సాహిత్య వ్యాసాలు

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -11

1902 ప్రారంభమైన హిందూ సుందరి పత్రిక మధ్యతరగతి తెలుగు గృహిణులను ఎందరినో రచయితలను చేసింది. అలా రచయితలు అయినవాళ్ళల్లో కిడాంబి కనకమ్మ, గంటి జోగమ్మ,ఆ.  లక్ష్మీ కాంతమ్మ ఉన్నారు. వంటల నుండి సామాజిక సంబంధాల వరకు అన్నీవాళ్లకు రచనా వస్తువులు అయినాయి. ముగ్గురూ 1902 నుండే రచనలు ప్రారంభించినా కిడాంబి కనకమ్మ ఒక్కతే 1910 వరకు రచనా వ్యాసంగంలో కొనసాగింది.

కిడాంబి కనకమ్మ సాహిత్య సృజన వ్యాసంగం మంగళహారతి రచనతో మొదలైంది.మంగళమని పాడి మందయానలుగూడి పొంగుచు హారతులెత్తరేఅంటూ మాధవుని గురించి వ్రాసిన (హిందూసుందరి, నవంబర్  1902) మంగళ హారతి ఇది. పొంగలి చేసే రెండు విధానాలగురించి కూడా ఆమె వ్రాసింది( సెప్టెంబర్ - అక్టోబర్ 1903). ఇవి కాక ఈమె వ్రాసిన వ్యాసాలు మూడు లభిస్తున్నాయి. వాటిలో రెండు సింహాచల క్షేత్రము ను గురించినవి.మరొకటి ఐకమత్యం గురించిన వ్యాసం. స్త్రీలందరికీ ఆనాడు ఐకమత్యం గురించి చింతన సామాన్యాంశం. స్త్రీలకు అభ్యుదయాన్ని కూర్చే సంస్కరణ విషయాలపట్ల స్త్రీలందరికీ ఒక అంగీకారం కుదిరితే తప్ప సంస్కరణోద్యమ గతిక్రమం వేగాన్నిఅందుకోలేదు .ఆ విషయం తెలిసిన సంస్కరణోద్యమ నాయకులు స్త్రీలు సంఘటితమై సమావేశాలు పెట్టుకొని ఏక కంఠంతో సంస్కరణలను ఆహ్వానించగల చైతన్యం పొందాలి అని ఆశించారు.దానికి అనుగుణంగా స్త్రీలు కార్యరంగంలోకి ప్రవేశించనూ ప్రవేశించారు. ఆ క్రమంలో వ్రాయ నేర్చిన ప్రతిస్త్రీ ఐకమత్యం ఎంతఅవసరమో ప్రబోధిస్తూ వ్రాసారు. కిడాంబి కనకమ్మ కూడా అలాగే వ్రాసింది.( సెప్టెంబర్ 1910) 

బాలికల యొక్క వచ్చీ రాని  మాటలకు సంతోష పడినట్లుగా కొద్దిలో కొద్దిగా చదివి తాను వ్రాస్తున్న చిన్న వ్యాసంలోని తప్పులను మన్నించి దయతో చదవమని పండితులను కోరుతూ కనకమ్మ ఈ వ్యాసం ప్రారంభించింది. ఒకరి కంటే ఎక్కువగా వుండే మనుషులలో ఐకమత్యం లేకపోతే సుఖంలేదని, ఐకమత్యం అంటేఒకరితోఒకరు అనుకూలంగా చేరటం అని, కలుపుకోలు మనుషులలో ఉండవలసిన లక్షణం అని పేర్కొన్నది. రెండు పదార్ధాల చేరిక వల్లనే నూతన కార్యం ఏర్పడుతుందని ఐకమత్యం విశిష్టతను తార్కికంగా నిరూపించే ప్రయత్నంచేసింది. వస్తుజ్ఞానం ఒక్క ఇంద్రియంవల్ల సమకూడదు అని, ఒకటికంటే ఎక్కువ సాధనాలు లేకుండాఏకార్యమూ సిద్ధించదని చెబుతూ వ్రాయటం అనే కార్యానికి చేతివేళ్ళు కలం, కాగితం, మసి( సిరా) అనే బహుళసాధనాలు కావాలి కదా అని ఉదాహారణలతో ఐకమత్యం యొక్క అవసరాన్ని నొక్కిచెప్పింది. అనుకూలాభిప్రాయాలు కల స్త్రీ పురుషుల మధ్య ఐకమత్యం అభిలషణీయం అనిఅభిప్రాయపడింది.ప్రత్యేకించిఅబలత్వం జన్మసిద్ధమైనస్త్రీలు”  ఐక్యంగా ఉండాల్సిన అవసరం మరింత ఉందని అభిప్రాయపడుతూ ఎంతపనికిమాలిన వస్తువులైనా  కలిసి మెలిసి ఉన్నప్పుడు కొంత శక్తిని పొందుతాయి కదా అని తన అభిప్రాయాన్ని సమర్ధించుకొన్నది.

 “ చేరి యుండుటగదా చేయును కార్యములు కై వ్రేలులయిదును

   కాంతలార, చిన్నిచీమల బారు చేరి పూనికతోడ నడచిన సంద్రం

   బు గడచు ( గాదె, కన్నుల కనరాని కడుచిన్ని యణవులు కొండ 

   యై గన్పట్టు  చుండు గాదె ,చులకన యగు దూది కలిసి దారంబయి

   పెనగొని పగ్గమై పెద్ద తేజి /గీ  / బట్టి బంధించుటది కూర్పు పనియె  

    కాదె, నెలతలట్లన తలపుల గలిసికొనిన , విద్దె సుగుణంబువినయం 

    బు వీరి కరయ( , గలిగి సత్కీతిన్ పాత్రలై , మెలగరాదెఅని ఒక సీస పద్యంలో  ఐక్యతా లక్షణాన్ని, ఐక్యతా ఫలితాన్ని నిరూపించి చెబుతూ స్త్రీలను ప్రబోధించింది కనకమ్మ. 

దైహిక యాత్ర దైన్యం లేకుండా సాగించాలంటే చెడ్డ తలపులు ఎప్పుడూ కలుగకూడదు. ఆలోచనలు మంచివై ఉంది కీర్తి కరమైన కార్యాలకు ప్రేరణగా ఉండాలి. ఐహిక ధర్మవర్తనం అలవడి ఉండాలి . అట్లా చేయమని శ్రీహరిని వేడుకొనే ఒక ఉత్పలమాల పద్యంతో ఆమె ఈ వ్యాసాన్ని పూర్తి చేసింది. ఐక్యతా తత్వాన్ని ఇంత సరళ సుందరంగా  నిరూపించిన వ్యాసం మరొకటి కనబడదు. 

మిగిలిన రెండు వ్యాసాలు సింహాచల క్షేత్రాన్ని గురించి వ్రాసినవి. వాటిలో మొదటి వ్యాసం 1903 ఫిబ్రవరి సంచికలో వస్తే రెండవది మూడేళ్ళ ఎనిమిది నెలలకు 1906 నవంబర్ సంచికలో వచ్చింది. సింహాచల క్షేత్రం గురించి వివరంగా వ్రాయాలన్న ఉద్దేశంతో కనకమ్మ పని ప్రారంభించింది. సింహాచల  క్షేత్ర మహత్త్యము అనే మొదటి వ్యాసంలో దాని పౌరాణిక చారిత్రక విశేషాలను వివరించింది. ప్రహ్లాదుని రక్షించటానికి  నరసింహుడు ఈ కొండమీదే ఉద్భవించాడని, ఆ తరువాత ప్రహ్లాదుడు చేసే పూజలు అందుకొంటూ నరసింహ స్వామి ఇక్కడే ఉండిపోయాడని, ఎందుకనోఅవి ఆగిపోయి అక్కడ పెరిగిన అడవిలో దేవుడు మరుగునపడిపోయాడని పురూరవ చక్రవర్తి దానిని పునరుద్ధరించాడని ఒకఐతిహ్యం ఉంది.దానిని గురించి చెప్పి ఊరుకోలేదు ఆమె.శాసనాధారాలతో పోల్చి ఆ పౌరాణిక కథాంశంలోని సత్యాసత్యాలను నిగ్గుతేల్చే ప్రయత్నం చేసింది.ఇక్కడ కనకమ్మ అచ్చమైన చరిత్రకారుల పద్ధతిని అనుసరించింది.అది పురూరవ చక్రవర్తి కట్టించిన గుడి అనటానికి నిదర్శనాలు ఏవీ లేవంటుంది.

పురూరవుడు వేదకాలపు వాడుఅని చెప్తారు.వేదాలు, పురాణేతిహాసాలలో అతని ప్రస్తావన ఉంది.అతని పుట్టుక గురించి ,తల్లిదండ్రుల గురించి ,రకరకాల  ఐతిహ్యాలు ఉన్నాయి. ఊర్వశికి అతనికి మధ్య సంబంధం సాహిత్యవస్తువైంది. అది అలా ఉంచితే సింహాచల క్షేత్రం అంత ప్రాచీనమైనది అనటానికి శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేకపోవటం కనకమ్మ గుర్తించింది. దేవాలయ ప్రాంగణంలోని శిలాశాసనం ప్రమాణంగా అందులో పేర్కొనబడిన శ్రీకృష్ణదేవరాయల తండ్రి అయిన నృసింహదేవరాయల కాలంలో నిర్మించబడి, నిర్వహణకు గాను భూమి దానం చేయబడిన విషయాలను బట్టి ఆనాటికి ఆ ఆలయం కట్టి 900 సంవత్సరాలు గడిచినట్లు పేర్కొన్నది. వ్యాసాన్ని ముగిస్తూ ఇక్కడ జరిగే ఉత్సవాదుల వైభవాల గురించి ముందు ముందు వ్రాస్తానని చెప్పినదానిని బట్టి సింహాచల క్షేత్రంగురించి సమగ్రంగా వ్రాసే బృహత్ ప్రణాళిక ఏదో ఆమె వేసుకున్నట్లు కనబడుతుంది. కానీ 1906 నవంబర్ సంచిక వరకు ఎందుకో దానికి కొనసాగింపు వ్యాసం ఏదీ కనబడదు. అందుకు సమాధానం ఆ వ్యాసం చివర దొరుకుతుంది.

ఈరెండవ వ్యాసంలో కనకమ్మ విశాఖ పట్టణపు మండలంలోని సింహాచలానికి రైల్వేస్టేషన్ నుండి బండిపై ఊళ్లోకి వెళ్ళగానే ప్రభుత్వం వారు కట్టించిన హవేలీ, దానికి దక్షిణాన పెద్ద పూలతోట, దానికి తూర్పు దక్షిణాలలో పండ్ల తోటలు, హవేలీకి తూర్పున కొండపైకి వెళ్లే మెట్లు కనిపిస్తాయని ఆలయంలో ప్రవేశించే పర్యంతం అడుగడునా కనబడే దేవాలయాలు, స్నానఘట్టాలు, తోటలు వాటి మధ్య  దూరాన్ని  గజాలలో, ఎక్కవలసిన  మెట్ల సంఖ్యను  కూడా  చెబుతూ  ఆమె వ్రాసిన తీరు చేయిపట్టి  మనలను ఆ మార్గం గుండా, ఆ మెట్ల మీదుగా  తీసుకువెళుతూ చుట్టుపక్కల దృశ్యాలను చూపిస్తూ చెప్తున్నట్లుగా ఉంటుంది.ఆ క్షేత్రానికి వచ్చేవాళ్ళు  సౌకర్యవంతంగా దర్శనం చేసుకొని తీర్ధప్రసాదాలు సేవించటానికి మార్గదర్శకంగా వుండే సూచనలు కూడా అందులో ఉన్నాయి. యాత్రా చరిత్ర రచనలకు చక్కని నమూనా గా చెప్పుకోదగిన రచన ఇది. 

ఈ వ్యాసం ముగింపులో స్వామివారికి జరిగే నిత్యోత్సవ,పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్స రోత్సవాల గురించి తాను ఇదివరలో వ్రాసి పంపిన వ్యాసం కూడా ప్రచురించవల్సినదిగా కోరింది. ఆలయం చుట్టూ ఉండే శాసనాలను ఎత్తి వ్రాసి పంపుతున్నాను అని వాటిని కూడా ప్రచురించమని కోరింది. అక్కడ స్వామివారికి చేసే ప్రసాదాల తయారీ పద్ధతి గురించి కూడా వ్రాసి పంపుతానని చెప్పింది. ముగింపులో చెప్పిన ఈ వాక్యాలు చాలా ముఖ్యమైనవి. ఒక ఆలయం గురించి మూడు నాలుగేళ్లు ఒక లక్ష్యంతో శోధన చేయటం, సమాచారం సేకరించటం ఆనాటి ఆడవాళ్లకు అంత సులభమైన పని కాదు. సులభం కాని పనిని చేపట్టింది అంటే అది ఆ పని పట్ల ఆమె ఆసక్తికి, ఇష్టానికి నిదర్శనం. మూడు నాలుగేళ్లు ఆలయానికి పదే పదే వెళ్లి విషయాలు తెలుసుకొనే వెసులుబాటు ఉన్నదంటే ఆమె విశాఖ మండలానికి చెంది, ఆ సమీప ప్రాంతాలలో నివసిస్తున్నదని అనుకోవచ్చు. శాసనాలు ఎత్తి వ్రాసుకొని వాటిని వ్యాఖ్యానించగల జ్ఞానం ఆమెను మేధావుల కోవకు చేరుస్తుంది. బహుశా తెలుగునాట తొలి శాసన పరిశోధకురాలు కిడాంబి కనకమ్మే కావాలి. 

1902 లో పాటల రచనతో ప్రారంభించిన గంటి  జోగమాంబ విశాఖ పట్టణ వాసి. రామరామ నన్ను బ్రోవరారా, నన్ను బ్రోవరావా నారదాదినూత, సమయము మంచిదిరా నను బ్రోవరా అనే మూడు పాటలు వ్రాసింది (జనవరి 1902? 1903? ) జోగమాంబ అని స్వీయ నామాంకిత ముద్రతో ముగుస్తాయి ఈ పాటలు. ప్రతి పాటలోనూ ఆమె తనను ధర వైశాఖ పురీ వాసురాలిగా చెప్పుకొన్నది. ఆ రకంగా ఇటువంటి పాటలవల్ల స్త్రీల గురించిన స్వల్పమైన సమాచారం అయినా లభించింది. అదే సంతోషం. 

హిందూ స్త్రీల గుట్టు ( ఏప్రిల్ 1903) కథ లాగా మొదలై వ్యాసం వలె ముగిసిన రచన. ఆడవాళ్ళ చాపలత్వాన్ని కనిపెట్టాలని ఒక బ్రాహ్మణుడు నల్లకాకికి తెల్ల కాకి పుట్టిందని అందువల్ల రాజుగారికి ప్రాణాపాయమని చెప్పిన మాటను భార్య నీలాటిరేవు దగ్గర స్త్రీలకు చెబితే అది ఆనోటా ఈ నోటా పడి చివరకు రాజుగారి దగ్గరకు వచ్చిందని ఆయన అలా చెప్పిన ఆ బ్రాహ్మణుడిని పిలిపించి తక్షణం పరిహారం చెప్పకపోతే తలతీయిస్తానని హెచ్చరించాడని అందులో నిజం లేదని , స్త్రీల మనస్తత్వం తెలుసుకొనటానికి తానే అట్లా కల్పించి చెప్పానని రాజుగారికి చెప్పి ఒప్పించాడని ఆ కథను చెప్పి రచయిత్రి బుద్ధిబలం వల్ల బ్రాహ్మణుడు ప్రాణాపాయం తప్పించుకున్నాడని, అది లేకపోవటం వల్లనే అతని భార్య ముందువెనుకలు చూడక భర్త ప్రాణానికి ఆపద తెచ్చే పని చేసిందని వ్యాఖ్యానించి చెప్పింది. మనిషికి మంచి ఏదో, చెడు ఏదో తెలియటానికి శిక్షణ అవసరం అని అది స్త్రీ పురుషులిద్దరికీ అవసరమేనని విద్యాప్రాధాన్యతను ప్రతిపాదించింది. విద్య లక్ష్య డబ్బు సంపాదన అనుకొనటం తప్పని జ్ఞానం నిరంతరం పొందవలసినదే అన్న ఎరుక కలిగి ఉండాలని స్త్రీ విద్య ను ప్రోత్సహిస్తూ వ్యాసం ముగించింది. తాను చెప్పదలచుకొన్న విషయానికి తగిన దృష్టాంతాలు సమకూర్చుకొని ఒప్పించేట్లు రచన చేయటం జోగమాంబ పద్ధతి. 

గంటి జోగమాంబ సుగుణవతి - దుర్గుణవతి అనే కథను వ్రాసింది ( 1903 సెప్టెంబర్ & అక్టోబర్ ) పేరమ్మ వితంతువు. భర్త ఇచ్చిపోయిన ఆస్తితో బతుకుతూ ఇద్దరు కూతుళ్లను పెంచింది.  సుగుణవతి  దుర్గుణవతి ఇద్దరూ తన పిల్లలే అయినా దుర్గుణవతిని గారాబం చేసి సుగుణవతిని తిడుతుండేది. పనులన్నీ సుగుణవతివే. బావికి నీళ్లు తేవటానికి వెళ్ళినప్పుడు దాహమడిగిన అవ్వకు నీలతోడి పోసిన ఆమె మంచితనానికి ప్రతిఫలంగా నోరు విప్పి మాట్లాడినప్పుడల్లా మాటకొక వజ్రం, ముత్యం రాలుతాయని వరం పొందింది. దుర్గుణవతి కూడా అటువంటి లాభంపొందాలని తల్లి బతిమాలి మర్నాడు బావికి నీళ్లు తేను ఆమెను పంపింది. ఆమె అవినయ రీతికి దక్కిన వరం మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక పాము, ఒక తేలు నెల రాలటం. దీనికంతటికీ కారణం సుగుణవతి అని ఆమెను దండించబోతే అడవులలోకి పారిపోయిందని అక్కడ ఒక రాజపుత్రుడు ఆమెను చూసి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని, ఇక్కడ దుర్గుణవతి తల్లి వెళ్లగొడితే అడవులు పట్టి పోయిందని కథ. ఇది చెప్పి సుగుణములు కలిగి ఉండటందుర్గుణాలు కలిగి ఉండటం ఎటువంటి వ్యత్యాస ఫలితాలను ఇస్తాయో చూడండని హెచ్చరించింది రచయిత్రి. ఇది ఆధునిక కథ కాదు. అద్భుత కాల్పనిక కథ. మంచి గుణములను అభివృద్ధి చేసుకోనాలని ఎవరికైనా చెప్పటం అవసరమే. తల్లుల మూర్ఖత్వం, పెంపకపు తీరు కూడా పిల్లలు సద్గుణాలు అలవరచుకొనటానికి అవరోధం అవుతుందని ఈ కథ మరొక నీతిని కూడా సూచిస్తున్నది. అదలా ఉంచితే ఎవరయినా పిల్లలకు సుగుణ అని పేరుపెట్టుకోవచ్చు కానీ దుర్గుణ అని చూస్తూ చూస్తూ పెట్టరు. సుగుణవతి పేరుకు తగ్గట్టు మంచిది కావటం, దుర్గుణవతి పేరుకు తగ్గట్టు చెడ్డది కావటం అతిశయోక్తి తప్ప వాస్తవం కాదు.  

ఆ. లక్ష్మీ కాంతమ్మ రచనలు రెండు మాత్రమే లభించాయి. రెండూ వ్యాసాలే. ఒకటి స్త్రీవిద్య గురించి ( 1902 నవంబర్ ). జ్ఞానం విద్యామూలం అనిచెప్పి దేశంలో స్త్రీవిద్య పట్ల పట్టింపు లేకపోవటాన్ని గురించి బాధపడింది. విద్యలేని స్త్రీలు జ్ఞాన శూన్యులై భర్తలను సంతోషపెట్టే విధం తెలియక సంసారాలు పాడు చేసుకొంటారని చెప్పింది. విద్యలేని స్త్రీలు కన్నపిల్లల కు కూడా మేలు చేయలేరని స్త్రీలు విద్యాధనం సంపాదిస్తే ఇంటికీ బంధుమిత్రులకు కూడా కీర్తి తెస్తుందని అభిప్రాయపడింది. స్త్రీలు అలంకారాలమీద మోజు వదులుకోవాలని కూడా హెచ్చరించింది. మనుషులకు నిజమైన అలంకారాలు నగలు జుట్టు చక్కగా సంస్కరించుకొనటం కాదు మంచి మాట నిజమైన అలంకారం అని వాగ్భూషణమే అసలు భూషణం అని చెప్పే సంప్రదాయ హితోక్తిని ఉటంకిస్తూ స్త్రీలు చదువు కోవాలని ఆకాంక్షించింది. రాజమండ్రిలో కొటికలపూడి సీతమ్మ స్త్రీవిద్యా వ్యాప్తికి చేస్తున్న కృషిని గౌరవంతో ప్రస్తావించి  ఈ వ్యాసాన్ని ముగించింది. 

గంజాం జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్న ఓడ్రస్త్రీల గురించి వ్రాసిన వ్యాసం మరొకటి (1903, ఏప్రిల్) చదువు, నాగరికత లేనివాళ్ళని వాళ్ళ వేష భాషలను, ఆహారపుటలవాట్లను తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళవల్ల ఆజిల్లాలో తెలుగు స్త్రీలకు కూడా గౌరవంలేకుండా పోతున్నదని ఈవ్యాసంలో ఆమె పేర్కొన్నది. భిన్న సంస్కృతుల పట్ల అసహనం, ప్రాంతీయ దురభిమానం, ఆధిక్యతా భావన బీజరూపంలో కనబడతాయి ఈవ్యాసంలో. స్త్రీల ఐక్యతను గురించి పదేపదే అనేకులు చెప్తున్న ఆ కాలపు సంస్కృతికి భిన్నమైన వ్యక్తీకరణ ఇది.

 

                                                   ----------------------------------

 

సాహిత్య వ్యాసాలు

ప్రపంచీకరణ - భాషా సంస్కృతుల పై ప్రభావం

ప్రపంచీకరణ ప్రారంభమై మూడు దశాబ్దాలు గడిచాయి. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు మొదలైన సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ  90వ దశకంలో ప్రారంభమైనప్పుడు చాలామంది మేధావులు దీనిని వ్యతిరేకించారు. అప్పట్లో  సాహిత్యకారులకు దీని పర్యవసానాల పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడలేదు.

ప్రపంచీకరణ అన్ని రంగాల్లోకి చొచ్చుకుని వచ్చిందిప్పుడు ఆక్టోపస్‌లా. అదొక మట్టికాళ్ళ మహారాక్షసి. నోరులేని పులి. అయితే అది అనేక సవాళ్ళతోపాటు అనేక అవకాశాలనూ  తీసుకొచ్చింది. ప్రపంచంలోని మారుమూల వున్న సంస్కృతి, భావాలను విశ్వవ్యాప్తం చేయగలిగింది. అన్ని దేశాల భాషా సంస్కృతులను మిళితం చేస్తోంది.  ప్రపంచీకరణ, ప్రపంచంలో లభించే ఉద్యోగావకాశాలను అన్ని దేశాల వారికి అవకాశాలను కల్పించింది. భారతదేశానికి చెందిన చాలామంది నేడు వివిధ దేశాలలో పనిచేస్తున్నారు. ప్రపంచీకరణకు సాధనంగా అంతర్జాలం (ఇంటర్నెట్‌), సోషల్‌ మీడియా,  సమాచార సాంకేతిక రంగాలు పనిచేస్తున్నాయి.

గతంలో పెట్టుబడి, వస్తు వినిమయం పరిమితులకు లోబడి వుండేది. ప్రపంచీకరణ వాటి హద్దులను చెరిపేసి అన్ని దేశాలకు విస్తరించడానికి మార్గం ఏర్పరిచింది. దీనినే స్వేచ్చా వాణిజ్యం అన్నారు. దాంతో పెట్టుబడుల తరలింపు ఫైనాన్స్‌ పెట్టుబడి రూపంలో సంపన్న దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లోకి వెల్లువలా ప్రవేశించింది. ఇది అన్ని దేశాల రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక భావాలను మార్చివేసింది. గతంలో వున్న సోషలిస్టు భావాలను, సంస్కృతి పరంగా వున్న వైవిధ్యాన్ని కకావికలం చేసింది.

అన్ని దేశాల్లోకి  సులభంగా  స్వేచ్ఛా  మార్కెట్‌ విధానాన్ని విస్తరించడానికి చట్టాలను సరళీకరించి సవరించేటట్లు చేయించడం, అందుకు అడ్డంకిగా వున్న ఆయాదేశాల భాషా సంస్కృతులను రకరకాలుగా ధ్వంసం చేయడం మొదలు  చేపట్టాయి సంపన్న దేశాలు.ప్రజల్లో ఎన్నో ఏళ్ళ నుంచీ వేళ్ళూనుకున్న భావాలను మార్చడానికి, సాంస్కృతిక భావాల్లో మార్పు తేవడానికి కార్పొరేట్‌ సంస్కృతిని పెంచడానికి అనేకమార్గాలు అన్వేషించారు వారు.

మెల్లమెల్లగా  ప్రపంచీకరణను  అర్థం చేసుకున్న సాహిత్యకారులు దీన్ని పడమటి గాలిగా వర్ణించారు. ఈ పడమటి గాలి పర్యావరణాన్ని, భ్రష్టుపట్టించింది. గాలి, నీరు, నేల కాలుషాన్ని పెంచింది. సైబర్‌ నేరాలు పెంచింది.  అభివృద్ధి చెందుతున్న  సైన్సును ఉపయోగించుకుని దారుణ ఫలితాలను అది మోసుకొచ్చింది. వర్తకంలో, వ్యాపారాల్లో, మనిషి జీవన గమనంలో, ప్రతి అడుగులో పడమటిగాలి ప్రవేశించి అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అర్థం కాని అయోమయ జీవితాన్ని అది అందించింది. స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ, కోవిడ్‌ లాంటి వ్యాధుల్నీ ప్రపంచవ్యాప్తం చేసింది. ఎక్కడో ఎవరికో జలుబుచేస్తే అది అందరికీ అంటుకునే విధంగా ఈ గాలి వీస్తోంది. కోవిడ్‌ 19 అలాంటిదే. స్ట్రెయిన్‌ కరోనా అలాంటిదే. స్వైన్‌ఫ్లూ అలాంటిదే.

భిన్నమైన సంస్కృతీ సంప్రదాయాలు, విభిన్నతతో, వైవిధ్యంతో ఉన్న ప్రజల భాషలు, భావాలు భారతీయ సంస్కృతిలో కలిసిపోయాయి. విడివిడిగా వున్నా అవి ఏకత్వాన్ని సంతరించుకున్నాయి. భారతీయ ప్రజాస్వామిక గుణం విశిష్టమైనది. పరమత సహనం కలిగి వుండటం ఇక్కడి ప్రజల విశిష్ట లక్షణం. పాటలు, సంగీతం, భిన్నమైన శిల్పం జానపదం భారతీయ సంస్కృతిలో అంతర్లీనంగా వున్నాయి. అదేసమయంలో ఈ సంస్కృతి సంప్రదాయాలు ఆధిపత్య వర్గాల చేతిలో బలంగా ఉండి ఇతర వర్గాలను తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి తోడ్పడ్డాయన్న విషయం మనం మరువరాదు.

ప్రపంచీకరణ గాలుల ప్రభావం వీటన్నింటిపై పడింది. ఇంకో మాట చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతి భారతీయుల సంస్కృతిలో పెనుమార్పులు తెచ్చింది. పీఠాలను ధ్వంసం చేసింది.దీంతో భారతీయ సమాజం అనేక కుదుపులకు లోనయ్యింది.

పెట్టుబడీదారీ వ్యవస్థ కు ఊతమిచ్చే   కుటుంబ వ్యవస్థ భారతీయ సమాజంలో కి ప్రవేశించింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయాయి. దానితో పేద, ధనిక కుటుంబాలన్న తారతమ్యం లేకుండా అంబానీ, టాటాల కుటుంబాల నుంచి గ్రామసీమల్లోని కుటుంబాల వరకూ ఈ విచ్ఛిన్నత పెరిగిపోయింది. పర్యవసానంగా గతంలో లేని అపార్ట్‌మెంట్‌ సంస్కృతి  పెరిగింది.  పల్లెల్లో తల్లిదండ్రులు, పట్టణాలలో వారి పిల్లలు నివసించే పరిస్థితి ఏర్పడింది. చిన్న పిల్లలకు అవ్వ, తాతలు అప్పుడప్పుడు వచ్చే అతిథులయ్యారు. వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయి. కొన్ని నగరాలలో తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటే  పిల్లలు విదేశాల్లో జీవిస్తున్న పరిస్థితి వచ్చింది.మనిషి సమాజంలో ఒంటరైన పరిస్థితి ప్రపంచీకరణ కల్పించింది. కొన్ని కుటుంబాలలో తల్లి ఒకచోట, తండ్రి మరో చోట కొడుకు ఇంకోచోట, కూతురు వాళ్ళకు దూరంగా ఇంకోచోట ఉన్న పరిస్థితి కూడా ఏర్పడింది. పిల్లలు తల్లితండ్రులను భారంగా పరిగణించే పరిస్థితి వచ్చింది. కుటుంబ సంబంధాలలో సహజంగా ఉండాల్సిన ప్రేమ సంబంధాలు పోయి డబ్బు సంబంధాలు ఏర్పడ్డాయి. ఆస్తులకోసం తల్లితండ్రులను హింసించే కూతుళ్లు,కుమారులు తయారయ్యారు. అన్నదమ్ముల  తగాదాలు చంపుకునేంత  విపరీతంగా పెరిగాయి.

భారతీయ వివాహ వ్యవస్థ పెనుమార్పులకు లోనయ్యింది. వివాహ బంధం నూరేళ్ళ బంధంగా పరిగణించే పరిస్థితి పోయింది. ఈ రోజు పెళ్ళి, రేపు విడాకులు అనే పరిస్థితి పెరిగింది. వివాహ బంధంలో స్త్రీ, పురుషుల మధ్య సహజంగా వుండాల్సిన, ఇచ్చి పుచ్చుకోవడాలు మాయమయ్యాయి. వ్యక్తి ప్రాధాన్యత, కోపతాపాల స్థానంలో వారి వ్యక్తిగత ప్రయోజనాలుపెరిగాయి.స్వంత ఆసక్తులు వదులుకోకుండా కేవలం వృత్తిపర సంబంధాలుగా పరిణమించాయి. ఒక రకంగా బంధం పేరుతో స్త్రీల అణచివేత కు కొంతమేరకు ఎదురు దెబ్బ తగిలింది.

కుటుంబం ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. న్యూక్లియర్‌ కుటుంబం స్థానంలో వ్యష్టి కుటుంబాలు ఏర్పడుతున్నాయి. ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు ఎక్కువైపోయారు. సోలో బతుకే సో బెటరూ అనే నానుడి కూడా ఏర్పడింది.

భారతదేశ సంస్కృతికి ఏమాత్రం సరిపడని కొత్తరకం వైవాహిక సంబంధాలు పెరిగాయి. ఇది పతనమవుతున్న సామాజిక విలువల ను ప్రతిబింబిస్తోందిి.    వయసు తారతమ్యాలు లేకుండా, వావివరుసలు లేకుండా లైంగిక సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఎలాంటి వివాహ బంధం లేకుండా కలిసుండే పద్ధతి వచ్చింది. వివిధ మీడియాల ద్వారా మనుషుల మెదళ్ళలో పర్వర్షెన్‌ ఏర్పడి బలాత్కారాలు, చిన్నా తేడా లేకుండా లైంగిక దాడులు పెరిగాయి.

అతిథి దేవోభవ అనేవారు పూర్వులు. అతిథులు వస్తే వాళ్ళు పోకుండా చెప్పులు కూడా దాచేవారు. ఇప్పుడు అతిథులు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తున్నారు. ఇతరులతో సంబంధాలు వారి హోదాను బట్టి, ఆర్థిక స్థోమతను బట్టి ఉంటుంది. పెద్దలంటే గౌరవం పోయింది. నేటి యువతరంలో ప్రేమికుల రోజు జరపడంలో ఉన్న ఉత్సాహం, హోలీ, ,ఉగాదులు జరపడంలో లేదు.

భారతదేశంలో భిన్న సంస్కృతులున్నాయి. వారి భాషలు, వేషధారణ వేరు వేరుగా ఉంటాయి. గిరిజనుల వేషభాషలు వేరు. గడచిన 30 ఏళ్ళలో వారి వేషభాషల్లో చాలా మార్పులొచ్చాయి. బంజారాల ప్రత్యేక వేషధారణ మారింది. ఆహారపు అలవాట్లు మారాయి. స్వంతమంటూ ఏమీలేని ఒకానొక పరిస్థితి ఏర్పడింది. చిరుధాన్యాల స్థానంలో వరి అన్నం వచ్చి చేరింది. ఏ రాష్ట్రం వెళ్ళినా ఒకే ఆహారం దొరుకుతుంది. ఆయా ప్రదేశాల విభిన్న ఆహారపు అలవాట్లు మాయమయ్యాయి.

వస్త్రధారణల్లో అనేక మార్పులు వచ్చాయి. మహిళలు జీన్స్‌ ప్యాంట్లు వేసుకుంటున్నారు. సహజంగా వేసుకునే లంగా ఓణీల స్థానంలో పంజాబీ డ్రెస్సు వచ్చింది. పైట దాదాపు కనుమరుగవుతోంది. పురుషులు షార్ట్స్‌ ధరిస్తున్నారు. ధనికులు కోట్లు ధరిస్తున్నారు. ఆఖరకు దేశ ప్రధాని కూడా అదే ధరించే పరిస్థితి నెలకొంది. గిరిజనులు, యానాదులు, ఎరుకలు తమ స్వంత అస్తిత్వ వేషభాషలను వదిలి నేటి నాగరిక ప్రపంచంలోని దుస్తులనే ధరిస్తున్నారు. పంచెలు, చీరల తయారీలో పెనుమార్పులు వచ్చాయి. ఇది ఒక రకంగా ఏక సంస్కృతి నుంచి పెంచి పోషిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు ఆధిపత్యంలో వుంది. ఆంగ్లభాష రాకపోతే మనిషి మనుగడ లేదన్న భావనను పెంపొందించారు. దీనికోసం పాఠశాలల అభివృద్ధికోసం, అందరినీ అక్షరాస్యులను చేయడంకోసం అనేక నిధులు ఇచ్చారు. ఈ భూమిక  సంపన్న దేశాల మార్కెట్‌ విస్తరణకు ఉపయోగపడింది. దాంతో ఇంగ్లీషు, స్పానిష్‌, జర్మన్‌ భాషల వంటి విదేశీ భాషల ప్రాముఖ్యత పెరిగింది. ఇంగ్లీషు భాష ప్రధానమై ఆఖరుకు తెలుగు మాధ్యమాన్ని కూడా పాఠశాల స్థాయిలోనే వద్దనే పరిస్థితి వచ్చింది. సాహిత్యకారుల్లో కొద్ది మంది మాత్రమే  తెలుగు భాష కావాలని కోరుతున్న దుస్థితి నెలకొంది. ఇంగ్లీషు నేర్చుకుంటేనే విదేశాలకు వెళ్ళేదానికి వీలవుతుందని, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు లభిస్తాయన్న అభిప్రాయం సర్వత్రా   వ్యాపించింది. ఇప్పుడు దేశంలో కనుమరు గవుతున్న మాతృభాషల్లోకి మెల్లగా తెలుగు కూడా చేరే పరిస్థితి దాపురించే పరిస్థితి నెలకొంది.

ఆంగ్ల భాష ప్రాధాన్యతతో కొర్పొరేట్‌ పాఠశాలల్లో విద్యార్థులు రెయిన్‌ రెయిన్‌ గో అవే అనే పాట పాడుకుంటున్నారు. వానల్లు కురవాలి వరిచేలు పండాలి మాయిల్లు కళకళలాడాలి' పాటలు కరువవుతున్నాయి.

గతంలో సామ్రాజ్యవాదమంటే ఒక దేశం మరో దేశాన్ని బలవంతంగా ఆక్రమించడంగా ఉండేది. ఇప్పుడు ప్రపంచీకరణ ప్రారంభమయ్యాక సామ్రాజ్యవాద రూపం మారింది. అది ఆయాదేశాల ఒప్పుదల మేరకు ఆ దేశంపై ఆధిపత్యం వహించడంగా మారింది. తుపాకీ మనిషిని భయపెట్టి శరీరాన్ని వశం చేసుకుంటుంది. భాషతో వశపరుచుకుంటే మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోయి  మనసునే అప్పగిస్తాడు. అదే ఇప్పుడు జరుగుతోంది.

మన దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయం ఒక జీవన విధానం. పల్లె సీమలు వ్యవసాయానికి జీవగర్రలు.    ప్రపంచీకరణలో వ్యవసాయానికి సాయం దూరమైంది. యువత రైతుగా ఉండడటం నామోషీగా మారింది. వ్యవసాయం దండగ మారిగా మారిపోయింది. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. జైకిసాన్‌, జైజవాన్‌ అన్నవి కేవలం నినాదాలుగా మారాయి.

ఉద్యోగాల కల్పనంతా పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు చేస్తున్నాయి. వాటిల్లో ఉద్యోగులుగా చేరన యువత ఇతర దేశాల ప్రగతికి తోడ్పడుతోంది. మెల్లగా మనదేశం ఆర్థిక పరాధీనతలోకి వెళ్లిపోతోంది.  

మార్కెట్‌ విస్తరణకు ఆటంకంగా వున్న సంస్కృతి, సంప్రదాయాలపై దాడి మొదలైంది. దీనికోసం సినిమాలను, ఇంటర్నెట్‌ను, టి.వి.ని, సోషల్‌ మీడియాను విరివిగా ఉపయోగించు కున్నాయి. ఇవి ప్రజల మెదళ్ళ, ఆలోచనలను మసకబార్చి పాశ్చాత్య సంస్కృతిని విస్తరింపజేసుకున్నాయి. దాని పర్యవసానమే నేడు సమాజంలో జరుగుతున్న అనేక మానవ సంబంధాల విచ్ఛిన్నత. సంస్కృతే సామ్రాజ్యవాదంగా మారిపోయిన పరిస్థితి నేడుంది. ఈ రకంగా ప్రజలను మానసికంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. పర్యవసానంగా సాహిత్యం అప్రధాన అంశంగా మారింది. చాలామంది కవులు, రచయితలు ముందుకు వస్తున్నా సాహిత్యం చదివే వారు తక్కువైపోతున్నారు. పుస్తకాల అమ్మకాలు తగ్గిపోవడమే దీనికి సాక్ష్యం. పుస్తకాలు గ్రంథాలయాల్లోకి పోవడం అంటే స్మశానానికి పోవడమన్న అభిప్రాయం రచయితల్లో నెలకొంది. దానికితోడు ప్రభుత్వాలు సాహిత్యానికి ఎలాంటి తోడ్పాటు ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. ఇప్పుడు సాహిత్య సంఘాలే సాహిత్యాన్ని ఒక ఉద్యమం గా ముందుకు తీసుకెళుతున్నాయి.

ఇరవైయ్యోవ దశకం వరకు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు విరివిగా వచ్చాయి. అవికూడా మెల్లగా తగ్గుముఖం పట్టాయి. సాహిత్యంతో పాటు పల్లెపదాలు, జానపదగేయాలు, హరికథ, తోలుబొమ్మలాట, బుర్రకథ, ఒగ్గుకథ, పగటివేషగాళ్లు, నాటకాలు, జానపద బృంద గీతాలు, లంబాడీ నృత్యాలు మెల్లగా కనుమరుగయ్యే దశలో వున్నాయి. వాటి అస్తిత్వం ప్రశ్నార్థకంగా ఉంది. కరోనా కాలంలో సినిమాలు కూడా మందగించాయి. యూట్యూబ్‌ ఛానెల్లో ఓటిటి లో సినిమాలు వస్తున్న పరిస్థితి ఉంది. టి.వి.లు, సోషల్‌ మీడియా విస్తరణతో కళారూపాలకు ఆదరణ తగ్గింది. వాటిని నేర్చుకునే వారే కరువయ్యారు. నేడు డిస్కోతెక్‌లు, పబ్‌లు, జాజ్‌, రాక్‌ వంటి సరికొత్త పాశ్చాత్య సంగీతం, కళాశాలల్లో విద్యార్థుల విచిత్ర నృత్య ప్రదర్శనలు ఇవన్నీ దేశవాళీ సంస్కృతిని ధ్వంసం చేస్తున్నాయి.

అందాల పోటీలు నిర్వహించి అందం పట్ల భ్రమలు పెంచి అందానికి ఉపయోగించే ఉత్పత్తుల మార్కెట్‌ను విస్తరింపజేసుకొన్నారు. అందానికి ప్రాముఖ్యత నిచ్చేలా చేసింది ప్రచారం. సినిమాలలో, టి.వి.ధారావాహికల్లో కాస్ట్యూమ్స్‌, విపరీత అలంకరణ చూపెట్టి ప్రజల మనసుల్లో అందంగా వుండాలంటే ఆ విధంగా ఉండాలేమోనన్న భ్రమలు కల్పించారు.  

జనవరి ఫస్ట్వాలంటైన్స్‌ డే, ఫ్రెండ్‌షిప్‌ డే, మదర్స్‌డే లాంటి కొత్త పండుగలు ప్రచారం చేసి ఆయా దినాలకు సంబందించిన ఉత్పత్తులను తమ వ్యాపార విస్తరణకు ఉపయోగించు కున్నాయి.  ఉగాది, హోలీ లాంటి పండుగల ప్రాముఖ్యత తగ్గిపోయింది. మల్లవిద్య, చెడుగుడు, కబాడ్డీ, కర్రసాము, చదరంగం, పులిమేక లాంటి గ్రామీణ క్రీడలన్నీ కనుమరుగ వుతున్నాయి.

 నేడు ఖర్చుపెట్టు, నెమ్మదిగా దానిని కట్టు అని ప్రచారం చేశారు. ఎప్పుడో సుఖపడడం కాదు. ఇప్పుడే సుఖపడండి అన్నారు. ఇది వినియోగవస్తువుల మాయాజాలంలోకి లాగింది మనిషిని. మనిషి ఒక వస్తువుగా మారాడు.

తెల్లతోలు, విలాసంగా ఖర్చుపెట్టడమే జీవితంగా భ్రమించే ధోరణి ప్రబలింది. ధనమేరా అన్నిటికీ మూలం, ధనం మూలం మిదం జగత్‌ అన్న నానుడులు ముందునుంచి ఉన్నా, ధనమే లోకమన్న భావన నేడు ఊపందుకుంది. స్త్రీ పురుష సంబంధాలలో కుటుంబ సంబంధ బాంధవ్యాలలో, ప్రేమలకు ధనం ప్రధాన కారణంగా నిలుస్తోంది.

టి.వి., ఫ్రిజ్‌, ఎ.సి., కార్లు, బ్యాంకు బ్యాలెన్సు ఇవన్నీ హోదా చిహ్నాలు. ఇవి లేకుండా నీకు సమాజంలో గుర్తింపు , గౌరవం లేదు. మనిషిగా నీ శక్తి, కొనుగోలు శక్తి మాత్రమే. మనిషిగా నీ సంస్కృతి వస్తు సంస్కృతి మాత్రమే. అప్పుడే నీ విలువ, ప్రతిష్ట పెరుగుతాయి. వీటిని పలు ప్రచార మాద్యమాల ద్వారా ప్రచారం చేసింది. వీటన్నింటిని ప్రజల మెదళ్ళలోకి ఎక్కీఎక్కక ముందే ఐకియా, రిలయన్స్‌ మార్ట్‌, వాల్‌మార్ట్‌ లాంటి విదేశీ, స్వదేశీ మార్ట్‌లు ప్రవేశించి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇవన్నీ చిల్లర వ్యాపారస్థులను దెబ్బతీస్తున్నాయి.

మనిషికంటే నిర్జీవమైన డబ్బే ప్రధానమైన ఆర్థిక ప్రయోజనవాదం వల్ల సమాజంలో అమానవీకరణ (డీ హ్యూమనైజేషన్‌) జరుగుతోందని గుర్తించారు సామాజిక వేత్తలు. దీంతో ప్రేమ, శ్రమ మొదలైన ప్రాథమిక జీవన ప్రాతిపదికలుగా ఉన్న విలువలు కోల్పోతాయి. మనుషుల మధ్య మానవీయ సంబంధాలు వస్తు సంబంధాలుగా మారిపోతాయి. ఈ అమానవీకరణే నేడు సమాజంలో పరాయీకరణకు నేపథ్యం. సమూహంలో ఒంటరితనం, తన్ను తాను వంచించుకోవడం, అసంబద్ధత మొదలైనవి పరాయితనానికి అనేక ముఖాలు.

సోషలిజంపై వ్యతిరేక భావజాలాన్ని రచయితలు పోస్టుమోడ్రనిజం (ఆధునికానంతరవాదం) ముందుకు తీసుకొచ్చారు. ఇది అనేక అస్తిత్వవాద ఉద్యమాలకు ఊపిరిపోసింది. దీనిలక్ష్యం ప్రపంచీకరణ వ్యతిరేకులను విచ్ఛిన్నం చెయ్యడమే. ఇది ప్రపంచీకరణ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడింది. ఈ అస్తిత్వ ఉద్యమాలు ఈ విషయంలో విజయం సాధించాయి. దానికితోడు మతవాదులు, మనువాదులు చెపుతున్న ఒకేదేశం - ఒకే సంస్కృతి నినాదానికి ప్రపంచీకరణ రుద్దిన సాంస్కృతిక ఉగ్రవాదం తోడయ్యింది.

మనువాదులు అధికారంలోకి రావడానికి మత విద్వేషాలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ప్రపంచీకరణ విధానాలను అంతకంటె ఎక్కువగా ముందుకు తీసుకెళుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి కూడా సిద్ధమయ్యారు. రాజ్యాంగం చెప్పే మౌలిక ప్రజాస్వామిక విలువలను ధ్వంసం చేస్తూ, మత విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ, రైతుల పోరాటాలను, విభజన రాజాకీయాలకు వ్యతిరేకంగా పోరాడేవారిని అణచివేస్తూ, కార్మికుల వెతలను నిర్లక్ష్యం చేయడమే గాక, వారి కోసం చట్టాలను రద్దుచేస్తూ అమెరికా పాలకుల పాదాల దగ్గర నిలుచుని వారి కరుణా కటాక్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

అభివృద్ధి పేరుతో సమాజంలో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. ఖనిజ ఉత్పత్తులకోసం అడవులను ఆక్రమిస్తున్నారు. పరిశ్రమల పేరుతో యురేనియం వంటి కాలుష్య కారక, వ్యాధి కారక పరిశ్రమలను స్థాపిస్తున్నాయి. ఇదంతా అభివృద్ధి పేరుతోనే జరుగుతోంది. ఇది  ప్రజల ఆరోగ్యంపై విపరీత ప్రభావం చూపుతోంది.

        ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గత 20 ఏళ్ళలో అనేక ఉద్యమాలు వచ్చాయి. 2000లో మాంట్రియల్‌లో, 2001లో జెనీవాలో ఉద్యమాలు వచ్చాయి. అమెరికాలో వాల్‌స్ట్రీట్‌ ఉద్యమం వచ్చింది. మరో ప్రపంచం సాధ్యమేనని ప్రపంచ సోషల్‌ ఫోరమ్‌, గ్రీన్‌పీస్‌ లాంటి సంస్థలు ఉద్యమాలు నడిపాయి. మనదేశంలో వందనాశివ, అరుంధతీ రాయ్ లాంటి రచయితలు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రపంచీకరణలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటీకరించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు బార్లా తెరుస్తూ దూకుడుగా ముందుకెళుతున్న నేటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఇటీవల రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండటం మనం గమనించవచ్చు. ప్రపంచీకరణకు నేడు ప్రతిదేశంలో ఏదో రకమైన ప్రతిఘటన ఎదురవుతూనే వుంది.

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర- 10

మొసలిగంటి రామాబాయమ్మ  తెలుగు పత్రికారంగ చరిత్రలో తొలి మహిళా సంపాదకురాలు. 1830 లలో తెలుగు పత్రికల ప్రచురణవృత్తాంతితో మొదలైంది. ఆ తరువాత అర్ధ శతాబ్దికి  సంస్కరణోద్యమ అవసరాలనుండి స్త్రీల కొరకు ప్రత్యేకంగా పత్రికలు రావటం మొదలైంది. దానికి ఆద్యుడు స్త్రీ విద్య గురించి తహతహ లాడిన  కందుకూరి వీరేశలింగం.  ‘స్త్రీలు చదువుటకు  తెలుగులో మంచి పుస్తకములు లేవని భావించి ఆలోపాన్ని తీర్చటానికి  ‘సతీహితబోధినిపత్రికను 1883లోప్రారంభించాడాయన.  ఆ తరువాత పది పన్నెండు ఏళ్లకు మరో మూడు పత్రికలు దానికి  జత కూడాయి. అవి తెలుగు జనానా పత్రిక, స్త్రీ హిత బోధిని , శ్రీబాలిక. కొత్త శతాబ్ది ప్రారంభం లో స్త్రీల కొరకు స్త్రీలచే నడపబడే పత్రికా సంప్రదాయానికి త్రోవలు చేస్తూ హిందూసుందరి పత్రిక 1902 ఏప్రిల్ లో మొదలైంది. దానికి సంపాదకురాలు మొసలిగంటి  రామాబాయమ్మ . ఆమెకు తోడు వెంపలి శాంతాబాయి. 

అసలీ పత్రిక ప్రారంభకులు సత్తిరాజు సీతారామయ్య. ఏలూరు నుండి స్త్రీల ప్రయోజానాపేక్షతో ఆయన ఈ పత్రికను ప్రచురించసాగాడు.  1903 డిసెంబర్ వరకు ఆయనే సంపాదకుడు. కానీ స్త్రీల కొరకు నడపబడే పత్రికకు స్త్రీలే సంపాదకత్వం వహించటం సముచితం అన్నది తొలి నుండి ఆయన అభిప్రాయం. పత్రికను ఒక కాంతామణి ఆధిపత్యం కింద ప్రచురించాలన్న ప్రయత్నం ఫలించకపోవటమే కాదు, కనీసం ఒకళ్ళిద్దరు స్త్రీల రచనలైనా పత్రికలో ప్రచురించే అవకాశం కొంతకాలం వరకు రాలేదు అని డిసెంబర్  1903,  హిందూసుందరి  సంపాదకీయంలో చెప్పాడు ఆయన. రెండేళ్ల కాలంలో హిందూసుందరికి వ్రాసే స్త్రీలు ముప్ఫయి మందివరకు పెరిగారని పేర్కొంటూ ఇన్నాళ్లకు సంపాదకత్వ బాధ్యత తీసుకొనటానికి  మొసలిగంటి రామా బాయమ్మ, వెంపలి శాంతాబాయి అంగీకరించారని హర్షం ప్రకటించాడు. ఆ రకంగా  హిందూసుందరికి మొసలిగంటి రామాబాయమ్మ  ఆ సంచికనుండే సంపాదకురాలు. అంతవరకు పత్రికాధిపతి అన్న హోదాను ప్రకటిస్తూ వ్రాసిన సీతారామయ్యస్వవిషయముఅనే శీర్షికతో వ్రాసిన  ఈ సంపాదకీయం లో ఇక తనది  కార్యనిర్వాహకుడి  హోదా అని ప్రకటించుకొనటం, ఈ సంచికలోనే సంపాదకత్వ బాధ్యతను స్వీకరిస్తూ మొసలిగంటి రామాబాయమ్మ, వెంపలి శాంతాబాయి కలిసి చేసినవిజ్ఞాపనము’ ‘పత్రికాధిపతులుఅన్న హోదా తో ప్రచురించబడటం దానినే నిర్ధరిస్తాయి.   

ఈ సంపాదకీయం లోనే ఆడవాళ్లు సంపాదకత్వ బాధ్యతలు తీసుకొనటంలో ఎదురయ్యే ఒక సమస్యను ప్రస్తావించి దానిని సీతారామయ్య పరిష్కరించిన తీరు ఆసక్తికరంగా కనబడుతుంది. స్త్రీలు నిలకడగా ఒకగ్రామంలో వుండరు. కొంతకాలం అత్తగారింట్లో వుంటారు. పుట్టిళ్లకు వెళుతుంటారు అని  చెప్పి అందువల్ల సంపాదకులకు ప్రత్యేకంగా వ్రాయదలచిన వాళ్ళు, చందాలు పంపే వాళ్లు ఏలూరులోని పత్రికా కార్యాలయానికే వ్రాయాలని, ప్రత్యేకంగా సంపాదకులే జవాబు ఇయ్యవలసిన లేఖలను వాళ్లకు పంపటం జరుగుతుందని ఒక ఏర్పాటు చేసాడాయన. స్త్రీలపేరుమీద ఉత్తరాలు రావటమే విడ్డూరం అయిన ఆకాలంలో  తాము పత్రికలకు వ్రాస్తున్నామని తెలియటం తమ గ్రామాలలో  విమర్శకు ,హేళనకు కారణం అవుతుందన్న జంకుతో  స్త్రీలుఒక సోదరివంటి సర్వ నామాలతోనో, మారు పేర్లతోనో వ్రాస్తున్న వంద సంవత్సరాల వెనుకటి కాలపు సామాజిక స్థితిలో  ఇలాంటి ఏర్పాటు అవసరమై ఉంటుంది. 

మొసలిగంటి రామాబాయి, వెంపలి శాంతాబాయి వ్రాసిన విజ్ఞాపనము లో కూడా   ఆడవాళ్లు కుటుంబ పరిధి దాటి సామాజిక రంగాలలోకి  ప్రవేశించటానికి ఉన్న ఇలాంటి అవరోధాల గురించిన  ప్రస్తావన వుంది. పత్రికాధిపతులు మగవాళ్ళు కావటం వల్ల భర్తల అనుజ్ఞ లేక పత్రికలకు వ్రాయటానికి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటానికి స్త్రీలు సందేహిస్తున్నారని - ఇటువంటి పరిస్థితులలో స్త్రీలు పత్రికాధిపతులుగా ఉంటే జంకు విడిచి  రచనలు చేసి పత్రికలకు పంపటానికి వీలవుతుందని సీతారామయ్య తమను పత్రికా సంపాదకత్వానికి అంగీకరింపచేశారని సంపాదక ద్వయం పేర్కొన్నారు.మేమెల్ల కాల మొక్కచో నుండు వారము గాముఅని చెప్పి పత్రికకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఏలూరులోని పత్రికా కార్యాలయం ద్వారానే జరుగుతాయని చెప్పటం - స్త్రీల  చిరునామాలను అందరికీ తెలిసేలా బహిర్గత పరచటం అనైతికం అన్న విలువ పొందిన  సామాజిక సమ్మతి ఫలితమే అయివుంటుంది.  

1902 నాటికే రచనలు చేసి పత్రికలలో ప్రచురిస్తూ, 1904 నుండి హిందూసుందరి పత్రికకు సంపాదకురాలిగా ఉంటూ వచ్చిన మొసలిగంటి రామాబాయమ్మ గురించి కూడా  పెద్దగా  సమాచారం లేదు. ఆమెను సంపాదకురాలిగా పరిచయం చేస్తూ సీతారామయ్య వ్రాసిన స్వవిషయము ఒక్కటే ఇప్పటికి ఆమె వ్యక్తిగత జీవితం తెలుసుకొనటానికి ఆధారం. రాజాములోను, తరువాత చోడవరంలోను జిల్లా మునసబుగా ఉన్న నాభి రామమూర్తి   పంతులు ఆమె తండ్రి . అప్పటికే ఆమె మీరాబాయి మొదలైన గ్రంధాలను రచించింది. గ్రామంలో ఉన్నప్పటికీకుల స్త్రీలనుఅనేకులను  పోగుచేసి చదువు చెప్పింది. వాళ్ళ అభివృద్ధి కొరకు ఎనిమిది వందల గ్రంధాలతో లైబ్రరీని ఏర్పాటుచేసింది. సీతారామయ్య ఈ సంచారమిస్తూ పండిత రమాబాయి సరస్వతితో ఆమెను పోల్చాడు. 

మొసలిగంటి రామాబాయి రచనలు హిందూ సుందరి 1902 డిసెంబర్ సంచిక నుండి 1912 మార్చ్ సంచిక వరకు ఒకదశాబ్ద కాలం కనిపిస్తాయి. సమకాలపు సావిత్రి వంటి పత్రికలకు ఆమె వ్రాసినట్లు కనబడదు. ఆమె రచనలు ప్రక్రియా పరంగా నాలుగు రకాలు. 1. కీర్తనలు- మంగళ హారతులు 2. కవిత్వం 3. నాటిక 4. వ్యాసం. 

                                                1         

కీర్తనలైనా,మంగళ హారతులైనా పాడుకొనటానికి వీలయినవి. రామాబాయి వ్రాసిన కీర్తనలు ఎనిమిది.( హిందూసుందరి 1902 సెప్టెంబర్ & డిసెంబర్, 1903 ఏప్రిల్ & మే  1904 మే, జూన్ సంచికలు)  మంగళహారతులు రెండు( హిందూసుందరి,1904 ఫిబ్రవరి, మార్చి సంచికలు).పరమపురుష నన్ను బ్రోవ భారమేమిరా’  , ‘తరుణీమణులూ వినరేఅనే రెండు కీర్తనలు 1904 మే, జూన్ సంచికలు రెండింటిలో ప్రచురించబడినాయి.అది పొరపాటు కావచ్చు. ఆమె కీర్తించిన, హారతులు ఇచ్చిన భగవంతుడు సాకారుడు, సాలంకృతుడు, నిర్దిష్ట నామధారి కాదు. ఏకేశ్వరుడు,పరమాత్ముడు, రక్షకుడు, దేవదేవుడు..ఈ రకమైన సర్వనామాలతో సంబోధించబడిన దేవుడు.ఆనాటి సంస్కరణోద్యమంలో భాగంగా మత విషయికమైన కొత్త ఆలోచనలనుండి రూపొందిన బ్రహ్మసమాజ మతం లోని ఏకేశ్వరోపాసనను సూచించే మాటలు ఇవి. కాస్త అభ్యుదయ దృష్టి కలిగిన వాళ్ళు చాలావరకు  బ్రహ్మొపాసకులు అయినారు. భర్తల ఆదర్శాలు తమవిగా చేసుకోవలసిన స్త్రీలు ఆ ప్రభావంలోకి వెళ్ళటం  సహజంగా జరిగింది. కందుకూరి రాజ్యలక్ష్మమ్మ , కొటికలపూడి సీతమ్మ వంటివారు బ్రహ్మసమాజ మతావలంబకులై  స్త్రీల అభ్యుదయాన్ని కోరి ఏర్పాటు చేసిన  సమావేశాలలో చేసిన ప్రసంగాల ప్రభావం  దానికి తోడైంది. అటువంటి సమావేశాలలో పాడుకొనటానికి వీలుగా ఆనాడు కాస్త రాయగలిగిన శక్తి ఉన్నస్త్రీలు వ్రాసి నట్లుగానే రామాబాయమ్మ కూడా ఈ  కీర్తనలు, మంగళ హారతులు వ్రాసిందనుకోవచ్చు.

ఈమె కీర్తనలలో రెండు రకాలు కనిపిస్తాయి. ఒకటి  పాపాగ్నిలో కాలుతున్న తనను కాపాడమని ,గర్విష్టురాలిని కరుణతో బ్రోవమని, కష్టాలలో ఉన్నాను కరుణించమని స్వీయ విముక్తి కోసం భగవంతుడిని ప్రార్ధించేవి. రెండు -  సాటి  స్త్రీలను సంబోధిస్తూ  బ్రహ్మొ పాసనకు ప్రేరేపించేవి.దేవాదిదేవూనీ- ధ్యానించగావలెను... అక్కలారా మనమంతా మక్కువాతో’  అనిపరమాత్ముని దలచనట్టి పణతి జన్మమేలనేఅనిరక్షాకుని మీరు దీక్షతో వేడరేఅని స్త్రీలను హెచ్చరించేవి. స్త్రీలను ఉద్దేశించి వ్రాసిన కీర్తనలు పరమాత్ముని తలచని జన్మ చవిటి భూమి మీద విత్తనము వంటి చిన్నచిన్న ఉపమలతో  సాగాయి.  బంగారం మీద ఆశ , పరనింద వదులుకోవలసినవి అనే సందేశం కూడా వాటిలో కనిపిస్తుంది.సావిత్రిసీతామొదలగు- పూవుబోణుల  చెరితలు - సావధానాముగను జదివీ - సవినయముగా నుందామాఅని స్త్రీలకు ఒక ఆదర్శాన్ని ప్రబోధించటం కూడా ఈ కీర్తనల లక్ష్యం అయింది.   

పల్లవి, ఆ తరువాత  చిన్నచిన్న చరణాలతో కీర్తనను నిర్మించటం, చరణాలలో కొన్ని పదబంధాలను పునరుక్తి చేయటం ద్వారా సామూహిక గానానికి అనుకూలతను సాధించటం-పరమాత్ముని దలచనట్టి పణతి జన్మమేలనే’  వంటి కీర్తనలలో - కనిపించే  రామాబాయి రచనా పద్ధతి. ప్రతి కీర్తన ముగింపులో రాజాము వాసురాలైనట్టి దాస రామాంబను అని, కొన్ని చోట్ల రామాబాయిని అని  పేరు చెప్పుకొని కాపాడమని కోరటం చూస్తాం. ఇది ఆనాటి రచనా పద్ధతిగా రూఢి అయి కనిపిస్తుంది. 

మంగళ హారతులలోను పల్లవి ,చరణాలు యధాప్రకారమే. వీటిని కూడా స్వీయ నామాంకితం గానే వ్రాసింది. ఒక మంగళ హారతిలో మాత్రంవసుధ విజయపూర వాస రామాబాయిఅని చెప్పుకొన్నది. రాజాం శ్రీకాకుళం జిల్లాలోది.1904 మార్చ్ నాటికి  అక్కడినుండి విజయనగరానికి ఆమె మకాం మారిందో ఏమో తెలియదు. 

                                              2

మొసలిగంటి రామాబాయి హిందూసుందరి సంపాదకత్వ బాధ్యత స్వీకరించే నాటికే మీరాబాయి అనే పద్యకావ్యం వ్రాసినట్లు సత్తిరాజు సీతారామయ్య పేర్కొన్నాడు( డిసెంబర్ 1903). 1913 జనవరి సంచిక చివరి పేజీలలోహిందూసుందరి కార్యస్థానమున వెలకు దొరకు పుస్తకములవరుసలో ఇది కూడా ఉంది. వివరణాత్మక ప్రకటనను బట్టి అది 18 పుటల గ్రంథం . వెల రెండు అణాలు. అనుమానంతో భర్త వదిలివేయగా  అనేక  కష్టాలు పడిభక్తి మార్గంలో నడిచి, తన పాతివ్రత్యం లోకానికి వెల్లడి చేసి, తుదకు భర్త మెప్పును పొంది  మరణించిన మీరాబాయి అనే చిన్నదాని కథ ఇది అని,సులభ శైలిలో వ్రాయబడిన పద్యకావ్యం అని తెలుస్తున్నది.ప్రతిస్త్రీ చదవదగిన పుస్తకం అని ఆ ప్రకటన లో పేర్కొనటం స్త్రీలకు గమనం , గమ్యం అన్నీ పాతివ్రత్యమే అని చెప్పకనే చెప్తుంది.

దైవభక్తి అనే ద్విపద రచన మార్చ్ 1903 హిందూసుందరిలో ప్రకటించబడింది. మీరాబాయి కావ్యంలో భక్తిమార్గం స్త్రీలను ఉద్ధరించగల  సాధనమని చెప్పిన రామాబాయి ఇందులో ఆ దైవభక్తినే  స్త్రీలకు  బోధించింది.శ్రీకరంబుగ నాదు చెలులార వినుఁడి / మీకు నేనిదె యొక్క మేలెఱింగింతుఅని ప్రారంభించిన ఈ ద్విపదలో మానవ జన్మ ఎత్తినందుకు ఫలము పరమేశ్వరుని భక్తితో కొలచటమేనని, ఇంద్రియ వర్గాలను జయించటానికి బలం ఇమ్మని భగవంతుని వేడుకోవాలని, నోములు నోస్తూ కష్టాలు పడక స్వామిని స్తుతించాలని, ముందుగావర్తనమందు గల లోపములు సవరించుకోవాలనిమన మనంబులలోని మలినంబుపోగొట్టే గొప్ప ఔషధంఅనుతాపమేనని   చెప్పి సర్వ సమర్పణ బుద్ధితో భగవంతుడి కృప పొందాలని ప్రబోధించింది. పరులనిందలో పొద్దుపుచ్చటం మంచిది కాదని,భగవంతుడి దయను పొందటానికి  అవరోధం అవుతుం దన్న హెచ్చరిక కూడా ఇందులో వుంది. 

ఈశ్వర స్తుతి పది ఆటవెలది పద్యాలతో ఉన్న ఖండిక (1903, ఏప్రిల్ )తనను కాపాడమని భగవంతుడిని వేడుకొనటమే ఈ పద్యాలను కలిపే అంతఃసూత్రం. అబద్ధాలాడటం, పరనిందచేయటం దోషాలుగా చెప్పి దోషాలను బాపే దొరవు నీవు  కాపాడమని భగవంతుడిని వేడుకొంటుంది ఈపద్యాలలో. 

మొసలిగంటి రమాబాయి మరొక పద్య రచనఆర్తరక్షణ స్తబకము’.  ఆర్తరక్షణా అనేది భగవంతుడి గురించిన సంబోధన . ఆర్తరక్షణా అన్న సంబోధన మకుటంగా వ్రాసిన ముప్ఫయి పద్యాల ఖండిక ఇది. స్తబకము అంటే పూలగుత్తి . ఒక్కొక్క పద్యం ఒక పువ్వు . అవి ఉత్పలమాల ,చంపక మాల వృత్తాలలో ఉన్నాయి. ముప్ఫయి పద్యాలతో పూలగుత్తి తయారైంది. ఇందులోనూ భక్తే ప్రధానాంశం. ఏకైక అంశం. తనను కాపాడమని భగవంతుడితో చేసే సంభాషణ ఇదంతా. నయం, వినయం , చిరు బెదిరింపు ఇలా రకరకాల పోకడలు ఆ సంభాషణలో భాగం. వాక్చాతుర్యానికి నిదర్శనం. 

“ “వేమఱు ( గావ్యపంచకము వేడుకతో (బఠియింపలేదు ; నే / నో మహనీయ నీదయనె యొప్పుగ నమ్మి స్తుతింప బూనితిన్అనే పద్యంలో పంచకావ్యాలు చదవకుండానే  భగవంతుడి దయాలక్షణాన్ని నమ్ముకొని స్తుతించటం మొదలు పెట్టిన భక్తురాలి సవాల్ ఉంది. స్తుతించటం అంటే ఎవరో చేసిన స్తుతిని తిరిగి వల్లించటం కాదు, స్తుతి స్వయం సృజన. భక్తురాలి స్తుతి మనోహరంగా ఉంటే భగవంతుడి దయాప్రసారం జరుగుతుంది. భగవంతుడికి దయకలగలేదంటే స్తుతి శృతి సుభగంగా  లేదన్నమాట. లేదు అంటే అది భక్తుల పరాజయం. భక్తుల పరాజయం అంటే భగవంతుడి కరుణా లక్షణమే సందేహాస్పదం అవుతుంది. అందువల్ల తాను కరుణామయుడి అని నిరూపించుకోవలసిన బాధ్యత భగవంతుడిదే అవుతుంది. అది భక్తురాలిగా రామాబాయి తర్కం. 

తల్లీ తండ్రీ గురువు దాత నేత అందరూ నువ్వే అనుకున్నాను .. నామీద నీకు దయలేకపోవటం ఏమిటని మరొక పద్యంలో భగవంతుడిని నిలదీస్తుంది.చల్లనివాడవంచుసాధువులు నిన్ను స్తుతిస్తుంటే నిజమేనని నమ్మాను ..ఇట్లా అయిందేమిటి? అని భగవంతుడి  దయారాహిత్యం వేడిమిని సృష్టిస్తున్నదని వ్యంగ్య మానం చేసింది కవయిత్రి మరొక పద్యంలో. భగవంతుడి పద చింతన , భక్తుల సహవాసం, భూత దయ ,ఓర్పు, సత్యమునందు ప్రీతి ,పాపమునందు భీతి, పేదలను ఆదుకొనటం ఎప్పటికి తనపనులుగా ఉండాలన్న భక్తురాలి ఆకాంక్ష మరొక పద్యంలో వ్యక్తం అయింది.   

బాల్యం ఆటపాటలలోయవ్వనం మేలైన వస్తువులమీద ప్రీతితో గడిచిపోయాయని, ఇప్పుడు కాలు కదపలేని వృద్ధాప్యం  దాపురించిందని తనగతిని కానగలవాడు భగవంతుడు ఒక్కడే నని అంటుంది. ఇదే భావంతో  ఈశ్వర స్తుతి అనే ఖండికలోబాల్యమున నొకొంత పాడయ్యే కాలంబుఅనే   ఆటవెలది పద్యం వుంది. 

బాలికలాటలాడు తరి ( బంకము మేన (జెలంగ నింటికిన్ 

లీలగనేగు దేరఁగని నెయ్యము తోడుతఁ జేరఁ దీసి మై 

ధూళిని ( బాపు తల్లిగతిఁ దోషపు( బంకనిమగ్న నైనన 

న్నేలి  శుచిత్వమొంద నిడవే సుకృతానిధి ! యార్తరక్షణా”   స్త్రీ మాత్రమే వ్రాయగల పద్యం ఇది . దేవుడిని తల్లివి కమ్మని కోరుతున్నది కవయిత్రి. ఆటలాడి ఒళ్ళంత మట్టిగొట్టుకొని వచ్చే పిల్లలను తల్లి ఎలా నీళ్ళుపోసి పరిశుభ్రపరుస్తుందో అటువంటి హృదయం,ప్రేమ, సేవా భావాలతో భగవంతుడు తనభక్తుల లోని దోషాలను సహనంతో పోగొట్టి లాలించాలని కవి కామన.  భగవంతుడు  తనకు గమ్యం అయితే ఆ భగవంతుడికి ఆదర్శంగా తల్లిని నిలబెట్టింది. 

మొసలిగంటి రామాబాయి కీర్తనలు వ్రాసినా, మంగళహారతులు వ్రాసినా ద్విపద , ఆటవెలది వంటి దేశి ఛందస్సు లో వ్రాసినా ,వృత్తాలు వ్రాసినా అన్నీ దైవభక్తి కేంద్రకాలే. ఆధునికకాలపు భక్త కవిగా ఆమెను పేర్కొనవచ్చు . 

                                               3

కవిత్వం భక్తి ప్రధానం అయినా మొసలిగంటి రామాబాయి వ్రాసిననగలుఅనే నాటిక ( హిందూసుందరి, అక్టోబర్- నవంబర్ 1904) పూర్తిగా లౌకిక జీవితానికి సంబంధించినది. స్త్రీలకు నగల మీద మోజు ఎక్కువ అని, బంధువులలోనో, ఇరుగు పొరుగులోనో ఎవరో ఏవో నగలు చేయించుకున్నారని చెప్తూ తమకు కూడా  చేయించమని  భర్తలను వేధిస్తుంటారని స్త్రీలపై ఒక దోషగుణాన్నిఆరోపించి తప్పుపట్టటం చాలా పాతదే . అయితే సంస్కరణోద్యమంలో స్త్రీ విద్య కీలకాంశం అయినాక స్త్రీలకు  అసలైన అలంకారం విద్యే కానీ నగలు కావని ప్రబోధించే పని చాలానే జరిగింది.స్వయంగా బండారు అచ్చమాంబ వంటివారు ఆవిషయం వస్తువుగా కథలు వ్రాసారు.చదువు కొంటూ సమాజం వైపు చూపు ప్రసరించే కొద్దీ స్త్రీలలో నగల మీద మోజు తగ్గుతుందని భావించారు. ఆ సామాజిక సందర్భం లో వచ్చిన నాటిక నగలు. సుబ్బలక్ష్మి, వెంకట లక్ష్మమ్మ, సీతమ్మ, రాజేశ్వరమ్మ- ఈ నలుగురి మధ్య సంభాషణ సాగుతుంది ఈ రచన. స్థలం సుబ్బలక్ష్మి ఇల్లు. రంగము రామారావు గారి గృహము అనిప్రారంభంలో సూచించబడింది. పాత్రగా అతనికి దృశ్యంలోకి ప్రవేశమే లేదు. అయినా ఇళ్లెప్పుడూ మగవాళ్లపేరు మీదనే ఉండటం, మగవాళ్ల పేరుతోనే చెప్పబడటం సంప్రదాయంగా వస్తున్న సమాజంలోని వ్యక్తిగా రామాబాయి నాటిక తో ఏ సంబంధంలేని,సంభాషణలో ప్రస్తావన కూడా లేని ఇంటి యజమానిగా చెప్పబడే  మగవాడి పేరుతోనే కథాస్థలాన్ని సూచించవలసి వచ్చింది. 

ఆ ఇంట  కూడిన నలుగురు స్త్రీల సంభాషణకు విషయం నగలు. ఎవరు ఏకొత్త నగలు పెట్టుకొన్నారు? నగల మోటుతనం,నాజూకుతనం, నగలు ధరించటంలో సంప్రదాయ ఆధునిక దృష్టిభేదాలు, నగలు చేయించుకొనటంలో జరిగే మోసాలు ఇలాంటి చాలా విషయాలు చర్చకు వచ్చాయి. వంకీలు, కడియాలు,పాంజెబులు వంటి కాళ్ళకు పెట్టుకొనే మూడు రకాల ఆభరణాలు,పులిచేరు , నాను జిగినీ , సాదానా , దండకాడియాలు చెవుల బొగడలు, జల్లి బావిలీలు, జూకాలు, రవలకమ్మలు, కెంపులు,ముత్యాలు పొదిగిన ముక్కు పుడకలు,మెడలో ధరించే రవ్వల అడ్డిగ, కంటె, కాసుల పేరు, మురుగులు,పుదిచేరి గొలుసులు, గజ్జలఒడ్డాణంఇలా ఆకాలపు నగల ప్రస్తావన వాళ్ళ సంభాషణలో అలవోకగా వస్తుంటుంది. ఈ నగల  ప్రస్తావన వాళ్లంతా ఎంత సంపన్నవర్గాలకు చెందినవాళ్ళో సూచిస్తుంది. సంస్కరణోద్యమం అగ్రవర్ణ , సంపన్న వర్గాల స్త్రీలది మాత్రమే అనటంలో కొంత వాస్తవికత లేకపోలేదు అని కూడా అనిపిస్తుంది.

సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చిన వెంకట లక్ష్మమ్మ, సీతమ్మ ఒక ఈడువాళ్లుగా    కనబడతారు.వాళ్ళుఒకరినొకరు వదినా అని సంబోధించుకొంటారు. సుబ్బలక్ష్మి వెంకట లక్ష్మమ్మను పిన్నిగారు అనీ, సీతమ్మను అత్త అనిసంబోధించి చెబుతుంది.సుబ్బలక్ష్మి రాజేశ్వరి ఒకరినొకరు  వదిన వరుస  పిలుపు ఉన్నవాళ్ళు. 

పెద్దకాలపు నగలు , నవనాగరికుల నగలు  అని నగలను వేర్పాటు చేసి చెప్పే కొత్త కాలాన్నిఇందులో చూస్తాం.  నగల విలువను నిర్ధారించే వస్తుగత అభిరుచుల ప్రమేయం కూడా మన దృష్టికి   వస్తుంది. ఒకరికి బాగుందనిపించిన నగ మరొకరికి నాగరికం కాదు.   చక్కగా అలంకరించుకొనటం, నాగరికంగా అలంకరించుకొనటం అంటే వాళ్ళ దృష్టిలో చెవులకు రవ్వల కమ్మలు, ముక్కుకు కెంపు ముక్కుపుడక, చేతులకు మురుగులు ,పుది చేరి గొలుసులు,    దండలకు వంకీలు, మొలకు గజ్జల ఒడ్డాణం ,కాలికి ఒక  గొలుసు  తప్ప చీకిరి బాకీరి నగలు ఒళ్ళంతా  తీపులెత్తేలాగా పెట్టుకోక పోవటమే.  రాజేశ్వరి కిసుబ్బలక్ష్మికి  ఇది  ఆమోదయోగ్యమైన అలంకరణ రీతి. అయితే రాజేశ్వరి స్వయంగా కాళ్లకు అలంకరించుకున్న మూడువందల రూపాయలు విలువచేసే మూడు రకాల ఆభరణాల ను ఉద్దేశించి  మూడు సంకెళ్లు లాగా ఉన్న ఆయా నగలు నువ్వెట్లా ధరించావని  ప్రశ్నిస్తుంది  సుబ్బలక్ష్మి . అమ్మమ్మ చేయించి బలవంతాన పెట్టించిందని ఇవి పెట్టుకోకపోతే మరె నగలు ఇయ్యనని భయపెట్టిందని చెబుతుంది. శరీరానికి బరువనిపించి నొప్పి కలిగించే  అలంకారం స్త్రీల కదలికకు అవరోధం అవుతుందన్న స్పృహ సుబ్బలక్ష్మి కి ఉండాటాన్ని చూస్తాం . అలంకారం సంకెలగా మారితే వాటిని వదులుకొనటం మినహా మార్గం లేదు. 

నగల అలంకారం గురించిన మరింత అభివృద్ధికరమైన ఆలోచన, ఆచరణ  ఉందని చెప్పటానికి చిన్నమ్మ ప్రస్తావన పనికి వచ్చింది. చిన్నమ్మ మహారాజు వంటి తండ్రికి కూతురు. అంతకంటే అధికుడైన మామగారికి కోడలు. అయినా ఆమె ఒంటి మీద ఒక్క నగనైనా ధరించదు. ఆమె  చదువుకున్నది . స్త్రీకి సుగుణములే భూషణములు అన్న ఎరుక పొందింది. నగలకు పాడుచేసే డబ్బు బ్యాంకులో పెట్టి వడ్డీతో అనాధలకు ఉపయోగపడే పనులు చేయవచ్చు అన్నది ఆమె అభిప్రాయం. ఆమెను గురించి కొంత తిరస్కారంగా మాట్లాడుకున్న వాళ్ళందరూ నగలు చేయించుకొనే క్రమంలో చేతకూలీ కింద , తరుగు కింద కోల్పోతున్న దాని గురించిన వాస్తవ అనుభవాల నుండి చిన్నమ్మ మార్గం అనుసరించదగినదే అన్నఒక స్థూల అవగాహనకు రావటంతో నాటిక ముగుస్తుంది. వ్యాహారిక వచనం చక్కగా అమరింది ఈరచనకు.

                                             4

    మొసలిగంటి రామాబాయి వ్రాసిన  వ్యాసాలు ఏడు లభిస్తున్నాయి. ఐకమత్యం , ప్రేమ మొదలైన విలువల బోధన  సంస్కరణోద్యమంలో ప్రాముఖ్యాన్ని సంతరించు కొన్నది. సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్నప్పుడు దానికి అనుకూలంగా జనాభి ప్రాయాన్ని కూడగట్టటం , జనాన్ని ఒక లక్ష్యం దిశగా సమీకరించటం అవసరమైనప్పుడు ఐకమత్యం , ప్రేమ మనుషులను కలిపే సూత్రాలుగా ముందుకు వచ్చాయి. వీరేశలింగం పంతులు కూడా ఇలాంటి విషయాలమీద వ్రాసాడు. స్త్రీల అభ్యుదయంకోసం  ప్రారంభమైన సంస్కరణ ఉద్యమంలోకి  స్త్రీలు వస్తున్న క్రమంలో స్త్రీల లో ఐకమత్యాన్ని   ప్రేమను ప్రబోధిస్తూ స్త్రీలే వ్రాయటం మొదలుపెట్టారు. అలా మొసలిగంటి రామాబాయి  కూడా వ్రాసింది. 

ఐకమత్యము అనే వ్యాసంలో  (హిందూసుందరి నవంబర్ 1903) అనేకమంది స్నేహభావంతో ఒక చోట చేరివిదుషీ రత్నములచే  రచియింపబడిన సద్గ్రంధములను’ , పురుషపుంగవులచే రచింప బడిన పాతివృత్తాల చారిత్రములను , భగవన్నామామృత పూరితములగు స్తోత్రములను మన శ్రేయోభివృద్ధుల కనుకూలమైన వ్యాసములనుచదువుకొనటం వలన దురభిమానాలు తొలగిపోయి ఐకమత్యబీజం హృదయ క్షేత్రాలలో నాటుకొంటుందని ఆమె భావించింది . సంఘముగా ఏర్పడి ఐకమత్యం తో పనిచేయటం గురించి చెప్పింది.  

అలాగే ఆమె ప్రేమ గురించి వ్రాస్తూ( ఫిబ్రవరి1904) ప్రేమ స్వార్ధం , పరార్ధం అని రెండురకాలని   ఎప్పుడూ తన మేలు మీదనే దృష్టిపెట్టటం స్వార్ధ ప్రేమ లక్షణమని, ఇతరులమేలుకోరే స్వభావంకలది పరార్ధ ప్రేమ అని వివరించింది. వీరేశలింగం  వంటివాళ్ళు పరార్ధప్రేమకు నిదర్శనం అని స్త్రీలకు ఆదర్శంగా చూపింది. సంఘ దురా చారాలను నిర్మూలించటానికి స్త్రీలలో ఐకమత్యం ప్రబలాలి అని పురుషులు ఎంతఘోషిస్తున్నా స్త్రీలు చొరవ చూపక విని ఊరుకొనటం స్వార్థపరత్వం వల్లనే అని అభిప్రాయపడింది. స్వార్ధం వదులుకొని విదేశీవాసులు కూడా భారతదేశానికి వచ్చి పనిచేస్తుంటే దేశీయ  స్త్రీలు అలంకారాల గురించి మురుసుకొంటూ కూర్చొనటం భావ్యం కాదని చెప్పింది. నేను, నాయిల్లు, నావారు అని ప్రేమ ఎలా చూపిస్తామో అలా నాదేశము, నా ప్రజ, నా సోదరి అని భావించి దుర్దశల పాలవుతున్న వారిని ఉద్ధరించటానికి పూనుకోవాలని స్త్రీలకు హితవు చెప్పింది. స్వార్ధం విడనాడి ఆ స్థానంలో పవిత్రమగు ప్రేమలతను నాటండి అని తోటి స్త్రీలకు పిలుపు ఇచ్చింది. 

స్త్రీ విద్యా ఉద్యమం, పునర్వివాహా ఉద్యమం నెత్తికెత్తుకొని వీరేశలింగం పంతులు వ్యతిరేకి వర్గ వాదనలను తిప్పికొట్టటానికి వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్తాలు, పురాణేతిహాసాల నుండి ఉపపత్తులు చూపిస్తూ ఉపన్యాసాలు వ్రాసాడు.వ్యాసాలు ప్రచురించాడు. ఆమార్గంలో మొసలిగంటి రామాబాయి చేసిన ఒకప్రయత్నంపూర్వకాలపు హిందూ స్త్రీల స్థితిఅనే శీర్షికతో 1904 హిందూసుందరి పత్రిక ఆగస్టు సెప్టెంబర్ సంచికలలో ప్రచురించబడింది. స్వదేశీయ సోదరీమణుల ను సంబోధిస్తూ ఆమె ఈ వ్యాసం వ్రాసింది. సంస్కరణలు ఏవి చేయాలని ఎవరు ముందుకువచ్చినా ఆచారవిరుద్ధం, శాస్త్ర విరుద్ధం అంటూ అడ్డుపడే వాళ్ళను ప్రస్తావిస్తూ స్త్రీవిద్య శాస్త్ర విరుద్ధం అనే వాళ్లకు సమాధానంగా కృత త్రేతా ద్వాపర యుగాలనుండే విద్యనేర్చిన స్త్రీలు ఉన్నారని ఉదాహరణపూర్వకంగా  నిరూపించటానికి ఇది వ్రాసిందామె. 

బృహదారణ్యకోపనిషత్తు లో గార్గి చెప్పిన దానిని ఉటంకిస్తూ స్త్రీలు వేదవేదాంగాలను సాంగం గా చదివారని పేర్కొన్నది. భాగవతం నుండి దేవహూతి వృత్తాంతాన్ని వివరిస్తూ దేవహూతి , సీతారామాంజనేయ సంవాదము లోని పద్యాన్ని ఉటంకిస్తూ సీత , భారతం అరణ్య పర్వంలో సత్యభామకు ధర్మోపదేశం చేసిన ద్రౌపది, భారతంలోనే  దుష్యంతునితో  వాదించి సభాస్థలాలో ధర్మచర్చ చేసిన శకుంతల   విద్యావంతులు, తత్వవేత్తలు అని నిర్ధారించి చెప్పింది. భారతంలో ఉత్తర, భాగవతంలో చిత్రరేఖ ల గురించి ప్రస్తావిస్తూ స్త్రీలు నాట్యం , చిత్రలేఖనం మొదలైన కళల్లో ప్రాచీనకాలంలో సాధించిన ప్రగతిని ప్రశంసించింది. గణిత శాస్త్ర ప్రవీణురాలైన లీలావతిని , ఆది శంకరుడితో వాదించి నిలిచిన సరసవాణిని , ఖగోళ విద్య లోప్రవీణురాలైన ఖానా ను, విద్వాంసులతో వాదించి మెప్పు పొందిన నాచిని ప్రస్తావించి ప్రాచీనకాలపు స్త్రీల విద్యా ఔన్నత్యాలను గుర్తుకు చేసింది. తెలుగులో మొల్ల, తరిగొండవెంగమాంబ , మదిన సుభద్రమ్మ, మొదలైన వారిని పేర్కొని  సాహిత్య సృజన రంగంలో స్త్రీల కృషిని గుర్తుచేసింది. విద్యాజ్ఞానరంగాలలో ఘనమైన చరిత్ర గల స్త్రీలు దానిని పునరుద్ధరించటానికి  బద్ధకంకణులై ఉన్న పురుషులకు చేదోడు వాదోడు కావాలని పిలుపు ఇచ్చింది. సాహిత్యచరిత్ర  వ్యాసంగా సాగిన ఈ రచన మొసలిగంటి రామాబాయి అధ్యయనానికి, పరిజ్ఞానానికి నిదర్శనం. 

రజస్వలానంతర వివాహాల గురించి రామాబాయి వ్రాసిన వ్యాసం ( 1912 మార్చ్ , హిందూ సుందరి) ఒకటి ఉంది.అమెరికా నుండి వచ్చి బరోడా, మైసూరు, బెంగుళూరు, చెన్నపురి కలకత్తా మొదలైన చోట్ల వివాహ సంస్కరణ శాఖలు నెలకొల్పిన  స్త్రీ విద్యాభిలాషి, వివాహ సంస్కరణాభిలాషి అయిన (మిస్ సి ఏ) టెన్నెంట్ దొరసాని   అభిప్రాయాలతో ఏకీభవిస్తూ తాను ఈ వ్యాసం వ్రాస్తున్నట్లు చెప్పుకొన్నారామె. ఇది ఆమె జాతీయస్థాయి విషయావగాహనను సూచిస్తుంది.అన్యభాషల నుండి జ్ఞ్ఞాన విషయాలు తెలుసుకోగల చొరవను తెలియపరుస్తుంది. 

రజస్వల  కాకముందే ఆడపిల్లకు పెళ్ళిచేయాలని , లేకపోతే మేనమామల కు దోషం అని ఇలాంటివి ఏవేవో కల్పించిన కాలం అది. ముఖ్యంగా బ్రాహ్మణులలో ఈ ఆచారం ఉంది. మొత్తం మీద బాల్య వివాహాలు విరివిగా జరుగుతున్న కాలం అది. బాల్య వివాహాలు స్త్రీవిద్యకు ,ఆరోగ్యానికి అవరోధంగా ఉన్నాయని, బాల వితంతువుల సమస్యకు అదే కారణమని గుర్తించటం వల్ల వివాహ సంస్కరణల అవసరం ఏర్పడింది. ఆ సందర్భంలో రజస్వలానంతర వివాహాలను సమర్ధిస్తూ మొసలిగంటి రామాబాయమ్మ ఈ వ్యాసం వ్రాసింది. బాల్యవివాహాలు స్త్రీ విద్యా వినాశకారులని చెప్తూ ,అవి స్త్రీలనే కాదు ప్రపంచాన్నంతా పాడుచేసి వదిలాయి అంటుంది. లేతవయసు కాపురాలు దేహమనోబలాలు లేని ప్రజను ఉత్పత్తిచేయటానికి కారణం అవుతున్నదని పేర్కొన్నది వినోదం కోసమో ,తప్పనిసరి అనో చేసేవివాహాలు రోగభూయిష్టమైన సంతానానికి ,లేదా స్త్రీల అకాల మృత్యువుకు కారణం అవుతున్నాయని వాపోయింది. కూతుళ్ళ సుఖం కోరేవారు బాల్య వివాహ రాక్షసిని తరిమివేయవలసినదే అనినొక్కి చెప్పింది. శ్రుతిస్మృతి పురాణేతిహాసాలు ఎక్కడా బాల్య వివాహాలను చెప్పలేదని, రుగ్వేదంలోనికొన్ని మంత్రాలను, కొందరి చరిత్రలను బట్టి, ఆపస్తంబ సూత్రాలను బట్టి   స్త్రీలు యుక్త వయస్కులై అనుకూలుడైన వరుని ఎన్నుకొనే అవకాశం ఉందని ఉదాహారణలతో ఉటంకింపులతో వివరించింది.   

ఆటపాటల కాలంలో  ఆడపిల్లల మెడలకు మంగళసూత్రాలు అనే గుదిబండలను కట్టవద్దని వేడుకొన్నది. వండటం , తినటం, పడుకొనటం ,బిడ్డలనుగనటమే స్త్రీల జీవిత పరమార్ధం కానీయరాదని, విద్యను అభ్యసించటానికి, లోకోపకార చింతను అభివృద్ధి పరచుకొనటానికి అవకాశం కల్పించాలని చెప్పింది. సంపూర్ణ బలానికి వెలియై రోగభూయిష్ట మైనజీవితం గడపవలసిన దౌర్భాగ్యం నుండి ఆడపిల్లలను కాపాడు కొనవలెనని కోరింది.  మగవాళ్ళు ప్రారంభించిన ఉద్యమానికి స్త్రీలు  సహాయభూతులుగా  లేకపోతే వివాహ సంస్కరణలు సాధ్యంకావని చెప్పి యుక్త వయస్కురాలగువరకు మా బిడ్డలకు వివాహము చేయమని మనందరం బద్ధ కంకణులం కావాలని  కోరింది.  

 బిడ్డ అభివృద్ధిలో మాతయే కార్యదర్శి అనిచెప్తూ స్త్రీ అంటేనవమాసాలు బిడ్డలను మోయు తోలుసంచికాదని గ్రహించాలని,రజస్వల అయిన పిల్లకు వరుడు దొరకడని భయపడనవసరం లేదని చెప్తూఅక్రమ వివాహాలతో ఆయుష్కాలం అంతా విధవగానో, రోగిగానోజీవితం గడపటం కన్నాయావజ్జీవం బ్రహ్మ్మచారిణి గా ఉండటంలో చెడిపోయేది ఏమీ లేదని అనటంలో  తీవ్రత గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు.

హిందూ సుందరి సంపాదకురాలిగా రామాబాయి వ్రాసిన వ్యాసం ఒకటే కనబడుతున్నది.1911 సెప్టెంబర్ హిందూ సుందరి ముఖచిత్రం గురించిన వివరణ అది. ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఛాయాచిత్రం లో పెద్దమ్మాయి లలితాబాయి విద్యావతి, సంఘ సంస్కరణ ఉద్యమాభిమాని. ఉపన్యాసకురాలు. రెండవఅమ్మాయి రాధాబాయి అక్కవలెనె కళాశాల ప్రధమశాస్త్ర  పరీక్షలో కృతార్థురాలై ప్రెసిడెన్సీ కాలేజీలో పట్టపరీక్షకు చదువుకున్నది.మంచి వక్త. మూడవ అమ్మాయి శాంతాబాయి హైస్కూల్ లోచదువు కొంటున్నది.మంగుళూరులో న్యాయవాది, ‘హీనజాతుల మిషన్కార్యదర్శి అయిన కుడ్మల్ రంగారావు కూతుళ్లు అని పరిచయంచేసింది. విద్యావంతులైన స్త్రీల చిత్రాలను ప్రచురించటం  ద్వారా స్త్రీవిద్యా వ్యాప్తికి ప్రోత్సాహం ఇయ్యటం ఆనాటి స్త్రీలపత్రికల ప్రధాన లక్ష్యంగా ఉండేది.అందులో భాగమే ఈ ముఖచిత్ర ప్రచురణ,పరిచయం. ఈ ముఖచిత్ర ప్రచురణకు అచ్చుదిమ్మను అరువు ఇచ్చిన ఇండియన్ మేగజీన్ సంపాదకురాలగు సత్యనాధమ్మకు కృతజ్ఞతలు వ్యాసం ప్రారంభంలోనే చెప్పబడింది. స్త్రీలు సంపాదకులుగా స్త్రీల కొరకు పత్రికలు అన్నిభాషల లోను నిర్వహించబడుతున్న ఆ కాలం గురించిన ఒక అవగాహనను కలిగిస్తుందీ  సమాచారం. అంతేకాదు ఆమె పేర్కొన్న ఆ సత్యనాధమ్మ ఇంగ్లీషులో నవల వ్రాసిన తొలి భారతీయురాలు కూడా.

మొసలిగంటి రామాబాయమ్మ  హిందూ సుందరి సంపాదకత్వం 1913 మార్చిలో ఆ పత్రికను  కాకినాడలో స్త్రీవిద్యాభివర్ధనీ సమాజం వారికి ఇచ్చివేసేవరకు రామాబాయమ్మ సంపాదకురాలు. ఆతరువాత రామాబాయమ్మ ఏమిచేసింది? ఏమివ్రాసింది ? అంటే అది చరిత్ర శిధిలాలలో ఎక్కడో  మరుగు పడిన విషయం. 

---------------------------------------------------------------------------------------- 

  

 

 

సాహిత్య వ్యాసాలు

ఆచార్య సి.ఆనందారామం సంస్మరణలో... 

‘నీవు ఏదైతే ఆదర్శం అనుకుంటావో దాని ప్రకారం నువ్వు బ్రతకగలిగితే అదే నీ విజయంఅంటుంది’ ఆచార్యసి. ఆనందారామం. (You Tube – i Dream Telugu Movies - AksharaYaatra - Interview)తన జీవితం తొలినాళ్లలో అలాంటి పరిస్థితులు తనకు ఎదురుకాలేదని, తనలో తాను ఘర్షణపడుతూ, వాటిని కథావస్తువులుగా తీసుకొని రచనలు చేసానని అంటుంది. కానీ ఇపుడు పరిస్థితులు మారాయని ఈనాటి మహిళ తాను అనుకున్న విధంగా జీవిస్తుందని సంతోషపడింది.

ఆనందారామం అసలు పేరు ఆనందలక్ష్మి. గోపాలమ్మ, ముడుంబై రంగాచార్య దంపతులకు పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో 1935 ఆగస్ట్ 20వ తేదీన జన్మించింది.అక్కడే ప్రాథమికవిద్యను అభ్యసించింది. ఇంటర్, డిగ్రీ పూర్తయ్యాక 1957లో చిలకమర్రి రామాచార్యులుతో వివాహం జరిగింది. తన చిరునామా హైద్రాబాదుకు మారింది.  ఉస్మానియావిశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు పూర్తి చేసింది.  డా.సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో " తెలుగు నవలల్లో కుటుంబ జీవన చిత్రణ " అనే అంశంపై పరిశోధన చేసి Ph.D.పట్టా పొందింది. 1972లోకేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేరి 2000లో పదవీ విరమణ చేసింది.

అధ్యాపకురాలిగా, రచయిత్రిగా, విమర్శకురాలిగా ప్రసిద్ధులైన ఆనందారామం తపస్వి, ఇంద్రసింహాసనం, శారద, ఆనందనిలయం, స్వాతిజల్లు, తుఫాను, తపస్వి, నిశ్శబ్దసంగీతం, వర్చస్సుమొదలైన అరవై నవలలనూ, ఎన్నెన్నోకాంప్లెక్సస్, డోలిక, దశావతారాలు, పోనీ నేను వ్రాసిపెట్టనా! అనే కథాసంపుటాలను, వందకుపైగా కథలను రాసింది.

తెలుగు నవలావిమర్శ, సాహిత్యమునవలాప్రక్రియ, సమాజసాహిత్యాలు, తులనాత్మక సాహిత్యం - నవలాప్రక్రియ: వ్యవస్థాగత దృక్పథం అనే విమర్శగ్రంథాలను రాసింది.

ఈమె రాసిన జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతలకోవెల నవలను జ్యోతి సినిమాగా తీశారు. ఆత్మబలి అనే నవల సంసారబంధం సినిమాగా వచ్చింది. అదే నవల జీవనతరంగాలు టి.వి.సీరియల్లా కూడా వచ్చింది. తన నవలలోని పేర్లన్నీ(సౌందర్య, వామన విక్రమార్కుడు మొదలైన) ప్రతీకాత్మకంగా పెడుతుంది రచయిత్రి.

ప్రాచీన సాహిత్యగ్రంథాలను చదవడమేకాకుండా వాటిని తిరిగి ఆధునికప్రక్రియల ద్వారా పాఠకులకు అందించడం ఆనందారామం నవలల్లోని ప్రత్యేకత. సాంప్రదాయకుటుంబంలో జన్మించినప్పటికీ సృజనాత్మకరచనల్లో ఆమె అభ్యుదయభావజాలాన్నిప్రదర్శించింది.

ఆనందారామం గృహలక్ష్మి స్వర్ణకంకణము, మాలతి చందూర్ స్మారక పురస్కారాన్నిపొందింది. మాదిరెడ్డి సులోచన, సుశీలనారాయణరెడ్డి, గోపిచంద్, తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారాలను, ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ అవార్డునూ అందుకుంది. తెలుగు చలన చిత్రసెన్సార్బోర్డు సభ్యురాలిగా అనేక సంవత్సరాలు పనిచేసింది. అటు సాహిత్యరంగంలో, ఇటు సినీ రచనారంగంలో నూతనదైన ముద్రను వేసింది. తాను స్వీయచరిత్ర రాసుకుంటే దాని పేరు "వైరిసమాసం" అని పెడతానని అంటుండేది  రచయిత్రి.

ఈ మధ్యనే అనగా 2021 ఫిబ్రవరి 10వ తేదీన చనిపోయింది.

ఆనందారామం రాసిన నవలల్లో మహిళాసమాజం ఒకటి. ఇది 1975 నవంబరులో ప్రచురణఅయ్యింది. ఈ సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళాసంవత్సరంగా ప్రకటించింది. సమానత్వం, అభివృద్ధి, శాంతి అనే సూత్రాల ప్రాతిపదిక మీద సదస్సు నిర్వహించింది. కాబట్టి రచయిత్రిపై దీని ప్రభావం ఉందని అనుకోవచ్చు.

ఈ ప్రభావం నుండే నవలలోని ప్రధానపాత్ర సుధీర పాత్ర రూపొందింది. ఆలోచనలు, చైతన్యము కలిగి కదులుతున్నటువంటి స్త్రీ. తన తల్లి జానకి, తండ్రి మాధవయ్య. సుధీర పేరుకు తగినట్లుగానే ధీరత్వం కలిగిన స్త్రీ. ఆ ధీరత్వం ఆమెకు రావడానికి గల కారణం తన తల్లే. ఎందుకంటే జానకి బహిష్కృత, తిరస్కృత. తండ్రి మాధవయ్య ఊరివాళ్ళ మాటలు విని, అక్రమ సంబంధం అంటగట్టి తల్లిని అనుమానించి, అవమానించి ఇంటినుండి బయటకు వెళ్ళగొడతాడు. కొడుకుని తన దగ్గరే ఉంచుకొని తనను వెళ్లగొట్టిన భర్తను నిలదీయక, అధైర్యపడకుండా బయటకువచ్చింది, అప్పుడప్పుడే స్త్రీలు తమ వ్యక్తిత్వాల కోసం ఒంటరిగా బయటకువస్తున్నరోజులవి. కడుపులో పెరుగుతున్న బిడ్డను కన్నది. ఏదో ఒకపని చేస్తూ తన బ్రతుకు తాను బ్రతికింది, పిల్లను పెంచుకుంది. కూతురి దగ్గర సంగతులేమి దాచలేదు.

ఆ పిల్లకూడా దేనికి భయపడకుండా పెరిగి వ్యక్తిత్వంతో బ్రతకాలనుకుంది. హైద్రాబాదులో పుట్టి, పెరిగి, అక్కడే చదువుకున్నసుధీర, తల్లి ఆవేదన తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసం మరీ అంత పల్లెటూరు కాని ఊరిలో ఉండే మహిళామండలికి సెక్రటరీగా వెళ్తుంది. అక్కడ ఆడంబరాల ప్రదర్శనకు, డాబుకోసం పాకులాడే మహిళామణుల మధ్య తామరాకుపై నీటిబిందువులా ఉంటూ తాను వచ్చినపని చూసుకునేది.

ఇక సుధీర విషయానికి వస్తే తనతండ్రి ఇంటికే పరాయిదానిలా అద్దెకు వెళుతుంది. పట్నం వదిలి ఊరుబాట పట్టింది. సమాజానికి భయపడకుండా తనను వేశ్య అని, వేశ్యకూతురని, అందరిని చెడగొట్టుతున్నదని చులకన చేసిన, లెక్కచేయకుండా  తాను అనుకున్నపని చేయగలిగింది. సవతితల్లి కింద అనేక అవమాలను ఎదుర్కొని ఏమి అనలేక చెడు అలవాట్లకు మరిగి, రోగగ్రస్తుడైన అన్నను తిరిగి మాములు మనిషిని చేస్తుంది.

కష్టాల్లోఉన్నవారిని ఆదుకుంటూ, ఇతరుల నుండి తనను తాను కాపాడుకుంటూ జీవితాన్నిసంతోషమయం చేసుకుంది సుధీర. తనను అభిమానించే ధనవంతుడైన రావు సహాయంతో వేశ్యల జీవితాలను బాగుచేసింది. అన్నప్రయోజకుడయ్యాక తండ్రి మరణాంతరం అతనికి కోరుకున్నఅమ్మాయితో వివాహంకావడానికి కారణభూతమయ్యింది. స్త్రీజాతి క్షేమం కోసం నడుంకట్టి పనిచేసింది. చివరకు తనను ఇష్టపడ్డరావుని తన ఇష్టంతో పెళ్లిచేసుకుంది.

నీవు నిజంగా నీ కోసమే బ్రతుకు, సమాజం కోసమో, వేరే ఎవరి కోసమో నీ జీవితాన్నివదులుకోకు, నీవు నీలా బతకడమేనీ విజయం అన్నరచయిత్రి మాటలు ఈ నవలలోని సుధీర పాత్రకి సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటేతనుఎవరెన్నిమాటలన్నావాటినికనీసంపట్టించుకోలేదు. రావుతో బయటకు వెళ్ళినపుడు సమాజం నీవు చెడ్డదానివని కోడైకూసింది. అయినా పట్టించుకోలేదు, ఎక్కడ తను ధైర్యాన్నిపోగొట్టుకోకుండా ఇంకా మహిళా మండలి సభ్యుల్లో మార్పును కోరుకుంది, మార్చడానికి ప్రయత్నించింది కూడా. తనకు వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేసింది. తన తల్లిలాగా తను సర్దుబాటు అయి బతకాలనుకోలేదు. అన్యాయాన్నిఎదిరించి బతకాలనుకుంది.

అయితే ఈ రకంగాఎన్నోవిధాలుగా నవలలు, కథలు రాసిన ఆనందారామం సాహిత్యాన్నిమనం ఇంకా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఈ కాలానికి ఎలా తగినవి? వాటికున్నపరిమితులేమిటివాటికున్నఆకాంక్షలేమిటి? అనే ధోరణిలో మనం చదవాల్సి ఉంది. స్త్రీలకు సంబంధించిన చైతన్యాన్ని ఆమె ఏమి ఇచ్చిందని తెలుసుకోవడమే మనం ఆమెకిచ్చే నివాళి.

                                                                      

 

 

 

సాహిత్య వ్యాసాలు

సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే శివరాజు సుబ్బలక్ష్మి కథలు

ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మి 1925 సెప్టెంబర్‍ 17న ఆంధప్రదేశ్‍లోని తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో జన్మించారు. తల్లిదండ్రులు సత్యవతి, ద్రోణంరాజు సూర్య ప్రకాశరావుగార్లు. సుబ్బలక్ష్మిగారికి 12 ఏళ్ళ వయస్సులో చివరకు మిగిలేదినవలతో విశేష గుర్తింపు పొందిన రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు)తో వివాహమయింది. పురాణాలు చదివి అర్థం చెప్పగల బుచ్చిబాబు నాయనమ్మ సుబ్బమ్మగారి వద్ద భారత భాగవతాలు చదవటం అలవాటైంది. నిత్యపాఠకుడు, రచయిత అయిన బుచ్చిబాబు సాహచర్యం, ఆయనకోసం ఇంటికి వచ్చిపోయే మొక్కపాటి, విశ్వనాధ సత్యనారాయణ, ఆచంట జానకీరామ్‍, ఆచంట శారదాదేవి, పింగళి లక్ష్మీకాంతం లాంటి వారితో సాహిత్య సంభాషణలలో పాల్గొనటం సుబ్బలక్ష్మి గారిలో సాహిత్య సృజన చేయాలనే కోరికను కలిగించాయి. భర్త బుచ్చిబాబు కథలకు మొదటి పాఠకురాలు కావడం ఆమెలో కథ నడిపే నైపుణ్యాన్ని పెంచింది. దాంతో 1960లలో  ఆమె కథారచన ప్రారంభం అయింది. ఆమె మంచి చిత్రకారిణి కూడా తండ్రి దగ్గర కావ్యాలను చదువుకున్న సుబ్బలక్ష్మి రచనలకు, చిత్రలేఖనాలకు బుచ్చిబాబు స్ఫూర్తినిచ్చేవారట.

   అదృష్టరేఖ, నీలంగేటు అయ్యగారు, తీర్పు నవలలతోపాటు కావ్య సుందరి కథ, ఒడ్డుకు చేరిన కెరటం, మనో వ్యాధికి మందుంది, కాపురం, మగతజీవి చివరి చూపు మొదలైన కథలను సుబ్బలక్ష్మి రచించారు. గృహలక్ష్మి స్వర్ణ కంకణం, ఆంధప్రదేశ్‍ సాహిత్య అకాడమీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.  తన స్నేహాన్ని, ప్రేమను ఎందరికో పంచి ఇస్తూ నిండు జీవితాన్ని (95 సం।।లు) అనుభవించిన శివరాజు సుబ్బలక్ష్మి ఈ ఫిబ్రవరి 6న బెంగుళూరులో మరణించారు.

   సుబ్బలక్ష్మిగారు రచించిన ఎనిమిది కథలతో మగత జీవి చివరి చూపుఅనే కథా సంపుటి 1964లో వచ్చింది. దీనిని ఆదర్శ గ్రంధ మండలి, విజయవాడ వారు ప్రచురించారు. మగత జీవి చివరి చూపుఅనే కథలో ఒక అసహాయురాలైన స్త్రీ (కాంతమ్మ) సంవేదనకు సంబంధించిన పాత్ర ప్రధానమైనది. చిన్న వయసులోనే ఒక ముసలాయనతో పెళ్ళి కావటంతో కష్టాల పాలైన కాంతమ్మ చిన్న పిల్లతో అనేక అవస్థలుపడుతూ ఉంటుంది. మొదటి నుంచీ ఆమె అసహాయతను ఆసరా చేసుకొని వెంకటేశం అనే అతను వెంటపడి ఆమెను ఏడిపిస్తూ ఉంటాడు. ముసలాయన కూతురు, అల్లుడు వాళ్ళ ఎదురింట్లోనే ఉంటారు. సవతి తల్లిని భరించలేని కూతురు ఆమెను అనుమానిస్తూ ఉంటుంది. ఎందుకంటే మంచి మనిషైన అల్లుడు ఆమెకు అవసరమైన సహాయం చేస్తూ ఉంటాడు. అది భరించలేని కూతురు, వెంకటేశం, చుట్టు పక్కలవారు ఆమెను అపార్థం చేసుకొని మాటలతో బాధిస్తూ ఉంటారు. చివరకు కూతురు కాంతమ్మ మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది. ఆమె కావాలనుకుంటుంది. చివరి క్షణాల్లో పశ్చాత్తాపంతో చూసే కూతుర్ని, వెలిగిపోయే అల్లుడి కళ్ళను తృప్తిగా చూస్తుంది. ఈ కథలోని పాత్రలన్నింటినీ చాలా సహజంగా చిత్రించారు సుబ్బలక్ష్మి. ఇది చదువుతున్నంత సేపూ వీళ్ళంతా మన చుట్టూ ఉన్నవాళ్ళే అనిపిస్తుంది. ఎప్పుడైనా చివరకు మంచితనమే గెలుస్తుంది కదా ! ముందు అపార్ధంతో చెడుగా ఆలోచించినా, తరువాత తప్పు తెలుసుకొని పశ్చాత్తాపాన్ని వెల్లడించడం ద్వారా చివరి దశలో ఉన్న మనిషికి తృప్తి కలిగించడం సమాజానికి ఒక మంచి సందేశం.

   మరొక కథ కాపురంజానకి పెళ్ళితో మొదలై పెద్ద కోడలుగా అత్తగారింటికి వెళ్ళడం, అక్కడి పద్ధతులు, పరిస్థితులు కొత్తగా అనిపించడం, తరువాత అలవాటుపడడంతో కథ మొదలవుతుంది. అత్తగారి పెత్తనం, అజమాయిషీ, తోటికోడళ్ళ నిర్లక్ష్య ప్రవర్తన పెద్ద కోడలైన జానకికి బాధ కలిగిస్తాయి. మామగారి మంచితనం కొంత ఊరట పెద్ద కోడలికి బాధ్యతలు, బంధాలను భరించడంతోపాటు ఉమ్మడి కుటుంబంలోని మనుషుల మధ్య కోపతాపాలు, అపోహలు, అపార్థాలు, అపేక్షలు, అలకలతో కథ కొనసాగుతుంది. చిన్న కోడళ్ళతో సమస్యలను ఎదుర్కొన్న అత్తగారికి పెద్ద కోడలి మంచితనం అర్థమవుతుంది. జానకి భర్త రామం జానకిని తీసుకొని వేరే ఊరికి వెళ్ళాలని బయలుదేరడం, చివరకు అపార్థాలు తొలగి సామరస్యంతో అర్థంచేసుకోవడం లాంటి కుటుంబ సంబంధాలతో నడిచే కథ ఇది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. జలసూత్రం రుక్మిణినాధశాస్త్రి బుచ్చిబాబుగారికి రాసిన ఒక ఉత్తరంలో సుబ్బలక్ష్మిగారి కాపురంకథ సరళంగా మనుషుల మధ్య సంబంధాలు ఎంత సామరస్యపూర్వకంగా, సంస్కారవంతంగా ఉండాలో చూపింది అని మెచ్చుకుంటూ, ఇంత శుభ్రంగా నువ్వు కథలు రాస్తావా అని బుచ్చిబాబుగారిని సవాల్‍ చేశారట. నిజంగా ఈ కథను, కథలోని పాత్రలను అంత బాగా చిత్రించారు రచయిత్రి.

   ఇంకో కథ ఆడవాళ్ళ పెట్టెలో ప్రయాణంరైళ్ళలో కేవలం ఆడవాళ్ళకే సంబంధించిన బోగీ ఒకటుంటుంది. సాధారణంగా ఒంటరిగా ప్రయాణం చేసే ఆడవాళ్ళ ఆ పెట్టలోనే ఎక్కుతారు. ఆ పెట్టెలో ఎక్కిన రకరకాల మనస్తత్వాలు గల వాళ్ళ ప్రవర్తనలు, అభిప్రాయాలు, ఆలోచనలు ఎట్లా ఉంటాయో తెలియజేసే కథ ఇది. కొన్ని గంటలు కలిసి ప్రయాణం చేసే వాళ్ళ మధ్య సాగే సంభాషణలు, కొందరంటే మంచి భావం, కొందరంటే అస్సలు పడకపోవడం, మద్దతునిచ్చేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, కూర్చున్నవాళ్ళు, పడుకున్నవాళ్ళు ఒక రకంగా ఆలోచించడం, నిలబడిన                      వాళ్ళు మరో రకంగా ఆలోచించడం, సామాన్లు సర్దే సమస్య, ఒకరిపై ఒకరు మాటలు విసురుకోవటం లాంటి విషయాలతో సాగే కథ ఇది. అయితే ఈ కథ శాంత అనే పాత్ర స్వగతం చెప్పినట్లుగా ఉంటుంది. రైలులో శాంతతో గొడవపడిన వాళ్ళే భర్త రామారావు స్నేహితుడి భార్య ఆమె చెల్లెలు వాళ్ళిద్దరూ తమ ఇంటికి రావడం, వాళ్ళ ప్రవర్తన ఆమెకు నచ్చదు. అయినా వాళ్ళను భరించాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడి నుండి ఒక పెళ్ళికి వెళ్ళాల్సి రావడంతో వాళ్ళను రైలు ఎక్కించడానికి, రామం, శాంత స్టేషన్‍కు వెళ్తారు. అయితే ఆ పెళ్ళి ఆగిపోయిందన్న విషయం రామంకు తెలిసినా వాళ్ళకుగానీ, శాంతకుగానీ చెప్పడు. అది తెలియని ఆ అక్క చెల్లెళ్ళు రైలెక్కి వెళ్ళిపోతారు. విషయం చెప్పకుండానే శాంతకిష్టంలేని వ్యక్తులను పంపించి భార్యను సంతోషపరుస్తాడు రామం. ఈ కథలో భార్యాభర్తల అనుబంధంతో పాటు ప్రయాణంలో తారసపడే వాళ్ళ వింత ప్రవర్తనలను, మాటలను కళ్ళకు కట్టినట్లు చూపించారు రచయిత్రి.

   ఇంకా మగతజీవి చివరి చూపుఅనే ఈ కథా సంపుటిలో కొత్త చోటైనా పాత మనుషులే, నేనూ అంతేనేమో, నల్లమబ్బులు, కర్త, కర్మలు పూర్తి చేసిన కథ, ఊహించని కోరిక అనే కథలున్నాయి. ఇవనీ కూడా ఆలోచింపజేసేవే అనుబంధాల విలువలను తెలియజేసేవే, బంధాలు, బాధ్యతలను గుర్తు చేసేవే, ముఖ్యంగా మనుషుల మధ్య మంచి సంబంధాలు ఉండాలనే సందేశాన్నిచ్చేవే. కుటుంబ సంబంధాల గొప్పతనాన్ని చాటి చెప్పేవే. వీటన్నింటిని కలయికతో కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది అన్న భావాన్ని ఈ సంపుటి కలగజేస్తుంది. ఈ కథా సంపుటికి ముందుమాట రాస్తూ పింగళి లక్ష్మీకాంతం గారు ఇట్లా అంటారు సుబ్బలక్ష్మి కథల విశిష్టత చాలా భాగం ఇది స్త్రీ మాత్రమే వ్రాయగలదు అనిపించటం’. ‘పురుషుడు స్త్రీ ప్రకృతిని చిత్రించినప్పుడు అతడెంత నిపుణ రచయిత అయినా పురుష నేత్రాలతో ప్రతిఫలించిన దృశ్యమే చిత్రించగలడు. స్త్రీల స్వభావాన్ని సాటి స్త్రీ వర్ణించినప్పుడు అది అన్యునాతిరిక్తంగాను, వాస్తవికతకు సన్నిహితంగానూ ఉండడంలో ఆశ్చర్యం లేదు అని కూడా పేర్కొన్నారు.

   ‘‘ ప్రశాంతంగా ఉండాలంటే పాత వాటిని కలుపుకొని కొత్త ఊహల్లో జీవించటం అలవరచుకోవాలి’’ అని ప్రతిపాదించిన శివరాజు సుబ్బలక్ష్మి గారిని స్మరిస్తూ ఆమె సాహిత్యాన్ని అధ్యయనం చేయటం అవసరమని భావిస్తూ ఆ సాహితీమూర్తికి వినమ్రంగా అక్షర నివాళిని సమర్పిస్తున్నా.

                                                                                                         

సాహిత్య వ్యాసాలు

జమ్మిపూల సౌరభాలు

 

 

           బడిని ఊరి ఉమ్మడి సిరిగా మార్చగల సరితా టీచర్ లాంటి సమ్మెట ఉమాదేవి అంటే.. మా 'ఉమ' చూడ్డానికి బాసర సరస్వతి దేవిలా ఉంటారు. భావించడానికి కూడా ఉమా సరస్వతే.. ఇప్పటికి రెండు కథల సంకలనాలు  అందించిన ఉమ రేలపూల నుంచి జమ్మిపూల దాకా నడిచారు. ఉమకు పువ్వులూ, పిల్లలూ సమానంగా ఇష్టం. ఆమె తన కంప్యూటర్ నిండా వందల రకాల వేలవేల పువ్వులు పోగుచేసి  దాచిపెట్టారు. ఆమె గుండెనిండా..గుండె పట్టనంతమంది పిల్లలు ఉన్నారు. వారంతా ఎన్నో ఏళ్లుగా ఆమె దగ్గర చదువుకున్న చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులు. అందుకే ఆమె బాసర సరస్వతిని తలపిస్తారు.

           తత్వవేత్తలు వ్యక్తిత్వ నిర్మాణ నిపుణులు కూడా వర్ధమానంలో జీవించడం గురించి చెప్తుంటారు. ఇది స్థల కాలాల రెండింటికీ చెందుతుంది. మనం ఎక్కడ నివాసిస్తున్నామో ఎక్కడ జీవితానికి అవసరమయిన ఆర్థిక వనరులు పొందుతున్నామో అదే మన నేల. అక్కడే మన అస్తిత్వాన్ని వెతుక్కోవాలి.  అస్తిత్వ మూలాలు ఎక్కడో ఉండవచ్చు. కానీ వాటికోసం వెనక్కి ప్రయాణించి అక్కడే ఉండి పోనవసరం లేదు. ఉమాదేవి జమ్మిపూలు సంకలనం కథలన్నీ చదివినప్పుడు నాకు పై ఆలోచనలు పదే పదే కలిగాయి. ఆమె ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఊళ్ళూ మారుతూ వచ్చారు. అవి తెలంగాణ ప్రాంతపు మారుమూల పల్లెలు. ఇంకా చెప్పాలంటే గిరిజన గ్రామాలు, తండాలు. సాధారణంగా చాలా మంది అలాంటి చోటుకి వెళ్లకుండా ఏర్పాటు చేసుకోగలుగుతారు. కొందరు చేసుకోలేరు. కొందరు ఐచ్చికంగా వెళతారు. అలా వెళ్లి ఆ గిరిజన పల్లెల్లో మమేకమయిన ఉపాధ్యాయులను కొద్దిమందినే అయినా సరే నేను అలాంటి వారిని చూసాను. వారిని దైవసమానులుగా భావిస్తాను. గిరిజన గ్రామాలనుంచి వచ్చిన మేము అటువంటి వారి వల్లనే ఇంతదాకా ప్రయాణించగలిగాము.. అందువల్ల  వారు నిరంతర స్మరనీయులు. అటువంటి ఉపాధ్యాయిని  ఉమాదేవి. ఆమె చుట్టూ ఉన్న కథలే ఇవి. 

            ఇందులో ఉన్న పదహారు కథల్లో పన్నెండు కథలు కేవలం గిరిజన తండాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని  జీవితాల కథలు. నిత్యము వారితో కలిసిమెలిసి వారి కష్ట సుఖాలల్లో భాగమై, వారి మనసులోని  మర్మములు ఎరిగిన కథలివి. ఇందులోని ప్రతీ కథ ఒక్కొక్క ఆడకూతురి మనసులోని ఆవేదనను గానీ, ఒక పిల్లవాడు లేదా పిల్లదాని గుండెలలో దాగిన బాధ వెనుక వున్న నిజమయిన జీవితాలగురించి చెప్పిన కథలు.  ప్రతీ కథా మాములు కథల వెనుక ఉన్న అసలు కథను చెప్తుంది. ఆ అసలు కథను పట్టుకోగలడగంలోనే ఉమాదేవి ప్రత్యేక వ్యక్తిగా తనదయిన గమనింపును మన ముందుకు తెచ్చారు.

          మారు గ్రామాలలో ఇంటింటికీ పాకీ దొడ్లు ఉండవు. ప్రభుత్వం కేవలం దీని కోసం ప్రచారం చేస్తూ సబ్సీడీలు ఇస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్లకి అది  ప్రాణాంతకమయిన కష్టం. దీని చుట్టూ కథ రాయదల్చుకున్న వాళ్ళకి  అంతవరకే  ఉంటుంది వస్తువు. స్త్రీలవైపు నుంచి ఈ కథ చెప్పేటప్పుడు దీని వెనుక వారి జీవితాలలో మరెన్ని సమస్యలున్నాయో. వాటిముందు స్వంత పాకీదొడ్డి లేకపోవడమన్నది ఎంత రెండవ స్థానపు అంశమై పోతుందో మైసమ్మత్త కథ చదివి ఆశ్చర్య పోతాం. వరమ్మ చెంబట్కీ పేరు చెప్పి బహిర్భూమికి వెళ్ళి ఊర్లోనే ఉన్న తల్లిని అక్కడ  కలుస్తుంది. వదిన కూడా ఆ పనిమీదే వచ్చి మరదలిని కూతురిని కలుస్తుంది. వాళ్ళు కలుసుకోవడానికి అదొక్కటే వీలు. లేకుంటే అత్త వాళ్ళని కలవనివ్వదు. అదో కష్టం. అందుకని వరాలు ఇలా అంటుంది. “ఇట్లా చెంబట్కీ అని చెప్పి వచ్చి  దినాం ఈడ మిమ్ముల గలుస్తున్న. గా బాత్రూములు గిట్ల గట్టిపిస్తే నా బతుకు నిజంగా జైళ్ల వడ్డట్టే.” ఇంకో ఇంటికోడలు సీతక్క ఇలా అంటుంది. “నీకు దెలియందేముంది వరమ్మా.. మా అత్త చెంబట్కీ పోయిందంటే ఆమె ఎంటబోయినోళ్ళకు మొగని మీద కోడళ్ల మీద చెప్పుకుంట రెండుగంటలగ్గానీ రాదు. మా ఇంటాయన నేను గప్పుడే జర మంచిగా ఏమన్న మాట్లాడుకునేది. లేకుంటే ఆయన నాతోని మంచిగుంటే ఓర్వది లేదీ తల్లి " ఇవీ వారి కష్టాలు.

          "ఈమె, కథ వెనుక ఉన్న కథ చెప్తుంది అంటే ఇదీ చెప్పడం".. అయితే ఇంటివెనుక బాత్రూమ్ కట్టకుండా చేసే ప్రగతి నిరోధకత ఇందులో రానివ్వలేదు ఉమ. ఈ గొడవలన్నింటినీ తన కథలో సద్దు మణిగించుకుంటుంది. 

           ఈ మధ్య ప్రజారచయిత్రుల వేదిక సాంస్కృతిక సవాళ్ల సెమినార్ పెట్టి, "స్త్రీల రచనలలో ప్రతిఫలించిన సాంస్కృతిక వత్తిడుల" గురించి చెప్పమంది నన్ను. వెంటనే ఇందులో ‘బొడ్రాయి’ కథ గుర్తుకు వచ్చింది. అయిదారాళ్లేకోసారి పల్లెటూర్లల్లో ఊరికి  అరిష్టం కలుగకుండా గ్రామదేవత బొడ్రాయిని ప్రతిష్ఠిస్తూంటారు. ఈ బొడ్రాయి చుట్టూ ఉన్న నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఈ కథలో చిత్రించింది ఉమ. బొడ్రాయి వేసినపుడు ఊరి ఆడపడుచులు ఆ ఊరికి రాలేకపోతే మూడేళ్లు ఆ ఊరికి రాకూడదన్న ఆచారం కోడలిగా వెళ్ళిన యువతుల పాలిట ముళ్ల కంచెలా ఎలా మారుతుందో చెప్పిన కథ ఇది. ఇలా బొడ్రాయి ప్రతిష్టించిన మూడు రోజులు ఊరినుంచి బయటకు, బయటనుండి ఊర్లోకి రాకపోకలు ఉండరాదు. కానీ సమయానికి సొమ్ములు సమకూరక చివరి నిముషంలో పుట్టింటికి బయలుదేరిన ఆడకూతురికి ఈ బొడ్రాయి దారి కట్టడి నియమం ఎంత పెద్ద కష్టం అవుతుందో ఈ కథలో ఉంటుంది. ఇంకొక నియమం ఏమంటే  ఈ సందర్భమప్పుడు వెళ్లలేకుంటే మూడేళ్ళ పాటు పుట్టింటికి (ఆ ఊరికి) పోరాదు. ఇది గిరిజన, గ్రామీణ ప్రాంత నియమం. రచయిత్రి వారితో కలసి తిరగడం వల్ల ఈ ఆచారాల పట్ల అవగాహనా ఉన్నది. కానీ హేతువాద  దృష్టి గల రచయిత్రిగా ఉమ ఈ సాంస్కృతిక వత్తిడిని సవాల్ చేస్తుంది. ఆ చెయ్యడం కూడా అందరం ఒప్పుకోక తప్పని విధంగా ఆ గిరిజనుల చేతే ఉల్లంఘన చేయిస్తుంది. ఇలాంటి కథలు చెప్తూ.. ఆమె బడిలోనే గాక వారి సమాజానికి కూడా ఉపాధ్యాయురాలిగా మారడం కనిపిస్తుంది.  గ్రామదేవత మీద ప్రజాలకున్న నమ్మకాన్ని గౌరవిస్తూనే మఠాధిపతుల డొల్లతనం బయటపెడుతూ మానవతా దృష్టికి విలువనివ్వడం ఈ కథలోని మేలుదనం.   

            తెల్లవారి  వార్తాపత్రిక చూస్తే అప్పుల బాధలు తట్టుకోలేక చనిపోతున్న కుటుంబాల వార్తా కథనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అసలు పత్రికలో వచ్చిన అలాంటి వార్త మరి కొన్ని కుటుంబాలకు మార్గదర్శకం అవుతూఉంటుంది. అంతేగానీ సమాజంగానీ మీడియాగానీ వారిని ధైర్యంగా బతికే మార్గం చూపదు. అది తనపని కాదు అనుకుంటుంది. ఆ ఆశావాహ దృష్టి ప్రజలకు ఇవ్వడం కవి, రచయితల బాధ్యత. కన్నీళ్ల గురించి రాయడం కన్నా కన్నీళ్లు తుడిచే బాధ్యత తీసుకోవడమే రచయితల కర్తవ్యం. అని వారు నమ్మినప్పుడు ఇదిగో ఉమా రాసిన ‘ఖేల్ షురూ’ లాంటి కథలు వస్తాయి.

   ఈ కథలో ఉమా రెండు కోణాలు కలిపారు. అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోబోయి విఫలమైన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి నగరంనుంచి బంధువు సత్తెక్క వస్తుంది. ఆమె వారిని నగరంలో చెయ్యాలేగానీ కుటుంబానికంతటికీ కూడా  జీవనాధారాలెన్ని  ఉన్నాయో చెప్తుంది. ఆ మాటల్లోనే కొందరు అధిక  ధన సంపదతో  ఎన్ని మిషన్లు కొన్నుకున్నావారికి ప్రతి చిన్నపనికి పనివాళ్ళ అవసరం, కొరత గురించి చెప్పడంలో మార్కెట్ కల్చర్, మధ్యతరగతి కుటుంబాలను వ్యక్తులను ఎంత సోమరులుగా చేస్తుందో చెప్తుంది. వారు డబ్బుకోసం, చదువులు చదవడం కోసం  పరుగులు.. తీరా ఉద్యోగమొచ్చాక మళ్లీ పరుగులు. ఆ పరుగుల మధ్య దిక్కులేని ముసలివాళ్ళు. వీళ్ళందరికీ పనిచేసే మనుష్యులు కావాలి. అంటూ మేన్ పవర్ అవసరాన్ని చెబుతుంది. మనముందు మనకి ఇన్ని అవకాశాలు ఉండగా ఈ ఆత్మ హత్యలు చేసుకోవాల్సిన అవసరమేంటి అంటుంది. విపణీ సంస్కృతి మధ్యతరగతికి లేబర్ కి మధ్య పనిచేసే ఆఫీస్ ల గురించి కూడా సత్తెమ్మకి తెలుసు. సమాజంలోని రెండు దూరదూరంగా ఉన్న ప్రదేశాలను కలిపిన కథ ఇది. ఇది ఖేల్ కథం కాదు ఖేల్ ను షురూ చేసిన కథ. అపార్ట్ మెంట్ కల్చర్, మార్కెట్ కల్చర్ కి ఎలా తలవొగ్గి ఎలా పరుగెడుతుందో సవివరంగా చెప్పిన కథ.

          రెడపంగి  కావేరి  ఇందులో ప్రత్యేకమయిన కథ ఇది. కావేరి అనే బాలిక ఇంటిపేరు ‘రెడపంగి.’  ఈ కథ చదవగానే దమయంతి కూతురు కథ గుర్తుకు వచ్చింది. దాని మీద ఎంతో చర్చ జరిగింది. కథ దమయంతిదని కొందరు, దమయంతి కూతురిది అని కొందరు మాట్లాడారు. అదే కథ మరోకోణంలో ఉమా మరెంతో మానవీయంగా రాసారు. సామాజిక వర్గాలను బట్టి సంస్కారాలేలా ఉంటాయో తులనాత్మకంగా తెలుస్తుంది. దమయంతి కూతురు మిధ్యా గౌరవాలకు విలువలిచ్చే మధ్యతరగతిలో పుట్టింది. కాబట్టి అలాగే ఆలోచిస్తుంది. కానీ కావేరి అవేవి లేని మట్టికి చెందిన బిడ్డ. ఆ మాయ గౌరవాల బాధ లేదు. అందుకే ఆ తల్లి బిడ్డ కోసం వచ్చి వెడుతూ వుంటుంది. బిడ్డ తల్లి బాధను సంతోషాన్ని కూడా అర్ధం చేసుకోగలుగుతుంది. గుండె ద్రవించి కళ్ళ వెంట నీరు కార్చగల మానవీయ కథ కావేరి కథ. బహుశా కావేరి ఉమాదేవి ఎదురుగా తరగతి గదిలో బల్ల మీద కూర్చునే బిడ్డే కావొచ్చు. 

       ఇక మిగిలిన కథలల్లో అభివృద్ధి పధంలోకి వస్తున్నాయని మనం భావిస్తున్న యువత వున్నారు. అక్కడి పిల్లలకు చదువులో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తోంది. కానీ బతుకులు వెళ్లదీసే ఆర్ధిక స్తోమత లేదు. బీటెక్ చదువుకుంటున్న పిల్లలు సైతం మిగిలిన అవసరాలకోసం ఏవేవో పనులకు పోతారు. కానీ ఆ పనుల్లో భద్రత లేదు. కళ్ళముందే ప్రాణాలు కోల్పోతుంటారు. అయినా వేరే దారి లేదు. ఇవ్వన్నీ చాలా కొద్ది మందికే తెలిసిన విషయాలను ఉమా ఇందులో పొందు పరిచారు. 

       వాస్తవంగా గిరి పుత్రులు నిర్మల హృదయులు. అభివృద్ది పేరుతో వారు నాగారీకులకవడం అంటే ఎంతో కాలుష్యం బారిన పడడమే. వారని అక్కడే ఉంచి వారికి కావాల్సిన అభివృద్ధి ఏర్పాటు చేయడమే నిజమయిన కర్తవ్యం అని విజ్ఞులు అంటారు ఇది పెద్ద చర్చనీయాంశం 

            అస్సామీ రచయిత దీరేంద్ర భట్టాచార్య తన జనవాహిని అనే నవలలో ఈ అంశాన్ని చర్చిస్తాడు. 

ఆదివాసీలు చదువుకుని నగరాలకి వచ్చి ఆధునిక సాంకేతికత, నాగారీకతను అలవరుచుకున్నప్పుడు తరతరాలుగా వస్తున్న వారి ఆచారాలకు నమ్మకాలకు విలువనిచ్చేలాగా వారిని ఉంచాలి. అవి కాపాడబడాలి ప్రభుత్వం సమాజము ఆ సంగతి మర్చిపోయింది అంటాడు. ఉమాదేవి దశ్మీ కథలో దశ్మీ ద్వారా ఈ విషయమే చెప్పించారు. 

           నిత్యమూ రైలూ బస్ పట్టుకుని బడికి, ఇంటికీ తిరిగే ఉమలో నిరంతరమూ రచయిత్రి మేలుకునే ఉంటుంది. ఆమె తన ప్రయాణంలో గమనించి గుర్తుపట్టిన మానవీయ కోణాలను కథల్లోకి తేవడంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో ఈ కథలు చెబుతాయి.   

         ఊరుమ్మడి సిరి కథ చదివి కథలోని సరిత టీచర్ అమలు చేస్తున్న విద్యా విధానానికి పులకించి పోయాను. మాంటిస్సొరి పద్దతికి ధీటయిన ఓ మారుమూల గ్రామావసరాలకు అనువయిన విద్యాపాలనా విధానాన్ని రూపొందించుకుని తన పాఠశాలలో ప్రవేశపెట్టి అమలు చేసుకోవడమన్నది చాలా గొప్ప సంగతి. 

 వేంకటేశ మాడ్గుల్ గర్ తన జనగరవాడి అనే మరాటీ నవలలోని ఉపాధ్యాయునిలాంటి ఉపాధ్యాయిని ఈమె అనిపించింది. ఆ కథ చదివితే. అందులో ఉపాద్యాయునికి రచయిత పేరు పెట్టడు. అందరూ పంతులూ అనే పిలుస్తారు. ఊరివారికి అతడు దేవుడు. అందుకే ఉమని నేను బాసరమ్మ  అన్నది.

           ఇవి తెలంగాణా కథలు తెలంగాణ ప్రాంతపు కథలు. తెలంగాణా తెలుగు మాండలికాలు, యాసా నోటినిండా పలికిన కథలు. అక్కడి తండావాసుల వ్యవహార పదాలు, యాసలు కథల్లో సంభాషణలనిండా ఉన్నాయి. కానీ రచయిత్రి కథ మాత్రం తనదయిన వ్యవహార శైలిలోనే చెప్పారు. ఇది అభినందనీయం. కథంతా ఏ మాండలికంలో నడచినా మరో ప్రాంతపు వారికి చదవడానికి కష్టమే.  అయిన ఆసక్తి ఉన్నవారు  కష్టపడతారు. కానీ మనం ఎవరి గురించి చెబుతున్నామో వారి సమస్యలు అందరి దృష్టికి తీసుకు వెళ్ళాలంటే ఇది మధ్యే మార్గం. ఇది ఆదర్శవంతమయిన ఆచరనీయమయిన మార్గమని నాకు అనిపించింది. 

           గిరిజనుల జీవితాలలలోకి వెళ్లి దగ్గరగా చూసి కథలు రాసినవారు చాలా తక్కువ. ఆ ప్రాంతాలలో ఉద్యోగరిత్యా ఉండడాన్ని అవకాశంగా భావిస్తూ వారితో కలిసిపోయి ఆ జీవితాలను మిగిలిన సమాజాలకు ఇలా ఉమాదేవిలా చెప్పినవారు అరుదు. కానీ ఆమె తన రేలపూలు  పుస్తకంలోని ముందు మాటలో రాసుకున్న మాటలు మళ్ళీ ఇక్కడ గుర్తు చెయ్యాలని ఉంది 

            నీవు ఎవరి గురించి రాస్తున్నవో వారు ఈ కథలు చదవరు అన్నవారున్నారు.  వాళ్ళు ఇవి చదవక పోవచ్చు. కానీ ఈ సమాజంలో సాటి పౌరులుగా వున్నవారి గురించి తెలుసుకోవాల్సిన, పట్టించుకోవాల్సిన అవసరం బాద్యత మనందరి పైనా ఉన్నదని నేను నమ్ముతున్నాను. అలాగని నేను తండావాసుల రాజకీయ సామాజిక జీవనాల్లో అకస్మాత్తుగా వచ్చిన పెను మార్పుల గురించో, రాజకీయ జీవనాల గురించో నేను రాయలేదు. అందుకే వాటిని అగ్నిపూలనో మోదుగాపూలనో కాకుండా రేలపూలని పేరు పెట్టుకున్నాను ఈ రేలపూలు అడవికే అంకితమైపోతున్నాయి. జనం వాటిని పెంచి పోషించి కాపాడుకోవాలని నా తాపత్రయం .. ఇదీ ఆమె తపనా తాపత్రయమూనూ జనం మధ్య పరస్పర స్నేహాన్ని అందించడానికి సంకేతంగా ఉండే ఉమా జమ్మిపూలతో మన ముందుకు వస్తున్నారు. గిరిజనులతోనూ బడుగు గ్రామీణులతో స్నేహహస్తం కలపమని కోరుతున్న.. ఆమె ఆశయాలను సఫలం చేద్దాము. 

                                                                                  వాడ్రేవు వీరలక్ష్మీదేవి   

 

ప్రతులకు..  రచయిత్రికి చిరునామలను పంపి..  ఫోన్ పే , గూగుల్ పే ద్వారా పొందవచ్చును –

 సమ్మెట ఉమాదేవి - 9849406722

                  

 

Compose:

New Message

Minimise Pop-out Close

 

       

 

 

సాహిత్య వ్యాసాలు

జానపదం నుండి ప్రగతి పథంలోకి నాయని కృష్ణకుమారి కవితాప్రస్థానం

ఒక రచయిత ఎన్ని ప్రక్రియలలో రచనలు చేసినా, పరిశోధనలు చేసినా అతని సాహిత్యంలోని ఒక ప్రక్రియతోనే ఆ రచయిత (త్రి) గుర్తింపు సాధిస్తారు. కాని నాయని కృష్ణకుమారి వ్యాసం, యాత్రాచరిత్ర, కథలు, జానపద గేయ కథలు వంటి అనేక సాహిత్యప్రక్రియలతో అక్షరయాత్ర కొనసాగించినా ఆమెని ప్రధానంగా జానపదసాహిత్య పరిశోధకురాలని విద్యారంగంలోని వారు గుర్తిస్తారు. కానీ సాహిత్యరంగంలో మాత్రం కవయిత్రిగా, కాశ్మీరదీపకళిక వంటి యాత్రా చరిత్ర రాసిన తొలి రచయిత్రిగా గుర్తిస్తారు. 

బాల్యంనుండీ తండ్రి నాయని సుబ్బారావుగారి వలన ప్రముఖ సాహితీవేత్తలతో జరిపే చర్చలు వింటూ సాహిత్యాభిలాషేగాక నిర్భయంగా నలుగురిలోనూ మాట్లాడటం నేర్చుకున్నారు నాయని కృష్ణకుమారి. తొలిరోజులనుండీ కూడా పరిశోధనాత్మక సాహిత్యరచనపట్ల మక్కువ పెంచుకోవటంవలన 18 ఏళ్ళ వయసులోనే ఆంధ్రుల చరిత్రని పరిశీలించిఆంధ్రుల కథఅనే పుస్తకం వెలువరించారు. తదనంతరంతిక్కన కవితావైభవంపై పరిశోధన మొదలుపెట్టి మధ్యలో ఆపేసిజానపద సాహిత్యంపై పరిశోధించి డాక్టరేటు పట్టా తీసుకున్నారు. అయితే సమాంతరంగా కవిత్వ రచన పట్ల ఆసక్తి ఉన్నా వృత్తిరీత్యా సమయాభావం వల్ల కావచ్చు- అగ్నిపుత్రి (1978), ఏంచెప్పను నేస్తం(1988), సౌభద్ర భద్రరూపం (2006) అనే మూడు కవితాసంపుటాలు మాత్రమే వెలువరించారు.

1960 నుండీ కవిత్వం రాస్తున్న కృష్ణకుమారి ఆనాటి కవయిత్రులకు భిన్నంగా సమాజ పోకడలను గమనిస్తూ, సామాన్య మధ్య తరగతి జీవుల పక్షాన నిలబడుతూ, కవితలు రాయటం గమనించవలసిన విషయం.  జానపద పరిశోధన ప్రభావం వలన కావచ్చు అచ్చమైన తెలుగు పారిభాషిక పదాలతోనే వీరి కవితలు సామాజిక స్వభావాన్ని పొదువుకొని వుంటాయి.

స్వాతంత్ర్యానంతరం కవిత్వంలో రాజకీయ, సామాజిక పరిస్థితుల ప్రభావం ఎక్కువగా కవులలో ప్రతిబింబించినా, సాహిత్యోద్యమాలలోని భావకవిత్వోద్యమం ఛాయలు ఎక్కువగా కవయిత్రులలో కనిపిస్తున్న సమయంలోనే కృష్ణకుమారి తనదైన శైలిలో రాస్తూ వచ్చారు.

అంతేకాక అదే సమయంలో సృజనాత్మకత కల మహిళామణులందరూ ధనమూ, కీర్తీ తెచ్చిపెట్టే నవలా రచన వైపు మొగ్గుచూపి నవలామణులుగా ప్రఖ్యాతి పొందేరు.

అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావం అనంతరం కవుల కవిత్వ ధోరణిలో మార్పు వచ్చింది. అదేకాలంలో కవిత్వ రచన మొదలుపెట్టారు నాయని కృష్ణకుమారి. అంతవరకూ సామాజిక, కౌటుంబిక పరిస్థితులకు కట్టుపడిన కవయిత్రులలో వైవిధ్యమైన, స్పష్టమైన గొంతుకను ప్రదర్శించిన తొలి కవయిత్రిగా కృష్ణకుమారిని పేర్కొనవచ్చు.

1960-78 వరకూ రాసిన కవితలనుఅగ్నిపుత్రిగా సంపుటీకరించారు.

‘‘వర్తమానాన్ని తిట్టుకుంటూ

నిస్పృహలో మునిగి తేలే

నీరవ మూర్తి కాదు నా కవిత

ప్రతి నీటి కణంలో తోచే

ప్రభాకర ప్రతిఘటనంలా

నా కవిత్వమంతటా

నమ్మకం అక్షరమై మెరుస్తుందిఅని ఆత్మ విశ్వాసంతో తన కవిత్వం గురించి చాటిచెపుతారు కవయిత్రి.

పాఠకుడి మనసుకి కవితాసౌందర్యం అందాలంటే కవికి సంబంధించిన అనుభూతిపరమైన వివరణను అందుకునేందుకు దోహదపడే ఆర్ద్రతా, మనోభావాలు, కవిత్వంలో ప్రతిఫలించాలి.

నాయని కృష్ణకుమారి స్వభావరీత్యా సాధుస్వభావి. అందుకే కాలక్రమేణా వచ్చే సామాజిక మార్పుల్ని ఆహ్వానిస్తారు, దుఃఖిస్తారు. కానీ మార్పుకోసం విప్లవ భావాల్ని కోరుకోరు.

చాలా కవితల్లో దైవమో, కాదో, ఉన్నాడో, లేడో అనే డోలాయమాన స్థితిలో అంతస్చేతనలో రాసిన చాలా కవితలు కనిపిస్తాయి. కానీ మూఢభక్తిని ప్రోత్సహించరు. ఆమె తన ముందుమాటలో కూడాదేవుడి విషయంలో ఇదమిత్తమనే భావన నాకింకా ఏర్పడలేదంటారు. అందుకే ఆమె వెతుకులాట కొన్ని కవితల్లో వ్యక్తమౌతుంది. 

చాపకింద నీరులా ప్రవహించే కాలప్రవాహంలోని మార్పుల్ని నిబ్బరంగా ఎదుర్కోవాలని అభిలషించే కవిత్వం వీరిది. అందుకే

‘‘కాలం చెంగుల్ని పట్టుకొని

అతివేగంగా నడుస్తూనే

అగమ్యోహాల చిక్కుముళ్ళని

అతినేర్పుగా విప్పుకుంటాను’’- అంటారు.

కవిత్వమంటే జీవితమనీ, అనుభవాల తామరతంపరలనీ కవయిత్రి విశ్వాసం. పాఠకుల మనసులకు అందని సర్కసు ఫీట్ల కవిత్వాన్ని రాసి మెప్పు పొందే కవుల ఆధిపత్యాన్ని నిరసిస్తారు. చెప్పదలచుకున్న విషయాన్ని డొంక తిరుగుడుగా కాక సూటిగా చెప్పటం వీరి కవిత్వ లక్షణం.

‘‘నా కవిత్వాన్ని రూపు కట్టించదలచుకున్న భావంగా నేను కూడా రూపాంతరం చెందుతాను. అంతేకానీ భావాలకు ఆశ్రయభూతాలైన శబ్దాల్లోకి పరకాయ ప్రవేశం చేయను. కవిత్వంలో కవి మనస్సే కాక అతని చిత్తవృత్తి, అహంకారమూ, ఆర్ద్రతా, కాఠిన్యమూ వంటి లక్షణాల స్థాయి తెలిసినప్పుడు ఆ కవి కవిత్వము అర్థమయ్యే పద్ధతిలో వేరుగా ఉంటుందిఅంటారు నాయని కృష్ణకుమారి.

దూరం కొలతఅనే కవితలో కోరికల్ని గుర్రాల్లా పరిగెత్తనీయకు అని పాఠకుడికి బోధించేందుకు అన్నట్లు పలు ఉదాహరణలు ఇస్తారు.

‘‘నీకూ నీ కోరికకూ మధ్య

దూరం ఎంత ఎక్కువైతే

అంతగా పెరుగుతుంది

అంతరంగంలో రాగం...’’అని చెప్తూనే-

‘‘కావలసినదానికంటే ఎక్కువగా

కామిత ఫలాన్ని ఒడిగట్టచూడకు’’ అని సలహా యిస్తూ – 

కొసమెరుపుగా-

‘‘ఇది నీకే కాదు

నీ పిల్లలకు కూడా పనికొచ్చే నిజం’’ అని ముక్తాయింపుని ఇస్తూ పిల్లల పట్ల అమితమైన ఆశలు పెట్టుకోవద్దని, అవి నెరవేరకపోతే కుంగిపోవలసి వస్తుందనే అర్థాన్ని ధ్వనింపజేస్తారు.

రాళ్ళు-పిచ్చివాళ్ళుఅనే కవితలో నేటి సమాజాన్ని వ్యంగ్యంగా చిత్రిస్తూ 

‘‘ఎక్కడ చూసినా ఈ రోజుల్లో

పిచ్చివాళ్ళ చేతుల్లో పిడుగుల్లాంటి రాళ్ళు’’ అంటారు.

దైవం గురించి చాలా కవితల్లో ఉన్నాడో లేదో అనే వెతుకులాటతో సంశయాత్మకంగా రాసారు కవయిత్రి. అందులో ఒకటిగాలి పిడికిలిలో

‘‘గాలి పిడికిళ్ళ వేలంవెర్రికి

కొంటె నవ్వులు రువ్వుతూ

గుండెగుడిలో దీపంలా నువ్వు’’ అంటూ ప్రతీ మనిషిలోనూ గుండెల్లోనూ వెలిగే దీపమే దైవమని తీర్మానిస్తారు.

కొన్ని కవితల్ని మాత్రాఛందస్సు పద్ధతిలో పంక్తి చివర ప్రాసని పెట్టి ఒక లయతో నడిపారు. అవి ఆనాటి కవులైన శ్రీశ్రీ వంటివాళ్ళు తొలినాళ్ళలో రాసిన విధానాన్ని తలపిస్తాయి.

‘‘బ్రతుకు పాట ప్రిదిలి

కదులు బాట నొగిలి

శృతి చలించి

మతి భ్రమించి’’ అంటూ లయను పొదువుకొని సాగుతాయి. భరతమాతని హిమావృత శైలపంక్తి కిరీటంతో, వింధ్యాచల వడ్డాణంతో, గంగాయమున కంఠహారాలతో అలంకరించి అప్సరసలా ఉన్న దేశం ఈనాడు మామూలు స్త్రీలా పిల్లల చేతికి ఒకముద్ద అందించలేని పేద అమ్మగా మార్చేస్తున్న అదృశ్యహస్తాల్నీ వాటిని పడగొట్టాలని తపన పడ్తూ, మాత ముఖంలో వెలుగు కోసం హారతి కర్పూరమై కరిగిపోవాలని ఆరాటంతో ఆరు పేజీల సుదీర్ఘ కవిత అర్థవంతంగా మంచి పదచిత్రాలతో అక్షరీకరించారు కవయిత్రి.

సముద్రం, అగ్ని, జ్వాలా, శిఖలను కవిత్వ పంక్తులలో పొదుగుకొంటూ కాలాన్ని తన నెచ్చెలిగా భావించి తనలో లయింపచేసుకొంటూ సర్వ విషయాలూ కాలనెచ్చెలికి అర్థమయ్యేలా ఆమె చేయి పట్టుకుని ముందుకు తన గమనాన్నీ గమ్యాన్నీ నిర్దేశించుకుంటూ పోతుంది అనే విషయాన్ని అనేక కవితల్లో  ప్రస్తావిస్తారు.

మరొక మంచి కవితమట్టి మనిషి’. బాల్యం నుండి మనిషికి మట్టితోగల అనుబంధాన్నీ, అమ్మకీ మట్టికీ గల సాదృశ్యాల్నీ, అభేధాల్నీ వర్ణిస్తూ

‘‘తొలకరింపు తడుపుకు

చిలకరించిన మట్టివాసనల చిక్కదనంలో

అమ్మవాత్సల్యపు కమ్మదనాన్ని’’- చెబుతారు

‘‘నన్ను కన్నతల్లి ఆంతర్యంలో

నా నేలతల్లి ఆధిక్యాన్ని కొలిచే

నేనింకెవరిని మట్టిమనిషిని’’ అని సామాజిక జీవనంలోకి మమేకమౌతారు.

సాధారణ పదాలతోనే కవితల్ని అల్లే నేర్పు బహుశా జానపద సాహిత్య పరిశోధనలవల్ల అలవోకగా అలవడింది. అలా రాస్తూ రాస్తూనే ఒక్కొక్కప్పుడు అకస్మాత్తుగా భారీ సమాసాల్ని కవితలో చొప్పించేస్తారు. అంతకుముందు చదివిన కావ్యప్రభావం వల్ల అలాంటి పదగుంఫనలోకి వెళ్ళిపోతారు. అటువంటి వాటిలో కొన్ని ఉదాహరణలు-

  1. శాద్వలాంచల వాః కణాలకు మల్లె
  2. దురంత భీషణ క్రుధోద్విగ్న ప్రకృతి
  3. తీరస్థ పృధు శిలాగ్ర స్పర్శనం
  4. దుష్టచ్ఛేద నోన్ముఖ నిస్త్రింశిక వంటి పంక్తులు వారి కవితల్లో దొర్లడం కనిపిస్తుంది. 

అయితే అటువంటివి బహు తక్కువే.

ఏడున్నర పేజీలఊడలమర్రికవిత కొమ్మల నీడన గూటిలోని పక్షుల గాథను కథాత్మకంగా వర్ణిస్తారు. అటువంటిదే నాలుగన్నర పేజీలచౌరస్తా’. మరొకటి ఏడు పేజీలఅన్నదమ్ములుకవిత సంభాషణాత్మకంగా నడుస్తుంది. పగలంతా గిల్లికజ్జాలుతో అమ్మని సతాయించిన అన్నదమ్ములు రాత్రి కావలించుకొని పడుకున్న అన్నదమ్ములు స్వప్న వియద్గంగలో సేదతీరుతున్న శ్వేతయుగళంతా వున్నారంటూ అందమైన పదచిత్రాలతో కథన కవితగా రాసారు కవయిత్రి.

మరొక మంచి కవితహుసేన్ సాగర్లో-

‘‘చక్కని హైదరాబాద్ చూపించమని

సముద్ర పాప గగ్గోలు’’ పెడితే

అలల పిడికిళ్ళతో నీటిని విసిరితే

తీరిన కడలిముక్కే

నగర శరీరాన్ని హత్తుకున్న

సొగసైన హుసేన్ సాగర్ పాప’’ అంటూ హుసేన్ సాగరాన్ని కడలిముక్కగా పోల్చిన తీరు చక్కటి పంక్తులుగా తీర్చారు. ఈ కవిత నిండా మబ్బుపిల్లలు తారట్లాడుతారు. నేలతల్లి తన ఒడిలో అమర్చుకున్న నిర్మలమైన అద్దం బిళ్ళగా హుసేన్ సాగరాన్ని పోల్చుతారు. అంతటి నిర్మల కాసారాన్ని ధ్వంసం చేస్తోన్న గుర్రపు డెక్కల మొక్కల్ని గురించీ వాపోతారు కవయిత్రి.

సాధారణంగా భావకవిత్వచ్ఛాయలున్న కవులు వెన్నెలతోను, పూలతోనో, మలయపవనంతోనో మమేకమౌతారు. విప్లవ కవులు సూర్యుని తోనో, జ్వాలలతోనో పోల్చుకుంటారు. కానీ కృష్ణకుమారి గారు మాత్రం-

మనిషికీ మనిషికీ మధ్య

కనీ కనపడని

ఎర్రడాలు మనసు మంటల్నీ

దయ్యంలా అసూయని పెంచే

మానవత్వం మసిచేసే మంటల్నీ

కన్నెర్రని మంటల్నీ ఆర్పే

బొగ్గుపులుసు గాలిని’’ అంటారు కవయిత్రి.

ఎప్పుడూ మనిషి అంతరంగ దర్శనం చేస్తూనే అతని బాహ్య జీవన విధానాన్ని సరిపోల్చుతూ కవిత్వీకరించడం ఈ కవయిత్రి సాహిత్యలక్షణం. అందుకే ఆమెచింతలూ, చికాకులూ, నిరాశలూ, దురాశలూ, కష్టాలూ, కన్నీళ్ళూ, సుఖాలూ, సంతోషాలూ, సంతృప్తీ, త్యాగరక్తీ వంటి సమస్త పార్శ్వాలూ రంగరించుకొని రూపెత్తిన సగటు మనిషే నా కవిత్వమంతటా విశ్వరూపావిష్కరణంగా ఉండాలనుకుంటాను’’ అంటారు.

నాయని కృష్ణకుమారి గారి తల్లిని ఆరోగ్యవంతురాల్ని చేసే క్రమంలో వైద్యురాలిగా పరిచయమై హృదయానికి దగ్గరైన ఆత్మీయ మిత్రురాలైన డా. పి. శ్రీదేవి మరణవార్త (1962)విని ఆర్ర్దంగానే కాక ఆత్మీయ స్పర్శను నింపుకున్న స్మృతిగీతం ‘‘ఏం చెప్పను నేస్తం’’ కవిత-

‘‘నీవు మామధ్యను లేనందున / మాకు వెలితి!

నీ కలం కథలుగా మారనందున /తెలుగు కథలకే వెలితి!’’

అంటూ ఆద్యంతాలకి అందకుండా ఆవేశకావేశాలు పట్టని ప్రతికూల పరిస్థితుల్ని సైతం అనుకూలంగా మలచుకోగల అంతర్గతంగా శక్తిశాలిని యైన డా. పి. శ్రీదేవికి ఆత్మీయంగాఏం చెప్పను నేస్తంకవితాసంపుటిని అంకితం ఇచ్చారు కృష్ణకుమారి.

ఈ సంపుటిలోని కవితలన్నింటా సమాజంలో పెచ్చరిల్లుతున్న హింసా, ఆర్థిక అసమానత, విద్యారాహిత్యం, కులమత ప్రాంత విద్వేషాలూ, ఇలా సమాజాన్ని కుదిపేసిన పలు సమస్యల్ని గుదిగుచ్చి రాసిన ఆరేడు పేజీల పెద్ద కవితలే ఉన్నాయి. అంతవరకూ ఉగాది సమ్మేళనాల్లో మామిడిపూతలూ, కోయిల పాటలూ, చెరుకు, మామిడుల రుచులూ వీటితో కోమల కవిత్వాన్ని వినిపించే కవి సందర్భాలలో కృష్ణకుమారి సామాజిక సమస్యలవైపు దృష్టి సారించి అరవయ్యో దశాబ్దంలోనే కవిత్వీకరించటంలో రచయిత్రి సామాజిక దృష్టి కోణం తెలుస్తోంది.

ఇంద్రధనస్సులోని రంగుల్లా విభిన్న అంతరాలు వున్న జనాల్ని ఈ ఉగాదైనా ఒక్కటిగా చేస్తుందా అనే ఆశావహ దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ జనంలో పొడచూపుతున్న అనేకానేక వైరుధ్యాల గురించీ, పెచ్చుపెరుగుతోన్న హింసాప్రవృత్తుల గురించీ, అంతకంతకూ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్న పేదల గురించీ, అక్షరాల్లో పొదుగుతూ వాపోతారు కవయిత్రి.

దేవుని అస్తిత్వాన్ని నిర్ధారణ చేసుకోలేని సంశయంలోమృత్తికాతృష్ణకవితలో మట్టికీ మనిషికీ గల అవినాభావ సంబంధాన్ని వివరించే క్రమంలో నగర రోడ్లు విశాలం చేయాలనుకుంటే రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే మతాలయాల గురించి నిరసిస్తారు.

‘‘సామాన్యుని బతుకుని బాగుచేయమని

అడ్డమైన దేవతల్నీ

అడుక్కుంటున్న తరుణంలో

కనురెప్పలమీది నీలితెరల్ని లాగి

వెలుగుసూదుల్ని గుచ్చుతుంది

ఉగాది ఒయ్యారి’’ అని మూఢభక్తిని నిలదీస్తారు.

1969లో వచ్చిన ఉద్యమ నేపథ్యం వలన కాబోలు తెలుగు భాష గురించిన కవితల్లో మాతృభాషాభిమానాన్ని వెల్లడించడమే కాక అందరం ఒక భాషామతల్లి బిడ్డలమేనని తెలుగు కవిత్వం సార్వజనీనత్వాన్ని అభిలషిస్తూ కొన్ని కవితలను రాసారు. 

మొదటి కవితాసంపుటి తన తండ్రి నాయని సుబ్బారావుకి అంకితమిచ్చిన కృష్ణకుమారి సుమారు పాతికేళ్ళ తర్వాత రాసినసౌభద్ర భద్రరూపంగా శోభనిచ్చే చిరునవ్వుతో ఆర్తులైన వారినందరినీ, ఆత్మీయంగా అభిమానించే తల్లి భద్ర రూపాన్ని తలచుకుంటూ తల్లికే అంకితమిచ్చారు.

ఇందులోని చాలా కవితల్లో తన బాల్యాన్ని తలపోస్తూ, ఆ సమయంలో ప్రేమగా హత్తుకునే తల్లిని గుర్తుచేసుకొన్నారు కవయిత్రి.

‘‘పెను ప్రపంచంలోకి నన్ను

నిర్దాక్షిణ్యంగా విసిరేసి

మూసుకుపోయిన నీ గర్భ ద్వారం’’అంటూ తన పుట్టుకని గుర్తు చేసుకుంటూ, చల్లటి స్పర్శలా చాచిన చేతుల మధ్య ఒదిగిపోయి ఆమె గుండెమీద గువ్వపిట్టైనప్పటి దృశ్యాల్నీ దూదుంపుల్లా, తొక్కుడు బిళ్ళాట నాటి ఉత్సాహాన్నీ అక్షరబద్ధం చేసారు. ఈ క్రమంలో ప్రకృతినంతటినీ తల్లీబిడ్డలుగా వర్ణించటం గమనార్హం. బద్దకంగా పడుకున్న కొండలు చెట్లచేతులు చాపాయంటారు. ఆకాశం భూమిపిల్లను సందిట పొదువుకుందంటారు. రెక్కలు మొలిపించుకున్న పులుగుకూన /శ్రమించి కట్టిన గూడును దాటి ఎగిరిపోయి రాబందుల పాలౌతుందేమోనని దిగులుపడతారు.

‘‘నేలతల్లి నిర్భర వక్షాన

తల్లిని కరచుకున్న పిల్ల పోలిక

పల్లవించిన అడవి!’’ని దర్శిస్తారు ఈ విధంగా అంతటా మాతృదర్శనాన్ని వీక్షిస్తున్న కృష్ణకుమారిగారు తన జీవన సంధ్యలో ముందుకు వేస్తున్న ప్రతీ అడుగూ మృత్యువు వైపుకు కాదంటారు. తనవెనక ఘనీభవించిన కాంతిసముద్రం వైపు, దాంట్లో వటపత్రశాయి లాంటి బాల్యంవైపూ, తన పుట్టుకకు కారణమైన గర్భద్వారంవైపు ప్రయాణించి తిరిగి తల్లి గర్భగూడులో గువ్వపిట్టలా ఒదిగిపోవాలని కలగంటారు కవయిత్రి.

తొలి సంపుటిలో దైనం గురించి డోలాయమానంగా ఉన్న కవయిత్రి  ఈ సంపుటి చివరి మూడు కవితల్లో  దైవాన్ని నిర్ధారించుకుంటారు.

తిరునామం కింద కళ్ళకలువల్నీ, విశ్వరూప చమత్కారానికీ, ఉక్కిరిబిక్కిరై, ఊపిరందని చేపపిల్లలా ఎగసిపడుతూ తలంచుతున్నానని అంటారు.

ప్రతి కవితనీ ఒక సామాజిక బాధ్యతతో, సమసమాజ భావనతో, మానవీయ దృక్పథంతో రాసారు కవయిత్రి. అనేకచోట్ల మట్టినీ, నేలనీ, దేశాన్నీ, మాతృభాషనీ, తల్లితో పోలుస్తూ మాతృభావనని అనేక కవితల్లో కవిత్వాన్ని అమ్మగా రూపుదిద్దారు నాయని కృష్ణకుమారి.

మూడు నాలుగు దశాబ్దాల పాటు అనేక సాహిత్య ప్రక్రియలతో పాటూ కవిత్వానికి నిర్భయాన్ని అద్ది ఉద్యోగ సంబంధమైన ఒత్తిడులలో సైతం తనదైన శైలిలో కవిత్వాన్ని రాస్తూ విదుషీమణిగా కవిత్వ పతాకాన్ని ఆవిష్కరించిన కవయిత్రి నాయని కృష్ణకుమారి.

 

 

 

 

 

 

 

 

సాహిత్య వ్యాసాలు

ఎరుకలేని ఎరుకలస్త్రీల జీవితం 

           అరుణ రాసిన ఎల్లినవల 1992లో తొలిసారి అచ్చయింది. నీలితో కలిపి 1996లో విరసం వారు ప్రచురించారు. ఎల్లికి కొనసాగింపే నీలి నవల కూడా!. ఎల్లినవల ఎరుకల జీవన విధానాన్ని మన ముందు పరిచింది. అందులోనూ స్త్రీల జీవితాన్ని కేంద్రంగా చేసుకుంది. ఈ నాటికీ బాల్య వివాహాలు, ఓలి వంటి దురాచారాల కింద నలిగిపోతున్న చిన్న పిల్లల్ని వాళ్ళ బానిసత్వాన్ని మన ముందు నిలబెట్టింది ఈ నవల.

            ఎరుకల వారి జీవనం ప్రధానంగా పందుల పెంపకంపై ఆధారపడి ఉంటుంది. ఆడవాళ్ళు ఈతాకు బుట్టలు, చాపలు అల్లుతారు. కొందరు సోదె చెప్పటం, పచ్చబొట్లు పొడవడం, పురుళ్ళు పోయడం కూడా చేస్తారు. 1991 జనాభా లెక్కల ప్రకారం 3,87,898 మంది ఎరుకల వాళ్ళు భారతదేశంలో ఉన్నట్లు తేలింది. వీరిలో 25.74% అక్షరాస్యత ఉంది. ఎరుకల వాళ్ళు ఆంధ్రలో కృష్ణా, విజయవాడ, తూ.గో., ప.గో. ప్రాంతాల్లో ఎక్కువగా నివశిస్తున్నారు. కృష్ణా జిల్లా వుప్పలూరు ప్రాంతానికి చెందిన అరుణ తన ప్రాంతంలో తనకు బాగా తెలిసిన ఎరుకల వాళ్ళ జీవితాన్ని దగ్గరగా లోతుగా పరిశీలించి, స్త్రీల పై అణిచివేతను, వారి జీవితాల్లోని చీకటి కోణాల్ని వెలుగులోనికి తెచ్చింది. ఇందులోని పాత్రలన్నీ సజీవమైనవే.

            ఎల్లి గురించి చెప్పాలంటే నాయనమ్మ మాలచ్చిమితో మొదలుపెట్టాలి. మాలచ్చిమికి చిన్నప్పుడే ఓలికి ఆశపడి పెళ్ళి చేశాడు ఆమె తండ్రి. ఇద్దరు బిడ్డల తల్లి అయ్యాక మొగుడు తాగుడికి డబ్బు అవసరమై సుబ్బన్నకు అమ్మేశాడు. గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్న పిల్లలు వదల్లేక ఏడుస్తూ ఉండగా బలవంతంగా లాక్కువచ్చాడు కొనుక్కున్నోడు. గుండెల్లో దుఃఖంతో తడి ఆరని కళ్ళతో మాలచ్చిమికి సుబ్బన్నతో సంసారం మొదలయింది. ఎంకన్న, బాజి పుట్టారు. బాజిని ఊరి కామందులు పాడు చేయడంతో పిచ్చిదై నదిలో దూకి చచ్చిపోయింది. పందులు తమ చేలో పడ్డాయని ఊరి పెద్ద కోపంతో సుబ్బన్న కాలు నరికేశాడు. కాలు కుళ్ళి సుబ్బన్న మంచాన పడి చివరికి చనిపోయాడు. కొడుకు ఎంకన్నకు దురగతో పెళ్ళయింది. దురగ నలుగురు పిల్లల్ని కని ఆఖరి కాన్పులో, కాన్పు కష్టమై చనిపోయింది. మా లచ్చిమికి వృద్ధాప్యం వల్ల కళ్ళు కనపడక గుడ్డిదయ్యింది. పెద్దపిల్ల ఎల్లిపదేళ్ళకే ఇంటి బాధ్యతనంతా నెత్తిన వేసుకుని చాకిరీ చేస్తుంది. పదకొండు ఏళ్ళు రాగానే తండ్రి ఎంకన్న ఎక్కువ ఓలికి ఆశపడి 30 యేళ్ళ తమ్మయ్యకిచ్చి పెళ్ళి చేశాడు. చిన్న పిల్లకావడంతో ఇంట్లోనే ఉంచుకున్నాడు. 13 సంవత్సరాలు రాగానే ఎల్లిని అత్తారింటికి పంపారు. అక్కడ ఇంటి చాకిరీ అంతా చేస్తున్నా కూడా ఎల్లిపై వాళ్ళకు కనికరం లేదు. అత్తా మామ తిట్టే వాళ్ళు. మొగుడికి అనుమానం ఎక్కువ. రోజూ కొట్టేవాడు.

            దువ్వ ఎంకన్న దగ్గర పెరిగాడు మాలచ్చిమి ఓసారి పొరుగూరికి పెద్దోళ్ళ ఇంట్లో పురుడు పోయడానికి వెళ్ళింది. బిడ్డ పుట్టగానే వాళ్ళు మాలచ్చిమికి ఇచ్చి వడ్ల గింజ వేసి చంపుకుంటావో, పెంచుకుంటావో నీ యిష్టం అన్నారు. బంగారం లాంటి బిడ్డను చంపడానికి చేతులు రాక పెంచి పెద్ద చేసింది. దువ్వుకు నీలిఅంటే ఇష్టం నీలికి కూడా దువ్వ అంటే ప్రాణం. నీలి కోమలి కూతురు. నీలి చిన్నప్పుడే తండ్రి ఎక్కువ ఓలి కోసం రోగిస్టి వాడికిచ్చి చేశాడు. మొగుడు పోగానే నీలి సోదె చెప్పుకుంటూ తల్లి దగ్గర బతుకుతోంది. కొడుకు చస్తే మాత్రం అదినా ఇంటి గొడ్డు కాకుండా పోద్దా! ఎవడన్నా పలుగేసి దాన్ని తోలుకు పోవాలంటే నా ఓలి నాకు కట్టాల్సిందేఅన్నాడు నీలి మామ సంగయ్య పంచాయితీలో.ఊరిని కులం కట్టుబాట్లను నీలి ,దువ్వ లెక్కపెట్టక పంచాయితీని ఛీకొట్టి వెళ్ళిపోయారు. 

            ‘ఎల్లినవలలో స్త్రీ జీవితం చుట్టూ ఉన్న మూడు వలయాలను రచయిత్రి చిత్రించారు. ఈ నాటికీ ఎరుకల వాళ్లలో బాల్యవివాహాలు, ఓలి వంటి దురాచారాలు ఉన్నాయి. తాగొచ్చి ఆడవాళ్లను కొట్టడం, తన్నడం మగవాళ్ల జీవితంలో ఒక భాగం. కుటుంబంలో ఉన్న ఈ గృహహింసఒక విషవలయంగా స్త్రీల చుట్టూ బలంగా ఉంది. దానిని జాగ్రత్తగా అమలు పరుస్తూ కులం కట్టుబాట్ల పేరుతో కులపెద్దలు జరిపే కులపంచాయితీలు రెండవ వలయం. మొత్తం ఎరుకల వారిని అందరినీ అణిచివేస్తూ ఆడవాళ్ళపై భూస్వాములు చేసే ధౌర్జన్యం మూడో విషవలయం’’ ఆడది మగోడి చెప్పు  కింద తేలుతొక్కి పట్టాలి అని ఎరికల వాళ్ళు అనుకుంటే, ఎరికల వాళ్లు మన కాళ్లకింద చెప్పులాంటి వాళ్ళు అణిచి వేయాలి అని భూస్వాములు అనుకుంటారు. భూస్వాముల వాళ్ల కింది చెప్పుల్లాగా ఎరికలోళ్ళు. ఆ చెప్పుకింది తేలులాగా ఆడోళ్లు ఉన్న వ్యవస్థ వారిది.

            మొత్తం మీద భూస్వాములు, కుల పెద్దలు, ఇంట్లోని మగోళ్లు అందరికీ ఆడదాన్ని అణిచి వేయాలన్నదే  ఆలోచన.లోకానికంతా పంబలోడు లోకువ, పంబలోడికి పంబలది లోకువ’’ అంటుంది. మాలచ్చిమి కుటుంబం, వ్యవస్థ, రాజ్యం, చట్టం, స్త్రీల జీవితాలపై చూపే పెత్తనాన్ని ఎల్లినవల చిత్రీకరించింది.

            ఈ నవలలో రచయిత వాచ్యంగా కాక, సూక్ష్మంగా చెప్పింది ఒకటి ఉంది. అది కింది కులాల స్త్రీలపై ఉన్న ఒక అపోహను దూరం చేసింది. బ్రాహ్మణకులానికి చెందిన హనుమాయమ్మ మాలచ్చిమి దగ్గర బాధపడుతుంది. తన కూతురికి పెళ్ళి చేస్తే రెండేళ్ళకే ఇంటికి వచ్చేసింది. మొగుడు ఇంకో దాన్ని  ఉంచుకోవడంతో, మా యిండ్లల్లో ఒక సారి పెళ్లయితే ఆడదాని జీవితం ఇక అంతే వాడు చచ్చినా, బతికినా వాడే మొగుడు మీకు ఈ కట్టు బాటు లేదు కదా. ఇష్టం లేనోడిని వదిలి మారు మనువు చేసుకోవచ్చు అంటుంది. అందుకు మాలచ్చిమి ఆ సొతంత్రం మాకెక్కడిది అమ్మగారు? కన్నోడు డబ్బు కోసం అమ్ముతాడు. కట్టుకున్నోడి దగ్గిర చాకిరీ చేస్తాం. పిల్లల్ని కంటాం. కట్టుకున్నోడు. తాగుడు కోసం అమ్ముతాడు. పిల్లల్ని లాక్కుంటాడు. ఆ చిన్న పిల్లల్ని వదల్లేక ఏడుస్తూ కొనుక్కున్నోడి వెంట వెళతాం. ఉత్త గొడ్డు బతుకు మాదిఅని వాపోతుంది. ఆశ్చర్యపోయిన హనుమాయమ్మ ఆడదాని బతుకు ఎక్కడైనా ఒకటే అని బాధపడుతుంది.

            సాహిత్యంలో ప్రతి రచన తన పూర్వకాలపు లేక సమకాలీన రచనతో అల్లుకుని ఉంటుంది. ఆ అల్లుకను Inter textuality అంటారు. ఒక రచనలో అంతర్వాహినిగా ఉన్న అనేక రచనల్ని గుర్తుపట్టడం విమర్శకుడికి గొప్ప అనుభూతి. ఆ దృష్టితో పరిశీలిస్తే గురజాడ పూర్ణమ్మ ఎల్లిగాను, కన్యాశుల్కంలోని బుచ్చమ్మ. మధురవాణి నీలిలోను కన్పిస్తారు. అంతకంటే ఎక్కువగా ఎల్లి నవల్లో ఎరుక స్త్రీల బానిసత్వం అమెరికాలోని నీగ్రోల బానిసత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఎల్లి నవలకు స్తోవే రాసిన అంకుల్‍ టామ్స్ కాబిన్‍కు దగ్గరి పోలికలు ఉన్నాయి.ఈ నవలను రంగనాయకమ్మ టామ్‍ మామ ఇల్లుఅనే పేరుతో అనువదించారు. స్తోవే రచన బానిసల దుర్భర జీవితాల్ని వెలుగులోనికి తెచ్చింది. తెల్లోళ్లు బానిసల్ని కొట్టడం, చంపడం, వేలం వెయ్యడం వంటి దురాగతాలను ఎండగట్టింది. ఈ నవల ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య అంతర్యుద్ధానికి కారణమై, చివరికి బనిసత్వ రద్దుకు దారితీసింది.

            అయితే అక్కడ బానిస స్త్రీలు యజమాని నుంచి మాత్రమే తిట్లు తన్నులు తింటారు. ఇక్కడ ఎరికల స్త్రీలు భూస్వాములు నుంచి మాత్రమే కాక, తమ తండ్రి, మొగుడు, మామ, చివరికి కొడుకు నుంచి కూడా తన్నులు తింటారు. నా బతుక్కి చర్నాకోలపోయిందనుకుంటే, ఈ కొడుకు మొగుడు తగులు కున్నాడే అని కత్రేణి వాపోతుంది. కొడుకు తాగుడు కోసం డబ్బులు ఇవ్వడం లేదని తల్లి అని కూడా చూడకుండా తిడుతాడు. కొడతాడు. రంగనాయకమ్మ జానికి విముక్తి నవలలో బానిసలకు స్త్రీలకు మధ్యగల పోలికల్ని పన్నెండింటిని పట్టికలాగా చూపారు. ఈ నవలలో అరుణ గొడ్డుకి ఆడదానికి ఉన్న పోలికల్ని చూపించారు. నీలిని గొడ్డుతో పోలుస్తూ ఎక్కువ ధర చెపుతాడు మామ సంగయ్య.నీలి

1. సావిల్లు మారిన గొడ్డుకాదు

2. ఈత తీనిన గొడ్డుకాదు

3. వొడికి లొంగిన గొడ్డుకాదు

4. పనిపాట చేయగలగొడ్డు

            చాకిరీ తెలుసు మగోడి తరువాత మగోడంత చేవగలది అంటాడు సంగయ్య.అందుకే నీలికి ఏక్కువ ఓలి చెల్లించమన్నాడు. ఈ విధంగా అరుణ ఎల్లి నవల ద్వారా ఎరుక స్త్రీల జీవితంలో దాగిన చీకటి కోణాల్ని వెలుగులోకి తెచ్చారు.

 

( రచయిత : డీన్‍  మరియు  సెనెట్‍ మెంర్‍ , తెలుగు అధ్యయన శాఖ , శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి - 517 502)

 

 

సాహిత్య వ్యాసాలు

కవి కలముకుకు, శిల్పి ఉలికి...

(అలనాటి తెలుగు సినిమా రచయిత 'సదాశివ బ్రహ్మం' గారి జయంతి ఉత్సవాల సందర్భంగా...)

కవి కలముకు,శిల్పి ఉలికి,కళ కంచెకు

ఈ మూటికి సాటి రాదోయ్... పోటీ లేదోయ్

అంటూ వెండితెర సాక్షిగా బల్లగుద్ది కళారూపాలకి ఈ ప్రపంచంలో ఏవి సాటిరావు అని చెప్పిన మొదటి తరం సినిమా రచయిత 'సదాశివబ్రహ్మం'. ఆయన పేరు ముందు 'వెంపటి' అనే ఇంటి పేరు మీద పాడిన గుర్తులేదు. సదాశివబ్రహ్మం అంటేనే సర్వజ్ఞులని ఒక సినిమా చేతికి వస్తే కథ,మాటలు,పాటలు వ్రాసి సిద్ధం చేయగల సమర్ధులని ఆనాటి సినీ నిర్మాతల నమ్మకం.అది నిజం అని ప్రేక్షకులు,సినీ అభిమానులు, మేధావులు సైతం తలలూపి మెచ్చుకున్న కాలం.పాతకాలపు తెలుగు సినిమా వెండి తెర వెలుగుల యుగం. ఆ సినిమా సాంఘికం,పౌరాణికం,చారిత్రకం, జానపదం ఏదైనా ఆ విషయంలో కి శ్రీ సదాశివబ్రహ్మం గారు పరకాయ ప్రవేశం చేసి కథా కథనాన్ని రాణింపజేయడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య.

ఆయన 1905 డిసెంబర్ 29 వ తారీకున వెంపటి వారి పండిత కుటుంబంలో తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుండి భాష,వేదం, సంస్కృతి,సాంప్రదాయం, పాండిత్యం వంటి విషయాలు ముఖరితమయ్యే ఇంట్లో పెరిగారు. 10 ఏళ్ళ వయసుకే పద్యాలు వ్రాయగల ప్రావీణ్యం సంపాదించారు.స్కూలు చదువు ఎనిమిదో క్లాస్ వరకే అయినా పంచకావ్యాలు చదివి వాటి సారాన్ని గ్రహించారు.

శ్రీ వెంపటి సదాశివబ్రహ్మం 1941 వ సంవత్సరంలో సినిమారంగంలో రచయితగా పని చేయాలని ఆసక్తితో మద్రాసు నగరం చేరారు. ఆయనకి 1941 రాజా శాండో అనే దర్శకుని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'చూడామణి' అనే సినిమాకి రచయితగా పని చేసే అవకాశం లభించింది.అదే ఆయనకి తొలి సినిమా.ఆ వెంటనే తెనాలి రామకృష్ణ,ఘరానా దొంగ, పల్నాటి యుద్ధం, పరమానందయ్య శిష్యుల కథ లాంటి కొన్ని సినిమాలకు రచన చేశారు. అంటే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు అన్ని ఆయనే రాశారు. అయితే 1960లో తోట సుబ్బారావు నిర్మించిన 'పరమానందయ్య శిష్యుల కథ' బాగా పాపులర్ గా అందరికీ తెలిసినది. అది బాగా ఆడి, డబ్బులు కూడా బాగా వచ్చాయని ఆనాటి వారు చెప్తూ ఉంటారు. ఈ పరమానందయ్య శిష్యుల కథ కి కూడా రచయిత శ్రీ సదాశివ బ్రహ్మం గారే. అదీ చమత్కారం.

ఆయనకి బాగా గుర్తింపు వచ్చిన చిత్రం రాధిక (1947) అని చెప్పుకోవచ్చు. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. సాంకేతికంగా సినిమా మా మెరుగుపడటం, రావు బాలసరస్వతీ దేవి లాంటి ప్రతిభావంతులైన వారు అందులో పాటలు పాడటం, అవి ప్రచారానికి అవకాశం కలగడం కొన్ని అంశాలు.

'రాధిక' లో

గోపాలకృష్ణుడు నల్లన

 గోకులంలో పాలు తెల్లనా కాళిందిలో చల్లనా

పాట పాడండి నా గుండె జల్లున

అంటూ మారుమోగుతూ ఉండేది అప్పట్లో రేడియో మధ్యాహ్నం ఓపెన్ చేస్తే చాలు ఈ పాట వాడ వాడంత వ్యాపించి వినిపించేది. చాలా కాలం వరకు ఇదొక ప్రైవేటు గ్రామఫోన్ రికార్డు గా అందరూ భావించేవారు. పాడిన వారి పేరు చెప్పినా రచయిత పేరు, సంగీతం చేసిన వారి పేరు మరీ చూస్తే సినిమా పేరు కూడా తరచూ వినిపించేవి కావు.తెరవెనుక పనిచేసే రచయితలు నిజంగా తెరవెనుక గానే ఉండిపోవడం జరుగుతూ వచ్చింది చాలాకాలం.

నెమ్మదిగా 1949లో వచ్చిన కీలుగుఱ్ఱం తో రచయితకి కూడా గుర్తింపు లభించింది.అన్నిటికీ మించి 1950లో విడుదలైన 'సంసారం' సినిమాతో సదాశివబ్రహ్మం గారికి మంచి గుర్తింపు వచ్చింది. సిల్వర్ జూబ్లీ చేసుకున్న సినిమా. చిన్న చిన్న టౌన్ లలో కూడా 100 రోజులు పైన ఆడిన సినిమా ఈ సంసారం. ఇందులో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు,సావిత్రి లాంటి వాళ్లు స్టార్స్ గా మారారు. ఇందులో మెయిన్ లక్ష్మీరాజ్యం అయినా ఆమె అప్పటికే స్థిరపడ్డ నటి.ఈ సంసారం సినిమాకి రచన, సంగీతం, నటీనటుల ప్రతిభ అన్నిటికీ మించి సమకాలీన సాంఘిక వాతావరణం సినిమా విజయానికి దోహదపడ్డాయి. సువర్ణ దక్షిణామూర్తి అద్భుతమైన సంగీతం చేసిన సినిమా సంసారం.

 ఈ సినిమాలో

1.సంసారం సంసారం

ప్రేమ సుధా పురం

నవ జీవన సారం- సంసారం

 ఘంటసాల పాడారు

2.చిత్రమైనది విధి నడక

 పరిశోధన ఒక వేడుక

3.కలనిజమాయెగా కోరిక తీరేగా

4. టకు టకు టకు టమక్కుల బండి

లాంఖానాల బండి ఎద్దుల బండి ఇలా రక రకాలుగా పాటలు అప్పట్లో అందరినీ ఎంతో అలరించాయి .సదాశివ బ్రహ్మం గారి రచన కు ఒక గుర్తింపు మెప్పూ లభించాయని చెప్పుకోవచ్చు.

సదాశివ బ్రహ్మం గారి చిత్రాలలో ముఖ్యమైనది 'వద్దులే డబ్బు' (1954) చిత్రమైన,సరదా కథని అద్భుతంగా నడిపిన తీరు బాగుంటుంది. ఇందులో అల్లదే! అవతల అదిగో పాట చాలా బాగుంటుంది.ఇది జిక్కి పాడారు. ఈ 'వద్దంటే డబ్బు' చిత్రం లో ఎన్టీఆర్,షావుకారు జానకి,జమున, పేకేటి ముఖ్య పాత్రలు పోషించారు. కళ్యాణం చక్కని సంగీతం సమకూర్చారు.వై ఆర్ స్వామి దర్శకులు.

1.చదవాలి కంటిలోని మదిలోని 2.ప్రేమ గీతి (ఏ ఎమ్ రాజా సుశీల) ఎవరో దోషులు పాటలు సదాశివబ్రహ్మం వ్రాశారు. ఈ సినిమాలో శ్రీ శ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి కూడా రాశారు. అప్పట్లో సదాశివబ్రహ్మం వారిద్దరికీ ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా రాశారని సినీ సంగీతాభిమానులు కొనియాడారు.అది అతిశయోక్తి కాదు.నిజంగా వారి సాహిత్యం పాటలు చాలా ఉదాత్తంగా ఉంటుంది.

చాలా పేరు తెచ్చిన చిత్రం ఈ వద్దంటే డబ్బు ఆ తర్వాత సదాశివబ్రహ్మం గారు చాలా విజయవంతమైన చిత్రాలకు పని చేశారు.

 'భలేరాముడు' (1956) ఈ చిత్రంలో లోనూ చాలా చక్కని పాటలు ఆయన రాశారు. ముఖ్యంగా 'ఓహో మేఘమాల నీలాల మేఘమాల! చల్లగ రావేలా మెల్ల మెల్లగ రావేలా! ఈ పాట అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి విడివిడిగా పాడతారు. కథాపరంగా సాహిత్యంలో తేడాలుంటాయి.ట్యూన్ దగ్గరగా ఉంటుంది.సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో గంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల పాడారు

'పక్కింటి అమ్మాయి' (అంజలి దేవి, రేలంగి ప్రధాన పాత్రలు) హాస్యరస ప్రధానమైన చిత్రం సదాశివబ్రహ్మం గారు ధీటుగా రచన చేశారు.చాలా విజయవంతంగా ప్రదర్శింపబడిన చిత్రం. 'సొగసైన క్రాఫు పోయే- నగుమోము చిన్నబోయే' అంటూ అప్పట్లో కుర్రాళ్ళు ఒకరినొకరు ఆట పట్టించుకునే వారు.

 'పరదేశి'కన్యాశుల్కం రచనతో తెరకెక్కాయి.పరదేశి సాధారణ సినిమానే అయినా 'కన్యాశుల్కం' నిజంగా కత్తి మీద సాము.తెలుగు సాహిత్యంలో గొప్ప క్లాసిక్ గా చెప్పుకునే నాటకం కన్యాశుల్కం గురుజాడ అప్పారావు గారి అద్భుత సృష్టి తెర అనువదించడం సదాశివబ్రహ్మం అద్భుతంగా నిర్వహించారు. ఇది సామాన్యమైన విషయం కాదు, సులువు కాదు ఆయన చదువుకున్నది ప్రాచీన సాహిత్యం, సంస్కృత కావ్యాలు కానీ ఆయన ఆలోచన అత్యంత ఆధునిక మని విశాల మని వారి సినిమా రచన పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. ఇందులో 'సరసుడ దరిచేర రా' అనే నృత్యగీతం రాశారు.ఇది ఎమ్.ఎల్.వసంతకుమారి పాడారు.

'ఇలవేలుపు' లాంటి విజయవంతమైన సినిమాలకు పూర్తిగా పనిచేశారు. 1940లలో వచ్చిన తెనాలి రామకృష్ణ కు వీరే పని చేశారు. మళ్ళి 1956 లో తీసిన తెనాలి రామకృష్ణ (ఎన్టీఆర్ ఏ యన్ ఆర్) సినిమాకి సదాశివబ్రహ్మం గారు రచన చేశారు. ఇందులో పద్యాలు పాటలు రాశారు. 'చేసేది ఏమిటో చేసేయి సూటిగా- ఘంటసాల పాడిన పాట సంప్రదాయ సిద్ధంగా ఉన్నా పద్యాలు మినహాయిస్తే పద్యాలు, పాటలు శ్రీ వెంపటి సదాశివబ్రహ్మం గారు రాశారు.

ఈ తెనాలి రామకృష్ణ (56) రచనా పరంగా సంగీతపరంగా పెద్ద హిట్. దీనికి సంగీతం కూర్చున్నవారు విశ్వనాథన్ రామ్మూర్తి.

భువన సుందరి- భామావిజయం, రణభేరి లాంటి ఎన్నో సినిమాలకు రచన చేశారాయన. ముఖ్యంగా చెప్పుకోవలసిన సినిమాలు 'చెంచులక్ష్మి- సువర్ణసుందరి- లవకుశ- అప్పు చేసి పప్పు కూడు- ఇల్లరికం- 56 లో వచ్చిన తెనాలి రామకృష్ణ. సాంఘిక సినిమాలు ఎంత బాగా రాసారో. అంత సమర్థంగానూ పౌరాణికాలు, జానపదాలు కూడా రాసి మెప్పించగల గలగడం ఆయన ప్రతిభకు గీటురాయి.

ఎల్ వి ప్రసాద్ గారి లాంటి సినిమా దిగ్గజం పక్కన రచయితగా మాటలు,పాటలు రాసి మెప్పించడం గొప్ప విషయం. ముఖ్యంగా అప్పు చేసి పప్పు కూడు లాంటి హాస్య చిత్రానికి పనిచేయడం విజయం సాధించడం వెంపటి సదాశివబ్రహ్మం గారికి ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవాలి.

లవకుశ చిత్రంలో రామాయణం పాటల్లో రచించారు. అందులోనే 'ఏ నిముషానికి ఏమి జరుగునో' అని రాశారు అలాగే చెంచులక్ష్మి చిత్రంలో 'పాలకడలి పై శేషతల్పమున' అంటూ విష్ణువుని స్తుతించారు.

 వెంపటి సదాశివబ్రహ్మం- మరణించే పర్యంతం సదా తెలుగు సినిమాలకు రచన చేస్తూనే ఉన్నారు.

 1968 జనవరి 1న ఆయన మరణించినా, సదాశివబ్రహ్మం రాసిన తెలుగు సినిమాలు ఈనాటికీ సినిమా అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. పాత తరం రచయితల ప్రతిభను చాటి చెప్తూనే ఉన్నాయి.

 

సాహిత్య వ్యాసాలు

దళిత మహిళా చైతన్యాన్ని ఎత్తిపట్టిన ‘కెరటం’

        దళిత రచయిత్రి తాళ్ళపల్లి యాకమ్మ జీవితంలో కష్టనష్టాలను అధిగమించి ఉన్నతస్థాయికెదిగినా ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలి అన్నట్లు తను పుట్టి పెరిగిన మూలాలను మరచిపోకుండా తెలంగాణాలో దళితుల పేదరికం, ఆకలి, అమాయకత్వం, అసహాయత, కష్టాలు, కన్నీళ్ళు, ఇతర వర్గాల నుండి వాళ్ళు ఎదుర్కొనే వివక్ష, అణచివేతలాంటి అనేక అంశాలను చూసి, విని వాటిని ఇతివృత్తంగా చేసుకొని రాసిన తన మొదటి నవల కెరటం’.

            ఈ నవలలో భిన్న మనస్తత్వాలు గల వివిధ పాత్రలున్నప్పటికీ ప్రధానపాత్ర మల్లమ్మది. నర్సయ్య, ఎల్లమ్మల అధిక సంతానంలో ఒకతైన మల్లమ్మ పెళ్ళి ప్రస్తావన, ప్రయత్నాలతో కథ మొదలవుతుంది. పెళ్ళంటే ఏమిటో తెలియని పసి వయసులో పెద్ద వయసువాడు, రెండవ పెళ్ళివాడు, అమాయకుడు అయిన మల్లయ్యతో మల్లమ్మ పెళ్ళవుతుంది. అంటే వాళ్ళలో బాల్య వివాహాలు సాధారణమని అర్థమవుతుంది. పెళ్ళి పిల్లను పెళ్ళి పిలగాని ఇంటికి తోలుకొని పోవడం, పోలు పొయ్యడం, కాని పెట్టడం, పాటలతో జరిగే పెళ్ళి తంతు, ఒడి బియ్యం పొయ్యడం లాంటి అంశాలు వాళ్ళ కుల ఆచారాన్ని సంప్రదాయాలను సూచిస్తాయి.

            చిన్న పిల్ల అయిన మల్లమ్మ అత్తగారింట్లో మల్లయ్య అన్న, వదినల అధీనంలో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఆమెను చాలా రకాలుగా కష్టపెట్టడం, ఆమె ఓర్పుతో సహించడం అమాయకుడైన మల్లయ్య అన్న, వదినల ఆగడాలను ప్రశ్నించలేక భార్య పడే కష్టాలను చూడలేక బాధపడడం వంటి అంశాలతో కథ సహజంగా సాగుతుంది. భార్య బాగు కోసం ఆలోచించే మల్లయ్య ఆమెను వాళ్ళ అమ్మమ్మగారింటికి తీసుకెళ్ళడం, అక్కడ అందరూ ఆనందంగా ఉండడం ఒక ఊరటగా అనిపిస్తుంది. ఇక్కడ పురుషాహంకారం లేకుండా మల్లయ్య భార్యను ప్రేమించడం, ఆమె గురించి ఆలోచించడం మంచి పరిణామంగా అనిపిస్తుంది. పొలాలు, పూట గడవడమే కష్టమైన పరిస్థితులు, కూలీల వ్యధలు అవసరాలకు దొరల దగ్గర అప్పు చేయడం, అప్పు తీరేదాకా వాళ్ళ దగ్గర పని చేయాల్సి రావడంతో పాటు రజాకార్ల సమస్య, దొరల ధాష్టీకం వంటి అంశాలను చదివినప్పుడు రచయిత్రికి వాటి పట్ల ఆవేదన, సంబంధిత విషయాలపై ఆమె నిశిత పరిశీలనా దృష్టి అర్థమవుతుంది.

            మల్లయ్య, మల్లమ్మలకు మొత్తం సంతానం అయిదుగురు ఆడపిల్లలు అందులో ముగ్గురు కేవలం సరైన పోషణ లేక పాలు కూడా దొరకని పరిస్థితిలో చనిపోతారు. బతుకు పోరులో భాగంగా అదే పనిగా ఎదురయ్యే కష్టాలను తట్టుకోలేని మల్లయ్య వేరే ప్రాంతాలకు వలస వెళ్తాడు. కొత్త చోటులో తెలిసిన వాళ్ళెవరూ లేక పరాయిగా ఉంటూ బతుకుల్ని వెళ్ళదీసే వలస కూలీల జీవితాలు ఎంత దుర్భరమో, అక్కడ నిలదొక్కుకోవడం, మంచితనంతో మనగలగడం ఎంత కష్టమో ఈ నవలలోని అనేక సంఘటనలు తెలియజేస్తాయి. అయితే మనషుల్లో ఉండే మంచితనం ఎవరో తెలియని వాళ్ళను కూడా అయిన వాళ్ళను చేస్తుందనడానికి వాళ్ళ దగ్గరలో ఉండే ఒక ముస్లిం కుటుంబంతో వాళ్ళకు ఏర్పడిన అనుబంధం, రెండు కుటుంబాల మధ్య పెరిగిన ఆత్మీయత ఒక నిదర్శనం. ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే సంభాషణలు, ఒకరికి ఒకరు తోడుగా నిలవడం హిందూ ముస్లింల ఐక్యతను చాటే విధంగా ఉంటాయి.

            ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. పుట్టుక నుండే కష్టాలు, చేదు అనుభవాలతో రాటుదేలిన మల్లమ్మ, ఒక సాధారణ గృహిణి అయిన మల్లమ్మ కష్టపడే తత్వంతో, నిజాయితీతో చుట్టుపక్కల అందరి మన్ననలు పొందుతుంది. ముగ్గురి పిల్లల తరువాత పుట్టిన బిడ్డ ఆకలిని తీర్చాలనే ఆశతో, ఆ బిడ్డకు వరి అన్నం పెట్టాలనే బలమైన ఆకాంక్షతో కల్లం దగ్గర ఉన్న పొల్లు తూర్పారపట్టి వడ్లను తియ్యాలని వెళ్ళిన చోట ఒక పాము వెంటబడుతుంది. దండంపెట్టి భయపడుతూ వేడుకుంటుంది. అయినా అది తన వెంటే రావడంతో వేరే దారి లేక తప్పనిసరి పరిస్థితిలో తెగువ చేసి ఒక కర్రతో దాన్ని చంపుతుంది. ఆ సమయంలో లింగయ్య అనే అతను లేని పాము ఉన్నట్లుగా చెప్పి ఆమెను భయపెట్టి పంపించి మోసంతో ఆమె కష్టఫలాన్ని పొందాలనుకుంటాడు. ఆ మోసాన్ని గ్రహించిన మల్లమ్మ పట్టు వదలకుండా తను కష్టంతో సంపాదించుకున్న వడ్లను దక్కించుకుంటుంది. అప్పటినుండి ఆమె పడిలేచే కెరటమై తమకు ఎదురయ్యే ప్రతి సమస్యనూ ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కూడగట్టుకుంటుంది.

            ఆ తరువాత మల్లమ్మ మళ్ళీ ఇంకో బిడ్డకు తల్లయ్యే క్రమంలో ముఖ్యంగా పురిటి నొప్పులతో బాధపడుతున్న మల్లమ్మను హాస్పిటల్‍కు తీసుకెళ్ళడం దగ్గర నుండి ఇంటికి చేరడం వరకు అన్నీ సమస్యలే మనుషుల స్వార్థం, సంకుచితతత్వం అలాంటి సమయాల్లోనే బయటపడతాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రయివేటు ఆసుపత్రిని నడుపుతూ వృత్తిని వ్యాపారంగా మార్చాలనుకునే డాక్టర్‍, నర్సుల ప్రవర్తన, అదే ప్రభుత్వ ఆసుపత్రిలో మానవతావాదంతో ఆదుకునే ఒక డాక్టర్‍. ఆ డాక్టర్‍ మల్లమ్మను ప్రాణాపాయస్థితి నుండి కాపాడుతుంది. కానీ బిడ్డను మాత్రం బతికించలేకపోతుంది. ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటళ్ళలో ఉండే నిర్లక్ష్యం, అలసత్వం, ఒకరినొకరు పట్టించుకోక పోవడం అదే సమయంలో వెల్లివిరిసే మంచితనం లాంటి విషయాలను వివిధ సంఘటనల ద్వారా నిరూపిస్తుంది రచయిత్రి. అక్కడ డాక్టర్‍ సుశీల మాటలతో ప్రభావితురాలైన మల్లమ్మ ఎట్లా అయిన బిడ్డ అనితను బాగా చదివించాలని సంకల్పిస్తుంది.

            తరువాత మల్లయ్య మల్లమ్మలు వాళ్ళకు యజమాని కేటాయించిన కొంచెం భూమిని సాగు చేయడం కోసం రెక్కలు ముక్కలు చేసుకోవడం, ఆడపిల్లకు చదువెందుకు అని ఎవరెన్ని అన్నా వినకుండా అమ్మాయిని చదివించాలనుకోవడంతో వాళ్ళ జీవితాలలో మార్పుకోసం ప్రయత్నం మొదలవుతుంది. ఇంకో ఆడపిల్లకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి ఆడపిల్లలు అని బాధపడకుండా వాళ్ళిద్దరినీ పెద్ద చదువులు చదివించి ఒకమ్మాయిని టీచర్‍ను ఇంకో అమ్మాయిని డాక్టర్‍ను చేస్తారు. ఇది ఒక సానుకూల పరిణామం. ఆడపిల్లలు వద్దు అనుకునేవాళ్ళకు ఒక సవాల్‍. కష్టేఫలి అని నమ్మిన మల్లమ్మ అనుభవం నేర్పిన పాఠాలే కాదు చదువునూ నేర్చుకుంటుంది. అభ్యుదయ దృక్పధంతో ఆలోచించి అంచెలంచెలుగా ముందుకెళ్తుంది. అసలు మీటింగ్‍ అంటే ఏమిటో తెలియని మల్లమ్మ వివిధ సమస్యలపై మీటింగుల్లో మాట్లాడే స్థాయికి ఎదుగుతుంది. రాజ్యలక్ష్మి అనే ఒక ఆదర్శ మహిళ స్ఫూర్తితో గ్రామ నాయకత్వాన్ని చేపడుతుంది. ఆచరణాత్మకతతో అడుగు ముందుకేస్తుంది. అభివృద్ధిని సాధిస్తుంది. అంబేద్కర్‍ భావజాలంతో ప్రభావితురాలై దళితులంతా తమ దృష్టిని చదువు, రాజకీయాలపై పెట్టాలని బోధిస్తూ, దళితులు, బహుజనుల పక్షాన నిలిచి అభివృద్ధి  ఫలాలు అందరికీ దక్కే విధంగా కృషి చేస్తుంది.

            రాజయ్యలాంటి దుర్మార్గుల ధాష్టీకాన్ని ప్రశ్నించి, ఎదిరించడం, కుల వివక్ష ఉన్న సమాజంలో కుల పట్టింపులు లేని ఉప్పలయ్య పాత్ర, అందరి బాగునూ కోరుతూ మల్లమ్మ శక్తి సామర్థ్యాలను గుర్తించి ఆమెను రాజకీయంగా ఎదిగేలా చేసే రాజ్యాలక్ష్మి పాత్రను సృష్టించడంతో పాటు, బిడ్డలను చదివించి, ఉన్నత స్థాయిలో ఉంచడం, ముఖ్యంగా వాళ్ళ కులాంతర వివాహాలను ప్రోత్సహించడం దళితులు, మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడం వల్ల మాత్రమే బహుజనుల బతుకుల్లో మార్పు సాధ్యమవుతుందనే ఆలోచనా ధోరణి రచయిత్రి అభ్యుదయ భావాలకు అద్దం  పడుతుంది. నవల చాలావరకు తెలంగాణా మాండలికంలో సాగడాన్ని బట్టి తెలంగాణా భాష, యాస పట్ల రచయిత్రికున్న  మక్కువ అర్థమవుతుంది.

            చివరకు ఏ రాజకీయ పార్టీ ప్రలోభాలకు లొంగక శ్రమశక్తిని నమ్ముకొని స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి, అసెంబ్లీ స్థాయికి చేరుకొని ప్రజావారధిగా మారి తన ఊపిరి ఉన్నంత వరకు దళితులు, బహుజనుల పక్షాన పోరాడాలని నిర్ణయించుకొని ఉన్నత వ్యక్తిత్వంతో ఆదర్శప్రాయంగా నిలుస్తుంది మల్లమ్మ. ఒక సాధారణ మహిళను అసాధారణ మహిళగా తీర్చిదిద్ది, దళితుల, మహిళల చైతన్యాన్ని కాంక్షిస్తూ కెరటంను సృజియించిన డా।। తాళ్ళపల్లి యాకమ్మకు అభినందనలు.

                                                                                               

సాహిత్య వ్యాసాలు

పక్కదారి పట్టిన మహిళా దినం ఉద్దేశం

అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా గోదావరి అంతర్జాల సాహిత్య పత్రిక "ఆకాశమంత" అనే శీర్షికతో ప్రత్యేక మహిళా సంచిక చేస్తున్నందుకు ఉద్యమాభినందనలు. మహిళా దినం నేపథ్యం, దాని ఉద్దేశం,ఆ ఉద్దేశాన్ని ఎవరు, ఎందుకు పక్కదారి పట్టించారు, కార్మికులలో కెల్లా అత్యంత దోపిడీ,పీడనలకు గురయ్యే కార్మికులు ఎవరు, వారి విముక్తి ఎలా సాధ్యం, చివరికి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం శీర్షికలోని "శ్రామిక, పోరాట" అనే పదాలు సైతం పాలకవర్గాలు ఎందుకు తుంగలో తొక్కాయి అన్న అంశాలను సంక్షిప్తంగా చర్చిద్దాం.

పారిశ్రామిక విప్లవానంతరం యూరప్,అమెరికా ఖండాలలో అనేక పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి.ఆ పరిశ్రమలో పనిచేసే మహిళా కార్మికులు విపరీతమైన శ్రమ దోపిడీకి,అణిచివేతలకు గురయ్యే వారు.కనీస వసతులైన మరుగుదొడ్లు,తాగునీరు,గాలి, వెలుతురు, చంటిబిడ్డల సంరక్షణ లేకపోవడం, శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం, 15-18 గంటలు పని చేయించడం, సెలవులు ఇవ్వకపోవడం మొదలైన సమస్యలు ఎదుర్కొనే వారు. ఈ సమస్యల పరిష్కారానికి ఆ కార్మికులు సంఘటితమై గడ్డకట్టే చలిలో కవాతులు,రాస్తారోకోలు, ధర్నాలు మొదలైన నిరసన కార్యక్రమాలు చేసేవారు.వారి పోరాటాలను కంపెనీ యజమానులు తీవ్రంగా అణచివేసేవారు.చివరికి సజీవ దహనాలు కూడా చేసేవారు.అయినా ఆ మహిళలు తమ పోరాటాల నుండి వెనక్కి తగ్గకపోవడంతో యూరప్, అమెరికా దేశాలలోని మేధావులకు, ఉద్యమకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చారు.ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన కమ్యూనిస్టు నాయకురాలు "క్లారా జెట్కిన్" 1910వ సంవత్సరంలో డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్ లో రెండవ అంతర్జాతీయ సోషలిస్టు మహాసభను ఏర్పాటు చేసి, ఆ సభలో ఆ మహిళా కార్మికుల అలుపెరుగని పోరాటాలను ఎత్తిపడుతూ,శ్రామికుల శ్రమ దోపిడీకి, అణిచివేతకు మూలకారణం పెట్టుబడిదారీ వ్యవస్థ అని, స్త్రీ పురుష కార్మికుల ఐక్య పోరాటాలే వారిని "శ్రమ విముక్తి" చేస్తాయని, అది కార్మిక వర్గం యొక్క "దీర్ఘకాలిక పోరాటాల" వల్లనే సాధ్యమవుతుందని చెప్పారామె. అంతేకాక కార్మిక వర్గమే పీడిత ప్రజలను సమూలంగా విముక్తి చేస్తుందని, ఈ పోరాటాలు సజీవంగా ఉండాలంటే నిరంతర చర్చ, నిర్మాణాలు, సంఘటిత పోరాటాలు ఉండాలని వీటి సమీక్షకు మహిళలకు సంవత్సరానికి ఒకరోజు ఉండాలని, అది ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల మహిళలు మహిళా దినం ఏర్పాటు చేసుకోవాలని క్లారా జెట్కిన్ ప్రపంచ మహిళలకు పిలుపునిచ్చారు.

ప్రపంచంలో ఏ మూలన ప్రజా పోరాటాలు వెల్లువెత్తినా, వాటిని పీడిత ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని, తమ ముందున్న జీవన్మరణ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయడం చూస్తుంటాం. ఈ ప్రజాపోరాట సంస్కృతిని పెట్టుబడిదారులు అంతే వేగంగా నీరుగార్చి పోరాట "సారాన్ని" తుంగలో తొక్కి రూపాన్ని మిగిల్చి పాలకవర్గాల చేత తమ మార్కెట్ దోపిడిని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా దినం ఉద్దేశాన్ని కూడా తుంగలో తొక్కి, మహిళల్ని అత్యంత దుర్మార్గంగా దోపిడీ,అణిచివేతలకు గురి చేసిన ఇక్కడి బ్రాహ్మణీయ భూస్వామ్య హైందవ సంస్కృతిని మహిళా దినానికి జోడిస్తూ స్త్రీలను వంటలు, అల్లికలు, ముగ్గుల పోటీలకు పరిమితం చేశారు. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగులు, సంఘటిత కార్మికులు అనుభవిస్తున్న ఎనిమిది గంటల పనిదినం,ప్రసూతి,క్యాజువల్, చైల్డ్ కేర్ సెలవులు, పురుషులతో సమానమైన వేతనాలు, అలవెన్సులు మొదలైన హక్కులన్నీ ఆనాటి కార్మిక మహిళల పోరాట ఫలితమన్న చరిత్రను పాలకవర్గాలు ఎక్కడా బయటకు రానివ్వడం లేదు.

మహిళా దినం అవతరించిన ఈ నూటా పది సంవత్సరాలలో దాదాపు ప్రపంచదేశాలన్నీ స్వతంత్రం పొంది,బూర్జువా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వాలే పబ్లిక్ పరిశ్రమలలో పెట్టుబడులు పెడుతున్నాయి. కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్ర వేసినట్టు సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణలను ప్రవేశపెట్టి విపరీతమైన లాభాలు ఆర్జించాలని వ్యూహరచన చేశారు. మూడవ ప్రపంచ దేశాలలో లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ పరిశ్రమలను నష్టాల్లో నడుస్తున్నాయని దుష్ప్రచారం చేసి ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించడం,క్రమంగా మూసి వేయడం జరిగింది. నూతన ఆర్థిక విధానాల ఉద్దేశమే ప్రైవేటు రంగాల ను బలోపేతం చెయ్యడం. ఇందులో భాగంగానే ప్రభుత్వ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు VRS లు ఇవ్వడం, శతాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడం జరుగుతుంది. మరోవైపు మనలాంటి వ్యవసాయ దేశాలలో ఈ నూతన ఆర్థిక విధానాలు వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలో పడేశాయి. చేతి వృత్తులను ధ్వంసం చేశాయి. ఈ రంగాల విధ్వంసం వల్ల చిన్న, సన్నకారు రైతులు,రైతు కూలీలు, చేతివృత్తుల వారు పట్టణాలు, నగరాలకు వలసలు పోయి అసంఘటిత కార్మికులుగా మారిపోయారు. అక్కడ కూడా వీరికి ప్రతిరోజు పని దొరకక, అడ్డాల దగ్గర పోటీపడుతూ, అర్ధాకలితో బాధపడుతున్నారు. నూతన ఆర్థిక విధానాల అనంతరం పెట్టుబడిదారులు పరిశ్రమలలో కార్మికుల స్థానంలో యంత్రాల వాడకం పెంచడం వల్ల కార్మికుల వినియోగ శక్తి తగ్గిపోతుంది. పెట్టుబడిదారులు ప్రజలకు అవసరం లేని వస్తువులు కుప్పలుగా తయారు చేయడం వల్ల విపరీతమైన నిల్వలు పెరిగి పోయి నిరంతర సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. వారి మధ్యనే తీవ్రమైన పోటీ ఏర్పడి, దేశవిదేశాలలో కొద్దిమందే "గుత్త పెట్టుబడిదారులుగా" తయారయ్యారు.వీరు కార్మికులకు కనీస వసతులు కల్పించకుండా, శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వకుండా ఆనాటి యూరప్, అమెరికా కార్మికుల కన్నా దుర్భరమైన స్థితిలో కి నెట్టేశారు. చివరికి కార్మికుల పోరాటాలు లేకుండా చేసి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం శీర్షికలో"శ్రామిక, పోరాట" అనే పదాలను కూడా ఈ గుత్త పెట్టుబడిదారులు మాయం చేశారు.

ఈ గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థలో అసంఘటిత కార్మిక మహిళలే గాక అన్ని వర్గాల, కులాల మహిళలు తరతమ స్థాయిలలో దోపిడీ, పీడనల ఎదుర్కోవడమే కాక, పసి పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, హత్యలతో వారి మనుగడే  ప్రశ్నార్థకమైంది.ఈ దేశ నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో అట్టడుగుమెట్టయిన దళిత స్త్రీలు బ్రాహ్మణీయ భూస్వామ్య వ్యవస్థ వల్ల వేల సంవత్సరాలుగా శ్రమ దోపిడీకి గురి కావడమే కాక, లైంగిక దోపిడీకి గురవుతున్నారు.దానికి పెట్టుబడిదారీ వ్యవస్థ తోడవడం వల్ల శ్రామిక దళిత స్త్రీల పరిస్థితి పెంక మీది నుండి పొయ్యిలో పడ్డట్టయింది.వీరు పల్లెలు, పట్టణాలు, నగరాలలో రాత్రి 3-4 గంటల నుండి మధ్యాహ్నం 2-3 గంటల వరకు వీధులన్నీ శుభ్రం చేస్తూ, మనుషుల "మలాన్ని" చేతులతో ఎత్తి పోస్తూ, అసంఘటిత కార్మికులలోకెల్లా అత్యంత దుర్భరమైన కార్మికులుగా బతుకీడుస్తున్నారు.దుమ్ము,ధూళి,దుర్వాసన వల్ల వీరు శ్వాసకోశ వ్యాధుల బారిన పడి చిన్నవయసులోనే మరణిస్తున్నారు.ప్రభుత్వాలు వీరి శ్రమకు తగిన వేతనాలు ఇవ్వవు, ఉద్యోగాలు శాశ్వతం చెయ్యవు. వీరి ఆకలి,అంటరానితనం,ఆడతనం అనే అసమానతలు పోయినప్పుడు,వీరు కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించినప్పుడు, శ్రమ విముక్తి, కులనిర్మూలన, మహిళా విముక్తి జరిగినప్పుడు సమాజంలోని అన్ని కులాల, వర్గాల మహిళలు విముక్తి చెందుతారు."కార్మిక విముక్తి"అంటే ఆర్థిక రాజకీయ విముక్తే కాదు, సామాజిక, జెండర్, అంతర్ జెండర్, సాంస్కృతిక విముక్తి జరిగినప్పుడే క్లారా జెట్కిన్ ఆశయంలక్ష్యం నెరవేరుతాయి.

 

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర – 9

భుక్త లక్ష్మీ దేవమ్మ ఎవరు? ఎక్కడపుట్టి పెరిగింది ? సాహిత్య రంగంలోకి ఎలా ప్రవేశిం చింది?ఎందుకు నిష్క్రమించింది? అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే . హిందూ సుందరి పత్రికలో 1902 జులై సంచిక నుండి 1904 జూన్ సంచిక వరకు  సరిగ్గా రెండేళ్ల కాలంలో  ఆమె రచనలు చేసిం దన్నది వాస్తవం. చదువనూ,వ్రాయనూ నేర్చి స్త్రీలు తమ మనోభావాలను వ్యక్తీకరించే అవకాశాలు ఉండాలన్న నాటి సంఘ సంస్కరణ ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా స్త్రీల కోసం వచ్చిన  తొలి పత్రిక హిందూ సుందరి, మలి పత్రిక సావిత్రి ఇలా ఎందరో స్త్రీలను రచయితలుగా రంగం మీదికి తీసుకురావటానికి కృషిచేశాయి.అయితే  అలా రచనారంగంలోకి ప్రవేశించిన  స్త్రీలను   చివరివరకు కొనసాగేట్లు చేయగల భౌతిక వాతావరణ నిర్మాణం ఈ నాటికీ  పూర్తిగా వాస్తవీకరించబడలేదంటే నూట ఇరవై ఏళ్ల నాటి పరిస్థితి ఎలాంటిదో ఊహించుకోవచ్చు.  జ్ఞానసంపాదనావకాశాల లేమి వస్తు శిల్ప ప్రక్రియ ల  ఎంపికకు ఒక  పరిమితి కాగా, పితృస్వామిక    సామాజిక కౌటుంబిక    సంప్రదాయా లు, నియంత్రణలు అభ్యాసానికి అవరోధం అవుతుంటే ప్రతిభ వికసించే వీలులేక నిస్సహాయంగా నిశ్శబ్దంగా రచనా రంగం నుండి స్త్రీలు తప్పుకున్నారా అనిపిస్తుంది.అలా ప్రవేశించి ఇలా నిష్క్రమించిన ఎందరో మహిళా రచయితలలో భుక్త లక్ష్మీ దేవమ్మ ఒకరు.

భుక్త లక్ష్మీదేవమ్మ జలుమూరు వాసి అన్నసమాచారం ఒక్కటే ఆమె జీవితం గురించి తెలిపే చిన్నఆధారం.జలుమూరు శ్రీకాకుళం కు 35 కిలోమీటర్ల దూరంలోపల ఉన్నవూరు. అంటే భుక్త లక్ష్మీదేవమ్మ ఉత్తరాంధ్ర రచయిత్రి అన్నమాట. ఆమె వ్రాసిన పద్య రచన ఒక్కటే. మిగిలినవి వచన రచనలు. ఆ పద్య రచన ద్విపద. దాని శీర్షికపతివ్రతా ధర్మము ద్విపద’. “శ్రీకరంబుగ మంచి చేడెల విధము / నీకెరిగించెద నెలతరో వినుము / బద్ధకంబునసోకు  బారంగదోలి / పొద్దున్న లేచి దేవుని తోల్త దలచి / పతి బ్రోవుమనుచు బ్రార్ధనల్ సేసి /అని మొదలుపెట్టి , స్త్రీలు భర్త కంటికి, మనసుకు ఇంపుగా ఎట్లా వర్తించాలో చెప్పింది. స్త్రీ ధర్మం బోధించే ప్రసిద్ధ శ్లోకంకార్యేషు దాసి,కరణేశు మంత్రి / భోజ్యేషు మాత, శయనేషు రంభ/ క్షమయేషు ధరిత్రీ, రూపేషు లక్ష్మి/ షట్కర్మయుక్తా, కుల ధర్మపత్ని” .అందులోని కార్యేషు దాసి , భోజ్యేషు మాత, శయనేషు రంభ అన్న మూడు ధర్మాలను ఈ ద్విపదలో నొక్కి చెప్పింది. బూతు పాటల నేర్చ బోవద్దని, నీతులుగల పాటలేనేర్చవలయునని చెప్పటం విశేషం. ద్విపద పాడుకొనటానికి అనువైన ప్రక్రియ.తనకాలపు స్త్రీలు  ఈపతివ్రతా ధర్మాలనే అయితే పద్యరూపంలోనో, కాకపోతే వ్యాస రూపంలోనో ప్రబోధిస్తుండగా ఈమె వాటిని పాడుకొనటానికి వీలుగా ద్విపదలో చెప్పింది. స్త్రీలు బూతు పాటలు కాక నీతి పాటలు నేర్వాలని చెప్పిన లక్ష్మీదేవమ్మ వాళ్ళకోసం వ్రాసిన నీతి పాట ఇది అనుకోవచ్చు.

స్త్రీనీతి కథామంజరి అనే శీర్షికతో హిందూసుందరి (1902 జూన్,ఆగస్టు, 1904 జనవరి , జూన్) సంచికలలో లక్ష్మీదేవమ్మ వ్రాసిన చిట్టిపొట్టి కథలు వున్నాయి. పంచ తంత్రం కథల తరహాలో పక్షులు, జంతువులు పాత్రలుగా చెప్పిన కథలు ఇవి. కథ చివర దాని నుండి స్త్రీలు నేర్చుకోవలసిన నీతి ఏమిటో చెప్పటం అన్నికథలకు సామాన్యం.పావురము -డేగ - బోయవాడుకథ చెప్పి కష్టాలు సంభవించినా, సాటివారు వంచించ చూసినా దిగులు చెందక  భగవంతుడిని తలచుకొంటే ఆపదలు తొలగి పోతాయని చెప్పి భక్తి మార్గ ప్రబోధం చేస్తుంది రచయిత్రి. పిల్లి పశువుల దొడ్డి కథ స్త్రీలకు బోధించే నీతి ఏమిటంటె- గృహకృత్య భారం వహించే స్త్రీలకు లెక్కకు ఎక్కువైన చిక్కులు ఎదురవుతుంటాయి.అందుకు మీభర్తలు మీమీద కోపిస్తుండవచ్చు..ఆసమయంలో మీకోపాన్ని బిడ్డలపై మాత్రం చూపకండి అని . కోపాన్ని తమ కంటే నిస్సహాయులైన ప్రాణులమీద చూపే అవకాశం ఉన్న అసమసమాజంలో  అత్తలపై కోపం దుత్తలపైన, భర్తపై కోపం పిల్లలను చావబాదటం పైనా చూపే సంస్కృతిని గుర్తించి దానిని నిరసించడం ఇందులోకనిపిస్తుంది. అలాగే తల్లి లేడి హెచ్చరిక వినక మందనుండి విడిపోయి పులిబారిన బడిన లేడిపిల్ల కథ చెప్పి పెద్దలమాట వినమని పిల్లలకు ప్రబోధించింది రచయిత్రి.

 ఒకరి సుఖానికి, సౌకర్యాలకు అసూయపడి చెరుపదలచిన దుష్టులు ఎలా నష్టపోతారో చెప్పటానికిచిలుక-  కాకికథను చెప్పిన రచయిత్రి అత్తమామల, భర్తల మన్ననలు పొంది సుఖ సంసార లాభం పొందుతున్న స్త్రీలపట్ల అసూయతో నేరాలు చెప్పి కలహాలు పెట్టె వారి గురించిన హెచ్చరికను కథ ఫలితార్థంగా పేర్కొన్నది. ఇరుగుపొరుగుల తగాదాలను వినోదంగా తిలకించడం కూడా ప్రమాదాకరణమేనని చెప్పి వ్యర్ధ కలహాసక్తిని వదులుకోవాలని స్త్రీలను హెచ్చరించటానికి కాకి- కోవెల- గోరువంక పాత్రలుగా ఒక కథఅల్లి చెప్పింది లక్ష్మీ దేవమ్మ.సాంఘిక వస్తు కేంద్ర ఆధునిక కథ దిశగా సాగవలసిన ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోవటం విషాదం.

తెలుగులో కృతి విమర్శన కు మొదటి స్త్రీ భుక్త లక్ష్మీదేవమ్మ. 1902  మే హిందూ సుందరి పత్రికలో కొటికలపూడి సీతమ్మ వ్రాసిన భక్తి మార్గము అనే పద్యరచన సమీక్ష ఇది.పుస్తకంలో 110 పద్యాలుఉన్నాయని, శైలి మృదు మధురంగా చదువుటకు సొంపుగా ఉంటుందని పేర్కొన్నది. ఆమె వ్రాసిన మరొక సమీక్ష కూడా  కోటికలపూడి సీతమ్మ రచనలపైనే.1902 ఆగస్టు హిందూసుందరిలో ఇది ప్రచురితమైన ఈసమీక్షలో సీతమ్మ వ్రాసిన లేడీజన్ గ్రే, అహల్యాబాయి అన్నరెండు గ్రంధాలను ప్రస్తావిస్తూ కవిత్వమునిర్దుష్టముగాను, బాలబోధగాను ఉన్నందుకుహర్షం వ్యక్తంచేసింది.శ్రీరాముని భార్య అయిన సీతాదేవి స్త్రీ నీతి గ్రంధాలను ఆనాడు వ్రాయలేకపోయిన కొరతను తీర్చుకొనటానికి ఇప్పుడు సీతమ్మ గారై జన్మించి ఉంటుందని చమత్కరించింది. సాహిత్య విమర్శకురాలు కావలసిన విదుషి అభ్యాసం ప్రారంభ దశలోనే ముగియటం ఒక విషాదం.

విన్నకోట లక్ష్మీ జోగమ్మ కూడా  లక్ష్మీ దేవమ్మ వలెనె హిందూ సుందరీ సాహిత్యాకాశంలో  ఒక ఏడాది పాటు వెలిగి మరి కనిపించకుండా పోయిన  నక్షత్రం. 1902 లో ఆమె రచనలు  వచ్చాయి. ఆమె ప్రధానంగా వచన రచయిత్రి. ఒక నాటిక, ఒక వ్యాసంఒక పాట   లభిస్తున్నవి. ఆమె వ్రాసిన పాట పూజ పాట.పూజాలు జేతును/ పూబోడిరొ నేడుపొందూగ శ్రీలక్ష్మీ సుంద రికి/  మంగాళ గౌరికి మాహేషురాణికి మల్లెలుమొల్లాల మరి విరజాజుల”  అనేపల్లవితో ప్రారంభమైన ఈపాటకు  చరణాలు మూడు.  “బాగూగ జోగాంబ  పాలన జేసెడు వరలక్షి నీకిదె వందనమిడెదను”  అంటూ  మూడవ చరణం స్వీయ నామాంకితంగా వ్రాసింది.

ఇక  విన్నకోట లక్ష్మీ జోగమ్మ వ్రాసిన నాటికఅవివేకపు వెంకమ్మ’ ( 1902 జులై & సెప్టెంబర్ సంచికలు)  ఆహ్లాదకరమైన  వ్యావహారిక వచనంలో సమకాలీన సాంఘిక  వాస్తవం వస్తువుగా వ్రాసిన మూడు రంగాల నాటిక ఇది. స్త్రీ విద్యా ప్రాధాన్యతను నొక్కి చెప్పే ఈ నాటకం అందుకు అవరోధంగా స్త్రీలలో ఉన్నఅవివేకాన్నితొలగింపచేయటాన్ని ఉద్దేశించింది. ఈనాటిక కథ ప్రవర్తించేది ఒకబ్రాహ్మణాగ్రహారంలో. దానిపేరు అవివేకాగ్రహారం. అవివేకం నాటకంపేరులో ఉండటమే కాదు అది ప్రవర్తించే స్థ లానికి   కూడా పేరు కావటం కొంత అతిశయోక్తి గా కనిపించినప్పటికీ అది ఆనాడు సామాజిక దుర్మార్గాలపట్ల రచయితలకు ఉన్న ఆగ్రహానికి సంకేతంగా భావించాలి.వీరేశలింగం పంతులు నుండి గురజాడ వరకు ప్రహసనాలలో, నాటకాలలో ఆనాడు అదే పద్ధతి కనబడుతుంది.విన్నకోట లక్ష్మీజోగమ్మను ఆ సామాజిక సాహిత్య  సంప్రదాయంలో భాగంగానే చూడాలి.

అవివేకాగ్రహారంలో అవివేకపు వెంకమాంబ ఇంటి ముందు వరండాలో ఒక మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీధిలోనుండి వచ్చినలక్ష్మిదేవమ్మకు వెంకమాంబకు మధ్య సంభాషణగా  మొదలైంది. వెంకమాంబ తనకొడుకు నారాయణ మామగారు పెళ్లయినా కూతురికి చదువు, సంగీతము చెప్పిస్తున్నాడని అది తనను నలుగురిలో తలెత్తుకోనీకుండా చేస్తున్నదని లక్ష్మీదేవమ్మ తో చెప్పుకొని బాధపడుతుంది. దానికి ఆజ్యం పోస్తున్నట్లుగా లక్ష్మీదేవమ్మ కొన్నేనగలు పెట్టుకొనటం, చిన్నబొట్టుపెట్టుకొనటం, పుస్తకం చదువుకొంటూ కూర్చోటం ఆ పిల్ల దోషాలుగా చెప్పి ఆలాంటి పిల్లే దొరికిందా నీకొడుక్కు చేసుకొనటానికి అని అడుగుతుంది. వాళ్ళిద్దరి సంభాషణలో అన్న కూతురిని కొడుక్కు చేసుకోవాలనుకున్న వెంకమాంబ మాట కాదని ఆమె భర్త ఈసంబంధం చేసినట్లు తెలుస్తుంది.ఇంట్లోతాను ఒంటరిని అయిపోయానని వెంకమాంబ దుఃఖపడుతుంది.

 ఆ సమయానికి వెంకమాంబ పినతల్లి కూతురు జానికమ్మ వాకిట ముందర బండిదిగుతుంది. అక్కగారి దుఃఖంచూసి ఆందోళన పడి అందరూ క్షేమం గాఉన్నారని తెలుసుకొని అయిన దానికి, కానీదానికి ఏడవటం ఏమిటని మందలిస్తుంది. చేసుకొన్న కోడలు తెలివైనదని, ఆమె తల్లి కూడా చదువుకున్నది కావటాన ఇంటివద్ద పంతులును పెట్టి చదివిస్తున్నారని మెప్పుకోలుగా అంటుంది. బిఎ పాసయిన జానికమ్మ భర్త స్వయంగా ఆమెకు ఇంటివద్ద  చదువు చెప్పిన విషయం నేరంగా ప్రస్తావించిన వెంకమాంబ మాటలకు నొచ్చుకొని చదువుకొని ఎవరైనా నీకు చేసేఅపచారం ఏముందని మందలిస్తుంది.చదువుకున్న ఆడవాళ్లు ఇంటిపనులు చేయరు అన్న అక్కగారి మాట తప్పని వాదిస్తుంది. రాత్రివంట ప్రయత్నాలకు ఇద్దరూ లోపలికివెళ్లటంతో మొదటిరంగం ముగుస్తుంది.

రెండవరంగంలో వెంకమాంబ భర్త భైరవరావు రావటం, కూతురికి మంగళగౌరీ వ్రతం చేయిస్తున్న వియ్యపురాలు పిలవటానికి వచ్చిందా అని ఆయన వేసిన ప్రశ్నకు ఆమె విరసపు సమాధానం ఇయ్యటం,దానికి తోడు  కోడలు వీధివాకిట్లో కుర్చీలో కూర్చుని చదువుకోవటం గురించిన ఆమె ఫిర్యాదులు అతనికి చికాకు కలిగించాయి. కోడలి నోముకు కూతుర్నితీసుకొని పొద్దున్నే వెళ్ళమని ఆయన చెప్పినమాట ఆమెనిరాకరించటం, కూతురు వచ్చి భోజనానికి రమ్మనటం ఒక ఘట్టం అయితే, అలిగి పడుకున్న ఆక్కగారిని జానికమ్మ వచ్చి తగుమాటలాడి భోజనానికి లేవదీయటం మరొక ఘట్టం.

మూడవ రంగంలో జానికమ్మ అటుబావగారికి, ఇటు అక్కగారికి సర్ది చెప్పేప్రయత్నం చేస్తుంది.ఆడవాళ్ళకు చదువు చెప్పించకపోవటం వల్ల అవివేకులై ప్రవర్తిస్తున్నారని అందువల్ల తప్పు ఆడవాళ్లది కాదు అని అక్కను వెనకేసుకొని వస్తున్నట్లుగా  బావగారితో మాట్లాడుతుంది. చెల్లెలు తనవైపే మాట్లాడుతున్నా చదువు అనే మాట చెవినబడేసరికి వెంకమాంబ చిరచిరలాడుతుంది. ఆమె మాట్లాడిన మాటలకు విసుక్కొంటూ భర్త ఈవిధమైన కాపురం కంటే సన్యాసం మేలు అంటూ అక్కడి నుండి  వెళ్ళిపోతాడు. భర్తల పట్ల భార్యలు మెలగ వలసిన పద్ధతి గురించి జానికమ్మ అక్కగారికి బోధిస్తుండగా వియ్యపురాలిని గౌరీవ్రతానికి పిలవటానికి విజయలక్ష్మి వస్తుంది. జానికమ్మ విజయలక్ష్మి కోడలి  చదువు, సంగీతాల  గురించి మాట్లాడుతుంటే కోపంతో వెంకమాంబఆట ఒకటి తరువాయిఅని ఈసడించుకొన్నది. చదువుకున్న వాళ్ళందరూ పాడావు తారనుకొనటం వెనకటికి అరిశెల కుండతో ఐశ్వర్యం వస్తుంది అని నమ్మిన దుర్మార్గపు దుర్గమ్మ కథలాగున్నది అని జానికమ్మ అన్నమాటకు విజయలక్ష్మి ఆకథ చెప్పమని వినటానికి ఉత్సాహ పడింది. ఈకథ నాకొరకేనా ఏమిటి ? అని  సాధిస్తున్నట్లుగా వెంక మాంబ అన్నమాటకు జానికమ్మ లోకంలోనీవుఒక్కదానివే కాదు, నీలాంటి వారు ఇంకా చాలా మంది అని సమాధానం చెబుతూ కథ చెప్పటానికి ఉపక్రమించింది.

 రాజాశ్రయం పొంది తన దారిద్య్రానికి ఒక పరిష్కారం కనుక్కోవాలని ఒకబీద బ్రాహ్మడు రాజుగారికి కానుకగా ఇమ్మని ఇచ్చిన అరిసెలకుండతో అడవి  మార్గాన పోతూ ఒకచోట విశ్రమించగా ఆమార్గాన పోతున్న రాజు ఆకలి బాధకు ఆకొత్తకుండలోని అరిసెలు తీసుకొని తిని కానుకగా అందులో ఉంచి పోయిన పచ్చల హారం అంతిమంగా వారిజీవనానికి ఏలోటులేని ఏర్పాటుగా ఫలితం ఇచ్చింది. ఇది తెలుసుకొని తాను కూడా అటువంటి ప్రయోజనం పొందాలని ఒక దురాశాపరురాలు భర్తకు అరిసెల కుండ ఇచ్చి అడవికి పంపితే అతను ఇంట లేడని దొంగలు పడి సర్వం దోచుకొనిపోవటం ,అడవిలో పాము కరిచి అతను మరణించటం రెండు విషపరిణామాలు ఏకకాలంలో సంభవించాయి అని కథచెప్పి ఇంగితజ్ఞానం లేకభర్త మాటలు వినక స్త్రీలు అవస్థలు పడతారని సారం విప్పిచెప్పి ముగించింది జానికమ్మ . నిజానికి ఈనాటికలో ఈకథ అనవసర ప్రసంగమే. స్త్రీలకు ఏవోనీతులు బోధించాలన్నతపనతో భుక్తలక్ష్మీదేవమ్మ వంటివాళ్ళు విడిగా కథలు వ్రాస్తే ఈమె నాటిక లో అంతర్గత  కథా కల్పన ద్వారా ఆప్రయోజనాన్నిసాధించింది అనుకోవాలి.

 ‘ఎన్నికథలుచెప్పినా దూషించినా నన్నేకదా చదువుకొన్నవాళ్ళతో సమానంగాకబుర్లు చెప్పటం ఎవరితరం’  అని నిష్టూరమాడుతున్న అక్కగారితో జానికమ్మఅదేకదా చెప్పేది! నువ్వుచదువుకోక, నీకూతురికి చదువుచెప్పించక , పైగా చదువుకొంటున్న కోడలి చదువుకూడా పాడు చేయాలను కుంటున్నావు అది న్యాయంకాదు అన్నట్లుగా హెచ్చరించింది. అది నీకు ప్రయోజనకారి కాదు అని సూచించింది. అచ్చమాంబగారి ప్రస్తావన తెచ్చి ఆమెచదువుకొనటం వల్లనే కదా స్త్రీల మన్ననలను అందుకొంటున్నది అని చెప్పింది. అచ్చమాంబ మాటరాగానే వెంకమాంబ నిష్టుర వాక్యాలు మానిసాధు స్వరంతో అవును ఆమెను చూచినప్పటినుండి స్త్రీవిద్య అంటేముచ్చట కలుగుతున్నది అంటూ కోడలి చదువుకు సమ్మతి తెలిపింది.కూతురిని బడికి పంపటానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. వెంకమాంబ పాత్ర లో ఈమార్పు హఠాత్పరిణామంగా అనిపించినా స్త్రీలను సహనంతో స్త్రీవిద్యానుకూలురిని చెయ్యాలన్నలక్ష్యానికి అనుగుణమైన ముగింపులు ఇలా తప్ప మరొకలా ఉండవు. 

            స్త్రీల అవివేకానికి , మూర్ఖత్వానికి మూల కారణం వాళ్లకు చదువు లేకపోవటమే అని ఈ నాటికలో గట్టిగానే చెప్పింది రచయిత్రి. ఆడవాళ్ళ అవివేకానికి చదువులు చెప్పించని మగవాళ్ళు , వాళ్ళను నడిపే సమాజం కారణం అని ఎత్తి చూపగల వివేకం గల స్త్రీగా  జానికమ్మపాత్రను సృష్టించింది. చదువుకొన్న స్త్రీలు అత్తమాట వినక, ఇంటిపని చేయక చెడిపోతారన్న అభిప్రాయం ఆనాటి సమాజంలో ఏదైతే ఉందో దానికి ప్రతినిధిగా వెంకమాంబ ను నిలిపి ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించే పని జానికమ్మ పాత్రద్వారా పూర్తి చేసింది. జానికమ్మ చదువుకున్నది. అయినా ఇంటి చాకిరీ అంతా ఆమె చేస్తుంది. ఆ మాట చెప్పి చదువుకున్న కోడలి గురించిన ఆక్కగారి సందేహాలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది.  ఆ జానికమ్మ చేతనే పెనిమిటితో పోట్లాడే స్త్రీకి సుఖం లేదని సూచించింది రచయిత్రి. మగువల సర్వ సుఖాలకు కారణభూతులు మగడెనని , కార్యేషు దాసీ శ్లోకాన్ని పేర్కొంటూ స్త్రీ భర్తను ఎలా సేవించాలో బోధపరిచే పని కూడా చేయించింది. అంటే చదువుకొన్న స్త్రీలు భర్తను మరింత తెలిసి సేవిస్తారని అందువల్ల వాళ్ళ చదువులకు అభ్యంతర పెట్టనక్కరలేదన్న భరోసా కల్పించిందన్నమాట. స్త్రీలు చదువుకొంటే పతివ్రతల కథలు చదివి తామూ పతివ్రతలగా మెలగాలన్న ఆదర్శం పెంపొందించు కొంటారు అన్న వీరేశ లింగం గారి అభిప్రాయాన్ని ఆ రకంగా ఆకాలపు స్త్రీల సాహిత్యం బాగానే ప్రచారంలో పెట్టింది. 

            అలాగే ఆనాటి స్త్రీల సాహిత్యంలో సమకాలీకురాలైన భండారు అచ్చమాంబ స్త్రీవిద్య కు ఒక ఆదర్శ నమూనాగా ప్రస్తావించబడటం, స్త్రీవిద్యా ప్రబోధకాలైన ఆమె ప్రసంగాల ప్రభావాన్ని నొక్కి చెప్పటం తరచు కనిపిస్తుంది. ఈనాటికలోనూ విన్నకోట లక్ష్మీ జోగమ్మ అచ్చమాంబ ను ప్రస్తావించటం గమనించవచ్చు. స్త్రీవిద్య అంటే మండిపడే వెంకమాంబ అచ్చమాంబ పేరు ప్రస్తావనకు రాగానే, ఆమెపట్ల గౌరవాన్నిప్రకటించిస్త్రీవిద్యకు అనుకూలంగా మారినట్లు నాటికను ముగించటం ద్వారా సమకాలపు స్త్రీవిద్యా ఉద్యమాన్ని, అందులో అచ్చమాంబ వంటివారి ఆచరణను సాహిత్యచరిత్రలో నమోదు చేసినట్లయింది.

            విన్నకోట లక్ష్మీ జోగమ్మ వ్రాసిన వ్యాసంస్త్రీమూర్ఖత’.భర్త నగలు చేయించలేదని, అత్తామామామల వల్ల సుఖంలేదని స్త్రీలు ఏదో ఒక చింతతో జీవితాన్ని వృధాచేసుకొనటానికి  విద్య లేకపోవటమే కారణమని ఈవ్యాసంలోనూ ఆమెపేర్కొన్నది. ఇరుగు పొరుగుతో అధికప్రసంగాలతో పొద్దుపుచ్చటం కంటే భక్తి కలిగి భగవత్ సంబంధ గ్రంధాలను చదవటం, విద్యావంతులైన స్త్రీల చరిత్రలు చదివటం స్త్రీలకు ఉపయోగకరమని సూచించింది.దుర్గుణాలు నశించటానికి విద్యను మించిన మందు లేదని చెప్పింది. స్త్రీకి మంచిగుణము సత్ప్రవర్తన, ఖ్యాతి విద్యవల్లనే సమకూరుతాయని నొక్కిచెప్పింది.సర్వజనాళికిని నేకాభిమతంబున వర్తింపఁ జేయగలందులకు సరస్వతినే అనేక విధంబుల ప్రార్ధించెదనుఅని వ్యాసాన్ని ముగించిఅందరికీ సమంగా విద్యఅన్నభావనను జెండాగా ఎగురవేసింది విన్నకోట లక్ష్మీ జోగమ్మ.

 

--------------------------------------------------------------------------------------

 

సాహిత్య వ్యాసాలు

సాహిత్యంలో మార్క్సిస్టు ఆలోచనావిధానం

         ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రకృతిలో ప్రతి పదార్థంలోనూ చలనం ఉంటుంది. అది మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో ఏది స్వతంత్రంగా ఉండలేదు. అది ఇంకొక దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతిలో ప్రతిదీ పరస్పర ఆధారితం. పైగా రెండు వస్తువుల మధ్య ఆకర్షణ వికర్షణ సమానబలాలతో ఉంటుంది. దీనినే వైరుధ్యాలు అన్నారు.  అలాగే పాతవి నశిస్తూ కొత్తవి వస్తుంటాయి. ఇవన్నీ ప్రకృతి సూత్రాలు.

ప్రకృతి లోని పదార్థంలో మార్పు జరుగుతూ ఉంటుంది.దాన్ని పరిశీలించడానికి తోడ్పడే వాటి ని  చలనసూత్రాలు అంటారు.   ప్రతి పదార్థానికి స్థలం, కాలం ముఖ్యమైనవి. ఒక విషయాన్ని చెప్పడానికి దాని కాలాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి  చెప్పాలి .దాన్ని అర్థం చేసుకోవాలన్నా దాని స్థల కాలాదుల్లోనే అర్థం చేసుకోవాలి. అంటే చారిత్రక సందర్భంలో దాన్ని చెప్పాలని అర్థం.

            ఇంతవరకు చర్చించిన విషయాలను చలన  సూత్రాలను  సమాజానికి వర్తింప చేస్తే  దాన్ని మార్క్సిజం అన్నారు. ఇదే విధమైన పరిశీలనను తెలుగు సాహిత్యం పై చేస్తే అది మార్క్సిస్టు ధోరణి అవుతుంది.ఈ ఆలోచనా విధానాన్ని  క్రిస్టఫర్ కాడ్వెల్, జార్జి థాంప్సన్, జార్జ్ లూకాస్, ఎర్నెస్ట్ ఫిషర్ ,రేమండ్ విలియమ్స్ మొదలైన వాళ్లు అభివృద్ధి చేశారు. తెలుగు సాహిత్యంలో మార్క్సిస్ట్ దృక్పధాన్ని ప్రవేశపెట్టిన వారిలో రా రా ,మద్దుకూరి చంద్రశేఖరరావు ,కొ.కొ., శ్రీ శ్రీ., కె.వి రమణ రెడ్డి ,త్రిపురనేని మధుసూదనరావు ,చేకూరి రామారావు, రాచపాళెం, కాత్యాయని విద్మహే, తెలకపల్లి రవి, రంగనాయకమ్మ మొదలైనవారు ప్రసిద్ధులు.

        సాహిత్యం సమాజానికి దర్పణం వంటిది. సాహిత్యం ఒక సామాజిక ఉత్పత్తి. సమాజం లేందే సాహిత్యం లేదు. సాహిత్యానికి స్వతంత్రంగా ఉండే లక్షణం లేదు. సమాజంలో అది ఒక భాగం. సమాజంలో  పీడిత వర్గం, పీడించే వర్గం ఉన్నాయి.  వారి మధ్య ఘర్షణ , ఐక్యత ఉంటుంది. ఈ సమాజం నుంచి వచ్చిన సాహిత్యకారుడు కూడా అనివార్యంగా ఏదో ఒకవర్గం వైపు మొగ్గు చూపుతాడు.అందువల్ల సాహిత్యకారులకు ఉన్న వర్గ దృక్పథం బట్టే సాహిత్యం పుడుతుంది.  

         సమాజానికి   ఆర్థికం పునాది వంటిది. సమాజంలో  మానవుని అవసరాల రీత్యా సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా ఉంటాయి. దీని అభివృద్ధిని బట్టే సాహిత్యం కళలు ,ఉత్పత్తి అవుతాయి. సమాజంలో ఉన్న రెండు వర్గాల మధ్య ఉన్న వైరుధ్యాలు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. మనదేశంలో  కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు, మతాల మధ్య వైరుధ్యాలు, దోపిడీ వర్గం పీడితవర్గం మధ్యనున్న వైరుధ్యాలు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి..

         సాహిత్యకారుడు తన రచన కోసం,  తనకున్న కుల దృక్పథంతోనూ, వర్గ దృక్పథంతో నో,మత దృక్పథంతోనో,ఆరోజుల్లో సమాజంలో నెలకొన్న ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి , ఒక వస్తువును స్వీకరిస్తాడు. తనకున్న ప్రత్యేకమైన శైలితో ఆ రచనను పూర్తి చేస్తాడు. ఆ రచనను అధ్యయనం చేసేటప్పుడు పైన చెప్పిన విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయడాన్ని మార్క్సిస్టు దృక్పథం అంటారు.

       మహాభారతాన్ని  పరిశీలించినప్పుడు వ్యాసుడు అందులో బ్రాహ్మణ క్షత్రియ వర్గాలను సమర్థించడం మనం చూస్తాం.ఇది రచయిత ఎవరి వైపున్నాడో తెలియజేస్తుంది.

       రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని, వేమారెడ్డి హరివంశాన్ని,మామిడి సింగన్న శృంగార నైషధాన్ని, రాయలు మనుచరిత్రను కవులతో రాయించడం వెనుక వారి వర్గ ప్రయోజనాలు ఉన్నాయి.  అందువల్లనే ఆయా రచనలు వచ్చాయి.   

         పీడితవర్గం వైపు నిలబడిన చెరబండరాజు ప్రపంచ పురోగతి మొత్తం శ్రమజీవి నెత్తుటి బొట్టులో ఇమిడి ఉందని చెబితే, మహాకవి శ్రీశ్రీ  తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరని ప్రశ్నిస్తాడు.వీరిద్దరూ శ్రామిక వర్గం వైపు నిలబడిన రచయితలు.

      ఇలా సాహిత్యకారుడు ఏదో ఒక వర్గం ఉండాలంటే  అతనికి సామాజికచైతన్యం ఉండాలి.సమాజిక జీవితం ఉండాలి. మానవ చైతన్యం భౌతిక ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాదు దానిని సృష్టిస్తుంది కూడా అని లెనిన్ అన్నాడు. అంటే రచయిత తన సమాజాన్ని అధ్యయనం చేసి సరికొత్త సమాజ ఆవిష్కరణ కోసం తన కల్పనతో రచనలను చేస్తాడు.

     సమాజంలోని వైరుధ్యాలను గుర్తించడానికి మార్క్సిస్టు ఆలోచనా విధానం దోహదపడుతుంది. రచయిత చైతన్యం అతను తీసుకున్న వస్తువును బట్టి తెలిసిపోతుంది ఆ రచయితకున్న అవగాహన నుకూడా తెలియజేస్తుంది.

      రచయితకు చైతన్యం ఎలా వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానంగా రచయిత ప్రాపంచి దృక్పథం,అతను నమ్మిన విలువలు, అతని నిబద్ధత  ఇవన్నీ అతని చైతన్యాన్ని పెంపొందిస్తాయని రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి చెపుతారు. చైతన్యాన్ని బయట నుంచి అందించాలని లెనిన్ చెప్పినారు. రచయితకు కూడా సామాజిక సంబంధాలను గురించి,అందులోని వైరుధ్యాల గురించి పరిష్కారాల గురించి ఎవరో ఒకరు చెప్పాల్సి ఉంటుంది. ఇందుకు రచయిత స్వానుభవం కొంత తోడ్పడుతుంది.  అంతేగాక గురజాడ, జాషువా, శ్రీశ్రీ, రంగనాయకమ్మ మొదలైన వారి రచనలు కూడా రచయిత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి  కావలసినంత చైతన్యాన్ని అందిస్తాయి.

           రచయిత సామాజిక చైతన్యం పెంపొందించుకునే క్రమంలో అభివృద్ధికరమైన ఆలోచనలు చేస్తాడు .వాటిని సమాజ పురోగతి కోసం ప్రజా ప్రయోజనాల కోసం తన రచనలో వ్యక్తీకరిస్తాడు. ఈ వ్యక్తీకరణ కళాత్మకంగా ఉండాలి. సామాజిక వాస్తవికతను చెప్పడమేగాక భవిష్యత్ పరిణామాన్ని గుర్తించగలిగే శక్తి మార్క్సిస్టు దృక్పథం తోనే సాధ్యం అవుతుంది దీనినే సామ్యవాద వాస్తవికత అని కూడా అంటారు.

      రచయిత తన రచనలో  నవ్యత, గాఢత, క్లుప్తత తీసుకురావాలని తెలకపల్లి రవి చెపుతారు. పూర్వం చెప్పని విషయాలను ఆధునిక భావాలను రచనలో ప్రవేశపెట్టాలన్నారు.

       పాఠకుని హృదయాన్ని  కదిలించి, మనసును స్పందించిన జేసి భావప్రక్షాళన చేసేదే ఉత్తమ రచనగా అరిస్టాటిల్ పేర్కొన్నారు. దీన్నే శిల్పం అని కూడా అంటారు.  కళాత్మక రచన అని కూడా అంటారు. రచయిత తన రచనకు తీసుకునే వస్తువును తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులే నిర్ణయిస్తాయి.

      రచయిత శిల్పం కోసం తపన చెందినప్పుడు  వస్తువుని పక్కన పెట్టేస్తాడు. దాంతో రూపం ముందుకొస్తుంది. రూపమంటే  అది పద్యమో,గద్యమో, వ్యాసమో,కథో,కవితో కావచ్చు.  వస్తువు,రూపం లో రూపం ప్రధానమనే భ్రాంతి లో  పడి పోతాడు రచయిత. పద్యంలో చెప్తేనే బాగుంటుందని ,వచనం సరైంది కాదని , నానీలు మంచివని ఇలా రూపాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. రచనలో సామాజిక స్వభావం లేనప్పుడు రూప వాదం మొదలవుతుందని ఫ్లెఖనోవ్  అంటారు.

      జీవిత సంక్షోభాలను గుర్తించి పరిశీలించి పరిష్కారం సూచించి మనిషిని మరింత చైతన్యవంతుల్ని చేసేదే గొప్ప సాహిత్యం అవుతుందంటారు  పాపినేని శివశంకర్.

         సాహిత్యం మనిషిని సంస్కారవంతుని చేస్తుందని గురజాడ అన్నారు.సాహిత్యం చేసే పని భావ ప్రచారమేనని అమెరికా రచయిత ఆప్టన్ సింక్లెయిర్ అంటారు. సాహిత్యం ఒకవైపు భావ ప్రచారం  చేస్తూనే మానవ సంస్కారం లోనూ ,ఆలోచనా ప్రవాహంలోనూ మార్పు తీసుకువస్తుందని బాలగోపాల్ అన్నారు. ఇది ఒక రకంగా బయటనుంచి చైతన్యం అందించే  ఒక విధానం.

        సాహిత్యకారులు చాలామంది మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్లే. మధ్యతరగతి బుద్ధిజీవులలో ఎక్కువ భాగం ద్వంద్వ స్వభావం ఉంటుంది . దీని వల్ల  వారిలో మానసిక సంఘర్షణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది . ఈ సంఘర్షణలో  ఏది పైచేయి సాధిస్తే అటు వైపు మొగ్గు చూపుతారు మధ్యతరగతి బుద్ధిజీవులు. ఇలాంటి సంక్లిష్ట సామాజిక జీవితం నుంచి వచ్చిన కవులు రచయితలు తమ రచనలకు సమాజం నుంచి వస్తువులను తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుత ప్రపంచీకరణ ప్రపంచంలో సామాజిక జీవితం సంక్షోభంలో ఉంది దీనికి సరైన పరిష్కారాన్ని గుర్తించి అందించాల్సిన బాధ్యత సాహిత్య కారులదే. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉన్న ఈ సమాజంలో   అసమానతలు,పేదరికం, మూఢనమ్మకాలు, దోపిడీ, అజ్ఞానం కొన్ని వర్గాలు నిరంతరం వాటినే ప్రచారం చేస్తున్నారు. వాటిని పోగొట్టడానికి, రూపుమాపడానికి సాహిత్యకారులకు మార్క్సిస్టు ఆలోచనా విధానమే సరైన సాధనం.

సాహిత్య వ్యాసాలు

మానవీయ సంవేదనా ప్రపంచం  ఏనుగు నరసింహారెడ్డి కవిత్వం!

గడుసైన కవి ఏనుగు నరసింహారెడ్డి. సాహిత్య ప్రపంచానికి చాలా దగ్గరైన వాడు ఇతని కవిత్వంలో ఆగని కవిత్వ ధార కనపడుతుంది. అది ప్రజల భాషలో వినబడుతుంది.సీరియస్ విషయాలే కాకుండా వాటి మధ్య జారిపోతున్న దయనీయ జీవన దృశ్యాన్ని పట్టుకోవడం, అనేక వాదాలు, ధోరణులు, ఉద్యమాల్లో ఇమడ కుండా సమకాలీన సాహిత్య చరిత్రలో మానవీయ సంఘర్షణలను పట్టుకోవడం నరసింహారెడ్డి ప్రత్యేకత.  - డా. సుంకిరెడ్డినారాయణరెడ్డి.

కవి నిరంతర చైతన్య శీలి. నిత్య సృజనాత్మక శీలి.అతని కవిత్వం సమస్త మానవీయ సంవేదనా శీలి. అతని కవిత్వం ఏ భాషలో కి అనువదింపబడినా,తనదైన భావస్ఫూర్తి మెరుస్తూనే ఉంటుంది.

తనదైన శైలితో, తనదైన ప్రాపంచిక దృక్పథంతో, సమాజాన్ని జాగృత పరుస్తూనే ఉంటుంది తను ఏ స్థాయిలో నిలబడినా, తన మూలాల్ని మరువడు.  తన గ్రామీణ జీవననేపథ్యాన్ని మరువడు. తనలో భావ సంచలనం కల్గినపుడు,పురిటి నొప్పులు పడుతూనే కొత్తకవితకు జన్మిస్తాడు.  సామాజిక బాధ్యత కలిగిన కవి చైతన్య రహితంగా ఉండలేడు. సమాజ హితం కోసం, నిత్య చైతన్య శీలిగా, సాహిత్య వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. అలాంటి నిత్య చైతన్య శీలి, నిగర్వి, నిష్కపటి, తెలంగాణ సామాజిక చింతనా పరుడు, డా.ఏనుగు నరసింహారెడ్డి గారు.

తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖలో, ఒక బాధ్యతాయుతమైన ఉన్నతాధికారిగా నిత్యం ప్రజాక్షేత్రంలో విధులు నిర్వహిస్తూనే, పై అధికారుల ఒత్తిళ్ల మధ్య ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా లేని రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తూ, ఏమాత్రం తీరిక సమయం దొరికినా కవిత్వ రచనకు అంకితమైన  అరుదైన కవి, డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి గారు. వీరితో నాకు 1995 నుండి గాఢమైన పరిచయం. ఆత్మీయమైన కవితానుబంధం   మాది.

2018లో నేను మా "ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు'త్రిదశాబ్దిఉత్సవాలనుఅనంతపురంలో ఒక రోజంతా నిర్వహించాను వారిని ఒక  ఆత్మీయ అతిథిగా ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఆనాటి సభలో వారు వర్తమాన కవులకు చక్కటి దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించారు. 

ఒక కవిగా,సాహితీవేత్తగా,తాను ఎక్కడా ఆగిపోలేదు.విశ్రాంతి తీసుకోలేదు. తనదైన సైద్ధాంతిక దృక్పధాన్ని విరమించు కోలేదు భావ సాంద్రత లో తనదైన అభివ్యక్తిని మెరుగు పర్చుకుంటూ,నిబద్ధతతో సాగిపోతూ ఉన్నారు. వారిని కవిత్వ కోణం లోంచీ, పాతికేళ్ల  వారి కవితా ప్రస్థానాన్ని గురించి విశ్లేషించే  ప్రయత్నమే ఇది.

కవి ఏనుగు నరసింహా రెడ్డి గారు 1968లో యాదాద్రి భువనగిరి జిల్లా లోని 'కల్లోల కుంట'లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, కృష్ణారెడ్డి దంపతులు.వీరి ప్రాథమికవిద్య, ఉన్నతవిద్య చిట్యాల, రామన్నపేట, నల్గొండలో, సాగింది.

1998లో హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో "తెలుగు హిందీ జాతీయోద్యమ తులనాత్మక అధ్యయనం" అనే అంశం మీద పీహెచ్ డి  పొందారు.

వీరి సృజనాత్మక  నేపథ్యంలోంచీ నిరంతరం పదునెక్కుతున్న కవిగా, విమర్శకుడిగా, తెలుగు సాహితీ రంగంలో అలసట లేని విరామం లేని సాహిత్య ప్రస్థానం వీరిది.

మీరు ప్రస్తుతం విభక్త తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ నిన్నటి వరకూ తెలంగాణా సాహిత్య అకాడమీ కార్యదర్శి కొనసాగుతూ ఉండడం వీరి వ్యక్తిత్వం, అంకితభావం, ఒక  కారణం కావచ్చు.

ఒక స్థితిలో తను తాను పరిచయం చేసుకుంటూ... "నేను పుట్టిన నేల,నేను నడిచిన బాటలు, నేను కలిసిన వ్యక్తులు, నన్ను దిద్దిన పుస్తకాలు, నేను చేసిన పనులు,అవి ఇచ్చిన అను భూతులు ఒక చోట రాసి పోస్తే అది నేనే "అని ప్రకటించడం  వెనుక ఈ కవి కి ఎంతటి ఆత్మవిశ్వాసం ఉందో, మనకు ఇట్టే అర్థమవుతుంది

డా.ఏనుగు నరసింహారెడ్డి గారి రచనలు

ఇవి..

1 సమాంతర స్వప్నం...కవిత్వం... (1995)

2.నేనే ... కవిత్వం .................(2002)

3.మట్టిపాట...కవిత్వం ............(2008)

4.కొత్తపలక.... కవిత్వం...............(2013)

5..హైద్రాబాద్ విషాదం...అనువాదం.. (2016)

6.అంతరంగం...ఆధునిక కవిత్వ విమర్శ...(2018)

7.మూలమలుపు...కవిత్వం...(2018)

8.సమాహార...........(2019)

9.తెలుగు రాష్ట్రాల.. రెవిన్యూ వ్యవస్థ..నిన్న నేడు రేపు (2019 )

10.కవిత్వం లో బాల్యం..ఎంఫిల్ గ్రంథం  ( 2019)

11.తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు

(తులనాత్మక పరిశీలన)....(2019)

12.తెలంగాణా రుబాయిలు...(2020)

-----------------------

 నిరుద్యోగ, నిరాశా పర్వం  సమాంతర స్వప్నం (1995)

 ------------------------

 ఆకలి కి పర్యాయపదమైన, నిరుద్యోగ దశాబ్దంలో, ఆకలిలోంచి అభద్రత లోంచీ ఎలుగెత్తి కవిస్వరమే ఈ "సమాంతర స్వప్నం"

తన సామాజిక అవగాహన గురించీ, జీవితం లోంచీ, కవిత్వం గురించీ ఇలా నిర్వచిస్తున్నాడు కవి..

నిజానికి దబాయింపులూ, స్ట్రాటజీల్లేని కవిత్వమే నాకిష్టం. జీవితానికి విధేయం కాని కవిత్వాన్ని నేనూహించలేను. రాయ కుండా ఉండలేని అనివార్యతా గుణం, పొగలు కక్కే నిజాయితీ ఇటువంటివి అరుదవుతున్న కాలంలో, అలసిపోయి పలకరించే నిరుద్యోగిలా, నాయీ "సమాంతర స్వప్నం".

 59 కవితలున్న ఈ సంపుటిలో ఒక్క నిరుద్యోగ పర్వాన్ని గురించే పది కవితలు దాకా ఉండటం ఓ విశేషం.

 వృద్ధాప్యం లేత చెట్టుపై

 నాలాంటి గొడ్డలి దెబ్బల్ని దయతో భరించు

 నేనసలే రాకపోవచ్చు

 అమ్మా!

 నువ్వు ఎదురు చూడకు     (పుట- 2 )

ప్లాట్ ఫారం మీద తన గొంతు రైలు కూతవు తుందని క్వాలిఫైడ్ టీచర్లకు మద్దతుగా నిలుస్తాడు కవి.ఒంటరి భూతాన్ని నిరంతర సామూహికత్వం తో చిత్తు చేస్తానని ప్రతిన బూనుతాడు. ఇరానీ చాయ్ తీపెక్కుతున్నా, బతుకు మాత్రం చేదెక్కు తుందంటాడు.

తప్పని దుఃఖం

దిగమింగుకున్న కొద్దీ ఎగదన్నుకొస్తున్న

వింత దుఃఖం

కాలం మెరుపు కత్తుల్ని దూసి

ఎన్నినిలువు కోతల్ని కోస్తున్నా

 గూడు వీడిన పిచ్చుకను కావడం

 మాను కోలేక పోయాను.  ( పుట- 17)

చాకిరీతనాన్ని స్త్రీత్వంగా అలంకరించుకున్న క్షమయాధరిత్రిని కొనియాడుతున్నాడు కవి.భగ్గున మండే చౌరస్తాలో రసం పిండుతున్న చేతుల్ని చూసి ఆర్ధ్రంగా ద్రవిస్తాడు.ఉస్మానియా

యూనివర్సిటీ లో పరిశోధకుల బతుకు కూడలి ఎన్.సీ.పీ చౌరస్తా పై రాస్తూ...

నా ప్రాణమా ఎన్.సీ.పీ

 నువ్వెన్ని కన్నీటి బొట్లను

 ఎన్ని వేదనామయ జాలి చూపులను

 ఎన్ని తరంగిత హృదయ విన్యాసాలను తీర్థమాడించుకున్నావు

 నీ స్పర్శ లేని రోజు

 దినచర్య మిగిలిపోయిన

 అనుభూతుల ఆస్తుల నిస్తున్న ఎన్.సీ.పీ

  దినదిన గండమైన ఈ చేప పిల్లలకు

 నువ్వే కదమ్మా ఎన్.సీ.పీ.చల్లటి కొల్లేటి సరస్సు ( పుట-23)

బతుకునే పద్మవ్యూహం లో నిలిపి ఆత్మబలిదానాలతో,చిత్ర హింసల నరక యాతనల్ని భరించే త్యాగమూర్తులను

స్మరించుకుంటాడు కవి.గల్లంతైన హృదయపు చిరునామాను గురించి వాకబు చేస్తాడు.

ఏ మాట వెనకాల ఆ వాసన లేదు

ఏ పలకరింపులో ఆ చెమ్మ లేదు

కాస్త వెతకండి

హృదయం చిరునామా గల్లంతయింది  ( పుట-29)

కవీ, నువ్వెప్పుడూ వేదనకు మరో రూపానివే నంటాడు. అమ్మ ఒడి నుండి అనుభవాల ఆస్తులను తీసుకున్నా నంటాడు  వందలు,వేల బతుకుపుస్తకాలను ఆ ఒడిలో నుండి  నేర్చుకున్నా నంటాడు. మా బతుకు దీక్ష మారదు,మా చెమట బట్టలు మారవు, మేంమారం అంటాడు.

ఇక్కడి భక్తి అంటే రాజకీయం,ఆలయాలు ఓట్లకు నిలయాలు అని ప్రకటిస్తాడు.

ఇక్కడి ఆలయాలు

ఓట్ల మొగ్గలేసి

సీట్ల పూత పూసి

పవర్ ఫలాలను పంచుతాయనే కదా

క్షుదార్తుల ఉదరాలను

కరసేవ కంపుతో నింపేస్తారు ( పుట..39)

నిరుద్యోగ నిర్వేద యువకుడిగా శివారెడ్డి కవిత్వంతో చైతన్య స్పూర్తితో ఒక కవిత  రాస్తాడు.

"సహజ సామర్థ్యం పెల్లుబికిన ప్రతిచోటా ఓవర్ క్వాలిఫికేషనై వెక్కిరిస్తుంది

గొంతునొక్కి మనసు చంపుకు

కనిపించిన నాడు

అసమర్థతగా ధృవీకరించబడుతుంది ఒక్కోసారి

అప్రయోజకమైన సానుభూతి తుఫాను కొన్ని రోజుల పాటు మనిషిని కానీయదు నాకేసి చూసుకుంటే

తెగిపోయిన పతంగాలు గుర్తుకు వస్తాయి బతకడానికి ఓ పెద్ద బండ బరువు చేసిన బతకడానికి ఓ బడా వ్యాపారం చేసిన సుందరమయ వ్యవస్థలో

బతకును మోయలేక మోస్తూ

 రాయలేక రాస్తూ

 కవిని నేనే

 చదువు కునే వాళ్ళుంటే 

 కవిత్వాన్ని నేనే

 నేను నవ యోగి

 నా పాత పేరు నిరుద్యోగి"    ( పుట..95 )

 

ఈ కవిత్వం రాసిన కాలం నాటికి నిరుద్యోగ యువకుడైన ఈ కవి చాలా కవితల్లో  తన మానసిక నిర్వేదం ప్రకటిస్తూ ఉంటాడు. ఇంట్లో,బయటా,స్నేహితుల మధ్య అన్నీ ప్రశ్నలే.వారి పలకరింపులన్నీతనకు శూలాలు గుచ్చుకున్నట్లు ఉంటాయి  కవికి.

"ఉపాధి వృక్షం చేసుకోలేని నాకు

ఇంట్లో

ప్రశ్నఅమ్మ  మొహమవుతుంది

నాన్న వయసవుతుంది

అన్నింటి కన్నా పెద్ద ప్రశ్న

నా చదువవుతుంది".  (పుట..50)

కవికి గ్రూప్2ఎ లో స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు తనఇల్లు, కాలేజ్, యూనివర్సిటీ  నదీనదాల్లోపడవై కేరింతలు కొట్టిన ఆనందాన్ని అనుభవించాడు కవి.తనకూ బాల్యానికీ నడుమ తెగిపోని హోమ్ వర్క్ ల రాగ బంధమనీ,యాభై అక్షరాల గందర గోళమని అంటాడు కవి.

ఇలా "సమాంతర స్వప్నం" లోని కవిత్వమంతా కవి నేటివిటీని, బాల్య, యవ్వనోద్రేకాల మధ్యబతుకు కష్టాన్ని వివరిస్తుంది.నిరుద్యోగ పర్వంలో కష్టాల కడగండ్లను ఆర్ధ్రంగా వివరిస్తాడు కవి.

-------------------------

ఒక అసందర్భ వ్యంగ్య చిత్రం-'నేనే' (2002)

--------------------------

ఎవరూ అందుకోలేని ఒక ఆదర్శవాది, ఒక ఉదాత్త మూర్తి ,జ్ఞాన గ్రంథాలయ సర్వస్వం మధురకవి తన గురువు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారికి అంకితమిచ్చిన కవిత్వమే 'నేనే'

 తొలి కవిత తెలంగాణ గ్రామ సేవకుల, వెట్టిచాకిరీల, వేతనము లేని ఉద్యోగుల గురించి,దయనీయంగా రాసిన కవిత-

'నీటిపిట్ట'

 వీరిని నీరుడీలని, కావలికార్ లని ఇంకా వివిధ పేర్లతో పిలువబడుతుంటారు.

 ఓ నీటి పిట్టా

 చిలికి చిలికి వెల్లువెత్తిన ఉప్పెనలో

 కట్టగండికి గడ్డివామువై ఇసుక బస్తావై నిలువరించి ప్రాణాలిచ్చే జలదాతా తూముల్లో మరణ పిట్ట వేదన తెలిసీ

నీరుడీ వారసత్వం చేపట్టిన

నీ సుగుణమే జ్ఞానం

నువ్వూ నీచేతి కర్రా అంగిబిళ్ళా

గంగ చుట్టూరా ఓ వెట్టి కాపలా

నువ్వు నిజమైనమట్టి బావుటా  ( పుట.. 2 )

ఉగ్గ బట్టుకున్న దుఃఖంతో భవానీ స్మృతి మీద రాసిన కవితే 'వాలు గులాబీ' చిక్కబట్టుకున్న తరిమివేత మీద,అక్కరకు రాని చుట్టము మాదిరి అశోక చక్రం తలలు వంచేసుకున్నప్పుడు పజ్జమే నా గుండె చుట్టూ తారాడుతూ,నాలో కొత్త ఆశల్ని పూయిస్తుందంటాడు కవి.

వానాకాలం అంటే ఇష్టపడని కవి ఎవడుంటాడు?  మన కవి నరసింహారెడ్డి కూడా పల్లె మూలాల నుండి ఎదిగి వచ్చిన వారే కనుక వానంటే పరవశించి పోతారు.

''ఆకాశం జల్లెడ లోంచీ

 పైకెగసిన సముద్రం

 అడవి తల్లికి తెగని చినుకులు చీరలిచ్చి పులకింత వాగులై సాగింది

వర్షం కురుస్తుంటే

చినుకుల వెనకాల

మసక మసకగా గుట్టరాళ్లు

ప్రతిదీ ఓ అద్భుత కళాఖండమే

విశ్వం విలాస హాసం వానకాలం

వన్నెల బహుమానం"

(పుట..11)

మానవత్వం లేని మత దురభిమానుల మధ్య, సరికొత్త క్షమాగుణాన్ని సృష్టించి, వ్యాధుల్ని నిర్భీతిగా నయం చేస్తూ పేదల గుండెల స్టెతస్కోప్ అయిన 'స్టీవర్ట్  స్టెయిన్' ను,1999 లో ఒరిస్సాలో సజీవ దహనం చేసిన ఘటనను తలుచుకుంటూ, వారి స్మృతి లో రాసిన కవితే 'అంగార శయ్య'.

'బంజారా హిల్స్ చుట్టూరా'  కవితలో ఖాళీ కడుపులు, కళ్ళనిండా నీళ్లున్న ఎండు గడ్డి గుడిసెల్నిబీపరామర్శిస్తాడు కవి.

జీవితమే ఓ అసందర్భ వ్యంగ్య చిత్రమనీ, ఇందులో నిందార్హుడెవడూ లేడని అంటాడు   శంకర్ మట్ రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లూట్ వాయించే బిక్షగాడి పాటకు ద్రవించి పోతాడు కవి.

పాటగాడా  నా పాటగాడా

పడిలేచే కెరటాల మధ్య పదిలమైన సముద్రంలా

 పగలూ రాత్రీ ఏకం చేస్తూ

 మా ఆనందాల కోసం

 మా విషాదాల కోసం

 పాడే పాటగాడా

 సైరాపాట గాడా

 సై సైరా పాట గాడా  ( పుట..19)

శాంతి కపోత సౌందర్యాన్ని చూస్తూ గడుపుతాడు కవి.ఎంతకీ తెగని కలను గురించి వివరిస్తాడు

కేవలం రెవెన్యూ రికార్డుల్లో కనిపించే గ్రామాలు కొన్నిఉంటాయి.అలాంటి వాటిని గురించి రాసిన కవితే 'తహసిల్ తరీఖా'

'బతుకమ్మ కల' లోతెలంగాణ బతుకమ్మ పండుగ గురించి అపురూపంగా రాస్తూ బతుకమ్మ దాపకం చీరలో జరీ అంచునై పోదామని ,ఒళ్లంతా కళ్లు చేసుకుని రెల్లు గడ్డి ఎదురుచూస్తుందట.

ఈ పండుగ అక్కలకు బదులు మాకే రెండు వారాల ముందు మొదలవుతుందంటాడు కవి. దేవ కాంతలు ప్రత్యక్షమై బంగారు బతుకమ్మను బహుకరిస్తే చెరువులో వదిలేయ బతుకమ్మను బహుకరిస్తే  చెరువులోవదిలేయ మనసురాక ఊగిస లాడుతూ మెలకువలో కొచ్చే వాళ్లమని తన అనుభవం గురించి రాశాడు కవి.

"దూరంగా కొండ నింగిని కలిసేచోట

 సృష్టిలోతుల్ని  కొలవాలని

 పండిన గోరింటల పరువం మీంచి

 నీట వాలి లోనికి దారేది బతుకమ్మ

 తొడలోతునీళ్లలో

 తరలిపోయే గౌరమ్మా

 మళ్ళొచ్చే  పండుగకు

 మళ్లీ మళ్లీ రావమ్మా  ( పుట..34)

డా.కూరెళ్ల విఠలాచార్య గారు ఒక మేధావి, ఒక సాహితీ ఝరి, ఒక తొణకని సముద్రం, ఈదురు గాలికి చెదరని ఓసాహితీ మహా వట వృక్షం.

అంతటి వారు ఈ కవి గురువుగారు కావడం వారికి ఈ పుస్తకం అంకితం చేయడం ఎంతో సముచితంగా ఉంది ఎందుకంటే తెలంగాణలోని వెల్లంకి అనే ఒక కుగ్రామంలో గ్రామీణ పేద విద్యార్థుల కోసం తన ఇంటిని మహా గ్రంధాలయం గా మార్చిన మానవతా మూర్తి. సాహితీ వదాన్యులనుండి  67,000 గ్రంథాలను సేకరించి అందులో పదిలపరచి విద్యా దానం అద్భుతంగా నిర్వహిస్తున్న మహానుభావుడాయన.

తనకున్న కొద్దిపాటి భూమిని కూడా పేదవారికి పంచిపెట్టి 83 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం అలసట లేకుండా తన గ్రంథాలయ నిర్వహణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సాహితీ భీష్ములు విఠలాచార్య గారు.

నేను స్వయంగా వెల్లంకి వెళ్లివచ్చాను వారి గ్రంథాలయాన్ని దర్శించే భాగ్యం నాకు కలిగిందని చెప్పడానికి ఎంతో గర్వ పడుతున్నాను ఆరోజు వారు నా పట్ల చూపిన ప్రేమను ఎన్నటికీ మరువలేను.

 నా వంతుగా వారి గ్రంథాలయానికి ఆరు వందల పుస్తకాలను విరాళంగా పంపించాను .వారు గొప్ప సాహితీవేత్తలు కవి పండితులు వారు స్వయంగా ఎన్నో విలువైన గ్రంథాలను రచించారు వారి కృషిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రజా కవి కాళోజీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

వారి "విఠలేశ్వర శతకము" గురించి మన కవి ఏనుగు నరసింహారెడ్డి అభివర్ణిస్తూ...

తలబిరుసు లేని పద్యం

లోతైన సాదు వ్యక్తీకరణ

మీ వ్యక్తిత్వమంత సమున్నత కవిత చదివాక ఏం రాసినా

పగలు దివిటీలు పట్టినట్లే గురువుగారూ మీరిలాగే ఉండి తీరాలి

మేము నమూనాగా చూపించగలిగే

సమున్నత వ్యక్తిత్వం

తలెత్తుకు చూసే కవిత్వం

లోకాన్ని నిజంగా శాసించ గలిగేకవిత్వం

వెల్లంకికి జేజే లు  (పుట.. 37)

పద్యాన్ని మరువకండని,అతికష్టం మీద దాన్ని మర్చిపోయినట్టు నటించకండి అంటూ కవుల్నీ, కళాకారుల్నీ హెచ్చరిస్తున్నాడు.పరాయీకరణ  ప్రారంభమయ్యాక మన పల్లెటూళ్లు జ్ఞాపకంగా మిగిలి పోయాయని ఆవేదన పడుతున్నాడు.

ఉద్యోగం బదిలీ గురించి కాదని బదిలీ కాలేని మనసు గురించి బాధపడు తున్నానని కవి ప్రకటిస్తాడు.

కాలం నది ముందు మోకరిల్లి

కాస్త ముందుకు పోతున్నట్లు నటిద్దాం సరళీకృత ప్రపంచం

ఇప్పుడు దుఃఖ సౌఖ్యపు అజెండా

ఎంతకీ దొరకని కన్నీటి జాలు  ( పుట..62)

బదిలీ పేరుమీద మజిలీ పూర్తయినప్పుడు ఎవరికైనా కళ్ళవెంట నీటి బిందువులు రావలసిందే,జీవితాన్ని మరణం దిశగా తెంపు లేని పరుగు నిర్వచిస్తాడు కవి.

కన్ను మూస్తే ఎవరి జీవనయానంలో వారే తీరిక లేకుండా ఉంటారు. ఆశ మాత్రమే మనకున్న ఆస్తి అంటారు. కొత్తగూడెం లో ఆర్టీసీ బస్సు ఎలక్ట్రిక్ షాక్ కు గురై 14 మంది మరణించినప్పుడు కవి కూడాఎంతో షాక్ కు గురవుతాడు.

బహుశా మన ప్రాణాలింక

సామూహికంగా హనన మవటం

ఓ గంట చర్చ కూడా కాదు

ఓ క్షణం నిట్టూర్పు కూడా కాదు

గుండె ఆగుతున్నప్పటి

ఆజీవన ఆక్రందన

ఏదీ.. ఏ చోట స్మరణకు రాదు  ( పుట..84)

షేక్స్ పియర్లు,షెల్లీ, కీట్స్, కాళిదాసులూ పాళీపల్లకిలో ఊరేగే యువరాజులని కీర్తిస్తాడు. మన లోక వ్యవహారం లో అందరూ అపూర్వమైన ప్రేమను నటించే వారే. నువ్వు మాత్రం ఒంటరి వాడవే నంటాడు.

 కాలం జారిపోతుంది

గుండె పగిలిపోతుంది

దిగులు దుప్పట్లు కప్పుకొని

పాత జ్ఞాపకాలుమీంచి

ముఖం చాటేసే దొంగ ప్రేమల్నుంచీ అవసరాల్ని దిగేసుకున్న

అభిమానాల్నుంచీ

 ఒంటరిగానే నువ్వు ( పుట.. 92)

ఇలా "నేనే" కవితా సంపుటిలో అనేక సామాజిక,సాంస్కృతిక,విషయాలను ప్రపంచీకరణ కోణం లోంచీ విశదీకరిస్తాడు కవి.

--------------------------

పల్లె కడగండ్ల మీద పద్య సమరం- మట్టిపాట శతకం (2008)

--------------------------

ఒకనాడు పసిడి పంటల తో, కుల వృత్తుల తో కళకళలాడిన పల్లె తీరు మారింది.  జీవనశైలి మారింది. కుల వృత్తుల విధ్వంసమైనాయి. అన్నదాతల దైనందిన జీవితాన్ని చూస్తే గుండె చెదిరి పోతుంది

అన్నదాతల దీన దశను చూసి కవి గుండెల్లో ప్రతిధ్వనించిన  పద్యమే మట్టిపాట శతకం. ఈమట్టి పాట ఈ శతక పద్యాలు ఆడియో క్యాసెట్ గా రూపొందింది, తెలంగాణ జనజీవనంలో మమేకమై ప్రతిధ్వనిస్తున్నాయి 'పల్లె బతుకు మాది పాడు గాను' అనే మకుటం తో అలరించే చక్కటి  పద్యరచన ఈ పుస్తకం.

 

ఉన్న ఊరు నిడిసి కన్నతల్లి నిడిసి

పంట చేలనిడిసి పనులనిడిసి

బోరు బండ్లమీద ఘోరంగ తిరిగేము

పల్లె బతుకు మాదిపాడుగాను   (పుట.. 7 )

ప్రపంచీకరణకు స్థానికతే పరిష్కారం. అటువంటి విధ్వంస వినాశనాన్ని ధిక్కరిస్తూ  ఈ శతక పద్యాలు రూపొందిందాయి.

రేయి పగలు యనక రెక్క విరుచుకున్న పుట్టవేమి బువ్వ బట్టలైన

శ్రమను జేయువాడుకుమిలి యేడ్చుటఏమి పల్లె బతుకు మాది పాడు గాను (పుట..10)

నేడు పల్లె తన ఉనికిని కోల్పోయింది టీవీలు మొబైల్లు తెచ్చిన నాగరికతతో మన పల్లె సంస్కృతి బాగా మారిపోయింది.

ఈ  మార్పు జీవితాన్ని మనిషిని విడదీసి చూపుతున్నది.

చేనేత బతుకులకు చేటు గాల మొచ్చింది. కులవృత్తులు కూలిపోయి బతుకు దుర్భరమైందనికవివాపోతున్నాడు

పద్మశాలి బతుకు బహుదుర్భరంబాయె  వారమంత వడికి చీరె నేయ

పడుగు పేకలాయేబతుకు దారిద్ర్యాలు

పల్లె బతుకు మాది పాడుగాను  ( పుట..16)

ఓట్ల బిచ్చగాండ్లు వచ్చారు పోయారు ఐదేళ్ల వరకు మళ్ళీ పల్లెలో అడుగుపెట్టరు. అన్ని కులాలు పల్లెలో ఐకమత్యంగా జీవిస్తారు.

పండిన పంటలు పట్నాలు చేరుతాయి.

చదివినోళ్లు ఉద్యోగం వేటలో పట్నాలకు పోతారు. ఇంకేముంది మా పల్లెలో ఎండిన చేలు తప్ప ,అంటున్న కవి.

పల్లె తరుగుతోంది పట్నమెదుగుతోంది

కన్న తల్లి గుండె కరుగుతోంది

నగర కన్నె వన్నె  నానాడు పెరిగెరా

పల్లె బతుకు మాది పాడు గాను  ( పుట..19)

ఏరు పొంగితే ఊరు మునిగిపోతుంది. ఎండ మండితే ఎడద మండిపోతుంది. పల్లె జీవిత మంటే అరటి ఆకు ముళ్లుతో సమానం. పల్లెటూరి లో శ్రమజీవులే  కనిపిస్తారు. నిత్యం బతుకు పోరులో బండ బతుకులు పల్లెటూర్లు. రామారావు గెలిచినా,రాజీవ్ గాంధీ గెలిచినా పల్లె బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు.

 ఏలి నోళ్ళ మాట లెంత గానో తీపి

 చేతలేమొ సున్న చేయరేమి

 మాట తోడ మమ్ము మాయజేసిరి చాల

 పల్లె బతుకు మాది పాడు గాను ( పుట..22)

 

చదువుకున్నవారు పదవులున్నవారు సంపాదన కొరకు పట్నం చేరినారు తల్లినొ దలినారు,  పల్లెనొదలినారు,ఆడబిడ్డ పెళ్ళికి ఐదెకరాల పొలం పోయే.కొడుకు చదువు కోసం కొంత,ఉన్న ఆస్తులెల్ల  ఊడ్చి పెట్టిన బతుకాయే..

ఎల్ల బాధలకును పల్లెలే నిలయాలు

పల్లె బాధ లెవడు బాపడాయే

ఉండి చావలేక ఊళ్ళు వురుకు చుండె

పల్లె బతుకు మాది పాడుగాను  (పుట..33)

వైద్య సేవలు లేవు.  పొలాలు ఫ్యాక్టరీలకై అమ్ముకోవడం,పనులు లేక అర్ధాకలితో

బతకడం,వృద్ధులంతాపల్లెటూరిలో,  కొడుకులంతా పట్టణాల్లో ఉంటారు. వరుస కరువులతో,పంట మీద ఆశ సన్నగిల్లే.రైతుల బతుకులన్నీ అప్పుల పాలే గదా..

 

అప్పు జేసి నీరు ఆశించి బోర్లేయ

గంటే డైనరావు కండ్ల నీరు

పరగ దయ్యెమాయె  పాతాళ గంగమ్మ

పల్లె బతుకు మాది పాడుగాను    (పుట..38)

కరువు పనులు వల్ల వచ్చే గింజలు ప్రభుత్వబ్రోకర్ల పాలాయె.ఫ్లోరైడ్ పీడతో  నానాటికీ ఊర్లన్నీ తరిగిపోతున్నాయి పట్టించుకునే నాధుడే లేడు.

 

తాగు బాధ సాగుతూనే ఉండ

సాగునీటి పనులు సాగు చుండె

దీర్ఘ వ్యూహమేది దరిదాపులో లేదు

పల్లె బతుకు మాది పాడుగాను   (పుట..43)

ఇలా ఈ శతకం లోని ప్రతి పద్యం పల్లె దయనీయ  జీవితాలను తెలియజేస్తుంది. విచ్ఛిన్నమవుతున్న గ్రామీణతకు రూపు కట్టిన అక్షర సాక్ష్యం ఈ శతకం.

పాడుబడిన పల్లె జీవితం పరిమళాలతో పాడిపంటలతో, పరవశించాలని ప్రపంచీకరణ కుట్రలు కుతంత్రాలు లను పల్లెలు జయించి పునర్వికాసం పొందాలని ఆశిస్తున్నాడు.మన కవి ఏనుగు నరసింహా రెడ్డి గారు

--------------------------

బతుకు పోరు చెలక లో ఒక గుండె ధైర్యం 'కొత్త పలక' (2013)

--------------------------

బతుకు పోరులో రేకు పలక గుండె ధైర్యాన్ని నింపిన 'కొత్త పలక'గా కవికి జీవిత పాఠాలు నేర్పింది. శీతాకాలం సాయంకాలం నల్లటి కాన్వాసు మీద నల్ల రంగు బొమ్మేసినట్టు మనుషులంతా మసక చీకట్లో కలుస్తుంటారు.జీఓ 610 పట్ల ఆగ్రహం ఉండొచ్చు కానీ జీవోలో అధర్మం లేదని పెద్దన్నల కు తెలియజేస్తున్నారు.రేకు పలక  మీద ఎక్కాలు దిద్దుకున్న 'పలక' జీవితం గురించి ఎన్నో పాఠాలు చెప్పింది అంటాడు.

పలకను తల్చుకుంటే

నల్లని చీకట్లనుతరిమేసేందుకు

ఒక తెల్లని దీపంలా ఎదురొచ్చిన

అక్షరం గుర్తొస్తుంది

ఇప్పుడొక పలక దొరికితే బాగుండు

చెరిపి  రాయాల్సిన జీవిత పాఠాలు

చాలా గుర్తుకొస్తున్నాయి    (పుట..28)

వాక్యం రసాత్మకం కావ్యం కదా, వ్యవసాయానికి విద్యుత్తు ఉచితం కావడం ఎంతో గొప్ప రససిద్ధి కావ్య ఖండం గా  భావిస్తూ, కవిత్వమిచ్చే ఉచిత విద్యుత్తును సమర్పి స్తున్నాడు .

చక్రంతిప్పి కుండల్ని తీర్చిదిద్దినంత నేర్పుగా   కణ కణ మండే కొలిమిలో 

పనిముట్లను వంకీలు తిప్పినంత ఒడుపుగా

మగ్గంమీద మేలిమి చీరల్ని నేసినంత ప్రేమగా 

దార్శనికులు ధర్మం కోసం పోరాడతారు   (పుట..31)

వెనకట ఇక్కడొక ఊరుండేది. మనుషులకు రక్షణ కవచంగా ఎవరైనా చూపిస్తారా? అంటూ పల్లెల గతకాలపు వైభవాన్ని మన ముందుంచు తున్నాడు కవి.

కరువంటేఎలా ఉంటది? వలస బతుకులంటే ఎలా ఉంటాయి? బతికే టోళ్లుఎవరు? బలయిపోయే పోరలు ఎవరు? అంటూ ప్రశ్నిస్తాడు.

 ఊరి మొగసాల కింద

 రావియాకుల గలగల కింద

 రాలిపోయే కన్నీటి కింద

 చెప్పుకోలేని బాధ బిడ్డా! కరువు

 వెంటవస్తే నేను కూడా మీకో బరువు     (పుట..39)

పని లేక పోవడమంటే జీవితం లేక పోవడమే లేకపోవడమే నంటాడు  ఈ కవికి నాన్నంటే ఆరబెట్టిన నీటిరంగుల వర్ణ చిత్రం లా, ఒక స్పష్టత జ్ఞాపకం.

వలస కాలంలో నాగలి కర్రు నీటి మట్టం నిర్దయగా జారుకుంటుంది .డుద్దు కూడా దొరకని పరిస్థితి, ఆడవాళ్లు పని దినమంతా మైళ్ళ కొద్దీ మంచినీళ్లకు నడకలు. నూకల్లేని   ముసలి యచన కలవరపెడ్తుంది.

ఖజానాలో ధనం మూలుగుతుంది గిడ్డంగుల్లో ధాన్యం మురుగుతుంది. కాలే కడుపుల మీంచి రోజుకో శవం లేస్తుంది. ఇదీ వలసల కాలమంటే.

సర్కస్ జీవనంలోని విషాదాలను వివరిస్తాడు ఒక చోట కవి. కొల్లేటి కలెక్టర్ గారి పేరు పొందిన అగర్వాల్ గారిని కవి   ప్రశంసిస్తాడు.

 1983లో విడిపోయిన పదవ తరగతి సహ విద్యార్థులు మళ్లీ 21 ఏళ్ల తర్వాత కుటుంబాలతో సహా ఆత్మీయంగా కలుసుకున్నప్పుడు, కవి హృదయం కాడ మల్లెపూలచెట్టయి, పట్టలేని పరవశంతో అవధులు దాటిన ఆనందంతో ఫ్లాష్ బ్యాక్ చైల్డ్ హుడ్ మెమరీస్ ను నెమరేసు కుంటాడు.

  కాలం ముందుకు గడిచినప్పుడు ఖచ్చితమైన వీడ్కోలు తప్పనప్పుడు పట్టపగ్గాలు లేని విశ్రాంతి లోనూ ఊహాతీతమైన శూన్యంలో

 బరువైన జ్ఞాపకాలతో

 చిట్యాల నుండి చిత్ర చిత్ర ప్రదేశాలకు  అంతుచిక్కని ఆకాశంలోఊర పిచ్చుకలమై  లోతెరుగని సముద్రంలో చేపపిల్లలమై..   (పుట..78)

 

సురక్షిత కలశాలతో

గట్టు మీద కూర్చున్న వాళ్లేవరైనా

నా బాధ్యతల యుద్ధరంగంలో

మునిగితేలే వారిని గాయపరచడం

సులువే మరి    (పుట..80)

కట్టుబట్టలకోసం,కడుపు కోసం పునాదులు తవ్వే  దిన కూలీలు వ్యవస్థ చక్రబంధంలో కేవలం ఆకులుగా మిగిలిపోతారని, వేదన పడతాడు కవి.

అవకాశవాద రాజకీయాల్ని కూడా మహా త్యాగమయ పోరాటాలు నిర్వహిస్తాడు పోరాటాలు చిత్రించగల పత్రికాధిపతుల చర్యలను నిరసిస్తాడు కవి.

ప్రభుత్వ శాఖల అన్నింటిలోనూ కుంటిసాకులతో ప్రమోషన్ అడ్డుకునే పరిస్థితిని చూసి,దిగులుగా నిట్టూరుస్తాడు కవి. కాలం ఆకాశం కింద కోటి ఆశలతో ఉగాదులు వస్తూ పోతుంటా యని,అప్పుడప్పుడు ఎవరి వ్యక్తిత్వాన్ని వారే తూకం వేసుకోవాలని సలహా ఇస్తాడు.

చిత్ర కారుడు కాపు రాజయ్య మరణానికి నివాళి సమర్పిస్తాడు. మనుషులంతా కలిసి నడవాలని భుజకీర్తులు లేకుండా కలవాలని ఆశిస్తాడు. తన బాల్యంలోకి మళ్ళీ వెనక్కి పోవాలని ఆశ పడుతున్నాడు నేల మీద పూచిన పూల సోయగాలను చూడాలని ఆశ పడుతున్నాడు.

 అక్కడికి

 ఎలాగైనా మళ్లీ పోవాలె

 చిగురుమామిళ్ల కింద గుసగుసలు

 గుట్టల కింద జ్ఞాపకాలు మల్లెలు

 తలుపుల వీణపై

 తట్టి చూడాలె

మళ్ళీఅక్కడికే పోవాలె    (పుట..127)

 

నల్గొండ జిల్లా చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల1982 -83 బ్యాచ్ పదవ తరగతి స్నేహానికి అంకితమిచ్చిన జ్ఞాపికగా ఈ 'కొత్త పలక'ను ఆవిష్కరించారు కవి

 ఇందులో మట్టి నుండి ఉదయించిన ఊహలు చీల్చుకుని అనుభూతులు అనుభవాలు ఆశయాలు ఈ కొత్త పలకపై మెరుస్తాయి.

--------------------------

గెలుపు కోసం నిరంతర శోధనే   "మూల మలుపు" (2018 )

--------------------------

సృజన లోకములో నిరంతరం కవి అంతరంగ శోధనే ఈ మూల మలుపు.

అసలు 'మలుపు' అంటేనే ఒక అధ్యాయం మొదలు కావడం లేదా జీవితంలో ఒక కొత్త  దశ ఆరంభం కావడం అనే అర్థం లో వాడుతూ ఉంటాం. వాడి జీవితం మలుపు తిరిగింది అంటూంటాం.అంటే వాడికి ఒక  కొత్త జీవితం,లేదా ఒక సంతోషకరమైన అధ్యాయం మొదలైందన్న అర్థంలో వాడుతాం.

కొన్ని పదాలకు, పదబంధాలకు ప్రాంతాలను బట్టి  లౌకిక అర్థాలు మారుతూ ఉంటాయి.

కవి వాడిన 'మూలమలుపు' అనే పద బంధానికి నలిమెల భాస్కర్ గారు రూపొందించిన తెలంగాణా పదకోశంలో (మూల మల్గుడు), వీధి మలుపు, అనే అర్థాన్ని సూచించారు. 

కవి కూడా ఈ అర్థప్రయోగం లోనే పుస్తకానికి పేరు పెట్టినట్లు భావిద్దాం 2013లో వెలువడిన "కొత్త పలక" తర్వాత మరో ఐదేళ్ల కు వచ్చిన కవిత్వమే ఈ "మూల మలుపు' మార్కెట్ మాయాజాలం లో  మనుషులంతా తప్పిపోతూ, ఎదురుచూస్తూ తడబడుతూ పారిపోతున్న నేటి కాలానికి  ప్రేరణగా నిలిచిన కవిత్వమే  "మూలమలుపు".

నడిచొచ్చిన నేను తిరుగాడుతున్న ని తీరం చేరువయ్యే దాకా కన్నీటిని ఆపుకుంటూ భావిస్తాడు. మార్కెట్ ప్రపంచంలో లోకమంతా వచ్చిన దారిని మర్చిపోతూ ఉంటారు. తాము ఉన్నచోటే ఉండి ఒక్కొక్కరే తప్పి పోతూ ఉంటారని కవి భావన.

 మనం ఉన్నచోటే ఉండి

 ఒక్కొక్కరం తప్పి పోతూఉంటాం

 ఎవరూఎవరికీ కనిపించే టట్లు లేరు.

 మనం అక్కడే తిరుగాడుతూ ఉంటాం తిరిగిన ప్రదేశంలోనే

 పదే పదే కలుస్తూ ఉంటాం  (పుట..25)

జీవన వేదనలన్నీ గుక్కపట్టిన   మరణమని, ఒంటరి దుఃఖాన్ని ఎవరూ పంచుకోలేమని అంటాడు కవి. నిద్రలో నవ్వు గురించి అద్భుతంగా నిర్వచిస్తాడు. కవిత్వం చెప్పడం కష్టమని అది నవ్యత్వ ఆలోచననీ, జడత్వ విమోచననీ,చెబుతూ కవి ఎప్పుడూ ప్రజల పక్షమే నని ఢంకా బజాయించి మరీ చెబుతాడు కవి.

జాలువారుతున్న పంటకాలువ గట్లమీద, పూల తీగల పులకరింతలు, తల్లి ఒడిలో ఖుషి చేసే పిల్లవాడిలా, జలదృశ్యం ముంగిట్లో ఉన్న  ఊరును మన కళ్ళ ముందు దృశ్యమానం చేస్తాడు కవి.

 జ్ఞాపిక అంటే

 కాలం వెనక్కి తిరిగి

 ప్రేమాత్మకంగా చేసే మువ్వల శబ్దం

 ఇంటి నిండా జ్ఞాపికలు సరే

 మదిలో చాలాకాలం నిలిచే జ్ఞాపకాలు కొన్నైనా ఉండితీరాలి   (పుట.. 45)

రాతిని ఉలితో చెక్కి శిల్పంగా మలిచినట్లు  కవిత్వాన్ని  చెక్కాలి.చిరకాలం గుర్తుండిపోయే వాక్యాల్ని పోత పోయాలని వర్ధమాన కవులకు సలహా ఇస్తాడు. అంటాడు.అన్నిచోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించినట్లు అమ్మకు శక్తి నిమ్మ ని నాన్నను పంపించాడని చమత్కరిస్తారు   కవిత్వం ఒక ప్రత్యేక ప్రపంచమనీ,అందులో నేనుంటాననీ  సెలవిచ్చాడు. భయానికి ఒక రూపం ఉంటుందని భ్రమ లో ఉండేవాళ్ళం భయం అనేది మహా మాయావి అంటాడు.  కొందరికేమో జీవితమే క్రీడ మరి నాకేమో రెవిన్యూ బాధ్యతల క్రీనీడ అంటాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం విడిపోయింది ఈ పది జిల్లాల తెలంగాణ ముప్పై ఒక్క దీపాలుగా వెలుగొందుతుందని తన ఆశావహ దృక్పధాన్ని తెలియజేస్తాడు.

కవిగా కవి నందిని సిద్ధారెడ్డి గారి నిబద్ధతను కవి  కొనియాడు తాడు.  పుస్తకాలు లేని ఇల్లు ఎడారి వంటిదని, కవి అన్నవాడు రోజు ఏదో ఒకటి రాయాలంటాడు.

ఇరానీ చాయ్ లేని హైదరాబాద్ ని ఎలా ఊహించగలం? గాయపడకుండా ఉండాలి అనుకుంటాను చివరికి గాయపడ్డ కే ఇల్లు చేరుకుంటాను గెలవడం మన చేతుల్లో లేనట్లే ఇతరుల్ని గెలిపించడం అంత సులభం కాదు.

రెప్పలు గాయపరిచిన కంటినిండా ఉద్వేగం జారి పోతున్నట్లు, చెదిరిపోతున్న సౌందర్యం కనిపించని భాషలతో మనల్ని కట్టేస్తుంది

2014 జూన్ 2న ఆంధ్ర ప్రదేశ్ నుండి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ మనసారా స్వాగతిస్తూ తన ఆనందాన్ని ప్రకటించే సన్నివేశాన్ని పారవశ్యంతో కవితాగానం చేస్తున్నాడు కవి.

కాల యవనిక మీద

సప్తవర్ణాల అద్దకం దిద్దినట్లున్నది

నవ తెలంగాణ పురోగామి ద్వారం తెరుచుకున్నట్లుంటుంది.  (పుట..90)

చిన్నప్పటి సినిమా సంబరాన్ని  ఇప్పటి ప్రపంచంతో పోల్చి చూపాడు. సారస్వత పరిషత్  నిత్య చైతన్య శీలిగా రూపొందించే  సాహిత్య,సాంస్కృతిక కార్యక్రమాల్ని  ఎంతగానో కొనియాడారు.

భారత ప్రధాని పెద్ద నోట్ల రద్దు మంత్రం ఏ మాత్రం పని చేయలేదన్నాడు. రెక్కలు విరిగితే పక్షి ఎగరలేదు, ఆయుధం లేని వీరత్వం ఎందుకు కొరగాదు. ప్రతి ఉగాదికి ముస్తాబై సాహితీ కళా సాంస్కృతిక సంబరాలతో కళ కళలాడే రవీంద్ర భారతిని ఇష్టంగా తలుచుకుంటాడు.

ఏదీ మిగలదనితెలిసీ

ఏదో మిగిలించుకుందామని

ఒక్క చోట కాలు  నిలువకుండా

నడయాడే నది, మనిషి  (పుట..116)

పూల పూల పరిమళమున్నట్లే  నేలకు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. చందమామను కిందికి దింపిన చార్మినార్ ను హైద్రాబాద్ కు తలమానికం గా భావిస్తాడు.నడుస్తున్న తొవ్వ లో మలుపుదాటాలి,ఎట్లున్నా ప్రయాణం సాగించాలి. 

నడుస్తున్న తొవ్వ

కోరుకున్నది కాదు

మలుపుల దగ్గరి దుఃఖం

 దింపుకోవడం

 గుండె కోతే

 శరీరం మీద దాని

 దాడి కనిపిస్తది

 మనో శకలం మీద దాని నాడి

 స్వారీచేస్తది

 మనకో మనసుంటది

 తన దారిలోనే అది నడిపిస్తది    (పుట.. 124)

 

ఆసిఫా హత్య పట్ల తీవ్రంగా స్పందిస్తాడు కవి.

గోవుల్ని ప్రేమించే పులి

పసి బాలికల్ని కామించే మూకల

మాతృభక్తి కి

మోజు పడుతుంది

దేవుడు జీవుల్ని కోరే వ్యవస్థ

ప్రతీకలు కదా

ప్రాణం కన్నా శీలం

కీర్తించబడే దేశంలో

 ఆసిఫాను దళిత ద్రౌపదిని చేసి

 పగలబడి నవ్వుతుంటే 

 వ్యవస్థ అంతా పులి ముట్టించిన

 వెలుగు లోనే వికృత నృత్య మాడుతుంది

పులి గోవుల కనికరపు గొంగడి కప్పుకొని మనిషుల్ని వెంటాడుతుంది  మనుషులంతా

ఒక్కటి కావాలె

పులిని బోనులో పెట్టాలె   (పుట..145)

ఇవాళ పులి గోవుల కనికరం గొంగడి మనుషుల్ని వెంటాడుతుంది కావున మనుషులంతా ఒక్కటి కావాలి పులి బోనులో పెట్టాలి అంటున్నాడు కవి.

కవి ఏనుగు నరసింహా రెడ్డి గారి  మూలమలుపు కవిత్వంలో సమకాలీన తెలంగాణా జీవితం మనల్ని తట్టి లేపుతుంది .

తెలంగాణ జన జాగృతికి అద్దం పడుతుంది ఒకప్పటి పల్లెటూర్లు ఇప్పుడు నగరానికి వలస వచ్చిదుర్భర జీవితాల్ని గడుపుతున్న ఉదంతాల్ని  ఇందులో కవిత్వం గా మలిచారు.

 

కవి తన బాల్య జీవనం గురించి నెమరువేసుకోవడం మనం ఇందులోనూ గమనించగలం.

-------------------------

మానవీయ తాత్విక భావాలు  తెలంగాణ రుబాయిలు (2020)

--------------------------

మూల మలుపు తర్వాత మరో రెండేళ్లకు 'తెలంగాణ రుబాయిలు' పేరుతో ఒక బృహత్ గ్రంథం తీసుకురావడం కవి గారి కవితా చైతన్యంలో  నిజంగానే ఒక కొత్తమలుపు. 'మూలమలుపు'  కవిత్వానికిది పొడిగింపు గా నేను భావిస్తున్నాను. పేరుకు ఇది తెలంగాణ రుబాయిలు గానీ ఇందులో తెలంగాణా ప్రాంతీయ జనజీవనం గానీ, భౌగోళిక చారిత్రిక విశ్లేషణలు గానీ ఇందులో మనకు కనిపించవు.కవి సార్వజనీన హృదయావిష్కరణమే వినిపిస్తుంది.

కవి తెలంగాణా ప్రాంతీయుడు గనుక బహుశా అందుకు సంకేతార్థంగా ఈ పేరు పెట్టి ఉండవచ్చు.ఒక అవిశ్రాంత ఉద్యోగిగా,ప్రభుత్వ పాలనా యంత్రాంగం లో కీలక బాధ్యతలు నిర్వహించే ఒక అధికారి కవి గా తనదైన సమయాన్ని కేటాయించుకొని కవిత్వం రాయడం అరుదైన విషయమే అయినప్పటికీ కవి గా ఏనుగు నరసింహారెడ్డి గారు ఒక కొత్త కళాత్మక ప్రక్రియ రుబాయిలు వైపు ఆసక్తిగా తలొగ్గి ఏకధాటిగా 536 రుబాయిలు  రాయడం,వాటిని మళ్ళీపుస్తక రూపం తేవడం, నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది.  ఇందుకు ప్రధానంగా ఆంధ్రప్రభ పత్రిక ఇచ్చిన ప్రేరణ కావచ్చు.

ఆంధ్రప్రభ దినపత్రిక,ఆదివారం సంచికలో 2016 ఫిబ్రవరి28 నుండి 2019 మార్చి3వ ఆదివారం వరకు అంటే మూడు సంవత్సరాల ,ఒక్కనెల దాకా సీరియల్ గా  ప్రచురిస్తూ వచ్చినట్లు కవి మాటల్లో తెలిసింది.పత్రికా ప్రేరణ లేకుంటే కవి

500 పైగా రాసుండేవారు కాదు.

ఇటీవల చాలా మందిని చూస్తున్నాం.ఓ యాభయ్యో,వందో రాసి, పుస్తకం గా వేసి,ఆ ప్రక్రియకు తనవంతుగా న్యాయం చేసినట్లుగా ఫీలైపోతున్న కవుల్ని రచయితల్ని ఇవాళ మనం చూస్తున్నాం.

అలా కాకుండా పత్రిక ఇచ్చిన స్ఫూర్తితో పాటు,తనలో ఇంకి పోని చెలిమగా స్రవించే  భావోద్వేగం వల్లనే ఐదువందలకు పైగా ఈ రుబాయిలు రాయగలిగారంటే కవిలో రగిలిన ,భావోద్వేగం ప్లస్ భావ స్పూర్తికీ హ్యాట్సాఫ్ చెబుతున్నా.

ఇకపోతే అసలు విషయానికొస్తే రుబాయీ అనేది అచ్చమైన  ఒక ఫారసీ  ఛందస్సు ప్రక్రియ.ఈ రుబాయీలో నాలుగు పాదాలుంటాయి.ఈ నాలుగు పాదాలు ఒకే భావాన్ని వ్యక్తం చేయాలి.నిర్దిష్టమైన ఛందో నియమాలతో 1,2,4,పాదాలలో రదీఫ్,కాఫియా లను పాటిస్తూ ఒకే విషయాన్ని చమత్కారపూర్వకంగా వ్యక్తపర్చడం కవి నైపుణ్య ప్రదర్శనకు ఆస్కారం కలిగిస్తుంది.మూడవ పాదం భావ పరిణామ సూచకంగా ఉంటుంది.

నియమాలను,మూల సూత్రాలను చక్కగా ఆకళింపు చేసుకొని, తనలోని సృజన కు పదును పెడ్తే రుబాయీల రచన  కవి భావనలో కొత్త అభివ్యక్తి లో రాటుదేలి తనదైన ఒక రుబాయీల ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు కవి.

ఇలా తెలంగాణా రుబాయిల్లో తనదైన సరికొత్త భావనా ప్రపంచం లో విహరించాడు ఈ కవి.నాకు తెలిసినంతలో  డా.దాశరథి,డా.తిరుమల శ్రీనివాసాచార్య తర్వాత రుబాయీలను సంఖ్యా పరంగా, ఇంత విస్తృతంగా రాసిన వారు ఈ కవే నని చెప్పవచ్చు.

ఇంక రుబాయిల లోకి ప్రవేశిద్దాం..

పాపాయి ఆటా, పాటా, నవ్వూ, ఇలా ఉందన్న చమత్కారం...

వీణ మోగినట్లు పాడింది పాప

కొమ్మ ఊగినట్లు ఆడింది పాప

వాణీ విలాసం ఆమె చుట్టూర

ఆత్మ వెలిగినట్లు నవ్వింది పాప

చిట్టి నడకలు,మాటలు,వాళ్ళున్న ఇల్లు ఇలా ఉంటాయట...

చిన్ని నడకల పడవలే పిల్లలు

చిట్టి మాటల వరదలే పిల్లలు

ఇల్లు ఒక ద్వీపం వాళ్ళు దీపం

రంగురంగుల మల్లెలే పిల్లలు   (పుట..29)

మన అనుభవానికి మించిన గురువు లేడుఅనుభావాలన్నీమనకు జీవిత గుణపాఠాలే నంటాడు కవి..

ఖాళీ కడుపులతో అలసినప్పటి రోజులు ఖాళీ జేబులతో తిరిగినప్పటి రోజులు చెప్పిన పాఠాలు ఏ గురువు చెప్పలేడు దిక్కుతోచని పక్షులైనప్పటి రోజులు      (పుట..31)

కవిత్వం వచనం కాకూడదనీ,భాష్యానికి తగ్గట్టు భావన సాగాలనీ,మొక్కకు అవసరమైనంత నీరు,అవసరానికి మించిన సంపద ప్రేమల్ని దూరం చేస్తుందని జీవన సత్యం బోధిస్తాడు కవి...

వచనం ఎక్కువైతే కవితా తగ్గుతుంది భాష్యం ఎక్కువైతే భావనా తగ్గుతుంది మొక్కకు నీరుండాలి ముంచేట్టుగా కాదు

సంపదలు ఎక్కువైతే ప్రేమ తగ్గుతుంది   (పుట..33)

మతములన్నియు మాసి పోవును,  జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును అన్నాడు గురజాడ..ఈ  కవి కూడా కులమతాలు,

భేషజాలు అన్నీ మాసిపోతాయన్న తాత్విక భావాన్ని ప్రకటిస్తాడు.

ఈ కులము ఈ మతము మాసి పోతవి

ఈ హంగూ ఆర్భాటం సమసి పోతవి భేషజాలు ఎన్నున్నా నేల మీదనే

పై లోకంలో నిజాలు తెలిసిపోతవి   (పుట..47)

అమ్మ మాట,నాన్న నడక మన జీవన సంస్కారానికి బాటల నేర్పరుస్తాయి అంటున్న కవి...

అమ్మ నేర్పిన మాట గొప్పది

నాన నేర్పిన నడక గొప్పది

నడుమ విద్యలు ఎన్ని ఉన్నా

తొలుత నేర్చిన నడత గొప్పది   (పుట..73)

ఎవరి నొప్పి వారి హృదయానికే తెలుస్తుంది.పరుల సానుభూతి కి గాయం  మానదంటాడు కవి..

ముళ్ళు దిగిన పాదానికె నొప్పి

తెగిన చేతి చుట్టూనే నొప్పి

పరుల సానుభూతంతా ఊహ

 గాయపడిన హృదయానికె నొప్పి

తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు, ఆశకు మించిన దరిద్రం లేదు అన్నా డొక కవి

మరి ఈ కవి కూడా ఏమీ తక్కువ తినలేదు..నీ మాటల్లో నిజముండాలి,నీ చేతల్లో సాయం ఉండాలి,నీ ఘనత అక్కర్లేదు నిజాయితీ చాలు అంటాడు..

నిజమొకటి మాట్లాడు నీతులు అక్కరలేదు/ చిన్న సహాయము చేయుఖ్యాతులు అక్కరలేదు/ సంతృప్తి యన్న దొకటే స్వర్గలోక  నకలు

సహజ వర్తన మేలు,ఘనతలు అక్కరలేదు   (పుట..103.)

సొంత ఊరిపట్ల మమకారం,బాల్య దోస్తులపట్ల యౌవనోత్సాహం, పొక్కిళ్ళయిన  వాకిళ్ల లో పొర్లిపోయే కన్నీళ్లు, బాల్య జీవిత ఆనవాళ్ళంటాడు కవి.

ఒక్కసారి ఊరికెళ్తే కొత్త జీవమొస్తుంది దోస్తులతో కీచులాడ నవయవ్వన మొస్తుంది/ పొక్కిలైన వాకిళ్ళు పొర్లి పోయిన కన్నీళ్లు/ గుర్తుకొచ్చి మరోసారి నవజీవన మొస్తుంది.  (పుట..125)

పక్షి కన్నీరు కన్పించదు,చెట్టు దుఃఖం విన్పించదు.మన లోలోపలి దుఃఖం ఎవరికీ అంతుచిక్కదంటాడు కవి.

 పక్షి కంట కన్నీరు ఎవరు చూతురుల

చెట్టు కార్చు మున్నీరు ఎవరు చూతురు మన కొరకే ఈ లోకం అనుకుంటం 

మన లోపలి దుఃఖఝరి ఎవరు చూతురు  (పుట..145)

ఇవ్వడమే తెలిసిన పల్లెకు చేయి సాచే గుణం తెలియదు.పట్నాలకు గుంజుకోవడమే తెలుసు,ఉపకారమంటే ఏమిటో తెలియదు అంటున్నాకవి...

పాలవాడు ప్రతిరోజూ పల్లె పరిమళము

తెస్తడు/కాయగూర కాపుబిడ్డ మట్టి మధురిమలు తెస్తడు/ రెండు చేతులా పట్నం గుంజుకొనుడె ఉంటెట్లా /

 ప్రతి రైతూ పండించీ పంట మోసుకుతెస్తడు    (పుట..183)

మరో రుబాయీలో పల్లె త్యాగాన్ని గురించి ఇలా అంటాడు.

పట్నానికి శ్రమ ఫలాలు పంపుతుంది ఊరు పట్నానికి చెమ్మటనే ఒంపుతుంది ఊరు కలకాలం పల్లెలకె రుణ పడ్డది నగరం పట్నానికి ప్రాణవాయువు నందిస్తది ఊరు   (పుట..189)

సహజీవనమే జీవన సౌందర్యమనీ,  అనుబంధాలకు,ఆనందాలకు ప్రోత్సాహం,  ఉత్సాహం టానిక్కులంటాడు కవి.

నలుగురితో కలవడమే నిజమౌ టానిక్  పలువురితో సంభాషణ నిజమౌ టానిక్  కొంటే దొరికేది కాని బలవర్ధకమూ ఉత్సాహం, ప్రోత్సాహం, నిజమౌ టానిక్  (పుట..297)

సంఖ్యాపరంగా ఈ 536 తెలంగాణ రుబాయిల్లో  అన్నీఆణిముత్యాలు కాకపోవచ్చు, కొన్ని సామాన్య నీతి బోధకాలు గా అనిపిస్తాయి.కానీ చాలావరకు సంతృప్తి కరంగా,వాస్తవికంగా ఉన్నాయి.తాత్త్విక చింతనకు సంబంధించివి తక్కువగా కనిపిస్తాయి.

నేను స్థాలీ పులాక న్యాయంగా నేను అతి తక్కువగానే ఉటంకించాను.సమయా భావం, స్థలాభావం వల్ల కేవలం అయిదు శాతం రుబాయిలను మాత్రమే కోట్ చెయ్యగలిగాను.  ఇందులోని రుబాయిలు కొన్ని గతంలో తాను రాసిన మట్టిపాట శతకానికి పొడిగింపుగా మనకు అనిపిస్తాయి.

ముందే చెప్పాను,పేరుకే తెలంగాణ రుబాయిలు తెలంగాణా జీవితానికి సంబంధించి గానీ,ఉద్యమ,పోరాటాల గురించి గానీ, ప్రస్తావనలు నాకు కన్పించలేదు.

అందుక్కారణం ఇవి రాస్తున్నకాలం నాటికే (2016-2019) తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడి పరిపాలన లో తనదైన ఉనికి చాటు కుంటూ ఉంది.కాకపోతే తెలంగాణ వ్యవహార భాషా శైలికి ఈ రుబాయిలు అద్దం పడుతున్నాయి.

మొత్తంమీద రుబాయీల సృజనలో కవి సాగించిన అనితర సాధ్యమైన ఈ కృషి తెలుగు సాహిత్య చరిత్రలో నిల్చిపోగలదు.

డా.ఏనుగు నరసింహారెడ్డి గారు ప్రధానంగా కవి,సామాజిక దృక్పథమున్న రచయిత.సాహిత్యం పట్ల నిశితమైన పరిశీలనా దృష్టిగల వివేచనా పరుడుగా అన్పిస్తాడు .తన కవిత్వానికి అనుబంధ రచనలు కొన్ని వెలువరించాడు.వాటిని గురించి కూడా సంక్షిప్తంగా తెలుసు కోగలిగితే వారి బహుముఖ ప్రజ్ఞ మనకు క్తెలుస్తుంది.వారి సమగ్ర కవితా ప్రస్థానం మనకు కూలంకషంగా మనకు అర్థమౌతుంది.

--------------------------

ఒక చారిత్రక అనువాదం  హైద్రాబాద్ విషాదం(2016)

--------------------------

మీర్ లాయక్ అలీ గారి ట్రాజెడీ ఆఫ్ హైద్రాబాద్ ఓ చారిత్రక విలక్షణమైన ఆంగ్లా నువాద రచన. ఆనాటి నిజాం రాష్ట్ర ప్రధానిగా, హైదరాబాద్ దేశభక్తుడిగా  హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర్యం కోసం తీవ్రంగా ప్రయత్నించి, విఫలమైన వ్యక్తి ఆనాటి న్యాయాన్యాయాలను తనదైన తూనిక రాళ్లతో బేరీజు వేసి ఆవేదనతో వ్రాసిన గ్రంథమిది.

ఆంగ్లములోని ఈ పుస్తకాన్ని కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఇది కవి గారి అనువాద రచన మాత్రమే.

హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరగడానికి దోహదపడిన కారణాలను  జరిగిన సంఘటనలను,జరిపిన సంప్రదింపులను అర్థం చేసుకోవడానికి ఈ అనువాదం ఎంతగానో దోహదపడుతుంది. తెలంగాణ చరిత్రనీ,ప్రత్యేకించి హైదరాబాద్ చరిత్రనీ  అధ్యయనం చేయడానికి ఉపకరించే తెలుగు అనువాద గ్రంథమిది.

1947 ఆగస్టు 15 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు నడిచిన ఉద్విగ్నభరితమైన హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈ అనువాద గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది.

--------------------------

ఆధునిక కవితావిమర్శ లో ఒక పార్శ్వం  'అంతరంగం'( 2018)

--------------------------

కవి డా.ఏనుగు నరసింహారెడ్డి కేవలం కవిగానే కాకుండా,తనలో విమర్శకుడు కూడా ఉన్నాడని ప్రకటించిన ఆధునిక కవితా విమర్శ పుస్తకమే ఈ 'అంతరంగం' ఇది 2018 లో వెలువడింది ఇందులో కవి కవిత్వం పై చేసిన విశ్లేషణాత్మక వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు కవిగారి నిశిత పరిశీలనా దృష్టిని,తనలో ఉన్న లోతైన అవగాహనను సూచిస్తాయి. ఈ వ్యాసాలన్నీ హైదరాబాద్ కవుల కవిత్వం మీదనే సాగుతాయి. కవిత్వంపై ఆయాకవుల అభివ్యక్తి,శిల్పం, దృక్పథం మొదలైన అంశాలపై దృష్టి సారించారుఇందులో 26 మంది తెలంగాణా కవుల  కవిత్వంపై నిశిత పరిశీలనా దృష్టితో రాసిన సమీక్ష వ్యాసాలుంటాయి.

ఇందులో మహాకవి దాశరథి, అమ్మంగి వేణుగోపాల్ ,సదాశివ డా.కూరేళ్ళవిఠలా  చార్య, విశ్వంభర సినారె, ప్రజా కవి కాళోజీ ఆధునిక తెలంగాణఅస్తిత్వ కవి నందిని సిథారెడ్డి ,ఆశా రాజు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, మొదలైన 26 మంది ప్రముఖుల కవిత్వ తత్వం గురించి విశ్లేషించిన పుస్తకమిది.

--------------------------

కవి సాహిత్య నిబద్ధతకు సాక్ష్యమే 'సమాహార'(2019)

--------------------------

కవి ఏనుగు నరసింహా రెడ్డి గారి సాహితీ వ్యక్తిత్వానికి నిదర్శనమే ఈ సమాహార సాహిత్య వ్యాసాల రచన. రాయకుండా ఉండలేని భావోద్వేగం కవిని సాహిత్య విమర్శకుడిగా కూడా నిలబెట్టింది.స్వయం ప్రతిభతో ఎదిగిన కవిగా, గ్రామీణ ప్రాంత నేపథ్యం నుంచి వచ్చిన కవిగా, విభిన్న సాహితీవేత్తల సమాహార దర్శనంగా  26 వ్యాసాల సంకలనం గా మనకు అందించారు.. ఇందులో ప్రధానంగా బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలలో స్త్రీ పాత్రల పరిశీలన మొదలుకొని భాను ప్రకాష్ హృదయ పథం.. వరకు వైవిధ్యభరితమైన వ్యాసాలున్నాయి

--------------------------

కవి పరిశీలన లో విలక్షణ సంస్కరణల ప్రతిపాదనలే...

"తెలుగు రాష్ట్రాల రెవిన్యూ వ్యవస్థ"  నిన్న నేడు రేపు (2019)

--------------------------

కవి ఏనుగు నరసింహా రెడ్డి గారు రెవిన్యూ  శాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ అందులోని అంతర్ బహిర్ స్వరూపాలు స్వయంగా చూసినవారు గనుక,అంతేగాకుండా, జనసామాన్యం పట్ల ఆసక్తి కలిగిన ఉన్నతాధికారిగా, రెవెన్యూ శాఖలోని అవగాహనతో, విశ్లేషణతో ఈ పుస్తకం రాసినట్లుగా మనం భావించవచ్చు

ప్రజా యోగ్యమైన సంస్కరణలను కొన్ని ఇందులో ప్రతిపాదించారు. ప్రజలకు జవాబుదారీ తనంతో పనిచేసే వ్యవస్థగా కలగంటూ రాసిన గ్రంథమిది. ప్రజల సాధకబాధకాలను, రెవెన్యూ శాఖలో రావలసిన సంస్కరణలను, సూచించారు. అటు రెవిన్యూ శాఖ ,ఇటు పాలక వ్యవస్థ ఈయన ప్రతిపాదించిన సంస్కరణలను మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ గ్రంథం చదివితే మనకు అర్థమౌతుంది. ఇందులో రెవెన్యూ శాఖ పై పది అంశాల గురించిన సమగ్ర విశ్లేషణలు ఉన్నాయి.

--------------------------

తులనాత్మక సాహిత్యంలో భాగంగా గుఱ్ఱం జాషువా: డిలాన్ థామస్ ల కవిత్వం లో బాల్యం..(2019)

కవి  ఏనుగు నరసింహారెడ్డి గారు హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో 1991-93 సం.లలో ఆచార్య మృణాళిని గారి పర్యవేక్షణలో సమర్పించిన ఎం,ఫిల్., సిద్ధాంత గ్రంథ రూపమే ఈ.. గుఱ్ఱం జాషువా:డిలాన్ థామస్ ల కవిత్వంలో బాల్యం.(తులనాత్మక సాహిత్యం).

తెలుగులో జాషువా కవితల్లో బాల్యాన్ని గురించి, ఆంగ్లంలో డిలాన్ కవిత్వంలో బాల్యం గురించి తులనాత్మకంగా అధ్యయనం చేశాడు కవి.

 జాషువా కవిత్వం భావ ప్రధానమైంది భావాన్ని అనుసరించి ఆయన భాష ఉంటుంది. భాష మీద మక్కువతో  విషయాన్ని దారి మళ్లించడు. ఏ విషయాన్ని తీసుకుని కవిత్వ రచన చేసినా, తన పరిధి దాటకుండా ముగించడం ఆయన లక్షణం.

 అందుకు భిన్నమైన వాడు డిలాన్ భాష పట్ల ఆసక్తి ఎక్కువ. ఆయనకు ఒక కొత్త పదం కనిపిస్తే దాన్ని ఆలంబనగా చేసుకుని కవిత్వ రచన చేస్తాడు. ఒక కొత్త భావాన్ని ఏర్పరచుకొని కాదు, అందువల్ల కవిత్వం ప్రారంభమైన తర్వాత అది కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది .

జాషువా కవిత్వం రచనా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. జాషువా కవితల్లో సామాజిక సంఘర్షణ కనిపిస్తుంది డిలాన్ కవిత్వంలోనూ అది కనిపించదని పరిశోధకుడు గా నరసింహారెడ్డి గారు నిరూపిస్తారు.

ఈ ఎం,ఫిల్., సిద్ధాంత వ్యాసమే 2019 లో గ్రంథ రూపంలో వెలువరించారు కవి.

 -------------------------

తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు (తులనాత్మక పరిశీలన ) -పిహెచ్,డి., గ్రంథం (2019)

--------------------------

కవి ఏనుగు నరసింహారెడ్డి గారు 1993-98సంవత్సరాల  మధ్యకాలంలో హైద్రాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఆచార్య పి.మృణాళిని గారి పర్యవేక్షణలో తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు (తులనాత్మక పరి శీలన)అంశం గా  పిహెచ్,డి.,పూర్తి చేశారు.ఈ సిద్ధాంత గ్రంథమే 2019 లో పుస్తక రూపంగా వెలువరించారు.

తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలపై చేసిన పరిశోధనలో ప్రధానంగా గమనించదగిన అంశం.. ఏక వస్తుకత. తెలుగు హిందీ లలోనే కాకుండా ఇతర భారతీయ భాషలలో కూడా జాతి విముక్తి పోరాట గీతాలు ఉద్యమ కాలం లో ముమ్మరంగా వెలువడిన గీతాలను పరిశీలించినప్పుడు ఈ విషయమై మరింత స్పష్టత పడిందని నిరూపించాడు పరిశోధక కవి.

జాతీయోద్యమంలో పోరాట వాదులు మితవాదులు మధ్యేమార్గం అవలంభించిన నట్లే జాతీయోద్యమ గేయ కారులో మూడు వర్గాల కవులున్నాలు న్నారని ఈ అధ్యయనం ద్వారా స్పష్టత నిచ్చాడు  పరిశోధకుడు.  జాతీయోద్యమం చూపిన గొప్ప ప్రభావం అన్ని ప్రాంతాల, వర్గాల, వయసుల, ప్రజల్ని కదిలించింది. స్వాతంత్రోద్యమం ఒక గొప్ప పోరాట గీతాలతో సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని ఇందులో పరిశోధకుడు వివరించారు. ఈ సిద్ధాంత పరిశోధనా గ్రంథం 2019లో  పుస్తక రూపం గా వెలువడింది.

-డా.ఏనుగు నరసింహారెడ్డి సమగ్ర కవిత్వ అధ్యయనం,పరిశీలన,విశ్లేషణల అనంతరం నాలో కల్గిన భావ సంచలనాలు,

ప్రతిస్పందనలు కొన్ని పాఠకులతో పంచుకోవాలనిపిస్తుంది నాకు.

-  52 ఏళ్ల జీవన యానం లో 27ఏళ్ల కవితా ప్రస్థానం కవిది.

తొలిసారిగా కవిగా రెక్కలు విచ్చుకున్న నాటికి వీరి వయస్సు 27 ఏళ్ళు,  అప్పటికియువకుడిగా నిరుద్యోగిగా కవిత్వంలోకి అడుగు పెట్టినప్పుడు వారి హృదయాకాశంలో  యవ్వనం తాలూకు సహజంగా ఉండే ప్రేమ భావనలు గానీ అనుభూతుల పరవశం గానీ లేక పోవడం ఒక విశేషం. పల్లెజీవనం,మధ్యతరగతి రైతు కుటుంబజీవనం ,నిరుద్యోగిగా తన అంతరంగ అలజడిని కవిత్వం గా  అవిష్కరించుకున్నారు.

తొలి కవితా సంపుటిలో నిరుద్యోగ పర్వంలోంచీ పెల్లుబిన వేదనే ప్రధానం గా  ప్రతిధ్వనించింది.  - తర్వాత ఏడేళ్లకు వచ్చిన కవిత్వం 'నేనే'లో కాలం తెచ్చిన మార్పులతో బాధ్యత గల ఉద్యోగం కవి భావజాలం లోనూ కొంత పరిణతి తెచ్చింది.సామాజిక అవగాహన పెరిగింది,కవిత్వంలోనూ సాంద్రత పెరిగింది. - తర్వాత ఆరేళ్లకు వచ్చిన 'మట్టి పాట' పద్య శతకం తో కవిత్వం లో కొంత వైవిధ్యం చోటు చేసుకుంది. - మట్టి పాట తర్వాత ఐదేళ్లకు వచ్చిన 'కొత్త పలక'(2013) లో వస్తువు ఎంపిక లోనూ,భావప్రకటనలోనూ,సామాజిక, రాజకీయ అవగాహననువిస్తృతం చేసిందనే చెప్పాలి.ఉద్యమాల పట్ల సంఘీభావం ఏర్పడింది.

-రాష్ట్రంవిడిపోయి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన  నాలుగేళ్ళ తర్వాత వచ్చిన కవిత్వం "మూల మలుపు" లో ప్రాంతీయ చైతన్యం పట్ల అవగాహన పెరిగింది.

-నాకు తెలిసిన,నాకు పరిచయమున్న కొందరు  రాష్ట్రం విడిపోయాక కూడా తెలంగాణా కవులు,రచయితలు  సీమాంధ్రుల పట్ల అవమాన కరంగా రాయడం నేను గమనించాను గానీ ఈయనెక్కడా అలాంటి పదజాలం వీరి కవిత్వం లో నాకు కనపడలేదు.

-కాకపోతే..ఒక కవితలో ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రముఖ్యమంత్రిగాఉండి, కార్యదక్షుడిగా ప్రశంసలు పొందిన ఒక రాజకీయ మేధావిని ఒక చరిత్ర హీనుడిగా  అభివర్ణించడం అస్మదీయులకు బాధాకరంగా తోచింది .ఆ కవితను సంకలనం లో చేర్చకుండా ఉంటే బావుండు ననిపిస్తుంది. -అదొక్కటే తప్ప, తన కవిత్వంలో మరెక్కడా సీమాంధ్రుల పట్ల అధిక్షేపం ప్రకటించలేదు.

-తాజాగా వచ్చిన "తెలంగాణ రుబాయిలు'.  కవిగారి విలక్షణ సృజన.500 లకు పైగా రుబాయిలు రాయడం వెనుక కవిగారి నిబద్ధతను కవిత్వం పట్ల అపారమైన ప్రేమను  మనం అర్థం చేసుకోవచ్చు .

డా.ఏనుగు నరసింహారెడ్డి వ్యక్తిగా సహృదయుడు,ఏమాత్రం భేషజాలు లేని కవి,నాకు గత పదిహేనేళ్ళుగా ఆత్మీయుడు,

నేను బాగా ప్రేమించే వారిలో ఒకడు, వారి 27 ఏళ్ల కవితాప్రస్థానంలో,అయిదు కవితా సంపుటాలు+తెలంగాణ రుబాయిల బృహద్గ్రంథం తో కలిసి ,మరికొన్ని ఆనుబంధ గ్రంధాలను ఆసాంతం చదివి,  విశ్లేషించే అవకాశం నాకు కల్గించినందుకు కవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

వయసులో నాకంటే పదేళ్లకు పైగా చిన్నవారు కావడంవల్ల వారిని ఇష్టపూర్వకంగానే అక్కడక్కడా ఏకవచనం లోనే సంభోదించాను.

ప్రముఖ కవి, విమర్శకులు, డా.సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారన్నట్లు.. నిబద్ధుడైన,చురుకైన కవిగా  సాహితీప్రపంచంలోకి దూసు కొచ్చిన కవిగా డా.ఏనుగు నరసింహారెడ్డి గారిని మనసారా అభినందిస్తూ,సుంకిరెడ్డి మాటలతో నేనూ ఏకీభవిస్తున్నాను.

 

 

 

 

సాహిత్య వ్యాసాలు

అది ఒక సహృదయుడు కలగన్న కలలరాజ్యం

సమకాలీన ప్రముఖ కథకుడు, నవలా రచయిత టి.ఎస్.ఏ కృష్ణమూర్తి. ఇటీవల ఆయన కలం నుండి వెలువడిన రచన కలలరాజ్యం. అది ఒక సహృదయుడు కలగన్న రాజ్యం. గుండె తడిగలవాడి వ్యాజ్యం కలలరాజ్యం. సమాజంలో నిత్యం జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను చూసి, గుండె గాయపడి దానికి విరుగుడుగా ఏమీ చెయ్యలేని సున్నిత మనస్కుడైన రచయిత తనలో తాను నిర్మించుకున్న ఒకానొక ఆదర్శరాజ్యం కలలరాజ్యం.  అలతి అలతి మాటలు, మాట మాటలో నేర్పరితనం, ఆ నేర్పరితనం వెనుక అపారమైన జీవితానుభవం వెరసి పాఠకుడిని ఏకబిగిన నవలంతా చదివించే గుణం ఈ నవల్లో ఆద్యంతం దర్శనమిస్తుంది. కృష్ణమూర్తి గారు మొదట నవలను నడిపించుకుపోతున్న తీరు కాస్త చిలిపిగా, హాస్యపూరితంగా కనిపించినా, తను సామాజిక బాధ్యత పట్ల అంకిత భావం, జీవితం పట్ల గాంభీర్యం ఉన్న రచయిత అని తర్వాత్తర్వాత తెలుస్తుంది. 

కలలరాజ్యంలో కథ ఏంటంటే ఉదయ్ బాబు అని ఓ నిరుద్యోగి. లావణ్య అనే బ్యాంకు ఉద్యోగినిని ఇష్టపడి ఆమె దివ్యదర్శనం కోసం ప్రతి రోజూ తంటాలు పడుతుంటాడు. కానీ ఆమెతో మాట్లాడడానికి గాని సన్నిహితంగా మెలగడానికి గాని జంకుతుంటాడు. రాజారావు అని అతని స్నేహితుడు ఉదయ్ బాబు ప్రేమాయణాన్ని కనిపెట్టి దాన్ని గమ్యం చేర్చే పనిలో తీవ్రంగా శ్రమిస్తుంటాడు. ఉదయ్ బాబు ప్రేమను గెలిపించడం అటుంచితే ఇతనే లావణ్య నేస్తం స్వాతి ప్రేమలో పడి పెళ్ళికూడా చేసుకుని బుద్ధిగా కాపురం పెట్టుకుంటాడు. కానీ  ఉదయ్ బాబు కొన్ని పరిస్థితుల్ని జయించి లావణ్యను పెళ్ళాడతానని చెప్పి నిష్క్రమిస్తాడు. అప్పటి నుండి ఆ ఊళ్ళో కలలరాజ్యం పేరిట వరుస హత్యలు జరుగుతాయి. పోలీసు వేట మొదలౌతుంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక చిన్న క్లూ కూడా దొరకదు. ఎలాగో చివరికి హంతకుడు  పోలీసులకు దొరికిపోతాడు. హంతకుడెవరో కాదు ఉదయ్ బాబే. అతడు పోలీసుల వద్ద నేరం ఒప్పుకుని కథలో వచ్చే ఒక పిచ్చి డాక్టర్ కలగన్న ఆదర్శవంతమైన కలలరాజ్యం స్థాపించడానికే సమాజానికి ప్రమాదకరంగా మారిన వారిని తాను హత్య చేశానని చెబుతాడు. అతనికి తెలియకుండానే అతనికి సంక్రమించిన ఎయిడ్స్ వ్యాధి వల్ల అతడు తొందరలో చనిపోతాడని తెలిసి పోలీసులు సానుభూతితో అతడు తమ స్వగ్రామంలో తల్లిదండ్రుల ముందు చనిపోడానికని వదిలేస్తారు. అతడు స్వగ్రామం పోయి చనిపోతాడు. కథ ఇంతే. సాదాసీదాగా కనిపించే ఈ కథలో రచయిత పాత్రల ద్వారా తన కలలరాజ్యం ఏపాటిదో చాటి చెప్పాడు.   

ఇంతకీ టి.ఎస్.ఏ కలలరాజ్యం ఎలా ఉంటుంది అంటే ఈ నవల్లో కలలరాజ్య సిద్ధాంత కర్త పిచ్చి డాక్టర్ మాటల్లోనే చూద్దాం.  “మేము కలలుకనే రాజ్యంలో మరణశిక్షలుండవు. కరకు హంతకులకు, తీవ్రవాదులకు సైతం ఇతర శిక్షలుంటాయి తప్ప మరణశిక్షలంటూ ఉండవు... హత్య కాదు కదా, చిన్ననేరం చెయ్యడానికి కూడా ఏ మనిషి సాహసించే అవకాశం వుండదు. ఎందుకంటే మరణశిక్షలు తప్ప ఇతర శిక్షలన్నీ వుంటాయి. మామూలుగా ఉండడం కాదు. చాలా కఠినంగా వుంటాయి... భయం నీడలోనే నడవాలి మనిషి... ఐదారుగురికి మించి ఎప్పుడూ, ఎక్కడా ఎవరూ సంచరించరాదు... రాస్తారోకోలంటూ రోడ్డుమీద బైఠాయించిన వాళ్ళ బట్టలూడదీయించి పిరుదుల మీద వాతలు కాల్చి పంపించాలి(ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా చూడ్డానికి, ట్రాఫిక్ స్తంభించడం వల్ల పోయే ప్రాణాలను కాపాడ్డానికి)... విధ్వంసాలకు పాల్పడేవారికి ఒకటి రెండు చేతివేళ్లు నరికివేయాలి... భయం మాత్రమే ఈ సమాజాన్ని సక్రమంగా సరిజెయ్యగలుగుతుంది... రైలు పట్టాలను, సిగ్నలింగ్ వ్యవస్థను దెబ్బతీసే వాళ్ళకు కుడిచెయ్యి తొలగించివెయ్యాలి... హింసను, చట్టవ్యతిరేకతను ప్రేరేపించే చలనచిత్రాలు నిర్మించేవారు కూడా శిక్షార్హులే... ప్రేమపేరిట ఆడపిల్లల్ని హింసించినా, స్త్రీలపై అత్యాచారాలు చేసినా, గృహహింసకు పాల్పడినా వాళ్ళు ఒక్కో కన్ను, ఒక్కో చెయ్యి, ఒక్కో కాలు పోగోట్టుకోక తప్పదు... ప్రతి నేరానికీ, ప్రతి తప్పుకూ కఠినమైన శిక్ష తప్పనిసరి... అదీ వెన్వెంటనే. జాప్యం అంటూ ఉండదు. ఉండకూడదు. పనేదీ చెయ్యకుండా రాజకీయాలు చేసే సోమరిపోతులకు కఠినాతి కఠినమైన కారాగార శిక్షలే. ఆ పరంపరలో అక్కడక్కడా, అప్పుడప్పుడు కొందరు అమాయకులు కూడా బలయిపోవచ్చు.. తప్పదు. సమాజం బాగుపడాలంటే, వ్యవస్థ పఠిష్టంగా ఏర్పడి గాంధీజీ కలలుగన్న రామరాజ్యాన్ని కళ్ళ చూడాలంటే కొన్ని బలిదానాలను భరించాల్సి రావచ్చు. ఏది ఏమైనా కఠినాతి కఠినంగా వ్యవహరించక తప్పదు. వైద్యులు సమ్మె చేస్తే వాళ్లకు పాదం మీద గాట్లు పెట్టాలి... ఎక్కువ గంటలు పని చేస్తూ ఉత్పత్తిని అధికం చెయ్యడం ద్వారా తమ నిరసనను నిరభ్యంతరంగా తెలుపుకోవచ్చు ఎవరైనా... లంచగొండులకు ముఖం మీద “లంచగొండి” అన్న గుర్తు స్పష్టంగా కాల్చబడుతుంది. సెల్ఫోన్ వ్యవస్థ అవసరానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. మద్యపాన నిషేధం నిరవధికంగా అమలుపరచబడ్తుంది. మద్యాన్ని తయారు చేసినా, అమ్మినా, తాగినా ద్వీపాంతర కారాగారమే. చవితినాటికి ఆకాశమెత్తు వినాయకులుండరు. మూరడు పొడవుకు మించకుండా కుటుంబాలలో భక్తితో కూడిన పూజలకే పరిమితం. కలుషిత జలాలను జీవజలాలలోకి వదిలే కర్మాగారాలు శాశ్వత ప్రాతిపదికన మూసివేయ బడ్తాయి... గురుద్వారాలు, మసీదులు, మదరసాలు మొదలైన వాటిలో తీవ్రవాదులుండరు. ప్రార్థించేవారు మాత్రమే ఉంటారు... మానవతా విలువలు, మంచితనం, మనిషితనం మాత్రమే కన్పిస్తుంటుంది... ముఖ్యంగా పనిలేనివారుండరు. పనిలేకపోవడం అంటే శిక్షకు చేరువకావడమే. ఎక్కడ చూసినా పని! పని!! పని!!! ఎటు చూసినా భయం! భయం!! భయం!!! ముఖ్యంగా ఎక్కడబడితే అక్కడ బహిరంగ సభలనీ, రోడ్ షోలనీ వుండవు. పాదయాత్రలు అస్సలుండవు... టి.వి. సందేశాలిచ్చుకుంటే చాలు...” ఇదీ కాన్సెప్ట్. ఇదీ టి.ఎస్.ఏ కన్న కలలరాజ్యం.  అంటే కఠిన శిక్షల ద్వారా అకృత్యాలు, అన్యాయాలు జరక్కుండా; సామాజిక జీవితంలో నేడు వేళ్ళూనుకున్న విధ్వంసాలు, నష్టాలు వాటిల్లకుండా చూడ్డం.  వాటిని నిత్యం చవిచూసి విసిగిపోయిన ఓ మంచివ్యక్తి చేసిన గొప్ప భావన.       

కలలరాజ్యం మొదట్లో కథానాయకుడు ఉదయ్ బాబు-లావణ్య, అతని నేస్తం రాజారావు-స్వాతీల లవ్వాయణాలు చూస్తుంటే సీరియస్ పాఠకుడికి "కలలరాజ్యం అంటే ఇదా!" అనిపిస్తుంది. ఆ తర్వాత జరిగే వరుస హత్యలు, అపరాధ పరిశోధన పాఠకుడిని నిజమైన కలలరాజ్యంలోకి తీసుకుపోతాయి. కానీ మొదటి ప్రేమాయణానికి ఈ హత్యలకు సంబంధం ఏమిటన్న ఉత్కంఠ(ఒక రకంగా విసుగు) కలుగుతుంది. ఆ తర్వాత కలలరాజ్యం పేరిట హత్యలు చేసింది ఉదయ్ బాబే అని సస్పెన్షు తొలగిపోయే వరకూ కలలరాజ్యం శీర్షిక అంతరార్థం అవగాహనకు రాదు. 

ఉదయ్ బాబు, రాజారావుల ప్రేమవ్యవహారాలు నడిపే పట్టుల్లో పాపులర్ రచయిత లాగా, కలలరాజ్యం పేరిట జరిగే హత్యా ప్రస్థానాల్లో డిటెక్టివ్ రచయిత లాగా కృష్ణమూర్తి గారు కనబడతారు. ఇలా అనడం కన్నా సీరియస్ రచయిత స్థాయి నుండి ఆ  స్థాయిలకు ఆయన పడిపోయారు అని అనడం సరిగా ఉంటుంది. ఇంతలా ఆయన్ని నొప్పించడం ఎందుకంటే పాక్షిక సిద్ధాంతబలంతో కాకుండా ఆయన కలం నుండి సంపూర్ణంగా సైద్ధాంతిక భూమిక గల రచనలు వెలువడాలని. అయినప్పటికీ అపరాధ పరిశోధనలో రాటుదేలిన ఒక పోలీస్ అధికారి కన్నా లోతైన అవగాహన కృష్ణమూర్తి గారిలో మనం చూడవచ్చు. ఈయన పూర్వాశ్రమంలో కొంపదీసి పోలీసు అధికారి కాదు కదా అన్న సందేహం పాఠకునికి కలుగుతుంది. 

కలలరాజ్య స్థాపన రచయిత ముఖ్యోద్దేశం. ఆ కలలరాజ్య స్థాపనకు కథానాయకుని శారీరక అనారోగ్యం, మరణభయం కాకుండా పిచ్చి డాక్టర్ ఇచ్చిన స్ఫూర్తి, లలితకు జరిగిన అన్యాయాలే కారణం అయ్యుంటే సైద్ధాంతిక బలం చేకూరేది. వీటికి అనారోగ్యం, మరణభయం తోడయ్యాయని చెప్పడం సైద్ధాంతిక పునాదిని బలహీనపరచింది. నాయకుడి కమిట్మెంట్ ను అగౌరవపరచింది. అది రచయిత పరంగా ఒకరకమైన పలాయనవాదంగా అనిపిస్తుంది.

ఉదయ్ బాబుకు హెచ్చైవీ, ఎయిడ్స్ రావడం లో సంభవనీయత(possibility), సంభావ్యత(probability), శాస్త్రీయత ఉన్నాయి. ఎందుకంటే అతడు వాడేసిన సిరంజీలు పొడిపించుకున్నాడు. మరి అతనికి శారీరక సంబంధాల ద్వారా కాకుండా ఇతర పద్ధతుల్లో సదరు వ్యాధి సోకడానికి అవకాశం ఉందని తెలియజెప్పడానికి పిచ్చి డాక్టర్ చెప్పిన యువతి కథలో అవి ఎంతమాత్రం లేవు. ఎందుకంటే ఆ యువతి ఎయిడ్స్ గల డాక్టరమ్మకు కాలి ముల్లు తీశాక వాళ్ళు మరికొంత దూరం నడిచారు. అందువల్ల ఆ ముల్లు తీసిన పిన్నుకున్న రక్తం తడారిపోయి ఉంటుంది. అప్పుడు డాక్టరమ్మకు తీసిన పిన్నుతోటే తానూ ముల్లు తీసుకున్నా ఆమెకు హెచ్చైవీ సోకే అవకాశం లేదు. హెచ్చైవీ వైరస్ తడి రక్తంలో తప్ప బయటి వాతావరణంలో క్షణకాలం కూడా మనలేదని శాస్త్రం చెబుతున్నది. కానీ ఎయిడ్స్ వ్యాధిపైనా, వ్యభిచార ప్రవృత్తిపైనా లోతైన పరిశోధనా, అవగాహనా ఈ నవల్లో కనబడుతాయి. 

నిజానికి రచయిత కోరుకున్నది, కఠిన శిక్షలూ కాదు, మరణశిక్షలూ కాదు. మరేమిటి? సమాధానం నేరాలు జరగని లోకం. పేదరికం లేని ప్రపంచం. అది ఆయన హృదయ మార్దవానికి,  మంచితనానికి నిదర్శనం. అయితే నేరాలు జరక్కపోవడం కన్నా, పేదరికం లేకపోవడం కన్నా భౌతిక, సామాజిక సౌకర్యాలు సమానంగా పంపిణీ కాబడ్డం ప్రధానం అని, సమాన పంపిణీ జరిగితే ఆ అనర్థాలన్నీ మటుమాయం అవుతాయని రచయిత గుర్తించి ఉంటే బాగుండేది. అంటే రచయిత సమాజంలోని లొసుగుల్ని జనరలైజ్డు దృష్టితో కాకుండా వర్గదృష్టితో అడుగువర్గం పక్షాన నిలబడి  చూసి ఉంటే ఆయన తన ఆదర్శానికి న్యాయం చెయ్యగలిగి ఉండేవారు. మన సినిమాల్లో మంచికీ చెడుకూ పోరాటం నడిపిస్తారు. కళ్ళతో చూడలేనంత హింస చూపిస్తారు. మరి వాళ్ళు సెన్సార్ సర్టిఫికేటు ఎలా పొందుతున్నారు? దానికి సినిమావాళ్ళ దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటంటే ఆ పోరాటాన్ని వర్గపోరాటంలా కాకుండా, హింసని వర్గహింసలా కాకుండా వైయక్తికాలుగా జనరలైజ్ చేసి చూపిస్తారు. అలాంటి సినీ టెక్నిక్ జోలికి రచయిత పోకుంటే బాగుండేది.      

టి.ఎస్.ఏ గారు పేదరికమే అన్ని అనర్థాలకు మూలం అని భావించారు. ఉదయ్ బాబు పోలీసులకు తన ఆఖరి కోరిక వెల్లడిస్తూ “పేదరికం చాలా చెడ్డది సార్! దానిలోంచీ దీనత్వం, క్రూరత్వం, వ్యభిచారం, అసంఖ్యామైన అకాల మరణాలు, ఆకలి మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మొదలైన సామాజిక రుగ్మతలన్నీ పుట్టుకు వస్తాయి. ఈ పేదరికం వల్లే మనుష్యులలో మనిషితనం నశిస్తుంది. మంచితనం అడుగంటుతుంది. పశుత్వం, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, పగలు మొదలైనవి సెగలై రగులుకుంటాయి” అంటాడు. ఈ అకృత్యాలు, అనర్థాలు లేని సమాజాన్ని ఒక సహృదయుడుగా ఆయన కోరుకున్నారు. అయితే పై లిస్టులో చెప్పిన అనర్థాలు చాలా వరకూ పేదరికం ఫలితాలు కావడం కొంతవరకూ నిజమే. కానీ  క్రూరత్వం, హత్యలు, దోపిడీలు, పశుత్వం, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, పగలు ఈ అనర్థాలు పేదరికం కంటే ధనదాహం, అధికారదాహం, లోభత్వం, పరస్త్రీవ్యామోహం... మొదలైన లంపటలు ఉన్న సంపన్న సమాజం వల్లనే అధికంగా జరుగుతాయి. సంపన్న వర్గాలవాళ్ళు బ్యాంకు అప్పులు మొదలు వివిధ మార్గాల్లో సేకరించి ఎగ్గొట్టిన ప్రజాధనం ముందు, వాళ్ళు పొందిన లక్షల కోట్ల రుణమాఫీ ముందు  పొట్టకూటికోసం దొంగతనం చేసినవాళ్ళు దొంగలించిన ధనం ఏ పాటిదో ఆలోచించండి. అది రచయితకు తెలియదా? మరి ఆయన వాటిని ఎందుకు ప్రశ్నించలేదు? ఆయన సంస్కరణవాది అయితే ఆ రుగ్మతల్ని కథా వస్తువుగా ఎందుకు తీసుకోలేదు? వాళ్ళను సంస్కరించాలని ఆయనకు ఎందుకు సంకల్పం కలగలేదు?    

రచయిత సంఘసంస్కరణకు కఠిన శిక్షలే ఔషధం అని పిచ్చి డాక్టర్ చేత ప్రతిపాదించాడు. దానికి మరణశిక్షా అవసరమేనని ఉదయ్ బాబు చేత ప్రతిపాదించాడు. (కలలరాజ్యం కాన్సెప్ట్ పిచ్చి డాక్టర్ ఊహల్లో మాత్రమే ఉంటుంది. దాన్ని ఆయనకే తెలియకుండా అమలుకు పూనుకున్నవాడు ఉదయ్ బాబు) ఆ విధంగా కఠిణ శిక్షలు, మరణశిక్షల ద్వారా కలలరాజ్యం స్థాపించవచ్చని ఆయన కలగన్నారు. అందువల్ల టి.ఎస్.ఏ గారు సంఘ సంస్కరణం పేరిట ఉదయ్ బాబు చేత ఒక కామాంధుని, డబ్బాశ గల ఓ డాక్టర్ని, బాధ్యత ఎరుగని ఓ ఆర్టీసీ డ్రైవర్ని(జనాలను కావాలని గుద్ది చంపే డ్రైవర్లు ఉన్నారా?), ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాల్ని హత్య చేయిస్తాడు. సంఘసంస్కరణే ధ్యేయమైతే వీళ్ళందరి కంటే ఎక్కువ మోతాదులో సంఘద్రోహం చేసే ఓ రౌడీని, ఓ గూండాని, ఓ రేపిస్టుని, ఓ ముఠాదారుని, ఓ కూనీకోరుని, చెయ్యని పనులకు బిల్లులు పెట్టుకుని ప్రజాధనాన్ని కాజేసే ఓ కాంట్రాక్టర్ని, బ్యాంకుల్లో వందలూ వేలకోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాల్లో సేదతీరే ఓ కార్పోరేట్ని, అవినీతి పరుడైన ఓ రాజకీయజీవిని ఎందుకు హత్య చేయించలేదు? ఇలా విలాసాల కోసం ధనలంపటతో అధిక హాని చేసే వాళ్ళని కాకుండా పొట్టకూటి కోసం అల్పనేరాలు చేసేవాళ్ళని చంపించడం పలాయనవాదం కాదా? అగ్రవర్ణ, ధనికభావజాలం(రచయిత అగ్రవర్ణుడూ, ధనికుడూ అని భావించకండి) కాదా? యథాతథస్థితిని కపాడ్డం కాదా? దానిలో నుండి రచయిత బయటపడలేక పోయాడా? 

కఠిన శిక్షలద్వారా సంఘసంస్కరణ చెయ్యాలని, అది సాధ్యం అని రచయిత భావించాడు. అది కొంతవరకూ వాస్తవం కావచ్చు. కానీ మనిషి లో మానవత్వాన్ని నిద్రలేపకుండా, మానసికమైన మార్పు తీసుకురాకుండా భయపెట్టి మనిషిని మార్చలేం. అది సంస్కరణవాదమైనా, సామ్యవాదమైనా దానివైపు ప్రజలు స్వచ్ఛందంగా రావాలి. ఆ సంస్కారం వాళ్లలో వచ్చే వరకూ సదరు ఉద్యమ కారులు ఆగాలి. వాళ్ళను మానసికంగా సన్నద్ధం చెయ్యాలి. మనిషి అంతరంగంతో మొదలు పెట్టి ఒకానొక నిర్మాణాత్మకమైన మార్పు తీసుకురావాలి. అప్పుడే అది విజయవంతం అవుతుంది. బలవంతంగా దేన్ని జనాలపై రుద్దినా అది అనతికాలంలోనే ఫెయిల్యూర్ అవుతుంది. రచయిత ఎంత కాదన్నా అది సామ్యవాద రాజ్యమే. రచయిత కన్న కలలరాజ్య స్థాపన జరగాలంటే కావాల్సింది శిక్షలూ కావు, మరణశిక్షలూ కావు. సైద్ధాంతిక భూమికపై నిర్మాణాత్మకంగా జరిగే నిరంతర పోరాటం.

 కృష్ణమూర్తి గారుమత సంస్థల్లో తీవ్రవాదులు ఉండరు” అని అక్కడే ఆగిపోయారు. అసలు మత సంస్థలే ఉండవు, మతమే ఉండదు అనే స్థాయికి చేరుకోలేకపోయారు. రచయిత తను తీసుకున్న వస్తువు యొక్క సైద్ధాంతిక ప్రాతిపదిక మార్క్సిస్టు ప్రాదిపదిక అనీ, ఆయన కన్న కలలన్నీ కమ్యూనిజంతోనే సాధ్యం అనీ గ్రహించి ఉంటే మరింత ప్రభావవంతంగా రాసుండేవారు. నేరాలు - అన్యాయాలు లేని రాజ్యాన్ని రచయిత కలగన్నారు. అది సంస్కరణ వాదం. అది సగటు పౌరుడెవడైనా కనేదే. కానీ రచయితా, మేధావీ కలగనే రాజ్యం అంతకన్నా కొంచెం ఎత్తులో ఉండాలి. దానికి సైద్ధాంతిక ప్రాతిపదిక కావాలి.

కృష్ణమూర్తి గారు నిస్సందేహంగా అభ్యుదయవాది. కానీ తన భక్తులను ఆదుకోవడం కోసం భగవంతుడు రకరకాల అవతారాలు దాలుస్తుంటాడు అనడం, స్వాతి కులం తమ కులం ఐతేనే రాజారావు ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారు అనడం లాంటివి రచయిత అభ్యుదయవాది అనడానికి అడ్డువచ్చే అంశాలు. కృష్ణమూర్తి గారు పాపులర్ శైలిపై, డిటెక్టివ్ శైలిపై చూపిన శ్రద్ధ కాన్సెప్ట్ పై పెట్టి ఉండాల్సింది. వర్గస్ఫృహకు మళ్ళాల్సింది. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిలో సామ్యవాదం ఉంటుంది. దాన్ని అంగీకరిస్తే  తాను పుట్టి పెరిగిన వర్గాన్ని కాదన్నవాడవుతాడు. ఒక్క సారిగా దాన్ని అతడు జీర్ణించుకోలేడు. అప్పుడు అతడు తనలో ఉన్నది కమ్యూనిస్టు భావజాలం అని ఒప్పుకోలేడు. తనను తాను కమ్యూనిస్టుగా అంగీకరించలేడు. అలాంటి డోలాయమానంలో కృష్ణమూర్తి గారు కనబడతారు.  

ఉదయ్ బాబు ఉద్దేశాలు తెలిసి, అతను అవసాన దశలో ఉన్నాడని తెలిసి తమ చేతికి చిక్కిన నేరస్తుణ్ణి పోలీసులు మర్యాదగా ట్రీట్ చేశారని, స్వగ్రామం పోవడానికి వదిలేశారని రచయిత రాశారు. నేరస్తుడు అతగాడు ఎంత మంచి వాడైనా, ఎంత మంచి ఉద్దేశం కోసం అతడు నే‌రం చేసినా, పోలీసుల ట్రీట్మెంట్ మాత్రం అంత మర్యాదగా ఉండదు. అతడు ఎంత అవసానదశలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తీ ఉండదు. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారుల్లో ధనిక వర్గంవారే ఎక్కువ. వాళ్ళు సంపన్న వర్గాల భావజాలానికి గండికొట్టే ఏ భావజాలాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్రతకనియ్యరు. ఈ విషయంలో రచయితలకు స్పష్టత లేకపోవచ్చు గానీ వాళ్ళకు మాత్రం వందశాతం స్పష్టత ఎల్లప్పుడూ ఉంటుంది.

 ప్రాయికంగా రచయితది సంస్కరణవాదం. దృక్పథంలో, భావజాలంలో సామ్యవాదానికి కొంత దూరంలోనే ఆయన నిలబడిపోతున్నా కృష్ణమూర్తి గారు కలలరాజ్యం నవలద్వారా నేటి యువతరానికి గొప్ప దిశానిర్దేశం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. రచయిత కలగన్న కలలరాజ్యం స్థాపించడానికి నేటి యువత పూనుకోవాలి. కానీ దాని సాధనకు వాళ్ళు అనుసరించాల్సిన మార్గం ఉదయ్ బాబు అనుసరించిన మార్గం ఎంతమాత్రం కాదు. పైగా అలా చేస్తే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టే అవుతుంది. అలా కాకుండా ఒక స్పష్టమైన నిర్మాణాత్మకమైన నిరంతర కార్యాచరణతో ముందుకుపోతే టి.ఎస్.ఏ గారు కలగన్న కలలరాజ్యం సాకారమవుతుంది. 

 

సాహిత్య వ్యాసాలు

స్త్రీ హృదయావిష్కరణం!   పద్మావతి రాంభక్త కవిత్వం!!

ఇవాళ ఒక "కొత్త వేకువ"ను  చూశాను, ఉలిక్కి పడ్డాను.  కంపించాను, కలవరపడ్డాను...
కలలు లేవు, గుస గుస లాడే ఊహలు లేవు, పలవరించే అనుభూతులు లేవు
ఒక నిలువెత్తు దుఃఖపు జీర,ఎదురుపడినట్లు, ఉల్లిపొరలాంటి వేదన వెంటాడు తున్నట్లుగా కల్లోల మేఘం ఉరుముతున్నట్లయింది.

"పక్కనున్న పసివాడి రోదన
రోదసి నంటుతూ
నన్ను నిట్టనిలువునా చీల్చేస్తుంటే
అవేవీ పట్టని నువ్వు
నా మైదానం పై
నీకు నచ్చినట్టు సంచరిస్తావు

నీ ఎముకలుకొరికే చలిని
వెచ్చబరచుకునే కుంపటిని నేను
నీ సలసల మరిగే అగ్ని గుండాలను చల్లార్చుకునే సరస్సును నేను

నాలో ఎన్ని సునామీలు
ఎన్ని భూకంపాలు సంభవిస్తున్నాయో ఎప్పుడైనా చూశావా

నీకు నా దేహమొక క్రీడాస్థలం ఎప్పుడుపడితే అప్పుడు
నా ప్రమేయం ఏమీ లేకుండానేఅడుకొని
నువ్వు మాత్రమే గెలిచి
విజయగర్వంతో
నీ నుదుటన మెరిసే
చెమట చుక్కలను తుడుచుకుంటూ
తృప్తిగా ఠీవిగా నడిచి పోతావు

నేను నా విరిగిపడిన ముక్కలను
ఏరుకుంటూ
నా సలపరించే పచ్చి బాలింత అవయవాలను
పోగు చేసుకుంటూ
రహస్యంగా కన్నీళ్ళు తుడుచుకుంటాను

నువ్వు మాత్రం
నన్నొక అలను చేసి
ఆనందాలనావ పై విహరిస్తూ
నీ నీలి కలలను
సిగ్గులేకుండా సాకారం చేసుకుంటూనే ఉంటావు"
(కవిత..నీలికలలు పుట..43)

ఎవరిదీ నిర్భయ గళం?
ఎవరిదీ నిర్నిద్ర వేదనా స్వరం?
ఏ సగటు ఇల్లాలి పక్షాన ఈ ఆక్రోశం?
ఈ కవితాస్వరమే.. పద్మావతి రాంభక్తగారిది.
పోయినేడాది మా శిష్యత్రయం ఫోన్ చేసి మన 'రాధేయ దశాబ్ది కవితాపురస్కారానికి' ముగ్గురి కవితల్ని ఎంపిక చేశాం సర్,వారే అనిల్ డ్యానీ,పద్మావతి రాంభక్త,అఖిలాశ,. ఇందులోని పద్మావతే ..ఇవాళ నేను ప్రస్తావిస్తున్ననీలికలల కవయిత్రి.

కవితా విజేతలు ముగ్గురి కవితలు తెప్పించుకుని చదివాను.మంచి నిర్ణయమనిపించి ముగ్గుర్నీ ఫోన్ లో అభినందించాను.

తరతరాలుగా పితృస్వామ్య నీడలో పురుషాధిపత్య భావజాలం లో నలిగిపోతూ,రాజీపడుతూ,సర్దుకుపోయే
సగటు ఇల్లాలికి ఈ నీలికలలు  కవితరాయడానికి ధైర్యమే కాదు తెగువ కూడా కావాలి.ఆ నిర్భయ,నిర్నిద్ర ,ధైర్య
స్వరం.. పద్మావతి రాంభక్త ది కావడం   నాకు ఆశ్చర్యమనిపించినా,ఈ ధిక్కార స్వరాన్ని స్వాగతిస్తూ,మనసారా అభినందిస్తున్నాను.

అందుకే ఇవాళ ఒక కొత్త వేకువను,కొత్త చూపుతో ఒక కొత్త కవిత్వోదయం గా స్త్రీ కోణం లోంచీ దర్శిస్తున్నాను. కవయిత్రికి ఈ కొత్త చూపునిచ్చిన వారు - కొండేపూడి నిర్మల"లేబర్ రూమ్" కావచ్చు, విమల"వంటిల్లు" కావచ్చు,
మందరపు'సర్పపరిష్వంగం"కావచ్చు, పాటిబండ్ల రజని "అబార్షన్ స్టేట్మెంట్' కావచ్చు, జయప్రభ "పైటను తగిలెయ్యాలి" కావచ్చు..ఇలా ఒకరి స్ఫూర్తి మరొకరికి  ఆచరణ కాగలిగి నప్పుడే కవుల, భవిష్యత్ స్వప్నం సాకార మవుతుంది.

దాంపత్య బంధం అమలిన శృంగారం లో దగ్గరౌతుంది.ఆత్మీయ స్పర్శ కావాలి

"నీ స్పర్శ నన్ను సేద తీర్చాలి
నువ్వు నన్ను తాకగానే
నా మనసు గాలిలో దూదిపింజలా తేలిపోవాలి
స్పర్శ అంటే.చర్మంపై తేళ్ళూ,జెర్రులూ పాకినట్టు చీదరించేలా కాకుండా లోలోతుల్లోకి చొచ్చుకొనిపోయి హృదయవీణ సుతారంగా మీటాలి బ్రతుకు పోరు లోని బడలిక తగ్గిస్తూ అమలిన ప్రేమకు అద్భుత భాష్యం చెప్పాలి"
(పుట..33)

పసుపు తాడుతో జీవన బంధంపరిమళాన్ని అందించకపోతే,ఎన్నాళ్ళని
ఆశగా ఎదురు చూస్తుందిఏఇల్లాలైనా. తన బ్రతుకు మడిపై ఒక్క చినుకు పలకరింపు కైనా నోచుకోకపోతే ఆమె అతడికి శాశ్వతంగా దూరమై ఆమె ఒక అర్థం కాని కావ్యం లాగే మిగిలి పోతుందంటారు కవయిత్రి.

"ప్రతిరోజూ అతడి ముని వేళ్ళు
ఆమెపై గొంగళి లా పాకుతూ
చర్మలిపిని చదివి
లోపలి తడిని ఒక్కసారైనా తాక లేకపోయాయి
అతడి కనులలో
కాస్తంత కాంతిపుంజానికై
ఆమె ఆత్రంగా వెతికింది"
(పుట..36)

జీవితంలో ఏబాధాసందర్భం కళ్లబడినా నేను కన్నీటి కుండ నై నిలువెల్లా వణికి పోతానంటోంది కవయిత్రి.అమ్మప్రేమగా ఆర్ధ్రంగా తలుచుకుంటుంది .

" ప్రతీ సాయంత్రం
చిమ్నీ మసినంతా తన అందమైన చేతులతో తుడిచేసి
ఇంట్లోనే ఏదో ఒక చంద్రుడిని వెలిగించేది మా అమ్మ
వెన్నెలనంతా ముద్దచేసి నాకు ప్రేమగాగోరుముద్దలు తినిపించేది"
పుట..39

ఒక వర్షం కురిసిన రాత్రిలో తన  హృదయాన్ని తడుపుకుంటూ కలలు గంటుంది.ఒక సారైనా జ్వరమొస్తే బాగుండుననీ భావిస్తుంది.

"ఒకసారి జ్వరం వస్తే బాగుండును ఆకాశంలోంచి అమ్మ నడిచొచ్చి
తన చల్లని స్పర్శతో నా ఒళ్ళంతానిమిరితేబాగుండును
పనికి సెలవు పెట్టి మరీ శ్రీవారు
కళ్లలో ఒత్తులేసుకుని
నాకు సపర్యలు చేస్తే బాగుండును"
(పుట..52)

అమ్మకోసం, అమ్మలాంటి ప్రేమకోసం తపన పడ్తుంది కవయిత్రి.అతివల దేహాల ఒంపుసొంపుల్ని మాత్రమే చూడగలిగే పురుష పుంగవులకు  తీవ్రంగా వార్నింగ్ ఇస్తోంది.

'ఇకమీదట
మీ నుండి వెలువడే
మా బాడీ షేమింగుల దుర్గంధ పూరితమైన వ్యాఖ్యలకు
చరమగీతం పాడేలా
మరోమారు చెవిన బడితే
మీ నాలుకలను తెగ్గోసికాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాం జాగ్రత్త,
(పుట..63)

ప్రతి ఇంట్లో కన్నీటికొలన్లు ఉంటాయని,  వాటిని దర్శించాలంటే మనమనసులకు కళ్ళుండాలి.అద్దె ఇల్లు లాంటి గర్భాన్ని మోస్తున్న సర్గసీ మదర్ ను మరో కుంతి తో పోలుస్తుంది.

"తన రక్తమాంసాలతో అభిషేకిస్తున్న పిండానికి అమ్మ కాని అమ్మ గా మారి నవమాసాలూమోస్తుందామె
మరో కుంతి కాకపోయినా ముఖమైనా చూడని పసి జీవాన్ని హృదయాన్ని చిక్కబట్టుకుని పరాయి చేతులలో పెట్టేస్తున్న ఇంతి ఆమె
తనను తానే క్షమించుకోలేక అంతులేనిబాధను మోస్తూ బతుకు కీడుస్తుంది"
(పుట..67)

మరోచోట గాయాల కథను వినిపిస్తుంది.
బెస్తవాళ్లను గురించి రాస్తూ..వారు నిత్యంసముద్రపు పొత్తిళ్లలో జన్మించి, పోరులో కెరటాల కత్తులతో యుద్ధం చేసేవారుగా వర్ణిస్తుంది.

నీకూ నాకూ మధ్య మొలిచిన నిలువెత్తు గోడను ధ్వంసం చేసి సమస్త మురికినీ, మాలిన్యాలనూ కడిగేసుకొని మనసారా కౌగలించుకొందాం రమ్మని సహచరుని కోరుతుంది. కన్నీటి ఉప్పదనాన్ని ఒక్కసారైనారుచిచూడకుండా బతుకు నదిని దాటడం సాధ్య మవుతుందా నీకైనా,నాకైనా,నా మనసేమైనా గొర్రెపిల్లా? గుంజకు కట్టేస్తే పారి పోకుండా ఉండడానికి ? అనిసూటిగా ప్రశ్నిస్తుంది

రంగువెలిసిన నేత కార్మికుల దైన్య జీవితాలను అక్షర బద్దం చేస్తుంది.  ఆకలిని ఆత్రంగా వెతుక్కుంటూ రోజంతా నిలబడి,నిలబడి తన బతుకులోకి ఆశగా తొంగి చూసుకొంటున్న సేల్స్ గర్ల్స్ ను పరామర్శిస్తుంది.

మాతృత్వపు అదృష్టం కోసం ,కొత్తజన్మ కోసం నరాలు చిట్లే నరక యాతనను భరించే స్త్రీ మూర్తిని ప్రశంసిస్తుంది. కొండేపూడి నిర్మల గారి లేబర్ రూమ్ ను తలపించే వేదన ఈ కవిత.

"కత్తుల నదిపై పయనించి
కన్నీళ్ళ నదిని ఈదుతూ
నరాలు చిట్లేయాతనను ఓర్వక తప్పదు
కొన్ని నిమిషాలలో సునాయాసంగానో ఎన్నో గంటల పోరాటంతోనో, యమలోకపు ద్వారాన్ని తాకినంత పనై, వెనుదిరిగాకో
కోరుకున్నంత