నవలలు

(May,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సైరన్ నవల  రెండవ పార్ట్ –  పదవ  భాగం

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)                                                           

                                                                           34

            టెంటు సామాన్లు తీసుకెళ్లి - షామియానాతాళ్లు బిగించేసరికి తెల్లారే సమయం మూడయ్యింది. గంగాధర్‍, షరీప్‍, శంకరయ్య, సత్యం టెంటులోనే నిద్రపోయారు.

            ఏడుగంటల వరకే లోడింగు కార్మికులంతా టెంటుకు చేరుకున్నారు. ఎప్పటిలాగే షామియానా నిలబడి ఉన్నది. కార్మికులు, విస్తుపోయారు.

            మొగిలి, వెంకులు వాళ్లనలుగురిని యాపలకాడికి తీసుకపోయి - టిపిన్‍, చేయించారు. అందరు టెంటు చేరే సరికి ఉదయం ఎనిమిదియ్యింది.

            నిన్న అక్కడేమి జరుగనట్లు - లోడింగు కార్మికుల నిరవధిక సమ్మె అందులోని భాగంగా ఎప్పటిలాగే కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.... వాల్‍పోస్టర్లు చూసి దాదాపు రెండు వందల మంది ఏఐటియుసి కార్యకర్తలు టెంటు దగ్గరికి చేరుకున్నారు.

            తొమ్మిది గంటలకు భాస్కర్‍రావు కారుమీద వచ్చికారు కొంచెం దూరంలో పెట్టి నలుగురు ఆపక్క ఈ పక్క నడువగా శిబిరం చేరుకున్నాడు.

            ‘‘కాలి కూలి కాముని పెంటయినంక దొరచ్చిండురా!’’ నారాయణ...

            ‘‘చెవులు గోసిన కుక్కలోలె ఏందిర్ర? ఒకల మాట ఒకలకు కలువది... బండ కింద సేతులు వెట్టి బండ మీద ఎక్కి కూసున్నట్టున్నది ఏనివరుస’’ దుర్గయ్య...

            ఎందుకైనా మంచిదని గంగాధర్‍, షరీప్‍, సత్యం, శంకరయ్య శంకర్‍ - వెంకులుతో సహా వేపలకాడికి పోయిండ్లు.

            భాస్కర్‍రావు ముఖంలో కోపం... దుమదుమలాడుతూ - కాసేపు నిలబడ్డాడు... ఎవరో బెంచీ తెచ్చివేశారు. పదినిమిషాలు కూర్చుండి - కోపం తగ్గించుకున్నాడు...డెలిగేట్సుతో పాటు చుట్టు పక్కల యాభైగజాలు తిరిగి చూశాడు. తెగిపోయిన చెప్పులు, నెత్తురంటిన బొగ్గుపెళ్లలు - చిరిగిపోయిన బట్టలు - కర్రలు,రాడ్లు - దొరికాయి. అన్ని తీయించి శిబిరం కాడ పెట్టించాడు.

            ‘‘అయ్యా కామ్రేడ్‍! నిన్నలారీడ్రైవర్లు రాకపోతే మమ్ములందరిని సంపి - బొగ్గుకుప్పలకు పెట్రోలు పోసి మమ్ముల కాలవెట్టేటోల్లు. ఇరువై ఏండ్ల సంది గీ బొగ్గుల బొగ్గైనం దొరా!’’ కాటం చెంద్రయ్య నడిమందిలోనిలబడి భాస్కర్‍రావు’’ కామ్రేడ్స్! మీ పోరాట స్పూర్తికి లాల్‍సలాం - వాళ్లు పిచ్చికుక్కల తీర్గున్నరు. వాళ్లు భూస్వాముల గుండాలు - వాళ్లకు కారణకారక సంబంధాలు, కార్మికులు, యాజమాన్యం చట్టాలు ఏమి తెలియదు.’’

            ‘‘అయ్యా మా పెయ్యంత అగ్గి తార్గ మండుతంది. గంగరాయి లొట్టపీసు గవ్వన్ని చెప్పకుండ్లి - వాళ్లు మనలను కొడితే మన యూనియన్‍ఏం చేసింది?’’ పోచం...

            ‘‘నిన్నంతా పోలీసు స్టేషన్ల చుట్టుతిరిగిన - మనప్రతి నిధులు ము్యమంత్రి దగ్గరికి పోయిండ్లు... గాయపడిన వాళ్లకు మన కామ్రేడ్స్ దగ్గరుండి ట్రీటుమెంటు చేయిస్తున్నారు. హైదరాబాదు నుండి డాక్టర్లను పిలిచాం’’

            ‘‘వాళ్లు సావగొట్టి సెవులు మూసినంక - మీరు కట్లు కడుతండ్లు - గంతేనా?’’ చంద్రయ్య...

            ‘‘ఆకలి దొర! మమ్ములాదుకునేటోడు లేడు. గ రాడికలోల్లు ఇంటికిన్ని బియ్యం పంచిండ్లు’’

            ‘‘మన కార్యకర్తలు మనిషి కోపది రూపాయులు ఇస్తారు’’

            ‘‘బస్‍ గది సంగతి - మరి మేనేజుమెంటు జంగవిల్లి తీర్గ నాసుబెట్టి కూసున్నది - మరి అడుగలేదా?’’

            ‘‘చర్చలు నడుస్తున్నయి, మీరు మీరు చూసుకొండ్లి యూనియన్ల కొట్లాటలకు మమ్ముల లాగకండి అన్నది మేనేజుమెంటు’’

            ‘‘ఇన్నారుల్లా మన పెద్దయ్య ముచ్చెట్లు - ఎవలేం చెయ్యరు? మనం పోరాటం చేయాలి’’

            ‘‘కామ్రేడ్స్ ఆవేశ పడకండి - వాళ్లు రెచ్చిపోయినప్పుడు మనం రెచ్చిపోతే - ఇదేసందని - యాజమాన్యం ప్రభుత్వం మనలందరిని మూసేత్తది.. ఈసమస్య కొలిక్కి వచ్చింది తీర నియ్యండి - మనం సింగరేణి అంతటా నిరవధిక సమ్మెకు పూనుకుందాం. శాంతించండి తప్పక విజయం సాధిస్తాం’’

            ‘‘మనం సచ్చినంక దినవారాలు సేత్తడట’’ తలో మాట - గోలగోలగా ఉంది. పదిగంటలయ్యిది. జనవరి మాఘీఎండలో కార్మికులు - ఆ బొగ్గుకుప్పలమధ్య శిబిరం దగ్గర ఏం చేయాలో తోచక - రాత్రి వాళ్లమీద జరిగిన దాడికి మండిపోతున్నారు.

            భాస్కర్‍ రావు అర్థాంతరంగా వెళ్లి పోయాడు... మరో పది నిమిషాలకు తలకు కట్టుకట్టుకొని ఇబ్రహీం చెయ్యికి పట్టేసుకొని - కొమురయ్య శిబిరం దగ్గరికి వచ్చారు. కార్మికులు వాళ్లను తడిమి తడిమి చూశారు. ఇంతలోనే గంగాధర్‍, శంకరయ్య, షరీప్‍, సత్యం, శంకర్‍, వెంకులు శిబిరం దగ్గరికి వచ్చారు. అక్కడున్న యూనియన్‍ వాళ్లంతా చుట్టు మూగారు.

            ‘‘ఊకే సిల్లర మాటలు, ఏతుల మాటలద్దు - మాశరీరం మండుతంది - ఊరేగింపు తీద్దాం - మేం ఇంక మీ గుండాతనం భరించమని చెప్పుదాం’’ నారాయణ ముందుకు నడిచిండు. డెలిగెట్లంత అరిచిండ్లు- గుండాగిరి నశించాలె’’ గూండాలు డౌన్‍డౌన్‍’’ ఇబ్రహీం ఏదో మాట్లాడుదామను కున్నాడు. ఇబ్రహీంను, కొమురయ్యను సైకిల్లమీద ఎక్కించుకున్నారు. కార్మికులు పదిగంటలకు ఊరేగింపు శిబిరం దగ్గరి నుండి బయలుదేరింది. శిబిరం దగ్గర పదిమంది కార్మికులు ఉండిపోయారు. ఊరేగింపు శిబిరం దగ్గరి నుండి మేన్‍రోడ్డెక్కే సరికి పదిన్నర అయ్యింది. ఎవరికి వారే అరుస్తున్నారు...ఎగురుతున్నారు. గంగాధర్‍, షరీప్‍, శంకరయ్య వాళ్ల ముందు నడుస్తున్నారు. ఊరేగింపును ఒక పద్దతిలో నడిపించడానికి సత్యం, శంకర్‍ ఎక్కడినుండో కంకకర్రలు తెచ్చారు... ఊరేగింపు నాపి ముగ్గురు ముగ్గురి చొప్పున సర్ది ఊరేగింపును సర్దేసరికి ఉదయం పదకొండు అయ్యింది. ఊరేగింపు దుమ్ము పొగలాగా ఆకాశంలోకి లేస్తున్నది. ఊరేగింపు పెద్ద మోరిమీదికచ్చింది. షరీప్‍ మోరీ మీదికెక్కి...

            ‘‘కార్మికులారా! నేను నినాదాలు చెప్పుతాను మీరు మళ్ల చెప్పండ్లి’’

            ‘‘పోరాడుతాం -పోరాడుతాం’’

            ‘‘ఆఖరుదాకా పోరాడుతాం’’

            ‘‘నిన్న జరిగిన దాడి మీద’’

            ‘‘విచారణ జరిపించాలి’’

            ‘‘ఐయన్‍టుయైసి గుండాలను’’

            ‘‘అరెస్టు చేయాలి’’

            ‘‘గుండాల నాయకుడు కృష్నారావును’’

            ‘‘అరెస్టు చేయాలి’’

            ‘‘యాజమాన్యం మొండి వైఖరి’’

            ‘‘విడనాడాలి’’

            ‘‘కంట్రాక్టర్‍ లేబర్‍ను’’

            ‘‘బదిలీ ఫిల్లర్లు చేయాలి’’

            ‘‘లారీ లోడింగు  కంట్రాక్టు పద్దతి’’

            ‘‘ఎత్తివేయాలి’’

            శంకర్‍ ఒక్కొక్క నినాదాన్ని కార్మికులతో మరోమారు అన్పించాడు.

            ‘‘దొరల జులుం’’

            ‘‘నశించాలి’’ కొత్త నినాదాలు పుట్టుకొచ్చాయి.

            ‘‘ఏఐటియుసి’’

            ‘‘జిందాబాద్‍’’

            ‘‘రాడికల్స్’’

            ‘‘జిందాబాద్‍’’

            మార్గమధ్యలో చేరేవాళ్లు వచ్చి చేరుతున్నారు... వీధులల్లో నడుస్తున్నప్పుడు అప్పటి కప్పుడు...

            ‘‘దుకాండ్లన్ని మూసేయాలి’’

            బందు బందు - అని కార్మికులు దుకాణాలను కొన్ని మూయించారు. క్వార్టర్లలో నుండి - గుడిసెలనుండి ఆడవాళ్లు వీధుల్లోకి వచ్చి చూస్తున్నారు. కొంత మంది అరిచే వాళ్లకు మంచి నీళ్లు తెచ్చిస్తున్నారు. ఊరేగింపుతో పాటు సోడా బండ్లు వీధుల్లో పెట్టుకున్నరు.  కార్మికులు నినాదాలిచ్చే వాళ్లు  తాగుతున్నారు. తుపాకులు పేలినట్టు సోడాలచప్పుడు ఊరేగింపు మార్కెటుకు చేరుకునే సరికి పదకొండున్నర అయ్యింది - భయస్తులైన కొందరు షట్టర్లు మూసి ముందునిలబడ్డారు. చాలా వరకు దుకాండ్లు బందయినాయి...

            అక్కడే మీటింగు పెడుదామని గంగాధర్‍ ప్రయత్నం చేశాడు. అక్కడ నుండి మళ్లీ కార్మికులను శిభిరం దగ్గరికి తీసుకపోవాలనుకున్నారు. యూనియన్‍ డెలిగేట్లు ఏఐటియుసి ఆఫీసు చెట్లకింద కాసేపు కూర్చున్నారు...ఇబ్రహీం కొమురయ్య, వాళ్ల మధ్యలో నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. ఆతరువాత మెల్లెగా ఆఫీసు చెట్లకింది నుండి డెలిగేట్స్ కొంత మంది మార్కెట్‍ సెంటర్‍లో నిలబడి బిగ్గరగా నినాదాలవ్వడం షురు చేసిండ్లు...

            ‘‘గూండాల దౌర్జన్యం’’

            ‘‘నశించాలి - నశించాలి’’

            ‘‘పని పడుదాం -పనిపడుదాం’’

            ‘‘గుండాల పని పడుదాం’’

            చెట్లకింద మిగతా వాళ్లు అక్కడికి చేరుకున్నారు. మందిలో జోష్‍ పెరిగింది. మార్కెటంతా గజగజలాడేటట్లు నినాదాలు చేశారు...

            ‘‘గుండాలు సినిమాటాకీసులో ఉన్నరంట’’ మందిలో నుండి ఎవరో అరిచారు.

            గుంపు కదిలింది - సినిమా టాకీస్‍ కేసి నడిచింది. గుంపు ముందు ఇబ్రహీం, కొమురయ్యలను సైకిల్ల మీద తీసుకపోతున్నారు. సినిమా హాలు గేటు మూసిఉంది. కొంత మంది యువకులు గేటు ఎక్కివెనకకు దిగితాళ్లు విరగొట్టిండ్లు గేటును కార్మికులు తన్నిండ్లు. ఎన్నేండ్ల దు:ఖంమో, అవమానమే - కోపమో - సినిమా టాకీసే అడ్డాగా దొరలు, వారి గుండాలు ఎంతో మందిని చూస్తుండగా మీద పడికొట్టారు. సినిమాకు వచ్చిన ఆడవాళ్లను ఎత్తుక పోయి చెరిచారు. మంది కోపంబద్దలయ్యింది. అయిదు వందల మంది సినిమాటాకీసు లోపల చొచ్చారు. కుర్చీలు విరగ్గొట్టారు. పరదా చింపేశారు. ఏది దొరికితే అది - గోడలను తన్నారు గుద్దారు. కాండ్రకిచ్చి ఊంచారు. ఉచ్చలు పోశారు. రాళ్లు విసిరారు.  సినిమా టాకీస్‍ మేనేజర్‍ శ్రీనివాస్‍ అంతకు ముందే పరారై కృష్ణారావుకు పోన్‍ చేశాడు. కృష్ణారావు పోలీసులకు ఫోను చేసాడు.

            గుంపు అదుపు తప్పింది...

            గంగాధర్‍, షరీప్‍, ఇబ్రహీం అరుస్తూనే ఉన్నారు. గుంపులో ఎవరు ఎవరిమాటలు వినడంలేదు - కోపంతో యువకులు అడ్డదారుల గుండా - పాలవాగు దిక్కుసాగింది - పాలవాగు వాగొడ్డుకు నరేందర్‍, లాంటి గుండాల ఇండ్లుంటాయి. వందమంది యువకుల గుంపు ముందుపోయింది. నర్సింగం ఇండ్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఇంట్లో వాళ్లు మొత్తుకుంటున్నారు. వాళ్లను బయటకు తీసుకొచ్చి కొంతమంది పట్టుకున్నారు. ఆరెండు ఇండ్లకు అగ్గి పెట్టారు. రెండు ఇండ్లు కాలుతున్నాయి. మంటలు ఆకాశంలోకి లేచాయి. నల్లటిపొగ వ్యాపించింది. రొద, ఏడుపులు - నినాదాలు - అంతా గదరగోళంగా ఉంది. వెనుక గంగాధర్‍ గుంపువచ్చింది. అయిదువందల మంది మూడు వందల మందే అయ్యిండ్లు. ఎవరు ఎటు ఉరుకుతున్నారో తెలియని పరిస్థితి.

            మూడు వందల మంది మేన్‍రోడ్డెక్కారు.

            ‘‘ఇక చాలు కామ్రేడ్స్’’ గంగాధర్‍ అరుస్తూనే ఉన్నాడు. షరీప్‍, శంకరయ్య, శంకర్‍, మొగిలి, సత్యం చెదిరిపోయిన వాళ్లందరిని ఏకం చేయడానికి అరుస్తున్నారు... చెతులెత్తి ఏవో మాటలు బిగ్గరగా అరుస్తున్నారు. యువకుల గుంపు మేన్‍రోడ్డుమీదుగా యాపలకాడికి చేరింది... అక్కడ మేన్‍రోడ్డుమీది కృష్ణారావు బ్రాండి షాపు కన్పించింది... కౌంటర్‍ మీద కూర్చున్నతన్ని బయటికిగ్గిండ్లు వందల సీసాలు పగులుతున్నాయి. కొందరు సీసాలెత్తి గటగట బ్రాండి, విస్కీ, బీరు తాగుతున్నారు...గుంపుకు మత్తెక్కింది.

            గూండాలకు వంతు సీసాయిచ్చిన సంగతి ఎవడో పెద్దగా లొడలొడగా చెప్పుతున్నాడు. నక్క పోశాలు కండ్లు పెద్దవి చేసి తనను గూండాలు కొట్టిన సంగతి చెప్పాడు. పది నిమిషాలల్లో బ్రాండి షాపు ఖాళీ అయ్యింది. చాలా మంది ఊగుతున్నారు. అరుస్తున్నారు. ఊరుపేరు లేకుండా తిడుతున్నారు. గుంపు ఇంకా ముందుకు ఉరికింది - అక్కడ బ్రాండి, కల్లు, సారా, పెద్దడిపో - డిపోమేనేజర్‍ సత్యనారాయణను పిడిగ్గుద్దులు గుద్దారు. అది దాదాపు ఎకరం జాగాలో విశాలంగా ఉన్నది. అక్కడ కర్రడమ్ములలో సారా వందలాది లీటర్లున్నది. వాటిని పగులుగొట్టారు. సారా వాసన నిండిపోయింది. కార్టున్లకు కార్టూన్లకు బయట ఎత్తేసి పగుల గొడుతున్నారు. తాగుతున్నారు. సీసాలు పళ్ల, పళ్ల పగులుతున్నాయి. ఇంతలోనే డియపిరెడ్డి నాయకత్వంలో పోలీసులు యాబై మంది దాకా వచ్చారు...

            లాఠీ చార్జి మొదలయ్యింది. గుంపురెచ్చి పోయింది...

            ‘‘రెడ్డి’’ పైర్‍...పైర్‍’’ అరిచాడు.

            తుపాకులు మొరిగినయ్‍ తుపాకి గుండ్లు తాకి కొంత మంది మొత్తుకుంటూనే నేలమీద పడిపోయారు. అరుపులు - యువకులు కొందరు చెట్ల మీదికెక్కారు - మరికొందరు సందుల గుండా పరుగెత్తారు. పది నిమిషాలల్లో కాల్పులు ఆగిపోయాయి... ఆ ఏరియా అంత రక్తాలతో ఆర్తనాదాలతో - గబ్బువాసనతో, గందకం వాసనాతో నిండిపోయింది. గంగాధర్‍ కౌంటర్‍ వెనుకాల నిలబడి ఇంకా అరుస్తున్నాడు.. ‘‘నేలమీద పడుకోండ్లి కామ్రేడ్స్’’ ఎవరి పరిస్థితి ఏమిటో ఎవరికి అర్థంకాని అయోమయ పరిస్థితి - గంగాధర్‍ చుట్టు కొందరు చేరుతున్నారు. దొరికిన వారిని దాదాపు పదిహేను మందిని జీబుల్లో ఎక్కించుకున్నారు. గంగాధర్‍, షరీప్‍, శంకరయ్య వాళ్లలో ఉన్నారు...

            మరో అరగంటలో సింగరేణి అంబులెన్సులొచ్చాయి. చనిపోయిన వారిని, గాయపడ్డవారిని హాస్పిటల్‍కు తరళించారు.

            మధ్యాహ్నం రెండు గంటలవరకు నెత్తురు మరకలతో ఆ ప్రాంతం మూగవోయింది. మొగిలి వేపచెట్టెక్కి  ఈ తంతగమంతా కండ్లాతోని చూసిండు. అతనికి ఏమయ్యిందో తెలియలేదు.కాల్పుల దిగ్భభ్రమ నుండి తేరుకొని మొగిలి వేపచెట్టు మీది నుండి కిందికి దిగాడు. అది కలోనిజమో - అతనికి అర్థంకాలేదు. ఆ ప్రాంతంలో నిలబడ్డాడు. పెద్ద పెట్టున ఒర్లిండు ఏడ్చిండు. పిచ్చివాని లాగా అంతటా వెతికిండు... సారాడ్రమ్ముల మధ్య భయంతో డిపోమేనేజర్‍ సత్యనారాయణ మొగిలి వెనకకు చూడకుండా ఎవరో తరుముతున్నట్టుగా - తన వెంట పోలీసులు పడుతున్నట్టుగా మురికి తుమ్మ చెట్ల కింది నుండి ‘‘మొగిలీ’’పిలుపు... సత్యం...మొగిలి సత్యంను బిగ్గరగా అలుముకున్నాడు.

            ‘‘మనోళ్ల సంగతేంది? కామ్రేడ్‍ చానా మందిని చంపిండ్లు... మొగిలి వనుకుతూ...

            ‘‘తెలువదు...హోష్‍కురా...తెలుసుకుందాం... కాల్పులు షురూ కాంగనే నేను చాలా మంది పడిపోయిన తరువాత ఇటు ఉరికచ్చిన’’ సత్యం... ఇద్దరు మురికి తుమ్మ చెట్ల కాలిబాటల నుండి నడుస్తున్నారు.

            ‘‘ఎటుపోదాం కామ్రేడ్‍’’ మొగిలి...

            పదినిమిషాలు విప్పచెట్టుకింద కూర్చున్నారు. సత్యం చెల్లాచెదరైన తన స్థితిని - కూడ దీసుకున్నాడు... అంతకలలో జరిగినట్లుగా ఉంది - మొదట్లో తుపాకి కాల్పుల మోతలు, తుపాకి గుండ్లు తాకి ఒర్రుతున్న కార్మికులు - చెట్ల మీదికి, చెల్లా చెదురుగా ఉరికిన మనుషులు - బ్రాండి, విస్కీ ఘాటువాసన - సార కర్రమొద్దులు పగిలి పారిన సారా నీచు వాసన...‘‘కామ్రేడ్స్ నేలమీద పండుకోండి’’ గంగాధర్‍ అరుస్తున్నాడు. కామ్రేడ్సంతా ఒక దగ్గరికి వచ్చి షట్టర్‍ లోని కౌంటర్‍లో రక్షణ తీసుకున్నారు... తను అక్కడికి వెళ్లాలనుకున్నాడు. తుపాకులు గురిపెట్టి పోలీసులు వాళ్లను కొట్టుకుంటూ జీబుల దగ్గరికి తీసుకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తారా? తను కూడా పరుగెత్తాలా? జీబులో ఎక్కించారు. కాల్పులాగి పోయినయ్‍ - తనుడిపో గోడ దూకిండు - తన వెంట పోలీసులు పడ్డారు. మురికి తుమ్మ చెట్ల మధ్య నుండి పరుగు. పోలీసులు తనవెంట రాలేదు.

            ‘‘కామ్రేడ్‍ మొగిలీ మనవాళ్లను జీబులెక్కించిండ్లు. ఎంత మంది చనిపోయిండ్లో తెలువది...’’ సత్యం.

            ‘‘ఆడేంలేదు. అంతఖాళీ’’

            ‘‘పోలీసులు ఇంకా ఆ ఏరియాను తమాధీనంలోనే ఉంచుకున్నారేమో?’’ సత్యం.

            ‘‘లేదు అయ్యో చనిపోయినోళ్లను, గాయపడ్లోళ్లను అంబులెన్సులచ్చి తీసుకుపోయిండ్లు. అందరు పోయినంకనే సుట్టుదిగి వచ్చిన అక్కడ గజగజ వనుక్కుంట డిపో మేనేజరున్నడు’’

            ‘‘వాళ్లే చంపిండ్లు గనుక - వాళ్లు పోస్టుమార్టం చేయిస్తరు’’

            రాజేశ్వరిని మేనేజరు కొడుకు హత్య చేసి ఉరిబెట్టినప్పుడు గిట్లనే కాల్పులు జరిగినయ్‍...ఆ సమయంలో బెల్లంపల్లిల నలుగురు చనిపోయిండ్లు. అదేపని చేసిండ్లు’’ సత్యం.

            ‘‘మనం దవాఖానకు పోదామా?’’

            ‘‘అదే మంచిది - ఉన్నొక్క ఆధారం గదే’’ సత్యం...

            ‘‘మొదలు మనం కొద్దిగా తేరుకోవాలి.  జరిగింది - నా అనుమానం - భాస్కర్‍రావు వాళ్లు’’ సత్యం...

            ‘‘ఔ! కామ్రేడ్‍ -మార్కెట్‍ కాడ, మనం మళ్లా వెనక్కు వద్దామంటే - వాళ్ల డెలిగేట్సు - వాళ్ల ఆఫీసుకాడికి పోయి చెట్లకింద కూసున్నారు. వాళ్ల ఆఫీసుకాడ’’ మొగిలీ...

            ‘‘అసలు సినిమాటాకీసులో దొర గుండాలున్న సంగతి ఎవరు తెచ్చిండ్లు?’’

            ‘‘మందిల తెలువలే’’

            ‘‘నిన్న దెబ్బలు తిన్న ఇబ్రహీం - మళ్ల ఊరేగింపుకెందుకచ్చిండు. ఎన్నడు రాందీ శిబిరం కాడికి భాస్కర్‍రావు ఎందుకచ్చిండు. ఆ దినం రెండు వందల మందిదాకా వాళ్ల డెలిగేట్సు శిబిరం కాడికి వచ్చిండ్లు - రాత్రి మనం టెంటుకడుతుంటే  తొంగిన్నా చూడలే’’

            ‘‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు - మనలనువాడుకొని యూనియన్‍ కృష్ణారావును దెబ్బకొట్టిండ్లన్న’’ మొగిలి.

            ‘‘గంత మందిలో పోలీసోల్లకు మనోళ్లే ఎట్ల తెలిసిండ్లు?’’

            ‘‘కామ్రేడ్‍ మనకు పిచ్చిలేత్తది. ఇంకా తుపాకి మోత, మెరుపులు మెదట్ల సత్యం. ఇక్కడికి మాయిల్లు దగ్గరే ఆడికి పోయినంక మాట’’ మొగిలి దారితీసిండు.

            దారిపొడుగుతా కట్టతెగిన ప్రవాహంలా సత్యంమాట్లాడుతూనే ఉన్నాడు. సాయంకాలం మూడయ్యింది. మొగిలి గుడిసె చేరుకున్నరు. గుడిసెకుతాళమేసున్నది. మొగిలి ఇంటి వెనకకు వెళ్లి తాళం చెయ్యి పెట్టే చోటవెతికిండు తాళం చెయ్యికింద చిన్న చిట్టీ పెట్టిఉన్నది. తాళం తీసి మంచం వాల్సి దాని మీద కూర్చున్నారు. మొగిలి ఇంటి వెనుకకు వెళ్లి    నీళ్లు మీద గుమ్మరిచ్చుకున్నాడు. కొంత రొద తగ్గింది. సత్యం ఇంటి వెనుకకు వెళ్లి వాంతి చేసుకున్నాడు. బట్టల మీద చిల్లింది. నాలుగు చెండుల నీళ్లు కుమ్మరించుకొని - వచ్చిండు. మొగిలి ఇచ్చిన లుంగీ కట్టుకున్నడు. బట్టలు ఉతికి ఎండపొడకు ఆరేసుకున్నడు. మొగిలి చాయ్‍పెట్టుకచ్చిండు.

            ‘‘శంకర్‍ వచ్చిండట - శంకర్‍ రెహనక్కను, రాయేశ్వరిని -ఈ వాడకట్టు నలుగురైదుగురిని దవాఖానకు తీసుకపోయిండట - అన్న్ని సంగతులు శంకర్‍ చెప్పిండు - మీరేమిగాభరా పడద్దు - దవాఖానకు రండి లోపట మంచం షెద్దరు కింద నాగయ్య బావ ఉత్తరమున్నది - మనూరి ఏల్పుల సమ్మయ్యతోని పంపిండు’’

            ఇద్దరు చాయ్‍తాగిండ్లు.

            ‘‘ఇప్పుడు నిమ్మలంగా ఉన్నది. మెదడు పని చేస్తంది’’

            ‘‘నిమ్మరసం చాయ్‍ బాగున్నది’’ సత్యం...

            ‘‘గంగాన్న వాళ్లింటికాన్నుంచి నాలుగేండ్ల జామసెట్టు, నిమ్మసెట్టు తెచ్చి పెట్టిండు - కాయలు గాత్తన్నయి’’ మొగిలి.

            ‘‘చెలోపోదాందావాఖానకాడికి’’ సత్యం...

            మొగిలి గిన్నెలు వెతికాడు. ఒక్కరికి సరిపోయే అన్నం కూర ఉన్నది... సత్యం, కూర  అన్నం గంజు ల్నేవేసికలిపి - మొగిలికి సగం పెట్టిండు. తను సగం తిన్నడు.

            ‘‘మా నాగన్న ఉత్తరం రాసిండంట’’ మొగిలి ఉత్తరం తెచ్చిండు.

            ‘‘నువ్వే చదువు కామ్రేడ్‍’’ నాకు జెప్పన సదువరాదు. మొగిలి.

            ‘‘మీ అన్న ఏం రాసిండో - అట్ల సదువద్దు’’ సత్యం...

            ‘‘కాదు కామ్రేడ్‍ - గంగన్న మా అన్న ఎనిమిది నెళ్లు రావాలల్ల ఉన్నరు మూడు నెళ్లు జైల్లున్నరు. మంచి దోస్తులు. గంగన్నను - నాగన్ననే ఎరుక జేసిండు’’

            ‘‘గంగన్న ఇంటికాడ నేను కల్సిన. మాకు పాటలు నేర్పిండు. మాకు ఒక దినం తెలంగాణ సాయుధపోరాటం గురించి పాఠం జెప్పిండు. సత్యం  ఉత్తరం చేతిలోకి తీసుకొని..

            ‘‘కామ్రేడ్‍ మొగిలికి అభినందనలు - మీ విషయాలన్నీ ఎప్పటి కప్పుడు తెలుస్తున్నయి. నువ్వు కామ్రేడ్‍ శంకర్‍, లక్ష్మి, రాజేశ్వరి పుస్తకాలు చదువుతున్నందుకు చాలా సంతోషం... ముఖ్య విషయం. మీరు క్రాంతి పత్రిక చూసే ఉంటారు.రైతాంగ పోరాటాలు మన ప్రాంతంలో ముమ్మరంగా జరుగుతున్నయి. మన ఊళ్లో పదిరోజుల కింద - లొల్లి జరిగింది. లక్ష్మి పెండ్లికి అప్పు కిందమూడెకరాల పెరడి బాపనోల్ల కిట్టయ్యదొర గుంజుకున్న సంగతి ఎరికేగదా! లింగుమామ మీ నాయనీ వడ్డీ అసలు కట్టినా కాయిదాలు ఇయ్యలేదు. రైతుకూలి సంఘం ఆ భూమి లింగుమామకు ఇప్పించి నాగండ్లు కట్టిచ్చింది. అట్లాగే నీ నౌఖరి కోసం చిన్నాయినె రయిను బెట్టిన భూమి దున్నిచ్చిండ్లు - అట్లా యాభై ఎకరాలు మనూళ్లే దున్నిండ్లు - పోలీసులచ్చిండ్లు - అందరిని కుప్పేసి కొట్టిండ్లు - నాలుగొద్దులకింద కిట్టయ్య ఇంటిమీద దాడి జరిగింది. అప్పుకాయిదాలు కుప్పేసి కాలబెట్టిండ్లు. వాన్ని వాకిట్ల కట్టేసిండ్లు... పోలీసులచ్చిండ్లు - పడుసోల్లు గుడిమెట్టు అడివిల బడ్డరు. మా నాయినను, మీ నాయినను లింగు మామతో సహా పది మందిని అరెస్టు చేసి కేసుబెట్టిండ్లు - నన్నుకూడా కేసుల బెట్టిండ్లు. మేం దొరికేది లేదు. మన వకీలు బేల్‍కోసం తిరుగుతండు. రేపోమాపో బేలు వస్తుంది. సాగర్‍రావు దొర ఊళ్లె నుంచి దెంకపోయిండు. మీరంతా ధైర్యంగా, క్షేమంగా ఉండాలని కొరుకుంటూ పాట పంపుతున్న శంకరన్నయితే మంచిగ పాడ్తడు. కొంచెం సల్లవడ్డంక వచ్చి సూసిపోండ్లి.

            ‘‘లాల్సలామ్‍’’

            సత్యం పాట మొత్త ఉత్తరం లాగనే సదివిండు.

            ‘‘మన కన్న ఘోరంగ ఉన్నదిగదా అయినా ముందే ఉన్నరు. పాట జెబర్దస్తీగ ఉన్నది. మంచిపాట  - జిమిడికి మీద ఊగిపోతది’’ సత్యం...

            మొగిలి నెత్తిగోక్కున్నడు...పాట కాయిదంలాగుజేబుల పెట్టుకున్నడు.

            ‘‘సరే కామ్రేడ్‍! నీబట్టలు ఆరలేదు. అట్లనే ఉండనియ్యి ఇగో నా అంగీ లాగువేసుకో’’ మొగిలి బట్టలు తెచ్చియిచ్చాడు.  ఇద్దరు డబుల్‍ సవారి సైకిల్‍ మీద మేన్‍రోడ్డు మిదికొచ్చారు. తన సైకిల్‍ సత్యం కిచ్చి - పాషా దుకాణం దగ్గరకుపోయిండు. పాషా దుకాణం మూసుకొని తనండ్లతనే ఎదో గొనుక్కుంటున్నడు.

            ‘‘అన్నా సైకిల్‍ గావన్నా! పాణంబడ్డది. అందరు మంచి గున్నరుగదా! మంది నోటికొచ్చినట్టు చెప్పుకుంటండ్లు’’

            పాషా ‘‘బాగుంటేనేకదా! నీకాడికచ్చింది - సైకిల్‍ గావాలె’’

            ‘‘నేను రావన్నా - దిమాక్‍ పని చేస్తలేదు. ఎవన్నన్న ఏసియ్యాల న్నంత గాయిగత్తరగున్నది.’’ పాషా... మొగిలికి నిజంగా అట్లాగే ఉన్నది....ఇద్దరు బయలుదేరిండ్లు...

            ‘‘తొవ్వల్నే గన్క శిబిరం దగ్గరినుంచి పోదాం’’ సత్యం...

            ‘‘మరిచేపోయిన -వాళ్లెట్లున్నరో - శిబిరంల పదిమంది ఉండిరి’’ సైకిల్లు నడుస్తున్నాయి...

                                                                            35

            శిబిరం దగ్గరికి పోయేసరికి పదిమంది లేచి వచ్చిండ్లు. వాళ్లు భయంతో గడ్డకట్టుకపోయున్నారు. ఏమైతదో తెలియదు. వాళ్లకు సంగతులన్ని ఎవరో ఒకరు వచ్చిచెప్పుతున్నరు గని ఏమి చేయాలో? ఎవరు చెప్పడంలేదు... శిబిరం ఎత్తేయడమా? ఉంచడమా? పోలీసులు ఇక్కడికి వస్తరా?

            సత్యం, మొగిలి అందరిని ఆలింగనం చేసుకున్నారు. చనిపోయిన వాళ్ల పేర్లు వనికే చేతులతో చిన్న చిట్టీని ఇచ్చారు. లోడింగు కార్మికులు, కాటం చంద్రయ్య, శీలంశెట్టి నారాయణ, పానుగంటి పోచం, దుర్గయ్య, చంద్రయ్య - వాళ్లయిదుగురు లోడింగుకార్మికులు - ఇంకొకరు చనిపోయినట్టుగా అందరు అంటున్నారు. అతని గురించి తెలియడంలేదు.

            సత్యం మొగిలిని నాలుగుమాటలు మాట్లాడు మన్నాడు.

            మొగిలికి ఉద్వేగంతో మాటలు రాలేదు. తనులోడింగు లేబరుగా చేసినరోజులు గుర్తొచ్చినయ్‍..‘‘మన కోసం అమరలైన మన అన్నలు తమ్ములకోసం రెండు నిమిషాలు తలుచుకుందాం’’ అన్నాడు. అందరు లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించిపేరు పేరున మొగిలి పేర్లు చెప్పుతుంటే అందరు జోహర్లు చెప్పారు.

            ‘‘మనం మంది సొమ్ములు కుప్పేసుకోను గిందులకు దిగలేదు. చావకుండా బతకడానికి ఇగో గిక్కడ మనం పనిచేపే కాడ నిలబడ్డం. ఈ బొగ్గు మనది - ఈ భూమి మనిది... మనం కట్టంజేసి మందిని బతికిత్తం - మనలను బతకనియిమంటన్నం - మనం గెలువాలె - గెలుత్తం. అవద్దం నాశినమైపోతది. నిజం గెలుస్తది. మనం....‘‘మొగిలి మాట ముందుకు సాగలేదు’’

            ‘‘మనం మనసమస్య తీరేదాకా - పోరాటం ఆపేదిలేదు. అన్ని డివిజన్లలో నిరవధిక సమ్మె నడుస్తంది... అమరుల సాక్షిగా పోరాడుదాం - ఇంతకన్నా మనలను ఇంకా వాళ్లేం చేస్తరు? శిబిరం కోనసాగిత్తం. మిగతా మన కార్మికులంతా దవాఖానకాడున్నట్టు తెలిసింది. ఆడికే పోతన్నం.. మన కార్మికులందరిని ఇక్కడికే తోలుతం. మళ్లీ మేమువస్తం’’ సత్యం చినపోయినవారికి, గాయపడ్డవాళ్లకు పాయమాలుకట్టయ్యాలని చెప్పుండ్లి’’ అన్నారు కార్మికులు సాగదోలుతూ...

( తరువాయి భాగం వచ్చే సంచికలో )

 


ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు