గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకుగుండేటి సుధీర్గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
నా పేరు గుండేటి సుధీర్. అమ్మ జయ, నాన్న బాబురావు. నాన్న చనిపోయి ఐదేళ్ళు అవుతుంది. అప్పటి నుండి ఊళ్ళో నాన్న పెట్టిన చిన్న చెప్పుల షాప్ ని నడుపుకుంటూ, చదువు కొనసాగిస్తున్నాను.
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
సాహిత్య సంస్థలకన్నా ముఖ్యంగా కళ్యాణ్ రావు పుస్తకాలు, కలేకురి, శివసాగర్ కవితలు నన్ను ఎంతోగాను ప్రభావితం చేసినవి. వాళ్ళ రాతలల్లో మా బతుకులు, బతుకుల పోరాటాలు కనబడ్డవి. అప్పుడే పుస్తకాలతో సాహిత్యాన్ని ప్రేమించాను, అందులో దళిత సాహిత్యం మరింతగా నాకు హత్తుకుంది.
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?
నా చిన్నప్పటినుండి మేము ఎన్నో రకాల పరిస్థితులను ఎదురుకుంటూనే ఉన్నాము. ఐనప్పటికీ వాటిని రాయాలని, మాట్లాడలని సాహిత్యం పరిచయం అయ్యే వరకు, ఏ రోజు నాకు అనిపియ్యలేదు. కానీ బూడిద పళ్ళెంలో బువ్వ తిన్న, తింటున్న బతుకులను, ఆగిపోయిన చిక్కేంటికల కలలను, అలసిపోయిన ఆశలను, బతుకు పోరుజేసీ పోయిన పానాలను ఇప్పుడు రాయకుండా ఉండలేను. నేను ఇప్పటి వరకు రాసిన ఏ రాతలైన ఊహించుకొని రాయలేదు. నాకు అలా రాయడం తెలీదు. ఐనా నేను రాసిన అన్ని రాతలు కూడ జరిగిన, జరుగుతున్న వాటికి నా అక్షరాలను దిష్టి సుక్కలా అద్దాను అంతే.
4. మీరు సాహిత్యం లోకి రాకముందు,సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?
నేను సాహిత్యంలోకి రాకముందు సాహిత్యం అంటే ఏమిటో తెలిదు. వచ్చాక కూడ నాకేమి సరిగా అర్ధంకాక పోయేది. అప్పుడే అనిపించింది సాహిత్యాన్ని ఇంకింత సామాన్య ప్రజలకు చేరువ చేసే సులభతరంగా ఉండాలి అని. ఇది నా అభిప్రాయం మాత్రమే.
5. మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
సాహిత్యం నాకు నేనే వెతుకున్నేలా చేసింది. మనుషులను, వాళ్ళ బతుకులను ఒక శాస్త్రీయ కోణంలో చూసేలా చేసేది. ఇక గుర్తింపు అంటరా, నా కలం పీడితుల పక్షం నిలబడ్డ ప్రతిసారి, అంతకన్నా గొప్ప గుర్తింపు లేదనిపిస్తుంది.
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?
ఆధునిక సాహిత్యమంత రోజు రోజుకి సమాజంలో కొత్తగా పూస్తుంటుంది. కానీ ఆ సాహిత్యమంత ప్రజల పక్షమై చైతన్యాన్ని తెచ్చే దిశగా ప్రస్తుత సాహిత్యం సాగాలని కోరుకుంటున్నాను.