సాహిత్య వ్యాసాలు

(October,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఆధునిక స్త్రీల సాహిత్య చరిత్ర -17

కళ్లేపల్లె  వేంకట రమణమ్మ కవిత్వం ఖండికల రూపంలో లభిస్తున్నవి ఆరు. శతకం ఒకటి. ఖండికలు ప్రధానంగా ఆశీర్వచన ,అభినందన పద్యమాలలు. కాకినాడ విద్యార్థినీ  సమాజం ,ఆ సమాజం వల్ల ఏర్పడ్డ సంబంధాలు ఆమెకు ఎంత ప్రియమైనవో చెబుతాయి అవి. 1904 లో ఏర్పడిన కాకినాడ విద్యార్థినీ సమాజం పులగుర్త లక్ష్మీనరసమ్మ నాయకత్వంలో నాలుగైదేళ్లు వర్ధిల్లి తరువాత నామ మాత్రావశిష్టమై  ఉండగా 1910 లో బాలాంత్రపు శేషమ్మ , దామెర్ల సీతమ్మ కలిసి పునరుద్ధరించినది మొదలు కళ్లేపల్లి వేంకట  రమణమ్మ  దానికి అధ్యక్షురాలు. 1916 వరకు ఆ పదవిలో ఆమె కొనసాగింది. అందువల్ల ఆమె మేధో సృజనలకు అదే ఆలంబన కావటంలో ఆశ్చర్యంలేదు.

                                                1

1910 లో రెండవ జన్మ ఎత్తిన శ్రీ విద్యార్థినీ సమాజం ద్వితీయ జన్మదిన మహోత్సవ సమయంలో వేంకటరమణమ్మ సంస్థను ఉద్దేశించి వ్రాసిన తొమ్మిది పద్యాల ఖండిక ( హిందూ సుందరి , 1911, సెప్టెంబర్) లో మూడు శార్దూల వృత్తాలు, మూడు ఉత్పలమాల వృత్తాలు, ఒక చంపక మాల , ఒక సీసం, ఒక పంచచామర వృత్తమూ వున్నాయి. ‘శ్రీవిద్యార్ధిని యన్సమాజమఅని సంబోధించి దేవుడు సదా నిన్ను పాలిస్తాడు అని ప్రార్ధనారూప ఆశీస్సుతో ప్రారంభించి రెండవ పద్యంలో ఖ్యాతి , అపఖ్యాతి అనేవి పని ఆరంభించకపోతే లేనేలేవు , ఆరంభించిన తరువాత దారి తప్పితే అపఖ్యాతి, ధైర్యంతో ఆరంభం అయ్యావు కనుక చివరివరకు నడవాలి అని ఆకాంక్షించింది. ఇంతకు ముందు ఈ నగరంలోని స్త్రీలందరినీ ప్రోగుచేసి ప్రసిద్ధికెక్కావు, ఏ మాయలోనో పడి మరుగై ఇన్నాళ్లకు ఈ రూపంలో మళ్ళీ అవతరించావు. ఏడాది శిశువువు అయ్యావు. గట్టెక్కవలసిన బాలారిష్టాలు ఎన్నిఉన్నాయో తెలివిగా ఉండాలని చెబుతూనీలోనే ప్రతిసంఘమేర్పడును జుమ్మీ జంకి వెన్నీకుమీఅని హెచ్చరించింది.

  ప్రారంభమైనప్పుడు ఏర్పరచుకొన్న సమాజ నిబంధనల ప్రకారం  పునర్వివాహం చేసుకొన్నస్త్రీలకు ఇందులో ప్రవేశం లేదనీ, పునరుద్ధరణ తరువాత నిర్వాహకులు కొందరు ఆ నిబంధనను వ్యతిరేకించి పునర్వివాహిత స్త్రీలను చేర్చుకొనటం వలన చాలామంది సమాజ సమావేశాలకు  రావటం మానేశారని,సమాజం ఇలా క్షీణదశకు రావటం చూసి సహించలేక   దామెర్ల సీతమ్మను , బాలాంత్రపు శేషమ్మను కార్యదర్శి సహాయకార్యదర్శి పదవులనుండి తొలగించి  సమాజకార్యక్రమాలను చక్కబెట్టే బాధ్యత పులగుర్త లక్ష్మీ నరసమాంబ  తీసుకొనాలని  జులై 2 వతేదీనాడు జరిగిన సభలో  నిర్ణయించినట్లు 1911 జులై సావిత్రి పత్రికలో వచ్చిన  ప్రకటనను దృష్టిలో పెట్టుకొనే రమణమ్మ ఈ హెచ్చరిక చేసి ఉంటుంది. ఆ ప్రకటనను ఖండిస్తూ బాలాంత్రపు శేషమ్మ , దామెర్ల సీతమ్మ తాము ఏర్పరచకుండా , తాము లేకుండా కార్యవర్గ సమావేశం ఎలా జరిగిందని, ఆ తీర్మానానికి విలువ ఏమిటని, పులుగుర్త లక్ష్మీ నరసమాంబకు దానితో సంబంధం ఏమిటని సవాల్ చేస్తూ వ్రాసిన నేపథ్యంలోనే  “కొందరి మెప్పుకై జనులకుం దలకంటకమైన తోవలన్ ముందడు గుంచ( బోకుముఅని ప్రారంభమయ్యే తరువాతి పద్యాన్ని  “ నిన్నుఁ  బాసిన బ్రయత్నములెట్లు ఫలించు సోదరీఅని  ముగించినట్లు తోస్తుంది.

తరువాతి సీసపద్యంలో స్త్రీలు  విద్యా  స్వాతంత్య్రముల రుచి ఎరగటానికి, సంఘాలు పెట్టుకొనటానికి ఏ సంస్కర్తలు కారకులు, ప్రేరకులు అయ్యారో వాళ్ళు తలపెట్టినసంఘ సంస్కా రములకు నీ శక్తి ( కొలది తోడుపడ ( జూడు యే మార్పు (గూడదనకు మమ్మ యదియె కృతజ్ఞత సుమ్ము కొమ్మఅని హితవు చెప్పటంలో పునర్వివాహిత స్త్రీలను సంఘంలో చేర్చుకొనరాదు అన్న   పక్షం పట్ల రమణమ్మ వైఖరి స్పష్టమే. ఆ రకంగా ఆశీస్సు రూపంలో ఉన్న ఈ ఖండిక విద్యార్థినీ సమాజ చరిత్రకు సంబంధించిన ఒక  ఘటనకు వ్యాఖ్యానం కూడా అయింది.

చెలులు స్వతంత్ర హీనులు అని , చెంచలమతులని, నీచులని గ్రంధాలలో వ్రాసిపెట్టినపుణ్యపురుషులవూహ, మాట, చర్య అన్నీ మిధ్య అనుకొనేట్లు శ్రీ విద్యార్థినీ సమాజం పనిచేయాలని ఆకాంక్షించింది రమణమ్మ, చివర వ్రాసినపంచ చామరవృత్తంలో సమాజపు రెండవ పుట్టిన రోజు ఉత్సవం కలిగించిన తృప్తి నుండి సంతోషపడిన ఆత్మ తో వారణాఖ్యమాలికను ఇస్తున్నాను తీసుకోమంటుంది. అంటే తాను వ్రాసిన ఈ పద్యాల మాలను  ఆమె  ‘వారణ మాల’  అన్నది. పద్య రచనా సంప్రదాయంలో వారణ మాల ఒక రూపమా ? వారణ మాయిరం అని తిరుపతిలో వెంకటేశ్వరస్వామికి చేసే ఆరాధన ఒకటి ఉంది. అమ్మవారు స్వామివారికి తాను ధరించిన పూలమాలను సమర్పించటం ఇందులో విషయం.( గిరిజామనోహరబాబు గారి సౌజన్యంతోశ్రీ విద్యార్థినీ సమాజాన్ని దేవుడు కాపాడాలి అని ప్రారంభంలోను  పార్వతి, సరస్వతి, లక్ష్మి - ఈ ముగురమ్మల దయతో శోభిల్లుతుందని  చివరి పద్యంలోను చెప్పిన కవయిత్రి ఈ పద్యమాల ను పవిత్రమైనదిగా సంభావించిందేమో దానికి వారణ మాల  అని పేరు పెట్టింది.

మళ్ళీ సమాజతృతీయ జన్మ వాసరోత్సవాన్నిపురస్కరించుకొని 1913లో ( హిందూ సుందరి , జూన్ ) ఆశీర్వచన పద్యాలు వ్రాసింది రమణమ్మ. వీటిని ఆమెపంచరత్నములుఅన్నది రెండు కందపద్యాలు, ఒక ఉత్పలమాల, ఒక సీసం , ఒక చంపకమాల మొత్తం అయిదు పద్యాలు కనుక పంచరత్నాలు. ఉత్సాహ వృత్తంలో నీ పుట్టిన రోజు సంబరాలు నన్ను సౌఖ్యవార్ధిలో తెల్చాయి కనుక నీ కోసం ఈ పంచరత్నాలు కానుకగా ఇస్తున్నాను అని చెప్పుకొన్నది. సాధించిన విజయాలకు సంతోషపడుతూ మెచ్చుకొంటూనే భవిష్యత్తులో సాగించవలసిన ఉద్యమాల విషయంలో శ్రద్ధతో పనిచేయాలని సూచించింది. ఏమి పనిమీద ఎక్కడికి వెళుతున్నదో గానీ మూడునెలలు విద్యార్థినీ సమాజాన్ని వదిలి వెళ్ళటానికి ఆమె పడిన వేదన తరువాతి సీసపద్యంలోని విషయం. శరీరాలు వేరైనా తనకూ సమాజానికి అభేదమని చెప్పుకొన్నది. కనుక ఎడబాటు బాహిరమే కానీ ఆంతరికం కాదని సమాధానపడింది.

శ్రీవిద్యార్ధినీ సమాజ అయిదవ వార్షికోత్సవానికి కూడా గజమాల అనే శీర్షికతో కళ్లేపల్లె వేంకట రమణమ్మ ఏడు పద్యాలు వ్రాసింది. సాధారణంగా ప్రశంసాపూర్వకమైన పద్యాలు చాలా ఎక్కువగా వ్రాసినప్పుడు దానిని గజమాలగా చెప్తారు. మరి ఏడూ పద్యాలే వ్రాసి రమణమ్మ ఆ పేరు ఎందుకు పెట్టిందో తెలియదు. ఇందులోనూ సమాజ చరిత్ర గురించిన సీస పద్యం ఒకటి ఉంది. తొలుదొల్త భండారు అచ్చమాంబ చేత స్థాపించబడింది కానీస్వాస్థ్యంబు లేక నామా వశిష్టవై నవయుచుండ శేషమాంబ జాలిపడి చేరదీసిందని, అందరూ కలిసి సంస్థకు ఒక భవనాన్ని ఏర్పరచి రిజిస్టరు చేశారని , హిందూ సుందరి పత్రికను తెచ్చి జత చేశారని ఆ కార్యంలో తన భాగస్వామ్యాన్ని కూడా సూచిస్తూ వ్రాసింది. ఈ సంస్థను స్థాపించింది భండారు అచ్చమాంబ  కాదు.ఆమె కాకినాడకు వచ్చిన సందర్భంలో పులుగుర్త లక్ష్మీ నరసమాంబ ఆ పని చేసింది. ఆమె పేరును పూర్తిగా విస్మరించటానికి  సంస్థ కార్యదర్శి ఉపకార్యదర్శుల మీద వచ్చిన వ్యతిరేకత విషయంలో లక్ష్మీ నరసమాంబ హస్తం ఉందన్న అనుమానం కారణమై ఉంటుంది.వివాదాల సంగతి ఎలా ఉన్నా -నిజానికి  1911 లో వచ్చిన ఆ వివాదం వెంటనే సమసిపోయినా - సంస్థ వ్యవస్థాపక సభ్యురాలిగా లక్ష్మీ నరసమ్మ పేరు ప్రస్తావించకపోవటం చరిత్రను మరుగుపరచటమే.

విద్య, వినయం , వివేకం అలవరచుకొనవలసిన గుణములని చెప్తూ ఆ పంచమ వార్షికోత్సవ సదస్సుకు అధ్యక్షురాలిగా కొటికలపూడి సీతమ్మ వచ్చిన విషయాన్ని కూడా నమోదు చేసింది కవయిత్రి ఈ పద్యాలలో.

ఆరవ వార్షికోత్సవంలోపారితోషికంగాగీతామాలిక అల్లి ఇచ్చింది. ( హిందూసుందరి , 1916, జూన్) గీతపద్యంతో మొదలుపెట్టి నాలుగు పాదాలు దాటి దానిని అలాగే కొనసాగిస్తే అది గీత మాలిక. ఇది 92 పాదాల గీతమాలిక . యథాపూర్వకంగా దైవప్రార్థనా పూర్వకమైన ఆశీస్సుతో మాలిక ప్రారంభం అవుతుంది. అప్పటికి దేశీయ రాజకీయాలలో వికసిస్తున్న ఆంధ్రజాతి ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్ర మాత భావనలు వెంకట రమణమ్మ వరకు అందివచ్చాయి. విద్యార్థినీ సమాజాన్ని ఆంధ్రమాత కన్న బిడ్డ  అంటుంది. ‘పతనమైన తల్లిని పైకి లేవ నెత్తుటకు తగిన సామర్ధ్యం కలదానిగా సమాజాన్ని సుశిక్షితం చేయటానికిఅబలలం అశక్తులం అనుకోకుండా ఆంధ్రసోదరులను ఆశ్రయించి అవసరమైన ధనం  సమకూర్చుకొని భవనం కొని గ్రంధాలయం, ముద్రాలయం ఏర్పరచుకొన్న విషయాన్ని చెప్తుంది. సభ్యత్వం విషయంలో సంతృప్తి కూడదంటుంది. పట్టణంలోని వనితలందరూ వారానికి ఒక మారైనా సమాజానికి వచ్చేట్లు చేయాలంటుంది. సమాజానికి వచ్చే పుస్తకాలు, పత్రికలు అందరి వినియోగంలోకి రావాలంటుంది. బాలికలకు నూతన జ్ఞానం సంపాదించటానికి అనువుగా నెలకొకసారి వచ్చే హిందూసుందరిని పక్షపత్రికగా వచ్చే మార్గం చూడాలని సూచించింది. అజ్ఞాన మయతిమిరంలో  ఉన్న స్త్రీలను ఆకర్షించి సంఘంలోకి రావటమే తెలివిడి అని బోధపరచాలని పేర్కొన్నది. నిందకు కృంగక , ప్రశంసకు పొంగక ఓరిమితో మెలగాలనిశాంతమే భూషణమ్ము మన కాంతలకుఅని చెప్తుంది . ‘వినయమే నగ మన యాంధ్రవనితలకునుఅని కూడా చెప్పింది

మరో రెండు పద్యఖండాలకు సందర్భం శ్రీ విద్యార్థినీ సమాజం కార్యదర్శి బాలాంత్రపు శేషమ్మ. ఆమె పురుడు పోసుకొనటానికి మద్రాస్ వెళుతున్నప్పుడు వీడ్కోలు ఇస్తూ చదివిన ఆశీర్వచన పద్యాలు ఐదు.(హిందూసుందరి, 1914, అక్టోబర్)   సంతానం కోసం పడిన చింత ఇకలేదు కదా అంటూ చాలాకాలం సంతానం లేదని ఎంతో చింతించిన కౌసల్య రాముడిని కని ఆనందపడినట్లుగా మంచి కొడుకు నీకు పుట్టి ఆనందం కలిగించాలని లక్ష్మిని ప్రార్థిస్తున్నా అని శేషమాంబను ఉద్దేశించి చెప్పింది.ఇంతవరకు సామాన్యమేఆ తరువాతి పద్యంలో ఉంది విశేషమంతా.

సుందరిదెచ్చినందులకు సుందరుడౌ సుతు గాంచగల్గునో

సుందరిదెచ్చినందులకు సుందరి యౌ సుత గాంచగల్గుదో

సుందరిదెచ్చియున్ సతము సుందరులన్న భివృద్ధిజేయుటన్

సుందరియౌ సుపుత్రికను శోభన మొప్పగ గాంచుమో చెలీ”           రాముడి వంటి కొడుకు కలగాలని కోరుకొనటం సరేపుట్టేది కొడుకో కూతురో నిర్ణయించలేం కదా అన్న ఆలోచన వచ్చి ఉంటుంది. హిందూసుందరి పత్రికను స్త్రీ విద్యార్థినీ సమాజం కోసం తెచ్చిన శేషమాంబ కృషి గుర్తుకువచ్చి ఉంటుంది. సుందరి ని తెచ్చినందుకు సుందరుడైన కొడుకు పుడతాడా? సుందరి అయిన కూతురు పుడుతుందా అని విచికిత్స చేసి సుందరిని తెచ్చి సుందరులను అభివృద్ధి చేస్తున్నావు కాదా మంచి కూతురు పుడితే బాగుంటుందని తీర్మానించటం ఈ పద్యంలో చూస్తాం. స్త్రీసమాజం తో పాటు హిందూ సుందరి పత్రిక రమణమ్మ  భావప్రపంచాన్ని అంతగా ఆక్రమించిందన్నమాట. ఈ పద్యంలో ఆడపిల్ల పుట్టుకను ఆకాంక్షించిన ఆమె తరువాతి పద్యంలో మళ్ళీ మాయ కమ్మినట్లుగా సుఖప్రసవమై కొడుకునెత్తుకొని రావాలని  సమాజమునకు తీసికొనివచ్చి తమకందరికీ చూపాలని శ్రీమహా విష్ణువు ను ప్రార్ధిస్తున్నానంటుంది. చైతన్యంతో ఆడపిల్ల పుట్టుకను ఆకాంక్షించటం సంప్రదాయపు అలవాటు చొప్పున అప్రయత్నకృతంగా మగపిల్లవాడి పుట్టుకను కోరటం ఇక్కడ చూస్తాం. శేషాంబకు పుష్పాలంకృతి వేళ అంటే సీమంతపు వేడుకలో రమణమ్మ ఈ పద్యాలు చదివింది.

మరుసటి నెల సంచిక( నవంబర్ 1914) వచ్చే నాటికి శేషమాంబ ప్రసవించి ఆడపిల్లను కనటం , ఆపిల్లను ఉయ్యాలలో వేసే వేడుక జరగటం కూడా అయ్యాయి. ఉయ్యాల ఉత్సవ వైభవ వేళ తాను బాలికకు చేసి ఇచ్చిన రత్నమాల ఈ పద్యమాల అంటుంది వెంకటరమణమ్మ చివరి పద్యంలో మొదటి ఐదు పద్యాలలో మొదటిది ఉత్పలమాల.తరువాతి రెండు కందాలు. ఒక గీత పద్యం తరువాత  మళ్ళీ ఒక కందం. సుందరరామయ్య శేషమాంబల పుత్రికకు దీవనలీయమని స్నేహితులను ఆహ్వానిస్తుంది. హిందూసుందరి పత్రిక యందున్న అభిమానం ఈ ఖండికలో కూడా ప్రతిఫలించింది. హిందూసుందరే మన మీద దయతో సుందరరామయ్య శేషమాంబల కూతురిగా పుట్టింది అంటుంది. హిందూసుందరి పత్రికయందు అభిమానమున్న అందరమూ కలిసి సుందరిని ఉయ్యాలలోవేసి జోలపాటలు పాడటంలో ఆనందం పొందాము అని సంబరపడుతుంది.

స్వస్తిరస్తు శుభొస్తు సౌభాగ్యమస్తు

చిరతరాయుష్యమస్తు భాసుర గుణోస్తు

భాగ్యమస్తు నిరంతరారోగ్యమస్తు

శేషమాంబా కుమారియౌ శిశువునకున్”         అని బిడ్డకు ఆశీర్వచనం పలికింది.

 

                                  2

కళ్ళేపల్లె వేంకటరమణమ్మ వ్రాసిన శ్రీవరలక్ష్మీ శతకం హిందూసుందరి పత్రికలో 1914 మే జూన్ నెలలలో ప్రచురితం. ‘శ్రీ వరలక్ష్మీఅన్నది మకుటం. 108 పద్యాలు. ఎంచుకొన్న వృత్తం కందం. శతకాలు భక్తి ప్రధానమైనవి. ఇష్టదైవాన్ని సంబోధిస్తూ లీలావర్ణన చేయటం ఎక్కువ. అది నెపంగా  సామాజిక విషయాల విమర్శ సమాంతరంగా సాగుతుంటుంది. స్త్రీలకు శ్రావణమాసం మంగళగౌరీ , వరలక్ష్మీ వ్రతాలతో, పేరంటాలతో  సందడి సందడిగా సాగే మాసం. శ్రావణమాసం రెండవ శుక్రవారం నాడు చేసుకొనే వరలక్ష్మీవ్రతం అధిష్టాన దేవత వరలక్ష్మి . వరలక్ష్మీ పూజావిధానం యక్షగానంగా కూడా వ్రాసింది రమణమ్మ . ( యస్వీ . జోగారావు , యక్షగాన వాజ్మయ చరిత్ర ) అది ఈ  శతకం కంటే ముందు వ్రాసిందో తరువాత వ్రాసిందో తెలియదు.

సాధారణ శతక పద్ధతిలో కాక  శ్రీ వరలక్ష్మీ శతకాన్ని కళ్ళేపల్లె వేంకట రమణమ్మ కావ్య పద్ధతిలో ప్రారంభించింది. “ శ్రీరామామణి నాహృ

                                 త్సారసమున నిలచి నీదు చరణ యుగళి సే

                                 వారతి నా చిత్తమ్మున(/

                                జేరిచి రక్షింపుమమ్మ శ్రీవరలక్ష్మిఅని ప్రార్ధనతో ప్రారంభించింది. కులదైవానివని మా పూర్వీకులు నిన్ను సేవించారు. వారి మార్గంలోనే నేనూ కనుక వాళ్లకు వలెనె  నేనూ వర్ధిల్లేట్లు చేయమని తరువాతి పద్యంలో వేడుకొన్నది. ఆదికవులు శతకం గొప్ప ప్రక్రియ అని నుతించారు కనుక భక్తితో నేనీనూతనశతకరచన చేయాలనుకొంటున్నాను , భారం నీదే అని వరలక్ష్మీదేవికి విన్నవించుకొన్నది.

మృదు మధుర వచన రచనల

కుదురెఱిగిన దానఁగాను కొలఁది ( జదివితిన్

జదువను ఛందము ( గావిం

చెదనని  కడఁగితిని గవిత శ్రీవరలక్ష్మీ “  రచనా నైపుణ్యం లేదని, చదువు కొద్దిగానే అని , ఛందస్సు అసలే చదవలేదని అయినా కవిత వ్రాసే సాహసానికి దిగుతున్నానని వెంకట రమణమ్మ చెప్పుకొన్న మాటలు తనకు  పూర్వపు మహిళాకవులు చెప్పుకొన్న పద్ధతిలోనే ఉన్నాయి. పెద్దగా విద్యావంతురాలిని, జ్ఞానవంతురాలిని కాదని అల్పజ్ఞత్వాన్ని ప్రదర్శించి లోకపు విమర్శలకు ఒక కవచం సిద్ధం చేసుకొన్నదన్నమాట.

ఆ తరువాత పద్యాలలో ఆమె తనకు కవిత్వం వ్రాసే శక్తి కలిగించిన  శివరామ కవీంద్రునికి(6)తనను విద్యాన్వితగా చేసిన మామగారు సీతారామశాస్త్రికి(11)  నమస్కరించిందితండ్రి కురవి రామశాస్త్రిని ( 8) తలచుకొన్నది. “ముద్దులుగులుకు కవిత్వము సిద్ధింపగవిద్దెలకధిదేవత అయిన వాణిని , తాను అనుకొన్న శతక రచనకు విఘ్నాలు రాకుండా హేళనలకు గురి కాకుండా ఉమా భావానిని  స్తుతించింది. ఇలా కావ్యాలలో ఉండే గురు దైవ ప్రార్ధనల సంప్రదాయాన్ని శతకంలోకి తీసుకురావటమే కాదు పూర్వకవి స్తుతి సంప్రదాయాన్ని కూడా పాటించింది. అందులోనూ ఒక విశేషం వుంది. ‘తొలి చదువుల కర్తలు, ద్రష్టలుఅయిన మైత్రేయి సూర్య శ్రద్ధ మొదలైన వాళ్ళ నుండి మొదలుపెట్టి సంస్కృత తెలుగు కావ్యాలు వ్రాసిన భామతి, మొల్ల , తరిగొండ వెంగమాంబ మొదలైన కవయిత్రులను స్తుతించింది. వ్యాస వాల్మీకాదులను, నన్నయ తిక్కనాదులను కాక కావ్యరచనా కారులైన స్త్రీల పరంపరను స్తుతించటం ఆత్మగౌరవ స్పృహతో కూడిన  కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించటమే.

అంతే కాదు సమకాలికులు సంస్కరణవాదులు, రచయితలు అయిన మహిళలను కూడా వేరువేరుగా ప్రస్తుతించింది. బాల వితంతు వివాహ  ఉద్యమంలో భాగమైన కందుకూరి రాజ్యలక్ష్మ మ్మను నుతించింది. అబలాసచ్చరిత్ర రత్నమాలను ఇచ్చిన బండారు అచ్చమాంబను స్నేహంతో   స్మరించుకొన్నది. తెలుగు గీర్వాణభాషల లో ప్రజ్ఞ గలిగిన కవయిత్రి , స్నేహితురాలు అయినా పులుగుర్త లక్ష్మీనరసమాంబను ప్రేమతో ఎప్పుడూ తలచుకొంటూనే ఉంటానని చెప్పుకొన్నది.’ దేశసేవారతయౌ నాతిఅని కొటికలపూడి సీతమ్మను తలచుకొన్నది. గతంలోనూ , ఇప్పుడూ కూడా విద్యావంతులైన స్త్రీలు ఎందరో ఉన్నారని కానీ వాళ్ళను అందరినీ చెప్పటానికి ఈ శతకం సరిపోదని ఆగుతున్నాని చెప్పింది. ఈ రకంగా శతకంలోని మొదటి 20 పద్యాలు కావ్యావతారికా  ప్రాయంగా రచించబడ్డాయి.

21 వ పద్యం నుండి 59 వ పద్యం వరకు శతకం ఆధ్యాత్మిక భావభూమికలో నడిచింది. సృష్టిస్థిలయ మూలం వరలక్ష్మి అని, ,అది, ఇటువంటిది, అటువంటిది, తుదిమొదళ్లు కలదన్నట్లు కనిపించేది , మనస్సుకు తోచేది అన్నీ వరలక్ష్మి లీలావిలాసమేనని , సుజ్ఞానులకు వశీకరమయ్యే బ్రహ్మం, శ్రీకైవల్య సుఖం అన్నీ  శ్రీవరలక్ష్మే అని స్తుతిస్తుంది. త్రిగుణాతీతము, పరిపూర్ణము, జగదాధారము అయి వ్యష్టిగా సమిష్టిగా కనిపించే సమస్తం వరలక్ష్మి అని ప్రవిమలం, అవిమలం అని, మాయ అని విద్య అని రెండురకాలుగా భాసించే శ్రీమహాలక్ష్మి శక్తి శివుడికైనా తెలియశక్యం కాదంటుంది. (44) “ అవివేకులునినుఁ గమలో

ద్భవునిగ నింద్రునిగ హరి( (బక్ష్మీం ద్రునిగా

రవిఁగా  విఘ్నేశ్వరుఁగా

 శివుఁగా నజ్ఞత నుతింత్రు శ్రీవరలక్ష్మీ (50) అనే పద్యంలో అన్ని దైవాలకు మూల రూపం శ్రీమహాలక్ష్మి అని ప్రతిపాదించింది. అవివేకం వల్ల మూల శక్తిని వదిలి వేరు రూపాలను ఆరాధించటం జరుగుతున్నదని చెప్పినట్లయింది. శ్రీవరలక్ష్మి పరమాత్మ మాత్రమే కాదు, సూక్ష్మ స్థూల కారణం తనువులు కలిగిన జీవాత్మ కూడా అని భావిస్తుంది. ( 53) పంచభూతాల సృష్టికర్త శ్రీమహాలక్ష్మే అని చెప్తుంది.

60 వ పద్యం నుండి కొంతకొంతగా లౌకిక జగద్విషయ చర్చ చేసింది. కనబడుతున్న ప్రపంచాన్ని సృష్టించినవాడు ఎవడో ఉంటాడు అతడు పురుషుడు శ్రీహరి అనుకుంటారు కానీ వాళ్ళు దారి తప్పిన వాళ్ళు అంటుంది రమణమ్మ (60) ఎందుకంటే సృష్టికర్త పురుషుడు కాదు ,స్త్రీ అన్నది , ఆ స్త్రీ మహాలక్ష్మి అన్నది రమణమ్మ విశ్వాసం. ఈ విశ్వాస మూలం దేవీభాగవతంలో ఉంది. శైవ వైష్ణవ భక్తి మార్గాలను ప్రస్తావించి విష్ణువు గొప్పవాడని కొందరు , శివుడు గొప్పవాడని మరికొందరు అట్లాకాదు , అసలు వాళ్ళిద్దరికీ భేదమే లేదు అని కొందరు అంటారని చెప్తూ ద్వైత అద్వైత విశిష్టాద్వైత మతాభిమానులై వాదవివాదాలు చేసేవాళ్లు వాటన్నిటికీ అతీతమైన వరలక్ష్మి రీతిని తెలుసుకోలేకున్నారని అంటుంది. అందరూ  దేవుడు మగవాడనుకొంటారు, స్త్రీయే దైవం అనేవాళ్ళు ఎందరు? అని ప్రశ్నిస్తుంది.

నేనేనీ వీవే నే

 నైనప్పుడొక చెలివి దైవమైనప్పుడు నా 

             ప్రాణేశ్వరుండవు సృ

ష్టే నీవైనన్ముదంబు శ్రీవరలక్ష్మి” (71)   వరలక్ష్మి తో అభేదం భావించినప్పుడు ఆమె తానూ  స్నేహితులట .. ఆమె తనకన్నా భిన్నమైన దైవం అని సంభావించినప్పుడు ఆ స్థానంలో తన భర్త ఉంటాడట , సృష్టి మొత్తం వరలక్ష్మే అయినప్పుడు మహా సంతోషమట .. లౌకిక పారలౌకిక పరమార్ధాలకు కవయిత్రి వారధి కట్టటం కనిపిస్తుంది ఈ పద్యంలో. “…. నువిదలకువిదను నుతించు టుత్తమమని నిన్నువిద(గ నమ్మి భజించెదఅని ( 71) తాను వరలక్ష్మిని పూజించటానికి స్త్రీ కావటం కారణమని ఒక తర్కం చెప్పటంలో ఆమె చమత్కారమే కాదు స్త్రీలు స్త్రీలగురించి ఆలోచించటం , పనిచేయటం అనే సామాజిక అవసరం తాలూకు తత్వం ఆమెలో ఎంతగా నాటుకుపోయిందో కూడా తెలుస్తుంది.

74 వ పద్యం నుండి ఈ శతకం లోని పద్యాలు పూర్తిగా లౌకిక విషయాలను  , అందులోనూ  స్త్రీల విషయాలను ప్రస్తావిస్తాయి. భక్తి శతకం సామాజిక సంస్కరణ దృక్పథ రచనగా తేలి కనిపిస్తుంది.

 “ మాత నెఱింగిన గతిఁ దమ

  తాతం దెలిసికొనవశమె తల్లి జనకుఁడం

 చేతని ( జూపునో  యాతని (

బ్రీ తిం గనవలయుగాక శ్రీ వరలక్ష్మీ “ (74)      నవమాసాలు మోసి కంటుంది కనుక శిశువుకు తల్లి ఎవరో సహజంగా తెలుస్తుంది. తండ్రి అలా కాదు. తండ్రి అని తల్లి ఎవరిని చూపిస్తుందో అతనే తండ్రి. తల్లి సత్యం, తండ్రి విశ్వాసం అన్న వాడుక అక్కడి నుండే వచ్చింది. స్త్రీ దేవతా ప్రాధాన్యాన్ని, స్త్రీ ప్రాధాన్యాన్ని స్థాపించటానికి అక్కడ ప్రారంభించింది వెంకట రమణమ్మ. జనకుని కన్నా గురుత్వం జనని యందే అని శ్రుతులు చెప్తున్నాయి కనుక నీవు వినా వేరెవ్వరూ అధికులని నేను అనుకోలేను అని చెప్తుంది రమణమ్మ. వనితల మహత్యం చెప్పటానికి అనసూయ, సుమతి, సావిత్రి , ద్రౌపది మొదలైన స్త్రీలను తలచుకొంటే సరిపోతుంది అంటుంది.

డబ్బు సంపాదించటం తమవంతు అని పురుషులే విద్యనేర్చుకొని అబలలు అని స్త్రీలను ఇంటి పనులు చేసేవాళ్లుగా చేసారని ఆరోపించింది. (86) స్త్రీలతో స్నేహం మరిచి దాసులుగా చేశారని అంటుంది. దాసికి ఎంత మర్యాదో సతికి కూడా అంతే మర్యాద ఉందని చివరకు రాకాసిగా పేరు పెడతారు స్త్రీ చేసుకొన్నా పాపం ఏమిటి అని వరలక్ష్మీదేవిని ముందు పెట్టుకొని తన వేదన వ్యక్తం చేస్తుంది.

లోకంలో స్త్రీలు సాధారణంగా ఐదవతనాన్ని, సంతాన సౌఖ్యాన్ని , సిరిసంపదలను కోరి వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు. కళ్ళేపల్లె వెంకటరమణమ్మ అటువంటి కోరికలు కోరలేదు. ఆమె కోరినవన్నీ స్త్రీని అసమానురాలిగా చూసి అవమానం చేసే సామాజిక రుగ్మతలకు పరిష్కారాన్ని. సుగుణవతియైన భార్యామణి కన్నా అధికతరమైనది ఏదీ లేదన్న స్థిరబుద్ధి మగవాళ్లకు ప్రసాదించమంటుంది. (89) ”  చదువెప్పుడు కీడొనరిం /పదు మేలొన( గూర్చు(దమకు వలెనని పురుషుల్ /మదినమ్ము కొనఁగ వే ( జేసెదవేని సుఖింతుమమ్మ శ్రీవరలక్ష్మీ “ (91)  స్త్రీల చదువువల్ల కీడు లేదని మగవాళ్లకు అర్ధం కావటం పై స్త్రీల అభివృద్ధి, సుఖం ఆధారపడి ఉన్నాయి కనుక ఆ పరిస్థి చక్కబడటం ముఖ్యం. వెంకటరమణమ్మ ప్రార్ధన సమిష్టి కోసం. స్త్రీలు విదుషీమణులైతే అది తమకు కూడా  సౌఖ్యకరమని పురుషులకు అర్ధమయ్యేలా చేయమంటుంది.( 92)

స్త్రీలు కొమలులు, అబలలు కావచ్చు కానీ అందరూ ఏకమైతే సబలలు , సామాజికురాండ్రు అవుతారు. అనుకొన్నది సాధిస్తారు. చీమలను చూస్తే ఈ విషయం  తెలుస్తుంది (93) అని చెప్తుంది. లోకాలను కనిపెంచే స్త్రీల  వరకు వెళ్లకపోతే సంస్కరణలు సార్ధకం కావు (94) స్త్రీలను చులకనగా చూడటం తగదు (97) నారీమణులు గృహాలంకరములు కారు , మూల స్తంభాలు (98) మనుజుఁడొనరింప జాలని పనినైనా చేయగల స్త్రీలు అబలలు ఎట్లా అవుతారు? (99) ఇలాంటి ప్రశ్నలు , అభిప్రాయాలు శ్రీవరలక్ష్మీ శతకం పద్యాలలో కనబడతాయి.

డబ్బుకోసం చిన్నపిల్లలను వృద్ధులకు ఇచ్చి పెళ్లిచేసే అధమాధమవృత్తిని అడుగంటా ఛేదించగలిగితే అదే పదివేలు అని వరలక్ష్మికి విన్నపం చేసింది. ఆడపిల్లల వివాహ వయో పరిమితి పెంచటం గురించి ఆలోచిస్తే దేశాభ్యుదయం సమకూడుతుందని కోరింది. చేయవలసిన మార్పులు ఎన్నో ఉన్నాయి అన్నిటినీ పరిష్కరించి మా కష్టాలను తీర్చమని వరలక్ష్మిని వేడుకొన్నది. ఆ రకంగా పితృస్వామ్య అధికార విలువలకు కట్టుబడి తమ జీవితాలు గడపటానికి స్త్రీల కోసం  రూపొందించబడిన వ్రతాన్ని, దైవభక్తిని స్త్రీల సమిష్టి సామాజిక ప్రయోజనాలకోసం కొత్తపద్ధతిలో ఉపయోగించుకొన్నది కళ్ళేపల్లె వెంకట రమణమ్మ.

 

-------------------------------------------------------------------------------- 

  

 

 

    

                           

 

 


ఈ సంచికలో...                     

Sep 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు