కథలు

(April,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

శాంతాదేవి 

మధ్యాహ్నం ఒంటిగంటకు ఎగ్మూర్ స్టేషన్ లో బయలుదేరిన రైలు చిదంబరం చేరేటప్పటికి సాయంత్రం అయిదు గంటలయ్యింది. ఇంకా ఉక్కగా ఉంది వాతావరణం. చరణ్ బాగా అలిసిపోయాడు. అంతకు ముందురోజే సర్కార్ ఎక్సప్రెస్స్ కు భీమవరం లో బయలుదేరి ఈరోజు ఉదయానికి మద్రాస్ చేరుకొని, బయట భోజనం చేసి ఎగ్గుమూర్ స్టేషన్ కు చేరి, మరల ఇక్కడికి చేరేటప్పటికి ఈ సమయం పట్టింది. దగ్గరలోనే ఉన్న హోటల్ రూము కు చేరుకొని, కొంతసేపు రెస్ట్ తీసుకొని భోజనం కోసం బయలుదేరాడు.  కొద్ది దూరం లోనే కనిపించిన భోజన హోటల్ లో ఓటేబుల్ వద్ద కూర్చుని బేరర్ తో "ఓ మీల్స్" అన్నాడు. బేరర్ ఆశ్చర్యగా చూస్తూ "సాయంత్రం భోజనాలు ఉండవ్! టిఫిన్స్ మాత్రమే " అన్నాడు. అదేంటి? ఆని షాక్ నుంచి తెరుకొంటూ, అటూ ఇటూ చూస్తే అందరూ టిఫిన్స్ తింటున్నారు. ఆశ్చర్యం నుంచి తెరుకొని ఓ ప్లేట్ ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాడు. ఫోన్ లో ఎంక్వయిరీ చేస్తే, తమిళనాడు అంతా సాయంత్రం భోజనాలు ఉండవని తెలిసింది. అరే ఇంత చిన్న విషయం తనకు తెలియలేదే ఆని ఆశ్చర్యపోయాడు.

          చరణ్ భీమవరం లో సెటిల్ అయ్యాడు. దగ్గరలో వున్న స్వంత గ్రామం లో చేపల చెరువులు లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. బి ఎస్ సి డిగ్రీ భీమవరం డి ఎన్ ఆర్ కాలేజీ లో చేసిన తరువాత హైదరాబాద్ లో ఓ కెమికల్ ఫ్యాక్టరీ లో జాబ్, ఇంకొన్ని జాబులు చేసి చివరకు మరల భీమవరం చేరాడు. ఇప్పుడు మరల పీజీ చేయాలనిపించింది. అన్నామలై యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న సైకాలజీ దూరవిద్య ప్రోగ్రామ్ లో చేరాడు. వ్రాత పరీక్ష విజయవాడ లో రాయొచ్చు. కానీ ప్రాక్టీకల్స్, చిదంబరం లోని యూనివర్సిటీ క్యాంపస్ లోనే వారం రోజులు చేయాలి. ఇక తప్పదు కాబట్టి అక్కడకు చేరుకొన్నాడు.

మద్రాస్ కొన్ని సార్లు వచ్చినా, తమిళనాడు రాష్ట్రం లో లోపలి ప్రాంతాలు తెలియదు. అంతా కొత్తగా వింతగా అనిపిస్తోంది. బజారు కు వెళ్లాలంటే కొంచెం దూరం నడవాలి ఇక చేసేది లేక రూముకు తిరిగి వచ్చేసాడు.

ఉదయమే ఆటోలో యూనివర్సిటీ క్యాంపస్ కు చేరుకొన్నాడు. ఓ హాల్ లో సమావేశం. చాలా మంది వచ్చారు. అరవై మంది ఉంటారేమో. ఎక్కువ మంది టీచర్లే ఆని తెలిసింది. తెలుగు వాళ్ళు అయిదు అరుగురే ఉంటారేమో. అయిదు రోజులు ప్రాక్టికల్స్ చేయాలి. ఆరవ రోజు పరీక్ష. రిజల్ట్స్ వెంటనే యిస్తారు. లెక్చరర్ ఒకాయన ఈ విషయాలన్నీ వివరంగా చెబుతున్నాడు. అందరినీ, ముగ్గురు చొప్పున ఓ గ్రూపుగా విడదీశారు. ఇన్స్ట్రక్టర్ చెప్పిన విధంగా ప్రయోగాలు చేయాలి. ఫలితాలను టేబుల్ రూపం లో రికార్డ్ చేయాలి. చరణ్ టీమ్ మెంబర్స్ గా శాంతాదేవి, ఆదిత్యరావులు వచ్చారు. పరిచయాలు అయ్యాయి. ఇద్దరూ అతని కంటే పెద్దవాళ్లే. శాంతాదేవి బెంగళూరు లో రిజర్వ్ బ్యాంక్ లో ఆఫీసర్, మరో రెండు సంవత్సరాలలో రిటైర్ అవ్వబోతున్నారట. పెద్ద వయస్సు అయినా, కొంచెం మేకప్, పెదాలకు లిప్స్టిక్, కళ్ళకు ఎక్కువ కాటుక, పెద్ద బొట్టు, నేత చీర, ఏదో వయసున్న బెంగాలీ మేడం లా విచిత్రం గా కనిపిస్తోంది ఆవిడ. ఆదిత్యారావు పెద్ద ఎత్తు ఏమీ కాదు. టక్ చేసుకొని చురుకుగా కనిపిస్తున్నాడు. ధర్మపురి జిల్లా ఎస్ పి గా చేస్తున్నాడట. సెలవు పెట్టి ఈ కోర్సు పూర్తి చేయాలని వచ్చాడు. చరణ్ తన ప్రొఫైల్ వాళ్లకు చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు.

  ప్రయోగాలు ప్రారంభించారు. మొదట వెర్బల్ తో జరిగాయి. మొదట కొన్ని విడి విడి అక్షరాలను చూపించారు. తరువాత వాటిని రాయమన్నారు. చాలా తప్పులు వచ్చాయి. రెండోసారి కొన్ని విడి విడి పదాలు యిచ్చారు. ఈసారి కొన్ని తప్పులు తగ్గాయి. మూడోసారి, ఓ పేరా చూపించారు , ఈసారి తప్పులు చాలా తగ్గిపోయాయి. ఇవన్నీ ఆపేరా లోనివే ఆని తెలిసాక ఆశ్చర్యం వేసింది చరణ్ కి . అనుబంధం వున్న పదాలు ఎలా గుర్తుంటాయో తెలిసోచ్చింది. ఇలా మరికొన్ని ప్రయోగాలు జరిగాయి. చాలా మంది, సైకాలజీ క్లాసు విద్యార్థులు తను వున్న హోటల్ లోనే వుంటున్నారు. ఇప్పుడు పరిచయం అయ్యారు. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు  శాంతాదేవి, ఆదిత్య రావు గార్లు కలిశారు. అయన తాతలది విజయనగరం అట. నేరస్థుల మనస్తత్వం తెలుసుకోవడానికే సైకాలజీ చదువుతున్నట్లు చెప్పారు. కొంచెం ముక్త సరిగానే మాట్లాడు తున్నారు. బహుశా అయన లెవవెల్ కి తాము సరిపోమేమో ఆని అనిపించింది చరణ్ కు. శాంతా దేవి గారు చెబుతూ, తనకి వున్న మానసిక సమస్యల గురించి తెలుసుకోవడానికే ఈ కోర్సు లో చేరానని చెప్పారు.

ఆ రోజు మధ్యాహ్నం ఓ ప్రయోగం చేశారు.

ఓ పెన్ లాంటి పరికరాన్ని, ఓ బోర్డు మీద వున్న గాడిలో నడిపించాలి. పక్కగోడలకు తగిలితే 'కీ'.. ఆని శబ్దం వస్తుంది. ఇలా పదిసార్లు చేసి ఎన్నిసార్లు సౌండ్ చేసిందో రికార్డు చేయాలి. ఇప్పుడు ఒక అద్దాన్ని అడ్డుగా పెట్టుకొని, ఆ అద్దం లో చూస్తూ చెయ్యాలి. ఇది చాలా కష్టం గా ఉంటుంది. రివర్స్ లో అలోచించి పెన్ ను ముందుకు నడపాలి. చరణ్ కు కష్టం మైయ్యింది. నెమ్మదిగా చేయగాలిగాడు. ఇప్పుడు శాంతాదేవి వంతు వచ్చింది. రివర్స్ లో పెన్ నడిపించలేక చేతులు వణికాయి. చెమటలు పట్టాయి. చివరకు కళ్ళు తిరిగి పడిపోయింది. మొఖం పై నీళ్లు చల్లి నెమ్మదిగా లేపి కూర్చోబెట్టారు.

సాయంత్రం చరణ్ రూముకు చేరాకా కొద్ది సేపటికే ఆవిడ వచ్చింది. నాకు ఇలా జరిగిందేమిటి? ఆని ఆందోళనగా ప్రశ్నించింది. మనస్సు లో పడిన బలమైన ముద్రల వల్ల ఇలా జరిగింది. ముందు చేసిన ప్రయోగం వల్ల ఓ అలవాటు వచ్చింది. ఇప్పుడు రివర్స్ లో ఆలోచించడానికి మనస్సు అంగీకరించలేదు, పాత అలవాటు నుండి బయిట పడలేకపోయింది.అందుకే మీకు ఈ ఇబ్బంది వచ్చింది ఆని కూల్ గా చెప్పాడు చరణ్. ఆమెకు ఏమీ అర్ధం కానట్లు మొఖం పెట్టింది. చీకటి పడే వేళ వాళ్లిద్దరూ డిన్నర్ చేయడానికి బయలుదేరారు. ఆమె మాట్లాడుతోంది.. "బళ్లారి జిల్లాలో చిన్న గ్రామం నుంచి వచ్చాను.

నాన్న టీచర్. నాకు కొంచెం కొంచెం తెలుగు కూడా వచ్చు. స్కూల్ అయ్యాకా, డిగ్రీ, పీజీ కూడా బెంగళూరు లోనే. ఫస్ట్ ఎటెమ్ట్ లోనే రిజెర్వ్ బ్యాంకు లో జాబ్ వచ్చింది. అతను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లో ఇంజనీర్. నాన్న చూసిన సంబంధమే. ఎందుకో మా ఇద్దరికీ పోసగలేదు. అతను మూడీగా ప్రవరిత్తించేవాడు. తనో పెద్ద ఆధ్యాత్మిక వాదిగా పోజు పెట్టేవాడు. నాకు ఒక కొడుకు, ఇప్పుడు ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కంప్యూటర్ సైన్స్ తీసుకోమంటే, ఎన్విరాంన్మెంటల్ సైన్స్ తీసుకొన్నాడు. సరిగ్గా చదవడు. జూలాయి గా తిరుగుతాడు. వీళ్లిద్దరితో వేగలేక చస్తున్నా. ఆఫీస్ లో నేను పెద్ద ఆఫీసర్ జాబ్ చేస్తున్నా. స్టాఫ్ అందరూ గౌరవిస్తారు, కానీ ఇంటి దగ్గర అసలు విలువలేదు.ముగ్గురువీ మూడు త్రోవలు.ఈ మధ్య నాకు ఫిట్స్ కూడా వస్తున్నాయ్.".. ఆమె ఆపకుండా మాట్లాడింది. కళ్ళ చుట్టూ నల్లటి వాలయాలు కనిపిస్తున్నాయి. కళ్ళలోతడి. చరణ్ మోనంగా ఉండిపోయాడు. " కానీ నాకు కొడుకంటే పిచ్చి ప్రేమ. తనను వదిలి ఉండలేను. తనకు కూడా ఇష్టమే, బయిట పడడు. జన్మ పునర్జన్మలపైన చాలా పుస్తకాలు చదివాను, వీరేష్ నాకు ఎప్పుడూ కొడుకుగా పుట్టాలని కోరుకుంటానని చేప్పింది. హోటల్ కు చేరుకొన్నాక కూడా మరల రూమ్ కి వచ్చి మాట్లాడుతూనే వుంది. " నాకు దేముడంటే నమ్మకమని, అమ్మవారిని నిరంతరం పూజిస్తానని" అంది. ఓ నిమిషం ఆగి "మరి మీసంగతేమిటి?" ఆని అడిగింది. చరణ్ కొంచెం విసుగ్గా ఉన్నాడు. "దేముడు, దెయ్యంపునర్జన్మ, ఆత్మలపైన నమ్మకం లేదు.. ఈ ప్రపంచం కోట్ల సంవత్సరాల పరిణామం ద్వారా తయారైయ్యిందని  నా నమ్మకం. ఫ్రాయిడ్ మనస్తత్వ పరిశోధనల పై నమ్మకం కలుగుతోంది. కలల గురించి అయన విపులంగా చర్చించాడు. మీరు థియరీ మెటీరియల్ లో చదివే వుంటారు " అన్నాడు. ఆమె హతాసురాలయ్యింది. కొంచెం నిస్పృహ చెందింది. "ఏదో విశ్వాత్మే ఈ సృష్టిని నడిపిస్తోంది ఆని నేను నమ్ముతాను." ఆని కొంచెం అనుమానంగా చరణ్ వంక చూస్తూ అంది. "మీరు ఏమీ అనుకోకపోతే, నా అభిప్రాయాలు నాకున్నాయి. సైకాలజీ ఓ సైంటిఫిక్ థియరీ. అది ఇంకా అభివృద్ధి చెందుతోంది. చదివేటప్పుడు దాన్నే అనుమానిస్తే మనం సరిగా అర్ధం చేసుకోలేము. దేముడి గురించి చర్చ చాలా పెద్దది. తరువాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. రేపు కలుద్దాం " అన్నాడు చరణ్. పాపం కొంచెం ఇబ్బంది పడి వెళ్ళిపోయింది. అతనికి ఎప్పటికో నిద్ర పట్టింది.

తరువాత రోజు మరో ప్రయోగం. ఇది కూడా మనస్సు పై అలవాట్లు కలగచేసే ముద్రలను నిరూపించిదే. చరణ్ కు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ పదినిమిషాలలో అయిన అలవాట్లే మనస్సు పై ముద్ర వేస్తే, చిన్నప్పటినుంచి ఎన్ని అలవాట్లు? ఎన్ని ముద్రలు వేస్తాయోకదా!, మనిషి స్వేచ్చగా, శాస్త్రీయంగా ఆలోచించే అవకాశం దొరుకుతుందా? ఆని అనుకొన్నాడు. "ఏమి ఆలోచిస్తున్నారు?" ఆని అడిగింది శాంతాదేవి. అతను చెప్పాడు. ఆమె కొంచెం సేపు మౌనంగా వుంది. "సైన్స్, టెక్నాలజీలు మనిషికి నాగరికత నేర్పొచ్చునేమోగానీ, మానసిక తృప్తిని ఇవ్వలేవు, పైగా కోరికలు పెంచుతాయి. ఇది మరింత ప్రమాదం " అంది ఆవిడ. చరణ్ కు కొంచెం భావవేశం కలిగింది. గట్టిగా వాదించాలనుకున్నాడు. ఆవిడ అమాయక మొఖాన్ని చూసి జాలి కలిగింది. తన ప్రతాపాన్నంతా ఆవిడ పైనా చూపించడం భావ్యం కాదనిపించింది. "సరే ఈవిషయం తరువాత చర్చిద్దాం " అనుకొని ఇద్దరూ హోటల్ కు చేరుకొన్నారు. మధ్యలో చరణ్ అన్నాడు, "నేను వేరే తెలుగు ఫ్రెండ్ తో బయట కు వెళ్ళొస్తాను, మీరు డిన్నర్ కి నాకోసం ఎదురు చూడకండి " ఆని చెప్పాడు. " సరే నేను కూడా నా కొడుకు వీరేష్ తో మాట్లాడాలి " అంది ఆవిడ. అసాయంత్రం చరణ్, అతని ఫ్రెండ్ చిదంబరేశ్వర ఆలయానికి వెళ్లారు. గుడిచుట్టూ వున్న రెండు ప్రాకారాలు, గాలి గోపురాలు, గుడిలోని పురాతన శిల్పాలు, అద్భుతంగా తోచాయి. నటరాజస్వామి, శివకామి ఆమ్మ వారి దర్శనాలు పూర్తి చేసుకొని, ఆలయ వీధుల్లో తిరిగారు. అయ్యో శాంతదేవి గార్ని కూడా తీసుకు రావాల్సిందే ఆని అనిపించింది చరణ్ కు.

ఈరోజైనా నాన్ విజిటీరియన్ భోజనం దొరుకుతుందేమోనని ఎంక్వయిరీ చేశారు. అందరూ ఒక సందు వైపుకు చూపించారు. అది ఒక పాత మండువా లోగిలి. జనం కిట కిట లాడుతున్నారు. ఓ మూల  ఓ బెంచీ దొరికింది. ఏది ఎక్కువగా తింటున్నారో తెలుసుకొని అదే ఆర్డర్ ఇచ్చారు. మలబార్ పరాట, పిట్ట వేపుడు.. రుచి చూస్తే స్వర్గం కనిపించింది. జన్మ ధన్యమైయ్యిందిరా బాబూ అనుకొన్నారు వాళ్ళు.

రూమ్ కి వచ్చి పడుకున్నాక,

 

నిద్రలో కల..కారులో వచ్చి అమ్మవారి దేవాలయం ముందు దిగింది శాంతాదేవి. టిప్ టాప్ గా తయారైయ్యింది. నల్లద్దాల కళ్ళజోడు. పెద్ద ఎర్రని బొట్టు. వెనకాల సెక్రటరీ లాగా చరణ్.

పూజారి ఆవిడకు నమస్కారాలు చేస్తూ, గోత్ర నామాలతో పూజ చేసాడు." వీడిపేరున కూడా పూజ చేయండి "అంది స్టైలు గా. అతనికి కోపంగా ఉంది కానీ ఏమీ అనలేక పోతున్నాడు. కారు దగ్గరకు తిరిగి వెలుతుంటే ఆమె కాలు బెణికి వెల్లకిలా పడింది. అతనికీ కడుపుబ్బ నవ్వొచ్చింది. ఆమె కొరకొరా చూసింది. పట్టుచీర వెనుక పక్క అంతా మట్టయ్యింది. తను మసి ముసి గా నవ్వుకొంటూ ఆమె లేవడానికి చేయి సాయం చేసాడు... కల చెదిరింది.

 

ఎప్పుడో అర్ధ రాత్రి తలుపు కొట్టిన చప్పుడు. తెరిచే టప్పటికి, ఎదురుగా నైటీ లో శాంతాదేవి. అచ్చం కాళికా మాతలా వుంది. కళ్ళు ఎర్రబాడ్డాయి. జుట్టు విడిపోయి వుంది. "రండి కూర్చోండి.." ఆని చరణ్ మంచం పై కూర్చుండిపోయాడు ఆవలిస్తూ. ఆమె సీరియస్ గా ఉంది. "చదువుకున్నోళ్ళందరూ హేతువాదులో నాస్తికులో అవ్వాలా " ఆని అడిగింది. "ఆలా ఏమిలేదు ఎవరి ఇష్టం వాళ్ళది" అన్నాడు కూల్ గా. "దేముడు లేడు, పునర్జన్మ లేదు, ఈజన్మ లోని ప్రేమలు, అనుబంధాలు ఇక్కడితో సరి అంటున్నారుకదా, మరి నా కొడుకు వీరేష్ తో బంధం ఈజన్మతో సరా? వచ్చే జన్మలో ఏమౌతామో చెప్పండి, లేకపోతే తప్పు ఒప్పుకోండి " ఆని గట్టిగా అడిగింది ఆవిడ. ఆమె చరణ్ వైపు తీవ్రంగా చూస్తోంది. ఇప్పుడు రాత్రి వేళ ఈ గొడవ అవసరమా ఆని అనిపించింది చరణ్ కు. "ఏమో ఎవరి ఆలోచనలు వారివి. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది." అన్నాడు చరణ్ నెమ్మదిగా. ఆమె కొంచెం చల్లబడింది "అలారండి దారికి, తెలిసీ తెలియని విషయాలను పట్టుకొని వాదించకండి. ఈ ప్రాక్టికల్స్ కు వచ్చినప్పుడే అర్ధమయ్యింది, ఇదంతా ఓ ట్రాష్ ఆని, రేపు నా కొడుకును రమ్మన్నాను. కారు లో వెళ్ళిపోతా!" అంది సీరియస్ గా. ఇంకా రెండు రోజులే వుంది. పరీక్షలు పూర్తిచేసి వెళ్లొచ్చు కదా " అన్నాడు చరణ్. "అక్కర్లేదు! ఈ చెత్త నేర్చుకోవడానికి ఇంత దూరం రావడమే దండగ, రేపు బ్రేక్ఫాస్ట్ సమయం లో కలుద్దాం. " అంటూ వెళ్ళిపోయింది. కొద్ది క్షణాల్లో నిద్రలోనికి జారుకున్నాడు చరణ్.

ఉదయం ఎనిమిది గంటలకే తలుపు కొట్టింది ఆవిడ. వీరేష్ ని పరిచయం చేసింది. ఎత్తుగా అందంగా వున్నాడు. గిరజాలజుట్టు.. పాలకరించాడు చరణ్. " ఓ పదినిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను లాబీలో వైయిట్ చేయండి." ఆని చెప్పాడు. కొద్దిసేపటికి ఫోన్ నంబర్స్, ఇమెయిల్ అడ్రస్లు మార్పిడి చేసుకొని వాళ్ళు వెళ్లి పోయారు.

ఈ రెండురోజులు చరణ్ కు భారంగా గడిచింది. మొదట తలనెప్పి తగ్గిందిరా బాబూ అనుకొన్నాడు. కానీ తరువాత, పాపం ఆమె అమాయకురాలు ఎలాబతుకుతుందో ఆని దిగులు పడ్డాడు. ఆలోచించే కొలదీ ఏదో అర్ధమౌతున్నట్లు అనిపించింది. అప్పుడే తనపైన కూడా ఏవో ముద్రల ప్రభావం పడుతున్నాయేమోనని అనిపించింది.

భీమవరం వెళ్లిన రెండు నెలలకు శాంతాదేవి నుంచి ఇమెయిల్ వచ్చింది.. "తిరిగి వెళ్లిన కొద్దిరోజులకే ఆయనతో గొడవయ్యింది. బహుశా అతనికి నేను ఉద్యోగం చేయడం, వ్యక్తిత్వం నిలుపుకోవడం ఇష్టం లేదు అనుకొంటున్నాను. ఇప్పుడు విడిగా ఉంటున్నాం. పాపం వీరేష్ బాగా డిస్ట్రబ్ అయ్యాడు. ఓరోజు పార్టీ కి వెళ్లి లేటుగా వచ్చాడు. తాగాడనుకుంట. ఉదయాన్నే తిడితే, రెండురోజులు కనిపించలేదు. అదికూడా తప్పేనా! నా కొడుకు కూడా దూరమైతే, నేను బతకలేను. జీవితం బోరింగ్ గా ఇబ్బందిగా వుంది. నా రిటైర్డ్ లైఫ్ ఎలావుంటుందో ఆలోచిస్తే భయంగా ఉంది. మీరు, మీవాదనలు గుర్తుకువచ్చాయి. ఆలోచిస్తే కొంచెం నిజం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. మీతో కొంచెం అతిగా ప్రవర్తించనేమో అనిపించింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఐ యామ్ సారి! మీరు మీకుటుంబం క్షేమం గా ఉండాలని కోరుకొంటూ సెలవ్.. శాంతాదేవి.

ఏదో తెలియని బాధ అతన్ని ఆవరించింది.

  మరో ఆరు నెలలకు కాల్.." నేను వీరేష్ అంకుల్, అమ్మకు ఓ నెల క్రితం అనారోగ్యం చేసింది. కొన్ని రోజులు హస్పెటల్ లో ఉంచాము. తరువాత ఫిట్స్ ఎక్కువయ్యాయి. ఎప్పుడూ మందులపైనే ఉండేది. దేముడనేవాడు ఉంటే తనలా నమ్మే వాళ్ళు కష్టాల్లో ఉంటే ఎందుకు ఉద్దరించడు? ఆని అడిగేది. చరణ్ చెప్పినట్లు దేముడే లేకపోతే పక్కదారి పట్టిన ఈ సమాజాన్ని ఎవరు దారిలో పెడతారు? ఆని ప్రశ్నించేది. తనకు మేము ఎలా సమాధానం చెప్పాలో తెలిసేదికాదు. మనస్సులో ఏదో మదన పడేది. మూడు రోజులక్రితం ఫిట్స్ ఎక్కువగా వస్తే మరల హస్పెటల్ లో చేర్పించాము. ఒక రోజు కోమాలో వుండి నిన్ననే చనిపోయింది". ఆని చెబుతూ చాలాసేపు ఏడ్చాడు. చరణ్ కొంతసేపు సముదాయించాడు ఫోన్ లోనే. మరో పది రోజులు తరువాత చరణ్ ఫోన్ చేసి  వీరేష్ తో మాట్లాడాడు.

" అమ్మను నువ్వూ, మీ నాన్నగారు కూడా సరిగా అర్ధం చేసుకోలేదేమో అనిపిస్తోంది. ఆమె మీ ఇద్దరినీ ఎంతో ప్రేమించింది. కానీ మీరు ఆమెకు ప్రేమను అందించలేకపోయారు. దీనివల్లే ఆమె డిప్రెషన్ కు గురై మానసిక అనారోగ్యానికి గురైయ్యింది. ఇప్పుడైనా మేల్కొని మీ పద్ధతులను సరిచేసుకోవాలి, లేకపోతే మీ భవిషత్తు కూడా దెబ్బతినొచ్చు " ఆని చెప్పాడు. "అవును అంకుల్ మావల్ల అమ్మ ఎంతో నలిగి పోయింది ఆని ఇప్పుడు బాధ కలుగుతోంది " అన్నాడు వీరేష్.

పాపం శాంతాదేవికి అన్నీ ఉన్నా జీవితం ఇలా ముగిసి పోయిందేమిటి? ఆని నిట్టూర్చాడు చరణ్.

కాలం గడిచే కొలదీ శాంతాదేవి, వీరేష్, అన్నామలై యూనివరసిటీ, సైకాలజీ క్లాసు, చరణ్ స్మృతి లో మసకబారి పోతున్నాయి.


ఈ సంచికలో...                     

Jul 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు