మనోశాస్త్రాలను యంత్రరూపంలోకి తెస్తే మానవరక్తంలో విషం విరిగి రంగు మార్చుకున్న రక్తం ఒక్కక్కోరిలో ఒకోరకంగా ఒక్కరికి ఒక్క ముఖాన్నే బొడ్డుతాడుతో అనుసంధానం చేసి, ప్రేమామృతాన్నిఇంధనంగా స్రవించి మనసు మరబొమ్మలా మనిషిని నడిపిస్తుంది.
అవిశ్రాంతంగా మెదడులో గూడు కట్టుకున్న ఊహాలకు రెక్కలు మొలిచి మనసు సంకేతాలను సాంకేతికంగా గౌరవిస్తూ, ప్రతి అనుభవాన్నిఅద్ధంగా మార్చి మరకల్ని తుడిచే అదృశ్య హస్తమొకటి తప్పటడుగులు లేని దారిలో స్వచ్ఛగా నడిపించాలని ఓ చిరునామాతో చిరుస్వాగతం పలుకుతుంది.
ఎండమావిగా నమ్మకంతో నడి రాతిరివడగాల్పుల సెగలు కమ్మే ఆలోచనకు మనసు చాపలా ముడుచుకొని చింతల్ని తలచుకొని చీకటిని కప్పుకొని వెలుగు గువ్వను కంటి ఇంటి దరిదాపుల్లో వాలకుండాక పారద్రోలిన ప్రతి పలుకులోని అంతర్ధాల కింద నలిగిన మనిషికి నిద్ర దూరమైనా నిజాలు దగ్గరయ్యాయి. కలలు రాకపోయినా కపటాలు తెలిసాయి.
అంగుళం వదలకుండా మనసును ఆక్రమించి ఆక్రందనకు గురి చేసే కళ తెలిసిన ఓ విద్యాలయం ఒంటరితనం.
గతాన్ని తవ్విపోసికొద్ది రాసులుగా బయటపడే నిజాలు గుట్టలుగా పేరుకుపోయి మనిషిలోని అహాన్ని సమాధి చేస్తుంటే జీవితం నల్ల కలువ. మెల్లగా ముడుచుకొని తెలుసుకొనే తెల్లని పొద్దులో హృదయంలో మృదుకదలికకు మాటలు నేర్పే తల్లిదనం సహనం.
వణికిన వర్తమానం కాలిన ఒంటితో ఒంటి కాలి పరుగుతో ఒంటరిగా ఓటమి ఒడిని చేరి రేపు ఉదయాన్ని శాసించే ఓ కిరణమై ఎలా మెలాగాలో ఓ పుంజమై ఎలా మెదలాలో ఆ రాతిరి రేపటికి గురిపెట్టిన బాణంగా మార్చి ఓటమి ప్రేమతో కౌగిలించుకొని నేర్పిన విలువిద్య ఆత్మస్థైర్యం.
తాకడానికి వీలుకాని జ్ఞానాన్ని, పుస్తకలోకి నడచివెళ్లలేని సోమరితనానికి చేరదీసుకోలేని విజ్ఞానం ద్రావక రూపంలో మెదడు పొరల్లో విస్తరించి కళ్ళకు మెరుపులు పూస్తున్నాయి. నాలుక నడక నేర్చుకుంది.
మనిషిలో మరో మనిషి విడివడి అనుభవ భావజాలంతో శుభ్రపడిన మనసులోని ప్రతి పొర సూక్ష్మ ప్రశ్నలకు స్పందించే శుభసమయంలో మనిషి వేసి ప్రతి అడుగు శబ్దం ప్రపంచానికిఓ శుభసంకల్పమే.