సాహిత్య వ్యాసాలు

(October,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

షాజహానా ప్రపంచం 

1990 వ దశకంలో  షాజహానా నఖాబ్ కవితతో ముస్లిం స్త్రీలకు ప్రాతినిధ్యం వహించే కవితా స్వరం సవరించుకొంటూ సాహిత్య రంగంలోకి ప్రవేశించింది.  అతికొద్దికాలంలోనే కథలు వ్రాయటం మొదలుపెట్టి ఇప్పుడు ‘మేరా జహా’ నవల తో  తనను తాను ఆవిష్కరించుకొన్నది. తాను కేంద్రం. తన అనుభవాలు,జ్ఞాపకాల కథనం ప్రధానం. అందులో భాగంగా ఆమె పుట్టి పెరిగి, చదువుకొన్న ఖమ్మం జిల్లా పాల్వంచ , కొత్తగూడెం చుట్టుపక్కల ఊళ్ల భౌగోళిక  వాతావరణం, ప్రకృతి పరిసరాలు, తన జాతి స్త్రీల కష్టసుఖాల కలనేత జీవితం శకలాలు శకలాలుగా కనబడతాయి. అందువల్ల  ఇది షాజహానా ప్రపంచం. ఆమే దానికి వ్యాఖ్యాత. ఆ రకంగా ఇది  ఆత్మ చారిత్రాత్మక నవల.

విస్తృతమైన తెలుగు సాహిత్య ప్రపంచంలో మన జీవితాలు ఎంతవరకు ప్రతిఫలించాయి? ఏ రకంగా నిర్వచించబడ్డాయి? అవి మన అనుభవానికి ఎంత దగ్గరగా ఉన్నాయి లేదా ఎంత దూరం అయినాయి అన్న విచికిత్స బహుళ అస్తిత్వాల గుర్తింపు చైతన్యం యొక్క ఫలితం.  సమాజంలో   రెండవ స్థాయి పౌరులుగా స్త్రీలు, వర్ణ వ్యవస్థలో అట్టడుగు స్థాయికి నెట్టబడిన దళితులు, అల్ప సంఖ్యాక వర్గాలుగా క్రెస్తవులు, ముస్లిములు ఈ క్రమంలోనే ఆ ఖాళీలను పూరించటానికి తెలిసి కలం పట్టిన కాలం 90వ దశకం. బాబ్రీ మసీదు కూల్చివేత , గుజరాత్ మారణకాండ ఘటనలు రగిలించిన కసి నుండి వచ్చిన  కవిత్వం సరే.. వాటితో పాటు తీవ్రవాద దాడుల సందర్భాల నుండి నిత్య అనుమానాలకు, అసహనానికి గురి అవుతూ స్వదేశానికి పరాయివాళ్లుగా అవమానింపబడుతున్న దుఃఖాగ్ని నుండి వ్రాసిన కథల సంగతి సరే… ముస్లిం జీవితాన్నివిస్తృత కాన్వాస్ మీద ప్రదర్శించటానికి నవలను మించిన ప్రక్రియ లేదు కనుక  ఆ దిశగా సృజన ఒక అవసరమై   సలీం వెండి మేఘం , స్కై బాబా ఆపా , అన్వర్ జమీలాబాయి నవలలు వ్రాసారు. ఆ వరుసలో   ముస్లిం మహిళల  కౌటుంబిక సామాజిక జీవితాన్ని ఇతివృత్తంగా మలుస్తూ   మేరా జహా నవల వ్రాసింది   షాజహానా. ఆమె కన్నా ముందు 80 వదశకంలోనే కథలు మాత్రమే కాక  మౌన పోరాటం వంటి నవలలు వ్రాసిన షహనాజ్  ఉన్నది. కానీ ఆమె  కథలకు గానీ, నవలకు గానీ ముస్లిముల జీవితం వస్తువు కాలేదు. స్త్రీపురుష సంబంధాలలోని  అధీన ఆధిపత్యాల నొప్పినే చిత్రించినా  జీవితం మాత్రం  హిందూ కుటుంబాలకు చెందింది. అందువల్ల తెలుగు  నవలా సాహిత్య చరిత్రలో  ముస్లిం స్త్రీల జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొన్న తొలి ముస్లిం మహిళా  రచయిత్రిగా షాజహానా తన పేరును నమోదు చేసుకొన్నది.

నిజానికి నవల,  స్వీయ చరిత్ర వేరువేరు  ప్రక్రియలు. నవల  కల్పన ప్రధానమైన సృజన రచన.  స్వీయ చరిత్ర  వ్యక్తి జీవితానికి సంబంధించిన ఘటనల కథనం. నవలలో కల్పన నేల విడిచిన సాము కాదు. రచయిత చూసిన జీవితం, మానవ  ప్రవృత్తులు , రచయిత అవగాహనకు అందివచ్చిన సామాజిక చలన చైతన్యాలు కల్పనకు ప్రాతిపదికలు అవుతాయి. ఆ మేరకు నవలలో రచయిత జీవితం, జీవితానికి సంబంధించిన దృక్పథం భాగం అవుతాయి. ఆత్మచరిత్రాత్మక పరిమళాన్ని అద్దుతాయి.

స్వీయ చరిత్ర  అంటే రచయిత పుట్టిన నాటి నుండి తన జీవితంలో సంభవించిన  ఘటనలను వాటి పరిణామాలను గుర్తు చేసుకొంటూ నిర్దిష్ట లక్ష్యంతో చేసే  కూర్పు. స్వీయ చరిత్రలో జీవితంలోని  ఘటనల  ఎంపికకు , ఎడిటింగ్ కు సంబంధించిన రచయిత వివేకానికి అనితర ప్రాధాన్యం ఉంటుంది. తనను , తన అనుభవాలను వస్తుగత దృష్టితో విమర్శనాత్మకంగా బేరీజు వేసుకోగలిగిన పరిణితి సాధించిన రచయిత  వివేకం స్వీయచరిత్రలను సామాజిక చరిత్రలుగా చేస్తాయి. తన ఎదుగుదలకు సంబంధించినవి , తన వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రభావశీలమైన పాత్ర నిర్వహించినవి, చారిత్రక అనుభవంగా అందరికీ అంది రావలసినవి, లోకానికి మంచి చెడుల వివేకాన్ని ఇయ్యగలిగినవి, వ్రాస్తున్న కాలపు సమాజ జ్ఞాన విషయాలకు అవసరమైనవి ఒక పద్ధతిలో కూర్చబడటం అప్పుడే సాధ్యం అవుతుంది. తనను గురించే కాదు , తనకాలాన్ని గురించి , తన కాలపు సమాజాన్నిగురించి, ఆ సమాజంలోని మానవ సంబంధాల గతి క్రమాన్నిగురించి ,  సంస్కృతిని గురించి  గతం నుండి అవి ఎలా భిన్నంగా పరిణమిస్తున్నాయో  , వర్తమానంలోకి ఏ మార్పులతో కొనసాగి వస్తున్నాయో  నిరూపిస్తూ  అనుభవాలను , అభిప్రాయాలను గుది గుచ్చటంలో సృజనాత్మకత కీలకమైన పాత్ర వహిస్తుంది. సృజనాత్మకత వల్లనే స్వీయ చరిత్రలు వ్యక్తిగత అనుభవానికి చెందినవి అయినా పరమ ఆకర్షణీయంగా రూపొందుతాయి. అంటే స్వీయచరిత్ర రచనలో నవల కు ఉండే కాల్పనిక రమణీయత ఆ మేరకు భాగం అవుతుందన్న మాట.

నవలా ప్రక్రియలోని కాల్పనిక సృజన శీలతను, స్వీయ చరిత్ర ప్రక్రియలోని   జీవిత ఘటనల వాస్తవికతను సమ్మేళనం చేసుకొంటూ షాజహానా చేసిన రచన ‘మేరా జహా’. ఒక నాటి రాత్రి తన ఇద్దరు స్నేహితురాళ్ళతో కలిసి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ లో కాకతీయ ఫాస్ట్ పాసెంజర్ ఎక్కిన సలీమా ఆ రాత్రంతా తన నలభై ఏళ్ల జీవితాన్ని తిరిగి జీవిస్తున్నట్లు స్నేహితులకు చెప్పుకుపోవటం ఈ నవల. అందువల్ల ఉత్తమపురుష కథనంగా కొనసాగుతుంది.  సందర్భం సలీమా తన నవలకు వచ్చిన అంతర్జాతీయ బహుమతి అందుకొనటానికి హైదరాబాద్ వెళ్ళటం. ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో రైలు దిగేవరకూ గతం తాలూకు కథనం. కనుక అది ఉత్తమ పురుషలో సాగుతుంది. ఆ కథనంలోని విషయాలపట్ల ఆసక్తినో , కుతూహలాన్నో,  సందేహాన్నో వ్యక్తంచేస్తూ  స్నేహితులు అరుణ , లక్ష్మి వేసే ప్రశ్నలు , చేసే వ్యాఖ్యలు సలీమా కథన ప్రవాహ గతిని ఆపి భిన్న మార్గాలు పట్టిస్తుంటాయి. సలీమా ను వర్తమానానికి లాక్కొచ్చే ఆయా సందర్భాలలో కథనం ప్రధమ పురుషకు మారుతుంటుంది.  ప్రధమ పురుష , ఉత్తమ పురుష కథనాల జమిలి నేతగా ఒక కథన శిల్పాన్ని షాజహానా నవలగా వ్రాయాలనుకొన్న స్వీయ చరిత్రకు అవసరమైన శిల్పంగా ఎంచుకున్నది. తెలతెలవారుతుండగా రైలు సికింద్రాబద్ స్టేషన్లో ఆగే ముందు సలీమా చెప్పిన ముక్తాయింపు మాటలలో ఆనాడు  ప్లవ నామ సంవత్సర ఉగాది అన్న ప్రస్తావన వస్తుంది. అంటే నవలకు వర్తమానం 2021 ఏప్రిల్ 13. 

 మేరా జహా   అంటే నా లోకం , నా  ప్రపంచం అని  అర్ధం. ఇందులో మూడు ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి రచయిత్రి వ్యక్తిగత ప్రపంచం. రెండు ఆమె సంబంధంలోకి వచ్చిన లేదా ఆమే తన  పరిధిలోకి లాక్కొన్న  సాటి ముస్లిం స్త్రీల ప్రపంచం. మూడవది సామాజిక ఉద్యమాల ప్రపంచం. వ్యక్తిగత ప్రపంచంలో ఆమె పుట్టిన పెరిగిన ఊళ్ళు, తన కుటుంబం , నాయనమ్మ , అమ్మమ్మల కుటుంబాలు, ఇరుగూ పొరుగూ , స్నేహితుల  కుటంబాలు, తన సహచరుడు యూసఫ్ కుటుంబం ఉంటాయి. ఆయా కుటుంబాలలోని  జనసందోహపు సంరంభం , వాళ్ళ మధ్య సంబంధ వైరుధ్యాలు, వాటన్నిటి నుండి రూపొందుతున్నకథకురాలి వ్యక్తిత్వం జాగ్రత్తగా అర్ధం చేసుకో వలసినవి. ప్రకృతితో సంబంధం , చెట్లు పెంచటం, వికసించిన పూలకు , కదిలే నీటి ప్రవాహాలకు పరవశించటం, పండ్ల మాధుర్యాలను , రకరకాల శాకాహార మాంసాహార వంటల రుచులను ఆస్వాదించటం, కాయకష్టం ఇష్టంగా చేయటం ఇవన్నీ అందులో భాగం.

రెండవ ప్రపంచం పూర్తిగా స్త్రీల ప్రపంచం.యూసఫ్ చెల్లెలి దగ్గర మొదలు పెట్టి  అమ్మీ,  ఆపా, దాదీ , మేనత్త పుప్పమ్మ, నానీ, పెద్దమ్మ బడెమ్మ, పిన్నమ్మ కాలమ్మ , మేనమామ భార్యలు, వాళ్ళ  బిడ్డలు, కోడళ్ళు ఇలా అనేకమంది స్త్రీలు ప్రత్యక్షంగా ఆమె  ప్రపంచాన్ని ఆవరించి ఉన్నారు. పుప్పమ్మ చెప్పే అనుభవ కథనాల వల్ల పరోక్షంగా మరింతమంది ముస్లిం స్త్రీల జీవితాలు ఆమెకు తెలిసి వచ్చాయి. ఈ అన్నీఆమె మెదడులో ప్రతిఫలించి చైతన్యంగా పదునెక్కే క్రమం సమాంతరంగా మనకు కనబడుతుంది. స్త్రీల జీవితాలు ఎందుకు ఎప్పుడూ ఇలా అధికారం కింద , అవమానాల కింద నలిగిపోతుంటాయి ? ఇది ఇలా ఎంతకాలం సాగుతుంది? ఎప్పటికయినా ఈ హింస నుండి  వాళ్ళు బయటపడతారా?   అన్న వేదన ఆమెను వెన్నాడుతూనే ఉంటుంది. అదే సమయంలో అన్ని ఒత్తిడుల మధ్య , తిరస్కారాల మధ్య, రాజీల మధ్య , ఓటముల మధ్య  కూడా వాళ్ళు కూడగట్టుకొనే  సహనం, కుటుంబం కోసం చేసే విరామం ఎరుగని శరీర కష్టం, త్యాగం, ఆమెను అబ్బుర పరుస్తుంటాయి. జీతా జాగ్ తా ముస్లిం మహిళలుగా వాళ్ళ పట్ల గౌరవాన్ని , ఆరాధనను కనబరుస్తుంది. నిజానికి షాజహానా బాల్యం అనేక హిందూ కుటుంబాల మధ్య, హిందూ స్నేహాల మధ్య గడిచింది. అందువల్ల హిందూ స్త్రీల జీవితం కన్నా ముస్లిం స్త్రీల జీవితంలోని అదనపు లేదా ప్రత్యేక సమస్యలు ఏమిటో , అందుకు మూలాలు ఏమిటో నిగ్గుతేల్చటానికి,  నిర్ధారించటానికి ఉన్న అవకాశం మీదకు  తను దృష్టి సారిస్తే బాగుండేది.  

ఇక ఆమె మూడవ ప్రపంచంలో వ్యక్తిగత  సామాజిక తిరుగుబాట్లు. ఉద్యమాలు ఉన్నాయి.  కుటుంబాలలో బలీయమైన పితృస్వామిక మత సంప్రదాయాల కారణంగానో , ఆర్ధిక కారణాలవల్లనో  తన ఈడు పిల్లలు, ప్రత్యేకించి ఆడపిల్లలు చదువులకు దూరం చేయబడటం ,సెంటర్లలో కుట్టు అల్లికలకు వాళ్ళ జీవితం కుదించబడటం, చిన్నతనానే  పెళ్లిళ్లు చేసి పంపటం - ఇవన్నీ చూస్తుండటం వల్ల  తన చదువు గురించి లోలోపల ఏర్పడ్డ సందేహాల వల్ల కావచ్చు, దానికి తోడైన  యవ్వనోద్రేకాల ఆవేశాల ఆదర్శాల పరిపూర్తి తొందరల వల్ల కావచ్చు  తాను ఎంచుకొన్న యువకుడితో పెళ్ళికి స్వతంత్రించటం ఆ తిరుగుబాట్లలో భాగంగానే చూడాలి.

ఇక ఆమె సామాజిక ఉద్యమాలకు చేరువ అయింది యూసఫ్ సాహచర్యంలోనే. అవి ప్రధానంగా ముస్లిం అస్తిత్వానికి సంబంధించినవి , తెలంగాణా ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించినవి. వాటిలో తన భాగస్వామ్యం గురించి కొంత ప్రస్తావించింది. అయితే  ముస్లిం అస్తిత్వ రాజకీయాల మీద ఫోకస్ మరింత నిశితంగా ఉండాలని, ఉంటుందని . షాజహానా రచన అనగానే ఎవరైనా  ఆశించటం సహజం . నేనూ అందుకు మినహాయింపు కాదు.

 స్త్రీవాదం నుండి ముస్లిం స్త్రీవాదాన్ని వేరు చేసి నిలబెట్టటంలో కీలకమైన పాత్ర తనది. దానికి సంబంధించి తాను గుర్తించిన  వైరుధ్యాలు, పడిన సంఘర్షణ ఇతివృత్తంలో భాగం అయితే బాగుండేది. అట్లాగే సమకాలపు దళిత  బహుజన ఉద్యమాల ప్రస్తావన,  ముస్లింలు వాటితో కలిపి నిర్మించవలసిన విశాల ప్రజా ఉద్యమాల గురించి సూచన ఉన్నది కానీ ఎందుకో ఎలాగో దాని వైపు దృష్టి సారించలేదు. అట్లాగే తీవ్రవాదం పేరుతో  ముస్లిముల పట్ల పెరుగుతన్న అసహనం  గురించి మంచి కవిత్వం వ్రాసిన షాజహానా జీవితంలోనూ , నవలలోనూ కూడా దానిపట్ల తన కోణం ఏదో ఇతివృత్తంలో భాగమై ఉండాలనుకొంటాం. బాబ్రీ మసీదు విధ్వంసం నుండి నిన్న మొన్నటి పౌర సత్వ సవరణ చట్టం వరకు భారతదేశ మత రాజకీయ చరిత్రను ముస్లిం మహిళా కోణం నుండి వ్యాఖానించగల  ఆవేదనా శీలి, ఆవేశ శక్తి అయిన షాజహానా అందుకోసం మరొక నవలను రచిస్తున్నదేమో  తెలియదు.

ఈ రచనలో షాజహానా ఇళ్ల గురించి మాట్లాడుతుంది. ఆమె దృష్టిలో ఇళ్ళు అంటే ఆడంబరంగా కట్టుకొని అట్టహాసంగా గృహప్రవేశాలు చేసుకొనే ఇళ్ళు కావు. అవి నాలుగు గోడల ఇళ్లా గుడిసెలా మేడలా మిద్దలా అన్నది కాదు ప్రశ్న . ఇల్లు అంటే మానవ సంబంధాల నిర్మాణ కేంద్రాలు. ఆ నిర్మాణంలో ఆడవాళ్ళ పాత్ర, త్యాగం  ముఖ్యమైనవి. ఇంతాచేసి ఆ ఇంట్లో మౌనంగా జీవిస్తూ ఉండేవాళ్ళు, జీవితమే కోల్పోయినవాళ్లు , తనకంటూ చోటులేనివాళ్ళు, పరాయీ కరింపబడిన వాళ్ళు, తనకంటూ ఒక ఇంటికోసం ఆర్తిపడిపడీ ఊపిరే విడిచినవాళ్లు ఇలా ఎంతోమంది స్త్రీలు ఆమెకు ఇల్లంటే గుర్తుకువస్తారు. అందుకనే తనలోపల ఎన్నో ఇళ్ళుఒకదానిపై ఒకటి  అంటుంది షాజహానా. ఇది చదువుతుంటే నాకు కవన శర్మ వ్రాసిన ‘ఆమె ఇల్లు’  కథ  పదేపదే గుర్తుకువచ్చింది.

నిజానికి ఇల్లు అంటే ఇటుకలు కాదు, సిమెంటు కాదు. తమ శ్రమతో , చాకిరీతో, త్యాగంతో నిర్మించి నిర్వహించుకువచ్చే మానవ సంబంధాల నిర్మాణం. కానీ స్త్రీలు ఎప్పుడూ తాము సృష్టించి నిర్మించిన దానిపట్ల ఏ హక్కులూ  లేని పరాయివాళ్లే.అదే షాజహానా దిగులు. నిర్మించేవాళ్లకు మిగిలేదేమీ లేదే అన్న వేదన. స్త్రీల సృజన శక్తులచేత అందగించబడ్డాయి కనుక ఇళ్లంటే షాజహానాకు ఇష్టం . కానీ స్త్రీలను ప్రేమరాహిత్యంలోకి నెట్టేది కూడా ఆ నాలుగు గోడల ఇంటిని శాశించే కుటుంబ నియమాలు , నియంత్రణలే కనుక ఇళ్లంటే షాజహానా కు భయం కూడా. దాని నుండి విముక్తి కావాలి .  స్నేహం , స్వేఛ్చ , ప్రేమ అనే మూడు అంశాలగురించిన రచయిత్రి నిరంతర చింతన ఒకటి ఈ  ఈ రచన మొత్తంలో అంతః సూత్రంగా కొనసాగివస్తుంటుంది. ఈ మూడు విలువలు మనుషులందరూ సాధించే క్రమంలో ఇళ్ళు ప్రజాస్వామికీకరించబడతాయి అన్నది షాజహానా ఆశ. ఆశ వాస్తవీకరించబడాలంటే నిర్దుష్టమైన ఆచరణ దిశగా గమనం ఉండాలి.

షాజహానా బాల్యాన్ని వర్ణించినంత విస్తృతంగా కాలేజీ చదువుల కాలాన్ని వర్ణించలేదు. నిజానికి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే సామాజిక సంబంధాల సంయోజనకు అనువైన కాలం అది. ఆశయాల ఆదర్శాల స్థిరీకరణ,  క్రియాశీల  చైతన్యం పరిఢవిల్లే డిగ్రీ, పిజి , పరిశోధన అధ్యయనాల కాలం నాటి సంబంధాలు, సంఘర్షణల చిత్రణకు సమ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే నవలగా  ఇది సమగ్రం అయ్యేది. అయినా ఇలా మైనారిటీ ప్రజాసమూహాలనుండి, వాళ్ళలోనూ రెండవస్థాయి పౌరులుగా చూడబడే  మహిళల నుండి వచ్చే ఇలాంటి రచనలను స్థిరపడిన ప్రక్రియల మూసతో  తూచకూడదేమో..!?

ఏమైనా సాహసి షాజహానా నవలా రంగంలోకి ఒక అడుగువేసింది. అందుకు ఆమెను మరొకసారి మనసారా అభినందిస్తూ ఇక్కడ నుండి  తాను వ్రాయవలసిన నవలలు మరిన్ని ఉన్నాయని గుర్తు చేయటం పెద్దరికంతో కాదు. ఈ నాటి యువతపై ఉన్న నమ్మకంతో. మనం  చేయలేని పనులన్నీపిల్లలు చేయాలని ఆశపడే తల్లి తత్వంతో ..

షాజహానా ప్రపంచంలోకి  మీరు కూడా ప్రవహించండి మరి ..

 

పశ్యంతి                                                                   

27- 8- 2021                                                                    

 

 

 


ఈ సంచికలో...                     

Sep 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు