సాహిత్య వ్యాసాలు

(April,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -23 

1903 లో  హిందూసుందరి పత్రికలో ఒక రచన మాత్రమే ప్రకటించబడి తెలుస్తున్న  స్త్రీలు 16 మంది  ఉన్నారు. వీళ్ళ సమకాలపు సావిత్రి వంటి పత్రికలలో గానీ తరువాతి కాలంలో మరే పత్రికలో గానీ వాళ్ళ రచనలు కనబడవు. ఈ మొత్తం రచనలలో ఎక్కువభాగం ఉపన్యాసాలు, వ్యాసాలు. తరువాతి స్థానం కవిత్వానిది. కథ ఒకే ఒకటి.

ఆ కథ పేరు లోభివాని కథ. ( ఆగష్టు 1903) రచయిత్రి శ్రీధర సీతాదేవమ్మ. అప్పటికే భండారు అచ్చమాంబ ఆధునిక కథకు అంకురార్పణ చేసినా స్త్రీలు నీతికథల మూసలోనే కథలు వ్రాసారు. లోభివాని కథ ఆ కోవలోదే. ఒక వూళ్ళో ఒక లోభివాడు. కొబ్బరి పచ్చడి తినాలనిపించి కొబ్బరి కాయ కొనటానికి బయటకు వెళ్ళాడు. బజారు లో కొబ్బరి కాయ ధర  ఎక్కువ అనిపించి తక్కువకు దొరికే ప్రాంతాన్ని వెతుక్కొంటూ రాజమండ్రి , అమలాపురాలు మీదుగా హైదరాబాద్ వరకూ వెళ్లి అక్కడ కానీ ఖర్చు లేకుండా ఒక సరస్సు ఒడ్డున సరస్సు పైకి వంగిన కొబ్బరి చెట్టు కాయలు కోయటానికి ఎక్కి జారి పడిపోతున్న  తరుణంలో కూడా డబ్బు ఆశ వదలక చేతి పట్టు వదిలి తనను కాపాడటానికి ప్రయత్నించిన నవాబును, రాజును కూడా  తనతో పాటు నీళ్లలో మునిగి చనిపోయేట్లు చేసిన లోభివాడి కథ ఇది. ఉన్నవూళ్ళో కొబ్బరి కాయ కొనటానికి డబ్బు కోసం చూసుకొన్న వాడు, చౌకగానో , అసలు డబ్బే పెట్టకుండానో దానిని సంపాదించటానికి చేసిన ప్రయత్నంలోని ప్రయాసను, నష్టాన్ని పతాక స్థాయిలో చూపించిన ఈ కథ లోభత్వం వినాశకరం అని చెప్తుంది. ఇంత సాధారణమైన నీతి కథను ఆధునిక అవసరానికి ముడిపెట్టి వ్యాఖ్యానించటం  ఈ కథకు కొసమెరుపు. ఒక్క రూపాయి పెట్టి హిందూసుందరిని తెప్పించి తమ స్త్రీలకు విద్యనేర్పించని లోభుల ఇల్లాండ్రు మూఢురాండ్రై తుదకు ఇలాంటి కీడే తెచ్చిపెడతారన్న నీతి తో ఈ కథను ముగించటంలో ఉంది రచయిత్రి చమత్కారం.

1903 నాటికి స్త్రీలు సంప్రదాయ ఛందో రీతులలో  కవిత్వం వ్రాస్తూనే ఉన్నారు. వాటితో పాటు స్త్రీలకే ప్రత్యేకమైన మంగళహారతులు , కీర్తనలు వ్రాస్తున్నారు. అయినారపు వెంకట రమణమ్మ స్త్రీల విధేయత అనే శీర్షిక కింద ( నవంబర్ 1903) నాలుగు  పద్యాలు వ్రాసింది. మొదట చివర సీస పద్యాలు , మధ్య రెండూ ఉత్పలమాల ఒకటి, తేటగీతి మరొకటి. “ జనని గర్భమునందు జన్మించినది మొదల్ యత్తవారింటికి నరుగువరకు … “ అని మొదలయ్యే ఈ పద్యం తల్లిదండ్రుల ఆజ్ఞ కాదనక బుద్ధిని విద్యయందు హద్దు పరచి వినయం, నమ్రత, లజ్జ , శీలం, సత్యం , శాంతం, దయ, ఉపకారం , నిర్మలత్వం మొదలైన గుణాలను అభివృద్ధి పరచుకొని మెలిగితే తల్లిదండ్రులకు పేరు , ప్రజల మెప్పూ లభిస్తాయి కనుక బాలికలకు అలాంటి జ్ఞానం ఇచ్చే చదువు నేర్పాలని చెప్పింది వెంకట రమణమ్మ. పిల్లలను గారాబం చేసి పాడు చేయవద్దని తల్లిదండ్రులను హెచ్చరించింది ఒక పద్యంలో. మరొక పద్యంలో స్త్రీలు అత్తమామల మీద  భక్తి , భర్త మీద మనసు పెట్టి అతనే దైవమని పూజించే స్త్రీకి భగవంతుడు సర్వ సంపదలు ఇస్తాడని ఆశపెడుతుంది. చివరి సీసపద్యంలో ఏ తీర్ధ యాత్రలు, జపతాపాలు, ఉపవాసాలు, దేవతా పూజలు, పుణ్య తీర్ధ స్నానాలు పతి పాదపూజతో సరి రావని కనుకప్రాణేశు పాదసేవ మానవలదుఅని స్త్రీలకు హితవు చెప్తుంది. ఎంతో కాలంగా గతానుగతికంగా స్త్రీధర్మాలుగా ప్రబోధించబడుతున్న వాటినే మళ్ళీ చెప్పింది.

పద్యరచనా శక్తి పరీక్షలలో సమస్యా పూరణ ఒకటి. ఒక పద్య శకలం సమస్యగా ఇచ్చి మిగిలిన భాగాన్ని పూరిస్తూ అర్ధవంతమైన పద్యం వ్రాయమనటం ఒకటి. ఆధునిక యుగపు తొలినాళ్ళ స్త్రీల పత్రికలలో సమస్యా పూరణ పద్యాలు వ్రాసిన మహిళలు చాలామంది కనబడతారు. శ్రీ రాజా బొడ్డు రాజ్యలక్ష్మమ్మ ( రాజ్య లక్ష్మీ దేవమ్మ ) ఒకరు. ఇచ్చిన సమస్యశునకమ్ములు పువ్వులయ్యె శోభావహించన్” ( డిసెంబర్ 1903)దానిని కలుపుకొని ఆమె రామాయణార్ధంలో పద్యం వ్రాసింది. “కనకాంగి వినుము రామునినని మార్కొని రావణుడు శరావళి గురియన్ \ ఘన శూరుడైన సీతే శునకమ్ములు పువ్వులయ్యె శోభావహించన్అన్నది ఆమె వ్రాసిన పద్యం. సీతేశునకు +అమ్ములు అని విడదీసి రావణుడు వేసిన బాణాలు సీతకు ఈశుడు , భర్త అయిన రాముడి మీద నాటుకొని పువ్వులై శోభించాయని చమత్కరించింది. ఆ సంచికలోనే పాలేపు మాణిక్యాంబ అదే సమస్యను తపస్సులో ఉన్న శివుడి మనసు పార్వతిపై లగ్నం కావాలని మన్మధుడు వేసిన బాణాలు శివుడి పై పూలై శోభావహించాయని పూరించింది.

వేప గుప్తాపు మహాలక్ష్మమ్మ ( జులై 1903 ) యే. కనకమ్మ ( సెప్టెంబర్&అక్టోబర్ 1903) కీర్తనలు వ్రాసారు. మహాలక్ష్మమ్మ కీర్తన సరస్వతీ స్తుతి. స్త్రీల కీర్తనలు  సాధారణంగా లక్ష్మీ పార్వతుల స్తుతి రూపకంగా ఉంటాయి. ఎందుకంటే నోములకు, వ్రతాలకు అధిదేవతలు వాళ్ళే కనుక. ఈ నేపథ్యంలో సరస్వతీ స్తుతి అరుదైనదే. “వందనంబులందు () వారిజాసను రాణి వందనంబు లంది  నా వంత దీర్పవమ్మఅన్న పల్లవితో ప్రారంభమైన ఈ కీర్తనలో అయిదు చరణాలు ఉన్నాయి. కవుల చెంత చేరి ఉంటుందని, విదుషులను బ్రోచు విద్యా కల్పవల్లి అని సరస్వతి స్థానాన్ని , దయను గురించి చెప్తుంది. “విద్యలేని స్త్రీ వెతల బాపవమ్మాఅని కోరటం లోవిద్యాశ్రీ నొసగి వేగ బ్రోవరమ్మాఅని ప్రార్ధించటంలో స్త్రీవిద్య పట్ల రచయిత్రి ఆర్తి కనబడుతుంది. యే. కనకమ్మ కీర్తన లో   “ సత్యముగాను  పణతూ లందరికీ పతిభక్తి భూషణమూ బాగుగానుండవలెన్అన్న పల్లవే చెబుతుంది దాని స్వభావాన్ని. సావిత్రి మొదలైన సతులు పతిభక్తి వల్లనే గణనకు ఎక్కారని ఆడవాళ్లు అబద్ధాలు ఆడరాదని నీతులు చెప్తుంది ఈ కీర్తన.

టి. రామలక్ష్మమ్మ (ఆగష్టు 1903), పేరు లేకుండా ఒక స్త్రీ అనే సర్వనామంతో మరొక స్త్రీ వ్రాసిన మంగళ హారతులు రెండు ఉన్నాయి. రామలక్ష్మమ్మ వ్రాసినది భగవంతుడి గురించిన కీర్తన కాదు. అప్పుడు భారతదేశపు బ్రిటన్ ప్రభువుగా ఉన్న  7 వ ఎడ్వర్డ్ గురించి. అతని పూర్తి పేరు ఆల్బర్ట్ ఎడ్వర్డ్. క్వీన్ విక్టోరియా పెద్దకొడుకు. 1901జనవరి 22 న అతను అధికారంలోకి వచ్చాడు. “ మంగళమని, మంగళమని మంగళమనరే మంగళమని పాడరే ఎడ్వర్డ్ గారికిఅనే పల్లవితో మొదలయ్యే ఈ పాటలో అయిదు చరణాలు ఉన్నాయి. భారతీయుల కోర్కెలు తీరేట్లుగా అతను ఇండియాకు ప్రభువు అయ్యాడని  మహిళలందరిని అతనికి మంగళ హారతులిమ్మని పిలుపు ఇచ్చింది ఈ పాటలో . సమకాలీన రాజకీయాల పట్ల స్త్రీలలో ఆసక్తి ని , ప్రతిస్పందనను నమోదు చేసిన పాట ఇది . ‘ఒక స్త్రీవ్రాసిన మంగళహారతి( సెప్టెంబర్ 1903)  “మంగళమూ నీకంబా మాతల్లీ జగదాంబా …”  అనే పల్లవి తో అయిదు చరణాలలో పార్వతికి ఎత్తిన హారతి. ఈ మంగళ హారతి కర్తగా ఆమె తనపేరు చెప్పుకొనటానికి ఇష్టపడలేదు కానీ ఆమె పేరు వెంకటరత్నము అని ఆ మంగళహారతే చెప్తున్నది. వరము లిచ్చి బ్రోవమని , దీన జనులను బ్రోవమని వేడుకొంటూదాసాను దాసురాలగునట్టి వెంకటరత్నము నే బ్రోవు మరి మరీ వేడేదా’  అని తనగురించి చెప్పుకొన్నది. మంగళహారతి, కీర్తన రచనలలో చివరి చరణాన్ని రచయిత నామాంకితంగా వ్రాసే సంప్రదాయాన్ని పాటించటం వల్ల ఇలా ఆమె పేరు వెంకట రత్నము అని తెలుస్తున్నది. కానీఅదే సంచికలో ‘“రామ రామ నన్ను నీ రచ్చశాయనేలరా , తామసంబు మానుమా కామితార్ద దాయకఅనే పల్లవితో ప్రారంభించి ఒక సుందరి’  వ్రాసిన నాలుగు చరణాల పాట రచనలో ఈ సంప్రదాయం పాటించబడలేదు కనుక ఆమె అసలు పేరు ఏమిటో మనకు తెలియకుండానే పోయింది.  

కథ, కవిత్వం, కీర్తనలు , మంగళ హారతులు వ్రాసిన ఈ ఎనిమిది మంది రచయితల తరువాత మిగిలిన వాళ్ళు తొమ్మిది మంది. వీళ్ళు వ్రాసినవి వచన రచనలు. వాటిలో వ్యాసాలు ఉన్నాయి. ఉపన్యాసాలు ఉన్నాయి. స్త్రీలకు సంబంధించిన సమస్యలపై స్త్రీల అవగాహనకు ఇవి అద్దం  పడతాయి. ప్రధానంగా ఇవి విద్యకు సంబంధించినవి. అందుకు మినహాయింపు రెండు వ్యాసాలు.

ఒకటి వైధవ్య సమస్యను చర్చించింది.ఆ వ్యాసంనిజమైన జననీ జనకులు.’ (జూన్, 1903).  రచయిత్రి  పార్నంది వెంకట రమణమ్మ. ఈ వ్యాసంలో ఆమె ఆడపిల్లలకు , మరీ ముఖ్యంగా వైధవ్యం పొందిన స్త్రీలకు  నిజమైన జననీ జనకులు   కందుకూరి వీరేశలింగం , ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ అని అంటుందికూతుళ్లు  భర్త మరణించి వైధవ్యం పాలైతే తల్లిదండ్రులు అల్లుడి సొమ్మును అపహరించి పిల్లకు జుట్టు తీయించి ముసుగేసి వంట పొయ్యిదగ్గర ఉంచి ఒంటిపూట తిండి పెట్టి ఏకాదశి ఉపవాసాలు చేయించిఆమె అత్తవారింటి రొక్కంతో వడ్డీవ్యాపారం చేస్తూ బాలవితంతువు ఘోష పుచ్చుకొని వాళ్ళు తల్లి                                                                                                                               దండ్రు లు ఎలా అవుతారన్నది ఆమె తర్కం. తల్లిదండ్రులు, బంధువులు ఎవరు వెనుకంజ వేసినా వితంతువులను చేరదీసి , ఆదరించి, జీతాలు కట్టి చదువులు చెప్పిస్తూ వాళ్ళ మంచి చెడ్డలు చూస్తున్న, వాళ్ళ జీవితానికి ఒక మార్గం చూపుతున్న వీరేశలింగం దంపతులే నిజమైన జననీ జనకులు అవుతారని ఆమె తేల్చి చెప్పింది

మరొకటి దేవగుప్తాపు మహాలక్ష్మమ్మ ది కాకినాడ శ్రీ విద్యార్థినీ సమాజం లో చేసిన చిన్న ప్రసంగం. (డిసెంబర్ )పోచిరాజు మహాలక్ష్మమ్మ అనే మహిళ ఉన్నతోద్యోగి అయిన భర్త తో ఆ వూరు వదిలివెళ్తున్న సందర్భంలో ఏర్పరచిన వీడుకోలు సభలో ఆమె ఈ మాటలు మాట్లాడింది. రక్త సంబంధాలకన్నా , బంధుత్వాల కన్నా ఆధునిక యుగంలో స్నేహ బంధాలు బలవత్తరం అవుతున్న విషయాన్ని, ఆ స్నేహాలు సాధారణ ఆసక్తులు, పాల్గొనే కార్యక్రమాలను బట్టి ఏర్పడుతాయన్న విషయాన్ని ఈ ప్రసంగం సూచిస్తుంది. శ్రీ విద్యార్థినీ సమాజంలో స్త్రీల ప్రయోజనాలకోసం పనిచేయటమే వాళ్ళ స్నేహ సూత్రం. తమతో కలిసి పనిచేసిన స్త్రీ , స్త్రీల విద్యకోసం ఇంకెంతో పని చేసి సమాజానికి మేలు చేకూరుస్తుంది అను కొన్న నెచ్చలి వియోగానికి విచారం ఇందులో వ్యక్తం అయింది

1903 ఫిబ్రవరి సంచికలో రుద్రవరపు కామేశ్వరమ్మ , వేమరుసు మహాలక్ష్మి స్త్రీవిద్యను ప్రస్తావిస్తూ వ్రాయటం మొదలుపెట్టారు. ఒక సుందరి అనే సర్వనామంతోనీతిని గూర్చిఅనే వ్యాసం ( ఏప్రిల్) ప్రచురించబడింది.సమాజ ప్రార్ధనకు స్త్రీలను ఇంటికి ఆహ్వానించిన ఒక స్త్రీ చేసిన ఉపన్యాసం ఇది. . సమాజ ప్రార్ధన అంటే  బ్రహ్మసామాజికులు సామూహికంగా చేసే ఏకేశ్వరోపాసన. అందుకోసం స్త్రీలు తోటి స్త్రీలను తమ ఇళ్లకు ఆహ్వానించటం, స్త్రీలకు ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుకొనటం, ప్రార్ధనలు చేసి కీర్తనలు పాడుకొనటం అదొక అలవాటుగా మారిన కాలం అది. అలా ఈ సుందరి కూడా తన ఇంట్లో సమాజ ప్రార్థనకు స్త్రీలను పిలిచింది. వాళ్ళను ఆహ్వానిస్తూ ఆమె చేసిన చిన్న ప్రసంగమే ఈ వ్యాసం

అబలా సచ్చరిత్ర రత్నమాల వ్రాసిన భండారు అచ్చమాంబ సకుటుంబంగా తమ నగరానికి వచ్చిన విషయం ప్రస్తావించింది. అచ్చమాంబ నాగపూర్ లో ఉంటున్నా రచయిత్రి గా స్త్రీ జనాభ్యుదయ ఆకాంక్ష కలిగిన వ్యక్తిగా తెలుగు దేశపు స్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకొన్నది. 1902 డిసెంబర్ నుండి కుటుంబంతో ఆంధ్రదేశంలోని వివిధ నగరాలను సందర్శిస్తూ కాశీకి వెళ్ళింది. బందరు లో మొదలుపెట్టి 1903 జనవరి ,ఫిబ్రవరి నెలలలో ఏలూరు, రాజమండ్రి కాకినాడ మొదలైన నగరాలలో పర్యటించి స్త్రీల సమావేశాలలో ప్రసంగాలు చేసింది. ఆమె తమ నగరానికి వచ్చి ఆనందం కలిగించిందని ఈ సుందరి చెప్తున్నదంటే ఈమె నివాసం ఏలూరు , రాజమండ్రి , కాకినాడ లలో ఎదో ఒకటి అయి ఉంటుంది. అచ్చమాంబ సద్గ్రంధాలు చదివితే ఆమె ఉన్నతమైన ఉద్దేశాలు అర్ధం అవుతాయని, విద్యామహత్యం వల్లనే ఆమె అందరి హృదయాలను ఆకర్షించగలిగిందని అంటుంది ఈ సుందరి.

చోరులు తస్కరించరానిది, పరులకు ఇచ్చినా తరగనిది విద్య అని , అలాంటి విద్య పురుషులకు మాత్రమే అందుబాటులో ఉందని, క్రైస్తవ స్త్రీలు కూడా ఉన్నత విద్యలో కనిపిస్తారని చెప్పి , ఇరుగుపొరుగు వారి అభ్యంతరాలకు, ఇంట్లో ముసలమ్మల సణుగుడుకు భయపడి ఆడపిల్లల చదువు మూడు నాలుగు తరగతుల లోనే మాన్పిస్తున్నారని ఒక వాస్తవాన్ని చెబుతూ స్త్రీలే చదువు చెప్తున్న బడులకు ఆడపిల్లలను పంపక పోవ టాన్ని ప్రశ్నిస్తుంది. ఆడపిల్లలు చదివిన ఆ కాస్త చదువు కూడా పెళ్లిళ్లు అయి సంసారాలు మీదపడిన తరువాత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్నదని బాధపడుతుంది. ఇంటి పనులు అయినా తరువాతనైనా సరే కాస్త సమయం కేటాయించి సద్గ్రంధాలు చదువరాదా అని వేడుకొన్నది. చదువు జనాభివృద్ధి సాధకం అని పేర్కొన్నది. విద్య కన్నా విలువైనది నీతి అని దానివలన విద్యకు వన్నె చేకూరుతుందని సీతను ప్రస్తావిస్తూ నీతి శ్రేష్ఠతను వక్కాణించింది.

దేశాభిమానము గల స్త్రీలకొక ప్రార్ధనఅనే వ్యాసంలో (జూన్ ) గొడవర్తి బంగారమ్మ దేశంలో అనేకరకాలైన పేదరికాలు ఉన్నాయని , విద్యలో ప్రత్యేకించి స్త్రీ విద్యలో దేశం కడు పేదరికంలో ఉందని కనుకనే ఈ దేశంలో స్త్రీలు బానిసలవలె ఏలబడుచున్నారని చెప్పింది. న్యాయంగా స్త్రీపురుషుల మధ్య ఉండవలసిన స్నేహం కొరవడటానికి విద్య లేకపోవటమే కారణం అంటుంది. నాగరికతకు మూలభూతమైన విద్యను స్త్రీలలో వృద్ధిచేయటానికి మహా జనసభలు పూనుకోవాలని , గడచిన సంవత్సరం కలకత్తా సభ స్త్రీవిద్య గురించి ప్రస్తావించటం సంతోషం కలిగించింది అని చెప్పింది.

స్త్రీవిద్యకు తగిన వసతులు లేవని, క్రిస్టియన్ మిషనరీలు అందుకు కొంత పనిచేశాయని స్త్రీలకు బడులు పెట్టి స్త్రీలను ఉపాధ్యాయులుగా నియమించి నిర్వహిస్తున్నారని వాళ్ళ ప్రేరణతో విజయనగరం మహారాజా  ఆనందగజపతి రాజు వంటి వారు అలాంటి పనికి పూనుకున్నారని ఆయన బాలికల విద్య కొరకు చెన్నపురిలో నాలుగు , విజయనగరంలో ఒకటి పాఠశాలలు ఏర్పరచాడని పేర్కొన్నది. విజయనగరంలోని బాలికా పాఠశాలలో నాలుగేళ్ల క్రితం 150 మంది బాలికలు చదువుకోగా ఇప్పుడా సంఖ్య బాగా పడిపోయిందని సమాచారం ఇయ్యటమే కాదు అందుకు కారణాలను కూడా ఆమె వాస్తవ భూమిక మీద ఊహించింది. పదేళ్లు దాటినా ఆడపిల్లను బడికి పంపటానికి అవసరమైన సంస్కారం సమాజంలో లేకపోవటం దానికి తోడు  ఆ పాఠశాలలో అధ్యాపకులు అందరూ  పురుషులే కావటం అందుకు కారణం అంటుంది.

గొడవర్తి బంగారమ్మ కు స్త్రీవిద్య గురించి ఉన్న ఈ ఆరాటం ఆమెను ఆచరణలోకి  నడిపింది. ఈ వ్యాసాన్ని బట్టి ఆమె 1897 లోనే  ఒక బాలికా పాఠశాల ఏర్పరచినట్లు తెలుస్తున్నది. పదిమంది తో ప్రారంభమై ఇప్పుడు అందులో చదువుతున్న బాలికల సంఖ్య యాభైకి చేరిందని దానిని తాను ఒక్కతే నిర్వహించటం  కష్టంగా ఉందని తెలుగు, ఇంగ్లీష్ చెప్పటానికి ఇద్దరు, కుట్లూ అల్లికలు నేర్పటానికి ఒకరు సహాయకులు కావాలని అందుకు విజయనగరం మాహారాణి అయిదువందల రూపాయల చందా , నెలకు 20 రూపాయలు ఇయ్యటానికి అంగీకరించిందని ఈ వ్యాసంలో  ఆమె పేర్కొన్నది. స్త్రీలందరినీ తమతమ ప్రాంతాలలో స్త్రీ విద్యకు తోడ్పడాలని కోరుతూ ఈ వ్యాసాన్ని ముగించింది.

విద్య సమానత్వ సాధనమని , స్త్రీ పురుషులమధ్య స్నేహం అనే విలువను అభివృద్ధి చేస్తుందని భావించిన గొడవర్తి బంగారమ్మ అభివృద్ధికి తనదయిన నిర్వచనాన్ని ఇయ్యటం ఈ వ్యాసంలో గమనించవచ్చు. ఏది అభివృద్ధి కాదో చెప్పటం ద్వారా ఆమె ఈ పని చేసింది. ఆమె దృష్టిలో అభివృద్ధి అంటే

  • ఎట్టి వయసు ఉన్నా విధవలకు మారు మనువు చేయటం కాదు.
  • సముద్రపు ఇసుక కు పోయి పురుషులతో స్వేచ్ఛగా విహరించటం కాదు.
  • మతనాడీ భేదం లేకుండా ఎట్టి జనులతోనైనా కలిసి తిరగటం కాదు .

కేవలం విద్య మాత్రమే. అంటే ఆమె అభివృద్ధి నిర్వచనం పరిధి లోకి  స్త్రీ పునర్వివాహాలు, పురుషులతో సామాజిక సంబంధాలు, మత సమానత రావన్న మాట. అది గొడవర్తి బంగారమ్మ సంస్కరణ  పరిమితి. అయినప్పటికీ స్త్రీ విద్య వరకు ఆమె ఒక ఆచరణ వాది అన్నది స్పష్టం.

          వలివేటి బాలాత్రిపుర సుందరమ్మ రాజము నందలి జనానా సభలో చేసిన ప్రసంగం ( జులైకూడా స్త్రీ  విద్య కేంద్రంగానే సాగింది. స్త్రీలు సభలకు రావటం వల్ల ఇంటిపనులు కాస్త ఆలస్యం అయితే కావచ్చు కానీ అందరూ చేరి మాట్లాడుకొనటం వలన కలిగే లాభం అంతకంటే గొప్పది అని చెప్తూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించింది. మానవ జాతిలో పురుషుడు మొదటివాడుగా  శరీరదారుఢ్యం , విద్య కలిగి ఉండగా  స్త్రీ రెండవది గా అబల గా విద్య లేనిదానిగా ఉండిపోవటం గురించిన ప్రశ్నతో దానిని కొనసాగించింది. విద్య లేకపోతే జీవనం లేదా? లేకుండా ఆడవాళ్లు ఇప్పుడు జీవించటంలేదా? చదువుకొని ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలాలా అంటూ స్త్రీలకూ చదువు చెప్పించకుండా నిరుపయోగులుగా చేస్తున్నారని నిరసన వ్యక్తం చేసింది.

విద్య అంటే తెలుసుకొనటం అని తెలుసుకొనటానికి విస్తృతమైన జ్ఞాన ప్రపంచం ఉందని బాలా త్రిపుర సుందరమ్మ అంటుంది. జీవ పదార్ధాలు , నిర్జీవ పదార్ధాలు అని  పదార్ధాలు రెండురకాలు అని మొదటి దానిలో మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు మొదలైనవి ఉంటే రెండవదానిలో భూమి, ఆకాశం, నీరు, గాలి , అగ్ని మొదలైనవి ఉంటాయని ఇవన్నీ తెలుసుకోవలసినవే అంటుంది. చదువు ఉంటే అన్నీ తెలుస్తాయని చెప్పింది. ప్రపంచంలో స్త్రీపురుషులకు ఏర్పాటైన పనులు సక్రమంగా నిర్వహించటానికి విద్య అవసరమని చెప్తూ చివరకు ఇల్లు చక్కదిద్దటం, పిల్లలను పెంచటం వంటివి చక్కగా చేయటానికి స్త్రీలకు విద్య అవసరమని చెప్పటంలో మళ్ళీ స్త్రీ విద్యను ఇంటి పనులకే పరిమితం చేయటం కనబడుతుంది. ఏమైనా స్త్రీలు తరచు కలుసు కొనటం కలిసి చదువుకొనటం ప్రయోజనకరమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించింది.

మొసలికంటి రమణాబాయమ్మ ( వెంకట రామణాబాయి ) కూడా రాజమునందలి జనానా సభలో చేసిన ప్రసంగం  స్త్రీవిద్య గురించే( సెప్టెంబర్ &అక్టోబర్). అందరికీ తెలిసిన విషయమే అయినా తన మాటలు బాలభాషితాలవలె  ఆనందపరచగలవని  అంటూ ఉపన్యాసం ప్రారంభించింది. తల్లిదండ్రులు చదువు చెప్పించకపోవటం వల్ల ఆడపిల్లలు కాపురంలోని కష్ట సుఖాలను అన్నదమ్ములకు ఉత్తరం వ్రాసి తెలుపుకొనటానికి వీల్లేక పోతుందని , ఎవరికైనా చెప్పి వ్రాయిద్దామంటే ఆ విషయం అత్తమామలకు తెలిసి పోతుందన్న భయంలో నిర్బంధంలో జీవితాలు గడిపేస్తున్నారని తనకెదురైనా ఒక స్త్రీ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చెప్పింది. ఇది అర్ధమైతే దానిని దాటటానికి ఇప్పుడు ప్రయత్నించి అయినా విద్య నేర్చుకోవచ్చని చెప్పింది. విద్యా  స్పర్శ వల్ల స్త్రీల చిత్తం పరిశుద్ధం అవుతుందని స్త్రీలకు అత్యంత ఆవశ్యకమైన పతిభక్తి , దైవ భక్తి, సత్యశీలత మొదలైన సద్గుణాలు సాధించటానికి సాధనం అవుతుందని , గృహకృత్య నిర్వహణ సమర్ధవంతంగా చేసుకొంటారని బాలా త్రిపుర సుందరమ్మ వలెనే అభిప్రాయపడింది.

కసవరాజు రంగమ్మ స్త్రీవిద్య గురించి వ్రాసినది ఈ వరుసలో చివరిది ( డిసెంబర్ ) చిన్న విన్నపం పత్రికాముఖంగా ప్రచురించండి అని కోరుతూ ఆమె వ్రాసిన అభిప్రాయాలు ఇందులో ఉన్నాయి. ఆమె భర్త పేరుమీద దేశోపకారి అనే పత్రికను తెప్పించుకొని కొన్ని నెలలుగా చదువుతున్నానని అందులో హిందూ సుందరి పత్రిక గురించి వ్రాసినది చూసి తెప్పించుకొని చదివానని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్  సంచికలు చదివాకా తనకు కూడా వ్రాయాలనిపించి వ్రాస్తున్నానని పేర్కొన్నది.

తనకు విశేష విద్య పరిశ్రమ లేదని , ఉన్న స్వల్ప విద్యనయినా అభివృద్ధి చేసుకొనటానికి ఎక్కువకాలం సంసార విషయాలలో వ్యయం అయిపోతున్నదని తప్పులెంచక తన వ్యాసం చదవమని కోరింది. వ్రాయటం, వ్రాసిన దాన్ని చదవటం మాత్రమే విద్య కాదని సత్యం , వినయం , వివేకం, భక్తి , పరోపకారం,  పత్ని వ్రతం ,పాతివ్రత్యం మొదలైన సద్గుణ సముదాయాలను పెంచుకొనటమని అభిప్రాయపడింది. ఇప్పటి వరకు స్త్రీలకు పాతివ్రత్యం గురించి చెప్పిన వాళ్ళే కానీ స్త్రీలకూ  పత్ని వ్రతం గురించి చెప్పిన వాళ్ళు, ప్రత్యేకించి స్త్రీలు ఎవరూ కనబడరు. దానిని చేర్చటం ద్వారా రంగమ్మ గుణాలను స్త్రీపురుషులిద్దరికి సమానమైనవిగానే భావించినట్లు. అందువల్లనే  ఇటువంటి విద్య స్త్రీపురుషులిద్దరూ పొందవలసినదే అని, అది పురుషులకు మాత్రమే హక్కు కాదని  చెప్పగలిగింది. విద్యాస్వాతంత్య్రం అందరికీ హక్కు అయిఉండగా మగపిల్లల చదువులో శ్రద్ధపెట్టి ఆడపిల్లలను నిర్లక్ష్యం చేయటం ఏమని ప్రశ్నిస్తుంది. ఆడపిల్లలను చదువు చెప్పించక పోవటం వల్ల వాళ్ళు కూపస్థ మండూకాలైవిద్యాగంధం లేని జ్ఞాన హీనులై  అందరికీ సంతాపకారకులు అవుతున్నారని అందువలన స్త్రీల చదువుకు సౌకర్యాలు కల్పించాలని అంటుంది. ఉత్తర సర్కారు జిల్లాలలో చదువుకొన్న స్త్రీలు ఎక్కువ కనబడతారని పరిశీలన మీద చెప్పింది. స్త్రీలకు చదువు పట్ల ఆసక్తిని పెంచే స్నేహం, సహవాసం, ప్రొత్సాహం ఇయ్యాలని పేర్కొన్నది. భండారు అచ్చమాంబను స్త్రీలు అనుసరించవలసిన నమూనా గా పేర్కొన్నది. భర్త కేశవరాజు నరసింగరావు తనకు రచనా స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పుకొన్నది.

రంగమ్మ అభిప్రాయాలను ఆమె చదివానని చెప్పుకొన్న హిందూసుందరి (1903, ఆగస్టు , సెప్టెంబర్, అక్టోబర్) సంచికలలో స్త్రీ విద్య గురించి వచ్చిన రచనలపై ప్రతిస్పందనగా పేర్కొనవచ్చు. వాటి మీద కొంత మెరుగైన అవగాహన , స్త్రీపురుష సమానత్వ భావన, హక్కుల స్పృహ ఈ వ్యాసంలో కనబడతాయి.

----------------------------------------------------------------------------------


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు