సాహిత్య వ్యాసాలు

(June,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర  - 13  

దామెర్ల సీతమ్మ రచనలు 1904 నుండిaలభిస్తున్నాయి. అయితే ఆమె 1900  నాటికే  రచనా రంగంలోకి ప్రవేశించిందని జంధ్యాల కనకదుర్గ సేకరించిన జనానా  పత్రిక వ్యాసాన్ని బట్టి తెలుస్తున్నది. 15 వచనరచనలు, 5 పద్యరచనలు , 1 పాట ఆమెవి లభిస్తున్నాయి. దామెర్ల సీతమ్మ జీవిత  వివరాలు తెలియచేసే రెండు రచనలు కూడా లభించాయి. హిందూ సుందరి  1911 మే సంచికలోదామెర్ల సీతమ్మగారుఅనే శీర్షికతో కర్త ఎవరో తెలియకుండా ప్రచురించబడిన పరిచయం ఒకటి . రెండవది 1913 సెప్టెంబర్  సంచికలో అత్తోట లక్ష్మీ నరసింహం గారి మరణానికి సంతాపం ప్రకటిస్తూ సంపాదకులు ప్రచురించిన రచన.  దామెర్ల సీతమ్మ పద్యరచనలలో సోదర స్మృతి అనే శీర్షికతో హిందూ సుందరి 1914 జనవరి , ఫిబ్రవరి సంచికలలో ప్రచురించబడిన పద్యాలను కూడా కలుపుకొని చూస్తే దామెర్ల సీతమ్మ జీవిత చిత్రం రూపు కడుతుంది. 

దామెర్ల సీతమ్మ నార్త్ఆర్కాట్ జిల్లాలోని వేలూరు పురంలో జన్మించింది. నార్త్ ఆర్కాట్ జిల్లా  1855 నుండి మద్రాసు  ప్రెసిడెన్సీలో ఒక జిల్లా. 1911 లో చిత్తూరు నువేరుచేసిఆంధ్రాలో కలిపేవరకు అదే  ఆజిల్లాకు ప్రధాన నగరం. నిజానికి దామెర్ల సీతమ్మ తండ్రి గారి  స్వస్థలం ఆంధ్రా లోని నర్సా పురం అయినప్పటికీ  సెటిల్మెంటు    డిపార్టుమెంటు లో  ఉద్యోగిగా  ఆయన నివాసం తమిళ నాడు లోని  ఆర్కాట్ జిల్లా అయింది . ఆయన పేరు అత్తోట రామయ్య . ఆయన భార్యవేంకట రమణాంబ . ఇద్దరు మగపిల్లల తరువాత పుట్టిన పిల్ల సీతమ్మ. ప్రత్యేకంగా బడికి పోక పోయినా అన్నల దగ్గర ఆసక్తిగా తెలుగు చదువను, వ్రాయనూ నేర్చుకొన్నది. ఉన్నది తమిళనాట కనుక అరవం లో మాట్లాడటం, చదవటం, వ్రాయటం సులభంగానే పట్టుబడ్డాయి. 

పదేళ్ల వయసులో సీతమ్మకు నర్సాపురం సమీపంలోని బెండమూరులంక గ్రామంలోని దామెర్ల గున్నయ్యగారి కొడుకు దామెర్ల సదాశివరావు తో పెళ్లిజరగటంతో ఆమె దామెర్ల సీతమ్మ అయింది .  పెళ్ళీకాగానే అల్లుడిని మద్రాసుకు తీసుకువచ్చి కొడుకులతో పాటు చదువు చెప్పించాడు ఆమె తండ్రి అత్తోట రామయ్య. రెండేళ్లకే ఆయన మరణించాడు. పెద్దన్నకు సెటిల్మెంటు ఆఫీసులో లేఖకుడిగా ఉద్యోగం వచ్చింది. ఆఫీసు గోదావరి జిల్లాలకు మారటంతో వాళ్ళ కాపురం  కాకినాడకు మారింది.  అది 1894 వసంవత్సరం. 

పెద్దన్నకు తండ్రి మరణించినవెంటనే ఉద్యోగం వచ్చింది కనుక 1894 లోనే ఆయన మరణించాడు అనుకోవచ్చు. సీతమ్మ కు పెళ్లినాటికి పదేళ్లు . తండ్రి రెండేళ్లకు మరణించాడు అంటే  అప్పటికి ఆమెకు 12 సంవత్సరాల వయసు అయి ఉంటుంది. 1894 నాటికి పన్నెండు ఏళ్ళు   అంటే ఆమె 1882 లో  పుట్టి ఉంటుంది . పెళ్లి 1892 లో అయి ఉండాలి. 

భర్త చదువు నిమిత్తం అత్తవారు రాజమండ్రిలో  కాపురం  పెట్టటం వలన  దామెర్ల సీతమ్మ నివాసం 1895 లో అక్కడికి మారింది . చదువు అయిపోయాక దామెర్ల సదాశివరావు కు నర్సాపురం   లోకల్ ఫండ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది . కొంతకాలం అక్కడ వాళ్ళ కాపురం సాగింది.  1906 లో చీఫ్ సానిటరీ ఇనస్పెక్టర్  ఉద్యోగంపై సదాశివరావు రాజమండ్రికి మకాం మార్చాడు. ఏడాది తిరగకుండానే  మశూచికం  వచ్చి చనిపోయాడు. పాతికేళ్ల వయసుకు దామెర్ల సీతమ్మ వితంతువు అయింది .  దానితో పిల్లలతో  ఆమె అన్నగారి ఇల్లు చేరవలసి వచ్చింది. ఆ రకంగా ఆమె కాకినాడ లో స్థిరపడింది. ఒక కొడుకు మరణించటం,పదేళ్ల వయసు కూతురు పెళ్లయి  ఆరునెలలు తిరగకుండానే  వితంతువు కావటం సీతమ్మకు ఒకదానిపై  ఒకటిగా సంభవించిన విషాదాలు.1904 తరువాత మళ్ళీ ఆమె రచనలు  1910 లో ఆరేళ్ళ వ్యవధి తరువాత గానీ కనబడకపోవటానికి  ఈవ్యక్తిగత సాంసారిక సమస్యలే కారణం అయి ఉంటాయి. 

ఈఅన్నిటి మధ్యా ఆమెలో జీవితాశను, విద్యాభిలాషను, సాహిత్యాభిలాషను, సామాజిక సేవనురక్తిని పెంచిపోషించిన వాడు ఆమె అన్న అత్తోట లక్ష్మీ నరసింహం. కాకినాడ శ్రీవిద్యార్ధినీ సమాజం ఏడేళ్ల తరువాత  1910 ఏప్రిల్ లో  పునరుద్ధరించబడినప్పుడు  అందులో చురుకుగా పాల్గొనటానికి సీతమ్మను ప్రోత్సహించాడు ఆయన. బాలాంత్రపు శేషమ్మతో పాటుదామెర్ల సీతమ్మ దానికి కార్యదర్శి.కోశాధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహించింది. అన్నగారిభార్య  అత్తోట శేషమ్మ కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు. ప్రతివారం వీళ్ళ సభలు అత్తోట లక్ష్మీనరసింహం గారి ఇంటనే జరిగేవి. సామాజిక కార్యకలాపాలతో  పాటు సీతమ్మ సాహిత్య రచనా వ్యాసంగం కూడా 1910 నుండి మళ్ళీ మొదలైంది. 1913 లో ఆగస్టు 16 న అత్తోట లక్ష్మీ నరసింహం మరణించాడు. సోదర వియోగ దుఃఖం నుండి సీతమ్మ వ్రాసిన పద్యాలు ఆమె ఎదుగుదలకు ఆయన ఎలా నిలబడ్డాడో చెప్తాయి.

                                                1

1904  నాటికి   దామెర్ల సీతమ్మ రచనలు మూడు .ఒకటి  దివ్యజ్ఞాన సమాజం- అనీబిసెంట్ (1900 జనానా) మహిళలు  సభలకు వెళ్లటం అమర్యాదకరంగా  భావించే పరిస్థితికి  ఆవేదన చెందుతూ చేసిన రచన ఇది. భగవత్ప్రార్ధన (హిందూ సుందరి 1904, మే)  బ్రహ్మ సమాజ ప్రభావం నుండి వ్రాసిన రచనలాగా  కనబడుతుంది. మనుషులకు ఉపయోగపడే సమస్త ప్రకృతి వనరులను సృష్టించిన భగవంతుడి పట్ల కృతజ్ఞులమై ఉండాలంటుంది సీతమ్మ . భగవంతుడు అంటే ఆమె దృష్టిలో ఆకారం , గుణం కలిగి పురాణాలలో పరిపరి విధాలుగా వర్ణించబడిన భగవంతుడు కాడు. నిరాకారుడు , నిర్గుణుడు. ఆపదలు వచ్చినప్పుడు ప్రార్ధించటం , మొక్కులతో ప్రసన్నం చేసుకొనటం దయాగుణం కల ఈశ్వరుడి యందు వ్యర్ధపుటుపకృతులు అంటుంది. ఆవునేతి దీపారాధనలు, లక్షవత్తుల వ్రతములు వంటి ఆచారాలను , నమ్మకాలను నిరసిస్తుంది. 

1904  సెప్టెంబర్ హిందూ సుందరి సంచికలో ప్రచురించబడినవెలి భయము లేని సంస్కరణము చిన్న వ్యాసమే కానీ ఆమె ఆచరణాత్మక సంస్కరణ దృష్టికి  నిదర్శనంగా ఉంది. రజస్వలానంతర వివాహాలు, వితంతు వివాహాలు మొదలైనవి జరిగినప్పుడు మతాచార్యులు కలగచేసుకొని వెలి పత్రాలు జారీ చేస్తుండటం వలన వాళ్ళు కుటుంబాలకు, బంధుమిత్రులకు, సామాజిక అవసరాలకు అంటరానివాళ్ళై నానా అగచాట్లు పడుతుండటం చూస్తున్న దామెర్ల సీతమ్మ తక్షణ సమస్యల కారణంగా సంస్కరణ కార్యకలాపాలకు దూరం కావలసినదేనా అని ప్రశ్నించుకొన్నది. వెలి భయం లేని సంస్కరణలను ఆచరించవచ్చుకదా అని తర్కించింది. మగపిల్లలకు సంపాదింప శక్తి కలిగేవరకు పెళ్లి చేయకుండా ఉండవచ్చునన్నది ఆమె ప్రతిపాదన. ఇందులో పెద్ద కష్టమూ లేదు , వెలి సమస్య లేదు. యుక్తవయస్కులు , సంపాదనా పరులూ అయితే అన్య శాఖల అమ్మాయిలను పెళ్లాడటం , కట్నం లేని పెళ్లిళ్లకు ముందుకురావడం వంటి విషయాలలో  నిర్ణయం తీసుకోగల , అభిప్రాయం ప్రకటించగల వీలు ఏర్పడుతుంది కనుక సంస్కరణలకు ఏదో ఒక మేరకు దోహదకారిగా ఉంటుందని సీతమ్మ అభిప్రాయపడింది. 

1910 ఏప్రిల్ లో పునరుద్ధరించబడిన  కాకినాడ శ్రీ విద్యార్థినీ సమాజం కార్యదర్శి పదవి చేపట్టిన రెండు నెలలకే గుంటూరు లో జరిగిన హిందూస్త్రీల మహాసభలో  సీతమ్మ ఒక ఉపన్యాసం చేసింది. బొంబాయి రాజధానిలోని స్త్రీల విద్య గురించిన ప్రసంగం అది. బొంబాయి రాజధాని అంటే  పూనా. మనుధర్మ శాస్త్రానికి అనుగుణంగా అక్కడి స్త్రీలు పురుషులవలె చదువుకొంటున్నారని తన ప్రసంగం ప్రారంభించింది సీతమ్మ. మనుధర్మం స్త్రీపురుష సమానతను బోధిస్తుంది అన్నమాట ఈ కాలంలో ఎవరూ అంగీకరించేది కాదు. ఆనాటి  కాలపు విశ్వాసం అది.  అది కాదు ముఖ్యం. ఆనాటికి బొంబాయి లోస్త్రీలు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ, వైద్యసేవలు అందిస్తూ అభివృద్ధి చెందటం గురించి ఉద్వేగంగా వివరించటం గమనించ దగినది. స్త్రీలకు  ప్రత్యేక కళాశాలలు లేకపోవటం , లౌకిక విద్యతో పాటు ఆత్మజ్ఞాన సంపత్తిని సమకూర్చే విద్య లేకపోవటం గురించి  అసంతృప్తి ప్రకటిస్తూనే తనకు తెలిసిన విద్యావంతులైన స్త్రీల గురించి చెప్పింది.  వాళ్ళందరూ పూనా లో కార్వే గారి పాఠశాలలో చదువుకొన్నవాళ్ళు.  గంగూబాయి గోడే బిఎ అయితే గానీ పెళ్లిచేసుకొనను అన్న నిర్ణయంతో ఉన్న 20 ఏళ్ల యువతి. విద్య ప్రధానం అని స్త్రీలు అనుకొంటున్న ఒక దృశ్యాన్ని ఈ రకం గా ప్రదర్శించింది. కర్ణాటక నుండి వచ్చి ఇక్కడ చదువుకొన్న ఒక బాలవితంతువు వైద్య విద్య చదువుకొంటున్నది అని ఆమె గురించి చెప్పింది. షోలాపూర్ లో పని చేస్తున్న డాక్టర్ కృష్ణాబాయి , చెన్నపురిలో వైద్యవృత్తిలో  ఉన్న ఆమె సోదరి కమలాకర్ గురించి పేర్కొన్నది.అబలా సచ్చరిత్ర రత్నమాలలో అచ్చమాంబ స్త్రీవిద్యాభిమానిగా పేర్కొన్న రఖమాబాయిఖేళోకర్ కూతుళ్లు వాళ్ళు అన్న సమాచారం కూడా ఇచ్చింది.    పూనా అనాధ బాలికాశ్రమంలో పనిచేయటానికి మద్రాస్ లో బిఎ చదువుతున్న కాశీబాయి దేవదారు ఆదర్శాన్ని ప్రస్తుతించింది. బాలవితంతువులలో విద్యావ్యాప్తికి , వాళ్ళను పూనా అనాధ బాలికాశ్రమానికి చేర్చటానికి అహర్నిశలు పాటుపడుతున్న పార్వతీబాయి అతవేలును గురించి ఆరాధనా భావంతో  వివరించింది. 

దాదాపుగా ఇందులోఆమె ప్రస్తావించిన  స్త్రీలందరూ ఏదో ఒకరకంగా పూనాలోని కార్వే హిందూ వితంతు గృహంతో సంబంధం ఉన్నవాళ్లు. దాదాపు వాళ్లందరినీ తాను చూసినట్లు , పరిచయం ఉన్నట్లుగానే వ్రాసింది. పదేళ్ల కూతురి భర్త చనిపోయి దుఃఖంలో ఉన్న దామెర్ల సీతమ్మను అన్న అత్తోట లక్ష్మీనరసింహం కూతురితో సహా పూనా లోని హిందూ వితంతు గృహంలో చేర్పించి వచ్చాడు. చదువుకొనటంలో తనలాంటి వాళ్ళ సమస్యలను అర్ధం చేసుకొనటంలో ఆమె అవగాహన పెరుగుతుంది , దుఃఖం తగ్గుతుంది అం కావచ్చు అయన ఆ ఏర్పాటు చేసాడు. ఒక సంవత్సరం పాటు ఆమె అక్కడ ఉంది. ఆ కాలపు పరిచయాలు , అనుభవాలు ఈ రకంగా ఈ ఉపన్యాసం లోకి ప్రవహించి ఉంటాయి. తరువాతి కాలంలో ( హిందూసుందరి , 1914, ఫిబ్రవరి ) వ్రాసిన సోదర స్మృతిలోని ఈ పద్యం చూడండి -నీ పుణ్యంబున ( గాదే 

   యేపార బున్హ కేగి యే (నట (గంటిన్

    శ్రీ పార్వతీ యతవేలును 

    నా పావన చరితలైన యతివలనెల్లన్”  - 

 దానినే బలపరుస్తున్నది.  

ఆత్మగౌరవంతో లోకానికి ఆదర్శంగా నిలబడాలంటే స్త్రీలకు విద్య ఉండాలని , ఇంటి పనులతో , సంసారపు  బాధ్యతలతో  తీరిక లేదనటం సరికాదని స్త్రీలు చదువుకొని తోటి స్త్రీల విద్యావికాసాలకు తోడ్పడినప్పుడే  దేశం అభివృద్ధిలోకి వస్తుందని పేర్కొన్నది. అందులో భాగంగా  స్త్రీల పాఠశాలల విషయమై పనిచేయటానికి తన  సంసిద్దతను కూడా వ్యక్తం చేసింది. ప్రసంగం చివరలో ఆ సభను ఏర్పాటు చేసిన సనాతన ధర్మ మండలి పక్షాన స్త్రీవిద్యావిషయమై పనిచేస్తున్న  ఏకా వెంకటరత్నమ్మ గారిని ప్రశంసించింది. 

ఇక్కడ నుండి ఈమె రచనలు ప్రధానంగా స్త్రీవిద్యకు సంబంధించిన ఆలోచనలు, ఆచరణకు సంబంధించినవి. దీనితో కలిపి మొత్తం ఆరు. విద్యవలని లాభములు అనే వ్యాసం 1910 సెప్టెంబర్ హిందూ సుందరిలోను, సావిత్రి లోను ప్రచురించబడింది. ఈ వ్యాసంలోనూ విద్యావంతులు, ఉద్యోగస్తులు , ఉన్నత ఆదర్శాలతో పనిచేస్తున్న బొంబాయి మహిళలను కృపాబాయి వంటివారిని ప్రస్తావించింది. విద్య పురుషులకు ఎంత లాభకారో స్త్రీలకూ కూడా అంత లాభకారి అని పేర్కొన్నది. చిన్నప్పటినుండి స్త్రీలు పురుషులవలెనే శ్రద్ధగా చదువుకొంటే ఉద్యోగాలు చేయగలరు , రాజ్యాపాలన కూడా చేయగలరు అని విశ్వాసాన్ని ప్రకటించింది. గృహిణులు విద్యనేరిస్తే భర్తలకు అనుకూలులై అర్ధాంగి అన్నమాట సార్ధకం చేసుకొంటారని , వితంతువులు విద్య నేరిస్తే స్వధర్మాన్ని గుర్తెరిగి స్వార్ధత్యాగులై లోకానికి ఉపయోగపడతారని చెప్పింది. విద్య ప్రయోజనం పురుషులకు ఏట్లో స్త్రీకి కూడా అట్లే అని చెప్పిన సీతమ్మ స్త్రీలలో మళ్ళీ భర్త ఉన్న స్త్రీ లేని స్త్రీ అనే భేదాన్ని బట్టి వాళ్ళ చదువు ప్రయోజనం వేరువేరుగా ఉంటుందని చెప్పటానికి  ఆమె కు అది ప్రశ్నించవలసినది అన్న అవగాహన లేకపోవటం వల్లనే . ఆమె కాలానికి ప్రశ్నించలేకపోయిన సాంస్కృతిక వైరుధ్యంఅది. 

స్త్రీలు చదువుకొంటే దుష్టులు అవుతారన్న వాదన ను ఆమె తిరస్కరించింది. పురుషులలో కూడా బాగా చదువుకొన్నవాళ్ళు  దుష్టులు గా ఉండటం లోకంలో ఉంది , అలాగని పురుషులకు విద్య కూడదని అనటం లేదు కదా అన్నది ఆమె వాదన. ఎంత చదివినా నీతి న్యాయం లేకపోతే ఆడయినా మెగా అయినా విద్యావిహీనులే అంటుంది ఆమె. దేశీయ స్త్రీల పాఠశాలలు పెట్టి స్త్రీలకు తీరిక సమయంలో మధ్యాహ్నం రెండు నుండి నాలుగు వరకు విద్యాబోధచేయాలని చెప్పింది. అటువంటి పాఠశాలల ఏర్పాటుకు త్వరపడాలని హెచ్చరించింది. 

1911 మార్చ్ సావిత్రి పత్రికలో వచ్చినరాజమహేంద్రవరపు మిషన్ బాలికా పాఠశాలఅనే రచన దామెర్ల సీతమ్మ క్షేత్రపర్యటనానుభవం నుండి రాసింది. 1910 లో మార్చ్ 13 వతేదీన ఆమె రాజమండ్రి బాలికా పాఠశాలను చూచి వచ్చింది . రెండువందల మంది విద్యార్థులతో నడుస్తున్న ఆమిషన్ స్కూల్ పాఠశాల తరగతిగదులు  , విద్యార్థుల వసతి గదులు , వంటశాల అన్నీ పరిశుభ్రంగా ఉండటం గమనించింది. అమెరికా నుండి వచ్చిన దొరసాని స్థాపించిన ఆ బడిలో విద్యార్థులు అందరూ హిందువులే . క్రైస్తవ మతాన్ని బోధిస్తూ మతంలోకి మారుస్తూ పాఠశాలలు స్థాపించి వాళ్ళు పనిచేస్తుంటే దేశస్థులు నిద్రాపరవశులై ఉండటం సీతమ్మకు బాధ కలిగించింది. వాళ్లకన్నా తెలివిగలవాళ్ళు , ధనవంతులు దేశంలో ఉన్నా వాళ్లకు సత్కార్య శూరత్వం లేకపోవటం గురించి వేదన పడింది. ఉన్నత విద్య నేర్పక   బ్రాహ్మణేతరులను ఇతరమతాలలోకి  పారద్రోలుతున్న వాస్తవం  స్వసంఘబలాన్ని తగ్గిస్తుందని గుర్తించి కలత పడింది. 

పాఠశాల స్థాపించి పనిచేస్తున్న దొరసానిని చూస్తే సంతోషంగానే ఉన్నది కానీ ఇతర మతం లో కలిసిన రెండువందలమంది స్త్రీలను చూస్తే దుఃఖం గా అనిపించింది అంటుందామె. ఒక రాజమహేంద్రవరం మిషన్ పాఠశాలలోనే రెండువందలమంది ఉంటె ఇలాంటి పాఠశాలలు దేశం మీద ఎన్ని ఉన్నాయో , ఇంకెన్ని వందలమంది జనం వాళ్ళ మతంలో కలిసారో అని ఊహించి భయపడ్డది. ఇకనైనా మేల్కొని మన మతంలో పుట్టిన వాళ్ళు దానిని వదిలిపోకుండా సనాతనధర్మప్రబోధం జరిగేవిధంగా స్వదేశీ పాఠశాలల ఏర్పాటుకు కంకణం కట్టుకోవాలని పిలుపును ఇచ్చింది . 

కులభేదాలు లేక అందరికీ విద్యను అందుబాటులోకి తేవటం అనే అభ్యుదయాంశం సీతమ్మ పట్టుకోగలిగింది. కానీ క్రైస్తవ మత  ప్రబోధ ప్రభావాలను సనాతన ధర్మ ప్రబోధ ప్రభావాలతో ఎదుర్కోగలం అనుకొనటం లోతైన ఆలోచన నుండి వచ్చింది కాదు. నిచ్చెనమెట్ల  కులవ్యవస్థ అస్పృశ్యత వంటి అవమానకర పద్ధతులు, ఆర్ధిక అసమానతలు వున్న సమాజంలో క్రైస్తవం వైపు ఆకర్షణకు ఆశ - గౌరవకరమైన జీవితం లభిస్తుందన్నఆశ- కారణం.దాని గురించిన అవగాహన సీతమ్మకు లేదు.

కాకినాడ సమాచారము (హిందూసుందరి1911, ఆగష్టు) స్వభావంలో  ఒక నివేదిక. దామెర్ల సీతమ్మ మరి కొంతమంది సభ్యులు  కాకినాడ విద్యార్థినీ సమాజం పక్షాన 1911మే 30 నాడు  గవర్నమెంట్ బాలికా పాఠశాల  పరీక్షాధికారి అయిన మిస్ జె పీటర్ సన్  దొరసానిని సందర్శించి  కాకినాడ విద్యార్థినీ సమాజం బాలికాలయంలో పురుషులు ఉపాధ్యాయులుగా ఉండటం వలన వయస్సు వచ్చిన  స్త్రీలు చదువుకొనటానికి వీలుగా లేదు కనుక స్త్రీలను ఉపాధ్యాయులుగా నియమించాలని కోరారు. సంస్థకు సంబంధించిన మరి కొన్ని అంశాలు మాట్లాడి  స్త్రీలకు నేర్పవలసిన విద్యల గురించి, వితంతు విద్యార్థి వేతనాలగురించి కాకినాడ హిందూ బాలికా పాఠశాలలో ప్రసంగించటానికి  ఆహ్వానించారు. జార్జి చక్రవర్తి పుట్టినరోజు జూన్ 3 న కనుక ఆరోజు ఏర్పాటు చేయమని ఆమె చెప్తే  అంగీకరించారు. ఆనాడు ఆమె చేసిన ప్రసంగపాఠం ఇస్తూ సీతమ్మ చేసిన రచన ఇది. 

 బాల్య వివాహాలవల్ల  చిన్నతనంలోనే తల్లులై , పిల్లల పెంపకపు పద్ధతి  తెలియక పోవటమే శిశుమరణాలకు కారణం అని, అందువల్ల శిశు సంరక్షణ, ప్రాధమిక వైద్యం స్త్రీలకు నేర్పించాలని తన ప్రసంగంలో ఆ దొరసాని చెప్పింది.   వ్యాధులు కలగకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకొనటం , రోగులకు గాలి వెలుతురూ తగిలేట్లు శ్రద్ధ వహించటం  కూడా విద్యాబోధనలో ఒక భాగమే అంటుంది. ఆడపిల్లల బడులలో పాఠాలు చెప్పటానికి స్త్రీలు కావాలని కోరారు కదా ? మీ సహాయం లేకుండా వాళ్ళను ఎక్కడి నుండి సృష్టించగలం అని ప్రశ్నించింది. వితంతువులకు వేతనాలు ఇచ్చి  విద్య చెప్పిస్తామని అన్న కూడా స్కూలులో చేరి చదువుకొన టానికి స్వతంత్రత మీకు లేనప్పుడు స్త్రీల కు పాఠాలు చెప్పే మహిళా ఉపాధ్యాయులు ఎలా తయారవుతారు అని ప్రశ్నించింది. విధవలను బడికి పంపండి వాళ్ళు చదువుకొని ఉపాధ్యాయులై మీ అవసరాన్ని తీరుస్తారు అని హితవు చెప్పింది . వైధవ్యానికి వగచి ప్రయోజనం లేదనిపరులకొరకు పాటుపడటంలోనే పరమార్దం ఉందని పేర్కొన్నది. పారతంత్య్రం నీచం అని చెప్పి వితంతు స్త్రీలు జీవితమంతా ఎవరి మీదనో ఆధారపడి బ్రతకటం కాక ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్ షిప్పులు తీసుకొని చదువుకొని ఉపాధ్యాయినులై మీ జాతిని విద్యావంతులను చేయవచ్చు . అని ఆమె చేసిన ప్రసంగవిషయాలను ఉటంకించి ఆ సభలో బాలాంత్రపు శేషమ్మ , కళ్లేపల్లి వెంకట రమణమ్మ ఆమె ప్రతిపాదనలను  బలపరుస్తూ అందరూ తమతమ విధవ తోబుట్టువులను, పిల్లలను పాఠశాలలకు పంపి దేశోద్ధరణకు  తగిన శిక్షణ ఇప్పించాలని కోరారని చెప్తూ ఈ నివేదికను ముగించింది దామెర్ల సీతమ్మ . 

మిగిలిన రెండింటిలో ఒకటి స్త్రీవిద్యావిషయము ( హిందూసుందరి, 1912,  జనవరి ) రెండవది స్త్రీవిద్యఎట్లున్నది ( వివేకవతి, 1912, ఏప్రిల్)  గుంటూరు సనాతన ధర్మ మండలి అయిదవ వార్షికోత్సవ సభ కు  విద్యార్థి కావటం వల్ల సెలవు లేక వెళ్ళ లేకపోయినా వ్రాసి పంపిన ప్రసంగ పాఠం  స్త్రీవిద్యావిషయము . (స్త్రీ సనాతన మండలి అధ్యక్షురాలు ఏకా వెంకటరత్నమ్మ , ఇప్పగుంట వెంకమాంబ కార్యదర్శి . రాజనాల గౌరమ్మ వంటి మహావక్త లు,విదుషీమణులు ఇందులో ఉన్నారు ( ఆంధ్రపత్రిక ఉగాది ప్రత్యేక సంచిక 1910 ) 1912 నాటికి అయిదవ వార్షికోత్సవం జరుపుకున్నదంటే 1907 లో ఇది ఏర్పడి ఉంటుంది .  ) ఈ వ్యాసంలో సీతమ్మ పురుషులు స్త్రీవిద్యవలన లాభాలను గ్రహించారు కానీ స్త్రీవిద్యను అభివృద్ధి చేసే మార్గం మాత్రం గ్రహించినట్లు లేదు అంటూ స్త్రీల పాఠశాలల లేమిని ప్రస్తావించింది .స్త్రీలమగు మనము మన విషయ మై పాటుపడిననే గానీ మనంభివృద్ధి నొందజాలము”  అని స్పష్టం చేసింది . విద్యావిహీనతచే స్త్రీలు పడే బాధ పురుషులకు , విధవల  కష్టములు సువాసినులకు , పురుషులకు కూడా అర్ధం కావు అని ఈ సందర్భంగా ఆమె చెప్పిన మాటలు  గమనించదగినవి.  అనుభవం నుండి  సమస్యలోని వాస్తవికత , తీవ్రత బాధితులకు  మాత్రమే అర్ధం అయ్యే విషయాలని, ఇతరులు వాటిని సంపూర్ణంగా సాంద్రంగా  వ్యక్తీకరించలేరు అని నేటి స్త్రీ, దళిత అస్తిత్వ ఉద్యమాలు   నిర్ధారించి చెబుతున్న వాటి దేశీయ మూలాలు సీతమ్మ మాటలలో  వినిపిస్తున్నాయి కదూ  ! 

ఎక్కడికీ పోకుండా ఉన్నచోటునే ఉండి  మనమే అన్నిటా అత్యున్నత దశలో ఉన్నామనుకొనటం  ఆత్మవంచన అని చెబుతూ బొంబాయి ప్రాంతంలో స్త్రీలు  సా ధించిన  అభివృద్ధిని ప్రస్తావించింది సీతమ్మ  . అట్టి స్థితికి రావాలంటే మన బాట మనం వేసుకోవలసినదే అని చెప్పింది .  విజ్ఞానచంద్రికా మండలి, నర్సాపుర మండలాభివర్ధనీ సంఘం వారు స్త్రీల కోసం బహుమానాలు ప్రకటించి నిర్వహిస్తున్న పరీక్షల గురించి చెప్పి విస్తృతంగా బాలికా పాఠశాలలు లేని కొరతను అధిగమించటానికి ఈ పరీక్షలకు స్త్రీలు హాజరు కావటమే తక్షణ కర్తవ్యం అని కూడా పేర్కొన్నది. 

స్త్రీ విద్యఎట్లున్నది అనే వ్యాసంలో స్త్రీలు చదువుకొనటానికి పాఠశాలలకు వెళ్ళటానికి ఇంకా సందేహిస్తూనే ఉన్నారని, పురుషులు కొందరు పూనుకొని స్త్రీవిద్యకు కృషి చేస్తున్నారని  చెప్పింది. సంస్కృతం, తెలుగు, ఇంగ్లిష్ భాషలు స్త్రీలు నేర్చుకోవలసినవని అనిపేర్కొంది. చదువుకొని ఉపాధ్యాయులు అయి తోటిస్త్రీల కుచదువుచెబుతున్నస్త్రీలను కొందరిని పేర్కొన్నది.దీనిని బట్టి దామెర్ల సీతమ్మ కూడా ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తున్నది.  

దామెర్ల సీతమ్మ వ్రాసిన మరొక మూడు వ్యాసాలు పెళ్ళికి తదనంతర పరిణామాలకు సంబంధించినవి .  వైవాహిక ధర్మములు ( హిందూసుందరి, 1911 జులై ) వ్యాసంలో వేద ప్రమాణాలతో పూర్వకాలంలో వివాహం , విద్య పూర్తి అయ్యాక వధూవరుల ఇచ్ఛప్రకారం  , పరస్పర ఆకాంక్ష నుండి జరిగేదని, స్త్రీపురుషులిద్దరూ సమంగా విద్యాభ్యాసంచేయవలసినవాళ్ళేననివివాహం ఐచ్ఛికమే కానీ నిర్బంధంకాదని వివరించింది సీతమ్మ. గృహ్యసూత్రాలను, పురాణాలను బట్టిఅప్పటి వివాహాలు రజస్వలానంతర వివాహాలేనని నిర్ధారించింది. 

వివాహం కొరకేప్రపంచం జన్మించింది అన్నట్లు కళ్ళు తెరవని పసివాళ్లకు చేసే పెళ్లిళ్లు ఈ కాలపు దౌర్భాగ్యంగా భావించింది.యువసంవత్సరం నుండి పదునాలుగు సంవత్సరాలలోపు పిల్లలకు అయినా పెళ్లిళ్లు 8486430 అని వాళ్లలో నాలుగేళ్లనుండిపదిహేను సంవత్సరాలలోపు  బాల వితంతువులు 320431 మంది అని జనాభాలెక్కలఆధారంగా బాల్యవివాహాల సమస్య తీవ్రతను , దుష్పరిణామాలను చూపించింది.అందువల్ల ప్రాచీన శాస్త్రాలు ఆమోదించని అతిబాల్యవివాహాలను జరపకూడదని స్త్రీపురుషులకు వాళ్ళఇష్టానుసారం యుక్తవయసు పర్యంతం పూర్ణవిద్యను అభ్యసించాకనే పెళ్లిళ్లు చేయాలనీ ప్రతిపాదిస్తూ ఈ వ్యాసాన్ని ముగించింది సీతమ్మ.

మనుధర్మశాస్త్రము లోనిస్త్రీల యాచారములు అనేశీర్షికతో  రాచేసినరచనలో ( హిందూసుందరి, 1911 జులై) స్త్రీలకు విధినిషేధరూపంలో చెప్పబడిన వాటిలో  పదిహేను స్మృతి వాక్యాలను  తీసుకొని  ఒక్కొక్క దానికి  తెలుగులో  అర్ధం చెప్పి ప్రతి దాని మీదా తన అభిప్రాయాన్ని ఇచ్చింది . ఆ స్మృతి  వాక్యాలు  మేలును , విలువలతో కూడిన జీవితాన్నిస్త్రీలకు  ఉద్దేశించి చెప్పబడ్డాయని ఆమె భావం.  

  ‘ హిందూ  వితంతువుల స్థితి, వారు దేశమునకెట్లుపయోగపడెదరు’ ( ఆంధ్రపత్రిక , సంవత్సరాది సంచిక 1911) వ్యాసంలో ఆమె విద్యాజ్ఞానవైరాగ్య మోక్షాలు అందరూ సంపాదించుకోవలసినవే అయినా విద్య లేకపోవటం తో స్త్రీలు వాటికి దూరం అయ్యారని , వితంతుస్త్రీలు వాళ్లలో భాగమే అని చెప్పింది. భర్తచనిపోయి అన్నదమ్ముల ఇళ్లకు చేరి లోకాభిరామాయణంలో , పరనింద లో కాలం గడిపేస్తున్నారని బాధపడింది. ప్రయాణంలో ఎదురుపడరాదు, పొద్దున్న లేవగానే లేచినవాళ్ల ఎదురుపడరాదు, శుభకార్యాలలో ఇంటి వెనక పనులు చేయవచ్చు కానీ నలుగురిలోకి రారాదు , పసుపుకుంకుమలు ముట్టరాదు..ఇలాంటి నిషేధాలమధ్య వాళ్ళ జీవితందుర్భరం అవుతున్నదని వేదనపడింది.

బాలవింతంతువుల స్థితి మరీ వేదనాకారం అంటుంది.బాల్యంలో తాడుకట్టినవాడు మరణిస్తే జీవితకాలం వైధవ్యం మోయమనటం అన్యాయం అంటుంది. వితంతువులు విద్యావంతులై, విరాగుణులై, స్వార్ధత్యాగం చేసి, శాస్త్రజ్ఞానం సంపాదించి బోధకురాండ్రు  కావాలని ఆశించింది. లౌక్యవిద్యనుఅభ్యసించి ఉపాధ్యాయులు కావచ్చని, విరాగిణులై తత్వబోధ చేయవచ్చని, వైద్యులై స్త్రీలకు సేవలు అందించవచ్చని వాళ్లకు చేయదగినకార్యక్రమాలను ఇచ్చింది.

బాల వితంతువులకు సూత్రపుతాడు సంబంధంతప్ప భర్తతో మారెబంధమూ లేకపోవటంవలన మామూలు వితంతువులకు చేసే శిక్షలు ఏవీ వాళ్లకువేయగూడదని  అంటుంది. వాళ్ళు ఆజన్మబ్రహ్మచారిణులుగా ఉండటానికి తగిన శిక్షణ ఇయ్యాలని అంటుంది. శరీరం ,మనసు  నియంత్రణ లో ఉంచుకొనటం  సంసారంచేసే దంపతులు ఉండే కుటుంబంలో వితంతువులకు కష్టంగాఉంటుంది కనుక వాళ్లకు వేరేశరణయాలు ఉంటె బాగుంటుందని, వాళ్ళ శక్తిసామర్ధ్యాలను సమాజహితవుకు వాడేటట్లు మార్గదర్శకత్వం వహించాలని ఆశించింది. అంతే కానీ  బాల వితంతువుల విషయంలోనైనా పునర్వివాహాన్ని గురించి ఆలోచించలేకపోయింది. స్త్రీపునర్వివాహ ఉద్యమానికి తన జీవితాన్ని ఒడ్డిన కందుకూరి వీరేశలింగం కాలంలో  జీవించిన మనిషి సీతమ్మ. ఈ వ్యాసం వ్రాసేనాటికి ఆయన  ఇంకా బతికే ఉన్నాడు. అయినా అతని ప్రభావం ఆమె మీద ఏమీ లేదు.    సనాతన సంప్రదాయ ప్రభావమే స్త్రీల ఆలోచనలను నియంత్రిస్తున్న శక్తి అన్నది స్పష్టం . 

కందుకూరి రాజ్యలక్ష్మి మరణానికి సంతాపం ప్రకటిస్తూ పతి  చేపట్టిన సంఘసంస్కరణోద్యమం లో కలిగిన ఇక్కట్టులకు జంకక , వెలికి  భయపడక బాసటగా నిలబడిన రాజ్యలక్ష్మమ్మను పాతిమాతను జవదాటని పతివ్రతగా పేర్కొనటం గమనించవచ్చు . ఆమె జ్ఞాపకాలను చిరస్థాయి చేసే కార్యాచరణను ఆశించింది.     ( హిందూ సుందరి ,  1910,  సెప్టెంబర్ ) 

స్త్రీలు సంఘాలు పెట్టుకొని సభలు జరుపుకొనటం  బోధనలను , ప్రసంగాలను వినటం వలన సాధించే ఒక భావ ఐక్యత , పొందే  ఒక సోదరీభావం స్త్రీలలో  విద్యాసక్తులను పెంచి వినయాది సద్గుణాల పెంపుకు తోడ్పడతాయని  దామెర్ల సీతమ్మమరొక వ్యాసంలో  అభిప్రాయపడింది. తమతోటి స్త్రీల అభివృద్ధిని కోరి సమాజాలు తమంతట తామే ఇలాంటి  సభలు ఏర్పాటు చేయటం ఒక సామాజిక అవసరంగా ముందుకువచ్చింది అని సూచించింది .( హిందూ సుందరి 1911, జనవరి ) 

భగవద్గీత నుండి , భర్త్రుహరి నీతి శతకాలనుండి శ్లోకాలను , పద్యాలను ఉదహరిస్తూ  వ్రాయబడిన ఈ వ్యాసాలు సీతమ్మ  అధ్యయనానికి నిదర్శనంగా ఉన్నాయి . అధ్యయనం , ఆలోచన, అనుభవం ఈ మూడు ఆమె వ్యాసాలకు విలువను కలిగించాయి. 

                                                                   2

            దామెర్ల సీతమ్మ   కవిత్వం కూడా వ్రాసింది. 1911 ఆంధ్రపత్రిక ఉగాది సంచిక లో హిందూ వితంతువుల స్థితి గురించి వ్రాసిన వ్యాసం చివర రెండు గీత పద్యాలు వ్రాసింది. లభిస్తున్నంతవరకు అవే ఆమె తొలి పద్యాలు.దైవ మెపుడు మీ మనముల దయను గల్గ 

                                    జేసి విధవల బాధలఁడచ వేగ

                                 నా శ్రమంబులు శీఘ్రంబ యమరునటుల 

                                జేయుగావుత సోదర శ్రేష్ఠులారా”   అనే పద్యంలో వితంతు శరణాలయాల ఏర్పాటుకు సంసిద్ధులు కమ్మని పురుషులను సంబోధించి చెప్పింది. 

విధవలకు బుద్ధి ధైర్యంబు వేగ నొసగి 

లోకహిత మనారతమును  లోటు లేక 

జరుప జ్ఞానంబు దయచేసి సాదరముగ

నప్పరాత్పరుఁ డెపుడు కాపాడు గాత  “  ఈ రెండవ పద్యంలో   వితంతువులకు లోకహిత కార్యక్రమాలకు పూనుకొనే బుద్ధి జ్ఞానాలను, ధైర్యాన్ని ఇయ్యమని భగవంతుడిని ప్రార్ధించింది.  వ్యాసంలోని ఆమె అభిప్రాయాలకే  ఇలా పద్యరూపం ఇచ్చింది ఆమె.

            శ్రీ ఆచంట లక్ష్మీపతిగారికి వ్రాయబడిన లేఖ పద్య రూపంలో నే ఉంది. ఆచంట లక్ష్మీపతి 1880 లోపశ్చిమగోదావరి జిల్లా మాధవరంలో జన్మించి  ఆయుర్వేద విద్యలో అభిమానం చూపి 1904 నుండి 1909  మధ్యకాలంలో మద్రాసు మెడికల్ కళాశాలలో MB & CM డిగ్రీని పొంది అక్కడే ప్రాక్టీస్ చేస్తూ వైద్యరంగంలో పేరెన్నికగన్నకృషి చేసాడు. ప్రజారోగ్య వ్యవస్థలో ఆయన సేవలకు గాను ఎంతో గౌరవాన్నిపొందాడు.ఆయన పేరుమీద ఆయుర్వేద పరిశోధనాకేంద్రం , న్యూరోసర్జికల్ కేంద్రం వంటి సంస్థలు ఏర్పడి పనిచేస్తున్నాయి.1911 డిసెంబర్ వతేదీన రుక్మిణితో ఆయన వివాహం జరిగింది. లక్ష్మీపతిని అభినందిస్తూ దామెర్ల సీతమ్మ పద్యాలలో వ్రాసిన లేఖ ఇది. ఒక తేటగీతి, ఒక ఉత్సాహం, ఒక సీసం, మరోరెండు గీతపద్యాలలో ఈలేఖ ఉంది. సోదరా అని సంబోధిస్తూస్వయంవర వివాహాలేఖ ‘  అందిఅపరిమిత సంతసం కలగచేసిందని అంటుంది. బాలికావివాహ దుష్ట రాక్షసిని పారద్రోలిన వివహంగా దానిని పేర్కొన్నది. ఎందుకంటే అది రజస్వలాపూర్వ వివాహం కాదు గనుక. రజస్వల కాకముందే ఆడపిల్లకు పెళ్ళిచేయటం సంప్రదాయంగా వస్తున్న కాలంలో ఆసంప్రదాయాన్ని బద్దలు కొట్టి ఆచంటలక్ష్మీపతి రుక్మిణిని పెళ్లిచేసుకొన్నాడు. 

            ఎవరీ  రుక్మిణి ? హుగ్గిళ్ల  శ్రీనివాసరావు చూడమ్మ దంపతుల  కూతురు. 1892 డిసెంబర్ 6 న మద్రాసు లో పుట్టింది. తండ్రి  నరసాపురంలో  ఉన్న షడ్డకుడిని చూడబోయి అక్కడ ఓరుగంటి శివరామ కృష్ణమ్మ గారి  కూతుళ్లు ఇద్దరూ చదువుకొనటం చూసి ప్రేరణ పొంది వచ్చి రుక్మిణిని ప్రెసిడెన్సీ ట్రైనింగ్  స్కూల్ లో  ఇంగ్లిష్ విద్యలో ప్రవేశ పెట్టాడు. ఆమె మెట్రిక్యులేషన్ పాసయి ప్రెసిడెన్సీ కాలేజ్ లో ఎఫ్ ఏ పరీక్షకు చదువుతున్నది. ఆ రుక్మిణినే ఆచంట లక్ష్మీ పతి పెళ్లి చేసుకొన్నది. కోరి రజస్వల అయిన కన్యను పెళ్లాడటం ఆనాటికి  గొప్ప సంస్కరణ. అందుకే దామెర్ల సీతమ్మ ఆ పెళ్లిని అభినందించింది.చెప్పిన దానిని ( జేసి చూపుట యందు / మార్గదర్శకులై మహిమ వెలయ”  “ సుగుణ భూషణాలంకృత  సుందరాంగి / విద్యచే వెలుగొందు నవ్వెలది మిన్న / యైన రుక్మిణాంబనుఅందరూ ఔను అని ఆమోదించగా పెళ్ళాడి లోకానికి మేలు చేసాడని ఆచంట లక్ష్మీ పతి గురించి సీస పద్యంలో వర్ణించింది . సద్వివాహంగా దానిని అభివర్ణిస్తూ వారికి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని  పేర్కొన్నది  సీతమ్మ . ఇట్లు భవదీయ సోదరి అని కింద తనపేరు  రాసింది. సంబోధన , సంతకం లక్ష్మీపతి ఆమెకు బాగా తెలిసినవాడే అని సూచిస్తున్నాయి. 

            శ్రీ విద్యార్థినీ సమాజం తృతీయ సంవత్సర ఉత్సవానికి అధ్యక్షత వహించటానికి వచ్చిన కంచనపల్లి కనకమ్మ గురించి సీతమ్మ వ్రాసిన సీస పద్యం హిందూసుందరి ( 1913 జూన్) పత్రికలో ప్రచురితమైంది.విజ్ఞానచంద్రికా పరిషత్తులో   పురుషులను మించి అత్యున్నత స్థాయి విజయాలు సాధించి బహుమతులు గెలుచుకొన్నద ని బాలికలకు విద్యనేర్పేపదవి చేపట్టింది అని సోదరీ జనంపై వాత్సల్యం గల  శుద్ధచరిత అయిన ఆమెనుఅధ్యక్ష స్థానం లోకూర్చోవలసినదిగా ఆహ్వానిస్తున్నానని ఆపద్యంలో పేర్కొన్నది.

            సోదర స్మృతిలో ఆమె వ్రాసినపద్యాలు  27 హిందూసుందరి 1914 జనవరి, ఫిబ్రవరిసంచికలలో ప్రచురించబడ్డాయి. సోదరుడు అత్తోట లక్ష్మీ నరసింహం. భర్తచనిపోయిన తనను తండ్రితరువాత తండ్రివలె ఆదరించి విద్యాబుద్దులు చెప్పించి తన జీవితాన్ని ఒకమార్గంలో పెట్టినవాడు.ఆయన మరణానికి చింతిస్తూ ఆయనకు తనకు ఉన్నబాంధవ్యాన్ని తలపోసుకొంటూ సీతమ్మ ఈ పద్యాలు వ్రాసింది. అందువల్ల ఇవి ఒకరకంగా ఆత్మకథాత్మకమైనవి. తండ్రి  పోయినప్పటి నుండి గోరంత కొదువలేకుండా  సాకుతున్న అన్నగారి వియోగాన్ని భరించలేకపోయింది . నీలాంటి  గుణవంతుడికి తోడబుట్టినందుకు  పుణ్యం చేసుకున్నామని అన్నది. నిను బోలిన సోదరుడే లేడని చెప్పింది. అవన్నీ ఒక ఎత్తు . ఆయన తన పట్ల ఎట్లా ఉన్నాడో చెప్పిన సీస పద్యం ఒక ఎత్తు. 

తల్లి రమ్మని నన్ను దాపున( జేరిచి, హితబోధ ( జేయువారెవ్వరింక 

భీతిల్లకుము విద్య ( బెంపుఁ జేయుమటంచు హెచ్చరించెడు వారలెవ్వరింక

 సద్ధ మన్ మొనరింపఁ జంక (గావలదని యెడనెడ( జెప్పువారెవ్వరిం

సంఘ సంస్కారంబు శాస్త్ర  సమ్మతముగా నెలమి సల్పెడు వారలెవ్వరింక

 ఆపదల యందు ధృతియును నాత్మరతియు 

నొసఁగి యజ్ఞానతిమిరమున్ వెసనడంప 

విద్యయను దివ్య తేజమున్ వెలయనిచ్చి 

ప్రోచువారలింకెవ్వరు పుణ్యచరిత “      అని తనను ఆయన మలచిన తీరును గుర్తుచేసుకొన్నది. 

            భార్యను , తమ్ముడిని , తల్లిని , మేనకోడళ్ళను వదిలి ఆయన వెళ్ళిపోతే  శోకార్తులై వాళ్ళు మిగిలిపోయారని వాపోయింది. బుద్ధి , భక్తి,, జ్ఞానందయ మొదలైన ఆయన గుణాలను ప్రస్తుతించటమే కాక ఆయన సంఘసంస్కరణ ఆచరణ గురించి చెప్పింది. 

నీచజాత్యుద్ధరణమున నీకుఁ గల్గు 

 నాసఁ గాకినాడపుర నివాసమందు  

నీవు నడిపిన యట్టి యా నిమ్నజాతి 

పాఠశాలలు తెల్పవే పరమపురుష”  అనే పద్యం  ఆయన  దళితుల విద్యాభివృద్ధికి చేసిన కృషిని  నమోదు చేసింది. వ్యక్తిగా ఎంతచేయాటానికి వీలైనదో అంతా చేసాడాయన.  తన చెల్లెలిని , భార్య శేషమ్మను స్త్రీల సంఘాలలో పనిచేయటానికి తగిన ప్రొత్సాహం , జ్ఞానం ఇచ్చాడు. కాకినాడ విద్యార్థినీ సమాజ కార్యకలాపాలకు తన ఇల్లు కార్యస్థలం చేసాడు. ఈ పద్యాన్ని బట్టి ఆయన ఇల్లు దళితపిల్లలకు విద్యాలయం కూడా అయిందని తెలుస్తుంది. 

            “బాల విధవల నభివృద్ధి పరచు నీదు / ప్రబలమైనట్టి యభిమత ప్రాభవంబు 

            మేనకోడలి విద్యా ప్రమేయమందుఁ / జూపితివి గాదె ధీవర్య శుభచరిత్ర “  ఈ పద్యంలో  సీతమ్మ పదేళ్ల వయసులో వితంతువు అయిన తన కూతురిపట్ల అన్నగారు చూపిన శ్రద్ధను గుర్తుచేసుకొన్నది. మేనకోడలి ని చదువుకోసం తల్లితో సహా పూనా విడో హోంలో ఉంచి వచ్చాడు. ఏడాదిపాటు వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడి వాతావరణం పడకపోవటం వల్ల మేనకోడలిని మళ్ళీ పూనాకు పంపటం కుదరలేదు. కానీ ఆతరువాత ఆ అమ్మాయి ఏమి చదువుకున్నదో, ఏమైందో వివరాలు తెలియరావడం లేదు. అన్న తనను  పూనా కు పంపటం వల్ల తనకు ఇతర ప్రాంతాల స్త్రీలతో వాళ్ళ  ఆశలతో , ఆదర్శాలతో  కలిగిన పరిచయం  తన చూపును విశాలం చేసిందని ఆమె కృతజ్ఞతను కూడా వ్యక్తం చేసింది ఒక పద్యంలో. 

            భర్తపోయి దుఃఖసాగరంలో ఉన్న తనకు అన్న సముద్రాన్ని దాటించే నావ అయ్యాడని చెప్పుకొన్నది. సుభద్రకు కృషుడు ఎట్లాగో తనకు అన్నగారు అట్లా అని చెప్పుకొన్నది. 

అన్ననీఒనర్చినట్టి యార్యధర్మబోధనలన్ /బన్నుగా నొనర్ప మేము ( బాటు ( బడెదమయ్య ..అని ప్రతిజ్ఞ  కూడా చేసింది. ఈ పద్యాలు దామెర్ల సీతమ్మ గురించి , అత్తోట లక్ష్మీ నరసింహం సంస్కరణ కార్యకలాపాల గురించి చెప్తున్నట్లే ఉన్నా మొత్తంగా ఆ కాలపు సంస్కరణ ఉద్యమ వాతావరణాన్ని, ఆ యజ్ఞం లో నేను సైతం అంటూ పాల్గొంటున్న చరిత్రను కూడా చెప్తున్నందువలన విలువైనవి. 

            దామెర్ల  సీతమ్మ ఇద్దరు స్త్రీల గురించి పద్యాలు వ్రాసింది. నవరత్నమాల ( హిందూ సుందరి 1915 జూన్  )  అన్న శీర్షికతో థాంసనమ్మ గురించి వ్రాసింది. 3 సీస పద్యాలు, ఒక ఉత్పలమాల , మిగిలిన ఐదూ తేటగీతి పద్యాలు.  థాంసనమ్మ  ఒక స్కూల్ నుండి పదోన్నతిపై వెళుతున్న టీచర్ . వీడ్కోలు సమయాన ఆమెపట్ల అభిమానాన్నిప్రకటిస్తూ చెప్పిన పద్యాలు ఇవి. నీవు అని ఆమెను సంబోధిస్తూ మేము అని విద్యార్థులు ఉమ్మడిగా చేసిన సంభాషణగా ఉన్నాయి ఇవి.పద్యాలు అన్నీఅయిపోయాక ఇట్లు Q. M .HIGH SCHOOL విద్యార్థినులు అని ఉండటాన్నిబట్టి దామెర్ల సీతమ్మ ఆవిద్యార్థులలో ఒకామెనా లేక వాళ్ళకోసం ఈపద్యాలు వ్రాసి ఇచ్చిందా అన్నసందేహం కలుగుతుంది. ఆసందేహంతీరే ఆధారాలు ఏమీ లభించలేదు. పాఠశాలను బాగుచేయటానికి థాంసనమ్మ కృషి చేసిందని, విద్యార్థులనేరాలను సహనంతో భరించిందని , వాళ్ళ సలహాలు కూడా తీసుకొనేంతగా ప్రజాస్వామికంగా ఉండేదని, పాఠ బోధన గొప్పగా ఉండేదని ఆమెకు ఈనవరత్నమాల కానుక అని ఈ పద్యాలుచెప్తాయి.

            వస్తాదు తారా బాయి గురించిన పద్యాలు 2017 మార్చ్ హిందూసుందరిలో అచ్చుఅయ్యాయి. అజ్మీర్ లో పుట్టి కండ బలం , గుండెబలం పెంచుకొని బరువులు ఎత్తటం లో అద్భుత ప్రతిభను కనబరుస్తూ ప్రసిద్ధికి ఎక్కిన మహిళ తారాబాయి.  1917 ఫిబ్రవరి 26   విజయనగరం బాలికా సరస్వతీ వినో దినీ సమాజంలో ఆమె  శాండో ప్రదర్శన జరిగినప్పుడు వ్రాసి చదివిన పద్యాలు ఇవి . ఒక సీస పద్యం , నాలుగు గీత పద్యాలు. కఠిన శిలలను జుట్టుతో కదపటం, గుండె మీద మోయటం ముళ్ళ పానుపు పై పాడుకొనటం , బలమైన బండిని త్రోసి పడగొట్టడం మొదలైన ఆమె అద్భుత కృత్యాలను ప్రశంసిస్తూ పురుషులకు తీసిపోని ఆమె శక్తి సామర్ధ్యాలను ఆరాధనా భావంతో పేర్కొన్నది. ఏ పనిలోనైనా సాధనకు ఉండే ప్రాముఖ్యతను ఆమె  గుర్తు చేసిందని అంటుంది.అబలలంచును స్త్రీలను నలతిజూచు 

                         చెట్ట వాపంగ నీ విట ( బుట్టితమ్మ 

                         సుగుణ పుంజమవౌచును సోంపు గాను 

                         పడతులకు నెల్ల నూతన బలముగల్గె”   అని  తారాబాయిని సాధికారతకు ఒక నమూనాగా ప్రతిపాదించింది సీతమ్మ . 

            ఆనాటి వ్రాయ నేర్చిన స్త్రీలందరి వలెనె సీతమ్మ  కూడా ఒక పాట వ్రాసింది . అది చంద్రమతి చరిత్రము ( హిందూ సుందరి 1917 సెప్టెంబర్ ) సత్య సంధతను చాటటంలో భర్తకు తోడ్పడిన చంద్రమతి గురించిన పాట ఇది . సూక్ష్మంలో మొత్తం ఏడు చరణాలలో సుందరంగా హరిశ్చంద్ర కథను ఈ పాటలో పలికించింది . పరమపాతివ్రత్య భావము పడతులకెల్ల బోధించిన సతిగా చంద్రమతిని కీర్తించింది. 

            1917 తరువాత దామెర్ల సీతమ్మ రచనలు మరేమీ లభించలేదు. ఆమె గురించిన ఏ ఇతర సమాచారం కూడా తటస్థపడలేదు.  

                                                                                      ------

 

 


ఈ సంచికలో...                     

Jun 2021

ఇతర పత్రికలు