కథలు

(February,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఆయమ్మ అంతే! ఆమె ఒక   మదర్ తెరీసా!

ఎరికిలోల్ల  కతలు -02

 మా నాయన చెమటలు కార్చుకుంటా, గసపోసుకుంటా , సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు. సరిగ్గా ఊసురోమని   ఆయన ఇల్లు చేరే టయానికి మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు. పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి “  జయమ్మక్కా... ఏమి చెప్పేది ఇట్లా అయిపోయిందే ..ఇప్పుడు నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని  ఏడిస్తే చాలు ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మా యమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే  వుంటాయి. ఆ మూడూ కలిపి  ఆ యమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం చిన్నప్పుడు ఎప్పుడూ చూడనే లేదు. మా నాయన రూపాయి రూపాయి కూడబెట్టి పదేండ్లకు  అప్పుడు ఒకటి, అప్పుడు ఒకటి  అని కష్టపడి చేపించిన సొత్తు అది.

మా ఇంట్లో ఏ గ్లాసు చూసినా, ఏ ప్లేట్ చూసినా, మంచం, టేబుల్ చూసినా, మేము చదువుకోవడాని రాసుకోవడానికి చేయించిన ఆ కాలం కరణాలు, వి ఏ ఓ లు వాడే చెక్క డస్కులు చూసినా.. మాకు మా నాన్న చెమటా , రక్తమే.. గుర్తుకు వస్తాయి ఎప్పటికీ. మేము తినే ప్రతి అన్నంముద్ద పైన అయన చెమట, రక్తం వుంటాయి అనేది మా అమ్మ. ఒక్క మెతుకు అన్నం కూడా వృధా కాకూడదని అంటుంది.  అందుకే  ఇప్పటికి మేము తినే ప్రతి అన్నం ముద్దకూ ముందు మా అమ్మా  నాయనా గుర్తుకు రాకుండా వుండరు.   

మా  యస్టీ కాలని లోనే అదెందుకో తెలియదు కానీ  ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది మా అమ్మే.. జయమ్మే..! అట్లా అని మేము ఏమీ వుండే వాళ్ళం ఏమీ కాదు. మా నాయన ఒక్కడే చిన్న జీతగాడు.   ఇల్లు మొత్తానికి మా నాయన జీతమే ఆధారం. అందునా మా నాయనకు జీతం చాల తక్కువ. లంచాలు , మామూల్లు  తెసుకునే మనిషి కాదు. ఆయన జీతం ఇంటికి చాలేది కాదు. అయన ఆరోగ్యం బాగా లేక, చిత్తూరు, బెంగళూరు, వేలూరు సి యమ సి., తిరుపతి రకరకాల   ఆసుపత్రులకు తిరగడం, మందులు కొనడానికి అప్పులు చేయడం  మెడికల్ లీవులు అన్ని వాడేసి, జీతం లేని సెలవులు వాడి,మొత్తం మీద సంవత్సరం అంతా వెతికి చూసినా అప్పులు  లేని నెలే  లేదు మాకు.క్యాలండర్  నిండా అప్పులతో, వడ్డీ లెక్కలతో, నిండిపోయేది. మేo ఎప్పుడూ పాత  క్యాలెండర్లు పడేసింది లేదు. మా అమ్మ అందమైన చేతిరాతతో, ఎన్నో అంకెలు, సంఖ్యల తో క్యాలెండర్లు నిండిపోయేవి. ఎక్కడా ఖాళీ అనే మాటే వుండదు.   ఇంటి వద్ద నాకు, మా తమ్ముడికి ఐదో తరగతి వరకూ రోజూ అమ్మే కదా  ట్యూషన్ చెప్పేది. మాకు ఆ క్యాలండర్ లోనే లెక్కలు నేర్పేది. మాకున్న అప్పులు వడ్డీ బకాయిలతోనే  లెక్కలు నేర్చుకున్నాం. మా అప్పులే మాకు ఎక్కాలు,  లెక్కలు నేర్పింది. అట్లా చాలా కష్టాలతోనే మా బాల్యం గడచింది.

ఫారెస్ట్ డిపార్టుమెంటు లో  ఉద్యోగస్తులకి ప్రతి సంవత్సరం టార్గెట్ వుంటుంది. అడవిలోకి వెళ్లి మేత మేసే పశువులపైన పన్ను వుంటుంది. అడవి నుండి కట్టెలు తెచ్చి అమ్మే వాళ్ళ నుండి అపరాధం వసూలు చేసి గవర్నమెంట్ కు కట్టాలి. ఆ నెల వచ్చిందటే చాలు మా అమ్మ మొహంలో కళ తప్పిపోయేది. ఎందుకంటే ఆ నెల మా నాయన జీతo తీసుకుని ఆయనకు ఆఫీసర్లు  ఇచ్చిన టార్గెట్  ప్రకారం తను వసూలు చేసి ఉండాల్సిన  మొత్తం అపరాధo కింద  జీతం  మొత్తం ప్రభుత్వానికే  కట్టేసే వాడు.

 “ మేయ్ జయా.. ఈనెల ఇంకా జీతం రాలేదు. లేట్ అవుతుంది, ఎట్లో నువ్వే ఈనెల  సర్డుకోవల్ల  ” అనే వాడు కుశాలగా నవ్వడానికి ప్రయత్నం చేస్తూ. మళ్ళీ ఆయనే అసలు విషయం చెప్పేసి తప్పు చేసిన వాడిలా మా అమ్మ ముందు తల వంచుకునేసే వాడు. చేత్తో బీడీ ని అదే పనిగా నలుపుతూ వుండి పోతాడు కానీ, ఆ రోజంతా మా అమ్మ మొహం చూసే వాడు కాదు.   ఆయనకి కానీ మా అమ్మకి కానీ అపద్దాలు చెప్పేది తెలియదు.మాకు ఎప్పుడూ వాళ్ళు అపద్దాలు చెప్పింది లేదు. మాకు అపద్దాలు చెప్పే అలవాటూ అందుకే రాలేదు.   

           ఒక నెల జీతం రాకపోతే అప్పో సప్పో చేసి ఇల్లు గడుస్తుంది కానీ , ఆరునెలలు పడుతుంది ఆ అప్పు వడ్డీ అంతా తీరి సరిగ్గా కుదురుకోవడానికి. “  ఏం చేసేదమ్మా  ఖర్మ..అందర్లాగా కాదు, మా ఆయన పదకొండు నెలల జీతగాడు” అని మాత్రం అనేది. మా నాయనకు అమ్మ చేతుల్లో జీతం  డబ్బు పెట్టేయడమే తెలుసు. అంతా అమ్మే చూసుకునేది.  మా నాయన చాలా అమాయకుడని, టీ, బీడీ తాగడం తప్ప ఆయనకు ఇంకేమి తెలియదని మేం చిన్నప్పుడు అమాయకంగా అనుకునే వాళ్ళం.  

అయితే మా నాన్నకు ఒక అలవాటు ఉండేది. ఎప్పుడైనా సరే ఆయన వచ్చే సమయానికి ఇంట్లో మా అమ్మ ఉందంటేనే ఆయన ఇంట్లోపలకి వస్తాడు. మా అమ్మ ఇంట్లో లేదంటే, ఇంటి బయటే అరుగు పైన కూర్చునేస్తాడు. నేను, మా తమ్ముడు ఇద్దరం  ట్యూషన్ కి వెళ్లి ఉంటే, ఇంటి బయట మా అమ్మ చిలుకు(గొళ్ళెం ) పెట్టి వెళ్లి ఉంటుంది. చుట్టూ పక్కల ఇండ్లకు వెళ్ళినప్పుడు  ఆమె ఇంటికి ఎప్పుడూ తాళం వెయ్యదు. ఆమెకు తాళంవేసి వెళ్లే అలవాటు లేదు. ఎస్టీ కాలనీలో  మా బంధువుల ఇండ్లన్నీ పక్క పక్క లోనే, కొంచెం ముందూ వెనకా ఉంటాయి. వాళ్ల ఇళ్లకు వెళ్లి రావాలంటే తాళం వేసి  వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని మా అమ్మ అనుకుంటుంది.

ఎక్కడికి వెడుతుందో ముందుగా చెప్పి వెళ్ళే అలవాటు ఆమెకు లేదు.

ఆమె లేకుండా ఇంట్లోపలకి వచ్చే అలవాటు మా నాయనకు లేదు.

ఇంటికి రాగానే కూర్చున్నంత సేపు ఆయన ఇంటి బయటే కూర్చుంటాడు. మూడో నాలుగో బీడీలు ఊది పారేస్తాడు. అప్పటికే ఆయన బాగా అలసిపోయి ఉంటాడు. అడవిలో తిరిగివచ్చినా, చెక్ పోస్టులో డ్యూటీ చేసి వచ్చినా , అటవీశాఖ ఉద్యోగిగా ఆయనకు శారీరక శ్రమ ఎక్కువ. అందునా డ్యూటీ అయిపోయిన తర్వాత ఆయన నేరుగా బస్సు ఎక్కి ఇంటికి చేరడు. బస్సు చార్జీలు పెట్టడం ఆయనకు నచ్చదు కదా, లారీ లోనే ప్రయాణం చేసి వస్తాడు. ఆ మిగిలిన డబ్బులకి ఏ పండో , స్వీటో ఏదో ఒకటి మాకోసం తెస్తాడు కదా. ఖాకి బట్టలు వేసుకుని ఫారెస్ట్ చెక్ పోస్టులో ఆయన చేయి ఊపితే చాలు, ఏ లారీ  అయినా ఆగిపోవాల్సిందే. ఆయన లారీలో చాలా దూరం ప్రయాణించటం వల్ల, బస్టాండ్ వద్ద లారీ దిగిన తర్వాత  ఆయన బరువైన  బ్యాగ్ మోసుకుంటూ చాలా అలసిపోయి చెమటలు కక్కుకుంటూ ఇంటికి వస్తాడు.అప్పటికే అయన బాగా అలసిపోయివుంటాడు.

వయసు కూడా ఎక్కువ కాబట్టి, దగ్గు, ఆయాసం, ఉబ్బసం వల్ల  అయన అప్పటికే గసపోస్తా ఉంటాడు.ఎంత దూరం వెళ్ళినా, ఎంత రాత్రయినా ఇల్లు చేరిపోతాడు. ఆయనకు ఉద్యోగం ఇల్లు, భార్య పిల్లలు తప్ప ఇంకో లోకం తెలియదు.అయన ప్రాణాలన్నీ మా పైనే ఉండేవి .ఎంత ఆరోగ్యం బాగా లేకపోయినా, ఇంకా ఈయన పని అయిపోయిందిలే అని అందరూ అనేసి, తల ఊపేసినా  కూడా  ఎట్లో మళ్ళీ మాకోసమే అన్నట్లు  బ్రతికేసే వాడు. ఆసుపత్రి నుంచి కోలుకుని ఇల్లు చేరిపోయేవాడు.

ఇల్లు,భార్య,పిల్లలు అంటే ఆయనకు అంత ఇష్టం . శారీరకంగా ఎంత బలహీనుడైనా భార్యా, పిల్లల్ని  ప్రేమించడంలో ఆయన్ను మించిన బలశాలి మాకు తెలిసిన లోకం లో ఇంకెవరూ లేరేమో?!        

అంత అలసిపోయి వచ్చిన వాడికి ఇంటి ముందుకు రాగానే, తలుపులు మూసి ఉండటం గొళ్ళెం పెట్టి ఉండటం  చూడగానే ఆయనకు  ప్రాణం ఉస్సురు మంటుంది. ఎక్కడలేని నీరసం ముంచుకు వస్తుంది. విపరీతంగా కోపం వస్తుంది. మా నాయనకు అట్లా ఇంటికి ఆమె తాళం వేయకుండా వెళ్లడం అస్సలు నచ్చదు.ఆయన వచ్చే సమయానికి మా అమ్మ ఇంట్లో లేకపోవడంతో ఎప్పుడు పెద్ద గొడవ మొదలవుతుంది. తను ఇంటికి వచ్చే సమయానికి, మా అమ్మ ఇంట్లో లేకపోవడం, ఆయనకు కోపం వచ్చే సవాలక్ష కారణాలలో ముఖ్యమైనది.ఆయనకు అసలే కోపం ఎక్కువ. ముక్కు మీదే వుంటుంది కోపం.

మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది." నీ కేమబ్బా.. ఊరికే ఊరికేనే కోపం వచ్చేస్తుంది.అయినా చీమ చిటుక్కుమన్నా కోపం వచ్చే ఇలాంటి ఆగింతం మొగవాడ్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మొగుడు ఇంట్లో కూలి డబ్బులు అస్సలు ఇయ్యడమే లేదంటే , పిలకాయలు ఆయమ్మ పస్తులు ఉండారంటే, పిల్లోల్లకి వయసైపోతా వుంటే కూడా ఇంకా మునిదేవర చెయ్యలేదని పెద్ద గొడవ అయిపోయింది లే.  ఆ కతేందో  మాట్లాడదామని మా ఆడబిడ్డ పిలిస్తే వాళ్ళ ఇంటికి పోయింటిని అది కూడా తప్పేనా..." అని దీర్ఘాలు తీస్తుంది.

 

చాలాసార్లు నెమ్మదిగానే తన గైర్హాజరికి  మెత్తగానే జవాబు చెపుతుంది కానీ, ఒక్కోసారి మా అమ్మకు కూడా కోపం వచ్చేస్తుంది. “ ఇప్పుడు ఏమైందని  అంత ఆగింతం  చేస్తా ఉండావు? ఇంట్లో లబ్బి ఏమైనా పెట్టిండావా? బంగారం ఉందా? వెండి ఉందా? దుడ్లు ఉండాయా? ముడ్డి చుట్టూరా ముప్ఫయి ఆరు అప్పులు పెట్టుకొని బతకతా ఉంటే ఎవురో వస్తారంట.ఈడుండే సత్తు సామాన్ల కోసం..".

ఆమె కోపంగా చెప్పినాముక్కు చీదతా చెప్పినా, కరుగ్గా చెప్పినా, ఏడుపు గొంతుతో చెప్పినా మా నాయనకి ఆమె ఎప్పుడు ఏం చెప్పినా నచ్చేది కాదు.కానీ ఆమెకు బదులు చెప్పేవాడు కాదు.ఆయన కోపం ఎంత తీవ్రంగా వున్నా సరే , ఆమెకు కోపం వచ్చినప్పుడు అయన పూర్తిగా తగ్గి పోయేవాడు. అట్లా అయన తగ్గిపోవడమే వాల్లిద్దరి అన్యోన్యతకి కారణమేమో .

"మొగోడు అన్యంక చిలుకు తీసి తలుపు తోసి లోపలికి పోయి, బ్యాగు పడేసి, గుడ్డలు మార్చుకుని పంచ కట్టుకోవడం కూడా  తెలీదా ఇంత పెద్ద మొగోనికి? నేను పక్కలోనే వుండి ఏం చెయ్యాలంట? ప్యాంటు విప్పి పంచ కట్టించాలా ?" ఆమె ఎదురుదాడి ప్రారంభిస్తుంది. మా అమ్మ గొంతు పెద్దదయ్యేకొద్దీ మా నాయన గొంతు మెత్తగా మారిపోతుంది. ఆమెకి నిజంగా కోపం వచ్చిన అన్ని  సందర్భాలలో , ఆయన తప్పు వున్నా, లేక పోయినా ఆయన పూర్తిగా తగ్గిపోతాడు.అది మా అందరికీ బాగా తెలుసు.

" మేయ్ జయా.. టీ పెట్టు.." అని మాట మార్చేస్తాడు.

ఆ గొంతులో విన్నపం ఉంటుంది. బ్రతిమాలడం ఉంటుంది. ప్రాధేయ పడటం ఉంటుంది. అభ్యర్థన ఉంటుంది.అన్నిటికీమించి అప్పడా గొంతు ఎంతో తియ్యగా వుంటుంది. ఆ మాటల నిండా ఎంతో  ప్రేమ వుంటుంది. మా నాయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు అనే మాట అది ఒక్కటే.ఆ టీ కూడా చాల వేడిగా పొగలు పోతూ వుండాలి. ముందుగా బాగా  వేడి నీళ్ళతో గ్లాసు నింపాలి.గ్లాసు వేడెక్కాలి..ఆ టీగ్లాసు పట్టుకుంటే చేతివేళ్ళకు వేడి అoటుకోవాలి. టీ చప్పరిస్తే నాలుక చురుక్కుమనాలి. అప్పుడే దాని “టీ..” అంటాడు  మా నాయన.అదీ  టీ అంటే !    

 

ఒకోసారి మా అమ్మ చుట్టుపక్కల ఇండ్లలో కాకుండా కొంచెం దూరం వెళ్లి ఉంటుంది. ఎస్టీ కాలనీలో పందులు మేపే వాళ్ళు ఉన్నారు. బాతులు మేపే వాళ్ళూ ఉన్నారు. ఎర్రమన్ను ముగ్గుపిండి అమ్మే వాళ్ళు ఉన్నారు. వెదురు దబ్బలు  చీల్చి,  చేటలు గంపలు తట్టలు బుట్టలు అల్లిక చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు.

మా అమ్మ వాళ్ళ నాన్న  చిన్నయ్య  అటవీశాఖ లో ఉద్యోగి. 

మా నాయన  వాల్ల నాయనేమో  గాడిదలు మేపే వాడు. అదీ తేడా.!

అడవి నుండి ఎండు కట్టెలు గాడిదల పైన తీసుకొని వచ్చి, ఊర్లో అమ్మడం  మా నాయన వాళ్ళ నాయనకు వృత్తిగా ఉండేది. ఆయనకు పందుల వ్యాపారం కూడా ఉండేది.అయన అస్సలు ఏమీ చదువుకోని వాడు. ఎట్లో ఒగట్లా కష్టపడి  మా నాయన  చదివినాడు కాబట్టి, అప్పట్లో ఫారెస్ట్ గార్డ్ గా ఉద్యోగంలో చేరిపోయాడు. దాంతో ఆయనకి గాడిదలు కాసే పని తప్పోయింది. ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఆ చిన్న ఉద్యోగమే లేక పోయి వుంటే మూడేండ్లు మా అమ్మ కోసం ఎన్నిసార్లు  అయన చుట్టూ  తిరిగినా, మా అమ్మను మా నాయనకు  ఇచ్చి మా చిన్నయ్య తాత పెండ్లి చేసి వుండే వాడే  కాదు.అందుకేనేమో మా నాయనకు అడవులు తిరిగే ఆ పని ఎంత కష్టం అనిపించినా, అస్సలు తను చెయ్యలేని పరిస్థితి లో వున్నా సరే ఆ ఉద్యోగం అంటే అంత ఇష్టం.డ్యూటీ నుండి ఇంట్లోపలికి వచ్చి, ఆ బట్టలు తీసి దండెం కు తగిలించాక ఆ గుడ్డలకు అయన రెండు చేతులతో దేవుడ్ని మొక్కినట్లు  మొక్కుకునే వాడు.  ఆ ఖాఖీ బట్టలంటే అంత గౌరవం ఆయనకి .

మామూలుగా స్కూల్లో సరిగ్గా చదవని పిల్లలని  టీచర్లు తిడతా వుంటారు. “ ఏమ్రా ..సరిగ్గా స్కూలుకు రాకపోతే చదువు ఎట్లా వస్తుంది మీకు ? సరిగ్గా సడువుకోక పోతే గాడిదలు కాసే దానికి తప్ప ఇంకా దేనికి మీరు పనికి రాకుండా పోతారు” అని . మా కాలనీలో వుండే పిలకాయలకి మాత్రం  భలే నవ్వు వస్తూ వుంటుంది...ఆ మాటలు వింటా వుంటే .. అయినా అట్లా గాడిదలు కాసే పనో , పందుల్ని కాసే పనో హీనమైనదనో, నీచమైన పని అనో ఎందుకు పిల్లోల్లకి చిన్నపాటి నుండే అయ్యవోర్లు అట్లా తప్పుగా చెపుతారో మాకు అర్థం అయ్యేది కాదు.మాకైతే గాడిదలు గొప్పే, పందులూ గొప్పే.మా ఎరికిలోల్ల ఇండ్లల్లో పందులూ గాడిదలు మాతో బాటే కదా వుంటాయి.మాకు వాటిని తక్కువగా చూడటం మాకు  అస్సలు చేత కాదు.  

ఎందుకంటే  మాఎరికిలోల్లల్లో పందులు మేపినా, గాడిదలు కాసినా, ఉప్పు అమ్మినా, వెదురు బుట్టలు డబ్బాలు, తడికలు అమ్మినా, అడవికి  పోయి ఎండుకట్టెలు కొట్టుకొచ్చి ఊర్లోకి మోసుకొచ్చి అమ్మినా, ఎర్రమన్ను, ముగ్గు పిండి అమ్మినా , పెద్దోల్ల ఇండ్లల్లో ఇంటి పని చేసినా, కూలికి పోయినా ఏం చేసినా మా బ్రతుకేదో మేం బ్రతకడమే మాకు తెలుసు. కష్టపడి సంపాదించడమే తెలుసు కానీ, ఎవురి సొత్తుకు పోవడం కానీ, ఇంకొకళ్ళ సొత్తు వూరికే ఆశించడం కానీ మాకు తెలియదు. గాడిదలు కాసినా, పందులు మేపినా ఆ జీవాల్ని ఎంత గొప్పగా, గౌరవంగా, ఇష్టంగా మా ఇండ్లల్లో  మనుషుల మాదిరే అన్నాతమ్ముల మాదిరే, అక్క చెల్లెళ్ళ మాదిరే చూస్తాం తప్ప, అవేవో జంతువులని కానీ , మనుషుల కంటే చాల తక్కువైనవనే భావన కానీ మాకు అస్సలు  వుండదు. మాతో బాటే అవీ ...

ఎందుకంటే మాకు పంది పిల్లలతో ఆడుకోవడం తెలుసు. గాడిద పిల్లల్ని చాకడమూ  తెలుసు. పై కులమోల్లు గొప్ప గొప్పోళ్ళు  అని అంటా వుంటారు కానీ,  ఎందులో ఎవురేం గొప్పో మాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. కులం అంటే తెలీదు, కానీ మా ఎరుకల  కులం ఎందుకో చాల తక్కువైనదని మాత్రం బాగా తెలుసు. మేం దడాలున ఎవరి ఇంట్లోపలికి పోకూడదని తెలుసు.

అదేందో తెలియదు కానీ మా కాలని పిల్లోల్లని   ఇంట్లో వుండే వాళ్ళు, స్కూల్లో అయివోర్లు, చిన్నా పెద్దా అందరూ కలసి ఎందుకు అంత భయపెడతారో అప్పట్లో  తెలియదు. ఆఖరికి దొడ్డికి పోవల్లంటే కూడా మిగతా జనాలు పొయ్యే కాడికి మా కులం వాళ్ళు పోకూడదని అంటే, మా మల మూత్రాదులకి కూడా అంటూ, మైల ఉంటాయని తెలియదు.వాళ్ళది  వేరు, మాది వేరు అని అమాయంగా అనుకునే వాళ్ళం చిన్నప్పుడు.

ఇట్లా నిత్యం భయాలతో , అడగడుగునా ఆంక్షలతో పెరిగే ఎరికిల పిల్లోల్లు  యెట్లా చదువు కుంటారో, యెట్లా బాగు పడతారో చెప్పే వాళ్ళు ఎవరు ? ఇప్పటికీ కులం అడిగి , చెప్పి చెప్పంగానే మొహం చిట్లించే వాళ్ళని ఎంత మందిని చూడలేదు ? అయితే మాకు కులాన్ని దాచి పెట్టుకుని అపద్దం చెప్పడం మాకు తెలియదు. ఎవరు మొఖాలు మాడ్చుకున్నా సరే, మా కులం ఏమిటో బెరుకు లేకుండా చెప్పాలని మా నాయన చెప్పేవాడు.  దేనికీ భయపడ కూడదని మా అమ్మ చెప్పేది.

మా అమ్మ ఎప్పుడూ ఒకమాట అంటా వుండేది.. సంపాల్సి వస్తే ముందు.. భయాన్ని సంపెయ్యల్ల,అప్పుడే ఎట్లాంటి  మనిషైనా  బాగు పడతాడని చాల సార్లు అనేది. చిన్నప్పటి నుండి నాకు ఆ మాటలు బలంగా గుర్తుoడి పోయాయి.   అందుకే నాకు ఎవురన్నా  , ఏదేమైనా ఎప్పుడూ  భయమే అనిపించదు.వుండేది వున్నేట్లుగా నిజాయితిగా పచ్చిగా  ధైర్యం గా మాట్లాడతాను అంటే , చిన్నప్పుడు నేర్చిన ఆ  చదువు కానీ , ఆ ధైర్యం కానీ  అంతా  మాయమ్మ పెట్టిన భిక్షే !     

 

ఎవరైనా ఏదైనా మాట సాయమో, చేతి సాయమో అడిగితే, మా అమ్మ వెనకా ముందు ఆలోచించేది కాదు. మనిషి  సహాయం అవసరమైతే ఇంట్లో కట్టెల పొయ్యి పైన  బియ్యం పాత్రలో పొంగు వస్తా ఉంటే కూడా సరే,  ఇంకోపక్క పప్పు చారు ఎనపాల్సి వుండినా సరే.. దాన్నట్లా చూసుకోండిరా అని చెప్పి ఆమె వెళ్ళిపోయేది. మేము లేకపోతే మండుతున్న కట్టెల పైన నీళ్ళు జల్లి ఉన్నఫలంగా వంట పనులు ఎక్కడికి అక్కడ అట్లాగే వదిలేసి  ఇంటికి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయేది.

ఈ పందులు మేపే వాళ్ళు, కాలనీలో కొంచెం దూరంగా ఉంటారని చెప్పినా కదా, అక్కడ ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే ఆమె అటు వెళ్లిందంటే రావడానికి చాలా సమయమే పట్టేది.మేము ట్యూషన్ నుంచి వచ్చి ఆకలితో, ఏడుపు ముఖాలతో నిలబడితే మా నాయనకు మా అమ్మ పైన విపరీతంగా కోపం వచ్చేసేది.

" చిన్న పిల్లలని కూడా చూడకుండా యాడికి పోయినావు మే.. బుద్ధుందా నీకు? అట్లా చూడు ఆ పిలకాయల మొహాలు ఎట్లా వాడిపోయిండాయో.."అని కసిరే వాడు.

 

"ఏముండాది  ఆ పక్క కాంతమ్మని వాళ్ళ ఇంటాయన కొట్టి చంపేస్తా ఉంటే అడికి పోయినా. ఆ నా బట్ట కి ఎన్నిసార్లు చెప్పేది ఆడదాన్ని కొట్టద్ధురా..అని. మిడిమాళం పట్టినోడు.. ఆ పాప ఓ..అని ఏడస్తావుంటే యాడ వాని చేతుల్లో చచ్చిపోతుందో అని పోయినా.. తప్పా?"

   

        ఇంకేo అంటాడు మా నాయన ?

ఆయన నోట్లోంచి వచ్చే మాటలకు, ఆయన కోపానికి ఆమె అనే  ఒక్క మాట అడ్డుకట్ట వేసేస్తుంది .ఆయన కోపం మొత్తం ఒక్క క్షణంలో మాయమైపోతుంది.

 “ అయ్యో పోనీలే పాపం. నువ్వు సరిగ్గా టయానికి పోయినావు కాబట్టే ఆయమ్మకి దెబ్బలు తప్పోయి వుంటాయి. నాలుగు దెబ్బలైనా తగ్గి వుంటాయి లే . ఏదో ఒకటి  మంచే జరిగిందిలేమ్మే . సరేలే ముందు ఈ  పిల్లోల్ల కత చూడు ఇప్పుడైనా  పాపం  ” అని మా వైపు తిరిగి మా ముఖాల  వైపే చూస్తూ మెల్లగా అనేవాడు గణేష్ బీడీనో, అశోకా  బీడీనో ముట్టిoచుకుంటా . ఆ మాట అంటా అట్లాగే  ఇంట్లోంచి బయటకు కదిలే వాడు. ఇంట్లో బీడిలు తాగకూడదని నాలుగో తరగతి చదివేటప్పుడు నేను గొడవ చేసినాను కాబట్టి. నేను నా  జడ విప్పే వాడ్ని అయన మాటలు వింటా , ఆయన్నే చూస్తా.మొగ పిల్లోడికి జడ ఏమిటి అంటారా ?  

మా అమ్మకు ఆడ బిడ్డలు అంటే చాలా ఇష్టం కదా . అందుకే మా అమ్మ తమ్ముడి కూతుర్ని, అన్న కూతుర్లని, చెల్లెలు కూతుర్లను   ముదిగారంగా చూసుకునేది. అయితే మా అమ్మకు ఇద్దరూ మొగ బిడ్డలే కాబట్టి నాకు జడలు వేసేది. నేను స్కూలుకు రెండు జడలతో వెళ్ళే వాడిని. మునిదేవర జరగటం, మునీశ్వరుడికి తల వెంట్రుకలు ఇవ్వడం డబ్బు సర్దుబాటు కాకపోవడం  వల్ల చాల ఆలస్యం అయింది.

ఎరుకల కుటుంభాల్లో డబ్బు వున్నా లేక పోయినా అప్పో సప్పో చేసి అయినా ఆడంబరం గా జరిపించే వేడుకల్లో మునిదేవర ముఖ్యమైనది.   మునిదేవర జరిగి  గుండు కొట్టిన తర్వాతనే  నాకు క్రాఫు కు అనుమతి వచ్చేది. ఆ రోజు గొడవ కూడా మా అత్తవాల్ల ఇంట్లో వాళ్ళ పిల్లోడికి మునిదేవర యెట్లా చేయల్ల అనే దాని గురించే అంట. డబ్బు లేదని, అప్పు పుట్టలేదని మా మామ అంటే మా అత్త ఒప్పుకోలేదంట. పిల్లోడికి టయానికి మునిదేవర కూడా చెయ్యలేక పోతే నువ్వేం  మొగోడివి అనేసిందంట. దాంతో మా మామకి కోపం వచ్చి మా అత్తను ఇష్టం వచ్చినట్లు కొట్టేసినాడంట. సరిగ్గా టయానికి మా అత్త వచ్చి అమ్మను తీసుకు పొయ్యింది కాబట్టి ఆ యమ్మకి దెబ్బలు తప్పోయిన మాట నిజమే  అని అన్నo తినేటప్పుడు మా అమ్మే  మా నాయనకు చెప్పింది.

నవ్వుతా నవ్వుతానే మా నాయన ఒక మాట అడిగినాడు మా అమ్మ కల్లా చూస్తా చూస్తా ..“ జయా  ఉద్యోగం చేస్తా వుండే నాకే దేవర చెయ్యాలంటే ఆలోచిస్తా ఉండాదా. ఆ రమనయ్యకి యెట్లా కుదురుతుందిమే  ”

అప్పుడైనా అసలు కథ చేపుతుందేమో అని ఒక్క క్షణం ఎదురు  చూసాడు కానీ,  మా అమ్మ తెలివిగా బదులు చెప్పేసింది. “ ఏముండాది ఎవురో ఒకరు మనసు పెట్టి ముందుపడి ఆదుకుంటే అయిపోతుందిలే. దేవుడి పనికి దేవుడే వస్తాడా యాడన్నా ?”.తల వంచుకునే వడ్డించింది, తల వంచుకునే అన్నం తింది. తల వంచుకునే మాట్లాడుతుంటే  చిన్నపిల్లోల్లం మాకే అర్థం అయి పోయింది, ఇంక మా నాయనకు అర్థం కాకుండా ఉంటుందా ?

చూసి, చూసీ అడగనే అడిగేసాడు.

“ ఏమ్మే జయా.. కొత్త పెండ్లి కూతురి మాదిరి తల వంచుకునే వుండావు. సిగ్గు పడతా నా  మొహం కల్లా  చూడకుండానే మాట్లాడతా ఉండావే? ఏమైంది నీకీ పొద్దు ? ”

ఆమె అప్పటికీ తల పైకి ఎత్తదు.మా నాయన మొహం కల్లా చూడదు.అయినా అమ్మ అపద్దం చెప్పదు కదా, నిజమే చెపుతుంది. ఆయమ్మకు ధైర్యం చాలా  ఎక్కువ కదా.భయమే ఉండదు కదా! . ఏం జరిగిందో చెప్పేస్తుంది.

“ వాళ్ళు పందులు అమ్మేదానికి ఇంకా టైం పడుతుంది కదా. అందుకే.. నా కమ్మలు ఇచ్చేసి వచ్చినా. కుదవపెట్టి మునిదేవర చేపించేయమంటి. ఏమిప్పుడు ?   ” అని  క్షణం  ఆగి  “ ఊ.... ” అంటుంది ప్రశ్నార్థకంగా.

అప్పుడు  మా నాయనకు కోపం రాదు.బాధ కలగదు.ఆయన మొహం మామూలుగానే వుంటుంది. ఏ మార్పూ వుండదు.

 నాకు చెప్పకుండా చేసినావే అని కానీ, నాకు ముందుగా చెప్పల్ల కదా అని కానీ, నన్ను అడగల్ల కదా అని కానీ అనే  మాట అస్సలు రాదు ఆయన నోట్లోనుంచి.

ఏం మాట్లాడకుండా “  మీ అమ్మ ఒక  మదర్ తెరిస్సా.. లేరా  ” అని మా కళ్ళా ఒక చూపు చూసి నవ్వుతా బీడీ కట్ట అగ్గిపెట్టె ఎత్తుకుని , మా ఇంటి ముందు  వుండే నెల్లికాయల చెట్టు దగ్గరకి వెళ్ళిపోతాడు. అదిగో కరెక్టుగా  మా నాయన ఇంట్లోంచి బయటకు పోయిన ఐదారు   క్షణాల తర్వాత మా అమ్మ తల పైకి ఎత్తి, వక్కా ఆకుతో గార పట్టిన  ఎత్తు పళ్ళు కనిపించేలా  నవ్వుతా  మా వైపు చూస్తుంది.

ఎందుకో తెలియదు కానీ జయమ్మ  మొహం లోకి అప్పుడు   ఏదో వింత వెలుతురు  వచ్చి వుంటుంది.

ఎందుకో అప్పుడు మా అమ్మ మాకు కొత్తగా అనిపించేది.ఎందుకో అంతకు  ముందుకన్నా  అప్పుడు మా అమ్మమాకు  చాలా  అందంగా కనిపించేది .

 

     

 


ఈ సంచికలో...                     

Feb 2021

ఇతర పత్రికలు