ఇంటర్వ్యూలు

(November,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

మనిషిని మనిషిగా గుర్తించేలా చేసే ప్రతిదీ ఉత్తమ సాహిత్యమే - సుంకోజి దేవేంద్రాచారి

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు సుంకోజి దేవేంద్రాచారి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ                                                 

1.         మీ బాల్యం మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి

మా అమ్మానాన్న సుంకోజి ఈశ్వరమ్మ, సుంకోజి రెడ్డెప్పాచారి. స్వస్థలం చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం గుడ్రెడ్డిగారిపల్లె. మా నాన్న నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు అమ్మను, ఐదేళ్ల వయసులో నాన్నను కోల్పోయాడు. అమ్మమ్మ ఇంట పెరిగాడు. పెళ్లయ్యాక బతుకుతెరువు వెతుక్కుంటూ కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ చెరువుముందరపల్లెకు చేరుకున్నారు. నేను, మా అక్క అక్కడే పుట్టాం. తీవ్ర కరువు నేపథ్యంలో నాకు రెండేళ్ల వయసులో తిరిగి సొంతూరు వచ్చేశారు. నాన్న బాల్యంలో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఉన్న ఆస్తులన్నీ పోయాయి. తర్వాత సొంతూరులోనే కౌలుకు సేద్యం చేస్తూ కొయ్యపనితో జీవిత నౌక నడిపారు. నాకు అక్క, ఇద్దరు తమ్ముళ్లు. అందరికీ వివాహాలయ్యాయి.

నా బాల్యమంతా పల్లెటూరులోనే సాగింది. నా చిన్నప్పుడు మా ఊరికి దగ్గరలోని బంజరుభూమిలో రాళ్లు తొలగించి, కంపచెట్లు కొట్టి కాస్త నేలను సాగుయోగ్యంగా మలిచారు అమ్మానాన్న. అందులో మేము చాలా రకాల పంటలు పండించాం. వేరుశనగ, వరి, రాగులు, నువ్వులు, ధనియాలు, మిరప, సజ్జ, టమాటా, ఎర్రగడ్డలు, అలసంద, కంది.. ఇలా. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం పనులు చేస్తూ పెరిగాను. విత్తనం విత్తడం దగ్గర నుంచి కోతలు కోయడం వరకు.. మడకతో దున్నడం మొదలు ఎడ్లబండి తోలడం వరకు.. వ్యవసాయంలో అన్ని పనులూ చేశాను. నాన్నతో పాటు స్కూలు రోజుల్లోనే కొయ్యలు కోసేదానికి వెళ్లేవాడిని. పదమూడేళ్ల వయసులోనే పాతికేళ్ల యువకుడు చేయగలిగినంత శారీరక శ్రమ చేసేవాడిని. నాకు కొండలు గుట్టలు ఎక్కడం అంటే ఇష్టం. ఈత కొట్టడం చాలా సరదా. ఇంట్లో ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులున్నా.. బాల్యమంతా సరదాగానే గడిచిపోయింది. ఆ వయసు అలాంటిది.

2.         మీకు సాహిత్యం అంటే ఆసక్తి ఎప్పుడు ఎలా ఏర్పడింది?

మా అమ్మ చదువుకోలేదు. కానీ తను అద్భుతమైన కథలు చెబుతుంది. నా చిన్నప్పుడు రోజూ రాత్రిపూట మా అమ్మ కథతోనే నిద్రపోయేవాడిని. నాన్న కూడా కథలు చెప్పేవాడు. మా మేనమామలు రాజగోపాలాచారి, బ్రహ్మయ్యాచారి, మా పెద్దమ్మ లక్ష్మీదేవి అద్భుతమైన కథకులు. మా ఊర్లో కాదరిల్లి (ఖాదర్‍ వల్లి) తాత, బడేసాబ్‍ ఉండేవారు. వీళ్లిద్దరూ వారంలో మూడునాలుగు రోజులైనా మా ఇంటికి వచ్చేవాళ్లు. ఇంటి ముందు అరుగుమీద కూర్చుని వారి జీవితానుభవాలను కథలుగా చెప్పేవాళ్లు. అవి బాల్యంలో వినడం చాలా బాగుండేది. (వారు చెప్పేవాటిలో కొన్ని అతిశయోక్తులని నాకు పెద్దయ్యాక తెలిసింది. అయినా ఆ కథలు చాలా గొప్పేగా చెప్పేవారు). బడేసాబ్‍ భార్యను అవ్వ అని పిలిచేవాడిని. ఆమె ముగ్గురు మరాఠీలు, సాసవల చిన్నమ్మ, మాయలఫకీరు.. కథలు చెప్పేది. మా పక్కింటిలో ఉండే చోటీ ఒకే కథను రోజూ చెప్పేది. అది హాస్య కథ. కాదరిల్లి తాత కొడుకు పీరాంసాబ్‍ మంచి జానపద కథలు చెప్పేవాడు. పొలంలో వేరుశనగ కాయలు ఒలిచేదానికి వెళ్లామంటే రోజంతా కథ చెప్పేవాడు. ఒక్కోసారి ఆ కథ రోజంతా చెప్పినా అయిపోయేది కాదు. తరచూ మా ఇంటికి రాత్రి వేళ మా వీధిలో ఉండేవాళ్లు.. ముఖ్యంగా సాయుబులు ఆడామగా అనే తేడా లేకుండా వచ్చేవాళ్లు. అర్ధరాత్రి దాకా కథలతో సందడిగా ఉండేది.

చిన్నప్పటి నుంచి ఇలాంటి వాతావరణంలో పెరగడం వలనేమో నాకు బాల్యంలోనే కథలంలే ఆసక్తి ఏర్పడింది. వినడం, నేనూ నా తోటి పిల్లలకు చెప్పడం వలన నాకు పదేళ్ల వయసుకే.. దాదాపు వందకు పైగా కథలు వచ్చేటివి. మా పక్కన ఇంటిలో సురేంద్రరెడ్డి అనే అతను ఉండేవాడు. నాకంటే ఏడెనిమిదేళ్లు పెద్దవాడు. తను పుస్తకాలు బాగా చదివేవాడు. తన వద్ద ట్రంకుపెట్టె నిండుకు పుస్తకాలుండేవి. వాటిని చూస్తే నాకు పెద్ద నిధిలా అనిపించేది. నేను తరచూ వాటిని చదివేవాడిని. అతని దగ్గరే అసమర్థుని జీవయాత్రనవల మొదటిసారి చదివాను. ఇంట్లో బడిపుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు చదివితే నాన్న అరిచేవాడు. ఇలా ఒకసారి అసమర్థుని జీవయాత్ర చదువుతూ నాన్నకు దొరికిపోయి దెబ్బలు తిన్నా. చెప్తే ఆశ్చర్యపోతారు.. నేను రెండో తరగతి సెలవుల్లో చదివిన మొట్టమొదటి నవల బాటసారి’. ఆ వయసులో అర్థం కాకపోయినా.. నన్నెందుకో అక్షరాలు పిచ్చెక్కించేవి. పుస్తకాల వెంట పరుగులు తీయించేవి. బహుశా.. పేదరికం కారణంగా ఇంట్లో పుస్తకాలను కొనలేని స్థితి కూడా ఈ పుస్తకాల పిచ్చికి ఒక కారణమేమో. ఇప్పుడు మా ఇంట్లో వేల పుస్తకాలున్నాయి. నెలలో ఇప్పటికీ కనీసం వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా పుస్తకాలు కొంటుంటాను.

నేను ఆరో తరగతి చదివే రోజుల్లో మా కేవీపల్లెలో లైబ్రరీ ఏర్పాటు చేశారు. అందులోని పుస్తకాలను చూడగానే నాకు పెద్ద నిధి దొరికినట్టు అయింది. 15 రూపాయల మెంబర్‍ షిప్‍ కడితే ఇంటికి పుస్తకాలు ఇచ్చేవాళ్లు. మెంబర్‍ షిప్‍ కట్టే పరిస్థితి మాకు లేదు. దీంతో సెలవు ఉందంటే చాలు నా కేరాఫ్‍ అడ్రస్‍ లైబ్రరీగా మార్చేసుకున్నా. మాకు సాయంకాలం గంటసేపు ఇంటర్వెల్‍ ఉండేది. పీఈటీ లేరు. దీంతో రోజూ ఆ గంట సేపు లైబ్రరీలో గడిపేవాడిని. అందులోని పుస్తకాలన్నీ రెండుసార్లు చదివేశా. ఇవన్నీ కూడా నాకు తెలీకుండానే నాలో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచాయి.

3.         మీ సాహిత్య ప్రస్థానం గురించి...

నేను ఐదో తరగతిలో ఉండగా గడ్డిపరకఅనే కథ రాసి చందమామకు పంపాను. ఆ కథ చేరిందో లేదో కూడా తెలీదు. నేను ఐదో తరగతిలో ఉండగా చదివిన మొట్టమొదటి డిటెక్టివ్‍ నవల ఆపరేషన్‍ ఇన్‍ చైనా’. మధుబాబు నవలలు విపరీతంగా చదివేవాడిని. అందులోని షాడో పాత్ర అంటే అప్పట్లో విపరీతమైన క్రేజ్‍. దాంతో నేనే ఏడో తరగతిలో ఉండగా నా హీరోకు డబుల్‍ షాడో’ (షాడోకన్నా రెండింతలు బలవంతుడని అర్థం నా ఉద్దేశంలో) అని పేరు పెట్టి ఒక డిటెక్టివ్‍ నవల రాసే ప్రయత్నం చేశాను. నేను ఏడో తరగతి ఫస్ట్క్లాస్‍లో పాసయ్యాక ఇతర పుస్తకాలు చదివే విషయంలో ఇంట్లో ఆంక్షలు తొలగిపోయాయి.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మా తాతగారు ముగ్గురు. పెద్ద తాత, రెండో తాత నాటకాలు వేసేవారు. సేద్యం చేసేవాళ్లు. రెండో తాత పెళ్లి కూడా చేసుకోలేదట. నాటకాలే లోకంగా బతికాడు. మా నాన్న నాన్న చివరి వాడు. ఆయన వైద్యం చేసేవాడు. ఉస్తికాయలపెంట అనే ఊరికి కరణంగానూ పనిచేశాడట. మానాన్నకు ఐదేళ్ల వయసు వచ్చేప్పటికే వీళ్లందరూ చనిపోయారు. అంటే నేను చెప్తున్నది సుమారు 70ఏళ్ల నాటి సంగతి. మా తాతల వారసత్వం నాకూ వచ్చిందని ఇంట్లో అంటుంటారు. ఇక మానాన్న మంచి పాటగాడు.

నా మొదటి కథ భూమి గుండ్రంగా ఉంది’ 1998 మార్చి నెలలో స్వాతి వారపత్రికలో వచ్చింది. అయితే దీనికంటే ముందుగా బంగారు పంజరంఅనే కథం 17 మార్చి 1997 వార్త దినపత్రికలోని సోమవారం నాటి చెలిఅనుబంధంలో వచ్చింది.

4.         ఇప్పటి వరకు వెలువడిన మీ రచనలు, అముద్రిత రచనల గురించి...

ఇప్పటి వరకూ దాదాపు వంద కథలు రాశాను. కవితలు కూడా కొన్ని రాశాను.  పల్లెల్లో ఆడుకునే ఆటలను (ముప్పై ఏళ్ల క్రితం ఆటలు. ఇప్పుడు ఈ ఆటలు పల్లెల్లో కూడా దాదాపు అడటం లేదు). ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో 2005లో సీరియల్‍గా రాశాను. అవి విశాలాంధ్రవారు మనమంచి ఆటలుపేరుతో పుస్తకంగా తెచ్చారు. అదే నా మొదటి పుస్తకం. తర్వాత 13 కథలతో అన్నంగుడ్డ’, మరో 13 కథలతో దృశ్యాలుమూడు ఒక ఆవిష్కరణ’, 18 కథలతో ఒక మేఘం కథసంపుటాలుగా వచ్చాయి. నీరు నేల మనిషి’, ‘రెక్కాడినంత కాలంనవలలూ పుస్తకాలుగా వచ్చాయి.  మొత్తం ఆరు పుస్తకాలు. వీటిలో మూడు పుస్తకాలను విశాలాంధ్రవారు ప్రచురించారు.

ఆంధ్రభూమి దినపత్రికలో వెన్నెముక’, ‘అమ్మానాన్నకుఅనే నవలలు సీరియల్‍గా వచ్చాయి. ఆంధ్రభూమి మాసపత్రికలో రెండు సంచికల్లో వచ్చిన మిస్సింగ్‍ అనే నవల ఉంది. ఇవన్నీ పుస్తకాలుగా రావాల్సి ఉంది. ఇక పుస్తకంగా వేయదగ్గ కథలు సుమారు 30దాకా ఉన్నాయి. వీటిలో పదికి పైగా కథలకు బహుమతులు వచ్చాయి. ఇక రాసి అచ్చుకాని నవలలు మరో రెండు ఉన్నాయి.

5.         వడ్రంగి వృత్తికి. పాత్రికేయ జీవితానికి, రచయితగా కొనసాగటానికి మధ్య ఎలా సమన్వయం కుదిరింది..?

తిరుపతిలో 1994 నుంచి 2002 వరకు ఎనిమిదేళ్లకు పైగా వడ్రంగి వృత్తితో జీవినం సాగించా. ఏ వృత్తిలో ఉన్నా చదవడం, రాయడం అనేవి నాకు ఇష్టమైన వ్యాపకాలుగా ఉండేవి. దీంతో వడ్రంగిగా ఉన్నప్పుడే కొంతకాలం తిరుపతిలో కళాదీపికఅనే పక్షపత్రికలో వ్యాసాలు రాసేవాడిని. తిరుపతిలో జరిగే కల్చరల్‍ కార్యక్రమాలను రిపోర్ట్ చేసేవాడిని. నా పాత్రికేయ జీవితం అలా మొదలైంది. నా చేతిరాతలో ఒక పేజీ రాసి ఇస్తే ఆ పత్రిక ఎడిటర్‍ వి.ఎస్‍.రాఘవాచారి గారు నాకు రూ.50 ఇచ్చేవారు. వారు డబ్బు ఇస్తున్నారు కదా అని నేను ఏవంటే అవి రాసేవాడిని కాదు. ముఖ్యంగా ఆ పుస్తకంలో సంగీత, సాహిత్య, నాటక రంగాలవారిని పరిచయం చేస్తూ వ్యాసాలు రాసేవాడిని. బయోడేటా ఎడిటర్‍కు పంపేవారు. నేను దానిని వ్యాసంగా మలిచేవాడిని. అప్పట్లో నేను రాసిన వ్యాసాల్లోని వ్యక్తులు తర్వాత ఆ యా రంగాల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు.

 వడ్రంగి వృత్తికి, పాత్రికేయ జీవితానికి మధ్య..  నాలో ఉండే విపరీతంగా పుస్తకాలు చదవడం, రాయడం అనే పిచ్చి ఒక వంతెనలా నిలిచింది. అయితే.. 2002 సెప్టెంబర్‍లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్‍-ఎడిటర్‍గా కొత్త జీవితం మొదలు పెట్టాక వడ్రంగం వృత్తిని వదిలేశాను. కుల వృత్తిని వదిలేసి కొత్త వృత్తిలోకి అడుగు పెట్టడానికి ప్రధానకారణం అనారోగ్యం. నిజానికి నేను వడ్రంగిగా ఉన్నప్పుడే ఎక్కువ పుస్తకాలు చదివే వీలున్నింది. నా జీవితం నా చేతుల్లో ఉండేది. ఇప్పుడలా కాదు..

6.         ముక్కుసూటి మనిషి అని మీకు పేరుంది. ఎందుకు..?

 తప్పును తప్పు అని చెబుతాను. తప్పు చేసిన వ్యక్తి చాలా పెద్దమనిషిఅయినా భయపడను. ఆ వ్యక్తి నా భవిష్యత్తుకు అడ్డంపడతాడని, నాకు అవార్డులు లేదా బహుమతులు రాకుండా చేస్తాడని తెలిసినా.. మౌనంగా ఉండను. వ్యక్తిగత జీవితంలోనే కాదు... సాహిత్య పయనంలోనూ ఇలాంటివి నా జీవితంలో చాలా ఉన్నాయి. చాలా పేరున్న వ్యక్తులను నిలదీశాను. ఫలితంగా ఇబ్బందులు పడ్డాను. కొన్ని కోల్పోయాను. కోల్పోవడం కాదు.. నాకు రావలసినవి రాకుండా పోయాయి. వాళ్లను ప్రశ్నించినందుకు ఇవి నాకు రాలేదని తెలుసు. దీనికి నేనేమీ బాధపడ్డం లేదు. వాళ్లను ప్రశ్నించినందుకు పశ్చాత్తాప పడ్డమూ లేదు. కాలం (వయసు)తో పాటు నాలోనూ మార్పు వచ్చింది. ఇప్పుడు ముందంత అగ్రెసివ్‍గా ముఖాన్నే మాట్లాడ్డం లేదు కానీ.. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం అలవాటు చేసుకుంటున్నా. పాతికేళ్ల క్రితం రచయితలంటే విపరీతమైన క్రేజ్‍ ఉండేది. వాళ్లు అసాధారణ వ్యక్తులని అనుకునేవాన్ని. అనుభవంతో అర్థమయింది ఏమంటే చాలామంది రచయితలకంటే సాధారణ వ్యక్తులు చాలా ఉన్నతులని. ఇది తెలిశాక రచయితలను ప్రశ్నించాల్సిన అవసరం లేదనిపించింది.

7.         కథలు, నవలలు కవితలు రాస్తున్నారు కదా.. మీకు ఏ పక్రియ అంటే ఎక్కువ ఇష్టం?

ప్రారంభంలో కవితలు రాసేవాడిని. ఇప్పటికీ నా దగ్గర కవితలు రాసి పెట్టుకున్న నోట్‍బుక్స్ నాలుగున్నాయి. కొన్ని కవితలకు బహుమతులు కూడా అందుకున్నా. మూడుసార్లు రంజని కుందుర్తి యోగ్యతాపత్రాలు అందుకున్నాను. తర్వాత కథల్లోకి అడుగుపెట్టాను. కథలు రాస్తూనే నవలలు రాయడం మొదలు పెట్టాను.

కవిత మెరుపులాంటిది. కథ వర్షంలాంటిది. నవల ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన గాలివాన లాంటిది. నేను ప్రారంభంలో కవిత్వం ఎక్కువ చదివేవాడిని. తర్వాత కథలు ఎక్కువ చదివాను. ఆ తర్వాత నవలలు ఎక్కువ చదివాను. ఈ మూడు పక్రియల్లోనూ రాశాను. నా మటుకు నాకు నవల ఇష్టమైన పక్రియగా మారింది. మంచి నవలలోనే కవిత్వమూ ఉంటుంది. కథా ఉంటుంది. మనం చెప్పాలనుకున్న విషయాన్ని సవివరంగా చెప్పగలిగే అవకాశమూ ఉంటుంది.

8.         సాహిత్యంలో మీకు స్ఫూర్తి కలిగించిన వాళ్లు..?

సాహిత్యం అనేది మనం తినే ఆహారం లాంటిది. బాల్యం నుంచి పెరిగే వయసుతో పాటు.. తినే ఆహారంలో ఇష్టాయిష్టాలు మారుతుంటాయి. లేదూ ఇష్టపడే ఆహార పదార్థాలు పెరుగుతుంటాయి. సాహిత్యంలో స్ఫూర్తికూడా అలాంటిదే.. కాలేజీ రోజుల్లో శ్రీశ్రీ, తిలక్‍ కవిత్వం పిచ్చిగా చదివేవాడిని. వారిని ఇమిటేట్‍ చేస్తూ ప్రారంభంలో కొన్ని కవితలు కూడా రాశాను. తర్వాత కె.శివారెడ్డి, ఎండ్లూరి సుధాకర్‍, శిఖామణి, కొప్పర్తి, ఆశారాజు, పాటిబండ్ల రజని, మందరపు హైమవతి, కొండేపూడి నిర్మల కవితలు ఇష్టంగా చదివా. కథకుల్లో కొకు, ఇనాక్‍, మధురాంతకం రాజారాం, పులికంటి కృష్ణారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డిసింగమనేని  నారాయణ, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కారా, మునిపల్లె రాజు, ఓల్గా, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బండి నారాయణస్వామి, ఆర్‍.ఎం.ఉమామహేశ్వరరావు, డాక్టర్‍ వి.చంద్రశేఖరరావు కథలు ఎక్కువ చదివా. ఇక నవలలంటే బాల్యంలో త్రిపురనేని గోపీచంద్‍, బుచ్చిబాబు, రావిశాస్త్రి, కొకు, వడ్డెర చండీదాస్‍ నవలలు చదివా. తర్వాత డాక్టర్‍ కేశవరెడ్డి నవలలు. నా దృష్టిలో కేశవరెడ్డిని మించిన నవలా రచయిత తెలుగులో ఇప్పటి వరకూ లేరు. పైన చెప్పిన వీళ్లే కాదు.. నేను చదివిన ఎన్నో పుస్తకాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు కారకులైన వారంతా నాకు స్ఫూర్తి కలిగించిన వారే..

9.         మీరు అనువాద రచనలను ఇష్టంగా చదువుతారు కదా.. ఆ ఆసక్తి ఎలా ఏర్పడింది?

 తిరుపతిలో విశాలాంధ్ర బుక్‍ హౌస్‍ ఉంది. అక్కడికి 1995 నుంచి వెళుతున్నాను. అప్పట్లో పుస్తకాలు కొనేదానికి డబ్బులు ఉండేవి కావు. అప్పుడప్పుడు వాళ్లు క్లియరెన్స్ సేల్‍ పెట్టేవాళ్లు. అందులో కొన్ని పుస్తకాలు 50 శాతం డిస్కౌంట్‍తో ఇచ్చేవారు. అలా కొన్ని రష్యన్‍ అనువాదాలు కొన్నాను. టాల్‍స్టా•••• ‘కొసక్కులు’, కుప్రీన్‍ రాళ్లవంకీఅప్పుడు కొన్నవే. మధురాంతకం నరేంద్రగారు తరచూ అనువాద నవలల గురించి చెప్పేవారు. చదవమని ఇచ్చేవారు. అన్నాకరేనినా, శరత్‍ శ్రీకాంత్‍ నవలలు, జయకాంతన్‍ కథలు వారు ఇచ్చి చదవమన్నారు. రెండేళ్లు హైదరాబాదులో ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో పనిచేశాను. ఆ సమయంలో హెచ్‍బీటీ వారు వేసిన బిభూతి భూషణ్‍ బంధోపాధ్యాయ వనవాసినవల వేమన వసంతలక్ష్మిగారు ఇచ్చి కొనుక్కోమని చెప్పారు. ఆ నవల నన్ను దిగ్భ్రమకు గురిచేసింది. చదివాక కొన్ని కాపీలు కొని మిత్రులకు ఇచ్చాను. హైదరాబాదులో జరిగే కేంద్రసాహిత్య అకాడమీ మీటింగుల్లో వారి ప్రచురణలు కొనుక్కునేవాడిని. అలా మొదలైంది. ఇప్పుడు నా దగ్గర అనువాద సాహిత్యం చాలానే ఉంది. శరత్‍ సమగ్ర సాహిత్యం ఈమధ్యే కొని చదివాను. బిభూతి వనవాసి’, బి.వసిల్యేవ్‍ హంసలను వేటాడొద్దు’, చెంగిజ్‍ ఐత్‍మాతోవ్‍ తల్లి భూదేవినేను మళ్లీ మళ్లీ చదివిన నవలలు.

10.       మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు, పుస్తకాలు?

 ప్రభావం చూపిన పుస్తకాలు చాలానే ఉన్నాయి. మన వయసు, ఆలోచనా తీరు ఎదిగే కొద్దీ ఇవీ మారుతుంటాయి. మనుషులు కూడా అంతే.

నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటివారు ఆర్‍.ఎం.ఉమామహేశ్వరరావు, విష్ణుప్రియగారు. 1999లో వీరి పరిచయం మొదటి సారి అయింది. అప్పటికి నేను కార్పెంటర్‍ (వడ్రంగి)గా జీవనం సాగిస్తున్నా. నేను చాలా ఇళ్లకు పనిచేశాను. పనిచేసినంత వరకే. తర్వాత తిరుపతిలో కార్పెంటర్లను చాలామంది సాటి మనుషులుగా గుర్తించరు. వాళ్ల ఇళ్లకు వెళితే టచ్‍మీ నాట్‍ అన్నట్టుంటారు. అలాంటి రోజుల్లో ఒకసారి విష్ణుప్రియ అమ్మ వాళ్ల ఇంటిలో రెండురోజులు వుడ్‍ వర్క్ చేశాను. మొదటి రోజు పనికి వెళ్లినప్పుడు ఉమాగారు నాతోపాటు ఉన్నారు. మధ్యాహ్నం అక్కడే భోజనమని చెప్పారు. కాళ్లు చేతులు కడుక్కుని భోజానికి వెళితే డైనింగ్‍ టేబుల్‍ వద్ద భోజనం. నేనూ, ఉమాగారు ఎదురెదురుగా కూర్చున్నాం. విష్ణుప్రియగారు స్టవ్‍ దగ్గర ఆమ్లెట్‍ వేసి వేడివేడిగా పెట్టారు. ఆ దృశ్యాన్ని ఎప్పటికీ మరచిపోలేను. చేసే పనిని, కులాన్ని, ఆర్థిక స్థితిని కాకుండా.. మనిషిని మనిషిగా చూసిన వ్యక్తులను నా జీవితంలో నేను మొదటిసారి చూసింది అప్పుడే. ఇక రచనల పరంగానూ ఉమాగారి ప్రభావం నాపైన చాలా ఉంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం చేస్తున్నానంటే అది వారి చలవే.

మధురాంతకం నరేంద్రగారు, బండి నారాయణస్వామి, అల్లం రాజయ్య, పులికంటి కృష్ణారెడ్డి, డాక్టర్‍ వి.ఆర్‍.రాసాని.. నేను సాహిత్యంవైపు అడుగులు వేసిన తొలిరోజుల్లో వీరి సూచనలు నాకు చాలా ఉపకరించాయి.

సీరియస్‍ సాహిత్యంలో ఎవరి స్థానం వారికి ఎప్పుడూ ఖాళీగా ఉంటుందని, దానిని పూరించుకుంటూ వెళ్లడమే మనం చేయాల్సిన పని అని మధురాంతకం నరేంద్రగారు అన్నారు. నేను రచయితగా ఎటువైపు ఉండాలో నిర్ణయించుకోవడానికి వీరి మాటలు దోహదం చేశాయి.

మనం ఏ కథ రాసినా, అందులో ఏ పాత్రను సృష్టించినా.. మన జీవితంలోంచే తీసుకోవాలని, మనం సృష్టించే పాత్రకు మన జీవితంలో పరిచయం ఉన్న వ్యక్తులను ఊహించుకుంటే దానికి సహజత్వం వస్తుందని ఉమాగారు అన్నారు. అందరి జీవితం స్వల్ప మార్పులతో ఒకేలా ఉంటుందని, అయితే వారి ఆలోచనా తీరు చదివిన పుస్తకాలు చూసే దృష్టికోణం.. కథను కొత్తగా మలుస్తుందని చెప్పారు. అంటే.. కథను ఎలా రాయాలో చెప్పారు.

అప్పటికే కొన్ని కథలు ప్రచురణ అయ్యాయి. రెండు కథలకు బహుమతులు వచ్చాయి. ఆ సమయంలోనే.. నా జీవితాన్ని నేను కథలుగా మలచాల్సిన అవసరాన్ని బండి నారాయణస్వామిగారు చెప్పారు.

తొలిరోజుల్లో నాకు మాండలికం అంటే ఏంటో తెలీదు. తెలంగాణ, కోస్తాంధ్ర, కళింగాధ్ర, రాయలసీమ.. ఇలా అన్ని ప్రాంతాల మాండలికాలు కలిపి ఒక కథ రాశాను. ఆ కథ స్క్రిప్ట్ డాక్టర్‍ వి.ఆర్‍.రాసానిగారు చదివి మాండలికాల గురించి వివరించారు. ఒక పేజీని కరెక్షన్‍ చేసి ఏ పదం ఏ ప్రాంతానిదో చెప్పారు. నా జీవభాష ఏదో నాకు తెలిసేలా చేశారు. అప్పటి వరకూ నాకు ఆ భేదం తెలీదు.

11.       అంతర్జాల సాహిత్యం గురించి మీ అభిప్రాయం?

 అంతర్జాల సాహిత్యం నేను ఎక్కువగా ఫాలో కావడం లేదు. నాకు పుస్తకం చేతిలో పట్టుకుని చదువుకోవడమే ఇష్టం. ఇంగ్లీషుమీడియం చదువుల నుంచి వచ్చిన రచయితలు ఇప్పుడు ఎక్కువమంది అంతర్జాలంలో తెలుగుసాహిత్యం రాస్తున్నారు. వీరిలో చాలామందికి వాక్యం రాసేది సరిగా రాదు. చదవగలరు. టెక్నాలజీ పెరిగింది. రాసే అవసరం లేకుండా చెప్తుంటే టెక్సట్ టైప్‍ అయ్యే సాఫ్ట్వేర్‍ వచ్చింది. కొంతమంది దీనిని ఉపయోగించి కథలు రాస్తున్నారు. చాలా అంతర్జాల పత్రికలు కూడా యూనికోడ్‍ ఫాంట్‍లోనే కథలు కోరుతున్నాయి. అలా లేదంటే పంపొద్దు అంటున్నాయి. అంటే యూనికోడ్‍ ఫాంట్‍లోనే రాయాల్సిన ఒక అనివార్యతను తెచ్చాయి. దీంతో  భవిష్యత్తులో ఇలా రాయగలిగేంత తెలుగైనా వచ్చేవారు ఉండకపోవచ్చు.

12.       మీ కవితా సంపుటి ఇంతవరకు రాలేదు కదా..! ఎప్పుడు తెస్తున్నారు?

 తొలిరోజుల్లో రాసిన కవితలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కవితలకు పోటీల్లో బహుమతులు కూడా వచ్చాయి. పదేళ్ల క్రితం అయితే ఆ కవితలతో పుస్తకం తెచ్చి ఉండచ్చు. ఇక వాటిని పుస్తకంగా తేవాల్సిన అవసరం లేదనుకుంటున్నా.

13.       చాలా రచనలకు మీకు బహుమతులు, అవార్డులు వచ్చాయి కదా.. అవార్డులు బహుమతులకోసం మీరు ప్రత్యేకంగా రాస్తారా..?

 నేను మొదట్లోనే చెప్పాను కదా. చాలా లేమి నుంచి వచ్చాను. జీవితంలో డబ్బు  ప్రధానం కాకపోయినా చాలా వాటికి డబ్బే ప్రధానం. కనీస అవసరాలు తీరాలన్నా డబ్బు ఉండాల్సిందే. ఆ డబ్బు కూడా నా దగ్గర ఉండేది కాదు. అలాంటి సమయంలో నన్ను కథల పోటీలు ఆకర్షించాయి. నేను ఇంటర్మీడియట్‍ చదివేరోజుల్లోనే స్వాతి, ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో పోటీలకు కథలు రాశాను. కేవలం డబ్బు వస్తుందని ఆశతోనే. తర్వాత తర్వాత కూడా నేను డబ్బు అవసరం అయ్యే పోటీలకు కథలు, నవలలు రాశాను. అలా అని బహుమతి రావాలని నా పాత్రలను చంపేయడమో, విపరీతమైన కష్టాలకు గురిచేయడమో చేయలేదు. అంటే.. బహుమతికోసం నేల విడిచి సాముచేసే కథలు, సినిమాటిక్‍ కష్టాల కథలు ఎప్పుడూ రాయలేదు.

బహుమతి కథలకు / నవలలకు గుర్తింపు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది పాఠకులు చదువుతారు. ఇది కూడా పోటీలకు రాయడానికి మరో కారణం.

పోటీకి రాయడం వేరు. బహుమతుల కోసం ప్రత్యేకంగా రాయడం వేరు. నేను బహుమతుల కోసం ప్రత్యేకంగా ఎప్పుడూ రాయలేదు. ఎప్పుడూ రాయను.

14.       పాఠకుల నుండి మీకు ఎదురైన అనుభవాలు, మీకు లభించిన ప్రోత్సాహం.. గురించి..

 ‘గాలిపేరుతో ఒక కథ రాశాను. అది 2004లో నవ్య వీక్లీలో వచ్చింది. రిజర్వేషన్‍ కింద ఎస్సీఎస్టీలు సర్పంచ్‍, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేస్తుంటారు. పేరుకు సర్పంచ్‍ ఎస్సీ అయినా వారిని నడిపించేదంతా అక్కడి పెత్తందారే. తమకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎన్నికల్లో నిలబడాల్సి వచ్చి, తర్వాత తమ కులంవారి మధ్య ప్రిస్టేజ్‍ సమస్యగా మారి గెలుపుకోసం ప్రయత్నం చేసి.. ఆ ప్రయత్నంలో అప్పులయ్యి.. చివరికి తమను నిలబెట్టిన పెద్దమనిషిసాయం చేయకపోవడంతో.. ఎంపీటీసీగా గెల్చిన ఓ మహిళ అప్పులు తీర్చేదానికి కువైత్‍ వెళ్లారు. రిజర్వేషన్ల పేరుతో ఎస్సీఎస్టీలను పెత్తందార్లు ఎలా ఆడుకుంటారనేది గాలికథలో చెప్పాను. అప్పుడు నేను తిరుపతి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. సాయంత్రం ఆఫీసుకు వెళ్లాను. ఒకతను వచ్చి తలుపు తీసి మెళ్లిగా దేవేంద్ర సార్‍ అని పిల్చాడు. తిరిగి చూస్తే ఓ పెద్దాయన. మా ఆఫీసులోనే అటెండర్‍గా పనిచేస్తుంటాడు. అతను మిషన్‍ సెక్షన్‍లో ఉంటాడు. చూశాను కానీ పరిచయం లేదు. లేచి అతని వద్దకు వెళ్లాను. ‘‘కత ఏం రాసినారు సార్‍.. ఇంగన్న మా మాల నాకొడకలకు బుద్దిరావాల’’ అన్నాడు. ఇది నాకు పెద్ద మెచ్చుకోలు.

నీరు నేల మనిషి’ 2006లో చతురలో వచ్చింది. మా వెనక వీధిలో ఉండే కవిత అనే ఆవిడ తరచూ మా ఇంటికి వచ్చేది. మా దేవితో కాసేపు మాట్లాడి వెళ్లేది. ఆమె ఈ నవల చదివాక మా ఇంటికొచ్చి ‘‘అనా.. నువ్వు మా కతే రాసినావు.. అంతా మా నాయక కతేన్నా’’ అంది. రచయితలు, సాహిత్యకారుల స్పందన గురించి నేను చెప్పడం లేదు. నేను కథలు రాయడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో టెక్నాలజీ ఇంత ఎక్కువ లేదు. అప్పుడు కమ్యూనికేషన్‍ అంటే ఉత్తరాలే. ఆ రోజులే బాగుండేవి.

15.       కొత్తగా రచయితలు పెద్దగా రాకపోవడానికి కారణం ఏమిటి?

 కొత్త రచయితలు పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. అయితే వారు ఎక్కువ కాలం రచయితలుగా కొనసాగలేకపోతున్నారు. ఒకటి రెండు పుస్తకాలకే పరిమితం అవుతున్నారు. మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేదే ఏ రంగంలో అయినా మనం ఎంతకాలం ఎంతబాగా రాణించగలం అనేది నిర్ణయిస్తుంది. వెయ్యి పేజీలు చదివితే గాని రెండుమూడు పేజీలు రాయగలిగేంత శక్తి రాదు. ఇప్పటి వరకు నేను సుమారు 2,500 పేజీల రచనలు చేశాను. వేల పుస్తకాలు చదివాను. కొత్త రచయితలు చాలామంది ఇతరుల రచనలు ఒక్క పేజీ కూడా చదవరు. ఎక్కువకాలం రచయితలుగా కొనసాగాలంటే ఎక్కువగా చదవాలి.

16.       మీ దృష్టిలో ఉత్తమ సాహిత్యం అంటే ఏమిటి?

 మనిషిని మూఢత్వం వైపు కాకుండా వెలుగువైపు పయనింప చేసే ప్రతిదీ ఉత్తమ సాహిత్యమే. సంప్రదాయాల పేరుతో ఆగిపోకుండా కాలంతో పాటు పయనించేలా మనిషిని ప్రోత్సహించేదీ ఉత్తమ సాహిత్యమే. మనిషిని మనిషిగా గుర్తించేలా చేసే ప్రతిదీ ఉత్తమ సాహిత్యమే.

17.       సాహిత్యంలో రావాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా?

 సాహిత్యంలో మార్పులను కాలమాన పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఆ మేరకు మనకు తెలీకుండానే మార్పునకు గురవుతూ ఉంటాం. మీరు గమనించే ఉంటారు. ఇప్పటికే సాహిత్యంలో చాలా మార్పులు వచ్చాయి. యాభై అరవై పేజీల కథ నుంచి ఇప్పుడు ఐదారు వాక్యాల మైక్రో కథలుగా కథ మార్పు చెందింది. రచయిత పనిగట్టుకుని సాహిత్యంలో మార్పుకోసం ప్రయత్నించినా.. అప్పటి సమాజానికి ఏది అవసరమో అదే నిలబడుతుంది.

18.       సమాజంలో రావాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా?

 సమాజంలో మార్పులు చాలా రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో మార్పులు అవసరం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున సాహిత్యం వచ్చేది కాదు. వచ్చే సాహిత్యంలో ఎక్కువ భాగం సమాజంలో మార్పు కోరేదే కదా..

19.       సమాజంలో రావాల్సిన మార్పులకు సాహిత్యం ఏ విధంగా తోడ్పడుతుందని భావిస్తున్నారు?

 సమాజం సాహిత్యం పరస్పర ప్రేరకాలు. అయితే సమాజ గమనంలో వేగం పెరిగింది. ప్రాధాన్యాలు పెరిగాయి. సమాజంలోని మనుషులే కదా రచయితలు కూడా. వీరి ఆలోచల్లోనూ రచనల్లోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు సమాజానికి సాహిత్యం గాలిబుడగలా కనిపిస్తోంది. సాహిత్యంలో తమ ప్రతిబింబాలను చూసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడ్డం లేదు. ఎవరి గాలిబుడగలను వాళ్లే సృష్టించుకుని ఎవరిలోకంలో వాళ్లున్నారు. అందువలన సమాజంపై సాహిత్యం ప్రభావం చాలాచాలా స్వల్పమైపోయింది. అచ్చులో వచ్చే సాహిత్యం ప్రభావం నామమాత్రమే.

20.       కొత్తరా రాయాలనుకుంటున్న వాళ్లకోసం మీ సూచనలు..

మీ అమాయకత్వంగానీ.. కొత్తగా రాసేవాళ్లు ఎవ్వరూ ఎవ్వరి సూచనలూ పాటించరు. ఇప్పుడొచ్చే కొత్త రచయితల్లో చాలామంది స్వయం ప్రకాశకులు. ఇతర్ల రచనలు చదవరు. పుస్తకాలు అస్సలు కొనరు.

21.       ఇప్పుడేం రాస్తున్నారు..?

నేను తిరుపతిలో చాలాకాలం ఉన్నాను. తిరుపతి మా సొంతూరులా మారిపోయింది. ఎర్రచందనం శేషాచల అడవుల్లో మాత్రమే ఉంది. దీనికి సంబంధించిన వార్త పేపర్‍లో రోజూ తప్పకుండా ఒక్కటైనా ఉంటుంది. ఎర్రచందనం నేపథ్యంలో నేను హత్యఅనే కథ 2014లో రాశాను. ఎర్రచందనంపై వచ్చిన మొదటి కథ ఇదే. చాలా ఏళ్లుగా ఎర్రచందనం నేపథ్యంతో నవల రాయాలని ప్రయత్నిస్తున్నాను. దానికి సంబంధించి చాలా సమాచారం సేకరించాను. దాదాపు ఏడాదిగా ఆ నవల రాస్తున్నా.

 

22.       మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?

మన ఇతిహాసాలు, పురాణాలలో విశ్వకర్మ / మయబ్రహ్మ ప్రస్తావన ఉంది. దేశంలో ఏ మూలకు పోయినా విశ్వకర్మలు పనిచేసిన ఆలయాలు, కోటలు ఉన్నాయి. వేల ఏళ్లుగా ఈ దేశ అభ్యున్నతికి విశ్వకర్మలు చేసిన కృషిని విపులంగా నవల రాయాలనుంది.

 


ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు