కథలు

(January,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

అమ్మదనం

సన్నగా కురుస్తున్న చినుకులు కాస్త సమయంలోనే హోరందుకోగానే అడుగు ముందేయలేక పక్కనే వున్నబస్టాప్ షెల్టర్ లో  నిలబడింది హిమజ.

ఏమిటే ఏదైనా విశేషమా... పెళ్ళై ఏడాది కావస్తోందిగా  అంటూ దీర్ఘం తీస్తూ వెనుకనుండి ఓ యాభైయేళ్ళ మహిళ ఓ అమ్మాయిని అడుగుతుంటే...

తననే అడిగారనుకుని ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూడగానే ఆ అమ్మాయి సిగ్గు పడుతూ
ఏమీ లేదు పిన్ని అంటూ మందిలో అలా అడక్కూడదనే  యోచన కూడా లేదని కళ్ళతోనే సైగ చేస్తూ పక్కకు తిరిగి నిలుచుకుంది  ఆ అమ్మాయి.

ఈ మాటల తూటాలకు అలవాటు పడిపోయి చాలా యేళ్ళైంది తనకు. ఇప్పుడూ ఎవరిని అడిగినా తననే అడుగుతున్నారనే భావన తనను వదిలి ఇంకా వెళ్ళలేదు కాబోలనుకుంది మనసులో.

వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో అడుగులో అడుగు వేస్తూ రెండు వీధులకావల వున్న ఇంటికి నడుస్తూ

మది గదిలో సాలె గూడులా అల్లుకుపోయిన కొన్ని చేదు జ్ఞాపకాలు మరిన్ని తీపి నిజాలు మనసును కుదిపేస్తున్నాయి.

"ఏమిటే హిమా ... ఇంకా నీళ్ళోసుకోలేదటే"

హమ్మో ..మా కాలంలో ఐతే నలుగురు బిడ్డల్నేసుకుని  వీధిలో తిరిగేవాళ్ళం.. పక్కింటి బామ్మ మాటలు రోజూ రోజాలా పుష్పించాల్సిందే ఆమె నోటిలోంచి.

పెళ్ళై ఏడాది కావొస్తోంది విశేషమేమి లేదా నీ కోడలు... ధీర్ఘ ఉపన్యాసాలు... ఉపనిషత్తులు నూరిపోసే తంతులు ప్రతిరోజూ.. చెవిలో పడాల్సిందే.

చుట్టపు చూపులు కాదు అవి చురచుర కోసే కత్తుల మాటలు గుండెను కోసి పచ్చని కాపురాల మధ్య చిచ్చు రగిలించేవి.

ఏ ముఖం పెట్టుకుని వస్తారో ఓ మందో మాకో తినిపించి  ఓ బిడ్డను కనిపించే యోగ్యత లేదు గానీ మా కూతురంటూ ఎగేసుకుని రావటమే  కన్నవారిని అనే  ఎగతాళి ఈటెలు ఇనుప చువ్వల కంటే ఘనంగా గుండెలో దిగబడేవే రోజూ.

ఇదిగో... ఈ ఫోటో చూడరా లక్షణంగా వుంది పెళ్ళైన ఆర్నెల్లకే నాకో మనవణ్ణో మనవరాల్నో కని చేతిలో పెడుతుంది రెండో పెళ్ళైనా మాకేం అభ్యంతరం లేదని ఎన్ని సంబంధాలొస్తున్నాయో  వెనుకనుండి దెప్పి పొడుపులు ఆకలి పేగులను ఎప్పుడూ చీల్చుతూనే వుండేవి.

ఎన్ని మాటలు మనసును గుచ్చినా మనసుపడిన భర్త  మాత్రం ఏనాడూ ఒక్క మాట కూడా అనకుండా
గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు.అదే నాకు కొండంత అండగా కనపడిన రాయి రప్ప చెట్టు చేమ
గుడి గోపురం చర్చి మసీదు అన్నీ చుట్టాను.

హోమియో ,అలోపతి, ఆయుర్వేదం,నాటు వైద్యం,ఆకు పసర్లు......ఎవరు ఏమి చెప్పినా అన్ని మందులు వాడాను నా కడుపున ఓ కాయ కాయదా అనే ఆరాటం అమ్మ అని పిలుపించుకోవాలనే ఆవేదనతో. ఏ దేవుడికి నాపై కనికరం లేదనిపించేది. పిచ్చిగా నాలో నేనే ఏడ్చుకునేదాన్ని మౌనంగా మాటలు రాని ఒంటరినైపోయాను. నా పరిస్థితి చూసిన ఓ మిత్రురాలు డాక్టర్ దగ్గరకు నువ్వొక్కటే వెళితే ప్రయోజనం లేదు ఇద్దరూ వెళ్ళి తగిన పరిక్షలు చేసుకోవాలని చెప్పింది.

పిల్లలు పుట్టకపోతే ఎప్పుడు ఆడవాళ్ళనే తప్పుగా చూసి గొడ్రాలిగా ముద్ర వేస్తారు. కానీ మగవారిలో కూడా లోపం వుండచ్చేమో ఇద్దరూ కలిసి వెళ్ళండంటూ సలహా ఇచ్చింది.

ఈ కాలంలో ఇది మామూలుగా తీసుకోవచ్చు . కానీ ఆ కాలంలో సందేహంతో అడిగినా అది వారి అహం మీద దెబ్బగా భావిస్తారు.ఆస్పత్రికి తనతో రమ్మని అడగాలి

అదే ఆలోచనతో రెండు రోజులు గడిపి చివరికి ధైర్యం చేసి తనపై వున్న ప్రేమతో తన మాట కాదనరనే నమ్మకంతో అడిగితే సరేనన్నారు.

హమ్మయ్య... ఆ రోజు ఎంత సంతోషం నా మాటకు విలువిచ్చి నాతో ఆస్పత్రికి వస్తాననడం.

రెండు రోజులు ఇద్దరికీ  వైద్య పరీక్షలు చేసి నాలో ఎలాంటి లోపమూ లేదు గర్భసంచి ఆరోగ్యంగా వుందని.

కానీ మీ వారిలోనే లోపం వుంది తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు.  భూమి  నిట్టనిలువునా చీల్చినట్టయింది నాకు. ఈ విషయం మరింత బాధ కలిగించింది. ఎప్పటికైనా అమ్మను కాలేకపోతానా అనే ఆశతో ఆరేళ్ళు గడిపాను కానీ ఇప్పుడు ఎప్పటికీ కాననే విషయాన్ని జీర్ణించుకోలేక పోయాను.

ఇంట్లో పదేపదే పిల్లల ప్రస్తావన వచ్చినప్పుడు నన్నుతిడుతున్నపుడూ నాలో ఏ లోపమూ లేదని గొంతెత్తి గట్టిగా చెప్పాలనిపించేది. ఆడది ఎంతటి అవమానాన్నైనా భరించగలదు. మగవాడు భరించలేడు.
తనను ఎవరైనా పల్లెత్తు మాటన్నా తట్టుకునే శక్తి నాకుండేది కాదు.. అందుకే ఎప్పటికీ తన లోపాన్ని ఎవరికీ చెప్పాలనిపించలేదు. దగ్గరి బంధువుల పిల్లలెవరినైనా దత్తత తీసుకుందామనుకున్నాతల్లి పిల్లలను వేరుచేసిన పాపమెందుకు మనకని వారించాడు భర్త. అనాథ పిల్లలను చేరదీస్తామంటె అత్తమామలు కులగోత్రాలు లేనివారిని గడపలో కాలు పెట్టనీయ్యనని శాపనార్థాలతో విసిగి వేసారి పోయిన హృదయానికి లేపనంగా   భర్త సుదర్శన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడవడంతో ,మధ్యలో ఆగిపోయిన నా చదువును మళ్ళీ మొదలు పెట్టమన్నాడు. ఇప్పటికే ఆలస్యమైంది సమయం వృధా చేయక  ఇక పిల్లల గురించి ఆలోచించక వేరే ధ్యాసలో వుంటే నీ ఆరోగ్యానికి మేలని ప్రైవేటుగా డిగ్రీ  పూర్తి చేయించి బీఈడీ చదివించాడు. తన ప్రోత్సాహంతో తొలి ప్రయత్నంతోనే టీచరుగా ఎంపికవడం నా జీవితంలో మరో అధ్యాయానికి నాంది పలికింది.

పెళ్ళైన ఏడు సంవత్సరాల వరకు పడిన కష్టాన్నంతా మరచిపోయి మల్లె పొదను అల్లుకోడానికి ఆరంభించాను.

ఆ ప్రారంభంలోనే ఉపాధ్యాయురాలిగా అడుగు పెట్టిన పాఠశాలలోని పిల్లల్ని   దగ్గరకు తీసి ఒడిలో కూర్చో పెట్టుకుని అక్షరాలు దిద్దిస్తుంటే అమ్మతనం పొంగుకు వచ్చింది.నాచుట్టూ చేరి వారి చిట్టి చేతులు ఆడిస్తూ మాటలు చెప్తుంటే మైమరచిపోయేదాన్ని.

బడిలో వున్నంత సేపు వారే లోకంగా గడిపేస్తూ ఇంటికి వచ్చినా ఆ పిల్లల ధ్యాసలో నిమగ్నమయ్యేదాన్ని.

ఆటలు పాటలు పాఠాలు అన్నీ టీచరమ్మగా కాక అమ్మగా నేర్పించాను. పిల్లలు కూడా అంతే ఆప్యాయంగా అభిమానంతో వుండేవాళ్ళు.

చక్కగా అన్నీ నేర్చుకుని చక్కని చుక్కల్లా అన్నిట్లో మెరిసిపోతే... మీకు ఎవరు నేర్పారు ఇవన్నీ అంటే మా అమ్మ నేర్పించారని  చెప్పేవాళ్ళు.

ఆ క్షణంలో నాకే పిల్లలుంటే ఒకరో ఇద్దరిచేతో అమ్మా అని పిలిపించుకునేదాన్ని. కానీ ఇప్పుడు కొన్ని వందల మందికి అమ్మనయ్యానని గొప్పగా ఫీలవుతున్నా.

దేవుడు ఒకటి దూరం చేసినా మరొక రూపంలో దగ్గర చేశాడు కదా అనే భావన మనసులో మెదులుతూనే వుంటుంది.

నా ధోరణి చూసి కొంతమంది నవ్వుకున్నా....

ఎగతాళి చేసినా...

అమాయకంగా ఏమీ ఎరుగని చిరునవ్వులు చిందించే పసి హృదయాలను నా గుండెకు హత్తుకున్నప్పుడల్లా

నా గుండె మరింత ఆశగా వారి కలలను పండించే దిశగా అడుగేయమని చెబుతోంటుంది నా మనసు. అదే ధ్యాసలో పాతికేళ్ళు గడిచిపోయాయి.

ఇక అమ్మ అనే పిలుపుకు ఈ రోజుతో ఆఖరి రోజని గుర్తుకు రాగానే కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగి జారి చెంపలపై వాలిపోయాయి.

పదుగురిని ఉన్నతంగా తీర్చి దిద్దిన ఉపాధ్యాయ వృత్తిని విడిచి పెట్టి పదవీ విరమణ చేసి ప్రశాంతంగా ఇంట్లో వుండమని చెప్తున్నారు అందరూ. ఒక నిర్లిప్తత పెదవులపై దొర్లుతూ

నాకు ప్రశాంతత అంటే నా పిల్లలతో గడపటమే కదా వారి అల్లరిని భరిస్తూ వారి ఆటలను ప్రొత్సహిస్తూ వారి భవిష్యత్తుకు వారధిగా వుండటమే కదా నాకు సంతోషం.ఆ సంతోష సంద్రం నుండి నన్ను నేను వెలివేసుకుని మళ్ళీ  ఒంటరినై గొడ్రాలిగా మిగిలిపోతానా...

ఏమో మాటలు ఈటెలు మళ్ళీ గునపంలా గుచ్చుతున్నాయి... అబ్బా అంటూ నడుస్తున్నదల్లా గుండెలు అదుముకుంటూ  అలాగే కుప్పకూలిపోయింది హిమజ.

నాలుగ్గంటలు ఎలా గడిచాయో తెలీదు

మాగన్నుతో మెల్లగా కళ్ళు తెరిచిన హిమజ చుట్టూ చూసి తనెక్కడుందో తెలుసుకోడానికి క్షణం పట్టింది

కింద పడటమే తెలుసు తర్వాత అని ఆలోచిస్తుంటె

భర్త సుదర్శన్ తలుపు తీసుకుని లోపలికి వస్తూ

అమ్మకేం కాలేదు మీరేం గాభరా పడకండి అంతా మీరనుకున్నట్లే యథావిధిగా జరుగుతుందంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే కళ్ళు తెరిచిన హిమజను చూసి ....

ఫోన్ కట్ చేసి

హిమా అంటూ దగ్గరగా వెళ్ళి

తన కళ్ళతోనే ఏమైందంటూ అడిగేసరికి

హిమ కళ్ళలోంచి నీళ్ళు ధారా పాతంగా వస్తుండటంతో

మాటలు పెగలక ముఖం పక్కకు తిప్పుకుంది

హిమా .. ఇటు చూడు అంటు తన రెండు చేతులతో ముఖం పక్కకు తిప్పి తన కళ్ళలోకే  చూసి

ఏంటి చిన్న పిల్లలా కన్నీళ్ళు పెట్టుకుంటూ 

నీకేమైనా ఐతే నేనేమైపోవాలి ... నిన్నే అమ్మగా ఆరాధిస్తున్న నీ పిల్లలేమైపోవాలి చెప్పు అంటుండగా సుదర్శన్ ..

ఇంకా ఎక్కడి పిల్లలు ఈరోజుతో నా ఉద్యోగానికి ఆఖరి రోజు కదా ఇక అమ్మా అని ఎవరు పిలుస్తారు 

నాకెక్కడున్నారు పిల్లలంటూ హిమ కళ్ళు తుడుచుకుంటూ ఒక్కోపదాన్ని ఒత్తి పలుకుతూ అంటుండగా...

ఐతే మేము మీ పిల్లలం కామా అమ్మా అంటూ

ఓ పదిమంది యువకులు గదిలోకి వచ్చారు

వారిని చూడగానే హిమకు అంతవరకు అనుభవించిన బాధ కనుమరుగై ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది

మధు ,కిరణ్ ,రోహిత్ మీరెప్పుడొచ్చార్రా అంటూ రెండు చేతులు వారికోసం చాచి దగ్గరకు రమ్మంది.

అందరూ హిమకు దగ్గరగా వెళ్ళి నిల్చుని

ఈ అమ్మను వదిలి పిల్లలుండగలరా చెప్పమ్మా అంటూ మధు హిమజ పక్కనే కూర్చుని తన చేయి తీసుకుని ఈ చేయితో అక్షరాలు దిద్దించారు.. మరి ఆ చేయిని ఇప్పుడు వదిలి మేమెక్కడికి వెళతాం అమ్మా అంటూ బుజ్జగింపుగా అనేసరికి...

ఒరేయ్ మధు, నువ్వొక్కడే కాదురా అమ్మ కొడుకు మేము కూడా అని కిరణ్ ,రోహిత్ ,రాజేష్ ,జగదీష్  ఒకేసారి మధు భుజం పట్టుకు ఊపుతూ అనే సరికి

హిమజ కళ్ళలో ఆనంద పువ్వులు విరిశాయి.

ఆ దృశ్యం చూస్తున్న సుదర్శన్ గారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

పదినిమిషాలు ఆ గదంతా నవ్వుల పరిమళంతో నిండిపోగానే హిమజ మనసులోని కలతంతా కలలా చెదిరిపోయినట్టనిపించింది.

ఏదో ఆలోచిస్తున్నట్టు హిమజ

అవును మధు నువ్వు నిన్న బాంబేలో వున్నానని ఫోన్లో  చెప్పావు కదా.. ఇక్కడికి ఎప్పుడొచ్చావు

కిరణ్ నువ్వు వైజాగ్ వెళుతున్నానని చెప్పి వెళ్ళావు కదా

రాజేష్ ,జగదీష్ ని అనుమానంగా చూస్తూ మీరు రామాపురంలో  కదా వుండేది

ఎప్పుడొచ్చారు మీరంతా అంటూ అందరినీ చూస్తూ ఒక్క సారిగా ప్రశ్నలేసింది

అమ్మా... అది అంటుండగా మధు

కిరణ్ ష్ అని సైగ చేయగానే..

సుదర్శన్ ముందుకు వచ్చి వారెంతగానో అభిమానించే అమ్మకు ఏమైనా ఐతే ఎక్కడున్నా రెక్కలు కట్టుకువాలిపోరూ అన్నాడు నవ్వుతూ.

ఐనా నాకేమైందని అంతగా కంగారు పడిపోయి

పిల్లలను కంగారు పెట్టారంటూ  చిరు కోపంగా విరుచుకుపడి   భర్తపై...

నాకు తలతిరిగి కిందపడటమే తెలుసు ,తర్వాత ఇంటికి ఎలా వచ్చానంటూ అనుమానంగా అడిగింది హిమజ.

ఊరంతా నీ పిల్లలే కదా హిమా....

ఆ పిల్లలే నిన్ను నాకు దూరం కాకుండా ఆదుకున్నారు.

మన వీధి చివర్లో వున్న టీ కొట్టులో పనిచేస్తున్న బాలు ,జోసెఫ్ ఇద్దరూ క్రింద పడ్డ నిన్ను చూసి అక్కడే హోటల్లో టేబుల్ పై పడుకోపెట్టి  నా దగ్గరకు పరిగెత్తి వచ్చి చెప్పారు. నేను అక్కడికి వచ్చేలోపు టీ కోసం వచ్చిన ఇంకో అబ్బాయి నిన్ను చూసి ఇక్కడున్నావేంటని తన కార్ లో ఆస్పత్రికి తీసికెళ్ళి అడ్మిట్ చేసి డాక్టర్ కు చూపించాడు. ఆ డాక్టర్ కూడా నీ బిడ్డే మరి అమ్మను కాపాడుకోలేడా క్షణంలో నీకు అన్ని పరీక్షలు చేసి

మానసికంగా ఒత్తిడి ఎక్కువైనందు వలన ఇలా అయ్యుంటది మరేం ఫరవాలేదని కాసేపు విశ్రాంతి తీసుకుంటే మామూలైపోతారని

నాకు ఫోన్ చేసి నేను అక్కడికి చేరుకునేంత వరకు  జాగ్రత్తగా చూసుకున్నాడు.

ఇదిగో ఇప్పుడే ఇంటికి వచ్చాం అన్నాడు సుదర్శన్ .

భర్త ఎంతగా తనకోసం ఆందోళనతో  తల్లడిల్లాడో తన ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది హిమజకు.

హిమా రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడుదాం అంటూ

అందరూ గదిలో నుండి బయటకు వచ్చారు.

రేయ్ కిరణ్ నువ్వు ఇక్కడే వుండు సార్ కు ఏ అవసరం వచ్చినా చూసుకో....

రేపు ఉదయం పది గంటలకల్లా అమ్మను తీసుకుని ఫంక్షన్ హాల్ కి వచ్చేయండి నేను అక్కడ ఏర్పాట్లు చూసుకుంటాను రాఘవ ఒక్కడే వున్నాడక్కడ అంటూ మధు చెప్పి బయలుదేరుతుంటే

మధు అని పిలిచాడు ...  సుదర్శన్

మధు వెనక్కు తిరిగి చెప్పండి సార్ అంటూ రెండు అడుగులు ముందుకు వచ్చాడు

సుదర్శన్ మౌనంగా వుండటం చూసి

సార్.... అన్నాడు

కిరణ్ రాజేష్ లు  తదేకంగా మధునే చూస్తున్నారు

సుదర్శన్ మధు చేయి పట్టుకుని సార్ కాదు

నాన్న అని పిలువండి అని అందరినీ దగ్గరగా తీసి గుండెలకు హత్తుకున్నాడు.

తన కళ్ళు చెమ్మగిల్లడంతో మాటలు రాలేదు

మధుకు.

మాకు పిల్లలు పుట్టరన్న దిగులుతో తనెక్కడ నాకు దూరమవుతుందోనని చదువు పై శ్రద్ధ పెట్టించి హిమజను

టీచర్ని చేశాను.. తను టీచర్ గానే కాకుండా  మీ అందరి మనసులను గెలుచుకుని అమ్మైంది . కానీ నేను నాన్న కాలేకపోయాను అంటూ కళ్ళనిండా నీళ్ళతో సుదర్శన్  మాట తడబడుతూ అంటుంటే

సార్ ,అంత మాట అనకండి మీరు మాకు తండ్రి కంటె గొప్పవారు. తల్లి దండ్రులను కోల్పోయి చదువు సంధ్యలు  లేక అనాథగా వీధుల్లో తిరుగుతుంటే అంత అన్నం పెట్టించి బడిలో చేర్పించింది మీరు అలాంటి మీరు మాకు తండ్రి కంటె ఇంకా గొప్ప స్థానంలోనే వున్నారు సార్  ,

తనను పక్కనే సోపాలో కూర్చోబెడుతూ

సార్మేమంతా మీరు పెంచిన పిల్లలమే

తల్లిదండ్రులని చూసుకోవడం పిల్లల బాధ్యత

మీరలా ఒంటరిగా వున్నామని మరెప్పుడూ అనకండంటూ తన చేతిలో భరోసాగా చేయి వేసాడు మధు.

సుదర్శన్ కు ఇప్పుడు మనసు తృప్తిగా అనిపించింది.





ఉదయం పదిగంటలు హిమజ రెడీ అయ్యావా పద పదమంటూ తొందర చేశాడు సుదర్శన్

ఏంటో మీ అవసరం.. ఎక్కడికో చెప్పరు

తిరిగి ఎప్పుడొస్తామో చెప్పరు.. మీకు తోడు కిరణ్ వాడి అర్జంట్ కి జెట్ విమానాన్ని నేను కాళ్ళకు కట్టుకోవాల్సిందే అంటూ హిమజ చెప్పులకోసం వెతుకుతుంటే సుదర్శన్ ఎదురుగా నిలుచుని హిమజనే చూస్తూ

ముదురు ఆకుపచ్చ రంగుపై సన్నగా లేత గులాబి రంగు బార్డర్ వున్న ధర్మవరం పట్టుచీర కట్టుకుని

నుదిటిపై ఎర్రటి మధురకుంకుమ దిద్దుకుని

చేతిలో ఎప్పుడూ నిండుగా వుండే మట్టి గాజులతో లక్ష్మీ దేవిలా వున్నావు హిమా... నా దిష్టే తగలుతుందేమో నీకు అన్నాడు కొంటెగా చూస్తూ...

ఆ... మరే ఇప్పుడు మీరు నాకు దిష్టి పెట్టాల్సిన సమయం పదండి మరి అనగానే వారిద్దరి సంభాషణకు కిరణ్ నవ్వుకుంటూ అమ్మా రండి అంటూ కార్ స్ట్రాట్ చేశాడు.

పదినిమిషాల్లో ఓ ఫంక్షన్ హాల్ ముందు ఆగింది కారు

హిమా దిగు ఇక్కడే ఫంక్షన్ అంటు తను దాగి డోర్ తీశాడు

హిమజ కారు దిగి  బయట చూడగానే పెద్ద హోర్డింగ్ పై తన ఫోటోతో పదవీ విరమణ శుభాకాంక్షలు

అమ్మకు అంటూ కొంత మంది పేర్లు.

ఆశ్చర్యంగా అలాగే చూస్తూ నిల్చుంది హిమజ.

మధు ,రాజేష్ హిమ దగ్గరగా వచ్చి అమ్మా లోపలికి రండి అంటూ స్వాగత తోరణాలతో ఇద్దరినీ ఆహ్వానించారు.

హిమజ లోపల చూడగానే నమ్మలేనట్లుగా వుంది తనకు

అమ్మా అంటూ అందరూ ఒక్కసారిగా తన చుట్టూ చేరారు

అందరూ తనకు దగ్గరైన వారే తన దగ్గర అక్షరాలు దిద్ది చదువు నేర్చుకున్నవారే.

హిమజ నోటి వెంట మాటలు రావడం లేదు

వారందరినీ అలా చూస్తూ వుంటె తన కళ్ళు ఇంకా నమ్మలేకపోతావుంది.సుదర్శన్ కు ప్రతి ఒక్కరినీ చూపిస్తూ వారి గురించి చెప్పుకుపోతోంది.

అందరినీ  పలకరించి కూర్చున్న హిమజకు ఎదురుగా రాఘవ ,రోహిణి కనపడ్డారు.

సుదర్శన్ వారిని చూపించి హిమా , ఈరోజు నీ దగ్గర చదువుకున్న పిల్లలందరూ ఇక్కడకు వచ్చారంటె దానికి కారణం వాళ్ళిద్దరే అని చెప్పాడు.

రాఘవ రోహిణి మధు ముగ్గరూ హిమజను ,సుదర్శన్ ను స్టేజిపైకి తీసుకెళ్ళారు.

వేదికపైకి జిల్లా విద్యాశాఖ అధికారులు , హిమజతో పనిచేసిన ఎంతో మంది ఉపాధ్యాయఉపాధ్యాయినిలను అందరినీ ఆహ్వానించారు.

వేదికపై మధు మాట్లాడుతూ వందల మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయినిగానే కాకుండా  ప్రేమను పంచి

నైతిక విలువలతో విద్య నేర్పించిన మానవతా మూర్తి

మా జీవితాలలో వెలుగు నింపిన మహోన్నతమైన

వ్యక్తికి మేము ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము. అందుకే తన దగ్గర అక్షరాలు దిద్దించుకుని ఆమె ప్రేమకు పాత్రులైన విద్యార్థులందరినీ పదవీ విరమణ మహోత్సవానికి ఆహ్వానించి

అమ్మ ఆశీస్సులు పొందాలని భావించామన్నాడు.

రాఘవ మైక్ తీసుకుని హిమజ దగ్గరకు వచ్చి ఆమె పాదాలను మొక్కి పైకి లేచి

అందరికీ నమస్కారం చేస్తూ

ఓ వీధి రౌడి కొడుకుగా ముద్ర పడినా ,నన్ను చదివించాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని  తల్లి దండ్రులున్న నేను వారిలానే పదేళ్ళు పెరిగాను.

చిన్న దొంగతనాలు చేసేవాణ్ణి . అలా దొంగగా పట్టబడ్డాను ఈ అమ్మకు.  ఎందుకూ పనికిరాని రాయిగా దొరికిన నన్ను రత్నంగా మార్చి ఈరోజు ఓ పెద్ద కంపెనీకి సీఈవోగా ఎదిగే సంస్కారాన్ని నేర్పించింది అమ్మ

అంటూ తన కళ్ళలో నీళ్ళు ఉబికి వస్తుంటే ఇక మాట్లాడలేకపోయాడు రాఘవ.

హిమజకు ఎంతో ఇష్టమైన రోహిణి మాట్లాడుతూ

ఎనిమిదేళ్ళ వయసులో ఊరి చివర పాడుపడిన ఇంట్లో ఎవరో అత్యాచారం చేసి కొన ఊపిరి తో వదిలి వెళ్ళిపోతే

అమ్మనాన్న కనీసం నా దగ్గరకు  కూడా వచ్చి చూడలేదు, ఆ ఊరి బడిలోనే పనిచేస్తున్న ఈ టీచరమ్మకు విషయం తెలిసి  ఆస్పత్రికి తీసుకెళ్ళి నన్ను బతికించి నాకు బతుకు నిచ్చింది ఈరోజు నాలా బలవుతున్న ఎంతోమంది ఆడపిల్లలకు అండగా అడ్వకేట్ గా న్యాయం కోసం పోరాడేలా చేస్తోంది అమ్మ ఇచ్చిన స్ఫూర్తి మంత్రం.

ఇక్కడున్న ప్రతి విద్యార్థికి ఇలాంటి కథలే కానీ ఆ కథలో టీచరమ్మగా పరిచయమై అమ్మగా మాకు ప్రేమను పంచి  మార్గదర్శకురాలైంది.

అలాంటి అమ్మ కు రిటైర్మెంట్ ఎక్కడుంది

అందుకే మాలాంటి పిల్లల కోసం "హిమజ ఛారిటీ హోమ్ "ను ఏర్పాటు చేస్తూ అమ్మకు కానుకగా ఇస్తున్నామని

వేదికపై అందరూ చూస్తుండగా  రాఘవ ,రోహిణి ,మంజుల ,కిరణ్ ,మధులు

హిమజ సుదర్శన్ కు ఛారిటీ హోమ్ కు  సంబంధించిన డాక్యుమెంట్సును చేతికందించారు.

హిమజకు ఇదంతా కలలా వుంది...

తను నేర్పింది నాలుగక్షరాలే కానీ నాలుగు కాలాలు గుర్తుండిపోయేలా నిత్యం  భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయ వృత్తిలో వుంటూ వారి పురోగమనానికి నాంది వాక్యం పలికింది.నీతి నిజాయితీలే మనల్ని మన బతుకుల్ని తీర్చిదిద్దుతుందనే మాటకు కట్టుబడి ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగిన తన విద్యార్థుల్ని తన బిడ్డలుగా చూసి దేవుడిచ్చిన మాతృత్వంతో

గర్వపడుతున్నానని , తల్లిగా ఇంతకంటె ఇంకేం కావాలని

సంతోషంతో ఆనంద భాష్పాలతో ఉక్కిరిబిక్కిరై

నా వృత్తికి పదవీ విరమణ చేయగలను కానీ నాలోని అమ్మదనం నా శ్వాస చివరి వరకు వుంటుందని

తన్మయమై మాట ఇచ్చింది.

భర్త సుదర్శన్ తనకు భరోసాగా హిమజనే చూస్తున్నాడు

ప్రాగణంలోని విద్యార్థులందరి కరతాళ ధ్వనుల మధ్య  హిమజ హిమాలయ పర్వతమైంది.

************


 

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు