సాహిత్య వ్యాసాలు

(January,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

హృదయ సంభాషణ

కవి కంటికి మనసుకు జరిగిన సహజమైన సంభాషణే ఈ"దృశ్యం నుండి దృశ్యానికి" కవిత్వం. ఇందులో 46 కవితలున్నయి.ఇవి ఒక వర్గానికో,కులానికో ఏదో ఒక దానికో మాత్రమే పరిమితమై రాసినవి కావు.విశాలమైన భావనల అనుభూతి.ఇందులో ప్రధానంగా కాలానికి మనిషికి మధ్య జరిగిన ఘర్షణ,మనిషితత్వం-జీవితం,ప్రకృతి,స్త్రీ సమస్య,సామాజిక అంశాలు,ప్రకృతి విపత్తులు వంటివి ఉన్నయి.ఇవి ఏక కాలంలో,ఒక ప్రాంతంలో నిలకడగా కూర్చొని రాసినవి కావని అనిపిస్తుంది.అందుకే కవితలన్నీ ఆకట్టుకునే విధంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నయి.కవి మనసుతో చూసిన దృశ్యాలను కళ్లకు కట్టినట్టుగా అక్షర రూపంలో చూపిస్తడు.చాలా కవితల్లో చివరి వాక్యం పూర్తి కవితను ఆవిష్కరించేవిధంగా ఉంటది.నాకైతే భిన్నమైన కవిత్వంగా భావిస్తున్న.ఇందులోని కొన్ని దృశ్యాలను మీ ముందుంచడానికి చిన్న ప్రయత్నం చేస్తున్న.

 ఈ కవిత్వం రాసింది వి ఆర్ విద్యార్థి.తెలుగు సాహిత్యానికి సుపరిచితులు.రిటైరయ్యాక కూడా సాహిత్యం పై తనకున్న శ్రద్ధతో దీన్ని మన ముందు ఆవిష్కరించాడు.నేర్చుకునే వాళ్లకు ఉపయోగపడే విధంగా మలిచాడు.

 "ఒక మహా విస్పోటనమే కదా

 నీకు నాకు జన్మనిచ్చింది"

 అంటూ ఒక బలమైన వాస్తవాన్ని చెబుతూ కాలానికి మనిషికి అనునిత్యం జరిగే ఘర్షణ గుర్తు చేస్తూ...

"హిమాలయం శ్వేత కమలమై

 భూగోళమంత వికసించాలి

సింధు జలది ధరణి చుట్టూ

శాంతి వలయాలుగా విస్తరించాలి"

 అంటూ స్వచ్ఛమైన కలగంటాడు.ఉగ్రవాదం,హింసమత్తు ఎప్పుడు అంతరిస్తాయోనని కాలాన్ని ప్రశ్నిస్తాడు."ఇప్పుడు" అనే మరో కవితలో తనే సమాధానంగా ఈ మాట చెప్తాడు 

"ఇక ఇప్పుడు మనం

యుద్ధాన్ని ప్రకటించాల్సింది

దేశాల సరిహద్దుల మధ్య కాదు

మనిషి ఉన్మాదపు ఆలోచనల మీద"

 అంటూ మనిషి ఆలోచనలు క్రూరంగా మారాయని,2021 వచ్చినా మనిషి ఇంకా కులం,మతం,లింగం,ప్రాంతం,వంటి వివక్షల పేర్చుతూనే ఉన్నాడని,అలాంటి అజ్ఞానాన్ని విషంలా ఎక్కించే ప్రగతి నిరోధక శక్తుల ఆలోచనలపై యుద్దం తప్పదని చెప్తాడు. 

 ఇంకా మనిషి దిగజారిన విధానాన్ని  చెప్తూ 

"ఏకంగా తనే దేవుళ్లను సృష్టించి

తన రుగ్మతలన్నీ నింపి

రాజ్యం చేయడం మొదలుపెట్టాడు

దేవుళ్ళయితే అడుగడుగునా వున్నారు

మనిషే కనిపించకుండా పోయాడు"

ఈమాట  నిజం కాదని అనగలమా?.దేవుళ్ళ పేర జరిగే మూఢనమ్మకాలు ఆఖరికి మనిషి ఉనికినే లేకుండా చేస్తాయనేది ఈ కవితలో చెప్తాడు.

ఇంతలో కవి హృదయం మరో ప్రపంచాన్ని కాంక్షిస్తుంది.

"కులం లేదు మతం లేదు

జాతి లేదు జాతీయత లేదు

కృత్రిమ సరిహద్దులెన్నో

అధిగమిస్తాం

దేశికుల మాటలన్నీ 

డొల్లలు

వొస్తావా

నేనొక ప్రపంచాన్ని కనుగొన్నాను" అంటూ మరో ప్రపంచంలోకి మనిషిని ఆహ్వానిస్తాడు.

ఇంకా ఇందులో కొందరు వ్యక్తుల్నికొన్ని సంఘటనల్ని యాది చేసుకుంటాడు.అవి తన హృదయాన్ని ఎంతగా కదిలించాయో రాసుకుంటాడు. రాజస్థాన్ కార్మికుడు,హిందుస్తానీ గాయకుడు "సికిందర్"ను తన ప్రతిబింబంగా "అద్దం"అనే కవితలో ప్రేమతో రాస్తాడు.కళల బాకీ తీర్చడం కోసం ఇద్దరు ఎంత వేదన పడ్డారో చెప్తూ

"ఐనా చివరి బాకీ తీరదు

కాలం మన విషయంలో

తేల్చాల్సింది చాలా ఉంది

పద మలుపు మలుపులో నిలదీద్దాం"

అంటాడు.

 సుప్రసిద్ధ చలన చిత్ర దర్శకులుకవి బి నరసింగరావు గారికి అభివాదములతో ముచ్చటిస్తూ తనలోని సాహితీ ప్రయాణపు వేదనని తనముందు పరిచినప్పుడు అదంతా ఓపిగ్గా విని నర్సింగరావు గారు నవ్విన నవ్వు గురించి రాస్తూ...

"అది నా లోకాల్ని కంపింప జేసింది

 నా చుట్టూ నిర్మించుకున్న

 అభిప్రాయాల కుడ్యాల్ని కూల్చివేసింది

విశ్వాసాల సంకెళ్లను రాలగొట్టింది"

 అని నర్సింగరావు గారి చేత మళ్ళి కోత్తగా ప్రేరేపించబడతాడు. 

 సమ్మక్క సారక్కల అమరత్వాన్ని స్మరించుకుంటూ ఆదివాసుల పై జరిగే దాడిని చెప్తూ

"నీతి నిత్యం పరిమళించే గిరిజాతులు

బతుకు లోకానికి చక్రవర్తులు

ఓర్వగలదా దళారి లోకం!

మతపు మాయ మెరుపుల బేహార్లుగానో

పురందుల దండమయ్యో

దండెత్తి వొస్తుంది

ఓనరులన్నీ కబళించి వేస్తుంది

 అంటూ శతాబ్దాలనుండి ఆదివాసీ ప్రజలపై జరుగుతున్న హింసాకాండను,ప్రకృతి విద్వాంసాన్ని,దళారి పెట్టుబడి దారుల కుట్రలను బట్టబయలు చేస్తాడు. 

అనాది నుండి ప్రపంచమంతా విశాల మనసున్న పల్లెలు, మనుషుల అన్ని అవసరాలు తీర్చేవి.కానీ ప్రపంచీకరణ వచ్చి పల్లెలనెట్లా వల్లకాడులా మార్చాయో చెప్తూ 

"ఇప్పుడు చూడు ప్రపంచీకరణ

గ్రామాల్ని ఎలా ఒంటరితనంలోకి నెట్టిందో!

ఎలా ఎడారుల్ని చేసిందో

చిన్నబోయిన గ్రామాలకు

తిరిగి చిరునవ్వు లెప్పుడో?

పూర్వవైభవాలెప్పుడో?" అని వలపోస్తాడు.

 హుద్ హుద్ తుఫాన్ విపత్తు ధాటికి బలైన వారిని తలచుకొని విలపిస్తాడు.తుఫాన్ ఉత్తరాంధ్రకు చేరిందని వార్త వినగానే విశాఖపట్నం గుర్తుకొచ్చి

"నిరంతరం కలల అలలతో రెపరెపలాడే ఆ తీరం

ఎలా గాయపడింది...

విశాఖ ఆత్మ ఎంత ఘోషిందో

కృష్ణక్కా ఎలా ఉన్నావు?

చలసాని క్షేమమేనా

మాస్టారు మంచేనా

ఏమైనా ఇది చేదు కాలం...

ఓదార్చలేనంత దూరంగా వున్నాను"

 అంటూ అమెరికా నుండి రాలేని,ఓదార్చలేని నిస్సహాయతను అక్షరరూపంలో రాసుకుంటాడు.

మహిళా సమస్యపై మాట్లాడుతూ....

"ఆడది చెడిపోయినప్పుడు

తోడుగా చెడింది చెట్టా పుట్టా?

మగవాడికి లేని శీలము

ఆడవాళ్ళకే అవసరమేమిటో"

 అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,హత్యలు నిరసిస్తూ పితృస్వామ్య భావజాలం ఉన్న మనుషులకు సూటి పదునైన ప్రశ్న వేస్తాడు.

 మరో కవితలో కామందుల క్రూరత్వాన్ని చెప్తూ

నిర్భయ చట్టం ముందుగూడా

వాడు నిర్భయంగా గంతులేస్తాడు

 పైశాచికంగా ప్రవర్తిస్తాడు"

అంటూ ఉన్మాది స్వరూపాన్ని చెప్తూ

 ఆడపిల్లలకు ఏడవకండి,మీలో అంతులేని పోరాట శక్తి ఉందని

"ధైర్యమే మీ కవచం

తిరుగుబాటు మీ ఆయుధం"

అని ధైర్యాన్ని చెప్తాడు.

చివరగా సాహితీ ప్రపంచానికి వద్దాం.నా ఇంట్లో గ్రంధాలయముంది,మెదట్లో అంతులేని జ్ఞానముంది,నా ఉపన్యాసాల్లో చాతుర్యముందని భ్రమపడే "అజ్ఞాన సామ్రాట్టు" గురించి చెప్తు

"చర్చలకు పిలిచిన నీలి సరస్సులోని

తెల్ల హంసల్ని

పూల తోటలోని గొంగలిపురుగుల్ని

ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపుల్ని

ఎప్పుడూ పట్టించుకోను" అని ఆ అజ్ఞాన సామ్రాట్టు అనుకుంటాడని, 

ఇంకా తను అహంకారంతో

"గంగాజలం గూడా

నా శంఖంలో పోస్తేనే

అది తీర్థమవుతుంది

ఏ జెండా ఎగరాలన్నా

నా పెరట్లో పెరిగిన

గడకర్రయే మూలాధారం"

అని విర్రవీగుతాడు.

 కానీ ఇప్పుడు కావల్సింది నిజమైన ప్రజాకవని.అతనెలా ఉంటాడంటే ఒక వర్గానికి మాత్రమే చెందకుండా,ప్రలోభాలకు లొంగకుండా ఉంటూ

"దేశాలు చీలినా

 ఎల్లలన్నీ చెదిరినా

 ప్రభుత్వాలు కూలినా

విధానాలు మారినా

జనం వెంట నడిచేవాడు

ప్రజా గళమై పలికేవాడు

ప్రజల చరిత్ర నిక్షిప్తం చేసేవాడు

అతడే సుమీ! ప్రజాకవి"

 

అంటూ ప్రజాకవికి నిజమైన నిర్వచనాన్ని చెప్తాడు.అది అందరూ ఆచరించాలని చెప్తూనే "నువ్వు నువ్వుగా రాయి" అంటూ ముందు తరపు భాద్యునిగా నేటితరానికి మార్గదర్శకం చేస్తాడు.

"నువ్వు దిగివచ్చిన లోకాల్ని రాయి

 నీ వెంట తెచ్చిన అనుభూతుల్ని రాయి

మా అజ్ఞానపు అంధకారాన్ని తెంపు

మా ఎదల పాచుట్టు దులుపు

మా హృదయాల్లో నవ వసంతాల్ని చిలుకు"

అంటూ నేటి తరాన్ని మీకు చేతనైనంత వరకు ప్రగతిశీల భావంతో చరిత్రను,మమ్మల్ని కూడా నడిపించండి, మీ అనంతరం మరో తరం  ఆ బాధ్యతను తన భుజాలకి ఎత్తుకుంటది అని చెప్తాడు.

విశాలమైన అంశాల పట్ల విశాల దృక్పథంతో ఉన్న కవిత్వమిది.ఈ కవితలు చదువుతుంటే దృశ్యాలు కండ్ల ముందటే తిరుగుతుంటాయి.అదే ఈ కవిత్వం గొప్పతనం.అదే కవి ఊహ శక్తి. కవి అనే వాళ్లు ఎంతగా ఆలోచించవచ్చో,ఎంతగా ఆలోచించగలరో "దృశ్యం నుండి దృశ్యానికి" చెప్తుంది.వి ఆర్ విద్యార్థి గారు ఇంకా "విద్యార్థి"నే అని మన తరానికి ఈ పుస్తకం ద్వారా సంకేతమిచ్చాడని అనిపిస్తుంది.

 

 

                                                                                                                   


ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు