కవితలు

(January,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఐశ్వర్యమంటే

1.చదువు కొన్న పార్థు చెడ్డబుద్ధితోడ

   అడ్డ దార్లు వెదికి అధిక సొత్తు 

   పొంద ఆశ్రయించె బూటకపు గురుని;

   చెప్పెనంత మూర్ఖ  చిటుకులతను.

 

2. వాటియందు ఒకటి వైవాహికమనగ

    పెండ్లి యాడె మంచి పిల్ల జూసి;

   కట్టుకున్న గౌరి కష్టమేనాడును

   పట్టకుండ తిరిగె భర్తగారు.

 

3.గర్భవతిగ నుండ గంతులేసిన పార్థు

   నెలలు నిండు చుండ కలత చెందె

   గురుడు చెప్పినట్లు కొమరుడు కలుగునా?

   కొడుకు పుట్టితేను కోట్లు తనకు!

 

4.పిల్లవాడు పుడితె పెరుగును సంపద

   పిల్లవాడు కలుగ పెద్ద పేరు;

   గుర్తు కొచ్చు కొద్ది గుండెలుప్పొంగెను

   ఎదురు చూసె బిడ్డ ఏడ్పు కొరకు

 

5.అతని ఆశలన్ని అడియాసలాయెను

   ఆడపిల్ల పుట్టెఅంత సతిని

  పుట్టినింట విడిచి పొసగదు కాపుర

  మనగ గాయ పడెను కాంత మనసు!

 

6.ఊరి పెద్ద లెల్ల ఉపయుక్త మాటలు

   ఎన్ని చెప్పి నేమి? ఎద్దు వాడు.

   ఆడపిల్ల అన్న అష్ట లక్ష్ములనిన

   వినక పోయె నిజము కనకపోయె!

 

7.అర్ధ మయ్యె సరికి అంతా ముగిసిపోయె

   కుళ్ళికుళ్ళి గౌరి కుమిలి పోయె.

   బోధపర్చె లక్ష్మి బోసి నవ్వు భవిత

  లక్ష్య మెంచు కొనియె లక్ష్మి కొరకు

 

8.కాయ కష్ట మెరిగి కార్యము సాధించ 

   బతుకు బండి నడిపె భార్య గౌరి

   నక్క జాతి వంటి నరులెందరున్ననూ

   నెగ్గుకొచ్చె లక్ష్మిని గెలిపించ

 

9.ఆడ బతుకునకును అర్థము చెప్పగ

   తల్లి మనసు తీర్చ తనయ తలచె

   పట్టు బట్టి చదివి పతకాలు సాధింప

   అంతరిక్ష యాన మంది వచ్చె

 

10.దేశమంత మెచ్చు ఆశలపట్టిగా 

     లక్ష్మి నిలిచె ధరను లక్షణముగ

     ఆమెజూచితండ్రి అనుకొనె మనసులో

     ఆడపిల్లయనగ అబలకాదు!

 

11. కన్నబిడ్డ చేరి కౌగిలించిన పార్థు

       కండ్లనీరునిలిచె కంఠమొణికె

       తప్పుకాయమంచు తనభార్యనూ వేడె

       గౌరి మనసు కూడ కరిగెనంత!

 

భావం:

     పార్ధు అనే అతను చదువుకున్న వాడైననూ అజ్ఞానంతో అధిక సొమ్ము సంపాదించటం కోసం మాయ గురువుని నమ్ముతాడు. అతను పెళ్ళి చేసుకుంటే మగపిల్లవాడు పుడితే దశ తిరుగునని చెబుతాడు. అతను గౌరి అనే అమ్మాయిని పెళ్ళాడతాడు కానీ ఆమె  బాగోగులు పట్టించుకోడు. గౌరి గర్భం దాల్చిందని తెలిసి ఆకాశమంత పొంగి గరువు చెప్పింది నిజం కాబోతుందని ఆన పడతాడు. కానీ ఆడ పిల్ల పుట్టిందని తెలిసి భార్యా బిడ్డలను పుట్టింట వదిలి వేస్తాడు. పెద్ధలు ఎంత సర్ధి చెప్పినా వినడు. గౌరి మనసు గాయపడి కుమిలి పోతుంది. కానీ పసిబిడ్డ లక్ష్మి నవ్వులు చూసి కర్తవ్యం గుర్తుతెచ్చుకుని  ఆడపిల్ల ప్రాముఖ్యతని తెలపటానికి అష్ట కష్టాలు పడి ఆత్మస్థర్యంతో లక్ష్మిని చదివిస్తుంది. తల్లి మనసు గ్రహించిన లక్ష్మి బాగ చదివి అంతరిక్షంలోకి వెళ్ళడానికి అర్హత సాధిస్తుంది. దేశం మొత్తం గర్వ పడేలా చేస్తుంది. అప్పుడు ఆ తల్లి బిడ్డలకు కలిగిన మర్యాద, గౌరవం, సంతోషం చూసి ఆడ పిల్ల వుంటే అష్టలక్ష్ములు వున్నట్లేగా అని తెలుసుకుని తను చేసిన తప్పుకు కుమిలిపోయి క్షమించమని వేడుకుంటాడు. క్షమాగుణం స్ర్తీ సహజమే కదా.

                         

                           ***

    


ఈ సంచికలో...                     

Sep 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు