సాహిత్య వ్యాసాలు

(April,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -22

పోతం జానకమ్మ తన ఇంగ్లండ్ యాత్రలో  బ్రామ్ ప్టన్ నుండి మాంచెస్టర్ కు వెళ్ళింది. రైలు  మార్గంలో ఏడుగంటల ప్రయాణం తరువాత మాంచెస్టర్ చేరుకొన్నది. పత్తివ్యాపారానికి కేంద్రం అని , ఇంగ్లీష్ సామ్రాజ్యం లో గొప్ప వస్తూత్పత్తులకు ఆటపట్టని ఆ  నగరాన్ని పరిచయం చేసింది.  ఇర్వెల్ నదికి పశ్చిమ తీరంలో  ఆ నగరం ఉందని,  కొన్ని వీధులు విశాలంగా చక్కటి ఇళ్లతో ఉంటాయని,  మరి కొన్ని ఫ్యాక్టరీలతో, దుకాణాలతో , సరుకు నిల్వచేసే గోదాములతో క్రిక్కిరిసి ఉంటాయని చెప్పి అక్కడ అందమైన శిల్పకళతో ఉన్న అతి పురాతన చర్చిలను  గురించి చెప్పింది. విద్యా వైద్య అవసరాలకోసం పనిచేసే దాతృత్వ సంస్థలు అనేకం  ఉన్న పట్టణం అని, ప్రత్యేకించి పేద స్త్రీల సహాయార్ధం ఏర్పడిన లేడీస్ ఆక్జిలరీ సొసైటీ గురించి చెప్పింది. ఆసుపత్రులు, పాఠశాలలు నిర్వహించబడుతున్నాయని తెలిపింది. ఆదివారం నడిచే స్కూళ్ల గురించి చెప్పింది. సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధికి ఏర్పడిన లిటరరీ అండ్ ఫిలసాఫికల్ సొసైటీ ( 1781) గురించి , రాయల్ మాంచెస్టర్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పింది. అందులోని పెద్ద భవనాలను, గ్రంథాలయాన్ని సమావేశాలకు ఉద్దేశించబడిన  విశాలమైన గదులను వాటి నిర్మాణ రీతులను గోథిక్ , డోరిక్ ఇలాంటి పేర్లతో పేర్కొన్నది.

మాంచెస్టర్ వెళ్లటంలో తమ  ప్రధాన ఉద్దేశం నూలు మిల్లులను చూడటమే అంటుంది జానకమ్మ. 14 వ శతాబ్ది లో ఊలు ఉత్పత్తులతో  మొదలై మాంచెస్టర్  ఆర్ధిక ప్రగతి 18 వ   శతాబ్దికి  పత్తి దిగుమతులను పెంచుకొంటూ   వస్త్ర పరిశ్రమ లో కి విస్తరించి శిఖర స్థాయికి చేరిందని చెప్తుంది.    పారిశ్రామిక విప్లవపు ప్రారంభంలో(1760- 1840) ఊలు , పత్తి మొదలైన వాటి నుండి నూలు తీసే ఆవిరి యంత్రాలను కనుగొన్న  ఆర్క్ రైట్,    హర్ గ్రీవ్ వంటి వారిని ప్రస్తావించి   వారి ఆవిష్కరణలు నూలు తీయటంలో నైపుణ్యాలను పెంచాయి అనీ .ఉత్పత్తి విస్తృతం కావటానికి అవి ఎంతో దోహదం చేశాయి అని పేర్కొన్నది. సిల్క్ వస్త్రాల ఉత్పత్తి క్రమంగా ప్రాధాన్యతను సంతరించుకొని పెద్ద పెట్టుబడితో అనేకమంది పనివాళ్ళతో నడుస్తున్నదని చెప్పింది. వెల్వెట్, కాలికో , మస్లిన్ , ఫాన్సీ కాటన్ , జీన్స్, మొదలైన అనేక రకాల వస్త్ర ఉత్పత్తులు జరుగుతున్నట్లు పేర్కొన్నది. వాటితో పాటు బట్టల పై అద్దకాలు, ప్రింటింగ్ , బ్లీచింగ్ వంటి అనుబంధ పరిశ్రమలు అనేకం అక్కడ ఉన్నాయని , కాలువల ద్వారా తూర్పు పడమర సముద్ర ఓడరేవుల నుండి,  ఎగుమతి దిగుమతులకు వున్న  అవకాశాల గురించి, రైలు రోడ్డు రహదారి మార్గాల ద్వారా  చుట్టుపక్కల వ్యాపార బస్తీలతో ఉన్న సంబంధాల గురించి  వివరించింది.   

లెక్క పెట్టటానికి వీలు లేనన్ని నూలు తీసే యంత్రాల నిరంతర చలనం, వేలకొద్దీ జనానికి బతుకుతెరువు ను ఇచ్చే ఫ్యాక్టరీలు , నిమిషాలలో వస్త్రాలపై అద్దకం చేసే ఫ్యాక్టరీలు, తడి అద్దకపు వస్త్రాలను ఆరబెట్టటానికి పక్కనే ఉన్న వేడి ప్రసారమయ్యే గదులను, నిమిషాలమీద ఆరిపోయి బయటకు వచ్చే వస్త్రాలను చూసి తనెంతగా ఆశ్చర్య పోయిందో చెప్పింది ఆమె. ఒక ఫ్యాక్టరీలోఇలాంటి ఒక మిల్లును స్థాపించటానికి ఎంత డబ్బు అవసరమవుతుందో కూడా వివరంగా తెలుసుకొనటానికి ఆమె చూపిన కుతూహలం చూస్తే వ్యాపారవర్గ  మహిళగా ఆమె అస్తిత్వం అవగతం అవుతుంది.

ఇంగ్లండ్ సాధించిన పారిశ్రామిక ప్రగతికి అబ్బురపడుతూ  ఆరాధనా భావంతో చెప్పుకుపోయిన జానకమ్మలో అదే సమయంలో భారతీయ అస్తిత్వం మేల్కొనటం కూడా చూస్తాం. భారతదేశ మార్కెట్ లో విస్తృతంగా అమ్ముడవుతున్న మాంచెస్టర్ ఉత్పత్తులను తలచుకొని దానిని బట్టి మాంచెస్టర్ వర్తకులు రెండింతలు లాభాలు పొందుతున్నట్లు తెలుసు కోవచ్చు నంటుంది.ముడిసరుకు- పత్తిని కొని-  తీసుకుపోవటం, తయారైన వస్తువును తెచ్చి అమ్మటం - ఈ రెండింటి ద్వారా లాభపడుతున్న బ్రిటిష్ వారి వ్యాపార రాజకీయం ఆమెకు అర్ధమైనట్లుగానే కనబడుతుంది.అయినా వాళ్లపట్ల ఆమె చాలా ఆశలే పెట్టుకున్నట్లు కనబడుతుంది.   విదేశీ వస్త్రం కొనుగోలు చేయటానికి బదులు భారతదేశంలో మిల్లు యజమానులు సమస్యలను సంబోధించి పరిష్కరించగలిగితే దేశ ప్రజల అవసరాలకు తగినంత ఉత్పత్తులు వాళ్ళు అందించగలరని నమ్మకాన్నిప్రకటించటమే కాదు. పాలకులలో అంటే బ్రిటిష్ వారిలో కూడా ఆ నమ్మకం కలిగి అవకాశం ఇస్తే భారత వస్త్ర పరిశ్రమ దానిని వాస్తవీకరించి చూప గలదు అని చెప్పటంలో అది కనబడుతుంది.

జానకమ్మ మాంచెస్టర్ వర్ణన చదువుతుంటే ఎంగెల్స్ గుర్తుకు వస్తాడు. జానకమ్మ మాంచెస్టర్ వెళ్ళటానికి (1873-74) మూడు దశాబ్దాల ముందే ఫ్రెడరిక్ ఎంగెల్స్ తండ్రి పంపగా మాంచెస్టర్ జౌళి పరిశ్రమలో పని చేయటానికి వెళ్ళాడు. అక్కడి తన అనుభవాలను వ్యాసాలుగా వ్రాసి ప్రచురించాడు. ఆ వ్యాసాల సంపుటి 1845 లో “ ది కండిషన్స్ అఫ్ ది వర్కింగ్ క్లాస్ ఇన్ ఇంగ్లండ్” అనే పేరుతో అచ్చు అయింది. ఎంగెల్స్  పారిశ్రామిక వేత్తల కుటుంబానికి చెందినవాడే అయినా అయన మాంచెస్టర్ ను శ్రామికుల కోణం నుండి చూసాడు. ఆకలిచావులు, అపరిశుభ్రత, ఇరుకు వీధులలో , చీకటి గుయ్యారాలలో నివాసం, దుర్భరమైన దారిద్య్రం, తీవ్రమైన అసమానతలు ఇవి ఆయన పుస్తకం నిండా కనబడతాయి. జానకమ్మ ఏ పెట్టుబడిని,అధిక ఉత్పత్తులను, వాటికి కారణమైన యంత్ర ఆవిష్కరణలను అభిమానంతో వర్ణించిందో ఆ పెట్టుబడి యొక్క వికృత ముఖాన్ని ఎంగెల్స్ బయట పెట్టాడు. పరిశ్రమలలో పెరుగుతున్న యంత్రాల ప్రాధాన్యం మనిషిని పని నుండి తరిమి వేయటాన్ని చూసాడు ఎంగెల్స్. నిరుద్యోగం , దరిద్రం ఆ స్థాయిలో పెరగటాన్ని గమనించాడు. నూలు తీయటానికి, బట్టనేయటంలో తెగిన పోగులను ముడిపెట్టటానికి తక్కువ కూలీకి  స్త్రీలను పిల్లలను తీసుకొనటం చూసాడు ఆయన. మొత్తం శ్రామికులలో 52 శాతం మహిళలే అని ఎంగెల్స్ పేర్కొన్నాడు. ఇంటి పని మనుషులలో స్త్రీలు ఎక్కువ అని గుర్తించి చెప్పిన జానకమ్మ ఇన్ని మిల్లులు చూసింది కానీ కార్మికుల గురించి, ప్రత్యేకించి మహిళా కార్మికుల గురించి ఒక మాటైనా మాట్లాడలేదు. ఆమె కు ముఖ్యం అనిపించిన  మత సాహిత్య సంస్థలు  ఆయనకు  అవసరమే లేకపోయాయి.  ఆమె పేర్కొన్న దాతృత్వ సంస్థలలో  ఆదివారపు బళ్ళు ఉన్నాయి. అవి వారమంతా ఫ్యాక్టరీలలో పనిచేస్తూ బాల్యానికి చదువుకు దూరం అవుతున్న పిల్లల కోసం ఏర్పాటు చేసినవి. వాటిని గురించి ఎంగెల్స్ ప్రస్తావిస్తాడు. పెట్టుబడిదారీ కూటమిలో చేరటానికి తహతహ లాడుతున్న భారతీయ సంపన్న వర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిత్వం జానకమ్మది అని ఆమె మాంచెస్టర్ అనుభవాలు తెలియ చేస్తాయి.

          జానకమ్మ ఇంగ్లండ్ నుండి భర్తతో, పరివారం తో కలిసి పారిస్ వెళ్లివచ్చింది. ఇంగ్లండ్ లో చలికాలపు తీవ్రతను, విపరీతంగా కురిసే మంచును తప్పించుకొనటానికి పారిస్ పోతుంటారని తెలిసి జానకమ్మ దంపతులు కూడా నవంబర్ లో   అందుకే  పారిస్ బయలుదేరారు.  ఫ్రాన్స్ రాజధాని పారిస్ అనీ ఇటీవల జరిగిన పర్షియా యుద్ధంలో పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్న దేశం అని పరిచయం చేసింది. 1873 నవంబర్ లో రైలు మార్గంలో విక్టోరియా స్టేషన్ నుండి బయలుదేరి న్యూ హెవెన్ చేరి అక్కడినుండి స్టీమ్ బోటు లో ప్రయాణించి డిప్పీ లో దిగి మళ్ళీ రైళ్లు మారుతూ పారిస్ చేరుకొన్నది జానకమ్మ. అందమైన పారిస్ నగరం యుద్ధంవల్ల, కమ్యూనిస్టుల విధ్వంసకర చర్యలవల్ల పాడైపోయినట్లు తెలిసింది అంటుంది జానకమ్మ.  తాము వెళ్ళినాటికి వెళ్లే నాటికి పారిస్ లో వెండోమ్ స్థంభం తో పాటు కమ్యూనిస్టుల  దురాక్రమణకు గురై దెబ్బతిన్న  భవనాలు, నిర్మాణాలు తిరిగి వేగవంతంగా నిర్మించబడుతున్నాయని ఆమె చెప్పింది.

          ఐరోపా దేశాల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాలలో ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ కీలక పాత్ర వహించాడు. రష్యా ఆస్ట్రేలియా కూటమి మీద 1805 డిసెంబర్  నెపోలియన్  సాధించిన విజయానికి గుర్తుగా పారిస్ లో వెండోమ్ అనే  విశాల చతురస్ర ప్రదేశంలో 1806 లో మొదలు పెట్టి 1810 నాటికి పూర్తి చేసిన విజయ చిహ్నం   వెండోమ్ స్థంభం. జర్మన్ ప్రష్యన్ కూటమితో జరిగిన 1870 యుద్ధంలో కుప్పకూలిన పారిస్ ను కాపాడుకొనటానికి   శ్రామిక వర్గ రాజకీయాలతో ప్రభావితమైన దేశీయ సైన్యం ముందుకు వచ్చింది.  1871 మార్చ్ 18 న పారిస్ ను స్వాధీనం చేసుకొన్నది. కొత్తగా ఏర్పడిన మూడవ రిపబ్లిక్ అధికారాన్ని అంగీకరించం అని ప్రకటించి స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పరచి రెండు నెలలు పాలించింది. అది పారిస్ కమ్యూన్ గా ప్రసిద్ధి. కమ్యూనిస్టు సిద్దాంతం వెలుగులో పాలనకు ప్రపంచంలో జరిగిన తొలి ప్రయత్నం అది. ఆ రెండు నెలల పాలనా కాలంలో వాళ్ళు చేసిన పనులలో సామ్రాజ్య వాద యుద్ధ చిహ్నాలను తొలగించటం ఒకటి. అందులో భాగంగానే  యుద్ధకాముకుడైన నెపోలియన్ ను అంత ఎత్తున  నిలబెట్టిన వెండోమ్ స్తంభాన్ని కూల్చివేశారు. అది తిరిగి నిలబెట్టబడుతున్న కాలానికి ఆమె ప్రత్యక్ష సాక్షి. ఫ్రాన్స్ కు నష్టం కష్టం కలిగిస్తున్న ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధానికి ముగింపు పలకటానికి జర్మనీతో నష్టపరిహారం చెల్లింపుకు అంగీకరించి సంధి చేసుకొన్న అడాల్ఫ్ థియర్స్ మూడవ రిపబ్లిక్ ప్రెసిడెంట్ కావటం ఫ్రెంచ్ ప్రభుత్వంలో అతి గొప్ప మార్పు అంటుంది ఆమె.

విశాలము, సుందరమూ అయిన ఈ వీధులలో పెద్దపెద్ద భవనాలను, దుకాణాలను చూస్తూ తిరిగిన జానకమ్మ ఆసక్తితో తాను చూసిన అనేక స్థలాలలో కొన్నిటి గురించి చెప్పింది. ప్రతి చోటా కమ్యూనిస్టుల వలన జరిగిన హాని గురించి చెప్పటం గమనించదగినది. రాయల్ పాలెస్ 1633-39 లలో నిర్మించబడిన రాజభవనాల సముదాయం. జానకమ్మ దానిని చూసింది. 1871లో కమ్యూనిస్టులు అంత గొప్ప భవనంలో అనేక భాగాలను తగలబెట్టారని, కింది దుకాణాలను దోచుకొన్నారని చెప్పటం మరువలేదు. పోర్ట్ సెయింట్ మార్టిన్ ను దర్శించినప్పుడు   కమ్యూనిస్టులు ఆ సమీపంలో చేసిన దారుణ హత్యా కాండ కు నిదర్శనంగా దానిమీద బుల్లెట్ గుర్తులు ఉన్నాయని చెప్పింది.

పారిస్ నగర నిర్మాణంలో రెండువైపులా చెట్లు బారులుగా నాటబడిన పొడుగాటి వీధులు ప్రత్యేక ఆకర్షణ. వీటినే బులెవర్డ్స్ అంటారు. అద్భుతమైన ఈ నిర్మాణాలు దశలు దశలుగా అభి వృద్ధి చేయబడ్డాయి.లెస్ గ్రాండ్స్ బులెవర్డ్స్ (Les Grands Boulevards) అటువంటి వాటిలో ఒకటి. దాని నిర్మాణ వైభవాన్ని , ప్రపంచంలో మరే  నగరంలోనూ లేనంత ఆకర్షణీయమైన అక్కడి దుకాణ సముదాయాల   గురించి చెప్తూ జానకమ్మ ఫ్రెంచ్ విప్లవ కాలంలో 1789  లో జులై 14 న విప్లవకారులు దానిని ఆక్రమించి నాశనం చేసారని 1871 లో కమ్యూనిస్టులకు ఇది పెట్టని కోట అయిందని వర్సైల్స్ బలగాలు మే 25 న దాన్ని స్వాధీనం చేసుకున్నాయని తన సమకాలపు చరిత్రను ప్రస్తావించింది.

   1830 లో ఫ్రెంచ్ విప్లవం ముగిశాక  జులై 26 నుండి మళ్ళీ అదే తరహాలో  అలలాగా లేచి ప్రభుత్వ అణచివేతకు గురైన జులై విప్లవంలో మరణించిన వారి స్మారకార్థం ది బులెవర్డ్ రిచర్డ్ లీనియర్ లో స్వేచ్చకు సంకేతంగా ఒక చేతిలో తెగిన సంకెల ఒక చేతిలో కాగడ ఉన్న ఆకారం చెక్కబడిన 164 అడుగుల ఎత్తయిన ఇనుప  స్థూపం గురించి చెప్తూ .ప్రభుత్వ దళాలకు , తిరుగుబాటుదారులకు జరిగిన కాల్పుల గుర్తులను ఆ స్థూపం మోస్తున్నదని, 1848 ఫిబ్రవరి విప్లవానికి,, 1871 లో కమ్యూనిస్టు దురాగతాలకు కూడా ఆ ప్రదేశంతో ఉన్న సంబంధాన్ని ప్రస్తావించింది.

ఆమె సందర్శించిన మరొక స్థలం ‘ప్లేస్ డు చాటే డి ఇయు’ ప్లేస్ డి లా రిపబ్లిక్ అనే సమకాలపు స్థల నామానికి అది పూర్వపు పేరు. అతివిశాలమైన మూడు హెక్టార్ల చదరపు ప్రాంతం . కమ్యూనిస్టులు దీనిపై ఆధిపత్యం సంపాదించి ఎక్కడిక్కడ ప్రవేశ ద్వారాల దగ్గర  బారికేడ్లు నిర్మించి రక్షణ ఏర్పాట్లు చేసుకొన్నారు అని వీటిని ఒక్కొక్కటిగా ఆక్రమిస్తూ వర్సైల్స్ దళాలు తిరుగుబాటు దారులు తిరోగమించేట్లు చేశాయని పేర్కొన్నది.  1871 , మే 24 న ఆ రెండు పక్షాలకు జరిగిన యుద్ధానికి అది మౌన సాక్షి అంటుంది ఆమె.  ఆ యుద్ధం వల్ల ఆ చుట్టుపక్కల అనేక ఇళ్ళు తగలబడిపోయాయని , బాగా దెబ్బతిన్నాయని కూడా చెప్పింది.

మాంచెస్టర్ లో పెట్టుబడిని ప్రేమించి,పారిశ్రామిక వేత్తలను ఆరాధించిన జానకమ్మ  పారిస్ లో కమ్యూనిస్టుల పట్ల అసహనం ప్రకటించటంలో ఆశ్చర్య పడవలసినది ఏమీ లేదు.  వాళ్ళ విప్లవ చర్యలను విధ్వంసకర చర్యలుగా, వాళ్ళను అణచివేయటానికి పాలకవర్గం, పరాయి దేశపు సైన్యం జరిపిన దాడులు, చేసిన విధ్వంసం శాంతి స్థాపన గా ఆమెకు  అనిపించటం ఆమె వర్గ స్వభావాన్ని సూచించేవే.

ఏమైనా 1874 నాటికి  ఒక తెలుగు మహిళ రాజకీయాల గురించి , చరిత్ర గురించి గొప్ప విశ్వాసంతో మాట్లాడగలగటం అపురూపమే. పారిస్ లో  అటు పర్షియన్ ఇటు కమ్యూనిస్టు  యుద్ధకాల దృశ్యాల భీభత్స చిత్రాలను తాను చూశానని ఆమె చెప్పుకొన్నది.

ఆ నాటి యుద్ధాలలో కీలక పాత్ర వహించిన వర్సైల్స్ కు కూడా ఆమె వెళ్ళింది. అక్కడ తాను చూసిన ఒక చారిత్రక చిత్ర శిల్ప  ప్రదర్శన శాలను గురించి చెప్తూ బహుళ అంతస్థుల అనేక భవనాలను తిరిగి రావటానికి కొన్ని గంటలు పడుతుందని,   యుద్ధకాలంలో( 1871)  పర్షియా రాజు దానిని తన ప్రధాన కార్య స్థానంగా చేసుకున్నాడని, యుద్ధంలో గాయపడ్డ తన సైన్యానికి చికిత్స కోసం ఆ ప్రాంతంలో చాలా విశాల ప్రాంతాన్ని ఆసుపత్రిగా మార్చాడని తెలిసిందని, అయినా అతను అక్కడి చిత్రాలను , శిల్పాలను ఏ మాత్రం పాడు చేయలేదని రక్తపాతం జీవితంగా ఉన్న వాడిలో కళాప్రియత్వం ఆశ్చర్యకరమని అంటుంది జానకమ్మ. ఆమె అక్కడ ఒక ఫ్రెంచ్ నాటకాన్ని చూసి అది తనకు నచ్చలేదని చెప్పింది. పారిస్ అందమైన నగరం అని ఇంగ్లండ్ లో కన్నా జీవన వ్యయం అక్కడ తక్కువ అని చెప్పింది.

లండన్ ప్రపంచం తనకు ఎలా అనిపించిందో జానకమ్మ ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది ఈ యాత్రా చరిత్రలో. ఆమె దృష్టిలో అది ప్రపంచంలోనే  అత్యంత గౌరవించ దగిన  అద్భుత నగరం. ప్రపంచ సంపదకు, వ్యాపారానికి ఆకర్షక కేంద్రం. భోమి మీద ఉత్పత్తి అయ్యే అనేక రకాల సరుకులతో వస్తూ పోతూ ఉండే  వేలకొద్దీ  ఓడలతో , ప్రయాణీకులతో సందడిసందడిగా ఉంటుంది. అక్కడ వ్యాపారస్తులు రాజుల్లాగా ఉంటారు - సంపద సమృద్ధి చేత, పలుకుబడి చేత. అయితే అక్కడ కళ్ళు చెదిరే సంపదతో పాటు అతి క్రూరమైన దారిద్య్రం, విశాలమైన జ్ఞానంతో పాటు అజ్ఞానం కూడా ఉందని ఆమె గుర్తించి చెప్పటం విశేషం.

లండన్ లో మనుషులు దయగలవాళ్ళు అని, కొత్తవాళ్లను ఆదరించి ఆతిథ్యం ఇచ్చే సంస్కారులని, స్త్రీలు పురుషులతో సమానులు అని  పురుషులకు మంచి సలహాదారులు కూడా అని చెప్తుంది. ఇంగ్లండ్ లో స్త్రీలు అన్ని రకాల గౌరవ మర్యాదలు పొందుతుండగా సలహాదారులుగా ఉండవలసిన స్త్రీలు భారతదేశంలో మగవాళ్ల ఇచ్ఛానుసారం బానిసల వలే పది ఉంటున్నారని బాధపడింది. నా భారతీయ సోదరీమణులు గృహనిర్వాహణలో ఇలా పాశ్చత్య సోదర స్త్రీలవలె  గౌరవకరమైన స్థానాన్ని ఎప్పుడు పొందుతారో కదా అని చింతించింది. నా దేశస్థులైన పురుషుల కళ్ళు ఇటువంటి విషయాలమీద ఇప్పుడిప్పుడే విచ్చుకొంటున్నాయని భవిష్యత్తు పట్ల ఆశను ప్రకటించింది.

చాలామంది మన వాళ్ళు ఇంగ్లండ్ వెళితే అక్కడ వాళ్ళ కులం మతం వదులుకోవలసి వస్తుందనే భయాన్ని వ్యక్తపరుస్తుంటారుకానీ అది ఊహే కానీ వాస్తవం కాదంటుంది జానకమ్మ. మత వ్యాప్తి కాంక్ష వారిలో ఉన్నమాట నిజమే కానీ ఎవరినీ అందుకు బలవంత పెట్టరు అని చెప్తుంది. ఎవరి మతాభిప్రాయాలు వాళ్ళు  కలిగి ఉండే హక్కు ఇంగ్లండ్ లో ఉందని చెప్పింది.ఏమైనా     యుద్ధాలకు,రక్తపాతాలకు, చెడుకు, ద్వేషానికి , అన్ని రకాల చెడు మనోవికారాలకు మతం కారణమని అభిప్రాయపడుతుంది. ఇంగ్లండ్ కు వెళ్ళండి. ,చూసిన దానితో ,విన్నదానితో సంతోషంగా సంతృప్తిగా తిరిగి రాకపోతే వాళ్ళు పుట్టు గుడ్డి, చెవుడు అనుకోవలసిందే అని చెప్పటంలో  ఆమె విదేశాయానం , మరీ ముఖ్యంగా ఇంగ్లండ్ యాత్ర జీవితంలో  అభివృద్ధి వికాసాలకు అవసరమైన సంస్కార వివేకాలను కలిగిస్తుందని దృఢంగా విశ్వసించటం కనిపిస్తుంది. “అన్నిదేశాల్ క్రమ్మ వలనోయ్/ దేశి సరుకులనమ్మవలనోయ్” అని దాదాపు నలభయ్ ఏళ్ల  తరువాత  గురజాడ ఏది చెప్పాడో దానిని అభివృద్ధి సూత్రంగా జానకమ్మఆనాడు  గుర్తించగలగటం  గొప్ప విషయం.ఒక తెలుగు మహిళ 1875 నాటికి ఇంగ్లండ్ వెళ్లిరావటం అదేదో భర్తచాటు భార్య చర్యగా కాక  ఒక  స్వతంత్ర వ్యక్తిత్వంతో దేశ ఆర్ధిక రాజకీయ అభివృద్ధి ఆకాంక్షలను ఏర్పరచుకొని వ్యక్తీకరించ కలిగిన మేధో చర్యగా  ఉండటాన్ని జానకమ్మ యాత్రాచరిత్ర రచన ‘పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్’ నిరూపించింది. 

 ఆమె మగవాడై ఉంటే  టాటా బిర్లా అయ్యే అవకాశాలు అందుబాటులోకి వచ్చి ఉండేవి. ఇంగ్లండ్ వెళ్ళివచ్చిన తరువాత జానకమ్మ ఆలోచనలు , ఆచరణ అంతా విస్మృత చరిత్రే.

(అపురూపమైన , అవసరమైనా ఈ పుస్తకాన్ని సంపాదించి ఇయ్యతమే కాక తమ సంభాషణలతో ఈ వ్యాసం వ్రాయటానికి ప్రేరేపించిన కాళిదాసు పురుషోత్తం గారికి, పి. మోహన్ గారికి కృతజ్ఞతలు )

---------------------------------------------------------------------------------------

 

    

 


ఈ సంచికలో...                     

Jul 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు