ఇంటర్వ్యూలు

(January,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

నిజమైన సాహిత్య విమర్శ, సాహిత్యాన్ని మెరుగు పరుస్తుంది – కిరణ్ విభావరి 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు కిరణ్ విభావరి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.. మీ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని మాటలు.....

నా పేరు కిరణ్. విభావరి అనేది నా కలం పేరు.

మా స్వస్థలం విశాఖ. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాం. వృత్తి పరంగా నేనో అధ్యాపకురాలిని. ఐఐటీ ఫౌండేషన్ (మాథ్స్) కోచింగ్ ఇస్తూ ఉంటాను. వందలాది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది, వారికి మంచి శిక్షణ ఇచ్చానన్న ఆత్మ సంతృప్తి ఉంది.

2.. మీ సాహిత్య ప్రస్థానం

2020 కరోనా మూలంగా నా కోచింగ్ ఆపివెయ్యాల్సి వచ్చింది. అంతకు ముందు, ఒకటి రెండు కథలు రాసి పత్రికకు పంపాను కానీ సమయాభావం వల్ల సీరియస్ సాహిత్యం వైపు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కరోనా లాక్ డౌన్ నాకు బోల్డంత సమయాన్ని మిగిల్చింది. అప్పుడే ఫేస్ బుక్ ఖాతా తెరిచాను. సృజనశీలుల పరిచయం ఏర్పడింది. Whatsapp లో సాహిత్య గ్రూపుల్లో చేరి, కథలు, కవితలు వాటి  పోటీలు వంటి వివరాలు తెలుసుకున్నాను. అంతకు ముందు వరకు ఏవేవో వార పత్రికల్లో వచ్చే కథల్నే తెలుగు సాహిత్యం అని భ్రమించిన నాకు, ఈ సాహిత్య సమాచారం చాలా కొత్తగా తోచింది. ఎన్నో పుస్తకాలు , రచయితలు వారి రచనలు వ్యాసాలు...ఇలా ఎన్నో పరిచయం అయ్యాయి. పరిచయాలూ పెరిగాయి. తెలియని విషయాలు తెలిశాయి.

నాకు కవిత్వం చదవడం మీదున్న ఆసక్తి రాయడం మీద అస్సలు లేదు. రాసి కన్నా వాసి ముఖ్యం అని నా అభిప్రాయం. నాలాంటి భావజాలం కలిగిన మిత్రులతో అప్పుడప్పుడు సాహిత్య గోష్టి చేస్తూ ఉండేదాన్ని. అలాంటి సమయంలో నా మిత్రురాలు శ్రావణి గుమ్మరాజు ప్రోద్భలంతో మొదటి సారి కవిత రాసి, ఆఖరి నిమిషంలో NATS పోటీకి పంపాను.  ఆ పోటీ గురించి ఆ తర్వాత ఇక ఆలోచన చెయ్యలేదు. అయితే కొన్ని రోజుల్లో మీరు ఫైనల్ కాబడ్డారని NATS నిర్వాహకుల నుండి మెసేజ్ చూడగానే నా ఆనందానికి అవధుల్లేవు. అదో అద్వితీయమైన అనుభవం. సినీ కవుల సమక్షంలో నా కవితని వినిపించడం, వారు తిలక్ గారి కవితతో నా కవితని పోల్చడం నిజంగా ఒక మధురమైన అనుభూతి.

ఆ తర్వాత, అదే ఊపులో NATA పోటీకి కూడా కవిత పంపాను. అందులోనూ విజేతగా నిలిచాను. నాకు కవిత్వ భాష తెలియదు కానీ కవిత్వ ఆత్మను పట్టుకోగలిగాను. నేను చెప్పాలి అనుకున్న బలమైన అంశాలను నాదైన శైలిలో చెప్పాను. అయితే నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మాత్రం అఫ్సర్ గారు మాత్రమే. ఆయన కవితలు యూ ట్యూబ్ లో విని, నేను నా భావాల్ని అక్షరికరించాను. విజయం సాధించాను. ఒకరకంగా నేను ఆయనకు ఏకలవ్య శిష్యురాలిని.

ఈ రెండు పోటీలూ నాకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎటువంటి సాహిత్య వారసత్వం లేకున్నా, కేవలం ఈ విజయాలే నన్నూ ఒక రచయిత్రిగా నిలబెట్టాయి. ఆ తర్వాత కథల పోటీలో పాల్గొని, స్వెరో టైమ్స్ వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి అందుకున్నాను. మొమ్స్ప్రెస్సో వారు నిర్వహించిన కథల పోటీలో కూడా ప్రథమ బహుమతి అందుకున్నాను.

సాహిత్యం ఒక వ్యసనం అని కొందరు రైటర్స్ చెబుతూ ఉంటారు. నిజమే.. అయితే ఈ విజయాలు అంత కన్నా ఎక్కువ మత్తునిస్తాయి. ఇక అప్పటి నుండి ఏడాది పాటు కేవలం పోటీలకు మాత్రమే రాయడం మొదలు పెట్టాను. ఏ పోటీకి రాసినా ఏదో ఒక బహుమతి అందుకున్నాను. కానీ ఏదో వెలితి. అందరికన్నా ఉత్తమంగా నిలవాలనే నా తపన నన్ను ఎక్కడా ఆగనివ్వలేదు. ఆ క్రమంలోనే ఎన్నో పుస్తకాలు చదివాను. నాలో పరిణితి పెరిగింది. మొదట్లో ఉన్నంత ఉబలాటం ఇప్పుడు లేదు. పరుగులు ఆపి ప్రశాంతంగా సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను నేను మెరుగు పరుచుకుని, కలకాలం నిలిచిపోయే ఉత్తమ సాహిత్యం అందించాలనే లక్ష్యం పెట్టుకున్నాను.

3.         మీకు బాగా గుర్తింపు తెచ్చిన మీ రచన

కిరణ్ విభావరి అనగానే కాఫీ పెట్టవు కథ అందరికీ గుర్తుకు వస్తుంది. ఒక ఫేస్ బుక్ గ్రూపు వారు నిర్వహించిన పోటికై ఆ కథ రాశాను. ఒక గంటలో రాసేసిన కథ. కానీ ఆ కథ వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదు. నా పేరు లేకుండా, వేరే రచయితల పేరుతో ఎన్నో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఆ కథ నేనున్న ఒక వాట్సప్ గ్రూపులో వేరే వారి పేరుతో రావడం నిజంగా చాలా బాధ వేసింది. దాంతో సారంగ ఎడిటర్ అఫ్సర్ గారిని అభ్యర్థిస్తే, నా వేదనను పాఠకులకు చేరేలా ఆయన అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత సాక్షి పత్రికలో కూడా ప్రచురితం అయ్యింది. ఎందరో పాఠకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. ఆస్ట్రేలియా, UK వంటి దేశాల నుండి పాఠకులు, కొందరు రచయితలు నా నంబర్ తెలుసుకుని మరీ ఫోన్ చెయ్యడం మరిచిపోలేని అనుభవం. వారంతా ఇప్పుడు నాకు మంచి మిత్రులు అయ్యారు.  ఒక యూ ట్యూబ్ చానెల్ వారు ఆడియో కథగా ప్రసారం చేసిన నెలలోనే లక్షన్నర వీక్షకుల ఆదరణకు నోచుకుంది.

4.         తపన రచయితల కర్మాగారం అనే గ్రూపు యెందుకు మొదలు పెట్టారు?

గ్రూపు మొదలుపెట్టి ఏడాది పూర్తి అయ్యింది.  దాదాపు 6 వేల మంది ఔత్సాహిక యువ రచయితలతో పాటు లబ్ద ప్రతిష్ట రచయితలూ ఉన్నారు. పిల్లల పెద్దల మేలుకలయికతో వారి అనుభవాలు సూచనలు సలహాలతో గ్రూపు నుండి ఎందరో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. సాహిత్యం గురించి తెలుసుకునే పరంలో నేను ఏదైతే అనుభవించానో అది మరొకరు అనుభవించకుండా ఉండేందుకు ఈ గ్రూపును ఏర్పాటు చేశాను. ఎటువంటి సాహిత్యపరమైన సందేహం అడిగినా చిటికెలో సమాధానం దొరుకుతుంది. ఇంతకన్నా ఏం కావాలి? కొత్తగా రాయాలి అనుకున్నవారు, రాస్తున్నవారు ఎవరైనా సరే, సీనియర్ రచయితల భిన్న అనుభవాల నుండి ఎంతో కొంత తెలుసుకుంటూ ముందుకు సాగవచ్చు. ఇబ్బడిముబ్బడిగా ఉన్న రచయితల్లో రచన సామర్థ్యం కొరతగా ఉంది. వారిలో  కొత్త కొత్త ఆలోచనలు ఉన్నా వాటికి అక్షర రూపం ఇవ్వడంలో కాస్త తడబడుతున్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చే విధంగా ప్రతి వారం, కొన్ని కొత్త పాఠాల్ని చెబుతూ కొందరు మార్గదర్శకులు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు.

5.         ఉత్తమ రచన అంటే ఏమిటి? దానిని. నిర్దేశించే వారు ఎవరు?

నేను రచయిత కన్నా ముందు ఒక పాఠకురాలిని. నా దృష్టిలో పాఠకులే ఉత్తమ రచనల్ని గుర్తిస్తారు. ఈరోజు చదివి రేపు మర్చిపోయే రచనల్ని సాహిత్యం అనరు. ఆలోచన రేకెత్తించాలి. పదికాలాల వరకూ గుర్తు పెట్టుకోవాలి. సమాజంలోని కుళ్ళును ప్రక్షాళన చేయకున్నా, కనీసం స్వేచ్చగా స్వరం వినిపించాలి.  ఏ వాదాలనో సిద్ధాంతాలనో బలవంతంగా పాఠకుడి మీద రుద్దకుండా, పాఠకుడికి ఆలోచించగలిగే అవకాశం కల్పించాలి. ఏ వర్గానికో, సమూహానికో కొమ్ము కాయకుండాసమాజ స్వభావాన్ని నిష్పక్షపాతంతో సమర్ధవంతంగా  తెలియజేయాలి.

6.         మీకు బాగా నచ్చిన రచనలూ, రచయితలూ

ఒక రచయిత రాసిన అన్నీ రచనలు అద్భుతంగా ఉండాలనెం లేదు. కాకపోతే కొందరి రచనలు మాత్రం ఎక్కడ కనిపించినా వదలకుండా చదువుతాను.  అఫ్సర్, అనిల్ డాని, పి. సుష్మ, వెంకటేష్ పువ్వాడ, తగుళ్ళ గోపాల్ గారి కవితలు ఇష్టంగా చదువుతాను. బాగున్నవి దాచుకుని మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను. ఇక రచయితల్లో నాకు బాగా నచ్చిన రచయితలు చాలా మంది ఉన్నారు. వివేకానంద మూర్తి గారు, పెద్దింటి అశోక్ కుమార్ గారు, సన్నపురెడ్డి గారు, సలీం గారు సింహ ప్రసాద్ గారు, సుంకోజి దేవేంద్రాచారి గారు, వెంకట మణి ఈశ్వర్ గారు, మల్లీశ్వరి గారు, కుప్పిలి పద్మ గారు, సమ్మెట ఉమాదేవి గారు, గీతాంజలి గారి రచనలు చాలా నచ్చాయి.

అయితే వ్యక్తిగతంగా మాత్రం, సాహిత్య ప్రస్థానపు తొలినాళ్ళలో ఉండవల్లి గారు, శరత్ చంద్ర గారు అందించిన ప్రోత్సాహం మరువలేనిది.

ఇక ఈ మధ్యే నవలలు చదవడం మొదలు పెట్టాను. నేను చదివిన తొలి నవల, సలీం గారి కాలుతున్న పూల తోట. అది చదివాక కొన్ని క్షణాలు పాటు ఆ పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని కూర్చుండి పోయాను. అంత హృద్యంగా ఉందా నవల. అదే నవల మీద సమీక్ష రాసి ఒక పోటీకి పంపిస్తే నాకు ఉత్తమ బహుమతిని తెచ్చిపెట్టింది. ఇక పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి, కేశవ రెడ్డి గారి అతడు అడవిని జయించాడు, సన్నపురెడ్డి గారి కొండ పొలం నాకెంతో ఇష్టమైన నవలలు.

7.         మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత

రచనా పరంగా ప్రభావితం చేసిన వారు చాలా మంది ఉన్నారు కానీ తమ ఆదర్శనీయమైన వ్యక్తిగత జీవితంతో ప్రభావితం చేసినవారు మాత్రం సింహ ప్రసాద్ గారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుసుకుని, నేనూ ఎంత సంపాదించినా అందులో కొంత సమాజం కోసం వెచ్చించాలి అనే నియమం పెట్టుకున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయం కూడా నేనాయన దగ్గరే నేర్చుకున్నాను. 

ఇకపోతే, నా కథలన్నిటికి తొలి పాఠకులు, సమీక్షకులు డా. వివేకానంద మూర్తి గారు. ఆయన కూడా ఎన్నో గుప్త దానాలు చేస్తూ, ఎందరికో అండగా నిలిచారు. నాకు ఆదర్శ ప్రాయులు అయ్యారు. నేనెప్పుడైనా నిరాశకు, నిర్లిప్తతకు గురైనా నాకు కొండంత ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని అందించే నా ప్రియతమ మిత్రులు ఆయన.

8.         మీ కథా సంపుటి గురించి..

మా నాన్న గారి కోరిక మేరకు కేవలం కొందరు సన్నిహితులకు పంపడానికి లిమిటెడ్ కాపీలతో నఖాబ్ అనే కథల సంపుటి ప్రచురించాను. నిర్మొహమాటంగా వాస్తవం చెప్పాలంటే, ప్రమోషన్ లేనిదే పుస్తకాలు అమ్ముకోవడం చాలా కష్టం. వాణిజ్య ప్రకటనలు తిమ్మిని బమ్మి చేయగలవు. అలా కొన్న కొన్ని పుస్తకాల కుప్పలు నన్ను వెక్కిరిస్తూ ఉన్నాయి. నేను అడిగితే నా పుస్తకాల గురించి మాట్లాడే రచయితలు చాలా మంది ఉన్నారు. కానీ పాఠకుడే నా వాక్యాన్ని ప్రేమించి, దాచుకోవాలనే బలమైన కోరికతో నా పుస్తకం కొనాలి. అంత వరకూ నేను పుస్తకాలు ప్రచురించదలుచుకోలేదు.

9.         యువత సాహిత్యంలో వెనుక బడ్డారు అనే విషయం మీద మీ అభిప్రాయం

తెలుగు సరిగ్గా రాయడం రాకున్నా, విరామ చిహ్నాలు ఎలా పెట్టాలో తెలియకున్నా డైరెక్ట్ గా బుక్స్ వేసి, అవే ఉత్తమ కథలుగా దండోరా వేయించి వేలల్లో పుస్తకాలు అమ్ముకుంటున్న కొందరు యువ రచయితలను చూసి, యువ కలాలకు పదును లేదు అనే భావనలో చాలా మంది ఉన్నారు.  కానీ

ఇది కేవలం అపోహ మాత్రమే. ఈ మధ్య కాలంలో ఎందరో యువ రచయితలు తమ వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి రచనలు చేస్తున్నారు. బహుశా వేణుగోపాల్, ఇండ్ల చంద్ర శేఖర్, చరణ్ పరిమి, స్పూర్తి కందివనం, అరుణ్ కుమార్ ఆలూరి, రవి మంత్రిఇలా చాలా మంది యువ రచయితలు ఉత్తమ సాహిత్యం అందిస్తున్నారు. అయితే  యువ రచయితల అక్షరం అందరికీ చేరడం లేదు. కేవలం కొందర్ని మాత్రమే వెనకేసుకు వస్తున్న సాహిత్య పెద్దలు కూడా ఇందుకు కారణమే. ఈ విషయంలో నేను కొంత అదృష్ట వంతురాలినే. ఇందూ రమణ గారు, జయంతి ప్రకాష్ శర్మ గారు, ప్రభాకర్ జైనీ గారుఈత కోట సుబ్బారావు గారి లాంటి పెద్దలు నాకా అవకాశం ఇచ్చారు.

అయితే , ఎంతో మంచి రచనలు చేస్తున్నా గుర్తింపు లేని రచయితలు ఎందరో ఉన్నారు. వారినీ గుర్తించాలి. వారిని ఉత్తమ సాహిత్యం అందించే దిశగా ప్రోత్సహించాలి. 

10.       విమర్శకుల గురించి మీ అభిప్రాయం

నిజమైన సాహిత్య విమర్శ, సాహిత్యాన్ని మెరుగు పరుస్తుంది. రచయిత ఇంకొన్ని ఉత్తమ రచనలు చేసేలా ప్రోత్సహిస్తుంది. కానీ నేటి కాలంలో అలాంటి విమర్శకులు కద్దు. కేవలం కొన్ని సమూహాల ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. తాను చూసిందే రంభ అన్నట్టు, తమ వారి రచనలు మాత్రమే గొప్పవి అని ప్రచారం చేస్తున్నారు. అందువల్ల ఉత్తమ రచన పాఠకుడి దృష్టికి రావడం లేదు.

11.       కొత్తగా కథలు కవితలు రాస్తున్న మహిళలకు అందించాల్సిన ప్రోత్సాహం గురించి మీరేమనుకుంటున్నారు?

కేవలం మహిళలు అనే కాదు. తగిన సాహిత్య వారసత్వమో లేదా పలుకుబడి లేకపోతే ఏ కొత్త రచయితకూ తగిన ప్రోత్సాహం దొరకడం లేదు. కేవలం తమ వర్గానికో, సమూహానికో లేదా తమకు అనుకూలంగా ఉన్న రచయితల రచనలు తప్పా మిగతా వారి రచనల్ని సీనియర్ రచయితలు పట్టించుకోవడం లేదు. కనీసం ఈ రచన బాగుంది/ చదవండి అనే చిన్న పరిచయ వాక్యం కూడా పొరపాటున మాట్లాడరు. ఈ పరిస్థితి మారాలి.

12.        20,30 ఏళ్లనాటి స్త్రీవాద సాహిత్యం  ఇప్పటికీ ప్రాసంగికతను కలిగి ఉన్నదని  మీరు భావిస్తున్నారా?

ఓల్గా  గారు రాసిన స్వేచ్ఛ నవల ఇప్పటికీ ఈనాటి సమాజాన్ని అద్దం పడుతోంది.  స్ర్తీల గృహిణిత్వానికి, పౌరసత్వానికి మధ్య నిరంతరమైన ఉద్రిక్తత 19వ శతాబ్దంలో ప్రారంభమై ఈరోజుకీ కొనసాగుతూనే ఉంది. ఆమె రాసిన అయోని కథలోని చిన్నారి జీవితం నేటికీ మారలేదు. ఎందరో చిట్టి తల్లులు లైంగిక వేధింపులకు వికృతాలకు గురి అవుతున్నారు. ఇక గీతాంజలి భారతి గారి పెహచాన్ కథలు ఇప్పటికీ వెతలు అనుభవిస్తున్న ముస్లిం స్త్రీల జీవితాలను మనకు గుర్తుకు తెస్తుంది.

సత్యవతి గారి సూపర్ మాం సిండ్రోం చదివి ఇప్పటికీ అనురాధలో తమని తాము చూసుకునే ఇల్లాల్లు ఎందరో!

రంగనాయకమ్మ గారి కల్యాణిలు ఇప్పటికీ మనకు ఎదురవుతూనే ఉన్నారు.

1984 లో సావిత్రి గారు బంది పోట్లు అనే కవిత రాసారు.

పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళిచేస్తానని

పంతులు గారన్నప్పుడే భయమేసింది !

ఆఫీసులో నా మొగుడున్నాడు

అవసరమొచ్చినా సెలవివ్వడని

అన్నయ్య అన్నప్పుడే అనుమాన మేసింది!

వాడికేం ? మగమహారాజని

ఆడా, మగా వాగినప్పుడే అర్థమై పోయింది

పెళ్ళంటే పెద్ద శిక్ష అని

మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని

మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే

మమ్మల్ని విభజించి పాలిస్తోందని!

ఈ కవిత ప్రస్తుత సామాజిక పరిస్థితిని అద్దం పట్టడం లేదూ!

సాహిత్యం ఒక పరిణామ క్రమంలో భాగం. వెనువెంటనే మార్పులు ఆశించకపోయినా ఆలోచనా సరళిలో తప్పక మార్పు వస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ మాత్రం స్వేచ్ఛ కూడా నాటి స్త్రీ వాదుల, ఉద్యమకారుల కృషి ఫలితమే కదా. కన్యాశుల్కం, సతీ సహగమనం వంటివి పారద్రోలబడ్డా, వంటింటికే పరిమితం అయిన ఆడవారికి విద్యా, ఆస్తి హక్కులు  అందించబడినా అందుకు కారణం సమాజాన్ని ప్రభావితం చేసిన సాహిత్యమే


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు