నవలలు

(June,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సైరన్ నవల  రెండవ పార్ట్ –  పదకొండవ  భాగం  

    సైరన్ నవల  రెండవ పార్ట్ –  పదకొండవ  భాగం  

(     (సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)                                                           

                                                                            36

 

            అక్కడి నుండి మొగిలి, సత్యం హాస్పటల్‍ చేరేసరికి సాయంకాలం అయిదయ్యింది. హాస్పిటల్‍ ముందు అయిదారు వందల మంది ఉన్నారు. కార్మికులు, విలేకర్లు, రాజకీయనాయకులు, యూనియన్‍ నాయకులు, మహిళలు, విద్యార్థులు, పోలీసులు, కంపెనీ అధికార్లు ఎవరికి తోచిన విధంగా వాళ్లే అరుస్తున్నారు...మధ్యలో సి.ఐడిలు సివిల్‍ బట్టల్లో తిరుగుతున్నారు. హాస్పిటల్‍ బయట రోడ్డుమీద జీబులు, ట్రక్కులు, బస్సులు నిలబెట్టి ఉన్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నది.

            సత్యం హాస్పటల్‍ పక్కనే గల హోటల్లో కూర్చున్నాడు. ‘‘కామ్రేడ్‍ నేను పొయి చూసొత్త - మా వోళ్లంత ఈడనే ఉన్నరు. మా సడ్డకుడు పోశెట్టి వాళ్ల యూనియన్‍ డెలిగేటు - మొన్న శిబిరం కాడ గుండాలు కొట్టిండ్లు గద దెబ్బలు తాకినయ్‍. మీరు ఈడనే ఉండుండ్లి.’’

            ‘‘నేను వస్త పోదాం’’ సత్యం...

            ‘‘అందరం పోతే పనినడువది అక్కడ నిన్ను నన్నులోపటేత్తే’’ మొగిలి నచ్చచెప్పి కూర్చుండబెట్టి మందిలో కలిసి పోయిండు.

            కాసేపటికి కొడుకు నెత్తుకొని - ఒక కడుపుతోనున్న పిల్లను తీస్కొని చంద్రకళ హోటల్‍ దగ్గరికి వచ్చింది.

            కిరణ్‍ను సత్యంకిచ్చింది. వాళ్లు హాస్పిటల్‍ మేన్‍గేటు చేరేసరికి అక్కడ పోలీసువలయం ఆపింది...కడుపుతో నున్న పిల్లహాస్పటల్‍ పాసు సూచింది. సత్యం ఆమె పక్కకు నిలుసున్నడు. సత్యంను ఆపిండ్లు...

            ‘‘మా ఆయన’’ అన్నది ఆపిల్ల.

            ‘‘మీ ఆయనైతే -మినిష్టరా? గడబెడ గున్నది - లోపటికి పోనిత్తలేం’’ పోలీసు...

            ‘‘చానా దూరం మావూరు నుంచి వచ్చిండు. మాది ప్రసూతి వార్డు అక్కడ లొల్లిలేదు’’ ఆ పిల్ల అన్నది.

            ‘‘పో - తొందరగ మళ్లరా - ఆన్నేకూసోకు’’పోలీసులు అటిటుసూసి ఒదిలి పెట్టిండ్లు -పోలీసు వలయం తరువాత వందలాది మంది మహిళలు కూచుండి దర్నా చేస్తున్నారు వాళ్లల్లో రెహనా, సరిత, లక్ష్మి, రాజేశ్వరి అక్కడక్కడున్నారు.

            ‘‘పోలీసుజులుం’’

            ‘‘నశించాలె’’

            గొంతుబొంగురుపోయినా రెహనా నినాదాలిస్తోంది...పోలీసుల నెత్తులమీది నుండి సత్యం వెనక్కి తిరిగి చూసిండు. లోపల అనేక వార్డులున్నాయి... పోశెట్టి ఉన్న వార్డులో ఒదిలి పెట్టి ఆ పిల్ల వెళ్లిపోయింది. ‘‘థాంక్స్అక్క’’సత్యం. ఆ పిల్ల నెనరుగా చూసి వెళ్లిపోయింది.

            కిరణ్‍ దారి చూపిండు...పోశెట్టి బెడ్‍మీద కూర్చుండి ఉన్నాడు. అతిని పక్కన శంకర్‍ కూర్చుండి ఉన్నాడు. అతని ముఖమంతా పీక్కపోయి ఉన్నది. బట్టలు దుమ్ముకొట్టుకపోయి ఉన్నాయి....

            ‘‘మీకోసం చూస్తున్న - ఎక్కడున్నరో తెలువదు. అరెస్టు కాలేదని తెలిసింది...’’ శంకర్‍ సత్యంను ఆలింగనం చేసుకున్నాడు. అతని ముఖంమీద పొద్దటి నుంచి జరిగిన కాల్పుల తాలూకూ ఉద్రిక్తత పోలేదు. ఇంతలోనే చంద్రకళ వచ్చింది... ఆమెతో పాటు మొగిలి, శంకర్‍ మొగిలిని ఆలింగనం చేసుకున్నాడు.

            ‘‘మొగిలీ! మీకోసం కొండకెదిరి చూసినట్టు  ఎదిరి చూత్తనం. ఇగో ఈ పిలగాడు మూడు గంటల నుంచి గిప్పుడు కూసున్నడు... గీ పిలగాడు లేపోతే ఆగమాగంగ ఉండే దవాఖానను లైనుకు తెచ్చిండు.’’

            బయటకు పిలిచి చిన్ని చిట్టీ సత్యం చేతికిచ్చింది.

            అది సరిత పంపిన చిట్టీ ‘‘అరగంటలో పోస్టు మార్టం అయిపోతుంది. ఏంచెయ్యాలె, కామ్రేడ్స్?’’

            ‘‘పానం పడ్డదా? పిలగా - పో - పొయ్యి ముఖం కడ్కుచ్చుకపో -పది నిమిషాలల్ల రండ్లి’’ చంద్రకళ...

            సత్యం, శంకర్‍ లేచి బయటకు పోయిండ్లు -దూరంగా ఆపరేషన్‍ థియేటర్‍ పక్క రెండు బెంచీలున్నాయి. ఒకటి ఖాళీగా ఉంది.

            ‘‘ఎక్కువ టైంలేదు. ఉన్నది ఇద్దరమే - మనం నిర్ణయంతీసుకోవచ్చా’’ శంకర్‍...

            ‘‘తప్పదు’’

            ‘‘ఏంచేద్దాం?’’

            ‘‘సూడవోతే ఇదిట్లా బద్దలయ్యిందిగని - దీనెనుక చానాకుట్రలున్నయి’’ సత్యం...

            ‘‘ఉన్నయి - మన కవరు గివరు తొలిగిపోయింది. అందరు గల్సి మనలను మూసేసి, లేకుంట చెయ్యాలనుకుంటండ్లు’’ శంకర్‍...

            ‘‘కానియ్యి -మనయినాలుగు డిమాండ్లు - కాల్పులు మీదన్యాయవిచారణ కేసులుజెట్టి జరుపాలి. చనిపోయిన వాళ్లకు యాభైవేలు, వారిపిల్లలకు ఒక్కరికి ఉద్యోగం, గాయపడ్డ వాళ్లకు కమిటివేసి నష్టపరిహారం నిర్ణయించి ఇవ్వాలె. లోడింగు కాంట్రాక్టు పద్దతిఎత్తేసి -వాళ్లందరిని బదిలీ పిల్లర్లు చెయ్యాలి. అరెస్టు చేసిన వారందరని బేషరుతుగా విడుదల చేయాలి.’’ సత్యం...

            ఈ విషయాలన్ని కంపెనీ అధికారి ప్రజల ముందు బహిరంగంగా ఇప్పుడే ప్రకటించాలి.’’ సత్యం...

            ‘‘మహిళలు, చనిపోయిన వారి బంధువుల తరుపున మనవాళ్లు ఈ డిమాండ్లు పెడుతరు’’ శంకర్‍

            ‘‘ఆక్సన్‍ ప్లాను శవాలను కదలనియ్యక పోవటం’’

            ‘‘లాఠీ చార్జ్చేస్తే?’’

            ‘‘చెయ్యరు. ఇప్పటికే డిపెన్సుల పడ్డరు. మీరు మహిళా కామ్రేడ్స్ ఈ స్థలంలో లేకపోతే ఇప్పటికే ఈ తతంగం ముగిసేది. మీ అందరికి అభినందనలు - మీ కామ్రేడ్లీస్పిరిట్‍ గొప్పది’’ సత్యం ఉద్వేగానికి లోనయ్యాడు...

            ‘‘గిదేం ఉన్నదన్న గిన్ని వందల మంది -కాల్పులు జరిగినంక కూడా ఇక్కడ చేరిండ్లంటే మనం ఎంత కామ్రేడ్‍’’ శంకర్‍.

            ‘‘లాఠీ చార్జి చేస్తే మనం రంగంలోకి దిగుదాం.’’ శంకర్‍ మళ్లీ...

            ‘‘ఎట్లా?’’

            ‘‘ముందుకు పోయి అరుస్తాం’’

            ‘‘వద్దు - నాయకత్వం పోతుంది. వాళ్లనుకున్నది నెరవేరుతుంది’’

            ‘‘మరేం చేద్దాం?’’

            ‘‘మనం బయట మిగులుతేనే ఏదైనా చేయగలం - మన శక్తులన్నింటిన్నింటిని కూడగట్టి నిరవధిక సమ్మెకు పిలిపిద్దాం’’

            ‘‘ఫేలయితే..?’’

            ‘‘మనం బాధ్యత తీసుకుందాం. ప్రజలే నాయకులు...’’

            చంద్రకళ, సరిత వెతుక్కుంటూ వచ్చారు...

            సరితకు నాలుగు డిమాండ్లు చెప్పారు... సరిత వెళ్లిపోయింది. చంద్రకళ వాళ్లిద్దరిని తీసుకొని ఇంకో వార్డుకు నడిచింది. కాల్పుల్లో గాయపడిన వారిని జనరల్‍ వార్డులో వేశారు. అంతా గందర గోళంగా ఉన్నది... అక్కడ రెండు బొగ్గుబాయిల ఫిట్‍ కమిటి సభ్యులు కల్సిండ్లు... వాళ్లద్దరితో మాట్లాడి అలాయిలాయి తీసుకున్నరు... ‘‘మన కామ్రేడ్స్ విడుదలకోసం ఏం చేద్దా’’ సత్యం అడిగిండు.

            ‘‘వాళ్లు ఉత్తగ ఒదులరు. మనమెంత హుశారుగున్నా మనపని తెలుత్తదిగద - మనం కవరు సంఘాలల్లో పనిచేసినా వాళ్లు వాసన పడుతరుగద - మనం ఫిట్‍ కమిటీల పెట్టిన రామలింగం సంగతి  బయటకు పొక్కింది. మన నిర్మాణం గురించి తెలువది. ఎవులున్నరన్నది తెలువది?’’

            ‘‘మరెట్లా?’’ శంకర్‍

            ‘‘ఎట్లేమున్నది? మన నాయకులేపోంగా - చూసుడెక్కడిది?’’ గీటైంల మనం ఖైరతు గుండకపోతే మనపని ఎనుకకు బోతది. సల్లవడ్తది’’ మరో ఫిట్‍ కమిటి డేవిడ్‍.

            ‘‘మరేం చేద్దాం?’’ సత్యం..

            ‘‘నిరవదిక సమ్మె’’ రామలింగం డేవిడ్‍ ఒక్క సారే అన్నారు.

            ‘‘ఎప్పటి నుండి మొదలు పెట్టచ్చు’’ సత్యం...

            ‘‘ఇప్పటికిప్పుడు కుదరదుగని - రేపు ఫస్టుషిప్టునుండి’’

            మనందరం ఒకే అంటే - తిరుగుదాం - రేపు పస్టుషిప్టునుండి’’ రామచంద్రం - డేవిడ్‍...

            ‘‘సరే కామ్రేడ్‍ మన ప్రయత్నం మనం చేద్దాం తప్పకుండా నిరవధిక సమ్మె ఎట్లా?’’ సత్యం...

            ‘‘మేం బయటకు పోతం - ప్లాను చేస్తం. మీరు చెయ్యండి’’ రామలింగం డేవిడ్‍...

            ‘‘ఆపని మీదనే ఉందాం’’ లాల్‍సలామ్‍. వీలైతే రాత్రికి లుద్దాం సత్యం, శంకర్‍ ఆవార్డునుండి బయటకు వచ్చారు.

            ‘‘కామ్రేడ్‍ యస్‍.బి. సి.ఐడీలు వాళ్లు చాలా మందున్నరు... వాళ్లకు తెలిసి పోయినట్టున్నది. మనం బయటికి తొందరగా పోకతప్పదు...’’ శంకర్‍ వార్డు చివరలో తచ్చాడుతున్న సివిల్‍ బట్టలపోలీసును చూయించాడు.

            ‘‘ఏం జరుగుతుందో? చూడాలికదా?’’సత్యం...

            ‘‘హాస్పిటల్‍ బయటినుండి చూద్దాం మనకు తెలుస్తుంది.’’ చంద్రకళ మొగిలిని వెంట బెట్టుకవచ్చింది...

            ‘‘కామ్రేడ్‍ బయటకు పోవడమెట్లా?’’ సత్యం...

            ‘‘వచ్చిందారినే’’ మొగిలి...

            ‘‘కాదు నావెంట రాండ్లి - అక్కడ అందరిని సోదా చేస్తండ్లు - ఏదో గడబిడ నడుస్తంది.’’ చంద్రకళహాస్పిటల్‍ వెనుక దిక్కు వాళ్ల ముగ్గురిని తీసుక పోయింది... హాస్పిటల్‍ వెనుక భాగంలో చిన్న గేటున్నది...ఆగేటు ఆవల డాక్టర్ల కోసం కట్టిన క్వార్టర్లున్నాయి. డాక్టర్ల కోసం పెట్టిన గది.

            ఒక్కరొక్కరు ముగ్గురు బయటపడి - మళ్లీ హోటల్‍ కాడికొచ్చారు. తలాకొంత దూరంలో జీబుల పక్క నిలుచున్నారు.

            మొగిలి మందిలో కలిసిపోయిండు.

            మహిళలు నినాదాలు ఇస్తున్నారు.

            ‘‘పోలీసుల మీద కేసు పెట్టాలె’’

            ‘‘న్యాయ విచారణ జరిపించాలె’’

            ‘‘అన్ని రాజకీయ పార్టీలు’’

            ‘‘మద్దతు తెలుపాలి’’

            ‘‘చినిపోయిన వారికి ఒక్కొక్కరికి యూభైవేలు కాంపన్‍సేషన్‍ ఇవ్వాలె’’

            ‘‘వారి పిల్లలకు ఇంటికొకరకి ఉద్యోగం కల్పించాలె’’

            ‘‘ఇవ్వాలె’’

            ‘‘గాయపడ్డవారికి కమిటివేసి నష్టపరిహారం’’

            ‘‘ఇవ్వాలె’’

            ‘‘లోడింగ్‍ కంట్రాక్టు’’

            ‘‘ఎత్తేయాలి’’

            ‘‘లోడర్లందరిని బదిలీఫిల్లర్లుగా సింగరేణి తీసుకోవాలి’’

            ‘‘అరెస్టు చేసిన వారందరినీ’’

            ‘‘బేషరుతుగా విడుదల చేయాలి’’

            ‘‘కార్మికుల ఐఖ్యత’’

            ‘‘వర్ధిల్లాలి’’

            ‘‘అమర వీరులకు’’

            ‘‘జోహర్లు’’

            సరిత, లక్ష్మి నినాదాలు యిస్తున్నారు. రెహనా గొంతు పూర్తిగా పోయింది. నినాదాలు మందిలోకి వెళ్లాయి. అన్ని మూలల నుండి విద్యార్థులు, కార్మికులు, మహిళలు అరుస్తున్నారు. మరణించిన కార్మికుల బందువులు, పిల్లలు పెద్ద పెట్టున రోదిస్తున్నారు... అరుపులతో, రోదనలతో హాస్పిటల్‍ ఆవరణ విశాదంగా ఉంది. చాలా మంది ఏడుస్తున్నారు. తిడుతున్నారు.  ఆగమాగంగ ఆడికీడికి తిరుగుతున్నారు. మందిలో కలకలం, విశాదం, కోపం కలెగల్సిన ఉద్విగ్నత విలేకర్ల గుంపు ముందుకొచ్చి డి.యస్‍.పిరెడ్డి సబ్‍ కలెక్టర్‍ విద్యాసాగర్‍ రావును చుట్టుముట్టారు. వాళ్లిద్దరి మధ్యలో సింగరేణి జనరల్‍ మేనేజర్‍ పర్సనల్‍ ధర్మారెడ్డి, పర్సనల్‍ మేనేజర్‍ మోహన్‍ రావు పరెషాన్‍గ నిలుసుండి ఉన్నారు. కొంచెందూరంలో మరో ఇద్దరు పర్సనల్‍ మేనేజర్లు - నిలుచున్నారు. ఏవేవో కాగితాలు పట్టుకొని ఇద్దరు సర్కిల్‍ ఇన్‍స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలు మంద మధ్యలో ఉన్నారు. వాళ్లపక్క పోలీసులు లాఠీలతో దడిగట్టినట్టు నిలుసున్నారు. వాళ్ల కావల మహిళల గుంపు నినాదాలిస్తోంది.

            ఇంతలోనే కాంపౌండు గోడలోపల పోస్టుమార్టం గది నుండి వచ్చే ఎడమవేపున గల రోడ్డునుండి పోస్టుమార్టం చేసిన శవాలను తీసుకొని రెండు అంబులెన్సులు వచ్చాయి. చనిపోయిన వాళ్ల బందువుల గుంపు ఘొల్లు మంది - ఏడ్పులు హాస్పిటల్‍ అంతావ్యాపించాయి. అక్కడ నిలబడ్డ వాళ్లందరి ముఖాలల్లో విశాదం...కోపం, ఆందోళన, మహిళా గుంపు అంబులెన్సుకు అడ్డంగా నిలుచున్నది. దాదాపు రెండు వందలమంది.

            ‘‘కదలనియ్యం’’

            ‘‘కదలనియ్యం’’

            ‘‘శవాలను కదలనియ్యం’’

            పోలీసు వలయం తోసుకొచ్చింది.

            సర్కిల్‍ మైక్రోఫోన్‍లో మాట్లాడుతున్నాడు.

            ‘‘ప్రలారా! కార్మికులారా! మహిళలారా ఇప్పటికే ఆలిశ్య మయ్యింది. చలికాలం. రాత్రయితది’’

            ‘‘కానియ్యి ఎన్నిరోజులైన ఇక్కడే ఉంటం’’ రెహనా అరిచింది.

            ‘‘అప్పటికే కాల్పులు జరిగినయ్‍ - తీవ్రవాదులు ప్రజలను రెచ్చగొడుతున్నారు. లాఠీ చార్జ్ జరుగుతుంది - ప్రజలారా చట్టాన్ని ధిక్కరించడంనేరం’’ సర్కిల్‍ అరుస్తున్నాడు. హాస్పిటల్‍ మేన్‍గేటు దగ్గరి పోలీసు పికెటింగు గదిలో జనరల్‍ మేనేజర్‍ శాస్త్రి, జనరల్‍ పర్సనల్‍ ధర్మారెడ్డి, సబ్‍కలెక్టర్‍ విద్యాసార్‍రావు డి.యస్‍.పి రెడ్డి కమ్యూనిస్టు నాయకుడు భాస్కరరావు మంతనాలు చేశారు... పదినిమిషాలు గడిచింది. సబ్‍కలెక్టర్‍, డి.యస్‍.పి పర్సనల్‍ ధర్మారెడ్డి బయటకు వచ్చారు. ధర్మారెడ్డికి చెమటలు కారిపోతున్నాయి.

            సావగొట్టి సెవులు మూసి తీవ్రవాదులంటరా!

            ‘‘ఏమయ్య నాయకులారా! మీకు నోళ్లు లేవా? సబ్‍ కలెక్టరు విద్యాసాగర్‍రావు వట్టిగ తమషా సూత్తండ్లా’’

            మిగతామాటలు విన్పించలేదు. చాలా మంది తలో రకంగా అరుస్తున్నారు.

            ‘‘ప్రలారా! శాంతంగా ఉండండి’’ సబ్‍ కలెక్టర్‍ మైక్రోఫోన్‍లో హాస్పిటల్‍ ఆవరణలోని ప్రజలంతా ఘొల్లున లేచిండ్లు.

            ‘‘మేనేజుమెంటు మాట్లాడాలి...’’ అరుపులు కేకలు మందిలో నుండి మైక్రోఫోన్‍లో జి.యమ్‍ పర్సనల్‍ ధర్మారెడ్డి ముందుకు వచ్చిండు. వాళ్లు ముందుగా ఇలాంటి స్థితిని అంచనా కట్టినట్లే ఉన్నారు.

            ‘‘కార్మికులారా! ప్రజలారా! ఇలాంటి దురదృష్టఘటనకు సింగరేణి యాజమాన్యం బాధపడుతున్నది.’’

            ‘‘జెప్పన చెప్పవయ్యాసంపుడేంది - బాధపడుడేంది?’’

            ‘‘సావగొట్టి - బాధపడుతేమున్నది కార్మికులకు సింగరేణియాజమాన్యం క్షమాపణ చెప్పాలె’’ సరిత అరిచింది...

            సి.ఐడి పోలీసులు మహిళా నాయకులను వారి కదలికలను చూస్తున్నారు. బాధపడుతున్నాం - యాజమాన్యం దురదృష్టఘటనకు చింతిస్తున్నాం చనిపోయినవారి కుంటుంబలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు వారి పిల్లలకు అలాగే గాయపడిన అర్హులైన వారికి ఇంటికొక ఉద్యోగం, గాయపడిన వారికి చట్ట ప్రకారంగా కాంపన్‍సేషన్‍ సింగరే ణియాజమాన్యం ఇస్తుంది. ట్రక్కు లోడింగు కంట్రాక్టు లేబర్‍ సిస్టమ్‍ గురించి ఇదివరకే రెండు దఫాలు అన్ని కార్మిక సంఘాలతో చర్చించడం జరిగింది. ఈ వారం రోజుల్లో తప్పకుండా ఎత్తివేసి - లేబరుకు ఉపాదికల్పిస్తాం - మధ్య దళారులుండరు.’’

            ‘‘ఇంకా రెండు డిమాండ్సు’’ పోలీసుల మీద కేసుపెట్టాలె - అరెస్టయిన వారిని బేషరుతుగా విడుదలచేయాలి.

            సబ్‍ కలెక్టర్‍ విద్యాసాగర్‍ రావు మైక్రోఫోను తీసుకొని...

            ‘‘మిగతా రెండు విషయాలు సింగరేణి యాజమాన్యానికి సంబంధించినవికావు... చట్టప్రకారంగా జడ్జితో ఈ ఘటన మీద విచారణ ఉంటుంది. రెండోది... చట్టం తనపనితాను చేస్తుంది. తీవ్రవాదం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’

            ‘‘పోలీసుల మీదకేసు పెట్టాలి’’

            ‘‘దోషులను శిక్షించాలి’’

            ‘‘అరెస్టు చేసిన వాళ్లను బేషరుతుగా విడుదల చేయాలి’’

            అప్పటికి అరయ్యింది. లైట్లు వెలిగినయ్‍ - అయిదు నిమిషాల తరువాత - పోలీసులు, సింగరేణి సెక్యురిటీ గార్డ్సు ముందుకొచ్చారు. రెహనా, సరితతో పాటు పదిమంది మహిళలనూ వేరుచేసి అరెస్టు చేసిండ్లు - మహిళల గుంపును దిగ్భందం చేసిండ్లు - భలవంతంగా దారికడ్డంగా ఉన్నవాళ్లను ఈడ్చేశారు.

            ఏంజరుగుతుందో ఎవరికి తెలియకముందే - రెండు అంబులెన్సులు వెళ్లిపోయాయి. బందువులను బస్సుల్లో ఎక్కించి తీసుకవెళ్లారు...

            జనం భయపడ్డారు. మళ్లీ ఏదో జరుగుతుందనుకున్నారు. మరో పది నిమిషాలల్లో హాస్పిటల్‍ ఆవరణ ఖాళీ అయ్యింది... సాయంకాలం ఆరుగంటల పదిహేనునిమిషాల ప్రాంతీయవార్తల్లో ఈ వివరాలన్ని ప్రభుత్వ భాషలో చెప్పారు. సింగరేణిలోని అన్ని డివిజన్ల కార్మికులు గుంపులు గుంపులుగా విన్నారు...వారి పద్దతిలో వారు అర్థంచేసుకున్నారు.

            సత్యం, శంకర్‍ చీకట్లో సందుల గుండా సైకిల్‍ తొక్కుతున్నారు.

            యాపలకాడ ఆగిండు. వీధిలైట్లు విచారంగా వెలుగుతున్నాయి. యాపలకాడ ఎంతో గడబెడగా ఉండేదీ - నిర్మాణుష్యంగా ఉంది -హోటల్లు, దుకాణాలు మూసి ఉన్నాయి.

            ‘‘కామ్రేడ్‍! మీరు మనం నిర్ణయించుకున్న విషయాల మీద మార్కెటు - బస్తీల మీద పోస్టర్లు వేయండి - ఎంతమంది రాడికల్‍ విద్యార్థులుంటే వాళ్లందరిని కూచుండ బెట్టి మాట్లాడండి - బహుశా రేపు ఎనిమిది తొమ్మిది గంటల మధ్య మన నిరవధిక సమ్మె సక్సెస్‍ అయితే యాపలకాడి చౌరస్తాలో మీటింగు పెడుదాం అరగంటలో మీటింగు ముగిద్దాం’’ సత్యం...

‘‘ఆ పనినేను చూస్త జాగ్రత్త కామ్రేడ్‍’’ శంకర్‍ వెళ్లిపోయాడు.

            సత్యంకు మళ్లీ విచారం కమ్ముకున్నది. యాపచెట్టు కింద గద్దెమీద కైనీడకు కుర్చున్నాడు. గతిక్రమం లేకుండా పొద్దటి నుండి జరిగినదంతా పోటేత్తుతోంది.

            ‘‘జెబుల పైసలులేవు...సైకిల్‍ రేపుయివ్వవచ్చు. కాని పోస్టర్లు వేయాలి. కాగితాలు...తిరుగాలి. కూర్చుంటే మెదడు చిట్లి పోతుందేమో?’’ సత్యం సైకిలెక్కాడు.

            అట్లా ఆలోచిస్తూ కొత్త గుడిసెలు చేరుకున్నాడు.

            ‘‘షరీప్‍, రెహనా ఇద్దరు అరెస్టయ్యారు... వాళ్ల గుడిసె పరిస్థితి ఏమిటి?’’ ఆలోచిస్తూ...

            మొగిలి గుడిసెలకొచ్చిండు...

            అక్కడ లక్ష్మి కూతరుకు, రాజేశ్వరి కొడుక్కు పాలు తాగిస్తున్నారు...

 

(             (తరువాయి భాగం వచ్చే సంచికలో )

 


ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు