నవలలు

(July,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సైరన్ నవల  రెండవ పార్ట్ – పన్నెండవ  భాగం  

సైరన్ నవల  రెండవ పార్ట్ –  పన్నెండవ   భాగం  

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)                                                                                                                

        మొగిలి ‘‘జంబాయిరే’’ అంట అడుగులేస్తున్నడు...

            తన్మయత్వంతో పాడుతున్నాడు. తనూ పాడుతే బావుండు...లోపలి ఒత్తిడి కొంతైనా తగ్గిపోవును. సత్యంకు విచారం తొలిగిపోయింది.తను గుడిసెతడుక కొరిగి కూర్చున్నడు... తను మొగిలి చేతుల కాగితం తీసుకొని కవిత చదివినట్టు - పెద్దగా చదివిండు. ఎన్నెన్నో పోరాటాలు అందులో ఉన్నాయి.

            ‘‘బావయో బంగారయ్య పదాలు పాడి పాడి - బంగారయ్య పోలీసు ఠానల కూసున్నడు. సత్తెన్నా పాణానికి ఇంకో పాటల పిచ్చోడు తయారయ్యిండు.’’ లక్ష్మి...

            ‘‘వదినా! ఏది ఒక్క చరణం పాడు ఎంత కష్టమో? నాభిల నుంచి నరాలు తీగలు చేత్తే పాటత్తది’’ మొగిలి...

            ‘‘కామ్రేడ్‍ సత్తెన్నా - మా ఖాందానంత గిసొంటి పిచ్చి ఖాందానే నాగయ్య మా మేన బావ - ఏడదాకిందో అంతకు ముందో గని అయినెకు గీ రొగం తాకింది. అయిన తా చెడ్డ కోతి వనమెల్ల సెరిసిందని - ఇగో మా ఇండ్లల్ల కచ్చి గిట్ల మమ్ముల ఆగం జేసిండు. చెప్పుకుంటే మానం పోతది. చెప్పకపోతే పానం పోతది. ఇగోగీ పోరి సూడు ఎట్ల కాల్లెగరేస్తున్నదో దీనికి సుత వాళ్లనాయిన్న సాలుపడ్డది... దీనిపేరు స్నేహలత నోరు తిరుగని పేరు. గంగన్న పెట్టిండు. ఆయన మతికచ్చికాలవడే - అయ్యకు అవ్వకు బుట్టిన ఆరుగురు పరమ బాగోతులంట ఆళ్ల సెల్లె - ఓ అంతకు ముందు వాళ్లవ్వ లచ్చవ్వచ్చింది. గా ముసలవ్వను లోపటిసేదుండే పెండ్లి గావల్సిన పోరి నీకు గిదేందే - అని ఝాడిచ్చి బిడ్డను తీసుక పోతదనుకున్న -ఓ పావురం కారిపోంగ బిడ్డకు ముద్దిచ్చి పోయింది - అది మన గంగన్న కుటుంబం’’ లక్ష్మికి దు:ఖంతోనో - ఉద్విగ్నతతోనో కన్నీళ్లు కారుతున్నయి.

            ‘‘కామ్రేడ్‍! మరి మీ ఇద్దరు వాళ్లతోటుంటిరి గదా! మిమ్ముల్ని జీబుల ఎక్కించుకపోలె’’

            ‘‘మాపోదురు మమ్ముల్ని కవరుపెట్టిండ్లు గదా! మా అక్క చంద్రకళ వీళ్లకేం ఎర్రిలేసిందో - ఎవలు అర్థంకావటంలేదు. అది పెద్ద లీడరయ్యింది. దవాఖానంత ఒక్కటి చేసింది. మాతోపాటు పిల్లలున్నరని - వాళ్ల సుట్టాల మనుకున్నరు’’లక్ష్మి...

            ‘‘నాకైతే భయమయ్యిందక్కా - సిన్నపిలగాడు’’ రాజేశ్వరి...

            ‘‘అగో నీమొగుడు పాడుతండు. ఆకాలం వత్తది - తిరుగనేర్పినకాలు - పాట నేర్సిన నోరు ఆగుతదా? ఈ కామ్రేడ్‍ పిచ్చి సిన్నదిగాదు. నాకే గిట్లనే పోయి మార్కెట్ల నిలుసుండి గింతబట్టి బాజినడుత్తంటే - గీడ పీనుగల తీర్గున్నరు అని మొత్తుకోవాలని ఉన్నది’’ లక్ష్మి...

            ‘‘కామ్రేడ్‍ నాగయ్యమీకు’’ సత్యం

            ‘‘అదే మాకు దూలు దుమ్మ దురదరాసిండు’’ ఓహ్‍ రాత్రిపగలు మా సెవుల్ల కారం రాసినట్టున్నది. మా నాయిన - వీళ్లనాయిన - మా పెద్దమామను జేల్లకూసుండవెట్టి - తమజెంగల్లవడ్డడు’’

            ‘‘అయినెకు రఘన్ననట, ఆ అన్నకు ఎవరో పెద్దాయినెనట - సీతారామయ్యనట. ఆయనకు అరవై ఏండ్లు దాటినయట - ఆయినకు చారు బాబునట - మరి ఆయనకు మావోనట - ఆయనకులెనినట అయినకు. మరి ఆయనకు గడ్డాపాయన మార్క్సు - ఎంగిల్సట -నా మెదడు తినిటోడు బంగారయ్య. మరి అందరు మీ సాలోల్లే, గడ్డపోల్లే, ఆడోల్లెందుకులేరు. ఉన్నా ముంగటికి రానియ్యలేదా? లక్ష్మి ఎక్కడికో పోతంది.

            ‘‘వామ్మో కామ్రేడ్‍ నీకు అరెస్టుతప్పదు’’ సత్యం రవిని ముద్దుపెట్టుకుంటూ పిల్లాడు కేరింతలు కొట్టాడు.

            లక్ష్మి ముసి ముసి నవ్వి ‘‘మరి గడ్డపాయనకు మల్ల బంగారయ్య, రఘన్న, గంగన్న, నాగన్న, మొగిలి, సత్తెం - నానోరు తిరుగది - రైతులు కార్మికులు పిచ్చిలేపిండ్లట -గది సంగతి మాకు గుండాలు గీసి గిదంత రఘన్న జెప్పిండు. కామ్రేడ్‍ ‘‘మార్కెట్ల అందరు సుడంగ సారలిగాడు నామీద చేయ్యేసిండు. నెల రోజులు మనిషిని కాలేదు. అంతకన్నా రోతగా ఉన్నది. నాదానుగా ఉన్నది. ఆ ఆరుగురి శవాలు నాయే నన్నట్టుగున్నది సంపినోళ్లు మన ముంగట ముచ్చెట్లు చెప్పిండ్లు - కారం రాసి నట్టుగున్నది. చూసుకుంట నిలవడ్డందుకు నాదినాగే ఇనంగా ఉన్నది’’ లక్ష్మి ఏడుస్తోంది. వెక్కివెక్కి ఏడుస్తోంది. - వేడిగున్నప్పుడే సుత్తే దెబ్బ... మెడకు వడ్డపాము కరువక మానదు... అందరు రిలాక్సయ్యిండ్లు... అందరి కండ్లలో గుబగుబ నీళ్లు మొదట లక్ష్మి తేరుకున్నది. కన్నీళ్లు కొంగుతో తూడ్చుకున్నది. బయటకుపోయి ముక్కుచీదరిచ్చింది.

            ‘‘రవిని సత్తెన్న కియ్యి - కామ్రేడ్స్ - అరగంటలోఅన్నం అయిపోతది. ముచ్చెట వెట్టేటట్టులేదు’’  బంగారయ్య నాకు నిన్ననే చెప్పిండు. ఎనకకు పోరాదు. ముంగటికి పోవాలె - మనండ్ల వేలమందున్నరు.’’ లక్ష్మి...

            ‘‘సరే - మనం పోస్టర్లు వేయాలి. రేపు నిరవధిక సమ్మె... అరెస్టు చేసిన నాయకులందరిని విడుదల చేసే దాకా - సమ్మె - అన్ని డివిజన్లకు సమ్మె సత్యం లేచినిలబడి...

            ‘‘మనకు కాయిదాలు, బ్రషుషలు, లైకావాలె’’ అన్నాడు.

            ‘‘అన్నీ తెచ్చినం కామ్రేడ్‍ రాంగరాంగ మీరు కాయిదం మీద రాసియ్యిండ్లి మా రాత అడ్డ దిడ్డంగా ఉంది - నేను ఏమొ అనుకున్న నాగన్న మాకు పలు••లు దెచ్చి ఇచ్చినప్పుడు గిసొంటి యాళ్లల్ల .సోస్టర్లు రాస్తం...ఇప్పుడు ఏడయితంది. ఎడున్నర కల్లా మీ రద్దరు తిని పోండ్లి’’ లక్ష్మి...

పాట బాగున్నది - నువ్వు బాగపాడ్తన్నవ్‍ - జెమిడికె పంబాలగురవయ్య జబర్దాస్తీగ వాయించుతడు  రేపు వీలైతే పాడు’’ ఎవలతోనన్న చెప్పిపంపుదాం నాకెరికే... అందరు ఎవరి పనులు వాళ్లు చేయసాగిండ్లు...

            సత్యం, మొగిలి సైకిల్లు తీసుకొని చెరోసంచిలో పోస్టర్లు, సరంజామా పెట్టుకొని ఏడున్నరకే బయటు దేరిండ్లు.

            మొదటి పోస్టరు శిబిరం కాడే సిండ్లు - శిబిరం దగ్గర లోడర్లు వంద మంది దాకా చేరిండ్లు. వాళ్లు కొన్ని పోస్టర్లు తయారు చేసిండ్లు... ‘‘యాపల కాడి పంబాల గురువయ్యను రేపు మీటింగు కాడికి రమ్మని - జమిడికెవాయించాలని’’ ఒక కార్మికున్ని గురువయ్య దగ్గరికి తోలారు. రాత్రి రెండింటి వరకు అన్ని గనుల మీద - ఆఫీసుల దగ్గర పోస్టర్లు పడ్డాయి... అన్నిబాయిల ఆఫీసులు, వీలైన కాడికి ఫిట్‍ కమిటీల మొంబర్లను కలిశారు. మొగిలి, సత్యం తిరిగి తిరిగి వచ్చి శిబిరం దగ్గరే ఆ రాత్రి పడుకున్నారు.

 

            సరిగ్గా ఆరున్నర - కెకెటూగని జెండా గద్దెమీద సత్యం నిలుచున్నాడు, అతని ముఖం మీద సూర్యుని లేత ఎండ మెరుస్తోంది. నిద్రలేక అతని కండ్లు ఎండతో పోటీపడుతున్నాయి.

            ‘‘కామ్రేడ్స్ గతవారం దినాలనుంచి జరుగుతున్న దొంగనాటకాలన్ని మీ కందరికి తెలుసు... సుట్టుపక్క ఇరువై ఊళ్లు ఆక్రమించి మల్ల సింగరేణిలో అన్ని రకాల దందాలు చేసి - గుండాలను పెంచి దాదాగిరి చేసిన దొరలు ఈవారం లనేను - కార్మికులు చావు దెబ్బ కొట్టిండ్లు. ఇదే సందని - దొంగ కార్మికసంఘాలు, నక్కజిత్తుల యాజమాన్యం పోలీసులు కలిసి ఆరుగురు లోడింగు కార్మికులను దుర్మర్గంగా, అన్యాయంగా పట్ట పగలు కాల్చిచంపిండ్లు - నలుభై మంది కార్మికులు - యువకులు గాయాల పాలయ్యారు. ఇది దొంగల రాజ్యం. ఖూనీకోర్ల రాజ్యం. మన నాయకులు ఎప్పటికప్పుడు వీళ్లందరి ఎత్తులన్ని తిప్పికొట్టిండ్లు! మనకు నాయకత్వం ఉంటే సింగరేణిలో వాళ్ల ఆటలు సాగయని మన నాయకులను ఒక ప్లాను ప్రకారంగా అరెస్టు చేసి పోలీస్టేషన్ల పెట్టిండ్లు... అసలు ఏ హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపింది పోలీసులు... ప్రజలను ఈ సమయంలో దగ్గరికి తీసుకోవాలి - కాని పుండుమీద కారం రాసినట్టు అరెస్టులు.

            మనకు అరెస్టులు కొత్తకాదు. పోరాటాలు మనలను బొగ్గులవంటి మనలను అగ్గి చేస్తయి. ఇప్పుడు సింగరేణి కార్మికులు అమాయకులు కారు... రాజ్యం రీతి రివాజు తెలుసుకున్నవాళ్లు.

            మన అవసరాల కోసం అనేక సమ్మెలు చేసినం -గాలి సప్లైకోసం, నీళ్లకోసం, ఇండ్లకోసం, జీతాల పెరుగుదల కోసం మనకు సరైన నాయకత్వం - గంగాధర్‍, షరీప్‍, శంకరయ్య, రెహనక్క, సరితక్క లాంటి వాళ్లు ఉండటం వల్లనే మనకు   నాయకులను బేషరుతుగా విడిపించుకోవడం సాధ్యమైంది. నిన్న మొన్నటిదాకా మన ఊపిరైన నాయకులను అరెస్టు చేసి చిత్ర హింసలు పెడుతున్నారు. మన నాయకులను బేషరుతుగా విడిపించుకోవడంకోసం ఏంచేద్దాం?’’

            ‘‘సమ్మె’’ అక్కడ చేరిన అయిదారు వందల మంది కార్మికులు అరిచారు. ఆ అరుపు మారుమోగింది.. సమ్మె...సమ్మె...

            ‘‘నిరవధిక సమ్మె’’

            ‘‘ఎమర్జెన్సీ తరువాత భారతదేశంలోనే సింగరేణి కార్మికులు చేస్తున్న మొట్ట మొదటి రాజకీయసమ్మెఇది కొత్త చరిత్రను ఆరంభించిన కార్మికులందరికి శనార్తి కామ్రేడ్స్ - అన్ని గనుల పస్టుషిప్టుల నుండి సమ్మె చేస్తున్నాయి. మనందరం ఊరేగింపుగా రాష్ట్ర హైవే మీదయాపల కాడిచౌరస్తా దాకా వెళ్లుదాం - అక్కడికే అన్ని గనులవాళ్లు వస్తారు. ఇది ఆరంభం రెండు గంటలు రాస్తారోకో చేస్తాం - అక్కడ మనడిమాండు ప్రజలకు చెప్పుదాం - మన నాయకులను బెషరుతుగా విడుదల చేసేదాకా సమ్మెనడుస్తోంది. మన నిర్ణయాన్ని ప్రకటిద్దాం. మళ్లీ మొదటి షిప్టు కార్మికులతోనే సమ్మె ముగియాలి.’’

            ‘‘కామ్రేడ్‍ గంగారాంను’’

            ‘‘విడుదల చేయాలి’’

            ‘‘కామ్రేడ్‍ షరీపును’’

            ‘‘విడుదల చేయాలి’’

            ‘‘కామ్రేడ్‍ శంకరయ్యను’’

            ‘‘విడుదల చేయాలి’’

            ‘‘కామ్రేడ్‍ రెహనక్కను’’

            ‘‘విడుదల చేయాలి’’

            ‘‘కామ్రేడ్‍ సరితక్కను’’

            ‘‘విడుదల చేయాలి’’

            ‘‘వారితో పాటు అరెస్టు చేసిన అందరిని’’

            ‘‘బేషరతుగా విడుదల చేయాలి’’

            ఊరేగింపులో ఇవ్వవలిసిన నినాదాల గురించి రాంచందర్‍ అనే కార్మికుడు నినాదాలు చెప్పాడు.

            మరో గని మీది మొగిలి ఇంచుమించు ఇదే విధంగా మాట్లాడిండు. ఇంతలోనే ఏడుగంటల సైరన్‍ కార్మికులే మోగించారు. సైరన్‍ వేలాది గని కార్మికుల కోపోద్రిక్త అరుపులా - పెనుకేకలా మూడు సార్లు ఆగిఆగి మోగింది.... ప్రమాదం జరిగినప్పుడు మోగే సైరన్‍ అది.

            రాత్రి బజలీ కార్మికులు ఆదరబాదరగా ల్యాంపులు, సెమ్మాసులు ల్యాంపురూంల్లో పెట్టారు. అప్పటికే ఆ గని దగ్గర వెయ్యిమందికి పైనే కార్మికులు లైన్లు కట్టారు.

            క్లర్కులు, వోర్‍మన్లు, ఇంజెనీర్లు, అండర్‍ మేనేజరు రూంల్లో నుండి బయటకివచ్చి చూస్తున్నారు.

            ఊరేగింపు కదిలింది. రెపరెలాడే అతిపెద్ద ఎర్ర జండాను ముందువరుసలో ఉన్న కార్మికులు ఎత్తి పట్టుకున్నారు.

            వెయ్యిమంది కార్మికులు కదం తొక్కుతున్నారు. చాలా మంది సైకిల్లు నడిపిస్తూ వెనుక వరుసల్లో నల్లటి బొగ్గుతో నడుస్తున్నారు... దుమ్ము పొగలాగా ఆకాశంలోకి లేస్తున్నది... అగ్ని పర్వతం బద్దలై లాలా పొంగి ప్రవహించి నట్టు, కొండల మీదుగా వరదలొచ్చిన నది ప్రవహించినట్టు - బొగ్గు పెళ్లలు బాయిల నుండి ప్రవహించినట్టు బొగ్గులు మంటలై మండినట్టు - కార్మికుల ఊరేగింపు సాగుతోంది. వందలువేలయ్యారు. కరకర బూట్ల చప్పుడు ఒక లయగానేలను గుద్దు తున్నాయి. బురద బురదగా ఉన్న బూడిద కుప్పల గుడిసెల మద్యనుండి ఆడవాళ్లు స్కూలు పిల్లలు గుంపులు గుంపులుగా  యాపలకాడికి చేరుతున్నారు.

            బొగ్గు ప్రవాహం సింగరేణి కాలరీ చిన్న పట్నపు వీధులను ముంచెత్తుతూ పారుతోంది.

            వేలాది మంది కార్మికులు రాష్ట్రహైవే మీద నాలుగుకిలో మీటర్లమేర కదంతొక్కుతున్నారు. వందలాది సైకిళ్లు - లారీలు జీబులు ఆగిపోయాయి. పాటలు నినాదాలు, ‘మాకష్టంతో సృష్టిస్తున్నా’’ తిండి గింజలూ కట్టుగుడ్డలూ పెట్టుబడులతో దోచుకదాచే ద్రోహులు గుండెలో - అగ్ని కణములై చెరుగుతున్న జెండా! దండిగ ఎగురుతున్న జెండా’’ ముందువరుస కార్మికులు పాడు తున్నారు.తొమ్మిది గంటలకు రాష్ట్రహైవే మూడుదారుల కూడలిలో ముందు వరుస ఆగిపోయింది...అక్కడ కంకబొంగులతో చిన్నస్టేజీ లాంటిది కట్టారు... నాలుగు మైకులు ముందుకట్టారు. సత్యం స్టేజీమీదికెక్కిండు. మైకు చేతిలోకి తీసుకున్నాడు.

 

                                                                                        ( తరువాయి భాగం వచ్చే సంచికలో )

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు