కథలు

(November,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఉడుకోడు (ఎరికిలోల్ల కథలు – 7)

(ఎరికిలోల్ల కథలు – 7)

ఆదివారం ఉదయాన్నే చావు కబురు.ఉడుకోడు చనిపోయాడు.ఊరు ఉలిక్కిపడింది. అసలు పేరు ఎరుకల రామచంద్రుడు అయినా గవర్నమెంటు లెక్కల్లోనే ఆ పేరు. అందరూ పలికేది మాత్రం ఉడుకోడు అనే.

చాలామందికి తెలిసినవాడు, కావాల్సినవాడు, పదికాలాల్లో పదిమందికీ మంచి చేసినవాడు.డెబ్బైఐదేళ్ళు దాటివుంటుంది వయసు. ఎడమచేతికి ఆరువేళ్ళు అతడికి.యస్టీకాలనీ  ఎగువ వీధిలో చివరి ఇల్లు. గుడిసెలో రాత్రి  పడుకున్న వాడు పడుకున్నట్లే పోయాడు.  నిద్రమధ్యలోనే  ప్రాణం పోయినట్లు వుంది. హాస్పిటల్ కు పోనే పోను అని మొండికేసిన వాడు, జన్మంతా ఒక్కసారైనా ఇంజెక్షన్  వేసుకోని వాడు, డాక్టర్ను చూసే పనిలేకుండానే చివరిదినాలు గడిపేసాడు.

చావుకబురు ఇండ్లు, వీధులు, ఊర్లు దాటే పనిలో వుంది.

అసలే పెద్దచావు. పెద్ద కులాల వాళ్ళు , సాటికులాల వాళ్ళు, కింద కులాల వాళ్ళు, పెద్దవాళ్ళు, నడివయసు వాళ్ళు , ఆడవాళ్ళు, మగవాళ్ళు , వీధిలోని వాళ్ళు, ఊరిలోని వాళ్ళు, చుట్టుపక్కల  ఊరి వాళ్ళు, మున్సిపాలిటి మనుషులు, టీచర్లు , ఎవరెవరో ఉద్యోగస్తులు,ఇంకాఎవరెవరో వస్తున్నారు, దండలు వేసేసి దండాలు పెట్టేసి పోతున్నారు. కొంతమంది ఫోటోలు తీసుకుoటున్నారు. ఫోన్లు,  వాట్సాప్ లు, మెసెంజర్ లు , ఫేస్ బుక్ లో ఆయన ఫోటోలు ఏవేవో సమూహాల్లోకి వెళ్లి అక్కడినుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి.ఆయన ఫోటో కింద నలుగురూ  నాలుగు మాటలు రాసినట్లున్నారు.చూస్తూ ఉండగానే గంటల వ్యవధిలో  చాలామంది వచ్చేసారు. కాలనీలో మనుషులకి అదొక పెద్ద పండుగలాగా జతరలాగా వుంది.

కాలనీలో ఆయనకు అందరూ బంధువులే కానీ ఆయనకంటూ ఒక కుటుంబం లేదు.పెళ్లి అయిందో లేదో ఈ కాలం వాళ్లకి సరిగా తెలియదు కానీ పిల్లలు అయితే లేరు.తోడబుట్టిన వాళ్ళు  ఎప్పుడో దేశాంతరం వెళ్ళిపోయి ఆయన ఒక్కడే ఇక్కడే మిగిలిపోయాడని అంటారు. పెళ్లి అయిందని  భార్య ఎవరితోనో లేచిపోయిందని కొందరు...లేదు, అతడే ఆమెకు నచ్చిన వాడితో ఆమె ఇష్ట ప్రకారం  పంపించేసాడని కొందరు అంటూ ఉంటారు.

అంత్యక్రియలు ఏ పద్దతిలో ఎలా చెయ్యాలో , ఎవరెవరు ఏమేం చెయ్యాలో కొందరు ముసలివాళ్ళు చెపుతున్నారు.వాళ్ళ మాటలకు  కొందరు నడివయసు వాళ్ళు మౌనంగా తలలూపుతూ వుంటే, ఇంకొందరు రకరకాల సందేహాలు అడిగి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు.  కొందరు యువకులు బ్యానర్లు కట్టాలని , ట్రాక్టర్లో ఊరేగింపు జరపాలని మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆడవాళ్ళు గుంపులో వున్నారు కానీ, నోర్లు తెరవడం లేదు. వక్కాఆకు నములుతూ తలలు నిలువుగా, అడ్డంగా అటూ ఇటూ ఆడిస్తున్నారు.

“ఎట్లో ఇప్పుడు  కరోనా భయం తగ్గింది . అయినా  దూరాభారం వచ్చిపొయ్యే వాళ్ళు ఎవరుoడారు? ఎక్కువగా రారులే. ఈ పక్క చిత్తూరు, మదనపల్లి, బంగారుపాళ్యం, వి,కోట రామాపురం వాళ్ళు ,ఆ పక్క అరవదేశం నుంచి వానియంబాడి వాళ్ళు,  ఆలంగాయం వాళ్ళు, ఆ పక్కనే అంబూరు వాళ్ళు.. అంతే కదా అందరూవచ్చేస్తార్లే  సాయంత్రానికి.”

“ కులం మొత్తం తెలిసినోడు. అందరికీ  కావాల్సినోడు, మనజనం చాలా మంది వస్తార్లే. బయటనుంచి అన్నాలటయానికి సరస్వతి  హోటల్లో ఆర్డర్ చెప్పేయండి. దూరంగా ఆ పక్క వీధిలో ఒక చోట పెట్టేస్తే తినే వాళ్ళు తినేసి పోతారు. ”

వరసలతో సంబంధం లేకుండా కాలనీలో ఎవరు చనిపోయినా, బయట ఊర్ల నుండి వచ్చేవాళ్ళ  కోసం అందరూ కలసి మధ్యాహ్నంఒక పూట భోజనాలు తెప్పించేయడం- ఈ మధ్య వచ్చిన కొత్త కట్టుబాటు అది.అన్నం పెట్టడానికి వరుసలేంది అని వాదించినవాడు ఉడుకోడే.!

బాధల్లో వున్నప్పుడు భోజనాల ఏర్పాటు ఇబ్బంది ఉండరాదని, ఉన్నవాళ్ళు పెట్టగలిగినా లేనివాళ్ళు చావులప్పుడు భోజనాలకి ఇబ్బంది పడకూడదని, అన్ని రకాలుగా అలోచించి, ఇక్కడున్న వాళ్లకు, బయటినుంచి వచ్చే వాళ్లకు ఇబ్బంది ఉండకూడదని అట్లా ఏర్పాటు అలవాటు చేసింది కూడా ఆ పెద్దాయనే. ఆఉడుకోడే.!

“మూడుదాకా రాహుకాలం కదా .మూడునుంచి మొదులు పెడితే నాలుగున్నరకు అంతా అయిపోతుంది. బయటినుంచి వచ్చినోళ్ళుమళ్ళిoకా ఎవురి తావులు వాళ్ళు చేరుకోవల్ల కదా..  ”

అంతా సిద్దం చేస్తున్నారు. ముందు షామియాన వద్దు అనుకున్నారు కానీ, వచ్చే  జనం అంతకంతకు పెరిగిపోతావుంటే షామియానా వెయ్యక తప్పింది కాదు. ముందు కుర్చీలు  అవసరం లేదు అనుకున్నారు, కానీ నూరుకుర్చీలు కూడా చాలలేదు.   పొలీసు  సైరన్ వినిపించే సరికి కాలనీలో అప్పటిదాకా అక్కడకి ఇప్పుడే కడులుదామా వద్దా అని తటపటాయిస్తున్న జనం మొత్తం గుంపులు  గుంపులుగా వచ్చేశారు.

 ఎండ పెరిగిపోతున్నా చమటలు కారిపోతున్నా ఉక్కపోస్తున్నా జనం కదలడంలేదు.  ఎవరు తెప్పిస్తున్నారో ఎవరు తెస్తున్నారో అక్కడ ఉంటున్న వాళ్లకి తెలియడం లేదు కానీ బ్యానర్లు వచ్చేసాయి. ముఖ్యమైన కూడళ్ళలో కట్టేశారు.  మైక్ సెట్ వచ్చింది, సంచుల నిండా  మంచి నీళ్ళ ప్యాకెట్లు, వాటర్ క్యాన్లు , ప్లాస్టిక్  గ్లాసులు వచ్చాయి.గుడిసె నుండి వీధి మొదలుదాకా రెడ్కార్పెట్ వేసారు.మైక్ ముందు నిలబడి నివాళి చెప్పడమో, ఆ పెద్దయన గురించి నలుగురూ మాట్లాడటం , కాలనీ మొత్తం ఇంటింటా వినపడుతోంది. ఆ కాలనీలో ఇదంతా కొత్త వ్యవహారం.అంతకు ముందు ఎప్పుడూ ఎవరికీ ఇలా జరగలేదు. అందరికీ విచిత్రంగానే వుంది.

ముందు పోలీసులు తర్వాతనాయకులు , ప్రజాప్రతినిధులు వచ్చారు. పొలీసు అధికారి  పెద్దదండ వేసి మౌనంగా వెళ్ళిపోయాడు, నాయకుడు కూడా కాస్సేపు  మౌనం  పాటించాడు కానీ మాట్లాడక తప్పలేదు. ఆయన అందుకు సిద్దపడే వచ్చినట్లుంది.పెద్దగా ఎవరూ బ్రతిమలాడకుండానే, గబగబా మైక్ అందుకున్నాడు.

“ నేను ఎంతోమందిని చూసాను. అందరూ నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగినవాళ్ళే కానీ మీకు ఏం సప్పోర్ట్ కావాలో చెప్పు , మంచికి నేను ఎప్పుడూ ముందు వుంటాను అని నేను రాజకీయాల్లోకి రాకముందే నాకు ధైర్నం చెప్పిన మంచి మనిషి మేనపాటి రామచంద్రుడు . ఎంతమంది కింద కులాల వాళ్ళు బడికి పోలేని స్థితిలో అయన వద్ద చదువుకుని బాగుపడినారో లెక్కే లేదు. గవర్నమెంటుటీచర్ కాకపోయినా, అంతకన్నా ఎక్కువే కష్టపడినాడు కదా?ఆయనకి కులం మతం జాతి, నాది నీది అనే బేధమే  లేదని నాకన్నా ఇక్కడ వుండే వాళ్ళకే తెలుసు. అయన శిష్యులు ఎంత మంది ఆయన్ను నీకు ఏం కావాలని అడిగినా అయన ఏ పొద్దూ నాకు ఇది కావాలని చెప్పింది లేదు. స్కూల్లోపిల్లోల్లకి పుస్తకాలు పెన్నులు బ్యాగులు బట్టలు అడిగినాడే కానీ , స్కూల్లో టేబుళ్లు బెంచీలు, కుర్చీలు  అడిగినాడే కానీ ఇంకొకటి అడిగినోడు కాదు.” నాయకుడి  ఆవేదన.

“  పేదోల్లు సార్, ఇండ్లకు పట్టాలు లేవు అని అర్జీలు ఆయనే రాసి మాతో బాటూ   ఎన్నిసార్లు యoఆర్ఓ వద్దకి  తిరిగినాడో లెక్కే లేదు. ఈ కాలనీ ఇండ్లు సాంక్షన్ అయ్యేదానికి మూలం కూడా ఆయప్పే కదా.పిడుగు పడి మండీపేటలో గొర్రెలు చనిపోయినా ముందుగా కదిలేది ఆయనే. కరెంటు షాక్ కొట్టి ఎరుకల వెంకట్రాముడికి కాళ్ళు చేతులు కాలిపోయినా ఆదుకోవడానికి ముందుకొచ్చి సరుకులు తెప్పించి ఇచ్చేది ఆయనే.అంత ఎందుకు? ఆడోల్లు డ్వాక్రా  గ్రూపుల్లో కరెక్టుగా లోన్లు కట్టకుండా వుంటే బ్యాంకు వాళ్ళు వచ్చి అడిగేది కూడా  ఈ పెద్ద మనిషినే కదా. నచ్చ చెపుతాడో, భయపెడతాడో, అధికారుల వల్ల కానిది, నాయకుల వల్ల కానిది చేసి  చూపిస్తాడు.  ” కౌన్సిలర్ సుబ్రమణ్యం.

షామియానా చాలడం లేదు. కాలనీలో అన్ని వీధుల్లో జనం.. జనం.. జనం. ఆ కాలని పుట్టినప్పటి నుంచిఎప్పుడూ ఆ కాలనీ అంత మంది జనాల్ని ఎప్పుడూ చూడనే లేదు. జనం ఎండను ఉక్కపోతను పట్టించుకునే స్థితిలో లేరు.మాటలన్నీ ఉడుకోడి గురించే. ఆలోచనలన్నీ అతడి గురించే.

దారులన్నీ యస్టీ కాలనీ వైపే.ఒక్క మాటలో చెప్పాలంటేఆ రోజు ఉడుకోడిదే.!. ఎండ ఎంత మాత్రం వాళ్ళని భయపెట్టడం లేదు. వాళ్ళలో హుషారు తగ్గడం లేదు. ఏదో కదలిక, ఏదో చైతన్యం, వాళ్ళు ఎందుకో ఉడుగ్గా ఉన్నట్లున్నారు.ఉడుకుడుగ్గా ఉన్నట్లున్నారు.అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి.రహదారి కూడళ్ళలో ఇంకా అక్కడక్కడా ఊరంతా బ్యానర్లు గాలికి అటూ ఇటూ కదులుతూ చప్పుడు చేస్తున్నాయి.

“ పలక కొట్టేవాళ్ళు దుడ్లు వద్దు అనేసిరి. గుంత తవ్వినోల్లు దుడ్లు వొద్దు అనేసిరి. సావు సరుకులకోసం పోతే ఉడుకాయప్పకే కదా అని ఫ్రీగా ఇచ్చినారు. కొత్త పంచె టవలు కూడా ఫ్రీనే. ఊరంతా తెలిసిపోయింది కదా చావు ఎవరిదీ అని. ఇంకో ఇచిత్రం తెలుసునా..”వక్కాకు ఎంగిలి దూరంగా రోడ్డు పక్కకు వెళ్లి  సైడు కాలువలో  ఉమిసి వచ్చాడు.

“ అటో వాళ్ళ గురించేనా.. ? ”  వంగిపోయిన నడుము ఆడమనిషి కిసుక్కున నవ్వింది.

“నా కొడుక్కూడా ఆటో డ్రైవరే కదా వాడు చెప్పినాడులే. యూనియన్ మొత్తం ఒకే మాట అంట. ”

“ ఇచిత్రం కాక పోతే బస్టాండుముందు వుండే  ఆటోస్టాండు  వాళ్ళు అందరూ గట్టిగా అనుకున్యారంట. సావుకు వోచ్చినోల్ల కాడ ఎవరిదగ్గరా రూపాయి కూడా తీసుకోకూడదని. ”

“   అదే న్యాయం కదా నాయనా . యూనియన్ యెట్లా ఉండాలో చెప్పి మనోళ్ళకే కాదు, ఎంతో మందికి సబ్సిడీ లోన్లు తెప్పించినాడు. వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబెట్టడమే కాదు , చేతిలో పదిరూపాయలు పడితే చెయ్యికి నవ్వ రాకూదడురా కన్నా ... అని ఎంత బాగా వాళ్ళ మైండు సెట్టు మొత్తం  మార్చినాడoటే, చాల మంది  సారాయి తాగకుండా ఉండరంటే అదంతా ఈ ఉడుకోడి పుణ్యమే కదా నాయనా .ఎన్నితూర్లు వీధి  గలటాలప్పుడు పెద్దమనిషిగా  పోలీసు స్టేషన్కి పోయింటాడు?. ”

కాలనీలో కుక్కలు కొన్ని అటూ ఇటూ దిక్కు తోచనట్లు పరుగెడుతున్నాయి. బోరిoగు చప్పుడు రోద పెడుతోంది. కొన్ని ఇండ్లల్లోంచి వస్తున్న రకరకాల టీవిల చప్పుడు , కుక్కల అరుపులు,వీటి మధ్యలోనే ఒంటి కాలి బోయకొండప్ప సారాయి మత్తులో పడుతున్న పాట వికారాన్ని తెప్పిస్తోంది.

ఉడుకోడి గుడిసె ముందు లైటు వెలుగుతూనే ఉంది. ఎవరూ దాన్నే ఆర్పే పని చెయ్యలేదు.  లోపల ఎవరో పెట్టిన దీపం గాలికి అటూ ఇటూ కదులుతోంది. గుడిసె ముందు కొయ్యమంచం పైన వుంది ఉడుకోడి శవం.

దాని పక్కనే రాతి బండలు.అక్కడకి వచ్చే వాళ్లకి  అవే కుర్చీలు, బెంచీలు.దానిపైన కావాటి మునస్వామి,ఎరుకల  నరసింహుడు, నాగరాజు, కుయ్యప్ప, కపాలి , మేనపాటి గోవిందస్వామి కూర్చుని వున్నారు. కొందరి  చేతుల్లో బీడిలు వెలుగుతున్నాయి. వాళ్ళకు కొంచెం ఎడంగా డిగ్రీ చదివే ఆడపిల్లలు ఆ కాలనీ వాళ్ళే పార్వతి, భూమిక నిలబడి పూలహారాలు మంచం చుట్టూ పొందిగ్గా పేరుస్తున్నారు. 

వీధికాలువలో దొడ్డికి కూర్చోవడానికి వచ్చిన చిన్నపిల్లాడు ఒకడు వీళ్ళని చూసి బిత్తర పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పరుగున వెళ్ళిపోయాడు.క్షణాల్లో వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుని మళ్ళీ  ఇంట్లోంచి బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మఅలివేలమ్మ  ఉడుకోడి గుడిసె ముందు నిలుచున్న వాళ్ళని, కూర్చున్న వాళ్ళని అదేపనిగా చూస్తా మొహం ఎందుకో తిప్పి వంకరగా మాట్లాడింది.

 “ నువ్వు ఆ పక్క  పోరా..వూరికే వూరికే మనుషుల్ని, శవాల్ని చూసి  భయపడితే ఎట్లా? సైలెంట్ గా  నీ పని నువ్వు చూసుకోవల్ల.”

నరసింహుడికి ఆ మాటతో కోపం వచ్చేసింది. గభాలున మంచం దిగి వీధిలోకి వచ్చిఅలివేలమ్మ  పైకి గొంతు ఎత్తి  గలాటాకి వెళ్ళిపొయినాడు.

“ ఏమ్మే నీమొగుడు కడుపాత్రం దేశాంతరం పోతా ఉంటాడు, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు యాడికి పోతాడో వాడికే తెలిదు.ఉండేది ఒక్కదానివి.ఇంట్లో  నీకు తోడు ఉండేది  ఆ పిల్లోడు ఒక్కడే. ఇప్పుడు వాన్ని ఆ పక్కకు దూరంగాతీసుకోని పోయిరాలేవా.. బుద్ధి ఉందా లేదా నీకు ? దినామ్మూ కొంచెం ఆ ఉడుకోడ్ని.. ముసలాయన కదా కొంచెం చూసుకోమ్మే అని చెపితే ఇంటివా?ఆఖరి దినాల్లో కొంచెంకూడూనీళ్ళు ఆయప్ప మొహాన పోసి వుంటే బావుండేది కదమ్మే. అడిగినోల్లకి అడగనోల్లకి అందరికీ ఆయప్ప అన్నీ చేస్తాడు కానీ,  ఆయప్ప నోరు తెరిసి ఎవుర్ని చిన్న సహాయం కూడా అడిగే రకం కాదని అందరికీ తెల్సు కదా ? ”

చీరకొంగు నడుముకు బిగించి కట్టుకుంటూ వక్కాకు ఎంగిలి ఉమిసి ఇoత లావు నోరు వేసుకుని, చేతులు తిప్పతా అలివేలమ్మ నేరుగా గొడవలోకే దిగేసింది.

“నువ్వు ఒప్పుకుంటే కాగితం బాండు రాసి ఇచ్చేయి మామా.నీ  ఖాళీ జాగా మాకు ఇచ్చేయి అంటే ఒప్పుకోలేదు   నువ్వు పోయినంకకాలనీలో ఈ గుడిసె లో మేం ఇల్లు కట్టుకుంటాం. బదులుగా రోజూ మూడు పూటలా తిండి పెడతాం మామా.. అని చెప్పినా కదా. నా మాటకి ఒప్పుకున్యాడా ఆ మొండి మనిషి ? పస్తులైనా వుంటాను, నా జాగాలో ఎరికిల  పిల్లోల్లు చదువుకునేదానికి షెడ్ కట్టల్ల, నా జాగా అమ్మను, ఇంకెవరికి ఈను  అంటాడు.అట్లాంటి వానికి నేను ఎందుకు....?” ఆయాసం వల్ల ఆగింది కానీ అప్పటికే ఆమె భారీ శరీరంలో  ఆవేశం వళ్ళ ప్రకంపనలు మొదలయ్యాయి.గొంతు కూడా వణుకుతోంది.మనిషి నిలువెల్లా ఊగిపోతోంది.

“ అప్పుడికీ ఎన్నోతూర్లు చెప్పి చూసినా. అప్పుడప్పుడు గంజి నీల్లు టీలు ఇస్తానే కదా ఉండా కదా. ఆయప్ప అందరికీ ధర్మాత్ముడే కావచ్చు, కానీ నాకు మాత్రం దుర్మార్గపు ముండా కొడుకే.. అట్లాంటి వానికి నేను ఎందుకు తిండి పెట్టల్ల  అని? ”

ఆమె మాటలకి చుట్టుపక్కల వుండే వాళ్ళు కూడా ఇండ్ల లోంచి బయటకు వచ్చేసి, చుట్టూ నిలబడి ఆసక్తిగా వింటుండి పోయారు.

“ ముందు నుంచి ఆయప్ప చెప్తానే వుండాడుకదాఅలివేలమ్మా.. కాలనీలో  గుడి కట్టేటప్పుడు కూడా ఎంత గొడవ చేసినాడో నీకు తెలిదా? గుడి ఎందుకురా ఎరికిలి నా కొడుకులారా ? ఇంకెన్ని గుడులు కడతార్రా ? ఇంకెంత మంది దేవుళ్ళని మొక్కుతార్రా అని గట్టి గట్టిగా అందురని అరిసేసినాడు కదా? అప్పుడే  మర్చి పోతివా ?  మా పిల్లోల్లు కొంత మంది ఆ ఉడుకోనికే సప్పోర్టు చేసి గుడి వద్దు లైబ్రరీనే కట్టల్ల, పుస్తకాలు పెట్టల్ల, ఈ పిలకాయలంతా సదూకోవళ్ళ అని తెగేసి చెప్పినారు కదా. ఆ పొద్దు  మన పిల్లోల్లు గుడి వద్దని  అడ్డం తిరిగిన రోజే ఎంత గొడవ అయిందో ఊరంతా ఇచిత్రంగా  కాలనీ గురించి కతలు కతలు చెప్పుకున్యారు కదా. ” దగ్గుతెర అడ్డురావడంతో  ఆరిపోయిన బీడీముక్క పారేసి ,  క్షణం  ఆగి గొంతు సవరించుకున్నాడు నరసింహుడు . 

“ ఆ పొద్దే చెప్పెసినాడు కదా. ఆయన ప్రాణం పోయినంక ఆ  సగం కూలిపోయిండే కాలనీ  ఇల్లు , యీ గుడిసె మొత్తం కలిపి ఎప్పటికన్నా ఇక్కడ లైబ్రరీ కట్టల్ల అని, దాన్నిండా  మన పిలకాయలు పెద్ద పెద్ద పరిక్షలు రాసేదానికి  పుస్తకాలు ఉండల్ల అని పెద్దఆశ  కదా ఆయప్పకి. ”అన్నాడు కపాలి.

ఆ మాటలేవి నచ్చనట్లు అలివేలమ్మ  మొహం తిప్పుతా “ ఓహోహో.. మన ఎరికిల పిల్లోల్లు సదివి.. ఇంకచూడల్లా సంబడం  ” అని తేలిగ్గా మాట్లాడే సరికి , అప్పటిదాకా చేతులు నలుపుకుంటా  నోరు మెదపకుoడా మౌనంగా  నిలబడి చూస్తూ వున్న ఆ ఇద్దరు అమ్మాయిలలో ఉడుకు  వచ్చేసింది.  అంత కోపం అంత ఆవేశం అంత దూకుడు యెట్లా వచ్చాయో  తెలియదు కానీ వాళ్ళ గొంతుల్లోంచి మాటలు దూసుకు వచ్చేస్తున్నాయి.

“ మేం ఇంకా పందులు తోలుకుంటా గాడిదలు మేపుకుంటా , ఇంటికాడ బోకులు తోముకుండా ఉండల్లా అనే నీ కోరిక. థూ... మనకి సిగ్గువుండల్ల అత్తా. పది మందిలో తల ఎత్తుకుని బతికే పనులు చెయ్యాల్ల,కానీ మేం ఇంతే. ఇట్లే పుట్టినాం, ఇట్లే చస్తాం అంటే ఎవరు మారస్తారు మన బ్రతుకులు.అందుకే అత్తా ఆ తాత చెప్తా వున్యాడు కదా .దేశానికి ఒక్క  అంబేద్కర్ చాలడు. ఒక్కో కాలనికీ ఒక్కో ఊరికీ ఒక్కో  ఇంటికి ఒక్కో అంబేద్కర్ కావల్ల  అని , మీకే అర్థం కాలేదు ఆ తాత చెప్పేది. ఒక్క మాట అడగతా చెప్పు. ఈ తాతే అడ్డం పడకుండా వుంటే, మొండిగా ఊరoదర్నీ ఎదిరిoచి నిలబడకుండా వుంటే మన లింగాపురం  భూములు మనచేతుల్లో ఉండేవా? మన కాళ్ళు మన భూముల్లో నడిచేవా? మన భూములకు పొయ్యేదానికి మనకో ఓనిమి  ఉందంటే అది ఆ తాత వల్లే కదా ?   ” భూమిక.

ఎన్నేళ్ళ కథ అది. ఎంత పెద్ద కథ.ప్రభుత్వం యస్సీ యస్టీ లకు భూములు ఇచ్చిన తర్వాత  ఎందరు ఎరుకల వాళ్ళు రైతులుగా మారినారో, చివరికి ఎందరుఎరుకల వాళ్ళు రైతులుగా మిగిలినారో చెప్పే కథ.ఎరుకల వాళ్ళు వాళ్ళ భూములకి వాళ్ళు పోలేకుండా లింగాపురం లో ఓనిమి (దారి ) లేకుండా పెద్దోళ్ళు  యెట్లా  మాయo చేసారో  చెప్పే కథ.ఒకసాదా సీదా  మామూలు మనిషి పెద్దోల్ల అన్యాయాన్ని ఒప్పుకోకుండా  తిరగబడి ఎదిరించి నిలబడితే  ఉడుకుడుగ్గా మాట్లాడితే, ఆ మనిషిని జైలుకు పంపిన కథ. సాటి కులమోల్లకోసం జైలుకు వెళ్లి ప్రభుత్వ టిచర్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఉన్నత విద్యావంతుడైన,ఒక  గిరిజన ఉపాధ్యాయుడి  కథ.ప్రభుత్వఉద్యోగం పోయినా జీతం లేకుండానే కొన్ని సంవత్సరాలపాటూ  ఎంతో మంది పేద పిల్లలకి మంచీ చెడు చెప్పి, పాఠాలు నేర్పి, ప్రయోజకుల్ని చేసిన ఒక సృజనకారుడి కథ.

***

“ బిరిన్నే చెప్పండి మీ భూములు  అమ్ముతారా? అమ్మరా ?” పెద్ద కులపోల్ల గొంతులు ఎప్పుడూ పెద్దవిగానే వుంటాయి. ఆ వూర్లో అప్పటిదాకా  ఎప్పుడూ ఆ గొంతులకు అడ్డం చెప్పిన వాళ్ళు లేరు. కానీ ఆ రోజు మాత్రంలింగాపురం లో  ఒక విచిత్రం జరిగింది.

ఎరుకల కులంలో పుట్టి , ఊరు దాటి, జిల్లా దాటి హాస్టల్లో చదువుకుని టీచర్  ఉద్యోగంలో కొత్తగా చేరిన ఎరుకల రామచంద్రుడు ఆ నిముషం  గొంతు విప్పాడు.  గుండె విప్పాడు.

“ ఏం మీరు కొనాలంటే మాత్రం మేం మా భూములు చవగ్గా ఇవ్వాల్నా ? మీరు అమ్మాలంటే మాత్రం రేట్లు ఆకాశం లో ఉండల్నా? తక్కువ జాతోల్ల భుములకు రేట్లు తక్కువ అంటారా? ఇదేమి న్యాయం? మా పక్కన మీ భూములు వుండచ్చు . ఎంత మాత్రం తప్పు లేదంటారు. అదే మా భూములు మీ పక్కలో వుంటే మాత్రం  అది మీకు తక్కువనా? ఏమన్నా ? కులాన్ని బట్టి భూమి రేటు కూడా మారుతుందా ? మట్టికి కూడా కులం ఉందoటారా అన్నా ? ఇదెక్కడి న్యాయం ?  ”

ఉడుకురక్తం కదా అనుకున్నారు అందరూ.

 పెద్దవాళ్ళు కోపంతో  ఉడికిపోయారు.ఎరుకల వాళ్ళు అంతకంటే ఎక్కువగానే  ఆవేశంతో ఉడికిపోయారు.

అంత ఉడుకుడుగ్గా మాట్లాడాడు రామచంద్రుడు.

“ నువ్వు  ఉండరా అబ్బోడా .... నీది ఉడుకు నెత్తురు. తొందర పడొద్దు”కులపెద్ద నాగయ్య అడ్డు వచ్చేశాడు.

“ ఎరికిలోడు సేద్యం ఒక్కటే నేర్చుకుంటే సాలదు మామా , పోరాటం చెయ్యడం నేర్చుకోవల్ల, బ్రతకాలంటే కరువుతోనే కాదు, మొండి మేఘాలతోనే కాదు, మొండి మనుషులతో, పెద్ద కులమోళ్ళతో పోరాటాలు చెయ్యడం నేర్చుకోవల్ల. పందుల్ని మేపే వాళ్ళకు , ఊరూరా తిరిగి  గాడిదలపైన ఉప్పు అమ్మి , ఎర్రమన్ను, ముగ్గుపిండి అమ్మిబ్రతికే వాళ్లకు,అడవుల్లో బ్రతికే వాళ్లకు,ఎండకు వానకి పురుగూ పుట్రకిభయపడని వాళ్లకి ఇంకొకరు నేర్పించల్లనా? బ్రతికేదానికి వయసుతో పనేముంది మామా ? ఏ వయసోడికైనా బ్రతకాలంటే నెత్తురు ఉడుగ్గానే ఉండల్ల. అసలు మనిషి అనే వాడు ఎప్పుడూ ఉడుకుడుగ్గానే  ఉండల్ల.” కుండబద్దలు కొట్టినట్లు తెగేసి చెప్పేశాడు రామచంద్రుడు.అతడు అట్లాగే బ్రతికాడు. జీవితకాలం మొత్తం ఉడుకుడుగ్గానే బ్రతికాడు. ఎక్కడా ఎవరిముందు తల దిoచిన వాడు కాదు. పెద్దోల్ల కుట్రలకి పొలీసుకేసులకి ఉద్యోగం పోయినా  వెనకడుగు వేసినవాడు కాదు.

నెలలు కష్టపడి  రాళ్ళు తేలిన నేలలో అడవిలాగా పెరిగిపోయిన మొక్కల్నిమొత్తం పీకిపారేసి,  బండరాళ్ళు పగలగొట్టి, , రాళ్ళు  ఏరి, నేల చదును చేసి సాగుకు అనుకూలంగా మార్చిన తర్వాత ఆ భూముల రూపమే మారిపోయింది. ఎందుకూ పనికి రాదనుకున్న కొండనేల, బండనేల, ఆ భూములపైన కన్ను పడిన తర్వాత జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు.  ఊరి  పెద్దోళ్ళకు కంటి నిండా నిద్ర లేకుండా పోయింది. ఆ పొలాలను ఎట్లాగైనా చవగ్గా కొనేయ్యాలని విఫల ప్రయత్నo చేశారు.

 

ఊర్లోంచి ఆ పొలాలకి వెళ్ళే దారి ఉన్నట్లుండి ప్రభుత్వ రికార్డుల్లోంచి మాయమైపోయింది.

ఆ దారికి  ఒక చరిత్ర వుంది.

అది ఆ ఊరి  రక్తచరిత్రలో ఒక భాగం.చెరువు దాటి , పెద్దోల్ల పొలాలు దాటి, వాగు దాటి వంక దాటినా తర్వాతా , కొండల్లో గుట్టల్లో , పిచ్చి మొక్కల మధ్య గవర్నమెంటు ఎరుకల వాళ్ళు బాగుపడాలని ప్రభుత్వం ఇచ్చిన పొలం అది.ఆ రాళ్ళల్లో ఆ బండ రాళ్ళల్లో, ఆ దుమ్ములో, ధూళిలో, ముండ్ల చెట్లల్లో, పాముల పొదల్లో , విషపు పురుగుల మధ్య కొన్ని సంవత్సరాలు ఎరుకల వాళ్ళు మనుషుల్లాగా కాక, యంత్రాల్లాగా  పని చేస్తే ఆ నేల అంత మాత్రం చదును అయ్యింది.ఎరువులు తోలినారు, ఎద్దులని తోలినారు, గంపల కొద్ది రాళ్ళు మోసినారు, ఒళ్లంతా రక్త గాయాలే.  ముందుతరం వాళ్ళ రక్తంతో చమటతో తడచిననేల అది.ఆ పొలాలకి వెళ్ళే దారి కోసం యుద్దాలే జరిగాయి, తలకాయలు పగిలాయి.పోలీసు కేసులు అయ్యాయి.

ఎన్నో పంచాయితీలు, రాజకీయాలు  నడిచాయి.చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కు, మదనపల్లి సబ్ కలెక్టర్ వద్దకు  వెళ్లి అర్జీలు ఇచ్చి వచ్చారు.ఆ అర్జిలన్నీ తిరిగి తిరిగి  ఇక్కడికే వచ్చాయి.   కొన్ని తరాలుగా కొన్ని దశాబ్దాలుగా వుండిన ఆ డొంక దారి రెవిన్యూ రికార్డుల్లోంచి ఎందుకు యెట్లా మాయమైoదో తెలియదు. దారి మూసి వేసిన రైతుల్ని గట్టిగా అడిగితే వాళ్ళు మొహాలు చూపకుండా కనపడకుండా పోయారు.

ఆ రోజు పెద్ద గొడవ అయింది.వీఆర్వో ను అడిగితే ముందు నోరు తెరవలేదు. అది దారి కాదు , అక్కడ దారే లేదు అనేశాడు. అందరూ ఎంత మాట్లాడినా , ఎంత బ్రతిమలాడినా  దిగి రాలేదు ఆయన.

“ఓపిక లేదా నీకు?. ఇంత తొందర పెడితే ఎలా ? మేం కూడా మనుషులే కదా మాకేమన్నా నాలుగు చేతులున్నాయా?  “ మొహం చిట్లించేశాడు. అవలింతను ఆపుకునే ప్రయత్నం కానీ, నోటికి చెయ్యి అడ్డం పెట్టుకునే పని కానీ చెయ్యకుండా మొహం అంతా పెద్దది అయ్యేలా నోరంతా తెరిచి పెద్ద చప్పుడుతో ఆవులించాడు  వీఆర్వో రంగారెడ్డి .  సన్నగా వున్నాడు కానీ అతడి గొంతు చాలా కరుగ్గా వుంది, మాట కటినంగా వుంది.నోట్లోంచి సిగెరట్ పొగతో ఇంకేదో కలసి మొత్తానికి వెగటు వాసన వస్తోంది.

మొహం పక్కకు తిప్పుకుంటే ఏమనుకుంటాడో అని సందేహిస్తూనే , ఒక అడుగు  వెనక్కు  వచ్చి, ఊడి పోయిన  అతడి చొక్కా గుండిల వైపు, ఉబ్బి పోయిన అతడి కడుపు వైపు  చూస్తూ  మెల్లగా ఇంకోసారి మెత్తగానే అడిగాడు ఎరుకల రామచంద్రుడు. 

“ దారి కోసం జనం అల్లల్లాడతా వుండారు  సార్, కొన్నేండ్లు వానల కోసం ఎదురు చూసినాం సార్ .ఇంకోన్నెండ్లు పట్టాలకోసం చూసినాం సార్. మా బావులన్నీ పూడిపోయక, రాళ్ళు తేలిపోయిన బావుల్లో పాములు పురుగు పుట్రా ఇన్నెండ్లూ వుoడి పోయినాయి సార్, ఇప్పుడైనా వానలు పడినాకే ఇంత మాత్రం నీళ్ళువచ్చి మా బావులు కళకళ్ళాడతా వుండాయి సార్, ఇప్పుడు గానా మాకు మా పొలాలకి పొయ్యేదానికి దారి వదల్లేదంటే మొత్తం మా పొలాలు అన్నీ మళ్ళీ బీడు పడిపోతాయి సార్, మా బ్రతుకులు మళ్ళీ  పందుల పాలు అవతాయి సార్.మీరు మా పరిస్థితి అర్థం చేసుకోండి..ప్లీజ్    ”

“ఊర్లో పందులు వుంటే ఊర్లో వుండే  వాళ్లoదర్కీ  వ్యాధులు వస్తాయి అంటారు సార్, నిజమే. పందులతో బాటూ మమ్మల్ని కూడా వూర్లోంచి వేలేస్తామని దండారా కొట్టి చెప్తావుండారు, బావుంది సార్, మీరు అందరూ ఎప్పుడూ బావుండల్ల. మేమే చెడిపోవల్ల. అంతే కదా సార్. మేం  అడవుల్లోకి పోకూడదు, వెదుర్లు కొట్టకూడదు, చెట్లు కొట్టకూడదు, మేకలు తోలుకుని అడవిలోపలికి పోకూడదు అంటారు.అప్పుడు  అడవులనుండి తరిమేస్తిరి,  ఇప్పుడు సేద్యం   చేసైనా పొట్ట పోసుకుందాం అనుకుంటే అదీ కాకుండా చేస్తా ఉండారు . ఇప్పుడు సేద్యం నుండి కూడా తరిమేస్తేఇంకా మేం యెట్లా బ్రతకాలని మీరంతా అనుకుంటా వుండారు? మీరు మాత్రం బ్రతికితే సాల్నా ? తక్కువ కులం లో పుట్టినామని ఇంత అలుసా సార్  మేమంటే ?”

“ ఏయ్ ఒక్కసారి చెపితే అర్థం కాదా మీకు ?మీ పొలాలకు ముందునుంచే ఎక్కడా  దారి  లేదు. రికార్డుల్లో ఎక్కడా మీ పొలాలకు దారి  వున్నట్లు ఎక్కడా ఆధారాలే లేవు. లేని దారిని ఇప్పుడు మీరు అడగతావుండారు.ఇదేమి న్యాయం?మల్లింకా  గట్టిగా ఎవరైనా   పెద్ద మనుషులు మాట్లాడితే మాత్రం కిందకులాలంటే అంత చులకనా మీకు అని నిలదీస్తారు.మీదే తప్పు. అసలు తప్పంతా మీదే.పెద్దోల్ల పొలాల్లోకి పోకండి. వాళ్ళు మంచోళ్ళు  కాబట్టి మీపై కేసు పెట్టకుండా మాటల్లోనే హెచ్చరిస్తా వుండారు. మీరంతా బాగుపడాలనే  కదా, పైకి రావాలనే కదా యస్సీ యస్టీలకు   ఇంత  నేల చూపిస్తుంది ప్రభుత్వం.ఇంత మాత్రం కొండలో గుట్టలో ఏదో ఒక  భూమి  ఇచ్చేదే గొప్ప, ఇంకా దారికూడా కావాలంటే యెట్లా?   ” 

“ రాళ్ళూ రప్పలు ఉండే చోట  కొండ తవ్వి సేద్యం చేసుకోవాల్నా మేం  ? దారి లేకుండానే  భూములిస్తే మేo ఏమైనా  గాల్లో ఎగిరి పోయి సేద్యం చేసుకోవల్నా ? ఎందుకు పనికి రాని భూముల్ని యా మూల్లోనో  మాకు ఇస్తానే  వుంటారు. కింద కులాలోల్లు యాడికి పోయ్యేదీ  లేదు, సేద్యం చేసుకునేదీ లేదు. కింద వుండే వాళ్ళు కిందనే ఉండిపోతాo. అయినా ఏంది సార్ అంత  అన్యాయంగా మాట్లాడతా వుండారు ?ఇన్నెండ్లూ మా పొలాలకి దారి  లేదంటే, మేమంతా గాల్లోకి పొయ్యి సేద్యం చేసినామా ఇన్నేండ్లు ?   ”

 మాటా మాటా పెరిగింది. ఉడుకోడు ఊరుకోలేదు.

ఆఖరికి  ఉడుకోడు పెద్దగా గలాటా చేస్తే వీఆర్వో అడ్డం తిరిగేశాడు.

“ పోనీలే...  అని మర్యాద ఇస్తా వుంటే ఏందిరా  ఎదురు మాట్లాడేది నేరిస్తా వుండారు? మాలోల్లు మాదిగోల్లే అనుకుంటే, ఇప్పుడు తిరగబడి మాట్లడేదానికి ఎరికిలోల్లు కూడా తయారవతా వుండారు.ఏం తెలుసురా మీకు? చట్టం తెలుసా , గవర్నమెంటు అంటే తెలుసా ? అధికారులంటే అంత అలుసా మీకు? నాతో జాగ్రత్తగా ఉండండి. ముందుగానే చెప్తా ఉండా. నాకు తిక్క రేగిందంటే కేసులు పెట్టి మీకు భవిష్యత్తే లేకుండా చేసేస్తాను బద్రం..   ” అది అతడి ఒక్కడి మాటే కాదు. పెద్దోల్ల మాట కూడా అదే. వాళ్ళ మాటలే అతడి నోటి వెంట...

వాళ్ళ  బెదిరింపులకు ఉడుకోడు అస్సలు లొంగలేదు. వీఆర్వో మొత్తానికి  అంతా తారుమారు చేసేశాడు. అది డొంకదారి కాదని, దొంగదారి అని తేల్చేశాడు.మారింది మార్చింది ఒక్క అక్షరాన్నే. కానీ  మారింది పాడయింది..ఎన్నో జీవితాలు.కొంతకాలం వరకూ  ఆ పొలాలు కొన్ని బీడుగానే ఉండిపోయాయి.కొన్ని  పెద్దోల్ల బలవంతాన ఆ దారిలేక,  వేరే దారీ..లేక తక్కువ ధరలకే అమ్మకానికి వెళ్ళాయి.కొన్ని పొలాలు  చేతులు మారాయి.ఇంకొన్ని పొలాలు వాళ్ళు చేసిన అప్పులకీ వడ్డీలకీ పెద్దోళ్ళ వద్దకే తాకట్టులోకి వెళ్ళిపోయాయి.

“ ఇదొక పనికిమాలిన రూలు. మన గవర్మెంటు వస్తానే దీనెబ్బా.. ఎదవ రూలు మార్చి పడేద్దాం అన్నా. అదేంది.. యస్సీయస్టీ ల  డికేటి భూముల్ని వేరే కులాలోల్లు  కొనకూడదoటే యెట్లా కుదురుతుంది? రిజిస్ట్రేషన్ చేసేది లేదంటే ఎట్లా ? ” పెద్దోల్ల బాధలు పెద్దోల్లవి.

తొంభైతొమ్మిది సంవత్సరాలకు లీజుకు పత్రాలు రాసుకున్నారు కొందరు. బాండుపేపర్ పైన అగ్రిమెంట్ చేసుకుని అమ్మకాలు జరుపుకున్నారు కొందరు. ఇచ్చిన సొమ్ముకు ఎక్కువగా బాండ్ పేపర్లో తెలివిగా  సంతకాలు తీసుకున్న పెద్దోళ్ళు  కొందరు. తాము ఇచ్చిన దానికన్నా తక్కువకే అతి తెలివిగా  బాండు పేపర్ రాసుకున్నపెద్దోళ్ళుఇంకొందరు .

నాగయ్య అడగనే అడిగేశాడు ” ఎందుకురా మన పొలాలు అమ్మకానికి పెడతారు. ఈ భూములు మళ్ళీ కొనాలంటే జీవితాంతం  మన బ్రతుకులన్నీ కలిపినా  సాలవు.అందరం కలసే  భూములు సాగు చేసుకుందాం .అందరూ ఒక్క మాట మీదే నిలబడదాం. ” ఆ మాటలు ఎవరూ పట్టించు కోలేదు. ఆయనంటే గౌరవం ఉన్న వాళ్ళు మాత్రం ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

“ పెద్దాయనా నువ్వు సెప్పేది వినేడానికి బాగానే వుంది. రైతుల్ని చూడు.ఉండేవాడు బాగానే వుండాడు. వుండే రైతుకు వాన వచ్చినా ఒక్కటే, రాకపోయినా ఒక్కటే, ఎందుకంటే ఉండేవానికి పది రకాల సంపాదనలు వుంటే అందులో సేద్యం ఒక్కటి మాత్రమే. జరుగుబాటు లేని రైతును సూడు. వానికి వానొస్తేనే సేద్యం వుంటుంది. వానొస్తేనే బ్రతుకు వుంటుంది, వాళ్ళ ఇంట్లో వానొస్తేనే పండగలు అయినా  దేవరలు అయినా  టయానికి జరగతాయి.టయానికి వానలు లేవు అంటే అదును తప్పేది వానోక్కటే కాదు. మొత్తం రైతు బ్రతుకే అదుపు తప్పుతుంది. వాళ్ళ పరిస్థితే అట్లా వుంటే ఇంక మనం ఎంత? మన బ్రతుకులెంత ?   ”అనేసారు.

“ అయినా మనకు వేట తెలుసు, జీవాల్ని మేపడం తెలుసు,అడవులు తెలుసు, తేనే,మూలికలు ఆకు పసుర్లు తెలుసు. అడవులు, ఊర్లు,వీధులు  తిరిగి తిరిగి బ్రతకడమే తెలుసు.వెదుర్లు  చీల్చి దబ్బలు, బుట్టలు అల్లడం తెలుసు,   మనం మానంగా బ్రతికే బ్రతుకు వదిలేసి,ఇప్పుడు మడక కట్టు, దుక్కి దున్ను, విత్తనాలు ఎయ్యి, కలుపు తియ్యి అంటే అదంతా కుదిరే పనేనా ?అయినా  సేద్యం పనులకి కూలికి పోయ్యేదానికే మనకు  అలవాటు కానీ ఇప్పుడు నువ్వే రైతువి, నువ్వే సేద్యం చెయ్యల్ల అంటే ఎరికిలోడికి గుoడె జారి పోతా వుండాదిరా అబ్బోడా.నీకు ఎన్ని తూర్లు చెప్పినా అర్థమే గావడం ల్యా... మార్చల్ల అంటావు, మారల్లఅంటావు,ఇదంతా అయ్యే పనే అంటావా?   ”నాగయ్య ఎంత చెప్పినా ఉడుకోడు వినలేదు. అప్పుడు మొదలు పెట్టిన పోరాటాన్ని ఆపనే లేదు.

***

ఉడుకోడు జీవితకాలం అట్లాంటిపోరాటాలు చేస్తూనే ఉండిపోయాడు.ఎప్పుడూ ఎక్కడా చల్లబడలేదు.

వయసు మళ్ళినా ముసలితనం వచ్చినా, చూపు మందగించినా, వినికిడి శక్తి తగ్గినా, కీళ్ళనొప్పులు సతాయించినా అతడిలో పట్టు తగ్గలేదు.ఇప్పటికీ అతడు ముసలివాడు కాలేదు, ముసలివాడని ఎవరి దగ్గరా అనిపించుకోలేదు. మార్పు కోసమే అతడి పోరాటం.అన్యాయాన్ని ఎదిరించడమే  అతడి జీవన విధానం. 

ఆ ఊరికి  పంచాయతి కేంద్రం ముందు నుండీ చాలా  దగ్గర. తర్వాత అది  మండలకేంద్రం అయింది, మున్సిపాలిటీ అయింది. పొలాలకు మనుషులు దూరమయ్యాక , కొత్త కొత్త పనులకు, కొత్త ఉపాధులకు వాళ్ళు అలవాటు పడ్డాక టౌన్ లో  కాలనీ ఇండ్లు మంజూరు అయ్యాక వాళ్ళ స్థావరాలు మారాయి.ఉపాధులు మారాయి. కొన్నేoడ్లకు  పందులు వూరికి దూరం గా ఉండాలనే ఆంక్షలు వచ్చాక, కొందరు పందుల తో బాటూ ఆ ఊరు వదిలిపెట్టేసారు.

ఉన్న అప్పులకి తోడు ఇంకా అప్పులు చేసి కొoదరు,  గవర్నమెంటు ద్వారా బావులు తవ్వుకొని కొందరు, బోర్లు వేసుకుని కొందరు మాత్రం  వ్యవసాయానికి అలవాటు పడిపోయారు. ఎంత లోతుకు వెళ్లి వేసినా  వాటిల్లో ఫెయిల్ అయిన బోర్లే ఎక్కువ. బోర్ ఫెయిల్ అయినా బ్యాంకు అప్పులు వడ్డీలు  కట్టాల్సిందే అని బ్యాంకులు తెగేసి చెప్పినప్పుడు, ఆ అప్పులు తీర్చేదానికి మిగిలిన పందుల్ని, మేకల్ని , ఆవుల్ని  అమ్ముకున్నవాళ్ళు కొoదరు.ఇన్ని బాధలూ పడిన తర్వాతా కూడా ఆ పొలాలకి వెళ్లి వచ్చేదానికి దారి లేదంటే వాళ్లకు ఏడుపే వచ్చింది. అట్లా  ఏడ్చుకున్న వాళ్ళు ఎందరో.  అటూ వ్యవసాయమూ చెయ్యలేక,ఇటు కులవృత్తులు చెయ్యలేని పరిస్థితిలో...అయోమయంలో వుండిపోయారు.. చాలా కాలం.

ఇప్పుడు వాళ్ళ వద్ద పందులు లేవు, ఆవులు వున్నాయి.

వాళ్ళ పిల్లలు వూరు దాటి హాస్టల్లో ఉండి చదువుకుంటూ సెలవుల్లో మాత్రం ఇండ్లకు వస్తారు. అప్పుడైనా వాళ్ళు ఎక్కువ మాట్లాడేది, ఎక్కవ సేపు వుండేది ఉడుకోడి వద్దే. చిన్నప్పటి నుండి వాళ్లకు అక్షరాలు నేర్పి,చదువుతో బాటూ మంచీ,చెడు చెప్పిందీ ఆయనే, బాగా చదవాలనే తపన కలిగించిoదీ ఆయనే. వాళ్ళల్లో కొందరు మైక్ ముందు నిలబడి కొత్త బాషలో కొత్తగా మాట్లాడుతూ వుంటే కాలనీ వాళ్లకి ఆశ్చర్యంగానే ఉంది.  

“ మనం ఎప్పుడూ వెనక అడుగు వేసే ప్రశ్నే లేదు. ఎంత కాలం ఈ వెనుకబాటుతనం.ఇంకెంత కాలం ఈ కుల రాజకీయాలు ? ప్రతి ఇంట్లో దేవుడి ఫోటోలు కాదు వుండాల్సింది, మంచి పుస్తకాలు ఉండల్ల.మనలో  ఏ ఒక్కడూ తక్కువ చదివే దానికి లేదు.ఎరికిలోల్లు అందరూ  ఎక్కువే చదవల్ల. ఉడుకాయన పోటీపరీక్షలకి పుస్తకాలు కావాలని మా సీనియర్లకి చెప్పినాడు, ఉద్యోగాలు వచ్చినోళ్ళంతా పుస్తకాలు కొనిస్తామన్నారు.గుడి బదులు లైబ్రరీ కడితే చాలు. అందరూ ముందుకు వచ్చి తలా ఒక చెయ్యి వేస్తే కానిది ఏముంది ? ” ఉడుగ్గానే ఉన్నాయి ఆ మాటలు.

అప్పుడు వచ్చింది భూమిక మైక్ ముందుకు.”  అన్నా మొన్న కూడా ఉడుకాయన ఆ ఓనిమి గురించే... ఆ దారి గురించే బాధ పడినాడు. ఏదో ఒకటి చేసి ఆ సమస్య పరిష్కరించాలి. అప్పుడే ఆయనకు శాంతి. ”

అప్పుడు చాలాకాలం తర్వాత మళ్ళీ ఆ దారి గురించి మాటలు మంతనాలు మొదలయ్యాయి.గవర్నమెంటు మారినప్పుడల్లా ఆ దారి కూడా  తన రూపు రేఖలు మార్చుకుంటుంది. మనిషి నడవడానికి మాత్రమే కుదిరే  దారి అప్పుడు మాత్రం  విశాలమవుతుంది!అంత వరకూ  అడ్డుగా వుండిన రైతులు అప్పుడు  మాత్రం  దారి వదలతారు,అప్పుడుఆ దారిగుండా  ఎద్దుల బండ్లు పోతాయి. ట్రాక్టర్లు పోతాయి, జేసిబిలు పోతాయి. ఆ కాలం లోనే ఎరుకలవాళ్ళు బోర్లు వేసుకోవాలన్నా , కలుపు తీయాలన్నా , నేల చదును చేసుకోవాలన్నా కుదురుతుంది.

ఇదేండ్ల తర్వాత ప్రభుత్వం మారితే దారి కూడా మారిపోతుంది. ఒక్కోసారి ఆ దారి కాలిబాట లాగా కుంచించుకు పోతుంది. అప్పుడు ఇక ఎద్దుల బండ్లు పోలేవు.ట్రాక్టర్లు , జేసిబిలు పోలేవు. సైకిళ్ళు పోవచ్చు, నడచి పోవచ్చు అంతే, అంతకు మించి పోవడానికి కుదరదు. అదే లింగాపురం  రాజకీయం.

పరుగులాటి నడకతో కొందరు అప్పుడే బస్సు దిగి వచ్చారు కాలనీ లోకి. 

 “ఎవరికి  ఏం కావాలన్నా ఉడుకోడి వద్దకే కదబ్బా అందరూ వస్తారు. గవర్నమెంటులో ఏ పని యెట్లా చెయ్యాలో ,చేయించుకోవాలో, పని కాక పోతే ఎవుర్ని కలవాలో, యెట్లా కంప్లైంటు చెయ్యాలో ఆయనే కదా నేర్పించేది. యస్టీ కార్పోరేషన్లో ఎంత మందికి ఎన్నెన్ని లోన్లు తీపిచ్చినాడో లెక్కేలే . మనోళ్ళవద్ద  ఏ ఆఫీసర్ అయినా లంచాలు అడగల్ల  అంటేనే  భయపడి పోతారంటే  వాళ్లకి ఉడుకోడు అంటే వుండే భయమే కదా కారణం.పద పదా .. చివరి చూపు చూసి ఆయనకో దండం పెట్టుకుని రావల్లనే కదా ఇంతదూరం వచ్చిండేది. బిరిన్నే పదా ..”  

ప్పుడు మైక్ ముందుకు పార్వతి వచ్చి నిలబడి చుట్టూ చూసింది.

పార్వతి పొడవుగా వుంటుంది. వాళ్ళ నాన్నకు అక్కడపొలం వుంది. కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది కానీ యస్ఐ కావాలని పోటీ పరిక్షలకు చదువుకుంటోంది. ఆమె తల తిప్పుతూ అక్కడ గుమిగూడిన వారిని చూస్తూ మాట్లాడుతోంది...

“ఒక్కటే మాట.  అంబేద్కర్ చెప్పినాడో , ఇంకొకాయన చెప్పినాడో  ఉడుకాయన చెప్పినాడో ఒక్కటే మాట..” ఎడమ చెయ్యి పైకి ఎత్తి మిగతా నాలుగువేళ్ళు మడచి పెట్టుకుని  చూపుడు వేలు మాత్రం పైకి ఎత్తి  చుట్టూ  చూపిస్తూ అంటోంది...

 “అస్సలు ఈ కులం ఎవడికి పుట్టింది? మన భూమి అనేది మన ఆత్మగౌరవం. ఎవరు ఏం చేసినా సరే మన భూములు అమ్మడానికి లేదు. మందు, బిర్యానీ,డబ్బులేకుండా ముందు  ఓటేద్దాం.అప్పుడు వాళ్ళే దారికొస్తారు.

మనది దొంగదారి అంటారా వాళ్ళు.. చూద్దాం..దాన్ని మళ్ళీ డొంక దారి చేసుకుందాం.ఇది మన దారి.. రహదారి.ఏమంటారు ? అన్నతమ్ముల్లారా , అక్క చెల్లల్లారా.. ఏమంటారు? ”

“అంతే అంతే.. “ జనం ఉడుగ్గా ఉన్నట్లున్నారు.

మనుషులు వడివడిగా నడుస్తున్నారు.అక్కడ ఎండవల్లో, ఎందువల్లో వేడి సెగ కొడుతోంది.గాలిలోనే  కాదు,మనుషుల నుండీ కూడా ఏదో వేడి సెగ మొదలయ్యింది.అక్కడి వాతావరణం ఉడుకెక్కిపోయింది.అక్కడున్న వాళ్ళు అందరూ ఉడుకెత్తి పోతున్నారు.
పలకల చప్పుడు ఎక్కువైంది. చప్పట్లు, ఈలలు, నినాదాలు, అరుపులు, ఏడ్పుల మధ్య  ఉడుకోడి శవం పైకి లేచింది.

@@@

 


ఈ సంచికలో...                     

Sep 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు