సాహిత్య వ్యాసాలు

(October,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర - 6

 “హర్షదాయక చిత్ర కథాళి తోడ నవ్యగతిహిందూ సుందరినడిపి మిగుల 

  ఖ్యాతి గనిన శేషమ్మ(కు గడు బ్రియముగ గరమునం దొడ్జి నాడను గంకణమ్ము” 

1928 నుండి స్త్రీలకోసం గృహలక్ష్మి పత్రికను నడుపుతూ 1934 లో సాహిత్య సామాజిక రంగా లలో విశేషకృషి చేస్తున్న మహిళలను సన్మానించి గౌరవించటానికి  గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని ఏర్పరచి ప్రతియేడూ ఒకరికి  ఇస్తూ వస్తున్న డాక్టర్ కె.ఎన్ కేసరి గంటి కృష్ణవేణమ్మకు ఇస్తున్న సందర్భంలో ( 1949 -1950)  మొదటి నుండి అప్పటి వరకు స్వర్ణకంకణం ఎవరెవరికి ఇచ్చాడో ఆయన మాటల్లోనే చెప్తున్నట్లుగా ఎవరో వ్రాసిన పద్యాలలో ఒకటి ఇది.  కర్త ఎవరో తెలియదు. కానీ హిందూ సుందరి పత్రిక నడిపినందుకు గృహలక్ష్మి స్వర్ణకంకణం పొందిన ఈ శేషమ్మ ఎవరు

శేషమ్మకు గృహలక్ష్మి స్వర్ణకంకణం లభించింది 1939లో. గృహలక్ష్మి పత్రిక కార్యాలయం అయిన మద్రాసు లోని కేసరికుటీరంలో జరిగిన ఆ సభలో కాంచనపల్లి కనకాంబ స్వాగత వాక్యాలు పలుకుతూ శేషమ్మ నుషష్టిపూర్తి ముత్తయిదువఅని ప్రస్తావించింది. శేషమ్మ 1878 బహుధాన్య సంవత్సర జ్యేష్ఠ బహుళ అష్టమి నాడు తణుకు తాలూకా వేలవెన్ను గ్రామంలో జన్మించింది. తల్లి మహలక్ష్మమ్మ. తండ్రి సత్తిరాజు వెంకటరామకృష్ణయ్య పంతులు. పది నెలల వయసులోనే తండ్రిని కోల్పోయింది. అక్క బావల దగ్గర కొంతకాలం పెరిగింది. తరువాత మేనమామ వెలిచేటి భద్రాచలం ఆమె బాధ్యత తీసుకొన్నాడు. ఆయన అమలాపురం బాలికా పాఠశాల ప్రధానో పాధ్యాయుడు. మేనగోడలిని బడిలో చేర్చి చదవనూ వ్రాయనూ నేర్పించాడు. ఆయన శిక్షణలో శేషమ్మకు భారత భాగవతాది గ్రంధాల జ్ఞానం అబ్బింది. పదకొండవ ఏట బాలాంత్రపు సుందర రామయ్యతో పెళ్లి అయింది. అక్కడినుండి ఆమె బాలాంత్రపు శేషమ్మ. 

రాజమండ్రిలో భర్తతో కలిసి జీవిస్తున్న కాలంలో  ఆమె విద్యను అభివృద్ధి చేసుకొన్నది. దేవగుప్తాపు మహలక్ష్మమ్మతో సాహచర్యం కావ్యప్రబంధ పరిజ్ఞానాన్ని పెంచింది. ఆ కాలంలో విజ్ఞానచంద్రికా పరిషత్తు వారు స్త్రీలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించేవాళ్ళు. నరసాపురం లోనూ అటువంటి పరీక్షలు నిర్వహించేవాళ్ళు. శేషమ్మ ఆ పరీక్షలకు చదివి ఉత్తీర్ణురాలయింది. కందాళ నరసింహాచార్యులుగారి దగ్గర సంస్కృతం నేర్చుకొన్నది. 1903 లో కాకినాడలో విద్యార్థినీ సమాజ స్థాపనలో పులుగుర్త లక్ష్మీ నరసమాంబతో పాటు శేషమాంబ కూడా ఉన్నది. ఆమె దగ్గర కావ్యాలు కూడా చదువుకున్నది. కాకినాడ విద్యార్థినీ సమాజానికి అనుబంధంగా స్థాపించబడిన రాజ్యలక్ష్మీ పుస్తక భా0డాగారాన్ని నిర్వహించింది. హిందూసుందరి పత్రికకు మూలధనం, చందాలు సేకరించి పంపటం నుండి, విద్యార్ధినీ సమాజ పునర్నిర్మాణం, దానికి అనుబంధంగా   మహిళా విద్యాలయం నిర్వహణ, హిందూసుందరి సంపాదకత్వం వరకు అన్నీకూడా బాలాంత్రపు శేషమ్మ కార్య కర్తృత్వ లక్షణానికి, కార్యదీక్షకు, నిర్వహణ సామర్ధ్యానికి గీటురాళ్ళు.

 1904 నాటి  విద్యార్థినీ సమాజం కొద్దికాలంలోనే మూతబడితే చిన్నచిన్న పట్టణాలలోనే  స్త్రీ సమాజములు ఎన్నో అభివృద్ధి చెందుతుండగా కాకినాడ వంటి పెద్ద పట్టణంలో  స్త్రీ సమాజం లేకపోవటం ఏమిటని దామెర్ల సీతమ్మతో కలిసి 1910 లో దానిని పునరుద్ధరించింది శేషమ్మ. శ్రీ కాకినాడ విద్యార్థినీ సమాజంగా 1911 సెప్టెంబర్ 27న ఇది రిజిస్టర్  చేయబడింది.  శేషమ్మ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం తనశక్తి యుక్తులను ఆ సంస్థ అభివృద్ధికి వినియోగ పరిచింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం సమావేశాలు నిర్వహించటం, స్వామి విద్యానంద పరమహంస స్వాములు,   ఆంద్రయోగినీ మణులుమొదలైన వారి  ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించటం, విద్యార్థినీ సమాజం స్వంత భవనం, సభాభవనం మొదలైన వాటి నిర్మాణాలకు శ్రీశ్రీ పిఠాపురం మహారాణి, లక్ష్మీ నరసాపురం జమిందారిణి శ్రీశ్రీ రావు రామయ్యమ్మ బహద్దూర్ మొదలైన వారిని కలిసి   విరాళాలు సేకరించటం, వార్షిక సభలు నిర్వహించటం, నివేదికలు సమర్పించటం వంటి పనులలో తలమునకలైంది ఆమె. శ్రీకాకినాడ విద్యార్థినీ సమాజం వార్షిక నివేదికలు ఆమె చారిత్రక దృష్టికి నిదర్శనాలు.1916 లో ప్రచురించిన ఆరవ వార్షిక నివేదిక అందుకు ఒకఉదాహరణ.మొట్టమొదటి సంవత్సరపు వార్షిక సభకు బుర్రా బుచ్చిసుందరమ్మ, రెండవ వార్షికసభకు కాంచనపల్లి కనకాంబ, మూడవ వార్షికసభకు వల్లూరిరాజేశ్వరమ్మ, నాలుగవ వార్షికసభకు ఆచంట రుక్మిణమ్మ, అయిదవసభకు కొటికలపూడి సీతమ్మ అధిపతులుగా వుండి విజయవంతం చేసిన విషయాన్ని ఈనివేదికలో నమోదుచేసింది. 

1910లో గుంటూరులో,1911 లో కాకినాడలో ఆంధ్రమహిళాసభ ప్రధమ ద్వితీయ మహాసభలు జరుగగా శేషమ్మ ఆహ్వానసంఘ అధ్యక్షులుగా 1912 మే నెలలో తృతీయ ఆంధ్రమహిళాసభ నిడదవోలులో నిర్వహించబడింది. 1913లో బందరులోను, 1914లో విజయవాడలోను, నిర్వహించ బడిన చతుర్థ  పంచమ ఆంధ్ర మహిళా సభలలో, 1916 లో జరిగిన  సప్తమ ఆంధ్రమహిళా సభ మొదలైన  అన్నిటిలోనూ ఆమె చురుకైన భాగస్వామ్యం ఉంది. అవసరాలకు తగిన తీర్మానాలను ప్రవేశ పెట్టటం,ఆమోదింప చేయటం చూస్తాం.  స్త్రీల విద్యకు, గౌరవకరమైన జీవనోపాధుల ఏర్పాటుకు తీర్మానాలు ఉండటం విశేషం. నరసాపురపు తాలూకాభివృద్ధి సంఘపు పరీక్షలో, విజ్ఞానచంద్రికా మండలి నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణతను  మహిళలను  బాలికా పాఠశాలలో  ఉపాధ్యాయులుగా  నియమించటానికి అర్హతగా గుర్తించాలని ప్రభుత్వ విద్యాశాఖ కు సిఫారసు చేస్తూ తీర్మానం చేయటం అటువంటి వాటిలో ఒకటి.

 ఇక విద్యార్ధినీ సమాజానికి అనుబంధంగా మహిళా విద్యాలయాన్ని నిర్వహించటంలో కూడా శేషమ్మ కృషి చెప్పుకోతగినది. 1928 జులై హిందూసుందరి లో కాకనాడ విద్యార్థినీ సమాజం కార్యదర్శిగా శేషమ్మ చేసిన విన్నపం సంపాదకీయం స్థానంలో ప్రచురించబడింది. బాలికలకు, యువతులకు జాతీయ విద్యనేర్పటానికి  మహిళా విద్యాలయం ఏర్పరచి అప్పటికి నాలుగేళ్లు అయినట్లు దానివలన తెలుస్తున్నది. శిరోమణి పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఉపాధ్యాయులుగా నియమించి ప్రభుత్వ గుర్తింపును పొంది ప్రభుత్వ నిర్దేశిత పాఠ్య ప్రణాళికతో  నిర్వహించ బడుతున్న సంస్థ అని కార్యదర్శి ప్రకటన( హిందూసుందరి, 1928, మే) వల్ల స్పష్టం అవుతున్నది. పన్నెండేళ్ళు వచ్చేసరికి బాలికలకు పెళ్లిళ్లు చేయటం, విద్యాప్రతిబంధకమైన సాంసారిక కృత్యాలు మీదపడిన ఆ పిల్లలు అర్ధాంతరంగా విద్యను విడిచి వెళ్ళటం జరుగుతున్నందున వితంతు యువతుల చదువు మీద కేంద్రీకరించింది ఈ విద్యాలయం. 18 ఏళ్ల నుండి 20 ఏళ్ల లోపు బాలవితంతువులకు ఐదేళ్లు అగ్రిమెంట్ వ్రాసినవాళ్లకు నెలకు 8 రూపాయల చొప్పున, మూడేళ్లు అగ్రిమెంట్ వ్రాసినవాళ్లకు నెలకు 5 రూపాయల చొప్పున ఉపకారవేతనం ఇచ్చి ఉచిత వసతి కల్పించి విద్వాన్, శిరోమణి మొదలైన పరీక్షలకు సిద్ధంచేసే శిక్షణ ఇప్పించటం, గౌరవపూర్వక జీవనం ఏర్పరచుకొనటానికి సహాయపడటం ఈ విద్యాలయం పెట్టుకొన్న కార్యక్రమం. 

 శేషమ్మ సంస్కరణాభిలాషి. స్త్రీలు చదువుకొనాలని ఆశించింది. అందుకోసం మాట్లాడి  వ్రాసి ఊరుకోలేదామె. బాలవితంతువులను చేరదీసి ప్రోత్సహించి విద్య చెప్పించింది. అలా ఆమె  చదువు చెప్పించిన ఇరగపరపు  వెంకటరత్న మద్రాసు క్షయ వైద్యశాలలో మేట్రన్ గా వైద్యసహాయం అందిస్తూ, భావరాజు రంగనాయకమ్మ ఉభయభాషాప్రవీణ అయి బెంగుళూరు ఉన్నత పాఠశాలలో అధ్యాపకురాలుగానూ స్వతంత్ర జీవనం సాగిస్తున్నట్లు  కాంచనపల్లి  కనకాంబ పేర్కొన్నది. ( గృహలక్ష్మి, 1939, ఏప్రిల్ )  

 మొసలికంటి రామాబాయమ్మ సంపాదకత్వంలో సత్తిరాజు సీతారామయ్యనడుపుతున్న హిందూ సుందరి పత్రికను కాకినాడ విద్యార్థినీ సమాజం పక్షాన నడపటానికి  ఆ విద్యార్థినీ సమాజ కార్యదర్శిగా చొరవ తీసుకున్నది శేషమ్మ. ఫలితంగా  1913 లో విద్యార్థినీ సమాజం యాజమాన్యం లోకి వచ్చిన ఆ పత్రికకు దాదాపు పదిపన్నెండేళ్ళు  కళ్లేపల్లి  వెంకట రమణమ్మ, మాడభూషి చూడమ్మ సంపాదకులుగా ఉన్నప్పటికీ బాలాంత్రపు శేషమ్మ కుదానితో నిత్యసంబంధం .1925 తరువాత ఆమే సంపాదకురాలు. ఆపత్రికకు ఆమెవ్రాసిన సంపాదకీయాలు సమకాలీన సమస్యలను సంబోధిస్తూ ఉండేవి. 1940 జనవరి సంచికకు కృతజ్ఞత అనే శీర్షికతో వ్రాసిన సంపాదకీయం చాలా విలువైనది.1939 సంవత్సరంలో పత్రికకు రచనలను ఇచ్చినవాళ్ళను ప్రస్తావిస్తూ వాళ్ళగురించి ఆమె ఇచ్చిన సమాచారం ప్రత్యేకించి స్త్రీల సాహిత్య చరిత్ర నిర్మాణానికి దిక్సూచిగా ఉంటుందనటంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. కాంచపల్లి కనకాంబ,పులుగుర్తలక్ష్మీనరసమాంబ, చిల్కపాటి సీతాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ, పొణకాకనకమ్మ, సత్తిరాజుశ్యామలాంబ, కాళ్ళకూరి మహాలక్ష్మీ సుందరమ్మ, సమయమంత్రి రాజ్యలక్ష్మి, కావలిసుబ్బలక్ష్మి పిశుపాటి అనసూయాదేవి, చల్లమాణిక్యాంబ,సి.వి.మీనాక్షి, జి.వి.శాంతరత్నం, బుర్రా కమలాదేవికొలిచినపద్మిని, విద్వాన్ రామరత్నమ్మ,కొత్తపల్లి వెంకట రత్నమ్మ, పి.వెంకటసూరమ్మ, భువనగిరి లక్ష్మీకాంతమ్మ, అల్లం రాజు వెంకటసుబ్బమ్మ, కౌ.చంద్రమతి, దివాకర్ల సూర్యకాంతమ్మ, కావలిశేషమ్మ, ఎ .స్వరాజ్యలక్ష్మి, చె .వెం .ర.జగదీశ్వరి, ద.సీతాసుందరమ్మ, గుడిపూడి ఇందుమతీదేవి, వారణాసి సుభద్రమ్మ-  1939 లో హిందూసుందరికి వ్రాసిన 29 మంది మహిళల పేర్లు ఇట్లా  ఒక చోట నమోదు చేసి వాళ్ళ రచనలు సేకరించి చదవటానికి ప్రేరణ ఇస్తున్నది బాలాంత్రపు శేషమ్మ.   

 

బాలాంత్రపు శేషమ్మ కాంగ్రెస్ రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసింది. 1923లో బొంబాయి లో జరిగిన అఖిల భారత మహిళా సభకు ఆంధ్రదేశ ప్రతినిధిగా వెళ్ళింది. కాకినాడ కాంగ్రెస్ మహిళా సభాకార్యదర్శిగా సభలను చక్కగా నిర్వహించింది.1928 లో మద్రాస్ లో జరిగిన జాతీయ మహాసభలో స్వచ్ఛందంగా సేవలు అందించింది. కాకినాడలో ఉప్పుసత్యాగ్రహ ప్రారంభ కురాలు. కాకినాడ పురపాలక సంఘానికి మహిళాప్రతినిధిగా ఎంపిక అయి నాలుగేళ్లు పనిచేసింది. కాంగ్రెస్ సభలు  కలకత్తా, బెల్గామ్ వంటి చోట్ల ఎక్కడికైనా ఉత్సాహంగా  వెళ్ళేది. ( గృహలక్ష్మి, 1939, ఏప్రిల్) కానీ అందుకు సంబంధించిన వార్తలు గానీ, ఆమె రచనలు గానీ ఏమీ లభించటం లేదు. 

            శేషమ్మకు లేక లేక కలిగిన కూతురు మహాలక్ష్మీసుందరమ్మ. ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ హిందూసుందరి మిత్రులు అనేకులు పద్యాలు వ్రాసారు. తన సంఘసంస్కరణ ఆదర్శానికి దీటుగా కూతురిని  సంస్కృతంలో ఉన్నత విద్యావంతురాలిని చేసింది శేషమ్మ. తనతో పాటు కాంగ్రెస్ మహిళా సభలకు తీసుకువెళ్లేది. ఉప్పుసత్యాగ్రాహంలో పాల్గొనటానికి కూతురిని కూడా ప్రోత్సహిం చింది. భాగస్వామి అయ్యేట్లు ప్రోత్సహించింది. రజస్వల పూర్వ వివాహపద్ధతిని కాదని పదహారేళ్లు వచ్చాక కూతరుకి పెళ్లిచేసిన ( 1932, మార్చ్) ఆచరణ వాది బాలాంత్రపు శేషమ్మ. ( గృహలక్ష్మి, 1932, మార్చ్)  పాతికేళ్ల వయసులోనే  ( 19 - 7- 41)    కూతురు మరణించటం శేషమ్మ జీవితంలో పెద్ద విషాదం. ఆ తరువాత శేషమ్మ రచనలు, ప్రస్తావన పెద్దగా తెలియరావడం లేదు. 

                                                            1 

            బాలాంత్రపు శేషమ్మ జీవితంలో  ప్రధానభాగం కాకినాడ విద్యార్థినీ సమాజంతో  దానికి అను బంధంగా నడిచే మహిళా విద్యాలయంతో, హిందూసుందరి పత్రికతో పెనవేసుకొని పోయింది. ఏ   మహిళాభ్యుదయాన్నికాంక్షించిందో దాని  ప్రచారానికి ఉపన్యాసాలు  ఇవ్వటం, వ్యాసాలు వ్రాయటం ఆమె జీవితంలో మరొక భాగం. ఆమె రచనావ్యాసంగంలో సృజన సాహిత్యం పాలు తక్కువే. 

            1903 లోకాకినాడ విద్యార్థినీ సమాజం ఏర్పడి వారంవారం జరిగే సమావేశాలలో ఉపన్యాసాలు ఇయ్యటాని కంటే ముందే శేషమ్మ హిందూసుందరి పత్రికకు వ్రాయటం మొదలు పెట్టింది. హిందూసుందరి పత్రిక 1902 జనవరి సంచికలోస్త్రీవిద్యాభిమానులకు ఒక విన్నపముఅనేశీర్షికతో శేషమ్మ వ్రాసిన వ్యాసం ప్రచురించబడింది. హిందూసుందరి పత్రికలో స్త్రీలు వ్రాసిన సంగతులు చూచుటచేత ఉత్సాహము కలిగి తాను ఇలావ్రాయటానికి సాహసిస్తున్నాని ప్రారంభంలో పేర్కొన్న మాటలు గమనించదగినవి.ఈ 1902 జనవరి  హిందూసుందరి మొదటి టైటిల్ పేజీపై సంపుటి 1 సంచిక 10 అని ఉన్నది. అంటే అప్పటికి పదినెలలుగా ఈపత్రిక వస్తున్నదన్నమాట. ఆ పత్రికను  బాలాంత్రపు శేషమ్మ చదువుతూ తన భావాలు పంచుకొనటానికి ఒకవేదికగా భావించి తొలిప్రయత్నంగా వ్రాసిన వ్యాసం ఇది. అక్కడి నుండి ప్రారంభించి శేషమ్మ రచనలలో  వ్యాసాలు, ఉపన్యాసాలు తో పాటు సంస్థలకు, సమావేశాలకు సంబంధించిన నివేదికలు ప్రకటనలు కూడా ఉన్నాయి.

            ఈ సందర్భంలో ప్రస్తావించవలసిన విషయం మరొకటి ఉంది. 1902 జనవరికి 10   సంచిక వచ్చిందంటే అది 1901 లోనే ప్రారంభించబడి ఉంటుంది. కానీ ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు (పొత్తూరి వెంకటేశ్వర రావు, 2004) పుస్తకంలో హిందూ సుందరి 1902 ఏప్రిల్ లో మొదలైనట్లు ఉన్నది.1904 ఏప్రిల్ సంచికలో స్వవిషయము అనే శీర్షిక తో పత్రికాధిపతులు వ్రాసిన విషయాలను బట్టి, అంతకు ముందరి సంచికలు ఏవీ దొరకకపోవటాన్నిబట్టి ఇలా పొరపడి ఉండవచ్చు.పత్రిక ఉద్దేశాలను, విధానాలను పేర్కొంటూఈ మాసపత్రికను వెలువరించ ప్రారంభిం చినాముఅని పత్రికాధిపతి వ్రాసిన వాక్యంఅప్పుడేప్రారంభమైనట్లు అర్ధంచేసుకొనటానికి వీలిచ్చేదిగా ఉంది.అప్పటికి ఏడాది అయింది పత్రిక ప్రారంభమై. ఏడాది అయిన సందర్భంగా తన అనుభవాలను చెప్పుకొంటున్నట్లుగా వ్రాసిన స్వవిషయం ఇది. 

            స్త్రీ విద్య బాలాంత్రపు శేషమ్మకు ప్రాధాన్య అంశం. దాదాపు ఆమె వ్యాసాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్త్రీవిద్యను చర్చించాయి. ఆ క్రమంలో స్త్రీపురుషుల మధ్య అసమానతలను, స్త్రీల పట్ల అమలవుతున్న వివక్షను ఆమె నిరసించింది. స్త్రీల అభ్యుదయాన్ని ఆశించి ఆధునిక పురుష ప్రపంచం సంస్కరణ ఉద్యమాలకు పూనుకొనటాన్ని అభినందించింది.స్త్రీవిద్యాభిమానులకొక విన్నపముఅనే వ్యాసాన్నిస్త్రీలమగు మనయెడల ఆర్యులు విధించిన కట్టుబాట్లు తలచుకొన్న నొడలుకంపమెత్తి వడకసాగెనుఅనిప్రారంభించింది శేషమ్మ. ఈ వ్యాసంలో ఆమె పురుషులను రెండు రకాలుగా విభజించింది. స్త్రీలు పాటలు పడకూడదు, అట్లా పాడేవాళ్లు వేశ్యలు కానీ సంసార స్త్రీలు కారు అని, స్త్రీలు స్వతంత్రులు కారు, గౌరవపాత్రులు కారు, వాళ్ళ మాట వింటే చెడిపోతారు ఇలాంటి విధి నిషేధాలతో, స్త్రీలను బుద్ధిహీనులుగా చేసి చూపిన వెనుకటి పురుషులు ఒకరకం. ఈ కట్టుబాట్లు వట్టి పిచ్చివి అని, స్త్రీల యెడ గౌరవం కలిగి వారివిద్యాభ్యాసాలకు ఏర్పాట్లు చేస్తున్న సమకాలీన సంస్కర్తలైన పురుషులు మరొకరకం. వెనుకటిపురుషులు భార్యలను తమకు లోకువవారని తలచి అహంకరించిన దానిఫలితం స్త్రీలు విద్యావిహీనులు, జ్ఞానశూన్యులు కావటం. పురుషులు స్త్రీలు సమమనే భావం పెంపొందాలని, విద్యా ధనం  పక్షపాతం లేక  సమంగా భాగించి పంచాలని ఆమె ఆకాంక్షించింది. 

            1904 జనవరి నుండి పులగుర్త లక్ష్మీనరసమాంబ కాకినాడలో సావిత్రి పత్రికను ప్రారంభించింది. మార్చ్ సంచికలో ఆప్రయత్నాన్ని అభినందిస్తూ బాలాంత్రపు శేషమ్మ వ్రాసినతెలుగుదేశమందలి స్త్రీల విద్యఅనే ఒక రచన ప్రచురితమైంది. స్త్రీలు స్త్రీలకొరకు ఒకపత్రికను ప్రారంభించటం ఉన్నతవిద్యాభివృద్ధికి సూచికగా భావిస్తూ ఆమె ఈ వ్యాసం వ్రాసింది. స్త్రీలలో ఉన్నతవిద్యాభివృద్ధి కొత్తగా పొందినదా పూర్వము ఉన్నదేనా అనిఒక ప్రశ్న వేసుకొని పురాతన గ్రంధాలవలన స్త్రీలు రాజ్యాలు ఏలి, యోగులై జ్ఞానబోధ చేసి , ఉద్గ్రంధాలు రచించి కీర్తి పొందిన విషయం తెలుస్తున్నది కనుక స్త్రీలు ప్రాచీనకాలం నుండి ఔన్నత్యం కలిగిఉన్నారనేది నిర్వివాదం అంటుంది. ముస్లిముల దాడులతో స్త్రీలకు జరుగుతున్నమానహానిని సహించలేక ఘోషా విధించటం తోమొదలై క్రమంగా చదువు, స్వేచ్ఛ స్వాతంత్య్రం మొదలైనవి వాళ్లకు నిషేధించబడ్డాయి అన్న వాదాన్ని శేషమ్మ కూడా నమ్మి మాట్లాడటం కనిపిస్తుంది.హూణుల రాజ్యపాలన మొదలైన తరువాత స్త్రీపురుష సమానత్వాన్నిప్రచారం చేస్తూ స్త్రీవిద్యాభివృద్ధికి దోహదం చేశారని అభిప్రాయపడింది. స్త్రీవిద్యకు కందుకూరి వీరేశలింగం చేసిన కృషిని ప్రస్తావించి స్త్రీల కోసం రాయసం వెంకటశివుడు, సత్తిరాజు సీతారామయ్య జనానా , హిందూసుందరి పత్రికలను ఏర్పరచిన విషయం కూడా చెప్పి పురుషులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుటకు సందేహించి వ్రాయ సామర్ధ్యం గల స్త్రీలు కూడా వ్రాయటం మానేస్తున్నారని దానిని పరిష్కరించటానికి పులుగుర్త లక్ష్మీనరసమాంబ సావిత్రి పత్రికను ప్రారంభించిందని ఆమె ఈవ్యాసంలోపేర్కొన్నది.

ఉత్తరాంధ్ర సరిహద్దులలోని గంజాం జిల్లాలో ఆసికా అనే పట్టణం లో బుర్రబుచ్చిబంగారమ్మ స్థాపించిన ఆసికా స్త్రీసమాజం ఏర్పాటు చేసిన సభలో చేసిన ప్రసంగాన్ని( హిందూ సుందరి,1907, జనవరి) శేషమ్మకారణాంతరల చేత అంతరించిన స్త్రీస్వాతంత్య్రమును దిరుగ మనకొసంగి స్వేచ్ఛనిచ్చుటకు గాను కొందరు పుణ్యపురుషులను సృజించాడని భగవంతుడిని కొనియాడుతూ ప్రారంభించింది. ఆ పుణ్యపురుషులవలనే వంట పొయిలు తప్ప వేఱుస్థలమెరుంగని స్త్రీలు సమాజాలు పెట్టుకొని సమావేశం కాగలుగుతున్నారని ఆనందపడింది. స్త్రీలకు విద్య ఆవశ్యకమని అది ఎంతవరకు సాధ్యం? ఎట్టి విద్య స్త్రీలకు తగినది? విద్యాస్వాతంత్య్రం ఎంత వుంది? అన్నమూడు ప్రశ్నలను వేసి చర్చింది శేషమ్మ. వేదఋక్కులు, వివాహమంత్రాలు వ్రాసిన వేదకాలపు స్త్రీల శక్తి సామర్ధ్యాలు, సులభ మొదలైన పురాణకాలపు స్త్రీల శక్తిసామర్ధ్యాలు ప్రస్తావిస్తూ స్త్రీలు ఎట్టివిద్య సంపాదించాలని ఎంత కృషిచేస్తే అంత పొందగలుగుతారనటంలో సందేహం ఏమాత్రం లేదని చెప్పింది. భాగవత కథలను, ఉత్తర రామ చరిత్ర నాటకాన్నిదేవహూతి, ఆత్రేయి  మొదలైన స్త్రీలను ప్రస్తావిస్తూ వేదాంత విద్య యందు స్త్రీల ఆసక్తిని, కృషిని పేర్కొని స్త్రీలకు ఈవిద్య తగును, ఈవిద్య తగదు అనే వివాదమే అవసరం లేదంటుంది శేషమ్మ. భాగవత సత్యభామ ను ప్రస్తావిస్తూ స్త్రీలుయుద్ధవిద్యలు కూడా నేర్చిన విషయాన్ని గుర్తుచేసింది.భండారు అచ్చమాంబ అబలా సచ్చరిత్ర రత్నమాల లో యుద్ధము మొదలైన ఘనకార్యాలు నిర్వహించిన స్త్రీల సంగతి విశేషంగా వ్రాసిన సంగతిని కూడా పేర్కొన్నది. ఇక స్వాతంత్య్రం విషయానికి వస్తే సమాజాలుగా ఏర్పడే స్వాతంత్య్రం పొందటం లోనే స్త్రీలకు ఉన్నతవిద్యను పొందే స్వాతంత్య్రం, బాధ్యత సమకూడాయని అభిప్రాయపడింది.

ఆదిభాష, జ్ఞానమూలము అయిన సంస్కృతం, ప్రస్తుత రాజభాష అయిన ఇంగ్లీషు, దేశభాష అయిన తెలుగు స్త్రీలు నేర్చుకోవాలని, సజ్జన సహవాసం, పరస్పర సహకారం స్త్రీలకు ఉన్నత విద్యావంతులు కావటానికి మార్గం సుగమం చేస్తాయని చెప్పింది శేషమ్మ.

            ‘నవీనోద్యమముఅనే ఉపన్యాసంలో ( హిందూసుందరి, 1914, మార్చ్)  బాలాంత్రపు శేషమ్మ నూతన ధర్మములగు కార్యములచేతను,తత్ఫలములచేతను, భావములచేతను, ఉద్యమములచేతను ఉద్విగ్నంగా ఉన్నకాలాన్ని గురించి ప్రస్తావించింది.స్త్రీలు సమాజములు స్థాపించటం, విద్యను వ్యాపింపచేయటం, బాలికా పాఠశాలలు ఏర్పరచటం, వాటినిర్వహణకు దానం ఇయ్యటం, గ్రామగ్రామాలు తిరిగి విరాళాలు సేకరించటం , స్త్రీలకు వృత్తి నైపుణ్యాలు అలవరచే పనులు చేయటం మొదలైన కొత్తఉద్యమాలకుదిగారని, పురుషులు కూడా స్త్రీవిద్యాభిమానులై తోడ్పాటును అందిస్తున్నారని పేర్కొన్నది. ఆనాటి లెక్కలప్రకారం ఒకకోటి ఎనిమిది లక్షలు మించిన బాలురలో ప్రయిమరీవిద్యలో ముప్ఫయి లక్షలమంది మాత్రమే ఉన్నారంటే ఇక ఆడపిల్లల చదువు ఎంత అధ్వానస్థితిలో ఉందో వూహించునంటుంది శేషమ్మ.విద్యావతియగు తల్లిగల బిడ్డ మాత్రమే బడికిపోతుంది గానీ తక్కిన బాలికలుఎందరో ఇంటిపనిపాటలకే బందీలైపోతారని బాధపడింది. బాలికల పరిస్థితి ఇలావుంటే ఇక వితంతు స్త్రీలకు విద్యావకాశాలు ఎంతగా మూసివేయ బడతాయోకదా  అని వేదన పడింది. వాళ్ళకోసం జాతీయ విద్యాలయాల ఏర్పాటు అవసరాన్నిసూచించింది. ఆవిధంగా వేటపాలెంలో కొండ వెంకటప్పయ్య నడుపుతున్నశారదా నికేతనం గురించి కూడాపేర్కొన్నది.

1911 ఏప్రిల్ ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకు శేషమ్మమనకు గావలసినదేది? పరార్ధపరత్వముఅనే వ్యాసం వ్రాసింది.పరార్ధతత్వము అంటే పరుల ప్రయోజనములందు ఆసక్తి కలిగిఉండటం అనినిర్వచించి, మిత్రలక్షణం, సోదరప్రేమ మనుషులయందు ఉండవలసిన గుణాలుగా పేర్కొన్నది.పదార్ధపరత్వం పలురకాలుగా ఉంటుందని చెప్పి ఆబాలసచ్చరిత్ర రత్నమాలను ఆంద్రస్త్రీలకు కానుకగా ఇచ్చిన  బండారు అచ్చమాంబలో అది గ్రంధరూపంలో ఉందని, డొక్కాసీతమ్మలో అది అన్నదానరూపంలోఉంటే పోలవరం జమీందారు స్త్రీలు అత్తాకోడళ్లు అయిన కామాయమ్మ బంగారమ్మలలో అది దానదయా వితరణ గుణాల రూపంలోఉన్నాయని కొన్నిఉదారణలతో చెప్పింది.

శేషమ్మ వ్రాసిన మరిరెండు వ్యాసాలు స్నేహానికి, ఐకమత్యానికి సంబంధించినవి. స్త్రీలు అభివృద్ధిలోకి తేగలిగినది స్నేహం ఒక్కటే అంటుంది. జీవితంలో స్నేహం యొక్క ప్రాధాన్యతను రకరకాలుగా వర్ణించి స్త్రీలపట్ల స్నేహభావంతో నీతిదాయకములైన సంగతులు అనేకం వ్యాసాలుగా వ్రాస్తున్న కొటికలపూడి సీతమ్మ, భండారు అచ్చమాంబ, పులుగుర్త లక్ష్మీ నర్సమాంబ మొదలైన స్త్రీలను ఆదర్శంగా చూపి స్త్రీలు పరస్పరం స్నేహంగా ఉండాలని దానికి మూలాధారం సమాజమేనని ప్రబోధించింది. (హిందూసుందరి,సెప్టెంబర్& అక్టోబర్ 1903) భగవంతుడు, విక్టోరియా మహారాణి , కందుకూరి వీరేశలింగం వంటి వారిని ప్రస్తావిస్తూ స్త్రీవిద్యకు దేశంలో ఏర్పడుతున్న అనుకూల వాతావరణాన్ని గురించి చెప్పి ఈ సందర్భంలో స్త్రీలు ముఖ్యముగా నేర్చుకోవలసినది ఐకమత్యము అంటుంది శేషమ్మ. ఇదివరకు పదిమందితో కలిసి తిరుగుట, పదిమందితో ఏకభావంతో ఒక ఘనకార్యం చేయటం మొదలైన పనులు స్త్రీలకు అలవాటు లేకపోవటం వలన ఐకమత్యం గురించి పట్టించుకోలేదని కానీ కొత్తగా సమాజాలు పెట్టుకొని విద్యాసామాజిక సాహిత్య రంగాలలో అభివృద్ధి చెందాలన్న తలంపుతో ఉన్న స్త్రీలకు ఐకమత్యమే అనుసరణీయం అని ఈ వ్యాసంలో వివరించింది శేషమ్మ ( హిందూ సుందరి, సెప్టెంబర్ 1906). దానిని జీవితాచరణ వాస్తవం నుండి నిరూపిస్తున్నట్లుగా ఉంది ఆమె 1938  ఫిబ్రవరి హిందూసుందరి సంచికకు సంపాదకీయం స్థానంలో మాడభూషి చూడమ్మ గురించి వ్రాసిన సంస్మరణ వ్యాసం. 

మాడభూషి చూడమ్మ హిందూసుందరి పత్రికకు కొన్నేళ్ల పాటు కళ్లేపల్లి వెంకటరమణమ్మతో కలిసి సంపాదకురాలిగా వ్యవహరించింది. ఉన్న 1938 జనవరిలో ఆమె మరణించింది.అప్పుడు సంపాదకురాలిగా  బాలాంత్రపు శేషమ్మ వ్రాసిన వ్యాసం చూడమ్మ గురించే కాదు శేషమ్మ గురించి కూడా చెప్తుంది.స్నేహం యొక్క విలువకు వ్యాఖ్యానం అది. బాల వింతతువు అయిన చూడమ్మ తానూ కందాళ నరసింహాచార్యులు వద్ద కలిసి కావ్యాలు చదువుకొనటం, కలిసి విజ్ఞానచంద్రికా పరిషత్తు వారు, నరసాపురం వారు నిర్వహించిన పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులు కావటం, ఇద్దరూ కలిసి కాకినాడ విద్యార్థినీ సమాజాన్నిపునరుద్ధరించడం, కలిసి యాత్రలుచేయటం, కలిసి హిందూ సుందరి పత్రికను నడపటం, తానుకన్నకూతురిని ఆమెపెంచి పెద్దచేయటం వంటి విషయాలను ఎన్నింటినో ఇందులో ప్రస్తావించింది శేషమ్మ. విద్యా సామాజిక సాంస్కృతిక రంగాలలో పనిచేసే స్త్రీలమధ్య ఉండవలసినవిగా శేషమ్మ పదేపదే చెప్తూ వచ్చిన సహకారానికి, ఐక్యతకు నమూనా చూడమ్మతో శేషమ్మ స్నేహ సాహచర్యాలు. 

                                                  2

బాలాంత్రపు శేషమ్మ సృజన రచన ఒకటి మాత్రమే కనబడుతున్నది.అదిధైర్య స్థైర్యములు’  సంభాషణాత్మక కథనం. ధైర్యవతి, పార్వతి బడికివెళ్ళేపిల్లలు. చదువుపట్ల వాళ్ళశ్రద్ధ, వాళ్ళలోని మంచిగుణాలను వర్ణించటం ఈకథనానికి లక్ష్యం. పిల్లలకు ధైర్యంస్థిరప్రవృత్తి రెండూ ఉండవలసిన గుణాలు అని ఆరెండింటినీ ఈఇద్దరు బాలికల యందు నిరూపిస్తూ చేసిన రచన ఇది. ధైర్యవతి పొద్దున్నేచద్ది అన్నం తిని పలక పుస్తకాలు తీసుకొని బడికి బయలుదేరుతూ పార్వతివాళ్ళంటికి వెళ్లి తనను తీసుకొని బడికి వెళతానని తల్లిని పిలిచి చెప్పి వీధి తలుపు వేసుకోమని చెప్పటం దగ్గర మొదలై పార్వతి ఇంటికివెళ్ళే లోపల ఆమెఎంతధైర్యవంతురాలో నిరూపించబడుతుంది. ధైర్యవతి వాకిట్లోకి వస్తూనే ఎదురింటి ఆమె కొడుకును రెక్కపట్టుకొని లాక్కువచ్చి బడికిపొమ్మని కోప్పడటం చూస్తుంది. బడికి పోవాలంటే ఏడ్చే కొడుకును విసుక్కొంటూ ఆతల్లిపనికిమాలిన యాడుదైనా ఇప్పుడు చదువుకొనుచున్నదిమగవాడివి కూడా , పెళ్ళానికి తిండి అయినా పెట్టాలికదా రెండుముక్కలు చదువుకోకపోతే ఎలాబ్రతుకుతావురాఅని మందలించటం గమనించవలసిన విషయం. మగవాళ్ళు పెళ్ళాన్నిపోషించుకొనటానికి చదువుకోవాలి. ఆడపిల్లలు పోషింపబడేవాళ్లు కనుక వాళ్లకు చదువుఅక్కరలేదు.ఇది అప్పటివరకు ఉన్నస్థితి.ఇప్పుడు దానిలో చలనం తెస్తున్నారు ఆడపిల్లలు ఉత్సాహం గా చదువులకు ముందుకువస్తూ. అందుకే ఆతల్లి ధైర్యవతిని చూపిస్తూ చూడు నీఈడుపిల్ల ఎంతచక్కగా బడికివెళుతున్నదో అనిచెప్పి కొడుకును ప్రోద్బలంచేస్తుంది. బడికి వెళ్లే వీధిలో కాట్లాడుకుంటున్నకుక్కలు కరుస్తాయి నేనుపోను ఆపిల్లవాడు మొరాయిస్తుంటాడు.

ధైర్యవతి ఆమెను వారిస్తూ మాట్లాడినమాటలు పిల్లలలో లేనిపోనిభయాలు కల్పించేది తల్లిదండ్రులే అని చెప్పకనే చెప్తాయి.కుక్కలు కరుస్తాయిఅన్నది ఒక బెదిరింపు మాట గా వాడేటప్పుడు ఆతల్లిదండ్రులు ఆమాట పిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందన్న విషయం విస్మరిస్తారు. ధైర్యవతి అప్పారావు కు కుక్కలాభయంలేకుండా బడి వరకు తోడువస్తా పదమని  మొరాయించే ఆపిల్లవాడితోస్నేహంగా మాట్లాడి తీసుకు వెళుతుంది. ధైర్యం లేకపోతే  ప్రాణంలేని చెట్లుకూడా మనలను భయపెడతాయి అంటూ మనతోపాటు ఈ ప్రపంచంలో ఉండే జీవరాసులతో మనం ఏరకంగా ప్రవర్తించాలో చెపుతూ ఆపిల్లవాడినే కాదు మరికొందరినికూడా బడిదగ్గర విడిచి వెళ్తుంది ధైర్యవతి. పార్వతి ఇంటికి వెళ్ళేలోపల ఒక అపరిచితుడు ఆమెను మాటలలో పెట్టి మేడలో గొలుసు కాజేయాలని చూస్తే చాకచక్యంగా అతని నుండి తప్పించుకొనటంలో కూడా కీలకమైనది ధైర్యం , అందువల్ల కలిగిన వివేకం. ఆడపిల్లలలో చదువు ధైర్యం అనే సద్గుణాన్నిపాదు కొల్పుతుందని చెప్పటం శేషమ్మ ఉద్దేశం.

ఇక పార్వతి సంగతి. చక్కగా చదువుకొనే అమ్మాయి. ఆరోజు కూడా చేయవలసిన లెక్కలు, నేర్వవలసిన పాఠాలు నేర్చుకొన్నది. వాళ్ళ అక్కగారింట్లోదొంగలుపడి, ఇల్లుకాలిపోయిందని తల్లిఏడుస్తున్నా ఆమెనుపరామర్శించటానికి ఎవరెవరో వచ్చి పోతున్నా అవేవీ ఆమెచదువుకు ఆటంకాలుకాలేదు. కాకుండా చూసుకొన్నది. అదిఎలాసాధ్యమైంది? ఏడుస్తూ కూర్చొనటం వృధా పని.చదువును మించిన సంపద మరొకటి లేదు అన్నతత్వం ఒంటపట్టించుకొనటంవలన అదిసాధ్యమైంది. ఆతత్వం బడిలో ఉపాధ్యాయులు చెప్పే మంచిసంగతులవలన, హిందూ సుందరి వంటి పత్రికలు చదవటం వలన, బండారు అచ్చమాంబ వంటి స్త్రీలను ఆదర్శంగా తీసుకొనటం వలన. ఆ తత్వం స్థిరసంకల్పానికి కారణమవుతుంది. మేనమామ ఇచ్చిపోయిన రూపాయి ఇల్లుకాలి బట్టలు కాలిపోయిన అక్క కూతురికి పరికిణీలు కుట్టించటానికి తల్లి ఇమ్మంటే తనకొత్తపరికిణీలలో రెండింటిని ఇయ్యటానికైనా సిద్ధపడింది కానీ ఆ రూపాయిని సావిత్రి పత్రికకు చందా కట్టటానికి తప్పమరిదేనికీ ఖర్చుపెట్టనని తల్లితో వాదించి ఒప్పించ గలిగింది. అందుకే ఆమెస్థిరచిత్త. విద్యావిజ్ణాన సాధనకు అవసరమైన గుణం అది. స్త్రీల చేత స్త్రీల కొరకు నిర్వహించబడే పత్రికలకు స్త్రీలు తప్పనిసరిగా పాఠకులు కావటం అనే విలువ స్త్రీల మధ్య ఒక ఐక్యతకు దారితీస్తుందన్న  శేషమ్మ అవగాహనను కూడా ఈ సంభాషణ లో గుర్తించవచ్చు. 

శేషమ్మ శేష జీవిత వివరాలు ఇంకా లభించవలసే ఉంది. 

                                                           

 

 
 


ఈ సంచికలో...                     

Oct 2020