కొత్త పోస్టులు

శీర్షికలు

కథలు

ఆకుపచ్చ కల 

పచ్చని అడవి. చిక్కని అడవిలో పచ్చిక బయలు

ఆ అడవిలో ఉండే జీవజాలం తప్ప మరో జీవి అక్కడి జీవులకు తెలియదు.  ఎప్పుడూ చూడలేదు. 

అయితే , ఈ అడవి దాటితే పెద్ద ప్రపంచం ఉందనీ, ఆ ప్రపంచంలో మానవులు ఉంటారనీ  వాళ్ళు చాలా గొప్ప వాళ్ళనీ, వాళ్ళు పక్షుల్లా ఆకాశంలో విహరిస్తారనీ, సముద్రంలో చేపల్లా ప్రయాణిస్తారని, చుక్కల్లో చందమామ దగ్గరకి వెళ్ళి వచ్చారనీ ఏవేవో చాలా విషయాలు చుట్టపు చూపుగా వచ్చిన కాకమ్మ ద్వారా విన్నాయి కొన్ని జంతువులు.  అందులో ఒకటి తోడేలు. 

అదిగో, అప్పటినుండి ఆ మానవ ప్రపంచం లోకి పోయి అక్కడ వింతలు విశేషాలు పోగేసుకురావాలని తహతహలాడి పోతున్నది తోడేలు. 

ఒకరోజు తనతో సమావేశమైన మిత్ర బృందంతో ఎన్నాళ్ళుగానో కంటున్న కల గురించి విప్పి చెప్పింది తోడేలు. 

"జరిగేది చెప్పు.  అనవసరపు కలలు కనకు. వంటికి మంచిది కాదు " అన్నది రైనో. 

"ఆమ్మో .. మానవ లోకంలోకా... బాబోయ్ "భయంభయంగా కళ్ళు టపాటపలాడించింది దుప్పి. 

"ఆకాశానికి నిచ్చెన వేద్దామంటే పడి నడ్డివిరగ్గొట్టుకున్నట్టే .. "నవ్వింది నక్క .

"నాకా వయసయిపోతున్నది . కోరిక తీరకుండానే పోతానేమో బెంగగా ఉన్నది" మిత్రుల మాటలు పట్టించుకోని తోడేలు దిగులు పడింది. 

మిత్రుడి కోరిక ఆమోదయోగ్యంగా లేదు. ముక్కు మొహం తెలియని మానవ లోకంలోకి వెళ్తుందంట. చుట్టుపక్కలున్న తమ వంటి రాజ్యాల్లోకే ఎప్పుడూ తొంగి చూసే ధైర్యం చేయని తోడేలుకు పోయే కాలం వచ్చిందని మనసులోనే విసుక్కుంది ఏనుగు. 

"ఆరు నూరైనా ఈ నెలలో మానవ ప్రపంచంలోకి వెళ్లి తీరాల్సిందే .. మీరెవరైనా నాతో వస్తానంటే  సంతోషం. లేకున్నా నేనెళ్ళేది వెళ్ళేదే .. ఆ ప్రపంచం చూడని బతుకు వృధా .. " తనలోతాను అనుకుంటున్నట్లుగా అన్నది తోడేలు. 

వయసు మళ్లుతున్న మిత్రుడి కోరికని తీర్చలేమా అన్నట్లుగా మిగతా నలుగురు మిత్రులూ ఒకరినొకరు చూసుకున్నారు. 

కొన్ని ఇబ్బందులు, కష్టాలు పడితే పడదాం.  పడమటి పొద్దులో ఉన్న మిత్రుడ్ని ఒంటరిగా కొత్త లోకంలోకి పంపడం మంచిది కాదేమోనన్నది దుప్పి. 

నిజమే, మిత్రుడి కోరిక తీర్చడం మన ధర్మం అని నక్క, రైనా సిద్దపడ్డాయి. ఏనుగు మాత్రం తన పరిస్థితుల దృష్ట్యా రాలేనని ఖచ్చితంగా చెప్పింది.  మీరు వెళ్తే మీ నాలుగు కుటుంబాల మంచి చెడు నేను చూసుకుంటానని మాటిచ్చింది. 

గతంలో కాకమ్మ ద్వారా విన్న అనేక విషయాలు మననం చేసుకున్నాయవి. తమ రూపాలతో వెళ్తే వచ్చే ఇబ్బందులను గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించుకున్నాయి. మరో లోకపు జీవితాన్ని ఉన్నతంగా ఊహించుకుంటూ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. 

 

                                              ***           ***           *** 

ఆకురాలు కాలం అది . కొన్ని చెట్లు ఆకురాలుస్తుంటే కొన్నిమోడు వారిపోయి, మరికొన్నిలేలేత ఆశలతో చిగురిస్తున్నాయి. 

నిశ్చలంగా నిశ్చబ్దంగా సాగిపోతున్న అక్కడి జీవితాల్లో ఏదో హడావిడి.  ఉత్సవమేదో జరుగుతున్నట్లు సందడి.   ఆ నోటా ఈ నోటా విషయం తెలిసిన  జీవులెన్నో ఎగుడుదిగుడు కొండ లోంచి చీలికలు చీలికలుగా ఉన్న సన్నని బాటల్లో వచ్చిపచ్చిక బయలులో సమావేశమయ్యాయి.  మరో లోకపు ముచ్చట్లు తెలుసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి . నిన్నమొన్నటి వరకూ తమతో తిరిగిన నలుగురు నేస్తాలు మానవ ప్రపంచంలోకి అడుగు పెట్టి ఏడాది దాటింది.   ఈ జీవాలు అసలున్నాయో లేవోననే సందేహంలో సందిగ్ధంలో ఉన్న సమయంలో అవి తమ రాజ్యానికి తిరిగి రావడం ఆ జంతు లోకానికి పండుగ్గా ఉంది. అదీకాక ఆ లోకపు వింతలు విడ్డురాలు, విశేషాలు తెలుసుకోవాలనే కుతూహలం వాటినక్కడికి రప్పించాయి .  ఇప్పుడు వాటి మాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.

 

తమ యాత్ర పూర్తి చేసుకొచ్చిన మిత్ర బృందం తోడేలు, నక్క , రైనో , దుప్పి రాకతో ఆ ప్రదేశమంతా హర్షధ్వానాలతో మార్మోగింది. అందరి వైపు చూస్తూ  చేతులూపుతూ సంతోషంగా పలకరించింది మిత్ర బృందం.  

అప్పటివరకూ ఉన్న కలకలం సద్దుమణిగింది.  ఆకు రాలితే వినపడేంత నిశ్శబ్దంగా మారిపోయింది ఆ ప్రాంతం. జీవులన్నీ ఊపిరి ఉగ్గబట్టుకుని కూర్చున్నాయి . అక్కడున్న వారంతా సుశిక్షితులైన సైనికుల్లా  .. కానీ వాటి శ్వాస నిశ్వాసలు పక్కన ఉన్న వాటికి వినిపిస్తున్నాయి. 

 

ఆ ప్రశాంతతను ఛేదిస్తూ  .. "ఆ రోజు మేం బయలుదేరినప్పుడు పలికిన వీడ్కోలు , మీ ఆదరాభిమానాలు మా వెన్నంటే ఉన్నాయి.  ఇప్పుడు మళ్ళీ..  ఇంత మందిచిన్నా పెద్దా, పిల్లా పాపా ..,  మిమ్ములని చూస్తుంటే కడుపు నిండి పోయింది. మాయా మర్మం లేని మనమంతా ఒక్కటేనని రుజువవుతున్నది. 

మరో లోకపు లోతుపాతులు తెలుసుకోవాలని స్వచ్ఛమైన హృదయాలన్నీ ఆశపడడం ఆరాటపడడం చూస్తే మహదానందంగా ఉంది. మా అనుభవాలు మీకు ఎలాంటి అనుభూతినిస్తాయో తెలియదు. ఏడాది కాలపు అనుభవాలను, అనుభూతులను కొద్ది మాటల్లో చెప్పడం కష్టమే .. కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాం.  

మేము మానవలోకంలో మేమెలా బతికామన్నదానికన్నా, మా నిశిత పరిశీలనలో అక్కడి ప్రజల జీవితమెలా ఉన్నదో, ఆ లోకపు నగ్న స్వభావం గురించి చెప్పాలనుకుంటున్నామన్నది తోడేలు.. సరేనన్నట్టు తలూపింది మిత్ర బృందం.  

 

మన మన్యంలో రకరకాల జంతు జాతులున్నట్టు  మానవుల్లోనూ జాతులున్నాయి . అంతేకాదు కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ, భాషా భేదాలు ఎన్నో ఉన్నాయి.  అంతా బయటకు ఎంతో అందంగా, ఆనందంగా రంగురంగుల్లో కనిపించే సంక్లిష్ట లోకం. స్వార్థ లోకం. 

ఒకే జాతి అయినా అంతా ఒకే స్థాయిలో ఉండరు . ఒకే రీతి నడవరు. ఒకే రకం తిండి తినరు . ఒకే రకపు ఇంట్లో ఉండరు . ఒకే రకపు బట్ట కట్టరు.  ఎక్కడ చూసినా కులం , మతం , జాతి , అంతస్తుల తేడాలే .. మిరుమిట్లు గొలిపే వెలుతురులో అద్దాల మేడల్లో కొందరుంటే చీకటి గుయ్యారాల్లో ఆకాశమే కప్పుగా మరికొందరు .. ఆకాశ వీధుల్లో విహరించే వాళ్ళు కొందరయితే చీలికలైన కాళ్లతో గమ్యం కేసి ప్రయాణించే వాళ్ళు మరికొందరు ...

ఎవరికివారు తామే గొప్పని విర్రవీగుతారు.  ఎవరి అస్తిత్వం వారికి గొప్పదే కావచ్చు. ఎవరి మత నమ్మకాలు , పద్ధతులు వాళ్ళకుండొచ్చు. అవన్నీ వాళ్ళింటికే పరిమితం కావాలి. గడప దాటిన తర్వాత అందరూ సమానమే కదా .. ఈ చిన్న విషయం వీళ్ళకెందుకు అర్ధంకాదో ..గొడవలు పడిచస్తారు. కొట్టుకుంటారు . నరుక్కుంటారు . యుద్ధాలే చేసుకుంటారు . ఏంమనుషులో ఏమో .. నమ్మినవాళ్ల మీదనుంచే తొక్కుకుంటూ పోతుంటారు... " అంటున్న తోడేలు మాటలకు అడ్డొస్తూ .. "అయ్యో .. ఎట్లా .. " చెట్టుమీద  బుల్లిపిట్ట సందేహం వెలిబుచ్చింది. 

" మనుషులకెనెన్నో నమ్మకాలూ, విశ్వాసాలు.  వాటినే పెట్టుబడిగా చేసుకుని మఠాధిపతులు , పాస్టర్లు , ముల్లాలు గొప్పగా బతికేస్తున్నారు.  ప్రజల నమ్మకాలను, భక్తిని మార్కెట్ వస్తువులుగా మార్చి వ్యాపారం చేసుకుంటున్నారు . ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. 

మనం అన్నది కనిపించక అంతా నేనులే ..  మైదాన ప్రాంతాల్లో ఒకచోట కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక నగరం కాదు ఎక్కడికిపో .. అదే తంతు. ఒకనినొకడు దోచుకోవడమే .. కప్పను పాము మింగినట్టు మింగేయడమే.. 

కులాన్ని, మతాన్ని, రిజర్వేషన్లను అడ్డంపెట్టుకుని చేసే రాజకీయంలో  చిన్న పిల్లలకు బిస్కట్ ఇస్తామని  ఆశ పెట్టినట్లు రకరకాల పథకాల హామీలు ఆశపెట్టి మనుషులను తమ తిండి కోసం తాము కష్టం చేయలేని సోమరులుగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. 

వారి అస్తిత్వాలు ఏవైనా ఆ జనం రెండుగా కనిపించారు. శ్రమ చేసేవారు , ఆలోచన చేసేవాడు. చెమటచుక్క చిందించేఉత్పత్తి చేసే శ్రామికులను గుప్పెడు మంది ఆలోచనాపరులు ఎప్పుడూ లొంగదీసుకుని తమ కాళ్ల కింద అట్టే పెట్టుకుంటున్నారు.  ఆరోగ్యం నుంచి ఆర్ధికం వరకు, రక్షణ నుంచి సామాజిక భద్రత వరకు అన్ని రంగాల్లో ఆడ మగ వ్యత్యాసాలే .. "కంచుకంఠంతో చెప్పుకుపోతున్న తోడేలు కొద్దిగా ఆగి అందరి వైపు నిశితంగా చూసి ఓ దీర్ఘ శ్వాస విడిచింది. 

 

" అన్నా .. ఏమైనా వాళ్ళు మనకంటే తెలివిగల వాళ్ళు.." అంటున్న రైనో ని "ఆహా .. ఏమిటో అంత గొప్ప తెలివితేటలు .. " తానే తెలివైనదాన్ననుకునే నక్కపిల్ల ప్రశ్నించింది. 

"ఒకప్పుడు మనలాగే అడవుల్లో బతికిన మనిషి తన తెలివితేటలతో పక్షిలా ఆకాశంలో ఎగరడానికీ విమానాలు , చేపలా నీళ్లలో ప్రయాణానికి ఓడలు, ఆకాశంలో చుక్కల్లా కనిపించే గ్రహాలను, చందమామను చేరే రోదసీ నౌకలు ఇలా లెక్కలేనన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు" అన్నది రైనో 

"ఓ అవునా .. ఇంకేం చేశారు .. చెప్పు మిత్రమా .. చెప్పు " తల్లి గర్భం నుండి వచ్చిన శిశువు లా ఉత్సుకతతో చూస్తూ మిడత.

"తల్లి గర్భంలోంచి పుట్టే మనిషి మరమనిషిని  తాయారు చేసి తాను చేసే పనులన్నీ దానితో  చేయిస్తున్నాడు.  అది ఊహకందడం లేదు కదూ .. కానీ అది నిజం.  అంతేకాదు , మనం ఇక్కడుండి మన పొరుగు రాజ్యంలోనున్న మనవాళ్లతో మాట్లాడగలమా..? చూడగలమా ..  లేదు. కానీ, వాళ్ళు  ఇక్కడుండి ఎక్కడెక్కడో ఉనోళ్లను చూస్తారు. ఇక్కడ ఉన్నట్లు మాట్లాడుకుంటారు .. ." చెప్తున్న రైనో మాటలకు అడ్డు వస్తూ .. "ఏమిటేమిటి మళ్ళీ చెప్పు " అన్నది చిరుత. 

"అవునన్నా, వాళ్ళ చేతిలో ఇమిడిపోయే ఫోన్ లున్నాయి.  నేను నీతో మాట్లాడాలంటే నీ దగ్గరకొచ్చి మాట్లాడాలి. కానీ వాళ్ళు రాకుండా ఎక్కడివాళ్ళక్కడుండి చూసుకుంటూ మాట్లాడుకుంటారు.. " వివరించింది రైనో. 

"అవును నిజమే, చేతుల్లో మొబైల్ ఫోన్లకు బందీలైపోయారు మానవులు.  అవి అందరి దగ్గరా లేవు గాని చాలామంది దగ్గర కనిపిస్తాయి.  మొదట్లో వింతగా ఆశ్చర్యంగా ఉండేది. అబ్బురంగా తోచేది . పోనుపోనూ విసుగొచ్చేసిందనుకోండి.  మనిషి జీవితం, వారి ఆలోచనలు వారి చేతిలో నుండి టెక్నాలజీ చేతుల్లోకి పోతున్నట్లనిపించింది. సోషల్ మీడియా.. అతనికి తెలియకుండానే కండిషనింగ్ చేస్తున్నది.  ఇంటర్నెట్ పెను తుఫానులా మనుషుల్ని తూర్పార పడుతున్నది. ఊకలాగా గాలికి కొట్టుకుపోతున్నాడు మనిషి.  ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే.. మనిషి ఒంటరే.. ఆ మానవ సంబంధాల నిండా బోలు.." విచారపు గొంతుతో నక్క. 

"అవునవును మన తెలివి మనని ముందుకు నడిపించాలి. మొద్దుశుంఠల్నిచేసి వెనక్కి నడిపిస్తే ఎలా .. " గొంతు సవరించుకుంటూ ఎలుగుబంటి.  

"వాళ్ళ సంగతొదిలెయ్ .. ఏ చావు చస్తారో చావనిద్దాం .. అటు ఇటూ చేసి మన మనుగడకే ముప్పు తెచ్చేస్తున్నారు కదా .. నింగి , నేల , నీరు , నిప్పు , వాయువు  అన్నీ తన సొంత ఆస్తి అనుకుంటున్నాడు మానవుడు. నిన్నమొన్నటి వరకూ దట్టంగున్న దండకారణ్యాలు తరిగిపోతున్నాయి.  అక్కడి జీవరాశులు నిరాశ్రయులైపోతున్నయి" దిగులుతో దుప్పి. 

దూరంగానున్న జలపాతపు సవ్వడిని గాలి మోసుకొస్తుండగా "మీరేం చెబుతున్నారో నాకైతే ఒక్క ముక్క అర్ధంకాలే.. " తలగోక్కుంటున్న అడవి పంది.     

" నీకర్థమయ్యేటట్లు మరోసారి చెబుతాలే .. "అని అందరివంకా పరిశీలనగా చూస్తూ "  ప్రకృతిని తన చేతుల్లోకి తీసుకున్నానని విర్రవీగుతున్నాడు కానీ, తన అహంకారానికి , తీరని దాహానికి , స్వార్ధానికి ఈ ప్రకృతిలోని సమస్త జీవజాలం తో పాటు అనాదిగా తానభివృద్దిచేసుకొస్తున్న సంస్కృతి, జ్ఞానం-విజ్ఞానంతో పాటు తాను కూడా ధ్వంసమైపోతున్నానినాశనమైపోతన్నాని అతనికి ఎందుకర్ధం కావడం లేదో... ప్రకృతితో పర్యావరణంతో వికృతమైన ఆట లాడుతున్నాడు " అన్నది దుప్పి.

అసహనంగా కదిలాయి పులి , సింహం , మరికొన్ని జంతువులు. " అంటే .. మనం సమిధలమా..    అట్లెట్ల .. ?" కోతి చిందులేసింది. 

" మన కాళ్ళ కింద అతనికి అవసరమయ్యే తరగని ఖనిజ సంపద ఉన్నది. అతని కన్ను దీనిపై ఉన్నది. రేపోమాపో మనమంతా మన తావులొదిలి  తలో దిక్కు వలస పోవాల్సిందే " హెచ్చరించింది నక్క. 

 " నిజమే నేస్తమా .. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రకృతిలో భాగంగా మనమున్నాం . స్వచ్ఛంగా, స్వేచ్ఛగా సంచరిస్తాం.  మానవ నివాసాలలో నాకు ఊపిరి సలప లేదంటే నమ్మండి . అంతా కాలుష్యం. వాయు కాలుష్యం, జల కాలుష్యం , శబ్ద కాలుష్యం .. మానవ ప్రవృత్తి లోనే కాలుష్యం .. తినే తిండి, పీల్చే గాలి , చూసే చూపు, మాట్లాడే మాట అన్నీ కలుషితం .. వాళ్లకు సృష్టి పట్ల ప్రకృతి పట్ల భవిష్యత్తు పట్ల గౌరవం లేదు  " అన్నది తోడేలు. 

 

"ప్రకృతి విరుద్ధంగా సాగే నడక, నడత వల్ల కొత్తకొత్త రోగాలొస్తున్నాయక్కడ.  ఉన్న పుట్టెడు రోగాలకు తోడు కంటికి  అగుపించని క్రిమి వారిని అతలాకుతలం చేస్తున్నది .  మనిషితనం మరచిన మనిషికి హెచ్చరికలు జారీ చేస్తున్నది .  మేము వెళ్ళినప్పుడు కళకళలాడిన లోకం, తళతళ లాడిన మనుషులు ఇప్పుడు వెలవెల బోతూ పెద్ద సంక్షోభంలో .. " అన్నది రైనో. 

"ఆ అదృశ్య క్రిమిని దుమ్మెత్తిపోస్తున్నారు " అన్నది దుప్పి. 

"ఆ క్రిముల పుట్టుకకు కారణం వాళ్ళే. వ్యాప్తికి కారణం ఆ మనుషులే. వాటి పేరుతో ప్రజల రక్తం తాగేది వాళ్ళే. ప్రజలని కాపాడటానికి ఏవిటేమిటో చేసేస్తున్నాం, చాలా కష్టపడి పోతున్నామని షో చేసేది వాళ్లే. ఈ క్రమంలో బలహీనులంతా లోకం నుండి సెలవు తీసుకుని పోతుంటే మిగిలిన వారి ప్రాణ భయాన్ని సొమ్ము చేసుకుంటూ చికిత్స రూపంలో , వాక్సిన్ ల రూపంలో కొల్లగొట్టేస్తున్నారు  " తోడేలు. 

"నన్ను నిందిస్తారు కానీ అక్కడందరూ గుంట నక్కలే.  మిత్ర సంబంధాలు శత్రు సంబంధాలుగా , శత్రు సంబంధాలు మిత్ర సంబంధాలుగా మారిపోతాయి. అక్కడ సంబంధాలన్నీ అర్ధంతోనో, అధికారంతోనో అహంతోనో ముడిపడినవే. కష్టమొకడిది. సుఖం మరొకరిది. సొమ్మొకడిది . సోకొకడిది. ఈ భూమి మీద ఉన్న  సకల జీవరాశులకు సమాన హక్కు ఉన్నదన్న జ్ఞానం లేదు. అంతా తమదే నన్న పోకడలతో నాశనం పట్టిస్తున్నారు " అన్నది నక్క.

"మనలో మనకు వచ్చే గొడవలు, దాడులు ఆ పూట కడుపు నింపు కోవడానికే కానీ తరతరాల తరగని సంపద పోగెయ్యడానిక్కాదు" గంభీరంగా అన్నది మధ్యలో అందుకున్న పులి.     

మానవ అభివృద్ధి దీపాల వెలుగులో నిప్పురవ్వలు రాజుకుని తమ అడవినంతా కాల్చేస్తాయేమోనన్న భయంతో .. తమ కాళ్లకింద నేలనంతా పెకిలిస్తాయేమోనన్న అనుమానంతో .. మసక మసకగా కనిపిస్తున్న భవిష్యత్ చిత్రపటం మదిలో చిత్రిస్తూ కొన్ని జీవులు. వాటి ఆలోచనల్ని భగ్నం చేస్తూ   

"విచిత్రమేమంటే, అదే లోకంలో గుండె తడి ఆరని మనుషులు ఆకాశంలో చుక్కల్లా సేవ తీరుస్తారు. అడవి పుత్రులకు సేవ చేస్తారు. మర్చిపోయిన మానవత్వాన్ని తట్టి లేపుతుంటారు. మనసును కదిలిస్తూ మానవీయ బంధాలను గుర్తు చేస్తుంటారు.  మనిషి మూలాలను తడిమి చూస్తుంటారు. అపారమైన ప్రేమ అందిస్తుంటారు .  ఏపుగా పెరిగిన రాచపుండుకు చికిత్స చేస్తుంటారు. 

ముక్కలు ముక్కలవుతున్న మానవ సంబంధాలకు మాటువేసి అతికించే ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటివారి నుంచి తీసుకోవడం కన్నా ఎదుటివారికి ఇవ్వడానికి ఇష్టపడతారు . తమ చుట్టూ ఉన్న నలుగురినీ సంతోషపెట్టడానికి యత్నిస్తుంటారు.  ఒక్కమాటలో చెప్పాలంటే.. తగలబడుతున్న మానవ ప్రపంచాన్ని కొత్త తోవలో ఆవిష్కరించడానికి తపన పడుతుంటారు. జీవితాన్ని ఉన్నదున్నట్టుగా  ప్రేమిస్తారు" వెలుగుతున్న మొహంతో అందరి వంకా చూస్తూ అన్నది తోడేలు. 

ఆకాశంలో తమ నెత్తి మీదుగా ఎగురుతున్న లోహవిహంగం కేసి చూస్తూ 

స్వార్ధం పడగ నీడ నుండి కాపాడేదిబతికించేది ఆకుపచ్చని మనసులే .. వారితో కలిసి అడుగేయాలి "చెట్టుమీద చిలుక పలికింది.  

ఆకుపచ్చని కలగంటూ వెనుదిరిగాయి ఆ జీవులన్నీ.

 

 

కవితలు

చేయాల్సింది సమీక్షే ...

చేయవలసింది

ఉత్సవం కాదు

చేయాల్సిందిప్పుడు

సమీక్ష...

 

గతానికైన

గాయాన్ని

వర్తమాన

శిక్షని

భవిష్యత్

బాధని

 

సవివరంగా

చేయాల్సిన

సమీక్ష

 

అజ్ఞాన తాయత్తు కట్టి

జోగిని బసివిని మాతంగుల జేసీ

దేవుని కుతి దీర్చమంటూ

అందాల ఆటబొమ్మల జేసీ

కార్పొరేటోడికి తాకట్టుపెడుతూ

రంగు రంగుల ముగ్గుల్లో

విషపు పొగల

క్లబ్బుల్లో పబ్బుల్లో

ఉక్కు గొలుసులతో

బంధించి

ఉత్సవానికి పిలుస్తారు

 

మీరు వెళ్ళకండి...

మహిళ బతుకు కాదది

 

అవనియంత పరిచి

ఆకాశమంత పొగిడి

పాతాలానికేసి తొక్కుతారు

జర పైలం....

 

కొత్తగా పుట్టింది కాదిది

మనువాద పితృస్వామ్యం

నీపై చేసిన ఆధిపత్యం

కత్తుల్తో చర్మమొలిచినట్టు

హక్కులన్నీ ఒక్కటొక్కటిగా

కాల్చేసింది పూడ్చేసింది

 

కట్టు కథలు కుట్ర కథలు

రోత పురాణాలు

పతివ్రత మంత్రమేసి

పరువును ఆపాదించి

గడప దాటకుండా

సూదిమొనల గీత గీసింది

 

బాల్యంలో

తండ్రి దగ్గర

యవ్వనంలో

భర్త దగ్గర

వృద్ధాప్యంలో

కొడుకు దగ్గర

బ్రతుకంతా

మగాడి బ్రతుకు కిందాని

ఆదేశించింది

 

కన్యాశుల్కం

సతీ సహగమనం

వితంతు విహహ రద్దు

దాసీ వ్యవస్థ

ఒక్కటి కాదు లెక్క లేనన్ని

దురాచారాలు...

తీసిన ప్రాణాలు

ఏ మట్టిని తాకినా చెప్తాయి

 

తరాల కాలగమనం జరిగింది

ప్రాణమొక్కటే మిగిలినప్పుడు

పోరాటమే సరైంది...

ఎందరో వీరవనితల పోరు ఫలితం

ప్రపంచ స్వేచ్ఛా పోరాటం...

నియంతల పాలననణిచి

శ్రమ దోపిడి లేని

ఎట్లాంటి భేదాలే లేని

అందరూ సమానంగా బ్రతికే

ప్రజా స్వపరిపాలనకోసం

త్యాగాలు కోకొల్లలు

 

మహిళా ప్రత్యేక చట్టాలు

చుట్టూ రక్షణ వ్యవస్థ

శాస్త్ర సాంకేతిక వృద్ధి

అన్నీ రంగాల్లో భాగస్వామ్యం

 

 అయినా ఏం మారింది

 

పట్ట పగలే పసిపిల్ల మొదలు

పండు ముసలి పై అత్యాచారాలు

అక్షరాస్యత ఎంతున్న

మనువు మూర్ఖత్వం తలకెక్కిచేసే

గృహ హింస వరకట్న వేధింపులు

వేల సంవత్సరాల ....

దురాచార పర్వమింకా వేటాడబట్టే

 

ఎంత చెప్పినా

ఒడువని దుఃఖమిది

ఆడజాతిని అమాంతంగా

అంతంచేసే కుట్రలు

పురుషాధిపత్యం అణిచేసిన

బ్రతుకులు ఏమని చెప్పగలం?

 

తల్లీ... జర పైలం

ఉత్సవం కాదిప్పుడు

చేయాల్సింది

సమీక్ష...

శ్రామిక మహిళా

పోరాట చరిత్ర సమీక్ష...

స్త్రీ పురుష సమానతకు

చేయాల్సిన సమీక్ష

 

 

నవలలు

సైరన్ నవల  రెండవ పార్ట్ –  తొమ్మిదవ  భాగం  

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)                                                           

                                                                            32

            సింగరేణి వ్యాపితంగా అన్ని డివిజన్లలో లారీలోడిండు కంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. కంట్రాక్టు పద్దతి ఎత్తేసి - సింగరేణి యాజమాన్యమే నేరుగా కంట్రాక్టర్‍ లోడింగు లేబర్‍ను బదిలీ పిల్లర్లుగా తీసుకొని లారీ లోడింగునేరుగా చేయించాలి. మధ్య దళారులు లేకుండా సింగరేణి యాజమాన్యమే కార్మికులకు చెల్లింపులు చేయాలి.

            మొదట గోదావరిఖనిలో డిశంబర్‍ ఆఖరు వారంలో ఆరంభమైన సమ్మె మందమర్రి, శ్రీరాంపూర్‍, బెల్లంపల్లి,  కొత్తగూడెంలో జనవరి మొదటి వారంలో కార్మికులు సమ్మెలోకి దిగారు. సమ్మెకు మద్దతుగా రాడికల్స్ పోస్టర్లు వేశారు. బొగ్గు యార్డులోనే శిబిరాలు వేశారు. శిబిరంలో రిలే నిరాహరదీక్షలు కొన సాగుతున్నాయి. సింగరేణి వ్యాపితంగా కంట్రాక్టులేబర్‍ యూనియన్లన్ని దాదాపుగా ఏఐటియుసియే నడుపుతున్నది.  కనుక మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొనకతప్పలేదు. కంట్రాక్టర్లంతా దాదాపుగా దొరలు లేదా కాంగ్రెసు అనుబంద యూనియన్‍ నాయకుల ఆధీనంలో ఉన్నాయి. సింగరేణి వ్యాపితంగా బలంగా ఉన్న ఈ రెండు యూనియన్ల మధ్య ఈ సమ్మె యుద్ధవాతావరణాన్ని తెచ్చింది. దీని మూలకంగా కంట్రాక్టర్లు గుండాల ఆర్థిక మూలల మీద దెబ్బకొట్టి - అన్ని రంగాలల్లో విస్తరించి యున్న దొరల మీద దెబ్బతీసినట్లుగా రాడికల్స్ భావించారు.

            అయితే రాడికల్స్ -కమ్యునిస్టు అనుబంద కార్మిక సంఘం లోనే పనిచేస్తున్నారు. వాళ్లెవరన్నది గుర్తుపట్టలేక - ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో - నిర్వీర్యమైన తమ యూనియనుకు తీవ్రత పెరిగి - బలం పుంజుకోగలదని - కమ్యూనిస్టుల అంచనా - ఏదిఏమైనా - సింగరేణిలో ఇది ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. యాజమాన్యం మొత్తం సింగరేణి కంపెనీ పాలసీకి సంబందించిన విషయం కనుక - హైదరాబాదులో రెండు దపాలుగా చర్చలు జరిపినా - రెండు యూనియన్ల లక్ష్యాలు పరస్పర విరుద్దమైనవి గనుక ఒక కొలిక్కి రాలేదు...

            ఈ విషయం మీద కార్మికులకు మద్దతు కూడ గట్టడానికి గంగాధర్‍, షరీప్‍, శంకరయ్య, సత్యం, శంకర్‍ వారివారి   రంగాలల్లో రోజు తిరుగుతున్నారు. అన్నిపిట్‍ కమిటీలు ప్రత్యేక సమావేశం చేసుకొని సమ్మెకు మద్దతు ప్రకటించాయి. చందాలు వేసుకొని సమ్మెలో ఉన్న కంట్రాక్టు కార్మికులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. విద్యార్థులు వీధుల్లో తిరిగి చందాలు వసూలు చేసి వచ్చిన మొత్తాన్ని కంట్రాక్టు కార్మికుల కిచ్చారు.

            జనవరి అయిదవ తేది - సి.యస్‍.పిదగ్గరి శిబిరం దగ్గర దాదాపు వందమంది కంట్రాక్టు కార్మికులున్నారు. పదిమంది షామిషానలో రిలే నిరహార దీక్షలో కూర్చున్నారు. వాళ్లకు మద్దతుగా విద్యార్థులు, రెహనా, లక్ష్మి, సరిత వారితో పాటు కూడా కూర్చున్నారు...

            సియస్‍పి దగ్గరి నుండి మేన్‍ రోడ్డు దాకా దాదాపు మూడు వందలకు పైన్నే లారీలు ఆగి ఉన్నాయి. లారీల డ్రైవర్లు, క్లీనర్లు లారీల దగ్గరే వంటలు చేసుకొని అశాంతిగా యార్డంతా తిరుగుతున్నారు. కోల్‍యార్డులో కోల్‍ గుట్టలు గుట్టలుగా పడున్నది. సేల్‍ పరీకార్మికులకు ఆ కుప్పల మధ్య పనిచేయడం కుదరడంలేదు. అందరు చుట్టూ ముగారు.

            అలాంటి సమయంలో గంగాధర్‍ ముప్పయి మందితో శిబిరం దగ్గరికి వచ్చారు. చాలా వరకు ఆ డివిజన్‍ లోని ఫిట్‍ కమిటీ సభ్యులు, విద్యార్థుల తరుపున తమ పూర్తి మద్దతు తెలుపుతామని - అవసరమైతే - స్కూల్లు బందు పెడుతామని విద్యార్థుల తరుపున శంకర్‍ మాట్లాడాడు...

            శంకరయ్య వీరులారా మీకు వందనం పాట పాడిండు. కళాకారులు ప్రదర్శణ చేశారు. పెదనాన్న పోశెట్టి ఒళ్లో కూర్చున్న సంవత్సరం మూడు నెలల పిల్ల తపతప అడుగులేస్తూ శంకరయ్య బృందం దగ్గరకు చేరింది, కళాకారులు ఎత్తుకున్నారు ఫిట్‍ కమిటీల తరపున  షరీప్‍ మాట్లాడిండు ‘‘మీరు సింగరేణి కోసం పని చేస్తున్న కార్మికులే - మునుపు ఎవరికి వారే కొట్లాడి దెబ్బలు తిన్నాం - సింగరేణి కార్మికులం మీవెంటే ఉన్నాం’’ భరోసా యిచ్చాడు.

            ఎప్పుడు లేంది - రెహానా, లక్ష్మి, సరితతో పాటు మరో పదిమంది మహిళలు మీటింగులో కూర్చున్నారు. మహిళల తరపున రెహనా’’ గింత మందిల పస్టుసారి...గుండె కొట్టుకుంటంది... మా తిప్పలు మేం బడ్తన్నం. మీరు గోస పడ్తండ్లు. మీ కట్టం - సుఖం గిట్ల సూడటం - మీతో పాటు మీమందరం నిలబడ్తం. సలాం’’ కూర్చున్నది. లక్ష్మి షేక్‍హాండిచ్చింది.

            లోడర్ల తరపున వెంకులు మాట్లాడిండు. అతనికి మాట్లాడటం ఇదే మొదటిసారి - ‘‘అన్నలారా! నాకాళ్లు గజగజ వనుకుతన్నయ్‍. లోపటినుంచి దు:ఖం ఎగదన్నుకత్తంది. ఒకప్పుడు అర్జన్న మాతో పని చేసిన అర్జన్న - నిలబడి సమ్మె జేసినం. అర్జన్నను సంపిరైలు పట్టాలకేడీసిండ్లు -ఆ కథంతా మేంజూసినం. ఇగో ఇక్కడ కూసున్న మొగిలన్నకు గ కథంతా ఎరుకే బతకవశం కావటం లేదు... బయమైతంది... మీకందరికి శనార్థి’’ కూర్చున్నాడు...

            అయిదు గంటల దాకా మీటింగు కొనసాగింది....

            ఆఖరున గంగాధర్‍ మాట్లాడిండు.

            ‘‘ఇప్పుడిది మన ఒక్క దగ్గరి సమస్యకాదు. మొత్తం సింగరేణంతా జరుగుతోంది. కామ్రేడ్స్ - మీ మీద ఒక్క దెబ్బపడ్డా ఇది సింగరేణి కార్మికులమీద అందరి మీద పడ్డదెబ్బే - అగ్గై మండుతది. ఇది సింగరేణిలో తరతరాలుగా చాప కింది నీళ్లలాగా చేరి - అధికార్లదాకా వ్యాపించిన దొరల ఆర్థిక మూలాల మీద దెబ్బ - అధికారులను, మార్కెటును తమ చేతుల్లో పెట్టుకోవడానికి - గుండాలను పోషించడానికి మీ నెత్తురు చెమట నుండి వేలాది రూపాయలు దోపిడి చేసి     వాళ్లు ఒక శక్తిగా ఎదిగారు.ఈ దెబ్బతో మార్కెటు మీద దొరల ఆదిపత్యం పోతుంది. ప్రజలు మనుపటిలాగాలేరు. కార్మికులు సింగరేణిలో జరిగే ప్రతిచర్యను గమనిస్తున్నారు. అధ్యయనం చేస్తున్నారు. ఈ సమస్య ఆలశ్యం చేసేది కాదు. సుమారు ముప్పైవేల లారీలు అన్ని డివిజన్లలో ఆగిపోయాయి. చిన్న పరిశ్రమలు బొగ్గులేక ఆగిపోయే పరిస్థితి వచ్చింది... చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఏసి రూముల్లో - హైదరాబాదులో కాదు - సమ్మె శిబిరాల దగ్గరికివచ్చి కార్మికులతో చేయాలని మేం డిమాండు చేస్తున్నాం... వాళ్లు అట్లా చేయకపోతే ఈ సమ్మె సింగరేణి గనులకు వ్యాపిస్తుంది... కార్మికులందరు జనరల్‍ మేనేజరు ఆఫీసుల్లోకి రావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. వేలాది రూపాయల జీతాలు తీసుకొని - విలాసవంతమైన జీవితం గడిపే అధికారులారా! కార్మికుల చెమట, నెత్తురుతోనే మీరంతా బతుకుతున్నారు. సమస్యను పరిష్కరించండి. కార్మికులు మీ శత్రువులు కాదు.  గులాములు కాదు. కార్మికులు బొగ్గులో ఉండే ఇంధన శక్తి...’’ గంగాధర్‍ ముగించాడు....

            శంకరయ్య సైకిల్‍ తీసుకున్నాడు.లక్ష్మి కూతురు నెత్తుకొని వెనుక సీటు మీద కూర్చున్నది. రాత్రికి శిబిరం దగ్గర పడుకోవడానికి వస్తామని వెళ్లిపోయారు... అప్పుడు కమ్యూనిస్టు నాయకులు ఇబ్రహీం, కరీం, కొమురయ్యతో పాటు ముప్పై మంది వచ్చారు....పోశెట్టితో చేతులు కలిపారు. మీటింగు మళ్లీ  మొదలయ్యింది.

            అదే సమయంలోసినిమా టాకీసుగేట్లు మూసి దాదాపు యూభై మంది గుండాలతో కృష్ణారావు మీటింగు ఏర్పాటు చేశాడు. ఆ మీటింగులో లోడింగు మొఖద్దమ్‍లు, బ్రాండి, కల్లు, సారా దుకాండ్ల దగ్గర గుండాలు, కటికె దుకాణాలు నిర్వహించే గుండాలు, మేకల మండీలవాళ్లు, చిట్టీలు,వడ్డీలు వసూలు చేసేవాళ్లు, బ్రాండి, సారా గోడౌను దగ్గరి గుండాలు, సారాకాచే వాళ్లమీద దాడి చేసే గుండాలు, మార్కెట్‍ చూసే గుండాలు, ఫిట్‍ కమీటీలు, సేప్టీ కామిటీలు, ఆఫీసులదగ్గర పైరవి కార్మికులు, యూనియన్‍ ఆఫీసుబేరర్లుల నుండి ఎంపిక చేసుకున్న వారిని మాత్రమే పిలిశారు.

            క్రిష్ణారావు ముఖమంతా నెత్తురు పేరుకపోయి కూర్చున్నాడు. రాఘవులు కృష్ణారావు కుర్చీపక్క దూరంగా నిలబడి -  ‘‘గిప్పుడు మననేతలు కార్యకర్తలు - సారలి, శంకర్‍లకోసం రొండు నిమిషాలు మౌనం పాటించుదాం’’ అన్నాడు.

            ‘‘గలత్తకోరోల్ల కోసమా? ఎవడన్న ఇంటె ముడ్డితోటి నవ్వుతడు’’ మందిల నుంచి ఎవడో గుణిగిండు.

            కృష్ణారావు ఒక సారి మందిలకు చూసి గీసోదేంది?’’ అన్నట్టు రాఘవులు ముఖం చూసిండు.

            అందరు లేచి నిలబడి మౌనం పాటించారు. కీష్ణారావు లేవడం కూచోవడం ఇబ్బందయ్యింది.

            ‘‘సారలి’’

            ‘‘అమర్‍హై’’

            ‘‘శంకర్‍’’

            ‘‘అమర్‍హై’’

            అందరు అరిచారు - ‘‘కొంపదీసి రాఘవులు గాడు డబుల్‍గేమ్‍ ఆడ్తలేడుగదా! కమ్యూనిస్టు తీర్తం పుచ్చుకొని’’ - కటికె వీరస్వామి చేపల మార్కెట్లు పెద్ద నర్సింగం చెవులూదిండు.

            ‘‘వింటెగీన్నే నీదవుడలు - నీదవుడలు సదురుతరు’’ నర్సింగం.

            ‘‘ఆత్మీయులారా! మన ప్రియమైన కార్యకర్తలు హత్యకు గురై సుమారు తొమ్మిదినెల్లు...’’

            ‘‘అప్పుడే దెబ్బకు దెబ్బతీస్తే గింతదాక వచ్చేదికాదు’’ నరేందర్‍ లేచి నిలబడి...

            ‘‘ఆలమ్డికొడుకు తాగిండా!’’ కృష్ణారావు.

            ‘‘నేను చెప్పేది వినుండ్లి - ఆ తరువాత మాటలు. ప్రతిదానికి రీతి రివాజుంటది. ప్లానుంటది. మనం చెప్పినట్టు ప్రపంచం నడిస్తే’’

            కృష్నారావుకు కోపం పెరిగిపోయింది.

            ఆయన లేచి నిలబడ్డడు.

            ‘‘రాఘవులు గాన్ని మాట్లాడనిస్తే - తెల్లారెదాక మాట్లాడ్తడు. గింత కాలం నాపేరు చెప్పుకొని, యూనియన్‍ పేరు చెప్పుకొని మీరంత తిన్నరు - తాగిండ్లు. తడి బట్టేసుకొని బేఫికర్‍గ పన్నరు...సారలి గాడు శంకర్‍ గాడు ప్రతిదానికి ముందటివడి కొట్లాడి ఏచిన్న సమస్యను కూడా మీదాక, మాదాక రానిచ్చేటోళ్లుగాదు...పైన కంపెనీ ఎట్ల ఎన్నిడిజన్లతో నడుత్తందో - మన వ్యాపారాలు గన్ని గిక్కడున్నయి - ఇంత కాలం కమినిస్టోడు తోకలేవట్టలే గిప్పుడు రాడికల్లోల ఎంటే సుకొని తోకలు మిడ కొడుతండ్లు గాళ్ల తోకలు మీరు కత్తిరింత్తరా? నేనే ఆపని చేసి మీతోకలు కత్తిరించి - కొత్తవాళ్లను బిజినెస్‍లకు తెమ్మంటరా? ఊకే బైసెందుకు?’’ మీరు బొత్తలు పెంచి ఆరాముగా సెటిలయ్యిండ్లు - గిప్పుడు గట్ల నడువది’’

            ‘‘అరెశ్రీనివాస్‍’’ పిలిచిండు.

            సినిమాటాకీస్‍ మేనేజర్‍ శ్రీనివాసు ముందుకొచ్చి నిలుచున్నడు.

            ‘‘అన్ని ఇంతె జాములు చేసినవ్‍గద’’

            ‘‘చేసినదొర - రాఘవులును ఎంట తీసుక పోండ్లి - నేను పోలీసులకు చెప్పిపెట్టిన - మీ ఎంటిక పీకెటోడెవడులేడు’’ కృష్ణారావు దొర చరాచరా నడిచి అక్కడి నుండి వెళ్లిపోయాడు...

            సినిమాటాకీసు ముందు కార్లో తమ్ముడు రాజేశ్వరరావు ఎదురుచూస్తున్నడు కారెక్కి ఇంటికి పోయిండు.

            మరోపది నిమిషాలు తర్జన భర్జన - ఆరున్నరకే చలికాలం గన్క చీకటయ్యింది...ఒక ట్రక్కు వచ్చి సినిమా టాకీసు గేటులోపల సొచ్చింది - రాఘవులుతో సహా - కత్తులు ,గొడ్డండ్లు, కర్రలు పట్టుకొని ముప్పైమంది గుండాలు మేన్‍రోడ్డువెంట గాకుండా దొంగతొవ్వల మీదుగా బయలు దేరింది.

            చీకటి దారలు గుండా లారీ శిబిరం కు ముందు బోయి చీకట్లో బొగ్గు కుప్పల మధ్య ఆగింది.

            శిబిరం దగ్గర ఇబ్రహీం మాట్లాడుతున్నాడు’’ మనయూనియన్‍ అమరుడు కామ్రేడ్‍ శేషగిరిరావు దగ్గరినుండి - అమరుడు మక్దూం లాంటి వారి స్పూర్తితో కామ్రేడ్‍ భాస్కర్‍రావు గారి నాయకత్వంలో కొట్లాడుతోంది. ఏమైనా -దొరలు సంచులు పదురుకొని దుకాణం బందు చేయాల్సిందే. మరింక దొరల రాజ్జెం నడువదు... సింగరేణిలో అన్ని డివిజన్లలో మన నాయకత్వంలో సమ్మె జరుగుతోంది. మన కామ్రేడ్‍ భాస్కరరావు  చర్చలకు హైదరాబాదు వెళ్లి వచ్చిండు. తప్పక మనమే విజయం సాధిస్తాం. రేపు ఉదయం కార్మికునికి ఒక్కంటికి పదిరూపాల చొప్పున సహాయం చేయడానికి మన యూనియన్‍ నిర్ణయించింది. ఎన్నినెలలైనా సమ్మెఅపేది లేదు. సింగరేణి యాజమాన్యం - ఐయన్‍టియుసి దొరల యూనియన్‍ కలిసి నాటకాలు ఆడుతున్నారు..’’

            లైట్లు ఆరిపోయాయి. బొగ్గుకుప్పల సాటునుండి గుండాలుదాడి చేశారు. అందరు ఒక్కపెట్టున లేచారు. లొల్లి అరుపులు -పెడీల్‍ పెడేల్‍న దెబ్బలు - ‘‘సత్తిరో’’ మొత్తుకోళ్లు ఉరుకులు పరుగులు... అయిదు నిమిషాలు అల్లకల్లోలం శిభిరం కూలిపోయింది..షామియాన మీద నెగడు దగ్గరి నిప్పులు వేసిండొకడు. సామియాన కాలుతోంది. లారీల దగ్గరి డ్రైవర్లు టార్చిలైట్లు పట్టుకొని వందమంది దాకా ఉరికొచ్చారు వాళ్లు.  ఎఐటియుసి వాళ్లనుకొని గుండాలు పరిగెత్తారు....

            అంతా అయిదు నిమిషాలల్లో ముగిసింది. అక్కడ దెబ్బలు తాకి బొగ్గుకుప్పల్లో పడిపోయి పదిమందున్నారు. పోశెట్టి, కరీం, కొమురయ్యలతో పాటు మరో ఏడుగురికి రక్తం కారుతోంది. ఎవరూ చనిపోలేదు. డ్రైవర్లకు ఏంచేయాలో అర్థంకాలేదు. అందులో ఒక సర్దార్‍ ‘‘క్యారే క్యాదేఖ్‍తే - జాన్‍వర్‍జైసే లడే - ఆదిమీహైరే’’ అన్నాడు.

            ‘‘ఎటుబోయి ఎటస్తదో - అసలే అంత గందరగోళంగా ఉన్నది’’ ఇంకోడ్రైవర్‍...

            ‘‘అరెభయ్‍ రోడ్డు మీద ఆక్సిడెంటయితది - అందరు అట్లంటె మనపనేంగావాలె’’ అన్నడు ఇంకోడ్రైవర్‍..

            నలుగురు డ్రైవర్లు పదిమంది క్లీనర్లు కలిసి గాయపడిన వాళ్లందరిని హాస్పిటల్‍కు లారీలో తీసుకొనిపోయారు... అప్పుడు రాత్రి ఎనిమిది గంటలౌతోంది...

 

                                                                        33

 

            శంకరయ్య, లక్ష్మి ఇల్లు చేరుకునేసరికి రాత్రి ఏడయ్యింది. చిన్న పిల్ల స్నేహలత ఏడుపుషురు చేసింది. శంకరయ్య పొయ్యి ముట్టించి ఉడుకు నీళ్లు పెట్టిండు. పిల్లకు నీళ్లు పోసిన తరువాత ఏడుపు తగ్గింది. లక్ష్మిపాలు వేడి చేసి తాగిచ్చింది.

            ‘‘మళ్ల విబిరం దగ్గరికి పోవాలె...రాత్రి ఆడనే పడుకోవాలె. జెప్పన వంట చేసుకుందాం’’ దడిపొంట పోయి సొరకాయ తెచ్చిండు. గీకితనే కూరవండిండు...

            లక్ష్మిబియ్యం కడుగుతాంటె ‘‘ఎందుకైనా మంచిది ఎక్కువ పెట్టు, సత్యం, శంకర్‍ వస్తరేమొ?’’ శంకరయ్య...

            ‘‘గంగన్న మొఖం పీక్కపోయింది. ఏడ తింటండో - ఏడ పంటండో - మీకందరికి సంసారం - బాయిపని - ఇల్లు ఉన్నాయి.’’ లక్ష్మి...

            అదేమనకు ఒక్కిల్లింటే అయినకు వందల ఇండ్లు. మన ఇండ్లన్ని ఆయనయే గంగన్న సదువుల పస్టు - ఇంజెనీరు సదివిండు. బంగారు బిళ్ల ఇచ్చిండ్లట - మద్రాసుల మంచి ఉద్యోగం చేసిండట...వాళ్ల తల్లికి మొక్కాలె - అచ్చం నీలోన్నాయే - లోపటేమనుకుంటదోగని - మనిషి సూస్తే పిరికెడు. గంగన్న - అయినె సెల్లె సరిత ఇండ్లనే తిరుగుతండ్లు - వాళ్ల నాయినకు కోపం’’ శంకరయ్య మొఖమంతా వెలిగిపోంగ చెప్పుకచ్చిండు.

            లక్ష్మి భీరిపోయి నిల్చున్నది. స్నేహలత వచ్చి తండ్రి చేతుల్లో చేరిపోయింది. లక్ష్మి ముఖంలో భయం.

            ‘‘నీ సంగతి సూత్తె ఎప్పుడో సెంగోబిళ్ల అనేటట్టున్నవు. అయ్యా కామ్రేడ్‍! నేను దిక్కు మాలినదాన్ని - మునుపటితీర్గ - తాగుతిను. కోపమత్తే తన్ను గుద్దగని - నన్ను ఒదిలిపోకు లక్ష్మి కళ్లల్లోనీళ్లు - కంఠం రుద్దమై పోయింది...

            ‘‘కామ్రేడ్‍ లక్ష్మి మొదటి సారిగా శిబిరానికి వస్తివిగదా! ఏమనిపిచ్చింది ?’’ శంకరయ్య మాటమారుస్తూ...

            ‘‘నువ్వు కైతికాలోనివి. నువ్వు పదమెత్తుకుంటే - పదం నువ్వే అయితవు. నువ్వు పదాలేపాడు కామ్రేడ్‍!’’ లక్ష్మి...

            శంకరయ్య పాటెత్తుకున్నాడు.

            తెలంగాణ గట్టుమీద ‘‘సందమామయ్యో - ఓల సందమామయ్యో’’

            తల్లి మల్లె చెట్టుకేమో ‘‘సందమామయ్యో - ఓల సందమామయ్యో’’

            ఎర్రమల్లెలు పూసెనంట ‘‘సందమామయ్యో - ఓల సందమామయ్యో’’

            శంకరయ్య తన్మయత్వంలో పాడుతూ అడుగులేస్తూన్నాడు. చిన్న పిల్ల స్నేహలత తండ్రిలాగా అడుగులేస్తున్నది...

            పాటయిపోయింది. లక్ష్మి చప్పట్లు కొట్టింది. స్నేహ చప్పట్లు కొట్టి మల్లెపూవు పూసినట్టుగా నవ్వింది.

            ‘‘ఔనుగని శిబిరం కాడికి నువెట్లచ్చినవ్‍’’ శంకరయ్య...

            ‘‘రెహనా వదినె వచ్చి తీసుకచ్చింది - రాజేశ్వరికి చిన్నపిలగాడు కదా! రాలేదు. నీకోవిషయం తెలుసా! అక్కడికచ్చి చూసేదాకా మీరు గియ్యన్ని ఎందుకు మాట్లాడుతరో అర్థంగాలేదు’’

            ‘‘సామాజిక అనుభవంలోకి వచ్చిండ్లన్నమాట’’

            ‘‘దుడుత్త్ - గమాటలు మాట్లాడ్తె ఇంట్ల నుంచి ఎల్లగొడుత - అసలే నాది కోడిమెదడు - దాన్నిండా సవాలక్ష కిరికిరులు’’

            ‘‘ఏది ఒక్కటి చెప్పు?’’

            ‘‘నువ్వుఢాంమని అడ్డం పడుతవు’’

            ‘‘ఎహె చెప్పు’’

            ‘‘ఆడోళ్లె అత్త గారింటికి ఎందుకు పోవాలె? ఎంటిక లెందుకు పెంచుకోవాలె? సీరెలేందుకు కట్టుకోవాలె? బొత్త కనపడంగ రయికెలెందుకు ఏసుకోవాలె - పిల్లలెందుకుగనాలె? మొగోళ్లెందుకు పెంచరు... నగలు మొగోళ్లెందుకేసుకోరు’’లక్ష్మి.

            ‘‘ఓర్ని సానా దూరం పోయినవు. మీకు ఈ సమయంలో క్లాసులు వెడితే ఇయ్యన్ని చెప్పుతరు నాకు గంత తెలువది?’’

            ‘‘అంటేనేను నీ తీర్గ మాట్లాడుడు ఘరూసేస్తననా? అదిగాదు - రెహనా వదినె నన్నే మాట్లాడుమన్నది మీటింగుల’’

            ‘‘ఔనా! ఏమాట్లాడుదువు?’’

            ‘‘తెలువది - కాని తప్పక అడ్డం పడిపోదును. నువ్వెప్పుడు పదాలేపాడ్తవ్‍ - మాట్లాడవెందుకు?’’

            ‘‘మా మీటింగులల్ల పాటలుండయి. మాట్లాడుత. ఆడ గంగాధర్‍ మాట్లాడాలె గదా! నేను పాడినగదా!’’

            ‘‘అయినా ఒక సారి ఇది మీటింగనుకొని మాట్లాడు’’ శంకరయ్య స్నేహను ఒళ్లో బుద్దిగా కూర్చుండ బెట్టుకొని అడిగాడు.

            ‘‘అన్నలారా! మనమంతా ఒక్కటే -  చేసినకాడ అడుగపోతె మరెక్కడ అడుగుతం? అడ్డమచ్చినోనిన దంచి కొడుదాం’’ లక్ష్యిలేచి నిలబడి. శంకరయ్య చప్పట్లు కొట్టాడు - స్నేహచప్పట్లుకొట్టింది.

            ‘‘పోరీ! మీనాయినకన్నా రెండాకులెక్కువే ఉన్నవ్‍’’

            ‘‘స్నేహ ఎవరనుకున్నవ్‍! కామ్రేడ్‍ రఘు బుద్దచ్చింది’’

            ‘‘ఎవరన్నా ఇంటే నవ్వుతరు?’’

            ‘‘ఎందుకు?’’

            ‘‘గన్ని చెప్పుతవు - బయటలోకం ఇంకా చీకట్లనే ఉన్నది’’

            ‘‘అర్థమయ్యిందా? మన యిష్టాయిష్టాలతో ఉండదు. దూపయితంది నీళ్లు గావాలె -వాగుల దిగినం - తడువకుండ దూపెట్ల తీర్తది లడాయి లదిగినంక ఎంత ఖెరత్‍గున్నా దెబ్బవడకుంట ఎట్లుంటది?’’

            లక్ష్మి శంకరయ్య నోరు మూసింది. ‘‘వద్దు చెప్పకు, నాకు చెప్పరాదు. కని మంటకొడతాకుతంది.పిల్లా నాకెల్లి సూడకు - మీనాయిన నోరు మూసి ఒక ముద్దియ్యి’’

            ‘‘నేనేతీసుకుంట’’ లక్ష్మినుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు.

            ‘‘నువు మునుపు తిడితే - కొడితే నా బతుకు ఇంతేనని రాత్రంతా ఏడ్సేదాన్ని... కని నువ్విప్పుడు దగ్గెరికి దీసుకుంటే  నువ్వు మాకే కాదు మా అందరికి దగ్గరికి కావాలె - పాటను ఒక్కరే ఉంచుకోవశమా? లక్ష్మి వెక్కి వెక్కి ఏడ్చింది.’’

            ఈ మాటలకందనిదేదో వాళ్లిద్దరికి అర్థమయ్యింది. తాము నడిచేదారి అద్భుతమైందికాని - ప్రమాదకరమైంది.

            ‘‘కామ్రేడ్‍! మనకు ఇష్టమున్నా - లేకున్నా సమాజం ముందుకే నడుస్తుంది. మనం సింగరేణి అందులో ముందుకీ పోవాలె.  ఎనుకకు పోలేము.  పోరాదు.  మనం కాలేరీలో పనిచేస్తున్న డెబ్బైవేల మంది కార్మికుల్లో ఒకలం. ఇంతకు ముందు కారణాలు తెలువది.ఇప్పుడు తెలుస్తన్నయ్‍... నీకుమతికున్నదా? ట్రక్కులోడింగులో మొగిలిపనిచేస్తున్నప్పుడు అర్జయ్య అనే కార్మికుడు మొదట సమ్ము చేద్దామన్నడు. అతన్ని చంపిరైలు పట్టాల మీదేసిండ్లు. అప్పుడు ఏమి చేయాల్నో కార్మికులకు తెలువదు. కార్మికులు అవమానాన్ని దు:ఖాన్ని గుండెల దాచుకున్నారు. గిప్పుడు గిన్నేండ్లు దోపిడి, పీడనతోటి నడిపించిన కృష్ణారావు ఎక్కడెక్కడ పాతుకపోయిండో? అవన్నీ తెలిసి పోయినయ్‍. తెలుసుడేకాదు. వాటిమీదదెబ్బగొట్టే రోజచ్చింది...’’ శంకరయ్య...

            ‘‘అబ్బో! నువ్వు మాట్లాడ్తె పిచ్చోల్లమై దేశాలుపట్టుకపోవాల్సిందే’’ లక్ష్మి...

            ‘‘నేను వారం దినాలు క్లాసులకు పోతాంటె - చిన్నపిల్ల తల్లివి ఏమన్నవు? కామ్రేడ్‍ మనం ఇద్దరం ఒకలకొలకలం బలం - మనిద్దరికి మన కామ్రేడ్స్బంలం - మనం వేలాది మందిమి’’ అంతలోనే సత్యం, శంకరవచ్చిండ్లు. 

            ‘‘తీరిపారి ముచ్చెట్లు బెడ్తండ్లు. మనం బయలుదేరాలి. అక్కా పొద్దటి నుంచి తినలేదు. గేరత్తంది. కడుపంత పిండుతంది. ఏదున్న పెట్టు - తినిపోతం’’ సత్యం...

            ‘‘మీరత్తరనే ఎక్కువ బియ్యం పెట్టిచ్చిండు బావయో బంగారయ్య’’ అందరికి పళ్లేలల్ల పెట్టిచ్చింది. ఉడుకుడుకుది ఊదుకుంట నిలబడే చేతులు కడుక్కొని తిన్నరు...

            ‘‘అక్కా నువ్వు కూడాతిను - నిన్ను శంకర్‍ హాస్పిటల్‍కు తీసుకపోతడు. స్నేహకు కుల్లా - షెట్టర్‍ వెయ్యి - బయట చలున్నది. ఒక శద్దర్‍ తీసుకపో’’

            ‘‘ఏమయ్యింది కామ్రేడ్‍’’ లక్ష్మి...

            ‘‘పోశెట్టి బావకు దెబ్బలు తాకినయ్‍, మేం ఇప్పుడే హాస్పిటల్‍నుంచి వస్తున్నం.... ప్రమాదమేమిలేదు. చంద్రకళ అక్కున్నది. రెహన అక్కున్నది. ఎనిమిది మందికి దెబ్బలు తాకినయ్‍.’’ చెప్పుకచ్చిండు.

            ‘‘ఏందీ ఎక్కడ - ఏమి అర్థంగావడంలేదు?’’ శంకరయ్య...

            ‘‘గావర - గావరల మర్చిపోయిన మనమచ్చినంక కృష్ణారావు గుండాలు శిబిరం మీద దాడి చేసిండ్లు - అక్కడ ఏఐటియుసివాళ్లున్నరు. లెక్క ప్రకారంగా మనం నైటుంటున్నంగదా!’’

            ‘‘అయ్యో! అనుకుంటనే ఉన్న’’ లక్ష్మి ఏడ్వసాగింది...

            ‘‘నయం లారీడ్రైవర్లు, క్లీనర్లు వందమందిచ్చిండ్లు - వాళ్లను కమ్యూనిస్టు యూనియనోల్లనుకొని దానితోని పారిపోయిండ్లు’’

            ‘‘ఎవరైనా?’’

            ‘‘నయం ఎవరు చనిపోలేదు’’

            ‘‘బయటంత గాయిగత్తర గున్నది...ఎవరికేం అర్థమైతలేదు’’ శంకర్‍.

            ‘‘మరి పోలీసులు రాలేదా?’’ లక్ష్మి...

            ‘‘ఏమయ్యిందో? వాళ్లయూనియన్‍ నాయకుడు భాస్కర్‍ రావు పోలీసు స్టేషన్‍కు పోయి దరకాస్తు ఇచ్చిండట... వాళ్లు హాస్పిటల్‍ దగ్గర కొచ్చిలోపటి కెవలను పోనిత్తలేరు. బందువులను, మహిళలను తప్ప’’

            లక్ష్మి గబగబ తిన్నది - చిన్న సంచీ పట్టుకొని బయలు దేరింది. ఏదో మరిచిపోయిన దానిలాగా లోపలికి వచ్చి - సత్యంకు షేక్‍హాండిచ్చింది - శంకరయ్యకు షేక్‍ హాండిచ్చింది.

            ‘‘కామ్రేడ్స్ పదిలం. మీతోటిమేం’’ లక్ష్మి బయటకు పోయింది...

            వాళ్లు దవాఖానాకు పోయేదాకా తనకు తెలిసిన విషయాలన్ని శంకర్‍ లక్ష్మికి చెప్పుతూనే ఉన్నాడు...

            శంకరయ్య సత్యం షరీప్‍ ఇంటికి పోయేసరికి గంగాధర్‍ అక్కడే ఉన్నాడు... మరో అరగంటలో శంకర్‍ కూడా వచ్చిండు. అప్పటికి రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది.

            ‘‘కామ్రేడ్స్ సమయంలేదు. ఇది మనకు గట్టిదెబ్బ శిబిరం కాల్చేసిండంటే - తప్పకుండా ఇందులో మేనేజుమెంటు చెయ్యి ఉన్నది’’ షరీప్‍...

            ‘‘అదే ఆలోచిద్దాం... మనం నాయకత్వాన్ని కలిసే వీలులేదు. రేపు మల్ల శిబిరం నిలబెట్టకపోతే - కంట్రాక్టు కార్మికులు మనలగా నిలబడలేరు. ఏఐటియుసి మొదటి సారిగా వాళ్లు కార్యకర్తలు చావు తప్పి కన్నులొట్టబోయింది. ఉత్త పిరికోళ్లు - కర్రవిరుగకుండా పాము సావకుండాభాస్కర్‍ రావు రాజకీయాలు చేస్తడు. మోకావస్తే నిలబడరు’’ గంగాధర్‍...

            ‘‘అసలు వాళ్లు గొడువలంటేనే ఏర్కుంటరు’’ శంకరయ్య...

            ‘‘వాళ్లకు గట్టిదెబ్బే!’’ షరీప్‍.

            ‘‘అరెస్టులు ఏమైనా జరుగుతాయా?’’ శంకర్‍ అడిగిండు.

            ‘‘నాకు తెలిసి జరుగకపోవచ్చు. వాళ్ల దిపైచేయి అయ్యిందిగదా!’’ గంగాధర్‍...

            ‘‘మనం ఫిట్‍ కమిటీలను కలిసి సమ్మెకు పిలుపిస్తే’’ షరీప్‍.

            ‘‘పుండోకాడయితే మందో కాడకాదా? అయినా సమయంలేదు’’ గంగాధర్‍...

            ‘‘మరేం చేద్దాం?’’ శంకరయ్య..

            ‘‘అదే అభిప్రాయం చెప్పుండ్లి - అయిదుగురం ఉన్నాం -మెజారిటీ నిర్ణయం’’ గంగాధర్‍.

            ‘‘రేపేంజరుగుతుందో చూసి మళ్లీ సమావేశమై నిర్ణయిద్దామా?’’ శంకరయ్య...

            మిగతావాళ్లు మాట్లాడలేదు.

            ‘‘మనం నిర్ణయించడం కాదు. మనంలోడింగు లేబర్‍ దగ్గరికి పోదాం - వాళ్లతోటి మాట్లాడినంక నిర్ణయం తీసుకుందాం’’ లోడింగు కార్మికులకోసం బయలుదేరబోతుండగా - వెంకులు మొగిలి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిండు... మొగిలి వెంకులు కలిసి దారిలోనే వారికి ఎదురయ్యిండ్లు - అందరు కలిసి యాపల కాడినుంచి పెద్దరోడ్డు దాటి - ఎడమ బాజున్న గుడిసెల్లో ఒక గుడిసెకు చేరుకున్నారు.

            అక్కడ పదిమంది కార్మికులు చేరి వాదించుకుంటున్నారు. ‘‘అన్నలు మాకు పానం బడ్డది... గిసొంటిదేది లేకంట ముందుకు పోతమని అనుకుంటె ఆళ్లంత పిచ్చోలుండరు... మనం లారీకి గింత ఎక్కువియ్యండ్లని అడుగుతలేం - మొదటికి దెబ్బ వెట్టినం’’ యాకోబు...

            ‘‘పదయ్యింది - పొద్దుపోయింది - ఊకే కొలువా కుమ్మరియ్య తాతకు దగ్గులు నేర్పకు - అదంత వాళ్లకెరికే’’ మల్లయ్య...

            ‘‘అంతట జరుగుతంది - మనం టెంటు పీకేసిండ్లని ఇంట్ల కూసుంటె ఎనుకబడిపోమా?’’ కోటేశ్‍...

            ‘‘ఏమిలేదు. వాళ్లు మమ్ములందరిని సంపి బొగ్గుకుప్పల్ల కప్పనీయ్‍ - రేపు మల్లటెంటేసుడే - గిప్పుడు నేనే పడుత ఆమరణ నిరహారదీక్ష - అవ్వతోడు నేను ఏసయ్య సాక్షిగా చెప్పుతన్న’’ యాకోబు...

