(April,2021)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)
32
సింగరేణి వ్యాపితంగా అన్ని డివిజన్లలో లారీలోడిండు కంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. కంట్రాక్టు పద్దతి ఎత్తేసి - సింగరేణి యాజమాన్యమే నేరుగా కంట్రాక్టర్ లోడింగు లేబర్‍ను బదిలీ పిల్లర్లుగా తీసుకొని లారీ లోడింగునేరుగా చేయించాలి. మధ్య దళారులు లేకుండా సింగరేణి యాజమాన్యమే కార్మికులకు చెల్లింపులు చేయాలి.
మొదట గోదావరిఖనిలో డిశంబర్ ఆఖరు వారంలో ఆరంభమైన సమ్మె మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, కొత్తగూడెంలో జనవరి మొదటి వారంలో కార్మికులు సమ్మెలోకి దిగారు. సమ్మెకు మద్దతుగా రాడికల్స్ పోస్టర్లు వేశారు. బొగ్గు యార్డులోనే శిబిరాలు వేశారు. శిబిరంలో రిలే నిరాహరదీక్షలు కొన సాగుతున్నాయి. సింగరేణి వ్యాపితంగా కంట్రాక్టులేబర్ యూనియన్లన్ని దాదాపుగా ఏఐటియుసియే నడుపుతున్నది. కనుక మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొనకతప్పలేదు. కంట్రాక్టర్లంతా దాదాపుగా దొరలు లేదా కాంగ్రెసు అనుబంద యూనియన్ నాయకుల ఆధీనంలో ఉన్నాయి. సింగరేణి వ్యాపితంగా బలంగా ఉన్న ఈ రెండు యూనియన్ల మధ్య ఈ సమ్మె యుద్ధవాతావరణాన్ని తెచ్చింది. దీని మూలకంగా కంట్రాక్టర్లు గుండాల ఆర్థిక మూలల మీద దెబ్బకొట్టి - అన్ని రంగాలల్లో విస్తరించి యున్న దొరల మీద దెబ్బతీసినట్లుగా రాడికల్స్ భావించారు.
అయితే రాడికల్స్ -కమ్యునిస్టు అనుబంద కార్మిక సంఘం లోనే పనిచేస్తున్నారు. వాళ్లెవరన్నది గుర్తుపట్టలేక - ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో - నిర్వీర్యమైన తమ యూనియనుకు తీవ్రత పెరిగి - బలం పుంజుకోగలదని - కమ్యూనిస్టుల అంచనా - ఏదిఏమైనా - సింగరేణిలో ఇది ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. యాజమాన్యం మొత్తం సింగరేణి కంపెనీ పాలసీకి సంబందించిన విషయం కనుక - హైదరాబాదులో రెండు దపాలుగా చర్చలు జరిపినా - రెండు యూనియన్ల లక్ష్యాలు పరస్పర విరుద్దమైనవి గనుక ఒక కొలిక్కి రాలేదు...
ఈ విషయం మీద కార్మికులకు మద్దతు కూడ గట్టడానికి గంగాధర్, షరీప్, శంకరయ్య, సత్యం, శంకర్ వారివారి రంగాలల్లో రోజు తిరుగుతున్నారు. అన్నిపిట్ కమిటీలు ప్రత్యేక సమావేశం చేసుకొని సమ్మెకు మద్దతు ప్రకటించాయి. చందాలు వేసుకొని సమ్మెలో ఉన్న కంట్రాక్టు కార్మికులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. విద్యార్థులు వీధుల్లో తిరిగి చందాలు వసూలు చేసి వచ్చిన మొత్తాన్ని కంట్రాక్టు కార్మికుల కిచ్చారు.
జనవరి అయిదవ తేది - సి.యస్.పిదగ్గరి శిబిరం దగ్గర దాదాపు వందమంది కంట్రాక్టు కార్మికులున్నారు. పదిమంది షామిషానలో రిలే నిరహార దీక్షలో కూర్చున్నారు. వాళ్లకు మద్దతుగా విద్యార్థులు, రెహనా, లక్ష్మి, సరిత వారితో పాటు కూడా కూర్చున్నారు...
సియస్‍పి దగ్గరి నుండి మేన్ రోడ్డు దాకా దాదాపు మూడు వందలకు పైన్నే లారీలు ఆగి ఉన్నాయి. లారీల డ్రైవర్లు, క్లీనర్లు లారీల దగ్గరే వంటలు చేసుకొని అశాంతిగా యార్డంతా తిరుగుతున్నారు. కోల్‍యార్డులో కోల్ గుట్టలు గుట్టలుగా పడున్నది. సేల్ పరీకార్మికులకు ఆ కుప్పల మధ్య పనిచేయడం కుదరడంలేదు. అందరు చుట్టూ ముగారు.
అలాంటి సమయంలో గంగాధర్ ముప్పయి మందితో శిబిరం దగ్గరికి వచ్చారు. చాలా వరకు ఆ డివిజన్ లోని ఫిట్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తరుపున తమ పూర్తి మద్దతు తెలుపుతామని - అవసరమైతే - స్కూల్లు బందు పెడుతామని విద్యార్థుల తరుపున శంకర్ మాట్లాడాడు...
శంకరయ్య వీరులారా మీకు వందనం పాట పాడిండు. కళాకారులు ప్రదర్శణ చేశారు. పెదనాన్న పోశెట్టి ఒళ్లో కూర్చున్న సంవత్సరం మూడు నెలల పిల్ల తపతప అడుగులేస్తూ శంకరయ్య బృందం దగ్గరకు చేరింది, కళాకారులు ఎత్తుకున్నారు ఫిట్ కమిటీల తరపున షరీప్ మాట్లాడిండు ‘‘మీరు సింగరేణి కోసం పని చేస్తున్న కార్మికులే - మునుపు ఎవరికి వారే కొట్లాడి దెబ్బలు తిన్నాం - సింగరేణి కార్మికులం మీవెంటే ఉన్నాం’’ భరోసా యిచ్చాడు.
ఎప్పుడు లేంది - రెహానా, లక్ష్మి, సరితతో పాటు మరో పదిమంది మహిళలు మీటింగులో కూర్చున్నారు. మహిళల తరపున రెహనా’’ గింత మందిల పస్టుసారి...గుండె కొట్టుకుంటంది... మా తిప్పలు మేం బడ్తన్నం. మీరు గోస పడ్తండ్లు. మీ కట్టం - సుఖం గిట్ల సూడటం - మీతో పాటు మీమందరం నిలబడ్తం. సలాం’’ కూర్చున్నది. లక్ష్మి షేక్‍హాండిచ్చింది.
లోడర్ల తరపున వెంకులు మాట్లాడిండు. అతనికి మాట్లాడటం ఇదే మొదటిసారి - ‘‘అన్నలారా! నాకాళ్లు గజగజ వనుకుతన్నయ్. లోపటినుంచి దు:ఖం ఎగదన్నుకత్తంది. ఒకప్పుడు అర్జన్న మాతో పని చేసిన అర్జన్న - నిలబడి సమ్మె జేసినం. అర్జన్నను సంపిరైలు పట్టాలకేడీసిండ్లు -ఆ కథంతా మేంజూసినం. ఇగో ఇక్కడ కూసున్న మొగిలన్నకు గ కథంతా ఎరుకే బతకవశం కావటం లేదు... బయమైతంది... మీకందరికి శనార్థి’’ కూర్చున్నాడు...
అయిదు గంటల దాకా మీటింగు కొనసాగింది....
ఆఖరున గంగాధర్ మాట్లాడిండు.
‘‘ఇప్పుడిది మన ఒక్క దగ్గరి సమస్యకాదు. మొత్తం సింగరేణంతా జరుగుతోంది. కామ్రేడ్స్ - మీ మీద ఒక్క దెబ్బపడ్డా ఇది సింగరేణి కార్మికులమీద అందరి మీద పడ్డదెబ్బే - అగ్గై మండుతది. ఇది సింగరేణిలో తరతరాలుగా చాప కింది నీళ్లలాగా చేరి - అధికార్లదాకా వ్యాపించిన దొరల ఆర్థిక మూలాల మీద దెబ్బ - అధికారులను, మార్కెటును తమ చేతుల్లో పెట్టుకోవడానికి - గుండాలను పోషించడానికి మీ నెత్తురు చెమట నుండి వేలాది రూపాయలు దోపిడి చేసి వాళ్లు ఒక శక్తిగా ఎదిగారు.ఈ దెబ్బతో మార్కెటు మీద దొరల ఆదిపత్యం పోతుంది. ప్రజలు మనుపటిలాగాలేరు. కార్మికులు సింగరేణిలో జరిగే ప్రతిచర్యను గమనిస్తున్నారు. అధ్యయనం చేస్తున్నారు. ఈ సమస్య ఆలశ్యం చేసేది కాదు. సుమారు ముప్పైవేల లారీలు అన్ని డివిజన్లలో ఆగిపోయాయి. చిన్న పరిశ్రమలు బొగ్గులేక ఆగిపోయే పరిస్థితి వచ్చింది... చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఏసి రూముల్లో - హైదరాబాదులో కాదు - సమ్మె శిబిరాల దగ్గరికివచ్చి కార్మికులతో చేయాలని మేం డిమాండు చేస్తున్నాం... వాళ్లు అట్లా చేయకపోతే ఈ సమ్మె సింగరేణి గనులకు వ్యాపిస్తుంది... కార్మికులందరు జనరల్ మేనేజరు ఆఫీసుల్లోకి రావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. వేలాది రూపాయల జీతాలు తీసుకొని - విలాసవంతమైన జీవితం గడిపే అధికారులారా! కార్మికుల చెమట, నెత్తురుతోనే మీరంతా బతుకుతున్నారు. సమస్యను పరిష్కరించండి. కార్మికులు మీ శత్రువులు కాదు. గులాములు కాదు. కార్మికులు బొగ్గులో ఉండే ఇంధన శక్తి...’’ గంగాధర్ ముగించాడు....
శంకరయ్య సైకిల్ తీసుకున్నాడు.లక్ష్మి కూతురు నెత్తుకొని వెనుక సీటు మీద కూర్చున్నది. రాత్రికి శిబిరం దగ్గర పడుకోవడానికి వస్తామని వెళ్లిపోయారు... అప్పుడు కమ్యూనిస్టు నాయకులు ఇబ్రహీం, కరీం, కొమురయ్యతో పాటు ముప్పై మంది వచ్చారు....పోశెట్టితో చేతులు కలిపారు. మీటింగు మళ్లీ మొదలయ్యింది.
అదే సమయంలోసినిమా టాకీసుగేట్లు మూసి దాదాపు యూభై మంది గుండాలతో కృష్ణారావు మీటింగు ఏర్పాటు చేశాడు. ఆ మీటింగులో లోడింగు మొఖద్దమ్‍లు, బ్రాండి, కల్లు, సారా దుకాండ్ల దగ్గర గుండాలు, కటికె దుకాణాలు నిర్వహించే గుండాలు, మేకల మండీలవాళ్లు, చిట్టీలు,వడ్డీలు వసూలు చేసేవాళ్లు, బ్రాండి, సారా గోడౌను దగ్గరి గుండాలు, సారాకాచే వాళ్లమీద దాడి చేసే గుండాలు, మార్కెట్ చూసే గుండాలు, ఫిట్ కమీటీలు, సేప్టీ కామిటీలు, ఆఫీసులదగ్గర పైరవి కార్మికులు, యూనియన్ ఆఫీసుబేరర్లుల నుండి ఎంపిక చేసుకున్న వారిని మాత్రమే పిలిశారు.
క్రిష్ణారావు ముఖమంతా నెత్తురు పేరుకపోయి కూర్చున్నాడు. రాఘవులు కృష్ణారావు కుర్చీపక్క దూరంగా నిలబడి - ‘‘గిప్పుడు మననేతలు కార్యకర్తలు - సారలి, శంకర్‍లకోసం రొండు నిమిషాలు మౌనం పాటించుదాం’’ అన్నాడు.
‘‘గలత్తకోరోల్ల కోసమా? ఎవడన్న ఇంటె ముడ్డితోటి నవ్వుతడు’’ మందిల నుంచి ఎవడో గుణిగిండు.
కృష్ణారావు ఒక సారి మందిలకు చూసి గీసోదేంది?’’ అన్నట్టు రాఘవులు ముఖం చూసిండు.
అందరు లేచి నిలబడి మౌనం పాటించారు. కీష్ణారావు లేవడం కూచోవడం ఇబ్బందయ్యింది.
‘‘సారలి’’
‘‘అమర్‍హై’’
‘‘శంకర్’’
‘‘అమర్‍హై’’
అందరు అరిచారు - ‘‘కొంపదీసి రాఘవులు గాడు డబుల్‍గేమ్ ఆడ్తలేడుగదా! కమ్యూనిస్టు తీర్తం పుచ్చుకొని’’ - కటికె వీరస్వామి చేపల మార్కెట్లు పెద్ద నర్సింగం చెవులూదిండు.
‘‘వింటెగీన్నే నీదవుడలు - నీదవుడలు సదురుతరు’’ నర్సింగం.
‘‘ఆత్మీయులారా! మన ప్రియమైన కార్యకర్తలు హత్యకు గురై సుమారు తొమ్మిదినెల్లు...’’
‘‘అప్పుడే దెబ్బకు దెబ్బతీస్తే గింతదాక వచ్చేదికాదు’’ నరేందర్ లేచి నిలబడి...
‘‘ఆలమ్డికొడుకు తాగిండా!’’ కృష్ణారావు.
‘‘నేను చెప్పేది వినుండ్లి - ఆ తరువాత మాటలు. ప్రతిదానికి రీతి రివాజుంటది. ప్లానుంటది. మనం చెప్పినట్టు ప్రపంచం నడిస్తే’’
కృష్నారావుకు కోపం పెరిగిపోయింది.
ఆయన లేచి నిలబడ్డడు.
‘‘రాఘవులు గాన్ని మాట్లాడనిస్తే - తెల్లారెదాక మాట్లాడ్తడు. గింత కాలం నాపేరు చెప్పుకొని, యూనియన్ పేరు చెప్పుకొని మీరంత తిన్నరు - తాగిండ్లు. తడి బట్టేసుకొని బేఫికర్‍గ పన్నరు...సారలి గాడు శంకర్ గాడు ప్రతిదానికి ముందటివడి కొట్లాడి ఏచిన్న సమస్యను కూడా మీదాక, మాదాక రానిచ్చేటోళ్లుగాదు...పైన కంపెనీ ఎట్ల ఎన్నిడిజన్లతో నడుత్తందో - మన వ్యాపారాలు గన్ని గిక్కడున్నయి - ఇంత కాలం కమినిస్టోడు తోకలేవట్టలే గిప్పుడు రాడికల్లోల ఎంటే సుకొని తోకలు మిడ కొడుతండ్లు గాళ్ల తోకలు మీరు కత్తిరింత్తరా? నేనే ఆపని చేసి మీతోకలు కత్తిరించి - కొత్తవాళ్లను బిజినెస్‍లకు తెమ్మంటరా? ఊకే బైసెందుకు?’’ మీరు బొత్తలు పెంచి ఆరాముగా సెటిలయ్యిండ్లు - గిప్పుడు గట్ల నడువది’’
‘‘అరెశ్రీనివాస్’’ పిలిచిండు.
సినిమాటాకీస్ మేనేజర్ శ్రీనివాసు ముందుకొచ్చి నిలుచున్నడు.
‘‘అన్ని ఇంతె జాములు చేసినవ్‍గద’’
‘‘చేసినదొర - రాఘవులును ఎంట తీసుక పోండ్లి - నేను పోలీసులకు చెప్పిపెట్టిన - మీ ఎంటిక పీకెటోడెవడులేడు’’ కృష్ణారావు దొర చరాచరా నడిచి అక్కడి నుండి వెళ్లిపోయాడు...
సినిమాటాకీసు ముందు కార్లో తమ్ముడు రాజేశ్వరరావు ఎదురుచూస్తున్నడు కారెక్కి ఇంటికి పోయిండు.
మరోపది నిమిషాలు తర్జన భర్జన - ఆరున్నరకే చలికాలం గన్క చీకటయ్యింది...ఒక ట్రక్కు వచ్చి సినిమా టాకీసు గేటులోపల సొచ్చింది - రాఘవులుతో సహా - కత్తులు ,గొడ్డండ్లు, కర్రలు పట్టుకొని ముప్పైమంది గుండాలు మేన్‍రోడ్డువెంట గాకుండా దొంగతొవ్వల మీదుగా బయలు దేరింది.
చీకటి దారలు గుండా లారీ శిబిరం కు ముందు బోయి చీకట్లో బొగ్గు కుప్పల మధ్య ఆగింది.
శిబిరం దగ్గర ఇబ్రహీం మాట్లాడుతున్నాడు’’ మనయూనియన్ అమరుడు కామ్రేడ్ శేషగిరిరావు దగ్గరినుండి - అమరుడు మక్దూం లాంటి వారి స్పూర్తితో కామ్రేడ్ భాస్కర్‍రావు గారి నాయకత్వంలో కొట్లాడుతోంది. ఏమైనా -దొరలు సంచులు పదురుకొని దుకాణం బందు చేయాల్సిందే. మరింక దొరల రాజ్జెం నడువదు... సింగరేణిలో అన్ని డివిజన్లలో మన నాయకత్వంలో సమ్మె జరుగుతోంది. మన కామ్రేడ్ భాస్కరరావు చర్చలకు హైదరాబాదు వెళ్లి వచ్చిండు. తప్పక మనమే విజయం సాధిస్తాం. రేపు ఉదయం కార్మికునికి ఒక్కంటికి పదిరూపాల చొప్పున సహాయం చేయడానికి మన యూనియన్ నిర్ణయించింది. ఎన్నినెలలైనా సమ్మెఅపేది లేదు. సింగరేణి యాజమాన్యం - ఐయన్‍టియుసి దొరల యూనియన్ కలిసి నాటకాలు ఆడుతున్నారు..’’
లైట్లు ఆరిపోయాయి. బొగ్గుకుప్పల సాటునుండి గుండాలుదాడి చేశారు. అందరు ఒక్కపెట్టున లేచారు. లొల్లి అరుపులు -పెడీల్ పెడేల్‍న దెబ్బలు - ‘‘సత్తిరో’’ మొత్తుకోళ్లు ఉరుకులు పరుగులు... అయిదు నిమిషాలు అల్లకల్లోలం శిభిరం కూలిపోయింది..షామియాన మీద నెగడు దగ్గరి నిప్పులు వేసిండొకడు. సామియాన కాలుతోంది. లారీల దగ్గరి డ్రైవర్లు టార్చిలైట్లు పట్టుకొని వందమంది దాకా ఉరికొచ్చారు వాళ్లు. ఎఐటియుసి వాళ్లనుకొని గుండాలు పరిగెత్తారు....
అంతా అయిదు నిమిషాలల్లో ముగిసింది. అక్కడ దెబ్బలు తాకి బొగ్గుకుప్పల్లో పడిపోయి పదిమందున్నారు. పోశెట్టి, కరీం, కొమురయ్యలతో పాటు మరో ఏడుగురికి రక్తం కారుతోంది. ఎవరూ చనిపోలేదు. డ్రైవర్లకు ఏంచేయాలో అర్థంకాలేదు. అందులో ఒక సర్దార్ ‘‘క్యారే క్యాదేఖ్‍తే - జాన్‍వర్‍జైసే లడే - ఆదిమీహైరే’’ అన్నాడు.
‘‘ఎటుబోయి ఎటస్తదో - అసలే అంత గందరగోళంగా ఉన్నది’’ ఇంకోడ్రైవర్...
‘‘అరెభయ్ రోడ్డు మీద ఆక్సిడెంటయితది - అందరు అట్లంటె మనపనేంగావాలె’’ అన్నడు ఇంకోడ్రైవర్..
నలుగురు డ్రైవర్లు పదిమంది క్లీనర్లు కలిసి గాయపడిన వాళ్లందరిని హాస్పిటల్‍కు లారీలో తీసుకొనిపోయారు... అప్పుడు రాత్రి ఎనిమిది గంటలౌతోంది...
33
శంకరయ్య, లక్ష్మి ఇల్లు చేరుకునేసరికి రాత్రి ఏడయ్యింది. చిన్న పిల్ల స్నేహలత ఏడుపుషురు చేసింది. శంకరయ్య పొయ్యి ముట్టించి ఉడుకు నీళ్లు పెట్టిండు. పిల్లకు నీళ్లు పోసిన తరువాత ఏడుపు తగ్గింది. లక్ష్మిపాలు వేడి చేసి తాగిచ్చింది.
‘‘మళ్ల విబిరం దగ్గరికి పోవాలె...రాత్రి ఆడనే పడుకోవాలె. జెప్పన వంట చేసుకుందాం’’ దడిపొంట పోయి సొరకాయ తెచ్చిండు. గీకితనే కూరవండిండు...
లక్ష్మిబియ్యం కడుగుతాంటె ‘‘ఎందుకైనా మంచిది ఎక్కువ పెట్టు, సత్యం, శంకర్ వస్తరేమొ?’’ శంకరయ్య...
‘‘గంగన్న మొఖం పీక్కపోయింది. ఏడ తింటండో - ఏడ పంటండో - మీకందరికి సంసారం - బాయిపని - ఇల్లు ఉన్నాయి.’’ లక్ష్మి...
అదేమనకు ఒక్కిల్లింటే అయినకు వందల ఇండ్లు. మన ఇండ్లన్ని ఆయనయే గంగన్న సదువుల పస్టు - ఇంజెనీరు సదివిండు. బంగారు బిళ్ల ఇచ్చిండ్లట - మద్రాసుల మంచి ఉద్యోగం చేసిండట...వాళ్ల తల్లికి మొక్కాలె - అచ్చం నీలోన్నాయే - లోపటేమనుకుంటదోగని - మనిషి సూస్తే పిరికెడు. గంగన్న - అయినె సెల్లె సరిత ఇండ్లనే తిరుగుతండ్లు - వాళ్ల నాయినకు కోపం’’ శంకరయ్య మొఖమంతా వెలిగిపోంగ చెప్పుకచ్చిండు.
లక్ష్మి భీరిపోయి నిల్చున్నది. స్నేహలత వచ్చి తండ్రి చేతుల్లో చేరిపోయింది. లక్ష్మి ముఖంలో భయం.
‘‘నీ సంగతి సూత్తె ఎప్పుడో సెంగోబిళ్ల అనేటట్టున్నవు. అయ్యా కామ్రేడ్! నేను దిక్కు మాలినదాన్ని - మునుపటితీర్గ - తాగుతిను. కోపమత్తే తన్ను గుద్దగని - నన్ను ఒదిలిపోకు లక్ష్మి కళ్లల్లోనీళ్లు - కంఠం రుద్దమై పోయింది...
‘‘కామ్రేడ్ లక్ష్మి మొదటి సారిగా శిబిరానికి వస్తివిగదా! ఏమనిపిచ్చింది ?’’ శంకరయ్య మాటమారుస్తూ...
‘‘నువ్వు కైతికాలోనివి. నువ్వు పదమెత్తుకుంటే - పదం నువ్వే అయితవు. నువ్వు పదాలేపాడు కామ్రేడ్!’’ లక్ష్మి...
శంకరయ్య పాటెత్తుకున్నాడు.
తెలంగాణ గట్టుమీద ‘‘సందమామయ్యో - ఓల సందమామయ్యో’’
తల్లి మల్లె చెట్టుకేమో ‘‘సందమామయ్యో - ఓల సందమామయ్యో’’
ఎర్రమల్లెలు పూసెనంట ‘‘సందమామయ్యో - ఓల సందమామయ్యో’’
శంకరయ్య తన్మయత్వంలో పాడుతూ అడుగులేస్తూన్నాడు. చిన్న పిల్ల స్నేహలత తండ్రిలాగా అడుగులేస్తున్నది...
పాటయిపోయింది. లక్ష్మి చప్పట్లు కొట్టింది. స్నేహ చప్పట్లు కొట్టి మల్లెపూవు పూసినట్టుగా నవ్వింది.
‘‘ఔనుగని శిబిరం కాడికి నువెట్లచ్చినవ్’’ శంకరయ్య...
‘‘రెహనా వదినె వచ్చి తీసుకచ్చింది - రాజేశ్వరికి చిన్నపిలగాడు కదా! రాలేదు. నీకోవిషయం తెలుసా! అక్కడికచ్చి చూసేదాకా మీరు గియ్యన్ని ఎందుకు మాట్లాడుతరో అర్థంగాలేదు’’
‘‘సామాజిక అనుభవంలోకి వచ్చిండ్లన్నమాట’’
‘‘దుడుత్త్ - గమాటలు మాట్లాడ్తె ఇంట్ల నుంచి ఎల్లగొడుత - అసలే నాది కోడిమెదడు - దాన్నిండా సవాలక్ష కిరికిరులు’’
‘‘ఏది ఒక్కటి చెప్పు?’’
‘‘నువ్వుఢాంమని అడ్డం పడుతవు’’
‘‘ఎహె చెప్పు’’
‘‘ఆడోళ్లె అత్త గారింటికి ఎందుకు పోవాలె? ఎంటిక లెందుకు పెంచుకోవాలె? సీరెలేందుకు కట్టుకోవాలె? బొత్త కనపడంగ రయికెలెందుకు ఏసుకోవాలె - పిల్లలెందుకుగనాలె? మొగోళ్లెందుకు పెంచరు... నగలు మొగోళ్లెందుకేసుకోరు’’లక్ష్మి.
‘‘ఓర్ని సానా దూరం పోయినవు. మీకు ఈ సమయంలో క్లాసులు వెడితే ఇయ్యన్ని చెప్పుతరు నాకు గంత తెలువది?’’
‘‘అంటేనేను నీ తీర్గ మాట్లాడుడు ఘరూసేస్తననా? అదిగాదు - రెహనా వదినె నన్నే మాట్లాడుమన్నది మీటింగుల’’
‘‘ఔనా! ఏమాట్లాడుదువు?’’
‘‘తెలువది - కాని తప్పక అడ్డం పడిపోదును. నువ్వెప్పుడు పదాలేపాడ్తవ్ - మాట్లాడవెందుకు?’’
‘‘మా మీటింగులల్ల పాటలుండయి. మాట్లాడుత. ఆడ గంగాధర్ మాట్లాడాలె గదా! నేను పాడినగదా!’’
‘‘అయినా ఒక సారి ఇది మీటింగనుకొని మాట్లాడు’’ శంకరయ్య స్నేహను ఒళ్లో బుద్దిగా కూర్చుండ బెట్టుకొని అడిగాడు.
‘‘అన్నలారా! మనమంతా ఒక్కటే - చేసినకాడ అడుగపోతె మరెక్కడ అడుగుతం? అడ్డమచ్చినోనిన దంచి కొడుదాం’’ లక్ష్యిలేచి నిలబడి. శంకరయ్య చప్పట్లు కొట్టాడు - స్నేహచప్పట్లుకొట్టింది.
‘‘పోరీ! మీనాయినకన్నా రెండాకులెక్కువే ఉన్నవ్’’
‘‘స్నేహ ఎవరనుకున్నవ్! కామ్రేడ్ రఘు బుద్దచ్చింది’’
‘‘ఎవరన్నా ఇంటే నవ్వుతరు?’’
‘‘ఎందుకు?’’
‘‘గన్ని చెప్పుతవు - బయటలోకం ఇంకా చీకట్లనే ఉన్నది’’
‘‘అర్థమయ్యిందా? మన యిష్టాయిష్టాలతో ఉండదు. దూపయితంది నీళ్లు గావాలె -వాగుల దిగినం - తడువకుండ దూపెట్ల తీర్తది లడాయి లదిగినంక ఎంత ఖెరత్‍గున్నా దెబ్బవడకుంట ఎట్లుంటది?’’
లక్ష్మి శంకరయ్య నోరు మూసింది. ‘‘వద్దు చెప్పకు, నాకు చెప్పరాదు. కని మంటకొడతాకుతంది.పిల్లా నాకెల్లి సూడకు - మీనాయిన నోరు మూసి ఒక ముద్దియ్యి’’
‘‘నేనేతీసుకుంట’’ లక్ష్మినుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు.
‘‘నువు మునుపు తిడితే - కొడితే నా బతుకు ఇంతేనని రాత్రంతా ఏడ్సేదాన్ని... కని నువ్విప్పుడు దగ్గెరికి దీసుకుంటే నువ్వు మాకే కాదు మా అందరికి దగ్గరికి కావాలె - పాటను ఒక్కరే ఉంచుకోవశమా? లక్ష్మి వెక్కి వెక్కి ఏడ్చింది.’’
ఈ మాటలకందనిదేదో వాళ్లిద్దరికి అర్థమయ్యింది. తాము నడిచేదారి అద్భుతమైందికాని - ప్రమాదకరమైంది.
‘‘కామ్రేడ్! మనకు ఇష్టమున్నా - లేకున్నా సమాజం ముందుకే నడుస్తుంది. మనం సింగరేణి అందులో ముందుకీ పోవాలె. ఎనుకకు పోలేము. పోరాదు. మనం కాలేరీలో పనిచేస్తున్న డెబ్బైవేల మంది కార్మికుల్లో ఒకలం. ఇంతకు ముందు కారణాలు తెలువది.ఇప్పుడు తెలుస్తన్నయ్... నీకుమతికున్నదా? ట్రక్కులోడింగులో మొగిలిపనిచేస్తున్నప్పుడు అర్జయ్య అనే కార్మికుడు మొదట సమ్ము చేద్దామన్నడు. అతన్ని చంపిరైలు పట్టాల మీదేసిండ్లు. అప్పుడు ఏమి చేయాల్నో కార్మికులకు తెలువదు. కార్మికులు అవమానాన్ని దు:ఖాన్ని గుండెల దాచుకున్నారు. గిప్పుడు గిన్నేండ్లు దోపిడి, పీడనతోటి నడిపించిన కృష్ణారావు ఎక్కడెక్కడ పాతుకపోయిండో? అవన్నీ తెలిసి పోయినయ్. తెలుసుడేకాదు. వాటిమీదదెబ్బగొట్టే రోజచ్చింది...’’ శంకరయ్య...
‘‘అబ్బో! నువ్వు మాట్లాడ్తె పిచ్చోల్లమై దేశాలుపట్టుకపోవాల్సిందే’’ లక్ష్మి...
‘‘నేను వారం దినాలు క్లాసులకు పోతాంటె - చిన్నపిల్ల తల్లివి ఏమన్నవు? కామ్రేడ్ మనం ఇద్దరం ఒకలకొలకలం బలం - మనిద్దరికి మన కామ్రేడ్స్బంలం - మనం వేలాది మందిమి’’ అంతలోనే సత్యం, శంకర• వచ్చిండ్లు.
‘‘తీరిపారి ముచ్చెట్లు బెడ్తండ్లు. మనం బయలుదేరాలి. అక్కా పొద్దటి నుంచి తినలేదు. గేరత్తంది. కడుపంత పిండుతంది. ఏదున్న పెట్టు - తినిపోతం’’ సత్యం...
‘‘మీరత్తరనే ఎక్కువ బియ్యం పెట్టిచ్చిండు బావయో బంగారయ్య’’ అందరికి పళ్లేలల్ల పెట్టిచ్చింది. ఉడుకుడుకుది ఊదుకుంట నిలబడే చేతులు కడుక్కొని తిన్నరు...
‘‘అక్కా నువ్వు కూడాతిను - నిన్ను శంకర్ హాస్పిటల్‍కు తీసుకపోతడు. స్నేహకు కుల్లా - షెట్టర్ వెయ్యి - బయట చలున్నది. ఒక శద్దర్ తీసుకపో’’
‘‘ఏమయ్యింది కామ్రేడ్’’ లక్ష్మి...
‘‘పోశెట్టి బావకు దెబ్బలు తాకినయ్, మేం ఇప్పుడే హాస్పిటల్‍నుంచి వస్తున్నం.... ప్రమాదమేమిలేదు. చంద్రకళ అక్కున్నది. రెహన అక్కున్నది. ఎనిమిది మందికి దెబ్బలు తాకినయ్.’’ చెప్పుకచ్చిండు.
‘‘ఏందీ ఎక్కడ - ఏమి అర్థంగావడంలేదు?’’ శంకరయ్య...
‘‘గావర - గావరల మర్చిపోయిన మనమచ్చినంక కృష్ణారావు గుండాలు శిబిరం మీద దాడి చేసిండ్లు - అక్కడ ఏఐటియుసివాళ్లున్నరు. లెక్క ప్రకారంగా మనం నైటుంటున్నంగదా!’’
‘‘అయ్యో! అనుకుంటనే ఉన్న’’ లక్ష్మి ఏడ్వసాగింది...
‘‘నయం లారీడ్రైవర్లు, క్లీనర్లు వందమందిచ్చిండ్లు - వాళ్లను కమ్యూనిస్టు యూనియనోల్లనుకొని దానితోని పారిపోయిండ్లు’’
‘‘ఎవరైనా?’’
‘‘నయం ఎవరు చనిపోలేదు’’
‘‘బయటంత గాయిగత్తర గున్నది...ఎవరికేం అర్థమైతలేదు’’ శంకర్.
‘‘మరి పోలీసులు రాలేదా?’’ లక్ష్మి...
‘‘ఏమయ్యిందో? వాళ్లయూనియన్ నాయకుడు భాస్కర్ రావు పోలీసు స్టేషన్‍కు పోయి దరకాస్తు ఇచ్చిండట... వాళ్లు హాస్పిటల్ దగ్గర కొచ్చిలోపటి కెవలను పోనిత్తలేరు. బందువులను, మహిళలను తప్ప’’
లక్ష్మి గబగబ తిన్నది - చిన్న సంచీ పట్టుకొని బయలు దేరింది. ఏదో మరిచిపోయిన దానిలాగా లోపలికి వచ్చి - సత్యంకు షేక్‍హాండిచ్చింది - శంకరయ్యకు షేక్ హాండిచ్చింది.
‘‘కామ్రేడ్స్ పదిలం. మీతోటిమేం’’ లక్ష్మి బయటకు పోయింది...
వాళ్లు దవాఖానాకు పోయేదాకా తనకు తెలిసిన విషయాలన్ని శంకర్ లక్ష్మికి చెప్పుతూనే ఉన్నాడు...
శంకరయ్య సత్యం షరీప్ ఇంటికి పోయేసరికి గంగాధర్ అక్కడే ఉన్నాడు... మరో అరగంటలో శంకర్ కూడా వచ్చిండు. అప్పటికి రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది.
‘‘కామ్రేడ్స్ సమయంలేదు. ఇది మనకు గట్టిదెబ్బ శిబిరం కాల్చేసిండంటే - తప్పకుండా ఇందులో మేనేజుమెంటు చెయ్యి ఉన్నది’’ షరీప్...
‘‘అదే ఆలోచిద్దాం... మనం నాయకత్వాన్ని కలిసే వీలులేదు. రేపు మల్ల శిబిరం నిలబెట్టకపోతే - కంట్రాక్టు కార్మికులు మనలగా నిలబడలేరు. ఏఐటియుసి మొదటి సారిగా వాళ్లు కార్యకర్తలు చావు తప్పి కన్నులొట్టబోయింది. ఉత్త పిరికోళ్లు - కర్రవిరుగకుండా పాము సావకుండాభాస్కర్ రావు రాజకీయాలు చేస్తడు. మోకావస్తే నిలబడరు’’ గంగాధర్...
‘‘అసలు వాళ్లు గొడువలంటేనే ఏర్కుంటరు’’ శంకరయ్య...
‘‘వాళ్లకు గట్టిదెబ్బే!’’ షరీప్.
‘‘అరెస్టులు ఏమైనా జరుగుతాయా?’’ శంకర్ అడిగిండు.
‘‘నాకు తెలిసి జరుగకపోవచ్చు. వాళ్ల దిపైచేయి అయ్యిందిగదా!’’ గంగాధర్...
‘‘మనం ఫిట్ కమిటీలను కలిసి సమ్మెకు పిలుపిస్తే’’ షరీప్.
‘‘పుండోకాడయితే మందో కాడకాదా? అయినా సమయంలేదు’’ గంగాధర్...
‘‘మరేం చేద్దాం?’’ శంకరయ్య..
‘‘అదే అభిప్రాయం చెప్పుండ్లి - అయిదుగురం ఉన్నాం -మెజారిటీ నిర్ణయం’’ గంగాధర్.
‘‘రేపేంజరుగుతుందో చూసి మళ్లీ సమావేశమై నిర్ణయిద్దామా?’’ శంకరయ్య...
మిగతావాళ్లు మాట్లాడలేదు.
‘‘మనం నిర్ణయించడం కాదు. మనంలోడింగు లేబర్ దగ్గరికి పోదాం - వాళ్లతోటి మాట్లాడినంక నిర్ణయం తీసుకుందాం’’ లోడింగు కార్మికులకోసం బయలుదేరబోతుండగా - వెంకులు మొగిలి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిండు... మొగిలి వెంకులు కలిసి దారిలోనే వారికి ఎదురయ్యిండ్లు - అందరు కలిసి యాపల కాడినుంచి పెద్దరోడ్డు దాటి - ఎడమ బాజున్న గుడిసెల్లో ఒక గుడిసెకు చేరుకున్నారు.
అక్కడ పదిమంది కార్మికులు చేరి వాదించుకుంటున్నారు. ‘‘అన్నలు మాకు పానం బడ్డది... గిసొంటిదేది లేకంట ముందుకు పోతమని అనుకుంటె ఆళ్లంత పిచ్చోలుండరు... మనం లారీకి గింత ఎక్కువియ్యండ్లని అడుగుతలేం - మొదటికి దెబ్బ వెట్టినం’’ యాకోబు...
‘‘పదయ్యింది - పొద్దుపోయింది - ఊకే కొలువా కుమ్మరియ్య తాతకు దగ్గులు నేర్పకు - అదంత వాళ్లకెరికే’’ మల్లయ్య...
‘‘అంతట జరుగుతంది - మనం టెంటు పీకేసిండ్లని ఇంట్ల కూసుంటె ఎనుకబడిపోమా?’’ కోటేశ్...
‘‘ఏమిలేదు. వాళ్లు మమ్ములందరిని సంపి బొగ్గుకుప్పల్ల కప్పనీయ్ - రేపు మల్లటెంటేసుడే - గిప్పుడు నేనే పడుత ఆమరణ నిరహారదీక్ష - అవ్వతోడు నేను ఏసయ్య సాక్షిగా చెప్పుతన్న’’ యాకోబు...
గంగాధర్ వాళ్లు బయటకొచ్చి మాట్లాడుకున్నారు.
‘‘చూద్దాం అదే మంచినిర్ణయం’’ అనుకున్నారు.
‘‘కామ్రేడ్స్ - మేముయువకులు విద్యార్థులతో పాటు వందమందిమి శిబిరం కాడ - మీతో పాటే ఉంటం’’ బయటకొచ్చే సరికి పదకొండయ్యింది...
ఆ రాత్రంతా అన్ని జాగాలల్లో వాల్‍పోస్టర్లు విద్యార్థులువేస్తూనే ఉన్నారు.
( తరువాయి భాగం వచ్చే సంచికలో )
May 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు