సైరన్ నవల రెండవ పార్ట్ – పదమూడవ భాగం
(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)
‘‘బూటకపు పోలీసు కాల్పుల్లో అమరులైన మన లోడింగు కార్మికులను రెండు నిమిషాలు యాదిచేసుకుందాం’’ సత్యం - మాటను నాలుగు కిలోమీటర్లు ఒకరికొకరు చెప్పుకున్నారు.
రెండు నిమిషాల మౌనం పాటించారు.
‘‘గతవారం దినాలుగా రగులుతున్న సింగరేణి గురించి రేడియో, కూస్తనే ఉన్నది. పత్రికలు రాస్తూనే ఉన్నాయి.ఎప్పటి కప్పుడు రాడికల్స్ వాల్‍పోస్టర్లు వేస్తూనే ఉన్నారు... ఇప్పుడు సింగరేణి కార్మికులకు బొగ్గు తీయడమే కాదు. రాష్ట్ర, దేశ రాజకీయాలన్ని తెలుసు... చరిత్ర తెలుసు... చరిత్రను మలుపు తిప్పడం తెలుసు.
గతంలో అర్థపూట సెలవు కోసమో?
అనచబడిన తమ హక్కులకోసమో?
జీత భత్వాలకోసమో?
నీళ్లకోసమో? గాలికోసమో?
గుడిసెలకోసమో, గూండాగిరిని ఎదురించడానికో పోరాడారు. సమ్మెలు చేశారు. ఔనా? కాదా?’’ సత్యం కంఠం అలలు అలలుగా - కార్మికులు - ‘‘పోరాడుతాం’’ పోరాడుతాం’’ అరుస్తున్నారు. మొట్టమొదటి సారిగా - తమనాయకులను బేషరుతుగా విడిపించుకోవడం కోసం మూడు డివిజన్లలో రాజకీయ సమ్మెకు సింగరేణి కార్మికులు సైరన్ మోగించారు...విప్లవ కార్మిక వర్గానికి జేజేలు...’’ సత్యం పోలీసు కాల్పులపై న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలి.
‘‘భూస్వామిక ధౌర్జన్యం’’
‘‘నశించాలి’’ అలలు అలలుగా నాలుగు కిలోమీటర్లు ఊరు ఊరంతా నినాదం చుట్టి వచ్చేలాగునా నినాదాలు...
‘‘దొరల జులుం’’
‘‘నశించాలి’’
‘‘సింగరేణి యాజమాన్యం జులుం’’
‘‘నశించాలి’’
‘‘కార్మికుల హక్కులు’’
‘‘వర్దిల్లాలి’’
‘‘లోడింగు కార్మికులను’’
‘‘బదిలీ పిల్లర్లుగా తీసుకోవాలి’’
సత్యం గొంతు కీచు గొంతుగా మారింది.
శంకర్ వేదిక నెక్కాడు... మైకు చేతిలోకి తీసుకున్నాడు. అందరికి లాల్‍సలామ్ చెప్పిండు.
‘‘కార్మికుల, కర్షకుల ఐఖ్యత’’
‘‘వర్దిల్లాలి’’
‘‘పోరాడితే పోయేదేమిలేదు’’
‘‘బానిస సంకెళ్లు తప్ప’’
‘‘ప్రపంచ కార్మికులారా’’
‘‘ఏకం కండి ’’
‘‘కరీంనగర్ ఆదిలాబాదు రైతాంగ పోరాటాలు’’
‘‘వర్దిల్లాలి’’
‘‘వర్దిల్లాలి వర్దిల్లాలి’’
‘‘గిరిజన రైతాంగ పోరాటాలు’’
‘‘వర్దిల్లాలి’’
‘‘కామ్రేడ్ గంగాధర్‍ను’’
‘‘వెంటనే బేషరుతుగా విడుదల చేయాలి’’
‘‘కామ్రేడ్ షరీప్‍ను’’
‘‘వెంటనే బేషరుతుగా విడుదల చేయాలి’’
‘‘కామ్రేడ్ శంకరన్నను’’
‘‘వెంటనే బేషరుతుగా విడుదల చేయాలి’’
కార్మికులు పెద్ద పెట్టున ‘‘బావయో బంగారయ్యను’’
‘‘వెంటనే బేషరుతుగా విడుదల చేయాలి’’
‘‘కామ్రేడ్ రెహనక్కను’’
‘‘వెంటనే బేషరుతుగా వదిలి పెట్టాలి’’
‘‘కామ్రేడ్ సరితక్కను’’
‘‘వొదిలి పెట్టాలి’’
‘‘అక్రమంగా అరెస్టు చేసిన వాళ్లందరిని’’
‘‘బేషరుతుగా విడుదల చేయాలి’’
నాలుగు కిలోమీటర్లు రోడ్డు మీద నిప్పులాగా మండుతున్న కార్మికులను ఏమి చేయాలో తెలియక పోలీసులు దారిలో ముందుకు పోవడానికి లేక ఎక్కడి కక్కడే ఆగిపోయారు...
అప్పుడు మొగిలి కాళ్లకు గజ్జెలు, ఎడం భూజం మీద గొంగడితో వేదికెక్కాడు. అతని పక్క శంకర్ ఎర్రజెండా పట్టుకొని నిలుచున్నాడు...మరో అయిదుగురు దోవతులు కట్టుకొని అతని పక్క చేరారు. డోలు, కంజీర మోగాయి పంబాల గురవయ్య తన జెమిడికతో వేదిక నెక్కాడు.
‘‘లాల్‍సలామ్...లాల్‍సలామ్’’ మొగిలి కంఠం సైరన్‍లాగా మోగింది. పాట సాగుతోంది...అలలు అలలుగా మారుమోగుతోంది. జమిడికే కార్మికుల నరాలు పీకి వాయించినట్లుగా మైకుల్లో నుండి లౌడు స్పీకార్ల గుండా కార్మికుల్లోకి ప్రవహిస్తోంది.
‘‘ఎర్రజెండెర్రజెండెన్నియాలో...’’
‘‘భళే...భళే...’’ గుడ్లెర్ర జేశాడు. మొగిలి పాటయిపోయింది.
కార్మికులు బావయో బంగారయ్య పాడుమన్నారు
‘‘కార్మికులారా! ఆ పాట మా అన్న శంకరన్న తీర్గపాడలేను. క్షమించాలి... మన నిరవధిక సమ్మెతోటి కామ్రేడ్ శంకరన్న విడుదల అయిన తరువాత ఆయనతో పాటు పాడుతాను. మొట్ట మొదటి సారిగా పాడుతన్న..కోపంతోటి, దు:ఖంతోటి పాడ్తన్న మన్నించాలి - కొత్తపాట మన పోరాటాలు ఎట్ల నడుస్తున్నయో? ఇది జమిడికె పాట - కామ్రేడ్ పంబాల గురువన్న జమిడికె చూసిండ్లుగదా! గిది జమిడికె పాట.
జమిడికె వాయించిండు. ఒక్కడే కార్మికుల నరాలు తెంపి జమిడికెకు కట్టి వాయించినట్టుగా గురువయ్య కనిగుడ్లు తిప్పిండు. మీసాలు వడిపెట్టిండు.ముందటికి దునికిండు మొగిలి పాటెత్తుకున్నాడు.
అరె దండు గదిలిందిరా! జంబాయిరే
ఎర్ర దండు గదిలిందిరా! జంబాయిరే
కార్మికులు అందుకున్నారు జంబాయిరే - జంబాయిరే... జంబాయిరే కార్మికులకంరాలన్ని జమిడికె మోతతో మోగుతున్నాయి...
మొగిలి చరణం అందుకున్నాడు.
తాతల నాటినుంచి - తన్నులు గుద్దులే
గురువ్వయ్య కోరస్ ఇచ్చిండు. తన్నులు గుద్దులే జమిడికె వాయించిండు.
తలెముంత గంజికి - తంగెళ్లు బీకిండ్లు
‘‘తంగెళ్లు బీకిండ్లు’’ స్టేజీమీది అందరు.
దొరల సెప్పుల కింద పేదోళ్ల బతుకులు
‘‘పేదొళ్ల బతుకులు - పేదోళ్లబతుకులు
అరె ఊరు గదిలిందిరా - జంబాయిరే
మద్దునూరు గదిలిందిరా జంబాయిరే..
కార్మికులు మొత్తం ఊగిపోతండ్లు - ఉరిమినట్టుగా జమిడికె మోగింది.
దొరల కామానికి రాజేశ్శరి బలి
వాళ్ల కావలికొరకు - పోలీసు సర్కారు
ఆడోళ్లు లేచిండ్లు - కోపానికచ్చిండ్లు
తూటాలు పేలినా -కోటయైనిలిసిండ్లు
లొల్లి లేసిందిరా జంబాయిరే
బేల్లం పల్లి పూసిందిరా జంబాయిరే...
జంబాయిరే - జంబాయిరే - జంబాయిరే
ఆ మందిలో నిలబడ్డారు వాళ్లకు తెలియకుండానే రాజేశ్వరి, లక్ష్మి కుడికాలు ఎగరేస్తూ - కుడి చెయ్యి ఊపుతూ పాడుతున్నారు.
దొరల మేపేందుకు లోడరోల్లుబలి
వారికావలి కొరకు - పోలీసు సర్కారు
లోడర్లు లేసిండ్లు - దొర టాకీసుకాలింది
బ్రాండి షాపులన్ని - బద్దలైపోయినయ్
బద్దలైపోయినయ్ - బద్దలైపోయినయ్
తూటాలు పేలినయ్ - ఒరిగిరి లేబరు
ఒరిగిన లేబరుకు - అన్నలు పానమై నిల్సిండ్లు
దొంగ నాయకులంతా - ఒక్కటైపోయిండ్లు
నాయకులందరిని - అరెస్టుచేసిండ్లు
అరె సమ్మె పెట్టిందిరా - జుంబాయిరే
నిరవధిక సమ్మె లేసిందిరా జంబాయిరే...
సింగరేణి అంతా జంబాయిరే
చిచ్చురేగిందిర - జంబాయిరే
కార్మికులంతా ఎవరికి వారే పాడుతున్నారు కొత్త కొత్త చరణాలు కలుపు తున్నారు. రోడ్డు పాటైయింది...అలలు అలలుగా – పాట కార్మికులల్లో కలిసి మోగింది.
‘‘నూతన ప్రజాస్వామిక విప్లవం’’ మొగిలి...
‘‘వర్దిల్లాలి...’’
పాట నినాదం అలలుగా అటు మహారాష్ట్ర నాగపూర్ మీదుగా ఢిల్లీ వెళ్లేరోడ్డు, ఇటు హైదరాబాదు, సిర్వొంచ మూడు దారులకూడలిలో - పాట - నినాదం మారు మోగుతోంది....
ఆ తరువాత ‘బీదలపాట్లు’ నాటకం సింగరేణి పరిస్థితుల మీద వేసిండ్లు. అది నృత్య రూపకం. మధ్యలో చాలా పాటలు.
ఉరుములు మెరుపులు గాలి దుమారం. మధ్యలో రెండుసార్లు లైట్లు పోయినయి. స్టేజి దగ్గర జనరేటరు నడిపిచ్చిండ్లు. అట్లా రాత్రి పదకొండు గంటలదాకా మీటింగు నడిచింది.
మొట్టమొదటి సారిగా - వేలాది మంది. సింగరేణి కార్మికులు వివిధ డివిజన్ల కార్మికులు - ఒక్క దగ్గర జమైండ్లు. ఒక్కొక్కరికి మీటింగులో చెప్పిన బాధలన్నీ తెలుసు. కాని అవి అంతే అనుకున్నారు. అవి మారేవి కావు అనుకున్నారు. ఎవరికి వారే విడివిడిగా ఉన్న కార్మికులు, పల్లెల నుండి, రకరకాల అణిచివేతల నుండి కాలేరికి వచ్చిన కార్మికులు - కాలేరికి వచ్చిన తరువాత ఇక్కడి - జిత్తులమారి జీవితంలో చిక్కుపడి పోయిండ్లు. దాని కొస మొదలు తెలువక గింజుకున్నారు అంటూ పల్లె నొదిలిన ఫికరు, బెంగ, ఇక్కడ అలవిగాని బతుకు. ఊపిరి సలపక ఉడికి పోయిండ్లు. తాగిండ్లు. పెండ్లాలను కొట్టిండ్లు. దీనికి మూలమెక్కడో - తమను ఆడిస్తున్న వాళ్లెవరో కొద్దికొద్దిగా తెలుస్తోంది.
(అయిపోయింది)