            గంగాధర్‍ వాళ్లు బయటకొచ్చి మాట్లాడుకున్నారు.

            ‘‘చూద్దాం అదే మంచినిర్ణయం’’ అనుకున్నారు.

            ‘‘కామ్రేడ్స్ - మేముయువకులు విద్యార్థులతో పాటు వందమందిమి శిబిరం కాడ - మీతో పాటే ఉంటం’’ బయటకొచ్చే సరికి పదకొండయ్యింది...

            ఆ రాత్రంతా అన్ని జాగాలల్లో వాల్‍పోస్టర్లు విద్యార్థులువేస్తూనే ఉన్నారు.

                                                                                                        ( తరువాయి భాగం వచ్చే సంచికలో )

 

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -11

1902 ప్రారంభమైన హిందూ సుందరి పత్రిక మధ్యతరగతి తెలుగు గృహిణులను ఎందరినో రచయితలను చేసింది. అలా రచయితలు అయినవాళ్ళల్లో కిడాంబి కనకమ్మ, గంటి జోగమ్మ,ఆ.  లక్ష్మీ కాంతమ్మ ఉన్నారు. వంటల నుండి సామాజిక సంబంధాల వరకు అన్నీవాళ్లకు రచనా వస్తువులు అయినాయి. ముగ్గురూ 1902 నుండే రచనలు ప్రారంభించినా కిడాంబి కనకమ్మ ఒక్కతే 1910 వరకు రచనా వ్యాసంగంలో కొనసాగింది.

కిడాంబి కనకమ్మ సాహిత్య సృజన వ్యాసంగం మంగళహారతి రచనతో మొదలైంది.మంగళమని పాడి మందయానలుగూడి పొంగుచు హారతులెత్తరేఅంటూ మాధవుని గురించి వ్రాసిన (హిందూసుందరి, నవంబర్  1902) మంగళ హారతి ఇది. పొంగలి చేసే రెండు విధానాలగురించి కూడా ఆమె వ్రాసింది( సెప్టెంబర్ - అక్టోబర్ 1903). ఇవి కాక ఈమె వ్రాసిన వ్యాసాలు మూడు లభిస్తున్నాయి. వాటిలో రెండు సింహాచల క్షేత్రము ను గురించినవి.మరొకటి ఐకమత్యం గురించిన వ్యాసం. స్త్రీలందరికీ ఆనాడు ఐకమత్యం గురించి చింతన సామాన్యాంశం. స్త్రీలకు అభ్యుదయాన్ని కూర్చే సంస్కరణ విషయాలపట్ల స్త్రీలందరికీ ఒక అంగీకారం కుదిరితే తప్ప సంస్కరణోద్యమ గతిక్రమం వేగాన్నిఅందుకోలేదు .ఆ విషయం తెలిసిన సంస్కరణోద్యమ నాయకులు స్త్రీలు సంఘటితమై సమావేశాలు పెట్టుకొని ఏక కంఠంతో సంస్కరణలను ఆహ్వానించగల చైతన్యం పొందాలి అని ఆశించారు.దానికి అనుగుణంగా స్త్రీలు కార్యరంగంలోకి ప్రవేశించనూ ప్రవేశించారు. ఆ క్రమంలో వ్రాయ నేర్చిన ప్రతిస్త్రీ ఐకమత్యం ఎంతఅవసరమో ప్రబోధిస్తూ వ్రాసారు. కిడాంబి కనకమ్మ కూడా అలాగే వ్రాసింది.( సెప్టెంబర్ 1910) 

బాలికల యొక్క వచ్చీ రాని  మాటలకు సంతోష పడినట్లుగా కొద్దిలో కొద్దిగా చదివి తాను వ్రాస్తున్న చిన్న వ్యాసంలోని తప్పులను మన్నించి దయతో చదవమని పండితులను కోరుతూ కనకమ్మ ఈ వ్యాసం ప్రారంభించింది. ఒకరి కంటే ఎక్కువగా వుండే మనుషులలో ఐకమత్యం లేకపోతే సుఖంలేదని, ఐకమత్యం అంటేఒకరితోఒకరు అనుకూలంగా చేరటం అని, కలుపుకోలు మనుషులలో ఉండవలసిన లక్షణం అని పేర్కొన్నది. రెండు పదార్ధాల చేరిక వల్లనే నూతన కార్యం ఏర్పడుతుందని ఐకమత్యం విశిష్టతను తార్కికంగా నిరూపించే ప్రయత్నంచేసింది. వస్తుజ్ఞానం ఒక్క ఇంద్రియంవల్ల సమకూడదు అని, ఒకటికంటే ఎక్కువ సాధనాలు లేకుండాఏకార్యమూ సిద్ధించదని చెబుతూ వ్రాయటం అనే కార్యానికి చేతివేళ్ళు కలం, కాగితం, మసి( సిరా) అనే బహుళసాధనాలు కావాలి కదా అని ఉదాహారణలతో ఐకమత్యం యొక్క అవసరాన్ని నొక్కిచెప్పింది. అనుకూలాభిప్రాయాలు కల స్త్రీ పురుషుల మధ్య ఐకమత్యం అభిలషణీయం అనిఅభిప్రాయపడింది.ప్రత్యేకించిఅబలత్వం జన్మసిద్ధమైనస్త్రీలు”  ఐక్యంగా ఉండాల్సిన అవసరం మరింత ఉందని అభిప్రాయపడుతూ ఎంతపనికిమాలిన వస్తువులైనా  కలిసి మెలిసి ఉన్నప్పుడు కొంత శక్తిని పొందుతాయి కదా అని తన అభిప్రాయాన్ని సమర్ధించుకొన్నది.

 “ చేరి యుండుటగదా చేయును కార్యములు కై వ్రేలులయిదును

   కాంతలార, చిన్నిచీమల బారు చేరి పూనికతోడ నడచిన సంద్రం

   బు గడచు ( గాదె, కన్నుల కనరాని కడుచిన్ని యణవులు కొండ 

   యై గన్పట్టు  చుండు గాదె ,చులకన యగు దూది కలిసి దారంబయి

   పెనగొని పగ్గమై పెద్ద తేజి /గీ  / బట్టి బంధించుటది కూర్పు పనియె  

    కాదె, నెలతలట్లన తలపుల గలిసికొనిన , విద్దె సుగుణంబువినయం 

    బు వీరి కరయ( , గలిగి సత్కీతిన్ పాత్రలై , మెలగరాదెఅని ఒక సీస పద్యంలో  ఐక్యతా లక్షణాన్ని, ఐక్యతా ఫలితాన్ని నిరూపించి చెబుతూ స్త్రీలను ప్రబోధించింది కనకమ్మ. 

దైహిక యాత్ర దైన్యం లేకుండా సాగించాలంటే చెడ్డ తలపులు ఎప్పుడూ కలుగకూడదు. ఆలోచనలు మంచివై ఉంది కీర్తి కరమైన కార్యాలకు ప్రేరణగా ఉండాలి. ఐహిక ధర్మవర్తనం అలవడి ఉండాలి . అట్లా చేయమని శ్రీహరిని వేడుకొనే ఒక ఉత్పలమాల పద్యంతో ఆమె ఈ వ్యాసాన్ని పూర్తి చేసింది. ఐక్యతా తత్వాన్ని ఇంత సరళ సుందరంగా  నిరూపించిన వ్యాసం మరొకటి కనబడదు. 

మిగిలిన రెండు వ్యాసాలు సింహాచల క్షేత్రాన్ని గురించి వ్రాసినవి. వాటిలో మొదటి వ్యాసం 1903 ఫిబ్రవరి సంచికలో వస్తే రెండవది మూడేళ్ళ ఎనిమిది నెలలకు 1906 నవంబర్ సంచికలో వచ్చింది. సింహాచల క్షేత్రం గురించి వివరంగా వ్రాయాలన్న ఉద్దేశంతో కనకమ్మ పని ప్రారంభించింది. సింహాచల  క్షేత్ర మహత్త్యము అనే మొదటి వ్యాసంలో దాని పౌరాణిక చారిత్రక విశేషాలను వివరించింది. ప్రహ్లాదుని రక్షించటానికి  నరసింహుడు ఈ కొండమీదే ఉద్భవించాడని, ఆ తరువాత ప్రహ్లాదుడు చేసే పూజలు అందుకొంటూ నరసింహ స్వామి ఇక్కడే ఉండిపోయాడని, ఎందుకనోఅవి ఆగిపోయి అక్కడ పెరిగిన అడవిలో దేవుడు మరుగునపడిపోయాడని పురూరవ చక్రవర్తి దానిని పునరుద్ధరించాడని ఒకఐతిహ్యం ఉంది.దానిని గురించి చెప్పి ఊరుకోలేదు ఆమె.శాసనాధారాలతో పోల్చి ఆ పౌరాణిక కథాంశంలోని సత్యాసత్యాలను నిగ్గుతేల్చే ప్రయత్నం చేసింది.ఇక్కడ కనకమ్మ అచ్చమైన చరిత్రకారుల పద్ధతిని అనుసరించింది.అది పురూరవ చక్రవర్తి కట్టించిన గుడి అనటానికి నిదర్శనాలు ఏవీ లేవంటుంది.

పురూరవుడు వేదకాలపు వాడుఅని చెప్తారు.వేదాలు, పురాణేతిహాసాలలో అతని ప్రస్తావన ఉంది.అతని పుట్టుక గురించి ,తల్లిదండ్రుల గురించి ,రకరకాల  ఐతిహ్యాలు ఉన్నాయి. ఊర్వశికి అతనికి మధ్య సంబంధం సాహిత్యవస్తువైంది. అది అలా ఉంచితే సింహాచల క్షేత్రం అంత ప్రాచీనమైనది అనటానికి శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేకపోవటం కనకమ్మ గుర్తించింది. దేవాలయ ప్రాంగణంలోని శిలాశాసనం ప్రమాణంగా అందులో పేర్కొనబడిన శ్రీకృష్ణదేవరాయల తండ్రి అయిన నృసింహదేవరాయల కాలంలో నిర్మించబడి, నిర్వహణకు గాను భూమి దానం చేయబడిన విషయాలను బట్టి ఆనాటికి ఆ ఆలయం కట్టి 900 సంవత్సరాలు గడిచినట్లు పేర్కొన్నది. వ్యాసాన్ని ముగిస్తూ ఇక్కడ జరిగే ఉత్సవాదుల వైభవాల గురించి ముందు ముందు వ్రాస్తానని చెప్పినదానిని బట్టి సింహాచల క్షేత్రంగురించి సమగ్రంగా వ్రాసే బృహత్ ప్రణాళిక ఏదో ఆమె వేసుకున్నట్లు కనబడుతుంది. కానీ 1906 నవంబర్ సంచిక వరకు ఎందుకో దానికి కొనసాగింపు వ్యాసం ఏదీ కనబడదు. అందుకు సమాధానం ఆ వ్యాసం చివర దొరుకుతుంది.

ఈరెండవ వ్యాసంలో కనకమ్మ విశాఖ పట్టణపు మండలంలోని సింహాచలానికి రైల్వేస్టేషన్ నుండి బండిపై ఊళ్లోకి వెళ్ళగానే ప్రభుత్వం వారు కట్టించిన హవేలీ, దానికి దక్షిణాన పెద్ద పూలతోట, దానికి తూర్పు దక్షిణాలలో పండ్ల తోటలు, హవేలీకి తూర్పున కొండపైకి వెళ్లే మెట్లు కనిపిస్తాయని ఆలయంలో ప్రవేశించే పర్యంతం అడుగడునా కనబడే దేవాలయాలు, స్నానఘట్టాలు, తోటలు వాటి మధ్య  దూరాన్ని  గజాలలో, ఎక్కవలసిన  మెట్ల సంఖ్యను  కూడా  చెబుతూ  ఆమె వ్రాసిన తీరు చేయిపట్టి  మనలను ఆ మార్గం గుండా, ఆ మెట్ల మీదుగా  తీసుకువెళుతూ చుట్టుపక్కల దృశ్యాలను చూపిస్తూ చెప్తున్నట్లుగా ఉంటుంది.ఆ క్షేత్రానికి వచ్చేవాళ్ళు  సౌకర్యవంతంగా దర్శనం చేసుకొని తీర్ధప్రసాదాలు సేవించటానికి మార్గదర్శకంగా వుండే సూచనలు కూడా అందులో ఉన్నాయి. యాత్రా చరిత్ర రచనలకు చక్కని నమూనా గా చెప్పుకోదగిన రచన ఇది. 

ఈ వ్యాసం ముగింపులో స్వామివారికి జరిగే నిత్యోత్సవ,పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్స రోత్సవాల గురించి తాను ఇదివరలో వ్రాసి పంపిన వ్యాసం కూడా ప్రచురించవల్సినదిగా కోరింది. ఆలయం చుట్టూ ఉండే శాసనాలను ఎత్తి వ్రాసి పంపుతున్నాను అని వాటిని కూడా ప్రచురించమని కోరింది. అక్కడ స్వామివారికి చేసే ప్రసాదాల తయారీ పద్ధతి గురించి కూడా వ్రాసి పంపుతానని చెప్పింది. ముగింపులో చెప్పిన ఈ వాక్యాలు చాలా ముఖ్యమైనవి. ఒక ఆలయం గురించి మూడు నాలుగేళ్లు ఒక లక్ష్యంతో శోధన చేయటం, సమాచారం సేకరించటం ఆనాటి ఆడవాళ్లకు అంత సులభమైన పని కాదు. సులభం కాని పనిని చేపట్టింది అంటే అది ఆ పని పట్ల ఆమె ఆసక్తికి, ఇష్టానికి నిదర్శనం. మూడు నాలుగేళ్లు ఆలయానికి పదే పదే వెళ్లి విషయాలు తెలుసుకొనే వెసులుబాటు ఉన్నదంటే ఆమె విశాఖ మండలానికి చెంది, ఆ సమీప ప్రాంతాలలో నివసిస్తున్నదని అనుకోవచ్చు. శాసనాలు ఎత్తి వ్రాసుకొని వాటిని వ్యాఖ్యానించగల జ్ఞానం ఆమెను మేధావుల కోవకు చేరుస్తుంది. బహుశా తెలుగునాట తొలి శాసన పరిశోధకురాలు కిడాంబి కనకమ్మే కావాలి. 

1902 లో పాటల రచనతో ప్రారంభించిన గంటి  జోగమాంబ విశాఖ పట్టణ వాసి. రామరామ నన్ను బ్రోవరారా, నన్ను బ్రోవరావా నారదాదినూత, సమయము మంచిదిరా నను బ్రోవరా అనే మూడు పాటలు వ్రాసింది (జనవరి 1902? 1903? ) జోగమాంబ అని స్వీయ నామాంకిత ముద్రతో ముగుస్తాయి ఈ పాటలు. ప్రతి పాటలోనూ ఆమె తనను ధర వైశాఖ పురీ వాసురాలిగా చెప్పుకొన్నది. ఆ రకంగా ఇటువంటి పాటలవల్ల స్త్రీల గురించిన స్వల్పమైన సమాచారం అయినా లభించింది. అదే సంతోషం. 

హిందూ స్త్రీల గుట్టు ( ఏప్రిల్ 1903) కథ లాగా మొదలై వ్యాసం వలె ముగిసిన రచన. ఆడవాళ్ళ చాపలత్వాన్ని కనిపెట్టాలని ఒక బ్రాహ్మణుడు నల్లకాకికి తెల్ల కాకి పుట్టిందని అందువల్ల రాజుగారికి ప్రాణాపాయమని చెప్పిన మాటను భార్య నీలాటిరేవు దగ్గర స్త్రీలకు చెబితే అది ఆనోటా ఈ నోటా పడి చివరకు రాజుగారి దగ్గరకు వచ్చిందని ఆయన అలా చెప్పిన ఆ బ్రాహ్మణుడిని పిలిపించి తక్షణం పరిహారం చెప్పకపోతే తలతీయిస్తానని హెచ్చరించాడని అందులో నిజం లేదని , స్త్రీల మనస్తత్వం తెలుసుకొనటానికి తానే అట్లా కల్పించి చెప్పానని రాజుగారికి చెప్పి ఒప్పించాడని ఆ కథను చెప్పి రచయిత్రి బుద్ధిబలం వల్ల బ్రాహ్మణుడు ప్రాణాపాయం తప్పించుకున్నాడని, అది లేకపోవటం వల్లనే అతని భార్య ముందువెనుకలు చూడక భర్త ప్రాణానికి ఆపద తెచ్చే పని చేసిందని వ్యాఖ్యానించి చెప్పింది. మనిషికి మంచి ఏదో, చెడు ఏదో తెలియటానికి శిక్షణ అవసరం అని అది స్త్రీ పురుషులిద్దరికీ అవసరమేనని విద్యాప్రాధాన్యతను ప్రతిపాదించింది. విద్య లక్ష్య డబ్బు సంపాదన అనుకొనటం తప్పని జ్ఞానం నిరంతరం పొందవలసినదే అన్న ఎరుక కలిగి ఉండాలని స్త్రీ విద్య ను ప్రోత్సహిస్తూ వ్యాసం ముగించింది. తాను చెప్పదలచుకొన్న విషయానికి తగిన దృష్టాంతాలు సమకూర్చుకొని ఒప్పించేట్లు రచన చేయటం జోగమాంబ పద్ధతి. 

గంటి జోగమాంబ సుగుణవతి - దుర్గుణవతి అనే కథను వ్రాసింది ( 1903 సెప్టెంబర్ & అక్టోబర్ ) పేరమ్మ వితంతువు. భర్త ఇచ్చిపోయిన ఆస్తితో బతుకుతూ ఇద్దరు కూతుళ్లను పెంచింది.  సుగుణవతి  దుర్గుణవతి ఇద్దరూ తన పిల్లలే అయినా దుర్గుణవతిని గారాబం చేసి సుగుణవతిని తిడుతుండేది. పనులన్నీ సుగుణవతివే. బావికి నీళ్లు తేవటానికి వెళ్ళినప్పుడు దాహమడిగిన అవ్వకు నీలతోడి పోసిన ఆమె మంచితనానికి ప్రతిఫలంగా నోరు విప్పి మాట్లాడినప్పుడల్లా మాటకొక వజ్రం, ముత్యం రాలుతాయని వరం పొందింది. దుర్గుణవతి కూడా అటువంటి లాభంపొందాలని తల్లి బతిమాలి మర్నాడు బావికి నీళ్లు తేను ఆమెను పంపింది. ఆమె అవినయ రీతికి దక్కిన వరం మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక పాము, ఒక తేలు నెల రాలటం. దీనికంతటికీ కారణం సుగుణవతి అని ఆమెను దండించబోతే అడవులలోకి పారిపోయిందని అక్కడ ఒక రాజపుత్రుడు ఆమెను చూసి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని, ఇక్కడ దుర్గుణవతి తల్లి వెళ్లగొడితే అడవులు పట్టి పోయిందని కథ. ఇది చెప్పి సుగుణములు కలిగి ఉండటందుర్గుణాలు కలిగి ఉండటం ఎటువంటి వ్యత్యాస ఫలితాలను ఇస్తాయో చూడండని హెచ్చరించింది రచయిత్రి. ఇది ఆధునిక కథ కాదు. అద్భుత కాల్పనిక కథ. మంచి గుణములను అభివృద్ధి చేసుకోనాలని ఎవరికైనా చెప్పటం అవసరమే. తల్లుల మూర్ఖత్వం, పెంపకపు తీరు కూడా పిల్లలు సద్గుణాలు అలవరచుకొనటానికి అవరోధం అవుతుందని ఈ కథ మరొక నీతిని కూడా సూచిస్తున్నది. అదలా ఉంచితే ఎవరయినా పిల్లలకు సుగుణ అని పేరుపెట్టుకోవచ్చు కానీ దుర్గుణ అని చూస్తూ చూస్తూ పెట్టరు. సుగుణవతి పేరుకు తగ్గట్టు మంచిది కావటం, దుర్గుణవతి పేరుకు తగ్గట్టు చెడ్డది కావటం అతిశయోక్తి తప్ప వాస్తవం కాదు.  

ఆ. లక్ష్మీ కాంతమ్మ రచనలు రెండు మాత్రమే లభించాయి. రెండూ వ్యాసాలే. ఒకటి స్త్రీవిద్య గురించి ( 1902 నవంబర్ ). జ్ఞానం విద్యామూలం అనిచెప్పి దేశంలో స్త్రీవిద్య పట్ల పట్టింపు లేకపోవటాన్ని గురించి బాధపడింది. విద్యలేని స్త్రీలు జ్ఞాన శూన్యులై భర్తలను సంతోషపెట్టే విధం తెలియక సంసారాలు పాడు చేసుకొంటారని చెప్పింది. విద్యలేని స్త్రీలు కన్నపిల్లల కు కూడా మేలు చేయలేరని స్త్రీలు విద్యాధనం సంపాదిస్తే ఇంటికీ బంధుమిత్రులకు కూడా కీర్తి తెస్తుందని అభిప్రాయపడింది. స్త్రీలు అలంకారాలమీద మోజు వదులుకోవాలని కూడా హెచ్చరించింది. మనుషులకు నిజమైన అలంకారాలు నగలు జుట్టు చక్కగా సంస్కరించుకొనటం కాదు మంచి మాట నిజమైన అలంకారం అని వాగ్భూషణమే అసలు భూషణం అని చెప్పే సంప్రదాయ హితోక్తిని ఉటంకిస్తూ స్త్రీలు చదువు కోవాలని ఆకాంక్షించింది. రాజమండ్రిలో కొటికలపూడి సీతమ్మ స్త్రీవిద్యా వ్యాప్తికి చేస్తున్న కృషిని గౌరవంతో ప్రస్తావించి  ఈ వ్యాసాన్ని ముగించింది. 

గంజాం జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్న ఓడ్రస్త్రీల గురించి వ్రాసిన వ్యాసం మరొకటి (1903, ఏప్రిల్) చదువు, నాగరికత లేనివాళ్ళని వాళ్ళ వేష భాషలను, ఆహారపుటలవాట్లను తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళవల్ల ఆజిల్లాలో తెలుగు స్త్రీలకు కూడా గౌరవంలేకుండా పోతున్నదని ఈవ్యాసంలో ఆమె పేర్కొన్నది. భిన్న సంస్కృతుల పట్ల అసహనం, ప్రాంతీయ దురభిమానం, ఆధిక్యతా భావన బీజరూపంలో కనబడతాయి ఈవ్యాసంలో. స్త్రీల ఐక్యతను గురించి పదేపదే అనేకులు చెప్తున్న ఆ కాలపు సంస్కృతికి భిన్నమైన వ్యక్తీకరణ ఇది.

 

                                                   ----------------------------------

 

ఈ సంచికలో...                     

Apr 2021

ఇతర పత్రికలు