కవితలు

(April,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సూరిగోడు చేదబావిలో

సూరిగోడు చేదబావిలో

 "పాతాళభేరి" వేశాడు

బిందెలు బొక్కెనలు 

చేంతాళ్ళు చానా వచ్చాయి

ఊరూరంతా వుండజేరి 

వారోరి సామాన్లు ఏరుకొని 

ఇండ్లకు పోయినారు 

పరంటన పొద్దుగుంకతావుంది

సూరిగోడి కాలికి 

నా కంచుబిందె తగిలి ఖంగ్మంది

చీకట్లు ముసరతావుండాయి 

యీదరగాలీస్తావుంది

నా పైట గాలికెగిపోయింది 

సూరిగాడు చూపులు 

యాడో చిక్కుకున్నాయి 

క్షణంలో నే పైట సర్దుకున్నా

నా కళ్ళు 

సిగ్గుతో వాలిపోయాయి

మా అమ్మ అరుపుతో

నా గుండె గుభేళ్లంది

కంచు బిందెను ఎత్తుకుంటుంటే

సూరిగోడి వూపిరి వెచ్చగా తగిలింది

వాడెప్పుడూ గొంతిప్పి చెప్పనూలేదు

నేనూ నా గుండెలోని 

మాటను వినిపించనూ లేదు

ఊరిడిచొచ్చి ఎన్నోయేళ్ళు గడిచినా

ఏ పాతాళభేరి వేసి లాగినా

నా గుండెపాతాళంలో 

దాగిన వాడి జ్ఞాపకం 

గుండెసడిని వీడి బయటికి రాదు !

 

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు