సాహిత్య వ్యాసాలు

(February,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర - 21 

పోతం జానకమ్మ( POTHUM JANAKUMMAH , అప్పటి కాలపు స్పెలింగ్ ఇది )  1873 జులై 29 నుండి    1874 ఫిబ్రవరి 1 వరకు చేసిన ఇంగ్లండ్  యాత్రాకాలపు అనుభవాల , పరిశీలనల , ప్రభావాల కథనం 1875 లో ప్రచురించిన ‘పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్’ .  ఈ  పుస్తకంలో పన్నెండు చాఫ్టర్లు ఉన్నాయి.

 శ్రీ ఆంధ్ర భాషా సంజీవిని ( Sriandrabhashasunjivini అని పుస్తకంలో ఉంది.)  పత్రికలో జానకమ్మ లేఖ గా వ్రాసిన యాత్రా సంబంధి రచనకు ‘ఎథినీయం అండ్ డైలీ న్యూస్’ పత్రిక( 1874  ఏప్రిల్ 15) పత్రిక ప్రచురించిన ఇంగ్లీషు అనువాదం ,దానిపై విపుల   సమీక్షతో సహా మొదటి చాప్టర్ లో ఉంది. దేశీయ దురభిమానాన్ని అధిగమించగలిగిన జానకమ్మ ఉదార బుద్ధి ని,  నిర్భయతను,  తనదేశం మూర్ఖమైన పిరికితనాన్ని వదిలేసి ఇతరదేశాలు సంపాదించిన వైజ్ఞానిక కళావిషయ జ్ఞాన సముపార్జనకు ప్రయత్నాలు చేయాలని  ఆశించిన విశాల దృష్టిని,  ప్రశంసించింది ఆసమీక్ష.

కలకత్తా నుండి సుయెజ్ కెనాల్ మీదుగా సౌతాంప్టన్ వెళ్తున్న  స్టీమర్ లో ప్రయాణ కాలం పూర్తిగా ఒక నెల. తిరుగు ప్రయాణం నెల. ఈ ప్రయాణ కాలపు అనుభవ కథనాన్ని  ఇక  ఆమె ఇంగ్లండ్ లో ఉన్న  నాలుగు నెలల అనుభవ కథనాన్ని విడివిడిగా పరిశీలిస్తే జానకమ్మ వ్యక్తిత్వం దృక్పథం అర్ధం అవుతాయి.

                                             1

ఈ యాత్రా చరిత్రలో రెండవ చాప్టర్ అంతా సముద్రయానకాల అనుభవ కథనం. ప్రయాణీ కులు ఎక్కువమంది ఐరోపా వాళ్ళే  అయినప్పటికీ దేశీయులకు కూడా వారితో సమానమైన సౌకర్యాలు ఉండటాన్ని ఆమె గుర్తించింది. తోటివాళ్లపట్ల యూరోపియన్లు చూపించే సామాజిక మర్యాద, చొరవ వల్ల ప్రయాణంలో ఒంటరితనం అనేది తన అనుభవానికి రాలేదని కూడా చెప్పింది. యూరోపియన్ల దైనందిన జీవనశైలిని, అలవాట్లను, అభిరుచులను ఆసక్తితో  సన్నిహితంగా పరిశీలిస్తూ ఆరాధనాపూర్వకంగా వాటిని ప్రస్తావించింది.

రోజుకు అయిదుసార్లు తినే యూరోపియన్ ల పద్ధతి, వండి టేబిల్ మీద తినటానికి సిద్ధపరిచే పద్ధతిని వివరిస్తూ టేబిల్స్ ను అలకరించే పద్ధతి, రుచికరమైన వంటలను ఏర్పాటుచేసే పద్ధతి, పండ్లు మొదలైనవి అమర్చే తీరు , తేలివచ్చే వాసనలు ఎవరికైనా ఆ ఆహారం రుచి చూడాలనిపించేట్లు ఉంటుందని అంటుంది. అలా అని  నేను నా కుల నియమాలు ఉల్లంఘించానని అనుకోవద్దు అంటూ తాను  పాలు, వైన్ , పండ్లు మాత్రమే తీసుకొన్నానని  చెప్పింది.  ఆహారానికి సంబంధించిన కుల నియమాల ప్రస్తావను బట్టి జానకమ్మ శెట్టి బలిజ  కులానికి కాక కోమటి కులానికి చెందినదై ఉంటుంది అనుకోవచ్చు.

భోజనాల సమయంలో బల్లల దగ్గర కూర్చొని తింటూ స్త్రీపురుషులు రకరకాల విషయాల మీద మాట్లాడుకొంటూ మూడు నాలుగు గంటలు గడపటం, సంగీతం వచ్చినవాళ్లు పియానో వాయిస్తూ పాడటం  చప్పట్లతో , నవ్వులతో శ్రోతలు వాళ్లకు అభినందనలు చెప్పటం అవన్నీ ఆమెకు నచ్చాయి.  మిగిలిన సమయంలో డెక్ మీదకు వెళ్లి సముద్రపు గాలి పీలుస్తూనో , పుస్తకాలు చదువుకొంటూనో కాలం గడుపుతారని,  చదువుకొనటానికి స్వల్ప మొత్తానికి పుస్తకాలు అద్దెకిచ్చే వ్యవస్థ కూడా స్టీమర్ లో ఉందని చెప్పింది.  క్షణం వృధా చెయ్యని  యూరోపియన్ల దినచర్య  చూసిన జానకమ్మ ‘టైమ్ ఈస్ మనీ’  (సమయమే  డబ్బు ) అన్న వాళ్ళ తత్వమే అందుకు కారణం అంటుంది.

ఈ ప్రయాణంలో ఆమెను బాగా ఆకర్షించింది ఆలోచింపచేసింది క్రైస్తవం. స్టీమర్ లో ప్రతి ఆదివారం జరిగే క్రెస్తవ మత ప్రార్ధనల గురించి చెప్తూ హోలీ బైబిల్ లోని భాగాలు చదువుతుంటే  అర్ధం హృదయాన్ని తాకుతుందని అంటుంది.  స్టీమర్ లో సంభవించిన ఒక మరణం గురించి చెబుతూ చర్చ్ నుండి పొందిన అధికారంతో మరణించిన వ్యక్తి పట్ల చేయవలసిన కార్యక్రమాన్ని బైబిల్ చదువుతూ కెప్టెన్  నిర్వహించటాన్ని , డాక్టర్ సంతాప ప్రసంగం చేయటాన్ని  ఆ తరువాత శవ పేటికను సముద్రంలోకి జారవిడవటాన్ని గురించి చెప్తూ పురోహితుడు, సంస్కృత మంత్రాలు అవసరంలేని ఆ కార్యక్రమంలోని సారళ్యం తనకు నచ్చింది అని చెప్పింది. అందరికీ అర్ధమై  భాషా సారళ్యం , హృదయానికి తాకే సౌందర్యం , ఆర్ద్రీభూతం చేయగల  సత్తా ఉన్న క్రైస్తవ ప్రార్ధనల వంటివి  హిందువులకు లేకపోవటం గురించి విచారపడింది. ఇది మనం కూడా అలవరచు కొన వలసిన విధానం అంటుంది. ఇలా అన్నానని క్రైస్తవాన్ని ప్రచారం చేస్తున్నాని అనుకోవద్దు, పరిస్థితులు , అవసరాలు ఆ అవగాహనను కలిగించాయి అని చెప్పింది. త్వరలో మన మంత్రాలను కూడా అందరికీ తెలిసే భాషలోకి అనువాదం చేసే రోజు వస్తుందని ఆశాభావం కూడా ప్రకటిస్తుంది.

బైబిల్ గురించిన అవగాహనా కూడా ఆమెకు బాగానే ఉంది. ఎఱ్ఱసముద్రం గుండా ప్రయాణం సాగుతున్నప్పుడు  ఆ  పేరు ఎలా వచ్చిందో సూచించే కథనాలు బైబిల్ లో ఉన్నాయని చెప్పటం అందుకు నిదర్శనం.ఈ ప్రయాణంలోనే ఒక నెలరోజులలోనే క్రైస్తవం పట్ల ఇంత ఆరాధన, బైబిల్ విషయాలపట్ల ఇంత అవగాహన కలగటం సాధ్యకాదు. మద్రాస్ లో కులీన వ్యాపారవర్గ స్త్రీగా పాలకవర్గాల మతం తో మెలగవలసిన పరిస్థితులు, అవసరాలు అందుకు దోహదం చేశాయి అన్నది స్పష్టం.  

ఈ ప్రయాణంలో మూడు సందర్భాలలో  బ్రిటిష్ పాలకుల పట్ల జానకమ్మ  గౌరవాభిమానాలు వ్యక్తమయ్యాయి.శ్రీలంక నుండి బయలుదేరి ఎడెన్ దిశగా స్టీమర్ పోతుండగా జబ్బు పడి   కలకత్తానుండి స్వస్థలానికి ఒంటరిగా బయలుదేరిన ఒక   యూరోపియన్ ప్రయాణీకుడు మరణించాడు. దానికి  సానుభూతితో స్పందిస్తూ  ప్రభుత్వ ఉద్యోగులుగా యూరప్ నుండి తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి భారతదేశానికి రాగలిగిన వాళ్ళ ధైర్యాన్ని.  యువకులైనా, వయసుమీరిన వాళ్ళైనా ఒకేరకం ఉత్సాహంతో  పనిచేస్తున్న తీరును మెచ్చుకొన్నది.

 సముద్రంలో ప్రయాణిస్తూ ఓడలను నడిపే  సాంకేతిక జ్ఞాన విషయాలను తెలుసుకొంటూ , పరిశీలిస్తూ అబ్బురపడుతూ ఆమె వెలి బుచ్చిన అభిప్రాయలు గమనించదగినవి. ఓడలను  గమ్యాన్ని చేరేట్లు దిశా నిర్దేశం చేసే  కంపాస్ గురించి వివరించి ఇలాంటి ఆవిష్కరణలు లేకపోతే సరుకుల రవాణా , ఇతరదేశాలతో సంబంధాలు అభివృద్ధిచెందవు కదా అంటుంది. ఒక ఓడ ఒక స్థలం  నుండి  ఎంతదూరం వచ్చింది? నిర్దేశిత ప్రాంతం చేరటానికి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలి వంటివి నిర్ణయించే పరికరాలు కూడా వాడుతున్నట్లు పేర్కొన్నది. దేశవికాసం, సుసంపన్నత ఇలాంటి ఆవిష్కరణలలోనే ఉందని కూడా అభిప్రాయపడింది. ఈ సందర్భంలో ఇంగ్లీష్ జాతి వైజ్ఞానిక తత్వాన్ని ఆరాధనా భావంతో ప్రశంసించింది. 

ఇక్కడ జానకమ్మ  ఓడలను రేవుకు అనుమతించటానికి  సంబంధించిన పాలనా పద్ధతిని కూడా ఆమె అభినందన పూర్వకంగా పేర్కొన్నది. ఓడ తీరాన్ని సమీపిస్తున్నదంటే కంపెనీకి చెందిన డిప్యూటీ ఏజంట్ ఓడ తో కలిపి కట్టబడి పక్కనే వస్తున్న పడవలోకి దిగి కంపెనీ జండాను ఎగరేసి తన విధులలోకి   దిగుతాడని , అప్పుడు పోర్ట్ సర్జన్ వచ్చిప్రయాణంలో ఏవైనా మరణాలు సంభవించాయా , ఎవరైనా త్వరగా సమూహాలలో వ్యాపించగల అంటూ వ్యాధులతో బాధపడుతు న్నారా అని ఓడ డాక్టర్ ను అడిగి తెలుసుకొంటాడని, అలాంటి వాళ్లు ఉన్నారని తెలిస్తే క్వారంటైన్ నియమాలను అమలు పరుస్తాడని, దానిప్రకారం  ఆ ఓడను ఒడ్డుకు రానీయకుండా  సముద్రం లోనే నిలిపివేస్తారని చెప్పి ఇలా పాలకులు  వొడ్డున ఉన్న వేలాదిమంది ప్రాణాలను కాపాడే క్వారంటైన్ నియమాలు పాటించటం తెలివైన ముందు జాగ్రత్త చర్య అని అభినందిస్తుంది.

బ్రిటిష్ పాలకుల జీవన విధానం, మతం, వైజ్ఞానిక పురోగతి, పాలనా దక్షతలను మాత్రమే కాక వివిధప్రాంతాలను వాళ్ళు ఆక్రమించుకున్న చరిత్రను కూడా ఆమె ఏవిధమైన ఫిర్యాదీ స్వరం లేకుండానే ప్రస్తావించటం చూస్తాం. దక్షిణ అరేబియా (యెమన్) ఓడరేవు ఎడెన్ లో ఓడ ఆగిన సందర్భంలో 1839 నాటికే బ్రిటిష్ వాళ్ళు ఎడెన్ పై దాడిచేసి వశంచేసుకొని బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం చేసుకొన్న చరిత్రను చెప్పింది. మెడిటరేనియన్ సముద్ర ద్వీప దేశం మాల్టా రేవును చేరిన సందర్భంలో ఒడ్డున ఉన్న యూరోపియన్ జనాన్ని చూస్తే అది ఐరోపా భూభాగమే అన్నట్లుగా ఉందని అంటుంది జానకమ్మ. యూరోపియన్ మహిళల దుస్తులకు విరివిగా వాడబడే లేస్ అక్కడినుండే వస్తుందని ఆమెకు తెలుసు. నీలిమందు, కుంకుమ పువ్వు అత్యధికంగా ఎగుమతిచేయబడే పత్తి పంటలకు ప్రసిధ్ధప్రాంతం అయిన మాల్టా తొలుత నెపోలియన్ బోనపార్టే వశమై  1800 లలో వచ్చిన కరువు కాలంలో బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చి 1814 పారిస్ ఒప్పందంతో  బ్రిటిష్ వారికి దఖలు  పడిన చరిత్రను ప్రస్తావిస్తుంది. సముద్ర మార్గ వ్యాపారంపై ఆధిపత్యాన్ని స్థిరీకరించుకొనే  క్రమంలో బ్రిటిష్ వారు   తమ ప్రయోజనాల కోసంసముద్ర తీర ప్రధాన ఓడరేవులను  ఆక్రమించటం కూడా  జానకమ్మకు  వాళ్ళ సామర్ధ్యంగానే అర్ధం అయింది అనిపిస్తుంది.

సముద్రయాన అస్వస్థతకు తాను గురి కాలేదని , ఒడ్డున ఉన్నంత  స్వేచ్చగా , హాయిగా సముద్ర మధ్యలో కూడా ఉండ గలిగానని , తోటి స్త్రీలు ఎవ్వరు డెక్ మీదకు రాకపోయినా తాను ఒక్కతే వచ్చి ఓడ కదలికలకు అనుగుణంగా బ్యాలెన్స్ చేసుకొంటూ తిరుగుతుంటే సంతోషించి కెప్టెన్ అభినందించాడని ఎవరితోనైనా తనగురించి మంచి సముద్ర ప్రయాణీకురాలని చెప్పేవాడని  చెప్పుకొన్నది.

తనకు వచ్చిన ఇంగ్లీష్ కాస్తే అయినా వివరించటంలో భర్త చేసే సహాయం , ఆయన లేనప్పుడు తన వచ్చీరాని ఇంగ్లీష్ తో  ఆయా చేసే సహాయం వల్ల మొత్తం మీద తన ఆలోచనలను చక్కగానే వ్యక్తం చేయగలిగేదానిని అని చెప్పింది. ఆ రకంగా  ఆ నెల రోజుల ప్రయాణ కాలం ‘నీటిలో కదిలే ఇళ్లల్లో’ చేసిన అందమైన కాపురంగా భావించింది ఆమె. సముద్రం నుండి బయటకు పొడుచుకు వచ్చిన  చిన్నచిన్న పర్వతాలను చూస్తూ రామాయణం లోని మైనాక పర్వత ఉదంతాన్ని గుర్తుచేసుకొనటం ఆమె సంప్రదాయ సాహిత్య పాండిత్యానికి గుర్తు మాత్రమే కాదు, ఆమె నిశిత పరిశీలనాశక్తికి , పోల్చి చూసి సంబంధ వైరుధ్యాలను గుర్తించగల సూక్ష్మ దృష్టికి కూడా నిదర్శనం.  

                                                2

లండన్ ను గంధర్వ లోకంగా సంభావించింది జానకమ్మ. లండన్ కు చేరాక హోటల్లో దిగి అతి కొద్దీ కాలంలోనే బ్రామ్ ప్టన్    ప్రాంతంలో నాలుగు అంతస్థుల నివాసగృహం లో అద్దెకుచేరారు. నాలుగు నెలల నివాసకాలంలో ఆమె కు ఆ ఇంటితో ఎంత గాఢమైన మోహం  ఏర్పడిందో కానీ తిరిగివచ్చాక మద్రాస్ లో ఎగ్మూర్ లోని తమ ఇంటికి బ్రామ్ ప్టన్ హోమ్ అని పేరుపెట్టుకొన్నది. ఈ యాత్రాచరిత్రను లేడీ జులియా రాబిన్ సన్  కు అంకితం ఇస్తూ వ్రాసిన వాక్యాల కింద తన ఇంటి ని ఆ పేరుతోనే పేర్కొన్నది.

  లండన్ లో ఆమె మొదటి పరిశీలన పనివాళ్లకు సంబంధించినది. భారతదేశంలో ఇళ్లల్లో ఎప్పుడూ ఉండే పనివాళ్ళు కూడా నేల మీద పడుకొనటమే ఆమెకు తెలుసు. కానీ లండన్ లో పనివాళ్ళ కు పడుకొనేందుకు మంచాల ఏర్పాటు ఉండటం ఆమెను ఆశ్చర్య పరిచింది. వాతావరణ ప్రత్యేకతలు వల్లనే ఆ ఏర్పాటు జరిగివుంటుందని ఆమె అభిప్రాయపడింది. ఆమె తనవెంట ఎంత మంది సేవకులను తీసుకొనిపోయిందో కానీ ఒక్క వంటకు తప్ప వాళ్లేందుకూ ఉపయోగపడరని తేల్చుకొన్నది. ఇంగ్లిష్ పనివాళ్ల సామర్ధ్యాన్ని ప్రశంసాపూర్వకంగా పేర్కొన్నది.  ఇంగ్లండ్ గృహజీవితంలో ఆడపనివాళ్లకు , మగపనివాళ్లకు వేరువేరుగా ఉండే  పై స్థాయి పనివాళ్లు -  హౌస్ కీపర్,   బట్లర్. సరుకులు తెప్పించటం దగ్గరనుండి పిల్లలపోషణ కు ఉండే నర్సులతో సహా   అనేకపనులు చేయటానికి నిర్దిష్టమైన పేర్లతో ఏర్పడి ఉన్న పనివాళ్ళ వ్యవస్ధను గురించి జానకమ్మ చెప్పినది అంతా అత్యంత  ధనికవర్గ కుటుంబాలకు సంబంధించినదే కానీ సామాన్య కుటుంబాలకు సంబంధించింది కాదు. ఈ వ్యవస్థలో యజమానులకు తమంతట తాము చేసుకోవలసిన పనులే ఉండవు. అక్కడ పనివాళ్లకు జీతాలు ఎక్కువని,  ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నదేశీయ గుమస్తా జీతం అంత జీతం వాళ్లకు లభిస్తుందని , స్త్రీ జనాభా ఎక్కువ కావటం వల్ల పనివాళ్లలో ఎక్కువమంది స్త్రీలే కనబడతారని చెప్పింది.

పంజరం విడిచిన పక్షిలాగా తనవంటి వాళ్ళు విసుగు , ఆకలి లేకుండా లండన్ అద్భుతాలను చూడటానికి రోజంతా తిరగటానికి ఇష్టపడతారని అంటుంది. స్వదేశంలో ఎప్పుడూ తన ఆలోచనకే రాని శారీరక వ్యాయామం వైపు ఇక్కడ తన దృష్టి మళ్లిందని హైడ్ పార్క్ లో అనుదినం ఎంతెంతో దూరాలు నడిచే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకొన్నాని చెప్పింది. ఇళ్లల్లో స్త్రీలు అతిధులను ఆనందపరచటానికి పియానో వాయిస్తూ పాడతారని,  అతిధులు వెళ్తుంటే పండో, వైనో , టీనో , బిస్కెట్లో ఇయ్యటం అక్కడ మర్యాద అని అది స్వదేశంలో తాంబూలం ఇచ్చి పంపించే ఆచారం వంటిదని చెబుతుంది.

అదే సమయంలో ఇంగ్లండ్ ప్రత్యేకత దేశంలో దాదాపుగా స్త్రీలందరూ విద్యావంతులు కావటం అనిపేర్కొన్నది జానకమ్మ. అలాంటి విద్యావంతులైన స్త్రీలలో కొందరు భారతీయుల సంక్షేమం కోసం పనిచేశారని చెబుతూ లేడీ వాటర్ లూ, మిస్ మేరీ కార్పెంటర్, మిసెస్ ఆర్నాల్డ్, మిస్ మన్నింగ్ తదితరులను కృతజ్ఞతతో తలచుకొన్నది

నాలుగు అయిదు అధ్యాయాలలో లండన్ అద్భుతాలను వివరించింది. లండన్ పోలీస్ ఫోర్స్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది అంటుంది. వర్తకం గురించి చెప్తూ ఇంగ్లీషువారికి ఇతరదేశాలతో సంబంధ సాధనం వ్యాపారమే అంటుంది. ఇండియా తదితర దేశాలనుండి ముడి సరుకుని దిగుమతి చేసుకొని మాంచెస్టర్ , బర్మింగ్ హామ్, షెఫల్డ్ తదితర ప్రాంతాలలో  పెద్ద పెద్ద  యంత్రాలతో వాటిని వస్తువులుగా మార్చి మళ్ళీ ఆదేశాలకే ఎగుమతి చేసి ఇబ్బడిముబ్బడి లాభాలను పొందుతున్న ఇంగ్లండ్ వ్యాపార సూత్రం సరిగానే గ్రహించి చెప్పింది. లండన్ ఒక వ్యాపార ప్రపంచం అంటుంది. లెక్కలేనన్ని బాంకులు దాని ఫలితమే అంటుంది. 

 బజార్లలో  ఎక్కువభాగం దుకాణాలను స్త్రీలే నడుపుతారని వాళ్ళు  ధరలు చెప్తూ వస్తువులను అమ్మే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పింది. చాసర్, షేక్స్ పియర్, మిల్టన్, జాన్సన్, స్పెన్సర్, డ్రైడన్ , బట్లర్ మొదలైన వారి సమాధులున్న పోయెట్స్ కార్నర్ గురించి చెప్పటం ఆమె సాహిత్య ఆసక్తులను సూచిస్తున్నది.

లండన్ లోని అద్భుతాలకు అబ్బురపడుతూ ఆరాధనగా చెప్పుకువచ్చిన జానకమ్మ విశ్వాసాలు  ది టవర్  అఫ్ లండన్ చూసినప్పుడు కొంత కదలబారటం చూస్తాం. చారిత్రకమైన ఆ కట్టడం గురించి, అక్కడ సంభవించిన అనేక ఘటనల గురించి అక్కడి కావలివాళ్ళు 12మంది సందర్శకులను ఒక సమూహంగా  వెంటపెట్టుకొని ఆ టవర్ లోపల భాగాలను చూపిస్తూ అనర్గళంగా చెప్పిన విషయాలు విన్నాక తనకు కలిగిన భావాలను పేర్కొన్నది. అది  పురాతన కాలంలో ఒక  కోట. తరువాత జైలుగా మార్చారు. ఆ తరువాత అది అనేక టవర్లుగా విడగొట్టబడిన భవనం. ఆ టవర్లను చూస్తూ ఒక చోట ఆయా చారిత్రక కాలాలకు సంబంధించిన రకరకాల ఆయుధాలు చూశానని వాటిని ఎప్పుడెప్పుడు ఎవెరెవరు వాడుతూ ఎన్ని అత్యాచారాలు చేశారో కావలి వాళ్ళు వివరిస్తుంటే తాను వినలేకపోయానని అంటుంది జానకమ్మ.  ఇంగ్లీషు వాళ్ళు దిగ్భ్రాంతికరమైన ఇలాంటి పనులు చేయగలరని తాను ఎప్పుడూ ఊహించలేదు అంటుంది. అయితే నేరస్థులజీవితాన్ని  పాశవికంగా అనాగరికంగా హింసకు గురిచేయడం లేదా నేరస్థులను గొడ్డలితో నరికెయ్యటం ప్రాచీనకాలాల బ్రిటిష్ పాలకుల నైజంగా తాను ఊహిస్తున్నాను అని చెప్పటం  ద్వారా సమకాలీన బ్రిటిష్ పాలకవర్గాల పట్ల తన విశ్వాసం చెదరలేదనే సంకేతాన్ని ఇచ్చినట్లయింది.

 లండన్ అద్భుతాలు అనే ఉపశీర్షిక లేకపోయినా ఆరు,  ఏడు, ఎనిమిది అధ్యయాలలో  కూడా ప్రధానంగా లండన్ లో జానకమ్మ తాను చూసిన ఇంగ్లండ్ రాణి వంటి  వ్యక్తులను, అక్కడ జరిగే ఆధికారిక ఉత్సవాలను, స్థలాలను, పార్కులను, వివిధ వస్తు కళా  ప్రదర్శన శాలలను, రాజభవనాలను, వినోద వికాస కేంద్రాలను, వ్యాపార కూడలులను, అనాథ సంక్షేమ గృహాలను- ఇలా అనేక స్థలాలను పరిచయం చేసింది.  ఇక అక్కడి కట్టడాలగురించి, కళా వస్తు ప్రదర్శన శాలలగురించి సూక్ష్మ వివరాలతో ఆమె ఎంతో  సమాచారం  ఇచ్చింది. ఈ విషయంలో ఆమె పాఠకులను పర్యాటకులనుచేసి వెంటపెట్టుకొని తిప్పుతూ  ఇంగ్లండ్ అద్భుతాలను చూపిస్తూ వివరించే   ఒక టూరిస్ట్ గైడ్ పాత్రను నిర్వహించింది. 

ఈ మొత్తం పర్యటనలో ఏది చూస్తున్నా బ్రిటిష్ సంస్కృతీ సంపదల పట్ల ఎంత అభిమానం వున్నా  తన  భారతీయ అస్తిత్వం జానకమ్మ మరిచిపోలేదు.  హౌస్ అఫ్ పార్లమెంట్ ను చూస్తున్నప్పుడు ఇండియాతో ప్రత్యక్ష సంబంధం ఉన్న సంస్థ అదొక్కటే అనుకొన్నది ఆమె.  భారతదేశ శ్రేయస్సుకు సంబంధించి గానీ, శోకానికి సంబంధించిగానీ అక్కడ జరిగే నిర్ణయాలే కీలకమైనవి అని భారత దేశ  అదృష్ట దురదృష్టాలను నిర్ణయించేవి అవే అని ఆమె అభిప్రాయం పడింది.  అలాగే ఇన్స్ ఆఫ్ కోర్ట్ ( INNS OF COURT ) గురించి చెప్పినది కూడా భారతదేశ సంబంధంలోనిదే. ఇన్స్ ఆఫ్ కోర్ట్ అంటే న్యాయ విద్యా  సంబంధమైన వసతి గృహ సముదాయం. 

ఇండియన్ సివిల్ సర్వీస్ లో  ఉన్నత పదవులు పొందటానికైనా  పై స్థాయి న్యాయస్థానాల్లో వాదించటానికి అవసరమైన అర్హత సంపాదించటానికైనా బ్రిటిష్ ఇండియాలో భారతీయులు ఇంగ్లండ్ లో చదివి ఉత్తీర్ణులు కావలసిన పరిస్థితులలో బెంగాల్ సంపన్న వర్గం నుండి అటువైపు కదలిక మొదలైంది. 1860 లలో మన్మోహన్ ఘోష్ అలా ఇంగ్లండ్ లో బారిస్టరైన మొదటివాడు. కలకత్తా హైకోర్టులో 1867 లో ప్రాక్టీస్ చేసినవాడు. ఆతరువాత ఐదారేళ్లకే జానకమ్మ లండన్ వెళ్ళింది. ఇన్స్ ఆఫ్ కోర్టు ను చూసింది. వాటి గురించి ఆమె చెప్పిన విషయాలు ఆసక్తి కరమైనవి. 

లండన్ లో న్యాయస్థాన ఆవరణలో మూడు వసతి  గృహాలు ఉన్నాయని అవి ఇన్నర్ టెంపుల్ ( లోపలి ఆలయం ), గ్రేస్ నిలయం.( Gray’s  Inn )  లింకోలన్స్ నిలయం( Lincoln’s Inn) అని చెప్పి భారతదేశం నుండి బారిస్టర్ చదవటానికి వెళ్లే వాళ్ళు వీటిలోనే చదివి ఉత్థర్ణులు కావలసి ఉంటుందని చెప్పింది. (మన్మోహన్ ఘోష్   లింకోలన్స్ నిలయం లో చదివాడు)  ఈ ఆవరణలో చదువుకొంటున్న పి. వెంకట కృష్ణమ నాయుడు అనే మిత్రుడు తమను తీసుకొనివెళ్ళి చూపించాడని అక్కడ తాను చూసినవి గ్రహించినవి చెప్పింది. భవనాలు విశాలమైనవి, ఉదాత్తంగా నిర్మించబడినవి. ఒక పెద్ద హల్ లో ప్రపంచంలో గొప్పగొప్ప జాతులకు చెందిన న్యాయసూత్ర నిర్మాతల చిత్రపటాలు ఉన్నాయని వాటిలో భారతదేశ న్యాయసూత్ర దాత మనువు బొమ్మ ఉందని పేర్కొన్నది. అనుబంధంగా ఉన్న గ్రంథాలయాన్ని , అక్కడ చదివే విద్యార్థులు , న్యాయవాదులు మొదలైనవాళ్ళ భోజనాల కోసం ఏర్పాటైన వంటశాలను ఆమె చూసింది. అక్కడ చదివే హిందూ విద్యార్థులు కులం వల్ల బ్రాహ్మలు కావచ్చు, బలిజలు కావచ్చు ఎవరైనా తమ అధ్యయన కాలం పూర్తి చేసుకొనటానికి ఇంగ్లీష్ వాళ్ళతో ఒకే బల్ల మీద భోజనం చేయటం తప్పనిసరి అని అక్కడ అమలవుతున్న ఒక నియమాన్ని చెప్పింది. ఈ విధమైన కుల మత హద్దులను చెరిపివేసే ఈ విధమైన సామాజికీకరణ ప్రక్రియ భారతదేశ చరిత్రలో భక్తిఉద్యమాల   చాపకూటి భోజనాలను  , సంస్కరణోద్యమ కాలం నాటి  సహపంక్తి భోజనాలను గుర్తుకు తెస్తుంది.

ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. హిందూ విద్యార్థులలో అతను బ్రాహ్మడు కానీ బలిజ కానీ (  be he a Brahmin or Bulga ) అని రెండు కులాలనే ప్రస్తావించింది. తాను బలిజశెట్టి కావటం వలన అలా అన్నదా అని అనుమానం రాక మానదు. ప్రయాణ సందర్భంలో కుల సంబంధ ఆహారపుటలవాట్ల గురించి మాట్లాడిన సందర్భాన్ని ఈ సందర్భాన్ని కలిపి చూస్తే మళ్ళీ ఆమె కులం ఇది అని నిర్ధారించలేని సందిగ్ధ స్థితే ఎదురవుతుంది. అదలా వదిలేద్దాం.

  లండన్ లో  ఉన్న కాలంలో జానకమ్మ అక్కడి నుండి మాంచెస్టర్ కు , పారిస్ కు వెళ్లివచ్చింది. ఆ ప్రయాణ కాలపు ఆమె అనుభవాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, మొత్తంగా లండన్ ప్రపంచం ఆమె మీద వేసిన ముద్ర ఈ యాత్రాచరిత్రలో కీలకమైనవి. వాటి గురించి వచ్చే నెలలో మాట్లాడుకుందాం. 

 

 

 

 

 

 

 

 

 

 

 


ఈ సంచికలో...                     

Jul 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు