గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకుకుసుమ రవళి విల్లూరిగారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
నా పేరు కుసుమ రవళి.నేను విశాఖపట్నం జిల్లాలో దేవీపురం అనే గ్రామంలో నవంబర్ 26 1999 లో జన్మించాను.నాన్న వ్యవసాయ రంగంలో ఉండగా అమ్మ గ్రుహిణి. అక్క ,అన్నయ్య చదువు పూర్తయి ఉన్నారు.
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
నన్ను బాగా ప్రభావితం చేసిన రచయిత అన్వర్ గారు. ఆయనతో మాట్లాడింది కొన్ని సార్లు అయినా ఎన్నో నేర్చుకున్నా. ఎలా రాయాలో ఎలా సాగాలో ఎలా ఎదుర్కోవాలి అని ఆయన మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఆయన ఇచ్చిన ధైర్యంతో ఉండే సాహిత్యం వైపు అడుగులు వేయగలిగాను...
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?
నా ఎనిమిదవ తరగతి నుంచి రచనలు చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టాను. మొట్టమొదట నేను రాసిన కవిత “ఒక రైతు కోసం”. మొదట అయితే ఏం రాయాలో ఎలా రాయాలో తెలియక ఆలోచిస్తూ ఆరుబయట నక్షత్రాలను చూస్తూ ఒక్కొక్క అక్షరం రాయసాగాను.అలా నా మొదటి కవిత పూర్తి అయ్యింది
4. మీరు సాహిత్యం లోకి రాకముందు,సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?
సాహిత్యం లోకి రాకముందు వరకు రచనలు, కవితలు, కథలు మీద నాకు అంతగా పట్టు లేదు. కానీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. కానీ నేను రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి నా మాటలతో పదాలతో సమాజంలో ఒక్కరైనా మారిస్తే చాలు అని అనుకున్నా. మార్పు వస్తుందో లేదో చెప్పలేకపోవచ్చు కానీ మార్పు నా నుంచే మొదలవ్వాలి అని నిర్ణయం తీసుకున్నా.
5. మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
సాహిత్యం తో వచ్చిన గుర్తింపు నన్ను ఎంతో ఆనందింప చేసింది. ఎవరైనా వచ్చి మేడం బాగా రాశారు అని నాతో అన్నప్పుడు మనసుకి ఎంతో హాయిగా అనిపించేది. ఎందుకంటే నా అక్షరాలు మీ ముందుకి నడిపించేది ఆ మాటలే కాబట్టి..
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?
ఒక విషయం లో మార్పు రావాలి అంటే ముందు మనలో మార్పు రావాలి అన్నాడు ఒక మహానుభావుడు. ఒక రచయితగా నా భావన కూడా అదే. సమాజంలో సమస్యలన్నీ అర్థం చేసుకుంటే సాహిత్యాన్ని అర్థం చేసుకున్నట్లే అని నా అభిప్రాయం....