సాహిత్య వ్యాసాలు

(December,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -19

జూలూరి  తులశమ్మ వ్రాసిన వచన రచనలు లభ్యమైనవి రెండే. ఒకటి వ్యాసం , రెండవది సంభాషణాత్మక కథనం. రెండూ స్త్రీ జీవిత సంబంధ సంస్కరణల విషయం లో ఆమె ఆలోచనలను ప్రతిఫలిస్తాయి.

వ్యాసం ‘హిందూ స్త్రీల దుస్థితి’ హిందూసుందరి ( జులై 1912) పత్రికలో అచ్చు అయింది. పూర్వకాలం నుండి కొనసాగివస్తున్న  స్త్రీల నిరంతర  కష్టభూయిష్టమైన దుస్థితికి విచారిస్తూ వాటిని  తొలగంచటానికి నవనాగరికులు ప్రారంభించిన ప్రయత్నాలను ప్రస్తావిస్తూ ఈ వ్యాసాన్ని ప్రారంభిం చింది ఆమె.  కనిపెంచిన తలిదండ్రులే  పాపపు ధనమునకు ఆశించి ఎవరికో ఒకరికి కట్టబెడతారని కన్యాశుల్క వివాహాల గురించి వేదన పడింది. తల్లిదండ్రులు కట్టబెట్టిన ఆ మొగుడు  ఎటువంటి  వాడైనా, ఏ వయసువాడైనా  ఆయుష్షు ఉంటే కష్టంగానో , సుఖంగానో ఏదో ఒక తీరున ఆడవాళ్ళ దేహయాత్ర సాగిపోతుంది అని ఆమె చెప్పిన మాటలు స్త్రీల జీవితం ఎంత పరాధీనమో అంత ఉదాసీనంగా కూడా గడపవలసిన స్థితి లోని విషాదాన్ని సూచిస్తున్నాయి. భర్త  ఆయుష్షు తీరిన ముక్కుపచ్చలారని బిడ్డల జీవితం దుర్భరం. ఆ దౌర్భగ్యానికి వాళ్ళు  కర్తలు కారు , కారణమూ కాదు, అయినా బాధితులు అవుతారని తులశమ్మ గుర్తించి చెప్పింది. విద్యాబుద్ధులు చెప్పించవలసిన సమయంలో పెళ్లి చేసి అందువల్ల వచ్చిన అనర్ధాలకు ఆమె చేసుకొన్నపాప పుణ్యాల ఖాతాలో ఎక్కువతక్కువలను నెపంగా చూపే వైఖరి గురించి చెప్పింది. ఇహలోక సౌఖ్యం లేకపోయినందుకు ఊహతెలిసే నాటికే మరణించి మొహమైనా గుర్తు లేని భర్తను తలచుకొని జీవితకాలం దుఃఖించవలసిన స్త్రీల గురించి బాధపడింది.  ఈ రకమైన తులశమ్మ అవగాహనకు  స్వానుభవమూ లోకవృత్త పరిశీలనతో పాటు అంతకు మూడేళ్ళ క్రితమే వచ్చిన గురజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటక ప్రభావం కూడా కారణం కావచ్చు.

స్త్రీల కష్టానికి సంఘసంబంధ సూత్రాలే కారణమంటుంది తులశమ్మ . స్త్రీలకు విద్య లేకపోవటం, బాల్య వివాహాలు, బలవంత వైధవ్యం ఎక్కువైపోతున్నాయని వాపోతుంది. ఆడదానికి  చదువెందుకు ఉద్యోగం చేయనా ఊళ్లేలనా అని అయిదారు సంవత్సరాలు రాగానే పెళ్లీడు వచ్చినదని , అష్ఠవృషభవత్కన్యా అన్నారు కనుక పెళ్లి చేయకపోతే అల్లరి పడతామని పెళ్లిళ్లు చేయటం,  భర్త చనిపోతే  జుట్టు తీయించకపోతే ఆమె తలవెంట్రుకల నీళ్లు భర్తను ఉత్తమలోకాలనుండి అధోలోకాలకు జారిపోయేట్లు చేస్తాయంటూ యేవో కల్పనా కథలు చెప్పటం, ఇంటాబయటా అజ్ఞానాంధకారంలో ఉన్న ఆడవాళ్లే ఈ ఆచారాల అమలు గురించి పట్టింపులకు పోవటం, సమస్త ధర్మాలు ఎరిగిన పురుషులు కూడా అట్లాగే మాట్లాడటం, ప్రవర్తించటం తులశమ్మ విమర్శకు గురి అయ్యాయి. శిరోజఖండనం అభిమానవతులైన స్త్రీలకూ శిరోఖండనమే తప్ప మరొకటి కాదని అంటుంది తులశమ్మ. పెద్దపెరిగి లోకం తెలుసుకొని, ఏది సుఖమో, ఏది కష్టమో తెలుసుకోగల జ్ఞానం సంపాదించి తన ఇఛ్చను బట్టి పెళ్లికి అంగీకరించిన స్త్రీలకు భర్తృ వియోగం వంటి సమస్యలు రావా అని ఎవరైనా వేయగల ప్రశ్నను తానే వేసుకొని అప్పుడైనా శిరోముండనం వంటి కర్మకాండలు విడువవలసినవే అంటుంది.

బాల్యవివాహాలవల్ల సంఘానికి అనేక అనర్ధాలు కలుగుతున్నాయని , బాలికలకు రజస్వలానంతర వివాహాలు చేయాలనీ వేదికలు ఎక్కి ఉపన్యసించు సంస్కరణ వాదులు, రాజకీయ వాదులు వేదిక దిగినతరువాత ఆ విషయం విస్మరించటాన్ని కూడా ఆమె ఎత్తి  చూపింది. కార్యరూపం పొందని చర్చలు ఎందుకని నిస్పృహను వ్యక్తపరుస్తూనే చర్చించగా, చర్చించగా ఎప్పటికైనా అది కార్యరూపం చెందకపోతుందా అన్న ఆశను వ్యక్తపరుస్తుంది. మనుస్మృతి  రజస్వలాపూర్వ వివాహం, రజస్వలానంతర వివాహం రెండిటినీ చెప్తున్నది కనుక సముచిత పద్ధతిని అనుసరించి పెళ్లిళ్లు చేయాలనీ,  బాలికలకు  విద్యాబుద్ధులు చెప్పించాలనీ , శిరోముండనాది కర్మలు వారించాలనీ తీర్మానించుకుని ఆచరించాలని చెప్తూ ఈ వ్యాసాన్ని ముగించింది.

ఈ వ్యాసాంశాన్నే జీవిత సంబంధాలలో నిరూపించటానికి చేసిన సృజనాత్మక ప్రయత్నం ‘కమలాకాంతా సంభాషణ’. కమల చిన్నబోయిన మొహంతో వున్న కాంతను కారణం అడుగుతూ పలకరించడంతో మొదలయ్యే సంభాషణ 1914 నాటి హిందూసుందరి పత్రిక ఆగస్టు , సెప్టెంబర్ సంచికలలో ప్రచురించబడింది. కాంత ఆడపుట్టుక ను ఏవగించుకొంటుంది. సృష్టి కార్యం  కోసం సృష్టించబడిన స్త్రీ పురుషుల విషయంలో భగవంతుడికి ఎటువంటి భేదభావం లేదని కమల అంటే కాంత కానీ పెంచిన తల్లిదండ్రులు మాత్రం భేదభావంతోనే చూస్తున్నారని బాధపడుతుంది. వాళ్ళ సంభాషణ క్రమంలో కాంత బాలవితంతువని, పెళ్లయిన తోటి ఆడపిల్లలు నోచే చిట్టిబొట్టి , కాటుక గౌరీ వంటి నోములు తానూ నోస్తానని అడిగే కూతురిని నీకు పెళ్లే  కాలేదు , నోములు ఎట్లా నోస్తావని తల్లి సమాధానపెడతూ వచ్చిందని తల్లి మరణించాక తండ్రి తన పసుపు కుంకుమలు , తల జుట్టూ తీయించే ప్రయత్నానికి పూనుకొన్నాడని తెలుస్తుంది.

వితంతు వైన స్త్రీ జుట్టు తీయించకపోతే స్త్రీలు మడి వంటకు పనికిరారు అన్నది బ్రహ్మణాచారం. ఆ ప్రస్తావన తేవటానికి ముసలమ్మ పాత్ర ఒకటి ప్రవేశపెట్టబడింది. కాంత తల్లి మరణించాక వంటపని ముసలమ్మ మీద పడింది. ఆమె కూడా వితంతువే. కాంత తండ్రికి పిన్ని వరస బంధువు. ఏ వయసులో వితంతువు అయిందో , ఎన్నాళ్ళు ఎవరెవరి అవసరాలకు ఏ ఇంట ఉంటూ చాకిరీ చేస్తూ బ్రతుకు ఈడ్చిందో కానీ ఈ వయసులో కాంతా వాళ్ళ ఇల్లు చేరింది.  కాంత తలవెంట్రుకలు ఉన్నందువలన వంటకు పనికిరాకుండా పోయి తాను చేయవలసి రావటం ఆమెకు కంటగింపు అయింది.” నెత్తి మీద ఉన్న ఆ గంపెడు  తుక్కు తగల వేసి వంటలో పెట్టు” అంటూ  కాంత తండ్రిని ఒత్తిడి పెట్టింది. వితంతు తలవెంట్రుకలనుండి కారే నీరు చచ్చినవాడికి ఉత్తమలోకాలు కలగనియ్యదు అంటూ బతికివున్న కాంత జుట్టు తీయించవలసిందే నంటూ వేధించింది. జపం, దేవుడు , దీపం,  నోము , వ్రతం అని ఏదో ఇహపర సాధనమైన త్రోవ చూసుకోవాలి గానీ మగడు చచ్చిన మగువకు లౌకిక చదువులు కూడవని ఆ ముసలమ్మ అభిప్రాయం. ఈ రకంగా తనకు ఆ ముసలవ్వ వలన కలిగిన కష్టాన్ని కాంత కమలకు చెప్పుకొంటుంది. సుఖంగా ఉన్న కమలకు తనబాధలు అర్ధం కావని కాంత అనుకొంటుంది. కమలతో అంటుంది కూడా. అదే కష్టాలు అనుభవించిన ముసలమ్మ దానిలో బాధ తెలిసిన మనిషిగా కాంత గురించి ఆలోచించిందా అంటే లేదు. నిజానికి కమలే కాంత పట్ల  సానుభూతితో ఉంది. ఎప్పుడు అవసరమైనా కమల పక్షాన నిలబడటానికి తాను సిద్ధంగా ఉండాలని కూడా అనుకొంది . కేవలం ఆడది కావటం వల్ల కాక అభివృద్ధి చేసుకొన్న కొత్త  చైతన్యం వల్ల అది ఆమెకు సాధ్యమైంది. స్త్రీలమధ్య ఈ సహోదరత్వం గురించిన ఆకాంక్ష స్త్రీలకు ఎంత పాతదో దేనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

  సంభాషణలో  రచయిత్రి సనాతన వాదానికి ప్రతినిధిగా కాంత తండ్రిని, నవనాగరిక యువతకు ప్రతినిధిగా కాంత అన్నను నిలబెట్టింది. తండ్రి పేరు వ్యాఘ్రేశ్వర సోమయాజులు.అన్న పేరు భాస్కరుడు. అన్న పట్నంలో చదువుకొంటున్నాడు.  భూగోళం మొదలైన ఆధునిక విద్యావిషయాల అధ్యయనానికి చెల్లెలిని ప్రోత్సాహపరిచింది అతనే అయిఉండాలి. అందువల్లనే తండ్రి తన తల జుట్టు తీయించటానికి చేస్తున్న ప్రయత్నాలను పసిగట్టిన కాంత వ్రాసిన ఉత్తరానికి జవాబుగా మర్నాడు ఉదయానికి ఇంటికి వచ్చేసాడు అతను. ఆ సందర్భంగా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన సంభాషణ ను కాంత కమలకు తెలియచేసింది.

కాంత జుట్టు తీయించటం అవశ్యం జరగవలసిన పనిగా తండ్రి చేసిన వాదన ఏమిటి? ఇంట్లో వంటావార్పుకు పెద్దవారెవ్వరూ లేరు. అందుకు కూతురిని అర్హురాలిని చేయటానికి ఈ ఏర్పాటు. తాను ఆహితాగ్ని. చేయవలసిన యజ్ఞయాగాదులు అనేకం ఉన్నాయి. భార్య లేకపోవటం వలన తాను వాటిని పూర్తిచేయలేడు. అట్లా పూర్తి చేయకుండా చావటం అతనికి ఇష్టం లేదు. అందువల్ల అతను మళ్ళీ  పెళ్లి కి సిద్ధం అయ్యాడు. అరవై ఏళ్ళు నిండిన ఆయన కర్మల పేరిట పెళ్ళికి సిద్ధపడటం , కూతురి శిరోజాలు తీయించటానికి నిర్ణయించటం రెండూ కూడా భాస్కరం విమర్శకు గురి అయ్యాయి. ఈ క్రమంలో ధర్మ శాస్త్రాలను స్వప్రయోజనాలకు అనుకూలంగా వ్యాఖ్యానించి ,ఉల్లంఘించగల వర్గాలు దిక్కు మొక్కు లేక చిక్కులు పడుతున్న అబలల ఎడ దాటరానివిగా చేయబడుతున్న ద్వంద్వ విలువల సమాజ వైఖరి ని రచయిత్రి ఈ సంభాషణాత్మక కథనంలో  స్పష్టం చేయటం విశేషం.

శిరోజాలు లేని నెత్తిమీద తెల్లముసుగు ధోవతి కట్టుతో జీవించిన తులశమ్మ దానిని ఎంత అవమానకరంగా భావించి బాధపడిందో , గాయపడిందో ఆ ఆక్రోశాన్ని వినిపించే రెండు వచన రచనలు ఇవి.

------------------------------------------------------------------------

 

 

 

           

 


ఈ సంచికలో...                     

Jan 2022

ఇతర పత్రికలు