా ముందు తరాలకు అందించేది. భవిష్యత్తు ఎక్కడినుండో ఊడి పడదు. చరిత్రలోంచే మనం పుట్టాం. మనమే భవిష్యత్తులో కూడా ఉంటాం. మనం అంటే మీరో నేనో మనవాళ్లో కాదు. మనలోని మనిషితనం. దాన్ని కొనసాగించేదే సాహిత్యం. కాబట్టీ మీరు చదివిన సారాంశాన్ని తప్పకుండా పిల్లలకు అందించండి. అదే మన సాంస్కృతిక వారసత్వ సంపద. తాటాకులుపోయి కాగితాలొచ్చినా కాగితాలు పోయి అంతర్జాలమో మరో వింతర్జాలమో వచ్చినా చివరివరకూ కొనసాగేది అక్షరమే. కాబట్టీ మనిషితనాన్నికూడా అక్షరంగా మననిద్దాం. నమస్తే!!

 

 

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి వివరాలు

 

రచయిత పేరు:  జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

తల్లిదండ్రులు:    జొన్నవిత్తుల రామకృష్ణశర్మ- లక్ష్మీనరసమ్మ

పుట్టిన తేదీ:     10 జనవరి 1962

స్వస్థలం:         భీమవరం

చదువు:         శ్రీ చింతలపాటి బాపిరాజు మెమోరియల్ హైస్కూల్లో పదోతరగతి వరకూ

ఈటీవీ కన్నడంలోనూ, మాటీవీ తెలుగులోనూ రచయితగా ఉద్యోగం చేశాను. ప్రస్తుతం ఖాళీ.

కన్నడ హిందీ ఇంగ్లీషు టీవీ ప్రోగ్రాములకి తెలుగులో డబ్బింగులు రాస్తూంటాను.

ఇంతవరకూ వచ్చిన కథా సంపుటాలు: ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్, ఈ కథకి శిల్పం లేదు, నూటొకటో మార్కు,

నవలలు:        వలసదేవర (అమెరికన్ తెలుగు అసోసియేషన్ తొలి నవలలపోటీలో మొదటి బహుమతి); జంగమదేవర (ఆంధ్రప్రదేశ్ భాషాసాంస్కృతికశాఖ నిర్వహించిన నవలలపోటీల్లో బహుమతి); అంతర్యామి (ఆంధ్రభూమి వీక్లీలో-సీరియల్) సాక్షాత్కారం (ఆంధ్రభూమి మంత్లీలో-సీరియల్) ప్రస్తుతం తెలకొవెల అనే నవల రాస్తున్నాను

అనువాదాలు

తెలుగులోకి:     భలేతాత మన బాపూజీ(కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన కన్నడ బాలల నవల); బాహుబలి విజయం(డాక్టర్ చంద్రశేఖర కంబార నాటకం)


ఈ సంచికలో...                     

Sep 2021

ఇతర పత్రికలు