కథలు

(April,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

చెదిరిన కల

పొధ్ధాటి కల్లు వాసన కమ్మగా వోత్తాన, ఏ పుర్గు పుట్రో అచ్చి కుడ్తదన్న భయంతో, సలిని కప్పుకున్న శీకట్ని సూత్తు ఒక్కడే కంకిశేను కాడ వన్కుతూ కూసోని ఎదుర్సూత్త ఉండు జోసఫ్. సెకను ముల్లుల తన గుండె సప్పుడు ఒక్కటే కల్వరింత, పూర్ణ ఎప్పుడొత్తదా అని. ఈ ఎదురుసూపులు కొత్తేం కాదు, అయ్న ఆళ్ళు కల్శిన ప్రతిసారి ఒక కొత్త కలలా ఉంటది. సుట్టు శీకట్లో ఈదర గాలులు ఉక్కిరిబిక్కిరి సెత్తుంటే, డిశంబర్ నెలలో అచ్చె తూర్పు దిక్కు సుక్కలోలే, అంత సీకట్లో కుతం ఎన్నెల ఎల్తురొలే వొత్తాన పూర్ణను సూత్తు జోసెఫ్ "ఏమైంది ఇంతశేపైంది, ఇగ రావేమో అనుకున్న" అని అన్నడు.  తన మాటల్ని పట్కోకుండా పూర్ణ అచ్చి జోసెఫ్ పక్కపొంటి కూసోని తన కొంగును ఇద్దర్కి కప్పుకుంటూ కండ్లల్ల నీల్లు నింపుకొని జోసెఫ్ని అల్లుకపోయింది.

పూర్ణ సుట్టూరా శేతులు పోనిచ్చి తనకి ఇంకా దగ్గర్గా లాక్కొని, "ఏమైంది" అని అడ్గిండు జోసెఫ్.

"మా మామ శెట్టుమించెలి జారిండే" అని తన లోపలున్న బాధనన్సుకుంటు సమ్దానమిచ్చింది పూర్ణ.

అవునా..! అసలు ఏమైంది నర్సి బాబాయ్కి అని అచ్చెరంతో మల్ల అడ్గిండు జోసెఫ్.

"సాయింకాలం మామ శెట్టెక్కి కల్లు లొట్టి దించ్తుంటే మోకు జారిందట, ఐతే ఎంబటే తాటిశెట్టును కర్సుక పట్టిన కుతం జర్ర జర్ర జారిపడి, మామ చాత్పొంటి, కొంకుల్పొంటి మల్ల జబ్బలపొంటి తాటిపేడ్లు గీర్కపోయి ఎర్రగా ఐంది అని ఏడ్తూ జెప్పింది.

తన శంపలపొంటి కార్తున్న నీల్లను తుడ్సుకుంటా జోసెఫ్ మరింత్గా పూర్ణను అముల్కొని తన నొసల్పై ముద్దునిత్తు, "ఇప్పుడైతే మంచిగనైతే ఉండు కద అని అన్నడు.

"హ కానీ, మా అవ్వ సచ్చిన్కానుండి నన్ను దెచ్చుకొని బిడ్డలెక్క సాత్తాండు, కన్నబిడ్డ అమ్ముల్ని గూడట్ల జూశ్కోలే. అయిన మా మామ శెట్లెక్కితే గాని మాయిల్లు గడ్వదు. అద్గాక రికాం లేకుండా ఏ పని దొర్కితే ఆ పన్కిబోతడు. అట్లాంటిది మావోనికేమన్నైతే ఏంగాను మా బత్కు" అని బదులిచ్చింది పూర్ణ.

జోసెఫ్ ఒక్కశార్గ పూర్ణలోని బాధను మర్శెలా గట్టిగా అముల్కొని పూర్ణ వొల్లంత తడ్ముతూ, ముద్దుల్తో తడ్పేశాడు. ఎచ్చగా జోసెఫ్ శేతులు తాకేసరికి పూర్ణ వొల్లంత అదిరి, తన ఆలోచలన్లన్ని దెంకపోయాయి. ఆ రాత్రిలో ఏకమయ్యి ఇద్దరు కల్శి మరో కొత్త కల కన్నరు. సూట్టురా ఎన్నో ఇసపు పురుగులు పూశున్న, ఆ కంకిశేను చీకట్లను మిన్గురేల్గులు శీర్తుంటే, ఊపిరి తీశ్నట్లైతున్న సలిలో ఈదర గాడ్పులు గూడ ఎచ్చగా అనిపిత్తాంది యిద్దరికిప్పుడు. ఆ కలయ్క రేపిన ఆయితో పూర్ణ "బావ మనం మన కులాల్ని కాదని కల్తానం కద, రేపీళ్ళు మనల్ని ఒప్పుకుంటరంటవా" ? అని అడ్గింది.

"అస్సలు ఒప్పుకోరే"

"మరి ఏం జేద్దామే, నేనైతే నిన్ను ఒదిలి బత్కలేను బావ, ఎటైనబోయి బత్కుదామా"

"నాగ్గుత అట్లనే అనిపిత్తాంది గానీ, మా ముసల్లోలను సూత్తనే బయమేత్తాంది. మా అవ్వాయ్య లేకున్నా నన్ను ఇంతటోన్ని జేశిర్రు, నే ఏటన్నబోతే ఆళ్ళేం గావలే అని గొంతులో గుట్కెత్తు జోసెఫ్ మొఖం మాడ్చిండు.

పూర్ణ, మాడ్చిన జోసెఫ్ మొఖాన్ని శేతుల్తో తుడ్తూ తన చెంపల్పొంటి ముద్దిచ్చి, "కొన్ని దినాలెలే మల్ల ఇటే అద్దాం.

సరే మరి నేన్బోనా అచ్చి చాలా సేపైతంది" అని అన్నది.

"సరే మంచపో"

*

ఊళ్లే పొద్దెక్కగానే పనారాటంతో ఎక్కడోళ్ళు అక్కడ్కి బోయిండ్రు. అట్లనే గొర్లను కొట్టుకుంటూ బాషి, జోసెఫ్ని ఎంబడెట్టుకొని ఊర్దాటి శాన దూరమచ్చిండ్రు. నెత్తి మీద ఎండ సుర్రుమంటు ఎన్ను తాక్తుంటే జోసెఫ్ శిరాక్తో "ఏమే బాషన్న మంచ పన్నోన్ని ఈ ఎండల తిప్పబడ్తివి".

"ఏమ్రా అయ్సు పొరడు పొద్దెక్కేదాక పంటర్రా" అని ఎక్కిరిచ్చిండు బాషి.

"గదంత గాద్గాని గిప్పుడు నీ గొర్లతోబాటు నన్నెంద్కు దోల్కచ్చినవో గద్జెప్పు" అని మల్ల గదే శిరాక్తో అన్నడు జోసెఫ్.

"ఉచ్చాగ్దార , జేప్పెదాక ఇనవ్ ఇటిను మొదాలు, మీ అయ్య నేను సొంత అన్నదమ్ముల్లెక్క ఊళ్లే తిరిగేటోళ్లం, తాగేటోళ్లం. కానీ, మీవోడు కొత్వాల్ దొరోడి బాయి పన్కిబోయి సచ్చిన్కానుండి నాకు నిమ్మలం లేద్రా. ఆరోజు మస్త్ లొల్లి జెశ్నగనీ, ఆడి దొరతనం ముందు నేచెల్లలేద్రా" అంటు కండ్లకత్తాన నీల్లను తుడ్శుకుంటూ "ఐతే ఇయ్యాల కోన్ని కోశ్నరా, మీ అయ్యకు పెట్టలేన్గా, కనీసం నీకైనా ఇంత పెడ్దామని దిస్కచ్చినరా" అని సద్దిని జూపిత్తు అన్నడు.

బాషి మాటల్కి జోసెఫ్ కత్తాన బాధనన్సుకుంటు, "ఊకోయే బాషన్న బోయినోళ్లు మల్లాత్తర" అని సమ్దాయిత్తు "సరే దిందాంబ" అంటూ పక్కనే ఉన్న తుమ్మశెట్టు కిందకు దిస్కపోయిండు.

యిద్దరి నెత్తికున్న తువ్వాల్నిప్పి తన శెమట మోకాన్ని తుడ్తుంటే అత్తాన వేడి గాడ్పులు కుతం దాక్గానే ఒళ్ళంతా ఆయిగనిపించి ఎన్కకు ఒర్గి కండ్లు ముస్కుండ్రు. గప్పుడు జోసెఫ్ పక్కకి బాషి దిర్గుతూ "అరె చిన్న ఒక పాట పాడ్రాదురా" అని అడ్గిండు.

"నీకెట్ల ఎర్కనే నే పాడ్తని" మూశున్న కండ్లను తెర్తు అడ్గిండు జోసెఫ్.

"ఎహే నాకెంద్కు దెల్వదురా ఆరోజు మీ కిస్మస్ పండ్గరోజు బీరు సాయిబోళ్ల యింటి కాడ స్టేజేశి అది.., అది,

దాన్నేమంటార్రా" ?

"అదానే, గిటార్".

ఆ అదే దాన్ని వాయించ్కుంటా స్టేజి మీద నువ్వు పాడ్తాంటే సిన్మాలా హీరో లెక్క కొట్టినవ్ పో" అని మస్త్ సంబ్రపడ్డాడు బాషి.

ఒర్గినోడు లేశి సకులం ముకులం పెట్కొని "అవునానే అన్న" అని అడ్గిండు జోసెఫ్.

"అవున్రా, ఆ మీటింగ్ నడ్తాంటే మొత్తం ఆడపొరగాళ్ల కండ్లల్లా మొత్తం నువ్వే మెదిలినవ్. అది జూశి ఊళ్లే ఎంత మంది కుల్లుక సచ్చిండ్రో" అని అంటూ "నాకోసం ఓ పాట పాడ్రా" అని మల్ల అడ్గిండు బాషి.

ముశి ముశి నవ్వుకుంటా "సరే అన్నం దిన్నంక పాడ్తలే" అని జోసఫ్ లేశి ఎంటదెచ్చుకున్న బాటిల్ నీల్లతో శేతులు కడ్కుండ్రు ఇద్దరు.

 

*

"అరే జోసెఫ్ గిప్పుడన్న పాడ్రా" అని బాషి అయిపోయ్న సద్ది డబ్బను డొల్లేక్క కోడ్తుంటే "జీవనదిని నా హృదయములో" అంటూ ప్రభువు పాటనెత్తుకుండు జోసెఫ్.

ఇంతకు మున్పు డోలు కొట్టిన అన్భవంతో బాషి మార్శి మార్శి కొడ్తుంటే, జోసెఫ్ పాటలు మార్సుకుంటబోతూ యిద్దరు పాటల్లో మునిగిబోయిండ్రు.

"దెలికుండానే శాన సేపయ్తాంది, ఇగబోదాంబ" అని లేశి గొర్లను మల్లెశిర్రు యిద్దరు. ఎన్నో ముచ్చట్లు ఎట్టుకుంటూ, నవ్వుకుంటా, చూశేటోళ్లకు ఒక్కింట్లోల్ల లెక్కకొడ్తు బోతావుంటే, శేరువు కట్ట మీద పోడ ఎండ సొగసుకు శెమట సుక్కలద్దినట్లు ఈపంత మెర్తుంటే కట్టెల మోపెత్తుకొని, పిల్లకాలువంకోలే నడుమంకను తిప్పుతూ నడ్తాంది పూర్ణ.

ఆళ్ల మాటలిని పూర్ణ ఎన్కకు ఒక్కశార్గ తిర్గి జోసెఫ్ని జూత్తు ఓ నవ్వు నవ్వి ముంద్కుబోతుంటే, జోసెఫ్, పూర్ణ కండ్లాంకలను, నడుమంకను జూశి తన కాళ్ళ అడుగుల్కి వంకలు పడ్డాయి. ఇందంత జూత్తాన బాషి "ఏడిదాకచ్చిందిరా మీ కత" అని అడ్గిండు.

జోసెఫ్ అదిర్బడి పూర్ణ మత్తులోంచి బయటకత్తు "నీకెట్ల దెల్సునే" అని అచ్చెరంతో మల్లదిర్గి అడ్గిండు.

బాషి పక్కకు బోతున్న గొర్లను మర్రెత్తు "నాకు బోనాలప్పుడే దెల్సుర వారి, మా పండుగల్కి నేనెప్పుడు పిల్శిన రానోడివి, ఆరోజు ఆపోరి చిల్కల బోనమెత్తుకొని వొత్తాంటే ఎన్కేన్క నువ్వు ఎగిరేగిరి జూశినప్పుడే సమజైంది నాకు" అని జేప్పిండు.

బాషి మాటల్కి జోసెఫ్ శిగ్గుపడుతూ, నవ్వుకుంటా బాషిని హత్తుకుండు. ఎంబటే "భయంగల్ల కోడాట బదాట్ల గుడ్డెట్టినట్టు, శేశిందంత శేశి గిప్పుడు శిగ్గుపడ్తానవారా" అని నవ్వుకుంటా అండు బాషి.

"అద్గాదే బాషన్న అసలు ముచ్చట, మా పెళ్లి ఐతదా ? అని బయమైతందే" అని నవ్వుతున్న మోకాన్ని మాడ్శి జెప్పిండు జోసెఫ్.

"నీకేందక్కువరా, మంచ సదువ్కున్నావ్, రేపో మాపో నౌకరైతది. వాళ్ళోళ్ళు ఒప్పుకోకపోతెం మీరే ఏటన్నబోయి పెళ్లి జేసుకోనచ్చి, పోలీస్ స్టేషన్లో కూసొండ్రి" అని సలయిచ్చిండు బాషి.

బాషి మాట్లాడుతాంటే గమ్మునుండి సోచాయిత్తు నడ్త ఉండు జోసెఫ్. పర్తితి బాష్కి సమజై జోసెఫ్ కాడ్కిబోయి ఎన్కనుంచి ఎన్నుమీద నేనున్న అన్నట్లు రెండు దెబ్బలేశి "బోయి ఆ పిల్లతో ఏమన్నా మాట్లాడుబో" అని ముంద్కు దోశిండు బాషి.

గొర్లను దాట్కుంటూ జోసెఫ్, పూర్ణ కాడ్కి రాంగానే పూర్ణ ఒక్కశార్గ అదిర్పడి "అబ్బా..! నువ్వుబోయే బావ ఎవల్లన్న జూత్తరు" అని బయంతో అన్నది.

"అద్గాదే నే జెప్పేదీను" అని ఏదో జెప్పబోయిండు జోసెఫ్.

"జెప్పేదేంలే, చీకటైనాక కల్దాం గాని మొదలూ ఈన్నుంచిబో" అని ముంద్కు దన్న దన్న బోయింది  పూర్ణ.

బాషి ఆళ్ళిద్దరిని సూత్తు "అరేయ్ గిట్ల బయపడ్తే, రేపు మీ రెండు కులాల పెద్దమనుషుల్ని ఎట్ల ఎదుర్కుంటరు, మీ పెళ్లెట్ల జేసుకుంటరు" అని నవ్వుతుండు.

"అట్లేం లేదే, ఆళ్ల మామ సూత్తడన్న భయం తప్ప, నేనంటే మస్త్ ఇష్టమే ఆ పిల్లకి, నాగోసం ఏమైన జేత్తది" అని అన్నడు జోసెఫ్.

"సరే ఊకే గదె సోయిలుండకు, ఎట్లాయ్యేది గట్లనైతది గాని ఇగ నువ్వు ఇంటికిబో పొద్దుబోయింది" అని జోసెఫ్ ధైర్నం జెప్పుతూ పంపిండు బాషి.

మాపటెండ కుంకుమ్బుసుకోని సన్నగా ఒంటిమీద పడ్తాంటే, రూమల్సుట్టుకొని ఇంటికెళ్తున్నా జోసెఫ్ని జూత్తు "ఈ పొరగాళ్ళు కులాలు కాదన్న కలలా బత్కుతాళ్ళు, రేపీల్లా ముచ్చట ఊళ్లే తెల్తే ఎంత పెద్దలొల్లయింతదో" అని బాషి మెదడ్ల దిర్గుతూ, ఏమైనగాన్ని గానీ పొరగాన్కి ఏం గాకుండా కాపాడ్కోవాలే" అని మన్సుల అన్కుంటూ గొర్లను ఇంటికి తోల్కబోయిండు.

*

జోసెఫ్ ఇంటికచ్చి గోలెంకాడ కాల్శేతులు కడ్కోని ఇంట్ల అడ్గెట్టెశరికి, సలికాలం పొద్దునచ్చె పొగమబ్బులా ఇల్లంత సుట్టపోగతో నిండుంది. "ఓ ముసల్లచ్చి, నువ్వన్న నీ మొగన్కి జెప్పాల్సిందిబోయి, ఇద్దరు కల్శి గుప్పు గుప్పుమంటూ సుట్టతాగుతాల్లా? ఇగ సూడు ఇల్లంత మీ సుట్టపోగతో అసలేం అవుపడ్తలే" అని మొత్తుకుండు.

ఇద్దరు ముసలోళ్లు ముశి ముశి నవ్వుకుంటా "ఇట్రారా అయ్యా" అని శేతుల్శాశి జోసెఫ్ని పిల్శింది లచ్చి.

జోసెఫ్, లచ్చి కాడ్కి రాంగానే తన రెండు శేతుల్తో జోసెఫ్ మోకాన్ని దీస్కొని ముద్దునిత్తు "అరయ్య నీ అవ్వయ్యలు కాలం జేశినాక నిన్నే కండ్లల్లబెట్టుకోన్ని బతుక్తున్నంరాయ్యా" అని నీల్లు దెచ్చుకుంది.

"ఇగ ఊకొయే అవ్వ, ఏదో సుట్టవాసోనోచ్చి అన్న మల్లగిట్ల ఏడ్వకు" అని అన్నడు జోసెఫ్.

"సరే బిడ్డ ఏడ్వనుగాని సుట్ట ఆరిపోయ్నట్టుంది, ఇంత నుప్పు దెచ్చియ్యారయ్యా" అడ్గింది లచ్చి.

"దోశ్ బో, మీరు మారారే ఇగ" అంటూ జోసెఫ్ బయటిక్తాంటే "అరే పిలగా నీగోసమని వట్టితున్కల కూర అండిన్రాయ్యా  ఎటుబోతనవ్, ఇంతదింద్వురా" అని పిల్శింది లచ్చి.

"దెహె బో మీ సుట్టపొగ బోయేదాక నే తిన" అన్కుంటూ యింటి ముందు కూసుండు జోసెఫ్.

సాటింపు జెప్పే పెద్దమనిషి కట్టన్న సైకిల్ మీద జోసెఫ్ కాడ్కి ఆగమాగం వొత్తాంటే "ఏమే పెద్దయ్య ఇట్గిట్ల బాట పట్టినవ్ ఏమన్నా అయింద ఏంది" అని అడ్గిండు జోసెఫ్.

"అవునాయ్య కొత్వాల్ సారోత్తండట, మన నాల్గువాడల పెద్దమనుషుల్ని, జనాల్ని, అందర్ని గిన్నెశెట్టు కాడ్కి రమ్మన్నరు. అందరు ఆన్నే ఉన్నరు, మిగిలినోళ్ళకు జెప్పుకుంటా నీదాకచ్చిన ఆడ్కిబా" అని అన్నడు కట్టన్న.

"సరే వత్తనబాయే" అని జోసెఫ్ జెప్పగానే కట్టన్న ఆడ్నుండి బోయిండు.

"కొత్వాల్ దొరంటే ఈ సుట్టుపక్కల ఆయిన్ను కాదని ఏ పనిగాదు, ఏ కాంట్రాక్ట్ ఐన అయినే పట్టాలి, ఏ ఇక్కటోచ్చినా అయినే తీర్వాలి. ఊళ్లేగూడ ఏ కులన్కి పెద్దమన్శి ఎవడున్న పెద్దరికమైతే కొత్వాల్దె. ఆయిన్ను కాదని ఏ కులపొడు ఏపని జెయ్యడు, కాదన్నోన్ని జూశిన దాకల్లేవు గూడ. ఒకేలుంటే ఆడి సంగతేందో జెప్పేదాక ఊకోడు. అందేందోగాని కొత్వాల్ ఇన్నిజెత్తున్న ఒక్క కేసుగూడ కాలేదు. అయిన అచ్చిన ప్రతాఫీసర్లు, పోలిసొళ్ళు కొత్వాలిచ్చే దావత్లా మున్గుంతాంటే ఎట్లా ఐతది. అసోటోండు మా వాడక్తాండంటే ఏదో పెద్దపనే ఉంటది" అని మన్సుల అన్కుంటూ గిన్నెశెట్టు కాడ్కి నడ్తాండు జోసెఫ్.

*

గిన్నెశెట్టుకాడ అందరూ కొత్వాల్ కోసం ఎదురుజూత్తాల్లు. ఆ గుంపులోంచి రమేష్ గిన్నెశెట్టు గద్దెకాడ్కిబోయి నిలబడ్డాడు. "అసల్కి కొత్వాల్ దొర ఎందుకు పిల్శిండు" అని నాల్గు వాడల మంది అంత ఆడ ఈడ మోపై ముచ్చట్లు యెట్కుంటాళ్లు. రమేష్ ఆ ముచ్చట్లన్నింటిని బంజేత్తు ఒక్కశార్గా "దోశ్ మనకు పని లేదన్కున్నాడు ? మనమచ్చి గింతసేపైతున్న రాడేమే ఈ దొర అనేటోడు" అని అన్నడు.

"ఏంరో దొరను గట్ల అంటన్నావ్, నీ లెక్కనార ఆయిన్కి వంద పనులుంటయ్" అని గద్దెమీద కూసున్న పెద్దమన్శి లేశి అన్నడు.

"ఓ పెద్దమన్శి ఎవన్కే దొర, మీగావచ్చు మాగాద్, అయిన మాకుతం మస్త్ పనులున్న ఒదిలి పెట్టుకొనచ్చినం" అని రమేష్ మాట్లాడ్తుంటనే కొత్వాల్ కార్ అచ్చాగింది.

గిన్నెశెట్టుకాడ్కి కొత్వాల్ తన మన్శులతో దిగ్గానే వయిస్సుబడ్డొల్లేమో లేశి దండలేడితే, నడీడుల్లోలేమో అట్లనే నిలబడి సూత్తున్నరు. ఐతే ఎంబటే పెద్దమన్శి కట్టన్న తన నెత్తికున్న రూమల్దీశి, ఉరుక్కుంటబోయి కూర్చి తెచ్చేశిండు.

గప్పుడే జోసెఫ్ గుంపులోకచ్చి సూత్తాండు ఏంటాని, తనకేం సమజ్గాక గద్దెమించెలి దిగ్తున్న రమేష్కి సైగ జేశిండు. "ఏమో దేల్వదు" అని జబ్బలేగరేసుకుంటు మల్ల సైగ జేశిండు.

గమ్మునున్న వాతవర్ణాన్ని పలగ్గొడుతున్నట్లు కొత్వాల్ "ఇగో అందరూ ఇటినండి, పైనున్న సర్కారోళ్లతోని, పార్టోళ్లతోని కొట్లాడి మరి తీస్కచ్చిన, ఇంకో మున్నెల్లోచ్చె ఎన్నికల్లో మీదాంట్లోనే ఒకడు మనఊర్కి సర్పంచ్" అని మాట్లాడ్తుండగా కింద మంది గట్టిగా సప్పట్లు కొట్టారు.

"ఆగండి ఆగండి, ముందు నే జెప్పేది ఇనుర్రి" అని కొత్వాల్ జనాలనాపుతూ, "ఐతే రేపు గ్రామస్థాయి ఎన్నికల మీద  పార్టీ మీటింగుంది. దానికోసం MLA సారత్తండు, దీన్కోసం ఒక ఇరవై డప్పుల్దెచ్చిన, అవేవలు గొడితే వాళ్ళకే, ఒకపక్క డప్పులు నడ్తాంటే ఇంకోపక్క ఆడోళ్ళు కోలాటాలెయ్యలే, ఎశ్నందుకు రెండొందలు, మీటింగ్కుచ్చిన ఒక్కో మన్శికి వందరూపాల సోప్పున ఇత్తం. మీగోసం కొట్లాడి  మరింత జేశినందుకైనా మీ అందర్రావలె" అని మందిని నాన్పుతూ మాట్లాడ్తుంటే,

"ఎహే ఆపే అన్న, ఏం జేశినవ్ నువ్వేదో బగు జేశినట్టచ్చి మాట్లాడ్తానవ్" అని కిందున్న మందిలోంచి అన్నడు రమేష్.

అక్కడ మొత్తం నిసబ్దం అల్ముకుంది. రమేష్ మాటల్కి ఏమైతదాని అమ్మలక్కాలందరు సూత్తాండ్రు. కొత్వాల్ నింపాదిగా కూసుంటు "ఏంరా రమేశ్గా, నీయన్ని తండ్లబడె మాటలేనరా, నేనేం జెశిన్నో మీ పెద్దమన్శుల్ని అడ్గుర, అదికుతం శాతకాకపోతే, మీరు శెర్వుశికం కాడ దున్నుతారే ఆ భూమ్లేవరిచ్చిండ్రో దెల్సుకోర" అంటూ గుర్రుగా సూత్తు దొరమధంతో అండు.

ఆడమోపైన మందిలో కొందరు రమేష్ని సూత్తు నవ్వుతాంటే ఏం మాట్లాడాలో ఆన్కి అర్ధంగాలే. పెద్దమన్శుల్లో ఒకలు లేశి "మాట్లాడేటోన్ని మాట్లాడనియ్యకుంటా నడిమిట్ల నీ లోల్లేందిరా" అని కోపంతో కొత్వాల్కు వత్తాస్ బల్కిండు.

రమేష్కి మొకం లేకుండ బోయిందాడ. మొత్తం గమనిత్తాన జోసెఫ్ "దెహే మీకేమన్న సమజైతాంద ఐనా మనలందర్ని ఎడ్డిగుద్దోళ్లను జేత్తాండు. ఆ శెర్వుశికం భూమ్లన్ని అసైండ్ భూమ్లు, అవేం ఆళ్ళ అయ్యా జాగిరేంగాదు" అంటూ రమేష్కి వంత బల్కిండు.

కొత్వాల్కి జోసెఫ్ మాటలన్ని తన్నినట్లై, కోపంతోని "ఏంరా కట్టయ్య నేనేం జెశిన్నో మీకు దెల్వదార, గిప్పుడు ప్రతోడ్కి నే జెప్పల్లారా" అని ఎగేశిండు.

"దొశ్ పోరగ, ఏం దెల్సురవారి నీకు, నిన్నమొన్న మొల్శినోన్వి బగు దెల్సినట్లాత్తనవ్, నడువ్ ఈన్నుంచి" అని దొర మెప్పుబొందనికి గద్దెమించెలి లేశి అన్నడో పెద్దమన్శి.

గిన్నెశెట్టు మీద పిట్టల సప్పుళ్ళు తప్ప ఏం ఇనబడనంత నిసబ్దంగుంది వాతావర్ణం. ఏమైతదాని మందిలో ఉచ్చిలు పెర్గుతుంటే, నే జెశ్నా ఇకమాతు పనిజేశిందన్నట్లు ముశి ముశి నవ్వుతుండు కొత్వాల్.

"అవ్ నాకేం దెల్సు, ఐనగాని, ఇంకెవలన్నగాని ఇంత ఇత్తె లొట్టల బోసుడుదప్ప" అని పెద్దమన్శి అన్న మాటల్కి ఎదుర్గుల్లిచ్చినట్లు మాట్లాడిండు జోసెఫ్.

ఆడైతున్నా యవ్వరాన్కి అమ్మలక్కాలందరు నవ్వుతూ సూత్తాంటే, పెద్దమన్శికి ఇజ్జత్ బోయినట్లై, ఇగ కోపంతో "ఏం రా ఏమన్నావ్" అని జోసెఫ్ మీద్కి ఉరికిండు.

ఒక్కశార్గ ఆడోళ్ళందరూ జోసెఫ్ కాడ్కి అమంతామచ్చి "ఏమయ్యా గిదేనా నీ పెద్దమన్శితనం, ఏమో పొరన్మీకీ బాగా ఉరికత్తానవ్" అని మన్శికో మాట అందుకున్నారు.

"మరి ఆడన్నది" మంచిగున్నదా ?

"మరి మీరు ఎవ్వల్కాడ ఏం దీస్కోకుండా, ఊకనే పంచాయితిలు జేశిర్ర ?" అని ఏంగాకుండా జోసెఫ్ని పట్టుకుంటు అన్నది.

పక్కనున్న రమేష్ ఈ లోల్లంత ముదురుతదేమోనని "ఓ ఆగే పెద్దమన్శి, ఎందుకంత ఆగమైతనవ్, మీతో లొల్లి పెట్టుకోనికేం ఉండలే ఈడ. ఒక్కశారి జోసెఫ్ గాన్ని మాట్లాడనియ్యి మీకే తెల్తది" అని మద్యలచ్చిండు.

పెద్దమన్శి అందరి మాటల్కి ఎన్కకు బోగానే "అరేయ్ నువ్వుబోయి మాట్లాడురా" అని జోసెఫ్ని రమేష్ ముంద్కు నెట్టగానే, జనంలో శానమంది కుతం మాట్లాడమని కోరిర్రు.

జోసెఫ్ ఛాతినిండా గాలి పీల్సుకొని, గిన్నెశెట్టు కాడ్కి బోతావుంటే కొత్వాల్కి ఎక్కడ్లేని కోపంతో సూత్తు పక్కకి జరిగిండు, ముందు కూసున్న పెద్దమన్శులు లేశి నిలబడ్డరు. నిసబ్దం సింగరించుకొని కూసున్నట్లు వాతావర్ణం అముల్కొని గద్దెమించెలి దిక్కుజూపే మోషేలెక్క జోసెఫ్ అగుపడ్తాంటే, అందరూ కండ్లు మిట్కలెయ్యకుండా సూత్తవుండ్రు.

*

తన పనులన్ని ఒడగొట్టుకొని జోసెఫ్ కోసం కంకిశేనుకాడ కూసోనుంది పూర్ణ. సుట్టు శీకట్లు కమ్ముకొనత్తాన ఈదర జోసెఫ్ కౌగిలోలే తన ఊపిరి ఆపేత్తానయ్. కంకిశేనంత పురుగుల మోతల సప్పుళ్ళున్న, పూర్ణకింతైన భయం లేదు, ఉన్నదల్లా ఎదుర్జూపే జోసెఫ్ ఎప్పుడోత్తడని.

పూర్ణ తన్వంత ఎచ్చగా కోరుకుంటుంటే, తన కొంగును తానే హత్తుకుంటూ, జోసెఫ్ శేతులు తాక్తున్నట్లుగా తల్సుకుంటా, "ఇంక రాడేంది" అని తనలో తానే మాట్లాడ్తాంది.

తన మెడోంపులపోంటి కార్తున్న శెమట సుక్కలు చెక్కలగుల జేత్తాంటే, మొదటిశార్గా ఆళ్ళు మాట్లాడ్కున్న ప్రేమ మాటలు గుర్తు జేత్తానయ్.

"బావ, నేనంటే ఎందుకంత ఇష్టం" అని పూర్ణ అడుగంగానే, జోసఫ్ తన దగ్గరగచ్చి, తన నడుంమీద శేతులేసి గుంజుకొని, ఒకరి మొసలు ఒకరికి తాక్తుంటే "ఎండిన ఎముకలకు యెహోవా జీవం పోశినట్లు, నువ్వు నాలో ప్రేమకు ప్రాణం పోశావ్" అని పోలికెడ్తూ ఇచ్చిన ముద్దును తల్సుకుంటా, పంటికింద పెదవిని నల్పుతా నవ్వుతాంది. ఆళ్ళు జేశ్నయన్ని కలల గుర్తుకత్తంటే ఒకింత ఆయిగున్న, మరోదిక్కు కల్వర పెడ్తాంది.

"అసలు ఏంది ఇది, ఎందుకిన్ని కులాలు? ఎంచక్క మన్సులందర్కి ఒక్కటే కులముంటే మస్తుండుగా, గప్పుడు మమ్మల్ని ఆపేటోళ్లే ఉండరు. అయ్యా దేవుడా, మమ్ము కల్పినోడివే ఏ లొల్లిలేకుండా మా పెళ్లి అయ్యేట్టు చూడు దేవా, ఐన ఎంబటే ఎములాడ కచ్చి నీ మొక్కు తీర్సుకుంటా" అని కోర్కుంది.

"ఈ మన్శికి ఏం ఆయే, నా మీద సోయి ఉందా? ఇంక రాడేంది" అని సూట్టురా సూత్తు అక్కడ్నుండి లేశి, మబ్బుల మీద ఎన్నెల అలిగినట్లుగా, పూర్ణ అలిగి ఎల్లింది.

*

సల్ల సలేడుతున్న, దోమలచ్చి శిట్ట శిట్ట కుడుతున్నా జనం ఓపిగ్గా జోసెఫ్ మాటల్ని ఇంటాళ్లు.

"జూశిర్రా శీకట్కాంగానే ఎవలం, ఎవల్కి అవ్పడ్తలేం. అస్సల్ గిప్పుడే గాదు ఎప్పటికుతం, మన వాడలు ఈళ్ళకి ఊరిలెక్క అవ్పడవ్. లైట్లు లేవ్, కాలువల్ లేవ్, రోడ్లు లేవ్. వర్షమత్తె సాలు వర్దంతా ఇండ్లల్ల కత్తంటే, ఊళ్లే కుక్కల్లెక్క బుర్దలో ఒకళ్లకోకళ్ళం నీల్లాత్తనయని కొట్లాడ్కుంది మర్శిర్రా. గిప్పుడచ్చి సర్పంచ్ జేత్తం, మాగోసం డప్పుల్ కోట్టుండ్రి, కోలటాల్లేయ్యండ్రి అంటే ఎంబటే పోనికి గింతన్న ఇజ్జత్ ఉండాలే మనకి. ఆడెవాడోత్తే మన అమ్మలక్కలేందుకు ఆన్ముందు ఆడాలే, అంతగనం కావాలంటే ఆళ్ళ ఇండ్లళ్ళున్న ఆడోళ్లతో ఎయించుకోవచ్చుగా, మనమెందుకేయ్యలే" అని జోసెఫ్ అందర్కి జెప్తుంటే, కొత్వాల్తో అచ్చిన మన్శి కిరణ్ మధ్యలచ్చి ఆపిండు.

"ఏంరా, చిన్న పొరన్వని అని సూత్తాంటే, శానెక్కువ మాట్లాడ్తున్నావ్, ఊకనే ఎత్తాల్ల పైశల్ దీస్కుంటలే"?

ఆన్మాటల్కి జోసెఫ్కి బగ్గ కోపమచ్చి"ఇగో జూశిర్రా, ఆళ్ళేం అంటుర్రో. గిప్పుడా పైశల్గోసం, ఆళ్ళు ఆడమందల్లా ఆడితే, మనకి ఇలువుంటాద? అసలు ఊరంత సర్పేశి కడిగినట్లుంటే, ఆ కడిగిన నీళ్ళన్ని మావాడల కత్తనయ్యని ఎన్నిసార్లు గ్రామపంచాయత్కి బోయి జెప్పిన, మాకేదన్న పన్జేయండ్రని ఎంత మొత్తుకున్నా మొకం జూశినోడ్లేడు గాని, గిప్పుడచ్చి సర్పంచ్ జేత్తడట, ఆ సర్పంచ్ ఎవ్వడో గాని ఈ కొత్వాల్ శేప్పులు తుడ్శెటోడే అత్తడుగాని, ఏరేటోడు రాడు. అందుకే జెప్తనా మన్మందరం ఒక్కట్గావలే, మన బత్కులు ఎవ్వడ్ మార్వడు, మనమే మార్సుకోవాలే. గి దొరనేటోన్తోనేం లేకుండా మన సర్పంచ్ని మనమే ఎన్నుకోవాలి. ఇంకో ముచ్చట రేపీళ్లు పెట్టె మీటింగ్కు నేనైతే ఆళ్లిచ్చే పైశల్కోసం అసల్కేబోను. మీరు బోతాంటే నేనాప. కానీ, ఒకటి మాత్రం జెప్తున్న ఇనుండ్రి నాకు అన్నం లేక ఆకలితో సత్తమాయే గాని, నేను ఆత్మగౌరవంతో బత్కుత" అని గట్టిగా ఓర్రుకుంటూ మాట్లాడిండు.

ఒక్కశార్గా కటిక శీకట్లో సుక్కలు మెర్శినట్లు, జనాల మొఖాళ్ళు మెర్శినయ్. ఆ మెరుపంత ఒళ్ళంతా పాకినట్లు అయ్సు పొరగాళ్ళంతా ఈలలెత్తుంటే, అమ్మలక్కాల సప్పట్లతో వాడంత మోగినయ్. ఆ సప్పట్లన్ని కొత్వాల్కి సావు డప్పులెక్క ఇనబడ్తున్నాయి. ఒక్క నిమిసం గూడ ఆడుండలేకబోయిండు. ఒక్కమారు మాట్లాడకుండా గద్దెమించెలి దిగి కారెక్కిండు.

పెద్ద మన్శులందరు కొత్వాల్కాడ్కి బోయి "ఏమైందొర" అని అడిగిర్రు.

"ఏమైంది ఏంద్రా, మీ కాడ్కత్తే గిదార మీర్జేశే మర్యాద. ఇగ మీ ఇష్టం, మీసావు మీర్సావండి. ఇగో ఇవైతే దీస్కోండి, రేపచ్చేటోళ్లయితే రండి" అని పైశలకట్టిచ్చి కార్లబోయిండు.

రమేష్ ఉర్కుంటబోయి జోసెఫ్నెత్తుకొని "అరేయ్ మొదటిసార్రా కొత్వాల్కి మొఖం లేకుండా జేశినవ్" అన్కుంటూ ఎగుర్తుండు. వాడంత అరుపుల కేకలతో జోసఫ్ సూట్టుర పొగయ్యారు ఏదో సాధించాం అని.

"మా అయ్యనే ఎంత బాజెప్పినవ్" అని ముసలోళ్లందరు దగ్గర్కత్తాంటే, జోసెఫ్ ధన్న ధన్న రమేష్ భుజాలమించేలి దిగి కుక్కను కొడితే ఉరికినట్లు ఒగ ఉరుకుడు ఉరుకుతాండు పూర్ణ గుర్తచ్చి. వాడంత ఏం పట్టిందీ పొరనికన్నట్లు జూత్తాండ్లు.

జోసెఫ్ కంకిశేను కాడ్కచ్చి మొత్తం జూశిండు. పూర్ణ ఏడ అవ్పడక బోయేసర్కి, ఎల్లిపోయిందేమోనని జూశి జూశి అన్నుంచి ఎల్లిపోయిండు.

*

పొద్దు పొద్దుగాల్నే గద్దెకాడ కొత్వాలిచ్చిన కొత్త డప్పులు, కోలలు దెచ్చిపెట్టిర్రు పెద్దమన్శులు. "మీటింగ్కు టైం అయితాంది. మంది ఒత్తరా రారా? ఏందో దెల్సుకొబో"  అని కట్టయ్యను మత్లావ్ దెల్సుకోనికి తోలిర్రు.

కట్టయ్య నాల్గు వాడలు దిర్గచ్చి "ఒక్కొక్కడు గడ్డ మీద కూసోనున్నరు. ఏడ ఏర్పడతలేదు ఆళ్లకు. ఆడోళ్ళు, మొగోళ్ల కాన్నుంచి ఒక్కలు ఒచ్చేట్టు అవ్పడ్తలే" అని పెద్దమన్శులతో అన్నడు.

"రాకబోతే రాకబోనియ్, చిన్న పొరన్ని బట్టుకొని ఏతుల్ జేత్తా ల్లు. మనమన్నా బోదాంబా" అని పెద్దమన్శులు డప్పులందుకున్నరు.

మీటింగ్కు కావాల్సిన పనుల్ని కొత్వాల్ ఆగమాగమవుకుంటా, అన్ని తానై జూసుకుంటుండు. ఎట్లైన ఎమ్మెల్యే మెప్పుబొంది, ఈశారి పార్టీలో గట్టి పదవి దీస్కోవాలని మస్త్ ఆశతో ఉండు.

"అరేయ్ కిరణ్గా, నిన్న అంత అయ్యిందిగా డప్పుల్లోళ్ళు ఒత్తరంటవ" అని అన్మానంతో అడ్గిండు కొత్వాల్.

"ఎందుకు రార్ సార్, పైశల్ పార్దెంగింతే ఎవ్వడైన వోత్తడు. దాంట్లో మావోళ్ళు ముందుటరు" అని గట్టి నమ్మకంతో అన్నడు కిరణ్.

అంతలోనే నల్గురు పెద్దమన్శులు మిగిల్న డప్పులతో, కోలలతో ఒత్తవుండ్రు. ఆళ్ళను జూశి కొత్వాల్ "ఏంరా కట్టయ్య గి నల్గురచ్చి ఎవ్వన్ని బాద్నం జేద్దాంమని ఒత్తాల్లురా, గింతన్నన్నా గుద్ద శిగ్గుడాలే రానీకి" అని కోపంతో అర్శిండు.

"సారు తప్పయింది. ఆ పోరని మాటల్కి ఇంట్లకేళి ఒక్క పుర్గు గూడ బయటక్రాలే. ఈ ఒక్కశారి క్షమించండి దొర, ఇంకోశారి ఇట్ల కానీయం" అని కొత్వాల్కి దండం బెట్టిర్రు పెద్దమన్శులు.

"అరేయ్ మీరీన్నుంచి బోండ్రా, నాక్కసలే మాటల్ సక్కగ రావ్" అని కొత్వాల్ తిడుతుంటే, పక్కనున్న కిరణ్ పెద్దమన్శులను పక్కక్ దిస్కచ్చి "మీరైతే ఆడుండ్రి నే జెప్తా సార్కి" అని అన్నడు.

"కిరణ్గా ఎంత పనైందిరా, ఎమ్మెల్యే కాడ ఇజ్జత్ పోతదిరా నాది. ఆ లంబిడికొడుకులు ఎంత పన్జేశిర్రా" అని మొత్తుకుంటుండు.

"ఊకోండి సార్ గ పొరగాళ్ళు మళ్ళేం జెప్పి జనాలను రానియ్యకుండా జేశిర్రో, ముందైతే ఎట్లనో గట్ల ఈ మీటింగ్ ఒడగొట్టుకుందాం" అని కొత్వాల్ని సందాయించాడు కిరణ్.

కొత్వాల్ కొంచెం నిమ్మలపడి "అవ్ రా ముందైతే ఈ మీటింగ్ కానీయ్. ఆళ్ళ సంగతి తర్వాత జెప్పుదాం. అదేట్లుండాలంటే ఇంకోశారి కొత్వాల్ పేరు ఎత్తాలంటే కింద్కేలి సమర్కారలే, నా కొడుకుల్కి" అని సుర్కంటిన పిల్లిలెక్క అటిఇటు దిర్గుతుండు.

"ఎటుబోతర్ సార్, దొరుకుతర్ ఆళ్ళు గప్పుడు జెప్పుదాం. ముందైతే గి పని చూద్దాం" అని కొత్వాల్ని దిస్కోబోయిండు కిరణ్.

*

"కూలికి బోయేదాన్ని శేన్లకు గుంజుకచ్చి, ఏంది నువ్వు లే నామించేలి" అని కసుర్కుంది పూర్ణ.

"అబ్బా కోపమత్తందా?"

"హ రాక, నువ్వు రాగానే ఎంబడేసుకొని ముద్దులిత్తనుకున్నవా? నిన్న రాత్రంతా నీగోసం ఎంతశేపు జూశిన్నో దెల్సా" అని పక్కకి దిర్గింది పూర్ణ.

"నేనొచ్చిన్నే గానీ, నేనొచ్చేశర్కి నువ్వు బోయినవ్" అంటూ జోసెఫ్ తన శేతుల్లోకి పూర్ణ శంపలను దీస్కొని పెదాలను అందుకోబోతుండగా మొకం పక్కకి దిప్పుకున్నది.

పూర్ణను జోసెఫ్ బుజ్జగిత్తాంటే,

"ఎవల్లుళ్ళ ఆడ" అని శేను లోపల్కచ్చి పిల్శిండు కావాల్కాశే స్వామి.

ఆ మాటతోని పూర్ణజోసెఫ్ లిద్దరు అదిరిపడ్డారు. ఆళ్ళు ఎన్కకు దిర్గి జూడగానే స్వామి కట్టేబట్టుకొని రానే వొచ్చిండు.

"గిల్లకచ్చి మీర్జేశే పనులు గివ్వ? మీ సంగతి జెప్తాగు"

పూర్ణ వన్కిబోతాంది. జోసెఫ్కేమో ఏం మాట్లాడాలో సమజైతలేదు. ఐన ఎట్లనో గట్ల ధైర్నం దెచ్చుకొని "పూర్ణ నువ్విన్నుంచి బో, నే జూశుకుంటా" అన్నడు.

పూర్ణ పోవడాన్కి లేవగానే "ఓ పోరి ఎటుబోయేది. ఊళ్లేందరచ్చే దాక ఎటుబోయేదిలేదు" అంటూ బెదిరిక్జిండు స్వామి.

"అన్న నీకు దండం పెడ్తా బోనియ్" అని బతిలాడుకుంటూ పూర్ణకు బొమ్మని సైగ జేశిండు జోసెఫ్.

ఎంబటే పూర్ణ ఉర్కుడు అందుకుంది. అది జూశి పూర్ణ ఎన్క స్వామి ఉర్కబోతుంటే, స్వామి గల్ల బట్టుకొని గుంజగానే బోర్లబొక్కలబడ్డాడు. జోసెఫ్ గూడ ఆన్నుంచి తప్పించుకబోయిండు.

స్వామి తేరుకొని లేశి జూశేశర్కి ఇద్దరు కనబల్లె "ఈళ్ళ సంగతి గిట్ల గాదు, ఊళ్ళే జెప్తా" అన్కుంటూ ఊళ్లేకు నడ్శిండు.

*

ఊరి పని దీరాగ, సూరీడు ఎర్ర మందారంలా మెర్తాంటే, స్వామి శేయబట్టి ఊరంతా పూర్ణజోసెఫ్ల యవ్వారం తెల్శింది.

పూర్ణకింకా అదురుపోలేదు. భయం భయంగానే నడ్తాంది ఇంటికి. ఆళ్ళ భాగ్యత్త పూర్ణను జూశి "రామ్మ తల్లి, కూలికని బోయి నువ్వు జేశే నిర్వాకమిద? మీ మామైతే తాళ్ళల్లా నుంచి రానియ్, నీ సంగతి జెప్తా" అని సదువుతుంది.

పూర్ణ ఏడ్తూ కాల్శేతులు కడ్కోకుండానే మంచంలా పడింది. కండ్లల్ల నుంచి నీళ్లు ధారలు అట్టకట్టినయ్. తన శంపలు నావర్పట్టికి అతుక్కబోయి మస్కనిద్రలకు బోయింది.

నర్సయ్య ఎప్పుడచ్చిండో తెలీదు. నిద్రమబ్బులోనున్న పూర్ణకు కొంచెం కొంచెం ఆళ్ళ అత్తమామలు మాట్లాడ్కుంటున్న మాటల్ ఇనబడ్తున్న, ఏం దెల్వనట్లు అట్లే పడ్కుంది.

"జూశినవా, మేనకోడలని నెత్తిమీదేట్టుకుంటే ఎంత పన్జేశింది. మల్ల ఏం ఎర్గనట్లు ఎట్ల పన్నదో జూడు" అని పూర్ణని భాగ్య లేపబోయింది.

"ఏయ్ ఆగావే. లే నడ్వు ఈన్నుంచి, పన్నదాన్ని లేపుతానవ్. అది చిన్న పోరి దానికేం దెల్సు. వాడే దీనికేదో మందు బెట్టివుంటడు" అని కొప్పాడ్డాడు నర్సయ్య.

"గిట్లనే ఎన్కేసుకుంటరా, ఏదో ఒకరోజు మనల్ని బదాట్ల నిలబెడ్తది" అని కసుర్కుంటా బోయింది భాగ్య.

పూర్ణ పక్కపొంటి మంచం మీద నర్సయ్య కూసోని నెత్తికున్న తువ్వాల దీశి, పూర్ణ కాళ్లకున్న దుబ్బను తూడ్తు "బిడ్డ లేరా" అని లేప్తుండు.

పూర్ణ కండ్లు ముసుకున్న మెల్కతోనే ఉంది. ఏమైతే అదే అయితదని ధైర్నం దెచ్చుకొని "నన్ను సంపినమాయే గానీ, నే వాన్నే పెళ్లి జేశుకుంటని మామకు జెప్తా" అని లేశింది.

"ఏమైంది బిడ్డ? కంకిశేను ఏంది? ఎవడెవ్వడోచ్చి ఏదేదో జెప్తున్నరు" అని మన్సుల మాట అడ్గిండు.

"మామ నేనే ఎప్పుడో జెప్పుదాం అనుకున్నానే, నాకు జోసెఫ్ అంటే శాన ఇష్టమే. మా పెళ్లి జెయ్యి మామ నీకు దండం పెడతా" అని నర్సయ్య రెండు శేతుల్బట్టుకొని వేడ్కుంది.

నర్సయ్యకి కోపమత్తాన అన్సుకొని "కుదరదు బిడ్డ, కులాన్ని కాదని మనం ఈ ఊళ్ళ సక్కగా ఉండలేం. వాన్ని మర్వు బిడ్డ మన మంచికే జెప్తున్న" అని పూర్ణ తల నిముర్తూ జెప్పిండు.

నర్సయ్య మాటల్కి పూర్ణకింకా ఏడ్పు ఎక్కువై "ఆడు మంచోడే మామ, నన్ను నీ లెక్కనే బా జూశ్కుంటడు" అని అంది.

నర్సయ్య నిమ్మలంగా పూర్ణను నొప్పియకుండా, "ఇక్కడ కావాల్సింది గుణం కాదు బిడ్డ కులం. నీకు జెప్పిన సమాజ్గాదు. నా మాటీను అంతకన్న మంచోన్ని నీకు జేత్తా" అని సమ్దాయించిండు.

పూర్ణ ఏం మాట్లాడ్కుండా మంచంలా కూసోనుంది. నర్సయ్య అక్కన్నుంచి బయటికత్తు పొరగాళ్లందరిని పిల్శిండు.

"అరేయ్ జోసెఫ్ గాడెక్కడున్న ఎతకండ్ర" అని కేకెశిండు. దాంతో గౌండ్లోళ్ల పొరగాళ్లంతా ఒక్కాడికచ్చి ఎతకనీకి బోయిర్రు.

పూర్ణకి ఆళ్ళ మామ మాటల్కి, ఏదో అన్పించి ఎట్లైనా జోసెఫ్ని కల్వలన్కుంది.

పోరగాళ్ళు ఊరంతా ఏ వాడ ఒదిలిబెట్టకుండా ఎత్కుతాళ్ళు. ఏడా జూశిన జోసెఫైతే అవ్పల్లె. ఎట్లయిన దొర్కబట్టాలని కంటికి కున్కు లేకుండా దిర్గుతాళ్ళు.

 

ఇదే అదునన్కొని కొత్వాల్, కిరన్ని పిల్శి "అరేయ్ నా మాటగా గౌండ్లోళ్ల పెద్దమన్శులకి జెప్పురా. ఆడు దొర్కకబోతే గాజులేశుకోని దిర్గమను" అని అన్నడు.

"సరే సార్" అని కిరణ్ బోతుంటే, మల్లాపి కొన్ని పైశల కట్టనిత్తు "ఆళ్లకు శాతగాకపోతే, నువ్వన్న వాన్నేయ్ రా"

కిరణ్ మారు మాట్లాడ్కుండా కొత్వాల్ మోకాన జూత్తాండు.

"ఏమిరా అట్ల జూత్తానవ్. మీ కులపోడని జూత్తానవా, ఒగాల అదైతే, రేపాడు నీ సర్పంచ్ సీట్ని శింపుతడు. నువ్వైతే ఈ పని కానీయ్, నిన్ను సర్పంచ్గా నే జేత్తా" అని రెచ్చగొట్టిండు.

సర్పంచ్ జేత్తానేశరికి మస్త్ సంబ్రమయ్, ఇగేమి ఆలోశించకుండా పైశల కట్టందుకొని గౌండ్లోళ్ల కాడ్కి ఉర్కిండు కిరణ్.

 ఇగ ఊళ్లే నాకెదురు లేదనుకుంటూ నింపాదిగా ముశి ముశి నవ్వుకుంటా కుర్చీలో కూసున్నడు కొత్వాల్.

*

నర్సయ్య ఊరంతా ఎతికి ఎతికి గొల్ల బాషన్న ఇంటిదాకచ్చి తల్పు కొడ్తుండు.

"ఎవలయ" అని అడ్కుంటూ తలుపు దీశిండు బాషి.

"ఏం నర్సయ్య గింత శీకట్ల, గిటు బాటబట్టినవ్. ఏమన్నా పన ఏంది" అని దెల్సుకోనికి అడ్గిండు.

"జోసెఫ్గాడు గావలే బాషి. వాడీటు ఒచ్చిండా? ఒత్తె ఏడున్నడో జెప్పు".

"ఆడేడున్నడో, ఎటుబోయిండో నాకెట్ల దెల్తది. దీనిగోసం గి శీకట్లచ్చి అడుగుతానవా? ఏదన్నుంటే రేపొద్దుగాల మాట్లాడుదాంగాని నువ్వుబో."

"నీక్దెల్సు బాషి, ఆడేడున్నడో ఆనికి జెప్పు. ఇంకోశారి నా మేనకోడల్ జోల్కి ఒచ్చిండో, సంపి బొందబెడతానని"

"ఏంరా నర్సిగా బెదిరిత్తనావ? నా ముంగట ఆడి మీద శెయ్యి ఏయ్, గొడ్డలి శిప్ప మర్రేశి సంపుతా బిడ్డ. ఆని జోల్కత్తె నడువ్ ఈన్నుంచి" అని బెదిరిచ్చిండు బాషి.

"బోతన్న, గానీ మా జోల్కత్తె నే అదే పన్జేత్తా జూడు" అన్కుంటూ మర్రిబోయిండు నర్సయ్య.

ఆళ్ళు బోగానే తల్పేసుకొని మంచంలా ఒరిగిండు బాషి.

"ఎంత పనాయే, పోరనికి ముందున్నుంచే జెప్తున్న జాగ్రత్తరాని, గిప్పుడు గి లొల్లి ఏడిదాక బోతదో" అని ఆలోచిత్తాంటేనే మల్లేవరో తల్పు కొట్టిన సప్పుడైంది.

"దెహే నీయమ్మ మల్ల ఎవల్రా" అని శికాక్తో తల్పు దీయగానే ఎదుర్గా పూర్ణ.

ఎడ్శి ఎడ్శి మొకమంత వాడిపోయిన పూర్ణను జూశి ఎంబటే ఇంట్లకు గుంజి తల్పేశి "ఏమైంది బిడ్డ గిప్పుడచ్చినవ్, ఎవలు జూడలేగా" అని అడ్గిండు.

"అన్న నే జోసెఫ్ని జూడాలే. వాడికేమయ్యిందో" నని ఎడ్తాంది.

"వాడు ఈడ లేడు బిడ్డ, ఏడున్నడో నాక్దెల్వదు" అని ఊకోబెడ్తుండు.

"అట్ల అనకే అన్న, నీక్దెల్వకుంటా వాడేట్బోడు. మా మామ మాటలు ఇంట ఉంటే భయమేత్తాంది. జర కల్పియన్న" అని దండం బెట్టింది.

ఏం జెయ్యాలో బాషికేం సమాజ్గాలే, ఈ పిల్లతోబాటు ఎవరన్న ఒచ్చిర్రాని బయట సూట్టురా జూశిండు. ఎవర్రాలే అని అన్కున్నకానే పూర్ణను దీస్కొని గొర్లమంద కాడ్కి బోయిండు.

"లోపల్కి బోయి జూడుబో బిడ్డ"

గొర్లమందను దాటుకుంటా పూర్ణ బోయేశర్కి, గొర్లమధ్యల గొంగడి గప్పుకొని జోసెఫ్ పడుకొని ఉండు.

జోసెఫ్ని అట్ల జూశేశర్కి పూర్ణకి ఏడ్పు ఎక్కువై ఎంబటేబోయి తనని అముల్కొని "నావల్లనే నీకీ గతచ్చెనే బావ, ఎవ్వల్ లేనట్టుగా గొర్లల్ల పన్నవానే బావ" అని ఎక్కి ఎక్కి ఏడ్తూ జోసెఫ్ మొకమంత ముద్దులు పెట్టింది.

"లే బావ లే, మనం ఈడ అద్దు. ఈడ ఇట్లనే ఉంటే మనల్ని బతకనియ్యరు, ఎటైనా బోదాంబా" అన్కుంటూ జోసెఫ్ని లేపింది.

"ఎట్బోతమే, ఏడ్కని బోతం. ఏడ్కిబోయిన ఇదే బత్కు, ఆడ్కెడికో బోతే నా కులమేమన్నా మార్తదా పూర్ణ. ఏది ఏమైనా ఈన్నే ఉండి కొట్లాడుదాం."

"అద్దు ఈడ అద్దె అద్దు. మా మామను జూత్తనే భయమేత్తాంది నాకు" మంకు బట్టుకుంది పూర్ణ.

అంత గమనిత్తున్న బాషి ఆళ్ళ దగ్గర్కత్తు "అవ్ రా జోసెఫ్, ఈ రాత్రి ఏమైతదో కుతం తెల్వదు. మీరేటన్న బోయి ఎట్లనోగట్ల పెళ్లి జేశ్కోని రండ్రి, గప్పుడు నే జూశ్కుంటా" అని సలయిచ్చిండు.

"ఎటుబోనే ఏడికనిబోను, మల్లోకటి శేతిలో రూపాయిబిళ్ళ గూడ లేదు" అని అంటుండగానే బాషన్న పైశల్ దీశి జోసెఫ్శేతిలో బెట్టిండు.

జోసఫ్ గమ్మునవుండి, నోరు మెదపలేదు. కండ్లపొంటి వాటంతటవే నీళ్లు కార్తానయ్.

"ఊకోరా పిచ్చోడ నే లేనారా నీకు" అని జోసెఫ్ ఎన్నుమీద భరోసాగా రెండు దెబ్బలేశిండు బాషి.

జోసెఫ్ నీళ్లు తుడ్శుకుంటు "నీకు బాకి పడ్తనే అన్న"

"సరే సరేగాని ముందు ఈన్నుంచి ఎల్లుండ్రి" అని తోల్తుంటే జోసెఫచ్చి బాషిని కౌగిలించుకున్నడు.

"అరేయ్ జోసెఫ్, నిన్ను నమ్మత్తాన పిల్లకు ఏ కట్టం రాకుండా జూశ్కోరా" అని ఇద్దర్నిబంపిండు బాషి.

*

ఊరంతా దిర్గి దిర్గి నర్సయ్య ఇంటికచ్చేశర్కి, ఆడ జనాలంత మోపైండ్రు. భాగ్య గద్మల గూసోని సాపిత్తాంది.

"ఏమైందే, ఎవలో సచ్చినట్లు జేత్తానవ్" అని ఆగమాగంగా అడిగిండు నర్సయ్య.

"కోడల్ కోడలిని మీదేశ్కుంటే, మన కొంప కూల్శి ఆ మాదిగొన్తోని లేశ్పోయిందిరయ్య" అని ఉన్నముచ్చట జెప్పింది భాగ్య.

మా మాటకు నర్సయ్య దట్టుకోలేక బోయిండు. ఒక్కశారిగా ఒళ్ళుదిర్గి కూలబడ్డాడు. ఎంబటే ఆడున్నోళ్లు అందుకొని నీళ్లు దాపిచ్చిర్రు.

కిరణ్, గౌండ్లోళ్ల పెద్దమన్శులందరు కల్శి కొత్వాల్ జెప్పింది జేయడానికి, ఆళ్ళు అనుకున్న ముచ్చట జెప్పనీకి నర్సయ్య కాడ్కచ్చి "జూడు నర్సయ్య, గిట్ల కూలబడితే గాదు ముచ్చట లేశి ఏదొకటి జెయ్యి లేకపోతే మేమేదొకటి జెయ్యల్శి ఒత్తది. అదెట్లంటే నువ్వు గిప్పుడు ఎక్కే శెట్లు బంద్బెట్టి, వేరేటొళ్ళకిత్తం. నిన్ను కులంలకేలి ఎలెత్తం. ఆళ్ళు గన్క పెళ్లి జేశ్కొనత్తే, ఇదే జరుగుద్ది జాగ్రత్త" అని పెద్దమన్శులు నర్సయ్యను భయబెట్టిర్రు.

నర్సయ్యకింకింత ఆగమాగమయ్యిండు. ఒక్కశారిగా తలకాయలో పుర్గు దిర్గినట్లై, ఎంబటే లేశి గుంజకున్న ముస్తాద్లోంచి కత్తి దీశిండు.

"నాతోని ఎవ్వదత్తడో రండ్రి. ఇయ్యలా వాన్ని సంపి, నా కోడల్ని దెచ్చుకుంటా" అని అన్నడు.

పోరగాల్లు, కిరణ్ మల్ల ఆనితోనచ్చిన మన్శులు తలో కట్టె బట్టుకొని గుంపులు గుంపులుగా బోయిర్రు. ఏడబడితే ఆడ అటు నర్సాయ్యోళ్ళు, ఇటు కిరణోళ్లు ఎంత దిర్గిన పూర్ణజోసెఫ్లిద్దరు కనబల్లేదు.

ఇగ కిరణ్కి ఆళ్ళ మన్శులకి మోసచ్చి, కెనాల్ బ్రిడ్జ్ కాడ కూసున్నరు.

"ఎందన్నా, ఎంత ఎతికిన దొర్కుతలేరు" అని గుంపులోంచి ఒకడు అంటున్న, కిరణ్ దేకకుండా ఏదో కదుల్తుందని కెనాల్ కట్టకేలి జాత్తాండు.

"అరేయ్ నాకే కనబడ్తాంద? ఓశారి అటు జూడుండ్ర, ఆడేదో ఉంది" అని జూపిచ్చిండు కిరణ్.

"అవ్ అన్న మాకు కనబడుతాంది"

"సరే బోయి చూద్దాంబా" అని కొంచెం ఆళ్ళు ముందుకుబోగానే పూర్ణజోసెఫ్లిద్దరు నడ్సుకుంటబోతాళ్ళు.

అదిజూశి కిరణోళ్లందరు ఎంబటే ఆగి, నిమ్మలంగా అడ్గులేశి, ఒక్కశారిగా ఆళ్ళ మీద్కి దుంకిళ్ళు.

ఏదో సప్పుడు అయితందని జోసెఫ్ ఎన్కకు దిర్గానే, కిరణోళ్ళు ఆళ్ళ మీదకు ఉర్కిరాడం జూశి, ఎంబటే పూర్ణ శెయ్యి బట్టుకొని ఉర్కబోతుంటే లంగదట్టి ఇద్దరు బోర్లబొక్కల బడ్డారు.

పూర్ణజోసెఫ్లిద్దర్ని సుట్టు ముట్టిర్రు.

"అరేయ్ ఈ పోరిని దీస్కబోయి, నర్సన్నను దీస్కరాబోండిరా" మోసబోసుకుంటా అన్నడు కిరణ్.

జోసెఫ్ని అన్గబట్టి పూర్ణను గొర్ర గొర్ర గుంజుకబోతుంటే కాళ్లడిత్తు అర్తాంది.

"అన్న అన్న మీకు దండం బెడతా, మమ్మల్ని వదిలేయండన్న" అని కిరణ్ కాళ్ళు బట్టుకొని బతిలాడుతుండు జోసెఫ్.

కిరణ్ నవ్వుకుంటా జోసెఫ్ని మోకాళ్ళ మీద కూసోబెట్టి, ఆళ్ళు ఎంట దెచ్చుకున్న కట్టెలతో యిపరితంగా కొట్టిర్రు.

"నువ్వు ఊరిని మార్తావ్రా? దొరకెదురత్తవరా? నీ మోకాన్కి ఈ పోరి గావాళ్లరా? అని సదువుతూ జోసెఫ్ మొకం మీద ఉమ్మేశి, జోసెఫ్ బట్టలు శింపి పారేశిర్రు.

ఆ బర్వాతన జోసెఫ్ రక్తంతో తానం జేశినట్లు అగుపడుతుండు. కనీసం నోట్లకేలి మాటెల్లక సోయిలేకుండా బడ్డాడు. తన రెండు కాళ్ళను ఎడంజేశి మధ్యలో ఒకలు తర్వాత ఒకలు వీడు బతికితే మమ్మల్ని బతకనియ్యడన్నట్లు పిచ్చల్శితికి బోయేట్లు తన్నుత్తుండ్రు. నొప్పిని భరించలేక జోసెఫ్ ఒగ ఒర్రుడు ఒర్రుకుంటా శేతితో భూమిని కొడుతుండు.

అట్నుంచి నర్సయ్య కత్తి బట్టుకొని ఉర్కతాండు. ఆళ్ళు జోసెఫ్ని లేపి తలకాయ బట్టుకోని "అన్న ఏయ్ అన్న నర్కు ఈన్ని" అని రెచ్చగొడుతుండ్రు.

నర్సయ్య కత్తి లేపిండు. ఒక్కశారిగా మెడ దాకచ్చి, ఆగిపోయి ఆలోచిత్తాండు.

"ఏమైందన్న ఏమైంది. నర్కు వాన్ని నర్కు" అని అందరూ అర్తాళ్ళు.

"సంపలేను నే సంపలేను" అని కత్తిని విసిరిగొట్టిండు నర్సయ్య.

అందరు, "ఏంది ఏం జేత్తాండు" అని జూత్తాళ్ళు

"నీకేమన్న తెల్తాంద, శాతకానోన్లెక్క జేత్తానవ్" అని పెద్దమన్శోకడు అనగానే,

"తెల్తాంది అంత తెల్తాంది. నేను ఈ కూని జెయ్యలేను అట్లాని కులాన్ని కాదనలేను. వీన్ని సంపితేనే కులంలో ఉంటాన? నా కోడల్ నాకాన్నే ఉంది, గిప్పుడు వీన్నెందుకు సంపాలి. నేను సంపను. ఇది నా సమస్య నే జూశుకుంటా, మీర్ బోండ్రి ఈన్నుంచి" అని బాధపడుతూ అందర్ని బతిలాడిండు.

"ఛీ వీడబ్బా గిట్ల జేశిండేంది, కొత్వాల్కేం జెప్పలే" అని కిరణ్ అనుకుంటుంటే, పొరగాళ్ళు మల్ల పెద్దమన్శులు ఎల్లిబోయిండ్రు.

నర్సయ్య నెత్తికున్న తువ్వాలను దీశి బర్వాతనున్న జోసెఫ్ నడుంకి గట్టి కూసోబెట్టిండు. జోసఫ్కు సోయి ఉండి లేనట్టుండు. ఒళ్ళంతా రక్తం ధారలు అట్టు గట్టినయ్. నర్సయ్య ఆడి అవస్థ జూడలేక,

"అరే నాయ్న, నా మాటీనురా. నిన్ను జూత్తాంటే నాకు బాధైతాందిరా, అట్లని నా కోడల్నీకు ఇచ్చి పెళ్లిజేయలేను. శాన చిన్నోళ్ళంరా మేము. కులాన్ని కాదని బత్కలేము. బత్దేరువుండదు నా ఇంట్లొళ్ళందరం బదాట్ల బడ్తాం. నావోళ్ళ మధ్య ఏం కానోన్లెక్క బతకాలే. నీకు దండం బెడ్తా, మమ్మల్ని వదిలేయ్రా" అని బతిలాడుకుంటుండు.

నర్సయ్య మాటల్కి జోసెఫ్ ఓపిక దెచ్చుకొని నిమ్మలంగా కండ్లు దెర్శి "నాయిన మేం ప్రేమించుకున్నమే, మీరే మమ్మల్ని ఒదిలెయ్యండ్రి. నీకు పుణ్యముంటది" అని అన్నడు.

పట్టరాని కోపంతో జోసెఫ్ ఎదురుబొచ్చె మీద నర్సయ్య "లంజోడక ఇనవరా" అని ఒక్క తన్ను తన్నగానే ఎల్లెలకల బడ్డాడు. ఎన్కకు దిర్గకుండా నర్సయ్య, జోసెఫ్ని ఆన్నే ఒదిలేశి బోయిండు.

జోసెఫ్ నిమ్మలంగా లేశి తన నడుముకున్న తువ్వాలను సదురుకుంటు, ఒంట్లో నుంచి రక్తం కార్తున్న ఓపిక దెచ్చుకొని ఒక్కో అడుగేశుకుంటు నడ్తాండు.

నర్సయ్య బోయింది జూశి కిరణ్ ఎవలకు కనబడకుండా జోసెఫ్ ఎన్కకచ్చి ఎన్నులోకి నర్సయ్య విసిరిగొట్టిన కత్తి దించిండు.ఏమైందోని దేరుకునే లోపు తన్ను తన్నెశరికి జోసెఫ్ కెనాల్ కట్ట మించేలి జర్ర జర్ర జారుకుంటా వారి మల్లల్లా బడ్డాడు.

జోసెఫ్ నెత్తురుతో వరిశేను తడ్తాంటే లేవలేకబోయిండు. కండ్లు దెలేశి, ఆకాశంలోనున్న సగం ఎన్నెలను జూత్తు పూర్ణ నవ్వోలే గుర్తచ్చి పెదాల చిరునవ్వుతో, "ఈ ఎన్నెల నీ నవ్వులా ఉన్న ఇప్పుడెంత ఎడ్తానవో" అని అన్కుంటు,

"తండ్రి, సమాప్తమైనది.

దేవా, హతుడనై నా జీవాత్మ నన్నొదిలెల్లు సమయాన నీ దరికి నన్ను చేర్చుకోనుము.

ఆమెన్."

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు