సాహిత్య వ్యాసాలు

(January,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

 మరాఠీ రచయిత్రుల ఆత్మకథలు

                                                                       మరాఠీ మూలం : పు. ద. హాతకణగతీకర   

                                                                             కన్నడానువాదం: చంద్రకాంత పోకళె

                                                                                            తెలుగు : ఘట్టమరాజు

            కొన్నేళ్ళ నుంచి మరాఠీలో మహిళల ఆత్మకథలు విరివిగా వెలువడుతున్నాయి. ఈ పరంపర దళిత ఆత్మకథలతో మొదలైంది. హైందవ సమాజంలో స్త్రీకూడా దళిత వర్గానికి చెందిందే అనే ఒక వాదం వుంది. అలా అని స్త్రీల ఆత్మకథలన్నీ పీడిత వర్గాల వాళ్ల కథలని చెప్పలేం. యాభై అరవై ఏళ్ల క్రిందట ఐదో పదో మహిళా ఆత్మకథలు మాత్రమే లభించేవి. లక్ష్మీబాయి తిలక్, రమాబాయి రానడేల స్వీయ చరిత్రలు తప్పితే మూడో ఆత్మకథ అగుపించేది కాదు. తర్వాత నర్సు సుందరాబాయి ఆత్మకథ మాత్రమే జ్ఞప్తికి వచ్చేది. 1940-45 మధ్యకాలంలో నే నా పుస్తకాన్ని చదివాను. సుందరబాయి రోగులకు సేవ చేసే సమయంలో అనుభవించిన వేదన మనోవ్యథ, అవమానాలూ, అవహేళనలు గుండెల్ని పిండివేసేవి. పురుషస్వామ్యయుగంలో స్త్రీలు ఎన్నో వెక్కిరింతలు, వేదనలకు గురవుతారన్న సంగతి నాకు అప్పుడే తెలిసి వచ్చింది.

            స్త్రీలు వ్యక్తిగత గౌరవాదరాల్ని కాపాడుకోలేని దుస్థితి దాపురిస్తున్నదన్న విషయం కూడా నాకు అప్పుడే బోధపడింది. ఇలాంటి వెన్నో బాధల గాథలు నాకు మహిళల ఆత్మకథల్లో తారసిల్లాయి. నన్ను వేదనకు గురి చేశాయి కూడా. తర్వాతి యాభై ఏళ్ల అవధిలో వెలువడ్డ ఆత్మకథల్లో ఇలాంటి ఎన్నో సన్ని వేశాలూ, సందర్భాలూ కనపడ్డాయి. క్రమక్రమంగా స్త్రీలు సంఘంలో గౌరవ ప్రతిష్టలు గడిస్తూ, తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకో గలిగారనీ, అధికార, బాధ్యతాయుత పదవులు పొంద గలిగారన్న విశ్వాసం కలిగింది. సమాజంలో పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమానమైన హక్కులు ఇవ్వాలన్న చట్టాలు రావడం వల్ల వనితలకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభించసాగాయి. మహిళలు ఎన్నో రంగాల్లో కృషి చేయగలిగారు. గౌరవ మర్యాదలు పొందగలిగారు. ఇలా మహిళల ఆత్మకథల్లో వైవిధ్యం, వైశాల్యాలు వ్యక్తం కాసాగాయి. ఇవి చర్చనీయాంశాలు అయ్యాయి కూడా. మాధవి దేశాయి ఆత్మకథ ‘నాచ గె ఘమా’ (ఆడవే ఆటబొమ్మా) సునీతాబాయి ‘ఆహేమనోహరతరి’ (ఎంత్తసొగసుకత్తెఐనా) ఇటీవల పెద్ద చర్చకు గురైన కమలా పాధ్యే ‘బంధ – అనుబంధ’ (బంధం- అనుబంధం) ఆత్మకథలు, ఆ రచయిత్రుల భర్తలు ప్రసిద్ధ సాహిత్యవేత్తలు కావడం కూడా అవి సాహిత్య ప్రపంచంలోసంచలనం సృష్టించడానికి కారణాలని చెప్పొచ్చు. పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న రచయితల జీవిత విశేషాల గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఉబలాటం పాఠక మహాశయులకు వుండటం సామాన్యమే కదా! ఆత్మకథల్లో రచయితల, రచయిత్రుల ఆత్మ నివేదనం వుండనే వుంటుంది. అలాగే వాళ్లు తమను లోతుగా విశ్లేషించుకొని, సమర్థించుకోవడమూ కద్దు. ఈ అభిప్రాయంతో అందరూ ఏకీభవించక పోవచ్చు. అందువల్ల ఈ అభిప్రాయం సరైనదనీ, కాదనీ నిఖార్సుగా చెప్పడం కుదరదు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఇలా అనొచ్చు. ఆత్మకథల్లో కటు సత్యం వుండదు. వ్యక్తిగత జీవితంలోని పచ్చినిజాల్ని ఇతరులకు చెప్పడం సాధ్యమా? ఈ విషయం గురించి తగినంత చర్చ ఇంకా జరగలేదు. కాని ఏదైనా ఓ వరిష్టమైన ఆత్మకథను పనికి మాలిన దనో, నాసిరకందనో నిరూపించదలచుకొన్నప్పుడు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఆ వ్యక్తి (ఆత్మకథారచయిత్రి) జీవితం లోని కటు సత్యం ఇదేనని నిరూపించడం విమర్శకులకు సాధ్యం కాని పని. విమర్శకుడు తన వాదాన్ని బలపరుచుకొనేందుకు లేదా సమర్థించు కొనేందుకు కొన్ని ఆధారాల్ని సూచించినా అతను నెగ్గుకు రాలేక పోతాడు. ఆత్మకథలు సత్యాన్ని కనుగొనే లేదా వెతికేందుకు చేసిన కొన్ని ప్రయోగాలు మాత్రమే అని భావిస్తే, ఏ సమస్యా వుండదు. ఇతరుల జీవితం గురించి అంతిమ నిర్ణయం తమదే అని భావిస్తే, అది తప్పే.

            ఇటీవల మాధవీ దేశాయి ఆత్మకథ ‘నాచ గె ఘమా’ మరాఠీ సాహిత్య ప్రపంచంలో అల్లోలకల్లోలం సృష్టించింది. స్త్రీవాద హుంకారం ప్రతిధ్వనించిన మొట్ట మొదటి మరాఠీ మహిళా ఆత్మకథ ఇదే. ఈ పుస్తకం రెండు భిన్న సంస్కృతుల మిశ్రణం బానదాని శ్రీమంత జమిందారీ కుటుంబానికి చెందిన వ్యక్తి, సమాజంలో పేరు ప్రతిష్ఠలు గల రచయిత. అతని రెండవ భార్యగా వచ్చి, ఆ కుటుంబం సరి సంపదలు, ఆచార వ్యవహారాలు, పెత్తందారీ విధానాల్ని ఎదిరించే ధైర్యం లేని ఓ మహిళ కరుణా కథ ఈ స్వీయచరిత్ర. ఆమె తన భర్తతో కలిసి వేరే కాపురం పెట్టాలని ఆశించినా, విఫలమైంది. ఆమె ముగ్ధతకు సంతోషించి ఆమెను రెండవ భార్యగా స్వీకరించి, ఆ గర్భ శ్రీమంతమైన అత్తవారింట్లో ఆమె సమస్యలకు పరిష్కారం కలిగించలేని భర్త నిస్సహాయకత – ఇవన్నీ ‘నాచగె ఘమా’ ఆత్మకథలో శక్తిమంతంగా చిత్రించబడ్డాయి. రచయిత్రి మాధవీ దేశాయి తన వాదాన్ని సమర్థవంతంగా పాఠకుల ముందుంచింది. పుట్టింటి వాతావరణం, సంప్రదాయాలు, నమ్మకాలు, ఆశయాలు – ఆచరణలు వీటి మధ్య స్వతంత్రమైన ఆధునిక భావాలతో ముందడుగు వేస్తున్న ఓ నవయువతి వూపిరాడని అత్తింటి కాపురంలో ఎలా విలవిలలాడి పోయిందో మాధవీ దేశాయి హృదయానికి హత్తుకునేలా చిత్రించారు. శక్తిసామర్థ్యాల్ని కూడగట్టుకోకుండా, ఈ బంధనాల నుంచి విముక్తి పొందడమెలా అన్నదే రచయిత్రి పాఠకుల ముందుంచిన ప్రశ్న.

            ఆత్మకథ ఆత్మపరిశీలన, ఆత్మ విమర్శ చేసుకునే ఓ సాహిత్య ప్రక్రియ అన్న మాట  వాస్తవమే. కొన్ని స్వీయచరిత్రల్ని చదివినప్పుడు మనకు అలా అనిపించడమూ నిజమే. ఆత్మకథలో ప్రత్యేక వ్యక్తిత్వం, తప్పులు, మోసం, దగాలకు లోనైన వైనం వివరంగా రచయిత్రి చెప్పివుంటారు. రచయిత తాను సౌందర్యానికి మోహితుడై, పెళ్లాడిన నేపథ్యాన్ని తన దృష్టిలో వివరిస్తాడు. అతను కూడా నిజాయితీగా, ప్రామాణికంగా తన వాదాన్ని ప్రతిపాదించడమూ కద్దు. రచయిత్రుల ఈ ఆత్మ పరిశీలన, మనోవైజ్ఞానిక అంశాల తైపారును మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సి వుంటుంది.

            నేను పైన కొన్ని పాఠకుల ఆదరణ పొందిన, చర్చలకు గురైన మహిళల కొన్ని ఆత్మకథల్ని ప్రస్తావించాను. వాటిని సంక్షిప్తంగా చెప్పడం సముచితం అని భావిస్తాను. ‘ఆహే మనోహరతరి’ (ఎంత సొగసుకత్తెఐనా) ఆత్మకథ రచయిత్రి (శ్రీమతి సునీతా బాయి. ఈమె ప్రసిద్ధ నాటక కారుడు, కళాకారుడు ఐన పు.ల. దేశపాండే భార్య. ఈమె వేలాది పాఠకుల మెప్పు పొందిన రచయిత్రి. ఈమె సమాజవాద భావాలు కల కార్యకర్త. తన అభిప్రాయాల్ని జంకుగొంకు లేకుండా, వాడిగా వేడిగా, స్పష్టంగా మౌఖికంగానూ, రచనల ద్వారానూ చెప్పగల దిట్ట. కార్యక్రమాల నిర్వహణలోనూ. సమాజసేవలోనూ నిరతురాలైన మహిళ. భర్త పు.ల. దేశపాండే ఆర్థిక వ్యవహారాల్ని చక్కగా నిర్వహించగలిగిన వ్యవహార చతుర కూడా ఈమె పు. ల. దేశపాండే ట్రస్టు స్థాపించి, దాని నిధుల్ని సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకై సద్వినియోగం చేసిన సేవాతత్పరురాలు. బహుముఖ ప్రతిభావంతుడైన భర్త పు.ల. దేశపాండే వ్యక్తిత్వం గురించి ఈమె తన ఆత్మకథలో ఏమి చెప్పిందో అన్న తహతహ పాఠకులకు వుండింది. ఆత్మకథ పేరు ఎంతో మనోహరంగా వుండటం వల్ల పు. ల. దేశపాండే జీవిత విశేషాల్ని, తెలుసుకోవాలనే ఉత్కంఠ వల్ల ఈ ఆత్మకథ అపారమైన పాఠక వర్గంలో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించింది. కాని ఈ పుస్తకం చదివిన తర్వాత పాఠకుల్లో వున్న ఆసక్తి కాస్తా చల్లబడింది. చప్పబడింది. పురుషాధిక్యం వల్ల స్త్రీకి అన్యాయం జరిగేది సామాన్యమైన విషయం అని భావించిన పాఠకుల అభిప్రాయం తలకిందులయింది. వాళ్లకు ఎంతో నిరాశ కలిగింది కూడా. ఈ ఆత్మకథ లోని పూర్వార్ధం చాలా ఆసక్తికరంగా సాగింది. రచయిత్ర సునీతాబాయి పుట్టిన వూరు, తల్లిదండ్రులు, బంధుబలగం, ఇంటితనం, చిన్నప్పటి మధుర స్మృతులు వగైరా విషయాల్ని రచయిత్రి ఎంతో చక్కగా చిత్రించారు. రచయిత్రి తనలో బాల్యం నుంచి కలిసి స్వాభిమానం, స్వతంత్రమైన భావాలు, అభిప్రాయాలు, దేశభక్తి, సమాజసేవ పట్ల ఆసక్తి, అనురాగం, జ్ఞానతృష్ణ మొదలైన విషయాల్ని ఎంతో కుతూహలం కలిగేలా, చదివించే ఆకర్షణీయమైన శైలిలో రాశారు. తర్వాత ఆమె సేవాదళంలో చేరడం, బొంబాయి ప్రయాణం, అక్కడ గడిపిన గడ్డురోజులు, సమాజ సేవకుల, సహ చరులతో తాను చేసిన చర్చలు, గోష్ఠులు వీటి వివరణ నాటకీయంగా చిత్రించగలిగారు. కాని ఇవి పాఠకుల్ని ప్రభావితం చేయలేక పొయ్యాయి. పు. ల. దేశపాండే పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి, రచనా వ్యాసంగం – ఇవన్నీ వర్ణింపబడ్డాయి ఈ ఆత్మకథలో. భర్త  వ్యవహారంలో సానుభూతి లోపించడం, తనను నిర్లక్ష్యం చేయడం, ఇతరుల కష్టసుఖాల్ని పట్టించుకోక పోవడం, తోడి కళాకారుల ప్రతిభను గుర్తించినా, చిన్న చూపు చూడటం మొదలైన విషయాలన్నీ ఇందులో ప్రస్తావింపబడ్డాయి. అంతేకాదు, రచయిత్రి తానే యింటి బాధ్యతనంతా నెత్తిమీద వేసుకోవడం. భర్త ఆర్థిక వ్యవహారాల్ని చక్కపెట్టడం, భర్త తన్ను లెక్కపెట్టకున్నా, తాను మాత్రం అతన్ని గౌరవంగా చూశానని చెప్పుకోవడం – ఈ విషయాలకే ఈ పుస్తకంలో ప్రాధాన్యం ఇయ్యబడింది. ఈమె చిత్రించిన సంగతులన్నీ అసత్యాలని చెప్పలేం. కాని సమయాసందర్భాల్ని వర్ణించేటప్పుడు రచయిత్రి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్ని విషయాలపై పక్షపాతం చూపించడం మాత్రం క్షమార్హం కాదు. ఈమె కొన్ని సందర్భాల్లో తన భర్తకు ప్రతికూలంగానూ, తనకు అనుకూలంగానూ, రాయడం సమంజసంగా లేదు. ఈ రాతల వల్ల రచయిత్రి సునీతాబాయిపై మెప్పులు కురిసినా, పు.ల. దేశపాండే తన గృహస్థధర్మాన్ని సరిగ్గా నిర్వహించ లేదన్న బాధ దేశపాండే అభిమానులకు కలుగుతుందన్న, సంగతి మరువలేం. పు.ల. దేశపాండే పాఠకులు, అభిమానులు ఎన్నడూ సునీతాబాయికి ఆత్మీయులు కాలేదు. ఈ ఆత్మకథ చదివిన తర్వాత పు.ల. దేశపాండే అభిమానులూ, పాఠకులూ ఉద్రేకానికి లోనయ్యారన్న సంగతి సహజమే. సునీతాబాయి ఆత్మకథకు మరాఠీ సాహిత్య ప్రపంచంలో సకల గౌరవ మర్యాదలు కల్పించేందుకు నానావిధ ప్రయత్నాలూ జరిగాయి. సునీతాబాయి తన వాదనల్ని సమర్థించేందుకని పాశ్చాత్య రచయితల భార్యల, తనకు అనుకూలులైన రచయిత్రుల వ్యాసాల్నీ, కథనాల్ని మరాఠీ పాఠకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు కూడా. మరాఠీ సాహిత్య ప్రపంచంలో కొంత కాలం పాటు అనుకూలంగానూ, ప్రతికూలంగానూ వాదప్రతివాదనలు జరిగి, గొప్ప సంచలనం కలిగిన మాట వాస్తవమే. ఈ రభస వల్ల మరాఠీ సాహిత్య ప్రపంచానికీ, పాఠక సముదాయానికీ ఓ మేలు కూడా జరిగిందన్న సంగతి గమనించదగ్గ విషయం అదే సుమిత్రాబాయి ఆత్మకథ ‘ఆహే మనోహర తరి’ మరాఠీ సాహిత్యానికి ఓ కొత్త  చూపు, ఓ కొత్త వరవడి ప్రసాదించిందన్న సంగతి.

            కమల పాధ్యె గారి ‘బంధ అనుబంధ’ (బంధం – అనుబంధం) ప్రసిద్ధ మరాఠీ రచయిత ప్రభాకర సాధ్యెగారి భార్య ఆత్మకథ. శ్రీ పాధ్యె ‘కాంగ్రెస్ ఫార్ కల్చరల్ ఫ్రీడమ్’ అనే అంతర్జాతీయ సంస్థ  ఆసియాప్రాంత సంచాలకులు ఈయన సగం ప్రపంచం తిరిగి, చూసిన ఘనుడు, ప్రఖ్యాత పత్రికాసంపాదకుడు, వ్యాఖ్యాత, సౌందర్యశాస్త్రవేత్త. సమకాలీన దేశవిదేశ విద్వాంసుల, రాజకీయవేత్తల స్నేహం సంపాదించిన వ్యక్తి. అప్పట్లో ఆయన పెద్ద సదస్సును నిర్వహించాడు. మహారాష్ట్రలో బౌద్ధిక చైతన్యం వ్యాపింపచేయాలనిప్రయత్నించాడు. ఆ సందర్భంలోనే ఆయనకు కమలగారి పరిచయం కలిగింది. కమల పాధ్యె ఆత్మకథలో ప్రభాకర పాధ్యె పరిచితులైన జయప్రకాశ్ నారాయణ్ దంపతులు, రామమనోహర లోహియా, ఎస్. ఎమ్. జోషి, నాథపై, దయాకృష్ణ మొదలైన మహనీయులు జాతీయ స్థాయిలో కలిగించిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక చైతన్యం గురించి తెలుసు కోవచ్చన్న జిజ్ఞాన పాఠకులకు కలిగించి. పాఠకులకు కొంత వరకు వూరట కలిగింది కూడా. కాని రచయిత్రి వుద్దేశ్యం వేరేగా వున్నట్లు తోచింది. ఆమె వేసుకొన్న ప్రణాళిక మొదటి భాగంలో స్త్రీల సమాన హక్కులు, సమాజంలో స్త్రీ భూమిక, అభ్యుదయ దృక్పథం ఇవి ముఖ్యస్థానం ఆక్రమించాయి. ఆత్మకథ మొదటి అధ్యాయం ‘స్పర్శాలు లైంగిక సంవేదనల్ని అణచివేయడం వల్ల కలిగే మానసిక వేదనల్ని రచయిత్రి చిత్రించారు. దీన్ని చదివిన తర్వాత, మరాఠీ సాహిత్య చరిత్రలో ఈ ఆత్మకథ ఓ కొత్త ప్రయోగం కాగలదని నేను ఆశించాను. ఈ అధ్యాయంలో రచయిత్రి కమలా పాధ్యె చింతనాశక్తి, ఆత్మపరిశీలనా దృష్టి చాలా శక్తిమంతంగా వ్యక్తమయ్యాయి. కాని ఆమె నూతన దృక్పథం కొనసాగ లేక పోయింది. మిగతా భాగమంతా పాత పద్ధతి లోనే సాగింది. పాఠకులు ఈ ఆత్మకథకు, రచయిత్రి స్త్రీవాద దృక్పథానికి స్వాగతం పలికారు. శ్రీమతి కమలా పాధ్యె. తన భర్త ప్రభాకర పాధ్యె గుణశీలాల గురించి ధ్వని పూర్వకంగా రాశారు. ఆయన తనను ప్రోత్సహించలేదనీ, పూజారి కూతురి ననీ నన్ను చీటికిమాటికీ హేళన చేసే వారనీ, తనకు ఇంటా బయటా సమాన స్వాతంత్ర్యం ఇవ్వలేదనీ ఆమె అన్నారు. అయితే ఈ ఆత్మకథ పాఠకులకు ఆక్రమణకారి అనిపించలేదు. కాని ఈ పుస్తకం భావప్రకటనలో, అనుభవ నిరూపణలో కొత్త పుంత తొక్కిందని చెప్పొచ్చు. మరాఠీ సాహిత్యంలో ఇక మీదట ఇలాంటి విశేషమైన రచనలు వెలువడగలవన్న అభిప్రాయం పాఠక వర్గానికి, ప్రచురణ సంస్థలకు కలిగింది. కీర్తిశేషుడైన భర్త గురించి భార్య వ్యక్తం చేసిన ఆత్మ నివేదన సంప్రదాయం నెలకొనడం ప్రారంభమయిందనడానికి ఇది సూచన. కొంత వరకు ఇది అవసరమే, తగిందే కాని అది ఒక వేళ సాహిత్యంపై వెలుగు ప్రసరింప చేయలేకపోతే, ఆత్మకథ ప్రక్రియను పటిష్టం చేయలేకపోతే, అది ప్రయోజనకారి కాలేక పోతుంది. దివంగతులైన విద్యాధర పుండలీక గారి పత్ని శ్రీమతి రాగిణిగారు తమ సహజీవనం గురించి ఓ పుస్తకం రాశారు. ఇది ఆమె తొలి రచన. ఇందులో ఈమె తన భర్త వ్యక్తిగత వ్యవహారాల గురించి ఎక్కువగా రాసిందంతే.

            ఆనందీబాయి శిర్కెగారి ‘సాజవాత’ (సాయంకాలపుగాలి) ఆశాలత సావే గారి ‘పానా ఆడచేపూల’ (ఆకుచాటుపువ్వులు) పార్వతీబాయి ఆరవలె గారి ‘మాఘ కహాణి’ (నా కథ) మాలతీబాయి గారి ‘సహవాస’ (సాహసం) మరాఠీ మహిళలు రాసిన మరి కొన్ని ఆత్మకథలు. ఈ రచయిత్రులు తమ ఆత్మకథల్లో మారుతున్న కాలపు పరిస్థితుల్ని చిత్రించారంతే.

            ఈ రచయిత్రుల ఆత్మకథల కంటే ముందు వెలువడ్డ మహిళల స్వీయ చరిత్రల గురించి తెలుసుకొనడం అవసరం. శీలవతితాయి కేత్కర్ గారు విజ్ఞాన సర్వస్వకర్త కేత్కర్ తో గడిపిన జీవితాన్ని ‘మీచ హే సాగితలే ఆహే’ (నేనే ఇది చెప్పాను) చక్కగా నిరూపించారు. డా కేత్కర్ గారు సహృదయులే ఐనా విచిత్రమైన గృహస్థుడు. అతను దత్తత తీసుకున్న కొడుకు అనారోగ్యదశలో వున్నప్పుడు ఎలాంటి అడ్డుచెప్పక సేవ చేసింది. ఆ కాలంలో స్త్రీవాదం, అస్మిత, -లు ఇంకా ఉదయించ లేదని అనాలా? సుధా ఆత్రే గారి ‘గోదా తరంగ’ (గోదా, అల), ఉషా డాంగే (పణ ఐకతో కోణ) (కాని ఎవరు వింటారు), ముక్తా దీక్షిత్ గారి ‘హో తో ప్రచితిచె బోలణె’ (ఆమె అనుభవాలు), లీలాబాయి పట్వర్ధన్ – మాధవ జోలియన్ గారి భార్య రాసిన ‘ఆమచి ఆకరా వర్షే (మా పదకొండేళ్లు)

ఈ ఆత్మకథల్లో ప్రసిద్ధ వ్యక్తులైన భర్తల కరాళ ఛాయల్లో భార్యలు అనుభవించిన హింస, దుఃఖం, వేదనలు శక్తిమంతంగా వ్యక్తమయ్యాయి. పురుషాధిక్య పాలనలో వాళ్లు అనుభవించిన యాతన, నారకీయ జీవితాలు హృదయ స్పర్షిగా చిత్రించబడ్డాయి. పురుషాధిక్యానికి వ్యక్తమైన స్త్రీల ప్రతిక్రియల నేపథ్యంలో మరాఠీ సాహిత్యంలో స్త్రీవాదం రూపుకొనిందని భావించవచ్చు. ఈ సందర్భంలో మరో రెండు మహిళా ఆత్మకథల్ని పేర్కొనడం అవసరమని తోస్తుంది. యమునాతాయి ఖాడిల్ కర్ గారి ‘వటవృక్షాచా ఛాయేత’ (మర్రిచెట్టు నీడలో) సరోజినీ సారంగపాణి గారి ‘దుర్దైవాచి దోన పాథ’ (దురదృష్టం రెండు చేతులు), ఈ రెండు పుస్తకాల్లో పురుషుల పెత్తనంలో నోరు విప్పలేని స్త్రీల బతుకులు, వాళ్లపై ఆరోపింపబడ్డ అనైతిక సంబంధాలు వగైరాల హృదయవిధారక చిత్రణ లభిస్తుంది.

            ఇక దళిత స్త్రీల ఆత్మకథల గురించి పరిశీలిద్దాం. ఇవి చాలా తక్కువగా వెలువడ్డాయి. దళిత స్త్రీలు అనుభవించే కష్టాలు, ఇతర కులాల మహిళల బాధల కంటె భిన్నమైనవి. మొగుళ్ల దౌర్జన్యం, వ్యసనాలు, సోమరితనం, పగలు రాత్రి పని చేయాల్సిన అవసరం, పిల్లల బరువు బాధ్యతలు, వాళ్ల అనారోగ్యం- లెక్కలేనన్ని కష్టాలమయం దళిత స్త్రీల జీవితం. వీళ్ల జీవితాలు – దళితేతరులకు ‘షాక్’ తినిపించాయి. దళిత స్త్రీల దురవస్థ, పాఠకులకు మొట్టమొదటి సారిగా కానవచ్చింది. బేబి కాంబళె బతుకు మన లాంటిదే. కాని శాంతాబాయి కాంబళె (ప్రొఫెసర్. అరుణ కాంబళె గారి తల్లి) రాసిన ఆత్మకథ మాఝా జన్మాచి చిత్తర కథా (నా జీవితపు బొమ్మలాటకథ) కాస్త భిన్నమైనది. శాంతాబాయి కష్టాల-కడగండ్ల పాలైనా, కొంత కాలం తర్వాత ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసిన పరిస్థితుల్ని తెలియచేస్తుంది. ఈ పుస్తకం సాహిత్య స్పర్శతో, హృదయానికి హత్తుకునేలా రాయబడినందువల్ల విశాల పాఠక సముదాయాన్ని ఆకర్షించగలిగింది. పైగా ‘దూరదర్శన్’ లో ప్రసారం చేయబడి నందువల్ల పాఠకులకు, ప్రేక్షకులకు మరింత దగ్గర కాగలిగింది ఈ ఆత్మకథ. బేబి కాంబళె ఆత్మకథ సొంత అనుభవం మీద ఆధారపడ్డ రచన. వేలాదిమంది పాఠకుల్ని ఆకర్షించగల దళిత స్త్రీల ఆత్మకథలు వెలువడాల్సిన ఆవశ్యకత వుంది. ఈ సందర్భంలో శ్రీమతి మల్లికా అమరశేఖర్ ఆత్మకథ ‘ఉధ్వస్త వయాచి ఆహే మలా ( చితికిన నా బతుకు) శీర్షిక లాగానే గొప్ప సంకలనం కలిగించే, ప్రభావకారియైన రచన. ఆమె కవయిత్రి కూడా. ఆమె శైలి కూడా విశిష్టమైనది. పురుషుల దర్పం, ప్రవర్తన, స్త్రీవాద భూమిక, తరతరాలుగా కొనసాగుతున్న కట్టుబాట్లు, ఆర్థిక సమస్యలు, వీటివల్ల దాపురించిన మానసిక ఆందోళనలు ఈ ఆత్మకథల్లో మనస్సుకు హత్తుకునేలా చిత్రింపబడ్డాయి.

            మన మిప్పుడు సినిమా, నాటక రంగాల్లో పని చేస్తున్న మహిళలు రాసిన ఆత్మకథల వైపు దృష్టి సారిద్దాం. ఇలాంటి స్వీయ చరిత్రలకు ఇటీవల గొప్ప ప్రచారం లభిస్తోంది. పేరు ప్రసిద్ధులు కూడా బాగా దొరుకుతున్నాయి. వీటిని రాసి పెట్టడానికి చెయ్యి తిరిగిన రచయితలు కూడా తెరమీదికి వస్తున్నారు. ఇలాంటి ‘ఘోస్టు రైటర్స్’ పాశ్చాత్య దేశాల్లో చాలా కాలం నుంచి వుంటున్నారు. కాని మనదేశంలో వీళ్లు కొంత కాలం కిందటే అవతరించారు. ఇలాంటి రచయితలు మన దేశంలో తక్కువే అనుకోండి.మరాఠీలో‘ఘోస్టు రైటర్స్’ సృష్టించిన మహిళల ఆత్మకథలు ఏ వొకటి రెండో వున్నాయి. వీటికంటె ముందు మరో రకమైన ఆత్మకథల గురించి తెలుసుకోవాలి. ఉన్నత వర్గాల్లోని కొందరు స్త్రీలు వివాహబంధంలో చిక్కుకోకుండా తమకు నచ్చిన పురుషునితో సహజీవనం చేస్తూ వుంటారు. ఆనందిబాయి విజాపురై రాసిన ‘అజుని చాలతేచవాట’ (ఈ దినానికీ నడుస్తున్న బాట) లో స్త్రీ పురుషుల స్వతంత్ర సహజీవితం గురించి వర్ణింపబడింది. రచయిత్రిలో పాపం లేదా తప్పు చేస్తున్నావనే స్పృహ లేకుండా తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా, ధైర్యంగా, దాపరికం లేకుండా ఆనందిబాయి విజాపురె తమ అభిప్రాయాలు, భావాలు వెల్లడించారు. మరాఠీ నాటక రంగంలో నటించే స్త్రీల గుణశీలాల గురించి తరతరాలుగా వినవస్తున్న వ్యాఖ్యలు, టీకలు ఇంకా మాసిపోలేదు. శాంతాఆప్టే స్వీయచరిత్ర ‘జావు మీ సినేమాత’ (నేను సినిమాలో పోయేదాన్ని) 1940 లో వెలువడినప్పటి నుంచి రంగస్థల నటీమణుల గుణ శీలాల గురించి వూహాపోహలూ, వూహాగానాలు, నిందలు- ఆరోపణలు సంఘంలో మొదలయ్యాయి. శాంతాఆప్టే తన నటజీవితంలో ఎన్నో ఆటుపోట్లని ధైర్యంగా ఎదుర్కొనగలిగింది. ఆమె నిర్భీకత, స్వతంత్ర వ్యక్తిత్వం ఈ పుస్తకంలో చక్కగా వ్యక్తమయింది. హంసా వాడ్ కర్ ఆత్మకథ ‘సాంగతే ఐకా’ (చెప్తాను వినండి) 1970లో అచ్చయింది. ఈ స్వీయ చరిత్రలో వ్యక్తమైన ఆమె స్వతంత్ర భావాలు మరాఠీ సాహిత్యంలోఅల్లకల్లోలం సృష్టించాయి. ఈమె చదువుసంధ్యలు లేనిదైనా, సంస్కార వంతురాలు, గుణవంతురాలు, మంచి అభినేత్రి కూడా. ఎంతో మంది వ్యసన పరులైన పురుషుల మధ్య బతుకుతూ, అడకత్తెరలో చిక్కిన పోక చెక్క వలె దురవస్ధలు పడుతూ ఆమె ఆ అగ్ని జ్వాలల్లోంచి బయట పడిన వైనం ఈ పుస్తకంలో మనం గమనించవచ్చు. హంసా వాడ్ కర్ నిర్భయంగా, నిస్సంకోచంగా తన అనుభవాలు, అవస్థలు వాడిగా వేడిగా, వెల్లడించడం వల్ల ఈ పుస్తకం గొప్ప సంచలనమే కలిగించింది. ఇవే కాక స్నేహ ప్రభా ప్రధాన్ ఆత్మకథ ‘స్నేహాణిత’ (స్నేహబంధం), లీలా చిట్నీస్ రాసిన ‘చందేరి దునియేత’ (వెండితెర ప్రపంచంలో)  ఆత్మకథలు కూడా పేర్కొనదగినవే. తర్వాత చాలా మంది సినిమా నటీమణులు తమ తమ అనుభవాల్ని వెల్లడిస్తూ రాయడం వల్ల మహిళల ఆత్మకథల సంఖ్య పెరుగసాగింది.

            మరాఠీ, హిందీ సినిమాల్లో నటించి పేరు ప్రసిద్ధులు గడించిన దుర్గాఖోటె ఆత్మకథ విశిష్టమైనది. ఈమె చారిత్రక, సాంఘిక చలన చిత్రాల్లో ప్రధాన పాత్ర ధరించిన అభినయ విశారద. ఆమె పేరు మోసిన నటులతో, దర్శకులతో, నిర్మాతలతో తనకు గల పరిచయం, వాళ్ల నుంచి తాను నేర్చుకున్న పాఠాలు, మరాఠీ సినిమా పుట్టుక, ప్రగతి, వికాసాల గురించి తన ఆత్మకథలో చాలా విషయాలు చెప్పింది. సమకాలీన చలన చిత్ర కళాకారుల జీవిత విశేషాలు, సినిమారంగ అనుభవాలు, బొంబాయి నగర జీవితం, కుటుంబ నిర్వహణ మొదలైన విషయాలు ఆసక్తిదాయకంగా వెల్లడించారు. ఈ ఆత్మకథలో మరాఠీ మహిళల ఆత్మకథల్లో ఇదొక శ్రేష్ఠమైన రచన.

            ఈ వ్యాసం సంక్షిప్తమైనది. అందువల్ల ఎన్నో మహిళల ఆత్మకథల గురించి ప్రస్తావించలేక పొయ్యాను. గోదావరీ బాయి పరుళేకర్ గారి ‘జెహ్యా మణ్ణూస జాగా హోతో’ (మనిషి మేల్కున్నప్పుడు)

అనుతాయి వాఘెయ గారి’ కోస బాడచ్సా టెకడి వర్ణ’ (కొసవాడ కొండ దృశ్యాలు) ఈ స్వీయ చరిత్రలు సామాజిక స్పృహతో కూడుకొన్న ఆత్మనివేదనా పరమైన రచనలు. ఇలా సామాజిక దృక్పథం వెల్లడించే మహిళల ఆత్మకథలు మరాఠీలో మరింత ఎక్కువ సంఖ్యలో రాగల అవకాశముంది ఇది నిజంగా సంతోషదాయకమైన సంగతి.

            (కన్నడ మాసపత్రిక ‘హోసతు’) కొత్త- మార్చి 2001 సంచిక నుండి అనువదించబడింది.)

 

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు