గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు కందిమళ్ళ లక్ష్మి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ సాహిత్య నేపథ్యం గురించి...
మాది వ్యవసాయ కుటుంబం. మా కుటుంబంలో ఎవరు సాహిత్య పరంగా రచనలు చేయలేదు.. పెద్దమ్మ కూతురు, మేనత్త కూతురు వీళ్ళు ఇద్దరు మాత్రం మా ఇంట్లో నవలలు, వారపత్రికల్లో వచ్చే సీరియల్స్ చదివి చర్చించుకునే వాళ్ళు.. వాళ్ళ చర్చ పక్కనుండి వినే నాకు ఆ పుస్తకాలు చదవాలని అనిపించేది. అలా వాళ్ళ ఇద్దరి వల్ల నాకు చదవడం అనే ఒక అలవాటు అయ్యిందనే చెప్పాలి.
మా మేనత్త భర్త మా స్కూల్ లైబ్రరీ టీచర్ గా వుండటం వల్ల సెలవులలో స్కూల్ లైబ్రరీ నుంచి సాహిత్య పుస్తకాలు తెచ్చుకొని చదివేదాన్ని చాలా.
నా స్నేహితురాలు వాళ్ళకు ఒక బంకు వుండేది. ఆ బంకు లో నవలలు, పత్రికలు, వివిధ పుస్తకాలు అద్దెకు ఇచ్చేవాళ్ళు.. నాకు నచ్చిన పుస్తకాలు తెచ్చుకొని చదివేదాన్ని. అలా హైస్కూలు నుండే సాహిత్యం పుస్తకాలు చదవడం అలవాటు అయ్యింది.
చదవడం అన్నది నాకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఇష్టమైన వ్యసనం.
నాకు స్నేహితులు తక్కువ పుస్తకాలే మంచి నేస్తాలు.
2. మీరు సాహిత్యంలోకి ఎలా వచ్చారు ?
నేను రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సాహిత్యంపై నాకుగల ప్రేమే నాతో ఇలా రాయిస్తుందేమో అని అనుకుంటాను.
ఫేస్ బుక్ లో కొన్ని సాహిత్య గ్రూపులలో చేరాను. ఆ గ్రూపులలో ఎందరో రాసినవి చదివే దాన్ని.. అలా చదువుతున్నప్పుడు నాకు రాయాలనిపించి రాయటం మొదలు పెట్టాను.
నాకు నచ్చినవి నాకోసం నేను రాసుకునే దాన్ని.
నా రాతకు అభిమానం ఆత్మీయత కల్గిన పాఠకులు దొరికారు ఫేస్ బుక్ ద్వారా.. పత్రికల ద్వారా..
కవిసంగమం గ్రూపులోనూ నా కవిత్వం ఎంతో ఆత్మీయ ఆదరణ పొందింది. అదేవిధంగా ఎంతో మంది మంచి కవులు పరిచయమయ్యారు.
నా రచనలు అరుణ తార, గోదావరి, సాహిత్య ప్రస్థానం, రైతువాణి,కొలిమి, నెచ్చెలి,విహంగ,వెలుగు దర్వాజ, తెలుగు వెలుగు, ఇంకా వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
అలా నేను రాసిన వంద కవితలతో 2019లో "రెప్పచాటు రాగం" కవిత్వం పుస్తకం వేసుకున్నాను, కవి, మిత్రుడు 'యశస్వి సతీష్' సహకారంతో..
3. రచనా క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి ?
చాలానే ఎదురయ్యాయి మంచి, చెడు రెండూనూ.. వాటన్నిటినీ పాఠంగా మంచిని తీసుకొని చెడును వదిలేయడం నేర్చుకున్నాను. మరింత రాయాలనే పట్టుదలనుపెంచాయి.
4. మీరు సాహిత్యం లోకి రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులు రచయితలు పుస్తకాలు సంస్థల గురించి తెలపండి.
నేను చదివిన ప్రతి పుస్తకం నాపై ప్రభావం చూపింది.
కథలు రాయాలనే ప్రేరణ కలిగించిన పుస్తకాలు..
ఓల్గా ౼కథా స్రవంతి, అబ్బూరి ఛాయాదేవి ౼తన మార్గం, సత్యవతి కథలు, దర్గామిట్టా కథలు, గోపిని కరుణాకర్ కథలు, మౌని కథలు.
5. మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?
రాక ముందు నేను ఒక చదవరిని మాత్రమే
వచ్చిన తర్వాత అంటే.. కొత్త రచనలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి ఎన్నో సాహిత్య పత్రికలు విశాల దృక్పథంతో
6. మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
నేనెప్పుడూ ఏ గుర్తింపు కోసం రాయలేదు. నా సంతోషం కోసం.. నేను రాసింది నచ్చి చదివేవారికోసం రాశాను..
2018 డిసెంబర్ 17 ప్రజాశక్తిలో "కర్నూలు కవనం" శీర్షికలో"హృదయంలో ప్రవహించే జీవనది" లక్ష్మి_కందిమళ్ళ కవిత్వం అనే వ్యాసం వచ్చింది.
2018 నారీ గళాలు జాతీయ స్థాయి కవయిత్రుల కవిసంమ్మళనంలో ప్రశంసా పత్రం ఇచ్చారు.
2018 కందనవోలు రచయిత్రుల ప్రథమ వార్షికోత్సవం లో. నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంగమం, కర్నూలు జిల్లా శాఖ ప్రశంసా పత్రం ఇచ్చారు.
2019 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన ఉగాది మహోత్సవం కవిసమ్మేళనంలో కర్నూలు కలెక్టరు గారి చేతులమీదుగా ప్రశంసా పత్రం రెండువేల రూపాయల నగదు ఇచ్చారు.
నేను రాసిన ఎన్నో కవితలు, నా కవిత్వ పుస్తకం కు సాహిత్య విమర్శ గ్రూపులో అబ్దుల్ రాజహుసేన్ మాష్టారు మంచి విశ్లేషణ చేశారు.
కవిసంగమంలో రాజారాం తుమ్మచెర్ల మాష్టారు నా పుస్తకంపై మంచి విశ్లేషణ చేశారు. తుమ్మచెర్ల మాష్టారు విశ్లేషణ చేశారు అంటే అది ఏ కవికైనా ఒక గొప్ప పురష్కారంతో సమానం.
తోటి కవులు, రచయితలు కూడా నా పుస్తకానికి చక్కని విశ్లేషణలు రాశారు.
నేను రాసి చదివిన కవితలు రేడియోలో రెండు సార్లు ప్రసారమయ్యాయి.
ఇవన్నీ నాకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చిన ఒక గుర్తింపు అని అనుకుంటాను.
7. కొత్తగా వెలువడుతున్న సాహిత్యం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు?
ఇలాగే ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు.
8. భిన్న సాహిత్య ఉద్యమాలు మీ రచనల పై చూపిన ప్రభావం ఏమిటి?
ఉండొచ్చు, ఉండకపోవచ్చు నేను అంత ఆలోచించలేదు.
9. మిమ్మల్ని ప్రోత్సహించిన సీనియర్ రచయిత ల గురించి మీరు ప్రోత్సహించిన యువతరం రచయితల గురించి చెప్పండి.
నన్ను ప్రోత్సహించిన వారిలో సీనియర్, యువతరం రచయితలు వున్నారు.
కాశీభట్ల వేణుగోపాల్ గారు, వెంకటకృష్ణ అన్న, యశస్వి సతీష్ , ఓల్గా గారు, వాడ్రేవు చినవీరభద్రుడు గారు, వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారు, బొమ్మదేవర నాగకుమారి గారు, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు, పాలగిరి విశ్వప్రసాద్ గారు, అజయ్ వర్మ అల్లూరి, మంజు యనమల అక్క, గోపిని కరుణాకర్ గారు, శిలాలోలిత అక్క, యాఖూబ్ సర్, సిద్దార్థ కట్టా, రాయపాటి శివ,నరేష్కుమార్ సూఫీ,P.B.D.V.ప్రసాద్ గారు, హరికిషన్ సర్, కెంగార మోహన్ గారు, మారుతి పౌరోహిత్యం గారు. ఇంకా ఎంతో మంది తోటి రచయితలు.
ప్రముఖ కవి, రచయిత గౌరవనీయులు కాశీభట్ల వేణుగోపాల్ గారికి నా రెప్పచాటు రాగం కవిత్వం పుస్తకం ఇవ్వాలని పోన్ చేసినప్పుడు నా పుస్తకం కోసం ఎదురుచూస్తూ వున్నానని ఆయన అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. ఆయనను కలిసినప్పుడు.. ఆయన ఆదరణ, మాటల్లోని ఆత్మీయత నేను మరింత రాసేందుకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చాయి. వారి ప్రోత్సాహం నాకు ఆశీస్సులుగా దొరికడం నా అదృష్టం.
ఇక నా ప్రోత్సాహం విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరి రచనలు అభిమానంగా,ఇష్టంగా చదువుతుంటాను.
10. సాహిత్యం ద్వారా సమాజానికి మీరు చెప్పదలుచుకున్న సందేశం ఏమిటి?
సాహిత్యం చదివి సమాజం కచ్చితంగా మారుతుందని అనుకోలేము, ఒకవేళ ఏ ఒక్కరైనా మారినా సంతోషమే.
11. సాహిత్యం సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు?
సాహిత్యం తేజోవంతమైనది, తప్పకుండా గొప్ప ప్రభావితం వుంటుంది. నమ్మకం, ఆశ.
12.కథ కవిత నవల నాటకం విమర్శ ప్రక్రియలలో మీకు ఇష్టమైన ప్రక్రియన ఏమిటి? ఇతర ప్రక్రియల గురించి మీరు ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
ముందుగా కవిత్వం లోకి వచ్చాను. ఒక కవిత్వం పుస్తకం వేశాకే కథలు రాయడం మొదలుపెట్టాను. కవిత్వం కథలు రెండు ఇష్టమైనవి.. ఇక ఇతర ప్రక్రియ ల గురించి ఎందుకు ఆసక్తి లేదు అంటే.. నాకు కూడా తెలీదు/ఏమో..
13. మీకు బాగా నచ్చిన మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాల గురించి చెప్పండి..
చదివిన ప్రతి పుస్తకం ప్రభావితం చేసిందనే చెబుతాను.
నచ్చినవి..చలం "గీతాంజలి ",కేశవరెడ్డి "నవల "అతడు అడవిని జయించాడు",
14. మిమ్మల్ని కలవరపెడుతున్న ఆలోచింప చేస్తున్న సామాజిక పరిణామాలు ఏవైనా తెలపండి.
మానవత్వం కనిపించని సందర్భాలన్నీ కలవరపెడుతుంటాయి.. అలా కలవరపెట్టే ప్రతి సంధర్భం ఆలోచనల నెలవే కదా..