సాహిత్య వ్యాసాలు

(November,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర - 18 

జూలూరి తులశమ్మ రచనలు 1903 నుండి మొదలై  1930 లలోనూ  వివిధపత్రికలలో లభిస్తున్నాయి. ఆమె రచనా వ్యాసంగం 1903 జూన్ హిందూసుందరి పత్రికకు చారుపొడి, పులుసు పొడి, కూటుపొడి తయారీ విధానాలగురించి వ్రాయటంతో మొదలైంది. మొదటి రెండింటిలో ఇంటి పేరు లేకుండా తులశమ్మ పేరు ప్రచురించబడింది. 1905 మార్చ్ -ఏప్రిల్ సావిత్రి పత్రికలో ఆమె రచన ఇంటి పేరుతోనే కాదు, తణుకు అనే ఊరి పేరుతో సహా వచ్చింది. వీరు పీఠికాపుర వాసులని ఊటుకూరి  లక్ష్మీ కాంతమ్మ ఆంధ్రకవయిత్రులు పుస్తకంలో పేర్కొన్నది (1980 ప్రచురణ, పు:143) 1931 సెప్టెంబర్ గృహలక్ష్మి పత్రికలో తులశమ్మ వ్రాసిన భారతేతిహాసములు ప్రధమ భాగం పై వచ్చిన సమీక్షను బట్టి ఈమె పిఠాపురం మహారాణి వారి గోషా స్కూల్ లో ఉపాధ్యాయిని అని తెలుస్తున్నది.1912  జూన్ హిందూసుందరి లోపలి కవర్ పేజీలో ప్రచురించబడిన ఫోటోలో నెత్తిమీద ముసుగుతో తెల్ల  చీర కట్టిన పద్ధతిని బట్టి ఆమె సంప్రదాయ బ్రాహ్మణ వితంతువు కావాలి. 

                                                            1

జూలూరి తులశమ్మ రచనలను పాటలు , పద్య కవిత్వం, వచనం అని మూడు భాగాలకింద పరిశీలించవచ్చు.  హిందూ సుందరి పత్రికలో ఏడేళ్ల మీద  ఆరు సంచికలలో ( సెప్టెంబర్&అక్టోబర్ 1903‘, డిసెంబర్ 1910, ఆగస్టు 1911, అక్టోబర్&నవంబర్ 1911, జూన్ 1912, జనవరి 1913) ఆమె వ్రాసిన పాటలు 23. కాపాడమని వేడితి నన్ను’ అని మొదలయ్యే కీర్తనలో  గోపాల భూపాలుడే దిక్కని వేడుకొనటం ప్రధానం.’తులసిని సారసాక్షి బ్రోవరా’  అని స్వీయ నామాంకితంగా కీర్తనను ముగించింది.ఆ తరువాత ఆమె వ్రాసినవన్నీ పెండ్లి పాటలే. మంగళ స్నానాల నుండి మొదలుపెట్టి అప్పగింతలవరకు వివిధ ఘట్టాలలో వేడుకగా స్త్రీలు పాడుకొనే పాటలు అనేకం.సందర్భాన్ని బట్టి మంగళ హారతి పాటలు అదనం.

మంగళ స్నానాలు అంటే వధువును లేదా వరుడిని పీటలమీద కూర్చోపెట్టి మాడుకు  నూనె పెట్టి, వంటికి నూనెరాసి నలుగు పెట్టి కుంకుడు కాయల రసంతో తలరుద్ది వేడి నీటితో స్నానం చేయించటం.ఈ ఘట్టంలో నలుగు పెడుతూ పాడే పాటలు నలుగు పాటలు.   వధూవరులను లక్ష్మీ నారాయణులుగా సంబోధించటం సంప్రదాయం. అందువల్ల వివాహ సందర్భంలో పాడే పాటలు లక్ష్మీ నారాయణ వివాహ వేడుకల వర్ణాలుగానే ఉంటాయి. ఆ రకంగా ఆముష్మిక ధర్మ నిర్వహణ కూడా లౌకిక వ్యక్తుల వివాహం నిమిత్తంగా సాగుతూనే ఉంటుంది. జూలూరి తులశమ్మ  పాటలను ఆ కోణం నుండి చూడాలి. రాసేవి పెళ్ళిపాటలే. పరోక్షంగా అవి లక్ష్మీనారాయణుల స్తోత్రాలు.ఆమె పేరులోని తులసి విష్షు పూజకు శ్రేష్ఠమైనదిగా ఉద్దేశించబడింది.   ప్రతి పాట చివర వధూవరులకు తులసి మాలతో అలంకారం సాధారణం. అది తనపేరును పాటలో ఇమడ్చటమే కాదు తనదైన భక్తి ప్రకటన కూడా.  “నలుగిడ రారంగ నలుగిడ రారంగ ననబోణికి వేగ నలుగిడరా “ అనే పల్లవితో మూడు చరణాల పాట లో ‘పుష్ప పరాగమూ, పూ రసమూ’  కలిపి పుష్పకోమలికి నలుగు పెట్టమని స్త్రీలను ఆహ్వానిస్తుంది. ఇక్కడ పుష్పకోమలి శ్రీ మహాలక్ష్మి. స్త్రీలు నలుగు పెట్ట రావటం ఆమె సేవకే. ‘నలుగందుకోరా జలజాసనార్చితా’ అనే పల్లవితో ప్రారంభమయ్యే మరొక పాట నలుగు  సేవను స్వీకరించమని నారాయణుని వేడుకొనటమే. ఆయనకు నలుగు పెట్టేవాళ్ళు కూడా స్త్రీలే. ‘ అత్తరు పునుగును మొత్తముగా జేర్చి జిత్తజరూపమున చేడియ నల్గిడ అనే తొలి చరణం వరుడిది మన్మధరూపం అని చెప్తూనే ఆ నెపం తో ఆమె అత్యంత సుందరాకారుడిగా  భగవంతుడిని స్మరిస్తున్నది. 

పెళ్లయ్యాక వధూ వరుల మధ్య చనువును పెంచే వేడుకలు అనేకం.  మంచం మీద కొత్తదుప్పటి పరిచి వధూవరులను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఒకరిచేత ఒకరికి గంధం పూయించటం, పన్నీరు చల్లించటం, పూలదండలతో బంతి కట్టి ఒకరి పై ఒకరు  విసురుకొనెట్లు  ప్రోత్సహించటం, తలుపుదగ్గర నిలబెట్టి ఒకరి పేరును మరొకరిచేత చెప్పించటం, పక్క పక్కనే భోజనానికి కూర్చోపెట్టి ఇద్దరినీ ఒకరి విస్తట్లో పదార్ధం మరొకరు తినేట్లు,  తినిపించేట్లు  చేయటం ఇవన్నీ ఆ కోవలోవే.    

‘పూల బంతుల నాడ రాగదే , నీలవేణి నీదు పతితో’ అనే పల్లవితో మూడు ఏకవాక్య చరణా లతో ఒక పాట ‘చేమంతి చెండ్లాడనే’ చెలువుడు సత్యతో అనే పల్లవితో మూడు చరణాల మరొక పాట ఉన్నాయి.(డిసెంబర్ 1910).ఈ రెండూ దండాడింపు పాటలు. మొదటి పాట భర్తతో పూలబంతులాటకు స్త్రీని ప్రోత్సహించేది కాగా రెండవ పాట వరుడిని శ్రీ కృష్ణుడితో అభేదం చేసి సత్యతో చెండ్లు ఆడటాన్ని వర్ణించేది. మరొక పాటలో బొండుమల్లెల పూల చెండు, ఇంకొక పాటలో ‘మల్లె మొల్లలు జాజులు మరువంపు చెండులు’  అవి ఏ పూల చెండ్లయినా తులసీ దళాలు, తులసీ మాలలు తప్పనిసరి.  ఈ చెండ్లాట ఆడే పురుషుడు శ్రీ కృష్ణుడు , శ్రీమన్నారాయణుడు ఇలా … అతని సహచరి ఒక సారి లక్ష్మి, ఒక సారి సత్య , మరొకసారి రాధ .. బ్రహ్మాది దేవతలు , సీత గౌరీ మొదలైన స్త్రీలు పూలు అందిస్తూ వేడుకలో పాల్గొనే సదస్యులు. ( ఆగస్టు 1911) ‘సందియమేలనే సరసకు రావే’, ‘ ఓ మందగమన నీ సామికి శ్రీగంధము లలదవే’ ( అక్టోబర్& నవంబర్ 1911) కలికీ పన్నీరు జల్లవే , కంజాక్షునిపై కులుకుచు హరిపై గొప్ప గిండియ తొడ’ (జనవరి 1913) జవ్వాది, బంగారు రజము  కల్పి వెండి బంగారు గిన్నెలు తీసిన  గంధం రాసి, పన్నీరు చల్లి పతితో కలిసిమెలసి జీవించమని వధువును ఉత్సాహపరుస్తాయి. ఇవి గాక హితమతి గై కొగదమ్మ ఇందిర జయ హారతినీ ( అక్టోబర్& నవంబర్ 1911), ‘జననీ పాదములకు జయ హారతిదే గొనుమా’ (జూన్ 1912) ఏమమ్మా కాత్యాయని నా మీదను దయరాదా! వంటి అమ్మవారి కీర్తనలు మరికొన్ని వ్రాసింది తులశమ్మ .

                                                            2

తులశమ్మ తొలి పద్యాలు భండారు అచ్చమాంబ మరణానికి ఖేదిస్తూ వ్రాసినవి. సావిత్రి పత్రిక   1905 మార్చ్- ఏప్రిల్  సంచికలో ‘సఖీవియోగ విచారము’ అనే శీర్షిక తో అచ్చు అయినాయి. ఒక సీసం , రెండు ఉత్పలమాలలు, రెండు గీతాలు మొత్తం అయిదు పద్యాలు. తెలుగు సమాజంలో 20వ శతాబ్ది ప్రారంభంలో స్త్రీల గురించి వ్రాయటం, స్త్రీలను సమీకరించటం అన్న రెండు పనులను తానొక్కతే ఉద్యమమగా నిర్వహించి స్త్రీలకు  స్ఫూర్తి దాయకంగా నిలిచిన భండారు అచ్చమాంబ  ముప్ఫయ్ ఏళ్ల వయసులో అకాలమరణం చెందింది. అప్పటి స్త్రీల సామూహిక దుఃఖానికి ప్రాతినిధ్యం వహిస్తుంది తులశమ్మ వ్రాసిన స్మృతి ఖండిక ఇది. అచ్చమాంబ 1903 లో కుటుంబంతో సహా యాత్రచేస్తూ ఆంధ్రదేశంలో వివిధ నగరాలలో పత్రికా సంపాదకులు , రచయితలు అయిన స్త్రీలను కలిసి స్త్రీవిద్య, స్త్రీల సంఘాల ఆవశ్యకత మొదలైనవాటి గురించి ప్రసంగించి వెళ్ళింది. దానిని ప్రస్తావిస్తూ ‘తరుణుల సోదరీ తతిగ’ నెంచిన ఆమె మరణం ‘సకియల దురదృష్టం’ అంటుంది. అబలా సచ్చరిత్ర రత్నమాల వ్రాసిన ఆమె ఆ పని ఆపేసి చెలులనందరిని వీడి తరలి పోయిందని వేదన పడింది. ‘మా మక్కువ సోదరీమణిని’ తీసుకువెళ్ళటానికి నీకు చేయట్లా ఆడిందని మృత్యువు ను నిలదీసింది. భూమి మీది పుణ్య స్త్రీల కథలు వ్రాసి ఇప్పుడు స్వర్గలోకపు  పుణ్యస్త్రీల గురించి వ్రాయటానికి వెళ్ళావా అని అచ్చమాంబను సంబోధిస్తూ సమాధానపడే ప్రయత్నం చేసింది. స్త్రీల కోసం పనిచేస్తున్న సమకాలపు స్త్రీల గురించిన స్పృహతో 1905 నాటికే తులశమ్మ వ్యక్తిత్వం వికసించటం గమనించవచ్చు.

ఈ క్రమంలోనే ఆమె కందుకూరి వీరేశలింగం గారి భార్య రాజ్యలక్ష్మమమ్మ మరణానికి దుఃఖిస్తూ  ‘జననీ వియోగ విచారము’. ( హిందూ సుందరి సెప్టెంబర్ 1910) అనే పద్య ఖండిక వ్రాసింది. శ్రీకరుడికి భక్తి మ్రొక్కి గానీ ఇతరమును తలవని తులసమ్మ మొదటి పద్యంలో దైవ ప్రార్ధన చేసి ఆ తరువాత ఎనిమిది పద్యాలలో రాజ్యలక్ష్మమ్మ వియోగ వ్యధను వ్యక్తంచేసింది. దయ , సౌశీల్యం , ధర్మవృత్తి , పాతివ్రత్యం , నీతి, సమత్వం, నిత్య తుష్టి, నిర్మల భావం, శాంతి మొదలైన గుణాలలో రాజ్యలక్ష్మమ్మకు  భూమి మీద ఏ కాంతాలూ సాటిరారని సన్నుతించింది. ఆమెను దయమాలి తీసుకువెళ్లిన మృత్యువును దూషించింది. కిరీటంపైన ప్రకాశించే సన్మణిని దుర్మార్గుడేవడో తీసుకుపోతే నివ్వెరపోయి చూచే మాన్యుని వలే విభ్రాంతిలో మునిగిపోయామని అంటుంది.

“ గతిలేక కష్టముల్ గాంచి చింతించెడు గరితల దయఁజూచు కాంత యెవతె

  తల్లిదండ్రి దయమాలి తరిమి పుచ్చిన యట్టి కాంతల బ్రేమించు గరిత యెవతె

వెలలేని సద్ధర్మ వితతిని బోధించి యజ్ఞానమడచిన యమ్మ యెవతె

అరలేని యనుకంప నారసి దుఃఖంబు లపనయించిన యట్టి అతివ యెవతె

అట్టి మా రాజ్యలక్ష్మమ్మన లఘుమతిని ,కాలగతినిట్లు నెడబాసి కనలవలసె

నకట కాలంబు దాటగా నలవి యగునె, ఫాలనేత్రునికయినను బ్రహ్మకైన “ ఈ సీస పద్యం లో తేటగీతి భాగం రామలక్ష్మమ్మ వియోగ దుఃఖం తో కాలం ఈదటం శివుడికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అన్న విశేషణ వాక్యంతో తన లాంటి సామాన్యుల సంగతి చెప్పనక్కరలేదన్న విషయాన్ని సూచించింది. మరణం ఎవరికైనా అనివార్యం కదా? వియోగ వ్యధ దుస్సహమే కావచ్చు కానీ రామలక్ష్మమ్మ మరణ దుఃఖానికి అంత తీవ్రత ఎందుకు? అంటే అది వ్యక్తిగత సంబందం వల్ల కాదు. ఆమె ఇన్నాళ్లుగా నిర్వహించుకు వస్తున్న ఒక గొప్ప సామాజిక బాధ్యత - స్త్రీ సమాజం పట్ల తల్లివలె వ్యవహరిస్తున్న తీరు-  వల్ల. వీరేశలింగం స్త్రీ పునర్వివాహ ఉద్యమం ప్రారంభించాక వివాహాలు కోరి ఇళ్ళనుండి బయటకు వచ్చిన స్త్రీల కొరకు వీరేశలింగం శరణాలయం  స్థాపిస్తే ఆ శరణాలయంలోని స్త్రీలను ప్రేమతో దగ్గరకు తీసి తల్లివలె సంరక్షించింది. చదువుచెప్పి జ్ఞానవంతులను చేసింది. పీటలమీద కూర్చుని పెళ్లిళ్లు చేసింది. వీరేశలింగం ఉద్యమం ఆమె సాహచర్యంవల్లనే సంపూర్ణంగా సాఫల్యం అయింది. ఆరకంగా స్త్రీజనోద్ధరణ ఉద్యమంలో ఆమె నిర్వహించిన చారిత్రక పాత్రను ఈ సీస పద్యం లో నమోదు చేసింది తులసమ్మ. లోకంలో ఎన్నో సభలు చూసిన రాజ్యలక్ష్మమ్మ స్వర్గ  సభల సంగతి తెలుసుకొనటానికి వెళ్లిందని సంభావించింది.

ఈ విధమైన స్మృతి కవితలలో మరొకటి మోతీలాల్ మరణానికి చింతిస్తూ వ్రాసినది( గృహలక్ష్మి , మార్చ్ 1931). పదకొండు పద్యాల ఖండిక ఇది.

                                                3

 డిసెంబర్ - జనవరి 1906 హిందూసుందరిలో సతీహితబోధిని అనే శీర్షికతో జూలూరి తులసమ్మ వ్రాసిన పద్యాలు ఉన్నాయి. భారతం అరణ్య పర్వం పంచమాశ్వాసంలోని  సత్యాద్రౌపదీ సంవాదం ఆధారంగా వ్రాసిన చిన్న కావ్యం ఇది.  అరణ్యవాసం చేస్తున్నపాండవులను చూడటానికి వెళ్లిన శ్రీకృషుడితో సత్యభామ కూడా వెళ్ళింది. ఏకాంతంలో సత్య ద్రౌపదిని నీ అయిదుగురు భర్తలు నీ యందు అంతగా అనురక్తులు కావటానికి నీవు ఏమందులు పెట్టావు  ఏ మంత్రాలు వేశావు? తెలుసుకొని నేను కూడా కృష్ణుడిని వశవర్తుడిని చేసుకొంటాను చెప్పవా అని అడిగింది. దానికి ద్రౌపది సతులకు ఏది హితమో వివరిస్తుంది. అక్కడ 32 పద్యగద్యలతో ఉన్న విషయాన్ని తులశమ్మ 60 పద్య గద్యలలో కథనం చేసింది. అంటే భారతకథా ఘట్టాన్ని ఒకదానిని స్త్రీల హితోపదేశానికి అనుకూలంగా ఉంది కదా అని స్వీకరించి సమకాలపు చైతన్యంతో తన మాటలలో తిరిగి చెప్పిందన్న మాట.

సతీహితబోధినిలో మొదటి రెండు పద్యాలు దైవ స్తుతి. “ఎవ్వడనంత శక్తి మయు( డెవ్వనిచేఁ జనియించు  విశ్వమిం/కెవ్వని మాయ … వంటి పద్యాలు పోతన భాగవత పఠన పారణ ప్రభావాలను చూపిస్తాయి. మూడవ పద్యంలో కథ మొదలు. ‘నిజదార సహోదర సంయుతుండు’ అయి స్త్రీ కృష్ణుడు బావలను చూడటానికి అడవులకు వెళ్ళటం, అతిధి సత్కారం మామూలే. “ తరుణీ లోకభీకర రుల నే తంత్రంబులం బన్నితో / వారదివ్యౌషధమేది యేని యిడితో వశ్యంబు గావించితీ” అన్న సత్యభామ కుతూహల వకాయం దగ్గర అసలు కథ మొదలవుతుంది. మందులు పెట్టి మాలిమి చేసుకొనటం మానహాని, ప్రాణహాని అని మందలించి ద్రౌపది ‘తానెరింగిన ధర్మంబు దాటె నేని సఖికి రౌరవ నరకం’  అని సత్యకు  స్త్రీ ధర్మం ఏమిటో  బోధిస్తుంది. అన్నం పెట్టేటప్పుడు స్త్రీ తల్లికావాలి, తాంబూలం ఇచ్చేటప్పుడు వెలయాలు కావాలి, పనులు చేసేటప్పుడు బానిస కావాలి అని చెప్తుంది.  “ వ్రతములు పెక్కులు గలవా

       వ్రతములలో వనితలకును వరుసేవయే మేల్” అని బోధించింది. భర్త కురూపి అయినా, రోగి అయినా జారుడైనా, చోరుడైనా , కోపిష్టి అయినా అతనే దిక్కని తలచే తరుణులకు కీర్తి  లభిస్తుందని అంటుంది. భర్త పరదేశాలకు వెళ్ళినప్పుడు గంధ పుష్పాది అలంకారాలు స్త్రీకి  తగదని చెప్తుంది.మగనికి లోబడి ఉండాలి.వాకిలి  దాటరాదు. మాట బయటకు రారాదు. మగడిచ్చిన అణువైనా మేరుపర్వతం అంత అని తృప్తి పడాలి.సేవకులు ఎందరు ఉన్నా,  తనకు ఎన్ని పనులున్నా భయభక్తులతో స్వయంగా భర్తకు సేవచేసే స్త్రీకి అభ్యుదయం. రోజుకొకరకంగా భర్త స్నాన పానాలకు, భోజనానికి ఏర్పాట్లు చేయాలి. స్త్రీకి అందగత్తెను అనే అహం, గర్వం , కోపం  వుండరానివి. జపతప ఉపవాస వ్రతాలు ఎన్నయినా పతి సేవకు సాటిరావు. దైవ భక్తి , ధర్మవర్తనం స్త్రీల కు నిత్యం అనుష్టించదగినది. ఇలా సతికి హితము చేకూర్చే నీతులు అనేకం బోధిస్తూ తదనుగుణంగా ప్రవర్తించే  స్త్రీలకు మెప్పు , చేయని స్త్రీలకు అపకీర్తి అని హెచ్చరించింది. భారతంలో సత్యకు ద్రౌపది బోధనగా చెప్పబడినవన్నీ  మనుస్మృతి ‘స్త్రీ ధర్మములు’  గా పేర్కొన్న వాటికి కల్పించిన ప్రాచుర్యమే. ద్రౌపది బోధ ఆధారంగా తులశమ్మ వ్రాసిన ఈ ఖండిక అందువల్ల ఆధునిక మహిళకు అత్యంత ప్రాచీన మనుధర్మాన్ని ఆదర్శంగా  చూపేదే అవుతున్నది. ఆధునిక యుగం స్త్రీని ఉదారవాద దృక్పథంతో పబ్లిక్ ప్రపంచంలోకి అయితే తెచ్చింది కానీ మనుధర్మ మూలం నుండి వేరు చేయలేకపోయింది అన్నది స్పష్టం. 

అయితే తులశమ్మ వ్రాసిన సతీహిత బోధినిలో ప్రత్యేకత సమకాలపు స్త్రీ విద్యా ప్రాధాన్య ప్రస్తావన ఉండటం. ద్రౌపది బోధ విన్నాక సత్యభామ ఆమె మాటలవల్ల తన హృదయ తాపం అంతా తీరిపోయిందని తన మనస్సు ధర్మపథంబు పొందిందని చెప్పి ఒక్క సందేహం వ్యక్తం చేసింది.

“ విను చెలి వనితలకెల్లను

ఘనమనుచున్ విద్దె నెఱపి గాంతురు ప్రేమన్

జనదని కొందరు బల్కెద

రనుమానము దీర్చి పరమ హర్షంబిడదే”  అని స్త్రీవిద్య గురించి ప్రశ్న వేసింది.

“ఒక్కరు గల్గి స్త్రీలకికనొల్లదు విద్య యటంచు బల్క బె

న్మక్కువ తోడ వేరొకరు మానక విద్య నొసంగుడంచనన్

బెక్కురు పెక్కు మార్గముల నేర్చిన వారల బ్రీతి గాంచినన్

చక్కని విద్య ఎప్పుడిల జక్కని శ్రేయ మొసంగు చుండ దే “ అని విద్య శ్రేయో కారకం కదా అని తన అభిప్రాయాన్ని కూడా జోడించింది. మంచి ప్రశ్న వేశావు అంటూ ద్రౌపది  విద్య ప్రయోజనం గురించి చెప్పిన మాటలు సమకాలీన సంఘ చైతన్యం నుండి తులశమ్మ చేసిన భావనలే. “ అజ్ఞానంబను జీకటిం దునుము నత్యాశాగ్ని జల్లార్చు సు

      ప్రజ్ఞంజింతను వార్ధి దాటనగు నా ప్రజ్ఞాతమౌ విద్యచే

      సుజ్ఞానంబు నొసంగి సూరి జన సం స్తుత్యంబు మోదంబునౌ

      నజ్ఞల్ గొందరు విశ్వసింపరిది యానందంబె యార్యాళికిన్” అని విద్య అజ్ఞానాన్ని , అత్యాశను పారద్రోలే శక్తి విద్యకు ఉందని , అది బుద్ధిమంతులు అయినవాళ్ళచే ప్రశంసించబడుతున్నదని చెప్పి స్త్రీలకు ఆభరణాలు ఎన్ని ఇచ్చినా ఆశతీరదు, అజ్ఞానం పెరుగుతుందీ కనుక “...... విద్యా విభూషణంబు / గల్గి యుండిన కాంతలు కాంతృ  యశము” అని నిర్ధారించింది. ఆ రకంగా తులశమ్మ సమకాలీన స్త్రీవిద్యా ఉద్యమానికి తన స్వరాన్ని ఇచ్చింది. వీరేశలింగం పంతులు ఇదే భారతాంర్గత  ద్రౌపది ప్రబోధం వస్తువుగా 1900 లో సత్యా ద్రౌపది సంవాదం పాటగా వ్రాసాడు. ద్రౌపది చేసిన హితబోధ మదినుంచుకొని సత్య పతి మనసెరిగి మెసలి సుఖించిందని చెప్పటమే కాక ఈ పాట చదివి స్త్రీలు వరగుణములు కలిగి వర్తిస్తే సకల శుభాలు , సత్కీర్తి పొంది ఇహపరాలలో సుఖిస్తారని ఫల శృతితో దానిని ముగించాడు వీరేశలింగం. ఆరేళ్లకు మళ్ళీ తులసమ్మ దానినే వస్తువుగా ఎంచుకొనటానికి వీరేశలింగం రచన కూడా ఒక ప్రేరణ అయిందేమో. పతులపట్ల స్త్రీలు ఎట్లా మెలగాలో పురుషులు చెప్పటం ఒక పద్ధతి. అందులో శాసనం ధ్వనిస్తుంది. స్త్రీలే స్త్రీలకు చెప్పటంలో అనుభవ  కథనం ఉంటుంది. శిక్షణపొందిన పద్ధతి ఉంటుంది. స్త్రీలు స్త్రీలుగా జీవించవలసిన పద్ధతిలో శిక్షణ ద్రౌపది నుండి తులశమ్మ వరకు ఒకే రకంగా ఉందన్నమాట. వేల  ఏళ్ళు గడిచినా శిక్షణలో రాని మార్పు విచారణీయం.

                                                4

ఋతుచక్రవర్ణనము పేర జూలూరి తులశమ్మవ్రాసిన పద్యాలు 32.(1914, ఆంధ్రపత్రిక, ఉగాది సంచిక)  “శ్రీల నలరారునట్టి యీ క్షితిని పెంపు / సొంపు వెలయించు  దినముల సొరిది వినుడు”అని మొదటి రెండు పాదాలలో చెప్పి తరువాతి రెండు పాదాలలో మధుమాస వర్ణన కు శ్రీకారం చుట్టింది. 23 పద్యాలలో మధుమాస వర్ణన చేసి, తరువాతి ఆరు పద్యాలలో  వర్షరుతు వర్ణన చేసి చివరి పద్యాలలో  ఒక తాత్వికమైన ముగింపును ఇచ్చింది. చెట్లు కొత్త చిగుళ్లు వేయటం, మొగ్గ  తొడగటం, తుమ్మెదల ఝుంకారాలు, కోకిలల కూతలు, వికసించిన మల్లె, మొల్ల మొదలైన పుష్పజాతులు,  పక్షుల కిలకిలలు అనేక రకాలుగా మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి అని ‘ ఆ దినంబులలోనే హాయి కలుగు’ అని మధుమాస సౌఖ్యాన్ని వర్ణిస్తూ ఆ వెనువెంట పద్యంలో ‘ ఆ దినాంబులనిఎండలధికమౌను/ తనకు ( బూర్వము గల్గు శాంతమును బాసి / భాను డెంతయు  గ్రోధ సంధానుడగుచుఁ …. ‘ అంటూ అంత సౌఖ్యాన్ని ఇచ్చే మధుమాసపు మరొక ముఖం బాధాకరమైన -ఎండ, నీటి ఎద్దడి, విసనకర్రలతో విసురుకొనటం వంటి అనుభవం అని వర్ణిస్తుంది. ఒక సౌఖ్యాన్ని ఆనుకొని ఒక బాధ ఉండటాన్ని ఫోకస్ లోకి తేవటంలో  ఒక జీవనతాత్వికత అందివస్తుంది. ఎండా కాలం పోయి వానాకాలం వచ్చింది. దానిని  వర్ణిస్తూ  ఉరుములకు , పిడుగులు భయపడటం, వానలో తడిసి చలికి వణుకుతూ ఇంతలో ఇట్లా వర్షం వస్తుందని తెలియదు అంటూ జనం మాట్లాడుకొనటాన్ని ప్రస్తావించి ఇట్లా బహుభంగుల కనిపించే ప్రకృతిని , ప్రపంచాన్ని చూస్తుంటే ఏదీ స్థిరం కాదని తెలుస్తున్నదని నిర్ధారించి “ స్థిరముగా నుండు వస్తువు (దెలియవలయు /జ్ఞాన యుతులారా! సద్గుణ చతులార !/అన్నలార !సుపూజ్యత ప్రసన్నులార!” అని కర్తవ్యం ఉపదేశించింది.అనుభవాలు అనేకం. అస్థిరం.  స్థిరంగా ఉండేది ఏదో ఈ చిత్రంపు సృష్టికి కర్తయైన సత్య చారిత్రుని ఎదలోన నిలుపుకొనటం వల్ల తెలుసుకొనేదే అని ఆమె కవిత్వ తాత్పర్యం. అట్లా ఋతుచక్రవర్ణన ఋతువర్ణన కోసమే కాక దానిని  ఒక ఆధ్యాత్మిక   తాత్విక భావ స్ఫూర్తి దిశగా నడిపించటం విశేషం.

ఈ పద్యాలలో తులశమ్మ భావుకత్వ శక్తి ఆహ్లాదకరంగా వ్యక్తమైంది. మధుమాసంలో చెట్లు పాత ఆకులు రాల్చి కొత్త ఆకులను తొడుక్కొనటం స్త్రీలు “ ప్రా(త చీరలు విడనాడి…  / పట్టు పుట్టంబులను”  కట్టుకొన్నట్లు ఉందని అంటుంది. మధుమాసాన్ని వర్ణించినవాళ్లు ఎందరో ఉన్నారు కానీ పాత చీరలు విడిచి కొత్తచీరెలు కట్టడాన్ని ఉపమానంగా చేసినవాళ్లు ఎవరయినా ఉన్నారా అంటే అనుమానమే. సంధ్యాసమయపు ఎర్రడాలు  సూర్యుడు  అక్కడక్కడా తిరిగి ఇల్లు చేరుతున్న కొడుక్కు దృష్టి తీయటానికి తల్లి తెచ్చిన ఎర్రనీళ్ళ పళ్లెం లా ఉన్నాడట. కమ్ముకొస్తున్న చీకట్లు రాత్రి అనే స్త్రీ జుట్టు లాగా ఉందని , ఉదయిస్తున్న చంద్రుడు ఆమె తలదువ్వుకొనటానికి కాలపురుషుడు ఇచ్చిన అద్దం అన్నట్లుగా ఉన్నాడని ఉత్ప్రేక్షిస్తుంది. భావుకత వాస్తవికత పరుగు పేకలవలె అమరిన పద్యరచన తులశమ్మది. ఒక పద్యం నుండి మరొక పద్యానికి కొనసాగింపు పద్ధతి వల్ల పాట లక్షణం కొంత పట్టుబడింది.

తులశమ్మ ప్రకృతి ప్రేమ , పారవశ్యం ఋతుమాల అనే శీర్షికతో (ఆంధ్ర సర్వస్వం 1925 మే, జూన్ , జులై సంచికలు )  ప్రచురించబడిన పద్యాలలో ప్రగాఢమై కనిపిస్తుంది. ఋతుచక్రవర్ణము పద్ధతిలోనే ఋతువులను వర్ణించే పద్యాల మాల ఇది. మధుమాసం తో మొదలై  వర్షఋతువు రాకడ వరకు నడిచిన వర్ణన  జులై సంచికలో  సశేషం అని  ప్రకటించబడింది. ఆ తరువాత ఎన్ని సంచికలలో ఇంక ఏయే ఋతువుల వర్ణన జరిగిందో తెలుసుకొనటానికి ఆ సంచికలు అలభ్యం. 1926 ఫిబ్రవరి సంచికలో లేవుకనుక ఋతుమాల పద్యాల ధారావాహిక 1925 ఆగస్టు నుండి జనవరివరకు ఆ ఆరు నెలల లోపల ఎప్పుడో ముగిసి ఉండాలి.

అప్పుడప్పుడే వికసిస్తూ ప్రచారంలోకి వస్తున్న భావకవిత్వం ధోరణి తులశమ్మకు పట్టు బడింది అనటానికి నిదర్శనం ఋతుమాల. “ చైత్ర రాజింక రామికి చింత తొడ / నున్న వనకాంత కొక వార్త విన్నవింప / వచ్చి కోయిల యెంతయో మచ్చికలర/ కొలది ధ్వనితోడ ( గూసె  కుహూ యటంచు”  అని చైత్రాన్ని పురుషుడితోటి వనాన్ని స్త్రీతోటి రూపకం చేసి చైత్రం కోసం ఎదురు చూస్తున్న వనకాంతకు చైత్రుడి రాక గురించి చెప్పటానికి వచ్చి కోకిల కూత మొదలుపెట్టింది. ప్రేమ , ఎదురు చూపులు అన్న భావాలను చుట్టుకొని  కారయిత్రీ ప్రతిభ తీగలు సాగి కవిత్వానికి పందిళ్లు వేయటం ఈ కవితలో కనబడుతుంది. కోకిల కూత   వనకాంత లో కలిగించిన సంచలన వర్ణన తరువాతి పద్యం. “ అట్టి యవ్యక్త మధురిమ నాలకించి /యెంతొ రహిమించి పులకించి సంతసించి / వింత దళుకొత్త ననలెత్తి వేడ్క హత్తి  /పోవనున్నట్టి ప్రాణంబు పొందు పరుచు” కోకిల నాద మధురిమ అంచలంచెలుగా కలిగించిన ప్రభావం వర్ణితం. పులకింత , సంతోషం , కొత్త మెరుపు , మైమరపు , ఉత్సాహం కలిగిస్తూ కోకిల నాదమాధురిమ అంతిమంగా పోతున్న ప్రాణాలను నిలిపింది. ఈ రకమైన మానసిక అవస్థా వర్ణన, ఒక భావాన్ని దశా పరిణితివరకు తెగకుండా సాగించటం  కృష్ణశాస్త్రి కవిత్వంలో కనబడే లక్షణాలు. యెంత మృదుతర గానమో అంటూ  కోకిల గానానికి పరవశించి  పోతుంది. ఆ పారవశ్యంలో అది మోహన మంత్రమో , చక్కని రసమో , ఎంత హాయో, ఎంత రుచో ఎంత విలువో ఎరుకపడదు అని ఆ ఆనందానుభవాన్ని పేరుపెట్టి తెలుసుకొనటానికి తాపత్రయ పడుతుంది. శిశువులకు , పశవులకు, పాములకు మాత్రమే ఆ నాదం ఎక్కడ పుట్టి ఎలా వ్యాపిస్తున్నదో తెలుసు నని , తెలుసుకోలేకపోయిన తన నిస్సహాయతను చెప్పుకొంటుంది. ఎండిన మోడులను చిగురింప చేసే శక్తి పాట అని సంభావిస్తుంది.మధుమాసం రుతువులలో హృద్యమైనదని చెప్తూ దాని విలాసాన్ని పరిపరివిధాలుగా వర్ణించింది తులశమ్మ.  

మధుమాసం ఎండాకాలాన్ని వెంటపెట్టుకొని వస్తుంది. సూర్యుడు సహస్ర కిరణాలతో విజృభించి తాపం కలిగించే కాలం అది. ‘చండతరవర్తి , ప్రచుర మార్తాండ మూర్తి’  అంటుంది సూర్యుడిని. సూర్యకిరణాల వేడికి నీరు ఆవిరై పైకి తేలి ఘనీభవించి మేఘమై గాలి తాకిడికి కదులుతూ ఎక్కడో వర్షిస్తుంది. ఇది ప్రకృతి చక్రం. ఈ క్రమంలో వర్ష దాత పరోక్షంగా సూర్యుడు. “ “ “ “తానొసగిన రసరూప ధనము మరల గైకొనుటకు వేయికరములు సాచి సూరీడు ఎండాకాలంలో  విజృంభిస్తున్నట్లు ఒక కార్యకారణ సంబంధ భావన చేసింది తులశమ్మ.  భావకవిత్వానికి నిలువుటద్దం వంటి ఖండకావ్యం ఈ ఋతుమాల. ఆధునికులలో ఋతువర్ణనకు విశ్వనాథ సత్యనారాయణ పేరు ప్రసిద్ధి. ఆ రకంగా చూసినప్పుడు జూలూరి తులశమ్మ చేసిన ఋతువర్ణన తప్పని సరిగా చెప్పుకోవలసినది.

          --------------------------------------------------------------

                                                                                            (ఇంకావుంది) 


ఈ సంచికలో...                     

Sep 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు