(January,2022)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
పోతం జానకమ్మతో ఆధునిక స్త్రీల సాహిత్య చరిత్ర 1874 లో మొదలవుతున్నది . ఎవరీ జానకమ్మ ? ఏమివ్రాసింది? ఎక్కడ ప్రచురించబడ్డాయి?
పోతం జానకమ్మ మద్రాసు నివాసి. ఆమె భర్త రాఘవయ్యతో కలిసి 1873 లో ఇంగ్లండ్ వెళ్లి 1874 ఫిబ్రవరి 1 కి తిరిగి వచ్చింది. వచ్చిన తరువాత తన భావాలను, అనుభవాలను, తెలియపరుస్తూ తెలుగులో లేఖ రూపంలో ఒక వ్యాసం వ్రాసి ‘శ్రీ ఆంధ్ర భాషా సంజీవని’ పత్రిక కు పంపింది. అది ప్రచురించ బడింది. అయితే తెలుగులో ఆంధ్ర భాషా సంజీవని అనే పత్రిక ఉంది కానీ ‘శ్రీ’ అనే ప్రారంభ వర్ణం దానికి లేదు. అది మద్రాస్ నుండే వచ్చేది. 1871 నవంబర్ నుండి ఆ మాసపత్రిక ను కొక్కొండ వెంకటరత్నం పంతులు నడిపాడు.( పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికలు, 2004, పు;113) దానినే జానకమ్మ ‘శ్రీ ఆంధ్ర భాషా సంజీవని’ అని చెప్పి ఉండవచ్చు. ఈ వ్యాసం 1874 ఫిబ్రవరి లేదా మార్చ్ నెల సంచికలో వచ్చి ఉండాలి. ఎందుకంటే దీని ఇంగ్లిష్ అనువాదం మద్రాసు నుండి వచ్చే ‘ఎథినీయం అండ్ డైలీ న్యూస్’ పత్రికలో 1874 ఏప్రిల్ 15 సంచికలో విపులమైన సమీక్షతో ప్రచురించబడింది కనుక. ఆ రకంగా తెలుగులో తొలి వ్యాస రచయిత్రి పోతం జానకమ్మ. ఆమే తొలి తెలుగు రచయిత్రి కూడా.
అండ్ డైలీ న్యూస్’ పత్రికలో వచ్చిన ఆవ్యాసం, ఈ సమీక్ష మొదటి అధ్యాయంగా చేసి మొత్తం పన్నెండు అధ్యాయాల ఇంగ్లండ్ యాత్రా చరిత్రను Pictures Of England అనే శీర్షికతో 1875 అక్టోబర్ లో ప్రచురించింది జానకమ్మ. అసలు ఈ యాత్రా చరిత్రను ఆమె మొదట తెలుగులోనే వ్రాసింది. అలా అనుకొనటానికి ఆధారం ఈ పుస్తకానికి జానకమ్మ వ్రాసిన ముందుమాటలోనే ఉంది.
తాను తన కళ్ళతో చూసింది, తన ఆలోచనకు అందినది మాత్రమే వ్రాయటం వలన ఇందులో ఏమైనా తప్పులు, అక్కడి స్థలాలను , ప్రజలను వర్ణించటంలో లోపాలు ఉంటే క్షమించమని పాఠకులను కోరింది. ప్రత్యేకించి దీనిని దేశీయ మహిళలకోసమే వ్రాస్తున్నా వాళ్లలో ఎక్కువమంది ఇంగ్లీష్ భాష చదవడంలో ప్రగతి సాధిస్తున్నారు కనుక కొన్నేళ్లలో ఈ పుస్తకంలోని విషయాలను గ్రహించగలరన్న విశ్వాసం ప్రకటించింది.అయితే అవసరాన్ని బట్టి, ఇంగ్లీషు భాష నేర్చుకోని వాళ్ళ కోసం తెలుగు అనువాదం ప్రచురించటం గురించిన ఆలోచన ఆమెకు ఉన్నది. “In due course the original with a Telugu translation of English passages quoted in this book , shall be published, when there is a pretty good demand and not before” అని ముందుమాటలో చెప్పిన విషయం గమనించదగినది. దీనిని బట్టి ఆమె ‘ఒరిజినల్’ అని చెప్పింది తెలుగులో వ్రాసిన అసలు ప్రతి గురించే అనుకోవచ్చు. ఆమె మొత్తం పుస్తకాన్ని తెలుగు చేస్తానని అనలేదు. యాత్రానుభవాల వివరణ క్రమంలో అవసరమైన చోట్ల ఇతర గ్రంధాల నుండి ఎత్తి యథాతథంగా ఇందులో చేర్చిన ఇంగ్లీష్ పేరాలను తెలుగు చేసి ప్రచురించటం గురించి మాత్రమే చెప్పింది. అందువల్ల జానకమ్మ ఈ పుస్తకాన్ని తెలుగులోనే వ్రాసింది అని రూఢి అవుతున్నది. సమకాలపు సమాజంలో తన స్థానం , అవసరాలు , ప్రయోజనాలు ఏవో ఆమెను ఈ రచనను ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించేట్లు ప్రేరేపించి ఉంటాయి.
ఆ రకంగా ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర యాత్రాచరిత్ర ప్రక్రియ తో ప్రారంభమైంది.
1
పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్(Pictures Of England) పుస్తకానికి వ్రాసుకొన్న ముందుమాట (preface) కింద సంతకం స్థానంలో జానకమ్మ పేరు పక్కన చేరిన రాఘవయ్య( POTHAM JANACUMMAH RAGAVIAH ) ఆమె భర్త పేరు. అంతకు మించి ఆయన వృత్తి ఉద్యోగ వివరాలు ఏమీ లేవు. ఫామిలీ మెంబర్స్ , రిలేషన్స్ , ఫ్రెండ్స్ అంటూ సాధారణ వాచకాలతో పేర్కొన్నదే కానీ , ఎవరి పేరును గానీ ఎవరితోనైనా తనకు ఉన్న రక్త బంధుత్వ సంబంధాలను గానీ ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చేటప్పుడు స్టీమర్ నుండి బయటకు రాగానే భర్త సోదరుడు మిస్టర్ పి. వెంకటచెల్ల చెట్టి కనిపించేసరికి తనకు ఆనందం కలిగిందని చెప్పుకొన్నది. ఇదొక్కటే ఆమె బంధుత్వ పరంగా పేర్కొన్న పేరు. అది ఆధారంగా జానకమ్మ చెట్టి కులానికి చెందినది అనుకోవచ్చు. సాధారణంగా చెట్టి వైశ్యుల పేర్లలో కనిపిస్తుంది. కనుక జానకమ్మ కోమటి కులస్థురాలు. మద్రాస్ లో ఆనాడు ప్రముఖ వ్యాపారవేత్త , సంఘ సంస్కర్త గాజుల లక్ష్మీ నరుసు చెట్టి బలిజ కులస్థుడు. దానిని బట్టి జానకమ్మ బలిజ కులానికి చెందినదైనా కావచ్చు అని ఒక వూహ.
వ్యాపార కార్యకలాపాల కోసం భారతదేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ సముద్రతీరపు చెన్నపట్నాన్నికొనుక్కొని ఓడరేవును , కోటను నిర్మించటంతో 1650 నాటికి అది ఒక వ్యాపార కేంద్రమై క్రమంగా మద్రాసు నగరంగా విస్తరించింది. తూర్పు ఇండియా కంపెనీ ప్రభుత్వ పాలనా కేంద్రమై అటు కర్ణాటక, కేరళ, తెలుగు, నైజాం ప్రాంతాల పై అదుపు సంపాదించగలిగింది. దీనితో మద్రాసులో పెరిగిన ఉద్యోగ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనటానికి వలసలు ప్రారంభం అయినాయి. అట్లా వెళ్లినవాళ్లలో తెలుగు ప్రాంతాల బ్రాహ్మణులూ, కోమట్లు, బలిజలు కూడా ఉన్నారు. ( కాళిదాసు పురుషోత్తం -ఇంగ్లీషు జర్నలిజం లో తొలి వెలుగు దంపూరి నరసయ్య 2007)
1930 లనాటికి తూర్పు ఇండియా కంపెనీ పాలనలో స్థానిక ప్రజల హక్కుల కోసం, సంస్కరణల కోసం విద్యావంతులు సంఘాలు పెట్టి , పత్రికలు పెట్టి ప్రయత్నించసాగారు. వారిలో ఒకడైన గాజుల లక్ష్మీ నరుసు చెట్టి తండ్రి సిద్ధుల చెట్టి అలా నెల్లూరు ప్రాంతాల నుండి వలస వెళ్లిన వాడే. మద్రాసులో నీలిమందు వ్యాపారం చేసి సంపన్నుడైనాడు. లక్ష్మీ నరసు చెట్టి తండ్రితో కలిసి నీలిమందు వ్యాపారం తో పాటు పత్తి ఎగుమతి వ్యాపారం కూడా చేసాడు. పోతం జానకమ్మ అత్తింటి కుటుంబం కూడా అట్లా వలస వచ్చి వ్యాపారం లో కుదురుకుని మద్రాసులో స్థిరపడినదై ఉంటుంది. జానకమ్మకు కూడా పరిశ్రమలకు, వ్యాపారానికి సంబంధించిన ఆసక్తి, పరిజ్ఞానం ఉన్నాయని ఈ యాత్రాచరిత్రలో అనేక సందర్భాలు సాక్ష్యం ఇస్తాయి. ఈ ఆసక్తి , ఈ పరిజ్ఞానం కుటుంబంలోని ఆ వ్యాపార వాతావరణం నుండే ఆమెకు లభించి ఉంటాయి, ఆ క్రమంలోనే వ్యాపారలావాదేవీలమీద ఇంట్లోని మగవాళ్ళు ఇంగ్లండ్ కు వెళ్లిరావటం చూస్తున్న జానకమ్మలో విదేశాయానం పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది.
హిందూ ప్రజలు ఓడలు నిర్మించి ఇతరదేశాలకు ప్రయాణాలు చేసిన చరిత్ర , అక్కడి ప్రత్యేకతలను తెలుసుకొన్న చరిత్ర లేదన్నది ఆమె అభియోగం. పైగా హిందువులు సముద్రాలు దాటి ఇతరదేశాలకు పోరాదనే నిషేధం ఒకటి. అందువల్ల కులం పోతుందన్న బెదిరింపు, ప్రాణాలకే ముప్పు అని భయపెట్టి వెనక్కిలాగాటం.. వీటిపట్ల ఆమెకు కినుక. అందువల్ల జరిగిన మేలు ఏమీ లేక పోగా జాతి సమున్నత నాగరికతా సాధనకు అవరోధం అయినాయని ఆమె అభిప్రాయం. ఇప్పుడిప్పుడు హిందూ వ్యాపారులు సరుకులను ఓడలలో రవాణా చేయటం మొదలు పెట్టారు కానీ మిగిలిన దేశాలవాళ్ళ లాగా పెద్దపెద్ద ఓడలను నిర్మించి విదేశాలతో వాణిజ్య సంబంధాలు అభివృద్ధి పరచుకోలేక పోయారు కదా అని బాధపడుతుంది. ఇవన్నీ ఇంగ్లాండ్ యాత్ర ముగించుకు రాగానే తెలుగు పత్రికకు వ్రాసిన వ్యాసంలో ఆమె పేర్కొన్నది.
ఈ నిషేధాలు, అవరోధాలు వ్యాపార రంగంలో ఎదిగి స్థిరపడే క్రమంలో తన కుటుంబం ఎదుర్కొనే ఉంటుంది. ఆ అనుభవమే అభివృద్ధికి అవరోధంగా ఉండే సంప్రదాయాల పట్ల ఆమెలో ప్రశ్నలను రేకెత్తించి ఉంటుంది. వాటిని అధిగమిస్తూ అవసరాన్నిబట్టి వ్యాపారవర్గ పురుషులు ఇంగ్లండ్ వెళ్లిరావటం కొంత అలవాటు అవుతున్నది. దేశ క్షేమం కోసం అప్పుడప్పుడు ఇంగ్లండ్ వెళ్లివస్తున్న కొద్దిమంది హిందూ సుజనుల గురించి ఆమె తన వ్యాసంలో పేర్కొన్నది. అలా పేర్కొనబడిన హిందూ సుజనులలో జానకమ్మ భర్త, ఆయన సోదరులు కూడా ఉన్నారు. ఇంగ్లండ్ ప్రయాణంలో సౌతాంఫ్టన్ లో తమను ఎదుర్కొనటానికి వచ్చిన భారతదేశపు స్నేహితులు అని జానకమ్మ పేర్కొన్న పి. వెంకటకృష్ణమనాయుడు, పి. రతనావలో చెట్టి కూడా అలా వ్యాపార లావాదేవీలమీద వెళ్లినవాళ్ళే అయివుంటారు. ఇలాంటి వాళ్ళ సంఖ్య బహుళం అవుతూ సముద్రయానం నిషేధం అన్న మాట కాస్త వెనకబడుతున్న తరుణంలో ఒక స్త్రీకి తానూ సముద్రం దాటి ఇంగ్లండ్ కు పోవాలని అనిపించటం జానకమ్మ తోనే మొదలు. మగవాళ్ళు సంపాదన కోసం ‘దూరభూమి లేదు’ అని వెళ్లటాన్ని చూసీ చూడనట్లు వదిలివేయవచ్చు. కానీ కుటుంబ సంస్కృతికి, సంప్రదాయాల కొనసాగింపుకు సంరక్షకులుగా భావించబడే స్త్రీలు పోతామంటే ఎట్లా? . ఈ పరిస్థితులలో భర్త తో కలిసి ఇంగ్లండ్ వెళ్లాలన్న జానకమ్మ అభిలాషకు సహజంగానే వ్యతిరేకత ఎదురైంది. తల్లిదండ్రులు, సోదరీసోదరులు, చుట్టాలుప్రతిఒక్కరూ ఎవరి కారణాలు వాళ్ళు చెప్తూ ప్రేమతోనే అడ్డుపడిన సంగతి, కన్నీళ్లు పెట్టుకొన్న సంగతి, తిండి మానేసి ఏడుస్తూ కూర్చోటాన్ని గురించి చెప్పింది. అయినా ఇంగ్లండ్ వెళ్లాలన్న తన బలమైన కోరిక వదులుకొనటానికి తగిన కారణం ఏదీ కనబడలేదంటుంది జానకమ్మ. వాళ్ళ వైపు నుండి ఆలోచిస్తూ ఇంతకు ముందు ఎవరైనా ఆడవాళ్లు ఇంగ్లండ్ వెళ్ళి వుంటే వాళ్లింతగా బాధపడివుండే వాళ్ళు కాదని కూడా అంటుంది. ఆరకంగా ఇంగ్లండ్ వెళ్లిన తొలి భారతీయ మహిళా తానే అని జానకమ్మ చెప్పకనే చెప్పింది.
జానకమ్మ 1871 లోనే ఒకసారి భర్తతో కలిసి బొంబాయివరకూ వెళ్లి, ఇంగ్లండ్ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని మూడురోజుల ముందు విరమించుకొని తిరిగి వచ్చింది. ఆ ఏడు స్వదేశీయులు అనేకమంది కుటుంబాలు లేకుండానే ఇంగ్లండ్ వెళ్తున్నారు కనుక జానకమ్మ దంపతులు ప్రయాణం మానుకోవటం మంచిదని కుటుంబంవారు , స్నేహితులు చేసిన సూచన బాగుందనిపించి తక్షణమే ప్రయాణం విరమించుకున్నామని ఆమె చెప్పింది. ఇంగ్లండ్ కు వెళ్తున్న చాలామంది ఆ సంవత్సరం కుటుంబాలను ఎందుకు వెంటబెట్టుకు పోవటం లేదు? కుటుంబం తో ఇప్పుడు ప్రయాణం వద్దు అన్న బంధువుల మాట తగిన కారణం లేనిదే నిర్ణయాలు మార్చుకొనటానికి ఇష్టపడని జానకమ్మ కు తక్షణం ప్రయాణం విరమించుకొనేంత సకారణం ఎలా అయింది ? వాళ్ళు ప్రయాణానికి సిద్ధమైన ఆ 1871 సమకాలీన అంతర్జాతీయ రాజకీయ పరిణామాలలో కీలకమైనది కావటం తప్ప మరొక కారణం కనిపించదు.
ఇంగ్లండ్ కు పొరుగుదేశం ఫ్రాన్స్. 1789- 1799 మధ్యకాలంలో ఫ్రాన్సులో వచ్చిన విప్లవాలు రాజరికాన్ని కూలదోసి సామాజిక సమానత్వం, ప్రజా సార్వభౌమాధికారం ప్రాతిపదికగా కొత్త ప్రభుత్వాన్నిఏర్పరిచాయి.19 వ శతాబ్ది తొలి అర్ధభాగం ఫ్రాన్స్ లో రాచరికానికి స్వేచ్ఛను , సమానత్వాన్ని కోరే బూర్జువా శ్రామిక వర్గాలకు మధ్య నిరంతర ఘర్షణలతో గడిచింది. ఓటు హక్కు దగ్గర నుండి పారిశ్రామిక వ్యాపార హక్కులు అన్నిటికోసం పోరాటాలు అవసరమయ్యాయి. సామాజిక రాజకీయ అసంతృప్తులు 1830 నుండి 1848 వరకు అనేక విప్లవకర ఘటనలకు కారణమైంది. ప్రభుత్వాలు ఆ మేరకు మారుతూ వచ్చాయి. ఆ క్రమంలో శ్రామిక వర్గం బలపడుతూ వచ్చింది. యూరప్ అంతటా దాని ప్రభావం పడసాగింది. 1870 యుద్ధంగా చెప్పబడే ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం (ఫ్రాంకో జర్మన్ యుద్ధం) లో ఫ్రాన్స్ జర్మనులచేతిలో ఓడిపోయి వర్సైల్స్ సంధికి ఒడంబడవలసి వచ్చింది. అయితే శ్రామికవర్గ చైతన్యం పొందిన జాతీయ మిలటరీ జర్మనీతో సంధిచేసుకొని ఏర్పడ్డ మూడవ రిపబ్లిక్ ని ఆమోదించటానికి సిద్ధపడక చేసిన తిరుగుబాటు ఫలితంగా స్వతంత్ర ప్రభుత్వంగా పారిస్ కమ్యూన్ ఏర్పడిన సంవత్సరం 1871. మార్చ్ 18 నుండి మే 21 వరకు మాత్రమే మనగలిగినప్పటికీ ‘శ్రామిక వర్గ నియంతృత్వానికి’ తొలి నమూనాగా అభివర్ణించబడిన ఘటన అది. యుద్ధాలు, ఆహారపదార్ధాల కొరత, అనిశ్చిత, అంతర్గత పోరాటాలు, విప్లవకర జాతీయ సైన్యానికి, జాతీయ ఫ్రెంచ్ సైన్యానికి మధ్య ఆధిపత్య పోరుతో నిప్పులగుండంగా ఉన్న ఫ్రాన్స్ సెగలు బ్రిటన్ కు సోకుతున్న ఆ సమయంలో కుటుంబాలతో ఇంగ్లండ్ వెళ్ళటం క్షేమకరం కాదని జానకమ్మ వాళ్ళు భావించి వుంటారు. అందువల్లనే 1871 లో తలపెట్టిన ప్రయాణం జరగలేదు.
అప్పుడామె ఇంగ్లండ్ వెళ్లి ఉంటే బ్రిస్టోల్ లో మిస్ మేరీ కార్పెంటర్ ను కలిసి ఉండేది. ఆమెను సంబోధిస్తూ తమను పరిచయం చేసే ఉత్తరాలు డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ గారి అమ్మాయిలు ఇచ్చి ఉన్నారని చెప్పింది జానకమ్మ. మిస్ మేరీ కార్పెంటర్ బ్రిటన్ కు చెందిన ఉదారవాద సంఘసేవకురాలు. పేదలకు, ఆడపిల్లలకు విద్య అందుబాటులోకి తీసుకు రావటానికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పరచింది. రామమోహన్ రాయ్ వలన 1833 నాటికే ఇండియా పై ఆమెకు ఆసక్తి కలిగింది. నాలుగుసార్లు వచ్చి వెళ్ళింది.1866 లో తొలిసారి వచ్చినప్పుడు మద్రాస్ , బొంబాయి, కలకత్తాలకు వెళ్లి బాలికల విద్య గురించి ప్రముఖులతో చర్చించింది. జానకమ్మ మద్రాస్ లో మేరీ కార్పెంటర్ రాక గురించి విన్నదో , ఆమె సంభాషణల సారం తెలుసుకొన్నదో , ప్రత్యక్షంగా చూసిందో తెలియదు కానీ ఇంగ్లాండ్ వెళ్ళినపుడు ఆమెను కలవాలనుకొన్నది. లేక ఆమెను కలిస్తే బాగుంటుందని ఆత్మరామ్ పాండురంగ గారి అమ్మాయిలు చెప్తే తెలుసుకొని ఉంటుంది. ఏమైనా ఆ మేరకు వాళ్ళ నుండి మేరీకార్పెంటర్ కు పరిచయ లేఖలు కూడా సిద్ధం చేసుకొంది. ప్రయాణం ఆగిపోవటం వల్ల ఆమెను కలుసుకొనే అవకాశం కోల్పోయాను కదా అన్న బాధా స్వరం ఆమె వాక్యాలలో వినబడుతుంది.
మొదటిసారి ఇంగ్లండ్ ప్రయాణపు ఏర్పాట్ల సందర్భంలో జానకమ్మ ఆత్మరామ్ పాండురంగ గారిని ఆయన కూతుళ్ళను ప్రస్తావించింది. ఆత్మారామ్ పాండురంగ తుర్ఖడ్ 1823- 1898 మధ్యకాలంలో జీవించిన వైద్యుడు. విద్యావేత్త. సంఘ సంస్కర్త. బాల్యవివాహాలను వ్యతిరేకించాడు. ఆడపిల్లలకు 20 ఏళ్ళు వచ్చేవరకు పెళ్లి చేయరాదన్నది ఆయన అభిప్రాయం. ఆడపిల్లల చదువును ప్రోత్సహించాడు. కులవ్యవస్థను నిరసించాడు. బ్రహ్మ సమాజ ప్రభావాలతో తన ఇంట్లో ప్రార్ధనా సమాజం ఏర్పాటు చేసాడు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న సంస్కర్తలతో ,మేధావులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఆయనకు ఇద్దరు కొడుకులు , ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు మనేకా తండ్రివలెనే వైద్యం చదివింది. చిన్నకూతురు అన్నపూర్ణ ఇంగ్లీష్ భాషా సాహిత్యాలు చదివింది. జానకమ్మ “ accomplished daughters of Dr. Atmaram Pandoorung of Bombay” అని పేర్కొన్నది వీళ్ళను. మేరీకార్పెంటర్ కు జానకమ్మ వాళ్ళను పరిచయం చేస్తూ ఉత్తరం వ్రాయ గలిగిన స్నేహం , చనువు వాళ్లకు ఎలా వచ్చాయి.? 1866 ఇండియా పర్యటనలో మేరీకార్పెంటర్ బొంబాయి వెళ్లిన విషయాన్ని, అలా వెళ్లిన సంస్కరణవాదులు ఎవరైనా బొంబాయిలో ఆత్మరామ్ పాండురంగ ను కలవకుండా ఆయన ఆతిధ్యం పొందకుండా రాలేరు రారు అనే విషయాన్ని కలిపి ఆలోచిస్తే ఆమెకు ఆయన కూతుళ్ళకు మధ్య స్నేహం ఏర్పడగల అవకాశాలు అర్ధం అవుతాయి. ఆ క్రమంలో జానకమ్మ కూడా వాళ్ళ కుటుంబంతో సంబంధాలు, ఆయన కూతుళ్లతో స్నేహం సాధ్యం అయ్యాయి. అయితే జానకమ్మ వాళ్ళను అత్మారామ్ కూతుళ్లు అనే చెప్పింది కానీ పేర్లతో వాళ్ళను గుర్తించి చెప్పలేదు.
1871 ఇంగ్లండ్ ప్రయాణం ఆగిపొయ్యాక కూడా జానకమ్మ మరికొన్ని రోజులు అక్కడే ఉన్నది. భారత గవర్నర్ జనరల్ లార్డ్ నార్త్ బ్రూక్ వచ్చి బొంబాయిలో మహారాణి విగ్రహాన్ని ఆవిష్కరించే ఉత్సవంలో ఆత్మారామ్ గారి కూతుళ్లతో కలిసి పాల్గొన్నది. బొంబాయిలో దేశీయ నూలు తీత ,నేత మిల్లులను చూడగలిగింది. మద్రాస్ ను మించిన నగరమని చాలావరకు ఇంగ్లీష్ టౌన్ గా ఉంటుందని బొంబాయిని మెచ్చుకొన్నది.
జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర 1873 జులై 20 న మద్రాస్ లో మొదలై 1874 జనవరి 31 న బొంబాయిలో దిగటంతో ముగిసింది. అప్పటికి జానకమ్మకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? పిల్లలు ఉన్నట్లు లేదు. ఉత్సాహం, ఆలోచనారీతి, ప్రశ్నించే తీరు పాతిక ముప్ఫయ్యేళ్లు దాటవని పిస్తుంది. ఈ ఆలోచనారీతి, ప్రశ్నించి తర్కించే పద్ధతి ఆమెలో ఎలా వికసించాయి? ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీ లో విద్య, ఉద్యోగ రాజకీయ మత సాంస్కృతిక రంగాలలో హిందూ సమాజ ప్రయోజనాలకోసం,ప్రత్యేకించి స్త్రీవిద్య, పునర్వివాహ విషయాల కోసం జరుగుతున్న చర్చోప చర్చలతో వేడెక్కుతున్న సంస్కరణఉద్యమ నేపథ్యం కారణం కావచ్చు. ఒక సంపన్న వ్యాపారవర్గ స్త్రీగా నాటి నాగరిక స్త్రీ సమాజంతో ఏర్పడిన సంబంధాలు, చేసిన సంభాషణలు కారణం కావచ్చు. సమకాలపు ఆ జీవన సంఘర్షణను అవగాహన చేసుకొనే విద్య, ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం ఉండటం వల్ల కావచ్చు. ఏ విధమైన జంకు గొంకులు లేక పూర్తిగా అపరిచితమూ, భాషా సాంస్కృతిక భిన్నత్వము కల ఇంగ్లండ్ సమాజంలో తిరగటం, ఇంగ్లీషులోకి తన వ్యాసాన్ని అనువదించు కోగలగటం, ఇంగ్లీష్ లో యాత్రా చరిత్ర వ్రాయటం కన్నా అందుకు ప్రబల నిదర్శనం మరేమి కావాలి!? ఇంగ్లండ్ ప్రయాణంలో ఆమె అనేకమంది ఆంగ్ల మహిళల స్నేహం సంపాదించింది. వాళ్ళందరూ హిందూ మహిళా సమాజ సంక్షేమాన్ని కోరుతున్న వాళ్ళని గుర్తించింది. వాళ్ళ సూచనమేరకే ఆమె ఈ యాత్రాచరిత్ర వ్రాస్తున్నట్లు చెప్పుకొన్నది కూడా.
ధనికులకు , విస్తృతంగా వ్యాపారంచేయాలను కొనేవాళ్లకు, తమ విదేశీ భాషా పరిజ్ఞానంతో లోకోత్తరవిజయాలను కాంక్షించే వాళ్లకు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళటం అవసరం, అనివార్యం అంటూ ప్రబోధించటానికి, విదేశాయానం ప్రయాసకరం కాదు , ప్రమాదకరం కాదు అన్న నైతిక ధైర్యాన్ని ఇయ్యటానికి జానకమ్మ ఈ యాత్రాచరిత్రను రచించింది.
జానకమ్మ ‘pictures of England’ అనే తన ఈ రచనను లేడీ జులియా రాబిన్ సన్ కు అంకితం ఇచ్చింది. అంకిత వచనాలలో ‘లేడీ షిప్’ అనే మాటతో ఆమెను పదేపదే సంబోధించటాన్ని బట్టి , హిందూ స్త్రీల సంక్షేమం పట్ల ఆమె చూపిస్తున్న శ్రద్ధ, వాళ్ళ సామాజిక మేధోపర స్థాయి కోసం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు ఈ పుస్తకాన్ని ఆమెకు అంకితం ఇయ్యటానికి తనను ప్రేరేపించాయి అని చెప్పిన దాన్ని బట్టి జూలియా రాబిన్ సన్ మద్రాసు లో ఉన్నత సామాజిక స్థాయిలో ఉన్న స్త్రీ అని అర్ధం అవుతుంది. అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ కి యాక్టింగ్ గవర్నర్ గా ఉన్న విలియం రోజ్ రాబిన్ సన్ భార్య ఆమె అని అన్వేషణలో తేలింది. 1822 లో పుట్టిన విలియం రోజ్ రాబిన్ సన్ 1842 లో ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరి భారతదేశానికి వచ్చాడు. 1865 నాటికి మద్రాస్ ప్రెసిడెన్సీ కి ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయినాడు. వివిధ హోదాలలో పనిచేస్తూ 1875 లో ఏప్రిల్ నుండి నవంబర్ వరకు గవర్నర్ బాధ్యతలను కూడా నిర్వహించాడు. ఆ నాటి ప్రభువర్గ మహిళకు వలెనె జూలియా రాబిన్ సన్ కూడా ఉన్నత హోదాలో ఉన్న ప్రభుత్వాధికారి భార్యగా మద్రాసు లో స్త్రీ సంస్కరణలకు పనిచేయటం అతి సహజం. పోతం జానకమ్మ ఆమె హిందూ స్త్రీల సంక్షేమం కోసం పనిచేయటాన్ని ఎంతకాలంగా గమనిస్తూ వచ్చిందో కానీ హిందూస్త్రీల అభ్యుదయానికి అంకితం అయినందుకు కృతజ్ఞతా పూర్వకంగా సగర్వంగా తన పుస్తకాన్ని ఆమెకు కానుకగా సమర్పిస్తున్నాను అని చెప్పుకొన్నది. సంపన్న వ్యాపారవర్గాల స్త్రీలకూ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ వర్గాల స్త్రీలకూ ఉండే మర్యాదాపూర్వక సామాజిక సంబంధాలకు ఇది ఒక సంకేతం
ఈ యాత్రాచరిత్రను ఇంగ్లండ్ యాత్రా విశేషాలతో పాటు ఆయాప్రాంతాల ఆర్ధికరాజకీయ సంస్కృతిని తెలుసుకొనటానికి చదవాలి. అదే సమయంలో రచయిత్రి జీవిత చైతన్యాన్ని , చారిత్రక భావజాల దృక్పథాన్ని అంచనా వేసే పని చేయాలి. ప్రత్యేకించి రచయితలుగా స్త్రీలు తమను తాము వ్యక్తీకరించుకొన్న తీరును పరిశీలించాలి.
----------------------------------------------------------------------
(ఇంకా ఉంది)
Oct 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు