గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు సదయ్య ఉప్పులేటిగారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
నాపేరు సదయ్య అవ్వ పోసమ్మ, బాపు రాయ పోచయ్య.మాది తెలంగాణలోని కొత్తగా ఏర్పడ్డ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లోని పొట్యాల గ్రామం.మా గ్రామం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతం.నాకు ఒక చెల్ల ఒక తమ్ముడు.మా ముగ్గురిని కూలి పని చేస్తూనే ఉన్నత చదువులు చదివించారు మా అవ్వ బాపులు. మా పాఠశాల విద్యాభ్యాసం అంతా మా ఊరి లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. నిజానికి నేను చదువురాని ఒక మొద్దును. చిన్ననాటి నుంచే నాకు ఆత్మవిమర్శ ఎక్కువ అనుకుంటా. తొమ్మిదో తరగతి కి రాగానే నా లోపాన్ని నేను గుర్తించి చదువు మానేస్తా అనంగానే నా మిత్రుడు తొమ్మిది దాకా వచ్చావు కదా ఆయింత పదవ తరగతి చదువు అని సలహా ఇవ్వటం. తర్వాత కష్టపడి చదవడం నా గురువులు నాకు చదువు మీద ఆసక్తి పెంచడం వల్ల నేను పీజీ దాకా చదవగలిగాను.ఈ మద్యే 29.01.2017 నాడు మా బాపు మిషన్ భగీరథ పైప్ లైన్ల పడి మెడలు విరిగి మంచాన పడడం వల్ల మా బాపును చూసుకుంటూ, ఉన్న ఎకరం పొలం చేసుకుంటూ దొరికినప్పుడు కూలి పనికి పోతాను.మా అవ్వ, నా సహచరి హేమలత లు కైకిల్ పనికి పోతే ఇల్లు గడుస్తుంది. మొన్ననే మా తమ్మునికి ఎస్ ఎస్ సి లో జాబ్ వచ్చింది. కొంతవరకు సంతోషం.
2.మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు,రచయితలు,పత్రికలు,పుస్తకాల గురించి తెలపండి.
నేను డిగ్రీ చేస్తున్నప్పుడు వరంగల్ లో ఉన్న "గోదావరి సాహితీ మిత్రులు" ఆవిష్కరించిన “మా భూమికోసం, మా హైదరాబాద్ కోసం” అనే కవితాసంపుటి రిలీజ్ కార్యక్రమానికి నేను నా మిత్రులు కలిసి పోయినం. అక్కడ చాలామంది పేరుమోసిన కవులు రచయితలను చూసి ఆనందించాను.తర్వాత నేను వరంగల్లో యం.ఏ తెలుగు చేస్తున్నప్పుడు మాకు నాలుగు సెమిస్టర్లో కలిపి స్త్రీ,వాదం దళిత వాదం, అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం అన్ని రకాల కవిత్వ వాదాలు వుండేటివి.అందులో భాగంగానే నందిని సిద్ధారెడ్డి గారి “ప్రాణహిత” కవిత్వం చదివి సార్ తో మాట్లాడాను. సార్ చాలా అనుకూలంగా స్పందించి నా సందేహాలు తీర్చాడు. “భవిష్యత్ చిత్రపటం” వివి సార్ ది సిలబస్లో చదివాక అనుకోకుండా విరసం సభలు జరగటం అక్కడ వివి సార్ ని చూసి ఆనందానికి గురి కావడం జరిగింది. “కొలిమి అంటుకున్నది” నవల కూడా మా సిలబస్లో భాగమే. అల్లం రాజయ్య గారిని కలిసి మాట్లాడినప్పుడు నవల గురించి చెబుతూ రాయటం లో మెలుకువలు చెప్పిండ్లు.“జానకి విముక్తి” నవల చదివి మా చుట్టుపక్కల ఆడవాళ్లకు జరుగుతున్న ఒత్తిడిలు పోల్చుకుని చాలా బాధపడ్డాను. సిలబస్లో భాగంగానే దిగంబర కవిత్వం చదవడం జరిగింది. అట్లాగే చంగిజ్ ఖాన్,రెయిన్ బో, నల్ల నరసింహులు నా అనుభవాలు, కొమురం భీం దొరికిన ప్రతి పుస్తకం చదవడం జరిగింది. ఇట్లా అనేక రకాల రచయితలు సంస్థలు పుస్తకాలు నా మీద ప్రభావం చూపించాయి అని నేను గర్వంగా చెబుతాను
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.?
నా తల్లి సంకలో ఉన్నప్పుడో, నాకు తెలిసి తెలియని వయసులో జరిగిన సంఘటనలో కానీ స్త్రీలపై అణిచివేత దళితుల మీద ఒత్తిడి, దొరల దోపిడీతనం వల్ల దళిత కుటుంబాలైన మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది.దొరల ఇళ్లల్లో పొలాల్లో ఎట్టి చాకిరి చేసిన అనుభవం మా అవ్వకు బాపుకు ఉన్నది. వారు ఏదో ఒక్క సమయం లో పడ్డ కష్టాలు వేరే వాళ్ళతో నెమరు వేసుకున్న సందర్భంలో నేను విని చాలా చలించిపోయాను. దొరల ఆగడాలు చూడలేక వారికి వ్యతిరేకంగా కొట్లాడిన వారిని అవ్వ సంకలో ఉండి కొంత చూసిన. ఈ చరిత్ర పరిచయం ఉన్నవారు ప్రత్యక్షంగా పాల్గొన్న వారు చెప్పినప్పుడు విన్నాను.ఇవన్నీ నేను పీజీ చేస్తున్నప్పుడు ఆయా రచయితలు చెప్పిన పద్ధతులు ఇని మనం కూడా రాయవచ్చు కదా అనే ఆలోచన వచ్చి విన్నవి , కన్నవి కథలు రాయడం ప్రారంభించాను.
4. మీరు సాహిత్యంలోకి రాకముందు, సాహిత్యంలోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తారు.
నా సాహిత్య ప్రవేశం గమ్మత్తుగా ఉంటది.నేను ఇంతకు ముందు చెప్పినట్టు నా పాఠశాల వయసులో చదువులో మొద్దును. అయితే మా గురువుగారు నాకు ఎనిమిదో తరగతిలోనే ప్రపంచ రాజ్యాల సంగ్రహ చరిత్ర, కన్యాశుల్కం, అసమర్ధుని జీవయాత్ర,మహాప్రస్థానం పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు. పాఠ్య పుస్తకాలు పక్కన పారేసి ఈ పుస్తకాలు చదవడం మొదలైంది. అసలే చదువంటే ఇష్టం లేని నేను చాలా ఆసక్తిగా చదవడం జరిగింది. నిజానికి నాకు సాహిత్యం అంటే పీజీ లోకి వచ్చేవరకు ఏంటో తెల్వదు.బీఈడీ చేస్తున్నప్పుడు ద్రావిడ విశ్వవిద్యాలయంలో తుని నుంచి మిత్రుడు గణేష్ మీ తెలంగాణ సాహిత్యం బాగుంటది సదా. తెలంగాణ పాట పాడమని అడిగితే దరువు ఏస్తూ తెలంగాణ పాటలు పాడే వాడిని.అప్పుడంటే 2011లో తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా జరుగుతున్నది. నాకు అప్పటికే ధూమ్ దాం ప్రోగ్రాం చేసిన అనుభవం ఉన్నది.అయితే చాలా అమాయకంగా గణేష్ ని సాహిత్యం అంటే ఏంటిదని అడిగేవాడిని. తాను అన్ని చెప్పేది. కానీ నాకు అర్థం అయ్యేది కాదు. వరంగల్ ckmకాలేజీలో యం. ఏ తెలుగు చేస్తున్నప్పుడు సాహిత్యం అంటే పూర్తిగా అర్థం అయింది.
సాహిత్యం లోకి వచ్చినంక, సాహిత్యం పరిచయం అయినంక మానసిక దృఢత్వం పెరిగింది. ఏ బలం లేనోళ్లు, అన్నం లేని వాళ్ళు అంత పెద్ద రాజ్యంతో తలపడుతున్నారు అంటే అది కేవలం సాహిత్యం అందించిన మానసిక బలమే అనుకుంటాను.
5. సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
నేను రాసినవి చాలా తక్కువ. గోదావరి సాహిత్య పత్రిక, నేను రచయితగా ఒకేసారి పుట్టినం. నేను రాసిన మొట్టమొదటి కథ “నిప్పు కణిక” గోదావరి ప్రారంభ సంచికలో వచ్చింది. అదే విధంగా నా కథలు, కవితలు అన్నీ గోదావరి పత్రికలనే వచ్చినయ్. “దొరల పంచాతు” కథ చదివి కేతిరెడ్డి సార్ ఫోన్ చేసి మాట్లాడారు."ఉడో"కథ చదివి పి. చందు సార్ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. “నక్క తోక”,”సంఘర్షణ” కథలు చదివి మిత్రులు అల్లం రాజయ్య సాహిత్యం మీకు ఇష్టమా అని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే నేను గుర్తింపు కోసం మాత్రం రాయలేదు. నేను రాస్తాను అని కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారు?
ఇప్పటి జనరేషన్ మీద సినిమా ప్రభావం పడటం మూలంగా కొంత సాహిత్యం చదివేంత టైం కేటాయించడం లేదని నేను అనుకుంటున్న. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక దాని మీద స్పందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం జరుగుతుంది.వారంతా సీరియస్ గా చదివి రాస్తే మాత్రం చాలామంది మంచి కవులు, రచయితలు బయటికి వస్తారు. ఇప్పటికే పేరుమోసిన వారి గురించి పక్కన పెడితే కొత్తగా రాస్తున్న యువకుల కొంతమంది రచనలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటున్నాయి.చెప్పే విషయాన్ని కొత్త కొత్త కోణాలలో చెపుతున్నారు.మన ముందు సాహిత్యం చదువుతూ మన రచనలకు దారులు వేసుకోవాలి. మనం నివసిస్తున్న సమాజంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా అదే సమాజంలో నుంచి వస్తువులు తీసుకుని అదే సమాజానికి చెప్పాలి.